గుట్టు విప్పిన గురూజి-2-అగెహనంద స్వీయగాధ






తెలుగు వ్యక్తి భారత్ దర్శనం
నేను చిన్న తనంలోనే ఇంగ్లీషు నేర్చుకోవడం ప్రారంభించాను. మధ్యలో వదిలేసినా, ఉదయశంకర్ సందర్శనం తరువాత మళ్ళీ ప్రారంభించాను. ఆయన నృత్య ప్రదర్శన సందర్భంగా వచ్చిన భారతీయు లలో ఒకతెలుగు వ్యక్తి నాకు పరిచయమయ్యారు. ఆయన పేరు బాలకృష్ణశర్మ. 19వ యేటనే ఇంగ్లండు వెళ్ళి కొన్ని సంవత్సరాలపాటు అక్కడ ఉండి చక్కని ఇంగ్లీషు నేర్చుకున్నారు. ఆయన అభ్యుదయవాది శాస్ర్తీయంగా, సాంకేతికంగా ఇండియా పాశ్చాత్య ప్రపంచంతో పాటు పురోగమించాలని ఆయన ఉద్దేశ్యం.
నాకు అప్పుడు 13 సంవత్సరాలు. బాలకృష్ణ తటపటాయించి నన్ను ఇండియా క్లబ్బుకు తీసుకువెళ్ళారు. ఈ క్లబ్బును విఠల్ భాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ 1933లో స్థాపించారు. ఇందులో డాక్టర్లు, విద్యార్థులు, సభ్యులుగా వుండేవారు. నేను క్లబ్బులో సభ్యుణ్ణి అయిన తర్వాత చాలా ఉత్సాహం చూపాను. అందరిలోకి నేను చిన్నవాడిని. వారి మధ్య నేను మసలుతూ ఇండియాను గురించి, భారతీయ సంస్కృతిని గురించి తెలుసుకున్నాను. క్లబ్ లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ, అక్కడికి వచ్చే భారతీయ వార్తా పత్రికలన్నీ చూసేవాడిని.
జర్మనీలో వైద్యం చదువవలసిన భారతీయ విద్యార్థులు తప్పనిసరిగా జర్మన్ భాష నేర్చుకోవలసి వచ్చేది. దీనికోసం వేరే ట్యూషన్ కావాలంటే చాలా ఖర్చుయ్యేది. ఆ అవకాశం తీసుకొని భారతీయులకు నేను జర్మన్ భాష నేర్పేవాడిని. వారి వద్ద సంస్కృతం, హిందీ, ఉర్ధూ, బెంగాలీ నేర్చుకున్నాను. శాంతినికేతన్ విద్యార్థిని సుచిత్ర చౌదరి సంగీతం నేర్చుకోడానికి వచ్చినాకు బెంగాలీ నేర్చింది. ఆ విధంగా నేను బెంగాలీ నేర్చుకుని టాగూర్ సంప్రదాయాలను తెలుసుకున్నాను. డాక్టర్ కేసరవాణి నాకు సంస్కృతం నేర్పారు. 1937లో అక్టోబరు 2న మహాత్మాగాంధీ జన్మదినోత్సవం సందర్భంగా హోటల్ ఫ్రాన్స్ లో జరిగిన ఒక ఉత్సవంలో నేను భగవద్గీతలో కొంత భాగం చదివాను. అది నా 14వ యేట. మరునాడు వియన్నా పత్రికలు నన్ను పొగుడుతూ వ్రాశాయి.
వియన్నా విశ్వవిద్యాలయంలో సుప్రసిద్ధ ప్రొఫెసర్ ప్రావాల్ సర్ సంస్కృతం, ప్రాచీన భారతీయ విషయాలు చెప్పేవారు. ఆయన అనుమతితో క్లాసులో కూర్చొని అనేక విషయాలు నేర్చుకున్నాను.

నెహ్రూతో ఒకసారి
1938లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వియన్నా వచ్చారు. అప్పటికి గాంధీపేరు చాలా మందికి తెలుసుగాని, నెహ్రూ యింకా అంతగా ప్రచారంలోకి రాలేదు. ఇండియా క్లబ్ అధ్యక్షుడు నన్ను రమ్మని ఆహ్వానిస్తే హోటల్ ఫ్రాన్స్ లో 114వ గదిలో వుంటున్న నెహ్రూను చూడడానికి వెళ్ళాం. బహుశా నా గురించి అప్పటికే ఆయనకు చెప్పారేమో తెలియదు. నన్ను చూడగానే కుర్చీ చూపి కూర్చోమన్నారు. నా ఉర్దూ విని ఆశ్చర్యపోయారు. అప్పుడే వెలువడిన తన పుస్తకం చదివారా అనీ. అందులో అర్థం కానిదేమైనా వుంటే నిర్మోహమాటంగా అడగమన్నారు. ఇండియాలో మంచి పత్రికలేవని అడిగాను. దానికి సమాధానంగా ఆయన భారతీయ పత్రికలపై ఒక చిన్న వుపన్యాసమిచ్చారు.

భాయీ సచ్చిదానంద
1939 ఏప్రిల్ 20న భాయీ సచ్చిదానంద యూరప్ పర్యటిస్తూ వియన్నా వచ్చారు. ఉదయం 8 గంటలకు ఇండియన్ క్లబ్ కు వచ్చారు. నన్ను హిందువులలో చేర్చుకొమ్మని ఆయననడిగాను. వేద ప్రమాణాన్ని అంగీకరించిన వారెవరైనా హిందువులు కావచ్చునని ఆయన ఉద్దేశ్యం. ఆవు పాలు, ఆవు మజ్జిగ, ఆవు వెన్న, గోమూత్రం, గోపంచకం అనేవి హిందువు స్వీకరించాలని, అయితే గోమాంస భక్షణ మాత్రం కూడదని భాయీ సచ్చిదానంద చెప్పారు. అక్కడే నాకు మొట్టమొదటిసారిగా రామచంద్ర అని నామకరణం చేశారు. భాయీ సచ్చిదానంద పెట్టిన పేరే చాలకాలం స్థిరపడింది. అంతటితో నేను హిందువుగా మారాను. ఈ బాల్యదశ విషయం ముగించే ముందు మరికొన్ని వివరాలు చెప్పి అంతటితో పూర్వాశ్రమానికి స్వస్తి పలుకుతాను. మా తండ్రి మొదటి ప్రపంచ యుద్ధంలోను, ఆ తరువాత యవనదశంలోనూ కెప్టెన్ గా పనిచేశారు. ఆయన పోలో ఆడేవారు. మా తల్లి బాగా చదువుకున్నది. తమ పూర్వీకులంతా రాజవంశానికి చెందినవారనేది. ఆమె నోరు మంచిది కాదు. ఆ బాధలన్నీ మా తండ్రే పడేవారు. మా నాన్నకు పుస్తకాలంటే అయిష్టం. ఆయన మా చిన్నతనంలో ఒకసారి నాకు విస్కీ యిచ్చారు. అదేదో షర్బత్తు అనుకొని గటగటా తాగేశాను. అంతటితో నాకు విస్కీపై విరక్తి పుట్టి దాని జోలికిపోలేదు. కోరికలు ఏవైనా వుంటే నిస్సందేహంగా తీర్చుకోవాలని మా తల్లి బోధించేది. ఇది లైంగిక విషయాలతో కూడినదని భావించి, స్ర్తీ జోలికి పోకూడదని నేను నిశ్చయించుకున్నాను. కాని, ఆ మాట మీద పూర్తిగా నిలబడలేదు. గ్రామర్ స్కూల్లో లాటిన్ చదువుకున్నాను. మతపరమైన విద్య  కూడ కఠినంగా నేర్పేవారు.
నా చిన్న తనంలో ఆర్య సేవకురాండ్రు హిట్లర్ ప్రోత్సాహంతో తమ యూదు యజమానురాండ్రను వీధుల్లోకి లాక్కొచ్చి కాలిబాటను తుడిపించే వారు. ఇలాంటి భయంకరమైన దృశ్యాలు సర్వసాధారణంగా వుండేవి. నాజీ విద్య వలన నాలో నియంతృత్వ వాదంపై వ్యతిరేకత ప్రబలింది. భాయీ సచ్చిదానంద వలన హిందువుగా మారిన నేరు కొత్త జీవితాన్ని ప్రారంభించాను.

నేతాజీతో పరిచయం
1942 చివరిలో ఒకరోజు హఠాత్తుగా నాకో టెలిగ్రాం వచ్చింది. వీలు వున్నంత త్వరలో ఓ మోజోటాను (7 సోఫిన్ స్ర్టాప్,. బెర్లిన్) కలుసుకోమని ఉన్నది. నాకు తలా, తోక అర్థం కాలేదు. ఆ పేరు ఎవరిదో నాకు తెలియదు. వియన్నా జనరల్ హాస్పిటల్లో ఇండియన్ డాక్టర్ రఘులాల్ నాకు ఫోన్ చేసి అలాంటి టెలిగ్రామే తనకు వచ్చిందని, వెంటనే వెళ్ళాలని చెప్పాడు. ఇద్దరం కలిసి టెలిగ్రామ్ లోని అడ్రసుకు వెళ్ళాం. అదొక గొప్ప యిల్లు. ఆత్రుతగా ఎదురుచూస్తుండగా చనిపోయాడని భావిస్తున్న సుభాష్ చంద్ర బోస్ తలుపు తీసుకొని వచ్చారు. ఆయన కలకత్తా నుండి ఎలా తప్పించుకు వచ్చారో తుది విజయం తర్వాత చెబుతానని మాతో తరచు అంటూండేవారు. కాని, ఆ క్షణం ఎప్పుడూ రాలేదు. 1943లో బోస్ మళ్లీ జర్మనీ నుండి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన విషయం అక్కడి భారతీయ సైన్యానికి తెలియదు.
నేను బోసుతో నా పరిచయాన్ని ప్రస్తావిస్తూ, భారత సైన్యంలో చేరడానికి దరఖాస్తు పెట్టాను.
1943 ఫిబ్రవరిలో నాకు పిలుపు వచ్చింది. కల్నల్ గా ఒకతను నన్ను చూచి నీవు సైనికుడిగా మారేటంతవరకూ ఉంటావన్నాడు. కాని ఆ ఏడు నవంబరులో భారతీయ సైన్యంలో చేరగలిగాను. అది నాకు గొప్ప అనుభవం నాకు యింకా 20 ఏళ్ళు నిండలేదు. అంతవరకు వియన్నా క్లబ్ లో భారతీయుల ద్వారా, పుస్తకాల ద్వారా మాత్రమే ఇండియా నాకు తెలుసు. కాని, సైన్యంలో భిన్న భాషలు మాట్లాడేవారు వుండటం వలన అనేక విషయాలు తెలుసుకోవడానికి భాషాపరంగా పెంపొందటానికి అవకాశం ఏర్పడింది. భారతీయులు మాట్లాడినట్టే నేను మాట్లాడేవాడిని. తమరిలో ఒకరిగా నన్ను స్వీకరించడానికి ఈ ఉచ్ఛారణ తోడ్పడింది. నన్ను భాయీ సాహెబ్ అని, రామచంద్ర అని పిలిచేవారు. జర్మన్ సైనికులు నాపట్ల విముఖతతో వుండేవారు. జర్మనీలో నన్ను కావాలని ఇండియన్ల మధ్య వుంచినట్లు, రోజూ జరుగుతున్న విషయాలు తెలుసుకోడానికి ఇలా చేసినట్లు కొందరు భావించారు. అయితే, నేను ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కాని, నాకు ఎదురైన చిక్కులన్నీ జర్మన్ సైనికాధికారుల తోనే.
భారతీయ సైన్యంలో చేరిన తరువాత గ్రాండ్ ప్రికే అనే గ్రామం వద్ద 11వ దళంలో నన్ను చేర్చారు. జర్మనులకు ఇండియన్లకు వంటలు కూడా వేరు వేరుగా వుండేవి. మొదట్లో నేను జర్మనుల వంటలనే తినే వాణ్ణి. నా భారతీయ అనుకూలత చూసి, నన్ను ఇండియా మెస్ కి పంపివేశారుఇందుకు దారితీసిన ప్రథాన సంఘటన ఒకటి వున్నది. డిసెంబరులో ఒకనాడు నా గదికి వెళ్లి యూనిఫాం తీసివేసి తెల్లని అంగీ వేసుకొని ధ్యానంలో కూర్చున్నాను. హఠాత్తుగా కొంతమంది జర్మన్ సైనికులు అరుస్తూ తలుపుకొట్టారు. తలుపు తీయగానే నా మీద ఐస్ నీళ్ళు చల్లారు. వారంతా బాగా తప్పత్రాగి వున్నారు. నా గదిలో వున్న భగవద్గీత, చిన్న పూజామందిరం, ఒకటి రెండు పవిత్ర గ్రంథాలు చిందర వందరగా పడేసి గదంతా నీళ్లు పోసారు. నాగదిలో వున్న రైఫిల్ ను మా కండర్ తీసుకున్నారు. ఇంతలో ఎవరో ఒకతను యిదంతా ఎగతాళికని చెవిలో వూదాడు. ఆ తరువాత నన్ను ప్రక్కగదిలోకి తీసుకెళ్ళారు. అక్కడ యిద్దరు అందమైన ఫ్రెంచి అమ్మాయిలు వున్నారు. నన్ను త్రాగమని కమాండర్ అన్నాడు. నేను హిందూ మతం పుచ్చుకొన్నాను. తాగనన్నాను. కోటు తీసి వెయ్యమన్నాడు. తీసేసాను, బట్టలు పట్టుకొని ఆల్మెరా ఎక్కమన్నారు. అది ఇంచుమించు కప్పును తాకుతున్నది. అతి కష్టం మీద ఎక్కి పడుకున్నాను. అంతలో ఫ్రెంచి అమ్మాయి నాపై వెస్ ను విసిరేసింది. నా బట్టలు విప్పతీమని కంపెనీ కమాండర్ అమ్మాయిలతో చెప్పాడు. ఇక నేను సహించలేక పోయాను. క్రిందకు దిగివచ్చి మీ అధికారాలను మితిమీరుతున్నారు. ఏమైనా చేసుకోండి అన్నాను. నన్ను గదిలో పెట్టి బయట తలుపువేసి వెళ్ళిపోయారు. (లియోపాల్డ్ ఫిషర్ అయిన నేను రామచంద్రగా మారి జర్మనుల చేతిలో ఇలాంటి అనుభవాలు పొందాను) ఆ తర్వాత ప్లెటూ కమాండర్ వచ్చి అంతా మర్చిపో, ఏం జరగలేదనుకో అని చెప్పి వెళ్లాడు. ఆ తరువాత నిద్రపోదామంటే నా గదంతా పడకతో సహా తడిసి పోయింది. ఇంతలో కార్పోరల్ రతన్ సింగ్ వచ్చి జరిగినదంతా ఇండియన్లకు తెలుసునని, ఆ రాత్రికి తన పడకను వాడుకోమని చెప్పాడు. ఆ తరువాత నన్ను జర్మన్ మెస్ నుంచి తొలగించారు. హిందువులు, సిక్కులు వున్న దళంలో వేశారు. అక్కడ నుండి కూడా నన్ను మారుస్తారని జర్మన్లు అనుకుంటుండగా విన్న వంటవాడు చెప్పాడు. వెంటనే కల్నల్ క్రాప్ కు జరిగినదంతా తెలియజేసి సహాయపడమన్నాను. నన్ను లకనాప్ అనే చోటికి మార్చారు. జాగ్రత్తగా వుంటే ఏమీ జరుగదు. గొడవ చేస్తే నీ సంగతి చూస్తానని లెఫ్టినెంట్ నన్ను హెచ్చరించారు. నేను టెలిప్రింటర్ సెక్షన్ లో పనిచేశాను. చదువుకోవడానికి చాలా సమయం వుండేది. లకనాప్ లో భారతీయదళం మధ్య ఉంటూ హిందీ, ఉర్దూతో పాటు పంజాబీ, బెంగాలీ కూడా నేర్చుకున్నాను.
ఒకవారం రోజుల పాటు వియన్నాలో గడిపాను. భారతీయ సైనిక దుస్తులతో తిరిగాను. పాత స్నేహితురాళ్ళను కలుసుకున్నాను. తరువాత లకనాప్ డ్యూటీలో చేరాను. భారతీయ సంగీతం కొంత పట్టుబడింది. నాకు తోడుగా లుథియానా నుంచి వచ్చిన కార్పోరల్ ప్రీతమ్ సింగ్ ఫోన్ డ్యూటీలో చేరాడు. ఒకరోజు పరిగెత్తుకుంటూ వచ్చి మనదళం కోసం పుల్ వారీ పెడతామన్నాడు. ఎక్కడి నుంచో 8 మంది అమ్మాయిలను తీసుకు వచ్చారు. అందులో ఇద్దరు చాలా అందంగా వున్నారు. ఒకామె ఇటాలియన్, ఇందులో జర్మన్లకు ఇండియన్లకు వేరే వేరు ఏర్పాట్లున్నవి. ఇక్కడ జాతి విద్వేషాన్ని పాటించారు. 14 రోజుల పాటు చాలా సందడిగా హడావిడిగా జరిగిపోయింది. ఇటాలియన్ అమ్మాయి నీనాతో పిచ్చాపాటిగా మాట్లాడినప్పుడు జర్మన్లు, ఇటాలియన్ల కంటే భారతీయ సైనికులు చాలా ఆప్యాయంగా ప్రవర్తించారని చెప్పింది.
ఒకవైపున మిత్రరాజ్య సైన్యాలు వచ్చేస్తుంటే, ఫ్రాన్స్ ద్వారా ప్రయాణం మళ్ళుతున్నవది. అప్పుడు 4 వారాలపాటు మేము ఫ్రాన్ ద్వారా ప్రయాణం చేశాం. కొందరు భారతీయ సైనికులు చేసిన దుర్మార్గాల వల్ల మొత్తం సైన్యానికి చెడ్డపేరు వచ్చింది. ఇండియాపట్ల నా ఉత్సాహానికి తొలిదెబ్బ తగిలింది. వెనక్కు తిరిగి వస్తున్న సైనికులలో కొందరు ఇరవై సంవత్సరాల లోపు యువతులను చెరిచారు.

సైన్యంలో పూజలు, పరాభవాలు
యుద్ధంలో జర్మనులు ఓడిపోవడం ఖాయమని తేలిపోయింది. తిరిగి వస్తున్న భారతసైన్యంతో పాటు నేను ఫ్రాన్సులో చాలా అందమైన ప్రదేశాలు చూశాను. మాలో నూరు మంది మళ్ళీ బ్రిటిష్ సైన్యంలోకి వెళ్ళిపోయారు. మాలో ఉన్న సిక్కులు ఎక్కడికక్కడ గురుద్వారా స్థాపించి గురు గ్రంథ సాహెబ్ను పెట్టుకొని రోజూ ప్రార్థనలు చేసేవారు. నేనూ అందులో పాల్గొనేవాడిని. వారి ఆచార వ్యవహారాలు నాకు బాగా తెలిశాయి.
మళ్ళీ జర్మనీ గ్రామాలలో, లోయలలో పయనించాం. అప్పటి వరకు భారతీయ సైన్యంలో సిక్కులు మాత్రమే నిత్యం ప్రార్థనలు చేస్తుండేవారు. జర్మనీలో అతి శీతల ప్రదేశమైన స్వాబియన్ జ్యూరాలో మమ్మల్ని ఉంచారు. అక్కడ నేను హిందూ దేవాలయాన్ని స్థాపించాను. ప్రతి శనివారం పూజలు చేసి ప్రసాదం పంచిపెట్టేవాణ్ణి. పురాణాల నుండి, భగవద్గీత నుండి కొన్ని భాగాలు చదివి వినిపించేవాడిని. కార్పోరల్ హర్ దయాళ్ సింగ్ తులసీదాస్ రామాయణం చదివి వినిపించేవాడు. నేను అనుకోకుండా ఒక పూజారిగా మారాను. భారతీయ సైన్యంలో సంస్కృతం వచ్చినవారు ఎవరూ లేకపోవడమే అందుకు కారణం. ఇదంతా 1944 క్రిస్మస్ సందర్భంగా జరిగింది. తరువాత మా సైన్యం ఆఖరు ప్రమాణం సాగించింది. రణధీర్ సింగ్ సార్జెంటు మేయరుగా మాకు నాయకత్వం వహించాడు. 15 మైళ్లు నడచి డాన్యూబ్ బ్రిడ్జి దాటి రైలులో ప్రయాణం చేశాం. స్టేయిస్ లింజన్ అనే చోట దిగి మళ్ళీ రాత్రింబవళ్లు మార్చ్ చేశాం. అంతలో ఫ్రెంచివారి టాంకులు ఎదురుకాగా రణధీర్ సింగ్ ఒక తెల్లబట్టను చెట్టుకు కట్టి లొంగిపోయినట్లు ప్రకటించారు. మళ్ళీ మమ్మల్ని జర్మన్ గ్రామాలగుండా నడిపించి యుద్ద ఖైదీల శిబిరాలలో పెట్టారు. మూడు రోజులకొక పర్యాయం చిన్న రొట్టె ముక్కను, చిన్న చేపముక్కను ఇచ్చేవాడు. ఒకరోజు సాయంత్రం బ్రిటీష్ ఆఫీసరు వచ్చి మమ్మల్ని ఉద్దేశించి ఇలా అన్నారు. మీరు మీ దేశానికి ద్రోహం చేశారు. నాజీలతో కలసి నవ్వుతూ ఆడుతూ, పాడుతూ మాతృదేశ పతాకాన్ని వదిలేశారు. ఇప్పుడేడవండి అన్నారు.
బ్రిటీష్ అధికారి అందరినీ ప్రశ్నిస్తూ నా దగ్గరికి వచ్చాడు. అంతకు ముందే నేను భారతీయుడిని కాదని చెప్పవద్దని నాతోటి సైనికులకు చెప్పి ఉంచాను. నావంతు రాగానే హిందూస్థానీలో మాట్లాడాడు. ఇంగ్లీషులో మాట్లాడినప్పుడు నేను కాశ్మీర్ బ్రాహ్మణుడిని. నా పేరు రామచంద్రశర్మ అని, జర్మనీలో చదివానని చెప్పాను. తెల్లగా కాశ్మీర్ బ్రాహ్మణుడివలె వుండటం వలన అనుమానానికి తావులేదు. తల్లిదంద్రుల పేర్లు కూడా అప్పటికప్పుడు కల్పించి భారతీయ పేర్లు చెప్పాను. ఇదంతా అబద్ధమో నిజమో తెలుసుకునే అవకాశం వారికి లేదు. ఒకవారం తరువాత మమ్మల్ని లారీలోకి యెక్కించి స్ర్టాస్ బరీ వద్ద రైలు ట్రక్కులలో టులాన్కు పంపారు. అయిదు రోజుల ప్రయాణానంతరం ఆకలిదప్పులతో అక్కడకు చేరుకున్నాం. త్రోవలో ఒకచోట రైలాగినప్పుడు వాగన్ ప్రక్కనే నీళ్ళు త్రాగటానికి దూకబోయి పడిపోయాను. నాతోపాటు చాలమంది అలానే స్పృహతప్పి పడిపోయారు. నేను తరువాత జాక్ బూటు విప్పి నీటితో నింపుకున్నాను. తరువాత టూలాన్ లో జనం మమ్మల్ని ఉద్దేశించి ఇక నుండి వీళ్ళంతా బ్రిటిష్ ఆర్డరులో ఉంటారు. క్రమశిక్షణతో మెలగండని హెచ్చరించాడు. మమ్మల్ని మార్ సెల్స్ కు తీసుకెళ్ళి జర్మను యూనిఫారాలు తీయించారు. అక్కడ క్యాంప్ మాస్టరుగా వుండవలసిందిగా నన్ను కోరారు. వంటగదికి తీసుకు వెళ్ళి చూపెట్టి నన్ను ప్రత్యేకంగా తినమన్నారు. ఇంకెవరినీ పిలవవద్దన్నారు. వెన్న, పాలు, అన్నం, పప్పు, మసాలాలు, మాంసం, కూరగాయలు ఉన్నాయి. తెగ తిని నిద్రపోయాను. ఒక గంట తరువాత మెలకువ వచ్చింది. చాలా కాలం తరువాత మళ్ళీ వేడి వేడి భోజనం పెట్టారు.
హఠాత్తుగా నన్ను, మరొకరిని జీపు ఎక్కించి తీసుకెళ్ళారు. ఇండియాకు విమానంలో తీసుకెళుతున్నామని చెప్పారు. శార్దూల్ సింగ్ జిల్ ను, నన్ను ఒక అమెరికా విమానంలో ఓర్గీ అనే పట్టణానికి తీసుకెళ్ళారు. ఇద్దరు గూఢాచార అధికారులు మమ్మల్ని అనుసరించారు. ఇక్కడ మమ్మల్ని ఒకచిన్న గదిలో పెట్టి ఆరువారాల పాటు రాచమర్యాదలు చేసి అనేకసార్లు ప్రశ్నించారు. ఇందులో ఒక ఇండియన్ కెప్టెన్ ఉన్నారు. వారెవరూ నన్ను అనుమానించలేదు. బోసును గురించి, భారతసైన్యం గురించి, జర్మనులు, ఫ్రెంచివారు ఎలా చూచేవారు అనే విషయాలను అడిగేవారు. తరువాత మమ్మల్ని మళ్ళీ జర్మన్ సరిహద్దుకు తీసుకొచ్చారు. కలోన్ లో మధ్యాహ్నం భోం చేసి బయలుదేరాం. మాతో పాటు ఒకసార్జెంటు, ఇరువురు సైనికులు వున్నారు. త్రోవలో ఒక చోట ఇద్దరమ్మాయిలు కారును ఆపారు. సిగిరెట్లు అడిగారు. లిఫ్ట్ అడిగారు. మాతో వున్న సైనికులు మెషిన్ ఫిస్టల్ను, రైఫిల్ను మాకిచ్చేయగా మూడో వ్యక్తి తన పిస్టల్ ను డ్రైవర్ సీట్లో పెట్టాడు. అమ్మాయిలకు ప్రకృతి దృశ్యాలను చూపిస్తామని వారు ముగ్గురు ఆ అమ్మాయిలతో వెళ్ళిపోయారు. ఈ లోగా ఎవరైనా వస్తే పిస్టల్ తో కాల్చమని చెప్పారు. మధ్యలో ఒకటి, రెండు కార్లు అటు వెళ్ళినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. కాసేపటికి వెళ్ళిన వారందరూ తిరిగి రాగా అమ్మాయిలు మా వెనుక సీట్లో కూర్చున్నారు.
కొన్ని మాసాలపాటు జైలుశిక్షను అనుభవించిన తరువాత నన్ను హెర్ ఫోర్డ్ బాల్యనేరస్తుల జైలులో పెట్టారు. మూడుమాసాల పాటు నన్ను ఏకాకిగా ఉంచారు. నేను బరువు తగ్గి సన్నబడ్డాను. ఆహారం బాగుండేది కాదు. డాక్టరు నన్ను పరీక్షించి ప్రతీరోజు రొట్టె, వెన్న యివ్వమన్నారు. నన్ను ప్రత్యేక ఖైదీగా చూశారు. గోడమీద పడే నీడను బట్టి నాకు టైమ్ తెలిసేది. గదిలోనే రోజూ గంటన్నర సేపు పడుకోబోయే ముందు ధ్యానం చేసేవాడిని. జైలులో ఒక చిన్న లైబ్రరీ వుంది. ఇంతకాలం ఆ పాటి చదువుకునే అవకాశం లేదు. ఒకరోజు హఠాత్తుగా ఒక సైనిక వాహనంలో నన్ను చాలా దూరం తీసుకెళ్ళారు. సార్ లాండ్ అనే అందమైన ప్రదేశంలో నన్ను ఒక భవనంలోకి తీసుకెళ్ళి సోదా చేసి ప్రక్క గదిలోకి ప్రవేశపెట్టారు. ముగ్గురు అధికారులు కూర్చుని పెన్సిళ్ళతో ఏదో బొమ్మలు గీస్తూ నన్ను ప్రశ్నించారు. జర్మన్ లో నీ పేరేమిటని అడిగారు. రామచంద్రశర్మ అని చెప్పాను. నటించవద్దు. నీ పేరు ఫిషర్ అన్నారు. గత మూడు నెలలుగా నన్ను ఏకాంత వాసంలో ఉంచి ఇవన్నీ కనుక్కున్నారన్నమాట. వియన్నాలో నన్ను గురించి విచారించి, విషయాలన్నీ కనుగొన్నారు. నా సహచరుడెవరో అనుకోకుండా విషయం చెప్పివుంటాడు. గూఢచారులు తమ అసమర్థతను తిట్టుకొని, ఆరా తీశారు.
ఒకరోజు నన్ను, శార్దూలసింగ్ ను లండన్ తీసుకు వెళ్ళి రెండు రోజుల తర్వాత పంపించారు. అనుకోకుండా మాకు లండన్ సందర్శనం జరిగింది.
ఆ తరువాత నన్ను హెమర్ కేంప్లో నెలరోజుల పాటు నిర్భంధిం చారు. ఒకరోజు హఠాత్తుగా వదిలేశారు. ఆర్స్ బర్గ్ వరకూ వచ్చేసిన తరువాత మళ్ళీ నన్ను అరెస్టు చేశారు. రెండు వారాలు రాజకీయ ఖైదీగా అట్టిపెట్టి మూన్ స్టర్ కు పంపించారు. నేనేమంత ప్రమాదకారిని కాదని గ్రహించారు.
చివరకు నన్ను వదిలేయగా 1947 జనవరి 27న వియన్నా చేరుకున్నాను. కుటుంబమంతా ఒకచోట సమావేశమైంది. ఇంట్లో చలి కాచుకోవడానికి తగినన్ని కటైలు కూడా లేవు. ఇంటిల్లి పాదీ ఎవరి బాధలు వారు ఏకరవు పెట్టారు.
యూనివర్శిటీకి వెళ్ళి తత్వశాస్త్రం, ఇండాలజీ అభ్యసించడానికి పేరు నమోదు చేసుకున్నాను. ఇండియన్ క్లబ్బులో పరిచితులైన వారిలో ఐదుగురికి ఉత్తరాలు రాశాను. ఇండియాలో మూడు మఠాలకు నన్ను పరిచయం చేసుకుంటూ ఉత్తరాలు రాశాను.
నేను మొదట్లో 1939లో మా మామవద్ద సంగీతం నేర్చుకున్నాను. తరువాత కుటుంబ కలహాల వలన వదిలేశాను. మళ్ళీ సంగీతంపై అభిలాష కలిగి మొదలు పెట్టాను. తాత్కాలికంగా ఇండియాపై ఆసక్తి సన్నగిల్లింది. ఆ తరువాత నేను ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడ్డాను. మళ్ళీ హిందూతత్వంపై ఆసక్తి కలిగి వారిని వదిలేశాను.
1948 క్రిస్మస్కు ముందు నా వీసా దరఖాస్తును ఆమోదించినట్లు బెర్నీలోని భారతరాయబార కార్యాలయం తెలియజేసింది. క్రిస్మస్ నాడు బయలుదేరాను. ఒకటైప్ రైటర్, ఒక చిన్న కెమెరా, రెండు పుస్తకాలు, ఒక సూట్ కేసుతో  ప్రయాణం కట్టాను. రైలులో వెనిస్ కు వచ్చి జెనివాలో ఓడ ఎక్కాను. నేను యూర్ నుండి బయలుదేరేటప్పుడు దృఢ విశ్వాసంతో వున్నాను. ఒక వియన్నా వ్యక్తి సన్యాసిగా మారడం విశేషం.( telugu version by Innaiah Narisetti)


No comments:

Post a Comment