కలలుగన్న భారత దర్శనం
అనుకున్న క్షణం రానే వచ్చింది. ఎన్నాళ్ళ నుండో కలలు కన్న భారత భూభాగంపై అడుగు పెట్టాను. అది గాంధిజీని హత్య చేసిన రోజు. నెల రోజుల పాటు ఓడ ప్రయాణం చేసి 1949 జనవరి 30వ తేదీన బొంబాయికి చేరాను. కొన్ని వారాలకు ముందే నన్ను తన అతిథిగా వుండమని ఒక సంపన్న ముస్లిం ఆహ్వానించాడు. ఆయన ఇంట్లో అతిథ్యం స్వీకరిస్తే వియన్నాలో వున్నట్లు అనిపించింది. అంతే కాకుండా చాలా కాలం క్రితం మానేసిన మాంసాహారం మళ్ళీ అక్కడ స్వీకరించాను. కాని ఒక తేడా వున్నది. చక్కని ఉర్దూ నాకూ వచ్చు అనిపించాను.
మరునాడు హెద్దార్ రోడ్డులో తిరిగి ఖాకీదుస్తులు, గాంధీ టోపి కొన్నాను. హారస్ బి రోడ్డు, కొలబా మొదలైన ప్రాంతాలలో తిరుగుతూ నా మాతృదేశంలో వున్నట్లే భావించాను. నన్ను ఇండియాలో ఎలా చూస్తారో అనే భయం వుండేది. ఒకసారి న్యూ ఢిల్లీలో ఒక ప్రభుత్వ కార్యాలయంలో నన్ను గురించి అనుకుంటున్న మాటలు విన్నాను. ఇతడు మనలాగానే మాట్లాడతాడు. అదే చాల ప్రమాదం మొత్తం మీద ఇండియాలో నాకు తటస్థపడిన వారిలో నూటికి తొంబై మంది స్నేహంగానే వున్నారు.
కాకుంటే నన్ను చూసిన వెంటనే ఆశ్చర్యపోయేవారు. కొన్ని పారిశ్రామిక నగరాలలో మాత్రం నాపై వ్యంగ్య వ్యాఖ్యానాలు వినవచ్చేవి. వారి భాష మాట్లాడటం, కాషాయ వస్త్రాలు ధరించడం ముఖ్యంగా యూనివర్శిటీలలో నాపట్ల అనుమానం కలగడానికి కారణమయ్యేది. నేను ఎప్పుడైనా సినిమాకు వెళితే నన్ను చూడగానే గౌరవంగా క్యూని పాటించకుండా టికెట్ కొనుక్కోనిచ్చేవారు. మూడు పర్యాయాలు యిలా జరిగింది. దీనికి కారణం నేను తెల్లవాడిని కావడమేనని అనుకున్నాను. కాని నోరువిప్పితే క్యూ నుంచి బయటకు నెట్టేసేవారు. అదే ఇంగ్లీషు ఫారెన్ యాసలో ఒకసారి పెద్దగా అరిస్తే అది ఎంతో బాగా పనిచేసింది. ఇండియాలో చాలా సినిమాలు పౌరాణిక ఇతి వృత్తాలతో కూడినవే. అందువల్ల సన్యాసి సినిమాకు పోకూడదనడం కేవలం రాగద్వేషాల వల్లనే.
బొంబాయిలో మూడు రోజులు గడిపాను. తరువాత శాంతా క్రజ్ కు సమీపంలో వున్న ఖార్కు స్థానిక ట్రైన్లో వెళ్ళాను. అక్కడే రామకృష్ణ ఆశ్రమం వుంది.
శ్రీరామకృష్ణ ఆశ్రమంలో
నేను యూరప్ లో వుండగానే రామకృష్ణ మిషన్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. ఫలితంగా ఖార్ లోని రామకృష్ణ మిషన్ కు వెళ్ళగానే నాకోసం ఎదురు చూస్తున్న ఒక బెంగాలీ నాకు స్వాగతం పలికాడు. నన్ను లోపలికి తీసుకు వెళ్ళి కూర్చోబెట్టి మఠాధిపతి దర్శనం కోసం వేచి వుండాలన్నాడు. ఈ లోగా నాతో పిచ్చాపాటీ మాట్లాడాడు. ఎంతో కాలం నుంచి నేను వారిమధ్య వుంటున్న వాడిలాగా నాతో మాట్లాడాడు. నాకు చాలా ఆనందం అనిపించింది. తరువాత మఠాధిపతిని కలిశాం. అతను బెంగాలీ... పొట్టిగా లావుగా, అతి సామాన్యంగా కనిపించాడు. 55 సంవత్సరాలు వుండవచ్చు. నావైపు చూసి మూడు రోజుల క్రితమే రావలసింది. ఎందుకు రాలేదన్నాడు. నేను దిగజారిపోయాను. ఓడ అనుకున్న దానికంటే ఎక్కువ కాలం తీసుకుందని చెప్పాను. అతను తల ఊపాడు. మొదట ఇంగ్లీషులోను, తరువాత నెమ్మదిగా అంత బాగా రాని హిందీలోనూ మాట్లాడాడు. అక్కడ మూడు రోజులు మాత్రమే వుండాలని తరువాత కలకత్తా దగ్గర ఆశ్రమానికి పంపుతామని చెప్పాడు. సాయంకాలం జరిగే ఆరతి కార్యక్రమంలో తప్పక పాల్గొనాలని మిగిలిన సమయంలో నా యిష్టం వచ్చినట్లు వుండవచ్చునని చెప్పి నన్ను పంపించేశాడు. ఇద్దరు ఆశ్రమవాసులు నాకు గది చూపెట్టారు. ఒక తెల్ల ధోవతి, తెల్ల చొక్కా యిచ్చారు. అవి బ్రహ్మచారి దుస్తులు. ఆ గదిలో మంచం మీద కూర్చొని చుట్టూ దోమతెర వేసుకుని కాసేపు ధ్యానం చేసుకున్నాను. సాయంకాలం గంటలు వినిపించగా హడావుడిగా పంచె కట్టుకుని దేవాలయం దగ్గరకి వెళ్ళాను. సుమారు 30 మంది జనం వున్నారు. ఒక సన్యాసి హార్మోనియం వాయిస్తుండగా మరొక బ్రహ్మచారి తబలా వాయిస్తున్నాడు. కొందరు సంపన్నులు ఊళ్ళో నుంచి వచ్చారు. అందులో గుజరాతీ వారు కూడా వున్నారు. సీనియర్ స్వామీజీ ప్రార్ధన చేయడం, ప్రసాదాలు పంచడం పూర్తి చేసిన తరువాత చివరకు రామకృష్ణ పరమహంస విగ్రహానికి ఆరతి ఇవ్వడంతో సాయంకాలం కార్యక్రమం ముగిసింది. ప్రార్థనలో అందరూ పాల్గొన్నారు.
మరునాడు సాయంత్రం నన్నూ, మరో ఇద్దరు బ్రహ్మచారులనూ ఒకజైన వ్యాపారుడి భార్య టీకి ఆహ్వానించింది. ఆమె పేరు సుశీల, చక్కని టీ, పకోడీలు, జిలేబీలు - ఇంకా అనేక తీపి పదార్థాలు వడ్డించింది. ఆశ్రమంలో ఒకే రకమైన ఆహారం తింటుంటాం. ఈ మార్పు బాగానే వుంది. మేము టీ త్రాగుతూ మాట్లాడుకుంటుండగా యిద్దరు అందమైన అమ్మాయిలు అక్కడికి వచ్చారు. ఒక అమ్మాయికి 18 సంవత్సరాలు వుంటాయి. మరొక అమ్మాయి ఇంకా పిన్న వయస్కురాలు. వారు చేతులు కట్టుకుని నమ్రతతో నిలుచున్నారు. నా మాటలకు హాయిగా నవ్వారు. అందులో పెద్దమ్మాయి పేరు మాలిని. ఆమె త్వరలో ఒక జైన యువకుడిని పెళ్ళి చేసుకోబోతున్నట్లు సుశీల నాతో చెప్పింది. ఈ విధంగా మాటలు సాగుతుండగా యిద్దరు బ్రహ్మచారులలో ఒకరు ఓమ్ కేష్ జేవురు మొహంతో గుండు నిమురుకుంటూ ఆశ్రమానికి పరిగెత్తాడు. అతను అలా ఎందుకు వెళ్ళాడని సుశీల మమ్మల్ని అడిగింది. నేనూ ఏమీ చెప్పలేక పోయాను. ఆశ్రమానికి వెళ్ళి అలా హఠాత్తుగా యెందుకు వెళ్ళిపోయాడో కనుక్కుందామని గదిలో ప్రవేశించాను. రుద్రాక్షమాల క్రిందపడి వున్నది. అతడు కూర్చుని ఏడుస్తున్నాడు. నేను స్నేహపూర్వకంగా ఓదారుస్తూ కారణం అడిగాను. అతడు వెక్కివెక్కి ఏడుస్తూ ప్రేమలు, పెళ్ళిళ్ళు గొడవ నేను వినదల్చుకోలేదు. అదంతా ఎప్పుడో వదిలేశాను. ఆవిడ మళ్ళీ ఆ మాటలు మొదలు పెట్టింది. నాకు జుగుప్స కలిగింది అన్నాడు. నేను ఏమీ అనలేదు. కాని అతడు ఆశ్రమ జీవితానికి పనికిరాడని భావించాను. రెండేళ్ల తరువాత అతడు ఆశ్రమం వదిలేసి ఒక బెంగాలీ నర్సును పెళ్ళి చేసుకున్నాడు. చాలా మంది బ్రహ్మచారులకు, సన్యాసులకు అతనికి పట్టిన అదృష్టం పట్టదు. మానసిక సంయమనం లేనివారు చాలామంది ఆశ్రమాసులు చివరకు అక్కనే తేలతారు. కాషాయ వస్త్రాలను వదిలేస్తే, వారు అపఖ్యాతి పాలవుతారు.
వారాంతానికి మఠాధిపతి నన్ను కలకత్తా వద్దనున్న రామకృష్ణ మిషన్ కు పంపారు. బొంబాయి నుంచి మూడో తరగతి పెట్టెలో ప్రయాణం సాగించాను. ఆ అనుభవంతో తరువాత సాధ్యమైనంత వరకు మొదటి లేదా రెండవ తరగతిలో ప్రయాణం చేశాను.
అద్వైతాశ్రమంలో నాలుగు నెలలు
సాయంత్రానికి మా రైలు హౌరా స్టేషన్ కు చేరింది. నేతాజీ సుభాష్ పెద్దన్నగారు శరత్ చంద్రబోస్ కుమారులిద్దరూ నా కోసం స్టేషన్ కొచ్చారు. కలకత్తాలోని ఉడ్ బర్న్ పార్క్ వద్దనున్న వారి ఇంట్లో ఆతిథ్యం. రామచంద్ర (లియోపాల్డ్ ఫిషర్)గా నేను ఒకరి ఇంట్లో అతిథిగా వుండటం అదే చివరిసారి. మరునాడు ఉదయం అద్వైతాశ్రమానికి వెళ్ళాను. స్వామి యోగేశ్వరానంద నాకు రెండేళ్ళ సీనియర్. ఆయన మద్రాసు యూనివర్శిటీలో ఎం.ఎ చదివారు. సంస్కృతంలో, ఇంగ్లీషులో మత విజ్ఞానంలో నిపుణులు. ప్రపంచంతో సంబంధాలు తెంచుకోడానికి ఇంకా ఎన్నాళ్ళు కావాలని నన్ను అడిగాడు. మళ్ళీ బోసుగారింటికి వెళ్ళాను. శరత్ చంద్రబోస్ భార్య నా వీడ్కోలు విందుకు చాలా మందిని ఆహ్వానించింది. సనాతన హిందువులు, వృద్ధులు వచ్చారు. మూడు విధాలైన బియ్యపు వంటకాలు, నాలుగు విధాలైన చేపకూరలు, మూడు రకాల పప్పులు, అనేక మసాలా కూరలు మిఠాయిలు వడ్డించారు. ఆ రాత్రి బాగా నిద్రపోయి ఉదయం ఆలస్యంగా లేచాను. మధ్యాహ్నం వీడ్కోలులో పురుషుల కరచాలనం చేయగా, స్త్రీలు పాదాభివందనం చేశారు. యూరప సంస్కృతి నుంచి యెంతో దూరం వచ్చేశాను అనిపించింది.
రామకృష్ణ మఠానికి వెళ్ళాను. స్వామీజీ అక్కడ ఇద్దరు బ్రహ్మచారులను, ముగ్గురు స్వాములను పరిచయం చేశారు. వారు నాకు నచ్చారు. సాయంత్రం చక్కని భోజనం చేశాను. తరువాత సత్సంగ సమావేశానికి రమ్మని స్వామీజీ చెప్పారు. రామకృష్ణ సూక్తులు చదివి వినిపించారు. అది బెంగాలీ అయినా నాకున్న సంస్కృతం, హిందీ పరిజ్ఞానం వలన కొంత అర్థం చేసుకున్నాను. వాటి ఇంగ్లీషు అనువాదాన్ని నాకిచ్చి పెద్దగా చదవమన్నారు. చదివాను. అప్పటికి ఇంకా విదేశీ దుస్తులతోనే వున్నాను. ఆ రాత్రికి ఇద్దరు బ్రహ్మచారులతో నేలమీద చాపపైన పడుకున్నాను.
ఆశ్రమంలో పుస్తకాలు అమ్మకం పనిలో ప్రతివారూ పాల్గొనవచ్చు. ఒకటి, రెండు సంవత్సరాలు అక్కడ పనిచేసిన తరువాత ఇతర కేంద్రాలకు పంపిస్తారు. ఒకచోట ఎవరినీ వుండనీయరు.
మూడు రోజుల్లో నేను ఆ క్రమశిక్షణకు అలవాటు పడ్డాను. రామకృష్ణ ప్రచురణ సంస్థ కలకత్తా నగరం మధ్యన ఉన్నది. ఇతర రామకృష్ణ మిషన్ కేంద్రాల నుండి రోజూ అక్కడకు వస్తూపోతూ వుంటారు. ప్రతిరోజూ సాయంత్రం రెండు గంటలపాటు నగరంలో కాలినడక చాలా విషయాలు తెలుసుకున్నాం. బ్రహ్మచారి సుధీర్ నా వెంట వచ్చేవాడు. సందులలో నేను తప్పిపోకుండా మురికి కూపాల పడి పాపం చేయకుండా నన్ను రక్షించేందుకు సుధీర్ను పంపించేవారు. అతను పొట్టిగా, సన్నగా వుండేవాడు. నేను నెమ్మదిగా నడిచేవాడిని. అతను గబగబా వెళ్ళేవాడు. కొన్నాళ్ళకు నాతో పాటు రావడం మానేశాడు. నాకు ఎలాంటి ప్రమాదమూ లేదని భావించాడేమో.
అద్వైత ఆశ్రమంలో మొత్తం నాలుగు మాసాలున్నాను. మార్చి మాసంలోనే విపరీతంగా చమటపోసేది. అప్పటికి కొంతవరకు కొత్త దుస్తులు అలవాటుపడ్డా, ధోవతి కట్టుకోవడం బాగా అలవడలేదు. అదెప్పుడో జారిపోతుందని స్వామీజీ అంటుండేవారు. ఆయన అన్నట్లు ఒకసారి చౌరంఘీలో వెడుతుండగా ధోవతి ఊడిపోయి కాళ్ళమీద పడింది. పైన చొక్కా వుంది కనుక సరిపోయింది. వంగి ధోవతి అందుకొని నడుముకు చుట్టుకునేలోపు కొందరి దృష్టి నాపైన పడ్డది. వారు నవ్వుతూ నావైపు ఆసక్తిగా చూశారు. దగ్గరలో వున్న ఒక దర్జీ షాపులోకి వెళ్ళాను. ఒకవ్యక్తి నన్నుచూచి మహారాజ్ ఏం కావాలి అని అడిగాడు. కొంచెం చాటు ప్రదేశం కావాలన్నాను. ప్రపంచం అంతా మీదే. ఎక్కడి కావాలంటే అక్కడికి వెళ్ళండి అన్నాడు. గుట్టలుగా పడివున్న బట్టలచాటుకు వెళ్ళి ధోవతి కట్టుకున్నాను. అప్పటి నుండి ధోవతి విషయంలో చాలా జాగ్రత్తపడ్డాను.
నేను కలకత్తా వచ్చినప్పుడే కొన్ని రోజుల తరువాత హిమాలయాల్లోని ఆశ్రమానికి శిక్షణ నిమిత్తం పంపిస్తామని చెప్పారు. కలకత్తాలో వున్నంత కాలం నగర జీవితం అధ్యయనం చేయడానికి అవకాశం ఏర్పడింది. హిమాలయాలకు వెడితే మళ్ళీ రావడం ఆలస్యం అవుతుంది గనుక ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను.
ఆశ్రమంలో తరచు జరిగే కార్యక్రమాలలో రకరకాల మిఠాయిలు పెట్టేవారు. తీపి పదార్థాలంటే నాకు ఇష్టముండేది కాదు కాని సన్యాసి స్వీట్లు బాగా తినాలట. నేను వద్దంటే నావైపు వింతగా చూసేవారు.
ఏప్రిల్ లో కలకత్తా దుర్భరంగా ఉంటుంది. అప్పుడు స్వామీజీలు కొందరు హిమాలయాలకు వెడతారు. నేను రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి మాధవానంద, అద్వైత ఆశ్రమ స్వామీజీ యోగేశ్వరానంద ప్రయాణానికి సిద్ధమైనాం. మమ్మల్ని సాగనంపడానికి ఆశ్రమవాసులు కొందరు హౌరా స్టేషన్ కు వచ్చారు. పూలమాలలతో ముంచెత్తారు. స్వామి మాధవానంద రిటైరయినవాడు, ఆయన శేషజీవితాన్ని భగవత్ ధ్యానంలో గడపదలచారు.
చంపావతికి బస్సులో మూడు గంటలు ఆలస్యంగా చేరిన మేము అక్కడ నుండి నడక ప్రారంభించాము. నాకు ఎత్తు ప్రదేశాలెక్కడమంటే ఇష్టం లేదు. ఒక గంట నడిచిన తరువాత చికాకు కలిగింది. నా వెనుక వస్తున్న బ్రహ్మచారి, భండారిస్వామి సంభాషణ మరీ జుగుప్స కలిగించింది. వాళ్ళు కన్నడంలో మాట్లాడుతూ మధ్యలో ఇంగ్లీషులోకి పోయి, అక్కడక్కడా బెంగాలీ పదాలు వాడారు.
ఆశ్రమానికి వెళ్ళే త్రోవలో లోహాఘట్ ఉన్నది. మేము మోహన్ లాల్ షా ఇంట్లో బస చేశాం. అతనిని షాజీ అని సంబోధించేవారు. అతను వివేకానందను చూచాడు. సేవించాడు. బ్రహ్మచారిగానే జీవితం గడిపాడు. అతని చూపును గ్రహించి సేవకులు పనులు చేసేవారు.
ఆశ్రమంలో నాగది విశాలమైంది. శుభ్రమైంది. నాకు ఒక రగ్గు, రాసుకోడానికి బల్ల, ఒక స్టూలు, పుస్తకాలతో కూడిన ఒక అల్మారా సమకూర్చారు. రామకృష్ణ, వివేకానంద సూక్తులు, ఉపనిషత్తులు, భగవద్గీత, మఠం నియమాలతో కూడిన చిన్న పుస్తకం ఇచ్చారు. మరునాడు ఉదయం మధ్యహాలులో టీ నిమిత్తం అందరూ సమావేశమయ్యారు. స్వామీజీ నాకు ఆశ్రమం చూపెట్టారు. పుస్తకాలతో పాటు ఒక టీ టేబుల్, టైప్ రైటర్, పాత గ్రామఫోన్, డ్రై బాటరీ రెడియో ఉన్నవి. తరువాత డైనింగ్ హాలు, బయట వంటిల్లు, స్నానాల గదులు ఉన్నవి.
అద్వైత ఆశ్రమంలో రామకృష్ణ మిషన్ ప్రచురణ కేంద్రం ఉన్నది. ఎడిటర్ కార్యాలయం ఉన్నది. ప్రబుద్ధ భారతి పత్రిక ఇక్కడ నుండే వెలువడుతుంది. ఒక పోస్టాఫీసు ఉంది. ఆస్పత్రి, విశ్రాంతి గృహం కూడా ఉన్నవి.
రాంసింగ్ అనే వ్యక్తి ఆశ్రమంలో ఆవుల సంరక్షణ చూచుకుంటాడు. పాలు పితికేటప్పుడు ఒక బ్రహ్మచారిని అతనిపై కాపలా పెట్టేవారు. అతడు పాలన్నీ పితకకుండా వదిలేసేవాడు. స్వాములకు పాలు సరిపోయేవి కావు. ఆశ్రమంలో కూరగాయల తోట ఉన్నది.
ఆశ్రమంలో నా విధులేవో తెలియపరిచారు. ప్రధాన భవనంలో కొంత భాగం శుభ్ర పర్చారు. లైబ్రరి పుస్తకాల్ని క్రమంలో పెట్టి కేటలాగు తయారు చేయటం, ఎడిటర్కు ప్రచురణ కర్తకు తోడ్పడుతూ ఫ్రూఫ్లు చదవడం నా పనులు. నాలుగు నెలలు ఆశ్రమంలో ఉండి అధ్యయనం చేస్తూ, ధ్యానం చేస్తూ గడపాలి. తరువాత కలకత్తా నుంచి బేలూరు మఠానికి పంపించి బ్రహ్మచర్య ప్రథమ దీక్ష ఇస్తారు. ఆ తరువాత మళ్ళీ ఇక్కడకు వచ్చి నాలుగైదేళ్ళు ఉండిన అనంతరం బేలూరు మఠంలో పూర్తి సన్యాసత్వాన్ని ఇస్తారు.
స్వామి యోగేశ్వరానంద ఆ సాయంకాలం నన్ను తన ఎదురుగా కూర్చోబెట్టి ఇలా అన్నారు. మీరు రోజూ రెండు పర్యాయాలు ధ్యానం చేయాలి. అధ్యనం చేయాలి. ఠాకూర్ (రామకృష్ణ) పేర ఇచ్చిన పనిచేయాలి. ఏ పనైనా సరిగా చేయకపోతే మందలింపు తప్పదు, ధ్యానం, అధ్యయనం, మీ స్వవిషయాలు. మోక్షానికి చదువు అక్కరలేదు. రామకృష్ణ నిరక్షరుడు. ఋషికి చదువు అవసరం లేదు అని చెప్పారు.
ప్రధాన స్వామీజీ చాలా వృద్ధులు. అంత ఆరోగ్య వంతులూ కారు.
దీక్షకు ముందు నేను నేర్చిన ధ్యానం ఒక విధమైన సాదన అయింది. మంత్రం గురువు ఉపదేశించాలి.
అప్పట్లో వివేకానంద సంపూర్ణ రచనలలో 8వ సంపుటి సిద్ధమవు తున్నది. ఇందులో అప్పటివరకు ప్రచురించని లేఖలు ప్రధానంగా ఉన్నవి.
లండన్లో రామకృష్ణ మఠాన్నినిర్వహిస్తూ స్వామి వివేకానంద వేదాంతంలో కమ్యూనిజాన్ని, గతితార్కిక భౌతికవాదాన్ని చూశాడు. కాని, ఆయన భాష్యాన్ని రామకృష్ణ మిషన్ వారు అంగీకరించలేదు.
నేను ఆశ్రమంలో ప్రవేశించిన తరువాత 8 మాసాలు పాటు ఉదయమే భగవద్గీత చదివి వినిపించేవారు.
గీత ద్వితీయాధ్యాయంలో ఇలా వున్నది. జన్మతః వచ్చిన చర్యలను తృణీకరించవద్దు అవి చెడ్డవైనా సరే పాటించు. ఇతరుల పనులు చేయడం కంటే ఇదే మంచిది అంటే పుట్టుకతో నీవు కొన్ని పనులు చేయడానికి అర్హుడవు. ఇతర పనులకు అనర్హుడవు అని అర్థం. ఇది మతపరంగా పచ్చి కులవాదం. ఈ భాగాన్ని స్వామి యోగేశ్వరానంద గబగబా చదివేవారు. నేను అభ్యంతర పెట్టాను.
ఆయన సమాధానం చెపుతూ మత పవిత్రతను, ఆధ్యాత్మికతను అర్థం చేసుకోలేని సమాజంలో పుట్టి పెరిగిన నీకు ఇవి అర్థం కావు అన్నాడు.
ఒకే ఆలోచనను రాజకీయ నియంత చెప్పినప్పుడు తృణీకరించి అదే మాటలను మత పెద్ద చెబితే అంగీకరించాలా? అని అడిగాను. నీకు తగినంత అంతర దృష్టి లేదు. సున్నిత మర్మాలను నీవు అర్థం చేసుకోలేవు. నీకా దృష్టి ఉంటే ఈ సందేహాలు రావు అన్నాడు.
ఆశ్రమంలో భోజనం తొంభై శాతం శాఖాహారమే. బెంగాలీ సన్యాసులు చేపలు, గుడ్లు తింటారు. వాటిని శాఖాహారంగానే పరిగణిస్తారు. సాయంత్రం 5-00 గంటలకు టీ ఇస్తారు. సాయంత్రం 7-00 గంటలకు ఒక గంటసేపు ధ్యానంలో నిమగ్నులవుతారు. రాత్రి ఎనిమిదిన్నరకు భోజనం ముగించి, అందరూ హాలులో చేరి రామకృష్ణ సూక్తులను, వివేకానంద ప్రసంగాలను, బ్రహ్మానంద సూచనలు చదువుతారు.
రామకృష్ణ మిషన్లో ఎక్కువగా బెంగాలీలు, దక్షిణాదివారు వుండేవారు.
కలికృష్ణ మహారాజ్ స్వామి విరాజానంద రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు. ఆయన పండితుడు, భక్తుడు, దయామయుడు, ఆయన ఆరోగ్యం సరిగా లేదు. పొట్టిగా వుంటాడు. నిడువైన గడ్డం. మొదటిరోజు నేను ఆయనను చూడలేదు. ఆయన వద్దకు తీసుకువెళ్ళాడు.
దీక్ష ఇచ్చేముందు రాత్రి పగలూ కూడా ప్రార్థనలతో, ధ్యానంతో గడపాలి. దీక్షనాడు ఉపవాసం వుండాలి. ఆరోగ్యం సరిగా వుంటే గురువు కూడా అలాగే పాటించాలి. నాకు దీక్ష ఇచ్చే సమయానికి ఆశ్రమ కార్యదర్శి వచ్చి మీకు హిందీలో దీక్ష ఇస్తారని చెప్పాడు. విరాజానంద మాతృభాష బెంగాలి. అతడి ఇంగ్లీషు చక్కగా వుంటుంది. అంతరు ముందు చాలా మందికి ఇంగ్లీషులోనే దీక్ష ఇచ్చాడు. ముహూర్తానికి నన్ను స్వామీజీ గదిలోకి పిలిచి నాచేతిలో ఫలాలతో కూడిన పళ్ళెం ఉంచారు. దీక్ష అనంతరం నేను సమర్పించిన దక్షిణ అది. చిరకాలంగా ఎదురుచూస్తున్న సమయం అసన్నమైన నేనంతగా ఉప్పొంగిపోలేదు.
నన్ను గదిలోకి పిలిచి మంత్ర బోధన చేశాడు. ఇది ఆకర్షణీయమైన చర్య. ఆ తరువాత ధ్యానంలో మంత్రం ఎలా జపించాలో, మనస్సును ఎలా మలచుకోవాలో, ఆసనాలు ఎలా వేయాలో చెప్పారు. ఒకే వస్తువుపై మనస్సును లగ్నం చేయడం, క్రమేణా మిగిలిన వాటన్నింటినీ మనస్సు నుంచి తొలగించడం జరగాలి.
ఆశ్రమానికి ఉద్వాసన
బెంగాల్లో దుర్గాపూజా సందర్భంగా స్నేహితులకు, బంధువులకు ఉత్తరాలు రాడం సంప్రదాయం. అలా రెండేళ్ళు రాశాను. ఈసారి కలకత్తాలో ఉన్న స్వామి యోగేశ్వరానందకు సుదీర్ఘమైన ఉత్తరం రాశాను. ఆయన కలకత్తా వెళ్ళేటప్పుడు నన్ను పిలిచి ఇలా చెప్పారు.
రామచంద్రా, ఠాకుర్ను (రామకృష్ణ) ప్రార్థించు. ఆయన నామం జపించు, ఠాకుర్ను స్మరించు అదే నీవు చేయగలిగిన ఉత్తమ చర్య.
వీడ్కోలు మాటలు నాలో మారుమ్రోగుతున్నాయి. రామకృష్ణ మఠాన్ని స్థాపించిన మూలపురుషుడిని గురించి నా అభిప్రాయాలు వెల్లడిస్తూ ఆయన మన మధ్య నివసించిన గొప్ప వ్యక్తి అని, ఆధ్యాత్మిక అభ్యాసానికి గొప్ప అధ్యాపకుడని అన్నాను.
రెండు వారాల తరువాత నాకు ఒక కబురందించారు. దానిపై శ్రీరామచంద్ర లియోఫోల్ట్ ఫిషర్ అని వున్నది. అంటే నన్ను ఆశ్రమం నుంచి తొలగించినట్లుగా భావించాను. లేకుంటే బ్రహ్మచారి రామచంద్ర అని రాసేవారు. యోగేశ్వరానంద లేఖలో నీవు క్రమశిక్షణకు కట్టుబడిలేవని కొన్నేళ్ళుగా గమనించాను. నీవు మిషన్ నియమాలను అధిగమించావు.
యోగేశ్వరానంద ఉత్తరం వచ్చిన రెండు వారాలకు నా సామాన్లు సద్దుకున్నాను. ఆశ్రమ కుర్రవాడు సామాన్ల మూట పట్టుకున్నాడు. ఆశ్రమంలో స్వాములందరి నుంచి వీడ్కోలు సాష్టాంగ నమస్కారం ద్వారా చెప్పాను.
తనక్ పూర్ నుంచి లోహఘట్ వరకూ బస్సు ఉన్నది. అందువలన కొన్ని మైళ్ళు మాత్రమే నడవాల్సి వచ్చింది. నా హిమాలయ జీవితానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పాను. రెండేళ్ళ క్రితం కంటే ఇప్పుడు నేను కోపాన్ని జయించాను. ఇంకా పరీక్షలకు నిలవాల్సి వుంది. ఏమైనా హిమాలయాలలో ధ్యానం నేర్పినవారు భిన్నంగా వుంటారు.
రామకృష్ణ మిషన్ ఒక ఆధునిక హిందూశాఖ. ఇందులో సన్యాసులు, బ్రహ్మచారులు ఉంటారు. మొత్తం 138 కేంద్రాలను స్థాపించారు. అందులో 86 ఇండియాలో ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికాలలో 20 కేంద్రాల వరకు ఉన్నవి. పారిస్ లో ఒకటి, లండన్లో మరొకటి స్థాఫించారు. లండన్ లో రెండవ కేంద్రం ఉండేది కాని అక్కడ స్వామీజీ వేదాంతం. కమ్యూనిజం ఒకటేనని హఠాత్తుగా కనుగొన్నాడు. ఆయనతో మిషన్ వారు అంగీకరించలేదు. అమెరికాలో ఒక డజను కేంద్రాలున్నవి.
గత శతాబ్దం చివరలో బెంగాలీ పేద గ్రామీణ పురోహితుని కొడుకు సన్యసత్వ మనస్తత్వం గల యువ బ్రాహ్మణుడు ఉండేవాడు. కలకత్తాకు సమీపంలో ఒక కొత్త దేవాలయానికి అతడు పురోహితుడు అయ్యాడు. ఆ దేవాలయంలో దక్షిణేశ్వరుడు, బెంగాలీలు భక్తి ప్రవత్తులు చూపే కాళీ విగ్రహాలున్నవి. విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉన్నది. ఇండియాలోని దేవాలయాలన్నిటిలో మూల విగ్రహంతో పాటు ఇతర దైవాలను కూడా ప్రతిష్ఠ చేస్తారు. ఈ యువకుని పేరు గదాధర్ చటోపాధ్యాయ (రామకృష్ణుడు) కాళీని దర్శించాడు. ఆమెతో మాట్లాడాడు. నృత్యం చేశాడు. ఆయన దృష్టిలో కాళి ఒక సజీవమూర్తి. ఆయన ఏకోపాసన గాక అన్ని మత విధానాలు పాటించాడు. ఆయన ఏకోపాసన గాక అన్ని మత విధానాలు పాటించాడు. ధ్యానం చేస్తే పంచవంటి వృక్షం క్రింద సీత ప్రత్యక్షమై అతడిలో ప్రవేశించింది. శివుడిని చూశాడు. అతడిలో లీనమయ్యాడు. రాధాకృష్ణులను తిలకించి వారితో తాదాత్మ్యం చెందాడు. మహమ్మదు ప్రవక్త అతడికి ప్రత్యక్షమై అతనితో సంభాషించగా, అల్లాను దైవంగా గుర్తించాడు. క్రీస్తును ధ్యానించగా క్రీస్తు ప్రత్యక్షమై క్రైస్తవ సత్యాన్ని చూపాడు. తోతాపురి అనే సన్యాసి రామకృష్ణుడికి అద్వైత బ్రహ్మదీక్ష ఇచ్చాడు. మరొక బ్రాహ్మణయోగిని రామకృష్ణుడిని తాంత్రిక విద్యలో ప్రవేశపెట్టి స్ర్తీ పురుష సంగమ క్రతువులు నేర్పింది.
కలకత్తాలో ఈ యువపురోహితుడి ఖ్యాతి వ్యాపించింది. కొందరు నవ్వారు. కొందరు వెక్కిరించారు. కొందరు చూచి తలవూపి వచ్చేశారు. అప్పట్లో కలకత్తా బ్రిటీషు ఇండియాకు రాజధాని. పండితుడు, కవి, సంస్కర్త అయిన దేవేంద్రనాథ్ టాగూర్ ఇతడిని సందర్శించాడు. నోబుల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ టాగూర్ తండ్రిగారాయన.
ఒకనాడు విద్యార్థిగా ఉన్న నరేన్ ఇతడి వద్దకు వచ్చాడు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నరేన్ సంశయవాదినని అనుకునేవాడు. ఒక పవిత్ర వ్యక్తిని చూసి ఆనందిద్దామని వచ్చాడు. ఒకాడు రామకృష్ణుడు తన పాదాలను నరేన్ ఛాతిపై పెట్టాడు. నరేన్ క్రిందపడిపోయి మోహనిద్రావస్థలోకి పోయాడు. తరువాత నరేన్ చదువుకు స్వస్తి చెప్పి కుటుంబాన్నీ వదిలేసి ప్రథమ శిష్యుడిగా రామకృష్ణుడి వద్ద నిర్విరామకృషి చేస్తూ ఉండిపోయాడు. అతడే ఉత్తరోత్తరా స్వామి వివేకానందంగా యూరోప్, అమెరికాలలో హిందూ మతానికి ప్రథమ ప్రచారకుడయ్యాడు.
నేను యూరోప్ లో ఉండగా రామకృష్ణుని ఒక ఋషిగా, వివేకానందుని గురువుగా భావించాను. రామకృష్ణ మిషన్ పాఠశాలలను, కళాశాలలను స్థాపించి ఆసుప్రతులను నిర్వహిస్తున్నారు. వరదలు, కరువు కాటకాలలో ఆదుకుంటారు. బాధ్యత గల పౌరులవలె చురుగ్గా పనిచేస్తారు. ఈ మఠాలలోని సన్యాసులు విద్యావంతులు ఇంగ్లీషు వచ్చినవారు. రామకృష్ణ మఠాలు పరిశ్రుభంగా ఉంటాయి. సమర్థవంతంగా క్రమశిక్షణతో నడుస్తాయి. కాషాయ వస్త్రాన్ని అడ్డం పెట్టుకుని సుఖభోగాలను అనుభవించడానికి కామకేళిలో మునిగితేలి ఉండటం భారతదేశంలో సన్యాసులు చాల మంది సిద్ధహస్తులైనప్పటికీ, రామకృష్ణ మిషన్ లో సన్యాసులు మాత్రం అలాంటి పనులు చేయలేదు.
పాశ్చాత్య ప్రభావం వలన, ముఖ్యంగా క్రైస్తవ మత ప్రభావం వలన స్వామి వివేకానంద, భారతీయ సన్యసత్వానికి ప్రశాంతంగా ఉండటం ప్రధాన లక్షణం అయినప్పటికి, వివేకానందుడు, ఆయన అనుచరులు చాలా చురుకుగా పనిచేశారు. భగవద్గీతలో కృష్ణుడు కార్యదీక్షకై అర్జునుడిని పురికొల్పిన ఉదంతాన్ని వీరు చూపుతారు.
వివేకానందుడు తన గురువు రామకృష్ణుని సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని వివేకానందుడు గాని, ఆయన శిష్యులు గాని ఒప్పుకోరు.
రామకృష్ణ మిషన్ సన్యాసులు. వారి అనుచరులు పండితులు కాక పోయినా, బాగా చదువుకున్న వారే. అన్ని మతాలు చివరికి బోధించేది ఒకటేనని. మానవ సేవే మాధవ సేవని వీరు నమ్ముతారు.
రామకృష్ణ సిద్ధాంతంలో శుద్ధ పాండిత్యం వల్ల ప్రయోజనం లేదు. దానికి తోడు పవిత్రత, ధ్యానసాధన ఉండాలి. రామకృష్ణుడి దృష్టిలో పవిత్రంగా ధ్యానం చేయగలిగినవారు బహు అరుదు. చాలామంది ధ్యానానికి అర్హులు కారు.
రామకృష్ణ ఆశ్రమంలో బ్రహ్మచారులుంటారు. ఇందులో 80 సంవత్సరాల బ్రహ్మచారులు ఉన్నారు. బ్రహ్మచారి అంటే బ్రహ్మలో కదలడం అని అర్థం. వేదోక్తంగా నిర్వచనం చూస్తే బ్రహ్మపై మనస్సు లగ్నం చేసినవాడే బ్రహ్మచారి కాడు. కృష్ణుడు 16 వేల భార్యలను ఏక సమయంలో అనుభవించేవాడట. అయినా ఆయన బ్రహ్మచారి. నేడు అర్థం మారిపోయి లైంగిక సంపర్కం లేని వాడే బ్రహ్మచారి అని చెపుతున్నారు. క్రమేణా ఈ అర్థం వాడుకలో రూఢి అయి నిలిచింది.
లోగడ సనాతన మఠాలలో బ్రహ్మచారికి అర్ధాహారాన్నిచ్చి సుఖశాంతులకి దూరంగా ఉంచేవారు. దీనికి భిన్నంగా రామకృష్ణ ఆశ్రమంలో వివేకానందుడి పద్ధతి ప్రకారం బ్రహ్మచారిని చాలా గౌరవంగా చూస్తారు. శుభ్రమైన దుస్తులు, మంచి ఆహారం, సుఖంగా నిద్రించడానికి అనువైన పరిస్థితిని కలిగిస్తారు. తర్వాత ఒక్కొక్క సౌకర్యాన్ని ఉపసంహరిస్తారు. సన్యాసులు స్వచ్ఛందంగానే ఈ సౌకర్యాలను వదులుకుంటూ పోతారు. ఈ విధంగా రామకృష్ణ మఠాలలో సన్యాసులు నియమ నిబంధనలతో కఠోర జీవితాన్ని గడుపుతుండగా, బ్రహ్మచారులు చక్కని రుచికరమైన ఆహారాన్ని స్వీకరిస్తూ, విలాస జీవితాన్ని గడుపుతారు.
సన్యాసులలో చొక్కాలు వేసుకునేది రామకృష్ణ మిషన్లో మాత్రమే చూస్తాం. బేలూరు మఠంలో రామకృష్ణుడి విగ్రహాన్ని పూజిస్తారు. ఇండియాలో ప్రతి పవిత్ర వ్యక్తిని కనీసం కొందరైనా అవతారంగా భావిస్తారు. అలాగే పరమహంసను కూడా, బేలూరు మఠంలో పేద హిందువులు, మధ్య తరగతి వారు చేరుతుంటారు. కాని ఈ రెండు వర్గాలవారు ఎలాంటి సంబంధం ఉండదు. ఒక మ్యూజియంను సందర్శించినట్లే పేదవారు దేవాలయాన్ని సందర్శిస్తారు.
రామకృష్ణ మిషన్లో బ్రహ్మచారులకు నేర్పే యోగవిద్య రెండువేల సంవత్సరాల క్రితం పతంజలి చెప్పినదే. ఈ మిషన్లో ధ్యానం చేస్తున్నారా లేదా, ఎవరు ఎంతసేపు చేస్తున్నారు అనే విషయాలను పట్టించుకోరు. అద్వైత ఆశ్రమంలో ఎక్కువసేపు ధ్యానం చేసే వారిని గౌరవిస్తారు. రామకృష్ణ మిషన్ లో కర్మయోగాన్ని పాటిస్తూ, ఠాకుర్ పనిని (అంటే రామకృష్ణ సేన) చేస్తున్నామని తృప్తి పడతారు.
గీతకు అటూ ఇటూ
రామకృష్ణ మఠాలలో ప్రాతఃకాల సమావేశాలలో భగవద్గీత నుండి కొన్ని భాగాలను చదివి వినిపిస్తారు. గీతను అనువదించి బహుళ ప్రచారం తెచ్చి పెట్టారు. అందువలన గీత వ్యాఖ్య చిలవలు పలవలైంది. అసలు గీత కలగాపులగం. పైగా పరస్పర విరుద్ధ విషయాలు అనేకం వుండటం వలన దీనికి అంతటి ఖ్యాతి వచ్చింది. ఒకవైపు హింసావాదాన్ని, మరొకవైపు సన్యసత్వాన్ని గీత బోదిస్తుంది. ఏకేశ్వరోపాసనను బోధిస్తూనే మరోవైపు అద్వైతాన్ని ఉపదేశిస్తుంది. గీతలోని ఈ ద్వంద్వ వైఖరిని వివరించడానికి శంకరాచార్యుడు ప్రయత్నించాడు. కాని సఫలం కాలేదు. గీతాచార్యుడు ఈ విషయాన్ని వివరించడంలో ముందు సాధారణంగా ప్రారంభించి క్రమేణా ఉన్నత విషయాలు ప్రస్తావించాడు. నీవు యుద్ధరంగంలో చనిపోతే వీర స్వర్గాన్ని అలంకరిస్తావు. బ్రతికితే ప్రపంచాన్ని పరిపాలిస్తావు. కనుక పోరాడు అని గీతలో వున్న మాటలను సామాన్యుడికి ఉద్దేశించినవైతే, అనుకూలమయినప్పుడల్లా అవే పవిత్ర ప్రవచనాలుగా ఎందుకు బోధిస్తారో అర్థం కాదు. వాస్తవానికి భగవద్గీత ప్రమాణ గ్రంథం కాదు. హిందూ పునరుజ్జీవనంలో ఇది ప్రాముఖ్యతను సంతరించుకున్నది. రాజకీయ వాదులు, ఋషులు, తత్వవేత్తలు, సెక్యులర్ బోధకులు గీతను అనువదిస్తూ భాష్యం చెబుతూ తమ ఇష్టం వచ్చిన రీతిలో అన్వయించుకుంటూ పోయారు. నేటి రాజకీయవాదులు గీతలోని కర్మయోగాన్ని స్వీకరించి, మిగిలిన వాటిని త్రోసివేస్తారు. కొందరు యోగ విషయాలకు ప్రాధాన్యతనిస్తారు. ఇంకొందరు భక్తికి ప్రాధాన్యత ఇస్తారు. ఏమైనా భగవద్గీత సాహిత్య దృష్టిలో ఒక గొప్ప గ్రంథం Telugu version : Innaiah Narisetti
No comments:
Post a Comment