పిల్లి చెప్పిన కథ - 4

రామాయణం ఆటవికులదే

ఆధ్యాత్మిక ఇతిహాసాలు విమర్శించదగినవైనప్పటికీ నాకా శక్తి లేదు. సందర్భాన్ని బట్టి ఇక్కడ ఒక విషయం సూచిస్తాను. హనుమంతుణ్ణి ఆరాధించటం మాత్రం మూల పురుషుడికి కొలువులు కొలిచే ఆదిమవాసుల పద్ధతి అనిపిస్తుంది నాకు. నా సూచన ప్రకారం విషయాన్ని పరిశీలిస్తే పరిశీలకుల ధోరణి బట్టి రెండు విధాలైన నిర్ణయాలకు రావడం జరుగుతుంది. ఆధునిక విజ్ఞానం సాధించిన విజయాలు భారతీయులకు వేల సంవత్సరాలనాడే తెలుసునని రుజువు చేయదలచేవారు రామాయణ కావ్యం రాసినవారికి డార్విన్ సిద్ధాంతం ఆనాడే తెలుసునని ఢంకా బజాయించి చెబుతారు. కాని విమర్శనా దృష్టితో చూస్తే దానికి విరుద్ధమైన నిర్ణయం చేయవలసి ఉంటుంది. రామాయణ కాలపు ప్రజలు మూలపురుషుణ్ణి ఆరాధించే ఆటవికులూ రెండూ ఎలా కాగలరనే ప్రశ్నకు దారి తీస్తుంది. ఈ సమస్యకు సమాధానం ఊహాపరంగా లభించదు. పురాణాలకు గల చారిత్రక విలువను శాస్త్రీయ పద్ధతిలో పరిశీలించి నిర్ధారించాలి.
మాట్లాడగల శక్తి వలన మనిషి మిగతా జీవులలో ప్రత్యేకత సంపాదించాడు. అది అతనికొక వరమనాలి. ఈ శక్తి వల్లనే మానవులంతా ఒక ప్రత్యేక జాతిగా రూపొందటానికి వీలయింది. ఇందు మూలముగా మనిషి మిగతా జంతు ప్రపంచానికి దూరమై ఇతర ప్రాణులను అర్థం చేసుకునే శక్తిని కోల్పోయాడు. మానవుడు జంతువులతో వేరైనంత మాత్రాన గొప్పవాడని అర్థం కాదు. జంతు దశను దాటానంటాడు మానవుడు. అది నిజమేనా.. అని ఆశ్చర్యపోతాను. నిజం కాదంటుంది జీవ పరిణామ శాస్త్రం. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం మానవాధిక్యతకు విలువలేదు. మనిషి మంచి నడతకైనా, చెడు నడతకైనా అతనిలోని జంతు స్వభావమే కారణమని మనో విశ్లేషణ నిర్ణయిస్తుంది.

                                                        మూలం    తెలుగు సేత
           ఎమ్.ఎన్.రాయ్                      వెనిగళ్ళ కోమల

No comments:

Post a Comment