14 - “శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?”
సమాజ విజ్ఞానం నుంచి మనం చివరి ఉదాహరణ చర్చిద్దాం. సమాజ సిద్ధాంతానికి సంబంధించి మార్క్సిజాన్ని శాస్త్రీయమైందిగా భావిస్తున్నారు. గతి తార్కిక పదార్థవాదం అనే ప్రకృతి సిద్ధాంతం నుంచీ దీని రూపొందించారు. ఈ విధమైన ఆలోచనను తమకాలంలోని వైజ్ఞానిక సామాజిక వాస్తవాల దృష్ట్యా, మార్క్స్, ఏంగిల్స్ లు అనేక సంవత్సరాల కృషితో పెంపొందించారు. వీరిద్దరూ వాస్తవాల విషయంలో విజ్ఞాన ఘనులుగా భావించబడ్డారు. అయితే ఆ వాస్తవాలన్నీ అంత ఉపయోగకరమైనవి కాదు. మార్క్స్, ఏంగిల్స్ లు వైజ్ఞానిక పద్ధతిలో శిక్షణ పొందినవారు కారు. జర్మన్ తత్వవేత్త హెగెల్ ప్రభావం కింద మార్క్స్ ఉన్నారు. కేవల భావం అనే పేరిట గతితార్కికాభివృద్ధి దృష్ట్యా ప్రపంచంలోని భిన్న సంఘటనలను వ్యాఖ్యానించడానికి హెగెల్ పూనుకున్నాడు. హెగెల్ పద్ధతిని అనుసరించి మార్క్స్ కు, ఏంగిల్స్ కు ఉన్న మోజు వల్ల వారు, వారి కాలంలోని పదార్థ విజ్ఞానం, గణితశాస్త్రాన్ని కూడా వక్ర భాష్యంలో చిత్రీకరించారు. కాని గతితార్కిక పదార్థవాదం వంటి దోష పూరితమైన ప్రకృతి సిద్ధాంతం నుంచి సామాజిక సిద్ధాంతాన్ని రూపొందించవచ్చునా లేదా అనే విషయాన్ని అలా ఉంచుదాం. కాని గతి తార్కిక పదార్థవాదం వంటి దోష పూరితమైన ప్రకృతి సిద్ధాంతం నుంచి, రాబట్టిన సామాజిక సిద్ధాంతం ఏదీ కూడా సరైంది కావడానికి వీలులేదు. (సోవియట్ శాస్త్రజ్ఞులూ, విజ్ఞాన తత్వవేత్తలు కూడా గతితార్కిక భౌతిక వాదం పట్ల ఏదో మొక్కుబడిగానే గౌవరం చూపుతున్నారు. సరళమైన విమర్శకు సిడ్నీ హుక్ రాసిన డైలెక్టికల్ మెటీరియలిజం అండ్ సైంట్ ఫిక్ మెథడ్ చూడవచ్చు. ఈ విషయంలో ఐన్ స్టిన్ కూడా తనతో ఏకీభవిస్తున్నట్లు హుక్ పేర్కొన్నారు.) మార్క్సిజం అంచనా వేసిన అనేక ప్రధాన ప్రాతిపదికలు దారుణంగా, దోష పూరితాలని రుజువయ్యాయి. పారిశ్రామికీకరణ పెంపొందే కొద్దీ బూర్జువావర్గం తప్ప సమాజంలో మిగిలిన వారందరిలోనూ పేదరికం ధోరణి పెరిగిపోతుందని మార్క్స్ అంచనా వేశాడు. బూర్జువావర్గం మాత్రం కొద్దిమందే అయినా బాగా సంపన్నులుగా పెరిగి పోతారన్నారు. దీని ఫలితంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలలో కమ్యూనిస్టు విప్లవం వస్తుందని మార్క్స్ అంచనా వేశారు. విప్లవానికి సంరక్షకులుగా కార్మిక వర్గం ముందు నడుస్తుందన్నాడు. కార్మిక వర్గ నియంతృత్వం ద్వారా పెట్టుబడిదారీ వర్గాలకు భిన్నమైన వారికి అధికారం సంక్రమించటానికి విప్లవం తోడ్పడుతుంది. పెట్టుబడిదారులు తప్ప మిగిలిన వారందరూ రాజకీయ ఆర్థిక స్వేచ్ఛను అనుభవించేటట్లు కార్మిక వర్గం జాగ్రత్త వహిస్తుందన్నారు. సంధికాలం అనంతరం (ఇదెంతకాలం ఉంటుందో మార్క్స్ సూచించలేదు. పెట్టుబడిదారీ అవశేషాలు తొలగిపోవటానికి వీలుగా రెండు తరాలు ఉంటుందని అంచనా వేసుకోవచ్చు). రాజ్యం హరించిపోవడానికి నాంది పలుకుతుంది. ఆస్తి యాజమాన్యం ఉన్న వర్గాలంటూ ఏమీ లేవు గనక ఎవరికీ ఒత్తిడి చేయవలసిన పనిలేదు. ఎవరినీ దోపిడీచేసే అవకాశం లేదు.
ఈ అంచనాలన్నీ దోషపూరితమని రుజువయ్యింది. కమ్యూనిస్టులు తొలుత రష్యాలోనూ, తరవాత తూర్పు ఐరోపాలోనూ, పిమ్మట చైనాలోనూ విప్లవాన్ని తెచ్చారు. ఇవన్నీ పారిశ్రామికంగా వెనకబడిన దేశాలే. (చెకోస్లోవేకియా ఇందుకు మినహాయింపు) తూర్పు ఐరోపాలో విప్లవంలాగే ఎక్కడ కూడా కుట్రతో తప్ప మార్క్స్ కలలు గన్నట్లు ప్రజావిప్లవం రాలేదు. పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికాలలాగ ఈ దేశాలు సంపన్నమైనవి కావు. కమ్యూనిస్టేతర దేశాలలో పారిశ్రామికీకరణాభివృద్ధి వల్ల ప్రజలలో పేదరికం పెరగలేదు. పైగా ఆర్థిక సమానత్వాలు తగ్గిపోయి, కార్మికుడు సమాజంలో ఆత్మ గౌరవం గల సభ్యుడుగా ఆదరం పొందాడు. కమ్యూనిస్టు దేశాలలోని కార్మిక నియంతృత్వం. ఇతర నియంతృత్వాలు తగ్గిపోయి, కార్మికుడు సమాజంలో ఆత్మ గౌరవం గల సభ్యుడుగా ఆదరం పొందాడు. ప్రజలపై అధికారం చెలాయించే నియంతృత్వంగా తయారయింది. ప్రజలపై అధికారం చెలాయించగల హక్కు లభించడం, దానిని వీరు ఇష్టం వచ్చినట్లు, అమానుషంగా వాడటం జరిగింది. సోవియటే రష్యాలో మూడు తరాల అనంతరం కూడా నియంతృత్వం పట్టుసడలే ధోరణిగానీ, రాజ్యం హరించుకుపోయే లక్షణాలుగాని కనిపించలేదు. అక్కడ పెట్టుబడిదారీ అవశేషాలు ఏమాత్రం లేవు కూడా. (సోవియట్ యూనియన్ తరవాత విచ్చిన్నమై, కమ్యూనిజం అధికారాన్ని కోల్పోయింది).
జ్యోతిష్యంలాగే మార్క్సిజం కూడా పరీక్షకు గురిఅయ్యే ప్రమాణాన్ని అన్వయించనందున, వైఫల్యాలతో సర్దుకుపోతోంది. ప్రతివైఫల్యానికి ఏదో ఒక సాకు ఉంటుంది. సోషల్ డెమోక్రట్ల విద్రోహచర్య, కార్మిక వర్గ అపరిపక్వత, వామపక్ష సెక్టీరియనిజం మొదలైనవి పేర్కొంటారు. ఇవన్నీ, సంఘటనలు జరిగిపోయిన తరవాత అన్వేషించే సాకులే. సిద్ధాంతం మాత్రం లోగడవలె ఇప్పుడు కూడా నిస్సారమైందే. పదజాలాన్ని మాత్రం సంపన్నం చేశారు. విధేయులుగా ఉండేవారు సంతోషించారు. కృశ్చేవ్ దోషాలను బయటపెట్టినప్పుడూ, మావోదురాక్రమణ చేసినప్పుడూ మూఢ విశ్వాసులమత్తు వదిలిపోయింది. ప్రాపంచిక అనుభవానికీ, విజ్ఞానానికీ మార్క్సిజం పనికిరానిదన్నప్పుడు, పరీక్షించడానికి తగిన ప్రమాణాలు ఈ సిద్ధాంతానికి అన్వయించవనే అర్థం. ఆచరణలో మాత్రం మార్క్సిజం అమానుష, సామాజిక ఫలితాలకు దారితీసింది. చరిత్రలో ఎన్నడూలేనంతగా భారీ ఎత్తున ఈ అమానుష కృత్యాలు జరిగాయి. మానవజాతికి ఇది చాలా ప్రధానమైన విషయం. అయితే మార్క్సిజం యొక్క వైజ్ఞానిక స్థాయిని నిర్ణయించటానికి ఈ విషయాలు సందర్భ సహితాలు కావు.
మానవుడిని గురించి గాని, విశ్వం గురించి గాని ఇదే తుది సత్యమంటూ ప్రజాస్వామ్యం దేనినీ పేర్కొనదు. స్వేచ్ఛ, వ్యక్తి, గౌవరం, మనుషులలోని అంతర్యంలోనూ, పరిసరాల దృష్ట్యా ఎంతతేడా ఉన్నప్పటికీ మానవులందరినీ సమానంగా గుర్తించడం, ఇతరులతో సహకరిస్తూ సంపూర్ణ జీవితాన్ని గడపడం అనేవాటిని ప్రజాస్వామ్యం ప్రధానంగా స్వీకరిస్తుంది. ఇటువంటి విలువలను సాధించడానికి ఉత్తమోత్తమ సామాజిక వ్యవస్థను కనుక్కొనే పంథాను ప్రజాస్వామ్యం నమ్ముతుంది. అటువంటి మార్గం ప్రాపంచికానుభవంతో కూడిందేగాక, తాత్కాలికం కూడా. ప్రతివ్యక్తి కూడా ఈ విలువలను క్రమంగా సాధ్యమైనంత మేరకు సాధించ కుంటూ పోతాడు. అటువంటి సామాజిక క్రమాన్ని సాధించుకోడానికి ఏదీ ఉత్తమ పద్ధతి అని పరిశీలిస్తాడు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది కీలకమైన విలువ. సమాజంలోని వ్యక్తి మాత్రమే స్వేచ్ఛను సాధించగలడు. కనక ప్రజాస్వామ్యం అందరికీ ఓటు హక్కు కోరుతుంది. స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు కావాలంటున్నది. తమ ప్రతినిధులుగా ఉండదగనివారిని అధికారం నుంచి తొలగించే హక్కు వారికి ఉండాలంటుంది. ఆర్థికంగా అసమానత్వాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తే, రాజకీయ సమానత్వం అనేది కేవలం ఆటగామాత్రమే ఉంటుంది. అటువంటప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆర్ధికాధికారాన్ని వికేంద్రీకరించాలని ప్రజలు కోరారు. ఉత్పత్తి సాధనాలను జాతీయం చేయడం ద్వారా దీనిని సాధించవచ్చునని తొలుత భావించారు. ఆర్థిక స్వేచ్ఛను కోరిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గ్రేట్ బ్రిటన్ లో లేబర్ పార్టీని అధికారంలోకి ఎన్నుకోగా, వారు జాతీయీకరణతో ప్రయోగం చేశారు. కాని ప్రజాస్వామిక, కమ్యూనిస్టు దేశాలలో జాతీయీకరణ ప్రయోగం కనువిప్పుకలిగించింది.
జాతీయీకరణకంటే, ఆర్థికరంగాన్ని అదుపులో పెట్టడం వల్ల అనుకున్నవి సాధించవచ్చునని తేలింది. జాతీయకరణ వృధా అనీ, చికాకుకలిగించే పద్ధతి అని రుజువైంది. కమ్యూనిస్టు దేశాలన్నిటిల్లోనూ రాజకీయాధికారానికి ఆర్థికాధికారం తోడు అయింది. జాతీయకరణ వల్ల కలిగిన ఫలితమే ఇదంతా, ఒక పక్కన ప్రభుత్వానికి విపరీతాధికారాలుండగా, మరొక పక్క పౌరడు బానిస స్థాయికి దిగజారాడు. ఈ అనుభవం నుంచి ప్రజాస్వామ్యం గుణపాఠం నేర్చుకుంది. కనుక పిడివాదం లేని పంథాను అనుసరించాలని ప్రజాస్వామ్యం చెబుతుంది. సోషలిజంపై తీవ్రచర్చ జరిగింది. ప్రాశ్చాత్య ప్రపంచంలో ఇది ఇంకా మారు మ్రోగుతూనే ఉంది. దీని ఫలితంగానే 20వ శతాబ్దపు సోషలిజం అనే సిద్ధాంతం వెలువడింది. (సోషలిస్ట్ యూనియన్ ప్రచురించిన ట్వంటియత్ సెంచరీ సోషలిజం చూడండి. పెంగ్విన్ బుక్స్) మార్క్సిజం ఇంకా జాతీయకరణనే పట్టుకువేలాడుతోంది. ముందుగా రూపొందించిన చట్రంలో వాస్తవాలను ఇమడ్చాలని ప్రయత్నిస్తున్నది. అనుభవాన్ని బట్టి సిద్ధాంతాన్ని స్వచ్ఛందంగా మార్చుకోవాలనుకోవడం లేదు.
వైజ్ఞానిక సిద్ధాంతాన్ని అన్వయించడానికి గాను కొన్ని ఉదాహరణలు పరిశీలించాం. ఇది ఇతర విషయాలకు వర్తింపజేయవచ్చు. కులం, ఏకపక్షంగా నిరాయుధీకరణ, సమిష్టివ్యవసాయక్షేత్రాలు, శాంతి ప్రయోజనాల సాధన, పారిశ్రామికీ కరణకు పథకాలు-ఇత్యాదులను పరిశీలించవచ్చు. ఇవన్నీ ఎక్కువ స్వేచ్ఛను, వ్యక్తి సంక్షేమాన్ని కోరేవే. ఇటువంటి ప్రతిపాదనలు చేసిన వారి స్వేచ్ఛను, వ్యక్తి సంక్షేమాన్ని కోరేవే. ఇటువంటి ప్రతిపాదనలు చేసిన వారి ఉద్దేశాలను ప్రశ్నించకుండానే, ఏ మేరకు ప్రయోజనాన్ని సాధించామో పరిశీలించవచ్చు. అలా చేయడానికి గాను అనువైన వాస్తవాలను ఎక్కడ, ఎలా కనుక్కోవడమో వ్యక్తికి తెలియాలి. ఇందుకు తగిన శ్రమ చేయాలి. ఎలాంటి అరమరికలు లేకుండా నిష్పాక్షికంగా అన్వేషణ చేసే ధోరణి అలవరచుకోవాలి. అనేకమంది వ్యక్తులు ఈ విధమైన కృషి చేస్తే తప్ప, ప్రజాస్వామ్యానికీ మానవ విలువలకూ భద్రతలేదు. సంపన్నమైన సుసంఘటిత సమాజాలలోనూ ఇదే పరిస్థితి ఉంది. మనసమాజం సంపన్నమూ కాదు, సుసంఘటితమూ కాదు.
రచన తెలుగుసేత
ఎ.బి.షా నరిసెట్టి ఇన్నయ్య
1 comment:
Informative
Post a Comment