విజ్ఞాన సిద్ధాంతం మూసబోసింది కాదు

9 (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి



వైజ్ఞానిక సిద్ధాంతాలలో, ఒక్కొక్క ప్రత్యేక సిద్ధాంతం ఏదో ఒక మేరకు కొన్ని ప్రమాణాలను సంతృప్తిపరుస్తుంది. ఈ సిద్ధాంతాలన్నీ, అన్ని సందర్భాలలోనూ పరస్పరం సంబంధం కలవికావు. అంటే ఇవన్నీ కలిసి ఒకే సిద్ధాంతంగా రూపొందవు. విజ్ఞానాభివృద్ధిలో ఏ దశ తీసుకున్నా వివిధ స్థాయిలలో అనేక సిద్ధాంత నిర్మాణాలు గమనించవచ్చు. ప్రతి నిర్మాణం కూడా మరి కొన్ని నిర్మాణాల ప్రభావంతో ఏర్పడినట్టిదే. అలాగే అనేక సిద్ధాంతాలకు సంబంధ లేకుండా కూడా ఒకానొక వైజ్ఞానిక నిర్మాణం ఉండొచ్చు. జీవోత్పత్తి మూలానికీ, పర్వతాలు ఏర్పడటానికీ, పరమాణు పదార్ధ శాస్త్రానికీ ఏమి సంబంధం లేకపోవచ్చు. ఈ విషయం అవగాహన చేసుకోటం ఏమంత కష్టం కాదు ప్రపంచంలో సంఘటనలన్నీ ఒకదానితో మరోకటి తప్పిసరిగా సంబంధం కలిగి ఉండాలని ఏమీ లేదు. కొంకణ తీరంలో వర్షపాతానికీ, హిమాలయాలలో మంచు పడడానికీ సంబంధం ఉన్నట్లు చెప్పే అవకాశం లేదు ఇటలీలో అగ్నిపరత్వం బద్ధలు కావడ వల్ల నీలగిరిలో కాఫీపంట బాగా పండిందనడానికీ అవకాశం లేదు. సహజ సంఘటనలను విడివిడిగా పరిశీలించే అవకాశం ఉంది. స్వతంత్ర ప్రతిపత్తిగల సంఘటనలను ఇలా అధ్యయనం చేయవచ్చు. విజ్ఞాన సిద్ధాంతాలు పనిచేసే తీరు వివేచనాత్మకంగా రూపొందించే అవకాశం ఉంది. అంతమాత్రాన ఈ సిద్ధాంతాలన్నీ ఒకే మొత్తంగా మూసపోసినట్లు ఉండవు. సిద్ధాంతాలలోని భాగాలన్నీ తప్పనిసరిగా, విడదీయటానికి వీలులేనివిగా, కలిసి ఉండవలసిన పని లేదు.
జ్ఞానమంతా ఒకే విధానంగా ఉంటుందనే భావనకు రెండు ఆధారాలు కనిపిస్తున్నాయి. మానవుడికి క్రమత్వం అంటే ఇష్టం ఉంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషిస్తుంటాడు. ఇటువంటి అన్వేషణ వల్ల విజ్ఞానరంగంలో కూడా ఒకే క్రమాన్ని నిర్మించాలని ప్రయత్నిస్తాడు. కాని ఇటువంటి ప్రయత్నానికి కేవలం రామణీయక విలువ మాత్రమే ఉంది. అన్ని సందర్భాలలోనూ ఇది సఫలం కానక్కరలేదు.
ఆలోచనా రంగంలో విశ్వజనీనమైన పద్ధతులు వ్యాపించి ఉండగా, అటువంటి వాతావరణంలో విజ్ఞానం పెంపొందింది. ఉదాహరణకు హెగెల్ పద్ధతిని చూస్తే ప్రపంచంలో పరిశీలించదగిన ప్రతిదాన్నీ ఒకటి రెండు మూల సూత్రాల ఆధారంగా వచ్చినట్లు వివరించే ప్రయత్నం చేసినట్లు గమనించవచ్చు. అటువంటి పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడటంలో, ఎవరికి వారు విశ్వజనీనమైన పద్ధతులను, ప్రత్యామ్నాయాలను చూపాలని ఆశించారు. ఆ విధంగా మార్క్సిజాన్ని, పరిశీలించవచ్చు. విశ్వజనీనత కావాలనే విధానాలలో ఇది ఆఖరి పద్ధతిగా భావించవచ్చు. సోషలిజానికి ఇదే విజ్ఞాన సిద్ధాంతంగా పెర్కొంటున్నారు. గతి తార్కిక నియమాలనుంచి సామాజిక సూత్రాలను, ప్రకృతి సంఘటనలను రాబట్టడం జరిగింది.
20వ శతాబ్దం ప్రారంభదశవరకూ ఈ స్థితే కొనసాగింది. తాత్విక మద్దతుతో నిమిత్త లేకుడా, విజ్ఞానం తన కాళ్ళపై తానే నిలవగలిగిన స్థితికి చేరుకున్నది. సిద్ధాంత కర్తలను తేజఃకరణ సిద్ధాంతం (క్వాంటం సిద్ధాంతం) చెదురుమదురుగా నిలిచింది. వారు దీన్నుంచి కోలుకునే అవకాశం ఇంకా కనుచూపు మేరలోలేదు. ఇక ముందు కూడా అటువంటి అవకాశం లభిచేటట్లు లేదు. ఒకే విధమైన విజ్ఞానపద్ధతి ఆవశ్యకత ఇంకేమాత్రం ఉన్నట్లు లేదు. విజ్ఞానం ప్రభావం వల్ల విశ్వజనీనమైన తాత్విక పద్ధతులు చాలావరకూ మారాయి.
విజ్ఞాన సమైక్యత-పద్ధతులు, నిర్మాణం

విజ్ఞానం అంటే అనేక సిద్ధాంతాలతోనూ, వాటికి ఆధారంగా నిలిచిన వాస్తవిక సమాచారంతోనూ ఉన్నట్టిదే అయితే విజ్ఞానంలో ఐక్యతను కనబరచడానికి తోడ్పడేది ఏమిటి. అన్ని విభాగాలకు సర్వసాధారణంగా ప్రతి విజ్ఞాన సిద్ధాంతం కూడా చేబట్టిన విషయ పరిశోధన ప్రకారం, చేరుకున్న దశను ప్రమాణంగా స్వీకరిస్తుంది. విజ్ఞాన సిద్ధాంతాలకు గల ఈ ప్రమాణాలే ఒక నిర్మాణ సమైక్యతను సమకూర్చి పెడుతున్నాయి. విజ్ఞానేతర సిద్ధాంతాలు ఇలాంటి ప్రమాణాన్ని స్వీకరించవు. మనం సాగిపోయే కొద్దీ ఐక్యత ఏమిటో స్పష్టపడుతుంది.
భౌతిక, రసాయనిక, భూగర్భ, జీవశాస్త్రాలకు, ఆరంభం ఉందిగాని అంతం లేదు. ప్రారంభ ప్రాతిపదికలన్నీ రుజువు అవసరం లేనివిగా భావించబడు తున్నాయి. అవి రుజువు పరచనక్కరలేదంటే, వాటిని ఇంకో సూత్రం నుంచి రాబట్టే అవసరం లేదన్నమాట. మరో సూత్రం నుంచి గనక రాబట్టగలిగితే, అదే ఆరంభదశ అవుతుందన్న మాట. ఇలా అనంతంగా వెనక్కు పోకుండా ఉండాలంటే, ఎక్కడోచోట ఆరంభించడం తప్పనిసరి అవుతుంది. ఈ ఆరంభదశనే విజ్ఞానంలో ప్రతిపాదన అంటాం.
తార్కిక పద్ధతులననుసరించి ఈ ప్రతిపాదనల మూలంగా అనేక నిర్ణాయాలను రాబట్టడం జరుగుతుంది. అవి ప్రాపంచిక అనుభవంతో రుజువుపరచదగినవే. వాస్తవాల ఆధారంగా రుజువైన నిర్ణయాలను శాస్త్రీయ సిద్ధాంతం వివరించినట్లే భావిస్తారు. మరికొన్ని నిర్ణాయాలు ఇంతకు ముందు తెలియని ప్రతిపాదనలను సూచిస్తాయి. అటువంటి నిర్ణాయాలను అంచనాలనీ, గతాన్ని తెలియపర్చేవనీ అంటాం. వీటిని నిర్ణీత పరిశీలన ప్రకారం వాస్తవాలను కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. అవి కనుక్కొన్న వాస్తవాలను ఆధారం చేసుకొని అంచనావేసిన వాటిని రుజువు పరచగలిగితే ప్రతిపాదనలకు వాస్తవ ప్రమాణం లభిస్తుంది. అంటే సిద్ధాంతం రుజువైనట్లే.
ప్రతిపాదనల నుంచి రాబట్టిన నిర్ణయాలన్నీ సిద్ధాంతంలో మధ్యస్థ స్థాయికి చేరుకున్నట్లే విజ్ఞాన సిద్ధాంతానికి అంతం లేదంటే, ఇక ముందు ఎలాంటి పరిణామాలు పెంపొందుతాయో ముందు చెప్పజాలం అని అర్థం. కొత్తగా అనేక విషయాలు రాబట్టవచ్చు. లేదా కొత్త వాస్తవాలు వెలుగులోకి రావచ్చు. విజ్ఞాన సిద్ధాంతం ఆకాశహర్మ్యం వంటిది. ఎన్ని అంతస్తులైనా ఆకాశంలో కట్టుకుంటు పోవచ్చునన్నమాట.
ఈ విషయం రుజువు పరచడానికి న్యూటన్ పదార్ధ చలన సిద్ధాంతమే ఆధారం. మూడు చలన సూత్రాలు ఆరంభదశలో ఉన్నాయి. ఆ తరవాత గురుత్వాకర్షణ సిద్ధాంతం వచ్చింది. తదనంతరం అనేక ఫలితాలకు దారితీసిన సంఘటనలనేకం వచ్చాయి. కెప్లర్ సూచించిన గ్రహచలన సూత్రాలు, సముద్ర తరంగాల సూత్రాలు, గైరోస్కోప్ చలనం, పదార్థచలన సిద్ధాంతం-తుపాకి గుండు చలన సిద్ధాంతం-ఇవన్నీ పరిశీలనతో రుజువు పరచదగినవే అయినప్పటికీ, ఐన్ స్టీన్ సాపేక్షతా సిద్ధాంతంలో న్యూటన్ సిద్ధాంతాన్ని పొందుపరచేటంత వరకూ, న్యూటన్ సిద్ధాంతం. ఆగిపోయిందనడానికి వీల్లేదు.
ఈ పరిశీలనను విపులీకరించి చూద్దాం.
విజ్ఞాన సిద్ధాంత లక్షణాలు
విజ్ఞాన సిద్ధాంతంలోని ప్రతిపాదన, ఒక రకమైన వాస్తవాలకు మరొక విధమైన వాస్తవాలతో సంబంధం ఏర్పరుస్తుంది. దీనినే కార్యకారణ సంబంధం అంటారు. ప్రతిపాదనలో రెండు విషయాలు సంతృప్తికరంగా ఉండాలి.
1.   పరిశీలించిన వాస్తవాలన్నిటికీ సంబంధించిన ప్రకటనలు, ప్రతిపాదన యొక్క తార్కిక ఫలితాలుగా రాబట్టే వీలుండాలి.
2. ఇంతకు ముందు తెలియని, పరిశీలించదగిన సంఘటనలను ముందుగా ఊహించడం లేదా, లోగడ జరిగిన వాటిని చెప్పగలగడం.

న్యూటన్ విశ్వవ్యాపిత గురుత్వాకర్షణ సిద్ధాంతం, మాక్స్ వెల్ విద్యుదయస్కాంత క్షేత్ర సిద్ధాంతం కూడా పైన పేర్కొన్న రెండు నిబంధనలను సంతృప్తి పరచినవి. విజ్ఞానస్థాయి కోల్పోకుండానే, పై రెండింటిలోనూ ఒక నిబంధనను మాత్రమే సంతృప్తి పరచడం జరిగింది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇటువంటి మినహాయింపుకు కారణాలు లేకపోలేదు.
అనేక సిద్ధాంతాలను కలిపి స్వీకరిస్తే రెండు నిబంధనలూ సరిపోవచ్చు. ఒకే సిద్ధాంతంలో రెండు పరిస్థితులను సంతృప్తి పరచలేకపోవచ్చు. సంప్రదాయ బద్ధంగా వస్తున్న ఉష్ణ సిద్ధాంతం పదార్థ చలన ప్రతిపాదనపై ఆధారపడింది. ఈ క్షేత్రపరిధికి చెందినవాటితో నిమిత్తం లేకుండానే, చాలా మట్టుకు జరిగే సంఘటనలను ఉష్ణ సిద్ధాంతం వివరించగలదు. కాని ఉష్ణ సిద్ధాంతం ఆధారంగా, రెండు చోట్ల కలిసిన భిన్న లోహపు తీగెల అతుకుల ఉష్ణ తాభేదం వల్ల కలిగే విద్యుత్ ప్రవాహం గురించే వివరించడం గాని, ముందుగా ఊహించడం గాని వీలుపడలేదు. దీనికి గాను నేటి విద్యుత్ కు సంబంధించిన సిద్ధాంతం అవసరమయింది.
ఈ చర్యల వల్ల విజ్ఞాన సిద్ధాంతంలోని భిన్నస్థాయీ భేదాలు గమనించవలసిన ఆవశ్యకత గుర్తించాలి. పదార్ధ చలనం, వేడి, ధ్వని, విద్యుత్తు, అయస్కాంతం ఇత్యాది పదార్థ సంఘటనలకు వేర్వేరుగా సిద్ధాంతాలున్న మాట నిజమే. వీటన్నిటినీ కలిపి సంప్రదాయ పదార్థ విజ్ఞాన సిద్ధాంతం అంటున్నాం. విభాగాలను పక్క పక్కనే అట్టిపెట్టిన ఫలితాలనూ, అన్నిటినీ కలిపిచూస్తే లభించే సిద్ధాంతానికి చాలా తేడా ఉంది. విడిగా ఉన్న సిద్ధాంతాలన్నీ పరస్పర సంబంధం గలవి. కనక సమైక్యతలో పొందిక ఉంది. ఒక ప్రతిపాదనల రాశి నుంచి తార్కికంగా వీటన్నిటినీ రాబట్టే వీలున్నది. అంటే విడి శాఖలకంటే, సంప్రదాయ పదార్థ విజ్ఞానం యావత్తు భిన్న స్థాయిలో ఉన్న సిద్ధాంతమన్న మాట. మొత్తంగా ఉన్న సిద్ధాంతం సంతృప్తి పరచినట్లు, విడిగా ఏ ఒక్క శాఖకూడా సంతృప్తి నివ్వలేకపోవచ్చు. ఈ వాస్తవం దృష్ట్యా, విజ్ఞాన సిద్ధాంత స్వభావాన్ని చర్చించేటప్పుడు, ఇమిడి ఉన్న స్థాయి భేదాలను ప్రస్తావించకతప్పదు. అయితే అవిపైకి చెప్పేటట్లు లేకపోవచ్చు.
ఒకనొక విజ్ఞాన సిద్దాంతం పరీక్షశ్రకు నిలవకపోవడానికి తగిన కారణాలు ఉన్నాయి. సిద్ధాంతపరమైన స్థాయిబేధం దీనితో ముడిపడిఉంది. అంటే ఉష్ణ సిద్ధాంతానికి, సంప్రదాయ పదార్థ సిద్ధాంతానికీ గల సంబంధంకాదు. సహజంగా స్వాభావిక దశలో ఉన్న సిద్ధాంతాలకు అంచనావేసే శక్తి స్వల్పంగా ఉంటుంది. నిగమనంతో రూపొందించే స్థాయికి చేరుకున్న సిద్ధాంతానికి అంచనావేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ తేడాను పరిశీలిద్ధాం.
విజ్ఞానాన్వేషణ ఒకానొక సమస్యతో కూడిన సన్నివేశంలో ఆరంభమై ఈ కింది దశలలో సాగిపోతుంది.
1.   సమస్యను విడగొట్టి చూడడం.
2.   పరిశీలన, పరిశోధనతో అవసరమైన వాస్తవాలను సేకరించడం, వాటి మధ్యగల సర్వసాధారణ లక్షణాలను బట్టి వర్గీకరించడం.
3.   పరిశీలించిన వాస్తవాలన్నిటినీ వివరించి సమస్యను పరిష్కరించగల ప్రతిపాదన చేయడం.
4. ఆ ప్రతిపాదన ప్రకారం వీలైతే, అందులో ఇమిడి ఉన్న తార్కిక విషయాల ఆధారంగా అంతవరకూ తెలియని సంఘటన గురించి అంచనా వేయడం.
5.   అలావేసిన అంచనాలను పరిశీలించి పరీక్షకు పెట్టడం.

గలీలియో తుపాకి గుండు చలనానికి సంబంధించిన సమస్యను పరిష్కరించిన తీరు గమనిస్తే ఈ దశలన్నీ తేటతెల్లమౌతాయి. అప్పటివరకూ అరిస్టాటిల్ పేర్కొన్న పదార్థ విజ్ఞాన ప్రభావంలోనే శాస్త్రవేత్తలు ఉండిపోయారు. కదలే వస్తువువేగం, ఆ వస్తువుపై పనిచేస్తున్న ఒత్తిడిని బట్టి ఉంటుంది. ఒత్తిడి ఆగినప్పుడు పదార్థ చలనం కూడా ఆగిపోతుంది. ఇది సాధారణ ఆలోచనకు సరిపోతుంది కూడా. అరిస్టాటిల్ భావాలకు సరిపోయోటట్లుండే అనేక సంఘటనలను మనం రోజూ చూస్తూనే ఉంటాం. మనం నడిచేటప్పుడు శ్రమపడుతుంటాం గదా. శ్రమ ఎక్కువైతే వేగంగా వెళ్ళగలం కూడా. ఇక బల్లను నెడుతుండగా, ఎప్పుడు నెట్టడం ఆపేస్తామో అప్పుడు బల్ల కదలకుండా ఆగిపోతుంది. గలీలియోకు పూర్వం ఒత్తిడికీ వేగానికీ సంబంధం ఉన్నదని ఇందలి భావన. వేగం (త్వరణం) ఎక్కువైందన్న మాట. ఒత్తిడి తగ్గితే ఆ మేరకు పదార్థ వేగం తగ్గుతుంది.
తుపాకి గుండు వెళ్ళే పద్ధతిలో ఈ నియమం పనిచేయడం లేదు. తుపాకి నుంచి పేల్చిన గుండు చాలా సేపటి వరకు, దానిపై ఎలాంటి ఒత్తిడి లేకుండానే, వేగంగా దూసుకుపోతుంది. ఆ గుండుపై గురుత్వాకర్షణ తప్ప మరే ఒత్తిడీ పనిచేయడం లేదు.
తుపాకి పేల్చినప్పుడు మాత్రమే గుండుపై ఒత్తిడి పనిచేసింది. పేల్చడం అయిపోగానే గుండు బయటబడిన తరవాత ఇక తుపాకీ ఒత్తిడి అనేదేమీ లేదు. ఇలాగే ఇతర చలనాల విషయంలోనూ కొన్ని చిక్కులు ఎదురయ్యాయి. చేత్తో విసిరేసినరాయి, ఒకచోట నుంచి పడినరాయి, కర్రతో కొట్టినబంతి, నేలపై దొర్లుకుంటూ పోయే చక్రాలబండి ఇలాంటివి ఉదాహరణలుగా స్వీకరించవచ్చు. అరిస్టాటిల్ భావాలతో ఈ చలనాలను వివరించలేం.
ఇలా అనేక సందర్భాలలో చిక్కు ఏర్పడితే, మనం పొందుపరచ దలచిన చట్రంలో దీనికి సంబంధించిన సిద్ధాంత భావన ఉండి ఉండాలి. ఒత్తిడికీ వేగానికీ అరిస్టాటిల్ వివరించిన బావనలోనే, తుపాకి గుండు వేగాన్ని అధ్యయనం చేయడంలో గల చిక్కు ఇమిడి ఉందని గలీలియో విశ్లేషించి, నిర్ణయానికి వచ్చాడు. దీన్ని పరిష్కరించాలంటే ఒత్తిడికి సంబంధించి కొత్త భావన అవసరం. ఒత్తిడిని ఎలా నిర్వచించాలనేదే గలీలియోకు ఎదురైన సమస్య.
గలీలియో ఈ సమస్యను విశ్లేషించడంలో, మూలంలోనే చిక్కు ఉన్నదనే గాక ఇంకెంతో బయటపడింది. ఇలా కృషి చేయడానికి వీలైన సమాచారం ఆయన చేసిన పరిశోధనలో లభించింది. అన్ని విధాలైన చలనాలకు సంబంధించిన ఒత్తిడి విషయంలోనూ సమస్య ఒకటే గనక, వశ్లేషించడానికి గాను అతి సాధారణమైన చలనాన్ని పరిశోధనకు స్వీకరించాడు. తుపాకి గుండు వేగం కొంత జటిలమైంది. తుపాకీని పేల్చడం వల్ల వచ్చే ఒత్తిడితో బాటు, భూమిపైన కదిలే అన్ని పదార్ధాలపైన భూమికి చెందిన గురుత్వాకర్షణ ఒత్తిడి పనిచేస్తుంటుంది. ఎత్తైన ప్రదేశం నుంచి భూమిపై పడే వస్తువుపై భూమి గురుత్వాకర్షణ ఒత్తిడి మాత్రమే పనిచేస్తుంది. కనక ఇటువంటి దానిని విశ్లేషించడం సులభం. ఇటువంటి పరిశోధన ఆధారంగా ఒత్తిడికి సంబంధించిన భావన ఏర్పడితే, అన్ని విధాలైన చలనాలకూ అది అన్వయించవచ్చని గలీలియో అనుకొన్నాడు. ఆ విధంగా సమస్యను విశ్లేషించడంలో, ఎటువంటి సమాచారం కొరకు చూడాలో నిర్థారించవీలైంది. అంటే అన్వేషణలో రెండో దశకు చేరాడన్నమాట.
ఈ దశలో గలీలియో సేకరించిన సమాచారాన్ననుసరించి భూమి గురుత్వాకర్షణ అనేది పదార్థపు ద్రవ్యరాశి అని గ్రహించాడు.
వస్తువు వేగాన్ని ఏ మేరకు మార్చగలదో ఆ నిష్పత్తిలో గురుత్వాకర్షణ పనిచేసిందన్నమాట.
ఒకానొక పదార్థ వేగంలో, నియమిత కాలంలో వచ్చే మార్పును పదార్థత్వరణం అంటారు. సెకండుకు 500 అడుగుల నుంచి 505 అడుగుల వేగానికి మార్చడానికి ఆ పదార్థంపై పనిచేసిన ఒత్తిడి ఎంతో, సెకండుకు 15 అడుగుల వేగం నుంచి 20 అడుగుల వేగానికి మారినప్పుడు పనిచేసే ఒత్తిడి అంతేనని గలీలియో ప్రతిపాదించాడు. రెండు సందర్భాలలోనూ పదార్థ ద్రవ్యరాశి ఒకటేనన్నమాట. ద్రవ్యరాశి మారితే, ఆ నిష్పత్తిలో వేగంపై ఒత్తిడి కూడా మారుతుంది.
ఒకసారి ప్రతిపాదనను రూపొందిస్తే, పరిశీలన ఆధారంగా రుజువుకు పెట్టడం చాలా సులభమైన విషయమే.
త్వరణం (వేగం దిక్కు) కాదుగాని, మార్పు ఏ మేరకు జరుగుతుందనేది ప్రధానం. ఆచరణ ప్రధానంగా గల సామాన్యుడికి ఇది చిక్కు సమస్యగా ఉంటుంది. గలీలియో రెండోదశ నుంచి మూడో దశకు పయనించడమేగాక, ఇంకా విజ్ఞానంలో మధ్యకాలాల నుంచి ఆధునిక స్థాయికి రావడాన్ని కూడా ఇది సూచిస్తుంది.
ఎఫ్.ఎఫ్.సి. నార్త్ రప్ (తన గ్రంథం ది లాజిక్ ఆఫ్ ది హ్యూమానిటీస్ అండ్ సైన్స్ స్ (అధ్యాయాలు 2, 3, 4)లో) పేర్కొన్నట్లు, విజ్ఞాన పద్ధతిలో మొదటి దశను విశ్లేషణస్థాయి అందాం. రెండో దశను సహజ చారిత్రకస్థాయి అని పిలుద్దాం. చివరి మూడవ దశలను సమిష్టిగా, నిగమన (Deductive) రీతిలో ఏర్పరచిన సిద్ధాంతం అని పేర్కొందాం. అందులో విశ్లేషణస్థాయి అంటున్నామంటే సమాచారాన్ని సేకరించడం, పరిశీలన, పరిశోధనల సహాయంతో సందర్భానికి ఉపకరించే సమాచారాన్ని వర్గీకరించడం తప్ప, చేయగలిగింది లేదన్నమాట. ఇది ఆగమనపద్ధతి (Inductive) నేటి మనోవిజ్ఞాన స్థాయి ఈ దశలోనే ఉంది. ఈ శతాబ్దారంభంలోని తొలి దశబ్దాలలో జీవశాస్త్రం ఇటువంటి స్థాయిలోనే ఉండేది. అంతమాత్రాన సహజ చారిత్రక స్థాయి అనేది మూడవ, నాలుగవ విజ్ఞాన దశలకంటే తక్కువదనిగాని, అప్రధానం అని గాని భావించరాదు. సహజ చారిత్రక స్థాయి పునాదులు సరిగా ఉంటేనే సిద్ధాంతం ఫలవంతంగా రాగలదని ఆశించవచ్చు.
మూడో అంచెలో తలపెట్టే ప్రతిపాదనలో, అంతకు ముందు స్థాయిలో సేకరించిన సమాచారాన్ని వివేచనాత్మకంగా వివరించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ సందర్భంలో వివరణ అంటే, చేసిన ప్రతిపాదన దాని తార్కిక ఫలితాలు కూడా ప్రాపంచిక అనుభవరీత్యా వాస్తవాలే. అంటే విజ్ఞాన సిద్ధాంతానికి ప్రతిపాదన అనేది ఒక మెట్టు అన్నమాట.

 రచన తెలుగుసేత
ఎ.బి.షా                   నరిసెట్టి ఇన్నయ్య





No comments:

Post a Comment