ఎలక్ట్రాన్- దైవం- ఆత్మ

13 - “శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?”



ఎలక్ర్టాన్, దేవుడు అనే భావాలు మరొక ఉదాహరణగా స్వీకరించవచ్చు. ఇవి రెండూ సూటిగా చూడడానికి వీలులేదు. ఎలక్ట్రాన్ చలనాన్ని పరిశీలిస్తున్నామని విజ్ఞానవేత్తలు చెప్పారంటే ఆటలో బంతిని గమనించినట్లు ఇది గూడా చూశారని భావించరాదు. గ్యాస్ లో రేణువులు ఒకానొక మార్గంలో ఉన్నప్పుడు, ఎలక్ర్టాన్ నుంచి శక్తిని పొంది, విజ్ఞానం పేర్కొనే నియమాలననుసరించి కాంతి కిరణాలను ప్రసరిస్తాయి. విజ్ఞానవేత్తలు గమనించేది ఈ కాంతి మార్గాన్నే. ఆ మార్గాన ఎలక్ట్రాన్ పయనించినట్లు విజ్ఞాన వేత్త గ్రహిస్తాడు. మనం చూడని ఎడ్లబండి రోడ్డు మీద వెళ్ళిపోయిన తరవాత ఆ దారిన పడిన గుర్తులనుబట్టి ఎడ్లబండిగాక, ఇంకేవీ వెళ్ళలేదని తెలుసుకుంటాం. పైగా ఎంతదూరం అలా వెళ్ళింది గమనించవచ్చు కూడా. ఇదంతా మనం చూడని ఎడ్లబండి వెళ్ళిపోయిన తరవాత చెబుతున్న మాటలే. పైన చెప్పిన ఆవిరిలో ఎలక్ర్టాన్ మార్గం కూడా ఇలాంటిదే. ఎలక్ర్టాన్ పరిమాణం మనం సూటిగా చూడటానికి వీలులేనంత చిన్నది. కాని దాని చలనాన్ని అంచనా వేయవచ్చు. వెలిగిన మార్గానికి మరొక కారణం లేదనికూడా చూపవచ్చు. కనకనే ఆ మార్గాన ఎలక్ట్రాన్ పయనించినట్లు నిర్ధారణగా చెప్పవచ్చు. బంతి పోవడానికీ, ఎడ్లబండి వెళ్ళిపో వడానికీ, తేడా ఉంది. ఎలక్ర్టాన్ వెళ్ళిన తరవాత కాంతి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. గాలిలో రేణువులు ఎలక్ట్రాన్ వల్ల ప్రకంపించి నందువల్ల మనకు వెలుగురావడం లేదు. ఎలక్ర్టాన్ తన శక్తిని వాటికి ఇవ్వడం వల్లనే వెలుగువస్తుంది

అయినప్పటికీ ఎలక్ట్రాన్ వైజ్ఞానిక భావన అంటున్నాం. మేధస్సుతో అవగాహన చేసుకునే భావన ఇది. ప్రాపంచిక విధానాలకు చెందేతీరు ఇందులో ఉంది. దీనికి కొంత ద్రవ్యరాశి, పరిమాణం చేర్చవచ్చు. దీని ప్రవర్తనకు సంబంధించిన నియమాలను రూపొందించవచ్చు. ఈ కార్యకారణ విధానంలో సాక్షి వంటి పరిశీలకుడు ఎవరూ అవసరం లేదు. ఎలక్ర్టాన్ ప్రాపంచిక అనుభవరీత్యా వాస్తవమైనది. ఎలక్ర్టాన్ ప్రవర్తనను పరిశీలించేవాడు ఎప్పుడు ఎక్కడ ఉన్నాడనే దానితో నిమిత్తం లేకుండా, అది స్వతంత్రంగా కాల ప్రదేశాలలో ఉన్నది.

దైవ భావన విషయంలో ఇదే సూత్రం అన్వయించదు. దేవుడు తప్పనిసరిగా ఉంటాడనుకొంటే, దేవునికి నియమాలను ఏర్పరచడం సాధ్యపడదు. పరిశీలకునితో నిమిత్తం లేకుండా, కాల-ప్రదేశాలలో ప్రాపంచిక అనుభవ విషయంగా చూసేటందుకు వీలులేని విషయమిది. దైవభావన విజ్ఞాన పూరితంకాదు. ప్రాపంచిక వాస్తవానికి చెందని విషయమిది. మానవుడు, ప్రకృతి గురించి విజ్ఞానం చెపుతున్న దాన్నిబట్టి చూస్తే దైవానికి అంటగట్టే లక్షణాలు అనవసరమనీ లేదా, అశాస్త్రీయమని అనిపిస్తున్నది. దైవం విషయంలో లాగే, ఆత్మ భావనలో కూడా ఇటువంటి వాదమే చెల్లుతుంది.

      రచన తెలుగుసేత
        ఎ.బి.షా నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment