6. “శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?”
బేకన్ అనుసరించిన ఆగమన (Inductive) పద్ధతినే విజ్ఞానంగా భావించారు. సర్వసామాన్యంగా సంప్రదాయానుసారంగా వస్తున్న తర్కానికి, మత విజ్ఞానానికీ విశిష్ట పద్ధతిని తొలుత బేకన్ (1561-1626 క్రీ.త) రూపొందించారు. మన విజ్ఞానాన్ని గురించి ఇక్కడ అట్టే వివరణ అక్కరలేదు. అదంతా చివరకు అలౌకిక, మానవాతీత శక్తిపై ఆధారపడుతుంది. మానవ వివేచన పరిధిలోకి అది రాదు.
ఇక బేకన్, సంప్రదాయ తర్కాన్ని విమర్శిస్తూ, ఆగమన పద్ధతిని, ప్రవేశపెట్టాడు. దీన్ని ఇలా పేర్కొనవచ్చు. ముందుగానే ఏర్పరచుకున్న భావాలను, ద్వేష ధోరణులను పక్కనబెట్టి, ఏ మాత్రం అవకాశం లభించినా రకరకాల ప్రతిపాదనలు చేసే విధానం నుంచి నిగ్రహం చూపాలి. దీనికి బదులు, వాస్తవాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఈ వాస్తవాలను పరిశీలించాలి, వర్గీకరించాలి. అంచెలవారీగా వాటికి అన్వయించే సూత్రాలను బట్టి సిద్ధాంతాన్ని రాబట్టాలి. సర్వసాధారణ సూత్రాలకు రావడమనేది చిట్ట చివరకు చేయవలసిన పని మాత్రమే. లేకుంటే, ప్రకృతి విషయమై ముందే ఊహించడం జరుగుతుంది. అంతేగాని ప్రకృతికి భాష్యం చెప్పడం జరగదు.
వైజ్ఞానిక ప్రతిపాదనలో అంచనా వేసే శక్తి
అందరికీ తెలిసిన వైజ్ఞానిక పద్దతిలోని ఒక అంశాన్ని వదిలేసినట్లున్నది. ప్రతి ప్రతిపాదన కూడా బేకన్ చెప్పిన ధోరణిలో రాబట్టినప్పటికీ, అంటే-ఒక్కొక్క విషయం ఆధారంగా సర్వసాధారణ ధోరణికి చేరినా, వైజ్ఞానిక సిద్ధాంత స్థాయికి చేరుకోవాలంటే మాత్రం, రుజువు అనేది తప్పదు. నిగమన తర్కం సహాయంతో, ప్రతిపాదనలో ఇమిడిన విషయాలు పరిశీలించడం, కొత్త పరిశీలనతో ఇవి సరిపోతున్నాయో చూడడం ముఖ్యం. మామూలుగా ప్రతిపాదనలన్నీ భవిష్యత్తులో జరగబోయే వాటిని గురించిన అంచనాలే అయి ఉంటాయి, కొన్ని సందర్భాలలో మాత్రం జరిగిపోయిన వాటిని గురించి తెలియదన్నమాట. గతాన్ని అధ్యయనం చేసే భూగర్భ, జీవపరిణామ శాస్త్రాలలో ఈ విషయాలు ఉంటాయి. అయితే గతాన్ని, భవిష్యత్తును గురించిన అంచనాలలో సర్వసాధారణ లక్షణం ఒకటున్నది. ప్రతిపాదనే లేకుంటే వాస్తవాల అన్వేషణ జరగదనేది ఇందలి విశేషం, రుజువుకు ఇదే ముఖ్య విషయం.
చారిత్రక సందర్భం
అయితే కొన్ని ముఖ్యవిషయాలలో ఈ విధమైన వైజ్ఞానిక ధోరణి అసంపూర్తి మాత్రమేగాక తప్పుతోవను పట్టించవచ్చుకూడా. బేకన్ సూత్రీకరణను సరిగ్గా అవగాహన చేసుకోవడానికి అతడు నివసించిన కాలం, సందర్భాన్ని గ్రహించవలసి ఉంటుంది. ఆధునిక యుగారంభంలో బేకన్ రాశాడు. అప్పట్లో విజ్ఞానవేత్తలు తమ స్థానానికై పెనుగులాడ వలసివచ్చింది. అంతేగాక మత విజ్ఞానం సనాతన పద్ధతుల నుంచి బయటపడి విజ్ఞానం తానుగా ఒక మార్గాన్ని చూడగలదనే ధోరణిని శాస్త్రవేత్తలు అవలంబించలేకపోయారు. బ్రూనోను తగలబెట్టారు. గెలీలియో వెనుకంజ వేయవలసి వచ్చింది. గ్రహాల చలనంలో కెప్లర్ దైవసంబంధమైన సంగీతాన్ని విన్నాడు. ఆనాడు విజ్ఞాన వేత్తలలో ఉన్నత స్థాయిలో ఉన్న న్యూటన్ సహితం, ప్రకృతి తత్వంపై చూపిన శ్రద్ధను, మత విజ్ఞానంపై కూడా చూపాడు. నేటి నైతిక సామాజిక ధోరణితో చూస్తే ఇదంతా అవాంఛనీయంగా వినిపించినా ఆనాడు ఇదేమంత ఆశ్చర్యకరమైన విషయంకాదు. ప్రాచీన కాలంలోని వివేచనలోని పెత్తందారీతనం చాలా ప్రభావాన్ని చూపెట్టింది. దానికి విరుద్ధంగా పోవాలంటే, వ్యతిరేకించే వాస్తవాన్ని ప్రవేశపెట్టాలంటే ఒక పట్టాన ఆమోదంపొందే అవకాశం ఆనాడు లేదు.
అరిస్టాటిల్ నుంచి న్యూటన్ వరకు దాదాపు రెండు వేల సంవత్సరాల కాలంపాటు పెంపొందిన వైజ్ఞానిక శాస్త్రం చాలా స్వల్పంగానే ఉంది. సంప్రదాయ బద్ధంగా వస్తున్న లోకాన్ని గురించిన భావంపై ఈ విజ్ఞాన ప్రభావం అంతగా ఉండే అవకాశంలేదు. కనకనే గతం యొక్క భారం ఎక్కువగా ఉండడానికీ తగిన కారణం ఉన్నదనుకోవచ్చు. దీనికి తోడు మరొకముఖ్యమైన విషయంకూడా పేర్కొనాలి. బేకన్ ఈ వైజ్ఞానిక సమస్యను ప్రస్తావించాడు. ప్లేటోతో, పాతుకుపోయిన ఈ పంథాననుసరించి కంటికి కనిపించే వస్తువులు అన్నీ, అసంపూర్తి రూపాలు మాత్రమే. వీటి వెనుక శాశ్వతమైన భావాలు ఉన్నాయి. ఆ భావాలే వాస్తవమైనవీ, సమగ్రమైనవీ, మిగిలినదంతా అనుకరణ మాత్రమే. కనక అసంపూర్తి అయినవి, అంతవాస్తవం కానివి అన్నారు. ఉదాహరణకు సజీవంగా ఉన్న గుర్రంగాని, మనిషిగాని గుర్రపుతనానికి, మనిషితనానికి అనుకరణ అన్నమాట. కనక ఇవి హీనమైనవి. మానవుడు లేదా గుర్రానికి సంబంధించిన నిజస్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి సంతృప్తికరమైన తోవ చూపలేవు. అంటే ప్రాపంచికానుభవంతో కూడిన అధ్యయనం వస్తువుకు సంబంధించిన సమగ్రసత్యాన్ని తెలుసుకోవడానికి తోడ్పడదు. మూలానికి బదులు ప్రతిమలను అధ్యయనం చేయటమే ఇందుకు కారణం. భౌతిక వస్తువులను కంటితో చూస్తున్నట్లే, అంతరదృష్టితో కూడిన వివేచనతో భావాలను అవగాహన చేసుకోవడం, గ్రహించడం, చూడటం వల్ల సరైన జ్ఞానం లభిస్తుంది అంటారు.
ఇటువంటి విజ్ఞాన సిద్ధాంతం వల్ల, సర్వసాధారణమైన సూత్రాలకు అవరోధం తప్పదు. కేవలం వివేచన ఆధారంగా సూత్రాలను రూపొందించడం వల్ల సర్వ సాధారణమైన సత్యాల ఆధారంగా పరిశీలించవలసిన విషయాలను వివరించలేక పోవటం జరిగింది. ప్లేటో జ్ఞాన సిద్ధాంతం ఆధారంగా మాత్రమే తర్క న్యాయ (Syllogism) ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రధాన ప్రతిపాదనలోని సత్యాన్ని తెలుసుకుంటే తప్ప, న్యాయ తర్క విధానం మూలాన్నే ప్రశ్నించినట్లవుతుంది. అయితే ప్రధాన ప్రతిపాదన విశ్వవ్యాప్తమైన సత్యంగా గ్రహిస్తే రూపొందించిన నిర్ణయం ప్రాధాన్యం లేకుండాపోతుంది. ఉదాహరణకు సర్వసామాన్యమైన సోక్రటీస్ కు సంబంధించిన తర్క న్యాయ విధానంలో, అతడికి సంబంధించిన కొత్త జ్ఞానాన్ని చూడాలంటే, మానవుడిలో చావు ఇమిడి ఉన్నదని గ్రహించాలి. ఇందులో మధ్య ప్రతిపాదన సూటిగా రుజువు పరచవచ్చు. సంప్రదాయబద్ధమైన విజ్ఞాన సిద్ధాంతంలో వాస్తవాలకూ, వాటిని సేకరించి భాష్యం చెప్పే పద్ధతికీ ద్వితీయ స్థానం మాత్రమే ఉంది.
పై విషయాల ఆధారంగా చూస్తే వైజ్ఞానిక పద్ధతికి బేకన్ తోడ్పాటు గ్రహించవచ్చు. బేకన్ సంప్రదాయ పద్ధతిని ఖండించాడు. వాస్తవాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రతిపాదనకు తుది నిర్ణయంగా వాస్తవాలు స్వీకరించాడనటం వైజ్ఞానిక పద్ధతి పరిణామంలో ఒక నూతన దశ అనుకోవచ్చు. ఇక ముందు మతం చెప్పే పిడివాదంగానీ, అది భౌతిక వాదులు సూక్ష్మంగా ఊహించే పద్ధతిగానీ మానవుడి ప్రకృతి అన్వేషణను ఆపజాలవు. ప్రకృతి నియమాలను తనకనుకూలంగా మలచుకొని ముందుకు పోయే ధోరణిని కూడా ఆటంక పరచలేవు. తార్కికంగా ఆలోచించటమనే పద్ధతి మానవుడి విశిష్ట లక్షణం. దీనికి ప్రాపంచికానుభవం చుక్కాని లాగ పనిచేస్తుంది. తెలియని విషయాలకు దారులు వేస్తుంది. ప్రగతికీ, ఆనందానికీ అనూహ్యమైన బాటలు నిర్మిస్తుంది.
బేకన్ ఆగమన పద్ధతిలో పరిమితులు
అనుభవానికి మించి పోవడానికి అంగీకరించకపోతే కేవలం నిస్సార పంథా అవుతుంది. వాస్తవాలు, ఒకేరీతిగా ఉన్నా, భౌతిక విజ్ఞాని, చిత్రకారుడు, కవి, వాటిని భిన్న దృక్పథాలతో పరిశీలించి విభిన్న సృష్టి చేసే నిమిత్తం అదే వాస్తవాలను ముడిసరుకుగా వాడుకుంటారు. వాస్తవాలకు భాష్యం చెప్పటంలో ఎవరి మనోపరిధి వారికి ఉన్నది. ఆ కోణంలో వారు పరిశీలించి మళ్ళీ సృష్టించుకోడంలో తమ ధోరణినే అవలంభిస్తారు. ఇంకా ముందుకు వెళ్ళి చెప్పాలంటే కేవలం వాస్తవాలంటూ లేవు. ఏ వాస్తవమైన చర్చనీయాంశం కావాలంటే, ఒక భాషలోకి మలచవలసి ఉంటుంది. ఒక నిర్దిష్టమైన భావనా పరధిలోకి తీసుకురావలసి ఉంటుంది. ఒక సంస్కృతిలో నివసించే ప్రజలు చాలామంది సాధారణ భావాలను ఒక విధంగా గ్రహిస్తారు. కనకనే వాస్తవాలను ఇంచుమించు ఒకే దృష్టితో చూస్తారు. భావనారీతులలో ఇటువంటి అంగీకారం ఉండటం వల్ల మానవుడు సాంస్కృతిక సృష్టిని కొనసాగించటానికి, పరస్పరం అవగాహన చేసుకోవటానికి వీలవుతున్నది. అయితే ఈ అంగీకారం సంపూర్ణం కాకపోవటం అదృష్టమనాలి. లేకుంటే అభివృద్ధికి అవకాశమే ఉండేదికాదు.
కేవలం ప్రాపంచిక అనుభవాలు, సత్యాన్వేషణలో పరిమితంగానే ఉపయోగపడతాయి. అనేక వాస్తవాలకు సంబంధించిన సాధారణ లక్షణాలు మాత్రమే స్వీకరించి సిద్ధాంతాలు రాబట్టినంతవరకూ సంతృప్తికరమైన ఫలితాలు దక్కుతుంటాయి. వైజ్ఞానిక దశలో ఇది వర్గీకరణస్థాయికి చెందింది. 20వ శతాబ్ది ఆరంభం వరకూ జీవశాస్త్రం, ప్రస్తుతం పరిశోధనలో ఉన్న మనస్తత్వ శాస్త్రం ఈ స్థాయిలోనే ఉన్నాయి. అటువంటప్పుడు అధ్యయనం చేసే విషయాన్ని అవగాహన చేసుకోవటానికి, సిద్ధాంతపరమైన భావాలకు సంబంధం చూడవచ్చు. బేకన్ సూచించినట్లు వాస్తవాల నుంచి సిద్ధాంతాన్ని రాబట్టటం ఇక్కడ గమనించవచ్చు. అయితే వర్గీకరణ స్థాయి నుంచి విజ్ఞానం ముందుకు పోయిన తరవాత, ప్రతిపాదనలూ, భావాలపై ఆధారపడటం వాటిని రుజువు పరచటానికి పరోక్షంగా మాత్రమే సంబంధాలు నెలకొల్పటం జరుగుతున్నది. ఎలక్ట్రాన్, రేణువు, రసాయనికాలలోని వేలెన్సే అనేవి ప్రత్యక్షంగా పరిశీలించే వాటితో సంబంధం లేనట్టివే, కేవలం ప్రపంచం అనుభవవాదమనే సిద్ధాంతానికి భిన్నంగా పోతున్నప్పటికీ, ఆధునిక భౌతిక విజ్ఞానం, రసాయన శాస్త్రాల సిద్ధాంతాలలోని వైజ్ఞానిక విలువలను ప్రశ్నించే పరిస్థితి లేదు.
రచన తెలుగుసేత
ఎ.బి.షా నరిసెట్టి ఇన్నయ్య
No comments:
Post a Comment