జ్యోతిష్యం అశాస్త్రీయమే కాదు. విజ్ఞాన వ్యతిరేకం కూడా

12 - “శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?”

తన పరిధిలో పరిశీలనకు వచ్చిన వాస్తవాలను సంతృప్తికరంగా వివరించకపోతే వైజ్ఞానిక సిద్ధాంతం ఏదీ కూడా అట్టేకాలం నిలబడదు. కాని విజ్ఞాన చరిత్ర నిండా ఉత్తరోత్తరా దోషాలని రుజువైన సిద్ధాంతాలు లేకపోలేదు. న్యూటన్ పేర్కొన్న వెలుగుకణ సిద్ధాంతం ఇందులో ఒకటి. ఇంత మాత్రానే విజ్ఞాన స్థాయికి భంగం వాటిల్లదు. మనో విశ్లేషణవంటి అన్వేషణారంగాలనేకం ఉన్నాయి. వాటిలో సర్వసాధారణంగా ఆమోదించే వైజ్ఞానిక సిద్ధాంతం ఇంకా రావలసి ఉంది. అంటే మనో విశ్లేషణ ఉబుసుపోక అనుకోరాదు. చాలా ఆసక్తికరమైన, ఉపయోకరమైనకృషి ఈ రంగంలో జరిగింది. అనేక సందర్భాలలో ఈ పద్ధతి ప్రయోగించే చికిత్సా విధానాలను చూస్తుంటే దీనిని తేలికగా కొట్టిపారేయడానికి వీల్లేదు. అయినప్పటికీ ఆ సిద్ధాంతంగా పేర్కొన్న దానిలో అద్భుతమైన అంతర్ దృష్టి కనిపిస్తున్నదేగాని, కీలకమైన పరీక్షకు గురికాలేదు. విజ్ఞాన సిద్ధాంతంగా ఆవిర్భవించడానికి మనో విశ్లేషణ అన్వయించే పద్ధతులు, ఉద్దేశాలు ఉన్నాయికూడా. దీనికి వ్యతిరేకంగా వ్యవస్థాపితమైఉన్న సిద్ధాంతం ఏదీ లేదు. అందు వల్లనే, మనో విశ్లేషణ రానురాను విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందవచ్చు. ఆ లక్ష్యం చేరుకోడానికి ఎంతో దూరం పయనించవలసి రావచ్చు.

మరో విధమైన సిద్ధాంతాలు కూడా ఇక్కడ చర్చించబోతున్నాం. వాటిలో పరిమితంగా ప్రాపంచికానుభవ సత్యం కొంతమేరకు ఉన్న సందర్భాలు లేకపోలేదు. అయినా అవి విజ్ఞానపరంగా లేవు. ఈ సిద్ధాంతాలు ప్రతిపాదించే వాటిననుసరించి, అందులో ఇమిడి ఉన్నవాటిని పరోక్షంగానైనా రుజువుపరచవీల్లేదు. అదే రంగంలో విజయవంతంగా పనిచేస్తున్న వైజ్ఞానిక సిద్ధాంతాలలో పెసగకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. పైగా అటువంటి విజ్ఞాన-విజ్ఞానేతర సిద్ధాంతాలను (ఒకే రంగంలో) కొన్నింటిని చూద్దాం.

ఖగోళం-జ్యోతిష్యం

ఈ రెండూ మానవుడు చిరకాలంగా పరిశీలిస్తున్న ఆకాశానికి చెందినవే. ఆకాశంలో ఒకే తీరుగా చలిస్తున్నవాటిని, అందుకు సంబంధించిన భౌతిక సంఘటనలను మానవుడు పరిశీలిస్తున్నాడు. ఆధునిక విజ్ఞానం ఆవిర్భవించేటంత వరకూ జ్యోతిష్యం-ఖగోళ శాస్త్రం భిన్నమైనవని భావించనేలేదు. మానవ వ్యవహారాలకు ఖగోళ విషయాలను అన్వయిస్తే జ్యోతిష్యం అవుతుంది. మానవుడి వ్యవహారాలకు ఖగోళ విషయాలను అన్వయిస్తే జ్యోతిష్యం అవుతుంది. ప్రతి నక్షత్రం, ప్రతి గ్రహానికి కూడా ఒక దేవత ఉంటుందనీ, ఆ దేవత మానవుడి వ్యవహారాలలో ఆసక్తి చూపడమేగాక, ప్రభావితం చేస్తుందని భావించారు. గ్రహాల చలన నియమాలను కనుక్కొన్న కెప్లర్ సైతం జ్యోతిష్యంలో నమ్మకం గలవాడే. అతడి సమకాలీనులకు ఈ ధోరణిలో దోషం కనిపించలేదు. ఆకాశంలోని ఈ నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకున్న తరవాత, సామాజిక సంస్థలు పనిచేసే తీరు, మానవుడి శారీరక మానసిక రీతుల గురించి తగినంతగా తెలిసిన అనంతరం, గడ్డినుంచి గింజలు వేరు చేయడానికి వీలుచిక్కింది. ఖగోళశాస్త్రం విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందింది. మానవుడిపై గ్రహాల, నక్షత్రాల ప్రభావం ఉంటుందనే జ్యోతిష్యం విజ్ఞానపరంగా అపఖ్యాతి పాలైంది. ఇది అవగాహన చేసుకోవడం సులభమే. ప్రతిపాదన చేసిరాబట్టే నిర్మాణం ఖగోళంలో ఉంది. అనేక పరిశీలనాంశాలకు స్పష్టమైన వివరణలను ఖగోళ శాస్త్రం ఇస్తోంది. పరీక్షకు తట్టుకొనే ప్రమాణానికి నిలబడకలుగుతోంది. ఇందుకు భిన్నంగా, జ్యోతిష్యంలోని మూల సూత్రం దోషపూరితమైంది. నక్షత్రాలకు, గ్రహాలకు అంటి పెట్టుకొని దేవతలు అనేవారెవరూ లేరు. ఆకాశంలోగాని భూమిపైన గాని ఎక్కడా అలాంటి వారు లేరు కనక వారు మానవుడి వ్యవహారంలో ఆసక్తి చూపే ప్రశ్నేరాదు. జ్యోతిష్యం అశాస్త్రీయం. మనకు గల ప్రత్యక్షజ్ఞానానికి, వ్యవస్థాపిత సిద్ధాంతాలకు పొసగకుండా జ్యోతిషం ఉంది. జ్యోతిష్యం అశాస్త్రీయమే కాదు. విజ్ఞాన వ్యతిరేకం కూడా, జ్యోతిష్యంలో లాగే, యోగసిద్ధాంతం వంటి వాటిల్లోనూ ఇలాంటి విజ్ఞాన వ్యతిరేక ధోరణి ఉంది. విజ్ఞానం రుజువు పరచిన నియమాలను పాటించకుండా, గతం, వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించి జ్ఞానాన్ని మానవుడు యోగం ద్వారా సిద్ధింపజేసుకోవచ్చుననటం వాస్తవ వ్యతిరేకమే.

ఆలోపతి-ఆయుర్వేదం

అలోపతి-ఆయుర్వేద వైద్యరంగాలలోనూ ఇటువంటి విచక్షణే చేయవలసి ఉంది. అనుభవం, పరిశీలన ఆధారంగా ఆయుర్వేదం అనేక ప్రాపంచిక విషయాలను చిలికించింది. జ్యోతిష్యం లాగ కాక ఆయుర్వేదంలో రోగ నిర్ణయానికీ, చికిత్సకూ సంబంధించి విజ్ఞాన సిద్ధాంతాన్ని ఏర్పరచడానికీ వీలుగా ఆధారం ఉంది. అయితే ఆయుర్వేదం ఇంకా విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందలేదు. వాత, పిత్త, కఫం అనే ప్రతిపాదనలుగానీ, రస, కామ, రక్త, మాంస, మేధ, అస్తి, మజ్జ, శుక్ర అనే ఏడు సారాంశాల విషయంగానీ, ఆధునిక శారీరక శాస్త్రం కనుక్కొన్న వాటితో సరిపోవడం లేదు. ఈ విధంగా ప్రత్యక్షంగా వ్యవస్థాపితమైన జ్ఞానంతో పొందికగా లేకపోవడం వల్ల ఆధునిక విజ్ఞానానికి ఆయుర్వేదం ఆమోద యోగ్యం కాదు.

ఆయుర్వేదానికి భిన్నంగా ఆలోపతి సిద్ధాంతం ప్రత్యక్షపరిశీలనపై ఆధారపడి ఉంది. మానవుని శరీరంలో ఏది ఎలా పనిచేస్తుందో గమనించారు. ఇది ఒకవేళ అసంపూర్తిగా ఉన్నప్పటికీ ప్రశ్నించటానికి వీలులేని వాస్తవాల నాధారం చేసుకొని గట్టి ప్రాతిపదికలు చేసింది. ఆధునిక వైద్య శాస్త్రంలో కొన్ని రోగాలకు మాత్రమే నిర్దిష్టంగా చికిత్సలు కనుక్కొన్నారు. కాని రోగ నిర్ణయం మాత్రం తిరుగులేనిది. కాన్సర్ (పుట్టుకురుపు) ఎలా పెంపొందుతుందో, దీనిని ఎలా నయం చేయాలో ఇంకా తెలియదు. తొలిదశలో కనుక్కొంటే మాత్రం నయం చేయగలుగుతున్నారు. మధుమేహం, చలిజ్వరం, ప్లేగు, సన్నిపాతజ్వరం, కలరా, రక్తపుష్ఠి లేకపోవటం, నంజువ్యాధి, ఎముకలు సరిగ్గా ఎదగకపోవటం ఇత్యాదుల విషయంలో వివరాలతో సహా రోగనిర్ణయం తెలుసు. వీటిలో కొన్నిటికి ఆయుర్వేదం చికిత్స చేసి ఫలితాలు సాధిస్తున్నది. అయితే ఈ రోగాలకు చెప్పే కారణాలు, ఎలా నయమవుతున్నాయో వివరించే విధానం కృత్రిమంగానూ, దోష పూరితంగానూ ఉన్నాయి.

   రచన తెలుగుసేత
         ఎ.బి.షా నరిసెట్టి ఇన్నయ్య


No comments:

Post a Comment