ఇబన్ వారక్
10వ అధ్యాయం
కాఫిర్లు, నాస్తికులు స్వేచ్ఛాలోచన, వివేచన, దివ్యజ్ఞానం
ఇస్లాం చరిత్రలో హేతుబద్ధమైన వేరే ఆలోచనలు చాలా వచ్చాయని రాబర్ట్ సన్ రాశాడు. విభిన్న కొత్త అభిప్రాయాలకు ఇస్లాం సహనం చూపింది. పరస్పర సహనం ప్రవక్త కాలం నుండి ఉన్నదని గోల్డ్ జిహర్ అన్నాడు. అభిప్రాయ భేదం సమాజంలో కనిపిస్తే అది దైవదయామయ రీతి అనుకున్నారు. సున్నీ ఇస్లాంలోని నాలుగు న్యాయవిధానాలు సనాతనమైనవి. సమానంగా చెల్లుబాటైనవి అన్నారు. నమ్మకాలు లేని వారి పట్ల అసహనం, మరణ శిక్షలూ విధించాలన్నారు. షియైట్లు, ఖరీజైట్లు, మురీజైట్లు, ముతాజిలైట్లు. ప్రవక్త దైవ వచనాలవంటివి సందేహించే సున్నీలను అతివాదులుగా భావించాలన్నారు. పునర్జన్మ వంటివాటిని కేవలం భ్రాంతిగా పరిగణించాలన్నారు. దైవ ఏకత్వాన్నీ, మహమ్మద్ ప్రవక్తత్వాన్నీ కొరాన్ దివ్యత్వాన్నీ నిరాకరిస్తే వారు ముస్లిం పరిధిలోకి రారు.
భేదభావాలు భిన్న ధోరణులు చూపినవారికి తీవ్రంగా బాధ పెట్టారని చరిత్ర చెవుతున్నది.
గ్రీక్ తాత్విక ప్రభావం వలన నిజాన్ని తెలుసుకోవటానికి జీవన గమనానికీ హేతువాదాన్ని అనుసరించారు. హేతుబద్ధ ధోరణిగల తాత్వికులూ, మతవాదులూ, అల్మారీ వంటి సందేహవాదులూ, సనాతన మౌలిక భావాలను ప్రశ్నించారు. ఇందులో సనాతన ఇస్లాం పోరాడి, పై చేయి అనిపించుకున్నది. సత్యాన్ని తెలుసుకోవటానికి దేవుని సహాయం అవసరం లేదన్న భావాన్ని ఇస్లాం నిరాకరించింది. దైవసత్యం వెల్లడైతేనే నిజం తెలుస్తున్నదన్నారు. బహుశ అల్అషారీ 9వ శతాబ్దంలో మారినప్పుడు అల్ గజాలీ 11వ శతాబ్దంలో రాసినప్పుడు ఇస్లాంకు విజయం చేకూరి ఉండవచ్చు. ముస్లింలకూ మానవాళికి అదే పెద్ద ఉపద్రవం. పునరుజ్జీవనం పొందిన ఇస్లాం, అల్జీరియా, ఇరాన్, సూడాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్టులలో ఆటవిక ధోరణిలో పోతున్నది. ఇస్లాం రాజకీయంగా ఆధునిక ప్రపంచ సమస్యలను, ముఖ్యంగా, సాంఘిక, ఆర్ధిక, తాత్విక విషయాలలో విఫలమయింది.
తొలి సంవత్సరాలు
మక్కాలో మహమ్మదు కథల్ని ఆమోదించని అరబ్బు సందేహవాదులున్నారని ఖురాన్ మనకు చెపుతున్నది. శరీరం మళ్ళీ లేచివస్తుందనీ, దైవం విషయాలను వెల్లడిస్తుందనీ వాదాన్ని వారు సందేహించారు. అరబ్బు పేగన్ కవులనుండి మహమ్మద్ అనేక విషయాలు వారు కొట్టేసినట్లు కూడా వారు భావించారు. ఖురాన్ లోని కొన్ని చరణాలు ఇస్లాంకు ముందున్న అల్ కాస్ కవికి చెందినవంటున్నారు. ఇస్లాం తొలి రోజులలో మహమ్మదుకు అంటగట్టిన అద్బుతాలు పరిమితంగా ఉండటానికి మక్కా ఆలోచనా పరులే కారణమని రాబర్ట్ సన్ అన్నాడు. మహమ్మద్ వ్యతిరేకులు జీవితానంతరం బ్రతుకులోనూ, అద్భుతాలలోనూ నమ్మకం చూపలేదు. అతడికి దైవ ప్రేరణ వచ్చిందనేది కూడా వారు సందేహించారు. రాబర్ట్ సన్ ప్రకారం నాటి ప్రజల కవిత్వంలో మతధోరణులు లేవు. ఇస్లాం వచ్చి ఏకేశ్వరాధనలో అనేక మూఢనమ్మకాలను తెచ్చిపెట్టింది.
పేగన్ అరబ్బులు మత విశ్వాసం అంతగాలేనివారు. ప్రాపంచిక జయాపజయాలకు అతీత శక్తుల్ని వారు ఆరాధించలేదు. ఈ పేగన్ ధోరణులు ఇస్లాం తొలి రోజులలో ఉన్నాయి. జయాలూ, సంపదలూ అరబ్బులను మార్చివేశాయి. పైకి నమ్మకం ఉన్నట్లు చెప్పినా వాస్తవంగా వారికి విశ్వాసం లేదు. మహమ్మదు చనిపోయేనాటికి అతడి సిద్ధాంతంలోకి మారినవారు వేయికిమించి లేరని స్ట్రెంగర్ అన్నాడు. బెడోయినులు ఎంత తొందరగా ఇస్లాంను స్వీకరించారో అంత వేగంగా దాన్ని వదిలివేయటానికి సిద్ధపడ్డారు. తాగటం, లైంగిక ఆనందాలను కాదన్న ఇస్లాం, మహమ్మద్ వారికి అంతగా ప్రియమైనవారు కాలేకపోయారు.
అరబ్బులు ముస్లింల ప్రార్థనలనూ, శరీరాన్నీ ప్ర్రార్థనలో అంతగా కదిలించటాన్నీ ఇష్టపడలేదు. గోల్డ్ జిహర్ అలా రాశాడు.
ఎడారి అరబ్బులు ప్రార్థనలపట్ల ఉదాసీనత చూపారు. పవిత్ర గ్రంథాన్నీ, ముస్లింల క్రతువులనూ ఎవరూ పట్టించుకోలేదు. కొరాన్ కంటె పేగన్ వీరోచిత గాథలు వారికి నచ్చేవి. ఉబాయద్ హిలాల్ యుద్ధం నుంచి తిరిగి వచ్చినవారిని తన గుడారానికి రమ్మని అడిగాడు. కొరాన్ చదవమంటారా, కవితలు చెప్పమంటారా అని వచ్చిన సైనికులను అడగగా, వారు సమాధానమిస్తూ మీకూ, మాకూ కొరాన్ తెలుసు. కవితలు చెప్పండి అని అన్నారట. అప్పుడు ఉబాయద్ వారితో కొరాన్ కంటే కవితలే మీకిష్టమని నాకు తెలుసు అన్నాడట. (ముస్లిం స్టడీస్, 1వ సంపుటి, పుట 43-44)
ఇస్లాం తొలిరోజుల నాయకులు మతంలో ఆసక్తి చూపలేదు. ఖలీద్ అల్ వాలిద్, ఒత్ మన్ తల్హా, అమర్ అల్ అస్ ఇందుకు ఉదాహరణలు. ముస్లిం నాయకుడొకడు ఇలా అన్నాడని చెప్పుకుంటారు. దేవుడు ఉంటే అతని మీద ఒట్టువేసి, నేను అతడిని నమ్మను అన్నాడట.
ఉమాయద్దులు (661-750)
ఉమాయద్దులు నాస్తికులని వారి శత్రువులనేవారు. ఇస్లాం సిద్దాంతం తెలియకపోవటం, ఇస్లాం మొదటి శతాబ్దంలో సాధారణమైంది. ఒక సిద్ధాంతంగా ఖచ్చితమైన వాదనలతో ఇస్లాం చాలాకాలం అమలులోకి రాలేదు. ఖలీఫా అల్ వాలిద్ (743లో పాలన) ఖురాన్ చరణాలను వ్యతిరేకులపైకి ఇలా ప్రయోగించారంటారు. సుర 14.8, 9. మొండిగా వ్యతిరేకించేవారిని మీరు బెదిరిస్తున్నారు. నేనే అలాంటివాడిని పునరుజ్జీవంనాడు దేవుని ఎదుట ఇలా చెప్పండి, ఓ దేవా ! అల్ వాలిద్ నన్ను ఛిన్నాభిన్నం చేశాడు. గోల్డ్ జిహర్, 2వ సంపుటి, పుటః 65)
రెండవ వాలిద్ ఖురాన్ కు బాణం గుచ్చి ముక్కలు చేసి, పై చరణాలు చదివాడంటారు. అతడు ఖురాన్ కు కట్టుబడి ఉండలేదు. సంస్కృతీపరుడుగా అతడిచుట్టూ కవులు, నాట్యకత్తెలూ, గాయకులూ మతాసక్తి లేకుండా ఆనందంగా గడిపారు. పవిత్రతపట్ల పట్టించుకోని ఉమాయద్దులు ఇస్లాంను అనుసరిస్తున్నట్లే భావించారు. మతరాజ్యాన్ని కోరకున్న పవిత్రులకు వారి ప్రభుత్వం నచ్చలేదు.
అబ్బాసిద్దులు (ఇరాక్-బాగ్దాద్, 749-1258)
ఉమాయద్దులను అబ్బాసిద్దులను వచ్చి త్రోసిపుచ్చారు. ఇస్లాం సూత్రాలలో వారు గట్టిగా అమలుపరిచారు. ఇతర మతాలపట్ల అసహనం చూపారు. ఉమాయద్దులతో పోల్చి చూస్తే ఇది తిరోగమనమే అని గోల్డ్ జిహర్ వ్యాఖ్యానించాడు. (ముస్లిం స్టడీస్, పుటః 62) అబ్బాసిద్దులు మతరాజ్యాన్ని స్థాపించి సార్వభౌమత్వం దేవునికి చెందినదన్నారు. తాము భూమి మీద దైవ ప్రతినిధులమన్నారు. ప్రవక్త నామా అల్ అబ్బాస్ వారసులుగా వీరికి చట్టబద్ధత సంక్రమించింది.
ఖరీజైట్లు
ఇస్లాంలో ఖరీజైట్లు తొలి మతశాఖగా వచ్చారు. ఖలీఫా సిద్ధాంతాన్ని పెంపొందించారు. విశ్వాసాన్ని రూపొందించటంలో గ్రంథాలు ప్రధానం అన్నారు. ఇస్లాంలో పవిత్రతపై వీరు నొక్కు పెట్టారు. వారి ఆభిప్రాయాలను అంగీరించని వారందరినీ చట్టం వెలుపలివారుగానే భావించారు. వారి తీవ్ర ఛాందసవాదాన్ని ప్రదర్శించి స్త్రీలను పిల్లలతోసహా చంపేశారు. మూడవ ఖలీఫా ఉత్మన్ ను 655లో చంపేసిన తరువాత ఖరీజైట్లు అలీని ఖలీఫాగా గుర్తించలేదు. హత్యకు ముందు ఉత్మన్ ప్రవర్తనను కూడా ఖండించారు.
వారి ఛాందస ధోరణులకు వ్యతిరేకంగా అలీ చర్యలు తీసుకోవలసి వచ్చింది. ఖరీజైట్లను నహ్రవా వద్ద 658లో ఓడించి చాలామందిని అలీ చంపేశాడు. స్థానికంగా రెండేళ్ళపాటు అనేక తిరుగుబాట్లు జరిగినవి. సహ్రవాస్ యుద్ధానంతరం 3 ఏళ్ళకు 661లో ఖరీజైటు ఒకతను అలీని చంపేశాడు. తరువాతి ఖలీఫా మూవియా కాలంలో తిరుగుబాటు చేసిన ఖరీజైట్లను అణచివేసి చాలా మందిని చంపేశాడు. ఎనిమిదవ శతాబ్దం వరకూ ఈ తిరుగుబాట్లు సాగాయి. ఖరీజైట్లలో తీవ్రవాదుల్ని అజరక్వైట్లు అంటారు. కొరాన్ లో ప్రస్తావించిన సంస్థలన్నిటినీ వారు నిరాకరించారు. కొరాన్ పేర్కొన్నట్లు అప్పుచేసిన వారందరూ నరకానికి పోవలసిందేనన్నారు. అలాంటివారి భార్యా, పిల్లల్ని కూడా చంపేయాలన్నారు. ఆ విధంగానే చంపేశారు. కూడా. (డిల్లావిడ రచనలో మతపరమైన హత్యోదంతం ఉన్నది. ఎన్ సైక్లోపేడియా ఆఫ్ ఇస్లాం ఖరీజైట్లపై వ్యాసం)
ఇతర ముస్లింలపట్ల అసహ్యం చూపిన ఖరీజైట్లు ముస్లిమేతరులపట్ల సహనం చూపి కొన్నిసార్లు వారిని సమానంగా పరిగణించారు. ఖరీజైట్ మతవాదులు తొలుత హేతుధోరణులు చూపారు. ఈ విషయంలో వారి ప్రభావం ముతాజిలైట్ హేతువాదులపై ఉన్నదని గోల్డ్ జిహర్ పేర్కొన్నాడు. కొరాన్ లోని సుర. 12, జోసెఫ్ సుర ఖురాన్ కు చెందింది కాదని లైంగిక పరమైన ఆ కథ దేవునినోట పలికించటం అర్హమైన విషయం కాదని అన్నారు. ఖరీజైట్ మతవాది యాజిద్ అబీ అనీసా ఒక భావాన్ని వెల్లడిస్తూ, దేవుడు పర్ష్యన్ ప్రవక్తకు కొత్త కొరాన్ వెల్లడిస్తాడనీ, ఆ ప్రవక్త కొత్తమతాన్ని స్థాపిస్తాడనీ చెప్పాడు. యూదు. క్రైస్తవ, ఇస్లాం వలె ఈ కొత్త మతంకూడా ఉంటుందన్నాడు. దైవం చివరిమాటగా ఇస్లాంను వెల్లడించాడనీ, ప్రవక్తల్లో చివరివాడు మహమ్మదనీ నమ్మేవారికి ఇది వ్యతిరేకంగా ఉన్నది.
ఖరీజైట్లు ముస్లిం విశ్వాసాన్నీ హేతుబద్ధంగా ఆలోచించేటట్లు చేయటంలో ప్రముఖపాత్ర వహించారు.
ఖాదరైట్లు
హ్యూబర్ట్ గ్రిమ్మే రాస్తూ మహమ్మదు చివరి రోజులలో ప్రవక్తగా రాజీలేని మూర్ఖవాదాన్ని పెంపొందించాడన్నాడు. (ఎన్ సైక్లోపీడీయా ఆఫ్ ఇస్లాం, ఖాదర్ పై వ్యాసం) 7వ శతాబ్దం చివరిలో పవిత్ర ముస్లింలే క్రైస్తవ మత ప్రభావం వలన మానవుడి నిస్సహాయ స్థితిని ప్రశ్నించారు. మనిషికి స్వేచ్ఛాయుతమైన ఆలోచన ఉన్నదనేవారు ఖాదరైట్లు విధి నిర్ణయానికి పరిమితులున్నాయన్నారు. వీరిని వ్యతిరేకించిన జబ్రియాలు విధి గుడ్డిగా పాటించవలనసినదేనన్నారు.
ఇస్లాం చరిత్రలో ఖాదర్ ఉద్యమం సంప్రదాయాల ఆధిపత్యం నుండి విమోచనకై తొలి పొరాటం సాగించిన దృష్ట్యా దీనికి ప్రాధాన్యత ఉన్నదని గోల్డ్ జిహర్ రాశాడు. (ఇన్ట్రడక్షన్ టు ది ఇస్లామిక్ థియోలజీ అండ్ లా, పుటః 82) ఖాదరైట్లను ఖండిస్తూ అనేక సంప్రదాయాలు వచ్చిన దృష్ట్యా వారి ఆభిప్రాయాలకు అంతగా సానుభూతి లభించలేదు. ఖాదరైట్ సిద్ధాంతానికి విచ్ఛిన్నకర ధోరణి ఉన్నదని రాజకీయ కారణాల దృష్ట్యా ఉమాయద్దులు భావించారు. ఉమాయద్దులకు దేవుడు లేడనీ, చట్టపరమైన పాలకులు కారనీ పేరున్నది. వారి పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినవారిని అణచివేసే ప్రయత్నాలు జరిగాయి. ఉమాయద్దులు పాలించాలనేది దైవనిర్ణయం అన్నారు. దేవుడు ముందే నిర్ణయించిన ఈ విషయాన్ని విధిగా పాటించాలన్నారు. ఉమాయద్దుల పాలన దైవేచ్ఛ అన్నారు. ఇస్లాం సనాతనత్వాన్ని చూపడంలో ఖాదరైట్లు ముఖ్యపాత్ర వహించారు.
ముతాజిలైట్లు, హేతువాదం
1865లో జూరిట్ కి సంబంధించిన హెన్రిక్ స్టైనర్ అధ్యయనంచేసి ముతాజిలైట్ల భావాలు ఇస్లాంలో స్వేచ్ఛాపరులకు సంబంధించినవన్నారు. యూరోప్ లో 19వ శతాబ్దపు ఉదారవాదులు ఈ పరిశోధనపట్ల ఉత్సాహం కనబరిచారు. రాబర్ట్ సన్ 1906లో రాస్తూ వారిని స్వేచ్ఛాపరులుగానే చిత్రించారు. ముతాజిలైట్లు ఇస్లాం భావాలతో ఉన్న ప్రథమ ముస్లింలుగా పరిగణనలోకి వచ్చారు. ఐతే గోల్డ్ జిహర్ వివరిస్తూ పూర్తి వివేచనా పూరిత ఆలోచన అంటూ వారిలో లేదని చెప్పారు.
ముతాజిలైట్లు ఉదాలరవాదులు కాదు. అసహనపరులు అబ్బాసిద్ధుల ఆధ్వర్యాన మిహ్న అనే ముస్లిం మత దారుణాలకు ఒడిగట్టారు.
ముతాజిలైట్లు గ్రీక్ తాత్విక భావాలను, ఇస్లాం వాదనలోకి తీసుకొచ్చారు. సందేహవాదం, హేతువాదం వచ్చి సనాతనత్వం నడపడానికి ఉపరికరించింది. ఇస్లాంను గుర్తించటంలో సందేహాన్ని ప్రవేశపెట్టి, పంచేంద్రియాలతోపాటు 6వ గ్రహణశక్తి ఉన్నదని అన్నాడు. గోల్డ్ జిహర్ ఈ విషయాలను విశ్లేషించి చూపాడు. (పై పుస్తకం, పుటః87)
నమ్మకంలో హేతువును ప్రవేశపెట్టారు. బాగ్దాద్ కు చెందిన బిషర్ ఇబ్న ముతామిర్ హేతువుపై కవితలు రాశాడు.
ప్రజల మూఢనమ్మకాలను ముతాజిలైట్లు విమర్శించారు. సిరాత్ వంతెనకు రూపాలంకార వివరణ ఇచ్చారు.
ముతాజిలైట్లు ఏకత్వాన్నీ, దైవన్యాయాన్నీ పట్టించుకున్నారు. వారితత్వం ఐదు సూత్రాలలో వివరించారు మొదటిసూత్రంలో ఏకేశ్వరవాదం చెప్పి దేవునికీ, అతని సృష్టికీ పోలికను ఖండించారు. కొరాన్ లో దేవుని కాళ్ళూ, కళ్ళూ ప్రస్తావించినా వాటిని అలంకారప్రాయంగా స్వీకరించాలన్నారు.
రెండవ సూత్రంలో దేవుడు న్యాయమైన వాడన్నారు. మానవుడిచర్యలు స్వేచ్ఛాయుత పనులు గనుక మనిషి చెడుకు దేవుడు బాధ్యుడు కాదన్నారు.
మూడవ సూత్రంలో ఆచరణయుతమైన మతవాదాన్ని, నమ్మకం, అపనమ్మకాన్ని చర్చించారు. పాపాలు ఘోరమైన, స్వల్పమైన విధానాలుగా ఉన్నాయన్నారు. ఘోరమైన పాపాలను చేయకపోవటంలోనే దైవనమ్మకం ఉన్నదన్నారు.
నాలుగవ సూత్రంలో ఘోరమైన తప్పుచేసిన ముస్లింను ఇంకా ముస్లింగానే పరిగణించవచ్చునా అని చర్చించారు. ముతాజిలైట్ స్థాపకులలో ఒకరైన వాసిల్ పేర్కొంటూ అలాంటి తప్పు చేసిన ముస్లింను వధ్యస్థానంలో ఉంచాలన్నారు.
ఐదవ సూత్రంలో మంచిచెడ్డలు చర్చించి విశ్వాసాన్ని మాటలు. చేతలూ, కత్తి ద్వారా వ్యాపింపజేయాలని నైబర్ రాశారు. (ఎన్ సైక్లోపేడియా ఆఫ్ లో ముతాజిలైట్లుపై వ్యాసం)
ఈ చర్చలో ముతాజిలైట్లు హేతువాదాన్ని తీసుకవచ్చారు.
హేతువును మత సత్యానికి ఆధారంగా చూపకపోయినా మానవ ఆలోచనలూ, హేతుభావాలూ అన్వయించి దైవాన్ని అవగాహన చేసుకోటానికి ప్రయత్నించారు. దేవునికి చెడు, అన్యాయం అంటగట్టరాదన్నారు. తప్పుచేసిన వారిని సృష్టించటం సబబు అన్నారు. ఐతే మానవ దోషాలుగానే ఉన్నప్పుడు అలా శిక్షించాలన్నారు. అంటే మానవుడి వ్యవహారాలపై దేవుడి అదుపు లేనట్లే అయింది.
స్వయం నిర్ణయాధికారం అనే సిద్ధాంతం దైవపాలనా భావనను వ్యతిరేకిస్తుంది. దేవుడి సర్వశక్తివంతం న్యాయానికే పరిమితం చేశారు. అల్ నజాం రచనల ప్రకారం విశ్వంలో హేతువు ప్రధానంగా ఉన్నది. దేవుడు సహితం హేతువును పాటించాల్సిందే. మనిషికి ఏది ఉత్తమమో అదే దేవుడు చేయాలి. (డబ్ల్యు వాట్, ఫ్రీ విల్ అండ్ ఎ ఫ్రీ డెస్టినేషన్ ఇన్ ఎర్లీ ఇస్లాం, లండన్, 1948, పుటః73)
అల్ నజాం శిష్యుడు అహమ్మద్ హిబిత్ మరొక అడుగు ముందుకు వేసి నమ్మకంలేని స్థితివరకూ సాగారు. ప్రవక్త మహమ్మద్ ను బహు భార్యత్వానికి విమర్శించి మహమ్మద్ కంటే ఇతరులు ధర్మాన్ని పాటించారన్నారు.
దేవుడు తప్పనిసరిగా చేయాలి అనటం సనాతనదృష్టిలో ఘోర పాపం. ముతాజిలైట్లు మానవస్వేచ్ఛను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మానవ విధికి నిర్ణేత మానవుడే అన్నారు.
ముతాజిలైట్లు దైవశక్తిని పరిమితం చేశారు. జంతువులతో సహా అన్యాయంగా ఈ లోకంలో బాధలకు గురైతే పరలోకంలో పరిష్కారం చూపాలన్నారు. గోల్డ్ జిహర్ చెప్పినట్లు స్వేచ్ఛలేని దేవుడికి మారుగా స్వేచ్ఛాయుత మానవుడికినీ ముతాజిలైట్లు చూపారు. (ఇన్ట్రడక్షన్ టు ఇస్లామిక్ థియోలజీ అండ్ లా, పుటః 91)
మంచి-చెడులు అంటే ఏమిటి.... దేవుడు నిర్దేశించింది మంచి, నిషేధించింది చెడు అని సనాతనులు అన్నారు. ముతాజిలైట్లు నైతిక స్వతంత్ర ప్రతిపత్తిని నమ్మారు. సోక్రటీస్ వాదించిన రీతిలో వివేచన ద్వారా నైతిక విలువలు నిర్థారిస్తారనీ, దైవేచ్ఛకంటే హేతువే మూలంగా ఉంటుందనీ భావించారు. దేవుడు నిర్ధారించినందువలన మంచి రాలేదనీ, మంచివాటిని దేవుడు అదేశించాడనీ, వారు వాదించారు. గోల్డ్ జిహర్ ఈ వాదనలో దైవ పరిమితుల్ని చూపినట్లు రాశాడు. (పై పుస్తకం. పుటః91)
ముతాజిలైట్లు ఖురాన్ ను నిశితంగా పరిశీలించటంలో హేతువాదం ఉన్నది. ప్రవక్త తన శత్రువులపై ముఖ్యంగా అబూలహాబ్ వంటివారిపై శాపనార్థాలు పెట్టిన చరణాలను వారు సందేహించారు. ఖురాన్ నిత్యం కాదనీ, సృష్టించినదనీ ముతాజిలైట్లు నమ్మారు. మోజెస్ నుద్దేశించి దేవుడు పలికిన మాటలు ఎలా నిత్యాలని వారడిగారు. సనాతన ముతాజిలైట్ భావాలు చావు దెబ్బ తీశాయి. (అర్చరీ, రీజన్ అండ్ రెవలేషన్, పుటః 24) ముతాజిలైట్లు ఖురాన్ లోని శైలి సందేహించారు. అందులో అద్భుతం లేదన్నారు. ఖురాన్ కంటె ఉన్నత పద్దతిలో శైలిలో అరేబియన్లు రాసి ఉండేవారనీ, దేవుడు స్వేచ్ఛ ఇచ్చి ఉంటే అలా జరిగేదనీ వారన్నారు. (సేల్, పుటః 53, లండన్ 1896, ఖురాన్ అనువాదం)
హడిత్ అధికారికతను కూడా ముతాజిలైట్లు ప్రశ్నించారు. వాటిలో పేర్కొన్న అనేక నమ్మకాలను వారు ఎదిరించారు. వస్తువులకూ, విగ్రహాలకూ జీవం అరోపించే వాదాన్ని వారంగీకరించలేదు. దేవుడిని తెలుసుకోవడానికి ఆధారం హేతువేనని ముతాజిలైట్లు చెప్పారు.
మిహ్న క్రీ.త. 827
అబ్బాసిద్ ఖలీఫా అల్ మామున్ కొరాన్ ను సృష్టించినట్లు అధికార పూర్వకంగా ప్రకటించి ముతాజిలైట్లు చేసే వాదనలు ప్రచారంలోకి తెచ్చాడు. అధికారులంతా ప్రతి రాష్ట్రంలో ఈ విషయం బహిరంగంగా చాటాలన్నాడు. బాగ్దాద్ లోని ప్రధాన మతాధికారులను ఖలీఫా పరీక్షించాడు. చట్ట విషయాలలో బాగ్దాద్ గవర్నర్ మత న్యాయమూర్తులను ప్రమాణం చేయించగా వారి సాక్షులను ప్రమాణం చేయించవలసి ఉంటుంది.
ఖురాన్ సృష్టించారనే సిద్దాంతాన్ని అహమద్ హన్ బాల్ నిరాకరించగా అతడిని రెండేళ్ళపాటు జైలులో పెట్టారు. అతడి ప్రజాదరణ దృష్ట్యా తిరుగుబాటు వస్తుందనే దృష్టితో జైలునుండి వదిలేశారు. అల్ మామున్ సోదరుడు, వారసుడు, అల్ ముతాసిం అంత పట్టుదలగా మిహ్న సిద్ధాంతాన్ని అమలుపరచలేదు. అతని కుమారుడు అల్ వాతిక్ మాత్రం ఆ విధానాన్ని పాటించాడు. అధికార సిద్ధాంతాన్ని నిరాకరించిన ఒక మతవాదిని అల్ వాతిక్ స్వయంగా తల నరికేశాడు. ఖలీఫా అంత సఫలం కాకపోగా తన కార్యక్రమాన్ని నిర్వర్తించటానికి వృత్తి నైపుణ్యుల సహాయాన్ని కోరాడు. అనేకమంది ప్రముఖులు జైల్లో చనిపోగా మరికొందరు చిత్రహింసలకు గురయ్యారు. అల్ ముతావకిల్ (847-861 రాజ్యపాలన) మిహ్న పాటించటం ఆపేసి ఖురాన్ సృష్టివాదాన్ని నిషేధించాడు. మిహ్న సిద్ధాంతం ముతాజిలైట్లకు చాలా దెబ్బకొట్టింది.
ముతాజిలైట్ల అసహనం
ముతాజిలైట్ల అసహనాన్ని తొలుత చూపినవాడు గోల్డ్ జిహార్. ముతాజిలైట్లు సఫలమైతే ఇస్లాం పరిణామవాదం స్పష్టపడేదని కొందరు పండితులు ఊహించటం సరైనదికాదన్నాడు. ముతాజిలైట్లు తమ సిద్ధాంతాన్ని కాదన్నవారిని చంపటానికి సిద్ధపడ్డారు. తమ పిడివాదం పైచేయి కానిచోట్ల జిహాద్ కూడా కోరారని గోల్డ్ జిహర్ రాశాడు. ముగ్గురు ఖలీఫాలకు పరిమితమైన అధికార పోషకత్వం సిద్ధాంతం ఒకవిధంగా ఇస్లాంకు అదృష్టమని గోల్డ్ జిహర్ భావించాడు. అధికారం, రాజ్యపెత్తనం ఎక్కువ కాలం కొనసాగితే ముతాజిలైట్లు ఎలా ప్రవర్తించేవారో అనూహ్యమన్నాడు. (ఇన్ట్రడక్షన్ టు ఇస్లామిక్ థియాలజీ అండ్ లా, పుట 102)
మత సిద్ధాంతంలో వివేచనకు ముతాజిలైట్లు ఇచ్చిన స్థానాన్ని తరువాత వచ్చిన మతవాదులు అనుసరించి ఉంటే, గోల్డ్ జిహర్ భావించినట్లుగాక, భిన్న ధోరణిలోనే ఇస్లాం సాగి ఉండేది. నాస్తిక వాదం, మానవ వివేచన అనేవి దైవవాక్యానికి మించిపోయినప్పుడు భయానకంగా పరిణమిస్తాయని జిబ్ అన్నాడు. ఐతే అతడు కూడా ఇలా రాశాడు.
ముతాజిలైట్ల హేతువాదం సాగిపోతే ఇస్లాంకు ఉపయోగంగా ఉండేది. కాని, ఎక్కడ ఆపాలో తెలియనందున అది ఓడిపోయింది. జయప్రదమైనట్లయితే సనాతన చట్ర పరిధిలో ఇస్లాం పునరుజ్జీవం బహుశ సహించి ఉండేవారేమో. ఐతే, ఎప్పుడో ఒకప్పుడు ఇస్లాం సంస్కృతిలో వచ్చిన ఐక్యత తీవ్రంగా విచ్ఛిన్నమై శత్రువుల చేతిలో ఇస్లాం దెబ్బతినేదే (ఇస్లాం, హెచ్.ఎ.ఆర్.గిబ్, ఆక్స్ ఫర్డ్, 1953, పుటః 80)
క్రాస్, గేబ్రియేలీ వంటి ఆధునిక పండితులు రాస్తూ, ఇబ్న అల్ రవాండి హేతువాద ధోరణి యూరోప్ వికాసయుగానికి పోలినదనీ, ముతాజిలైట్ల స్థితిని తార్కికంగా పెంపొందించిన ఫలితమనీ రాశారు. వివేచన తమ మతంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించేటట్లు చేయటమే ఇందుకు కారణమని అన్నారు. (గేబ్రియేలీ ఎఫ్. La Zandaqa Au her siecle Abbeside in C.Cahenet al, Lalaboration De L’Islam, పారిస్ : 1961, పుటః 34)
ఇస్లాంకు కావలసింది 18వ శతాబ్దం నాటి హేతువాదం, ఆధునిక అరబ్బు తత్వవేత్తలు ఇస్లాంలో వికాసాన్ని ప్రవేశపెట్టాలని తలపెట్టారు. ఫాహి జకారియా వంటివారు ముతాజిలైట్లను ఆప్యాయంగా పేర్కొన్నారు. వారి వాదనలను పోగొట్టుకున్నామని భావించారు. హేతువాద విజయాన్ని ఏ కారణాలుగా గిబ్ వద్దన్నాడో అదే కారణాలతో నేను వాటిని ఆహ్వానిస్తున్నాను.
ముతాజిలైట్ల ఓటమి
ముతాజిలైట్ల హేతువాదం ఓడిపోగానే, హేతువును నిరాకరించి కేవలం హేతురహిత విధానాన్ని అవలంబించారనుకోటం పొరపాటు. ముతాజిల్ వాదానికి చావుదెబ్బ కొట్టిన అల్ అషారీ (935 మరణం) హేతువాదాన్ని ప్రధానంగా అనుసరించాడనీ వెన్ సింక్ అభిప్రాయపడ్డాడు. దైవం వెల్లడించేవాటిని హేతువు ద్వారా సమర్థించవచ్చన్నాడు. దీనినిబట్టి హేతువుకు తక్కువ స్థానం ఇచ్చారు. అల్ అషారీ బోధించిన తీరులో మళ్ళీ కొరాన్, సున్నాలవైపుకు మరలిపోవాలనీ, వాటిని ప్రశ్నించకుండా అనుసరించాలనీ అన్నాడు. పవిత్ర గ్రంథాలను ఉపమానాలతో వివరించటం హేతువాదుల జుగుప్సాకర చర్యగా పేర్కొన్నాడు. అల్ అషారీ విజయంపట్ల తీవ్ర పరిణామాలు చూచిన గోల్డ్ జిహర్ ఇలా రాశాడు. ముతాజిలైట్లు సాధించిన వాటిని అల్ అషారీ చాలావరకు పోగొట్టాడని చెప్పవచ్చు. అతడి కారణంగా మేజిక్, భూతవైద్యం, రుషుల అద్భుతాలు మొదలైనవన్నీఅలాగే నిలబడిపోయాయి. ముతాజిలైట్లు వాటిని అలాగే అట్టిపెట్టారు. (ఇన్ట్రడక్షన్ టు ఇస్లామిక్ థియాలజీ అండ్ లా, పుటః 106)
అల్ అషారీని అనుసరించినవారు చాలా సందర్భాలలో ముతాజిలైట్ల పంథాలో పయనించారు. సంప్రదాయ ఆధారాలపై ఉన్న జ్ఞానం నమ్మదగింది కాదనీ, హేతుబద్ధ ఆధారమే కచ్చితమైన జ్ఞానాన్ని ఇస్తుందనీ అషారైట్ వాదులు భావించారు. వీరిని అటు ముతాజిలైట్లు, ఇటు సంప్రదాయ వాదులూ నిరశించారు. సంప్రదాయవాదులు మతజ్ఞానంలో పాండిత్యానికి చోటు ఇవ్వదలుచుకోలేదు. అలా ఇస్తే అరిస్టాటిల్ తత్వానికి దారితీసి నమ్మకంలేకుండా పోతుందని అనుకున్నారు. ఇస్లాంలో చివరకు సంప్రదాయవాదమే స్థిరపడి వివేచనకు అనుకూలం కాకుండా పోయింది. మత ఆవగాహనకు సంప్రదాయవాదం వివేచనను పొందలేదు. ఖురాన్, సున్న మత సత్యాలను ప్రశ్నించకుండా సందేహించకుండా ఆమోదించాలన్నారు. దీనివలన కరడుగట్టిన మితవాదం వచ్చి ఉలేమాలు 20వ శతాబ్దం మధ్యలో అబుహసన్ అషారీ అనుసరించిన విధానం వలన అలోచనా రంగంలో స్చేచ్ఛలేకుండా పోయింది. మహమ్మదీయ పాండిత్యవాదంలోని ఈ మొండి ధోరణులు నేటివరకూ కొనసాగుతూ వచ్చాయి. (లిటరరీ హిస్టరీ ఆఫ్ అరబ్స్, పుటః 284)
మేన్స్ లేదా మాని (క్రీ.త. 216-276), మానవవాదం
క్రీ.త. 216లో దక్షిణ బాబిలోనియాలో మాని పుట్టాడు. అతడు పార్థియ రాజకుంటుంబానికి చెందిన పర్షియన్ అని భావించారు. క్రీ.త. 240 ప్రాంతాలలో బోధన ప్రారంభించినా జొరాస్ట్రియన్ పురోహితులు మానీని వ్యతిరేకించి బలవంతంగా ఇండియా పంపించారు. రెండేళ్ళ తరువాత తిరిగివచ్చి మళ్ళీ బోధన ప్రారంభించాడు. ఒకటవ షాపుర్ అతనిని ఆహ్వానించాడు. మనీ అతడికోసం ఒక పుస్తకం రాశాడు. రాజపోషణ 30 ఏళ్ళు కొనసాగింది. చివరకు జొరాస్ట్రియన్ పురోహితులు అతడిని ఖండించి సజీవదహనం చేశారు.
మానీ విధానంలో ప్రధానాంశాలన్నీ పర్ష్యా సంప్రదాయాల నుండి వచ్చినవే. మంచి చెడులను ఒకే మూలాధారం నుండి రాబట్టలేమని అతడు ద్వంద్వ వాదాన్ని ప్రతిపాదించాడు. (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఫిలాసఫీ) దేవుడికీ, పదార్ధానికీ, వెలుగు నీడలకూ, సత్యం-దోషాలకూ మధ్య పోరాటం ఉన్నది. మానవుడితో సహా ప్రపంచం యావత్తూ మంచిచెడ్డల మిళితమే. ఈ రెండింటినీ విడదీసి చూపే పని మతం చేస్తుంది. అలాంటి వేర్పాటు నిమిత్తమే శాఖాహారవాదంతోపాటు తీవ్ర సన్యసత్వాలను బట్టి తారతమ్యాలను అనుసరించారు. ఎంపికైనవారు తమ కృషిని పట్టుదలతో సాగించి పరలోక పుణ్యాలకోసం పాట్లు పడ్డారు. (మేన్స్ ఇన్ కన్ సైజ్ ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్, ఆక్స్ ఫర్డ్, 1980)
క్రైస్తవ బౌద్ధ, జొరాస్ట్రియన్ ఆధారాల నుండి మానీ తన పద్ధతులను రాబట్టాడు. మనీవాదం త్వరగా వ్యాపించి కొంతకాలంపాటు క్రైస్తవానికి పోటీగా నిలచింది. ఉత్తర ఆఫ్రికాలో కొన్నాళ్ళు సెయింట్ అగస్టిన్ ఈ వాదాన్ని అనుసరించాడు.
జిందిక్కులు, జందక-ద్వంద్వ వాదం నుండి నాస్తికత్వానికి
ఇస్లాంలో జిందిక్ అనే పదం ద్వంద్వ వాద సిద్ధాంతాలను రహస్యంగా తొలుత అన్వయించిన వారిని ఉద్దేశించారు. ఇది ఇరానియన్ మతాల నుండి రాబట్టినది. పైగా ఇస్లాంను పాటిస్తూ మానిక్ వాదులవంటివారు ద్వంద్వ విధానాన్ని అనుసరించారు. కనుక జిందిక్కులు దోషులే. ఉత్తరోత్తరా ఈ పదాన్ని సనాతన వ్యతిరేక భావాలకూ సాంఘిక వ్యవస్థను గందరగోళ పరిచే వారికీ అన్వయించారు. రాను రాను స్వచ్ఛాపరులనూ, నాస్తికులనూ, పదార్థవాదులనూ జిందిక్కులన్నారు. గోల్డజిహర్ ఈ స్థితిని చక్కగా వివరించారు. ప్రాచీన పర్ష్యన్ కుటుంబాలు ఇస్లాంలో చేరిన తరువాత, షుబూయత్ ల వలె పర్ష్యన్ మతభావాలనూ సంప్రదాయాలను తిరగదోడి జాతీయ ఆసక్తులను చూపారు. ఆమేరకు మహమ్మదీయ విధానంలోని అరేబియా పద్ధతులను ఈసడించారు. మరొకవైపున స్వేచ్ఛాపరులు ఇస్లాం పిడివాదాన్ని వ్యతిరేకించి నైతిక చట్టాన్ని మాత్రమే గుర్తించారు. వీరిలో సన్యాసత్వ ధోరణులు పెంపొందాయి. ఇస్లాంకు అవి కొత్తర, బౌద్ధ ప్రభావం వీరిలో కనిపించింది. (నికల్ సన్, లిటరరీ హిస్టరీ ఆఫ్ ది అరబ్స్, పుటః 372-73)
జాద్ ఇబనా దిరహం (742లో ఉరితీత)
దోషభావాల పేరిట జాద్ ఇబనదిరహంను 742 లేదా 43లో ఉమాయద్ ఖలీఫా ఇషాం ఉత్తరువుల ప్రకారం ఉరితీశారు. జాద్ ద్వంద్వవాది అనటానికి సూచనలేమీ లేవు. ముతాజిలైట్ల భావాలకు అనుగుణంగా కొరాన్ సృష్టినీ స్వేచ్ఛాధోరణిని అనుసరించినందువలన ఉరితీసి ఉండవచ్చు. దేవుడు మోజెస్తో మాట్లాడలేదని అబ్రహాంను తన స్నేహితుడుగా గుర్తించలేదని జాద్ భావించాడు. అతడు పదార్థవాది. మహమ్మద్ ప్రవక్త అబద్ధాలాడాడని అతని అనుచరులు నిందించారు.
ఇబన అల్ ముఖఫా (760లో ఉరితీత)
అబ్బాసిద్ ఖలీఫా అలామన్ సూర్ (754-775లో పాలన) రాజ్యంలో జిందిక్కులను ఉరితీశారు. వారిలో ప్రముఖుడు ఇబన్ అల్ ముతాఫా, ముఖాఫా, రచనలో వాడిన భాషపట్ల ఖలీఫా తీవ్ర అసంతృప్తిని ప్రకటించి మన్ సూర్ మాకు సహితం అడిగినా క్షమాభిక్ష పెట్టలేదు. ఇబన్ అల్ ముఖాఫాను చేతులూ, కాళ్ళూ నరికి మంటల్లో తగలేశారు. అతడి భావాలు అతడిని ఖండించటానికి కారణమయ్యాయి.
ముస్లిం వ్యతిరేక ధోరణిలో హేతువాద ఛాయలున్న పుస్తకం ఇబన్ అల్ ముఖాఫా రచన అని గేబ్రేలీ క్రాస్ వంటివారు పేర్కొన్నారు. ముఖాఫా హేతువాద సంప్రదాయానికి మేధావి వారసుడని క్రాస్ అన్నాడు. ఈ సంప్రదాయాలు ససానిక్ రాజు కోస్ రోస్ అనూషర్వన్ కాలంలో బాగా విలసిల్లాయి. ఇబన్ అల్ ముఖాఫా ప్రవక్తనూ, ఇస్లాంనూ, వారి మత భావాలనూ, దైవ భావాన్నీ విమర్శించాడు. మానికా ద్వంద్వ వాదాన్నీ, ముఖాఫా హేతుబద్ధ సందేహవాదాన్నీ పొందుపరచటం ఎలా....... ముఖాఫా వంటి మేధావులు మానికా గాథలకు అలంకార ప్రాయమైన భాష్యం చెప్పారనీ, మర్మవాదంతో విశ్వాన్నీ, మానవుడి స్థానాన్నీ వ్యాఖ్యానించారనీ గేబ్రియేల్ రాశాడు. (ఎఫ్ గేబ్రేలీ, పై పుస్తకం, పుట. 23-38) ముఖాఫా మధ్యకాలపు పర్ష్యన్ సాహిత్యాన్ని అరబిక్ లోకి అనువదించాడు. కలీలా, దిమ్నవంటి పుస్తకాలు అతడు అనువదించాడు. సంస్కృత కథలు కూడా ఇందులో కనిపిస్తాయి. చక్కని శైలికి దీనిని ఉదాహరణగా చూపిస్తారు.
శిక్షలకు సుప్రసిద్ధుడు
మన్ సూర్ వారసులు అల్ మహదీ (775-785) అల్ హదీ (785-786) తీవ్రస్థాయిలో శిక్షలూ, ఉరితీతలూ అమలుపరిచారు. ప్రత్యేక న్యాయమూర్తులను నియమించి సాహి అల్ జనాదిక ఆధ్వర్యాన విచారణ జరిపించారు. వదంతుల ఆధారంగానే తక్షణ చర్యలు తీసుకునేవారు. జిందిక్కులను మూకుమ్మడిగా బంధించి, పాలకుల ఎదుట ప్రవేశపెట్టి వారి నమ్మకాలను ప్రశ్నించేవారు. అప్పుడు విరుద్ధ మత భావాలు వదులుకుంటే వారిని విముక్తుల్ని చేసేవారు. లేకుంటే తలలు నరికి వేలాడగట్టేవారు. కొందరిని శిలువ వేశారు. అల్ హది కొందరిని గొంతు నులిమి చంపించాడు. వారి రచనలు కత్తులతో కోయించాడు.
అబునువాస్ (పుట్టుక 762 చనిపోవుట 806-814 మధ్య) అందమైన అబ్బాయిలనూ, ద్రాక్షసారాయినీ వ్యసనంగా స్వీకరించాడు. ఒకనాడు తాగి మసీదులో ప్రవేశించగా అక్కడ ఉన్న ఇమాం సుర 109, 1వ చరణం చదివాడు. నమ్మకం లేని వారలారా అప్పుడు అబూనువాస్ నేనిక్కడ ఉన్నాను అని అరిచారు. అతన్ని భక్తులు పట్టుకెళ్ళి రక్షణాధికారి ఎదుట ఉంచారు. తనకు నమ్మకాలు లేవని అబూనువాస్ ఒప్పుకున్నారు. న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్ళారు. కవిని జిందిక్ అనటానికి న్యాయమూర్తి ఒప్పుకోలేదు. కాని జనం పట్టుబట్టగా పరిస్థితిని విషమించకుండా చూసేందుకు న్యాయమూర్తి ద్వంద్వవాదుల ప్రవక్త చిత్రాన్ని తెప్పించి దానిపై ఉమ్మమని అబూనువాస్ ను కోరాడు. అప్పుడు మాని చిత్రంపై అబూనువాస్ ఉమ్మటమే గాక, గొంతులో పొడిచినట్లు చేశాడు. అతన్ని వదిలేశారు. మరొకసారి జిందక నేరానికి అటునువాస్ ను జైల్లో పెట్టారు. ప్రవక్త కుటుంబం హోషిమైట్లకు చెందినది. వారిలో కూడా చాలామందిని వారి భేదభావాలకు ఉరితీయటం జరిగింది. (Vadja Jeorges, Les Zindiqs dn pays d’Islam an debut, de la periode abbaside Rivista degli studi orientali, పుట 184, 1938, 27వ సంపుటి)
అబన అబి అవజా (Awja) (772లో ఉరితీత)
జిందిక్కులలో అబి అరజా ఆసక్తికరమైన వ్యక్తి, వెలుగు మంచినీ, చీకటి చెడునూ సృష్టించాయని నమ్మాడు. ఇచ్ఛకు స్వేచ్ఛ ఉన్నదని బోధించాడు. చనిపోబోయేముందు తాము నాలుగువేల సంప్రదాయాలను (హడిత్) సృష్టించినట్లూ అందులో ముస్లింలకు పరస్పర విరుద్ధ అంగీకారాలూ, వ్యతిరేకతలూ సూచించినట్లు ఒప్పుకున్నాడు. ఉపద్రవాలూ, కరువు కాటకాలూ ఎలా వచ్చాయనీ, దేవుడు మంచి వాడైతే వాటిని ఎందుకు సృష్టించాడనీ అడిగాడు. ఇబన అవజా దైవ న్యాయాన్నీ ప్రశ్నించటంతో సాధారణ ప్రజల నమ్మకాలు సడలిపోయాయనీ అల్ బెరూనీ రాశాడు. ఇమాం జఫర్ అల్ సాదిక్ తో ఇబన అబి అవజా చర్చలు జరిపాడు. అందులో అతడి సనాతన విరుద్ధ భావాలు వెల్లడయ్యాయి. సృష్టికర్తను నిరాకరించాడు. ప్రపంచం శాశ్వతమన్నాడు. యాత్రలు దేవుడు ఉద్దేశించినట్లు అతడు అంగీకరించక, దాన్ని ఎలా సమర్థిస్తావని జఫర్ ను అడిగాడు. ఖురాన్ లో శిక్షలను కొన్నిటిని సందేహించాడు. అబ్రహాం జోసఫ్ ల వంటి ప్రవక్తలు, ఖురాన్ లో అబద్ధాలు చెప్పారని అన్నాడు. ఖురాన్ ను అద్వితీయమైనదిగా అతడు అంగీకరించలేదు. జిందకీల నమ్మకాలకు ఈ విషయాలన్నీ అద్దం పడుతున్నాయి. అవజాను జెయిల్లో పెట్టి 772లో చంపేశారు. (వాజ్య, పేజి. 173-229)
పషార్ ఇబన బర్ట్ (714/715 - ఉరితీత 784/785)
బషార్ బర్ట్ పర్ష్యా ఉన్నత కుటుంబానికి చెందినకవి. అతని తండ్రి బానిస, బషార్ ను జిందక్ ఆరోపణపై పట్టుకొని కొట్టి, చిత్తడి బురదలో పడేశారు. బషార్ ప్రాచీన ఇరాన్ దివ్యస్మృతులను అవకాశం దొరికినప్పుడల్లా శ్లాఘించాడు. అతనికి అరబ్బులపై సదభిప్రాయం లేదు. పుట్టుగుడ్డిగా వికారంగా ఉన్న బషార్ కవిగా, వ్యంగ్య రచయితగా పేరు మోశాడు.
తరచు బషార్ తన అభిప్రాయాలను దాచిపెట్టినందున అతడి మతదృష్టి కచ్చితంగా చెప్పటం కష్టం. వాడ్జ బషార్ ను కామిలియా ప్రాంతానికి చెందిన షియాగా పేర్కొన్నాడు. ప్రార్థనలకు పిలుపు ఇచ్చినప్పుడు బషార్ తాగి ఎగతాళిగా మాట్లాడుతుండేవాడు.
యాత్రా విధానాన్ని ఏ మాత్రం గౌరవించలేదని బషార్ పై ఆరోపణ ఉన్నది. ఒక సందర్భంలో యాత్రకు బయలుదేరి జొరారవద్ద ఆగి తాగుతూ కాలం గడిపాడు. యాత్రికులతో తిరిగివచ్చి తాను కూడా యాత్ర పూర్తిచేసినట్లు నటించాడు.
ఖురాన్ లోని అద్భుతాలను బషార్ దృష్టిలో పెట్టుకోపోవటం ఒక నేరంగా పరిగణించారు. కొరాన్ సంపూర్ణతను ఎవరూ అందుకోలేరని సనాతనులు భావించేవారు. గోల్డ్ జిహర్ జిందకీల దృష్టిని ఇలా వివరించాడు.
బస్రా వద్ద ముస్లింలూ, ముస్లిమేతరులూ కొందరు చేరి బషార్ కవితలను ఆస్వాదించారు. ఖురాన్ లో చరణాల కంటే నీ కవిత బాగున్నదని బషార్ ను పొగిడేవారు. బాగ్దాద్ లో ఒక నర్తకి తన కవితను పాడగా అల్ హషర్ కంటె బషార్ కవితలు బాగా ఉన్నాయనీ అతనే స్వయంగా వ్యఖ్యానించాడు. ఖురాన్ లో ఉపమానాలను విమర్శిస్తూ అనేక చరణాలను బాగాలేవని చెప్పి పొడిచాడు. (ముస్లిం స్టడీస్, 2వ సంపుటి పుటః 363-64)
మళ్ళీ జన్మించటమనేది, తుదితీర్పు అనేది ఉండబోదనీ బషార్ తన కవితలలో రాశాడు. ఆత్మల పునర్జన్మ నమ్మినట్లు అతని కవితలు చెపుతున్నాయి. బషార్ అగ్నితో జనించిన దయ్యాలను సమర్ధించినట్లు కవితలు చూపుతున్నాయి. మరొకచోట దేవుడిని ఎదుర్కోవటంలో తనతో చేతులు కలపమని ప్రవక్త మహమ్మదును కోరాడు. అతడి నమ్మకాలలో జొరాష్ట్రియన్ వాదంతో కూడిన మానికస్ ధోరణులు కనిపిస్తాయి.
బషార్ కవితలలో సందేహవాదం, విధిదృష్టి కలసి పోయాయని నిరాశావాదం, ఆనందమయ జీవితం కోరుకున్నాడనీ, బ్లాషర్ రాశాడు. (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం, నూతన ప్రచురణ)
సనాతనులకు కేవలం పైపై గౌరవం చూపేవాడు.
సాలి అబ్ద అల్ ఖుద్దూస్ (783లో ఉరితీత)
మానిక్ వాదిగా సాలీని 783లో ఉరితీశారు. నికల్ సన్ దృష్టిలో సాలీ ఊహలతో ఆలోచనలు చేసిన వ్యక్తి, తాత్విక ధోరణిని ముస్లింలు అపనమ్మకంగా పొరబడినందున అతను బాధలకు లోనయ్యాడు. (నికల్ సన్, లిటరరీ హిస్టరీ ఆఫ్ ది అరబ్స్, పుటః374)
హమ్మాద్ అజరద్ (చంపేశారు)
బస్రో స్వేచ్ఛాపరులలో హమ్మద్ అజరద్ ఒకడు. బషార్ సాలీ, రఖుద్దూస్, ఇబన్ సినాన్, ఇబన్ నజీర్ వంటివారు. అక్కడ తరచు కలుసుకుంటుండేవారు. ఖురాన్ కంటె కొన్నిచోట్ల తన కవితలే బాగున్నాయని అమ్మాద్ అన్నట్లు ఆరోపించారు. అతడిని ద్వంద్వ వాది అని నిందించారు. జిందకీలు అతడి కవితల్ని తమ ప్రార్థనలలో చేర్చినట్లు చెపుతారు. మానికన్ల దృష్టిలో మంచి గౌరవం సంపాదించుకున్న హమ్మాద్ చివరకు బస్రా గవర్నరుచే చంపేయబడ్డాడు.
అబన్ అబ్ద్ అల్ హుమాయద్ లాహిక్ అల్ రకాసి
బస్రాలో మరొక స్వేచ్ఛాపరుడుగా పేర్కొన్న అబన్, అబూనువాన్ వ్యంగ్య రచనలలో హేతువాదిగా, ద్వంద్వవాదిగా ప్రస్తావనకు వచ్చాడు.
ఒకనాడు అబన్ తో కూర్చొని ఉండగా తొలి ప్రార్థనకు స్పష్టంగా పిలుపు వచ్చింది.
కళ్ళతో చూచింది తప్ప మరిదేనినీ నమ్మను అని అబన్ అన్నాడు. నేను దేవుణ్ణి స్తుతించగా అబన్ మానెస్ ను స్తుతించాడు. దేవుడు స్వయంభువు ఐతే, అతడిని ఎవరు సృష్టించారు అని అడిగాడు. అతని ముందు నోరుమూసుకోవలసి వచ్చింది. (డి. ఎస్. మార్గోలియత్, ఎన్.సైక్లోపీడియా ఆఫ్ రెలిజియన్ అండ్ ఎథిక్స్, మహమ్మదీయ నాస్తిక వాదం)
ఆబునువాస్ వ్యంగ్యాన్నిబట్టి అబన్ మతాభిప్రాయాలు తెలుసుకోటం కష్టం. అబన్ తన కవితలలో పర్ష్యన్ హిందూ గ్రంథాల ప్రస్తావన చేశాడు.
బస్రాలో స్వేచ్ఛాపరులు
మనం పరిశీలించే ఆధారాలలో కొన్ని పేర్లు ప్రస్తావనకు వస్తున్నా వారిని గురించిన వివరాలూ, వారి అభిప్రాయాలూ, రచనలూ, ఏమీ తెలియడంలేదు. కాయస్ జుబాయర్ నాస్తికుడన్నారు. మళ్ళీ బ్రతికిరావడం అల్ బాకిలీ నిరాకరించాడన్నారు. ఇబ్రహీం సయ్యబా జిందిక్ అన్నారు.
మూతీ ఇయాస్ జిందిక్ అని తెలుస్తున్నది. మతంలో ఆసక్తిలేని సందేహవాదిగా అతడి జీవిత విశేషాలు తెలుపుతున్నవి.
ఉమాయద్దుల హయాంలో ఖలీఫా వాలిద్ యాజిద్ కు అనుచరుడుగా ఉన్న మూతి ఇయాస్ హాస్యంతో ఎవరినీ లెక్కపెట్టకుండా స్నేహ పాత్రుడుగా జీవనం గడిపాడు. మతంలో అతనిపట్ల సందేహాలున్నాయి. అబ్బాసిద్దులు రాజ్యానికి వచ్చినప్పుడు ఖలీఫా మన్ సూర్ కు అనుచరుడుగా ఉన్నాడు. జిందిక్కుల స్నేహంతో వ్యభిచార జీవనం గడిపినట్లు అతన్ని గురించి కథలున్నాయి. అతని కవితలలో ప్రేమ, మధుపానం గురించి ఆహ్లాదంగా చెప్పిన విశేషాలున్నాయి. (నికల్ సన్ లిటరరీ హిస్టరీ ఆఫ్ ది అరబ్స్, పుటః 291)
అబు అతాహియ
అబూ అతాహియా అరెస్ట్ తప్పించుకోటానికి అద్దాలు అమ్ముకునే వాడుగా నగర జనం మధ్య బ్రతికాడు. ఇతడి భావాలేమిటో ఎందుకు ఇతడిని ప్రశ్నించదలిచారో తెలియదు. సమకాలీనులు జిందక అని దూషించేవారు. రహస్యంగా మానికస్ భావాలున్నాయేమో తెలియదుగాని సనాతన ముస్లింలను నొప్పించే విషయాలు అతని కవితల్లో కానరావు. బుద్ధుని ప్రస్తావనలు అతని కవితల్లో ఉన్నట్లు గోల్డ్ జిహర్ చూపాడు.
జ్ఞానం సహజంగా ఆలోచనా పూర్వకంగా, పరిశోధనతో ఆగమ విధానాలతో, దైవ ప్రేరణతో నిమిత్తం లేకుండా వచ్చినట్లు ఇతడు భావించాడు.
నికల్ సన్ దృష్టిలో అతాహియా తాత్వికదృష్టి అతడికి వ్యతిరేకంగా పరిణమించిందన్నారు. భక్తులు అతనిలో నాస్తికత్వాన్ని చూచారని నికల్ సన్ అంటాడు. (అదే పుస్తకం, పుటః 298)
ఆబూ ఇసా మహమ్మద్ హరున్ వారన్
అల్ వారక్ ను జిందక అని నిందించారు. అతడు అల్ రవాండికి గురువు. వారక్ రచనలు లభించలేదు. అరబ్బు పండితులు మాత్రం అతని రచనల నుండి కొన్ని ఉదాహరణలు చూపారు. కొందరు అతని వాదనలను ఖండించారు. ముతాజిలైట్ మతవాదిగా అరంభించిన అల్ వారక్ స్వతంత్ర అభిప్రాయాలు ఏర్పరచుకొన్నందున వెలివేయబడ్డారు.
అతడు మతాల చరిత్ర రాసి నిస్పాక్షికతను, హేతువాదాన్నీ, సందేహవాదాన్నీ కనబరిచాడు. క్రైస్తవంలో 3 శాఖలనూ నిశిత పరిశీలన చేశాడు. దైవ ప్రేరణపై ఆధారపడవలసిన ప్రసక్తిలేదన్నాడు. హేతువాద ధోరణులు కనబరిచాడు.
అల్ వారక్ షియా ధోరణులున్నాయి. అతడు మానికన్ అనటం సందేహాస్పదం. ప్రపంచం శాశ్వతమని స్పష్టంగా నమ్మడు. అతడు స్వతంత్ర ఆలోచనాపరుడనీ, సందేహవాది అనీ మానిగ్నాస్ సరిగా అంచనా వేశాడు. అబ్బాసిద్దుల హింసకు గురై 909లో అల్ వారక్ ప్రవాసంలో ఉంటు అహ్వజ్ లో చనిపోయాడు.
ఆబు తమ్మామ్ (846లో మరణం)
అబు తమ్మామ్ 796లో గానీ, 804లో గానీ డమాస్కస్ దగ్గర జన్మించాడు. అతడు కవి, సంకలనకర్త, అల్ ముతాసిమ్ అనే ఖలీఫా కొలువులో కనిగా ఉన్నాడు. అతడు తన ప్రాంతీయ పోషకులను సందర్శించినట్లు మార్గోలియత్ రాశాడు (పై పుస్తకం, మహమ్మదీయ నాస్తికవాదం) ఇబన్ రద్జా వద్ద ఉండగా ముస్లిం మతాచారాలను పాటించలేదనీ, ఎందుకని అని అడగగా వాటి ప్రయోజనాన్ని ప్రశంసించాడనీ, అదే అతన్ని ఉరితీయటానికి దారితీసిందని అంటారు. అతడి కవితలలో మాత్రం మత సందేహాలు కనిపించవు.
అల్ ముతానబ్బీ (915-965)
అరబ్బీలో అల్ ముతానబ్బీ గొప్పకవి అంటారు. ఖుఫాలో పుట్టాడు. డమాస్కస్ లో చదివాడు. కవితలో అబూ తమ్మామ్ ను అనుసరించాడు. కనిగా పేరుతెచ్చుకోటానికి ప్రయత్నించాడు. అబూ ఫదల్ వలన ప్రభావితుడై మత, తాత్వికాభివృద్ధి చెందాడని బ్లాషర్ రాశాడు. అబూ ఫదల్ అగ్నేయవాది. అల్ ముతానబ్బీ మత పిడివాదాలను నిరాకరించి అవి అణచివేత సాధనాలుగా పేర్కొన్నాడు. నిరాశతత్వాన్ని అవలంబించాడు. ప్రపంచంలో మూర్ఖత్వం, దోషాలు పై చేయిగా ఉన్నాయనీ, విపరీత ఆకర్షణలు కొనసాగుతున్నాయనీ, అవి మరణంతోనే పోతాయనీ అన్నాడు. (ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాంలో అల్ ముతాజనబ్బీ పై వ్యాసం)
తనకు రావలసిన కీర్తి రాలేదని భావించిన అల్ ముతానబ్బీ హింసాధోరణులనవలంబించాడు. విప్లవ ప్రచారం మొదలెట్టి రాజకీయ మత తిరుగుబాటు నడిపాడు. కొత్త కొరాన్ తో తానొక కొత్త ప్రవక్తనన్నాడు. (ముతానబ్బీ అంటే ప్రవక్తగా నటించాడనీ అరబిక్ లో అర్థం) అతడిని పట్టి బంధించి హిమ్స్ లో రెండేళ్ళపాటు జెయిల్లో పెట్టారు. ప్రవక్తననీ, కొత్త కొరాన్ ఉన్నదనీ చెప్పినా చంపకపోవటం అతడి అదృష్టం. విడుదల అయిన తరువాత అలెప్పో వద్ద సయూఫ్ అల్ దౌలా కొలువులో ముతానబ్బీ రాజాదరణ పొందాడు. స్తోత్రపాఠకుడుగా అతడి కవితలు అరబ్ సాహిత్యంలో మణిపూసలని పొగిడారు.
సయీఫ్ అల్ దౌలాతో కలహించి అలెప్పోనుండి ఈజిప్టుకు వెళ్ళి ఇదిద్ పాలకుడు కపూర్ ఆదరణ పొందాడు. అతడితో కూడా కలహించి పారిపోయి బాగ్దాద్ వస్తుండగా బందిపోట్లు అతన్ని చంపారు.
అల్ ముతానబ్బీ స్తుతి కవితలు సయూఫ్ అల్ దౌలాను గురించి కొన్ని సందర్భాలలో అల్ప పోషకులను గురించి ఉన్నాయి. కొన్ని కవితలు ఉన్నతంగా, మరికొన్ని పదాడంబరంతో ఉన్నప్పటికీ సందేహవాదం సర్వత్రా కనిపిస్తుంది. ప్రపంచంలో అజ్ఞానం, మూర్ఖత్వం, మూఢనమ్మకం పట్ల నిరాశ వ్యక్తం చేస్తూ మరణం ఒక్కటే వీటినుండి విమోచన కలిగిస్తుందన్నాడు. కానీ మార్గోలియత్ ఉద్దేశంలో అల్ ముతానబ్బీ కవితలు ప్రవక్తకూ, దైవ ప్రేరిత మతానికీ అగౌరవాన్ని ఆపాదిస్తున్నట్లు ముస్లింల దృష్టి పడిందని అంటాడు. (మహమ్మదీయ నాస్తికత్వం వ్యాసంలో) తన పోషకుడు అలిద్ తో ముతానబ్బీ చెప్పిన వాక్యం ముస్లింల దృష్టిలో తీవ్రమైనది. ప్రవక్త మహమ్మద్ నీ తండ్రి అనీ, అదే గొప్ప అద్భుతమనీ అన్నాడట. యుద్ధరంగంలో లాజరస్ తలనరికివేస్తే అతడికి మళ్ళీ బ్రతుకునివ్వటం జీసస్ కు సాధ్యం కాదని మరొకరితో అన్నాడు. ఎర్రసముద్రం అతడిచేతిని పోలినదైతే మోజెస్ దాన్ని దాటేవాడే కాదన్నాడు. ఇవన్నీ ముస్లింలను నొప్పించాయి.
అబూహయ్యాస్ అల్ తాహిది (1023లో మరణం)
ఇస్లాం లో అల్ రవాండి, అల్ మారి, అల్ తాహిది అనే ముగ్గురు జిందకీలని సాహిత్య సంప్రదాయాలు తెలుపుతున్నాయి. అల్ తాహిదీ రచనలు మిగిలినవారి వాటికంటే చాలా ప్రమాదకరమైనవని మార్గోలియత్ రాశాడు. మిగిలినవారు నమ్మకంలేని ధోరణి ప్రస్తావించినా తాహిదీ అదే విషయాలను విరుచక పడేటట్లు చెప్పాడు. కాని అతడి రచనలు పరిశీలిస్తే అలా కనిపించడంలేదు. కిలాబ్ అల్ ఇత్మలో అతని నిరాశావాదం అల్ ముతానబ్బీని జ్ఞప్తికి తెస్తుంది. కాని సనాతన వ్యతిరేకత పైకి కనిపించటంలేదు. గ్రీకుతత్వంలో, విజ్ఞానంలో తాహిదీ చూపిన ఆసక్తి సనాతనులకు అతడిపట్ల అనుమానాన్ని కలిగించాయి.
ఇబన్ అల్ రవాండి (820-830)
ముతాజిలైట్ గా ప్రారంభించిన అల్ రవాండీని భిన్న పోకడలు పోయినందుకు బహిష్కరించారు. ముతాజిలైట్లపై తీవ్రంగా దాడి ప్రారంభించాడు. అల్ ఖయాత్ తన రచనలను ఖండించాడు. అల్ రవాండి తన మాజీ సహచరుడిపై రాసిన పుస్తకాన్ని ఫదీహత్ అల్ ముతాజిలా అంటారు. నిషిద్ధమైన, ప్రమాదకరమైన విషయాలను ప్రస్తావించడానికి అల్ రవాండి ఏ మాత్రం వెనుకాడలేదు. అతడిని జిందక్ అని ముద్ర వేయటంలో ఆశ్చర్యం లేదు. ద్వంద్వ వాదులనూ స్వేచ్ఛాపరులనూ అలాగే అన్నారు. ముతాజిలైట్ల నిందకు గురైన రవాండి ప్రభుత్వహింసకు గురై బాగ్దాద్ వదిలివెళ్ళాడు. తన మాజీ స్నేహితులపై విమర్శలు చేస్తూ వారిలోని అసంబద్ధతలను చూపి వారి సూత్రాలనుండే మత వ్యతిరేక భావాలను రాబట్టాడు.
అల్ రవాండీ అరిస్టాటిల్ ధోరణులను చూపినందువలన ముతాజిలైట్లు అతడిని ఖండించి బహిష్కరించారు. శూన్యం నుండి సృష్టివాదాన్ని సృష్టికర్తను కాదన్న తత్వమే అందులో ఉన్నది. ప్రపంచం శాశ్వతమని అల్ రవాండీ రాసిన పుస్తకం లభించలేదు. తాత్వికులూ, పండితులూ, అల్ రవాండీ భావాలను సేకరించి మద్దతునిచ్చాడు. అల్ హైతమ్ అలాంటివారిలో ఒకడు.
ద్వంద్వ వాదాన్ని అల్ రవాండీ నిస్సందేహంగా తన రచనలో పేర్కొన్నాడు. తరువాత షియా మితవాదంవైపు మొగ్గాడు. చివరకు ముస్లింలతో సంబంధాలు తెంచుకొని నిస్తికుడయ్యాడు.
అల్ రవాండి ప్రవక్తనూ, ఖురాన్ నూ, హడిత్ నూ దైవ ప్రేరణనూ, షరియానూ తన రచనలలో ఎదిరించాడని ముతాజిలైట్లు ఆరోపించారు. ముతాజిలైట్ల సూత్రాలను ఆధారంగానే తార్కిక నిర్ణయాలు రాబట్టాడని నైబర్ చూపాడు. కీతాబ్ అల్ దామిగ్, కితాబ్ అల్ ఫరీద్, కితాబ్ అల్ జుమూరుద్ అనేవి అల్ రవాండీ రచనలు. (గేబ్రియేలీ, పై పుస్తకం, పుటః 34)
కితాబ్ అల్ జుమురుద్ లో చేసిన రచనలను బట్టి అతడిని ప్రమాదకారిగా ఎందుకు భావించారో గమనించవచ్చు. సాధారణంగా ప్రవక్త విధానాన్నీ, ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్తనూ అతడు తీవ్రస్థాయిలో విమర్శించాడు. దైవ ప్రేరణకంటే వివేచన ఉన్నతమైనదన్నాడు. ప్రవక్తల మాటలు హేతుబద్ధంగా ఉంటే, ప్రవక్తల అవసరం లేదనీ, మానవులకు అలాంటి వివేచన సాధారణంగా ఉంటుందనీ అన్నాడు. హేతుబద్ధం కాని ప్రవక్తల్ని నిరాకరించాలన్నారు. అన్ని మతాల పిడివాదనలు హేతువుకు విరుద్దం గనుక వాటిని విడనాడాలని అల్ రవాండీ చెప్పాడు. ప్రవక్తల అద్భుతాలన్నీ మంత్రగాళ్ళ చర్యలవంటివేననీ, కేవలం అవి అల్లినవేననీ అల్ రవాండీ భావించాడు. (జీసస్ మంత్రగాడమి మార్టన్ వైట్ అలాగే సిద్ధాంతీకరించాడు) ఖురాన్ అద్భుతం కాదనీ, అనుకరించలేనంత గొప్పది కాదనీ, సాహిత్యపరంగా స్వల్పమైనదనీ, అందులో స్పష్టతలేదనీ, అవగాహన లేదనీ, ఆచరణయుక్తమైన విలువ అసలే లేదనీ, దైవం వెల్లడించిన గ్రంథం కాదనీ రవాండీ రాశాడు. (ఇబన్ అల్ రవాండీ, పై వ్యాసం, ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఇస్లాం, నూతన ప్రచురణ)
అల్ రవాండీ అన్ని మతక్రతువులనూ వృధా అంటాడు. ప్రవక్తల ద్వారా పొందిన జ్ఞానాన్ని సహజంగా మానవదృష్ట్యా వివరించవచ్చునంటాడు. దైవ ఉనికి గురించి, అతడి చర్యల హేతుబద్ధతల గురించీ అల్ రవాండీ పూర్తిగా నిరాకరించాడు.
అల్ రవాండీ ప్రపంచం శాశ్వతమన్నాడు. ఏకేశ్వరవాదన కంటే ద్వంద్వవాదం అధికం అన్నాడు.
అల్ మారి తమ రచన రిసాలతుల్ గుఫ్రాన్ లో అల్ రవాండీని ప్రస్తావించాడు. (నికల్ సన్, జర్నల్ ఆఫ్ ది రాయల్ ఏషియాటిక్ సొసైటీ, 1900, 1902) అల్ రవాండీ కవిత పట్ల అల్ మారి దిగ్భ్రమ వ్యక్తం చేశాడు.
అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య
No comments:
Post a Comment