పాశ్చాత్య ప్రపంచంలో ఇస్లాం-concluding- నేను ముస్లింగా ఉండలేకపోతున్నాను ఎందుకని ?


ఇబన్ వారక్
17వ అధ్యాయం

ష్డీ ఉదంతం తరువాత యూరోప్ లో కొట్లాటలూ, ప్రదర్శనలూ, పుస్తకాల దహన కాండనూ ఛాందస ముస్లింలు సాగించారు. యూరోప్ వాసులు తమ మధ్య సెక్యులర్ విలువలను పాటించని వారినీ, వాటిని వ్యతిరేకించే వారినీ చూచి ఆశ్చర్యపోయారు. 1989 నుండి ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్లు భిన్నదృష్టిని అవలంబించారు. ముస్లింలు ఈ దేశాలలో తమ ఆచారాలు పాటించడానికి సెక్యులర్ చట్టాలను ఎదిరించడానికీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ముస్లింలు ఒక బ్రిటీషు పౌరుణ్ణి చంపగోరుతున్నారు. బ్రిటీషు పోలీసు అలాంటివారిని అరెస్ట్ చేయడానికి, రష్డీని చంపడానికి రెచ్చగొడుతున్న వారిని ఆపడానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎవరైనా హత్యను ప్రోత్సహిస్తే తక్షణమే అరెస్ట్ చేస్తామని ఫ్రాన్స్ ప్రధానమంత్రి మైకెల్ రొనార్డ్ అన్నారు. బ్రిటన్  ఈ విషయంలో గట్టి నిర్ణయం తీసుకోలేదు. లండన్ లోని ముస్లిం సంస్థకు చెందిన డా. సిద్ధిఖీ బ్రిటీషు చట్టాలను వ్యతిరేకించవలసి వస్తే, ఇస్లాం చట్టాన్ని పాటించవలసివస్తే, అలాగే చేయాలని ముస్లింలకు బాహాటంగా బోధించాడు. ఫ్రాన్స్ లో ఒక టర్కిష్ ఇమామ్  ఫ్రెంచి చట్టాలకంటే షరియాకే ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పుడు 48 గంటల్లో అతన్ని పంపించివేశారు. ఆడపిల్లల సున్తీ విషయంలో కూడా ఇలాంటి విభిన్న దృక్పథాలు కనిపిస్తున్నాయి. 1992 జూలై 7న బ్రిటీషు దినపత్రిక ఇండిపెండెంట్లో  ఒక వ్యాసంలో ఇలా రాశాడు. బ్రిటన్ లో ఆఫ్రికా, 3వ ప్రపంచ సమాజాలకు చెందిన ఆడపిల్లలు సున్తీ విషయమై స్థానిక అధికారులు పట్టనట్లు ఉన్నారనీ, జాతి విద్వేషం అనే ముద్రపడుతుందని భయపడ్డారని పేర్కొన్నారు. సామాజిక ఆరోగ్యసేవా సంఘాలు కూడా సున్తీని నిరోధించడానికీ, ఆ విషయమై పై అధికారులకు తెలుపటానికి పూనుకోలేదు. సంస్కృతిలో ఏది చట్టబద్ధం... దేనిని గౌరవించాలి... మానవ హక్కుల దుర్వినియోగం ఏది అనేది కూడా గందరగోళంగా ఉన్నది. 1991 మార్చిలో ఫ్రాన్స్ లో ముగ్గురు మాలియన్ వాసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టబడ్డారు. హర్మటాకైటాపై అభియోగం మోపుతూ 15 సం.ల బాలికలకు సున్తీ చేశారని పేర్కొన్నారు. సోరీ, సెమిత్ కోలిబాలి అనే ఇరువురు ఆడపిల్లల తల్లిదండ్రులుగా సున్తీ నేరాన్ని తప్పించుకోటానికి ప్రయత్నించారన్నారు. అమాండ్ పత్రికలో నివేదికను 1991 మార్చి 24న గార్డియన్ వీక్లీ పునర్ముద్రించింది. కేథరిన్ స్విలాఫ్ అనే న్యాయవాది వాదిస్తూ సున్తీ ఆచారం వెనుక ఉన్న ఉద్దేశాన్ని సందేహించనక్కరలేదన్నారు. అయితే ఈ ఆచారాన్ని ఖండించకపోతే ఆమోదించినట్లవుతుందని కూడా అభిప్రాయపడ్డాడు.
    ప్రాసిక్యూటర్ వ్యాఖ్యానిస్తూ సున్తీని క్షమిస్తే ఫ్రాన్స్ లో చాలామంది ఆడపిల్లలు చట్టరక్షణకు గురికాకుండా పోయే అవకాశముందన్నారు. ఆర్మటాకైటాకు 5 ఏళ్ళ శిక్ష విధించారు. కోలిబేలకు కూడా ఇలాంటి శిక్షలే వేశారు. దీనివలన సాంస్కృతిక సాపేక్షతావాదం, బహుళ సాంస్కృతికవాదం, చట్టంముందు సమానత్వం, ఫ్రెంచి బ్రిటీషు సమాజాలలో గూడుకట్టుకుంటున్న మత సాంస్కృతిక ధోరణులు, సొంతనియమాలు పాటించే పద్ధతులు కనిపిస్తున్నాయి. మనకు ఎలాంటి సమాజం కావాలి ? ఎలాంటి దాన్ని సృష్టించుకోవాలి.. విధ్వంసక ఆటవిక వాదంపైకి పోవాలా, లేక మానవాళి అందరికీ చెందిన విలువలు కావాలా ? మెర్విన్ హిస్కట్ రచనలు సెక్యులర్ విలువలకు ప్రాధాన్యతనిచ్చేవారంతా. పాశ్చాత్య రాజకీయవాదులంతా చదవాలి. (సమ్ టు మక్కా టరస్ట్ టు ప్రే. ఇస్లామిక్ వాల్యూస్ అండ్ ది మోడరన్ వరల్డ్, లండన్, 1993) ఆర్థర్ స్లైసింగర్ కూడా అటవీకరణ, ముక్కలుగా చీలిపోవడం వంటి ప్రమాదాలు హెచ్చరించాడు. (డిజ్ యునైటింగ్ ఆఫ్ అమెరికా, రిఫ్లెక్షన్స్ ఆన్ ఎ మల్టీ కల్చరల్ సొసైటీ, న్యూయార్క్, 1992).
బ్రిటన్లో ముస్లింలు-వారికేం కావాలి.
    బ్రిటన్లో 15 లక్షలమంది ముస్లిలున్నారు. అందులో అధిక సంఖ్యాకులు భారత ఉపఖండం నుంచి వచ్చారు. చాలామంది తమ ఆర్థికస్థితిని మెరుగుపరచడానికి కోరివచ్చినవారే. గత 15 ఏళ్ళుగా తాము బ్రిటీషు సమాజంలో లీనం కాదలుచుకోనట్లు వ్యక్తపరుస్తూ వచ్చారు. తమకు ప్రత్యేక హక్కులూ, అవకాశాలివ్వాలంటున్నారు. డా. జకీబదానీ లండన్ లో ఇస్లాం సాంస్కృతిక కేంద్ర మాజీ డైరెక్టర్ (సమ్ టు మక్కా లరన్డ్ టు మక్కా టు ప్రే, సెయింట్  ఆల్బన్స్ 1993, పుటః 235)
      మతాన్ని మార్చే పద్ధతులున్న ఒక మతం స్థిరంగా ఉండజాలదు. అది పెరుగుతుంది. లేదా తరుగుతుంది. బ్రిటన్లో ఇస్లాం విస్తృత పడదలిచింది. ఇస్లాంది విశ్వమతం, నేల నాలుగు చరగులా సందేశాన్ని అందించాలని వారి ఉద్దేశం. ఒకనాడు మానవజాతి యావత్తూ ఒకే ముస్లిం సమాజంగా ఉండాలి.
    ఇంగ్లండులోని బ్రాడ్ ఫోర్డ్ లో ముస్లింల నాయకుడు ఇమామ్ అల్లా తప్ప మిగిలిన దేవుళ్ళను నిరాకరించి, క్రైస్తవుల త్రిమూర్తి సూత్రాన్ని తప్పుడు విధానంగా పేర్కొన్నాడు. ఇస్లాం వస్తేనే చీలిపోయిన, రుగ్మతలతో ఉన్న బ్రిటన్ బాగుపడుతుందన్నాడు. ఇస్లాం జీవన విధానంలో సంపూర్ణస్మృతి అందించేదనీ, అది గృహానికీ, వ్యక్తిగత సంబంధాలకూ పరిమితం కారాదనీ అన్నాడు. సెక్యులర్ రాజ్యంగా కాక ఇస్లాం పద్ధతులకనుగుణంగా ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నాడు. ప్రతి ముస్లిం ఇస్లాం ప్రభావాన్ని ప్రపంచంలో వ్యాపింపజేయాలన్నాడు. ఒక వైపున క్రైస్తవాన్ని అవమానించటానికి తమకు స్వేచ్ఛ ఉన్నదనుకొంటున్న  ముస్లింలు ఇస్లాంను విమర్శిస్తే రెచ్చిపోయి హింసకు దిగుతున్నారు. ఇస్లాంను ముస్లిమేతరులు కూడా ముస్లింలవలె దైవప్రేరణగా ఆమోదించాలంటున్నారు. విద్యపట్ల సెక్యులర్ ధోరణి  అవలంబించటం కూడా బ్రిటన్ లో ఇస్లామిక్ అకాడమీ, ఇస్లామిక్ కల్చరల్  సెంటర్ నిరశిస్తున్నాయి.  తమ విలువలు అట్టిపెట్టాలని బ్రిటిషు చట్టాలను ధిక్కరించటానికైనా సంసిద్ధమేనని ముస్లింలంటున్నారు. హిస్కెట్ ఇదే విషయాన్ని రాశాడు. (పై పుస్తకం, పుట. 238-39)
ముస్లిం కోర్కెల పరిణామం
      బ్రిటిష్ సమాజంపై బహుశ సాంస్కృతిక ఉదారవాదం దాడి చేసి నైతికంగా, సామాజిక రీతుల్ని దెబ్బతీసే ప్రమాదమున్నది. బ్రిటన్ లో జంతు వధశాలలన్నీ చట్టరూపేణా అదుపులో ఉన్నాయి. పేటర్ సింగర్ యూనిమల్ లిబరేషన్ లో ఇలా రాశాడు.
      మత క్రతువు ప్రకారం జంతువుని చంపకముందు స్తంభింపచేయనక్కరలేదని అంటున్నారు. యూదు, ముస్లిం ఆహార నియమాలనుబట్టి ఆరోగ్యకరంగా తిరుగుతూ ఉండే జంతువులనే చంపాలిగానీ అనారోగ్యమైన వాటిని కాదు. జంతువుల్ని స్తంభింపజేస్తే వాటి గొంతు తెగ్గగ్గొట్టకముందు  దెబ్బతిన్నట్లుగా భావించి మతాలవారు అంగీకరించలేదు. జబ్బుచేసిన జంతువులను తినకుండా ఉండాలని చట్టాలు చేశారు. చంపకముందు జంతువు చేతనావస్థను తొలగించాలని సనాతనమతం చెబుతున్నది. యూదులు ఇలాంటి చట్టాలు చేసినప్పుడు ఆనాటికి అదే ఉత్తమమై  ఉంటుంది. నేడది ఉదార పరిస్థితి కాదు.
    ముస్లిం వ్యతిరేకత చూపటం అనే ప్రస్తావన ఇందులో లేదు.
    జంతువులపట్ల దయామయంగా ఉంటున్నామా అనేది చూచుకోవాలి. తమ మత నియమాలకు విరుద్ధంగా జంతువులను చంపినప్పుడు ఆ మాంసం తిందామనుకునేవారు. తినకుండా ఉండవచ్చు.
    నైతిక కారణాలుగా బ్రిటిషు శాసనాలు వచ్చాయి. జంతువుల్ని ఇంకేవిధంగా చంపటం అవినీతికరంగా ఉంటున్నాయి. వాటికి మినహాయింపు లివ్వటం ముస్లింలూ, యూదులూ కోరినట్లు ఒప్పుకోవటం లోగడ అవినీతికరమైనవాటిని  మళ్ళీ తెచ్చిపెట్టటమే. మత గౌరవం కోసం అవినీతిని ఆమోదిస్తామా... జంతువులపట్ల మతపరంగా క్రూరత్వాన్ని సరైనదే అంటామా....
      రష్డీ వ్యవహారంలోనూ ప్రమాణాలు ద్వంద్వంగా కనిపించాయి. పాశ్చాత్య లోకంలో ముస్లిం స్త్రీలపట్ల ఈ వైఖరి చూడవచ్చు. మత మౌఢ్యవ్యాధులు తమకు ముప్పు తెచ్చిపెడతారనే దృష్టితో ముస్లిం స్త్రీలు కొందరు సంఘాలు స్థాపించుకున్నారు. ఒక సంఘస్థాపకురాలు హనానా సిద్ధికీ ఇలా రాశారు. స్త్రీలను ముందే ఏర్పాటు చేసిన పెళ్ళిళ్ళకొప్పుకోమని అంటున్నారు. గృహవసతి, చదువూ నిరాకరిస్తున్నారు. బహుళ సంస్కృతికవాదులు జోక్యం చేసుకొని స్త్రీలకు అండగా నిలవటంలేదు. మతం, సంస్కృతి పేరిట ఇదంతా సహించాలంటున్నారు. జాతి వ్యతిరేకవాదులు ఇలాంటి పద్ధతులను అనుమతిస్తున్నారు. (న్యూ స్టేట్స్ మన్ అండ్ ది సొసైటీ, మే 1, 1992, పుటః19).
    బహుళ సంస్కృతివాదులు నిశిత పరిశీలన చేయలేకపోతున్నారు. జాతివాదులకంటే మించిపోయి వీరే జాతి పక్షపాతం చూపిస్తున్నారు. నల్లవారిపై నల్లవారూ, ముస్లింలపై ముస్లింలూ, హింసలు జరిపితే వీరు పట్టనట్టున్నారు. ముస్లిం యువతులు ఏర్పాటు చేసిన పెళ్ళిళ్ళు తప్పించుకోవటానికి ఇళ్ళనుండి వెళ్ళిపోతే, వెంటాడి మళ్ళీ ఇళ్ళకు తెచ్చి అప్పగిస్తున్నారు. ఫలితాలు కొన్నిసార్లు విషాదాంతమవుతున్నాయి. యువతి హత్యకు గురికావటం, ఆత్మహత్య చేసుకోవటం  కుటుంబంలో పురుషులు ఆమెను తీవ్రంగా శిక్షించటం జరుగుతున్నది. పోలీసులు, సంఘసేవకులూ పట్టించుకోటంలేదు. కనుక స్త్రీ సంఘాలు అవసరమయ్యాయి. బ్రిటిషు స్త్రీలకు బ్రిటిషు చట్టాలనుండి రక్షణ లేకపోవటం దారుణం.
      డా. ఖలీల్ సిద్ధిఖీ గ్రేట్ బ్రిటన్ లో ముస్లిం పార్లమెంటు స్థాపకసభ్యుడు, లండన్ లో ముస్లిం సంస్థ డైరెక్టరు, బ్రిటన్ లో ఆసక్తులను కాపాడటం, నిర్వచించటం, పెంపొందించటం వీరి లక్ష్యం. ఇస్లాంపై అనేక గ్రంథాలూ, వ్యాసాలూ డా. సిద్ధిఖీ రాశారు. అయోతుల్లా ఖొమేనీ గొప్పవాడనీ, ఇస్లాం విశ్వవ్యాప్తంగా  ఆధిపత్యం వహించాలనీ, సాయుధ పోరాటం అవసరమనీ, ఇస్లాం లోకంలో జొరబడిన పాశ్చాత్య నాగరికత, తాత్విక ప్రభావాలూ, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక రీతులు తొలగించాలనీ ఈ రచనల సారాంశం.
      ప్రజాస్వామ్యం, విజ్ఞానం, తత్వం, జాతీయవాదం, స్వేచ్ఛలపై ఈ రచనలలో ద్వేషం విప్పారుతున్నది. ఇస్లాం సెక్యులర్ రీతులతో, పాశ్చాత్య ధోరణులతో పొందికగా ఉండగలవారన్న వారి పట్ల జుగుప్స కనబరిచారు. (హిస్కట్, పుటః1969) ఇరాన్ ను ఉదార  ప్రజాస్వామిక జాతీయ రాజ్యంగా చూపారు. అందులో కొన్ని ఇస్లాం లక్షణాలను ఆకర్షణీయంగా ప్రదర్శించారు. పాశ్చాత్య విద్య వలన కొందరు రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, సైనిక పాలనా రీతులు అలవరచుకున్నారనీ, వాటిని నాశనం చేయాలనీ అన్నారు. అలాంటి మేధావులను వారి పూర్వౌన్నత్యాన్నీ తెలిపి ప్రాచ్య, పాశ్చాత్య అలవాట్లను పోగొట్టాలన్నారు. వందకోట్ల జనాభాగల ముస్లింలు  అపార సంపదతో ఉన్నారనీ, అన్ని శక్తులనూ వారు ఓడించగలరనీ అన్నారు.
      హిస్కెట్ ఇలా రాశారు. ఇస్లాంను పరిశీలించేటప్పుడు కొన్ని భావాలబలాన్ని గుర్తుంచుకోవాలి. మన తీరాలలో మన సంస్థలకు ప్రత్యామ్నాయంగా ఈ భావాలను చెపుతున్నప్పుడు ఒక ప్రశ్న రాకతప్పదు. పాశ్చాత్య, సెక్యులర్, బహుళార్థ సంస్థలు కావాలా ? ఇస్లాం మతజ్ఞానం కావాలా ? ఇస్లాం ప్రత్యామ్నాయాన్ని కోరేవారు ఏ మేరకు సాగిపోవచ్చు. ఉదార ప్రజాస్వామిక రాజకీయవాదులు అవసరమైన చర్యను ధైర్యంగా చేపట్టగలరా... లేదా క్రమేణా ముస్లిం పార్లమెంటుకూ, ముస్లిం ఆసక్తులకూ లొంగిపోతారా ? (హిస్కెట్, పుటః 273)
బహుళ సంస్కృతీవాదం
      ప్రవాసులుగా వచ్చిన వారి పిల్లలు బ్రిటీషు సంస్కృతిలో కలసిపోవటానికి విద్య తోడ్పడుతుందని. అనుకున్నారు కానీ ఎక్కడో లోపం జరిగింది. 1970 నుండి బహుళ సంస్కృతీవాదం, ద్వంద్వ భాషావాదం వచ్చాయి. ప్రవాసులను ఇంగ్లీషువారిగా మార్చటం సంకుచితమనీ సాంస్కృతిక సామ్రాజ్యవాదమనీ, సాంస్కృతిక హత్య అనీ, జాతివాదమనీ పేర్లుపెట్టారు.  అన్ని సంస్కృతులూ ఒకే విలువలు గలవనీ బహుళ సంస్కృతీవాదంలో దురభిప్రాయం ఉన్నది. విలువలు భిన్నంగా ఉంటే సమాన గౌరవం ఇవ్వాలన్నారు. సాపేక్షతావాదం నుండి పుట్టిన బహుళ సంస్కృతీవాదం వివిధ సంస్కృతులను విమర్శించ లేకపోతున్నది.
      అన్ని సంస్కృతులూ ఒకే విలువలు గలవికావు. అన్ని విలువలూ గౌరవించదగినవీ కావు. ఆచారాలూ, సాంస్కృతిక సంప్రదాయాలూ పవిత్రమైనవి కావు. విమర్శలతో అవి మారవచ్చు.  పాశ్చాత్య సెక్యులర్ విలువలు  రెండువందల ఏళ్ళ నుండే వచ్చాయి. మన సంస్కృతికి భిన్నంగా ఉన్న ఇతర సంస్కృతులను గౌరవించాలనటం నాగరిక ధోరణి. కాని, ఇతర  విలువలు మనం అభిలషించే విలువల్నిధ్వంసం చేస్తున్నప్పుడు, విమర్శతో, వివేచనతో, వాదనతో, చట్టంతో, మేథస్సుతో ఎదుర్కోటం సరైన పద్ధతి కాదా ? హిస్కెట్ ఇలా అన్నారు. మత నమ్మకాలను సహించవచ్చు. కాని రాజ్యంలో, విశాలమైన చట్టం, రాజ్యాంగాలకు విరుద్ధంగా మతాచారాలూ, సంస్థలూ ఉంటే వాటికి సమాన అర్హత ఇవ్వటం, స్వేచ్ఛను ఇవ్వటం పద్ధతి కాదు. ముస్లింలు ఇందుకు అంగీకరించటం లేదు. ప్రజాస్వామ్యంలో ముస్లింలకు, మతాన్ని పాటించే స్వేచ్ఛ ఉన్నది. కాని అతను ఆమోదించని వారిని
చంపేయమంటే ఎలా ?
      ప్రజారంగంలో ముస్లిం తన సాహిత్య సెన్సార్ షిప్పును విధిస్తున్నాడు. బ్రిటీషు పౌరురాలిగా ఉన్న తన కుమార్తెను అదుపులో పెట్టి, నిర్బంధ వివాహాలకు గురిచేస్తున్నాడు. దారుణంగా జంతువులను చంపుతున్నాడు. తన పిల్లలు వెళ్ళే బడిలో పరిణామ సిద్ధాంతం చెప్పరాదంటున్నాడు. మత ఉత్సవాలకనుగుణంగా విద్యాసంవత్సరాన్ని మలచమంటున్నాడు. (హిస్కెట్. పుటః 328)
రాజకీయవాదుల ద్రోహం
    హిస్కెట్ ఇలా రాశాడు. బ్రిటన్లో ప్రజాస్వామిక సెక్యులర్ ధోరణులకు విరుద్ధంగా                      ఇస్లాం వ్యాపిస్తున్నది. ముస్లిం ఓట్లకోసం, ముస్లిమేతర రాజకీయవాదులు  అవకాశవాదాన్ని అనుమతిస్తున్నారు. (హిస్కెట్, పుటః331) ఇందుకు ఆధారంగా బ్రిటీషు దినపత్రిక డెయిలీ టెలిగ్రాఫ్ లో 1990, డిసెంబరు 31న లేబర్ పార్టీ అభ్యర్థి రాసిన లేఖను ఉదహరించారు.
      ఒక జాతిగా మనం సనాతనవాదులమైన ఇస్లాంను సహించాం. ఈ విషయం డిసెంబరు 28 సంపాదకీయంలో సరిగా ఉదహరించారు. మన స్వేచ్ఛ సూత్రాలకు విరుద్ధంగా ఏ మతశాఖలకూ అవకాశాన్ని ఇవ్వరాదు. ఐనా ఇలా ఎందుకు చేశాం... ప్రభుత్వం, పార్లమెంటులో లేబర్ పార్టీ, దాని నాయకత్వం ఇందుకు కారణం, వ్యాపారం కోసం ప్రభుత్వం చేస్తే, ఎన్నికలకోసం, లేబర్ పార్టీ చేసింది.
    లేబర్ పార్టీ ప్రజాస్వామిక సూత్రాలకంటే ఓట్లకు ప్రాధాన్యత  ఇవ్వటం సిగ్గుచేటు.
      అనేక నియోజక వర్గాలలో ఇస్లాం మౌలిక వాదులు ఎన్నికల ఫలితాలను మలుపు తిప్పే స్థితిలో ఉన్నారు.
      ఎన్నికలలో విజయానికి గాను స్వేచ్ఛకు ద్వితీయస్థానం ఇచ్చి సాల్మన్ రష్డీ జీవితంకంటే ముస్లిం మౌలిక వాదులను వ్యతిరేకం చేసుకోకపోవటమే మంచిదని నిర్ణయించారు. అలాంటి నిర్ణయంతో ఓట్లకు మూలసూత్రాలను తాకట్టుపెట్టారు.
      లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే అమెరికాలో యూదు ఓట్ల పరిస్థితి వంటిదే ఇక్కడా తెచ్చిపెట్టారు.
      ఓటర్లలో కొద్దిమంది అభిలాషకు లొంగి  లేబర్ పార్టీ ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నది.
      ఎన్నికల విజయం కోసం సిగ్గు లేకుండా లేబర్ ఉద్యమాన్నిఇలా వమ్ము చేయటం అలాంటి పార్టీ కోసం 20 ఏళ్ళుగా నేను పనిచేయటం తలవంపులుగా ఉన్నది.
మైకెల్ నోల్స్
      మితవాద ప్రభత్వం వ్యాపార నిమిత్తం ప్రజాస్వామిక సూత్రాలకు ద్రోహం చేసింది. సౌదీ అరేబియాలో తమ ఆర్థిక ఆసక్తులు కాపాడుకోటానికి, బ్రిటీషు ఆయుధాలు అమ్ముకోటానికీ, సౌదీ అరేబియాలోని అప్రజాస్వామిక ఆచారాలను విమర్శించలేకపోయారు. సౌదీ అరేబియాను విమర్శించిన బిబిసి టెలివిజన్ కార్యక్రమాలను  నిషేధించారు. బ్రిటీషు క్రైస్తవులు సౌదీ అరేబియాలో  తమ మతాచారాల్ని దొంగచాటుగా పాటించాల్సినగతి పడితే బ్రిటీషు ప్రభుత్వం సహించింది.
      బ్రిటన్ లో ముస్లింలు ప్రార్థించుకోటానికి స్వేచ్ఛ ఉన్నది. సౌదీ అరేబియా డబ్బుతో లండన్ నడిబొడ్డున మసీదు నిర్మాణం జరిగితే పరిసరాల శిల్పసంపదను గమనించకుండా అనుమతించారు.
      ఫ్రాన్స్ కూడా వ్యాపార నిమిత్తం ఇరాన్ తో రాజీపడి ఇరాన్ హంతకులను శిక్షించలేదు. వారిని అప్పగించవలసిన చోట అప్పగించలేదు.
      పాశ్చాత్య ప్రభుత్వాలు కొన్ని ముస్లిం దేశాలను రాజకీయ వాస్తవాల దృష్ట్యా విమర్శించటం లేదు. కాని తమ ప్రజాస్వామ్య సూత్రాలను తమ దేశంలోనే ముస్లిం అల్పసంఖ్యాకులు వ్యతిరేకిస్తున్నప్పుడు. వారు కాపాడుకోవాలి.
చదువుకున్నవారి ద్రోహం
    ప్రవాసం వచ్చినవారి పిల్లలు సమాజంలో కలిసిపోవాలంటే వీలుకావటం లేదు. ఉపాధ్యాయులు తరగతిలో చెప్పేటప్పుడు జాతి, మత భేదాలను గుర్తు చేస్తూ సమాజంలో లీనం కావటానికి వీలులేని రీతిలో పిల్లల్ని వారి తల్లిదండ్రులనూ నడిపిస్తున్నారు. బ్రిటన్ లో మతం, రాజ్యం వేరు కాదు. అందరూ సమిష్టిగా పాఠశాలల్లో ప్రార్థిస్తారు. బహుళ సంస్కృతివాదం పేరిట ఇస్లాం తన ప్రచారం తరగతుల్లో ప్రవేశపెట్టింది. ఇంగ్లండు చర్చిని వ్యవస్థాపితం కాకుండా విద్యా విధానంలో గట్టి సమైక్య పునాదులు వేస్తేనే కలిసిపోవటం సాధ్యం.
      ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మతాలపట్ల మర్యాదపూర్వకమైన అజ్ఞేయవాదం చూపాలి.  ఏ మతంలోనూ భాగం పంచుకోరాదు. సమష్టి ప్రార్థనలు ఉండరాదు. క్రైస్తవ, ఇస్లాం తదితర మత విద్యలు చదువులో బోధించరాదు. బ్రిటీషు యూరోపు చరిత్రలు చెప్పాలి. యూదు, క్రైస్తవ సంస్కృతి, కెల్టిక్-ఆంగ్లో, శాక్సన్ క్రైస్తవ పరంపర చారిత్రకంగా పెంపొందిన రీతిని వివరించాలి. ఆధునిక, క్రైస్తవ అనంతర విధానాలు ఎలా వచ్చాయో విద్యార్థి అర్థం చేసుకోటానికి వీలుగా  చెప్పాలి.
    ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్లాంగానీ, మరే మతంగానీ సడలింపులు ఉండరాదు. కళ, సంగీతం, నాటకం పాఠశాలల్లో చెప్పాలి. అవన్నీ పాఠ్యాంశాలలో భాగాలని మినహాయింపులు ఉండవని అన్ని మతాల తల్లిదండ్రులకూ వివరించాలి.  (హిస్కెట్, పుటః 312)
మేథావుల ద్రోహం
    పాశ్చాత్య మేథావులు, పాశ్చాత్య సెక్యులర్ విలువలను ఎలా చూస్తున్నారో పరిశీలించాలి. తమను తాము నిందించుకోవటం ఇంగ్లీషువారి ప్రత్యేక దోషంగా కనిపిస్తున్నది. పాశ్చాత్య లోకంలోనూ ఈ ధోరణి ఉన్నది. అమెరికాలోని వామపక్షాల్లో  దేశభక్తిని ఎందుకు కనబరచవు ?  అని తాత్వికులు రిచర్డ్ రోర్టీ అడిగాడు. (న్యూయార్క్ టైమ్స్, ది ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్, 1994, ఫిబ్రవరి 15) అమెరికాలోని వామపక్షం వారు దేశభక్తిని చూపటంలేదు.
      రాజకీయాల్లో తేడాచూపే నెపంతో తామున్న దేశం గురించి పట్టించుకోటం లేదు. జాతీయదృష్టిపట్ల గర్వించటం, జాతితో తాదాత్మ్యం చెందటం సరైనది కాదంటున్నారు.
    సంప్రదాయ అమెరికా బహుళ వాదానికీ, కొత్తగా బయలుదేరిన బహుళ సంస్కృతీ వాదానికీ ఉన్న తేడానుబట్టి ఈ ధోరణి వచ్చింది.
    తాత్వికుడు జాన్ రాల్స్ రాస్తూ బహుళవాదమనేది సాంఘిక సంస్థల కూడలిగా ఏర్పడిందనీ, తేడాలను స్వీకరించే జాతిగా రూపొందినదనీ అన్నారు.
    బహుళ సంస్కృతీ వాదం ఈ సమాజాలను వేరుగా అట్టిపెడుతున్నాయి.
      పౌరసత్వానికి, జాతీయ ఐక్యత అందులో భాగం పంచుకోటం అవసరం. మన దేశంపట్ల మనం గర్విస్తూ, సాంస్కృతిక తేడాలను గౌరవిస్తాం. ఒక దేశం తనను గుర్తించి ఆనందిస్తూ, ఆలోచిస్తూ బ్రతుకు కొనసాగిస్తే తప్ప సంస్కరించుకోలేదు. మన దేశాన్ని చూచి సిగ్గుపడవచ్చు. ఐతే ఇది మన దేశమనీ, దానితో కలిసిపోయినప్పుడు మాత్రమే సిగ్గుపడటానికి, ఉద్వేగపూరితంగా స్పందించటానికీ వీలవుతుంది. పాశ్చాత్య ఉదార ప్రజాస్వామ్యం ఎన్ని లోపాలతో ఉన్నా, మనసును స్తంభింపజేసే పెత్తందారీ ఇస్లాం మత ధోరణికంటె అది మంచిదే. ప్రజాస్వామ్యాన్ని సమర్థించిన కార్లపాపర్ తమను తాము ద్వేషించుకునే పాశ్చాత్య మేధావులపట్ల విచారం వ్యక్తపరిచారు.
      ప్రజాస్వామ్యంలో తీవ్రమైన లోపాలున్నాయి. అవినీతి ఏ ప్రభుత్వంలోనైనా ఉండవచ్చు. చరిత్రలో పాశ్చాత్య ప్రజాస్వామ్యాలే సంపన్న సమాజాలు కాదని చదువుకున్న వారికి అర్థం అవుతుంది. ఇది ముఖ్యమైన విషయం. ఐతే, స్వేచ్ఛ, సహనం అణచివేతకు గురిచేయని సమాజాల దృష్ట్యానే ఇది ముఖ్యం. మన యువకులకు మన ప్రపంచం ఘోరమైనదనీ, పెట్టుబడిదారీ నరకంలో ఉంటున్నామనీ చెప్పి వారిని సంతోష రహితులుగా చేయటం తగదు. మనం నివసిస్తున్న లోకం అద్భుతమైనది, సుందరమైనది. అశ్చర్యకరంగా స్వేచ్ఛతో, బాహాటంగా ఉన్న సమాజం. దీనికి వ్యతిరేకంగా మాట్లాడటం కొందరు పాశ్చాత్య మేథావులకు నాజూకు అయింది. (కార్ల్ పాపర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్రిటికల్ డిస్ కషన్, ఫ్రీ ఎంక్వైరీ, రెండవ సంపుటి, సంచిక 1, బఫెలో, 1981- 1982).
      ప్రపంచంలో కూడా మన విలువలపట్ల సిద్ధమైన విశ్వాసం అవసరం. విదేశీ వ్యవహారాలను గురించి రాస్తూ జూడిత్ మిల్లర్ ఇలా అన్నాడు.
      మధ్య ప్రాచ్యంలో తీవ్రవాదంతో ఉన్న ఇస్లాం పాశ్చాత్యలోకాన్ని గురించి వ్యఖ్యానించవచ్చు. ఇస్లాం వాదులు వారిని ఎవరూ వ్యతిరేకించనప్పుడు అధికారంలోకి అమెరికావారు బహుళ వాదాన్నీ, సహనాన్నీ, భిన్నత్వాన్నీ ఆహ్వానిస్తున్నామని చెప్పటానికి సిగ్గుపడనక్కరలేదు. దేవుడు ఏ ఒక్కరి పక్షానో ఉన్నాడని అనక్కరలేదు. ఇస్లాం తీవ్రవాదులూ, పాశ్చాత్యలోకం పరస్పర విరుద్ధంగా ఉన్నందనవచ్చు. భిన్నత్వాన్ని ఉదారవాదులు సమానంగా గౌరవిస్తుండగా, ఇదొక బలహీనతగా ఇస్లాం వాదులు చూడవచ్చు.  ఉదారవాదం దీనిని ఎదుర్కోవాలని అనకపోవచ్చు. కాని నేడు తీవ్ర ఉదారవాదం కావాలి. జంకకుండా, క్షమాపణలు చెప్పకుండా సాగిపోయే తీవ్ర ఉదారవాదం పరస్పర విరుద్ధంగా కనిపించవచ్చు గాని అదే అవసరం  (ఫోరిన్ ఎఫైర్స్, స్ట్రింగ్, 1993, 72వ సంపుటి, 1వ సంచిక, పుటః43-56).
      పాశ్చాత్యలోకం ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా పట్టించుకోవాలి. తాత్కాలిక ప్రయోజనాల నిమిత్తం ఇంటా బయటా కూడా సూత్రాలతో రాజీపడే ధోరణి మానాలి. ఫాసిజం, జాతివాదం, పాశ్చాత్యలోకంలో తలెత్తాయంటే అందరికీ ప్రజాస్వామ్య ప్రీతి లేదనేది గుర్తుంచుకోవాలి. తుది పోరాటం ఇస్లాంకూ, పాశ్చాత్య లోకానికీ జరగాలనేదేమీ లేదు. స్వేచ్ఛకు విలువ ఇచ్చేవారికి, ఇవ్వనివారికీ, మధ్య ఈ పోరాటం సాగాలి.
      ఈ గ్రంథంలో కొన్ని ప్రత్యేక పదప్రయోగాలు ఉన్నవి. వాటికి అర్థం ఇలా ఉంటుంది.
     
   బిదా (BIDA)                   ముస్లింల ఆచారాలలో కొత్తవి
ధిమ్మి (DHIMMI)              ముస్లిమేతరులను ముస్లిం దేశాలలో రక్షించే తీరు,
చూపే సహనం, వారికి విధించే కొన్ని ప్రత్యేక పన్నులు.
   ఫత్వా                          చట్ట న్యాయవాది ఇచ్చే ఉత్తరువు
   హుదుద్                       ఖురాన్ ప్రకారం విధించే శిక్షల పరిమితులు
   హాదిద్                         ప్రవక్త ప్రవచనాలు, ఇస్లాం చట్టంలో ప్రధానమైనవి
   హాజ్                            త్ర (మక్కా)
   హిజ్రా                           మదీనా నుండి ప్రవక్త మక్కాకు పారిపోయిన విధానం
                                       622లో ముస్లిం కాలమానం ఆరంభం
   ఇబన్                          కుమారుడు
   ఇజ్మా                          ముస్లింలలో అంగీకారాభిప్రాయం
   జీహద్                         నమ్మకం లేనివారిపై ముస్లింల పోరాటం
   జిజియా                        థిమ్మీలపై విధించే పోల్ టాక్స్
   జిన్ (JINN)                     అగ్ని, వాయు, దేవతల సృష్టి
   ఖలీఫా                         ప్రవక్త అనంతర వారసులు
   కాబా                           మక్కామసీదు మధ్యగల నల్లరాయి
కాఫిర్                          ముస్లిమేతరుడు
ముల్లా                         ఉలేమా
ఖాది                           ఫిఖా న్యాయపాలకుడు
రమాదాన్                     రంజాన్
ఫిఖా                           ఇస్లాం చట్టం, ఖురాన్ ప్రవక్తమాటలు, ముస్లిం
                                అంగీకారాభిప్రాయాలు, ఉలేమానాల వివేచనా పద్ధతి
షియా                          ఖలీఫాగా చెప్పుకునే అలీ మద్దతుదారులు
సున్ని                          ముస్లింలలో అధిక సంఖ్యాకులు
ఉలేమా                        ముస్లిం పండితుడు
జినా                            వ్యభిచారం
జిందక్                         వ్యతిరేకి, ద్వంద్వవాది.
----
అనువాదం
నరిసెట్టి ఇన్నయ్య


No comments:

Post a Comment