వై. ఎస్. రాజశేఖర రెడ్డి
(1949- 2009)
మెడిసిన్ చదివినా సూది పట్టని డాక్టర్ రాజశేఖర రెడ్డి 1978లో ఎమ్.ఎల్.ఎ అయినప్పుడు నాకు పరిచయం అయ్యాడు. అప్పటి నుండి చాలా సన్నిహితులమయ్యాము. నేను అనేక సందర్భాలలో శాసన సభలో వేసే ప్రశ్నలు, కాల్ అటెన్షన్ నోటీసులు, షార్ట్ నోటీసు ప్రశ్నలు ఇస్తుండేవాడిని. అందులో ఆయనకు నచ్చినవి స్వీకరించి వాడేవారు. నేను ఆంధ్ర ప్రదేశ్ రాజకీయలపై తెలుగులోను ఇంగ్లీషులోనూ రాస్తూ ఉండగా ఆయనకు నా ఇంగ్లీషు మాత్రమే నచ్చేది.
మేమిరువురం కలిసి అనేకమంది మిత్రుల దగ్గరకు వెళ్ళడం, ముచ్చటించడం జరిగింది. ఒకటి రెండు సార్లు ఒక స్నేహితుడి దగ్గరకు వెళ్ళి విందు ఆరగిస్తేనో, బ్రేక్ ఫాస్ట్ చేస్తేనో తరవాత తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి ఒక మాట అడిగేవాడు మనం ఆ స్నేహితుడికి ఏమైనా ఉపయోగ పడగలమా... అడుగు అనేవారు. అలాంటివారిలో డి. శేషగిరిరావు, ఆలపాటి రవీంద్రనాథ్ వంటివారున్నారు. కానీ వారు ఏ సహాయమూ అక్కరలేదని కేవలం మిత్రులుగానే కలుసుకుంటున్నామని అనేవారు. రాజశేఖర రెడ్డి మిత్రత్వ స్వభావం చెప్పటానికి ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఆయన ఎన్నో సందర్భాలలో మా ఇంటికి రావడం, మాతోపాటు భోజనమో, అల్పాహారమో చేయడం మాకుటుంబానికి ఆనందంగా వుండేది. ముఖ్యంగా భవనం వెంకట్రాం విద్యామంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాంటి సందర్భాలు ఎన్ని వచ్చాయో నేను చెప్పలేను. అలాగే మేము రాజశేఖర రెడ్డి ఇంట్లో (జూబిలీహిల్స్ కు వెళ్ళేదారిలో) అనేక పర్యాయాలు కూర్చుని ముచ్చటించుకుని భోజనాలు చేశాము. ముఖ్యంగా భవనం వెంకట్రాం, కె.వి.పి రామచంద్రరావు, నేను ఒక బాచ్ గా ఉండేవాళ్ళం. ముందుగా ఒకటిరెండు పెగ్గుల విస్కీ స్వీకరించి, తరవాత భోజనం చేసేవాళ్ళం. అప్పట్లో కె.వి.పి. డ్రింక్స్ తీసుకునేవారు కాదు. సిగరెట్లు బాగా తాగేవారు. రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మి ఎంతో చక్కగా వంటలు చేసి, ఆప్యాయంగా వడ్డించేవారు. ఆమె చాలా సహృదయురాలు.
రాజశేఖర రెడ్డి ఇంట్లో నేను తొలుత ఆయన తండ్రి రాజారెడ్డిని కలుసుకున్నాను. ఆయన ఎన్నో విషయాలు, స్వానుభవాలు చెప్పారు. తాను బర్మా వెళ్లి వచ్చినట్లు, తరవాత క్రైస్తవుడుగా తనకుగల అనుభవాలు ఆసక్తిగా చెప్పేవారు. అప్పటి నుండి సూరి (సూర్యనారాయణ) అక్కడే ఉండేవాడు. ఒక కుటుంబంవలె మేమందరం అలా ఎన్నో ఏళ్ళు మెలిగాం. భవనం వెంకట్రాం ముఖ్యమంత్రి కాగానే నాకు పదవి ఏదైనా ఇవ్వమని, నాతో చెప్పకుండా రాజశేఖర రెడ్డి వత్తిడి చేశారు. ఆయన మాట మీద భవనం నన్ను పిలిచి ఏ పదవి కావాలో కోరుకోమన్నాడు. అది లేనందువలనే మనం మిత్రులుగా కొనసాగుతున్నామని నేను స్పష్టంగా మర్యాదగా చెప్పాను. మిత్రులకు ఎలాగైనా సహాయపడాలనే ధోరణి రాజశేఖర రెడ్డికి మొదటి నుండి ఉన్నది.
కాంగ్రెసు పార్టీలో తొలుత రెడ్డి కాంగ్రెసులో ఉన్న రాజశేఖర రెడ్డి ఆ తరువాత చెన్నారెడ్డికి వ్యతిరేకిగా, ఉత్తరోత్తరా విజయభాస్కర రెడ్డికి నిరసనకారుడుగా, జనార్దన రెడ్డిని ప్రతిఘటించిన వ్యక్తిగా వివిధ ఘట్టాలలో ఉన్నారు. కాంగ్రెసు పార్టీలో ఆయన కొన్నిసార్లు డిసిడెంట్ అనిపించుకున్నారు. ఎన్.టి.రామారావు తెలుగుదేశం పెట్టి ఎన్నికల ప్రచారం చేసి గెలిచి వచ్చిన తరవాత, ఆ ప్రభావపు ఉప్పెన ఎంత తీవ్రతరమైనదో రాజశేఖర రెడ్డి నాతో చెప్పారు. చివరకు తన జిల్లాలో పులివెందులలో సైతం ఒక సునామీ వలె ఆ వాతావరణం ఉన్నదని కష్టం మీద తట్టుకున్నామని చెప్పాడు. కేంద్రంలో రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి రాను రాను అతి కీలక దశలో రాజకీయ ప్రాధాన్యతలోకి వచ్చారు. వ్యవసాయ రంగానికి ఆయనిచ్చిన ప్రాధాన్యత అమెరికా అధ్యక్షుడు బుష్ ను కూడా ఆకర్షించింది.
ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడుగా రాజశేఖర రెడ్డి ఉండగా నేను అమెరికా నుండి అభినందనల లేఖ పంపగా వెంటనే సంతోషంగా సమాధానం ఇచ్చాడు. ముఖ్యమంత్రి అయిన తరవాత నేనాయనను తరచుగా కలుసుకోలేదు. ఎప్పుడైనా కొన్ని సంఘటనలలో నా ప్రస్థావన విలేఖరుల సమావేశంలో వచ్చినప్పుడు ‘’ఇన్నయ్య ఇండియాలో ఉన్నాడా?” అని అడిగేవాడు. నేను దూరంగా ఉంటూ రాజకీయాలు పట్టించుకోనందువలన అటువంటి స్థితి ఏర్పడింది. కానీ, రాజశేఖర రెడ్డి హఠాత్తుగా చనిపోవటం మాత్రం దారుణ సంఘటనగా భావించాను. అదే విషయాన్ని నేను హెలీకాప్టర్ ప్రమాదం నాడు టి.వి.5 ఛానల్ లో చెప్పాను కూడా. రాగద్వేషాలు రాజకీయాలలో మెండుగా కనబరిచిన రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో తిరుగులేని మార్పులు చేసి తనదైన ముద్ర వేశారు.
3 comments:
తెలుగు వాడి ఆత్మ గౌరవానికి, పట్టుదల కి నిజమైన ప్రతీక అయిన మరపు రాని ఆ మహా నాయకుడి గురించి మాకు తెలీని అనేక విషయాలు తెలియచెసినందుకు ధన్యవాదాలు.
bagundi.......inka konnivishayalu vrasthe inka bagundedi....
mukhyamga: i thaniki manamemi sahayam cheyagalam?
ane alochana ravatame goppathanam...ayana snehaniki entha viluva isthunnado arthamavuthundi
chaalaa chaalaa bagundi. reddygaru mukhymantriga enthati brahmanadamaina paripalana chesaro enthamandhi mithrulaku enthati sahayam chesaro ippudi chusthunmuga. athanu brathiki unte jailu jeevatham thappani sari ayyedi.
Post a Comment