రాజకీయ జీవిగా కాసు బ్రహ్మానంద రెడ్డి

ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి (1909-1994)

ఆద్యంతాలూ రాజకీయవాదిగా జీవతం గడిపిన కాసుబ్రహ్మానందరెడ్డి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ తనదైన ముద్రవేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవుదామని విఫల ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ లో సంజీవరెడ్డి మంత్రి వర్గంలో తొలిసారి అమాత్యులుగా జీవితాన్ని ఆరంభించారు. అప్పటి నుండి చివరి వరకూ రాష్ట్ర కేంద్ర పదవులు ఎన్నో చేపట్టి కొనసాగారు.

1950 ప్రాంతాలలో ఆయన ప్లీడరుగా గుంటూరులో ఉన్న రోజులలో కలుసుకున్నాను. నేను ఎ.సి. కాలేజీలో విద్యార్థిగా ఉన్న సందర్భంగా నా సోదరుడు విజయరాజకుమార్ పెళ్ళి ఆహ్వనం కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. గుంటూరులోని అమరావతి రోడ్డులో ఉంటున్న బ్రహ్మానందరెడ్డి కాఫీ ఇచ్చి సాదరంగా కార్డు స్వీకరించినా పెళ్లికి మాత్రం రాలేదు. అంతకు ముందు ఎ.సి. కాలేజీకి ఎదురుగా ఎల్.వి.ఆర్. అండ్ సన్స్ క్లబ్బులో రోజూ బ్రహ్మానందరెడ్డి వచ్చి పేకాడటం చూసేవాడిని. అదే ప్రాంగణంలో మా అన్న ఒక పుస్తకాల షాపు పెట్టారు. నేను తీరిక వేళల్లో కూర్చుని అమ్ముతుండేవాడిని. ప్రక్కనే బ్రహ్మానందరెడ్డి, సలాం, ఇంకా కొందరు గుంటూరు ప్రముఖులు పేకాడుతుంటే మధ్యమధ్యలో నేను కాసేపు నిలబడి వారి మాటలు వింటూండేవాడిని. ఒకసారి గమ్మత్తయిన సంభాషణ చెవిన పడింది. మదరాసు శాసన సభలో కౌన్సిల్ సభ్యుడుగానూ గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడుగానూ ఉన్న ప్లీడరు సలాం మంచి హాస్య ప్రియుడు. సంభాషణా చతురుడు. ఆయనను ఉద్దేశించి, ఏం సలాం, మరీ పాతిక్కీ – పరక్కీ కక్కుర్తి పడుతున్నావటగా అని బ్రహ్మానంద రెడ్డి ఒక విసురు విసిరాడు. వెంటనే సలాం – ఏం చేస్తాం, వందా, రెండువందలూ అయితే నీతో పనేంటయ్యా, బ్రహ్మానందరెడ్డి ఉన్నాడుగా అంటున్నారు మరి అనేసరికి అందరూ గొల్లున నవ్వారు. అలా సాగుతుండేవి వారి సరసాలు.

బ్రహ్మానందరెడ్డి క్రమంగా జిల్లా నుండి రాష్ట్రానికి ఎదిగారు. మొదటి నుండి ముఠా రాజకీయాల్లో మునిగి తేలారు. తొలుత సంజీవరెడ్డి కుడి భుజంగా రాజకీయాలలో చక్రం తిప్పి కీలక స్థానంలోకి వచ్చారు. ఆ తరువాత ఆయనకు ఎదురు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో అత్యంత ప్రముఖ నాయకుడుగా కాంగ్రెసు పార్టీని చీలదీసి రెడ్డి కాంగ్రెసు అధ్యక్షుడు కూడా అయ్యాడు. ఆర్థిక వ్యవహారాల నిపుణులుగా పేరు తెచ్చుకున్నారు.

బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నేను వివిధ సందర్భాలలో కలిశాను. తెలుగు విద్యార్థి (కొల్లూరి కోటేశ్వర రావు సంపాదకుడు) మాసపత్రికకు ఇంటర్వ్యూ చేసి ప్రచురించాము. పాత హైదరాబాదులో మత కల్లోలాలు జరిగినప్పుడు (1968) వివిధ సంఘాలను పిలిచి జూబిలీ హాలులో సంప్రదింపులు జరిపారు. అప్పుడు మానవ వాద సంఘం తరఫున నన్ను పిలవగా నాకు తోచిన సూచనలు ఇచ్చాను.

1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిత్వాన్ని బాగా దెబ్బ కొట్టింది. ఆయన, ఆయన మంత్రులూ ఒకదశలో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి సందర్భాలలో తేళ్ళ లక్ష్మీకాంతమ్మ (లోక్ సభ సభ్యురాలు), నేను కలసి బ్రహ్మానంద రెడ్డి దగ్గరకు వెళ్ళి మాకు తోచిన విషయం చెపుతుండేవాళ్ళం. ఆయన బంగళా నిర్మానుష్యంగా ఉండేది. కొంత కాలం ఆయన కుంగి పోయినట్లు కనిపించేవాడు. అలాంటప్పుడు కలుస్తుంటే ఎంతో సహాయపడినట్లుగా భావించేవాడు. అదే సందర్భంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కారులు కొందరు హైదరాబాదులో గోడలపై బ్రహ్మానంద రెడ్డి భార్య రాఘవమ్మను ఉద్దేశించి చాలా అసహ్యకరమైన, అశ్లీల, శృంగార నినాదాలు రాశారు. మేము నిరసన తెలిపాము. తెలంగాణాలో ప్రముఖ స్త్రీ నాయకురాళ్లు జె. ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి, సరోజినీ పుల్లారెడ్డి మొదలైనవారు అటువంటి నినాదాలను ఖండించి వారే స్వయంగా చెరిపివేయడానికి పూనుకున్నారు. అటువంటి క్లిష్ట దశలో మేము కలుస్తుండడం బ్రహ్మానందరెడ్డికి ఊరటనిచ్చింది.

రాజకీయవాదిగా బ్రహ్మానందరెడ్డి చాలా ముఠా కక్షలతో సంకుచిత ధోరణిలో ప్రవర్తించాడు. ఆంధ్రజ్యోతి దినపత్రికపై, దాని సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావుపై ప్రభుత్వపరంగా దాడి చేసి అదుపు పెట్టాలని చూశాడు. వారికి ప్రకటనలు ఆపి వేయాలనుకున్నాడు. ప్రెస్ బిల్లు పెట్టి చర్యకు ఉపక్రమించగా మేము హేతువాద సంఘం పక్షాన తీవ్ర ప్రతిఘటన చేశాము. మామిడి పూడి వెంకట రంగయ్యని పిలిచి సభ జరిపి ప్రెస్ బిల్లును వై.యం.ఐ.యస్. హాలు సుల్తాన్ బజారులో ఎండగట్టాము. దీనిపై అఖిల భారత స్థాయిలో పత్రికలు ప్రతిధ్వనించాయి. బ్రహ్మానంద రెడ్డి ఆ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపి తప్పుకున్నారు.

బ్రహ్మానంద రెడ్డి జీవిత చరిత్రను కపిల కాశీపతి బ్రహ్మానంద యాత్ర పేరిట పెద్ద గ్రంథంగా వెలువరించారు. అందులో చాలా వివరాలు, నిశిత పరిశీలనలు చేశారు. అయినప్పటికీ దానిని బ్రహ్మానంద రెడ్డి స్నేహపూర్వకంగానే స్వీకరించటం విశేషం. జూబిలీ హాలులో సభ పెట్టి అందరికీ కాపీలు ఉచితంగా ఇచ్చి, ప్రసంగాలు విన్నారు. నేతి చలపతి అధ్యక్షతన బ్రహ్మానందరెడ్డిపై ఒక విచారణ సంఘాన్ని కాంగ్రెసు కమిటీ నియమించింది. ఆయన జిల్లా బోర్డు అధ్యక్షులుగా ఉండగా అరాచక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉండగా అవి చాలా వరకూ వాస్తవాలని నేతి చలపతి కమిటీ నిర్ధారించిందట. ఆ విషయం నిజమేనా అని నేను బ్రహ్మానందరెడ్డిని అడిగితే టోపీ వెనక నుంచి ముందుకు తిప్పి నవ్వి సమాధానం దాటేసేవారు. అసెంబ్లీలోనూ బయట బ్రహ్మానంద రెడ్డి నుండి సమాధానం రాబట్టటం చాలా కష్టమయ్యేది. ఆయన ఏమి ఆలోచిస్తున్నాడో సహచరులకు, పార్టీ వారికీ అంతుపట్టేది కాదు. ఏదైనా అడిగితే గాంధీ టోపీని వెనక నుంచి ముందుకు తిప్పుకుని పెట్టుకునేవారు.!

రాజకీయాలలో తనకు బద్ద విరోధిగా ప్రారంభమైన జలగం వెంగళరావును మంత్రి వర్గంలోకి ఆహ్వానించి, హోం మంత్రి శాఖ నుంచి బ్రహ్మానంద రెడ్డి తన రాజకీయ చతురతను చూపారు. ఆ విధంగా ప్రత్యర్థులను ఆకర్షించటం, మరో పక్క దెబ్బ కొట్టడం ఆయన రాజకీయ జీవితంలో మామూలే. సంజీవరెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉంటూ, తరువాత తీవ్ర వ్యతిరేకిగా మారిపోయాడు. సంజీవ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉక్కు కర్మాగారాల శాఖ నిర్వహిస్తున్నప్పుడు ఆంధ్రులకు విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పరచటం అవసరమైని ఆందోళన జరిగింది. అందుకు గాను తమనం పల్లి అమృతరావు అనే కాంగ్రెస్ వాదిని నిరాహార దీక్షకు పురిగొలిపి ఆందోళన పెంచటానికి బ్రహ్మానంద రెడ్డి హస్తం ఉందనేవారు. ఆ సందర్భంగా జరిగిన అలజడులలో విజయవాడలోని సంజీవ రెడ్డి విగ్రహాన్ని పగలుగొట్టారు. దీనికి బ్రహ్మానంద రెడ్డి పరోక్ష కారణం అంటారు. ఆయన మంత్రి వర్గంలో ఉంటూ వచ్చిన చెన్నారెడ్డి కేంద్రానికి వెళ్ళి కోర్టు తీర్పు ద్వారా పదవి పోగొట్టుకుని తెలంగాణా ఉద్యమంలోకి ప్రవేశించి బ్రహ్మానంద రెడ్డి వ్యతిరేకిగా ఆందోళన చేశారు. అయితే ఒక పట్టాన బ్రహ్మానంద రెడ్డి లొంగలేదు. శాసన సభలో ఆయన మెజారిటీకి తిరుగులేకుండా ఉండేది. అయినప్పటికీ ఇందిరాగాంధీ రాష్ట్ర ప్రయోజనం దృష్టా ఆయనను తొలగించి పీ.వీ. నరసింహారావును ముఖ్యమంత్రిగా తీసుకువచ్చారు.

మహరాష్ట్ర గవర్నరుగా, కేంద్రమంత్రిగా ఆయన చిరకాలం వివిధ పదవులు అనుభవించిన రాజకీయవాది. సంతానం లేదు. రాజకీయాలలో తన పాత్రను ఏమేరకు నిలబెట్టుకున్నాడనేది చరిత్ర చెపుతుంది. ఆయనకు పదవిలేప్పుడు కూడా నేను తరచు కలసి మాట్లాడుతుండేవాడిని.

3 comments:

kvrn said...

పూర్వపు ముఖ్యమంత్రులు గురించి యెన్నొ విషయాలు వ్రాసి తెలియచెస్తున్నారు ధన్యవాదాలు.
బ్రహ్మనందరెద్ది గారు టొపి తిప్పితే చానక్య పధకం యెదొ వేసారు అనేవారు.

Anonymous said...

"అదే సందర్భంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కారులు కొందరు హైదరాబాదులో గోడలపై బ్రహ్మానంద రెడ్డి భార్య రాఘవమ్మను ఉద్దేశించి చాలా అసహ్యకరమైన, అశ్లీల, శృంగార నినాదాలు రాశారు."

తెలంగాణా సాధన అనే మహత్తరమైన ఆశయంకోసం ఇలాంటి చిన్న చిన్న వాటిని పట్టించుకోకూడదు. అయినా ఇది్ తెలంగాణా వ్యతిరేకుల కుట్ర అయ్యి వుంటుంది. ఆంధ్రా వాళ్ళే అలా రాసి ఉంటారు. ఆంధ్రా వాళ్ళు అలా రాయలేదనటానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా. లేక తెలంగాణా వాళ్ళు రాయటాన్ని మీరు చూశారా? :-)

Nrahamthulla said...

జై ఆంధ్ర ఉద్యమం సాగే రోజుల్లో ఆంధ్ర గోడలపై సమైక్యవాది అయిన భవనం జయప్రధ గారిమీద కూడా చాలా అసహ్యకరమైన నినాదాలు రాశారు.కొందరు పోకిరీలు ప్రతి ఉద్యమంలో చేరి ఇలాంటి పాడుపనులు చేస్తుంటారు.వారిని నాయకులే కట్టడి చెయ్యాలి.

Post a Comment