1968లో మొదటిసారి కర్నూలులో కోట్ల విజయభాస్కర రెడ్డిని కలిశాను. అప్పుడు తెలుగు స్వతంత్ర, ఆంధ్రభూమి సంపాదకుడు, రేడియో నాటికల రచయిత గోరాశాస్త్రి (గోవిందు రామశాస్త్రి)కి 50వ జన్మదినోత్సవం జరపటానికి సభ ఏర్పాటు చేసిన సందర్భం అది. కర్నూలు జిల్లాపరిషత్ ఛైర్మన్ గా ఉన్న విజయభాస్కర రెడ్డి బాగా సహకరించి సభ జయప్రదం కావటానికి తోడ్పడ్డారు. ఆయన ఆనాడు చక్కటి ప్రసంగం చేశారు. అప్పటి పరిచయంతో ఆ తరువాత హైదరాబాద్.లో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళం. మిగిలిన రాజకీయ వాదులతో పోల్చితే విజయభాస్కర రెడ్డి పెద్ద మనిషి. హైదరాబాద్ లో పాత ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్.లో, గోపీ హోటల్.లో మిత్రులతో సరదాగా పేకాడుకోవటం ఆయన హాబీ. రాష్ట్ర రాజకీయాల నుండి కేంద్రానికి వెళ్ళిన విజయభాస్కర రెడ్డి చాలా కాలం స్థానిక విషయాలు పట్టించుకోలేదు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని, 1982 ఎన్నికలలో విజయావకాశాలు క్షీణించాయని భయపడి విజయభాస్కర రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసుకు వచ్చారు. అప్పటికి ముగ్గురు ముఖ్యమంత్రులని రాష్ట్రంలో మార్చేసిన ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేసింది. విజయభాస్కర రెడ్డి వలన పరువు దక్కుతుందని పదవిలోకి తీసుకు వచ్చారు. అయితే ఆనాటి రాజకీయ ప్రభంజనంలో రంగప్రవేశం చేసిన ఎన్.టి.రామారావు సుడిగాలి పర్యటనకు, ప్రజాదరణకు విజయభాస్కర రెడ్డి సరితూగలేకపోయారు. రామారావు ఇస్తున్న హామీలకు మారుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తాను కూడా కిలో బియ్యం రూ. 1.90 పైసలకే ఇస్తామని చెప్పినా జనం పట్టించుకోలేదు.
విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భవనం వెంకట్రాం, ఆవుల మదన్ మోహన్, నేను ఎదురుగా కూర్చున్నాం. రాష్ట్రంలో 11 మెడికల్ సీట్లు కర్ణాటకకు, అక్కడి స్థానాలు 11 ఆంధ్రకు ఇచ్చి పుచ్చుకునే పద్ధతిలో ఏర్పాటు చేశారు. దిగిపోబోయే ముందు భవనం వెంకటరాం ఆ ఫైలు సంతకం చేసి వెళ్ళారు. కానీ రానున్న ముఖ్యమంత్రి వాటిని ఆమోదించవలసి ఉంది. ఒక వైపు భవనం వెంకటరాం మరో వైపున మదన్ మోహన్ (నాటి ఆరోగ్య శాఖమంత్రి) నన్ను వెళ్ళి విజయభాస్కర రెడ్డితో ఆ ఫైలుపై సంతకం చేయమని చెప్పమన్నారు. ఆ మాట చెప్పటానికి వారికి మొఖం చెల్లక నన్ను కోరారు. నేను ఎదురుగా ఉన్న విజయభాస్కర రెడ్డి దగ్గరకు వెళ్ళి ఆ విషయం చెబితే ఆయన అప్పటికప్పుడే ఛీప్ సెక్రటరీకి చెప్పి ఫైలు తెప్పించి సంతకం చేయటం నన్ను ఆశ్చర్యపరచింది. కర్నూలులో ఏర్పడిన మా మిత్రత్వం ఆ విధంగా తోడ్పడింది.
నేను ఆ తరువాత విజయభాస్కర రెడ్డిని అంత తరచుగా కలవలేదు. ఎప్పుడైనా కలిస్తే ఆప్యాయంగా మాట్లాడేవారు. ముఖ్యమంత్రిగా నాలుగు నెలలకే దిగిపోయిన విజయభాస్కర రెడ్డి తరువాత ఢిల్లీ వెళ్ళిపోయి మరోసారి ముఖ్యమంత్రిగా పదేళ్ళ తర్వాత వచ్చారు. రెండవసారి కూడా ఆయన విఫలమయ్యారు. రెండు పర్యాయాలు కూడా తన చేతి మీదుగా కాంగ్రెస్.ను వోడించి ఎన్.టి. రామారావుకు అధికారం కట్టబెట్టిన పేరు విజయభాస్కర రెడ్డికే దక్కింది. రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నా మిత్రుడు అబ్బూరి వరద రాజేశ్వరరావుకు అధికార భాషా సంఘాధ్యక్ష పదవి ఇచ్చారు. వారిరువురికి ఢిల్లీలో పరిచయం ఉండేది. కానీ పదవి స్వీకరించక ముందే అబ్బూరి జబ్బుతో ఆసుపత్రిలో చనిపోయారు.
విజయభాస్కర రెడ్డి చివరి దశలో అపోలోలో చికిత్సకై చేరి చనిపోతున్న రోజులలో ఆయనను పట్టించుకున్నవారు లేరు. పదవులు లేకపోతే మనుషులకు ఉండే ఆదరణ అలాంటిదని కాంగ్రెస్ సంస్కృతి చెబుతున్నది.
No comments:
Post a Comment