నాదెండ్ల భాస్కరరావు

కుట్రతో ముఖ్యమంత్రి
నాదెండ్ల భాస్కరరావు
(1935 జననం)

నాదెండ్ల భాస్కరరావు అడ్వకేటుగా ప్రాక్టీసు చేస్తూ రాజకీయాలలో ప్రవేశించారు. కాంగ్రెసు పార్టీ యూత్ విభాగంలో చురుకైన పాత్ర నిర్వహించారు. నేను ఆంధ్రజ్యోతి బ్యూరో ఛీఫ్.గా ఉండగా హైదరాబాదులోని సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న మా ఆఫీసుకు అనేక పర్యాయాలు వచ్చేవారు. కొన్ని సందర్భాలలో రాజకీయ ప్రకటనలు ఇచ్చేవారు. ఇంచుమించు రోజూ ఫోనులో అనేక విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. భాస్కరరావు చురుకైన, తెలివిగల రాజకీయవాది. విషయాలు త్వరగా గ్రహించాడు. ఎక్కడికైనా చొచ్చుకుపోయేవాడు. ఆవిధంగానే కాంగ్రెసు పార్టీలో ఆయన అన్ని స్థాయిల వారితో మెసిలారు.
రాజకీయాలలో ప్రవేశించిన తొలి రోజులలో ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డికి చేరువయ్యారు. ఆయన తొలి మంత్రివర్గంలో శాసన సభా వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. కానీ, తనకున్న సన్నిహితత్వం వలన ఇంకా పెద్ద శాఖను ఆశించారు. ప్రమాణ స్వీకారాలు జరిగిన తొలి రోజున గవర్నర్ శారదా ముఖర్జీ ఇచ్చిన విందుకు ఆయన అలిగి రాలేదు. తరవాత కొన్నాళ్ళకు చెన్నారెడ్డి మంచి శాఖను ఇచ్చినా భాస్కర రావు ఆట్టే కాలం నిలుపుకోలేక పోయారు. ఢిల్లీ వెళ్ళి తనపై ఫిర్యాదులు చెబుతున్నాడని చెన్నారెడ్డి ఆగ్రహించి మరొకసారి ఆయనకు అప్రధానమైన శాఖ ఇచ్చారు. ఇలాంటి రాజకీయ ఒడుదుడుకులు చెన్నారెడ్డి కాలంలో ప్రారంభమై అంజయ్య కాలంలో కొనసాగాయి. కనుక అంజయ్య కూడా భాస్కరరావును కుదించి ఒక దశలో ఆయనను మంత్రివర్గంనుంచి తొలగించారు కూడా. ఆ తరువాత భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా వుండగా భాస్కరరావు ప్రయత్నించినా పదవి రాలేదు. అప్పుడే ప్రత్యామ్నాయ పార్టీకై ప్రతిపక్షాలు కొన్ని ప్రయత్నించడం ఎన్.టి.రామారావు రంగప్రవేశం జరిగింది. భాస్కరరావు అప్పుడు ఎన్.టి.రామారావుకు చేరువై తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర వహించాడు. తనను కో-పైలట్ గా చ్రితించుకున్నాడు. ఎన్.టి.రామారావు తొలి మంత్రివర్గంలో కీలక శాఖల్ని నిర్వహించారు. పార్టీలో ఆయనకు ఉపేంద్రకు అసలు పడేది కాదు. అలాగే మరికొందరితో కూడా భాస్కరరావుకు పొత్తు కుదిరేది కాదు. భాస్కరరావుకు రాగద్వేషాలూ ఎక్కవే. ఇందిరాగాంధీ తొందరపడవద్దని సలహా ఇచ్చినా తెలుగు దేశం పార్టీలోకి వచ్చేశాడు. కానీ, ఆయనకు పార్టీలో తృప్తి లేదు. జీవితమంతా కాంగ్రెసు సంస్కృతిలో అలవాటు పడిని భాస్కరరావు తెలుగుదేశంలో రామారావు నాయకత్వంలో ఇమడలేకపోయారు.
ఎన్.టి.రామారావు గుండె చికిత్సకు అమెరికా వెళ్ళినప్పుడు కాంగ్రెసు కుట్ర రాజకీయాలు పైకి తెచ్చి వివిధ పార్టీలతో గూడుపుఠాణీ జరిపి కేంద్ర కాంగ్రెసు వారి మద్దతుతో రాష్ట్రంలో రామ్.లాల్ గవర్నర్ సానుకూలతతో కృత్రిమంగా రామారావును అధికారం నుండి తప్పించారు. ప్రజలు ఎన్నుకున్న రామారావు ఆయన పార్టీ ప్రజాస్వామికంగా వస్తే అందుకు పూర్తి విరుద్ధంగా భాస్కరరావు డొంక తిరుగుడు విధానాలతో రామారావును తొలగించి ముఖ్యమంత్రి అయ్యారు. రాజధాని నగరంలో కృత్రిమ కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారు. తెలుగుదేశంలో ఉన్న బలహీనులకు అనేక ఆశలు చూపి కొందరిని ఆకర్షించగలిగారు. త్రిపురాన వెంకటరత్నం, నన్నపనేని రాజకుమారి మొదలైనవారు అలాగే మంత్రులయ్యారు. నిర్ణయాలు చకచక చేయటం అడిగిన వారికి అడిగినట్లు వరాలివ్వటం, కాలేజీలు సంస్థలు మంజూరు చేయటం నిమిషాల మీద జరిగిపోయింది. కానీ రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా రియాక్షన్ వస్తుందని తాము అభాసుపాలవుతామని భాస్కరరావు అంతగా వూహించి వుండడు. నెలరోజులు తిరక్క ముందే భాస్కరరావు కృత్రిమ ముఖ్యమంత్రిత్వం పోయింది. ఎన్.టి.రామారావు మళ్ళీ ప్రజాస్వామికంగానే కొనసాగారు.
ఆశ్చర్యమేమంటే భాస్కరరావును ఆదుకుంటామని అండగా నిలుస్తామని చెప్పిన కాంగ్రెసు ఆ తరువాత ఆయనను గాలికి వదిలేసింది. అవమానించిన అంజయ్యకైనా మళ్ళీ కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చారు కానీ భాస్కరరావును మాత్రం రాజకీయంగా అంటరానివాడినిగానే అట్టిపెట్టారు. అది రామారావు దెబ్బ.
భాస్కరరావును నేను ఈ విద్రోహ చర్య అనంతరం కలియడం మాట్లాడటం మానుకున్నాను. అప్రజాస్వామిక విద్రోహ చర్యగా ఆయన ధోరణి నాకు బొత్తిగా నచ్చలేదు.

No comments:

Post a Comment