రాష్ట్ర కేంద్ర స్థాయికి ఎదిగినజనార్దన రెడ్డి

నేదురుమల్లి జనార్దన రెడ్డి

నేను ఆంధ్రజ్యోతి బ్యూరో ఛీఫ్.గా హైదరాబాదులో ఉండగా నేదురుమల్లి జనార్దన రెడ్డితో పరిచయం అయింది. అనేక సందర్భాలలో కలుసుకుంటూ మాట్లాడుకునేవారం. 1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కేబినెట్ మంత్రిగా నేదురుమల్లి ప్రముఖపాత్ర వహించాడు. ఆయనతో రాజకీయాలే కాక సాధారణ విషయాలు కూడా చర్చిస్తుండేవాడిని.
నేను చాలా కాలం నెల్లూరు నుండి వచ్చే జమీన్ రైతు వారపత్రికకు రాజకీయ విలేఖరిగా రాస్తుండేవాడిని. నెల్లూరు శ్రీరామమూర్తిగారి కోరికపై ఆపని చేశాను. అలా జరుగుతుండగా ఆ పత్రికపై ప్రభావం ఉన్న జనార్దన రెడ్డి రాజకీయ విలేఖరి ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. శ్రీరామమూర్తిగారికి అది ఇబ్బందికరంగా పరిగణించింది. నేను ఆంధ్రజ్యోతి బ్యూరో ఛీఫ్ గా ఉన్నాను గనుక నాపేరుతో జమీన్ రైతులో రాయడానికి వీలులేకపోయింది. అయితే జనార్దన రెడ్డికి నచ్చని విషయాలు వ్యాఖ్యలు వస్తున్నప్పుడు ఆయన ఎడిటర్.ని వత్తిడి చేస్తుండేవారు. శ్రీరామమూర్తి నా దగ్గరకు వచ్చి ఈ విషయాలు వెల్లడిస్తుండేవారు. నన్ను మానేయమనడానికి ఆయనకిష్టం లేదు. పాఠకుల నుండి రాజకీయ విలేఖరి వ్యాఖ్యలకు అనుకూలత ఉండటం వల్ల కొనసాగించమన్నారు. అలా కొన్నాళ్ళు జరిగింతర్వాత జనార్దన రెడ్డి వత్తిడి ఎక్కువై, శ్రీరామమూర్తి నా దగ్గరకు వచ్చి తన ఇబ్బందులు చెప్పుకున్నారు. ఆ దశలో నా అంతట నేనే రాజకీయ విలేఖరిగా రాయటం మానేస్తానని చెప్పాను. కానీ ఆయన ఒప్పుకోక కొనసాగించమన్నారు. ఆ దశలో శ్రీరామమూర్తిగారు చనిపోయారు. డోలేంద్ర ఎడిటర్ గా వచ్చారు. కనుక విరమించటం నాకు సులువు అయింది.
జనార్దన రెడ్డి వ్యక్తిగతంగా నాకు మిత్రుడు. అనేక సందర్భాలలో మేము కలిసి కూర్చుని యథేచ్ఛగా మాట్లాడుకునేవారం. ఆయన మంచి ఆతిథ్యం ఇచ్చేవారు. కొన్నిసార్లు తట్టుకోలేనంతగా మర్యాదలుండేవి. అసెంబ్లీ జరుగుతుండగా ఉదయం సమావేశాలు సాయంత్రానికి వాయిదా పడినప్పుడు మధ్యలో మేమిరువురం ఆయనింటికి వెళ్లి స్కాచ్ విస్కీ పుచ్చుకుని నెల్లూరు భోజనం చేసి సాయంత్రం సమావేశానికి వచ్చేవారం. జనార్దన రెడ్డి చాలామందిని అరే ఒరే అని పిలిచేవారు. కొన్నిసార్లు గర్వంగా ప్రవర్తించేవారు.
1978లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుండీ ఆ పదవిలోకి తానూ రావాలని జనార్దన రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ సఫలం కాలేదు. భవనం వెంకట్రాం ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పదవికి జనార్దన రెడ్డి గౌరవం ఇవ్వలేదు. అతని మంత్రివర్గంలో సభ్యుడై వుండికూడా లెక్కలేనట్లు ప్రవర్తించేవాడు. భవనం మెతక తనాన్ని బాగా వాడుకున్నాడు. ఆ తరువాత కొన్నేళ్ళపాటు రాజకీయరంగంలో తిప్పలు పడి చివరకు 1990లో ముఖ్యమంత్రిగా తన కోరికను తీర్చుకున్నాడు. రెండవసారి చెన్నారెడ్డి విఫలమయినప్పుడు కేంద్రం మరొక వ్యక్తి కోసం అన్వేషిస్తున్న దశలో జనార్దన రెడ్డి ఆ స్థానానికి రాగలిగాడు. అయితే అధికారంలో ఉండగా చకచక మెడికల్, డెంటల్ కళాశాలలు మంజూరు చేయటం, ఎడాపెడా పనులు జరపడం, రాజకీయ భ్రష్టత్వానికి దారితీసింది. హైకోర్టు కూడా ఆయన చర్యలను నిరసిస్తూ ఉత్తరువులు జారీ చేసింది. బయట వ్యతిరేకత ఎంత ఉన్నా జనార్దన రెడ్డి కాంగ్రెసు పార్టీలో మాత్రం తన బలాన్ని కాపాడుకోగలిగాడు. 160 మంది శాసన సభ్యులు ఆయనకు మద్దత్తు పలికారు. సంవత్సరం తిరక్క ముందే మంత్రివర్గాన్ని పెంచి కొత్తవారిని తీసుకున్నాడు. కానీ కాంగ్రెసు పరిస్థితి దిగజారిపోతుండడం చూసి కేంద్రం ఆయనను తొలగించి విజయభాస్కర రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ఆవిధంగా ఒకఒకసారి వచ్చిన అవకాశాన్ని జనార్దన రెడ్డి జారవిడుచుకున్నాడు. కాంగ్రెసులో కూడా ఆయనకు వ్యతిరేకత పెరుగుతూ పోయింది.
వ్యక్తిగతంగా జనార్దన రెడ్డి నాతో ఎప్పుడూ బాగా వుండేవాడు. వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలకు, పెళ్ళిళ్లకు ఆహ్వానించేవాడు. టీచర్ గా జీవితంలో ప్రారంభించి రాష్ట్ర కేంద్ర స్థాయికి ఎదిగిన వ్యక్తి.

No comments:

Post a Comment