నేనూ రెడ్డినే అన్న ముఖ్యమంత్రి అంజయ్య

జంబోజెట్ ముఖ్యమంత్రి
(1919 – 1986)

అసలు పేరు తాళ్ళ అంజయ్య కానీ అది కూడా ఏకాభిప్రాయంతో లేదు. తన పేరు టంగుటూరి కృష్ణారెడ్డి అని, తాను రెడ్డినే అని అంజయ్య ముఖ్యమంత్రి అయిన తరవాత చెప్పారు. అంతకుముందు అంజయ్య అంటే వెనుకబడిన తరగతులకు ప్రతినిధి అని అందరూ భావించేవారు.
ఆల్విన్ కంపెనీలో ఆరణాల కూలీగా ఆరంభమైనట్లు చెప్పుకున్న అంజయ్య పేదవారికోసం, గుడిసెలలో బతుకుతున్నవారికోసం చాలా కాలం రాజకీయంగా కృషిచేశారు. ఆడంబరాలు లేకుండా సింపుల్.గా జీవితం గడుపుతూ చలాకీగా మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే రోశయ్యను 1969 ప్రాంతాలలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సందర్భంగా కలిశాను. అప్పట్లో చెన్నారెడ్డి ప్రవేశించి ఉద్యమాన్ని ఉధృతం చేసినప్పుడు అంజయ్య కూడా శ్రీమతి ఇందిరాగాంధీపై విసుర్లు విసురుతుండేవాడు. ప్రజాసమితి పక్షాన ఎన్నికలలో పోటీచేసి నెగ్గాడు కూడా. ప్రజాసమితి కాంగ్రెసులో లీనమైన మరునాటి నుండి అంజయ్య తిరుగులేని ఇందిరాగాంధీ భక్తుడైపోయాడు. మిగిలినవారు ఎటు మారినా ఆయన మాత్రం స్థిరంగా ఇందిరా మనిషిగానే నిలిచాడు.
మొట్టమొదట బ్రహ్మానందరెడ్డిని తొలగించి రాష్ట్రంలో మరొక వ్యక్తిని తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తున్న రోజులలో, (1972) ముఖ్యమంత్రి కావాలని అంజయ్య ఆశించి ఇందిరాగాంధీని అడిగాడు కూడా. ఆ తరువాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడం దేశంలో ప్రజాబలం కోల్పోవటం జరిగినా అంజయ్య మాత్రం ఆమె పక్షానే నిలిచాడు. తరచు ఢిల్లీ వెళ్లటం ఇందిరాగాంధీని, ఆమె కుమారుడు సంజయ్ గాంధీని కలిసేవాడు. సంజయ్ గాంధీతో అత్యంత సన్నిహితుడయ్యాడు. అతను చనిపోయినప్పుడు అంజయ్య అప్.సెట్ అయ్యాడు. అవన్నీ నేను ప్రత్యక్షంగా గమనించాను. బరకత్ పురాలో ఆయన ఇంటికి వెళ్ళి కూర్చొని కబుర్లు చెపుతున్నప్పుడు తోటి కాంగ్రెసు నాయకుల మీద, రాజకీయ విషయాల పైన అరమరికలు లేకుండా వ్యాఖ్యానాలు చేస్తుండేవాడు. మేము నవ్వుకునేవాళ్ళం. చెన్నారెడ్డిపై ఆయమ ముఖ్యమంత్రి అయినప్పటినుండీ ఫిర్యాదులు చెపుతూనే వుండేవాడు. అవికొన్ని ఢిల్లీలో కూడా చెప్పాడు. చెన్నారెడ్డి అపఖ్యాతిపాలై కాంగ్రెసు ప్రతిష్ఠను దిగజారుస్తున్నప్పుడు ముఖ్యమంత్రి కావాలనే ఆయన కోరికను మళ్ళీ అంజయ్య వెలిబుచ్చాడు. ఆయనకు పి.వి.నరసింహారావు మద్దతు పలికాడు, మరొకవైపుల సంజయ్ గాంధీ ఇష్టుడు కావటం వలన ఇందిరాగాంధీ అంజయ్యను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. తన చిరకాలవాంఛ తీరినందుకు అంజయ్య సంతోషించాడు.
ముఖ్యమంత్రిగా రాకముందే అంజయ్య కేంద్ర కాంగ్రెసు నాయకులతో సన్నిహితత్వం పెంచుకున్నాడు. బీహారు కాంగ్రెసు వ్యవహారాలు కూడా కొన్నాళ్ళు చూచాడు. హిందీ, ఉర్దూ మాట్లాడటం, కాళ్లు మొక్కటం కాంగ్రెసు సంస్కృతిలో అంజయ్యకు కలిసివచ్చాయి.
ముఖ్యమంత్రిగా ఆయన జంబో జెట్ మంత్రివర్గాన్ని 61మందితో ఏర్పరచాడు. రాజకీయవర్గలాలన్నీ విస్తుపోయాయి. అప్పుడు ఆయనను విలేఖరులుగా మేము అడిగితే ఏమంత్రికి ఎవరి సిఫారసు ఉన్నదో బయట పెట్టాడు. ఆ విధంగా కాదనలేక జాబితా పెంచుతూ పోయాడు. అయితే కేంద్రం దీనిపై వెంటనే స్పందించి మంత్రివర్గాన్ని కుదించమని చెప్పటంతో ఒక 20మందిని తొలగించి, వారికి వేరేపదవులు ఇస్తానన్నాడు. అంజయ్య తన మంత్రివర్గంలో నాదెండ్ల భాస్కరరావుకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక స్థాయిలో అంజయ్యను లెక్కచెయ్యనట్లుగా ప్రవర్తించాడు. దానిపై అంజయ్య ఆగ్రహించి ఆయనను మంత్రివర్గంనుంచి తొలగించాడు కూడా. భాస్కరరావు 17 పేజీల ఫిర్యాదు రాసి ఇందిరాగాంధీకి పంపించాడు. అయితే వాటిపై విచారణ జరిపిస్తామని తొందరపడి పార్టీకి రాజీనామా చేయటం మరో పార్టీ పెట్టే ప్రయత్నాలూ చేయవద్దని ఆమెను బాలరాజ్ చోప్రా ద్వారా కబురు పెట్టారు. అంజయ్యకు ఢిల్లీలో తగినంత సానుభూతి లేకపోలేదు. ఎవరెన్ని చెప్పినా ఢిల్లీ ఆయనను ఆదరిస్తూనే వచ్చింది.
అప్పట్లో నేను అంజయ్యను చాలా ఎక్కువగా తలుచుకునేవాడిని. ఆయన ప్రియశిష్యుడైన పి.జనార్దన రెడ్డికి పురావస్తు శాఖ ఇచ్చాడు. ఒకసారి నన్ను పిలిచి మనవాడికి కాస్త దాని సంగతి చెప్పు అన్నాడు. నేను జనార్దన రెడ్డిని వెంటబెట్టుకుని స్టేట్ ఆర్కెవ్స్ (తార్నాక, హైదరాబాదు)కు వెళ్ళి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించమన్నాను. శాసన సభలో కూడా ప్రశ్నలకు కొన్ని సమాధానాలు ఆయనకు చెపుతుండేవాడిని. జనార్దన రెడ్డి చాలా వినయంగా స్వీకరించేవాడు.
వివిధ రాజకీయ ఉత్సవాలలో మేము పాల్గొంటున్నప్పుడు, ముఖ్యమంత్రి అంజయ్య యధాలాపంగా, ... మన డ్రైవర్లకు, ఆ ప్రెస్ వాళ్ళకు ముందుగా పెట్టుండ్రి... అని సదుద్దేశంతోనే అనేవాడు. అందువలన గోల తగ్గుతుందని ఆయన ఉద్దేశ్యం.
అంజయ్య మాట్లాడేదే అసలైన తెలుగని ఆనాడు కవి దాశరథి వ్యాఖ్యానిస్తే పత్రికలు వ్యంగ్య చిత్రాలు వేసి ఎగతాళి చేశాయి. అంజయ్య జోక్స్ కొన్ని ఆయన చెప్పినవి కొన్ని ఆయన పేరిట ప్రచారంలోకి వచ్చినవి వాడుకలో ఉండేవి. సముద్రంలో తేల్ పడిందంట. మనకు ఇంక ఆయిలు కరువు లేదు అని అంజయ్య అంటే, అలాంటి తెలుగు ఉర్దూ కలిపిన పదాలు ఆయన ఎన్నో వాడుతుండేవారు. కంటి ఆసుపత్రికి వెళ్ళి అక్కడ లేబర్ వార్డు లేదా అని అడిగినట్లు చెపుతారు. ఆయనకు లేబర్ అంటే ఉన్న ఇష్టాన్ని ఆవిధంగా చిత్రించారు. ఇలాంటివి ఎన్నో ఉండేవి.
అంజయ్య ముఖ్యమంత్రిగా ఉండగా రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు రాగా ఆయనకు భారీ ఎత్తున స్వాగతం పలికే ఉద్దేశ్యంతో అంజయ్య మందీ మార్బలాన్ని వెంటబెట్టుకుని బేగం పేట విమానాశ్రయానికి వెళ్ళారు. అది నచ్చని రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి అని కూడా గమనించక, బఫూన్ అని ఈసడిస్తూ మాట్లాడారు. పత్రికలలో అది పతాక శీర్షికలలో వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు దానిపై స్పందించాయి. అంజయ్య రాజీనామా ఇద్దామనుకున్నాడు. ఆయన అనుచరులు పట్టుబట్టి ఆపారు. కానీ అతరవాత కొద్దికాలానికే అసంబ్లీ ఎన్నికలు రావటం అంజయ్యకి జరిగిన అవమానం తెలుగు వారికి జరిగినట్లుగా ప్రచారంలో విపరీతంగా పాకిపోవటం, కాంగ్రెసు పతనానికి ఒక ప్రధాన కారణం అయింది. అప్పుడే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది.
ఇంత జరిగిన తరవాత అంత అవమానించిన రాజీవ్ గాంధీ అదే అంజయ్యను తన మంత్రివర్గంలోకి తీసుకోవటం కాంగ్రెస్ సంస్కృతికి దర్పణం.
అంజయ్య ఆట్టే కాలం జీవించలేదు. 1986లో చనిపోయాడు. అంజయ్య మిత్రత్వానికి మంచి వ్యక్తి. అది స్వానుభవం.

No comments:

Post a Comment