రెండు సార్లు ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి

తెలంగాణా ఊసెత్తని చెన్నారెడ్డి
(1919 – 1996)

దేవర్స్ బాబా కాలు చెన్నారెడ్డి నెత్తిపై పెట్టి దీవించాడు. ఆయన ఉత్తర ప్రదేశ్ లో ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుండే బాబా. అక్కడ డా. చెన్నారెడ్డి గవర్నర్ గా చేశారు. ఆ ఫోటో సెక్యులరిస్ట్ ఇంగ్లీషు మాస పత్రికలో ముఖచిత్రంగా వేశారు. అప్పట్లో దానికి ఎడిటర్ ప్రొ. ఎ.బి. షా. అది చెన్నారెడ్డి దృష్టికి వచ్చింది. ఆయన ఆగ్రహంతో ఊగిపోయి, ‘పిలవండి.. ఆ ఇన్నయ్య ఎక్కడ ఉన్నాడో, సంగతేంటో తేల్చుకుందాం’ అన్నాడు. నాకు కబురు చేశారు. వెళ్ళాను. ఆ పత్రికను చూపి విసిరికొట్టి, నా మీద నీకు ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తావా అన్నాడు.

నేను ప్రశాంతంగా ఆయన షష్ఠి పూర్తి సంచిక తీసి, అందులో రంగుల చిత్రంగా పూర్తి పేజీలో వేసిన దేవర్స్ బాబా కాలు పెట్టి దీవించిన చిత్రం ఆయన ముందు పెట్టాను. అది చెన్నారెడ్డి ఆమోదంతో ఆయన అభిమాని పరమహం తయారు చేసిన సవనీర్. చెన్నారెడ్డి అవాక్కయిపోయాడు. ఆగ్రహంలో వివేచన మరచిపోవటం సహజం.

చెన్నారెడ్డికి నాకు సన్నిహిత పరిచయం 1958 నుండి మొదలైంది. ఆది నుండి అది లవ్ – హెట్ సంబంధంగానే కొనసాగింది. స్వతంత్ర పార్టీ ఆవిర్భవించిన తొలి రోజులలో విజయవాడలో ఆచార్య రంగా మొదలైన వారి సమక్షంలో జరిగిన సభలో చెన్నారెడ్డి ఆవేశంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ లో ఉండేబదులు, కృష్ణలో దూకి చావటం మేలని చప్పట్ల మధ్య ప్రసంగించారు. తరువాత హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆయన మాట్లాడిన సభలో నేను, ఎస్.వి. పంతులు మొదలైన వారంతా ఉన్నాము. అప్పుడే చెన్నారెడ్డితో నా తొలి పరిచయం. ఆ తరువాత ఆయన చనిపోయే వరకూ అన్ని పరిస్థితులలోనూ కలుస్తూనే ఉన్నాము.

మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రాసినప్పుడు కూడా చెన్నారెడ్డి పదవిలో ఉండగా అవినీతి విషయాలను ప్రస్తావించిన సంగతులు కొందరు ఆయన దృష్టికి తీసుకు వెళ్ళారు. నా పుస్తకాన్ని విసిరి గొట్టినట్లు అక్కడ ఉన్నవారు చెప్పారు. ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి రాకముందు, ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సారధిగా ఆయన వుర్రూత లూగించినప్పుడు ఎన్నిసార్లు కలిశానో చెప్పలేను. నా మీద ఎంత కోపమున్నా, మరొక పక్క ఆదరంగానే చూడేవాడు. తెలంగాణా ఉద్యమం తారా స్థాయిలో ఉండగా కొందరు ఆంధ్రా మిత్రులు ఆయన్ను కలవాలని కోరిక వెల్లబుచ్చారు. అడ్వకెట్ ఎన్.కె. ఆచార్య, మానవ వాది కొసరాజు సాంబశివరావు, జర్నలిస్ట్ ఎ.ఎల్. నరసింహారావు వారిలో ఉన్నారు. ఆ నాడు చెన్నారెడ్డి ఒక టెర్రర్. ఆంధ్రులు ఆయన్ని కలిసేవారు కారు. నేను వీరిని వెంట బెట్టుకుని లాలాపేటలో ఆయన గృహాలకు వెళ్ళినప్పుడు, ‘మీరంతా తెలంగాణా వారితో కలిసి ఉద్యమంలో పాల్గొంటే మీ జోలికి ఎవరూ రారు’ అని సలహా చెప్పారు. వెళ్ళినవారు మౌనంగా వచ్చేశారు. నేను తరువాత ఆయనతో, అయితే తెలంగాణా వారితో ఉద్యమంలో కలియకపోతే ఏమైనా చేయవచ్చు అని సందేశం ఇస్తున్నారా అని అడిగాను. ఆయన కాసేపు కూర్చోబేట్టి ఆచార్య రంగా, లచ్చన్న మొదలైన వారి విషయాలు అడిగారు. మా ఇరువురికీ అవి కామన్ టాపిక్స్.

ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నిసార్లు చెన్నారెడ్డితో తారసిల్లానో చెప్పలేను. ఒకసారి జర్నలిస్ట్ కాలనీకి వచ్చినప్పుడు, ఆయన ఉపన్యాసం చెబుతూ, కొత్త జర్నలిస్ట్ కాలనీలు ఏర్పాటు చేద్దామని ఉందనీ, అయితే జర్నలిస్టుల పేర్లు పెట్టాలంటే సుప్రసిద్ధ తెలుగు వారి పేర్లు కనిపించటం లేదని అన్నారు. ఎం. చలపతిరావు కాలనీకి ప్రారంభోత్సవం చేస్తూ అన్న మాటలవి. కొండా లక్ష్మారెడ్డి నన్ను ధన్యవాదాల ప్రసంగం చేయమన్నాడు. అప్పుడు నేను మాట్లాడుతూ కొత్త జర్నలిస్టుల కాలనీలు ఇస్తామని అన్నందుకు చెన్నారెడ్డి గారికి ధన్యవాదాలని అంటూ ఎన్ని కాలనీలు పెడితే అంత మంది సుప్రసిద్ధ తెలుగు జర్నలిస్టుల పేర్లు చెబుతామని, ఉదాహరణగా నార్ల వెంకటేశ్వరావు, కోటంరాజు పున్నయ్య, కోటంరాజు రామారావు, సి.వై. చింతామణి, ఖాసా సుబ్బారావు, అలా పేర్లు వల్లించారు. జనం చప్పట్లు కొట్టారు. చెన్నారెడ్డికి మళ్ళీ కొపం వచ్చింది. కానీ ఏమీ అనలేదు.

అనేక ప్రెస్ మీటింగులలో ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసేవాణ్ని. కొన్ని సార్లు ఆయన సమాధానం చెప్పటానికి కుదరక నీవే దానికి జవాబు చెప్పు అనేవాడు. మరోసారి ఢిల్లీ నుంచి తిరిగి బేగం పేట విమానాశ్రయానికి వచ్చినప్పుడు చెన్నారెడ్డిని తొలగించి వేరే వారిని పెట్టబోతున్నారని వార్త ప్రబలింది. విపరీతంగా ప్రెస్ వారు ఎయిర్ పోర్టుకు వచ్చారు. అక్కడ పత్రికల వారిని కలిసినప్పుడు వారంతా ఆయనకు పదవి పోయినట్లు, సానుభూతిగా ప్రశ్నలు వేస్తుండగా నేను, కంగ్రాచ్యూలేషన్స్ చెన్నారెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారుగా అన్నాను. ఆయన నవ్వుతూ ఏమో నీకే తెలియాలి అని దాటేసి వెళ్ళిపోయారు. ప్రెస్ వాళ్ళు ఆశ్చర్య పోయారు. అక్కడ ఉన్న ఉమా వెంకట్రమ రెడ్డి సంతోషంగా, ఆశ్చర్యంగా నా దగ్గరకు వచ్చి, ఏమండి మీరు చెప్పేది నిజమేనా అని ఆత్రుతగా అడిగారు. ఆ తరువాత కొన్నాళ్ళకు గాను చెన్నారెడ్డిని తొలిగించి అంజయ్యను పెట్టలేదు.

చెన్నారెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. దానికి ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు గాంధీ భవన్ లో కలిసేవాడిని. ఆ తరువాత ముఖ్యమంత్రిగా మరి కొన్ని సార్లు కలుసుకొన్నాం.

చెన్నారెడ్డి రాగ ద్వేషాలు విపరీతంగా ఉన్న వ్యక్తి. ఆగ్రహావేశాలని దాచుకోకుండా వ్యక్తం చేసేవాడు. ఆయన్ను ప్రత్యేక ఇంట్రవ్యూలు చేసినప్పుడు జస్టిస్ట్ పింగళి జగన్ మోహన్ రెడ్డిని గురించి, కొందరు కాంగ్రెస్ నాయకుల గురించి చాలా ఘాటుగానే స్పందించేవారు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలి రోజులలో డాక్టర్ గా ప్రాక్టీసు పెట్టడం, పత్రిక నడపటం మొదలైన ఎన్నో విశేషాలు వివరంగా చెప్పేవాడు. ప్రత్యేక తెలంగాణాలో ఆయన పాత్ర వేరు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా గవర్నర్ గా ఆయన దోరణి వేరు. రాజకీయాలలో అవినీతి అనే అంశం చెన్నారెడ్డి కాలంలో ఒక ప్రత్యేకమైన చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తులాభారాలు, జరిపించిన తీరు జనాకర్షణ అయింది. చెన్నారెడ్డి నిర్భీతిగా వ్యవహరించేవారు. సభలలో తనకు ఇష్టమైనవారిని స్టేజిమీదకు పిలిచి కూచోబెట్టేవారు. అలాంటి అదృష్టం శ్రీమతి దుర్గా భక్తవత్సలం వంటివారికి దక్కింది. చెన్నారెడ్డి పదవిలో వుంటే క్షేమం అని వి.బి. రాజు అనేవాడు. శత్రువులను సైతం లోబరచుకున్న రాజకీయ చతురత ఆయనకున్నది. తనపై పోటీ చేసిన వందేమాతరం రామచంద్రరావును పిలిచి అధికార భాషాసంఘాధ్యక్షుణ్ణి చేసిన చెన్నారెడ్డి, అరమరికలు లేకుండా తన మామ పేరిట కె.వి.రంగారెడ్డి జిల్లా అని రూపొందించారు. మార్క్సిస్టు పార్టీ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యను డ్రైనేజి బోర్డు ఛైర్మన్.గా ఒప్పించటం చెన్నారెడ్డికే తగింది.

1 comment:

pasi said...

mukkalu mukkalu ga rayatam ok stayle anukuntunnara. andhra vallanu emina chestara vudyamam lo palgonakapotey ani meeru adiginappudu ayana emani spandincharu.

vishyam chepatam kante style ga chepataniki pramukhatanicharu post bagoledu

Post a Comment