సంజీవయ్యను సాగనివ్వలేదు

దళితుల ప్రథమ ముఖ్యమంత్రి
దామోదరం సంజీవయ్య (1921-1972)

నాకు బాగా ఇష్టమయిన వ్యక్తి దామోదరం సంజీవయ్య. కానీ, ఆయనతో నాకున్న పరిచయం చాలా స్వల్పమనే చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా రెండుమూడు పర్యాయాలు సన్నిహితంగా కలసి మాట్లాడ గలిగాను. ఆ రెండుసార్లూ కూడా తెనాలిలోనే కలియడం అనుకోకుండా జరిగిన విషయమే. తెనాలిలో శాసన సభ్యులు, సోషలిస్టు ప్రముఖులూ నన్నపనేని వెంకట్రావు ద్వారా 1970లో కలిసినపుడు సుదీర్ఘ చర్చలు చేశారు. సంజీవయ్య ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తెనాలిలో మూడురోజులపాటు బడుగు వర్గాల సమస్యలపై చర్చాగోష్ఠి వి.ఎస్.ఆర్. కాలేజీలో ఏర్పాటు చేశారు. దానికి వెంకట్రావుగారు నా సహాయం అడిగారు. చర్చకు కావలసిన హంగులు, పిలవాల్సిన వ్యక్తులు, చర్చించాల్సిన అంశాలు, అందుకు భూమికగా తోడ్పడే సాహిత్యం సమకూర్చడానికి నేను యధాశక్తి తోడ్పడ్డాను. ఇది 1970 నాటి మాట. సంజీవయ్య వచ్చిన తరవాత గోష్ఠిలో చర్చలు, ఉపన్యాసాలు చాలా లోతుపాతులతో హుందాగా జరిగాయి. డా.ఆర్.వి.ఆర్. చంద్రశేఖరరావు, డా. రాఘవేంద్రరావు, రావెల సోమయ్య, సూర్యదేవర హనుమంతరావు మరెందరో పాల్గొని చర్చల స్థాయిని పెంచారు.
సంజీవయ్యకు దళితుల, బడుగు వర్గాల అభివృద్ధిపట్ల అపారమైన శ్రద్ధ ఆసక్తి ఉండేవి. కానీ అందుకు తగ్గట్టు ఆయన చేయలేకపోవటానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలే కారణం. ఒకవైపు కులం, మరొకవైపు ముఠాలు ఇంకోపక్క అగ్రకులాల వ్యతిరేకతలు ఇత్యాది సమస్యలతో సంజీవయ్య సతమతమయ్యారు.
సంజీవయ్య మంచి వక్త. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ ధారాళంగా, మనోరంజకంగా మాట్లాడేవారు. అందునా తనకిష్టమయిన బడుగు వర్గాల అభివృద్ధి అంశం గనుక, చాలా ఆవేదనతో, ఉద్విగ్నంగా ప్రసంగించేవారు. విడిగా ఆయనతో వివిధ కోణాల నుంచి బడుగు వర్గాల సమస్యను చర్చించాము. కాంగ్రెసు పార్టీలో సంజీవయ్య ఉన్నందున అనుకున్నవన్నీ అమలుపరచటానికి వీలులేని పరిమితులు ఉన్నాయి. అంబేద్కర్ భావాలు, లోహియా ఆలోచనలూ, ఎం.ఎన్.రాయ్ ధోరణి బడుగు వర్గాల ఉన్నతికి తోడ్పడేదిగా అగుపించినా, పార్టీ ఓట్ల రాజకీయం వలన చాలా అంశాలలో ముందుకు పోలేని స్థితి కాంగ్రెసు పార్టీలో ఉన్నది. చర్చలలో అటువంటి విషయాలను సంజీవయ్య ప్రస్తావించినా, వేదికపై అలా మాట్లాడడానికి వీలుకాలేదు. కానీ బడుగు వర్గాల సమస్యలపట్ల ఆయన వెలిబుచ్చిన ఆవేదన మాత్రం ఆకర్షణీయమైనది. నా అభిప్రాయాలు ఆయన చెప్పినప్పుడు సంతోషించి నన్ను గురించి వివరాలు అడిగారు. నన్నపనేని వెంకటరావుగారు రాడికల్ హ్యూమనిస్టుగా నాకు సంబంధించిన అంశాలు చెప్పారు. ఏదైనా ఆ అనుభవాలు చాలా హత్తుకుపోయిన అంశాలు.
మరొకసారి తెనాలిలోనే ఆవుల గోపాలకృష్ణమూర్తిగారి వద్ద సంజీవయ్యగారిని కలుసుకోగలిగాను. ఆ సన్నివేశం భిన్నమయినది. ముఖ్యమంత్రిగా పర్యటన చేస్తున్న సంజీవయ్య విజయవాడ వెళ్ళి, పాత బస్తీలో ఒక అనాథ బాలికల ఆశ్రమాన్ని సందర్శించవలసి ఉన్నది. సంజీవయ్య అక్కడివరకు వెళ్ళారు. ఒక కొండ గుట్టపై ఆ అనాథబాలికల బడి ఉన్నదని తెలిసి, ‘’అంతపైకి నేను ఎక్కలేను’’ అని తిరిగి వెళ్ళిపోయారు. ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న అనాథ బాలికలు, యాజమాన్యం కుంగిపోయారు. ఈ విషయాల్ని ఆంధ్ర పత్రికలో వార్తగా ప్రచురించారు. ఆవుల గోపాలకృష్ణమూర్తి అది చూచి ‘’ముఖ్యమంత్రి పదవికి దేకగలిగినవాడు ఆమాత్రం గుట్ట ఎక్కలేకపోయాడా’’ అని వ్యాఖ్యానించాడు. అదే మాటలని యధాతథంగా ఆంధ్రపత్రిక తెనాలి విలేఖరి వెంకటప్పయ్య శాస్త్రి పంపగా ప్రముఖంగా ప్రచురితమయింది. అది చూచుకున్న ముఖ్యమంత్రి సంజీవయ్య వెంటనే చెపుతూ, ఆ వ్యాఖ్య బావున్నది, నాకు తగిలింది, నచ్చింది. నేను తక్షణమే కార్యక్రమం వేసుకొని అనాథ బాలికల ఆశ్రమానికి వెళుతున్నానని చెప్పి వెళ్ళారు. అక్కడ నుండి తెనాలికి వచ్చి గోపాల కృష్ణమూర్తిని కలిసి అభినందించారు. అప్పుడు నేనక్కడే ఉన్నాను. చాలా సేపు అనేక విషయాలు మాట్లాడుకున్నాము. గోపాలకృష్ణమూర్తిగారిపట్ల ఆయన ఎంతో ప్రేమ ఆసక్తి కనబరిచారు.
దామోదరం సంజీవయ్య రాజకీయాలలోకి వచ్చిన కొత్తలోనే మదరాసులో రాజగోపాలాచారిని ఆకర్షించారు. ఆ తరువాత ఆంధ్రలో వివిధ దశలలో హుందాగా ప్రవర్తించి పేరు తెచ్చుకున్నారు. కర్నూలు నుంచి వచ్చిన సంజీవయ్య ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ ఆకర్షించటం విశేషం.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి హఠాత్తుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలవలన రాజీనామా చేసి పోవలసి వచ్చింది. బస్సుల జాతీయీకరణను చేయడంలో పక్షపాతం వహించి తన ప్రత్యర్థి అయిన పిడతల రంగారెడ్డిని దెబ్బకొట్టాలని కర్నూలు జిల్లా బస్సురూట్లు జాతీయీకరణ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందువల్ల సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో తాత్కాలికంగా కేంద్ర మధ్యవర్తిగా దామోదరం సంజీవయ్యను 1960 జనవరిలో రాష్ట్రానికి తీసుకువచ్చారు. కనుక సంజీవయ్య శాసన సభలో అధిక సంఖ్యాకుల బలంతో వచ్చిన వ్యక్తి కాదు. సహజంగా కుల, ముఠా రాజకీయాల మధ్య సతమతమయ్యారు. బలీయమైన రెడ్డి వర్గం ఎ.సి.సుబ్బారెడ్డి నాయకత్వాన ఎదురు తిరిగి సొంత పక్షం పెట్టుకున్నారు. 1962లో ఎన్నికలు జరిగి తిరిగి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చినపుడు సంజీవయ్య పోటీ చేద్దామనుకున్నారు కానీ ఢిల్లీ నాయకత్వం అందుకు అంగీకరించలేదు. ఆ విధంగా సంజీవయ్య ముఖ్యమంత్రిత్వం స్వల్ప కాలానికే పరిమిత కావడంతో దళితులకు
ఏమంతగా చేయలేకపోయారు. ఎ.సి. సుబ్బారెడ్డి మరీ తలబిరుసుతనంతో కులం పేరు ఎత్తి సంజీవయ్యను ఎద్దేవ చేసాడు. ముఖ్యమంత్రిగా 1962లో దిగిపోయిన సంజీవయ్య, గవర్నర్ కు రాజీనామా సమర్పించిన మర్నాడే సికిందరాబాదులో తన భార్యను వెంటబెట్టుకుని అజంతా టాకీసులో సినిమాకని నడిచి వెళ్ళారు. త్రోవలో ఎస్.వి.పంతులు కనిపిస్తే రా పంతులూ సినిమాకి పోదాం అని ఆయనను కూడా వెంటబెట్టుకు వెళ్ళారు. ఈనాటి ముఖ్యమంత్రులలో అలాంటి ప్రవర్తన వూహించటం కష్టం.
కేంద్రానికి వెళ్ళిపోయిన దామోదరం సంజీవయ్య మంత్రిగా కొనసాగారు. చక్కని పేరు తెచ్చుకున్నారు. కార్మిక సమస్యలు బాగా పట్టించుకున్నారు. పారిశ్రామిక రంగంలో ఎదుర్కొంటున్న విషయాలు అధ్యయనం చేశారు. ఆయన రాసిన పుస్తకాన్ని ఆక్స్ ఫర్డ్ వారు ప్రచురించారు – లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్.
సంజీవయ్య 1972లో చనిపోవటం దళితులకు, బడుగు వర్గాలకు పెద్ద లోపం. ఆయనతో నాకున్న పరిచయం పరిమితమయినా అపరిమిత అనుభవాన్నిచ్చింది.

1 comment:

kvrn said...

chaala baagaa charitra loni chief ministers gurinchi vraasaaru. dhanyavaadaalu

Post a Comment