రాజకీయాలలో పెద్ద మనిషి - బెజవాడ గోపాలరెడ్డి

ఆంధ్రకు మలి ముఖ్యమంత్రి - బెజవాడ గోపాలరెడ్డి (1907-1987)1950లో బెజవాడను విజయవాడగా మార్చారు. బెజవాడ గోపాలరెడ్డిని అప్పటి నుండి విజయవాడ గోపాలరెడ్డి అంటారా అని జోక్ వాడుకలోకి వచ్చింది.

నేను హైస్కూలు చదువుతున్నప్పుడే బెజవాడ గోపాలరెడ్డి గురించి తెలుసుకుంటుండేవాడిని. పత్రికలు అందుకు ఆధారం. ఆయన 1937 నాటికే మంత్రి పదవి చేపట్టిన సీనియర్ నాయకుడు. కర్నూలు ఆంధ్ర రాజధానిగా ఉన్నప్పుడు నేను కొన్ని కారణాలుగా తరచు అక్కడికి వెళ్ళడం తటస్థించింది. అప్పుడే తొలిసారి గోపాలరెడ్డి గారిని ఆయన బంగళాలో కలియగలిగాను. గౌతు లచ్చన్న, గోవాడ పరంధామయ్యలతో కలిసి ఆయన బంగళాకు వెళ్లినప్పుడు నేను కాలేజీ విద్యార్థిని మాత్రమే. నమస్కరించి, పెద్దలు మాట్లాడుకుంటుంటే వింటూ కూర్చున్నాను. మధ్యలో నన్ను పరిచయం చేసి, లచ్చన్న గారు మిమ్మల్ని చూడాలి అని అంటే వెంటబెట్టుకొచ్చాను అని చెప్పారు. సంతోషం అంటూ గోపాలరెడ్డి గారు ఏవో కుశల ప్రశ్నలు వేశారు. ఆ తరువాత చాలా కాలం నేను గోపాలరెడ్డిగారిని కలియలేదు. కాని ఆయన రాజకీయ జీవితాన్ని గమనిస్తూ పోయాను. నేను కర్నూలులో రెండవసారి గోపాలరెడ్డి గారి బంగళాకు వెళ్ళినప్పుడు సినీనటి భానుమతి అక్కడ ఉన్నది. గోపాల రెడ్డిగారి ఇంటికి కళాకారులు, కవులు రావడం ఆనవాయితీ, సంస్కృతి, భాష, కళల పట్ల అభిమానం గల గోపాల రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా అలాంటి వారిని పిలిపించుకునేవారు.

1955 ఉప ఎన్నికలలో గోపాలరెడ్డిగారి ఉపన్యాసాలు విన్నాను. మిగిలిన వారికీ ఆయనకూ విమర్శలలో స్థాయీభేదం ఉన్నది. నెల్లూరు యాసతో చక్కగా, హుందాగా మాట్లాడేవారు. ఎన్నికల అనంతరం గోపాలరెడ్డి గారి ప్రాధాన్యత రాష్ట్రంలో తగ్గిపోయింది. ఆ తరువాత ఆయన గవర్నరుగా కేంద్రమంత్రిగా వెళ్ళారు. చాలాకాలం నేను ఆయన్ను కలుసుకోలేదు. చివరి దశాబ్దంలో మళ్ళీ సన్నిహితంగా ఉండగలిగాం. హైదరాబాదు వచ్చినప్పుడల్లా ఆయన కబురు చేసేవారు. జూబ్లీహిల్స్ లో మాగుంట సుబ్బరామిరెడ్డి గెస్ట్ హౌస్ లో బస చేసేవాడు. అక్కడ కలుసుకొని విందు ఆరగించి, కవితలు విని, కబుర్లు చెప్పుకోవడం రివాజు అయింది. నగరంలో ఏవైనా కార్యక్రమాలుంటే నన్ను తోడు తీసుకెళ్ళేవారు. మిసిమి పత్రిక సంపాదకులు ఆలపాటి రవీంద్రనాథ్ సన్నిహిత మిత్రులుగా గోపాలరెడ్డిని కలుస్తుండేవారు. కొన్ని పర్యాయాలు మేము ముగ్గురం కలసి కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళం. గోపాల రెడ్డి గారు ఉత్తర ప్రత్యుత్తరాలకు పెట్టింది పేరు. మేము ఇరువురం ఆవిధంగా చాలా ఉత్తరాలు రాసుకున్నాము. అందులో కొన్నిటిని నేను హైదరాబాదులోని స్టేట్ ఆర్కివ్స్ కు ఇచ్చాను. ఎప్పుడైనా నెల్లూరు వెడితే ఇంటికి వెళ్ళి కాసేపు కాలక్షేపం చేసేవాడిని. ఒకసారి అలా వెళ్ళినప్పుడు పెద్ద ఇంట్లో ఆయన ఒక్కరే కూర్చుని ఉన్నారు. ఆయన శ్రీమతి లోపల ఎక్కడో ఉన్నారు. నాకు కనీసం ఒక కప్పు కాఫీ ఇద్దామని సహాయకుడి కోసం కేక వేస్తే ఎవరూ పలకలేదు. నేను అందుకొని మీతో కాసేపు హాయిగా కబుర్లు చెప్పుకోవడానికి వచ్చాను. కాఫీలు అక్కరలేదు. మీరు ఆ విషయం పట్టించుకోనక్కరలేదు అని చెప్పాను. కానీ ఏమీ ఇవ్వలేకపోయాననే ఫీలింగు ఆయన ముఖంలో కనిపించింది. ఎన్నో పదవులు నిర్వహించిన గోపాలరెడ్డి గారు రిటైర్ అయిన తర్వాత అంత సాధారణ జీవితం గడిపారు. నేటి రాజకీయ నాకులతో పోల్చుకుంటే తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

గోపాలరెడ్డి గారు తరచు మదరాసు వెళ్ళినప్పుడు మిత్రులను తన వద్దకు రప్పించుకొనడం, తానే వారి దగ్గరకు వెళ్ళటం ఆనవాయితీగా ఉండేది. అలా కలిసేవరిలో చందూర్, డి. ఆంజనేయులు మొదలైనవారుండేవారు. నేను ఆంజనేయులుగారింట్లో కొన్నిసార్లు గోపాల రెడ్డిగారిని కలిశాను. అనేక సందర్భాలలో గత రాజకీయ జీవిత ఘట్టాలలో వివిధ అంశాల గురించి అరమరికలు లేకుండా అడిగేవాడిని. కొన్నిటికి దాటవేసేవారు. మరికొన్నిటిని పరిమితంగా చెప్పేవారు. ఆయనకు ఠాగోర్ కవితలు ఇష్టం. కొన్నిటిని తెలుగులోకి అనువదించారు. ఆ ప్రభావంలో కొన్ని రచనలు చేసారు. బెంగాల్ ప్రభావం ఆయన రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. అది నాకంత ఆకర్షణీయంగా అనిపించలేదు. కానీ, ఆయన మాత్రం తన రచనలు ప్రచురించినప్పుడు నాకు ఒక ప్రతి ఇచ్చేవారు. ఆమె అనే శీర్షికన రాసిన కవితలు వినిపించినప్పుడు, ఈ ఆమె అనే పాత్ర నిజ జీవితంలో ఎవరినైనా పోలి ఉన్నదా? అని ప్రశ్నిస్తే ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. గోపాలరెడ్డి గారితో పరిచయం సంభాషణలు కాలక్షేపాలు ఎక్కువగా రాజకీయేతరంగానే గడిచిపోయాయి.

విశ్వనాధ సత్యనారాయణకు జ్ఞానపీఠ్ అవార్డు విషయమై ఉన్న సందేహాలు తెర వెనుక జరిగిన కథనం, అవార్డు ఇప్పించిన తీరు గురించి ఎన్ని సార్లు గుచ్చి గుచ్చి అడిగినా గోపాల రెడ్డి గారు, అవన్నీ ఇప్పుడు ఎందుకులే అయిపోయిందేదో అయిపోయింది అని చెప్పేరే తప్ప అసలు విషయాలు బయట పెట్టలేదు. నేను కూడా తెగిందాకా లాగకూడదని అంతటితో వదిలేశాను.

గోపాలరెడ్డి గారికి కళలు, చెస్, హిందీ భాషాభి వృద్ధి బాగా ఇష్టమైన విషయాలు. ఆయన చుట్టూ ఎప్పుడూ కవులూ, గాయకులు, కళాకారులు కొలువు తీరుస్తూ ఉండేవారు.

1 comment:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

పెద్దలు గోపాలరెడ్డి గారి మీద నాకూ గౌరవభావం ఉంది.మన కాలేజీ లైబ్రరీలో అయన రాసిన ఆమె కవితల సిరీస్ చదివాను.కానీ నాకు అర్ధం కానిదేమంటే బెంగాలీ లో విసర్జన అని ఉంటే తెలుగులోనూ అదే పేరుపెట్టాలంటారా?? :)

Post a Comment