మూడుసార్లు ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు

కాంగ్రెస్ సంస్కృతి మార్చేసిన

ఎన్.టి. రామారావు
(1923-1996)
“నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్” అంటూ నినదించి, సైనిక దుస్తులు వేసుకుని, తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలు ఢిల్లీవరకూ తీసుకెళ్ళాలని ఎన్నికల ప్రచారంలోకి దిగిన ఎన్.టి.రామారావు రాజకీయ చరిత్ర సృష్టించారు. 1981లో తెలుగుదేశం పార్టీ పెట్టిన రామారావు నవమాసాలు నిండకముందే పార్టీని అధికారంలోకి తెచ్చారు. వామపక్షాలతో సహా అందరూ ఆయనను సమర్థించటం ఒక విశేషం. జీవితమంతా సినిమారంగంలో ఉంటూ హఠాత్తుగా రాజకీయాలలో ప్రవేశించి అనూహ్య మార్పును తెచ్చిన రామారావు, ప్రజల నాడిని తెలుసుకున్నట్లు భావించవచ్చు.
ఎన్.టి.రామారావు రాజకీయాలలోకి వచ్చేనాటికి నాలుగుతరాల వారిని తన నటనా ప్రాచుర్యంతో ప్రభావితం చేశారు. పౌరాణిక పాత్రలు, సాంఘిక పాత్రలు, ఆయనను జనంలో బాగా జ్ఞాపకం పెట్టుకునేటట్లు చేశాయి. మదరాసులో ఆయన వుండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రీకులు ఒక మొక్కుబడిగా మదరాసు వెళ్ళి ఉదయమే ఆయనను దర్శించుకుని వచ్చేవారు. ఎన్నికల నాటికి అవన్నీ పనిచేశాయి.
1981 నాటికి ఇందిరాగాంధీ పేకముక్కలవలె ముఖ్యమంత్రులను రాష్ట్రంలో నలుగురిని మార్చేసింది. అది జనానికి ఏవగింపుగా, అవమానంగా భావించేటట్లు చేసింది. ప్రజాస్వామ్యం స్థానిక నిర్ణయాలు తెలుగువారి గౌరవం మంటగలిశాయనే మాట ఆనోటా ఆనోటా ప్రబలింది. అలాంటి వాతావరణాన్ని ఎన్.టి.రామారావు, రాజకీయానుభవం లేకపోయినా తనకనుకూలంగా మార్చుకున్నాడు. పార్టీ పెట్టడానికి కొందరిని సంప్రదించాడు. ఆనుపానులు చూచుకున్నాడు. మొత్తం మీద సాహసించి రంగప్రవేశం చేశాడు.
ఆ దశలో నేను ఎన్.టి.రామారావును హైదరాబాదులో అప్పుడప్పుడు కలుసుకునేవాడిని. రామకృష్ణా స్టూడియోస్.లో ఉదయం నుండే ఆయన సందర్శకులను కలసి మాట్లాడేవారు. అప్పట్లో నాతోపాటు మహిపాల్ రెడ్డి, భీమ్ రెడ్డి, తుమ్మల గోపాలరావు మొదలైనవారం ఆయనను కలిశాము. అలాకలుస్తున్నప్పుడు కొందరు పార్టీ అభ్యర్థులుగా తమ పేరు సిఫారసు చేయమని నన్ను కోరారు. ఆ పొరపాటు మాత్రం చేయలేదు. అందువలన రామారావుగారితో ఎప్పుడైనా కలియడానికి యథేచ్ఛగా మాట్లాడటానికి సందేహించాల్సిన పని ఉండేది కాదు.
ఎన్.టి.రామారావు ఎన్నికల ప్రభంజనం తెచ్చినప్పుడు నేను టంగుటూరి ప్రకాశాన్ని గురించి ఈనాడులో ఒక పెద్ద వ్యాసం రాశాను. అందులో ఆయన జీవిత చరిత్ర నుండి ఉదహరించి సైమన్ కమిషన్ మదరాసు వచ్చినప్పుడు ఒక వ్యక్తి చనిపోతే అతనిని చూడటానికి ప్రకాశంగారు వెళ్ళారని, ఒక పోలీసు అడ్డు పెడితే పక్కనున్నవారు ఆయనను గురించి చెప్పగా పోనిచ్చాడని రాశాను. అంతేగాని గుండీ విప్పి తుపాకి గుండుకి ఎరగా చూపాడనే వదంతి నిజం కాదని రాశాను. ఆమాటలు ప్రకాశంగారి, తెన్నేటి విశ్వనాథంగారి రచన నుండే తీసుకున్నాను. అయినా వీరాభిమానులు నా మీద ఆగ్రహించారు. ఈ వ్యాసం చదివి ఎన్.టి.రామారావు ప్రభావితుడయ్యాడు అని నేను చెప్పను కాని, అదే సందర్భంలో ప్రకాశంపై ఆయన కొన్ని విసుర్లు విసరడంతో కొందరు ఆగ్రహించారు.
ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా వివిధ సందర్భాలలో నేను విలేఖరిగాను ఇతరత్రా కలిశాను. ఎప్పుడైనా సరే నన్ను ఆదరంగానే చూచారు. హిందీ అకాడమీవారు ఆయన గురించి ఒక వ్యాస సంకలనం ప్రచురించదలిచారు. అందులో ఒకటి నన్ను రాయమని వేమూరి సత్యనారాయణ కోరారు. హిందీలోకి అనువాదం చేసుకుంటామని చెప్పారు. ఒక వెయ్యి రూపాయలు డబ్బు కూడా ఇచ్చాడు. తీరా రాసి ఇస్తే అది నిశిత పరిశీలనతో ఉన్నదని రామారావుగారికి నచ్చకపోవచ్చునని అన్నారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదును ఎన్.టి.రామారావు అడిగినప్పుడు ఆ వ్యాసం బాగున్నదని ప్రచురించాలని ఆయన చెప్పారు. అందుకు రామారావు అంగీకరించడంతో వేమూరి వారు ముఖం చిన్నబుచ్చుకున్నారు.
మరొక సందర్భంలో రాజ్య సభ స్థానానికి పర్వతనేని ఉపేంద్ర, యలమంచిలి శివాజి మధ్య ఎవరు ఉండాలి అనేదానిమీద రామారావుగారి దగ్గర సిఫారసుల పర్వం నడిచింది. నేను శివాజీతోపాటు రామారావుగారి దగ్గరకు వెళ్ళటం చూసిన ఉపేంద్ర కొన్నాళ్ళు నామీద అలిగారు.
ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా కొన్ని సాహసోపేత నిర్ణయాలు, మహిళల హక్కులు, వెనుకబడిన వారికి రిజర్వేషన్లు గొప్ప మార్పును తెచ్చాయి. పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం కూడా సామాజిక విప్లవానికి నాంది పలికింది.
ఎన్.టి.రామారావు దగ్గర కొందరు చక్కని సలహాలిచ్చే పోలీసు అధికారులు (పర్వతనేని కోటేశ్వరరావు, అప్పారావు, రామ్మోహనరావు ఉండేవారు. అలాగే జయప్రకాష్ నారాయణ వంటి ఐ.ఎ.ఎస్. అధికారులు ఆయనకు హేతుబద్ధమైన సలహాలిచ్చేవారు. మూఢనమ్మకాలతో వక్రమార్గాలు పట్టించిన ఐ.ఎ.ఎస్. అధికారులు లేకపోలేదు. రామారావుగారికి బాబాల, మాతల పిచ్చి లేదు. దేవునిపట్ల భక్తి ఉన్నది. బుద్ధునిపట్ల అపార గౌరవమున్నది. అందుకే అతి పెద్ద విగ్రహాన్ని చేయించి హైదరాబాదు చెరువు మధ్యలో ప్రతిష్ఠింప చేశారు. తెలుగువారి కీర్తిని చాటే ప్రముఖలు విగ్రహాలను టూరిస్టు ఆకర్షణగా నెలకొల్పారు.
ఒక సందర్భంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శివరామమూర్తి కొన్ని ప్రచురణలు రామారావుగారికి బహూకరించడానికి నన్ను తోడురమ్మన్నారు. అలా పొద్దున్నే వెళ్ళినప్పుడు, ఇచ్చి తిరుగు ముఖం పట్టగా, గాడ్ బ్లెస్ యూ అని ఆయన అందరినీ అన్నట్లే పలికారు. నేను వెంటనే ఏ గాడ్ ? అంటూ “మీరే దేవుడనుకొని కాళ్ళు మొక్కుతున్నారు కదా వేరే దేవుళ్ళు ఎందుకు?” అన్నాను. ఆయన దగ్గర అలా మాట్లాడేవారు బహుశ వుండరు. కాని ఆయన రియాక్ట్ అయి, “అరే, నీవంటయ్యా ఏదో మాట వరసకి అన్నాన్లే” అంటూ నవ్వారు.
సత్యసాయిబాబా పుట్టపర్తి ఆశ్రమంలో హత్యలు జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావు విచారణకు ఉత్తరువులిచ్చి అవసరమైతే సాయిబాబాను అరెస్టు చెయ్యమన్నాడని తెలిసింది. నేను ఆయనను కలిసి అభినందించాను. చిరునవ్వు నవ్వాడు. కాని ముఖ్యమంత్రి ఉత్తరువులు అమలు జరగలేదు. ఆయన చుట్టూ ఉన్న సాయిబాబా భక్తులు ఆయనకు తెలియకుండానే అడ్డు పడ్డారని తరువాత ఆరా తీస్తే తెలిసింది. ముఖ్యమంత్రిగా రామారావు ఉన్నంతకాలం సాయిబాబా హైదరాబాదులో అడుగు పెట్టలేదు. ఒక సినిమాలో కూడా సాయిబాబా వంటి వ్యక్తిని ఆయన ఎగతాళిగా చిత్రించిన సందర్భం లేకపోలేదు. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి కాగానే సుప్రసిద్ధ జర్నలిస్టు, ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావుగారిని సాంస్కృతిక సలహాదారుగా వేసుకున్నారు. ఆయన అంగీకరించి నా సహాయం తీసుకుని ఫైల్సు చూచి నిర్ణయాలు తీసుకునేవారు. రామారావుగారికి ఆ విషయం చెబితే ఆయన సంతోషించారు. కానీ నార్ల నిర్ణయాలు కొన్ని కొందరికి కంటగింపుగా పరిణమించాయి. ముఖ్యంగా అకాడమీల విషయంలో అది గమనించదగింది.
ఎన్.టి.రామారావుకు కొన్ని బలహీనతలు ఉండేవి వాటిని ఆసరాగా పనులు చేయించుకున్నవారు లేకపోలేదు. ఆచార్య రంగాకు ప్రజలు నిధులు వసూలు చేసి రంగా భవన్ హైదరాబాదులో ఏర్పరచి ఒక ట్రస్టుగా దానిపక్షాన కార్యక్రమాలు జరిపించారు. ఆయన సేవలకు ప్రతిభకు చిహ్నంగా అది జరిగింది. అంతవరకూ బాగానే వుంది. రంగాగారికి సంతానం లేదు. కానీ ఆయన బంధువులు రంగా భవన్ పై కన్నువేసి ప్రజలిచ్చిన ఆస్తి కాజేయటానికి పబ్లిక్ ట్రస్టును ప్రైవేటు ట్రస్టుగా మార్పించారు. రంగా చేతనే అది అడిగించారు. అందులో వున్న అనౌచిత్యాన్ని పాటించకుండా ఎన్.టి.రామారావు అందుకు అంగీకరించారు. అలాంటి తప్పులు చేయకుండా వుంటే బాగుండేది.
ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా వుండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పై నేను ఒక సెమినార్ నిర్వహించి ఉస్మానియా విశ్వవిద్యాలయ లైబ్రరీలో, ఐ.సి.ఎస్.ఎస్. ఆర్ ఆధ్వర్యాన చర్చ పెట్టాము. అందులో యూనివర్సిటీ నడుస్తున్న తీరు దాని స్థాపకుడు జి.రామిరెడ్డి వందిమాగధులను చుట్టూ చేర్చుకుని ప్రమాణాలు దిగజార్చిన పద్ధతి విమర్శించాను. ఆయన శిష్యులు సెమినార్ లోనే దీనికి నిరసన తెలుపగా డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదు విమర్శ సదుద్దేశంతో జరిగిందని తప్పొప్పులు చర్చకు పెట్టటం మంచిదేనని అన్నారు. కానీ రామిరెడ్డి ఆయన శిష్యులు ఒక పట్టాన విమర్శను గ్రహించలేకపోయారు. సమాధానం చెప్పలేకపోయారు. అప్పటికి రామిరెడ్డి ఢిల్లీ వెళ్ళిపోయారు. అయినా ఆయన ఫోనులు చేసి నన్ను ఎదుర్కొనమని పురికొల్పారు. ఎలా ఎదుర్కోవాలో శిష్యులకు తెలియలేదు. అందువలన ఓపెన్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, కొందరు ప్రొఫెసర్లు యూనివర్సిటీ గ్రాంట్ లో రోజూ అధికారంలో ఉన్నవారి చుట్టూ తిరిగి నాకు వ్యతిరేక ప్రచారం చేశారు. పత్రికల వారిదగ్గరకు వెళ్ళి నా వ్యాసాలు ప్రచురించవద్దన్నారు. అందుకు ఎడిటర్లు అంగీకరించలేదు. బుక్ లింక్స్ వంటి ప్రచురణ కర్తల దగ్గరకు వెళ్ళి నా పుస్తకాలు అమ్మవద్దన్నారు. కానీ, కె.బి.సత్యనారాయణ వంటివారు అందుకు నిరాకరించారు. సెమినార్ లో పాల్గొన్న ప్రొఫెసర్ విల్సన్ వంటివారిని క్షమాపణ చెప్పమని ఆయన ఇంటికి వెళ్ళి అడిగారు. ఆయన నిరాకరించాడు. చివరకు చంద్రబాబు నాయుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఇంద్రా రెడ్డి, జస్టిస్ జగన్మోహన రెడ్డి, జస్టిస్ ఆవుల సాంబశివరావు దగ్గరకు వెళ్ళి నాపై ఫిర్యాదులు చెప్పి నన్ను బోయ్ కాట్ చెయ్యమన్నారు. వారు నవ్వుకొని పంపించేశారు. చివరి అస్త్రంగా ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు దగ్గరకు వెళ్ళి నాపై ఫిర్యాదులు చెప్పి చర్య తీసుకోమన్నారు. ఎన్.టి.రామారావు పెద్దగా నవ్వి, ఏం బ్రదర్, మాకేం సంబంధం ఈ విషయం, విమర్శలొస్తే మీకు చేతనయితే వారికి సమాధానం చెప్పుకోండి. అని పంపించేశారు. ఇదంతా నెలరోజుల ప్రహసనం. జర్నలిస్టులలో వి.హనుమంతరావు దగ్గరకు వెళ్ళి డేటా న్యూస్ ఫీచర్స్ నుండి నన్ను తొలగించమని కోరారు. ఆయన నిరాకరించాడు.
ఈ ప్రహసనం పూర్తయిన తరవాత ఓపెన్ యూనివర్సిటిలో ఒక ప్రొఫెసర్ వ్యాఖ్యానిస్తూ, మాకు నెలతప్పింది కాని ఫలితం మాత్రం దక్కలేదని, మేము ఎంత ఫూల్స్ అనేది రుజువైందని వాపోయాడు. ఈ ఘటనలో పాల్గొన్న వారెవరనుకున్నారు? ప్రొఫెసర్ హరగోపాల్, చేకూరి రామారావు, కె. మధుసూదన రెడ్డి, రిజిస్ట్రార్ నాగరాజు, ప్రొఫెసర్ శివలింగ ప్రసాద్, వైస్ ఛాన్సలర్ నవనీత రావు, సి.నారాయణ రెడ్డి మొదలైనవారు. ఔచిత్యం కోల్పోతే ఎలా ప్రవర్తిస్తారో ఎన్.టి.రామారావు చెప్పేవరకూ వారికి గ్రహింపు రాలేదు.

1 comment:

Rajendra Devarapalli said...

ప్రొఫెసర్ హరగోపాల్, చేకూరి రామారావు, కె. మధుసూదన రెడ్డి, రిజిస్ట్రార్ నాగరాజు, ప్రొఫెసర్ శివలింగ ప్రసాద్, వైస్ ఛాన్సలర్ నవనీత రావు, సి.నారాయణ రెడ్డి మొదలైనవారు---బ్రహ్మాండమైన బృందం అండి ఇన్నయ్య గారు :)

Post a Comment