భవనం వెంకట్రామ్
1932 - 2002
కాంగ్రెసు సంస్కృతి పూర్తిగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న రోజులలో కేంద్రం తన ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రులను పేకముక్కల వలె మార్చేసింది. చెన్నారెడ్డిని తొలగించి అంజయ్యను ఆయనను పక్కన పెట్టి భవనం వెంకట్రామ్ ను ముఖ్యమంత్రిగా చేశారు. అదంతా ఇందిరాగాంధీ అధిష్టానవర్గ చదరంగంలో భాగమే.
1978లో భవనం వెంకట్రామ్ విద్యామంత్రి అయ్యాడు. చెన్నారెడ్డి ఆయనను తరువాత కౌన్సిల్ సభ్యుడుగా చేశారు. ఆ దశలో డా.తంగిరాల సుభాష్ నాకు భవనం వెంకట్రామ్ ను పరిచయం చేశాడు. ఆయన సోషలిస్టు భావాలతో ఉన్న కాంగ్రెసు వాది. కలలు సంస్కృతి భాష సినిమాలు పట్ల బాగా ఆసక్తి ఉన్న రాజకీయవాది. రెడ్డి కులస్తుడైనా ఆలస్యంగా కమ్మ కులానికి చెందిన జయప్రదను పెళ్ళి చేసుకున్నాడు. ఇరువురూ గుంటూరు జిల్లాకు చెందినవారే. మెట్ట, మాగాణి అలవాట్ల కలయిక కూడా వారి జీవితంలో ఉన్నది. భవనం వెంకట్రామ్ చక్కగా మాట్లాడేవారు. ఎదుటివారిని ఒప్పించి అంగీకరింపచేయటంలో చాకచక్యులు. కానీ కాంగ్రెసు ముఠా రాజకీయాలలో ఇమడలేకపోయారు.
భవనం వెంకట్రామ్ విద్యామంత్రిగా ఉండగా కేంద్రంలో నెహ్రూ కుటుంబానికి సన్నిహితురాలైన శ్రీమతి షీలాకౌర్ ఢిల్లీలో విద్యామంత్రిగా ఉండేవారు. ఆమె రాష్ట్రానికి వచ్చినప్పుడు భవనం వెంకట్రామ్ పని తీరును ఆయన అభిరుచులను, సంస్కృతిని గమనించి అభినందించారు. ఉత్తరోత్తర అది చాలా పనిచేసింది. ఇందిరా గాంధీకి దగ్గరయిన షీలాకౌర్ రాష్ట్రంలో సంక్షోభం తొలగించటానికి అంజయ్య స్థానే ఎవరిని ముఖ్యమంత్రిని చెయ్యాలి అని ఆలోచిస్తున్న రోజులలో భవనం వెంకట్రామ్ పేరు సరైన సమయంలో సరైన వ్యక్తులకు చేరవేసింది షీలా కౌర్ మాత్రమే. మిగిలినవారెందరో తాము ఒక సమిధను సమర్పించామని అన్నప్పటికీ అసలు కీలకం అది.
భవనం వెంకట్రామ్ కు విద్యామంత్రిగా చక్కని అనుభవం వచ్చింది. ఆయన కొన్ని సదస్సులలో పాల్గొని ప్రసంగించటానికి నేను తోడ్పడ్డాను. ఉదాహరణకు సైంటిస్టులను ఉద్దేశించి హైదరాబాదు జూబిలీ హాలులో ప్రారంభోపన్యాసం విద్యామంత్రిగా చేయవలసి వస్తే నేను ఆయన ప్రసంగాన్ని రాసి ఇచ్చాను. సైంటిఫిక్ మెథడ్ ఎలా అమలు జరపాలి. సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి రాజ్యాంగం రీత్యా దాని ఆవశ్యకతను అందులో రాశాను. ఎ.బి.షా రాసిన సైంటిఫిక్ మెథడ్.ను ఆధారంగా తయారు చేసిన ఆ ఉపన్యాసాన్ని భవనం వెంకట్రామ్ బాగా చదువుకొని సభలో మాట్లాడాడు. సైంటిస్టులు చాలామంది ఆయనను అభినందించారు. అనుకోని అభినందనకు భవనం పొంగిపోయాడు. తరువాత వచ్చి నాకు చాలా ధన్యవాదాలు చెప్పారు. అప్పటి నుండి మేము అతుక్కుపోయాము.
భవనం వెంకట్రామ్ తటపటాయింపు ఎక్కువగా చేసిన వ్యక్తి. ఒకపట్టాన నిర్ణయాలు తీసుకోగలిగేవాడు కాదు. దానికి కారణం ఆయనకు మద్దత్తుగా రాజకీయవాదులు లేకపోవడమే. కానీ అన్ని పార్టీల నుండి ఆయనను మెచ్చుకునేవారు ఉండటం గమనార్హం.
ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంలో ఢిల్లీ యాత్రలు జరుగుతుండగా భవనం వెంకట్రామ్ నన్ను తోడుగా తీసుకెళ్ళేవారు. ముఖ్యమంత్రి అయిన తరవాత కూడా ఆయన అధికారంలో ఉన్న కొద్దికాలం ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళినా అన్ని పర్యాయాలు నేనూ వెళ్ళాను. అది మంచి అనుభవం. ఇందిరాగాంధీతో సన్నిహితంగా కలియడానికి ఆమెకు ఆనాడు పి.ఏ.గా ఉన్న పోద్దార్ బాగా తోడ్పడ్డాడు. ఢిల్లీదంతా అర్థరాత్రి రాజకీయం. భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధీని చాలా పొద్దుపోయిన తరవాతనే కలిసేవాడు. అప్పుడే మంతనాలు చేసేవాడు. అది కాంగ్రెసు సంస్కృతిలో భాగమైపోయింది.
నేను ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్.కు సన్నిహితంగా ఉండటం వలన నా సిఫారసుల కోసం అనేకమంది తిరుగుతూండేవారు. నేను ఏవీ పట్టించుకోకపోవడం వల్ల, నా వల్ల పనులు జరగవని నిర్ధారించుకుని దూరంగా పోతుండేవారు. అదొక గమ్మత్తయిన రాజకీయ వాతావరణం.
నేను స్నేహితుడుగానే భవనం వెంకట్రామ్ కు మిగిలాను. అయితే రాజకీయాలపై వ్యాఖ్యానాలు చేసేటప్పుడు మాత్రం సన్నిహితత్వాన్ని పక్కకి పెట్టి విమర్శను వ్రాశాను. అది భవనంకు కష్టమనిపించేది. తరువాత మర్చిపోయేవాడు. మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి ఎన్నో కబుర్లు చెప్పేవాడు. హైదరాబాదు ఆదర్శ్ నగర్ లో నేను వుంటున్న ఒక అద్దె ఇంటికి భవనం వెంకట్రామ్ తరచు వచ్చేవాడు. అప్పుడు ఆయన కోసం వచ్చిన ప్రముఖులలో వై.యస్. రాజశేఖర రెడ్డి, నారాచంద్రబాబునాయుడు, పాలడుగు వెంకట్రావు మొదలైనవారుండేవారు. అది నిత్యకృత్యంగా ఉండేది. అయినప్పటికీ నేను మాత్రం రాజకీయాల జోలికి పోకుండా ఉండగలిగాను. భవనం పదవి నుండి దిగిపోయిన తరవాత కూడా మా సన్నిహితత్వం అలాగే కొనసాగింది.
భవనం ముఖ్యమంత్రిగా ఉండగా ఏమీ చేయలేకపోయాడనే చెప్పాలి. ఎన్. జనార్దన రెడ్డి వంటివారు ఆయన మంత్రివర్గంలో ఉంటూనే ఆయనను ఖాతరు చేసేవారు కాదు. నాదెండ్ల భాస్కరరావు ఆయన ద్వారా ఏదో ఒక పదవిలో ప్రవేశించాలని విఫల ప్రయత్నం చేశారు. భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకారానికి ఎన్.టి.రామారావు రావటం చాలామంది ఆశ్చర్యం వేసింది. వారిరువురూ గుంటూరు ఎ.సి.కాలేజీలో విద్యార్థి దశలో స్నేహితులు. అదీగాక సినీరంగంలో భవనానికి కూడా ఆసక్తి ఉండేది. పి.వి.నరసింహారావు అంటే భవనానికి ఇష్టం ఉండేది. ఏడు మాసాల ముఖ్యమంత్రిగా చరిత్రలో ఆయన నిలిచిపోయాడు.
1982లో ఎన్నికలు వచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఢిల్లీ నుండి సూట్.కేసులతో నిధులు తెచ్చిందని చెబితే నేను మొదట్లో నమ్మలేదు. తరువాత భవనం వెంకట్రామ్.ను పిలిచి కొంతడబ్బిచ్చి అనంతపురంలో కాంగ్రెస్ అభ్యర్థులకు పంచమన్నారు. ఆయన ఆవిషయం నాతో చెప్పకుండా, అనంతపురం వెళ్ళొద్దాం రమ్మని కారులో తోడు తీసుకెళ్లారు. ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాం. ట్రావెల్స్ బంగళాలో బి.టి.ఎల్.ఎన్. చౌదరికి కాంగ్రెస్ నిధిని ఎన్నికల ఖర్చుల నిమిత్తం భవనం వెంకట్రామ్ ఇస్తున్నప్పుడు గమనించాను. ఆయన డబ్బు చాలదని సిఫారసు చేసి మరికొంత ఇప్పించమని అడిగాడు. ఆయన వెళ్ళిపోయిన తరవాత భవనాన్ని అడిగితే ఇందిరాగాంధీ నిధులు తెచ్చి పంచిన మాట నిజమేనని అందులో ఒక భాగమే తనకు అప్పగించారని చెప్పారు.
భవనం ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబునాయుడుకు స్టేట్ మంత్రి హోదా వుండేది. ఆయనను కేబినెట్ హోదాకు పెంచాలని వై.ఎస్.రాజశేఖర రెడ్డి కోరిక. ఢిల్లీ వెడుతున్నప్పుడు నాకావిషయం చెప్పి నన్ను కూడా వీలైతే ఒక మాట చెప్పమన్నాడు. రాజశేఖర రెడ్డి మిత్రులకు అరమరికలు లేకుండా అలా సహాయం చేసిన ధోరణి కనబరిచాడు. కానీ నేను అందులో పాత్ర వహించలేదు.
అసలు విషయం ఏమంటే కేంద్రం ఆమోదం లేకుండా ఏ మార్పూ చేసే అవకాశం భవనానికి లేదు. తన నిస్సహాయతను భవనమే నాకు చెప్పాడు.
ముఖ్యమంత్రికి సన్నిహితుడుగా ఉన్నందున నాకు కొన్ని మంచి అవకాశాలు లభించేవి. సుప్రసిద్ధ గాయని లతామంగేష్కర్ తన తండ్రిపేరిట ముషీరాబాదులో సంస్థ పెట్టటానికి స్థలం అడుగుదామని ఒకరోజు పొద్దున్నే భవనం ఇంటికి వచ్చింది. సమయానికి ఎవరూ లేరు. ఆమెతే మాట్లాడుతుండమని ఈలోగా తాను తయారయి వస్తానని భవనం చెప్పారు. ఆవిధంగా చాలా సేపు లతామంగేష్కర్.తో మాట్లాడి ఆమె అనుభవాలు తెలుసుకునే అవకాశం లభించింది. ఆశ్చర్యమేమంటే ముఖ్యమంత్రి ఇంట్లో అలాంటి సుప్రసిద్ధ గాయని వచ్చినప్పుడు అందరం కలిసి ఫోటో తీయుంచుకుందామంటే కనీసం కెమేరా లేదు. నేటి ముఖ్యమంత్రులకు, నాటి ముఖ్యమంత్రులకు ఎంతో తేడా అనిపించింది.
భవనం వెంకట్రామ్ విద్యామంత్రిగా ఉండగా యు.జి.సి. ఛైర్మన్ మాధురీదీక్షిత్ అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వచ్చింది. భవనం వెంకట్రామ్ నేను కలిసి వెళ్లాం. అయితే ఆమె సత్యసాయిబాబా భక్తురాలిగా పుట్టపర్తిలోని డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నది. అది అవమానకరమని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ వ్యక్తిగత భక్తి ముఖ్యం కాదని నేను వెంకట్రామ్ కు చెప్పాను. ఆయన అందుకు అంగీకరించి సాయిబాబా విద్యాసంస్థకి వెళ్ళలేదు.
బాబాలు, మాతలు భవనం వెంకట్రామ్ దగ్గరకు వచ్చినా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఒకసారి కడప నుండి శివస్వామి వచ్చి విబూది, పండు ఆయన చేతిలో పెట్టాడు. గాలిలోనుంచి అవి సృష్టించినట్లు చెప్పాడు. పక్కనే కూచున్న నేను భవనం వెంకట్రామ్ చెవిలో – ఒక గుమ్మడి కాయ ఇవ్వమనండి అని చెప్పాను. ఆయన అలాగే అడిగాడు. ఆ స్వామి తెల్లబోయి ఇవ్వలేనన్నాడు. చేతిలో పట్టే వస్తువులయితే హస్తలాఘవంతో కనికట్టు విద్యతో అవతలి వాళ్ళని భ్రమలో పడేస్తారు. ఆ స్వామి జూనియర్ కాలేజీ పర్మిషన్ కోసం వచ్చి ఇలాంటివి అడిగాడు. మొత్తం మీద వాళ్ళను భవనం దూరంగానే ఉంచేవాడు.
ఆయన హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పోస్టు భర్తీ చేయవలసి వచ్చింది. అనుకోకుండా నన్ను అడిగితే అప్పుడే హైకోర్టులో ఛీఫ్ జస్టిస్.గా రిటైర్ అయిన ఆవుల సాంబశివరావు పేరు చెప్పాను. భవనం వెంటనే అంగీకరించి నన్నే వెళ్ళి ఒప్పించమన్నారు. నేను ఆపని చేయగలిగాను.
భవనం హయాంలో జరిగిన ఒక మంచి కార్యక్రమం ఓపెన్ యూనివర్సిటీకి నాంది పలకటం. చదువుకోవటానికి అవకాశం లేక గ్రామాలలో ఉంటున్న వారికి విద్యా బుద్ధులు గరపటానికి పథకం ఉండాలని భవనం తలపెట్టాడు. ఆ ప్రయత్నంలోనే జి. రామిరెడ్డిని పిలిచి విషయాన్ని పరిశీలించమన్నాడు. ఆయన ఇంగ్లండు వెళ్ళి ఓపెన్ యూనివర్సిటీ పద్ధతిని చూసి వచ్చి రిపోర్టు ఇచ్చాడు. యూనివర్సిటీ నాగార్జున సాగర్ వద్ద పెట్టాలని భవనం తలపోశారు. చివరి దశలో వైస్ ఛాన్సలర్.గా జి.రామి రెడ్డికి పోటీగా జెన్ టిక్స్ శాఖాధిపతి ఓ.యస్ రెడ్డి ముందుకు వచ్చాడు. కానీ మేమంతా రామిరెడ్డినే బలపరిచాము. ఓ.యస్. రెడ్డి నాకు మిత్రుడే. ఆయనకు కష్టం వేసింది కూడా. కానీ భవనాన్ని ఒప్పించి చివరకు రామిరెడ్డి పేరుకే మొగ్గు కనబరిచాము.
భవనం వెంకట్రామ్ దిగిపోయిన తరవాత రాజకీయాలలో చురుకైన పాత్ర నిర్వహించలేదు. కానీ చివరి వరకూ నాతో సన్నిహితంగానే ఉండేవాడు. ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆయన వద్దకు ఆట్టే ఎవరూ వచ్చేవారు కాదు. పదవి లేనప్పుడు కాంగ్రెస్ సంస్కృతి అంతే.
4 comments:
ఫొటో మసకాఉంది.ఇంకా క్లియర్ గా ఉన్న ఫొటో మీ దగ్గర లేదనుకొంటాను. నాకు ఏ ఏదెనిమిదేళ్ళో ఉన్నప్పుడు భవనం వెకట్రామ్ముఖ్యమంత్రి గా ఉన్నారు. ఆయన ముఖమెలా ఉంటుందో చూద్దామనుకొంటే మీ మీరు పెట్టిన ఫొటో క్లియర్ గా లేదు.
వారికి మాతాతగారితో ఉన్న అనుబంధాన్ని గూర్చి ఒకపోస్ట్ వ్రాస్తాను.
భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకారానికి ఎన్.టి.రామారావు రావటం చాలామంది ఆశ్చర్యం వేసింది. వారిరువురూ గుంటూరు మ్యూజిక్ కాలేజీ నుండి విద్యార్థి దశలో స్నేహితులు...ఇన్నయ్య గారు,వాళ్ళిద్దరూ ఎ.సి.కాలేజీలో క్లాస్ మేట్స్ అని విన్నానే??
ఆసక్తి కరమైన సీరీస్.
Post a Comment