దేశ ఆర్థిక భవిష్యత్తును మార్చిన పి. వి. నరసింహారావు

పి. వి. (1921-2004)
“ఈ పాములు, తేళ్ళ బాధ పడలేకుండా ఉన్నాము” అని జి.సి.కొండయ్య (ప్రముఖ జనతా నాయకుడు) ఆరోజులలో వ్యాఖ్యానించేవారు. మొదట్లో ఆమాటలకు అర్థం తెలిసేది కాదు. తరువాత పాములపర్తి వెంకట నరసింహారావు, తేళ్ళ లక్ష్మీకాంతమ్మ సన్నిహిత సహచర్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడని గ్రహించాము. నవ్వుకున్నాము.
పి.వి. నరసింహారావు విద్యామంత్రిగా బ్రహ్మానందరెడ్డి కేబినెట్.లో నాకు పరిచయం అయింది. తెలుగు విద్యార్థి మాసపత్రిక (ఎడిటర్ కొల్లూరి కోటేశ్వరరావు, మచిలీపట్నం) ఇంటర్వ్యూలు, ఉపన్యాసాలూ ఆయన చాలా చక్కగా చెప్పేవాడు. అలా మొదలై క్రమేణా సన్నిహితులమయ్యాము. 1968లో నాటి ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకుడు (లోగడ తెలుగు స్వతంత్ర సంపాదకుడు) గోరాశాస్త్రికి కర్నూలులో 50వ జన్మదినం జరిపినప్పుడు ముఖ్య అతిథిగా పి.వి. నరసింహారావును తీసుకెళ్ళాము. నాడు కోట్ల విజయభాస్కర రెడ్డి జిల్లాపరిషత్ ఛైర్మన్ గా ఉండేవాడు. వ్యవసాయ శాఖాధికారి మండవ శ్రీరామమూర్తి, తెలుగు భాషా సంఘాధికారి సి. ధర్మారావు, నేనూ పూనుకొని సన్మానం చేసి గోరా శాస్త్రికి కొంత ఆర్థిక సహాయం చేయగలిగాము. ఒక సంచిక కూడా వెలువరించాము. ఆ సభలో పి.వి. నరసింహారావు గొప్ప ఉపన్యాసం చేశారు. ఆయనతో చాలా సేపు నేను కాలక్షేపం చేసి అనేక విషయాలు అడిగాను.
హైదరాబాదులో ఆయన మంత్రిగా ఉండగా, ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు వివిధ సందర్భాలలో గోరాశాస్త్రి, తేళ్ళ లక్ష్మీకాంతమ్మలతో కలసి పి.వి. దగ్గరికి వెళ్ళటం ఆనవాయితీ అయింది. తేళ్ల లక్ష్మీకాంతమ్మ మా కుటుంబానికి సన్నిహిత స్నేహితురాలు. ఆమె చిరకాలంగా రాజకీయాలలో ఉంటూ పి.వి. దగ్గరైంది. చాలా చనువుగా కొన్ని పర్యాయాలు చులకనగా పి.వి. నుద్దేశించి మాట్లాడేది. అది చాటున కాదు. ఎదటే. నేను ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. ఉత్తరోత్తరా పి.వి. ఇంగ్లీషులో ది ఇన్ సైడర్ అనే నవల రాసి లక్ష్మీకాంతమ్మను ఒక పాత్రగా చేసి అన్యాపదేశంగా ఎత్తిపొడిచారు. అది గ్రహించిన లక్ష్మీకాంతమ్మ బాహాటంగానే ఆయనను ఖండించింది.
నన్ను రాడికల్ హ్యూమనిస్టుగానే పి.వి. పరిగణిస్తూ పోయారు. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా నేను స్నేహపూర్వకంగా కలుస్తూ ఉండేవాడిని. చనువుగా ప్రశ్నలడిగేవాడిని. కానీ ఆయన దగ్గరనుండి అసలు విషయం రాబట్టటం అంత తేలిక కాదు. కరణం లౌక్యం అంతా ఉపయోగించేవాడు. ఉదాహరణకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించబోయేముందు కొన్నాళ్ళు పి.వి.ని దూరంగా పెట్టింది. అప్పుడు హైదరాబాదు ఆదర్శనగర్.లో పి.వి. ఉండేవారు. ఆమెపై వ్యంగ్య విమర్శనాత్మక రచన ఒకటి తలపెట్టారు. నేను కలసినప్పుడు ఒకటి రెండు పేరాలు వినిపించారు. అయితే అది ఇందిరాగాంధీని ఉద్దేశించిందా అని అడిగితే చెప్పలేదు. ఈలోగా ఇందిరా గాంధీ పిలుపు రావడం, ఢిల్లీ రాజకీయరంగంలో పి.వి. ప్రవేశించడం కీలకపాత్ర వహించడంతో ఆమెపై ఆగ్రహాన్ని దాచేశారు.
విశ్వనాథ సత్యనారాయణ సుప్రసిద్ధ నవల వేయిపడగలు హిందీలో సహస్రఫణి శీర్షికన పి.వి.నరసింహారావు అనువదించారు. నేను ఒకటి రెండుసార్లు ఈ విషయమై నిరసనను ఆయనకు సూచన ప్రాయంగా తెలియజేసాను. ఆయనేమీ అభ్యంతర పెట్టలేదు. అయితే హైదరాబాదు ఆకాశవాణిలో హిందీ విభాగంలో రామమూర్తి రేణూ పనిచేస్తుండేవారు. అదే విభాగంలో నా మిత్రుడు దండమూడి మహీధర్ ఉన్నందున నేను వెళ్ళి, రామమూర్తిగారిని కూడా పలకరిస్తుండేవాడిని. అప్పుడు తెలిసిన విషయం ఏమంటే సహస్ర ఫణి ఆయన రాస్తున్నాడని. కొన్నాళ్ళ తరువాత అది పి.వి.నరసింహారావు పేరుతో ప్రచురితమైంది. ఇరువురిలో ఎవరు ఏమేరకు అనువదించారో వివరాలు తెలియవు. రామమూర్తిగారిని ఒకసారి ఆ విషయం ప్రస్తావించి మీరు అనువదిస్తున్న సహస్ర ఫణి పి.వి.గారి పేరుతో వచ్చిందేమిటి? అంటే ఆయన మౌనమే సమాధానంగా ఇచ్చారు.
శాసనసభలో, లోక్ సభలో పి.వి. చాలా బాగా రాణించిన రాజకీయవాది. ఆయన బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు. పత్యేక తెలంగాణా ఉద్యమంలో సమైక్యవాదిగా నిలబడ్డారు. తరువాత ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు, సీలింగు పరిమితులు తలపెట్టినప్పుడు ఆయనపై భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. అప్పడు వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని కూడా చేదు అనుభవంగా పి.వి. చవి చూచారు.
ఆయన కేంద్రానికి వెళ్ళిన తరువాత నేను కలుసుకోవటం తగ్గింది. హైదరాబాదు వచ్చినప్పుడు రాజభవన్.లో కొన్నిసార్లు కలిసి మాట్లాడాము.
పి.వి.ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి అమెరికా రాజధాని వాషింగ్టన్.కు వచ్చి అక్కడ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు (దానిని హౌస్ అంటారు.) నేను ప్రెస్ లాబీలో ఉండి ఆయన ప్రసంగం విన్నాను. బాగా మాట్లాడారనిపించింది. ఆరోజులలో నేను వార్త దినపత్రిక విదేశీ ప్రతినిధిగా వాషింగ్టన్.లో ఉన్నాను. అటువంటి అక్రెడిషన్ రావడానికి మిత్రులు, వార్త ఎడిటర్ కె.రామచంద్రమూర్తిగారు తోడ్పడ్డారు. అక్కడనుండి తరచు వార్త వ్యాసాలు, ఇతర విశేషాలు పంపగా ప్రచురించేవారు. ఆశ్చర్యమేమంటే దేశప్రధానిగా పి.వి.మాట్లాడితే మర్నాడు అమెరికా దినపత్రికలలో ఒకమాట రాలేదు. నేను అశ్చర్యపోయాను. అంత క్రితం చిన్న దేశాలైన దక్షిణ కొరియా వంటి దేశాల ప్రధానులు మాట్లాడితే ప్రముఖంగా ప్రచురించడం చూశాను. ప్రెస్ క్లబ్.లో కొందరిని కదిలించి చూస్తే పి.వి.బాగా మాట్లాడటం ప్రధానం కాదు. అందులో కొత్త అంశం కానీ, అగ్రరాజ్యాన్ని ఆకర్షించే ప్రతిపాదనలు కానీ లేనందువలన అశ్రద్ధకు గురైంది అని చెప్పారు. అదే సందర్భంగా ఆయన ఒక మ్యూజియం సందర్శిస్తే అది ముఖ్యమైన వార్తగా వేశారు. అప్పుడు పి.వి.ని కలిశాను. ఆయన వెంట కొందరు జర్నలిస్టులు వచ్చారు. అలా వచ్చిన వారిలో కల్యాణీ శంకర్ ఉన్నది. ఆమె హైదరాబాదులో జర్నలిస్టుగా యు.ఎన్.ఐ.లో సీతారాం దగ్గర పనిచేసింది. తరచు ప్రెస్ కాన్ఫరెన్సుల తరువాత నా దగ్గరకు వచ్చి వివరాలు వివరణలు అడిగి రాసుకునేది. ఆతరువాత ఆమె ఢిల్లీలో జర్నలిస్టుగా ఉంటూ చాలా ప్రముఖ స్థానాలు ఆక్రమించింది. పి.వి.కి బాగా దగ్గరైంది. ఒక సందర్భంలో ఆమెను పక్కన కూర్చుండపెట్టుకుని తిరుపతిలో కల్యాణమహోత్సవంలో కూడా పాల్గొన్నారు.
పి.వి. ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్.ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది. ఆ ఖ్యాతి పి.వి.కి దక్కాలి. మరొకవైపు బబ్రీ మసీదు కూలగొట్టడం కూడా ఆయన హయాంలోనే జరిగింది. చూసీ చూడనట్లు పోనిచ్చాడనే నెపం ఆయనపై ఉన్నది.
పి.వి. వృద్ధాప్యంలో కంప్యూటర్ నేర్చుకుని వాడటం విశేషం. ఆయన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు.
పి.వి. పెయ్యనాకుడు విధానాన్ని అనుసరించి సమస్యలు తేల్చకుండా నాన్చి రాజకీయాలలో జిడ్డు వ్యవహారాలు నడిపాడని పేరున్నది. కొన్నిటిలో ఇది నిజమే. అలా ఉన్నప్పుడు సమస్యలు వాటంతటవే సద్దుకుపోతుండేవి. పి.వి.లో మరొక కోణం ఏమంటే కళలు, సాహిత్యం, రసజ్ఞత పట్ల అభిరుచి ఉండటం.
పి.వి.కి చాలామంది సన్నిహితులుగా ఉండేవారు. కొంతమందికి పరోక్షంగా మరికొంతమందికి ప్రత్యక్షంగా సహాయపడ్డారు. తన బాల్యమిత్రుడు సుప్రసిద్ధ కవి కాళోజీ నారాయణరావుకు పద్మభూషణ్ ఇప్పించినప్పుడు ఇబ్బందికర సన్నివేశం ఏర్పడింది. కమ్యూనిస్టులతో సన్నిహితంగా ఉంటున్న కాళోజీ అది స్వీకరించడానికి తటపటాయిస్తే పి.వి. పట్టుబట్టి ఒప్పించారు.
పి.వి. ని గ్రామాలలో దొర అనేవారు. ఆయన దేశ్ ముఖ్. ఎన్నో ఎకరాల ఆస్తి సాగులేకుండా వృధాగా పడుండేది. దేశంలో పరోక్షంగా బి.జె.పి. మతతత్వాన్ని వెనకేసుకొచ్చినట్లు బబ్రీమసీదు సంఘటనతో విమర్శకులు ఆరోపణలు చేయకపోలేదు. తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని ఆయనపై నంద్యాల పార్లమెంట్ సీటు ఎన్నికలలో ఎన్.టి.రామారావు పోటీ పెట్టక పోవడం గమనార్హం.

2 comments:

Veeragoni said...

ఎమున్నదో గర్వకారణం నాకైతే అర్థం కాలేదు.నూతన ఆర్థిక సరళీకరణ విధానాలతో అంతా ప్రైవేటుమాయమై సామాన్యునికి ఏదీ అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది.కలిగిన వాళ్ళకు అనుభవించ గలిగినంత సౌఖ్యం అంగట్లో దొరుకు తున్నది.సౌఖ్యలు కొనుక్కోగలిగిన గొప్పవాళ్లకు పి వి గొప్పవాడే.

Krishna K said...

@వీరగోని,
"ఎమున్నదో గర్వకారణం నాకైతే అర్థం కాలేదు" అన్నారు, జీతాలు కూడా ఇవ్వలెక అప్పుకావాలంటే, బంగారాన్ని విమానం లో తీసుకెళ్లి లండన్ లో కుదవ పెట్టి డబ్బులు తెచ్చుకొన్న రోజులు మర్చిపోయారా?
మన మార్కెట్ ను తెరవటం అనేది ఓ గొప్ప పనే, కాకపోతే మీరన్నట్లు అది మరీ సరళీకృతమై సామాన్యుడు గిల గిల లాడటం కూడా వాస్తవమే, రెండిటిని బాలెన్స్ చేయలేకపోవటం అనేది ఆయన తర్వాత వచ్చిన ప్రబుత్వాలదే లోపం కాని, తప్పని సరి అయిన పరిస్తితులలో గట్టి నిర్ణయాలు తీసుకొన్న PV ది దానికి తప్పు ఎలా అవుతుంది?
సామాన్యుడు దెబ్బ తినేలా, సరళీకృత విధానాలు తప్పే, కాకపోతే ఆ తప్పు జరగకుండా ఉండాలని మొత్తం మూసుకొని కూర్చొని, దేశం మొత్తాన్ని దివాళ తీయంచటం అంతకంటే పెద్ద తప్పు కాదా? అవసరార్ధం టెలిఫోన్ కావాలంటే, అయిదు, ఆరు సంవత్సరాలు వేచి చూసిన రోజులు (స్వానుభవం) మర్చిపోయారా? దేశం లో లభించే ఒకే ఒక స్కూటర్ కావాలంటే, కనీసం 15 నెలల నుండి, మూడు , నాలుగు సంవత్సరాలు వేచిచూసిన రోజులు మర్చిపొమ్మంటారా? పోనీ ఆ లైసెన్స్ రోజులలో సామాన్యుడు ఎమయినా వెలిగి పోయాడంటారా? మీ వయసు ఎంతో నాకు తెలియదు కాని, ఆ లైసెన్స్ రోజులలో కూడా సామాన్యుడు సుఖ పడింది అంటూ పెద్దగా ఏమీలేదు, చక్కెర దగ్గరనుండి కిరసనాయులు, సెమెంట్ వరకూ ప్రతిదీ బ్లాక్ లో కొనుకొన్న రోజులు అవి, బైపాస్స్ కావాలంటే విదేశాలకు వెళ్లటం ఒక్కటే మార్గం అనుకొన్న రోజులు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి :(

PV గురించి మాత్రం చాలా మంది అనేది ఏమిటి అంటే మాత్రం, చాలా క్లిష్ట పరిస్తితులలో, అయిదు సంవత్సరాలు నెగ్గుకు రావటమే కాకుండా, ఆశ వదిలేసుకొన్న దేశ ఆర్ధికవ్యవస్థను ఓ గాడిన పెడతానికి ఓ నాయకుడుగా ప్రయత్నించాడు అని. ఆ ప్రయత్నాన్నే అందరూ పొగిడేది, ఆ ప్రయత్నం లో తప్పులు జరిగి ఉండవచ్చు కాని, ఆ ప్రయత్నమే తను చేయకపోతే పరిస్థితి ఉహించలేనంత దారుణం గా ఉండేది అనే చాలామంది అంటూ ఉంటారు.
ఇన్నయ్య గారు, ఆ భావం లో వ్రాసారనే నేననుకొంటున్నాను.

Post a Comment