తానా సజీవ చరిత్ర - రచన: నరిసెట్టి ఇన్నయ్యనరిసెట్టి
సూచిక
  1. తానా మహాసభలు
  2. తానా యువజనోత్సవాలు
  3. తానా జన సేవ (ఫౌండేషన్)
  4. తానా పత్రికలు
  5. 20 మహాప
TANA-Logo.jpg

తానా సజీవ చరిత్ర
ఉత్తర అమెరికా తెలుగు చరిత్రలో తానాకు ప్రత్యేక స్థానం ఉన్నది. 40 ఏళ్ళ ప్రాయానికి చేరుకుంటున్న తానా 19 సమ్మేళనాలు వైభవంగా జరుపుకోగా, వాటిని మహాసభలుగా పేర్కొంటున్నాము. 2015లో 20 పర్వానికి దారితీస్తున్న తానా, మోహన్ నన్నపనేని అధ్యక్షతన   చరిత్రను తెలుగులో, ఇంగ్లీషులో ప్రజలకు అందిస్తున్నది.
సభలను రెండేళ్ళకొకసారి ఒక్కొక్క ప్రాంతంలో జరుపుతుండగా, నిరంతరంగా వివిధ జనసేవలు అందిస్తున్న తానా ఫౌండేషన్ ద్వారా, ఇతరేతరంగా తెలుగు ప్రజలకు సన్నిహిత మవుతున్నది. ప్రతి పర్వానికి ప్రచురించిన ప్రత్యేక సంచిక (సావనీర్) రచయితలను, కవులను, కళాకారులను, ఆహ్వానించి వారి విశిష్ట సందేశాలను ప్రజలకు అందించింది. తానా పత్రిక ప్రతి నెలా తెలుగువారికి వెలుగునిస్తూ పయనం సాగిస్తున్నది. తానా చరిత్ర సజీవం అనడానికి కారణం దీనికి ఆది ఉన్నది గాని, అంతం లేదు. ప్రస్తుతం చరిత్ర రాసే సమయానికి మోహన్ నన్నపనేని అధ్యక్షుడుగా, డా. జంపాల చౌదరి కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడుగా, సతీష్ వేమన కార్యదర్శిగా ఎన్నికై తమ సంఘంతో నిర్విరామ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటికి అర్హ స్థానం చరిత్రలో చూడవచ్చు.

ప్రతి తానా మహాసభ భక్తితో ఆరంభమై, రక్తితో రంజింపజేసే విధంగా ఇప్పటివరకూ జరగడం చరిత్రలో భాగం. ప్రత్యేక అతిథులతోబాటు స్థానిక ప్రతిభను గుర్తించి వివిధ కళాకారులను రచయితలను వేదికపైకి తెచ్చి, గుర్తింపునిచ్చి సమాజానికి సేవ చేయటం గమనార్హం.  సాహిత్యం, వాణిజ్యం, వైద్యం, స్త్రీ సమస్యలు చర్చించడానికి విడివిడిగా సమావేశాలు జరిపారు. భరతనాట్యం, కూచిపూడి, బాలివుడ్ ఫ్యూజన్, ఏకాంకికలు, అష్టావధానాలు, ఏకపాత్రాభినయాలు తానా సభల ప్రత్యేకతలు. రంగంలో ప్రతిభ కనబరిచినా వారిని పిలిచి యధాశక్తి తానా అవార్డులు ఇచ్చింది సత్కరించింది. తోటి సంఘాలను పిలిచి సన్నిహితత్వాన్ని కనబరిచింది.
సుప్రీంకోర్టు మొదలు పార్లమెంటు వరకు ఎందరో నిష్ణాతులను పిలిపించి తెలుగువారికి సందేశాలు అందింపజేశారు. అమెరికా సమాజంలో ఉన్న పరిపాలకులను తానాకు పిలిచి కలిసిమెలిసి పోయేతత్వాన్నిఆచరణలో చూపారు. తెలుగువారి ప్రత్యేక వంటకాలు సభలలో అందరూ మెచ్చుకునే విధంగా  విందు చేశారు. ప్రతి తానా మహాసభకి ఒక్కొక్క విశిష్టత ఏర్పడింది. అదే చరిత్రలో నిలుస్తుంది. అది అందించటమే రచన ఉద్దేశ్యం.
రచన:
  • నరిసెట్టి ఇన్నయ్య


తానా ఎలా ఆవిర్భవించింది ?
ప్రప్రథమ ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనం 1979లో డెట్రాయిట్ లో జరిగిన సందర్భంగా నామకరణం జరుపుకున్నది. దీనికి బీజాలు 1977 తొలి సమావేశంలో అంకురించాయి. సమ్మేళనం చివరలో వివిధ ప్రాంత తెలుగు సంఘాలవారంతా సమావేశమై చర్చలు జరిపి, వాటిని అమలుపరచటానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘాల సభ్యత్వంతో ఒక జాతీయ సంఘాన్ని రూపొందించాలనుకున్నారు. ఇందుకు గాను ఒక సమన్వయ కార్యవర్గాన్ని ఏర్పరచారు. డా. కాకర్ల సుబ్బారావు సమన్వయ కర్త కాగా డా. గుత్తికొండ రవీంద్రనాథ్, బండారు శివరామిరెడ్డి, తుమ్మల మాధవరావు, మన్నె రమణరావు సభ్యులుగా ఉన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం అని తొలుత నామకరణం చేసి కార్యవర్గం ఆధ్వర్యాన వాషింగ్టన్ డి.సి.లో పేరుపెట్టి 1978లో మేరీలాండ్ రాష్ట్రంలో తానాను రిజిస్టర్ చేశారు. అందు నిమిత్తం రూపొందించిన నియమ నిబంధనావళిని (రాజ్యాంగ సూత్రాలను) ప్రాతిపదికగా తీసుకున్నారు. ఆవిధంగా తానా పేరు (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అంకురించింది. 1979లో తానా సభలు డెట్రాయిట్ లో జరపాలని కూడా అప్పుడు నిర్ణయించారు. కాకర్ల సుబ్బారావు అధ్యక్షులుగా, తుమ్మల మాధవరావు కార్యదర్శిగా, ముక్కామల అప్పారావు కోశాధికారిగా తాత్కాలిక సంఘాన్ని ఏర్పరచి, తానా రాజ్యాంగాన్ని రూపొందించాలనుకున్నారు. ఇందుకుగాను జాస్తి వెంకటేశ్వర్లు, రామినేని అచ్యుతరావులతో ఒక సంఘాన్ని ఏర్పరచారు. దాని ప్రకారం ప్రాంతీయ తెలుగు సంఘాలకు తానాలో సభ్యత్వం ఉంటుంది. ప్రాంతీయ సంఘానికి కనీసం 25మంది సభ్యులు ఉండాలి. సంఘం తమ ప్రతినిధిని తానా సర్వసభ్య సమావేశానికి పంపించాలి. సర్వసభ్య సమావేశంలో తానా కార్యవర్గాన్ని తొలుత ఎన్నుకున్నారు. రెండేళ్ళకోసారి తానా ఎన్నికలు జరుగుతాయి. కాలక్రమేణా  సభ్యుల సంఖ్య పెరగడం కారణంగా తానాకు ప్రత్యక్ష సభ్యత్వం ఉండాలని భావించారు. తానా రాజ్యాంగంలో ఆమేరకు ఉత్తరోత్తరా మార్పులు చేశారు. సాంవత్సరిక సభ్యత్వాన్ని (by annual membership) తొలగించి వ్యక్తి సభ్యత్వాన్ని జీవిత సభ్యత్వాన్ని కల్పించారు. 1995లో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కార్యవర్గాన్ని కూడా తొలుత ఏర్పరచారు. తానా ఫౌండేషన్ 1981లో సృష్టించారు. తానా ఫౌండేషన్ లో కార్యక్రమాలు సాగించడానికి వీలుగా ఫౌండేషన్ ట్రస్టీ ఏర్పడింది.. 2009లో పేరు మార్చి తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని కూడా అన్నారు. రెండేళ్ళకోసారి తానా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో తానా రాజ్యాంగాన్ని అమలుపరచుటకు వీలుగా నిధులను సక్రమంగా వినియోగించే పద్ధతిలో కొన్ని మార్పులు చేశారు. ఇది తానా కట్టుదిట్టంగా కొనసాగటానికి ఉపయోగపడింది.తానా మహాసభలు
తానా చరిత్ర సజీవమైనది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం చరిత్రకు ఆది ఉన్నది గాని, అంతం లేదు.  భారత దేశం నుండి అమెరికా వచ్చిన వివిధ భాషా సంఘాల ప్రజలు ఏర్పరచుకున్న జాతీయ సంఘాలలో తానా ప్రథమ స్థానంలో ఉన్నది. భాషా సంఘానికి దక్కని అపూర్వ గౌరవం, ఘనత తానాకు లభించింది. అత్యంత జనాదరణ పొందిన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తానా సభలకు వచ్చి అమెరికా రాజధాని వాషింగ్టన్ లో సుదీర్ఘ ఉపన్యాసం చేసి గౌరవించారు. అటువంటి ప్రత్యేక స్థానాన్ని అలరించే తానా చరిత్ర ఇది.  19 మహాసభలు జయప్రదంగా ముగించి 20 పర్వం జరుపుకునే దశలో చరిత్ర రచన ఆరంభమయింది.
తానా చరిత్రలో ప్రధాన ఘట్టాలుగా రెండేళ్ళకోసారి జరిగే సభలు, జనాదరణ పొందుతూ సేవలు అందిస్తున్న ఫౌండేషన్, తానా విశేషాలను సమాచారాన్ని అధునాతన సూచనలను అందిస్తున్న తానా మాసపత్రిక మరొక మణిపూస. అమెరికాలో ఉన్న తెలుగు వారికి ఎప్పటికప్పుడు సమస్యాపరిష్కారం వైపుకు పయనించే ధోరణి తానా చేపట్టింది. చరిత్ర రచన జరుగుతున్నప్పుడు తానా అధ్యక్షులుగా మోహన్ నన్నపనేని ఉన్నారు. ఆయనతోబాటు ఎంపిక అయిన సంఘం చేస్తున్న పనులు తానాకు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెడుతున్నాయి. ఇదే ఉత్తరోత్తరా కొనసాగుతుంది.

తానా ఇలా మొదలయింది
నదుల పుట్టుకకు మొదలెక్కడో చెప్పటం కష్టం . చిన్న చిన్న పాయలుగా ప్రారంభమై మధ్యలో వచ్చి చేరిన పిల్లకాలువలను, ఉపనదులను కలుపుకుంటూ క్రమేణా విశాలంగా మారి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా పరిణమిస్తుంది. అలాగే తానా కూడా అతి సామాన్యంగా ఆరంభమై వేర్లు పాతుకున్నది.
తానా అంటే ఉత్తర అమెరికా తెలుగు సంఘం. (TELUGU ASSOCIATION OF NORTH AMERICA) అమెరికాలో భారతదేశం నుండి వచ్చి స్థిరపడిన వివిధ భాషలవారు సంఘాలు పెట్టుకున్నావాటన్నిటిలో కూడా దేశస్థాయి సంఘంగా తానాకే ప్రథమ పీఠం లభిస్తుంది. నానాటికీ బలపడుతున్న తానా అమెరికాలో అధ్యక్షస్థానం నుండి అన్ని స్థాయిలవారినీ సభలకు ఆహ్వానించి అలరించగలిగింది.
ఆర్భాటాలు లేని తానా తొలి మహాసభలు న్యూయార్క్ నగరంలో జరిగినప్పుడు దీర్ఘకాలం కొనసాగే రీతిలో గట్టి పునాదులు వేశారు. అధికారికంగా అప్పటికి తానా అన్న పేరు రాలేదు. అనేకమంది త్యాగాలు చేసి సమయం వెచ్చించిన తీరుకు క్రమేణా సత్ఫలితాలు దక్కాయి.
అలాగే 1983 వరకూ అతి వినయంగా హైస్కూళ్ళలో సమావేశాలు జరుపుకుంటూ, కమ్యూనిటీ హాళ్ళలో చర్చలు చేస్తూ, ఇళ్ళ నుండి సమకూర్చిన భోజన ఫలహారాదులు సేవించి, అటు ఉపన్యాసాలు, ఇటు సాంస్కృతిక ఉత్సవాలు ఆనందించారు.
ఆర్భాటాలు లేని తానా తొలి సభల ప్రాధాన్యత దృష్ట్యా చాలా వివరంగా విశేషాలను లభించినమేరకు పొందుపరుస్తున్నాము.
అటు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఇటు భారత అధ్యక్షులు కె. నారాయణన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్, తెలుగువారి ఖ్యాతిని దేశవిదేశాలలో చాటిన నందమూరి తారకరామారావు, పి.వి. నరసింహారావు, చంద్రబాబునాయుడు, రాజశేఖరరెడ్డి, యం. బాగారెడ్డి, ఆవుల మదనమోహన్, వెంకయ్యనాయుడు, పురంధరేశ్వరి, రామోజీరావు, వేణుగోపాల్ రెడ్డి వంటి నాయకులు సభలలో పాల్గొని తమ సందేశాలతో ఎంతో ప్రాధాన్యతను సమకూర్చారు. తానా ఇలాంటి ఘట్టాలతో నిరంతర చరిత్ర సృష్టిస్తూ సాగుతున్నది.

No comments:

Post a Comment