శాస్త్రీయ విధానం 2 వ భాగం-రచన: ప్రొఫెసర్ ఎ.బి. షా -తెలుగు: ఇన్నయ్య నరిశెట్టి

1. సాంకేతిక శాస్త్రం మనుషుల్ని మార్చేస్తుంది.


చాలామంది దృష్టిలో విజ్ఞానం అంటే సాంకేతికశాస్ర్తమే. ఇందులో ఆశ్చర్య పడవలసిందేమీ లేదు. మన జీవితవిధానంలో సాంకేతిక శాస్త్రం తెచ్చిన మార్పులు అలాంటివి. విజ్ఞానం లేకుండా ఆధునిక సాంకేతిక శాస్ర్తం ఊహించలేం. అయితే, సాంకేతిక శాస్త్రమే విజ్ఞానం కాదు. విజ్ఞానం చేసే పని జ్ఞానాన్వేషణే. సిద్ధాంతానికీ అన్వయానికీ ఉన్న సంబంధమే విజ్ఞానానికీ, సాంకేతిక శాస్ర్తానికీ ఉంది. విజ్ఞాన సిద్ధాంతాలను ఆచరణలో పెడితేనే సాంకేతిక శాస్త్రం తలెత్తుతుంది. ఉదాహణకు విద్యుదయస్కాంత తరంగాలు విజ్ఞానంలో భాగం. వీటి నియమాలను చూపే రేడియో, సాంకేతిక శాస్త్రంలో భాగం. ఈ ఉదాహరణ వల్ల మామూలు వ్యక్తి దృష్టిలో విజ్ఞానం అంటే సాంకేతికశాస్ర్తం ఎందుకైందో తెలుస్తుంది. సాంకేతిక శాస్త్రంలో మెరుగుదల ప్రభావాలు ఎవరికైనా కనిపిస్తాయి. విజ్ఞానసిద్ధాంతంలో ఉత్తరోత్తరాగాని అది స్పష్టపడలేదు.
ఇలా చెబుతున్నామంటే, మానవజీవితంపై సాంకేతిక శాస్త్రం ప్రభావం అశ్రద్ధ చేయదగిందని గాని, కృత్రిమం అనిగాని అర్థంగాదు. ఆ మాటకొస్తే అది తెచ్చిన మార్పుల ప్రాధాన్యం చాలా ప్రగాఢమైంది. మానవుడి భౌతిక, సాంస్కృతిక రంగంపై ఈ ప్రభావం ఎంతగా ఉన్నదంటే, ఆధునిక సాంకేతిక శాస్త్ర యుగారంభానికి పూర్వం జీవితం ఎలా ఉండేదో ఊహించడానికి చాలా ప్రయత్నం కావాలి. ఈ మార్పులు రెండు విధాలుగా ఉన్నాయి. చాలా మార్పులు మంచికే దోహదం చేశాయి. అశోకుడు, అలెగ్జాండర్, అక్బర్, మొదటి ఎలిజిబెత్ కాలంతో పోల్చి చూస్తే, సాంకేతిక మార్పుల వల్ల మానవజీవితం సంతోషంగానూ, భద్రతతోనూ ఉందనవచ్చు. అయితే కొన్ని మార్పులు మానవస్వేచ్ఛకూ, మానవ ఉనికికీ భంగం కల్పించేవిగా పరిస్థితులను సృష్టించాయి. మంచిచెడుల పట్టికను చూస్తే ఆధునిక సాంకేతికశాస్ర్త ఫలితాలు ఇప్పటివరకూ చెడుకంటే, చాలా మంచినే సమకూర్చి పెట్టినట్లు స్పష్టమౌతుంది.
ఈ నిర్ణయాన్ని కొంత వివరించడం మంచిది. నేడు విజ్ఞానం వల్ల చెడు ఫలితాలు వచ్చాయని వింటున్నాం. యంత్రానికి మానవుడు లొంగిపోయా డంటున్నారు. మానవ సంబంధాలలో లలితమైనవన్నీ వ్యాపార లక్షణాలుగా మారాయంటున్నారు. కొద్దిమంది చేతుల్లో అనూహ్యమైన వినాశక శక్తిని అందించిందంటున్నారు. కనక గత మూడువందల సంవత్సరాలలో జీవితాన్ని ఎలా విజ్ఞానం మార్చి వేసిందో సింహావలోకనం చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి సింహావలోకనం వల్ల విజ్ఞానం మానవజీవితంపై చూపిన ప్రభావాన్ని తులనాత్మకంగా అవగాహన చేసుకోవడానికి తోడ్పడుతుంది. అంతే గాక, సాంకేతికశాస్త్రం కంటే విజ్ఞానం చాలా ప్రభావాన్ని చూపుతుందని గ్రహించవచ్చు.
మానవజీవితంపై విజ్ఞాన ప్రభావం మూడు విధాలుగా ఉంటుంది. 1. సాంకేతికం, 2. సాంస్కృతికం, 3. తాత్వికం, విజ్ఞానం మానవుడికి ఏం చేసిందో ఈ మూడు కోణాలలో పరిశీలిద్దాం.


Scientific Method -2



2. విజ్ఞానపు సాంకేతిక ప్రభావం
విజ్ఞానంతో సాధ్యపడిన నాగరికతాభివృద్ధి అంశాలను లెక్కించడం సాధ్యం కాదు, అవసరమూ లేదు. మనం గుర్తించడానికి వీల్లేనంతగా సాంకేతిక శాస్ర్తం చేసిన మార్పులను కొన్ని ప్రధాన రంగాలలో ప్రస్తావిద్ధాం.
1793లో విట్నె శాస్త్రజ్ఞుడు జిన్ యంత్రాన్ని కనుక్కోక పూర్వం, ప్రత్తిని చేతితో తీసేవారు. ఇది చాలా జాప్యంతో కూడినదని వేరే చెప్పనక్కరలేదు. కనక ఉత్పత్తి స్వల్పంగా ఉండేది. అందరికీ చాలినంత వస్త్రం నేయడం, పత్తి ఉన్నా సరే సాధ్యమయ్యేది కాదు. విట్నె కనిపెట్టిన జిన్ యంత్రం వల్ల రోజుకు ఒక్కొక్క కార్మికుడు లోగడకంటే 50 రెట్లు ఆదనంగా పత్తిని బాగుచేయగలిగాడు. ఈ నాటికీ అందరికీ తగినంత వస్త్రం లభించక పోవడానికి కారణం ఆర్థికపరమైన వెనుకబడిన తనమే గాని, సాంకేతికం మాత్రం కాదు.
పత్తి విషయంలో లాగే ఇంచుమించు వినిమ వస్తువులన్నిటిలో ఇదే వాస్తవం. వస్త్రంలాగే, ఆహారాన్ని కూడా సమృద్ధిగా అందించవచ్చు. జనాభాను అదుపులో పెట్టి, వ్యవసాయంలో వైజ్ఞానిక పద్ధతులు అవలంబిస్తే సరిపోతుంది. ఉదాహరణకు, ఇప్పటి జనాభా ఇక పెరగకుండా కుటుంబ నియంత్రణ అవలంబించవచ్చు. పంటలు మార్చుతూ తగిన ఎరువులు వాడవచ్చు. నీటివనరులు, కట్టలు పోయడం, చీడ నివారణతో పంటతెగుళ్ళు అరికట్టడం, లోతుగా భూమిని దున్నడం, అందుకు మేలైన నాగళ్ళు వాడడం, ఇలా వెయ్యి పద్ధతులు అనుకరించవచ్చు. అప్పుడు ప్రతి భారతీయుడు ఆరోగ్యంగా, శక్తిమతంగా ఉండవచ్చు. నేటివలె కళ్ళు పీక్కుపోయి దిగాలుపడి ఉండనక్కర లేదు. మనకు నేడు ఆహారవస్తువుల కొరత ఉందంటే, సాంకేతికశాస్త్ర లోపం కాదు. సాంకేతిక శాస్త్రాన్ని అధికోత్పత్తి కోసం, ఆహారాన్ని సరిగా పంపిణీ చేయడం కోసం వినియోగించక అడ్డుపడే సామాజిక, సాంస్కృతిక లక్షణాలలో కారణాలను చూడవలసి ఉంది.
మనకు లోగడ తెలిసిన వస్తువులలో ఉత్పత్తి అధికం కావడానికి సాంకేతిక శాస్త్రం తోడ్పడటమే గాదు. మనం కలలోనైనా ఊహించని కొత్త వస్తువులను సృష్టించింది కూడా. ఉదాహరణకు, అక్బర్, శివాజీల కాలంలో కృత్రిమ నీలిమందు గాని, ఎరువుల నిమిత్తం నత్రజనిని తయారు చేయడం గాని ఎవరూ ఆలోచించి ఉండరు. అలాగే గనుల నుంచి బంగారాన్ని తీయడానికి సైనైడ్ పద్ధతిని, పెట్రోలియం వస్తువుల తయారీ, విద్యుత్-రసాయనిక పరిశ్రమ, స్టెయిన్ లెస్ స్టీల్, కృత్రిమ రసాయనిక వస్త్రాలు-నైలాన్, రేయాన్ వంటివి ఎవరూ కలగనలేదు.
రవాణా, వార్తా ప్రసారాల రంగంలో విప్లవం వచ్చింది. ఆవిరి యంత్రం కనుక్కోకముందు, అతి వేగంగా వెళ్ళే సాధనం గుర్రం మాత్రమే. గుర్రానికి హద్దులున్నాయి. బతికేది. కొద్ది కాలం, పోషణకు ఖర్చు ఎక్కువ. కనకనే దేశంలో ఎడ్లబండ్లు సర్వసాధారణంగా ఉండేవి. వేడికీ యంత్రశక్తికీ సంబంధం తెలుసుకునే అవకాశాన్నిచ్చింది. సముద్రాలను దాటడానికి, లోగడ తెలియని ఖండాలను కనుక్కోవడానికి దోహదం చేసింది. ఆవిరి యంత్రం ప్రపంచాన్ని ఐక్యపరచడం ప్రారంభిస్తే, జెట్ విమానాలు ఈ కృషిని పూర్తి చేశాయి. కొత్త శక్తి, వనరులు, పెట్రోలు, అణుశక్తి వల్ల మానవ చరిత్రలో మొదటిసారిగా, ‘ప్రపంచమే నా గృహం’ అనే భావాన్ని సాధారణ వ్యక్తిలో కూడా వచ్చేటట్లు చేశాయి. అభివృద్ధి చెందని మనదేశం వంటిచోట, లండన్లో, న్యూయార్క్ లో జరిగే వార్తలను పొరుగూరు వార్తలకంటే త్వరగా తెలుసుకోవచ్చు. విమానం, టేలిగ్రాఫ్, వైర్ లెస్, టేలివిజన్ వంటివి దూరాన్ని ఆటంకంగాకూండా చేసి, ప్రపంచ ప్రభుత్వం ఆవిర్భవించడానికి, సామాన్య మానవ సంస్కృతి రావడానికి ఉపకరించాయి. ఆధునిక ప్రసార సాధనాలు మానవ కుటుంబాన్ని సన్నిహితం చేసి, మానవుడు వినడాన్నీ చూడడాన్నీ వెయ్యి రెట్లు పెంపొందించాయి. కొత్త నక్షత్రాలు, పాలపుంతలు, సూక్ష్మజీవులు, ఎలక్ర్టాన్లు, శబ్దానికి రంగుకు చెందినవెన్నో మానవుడికి తెలిశాయి. ఇటువంటి ఆధునాతన నాగరికతా సౌకర్యాలు భారత గ్రామాలలోని మారుమూలలకు చేరలేదంటే సాంకేతిక అజ్ఞానం కారణం కాదు. దీనికి సాంకేతికేతర కారణాలు ఉన్నాయి.
ఇంజనీరింగ్ భవన నిర్మాణరంగంలో ఇటువంటి విప్లవమే వచ్చింది. పర్వతాలలో సొరంగాలు తవ్వడం, పెద్ద నదులపై వంతేనలు నిర్మించడం, ఆకాశ భవనాలు కట్టడం అందులో వందలాది కుటుంబాలు హాయిగా నివసించగలగడం, పేదలకు గుడిసెలస్థానే శాశ్వత గృహాలను నిర్మించడం, గాలి, వెలుతురు వచ్చే పాఠశాల భవనాలు, ఇవన్నీ లోగడ మహాశక్తి మంతమైన సామ్రాజ్యాలకు కూడా అనూహ్యమే. గతంలో పెద్ద సామ్రాజ్యాల రాజధానులకంటే నేడు పురపాలకవాడలలో సామాన్యుడు బాగా ఉంటున్నాడు. 300 సంవత్సరాలకు పూర్వం ఐరోపావారు వచ్చి స్థిరపడినప్పటి కంటే నేడు ముంబాయిలో జీవితం గుణాత్మకంగా పెంపొందింది.
ఆధునిక వైద్యం మానవజాతికి ఎలా వర ప్రసాదంగా మారిందీ చెప్పనక్కరలేదు. ఒకప్పుడు ఉన్నట్లు నేడు మలేరియా, కలరా, ఆటలమ్మ, ప్లేగు శాపాలుగా లేవు. సన్నిపాతజ్వరం, క్షయ అదుపులోకి వచ్చాయి. ఇప్పుడు భయానకంగా ఉన్న కేన్సర్ కూడా త్వరలో అలా కాకుండా పోతుందని ఆశించవచ్చు.
శస్త్ర చికిత్సను కూడా వైద్యాభివృద్ధితో పోల్చవచ్చు. కృత్రిమ శరీరభాగాలను అమర్చడం, కొత్త కంటిపాపలను పెట్టడం, గుండె, మెదడు శస్త్ర చికిత్స చేయగలగడం, కొన్ని సందర్భాలలో లింగమార్పుకూడా సాధ్యపడుతున్నది. ఆరోగ్య శాస్త్ర అభివృద్ధి ఫలితంగా చావులు తగ్గాయి. ముఖ్యంగా బాల్య మరణాలు తగ్గిపోయాయి. మంచి ఆరోగ్యంతో జీవన ప్రమాణం కొనసాగించే వీలు చిక్కింది. రెండు వందల ఏళ్ళ కితం పుట్టిన పిల్లలు యుక్తవయస్సు రాకముందే చనిపోతుండేవారు. సగటు జీవితం 30 ఏళ్ళు మాత్రమే ఉండేది. నేడు ఇండియా వంటి పేద దేశంలో సైతం బాల్య మరణాలు చెప్పుకోదగినంతగా తగ్గిపోయాయి. గత మూడు దశాబ్దాలలోనే జీవిత వయస్సు సగటున 36 నుంచి 42 ఏళ్ళకు పెరిగింది. పుట్టిన వారిలో ఎక్కువమంది బతుకుతున్నారు. ఎక్కువకాలం జీవిస్తున్నారు. ఆరోగ్య ప్రమాణాలు మెరుగుగావడం వల్ల సామాన్యుడికి భద్రత, సంక్షేమ దృష్టి వచ్చింది. జాతీయస్థాయిలో కుటుంబనియంత్రణ పథకం లేనందున జనాభా పెరుగుదల అనేది అభివృద్ధి చెందని దేశాలలో పెద్ద సమస్యగా మారింది.

Scientific Method 3

3. సాంస్కృతిక ప్రభావంలో సైన్స్ పాత్ర
విజ్ఞానాన్ని అన్వయించినందు వల్ల భౌతిక స్థితిగతులు మెరుగయ్యాయి. సాంస్కృతిక జీవనంపై కూడా బలమైన మార్పు కనబరచింది. బైబిల్, ఖురాన్, రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు వంటి ప్రమాణ గ్రంథాలు కోట్లాది ప్రజలకు, అందుబాటులో ఉండే ధరకు లభించడానికి ముద్రణాయంత్రం తోడ్పడింది. విద్యావ్యాప్తికి అవకాశం కలగడమేగాక ఎవరు కావాలన్నా విజ్ఞానం లభించే స్థితి వచ్చింది, ఈ విధంగా జ్ఞానాన్ని పవిత్రస్థానాల నుంచి మతరహిత రంగానికి తేవడంతో, ఇన్నాళ్ళు కొద్దిమంది అల్ప సంఖ్యాకులు స్వార్థంతో మానవజాతిని మూఢనమ్మకాలలో, మార్మిక స్థితిలో అట్టిపెట్టగా, అది నేడు తొలగే అవకాశం లభించింది. కులం హెచ్చుతగ్గులు పోగొట్టడానికి రైళ్ళు కొంత తోడ్పడ్డాయి. జ్ఞానం, పరస్పర సానుభూతితో మానవజాతి ఒకటిగా పెంపొందించడానికి అచ్చుయంత్రం ఉపకరించింది. లోగడ దేవుడి ఆజ్ఞానుసారం సమాజంలో హెచ్చుతగ్గులు ఉన్నాయనేవారు.
నేడు అందరికీ అందుబాటులో రేడియో, పుస్తకాలు, పత్రికలు, సినిమాలు ఉండడం వల్ల సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి దోహదం కలిగింది. దూరంగా ఉన్న ప్రదేశాలలో ఏమిజరుగుతున్నదో తేలుసుకోవడానికి నేడు ఎవరూ లక్షాధికారి కానక్కరలేదు. హ్యూయన్ సాంగ్ లాగ యాత్రికుడు కానక్కరలేదు. సముద్రంలోతులలో జీవితం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎవరూ గజయీత గాళ్ళుగా మారనక్కరలేదు. సమకాలీన, ప్రాచీన ప్రపంచ విషయాలు గ్రహించడానికి ఎవరూ ఐరోపా, అమెరికా వెళ్ళనక్కరలేదు. ఆరుభాషలు నేర్వనక్కరలేదు. ఇదంతా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజలు, సంపద, స్థితిగతులు, కులం, వృత్తితో కూడా నిమిత్తం లేకుండా, పుస్తకాలు ప్రచారసాధనాలతో ఇటువంటి కృషి జరుగుతున్నది. చావు అనేది అందరికీ సమానత్వం ఇచ్చింది. సైన్సు వల్ల సమానత్వం అనేది అందరికీ సాధ్యమని చెబుతున్నది.
జ్ఞానం, సమాచారంలాగే కళలు కూడా గ్రామాలలో గుడిసెలకు చేరాయి. అజంతా, ఎల్లోరాగుహల శిల్పాలు చూడవచ్చు. రవిశంకర్, గులాం అలీఖాన్ సంగీతం వినవచ్చు. షెక్స్ పియర్ నాటకాలు లండన్లో ప్రదర్శిస్తుంటే తిలకించవచ్చు. ఓవల్ రంగస్థలంలో క్రికెట్ ఆటను ఆనందించవచ్చు. చంఢీఘడ్ భవన సౌందర్యాన్ని, న్యూయార్క్ ఆకాశహర్మ్యాలను తిలకించవచ్చు. ఇంట్లో నుంచి కదలకుండా ప్రపంచంలోని కళలను, వినోదాలను అనుభవించవచ్చు. కళలు, ఆలోచనలను ఆధునిక సాంకేతిక శాస్త్రం మన ఇళ్ళకు తెచ్చి పెట్టింది. అర్థ శతాబ్దం కిందటి వరకూ సాధ్యం కానప్పటికీ, నేడు పౌరుడు ప్రపంచవ్యక్తిగా భావించుకునే స్థితిని కల్పించింది.


4. అపస్వరాలు
ఇంతవరకు ఆధునిక సాంకేతికశాస్త్ర సత్ఫలితాలనే గమనించాం. కాని ఇంకోవైపు కూడా లేకపోలేదు. ఆధునిక సాంకేతిక శాస్ర్తంపై విమర్శ చాలా వరకు సరిగాలేని మాట వాస్తవమే. విమర్శకుడు ఎప్పుడూ, ఎన్నడూ లేని స్వర్ణయుగాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. పారిశ్రామిక విప్లవాన్ని కొందరు ఖండిస్తారు. మనిషిని యంత్రంగా మార్చి వేసిందని, పనిలో ఉండే సృష్టి ఆనందాన్ని తీసేసిందని అంటారు. పారిశ్రామిక విప్లవం రాకముందు ఏ సమాజాన్ని చూసినా లక్షలాది ప్రజలు ఆకలితో అలమటించారన్న విషయం విస్మరిస్తున్నారు. ఢక్కా ముఖమల్ నేతపనిలో నిమగ్నులైన పనివారు చిన్నవయస్సులోనే అంధులైన విషయం కూడా మరచిపోయారు. అంత మాత్రాన ఢక్కానేత పని నగిషీతనాన్ని కాదనడం లేదు. ఒక కాలాన్ని నిర్ణియించేటప్పుడు కేవలం ఉద్వేగభావాలతో, కొన్ని లక్షణాలను మాత్రమే స్వీకరించి, కొట్టుకుపోరాదు.
పారిశ్రామిక ఉత్పత్తికి ముందున్న రోజులలోని విమర్శనే, పారిశ్రామిక నాగరికతలోని కొన్ని విషయాలకు అన్వయించవచ్చు. స్వార్థం ప్రబలడం, నైతికవిలువలు పతనం కావడం, కుటుంబం విచ్ఛిన్నం కావడం, యువతరం తిరుగుబాటు ఇటువంటివే. ఒక్క విషయంలో ఆధునిక విమర్శకులు సాంకేతిక శాస్ర్తం గురించి స్పష్టంగా చెబుతున్నారు. ఆధునిక సాంకేతిక శాస్త్రం ప్రభుత్వాలకు ఇచ్చిన విపరీతశక్తితో పోల్చి చూస్తే, గతంలోని చక్రవర్తులు ఎందుకూ కొరగాని వారనిపిస్తుంది. శాశ్వత సైన్యాభివృద్ధి, రోడ్లు, నీటిరవాణా, వైర్ లెస్ ప్రసారాలు, మరతుపాకులు, సాయుధశకటాలు, జెట్ బాంబర్లు, అణ్వాయుధాలు, పౌరులకు అత్యవసరంగా సరఫరా చేసే నీరు, విద్యుత్ లను కూడా కేంద్రం అదుపులో పెట్టడం, ఆధునిక పద్ధతులలో మనస్సులను మూసబోసినట్లు చేయడం-ఇత్యాదులన్నీ, నిరంకుశత్వా నికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడడానికి వీల్లేకుండా చేశాయి. తిరుగుబాటులు విఫలం అయ్యే స్థితిని కూడా కల్పించింది. హంగరీ, టిబెట్లో జరిగినదాన్ని బట్టి, ఈ శతాబ్దంలోనే ఐరోపాలోని అనేక దేశాలలో ఈ విషయం వాస్తవమని రుజువైంది. పాలకవర్గాలు స్వయంగా కొన్ని మానవ విలువలను విశ్వసిస్తున్నప్పుడు మాత్రమే ప్రజలలోని అసంతృప్తి వైదొలగుతుంది. అటువంటి విలువలను పాలకులు అభిలషించడమనేది వారి సంస్కృతిని బట్టి ఉంటుందేగాని, సాంకేతిక శాస్త్రానికి సంబంధం లేదు. సాంకేతిక శాస్త్రం వల్ల వారు కోరుకునే విలువలు సమర్ధవంతంగా సాధించడానికి తోడ్పడుతుంది. వారి సంస్కృతి మానవత ఉదారతత్వంతో ఉంటే తమపాలనను కాపాడుకునే నిమిత్తం ఒక హద్దును మించి బల ప్రయోగం చేయరు. వారికి ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది. వారి సంస్కృతి పెత్తందారీ తనానికి, సమిష్టి వాదానికి చెందినదై ఉంటే మార్పును హింసాయుత సమాజంలో తేవాలనుకున్నా చాలా కష్టం. రెండో ప్రపంచ యుద్ధానంతరం సాధారణ ఎన్నికలలో మితవాదులు 1945లో ఓడిపోయినప్పుడూ, 1947లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని లార్డ్ అట్లీ ప్రభుత్వ ఆక్రమణలను విరమించడం ప్రారంభించినప్పుడూ ఉదార సంస్కృతి లక్షమాలు కనిపించాయి.
1956లో హంగరీలోనూ, 1959లో టిబెట్లోనూ, నాజీ నియంతృత్వం కింద ఐరోపాలోనూ జరిగినవి జ్ఞప్తికి తెచ్చుకుంటే నియంతృత్వ సంస్కృతి లక్షణాలు అర్థమౌతాయి.
పెత్తంగారీ సంస్కృతికి తోడ్పడే సాంకేతిక శాస్ర్తం మానవస్వేచ్ఛను నాశనం చేస్తుంది. అసలు మానవజాతినే తుడిచిపెట్టే ప్రమాదమూ లేకపోలేదు. అధికార దాహంతో ఉన్నవాడు చేసినా, శాంతి కోరుతున్నప్పటికీ భయపడి ప్రయోగించిన పాలకుడు చేసినా సరే, అణ్వస్త్రయుద్ధ ఫలితం ఒక్కటే. మానవజాతి నాశనం అవుతుంది. మానవుడి సాంస్కృతిక పరిణామాభివృద్ధి వల్ల సాంకేతిక శాస్త్రాన్ని అదుపు చేయడం అవసరం. అంతర్గతంగా ఉన్న పెత్తందారీతనం, మూఢనమ్మకాల నుంచి మానవుడు విమోచన పొందాలి. తన విధికి తానే నిర్ణేత అని మానవుడు భావించడమే గాక, ఈ విషయమై స్పష్టత అవసరం. ఏ సిద్ధాంతమైనా ఆత్మ హత్య సదృశంగా పరిణమించరాదు.
ఇక్కడే విజ్ఞానం యొక్క విమోచనా పాత్ర నిర్వహించాలి. మానవుడిని మానవుడుగా పెంపొందేటట్లు విజ్ఞానం తోడ్పడుతుంది. మానవుడు కేవలం మాంసపు ముద్దకాదు. అతడు ఈర్ష్య అసూయల నుంచి, మూఢనమ్మకాల నుంచి బయటపడాలి, సమస్యలను నిష్పాక్షికంగా చూడడానికీ, వాటి పరిష్కారం ఫలప్రదంగా చేయడానికీ తన ఆలోచనకు తగ్గట్లు హుందాగా ప్రవర్తించడానికీ, నైతికజీవిగా ఉండడానికీ విజ్ఞానం తోడ్పడుతుంది. విశ్వం, అంటే ఏమిటో తెలుసుకోవడానికీ, తనను తాను అర్థం చేసుకోవడానికి సైన్స్ ఉపకరిస్తుంది. గత మూడు వందల సంవత్సరాలలో ప్రకృతి రహస్యాలను తెలుసుకోజాలనప్పుడు ఇదంతా అసంభవం. విజ్ఞానం మానవుడి జీవితాన్ని, విశ్వాసాన్ని మార్చి వేసిన తీరు చాలా ప్రధానమైంది. సాంకేతిక శాస్త్రం తెచ్చిన మార్పుకంటే ఇది చాలా గణనీయమైంది.


5. శాస్త్రంతో విమోచన
విద్యవల్ల విముక్తి లభిస్తుందనేది విజ్ఞానపరంగా వాస్తవం. అజ్ఞానం, మూఢనమ్మకాలు, వాటి వల్ల కలిగిన రాగద్వేషాల నుంచి మానవుడిని విముక్తుడిని చేయడంలో విజ్ఞానం ఉపయోగపడింది. ఇటీవలి వరకు తనను తెలుసుకోవడానికి, విశ్వాన్ని తెలుసుకోవడానికి ఈ నమ్మకాలు అడ్డుపడి, మానవుడిని హేతుబద్ధంగా నైతికంగా పరిపూర్ణదశకు రాకుండా చేశాయి.
ఈ వియోచన ఎలా ఉన్నదో చూడాలంటే, వందేళ్ళ కిందట ఈ దేశంలో ఇంచుమించు అందరూ, నేటికీ కొందరు, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, జీవ నిర్జీవ వస్తువులు, సముద్రం, గాలి, మానవుడి గురించి ఏమనుకున్నారో చూస్తే సరిపోతుంది. ఈ నమ్మకాలు మన ఆదర్శాలను నిర్ధారణ గావించాయి. మతేతరంగానూ పారలౌకికంగానూ ఎలా ప్రభావితం చేశాయి, వ్యక్తిగతంగానూ, పరస్పర వ్యక్తుల మధ్య సంబంధాలలోనూ ఈ ప్రభావం ఎలా ఉన్నదీ తెలుసుకోవచ్చు. మానవుడిని గురించి, లోకాన్ని గురించి మన భావాలను, విజ్ఞానం దృష్ట్యా ఎలా పునరాలోచించుకోవాలో పరిశీలించాలి. ఆధునిక విజ్ఞానం సూచించిన ధోరణిలో మన దృష్టిని మార్చుకుంటే మానవుడిలోని సృజనాత్మక శక్తులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. అప్పుడు సాంకేతిక శాస్త్రాన్ని మానవుడి మంచితనం కోసం మలచవచ్చు. విధ్వంస లక్ష్యాలకోసం దుర్వినియోగ పరచకుండా ఆపవచ్చు.
ఖగోళ శాస్త్రం
పురాణాలలో లోకం అంతా స్వర్గనరకాలుగానూ, భూమిగానూ విభజించారు. ఇవి ఒకదానిపై ఎకటి ఆధారపడి ఉండగా భూమి అడుగున పాతాళ లోకంలో, ఆదిశేషు వీటన్నిటినీ మోస్తుంది. ఆ సర్పంపై విష్టువు శనించి ఉంటాడు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలన్నీ ప్రత్యేక దేవతలకు నివాసాలు. రాహువు, కేతువులు తరచు సూర్యచంద్రులను కబళిస్తుంటాయి. అప్పుడు గ్రహణా లేర్పడతాయి. కాంతి పుంజాలు వెదజల్లే ఈ నిస్సహాయ దేవతలను రాహు కేతువుల కబంధ హస్తాల నుంచి తప్పించటానికి పూజా పునస్కారాలతో ఎన్నో వస్తువులు సమర్పించుకోవలసి ఉంది. గ్రహణాలే కాక, వరదలూ, కరువు కాటకాలూ, భూకంపాలూ అన్నీ ఏదో ఒక దేవతకు అంటగట్టారు. వాటి ముందు మానవుడు నిస్సహాయుడు. ఆరాధనతో దేవతలను శాంతింపజేయటం, లేదా పూర్తిగా లొంగిపోవడం, కాదంటే, యోగాభ్యాసం, తపస్సు వల్ల కొన్ని శక్తులు సంపాదించటం మాత్రమే మానవుడు చేయగలిగింది. అంతేగాని దైవశక్తి పనిచేసే తీరును, వివేచనాత్మకంగా తెలుసుకొని వాటి బారి నుంచి తప్పించుకోవటం, లేదా మరొక మార్గాన్ని చూడటం అనేది జరగదన్న మాట. నియమ బద్దమైన ప్రకృతి అనే భావన వస్తువులలోగాని, తీరు తెన్నులలో గాని చూడలేక పోయారు. సైన్సు వల్ల నియమబద్దత వచ్చింది.
నక్షత్రాలను, గ్రహాలను, దేవతా నివాసాలుగా నేడు అందరు మానవులు నమ్మటం లేదు. దుష్ట దేవతల ప్రయత్నం వల్ల శిష్టమైన వాటిని నాశనం చేయటానికి గ్రహణాలేర్పడుతున్నాయని అందరూ నమ్మటంలేదు. మనం ఇప్పుడు, గ్రహణాలను ఊహించవచ్చు. లోగడ మనలను ఆశ్చర్య పరిచే అనేక సంఘటనలను ఇప్పుడు, గంటలూ, నిమిషాలతో సహా అంచనా వేసి చెప్పవచ్చు. భూమి సూర్యుని చుట్టూ గంటకు 65 వేల మైళ్ళ వేగంతో తిరుగుతున్నదని తెలుసుకున్నారు. దీని కాధారంగా శేషనాగు లేదుగాని, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి నిలబడిందని గ్రహించాం. సూర్యోదయం, సూర్యాస్తమయం, సముద్రాల ఆటుపోట్లు, రుతువుల మార్పులు, ఏడాదికొకసారి పక్షులు, చేపలూ వలసపోవడం, నక్షత్రాల, మనుషుల, జీవజాలాల పుట్టుక, చావు కూడా దేవుడు, దేవతవల్ల గాక, అంతర్గతంగా ఉండే నియామాల వల్ల జరుగుతున్నాయి. మానవుడి వివేచనకు ఇవన్నీ అవగాహన అయ్యేవే. తన సాంస్కృతిక పరిణామ భిన్నదశలలో మానవుడు తనను పోలిన దేవుడిని సృష్టించుకున్నాడు. ఈ విషయాలన్నీ తెలియటం వల్ల ఇంతకు ముందెన్నడూ లేనంతగా మానవుడి సృజనాత్మక శక్తి విమోచన పొందింది.


No comments:

Post a Comment