రాజకీయాలు-అధికార పార్టీలు
v
(నవ్య మానవవాద తత్త్వం, ఆచరణపై ఇచ్చిన రెండో ఉపన్యాసం, 1949, జనవరి 26న బొంబాయిలో ప్రసంగించారు)
నవ్య మానవవాదం, సంపూర్ణ సంఘటనలను వివరించటానికి ప్రయత్నిస్తుంది. సమగ్ర ఆలోచనా విధానంలో ఇదొక భాగంగా వుంటుంది. ప్రధానంగా ఇదొక సాంఘిక తత్త్వం, మానవ ప్రవర్తనకూ, మానవ సంబంధాలకూ చెందినట్టిది, కనక దీనికి రాజకీయ దృక్పథం కూడా ఉన్నది. గత రెండు వందల సంవత్సరాలుగా రాజకీయ కార్యకలాపాలకు, రాజకీయ సంస్థలకూ మరీ అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. దీనివల్ల సామాజికంగా అనేక ముఖ్యమైన విషయాల మీదికి దృష్టి మళ్ళలేదు. సామాజిక ఉనికి రాజకీయ ప్రవర్తనను, సంబంధాలనూ ప్రభావితం చేస్తుంది. ఈ దృష్ట్యా నవ్య మానవవాదాన్ని, ఆచరణను చూడవలసి ఉన్నది. రాజకీయేతరంగా మానవ సంబంధాలు, ప్రవర్తన కూడా ప్రారంభించవలసి ఉన్నది.
నవ్య మానవవాదం ధ్యానంతో కూడిన ఆలోచనా విధానం కాదు. అద్దాల మేడలలో అందరికీ దూరంగా ఉంటూ, పెంపొందించిందీ కాదు. సామాజిక ప్రక్రియల అనుభవం వల్ల ఆవిర్భవించింది కనక మానవుల సామాజిక అనుభవమే దీనికి గీటురాయి. ఈ విషయం సంశయం వెలిబుచ్చుతున్న కొందరు ఇలా ప్రశ్నిస్తున్నారు. వివేచన, నైతిక ప్రవర్తనపైన ఆధారపడిన నవ్య మానవవాదం ఊహాకల్పన కాదా?
కొన్ని యుగాలుగా మానవ ఆలోచనను విషపూరితం చేస్తూ వెన్నాడుతున్న భావన దృష్ట్యా ఇటువంటి సందేహం తలెత్తుతున్నది. ఈ సందేహం చిరకాలంగా వ్యక్తపరుస్తున్న ప్రశ్నలలోనే ఉన్నది. మానవ స్వభావం మారగలదా? మానవ స్వభావం ఎలాగున్నదో అలాగే ఉన్నది అనే సంప్రదాయ అభిప్రాయాన్ని అంగీకరిస్తే, మారడానికి వీలులేని లక్షణాలు కొన్ని ఉన్నాయని, అవి ఎప్పుడూ మారవనీ ఒప్పుకుంటే, నవ్య మానవవాదం ఆచరణలో పెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవలసి ఉంటుంది. ఇంకా నికృష్టమైన విషయమేమంటే, స్వేచ్ఛ నిమిత్తం కొత్త సాంఘిక వ్యవస్థను సృష్టించే ప్రయత్నాలన్నింటినీ వదులుకోవాలి. మానవ స్వభావం మారనిదైతే స్వేచ్ఛ ఎప్పుడూ దుర్వినియోగమవుతుంటుంది. ఆధునిక మానవులలో అనేకమంది స్వేచ్ఛను ఎక్కువగా అనుమతించే సంస్థలు కావాలనీ, కొత్త సాంఘిక సంబంధాలను సృష్టించాలనీ కోరుకుంటున్నారు. మానవ చరిత్రలో అన్ని కాలాలలోనూ ఇటువంటి కోరిక ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా మానవులు ఇలా అభిలషించటం మానవ స్వభావానికి విరుద్ధమా… మానవ స్వభావం మారటానికి వీలులేనిదైతే మాత్రం విరుద్ధమే అవుతుంది. ఇటువంటి విరుద్ధ స్థితి ఎలా వచ్చింది? అసలు సమస్యను ప్రక్క తోవకు పట్టించి, మానవ ప్రగతికి అనుకూలించే రీతులను తల్లకిందులు చేసినందువల్ల ఇది జరిగింది. మానవ స్వభావం మారదనీ, అయితే సాంఘిక సంస్థల్ని మారిస్తే అవే మానవ స్వభావాన్ని కూడా మారుస్తాయనీ వాదించారు.
సంస్థలకు దోషపూరితంగా ప్రాధాన్యత ఇవ్వడం, వ్యక్తులను వారి మానాన వారిని వదిలివేయటం ఒక విషవలయానికి దారితీసింది. అదే నేటి సంక్షోభానికి మూలకారణం. మంచి సంస్థలు మానవ స్వభావాన్ని మార్చి మెరుగుపరచగలిగితే, మంచి సంస్థలను, మంచి వ్యక్తులు మాత్రమే సృష్టించగలరని కూడా అనుభవం చెపుతున్నది. సంస్థలు ఎంత మంచివో, వాటిని సృష్టించే మనులూ అంతే. ఇదొక విషవలయం దీన్ని ఛేదించడానికే మానవాదం వ్యక్తులకు ప్రాధాన్యతను ఇస్తున్నది. మానవతావాద ఆచరణలో తొలుత అన్నిటికంటే ప్రధానంగా మానవ వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తారు. హేతువాదులు, నైతికవాదులు ఎక్కువగా పెంపొందేటట్లు చేస్తారు. అటువంటి వారు పెనుభూతాలుగా మారని రాజకీయ సాంఘిక సంస్థల్నిసృష్టిస్తారు. మానవ వ్యక్తిత్వం ఇంకా పెంపొందటానికి ఈ సంస్థలు బంధాలు కారాదు. మానవాభివృద్ధికి సాధనంగా, ఉన్నత మానవ సంస్కృతీ సంస్థలను సృష్టించేవిగా ఇవి తోడ్పడాలి.
నమ్మడమే మానవ స్వభావం అనీ, మౌలికంగా, అంతర్లీనంగా మారని మానవస్వభావంలో నమ్మడం అనే పిపాస ఉన్నదనీ చెపుతున్నారు. నమ్మడం అంటే ఉన్నదాన్ని ఆమోదించడం, అవి అలా ఉన్నాయని అనుకోవడం. మానవ అవగాహనకు హద్దులున్నాయని, అలాగే మానవ జ్ఞానానికి పరిమతి ఉన్నదని, ఇంతకు మించినవన్నీ కేవలం వ్యవస్థాపితమై ఉన్నట్లు భావించాలనీ అనుకుంటున్నారు. అలౌకిక, మానవాతీత, పారమార్థికతలోనే మానవ స్వభావానికి పునాదులున్నాయనీ, వీటిని కదిలించటానికి వీలులేదనీ భావం అన్నమాట.
భారత సామాజిక జీవనంలో ముఖ్యమైనదీ, భారత సంస్కృతిలో ఆధిక్యత వహించినదీ మతం కనక, పాశ్చాత్య, ఆధునిక రాజకీయ విజ్ఞానం పేర్కొంటున్న సెక్యులర్ రాజ్యాన్ని ఇండియాలో సృష్టించటం సాధ్యం కాదంటున్నారు. భారతీయ స్థితిగతులకు మానవ స్వభావం మారదనే సూత్రాన్ని అన్వయిస్తున్నారన్నమాట. భారత ప్రజల స్వభావం మారదనే సూత్రాన్ని అన్వయిస్తున్నారన్నమాట. భారత ప్రజల స్వభావం నమ్మడమే నన్నమాట. కనక సెక్యులర్ ప్రాతిపదికలు, వివేచనాయుతమైన ఆలోచన గల రాజకీయ సాంఘిక సంస్థలకు ఇండియాలో అవకాశం లేదన్నమాట.
మానవ స్వభావం ఎన్నడూ మారదని భావించటంతో మొదలుపెడితే ఈ విషవలయం నుంచి బయటపడలేం. అభ్యుదయం అనే భావనకు స్వస్తి పలకాల్సిందే. స్త్రీ, పురుషులు వ్యక్తలుగా పొందిన అభివృద్ధని బట్టే ప్రగతి నిర్ణయించటం సాధ్యం అవుతుంది. వ్యక్తులు అభ్యుదయాన్ని వ్యక్తం చేయలేకపోతే సమాజం వికసించదు. మానవ స్వభావంలో మారనిదంటూ ఏదైనా వుంటే మానవ అభ్యుదయానికి పరిమితి ఉన్నదన్నమాట. చిరకాలంగా వస్తున్న ఈ నమ్మకాన్ని మానవతావాదం ప్రశ్నిస్తున్నది. నిరంకుశంగా, మొండిగా ప్రశ్నించటం లేదు. ఆధునిక విజ్ఞానం అండ చూసుకొని ఇలా చేస్తున్నది.
మానవుడికీ, ప్రకృతికీ తొలుత ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేసినప్పుడు, మానవ శాస్త్రాలు పరిశోధించినప్పుడు ఆదిమ మానవునిలో కేవలం గుడ్డి నమ్మకం లేదనేది సృష్టపడింది. మానవునిలోని అంతర్గత వివేచన మాయాజాలంగానూ, మూఢ నమ్మకాలుగానూ, రాగద్వేషాలుగానూ ఆదిలో వ్యక్తమయినట్లు సంస్కృతికి సంబంధించి చరిత్రకారులు వివరించారు. మానవుని స్వభావంలో స్థిరంగా ఏదైనా వుంటే అది నమ్మకం కాదు. అతని వివేచన, హేతు స్వభావం, ప్రతి దానికీ, సరైన వివరణ కనుగొనాలనే పిపాస మాత్రమే.
ఇది కేవలం మానవునికి మాత్రమే పరిమితమైన ప్రత్యేక లక్షణమేమీ కాదు. వివేచన అనేది (హేతువు) జీవ పరిణామక్రమంలో, నిర్ధారించబడి, కొనసాగుతున్నది. దీనికి నియమబద్ధమైన ప్రకృతి ఆధారంగా ఉన్నది ప్రకృతిలోని హేతువు మానవుడిలో వివేచనగా వ్యక్తమవుతున్నది. వివేచనలో మార్మికత ఏమీ లేదు. వివేచనకు మూలం జీవం లేని భౌతిక విశ్వంలో కనుక్కొనవచ్చు. పదార్థ ఉనికి పొందికగా ఉండటం తప్ప తప్ప ఇందులో మార్మికత లేదు. ఈ పొందిక అనేది జీవ, మానసిక రీతులలోనూ, మొత్తం మనుగడలోనూ కనిపిస్తున్నది. మానవ స్వభావానికి నమ్మడమే ప్రధానమని చెప్పడానికి మతాన్ని ఆధారంగా చూపుతున్నారు. మానవుడు తన పరిసరాలలోని భౌతిక సంఘటనలను వివరించటానికి మతాన్నీ సృష్టించాడు. మానవుడి మనుగడకు పరిసరాలే ఆధారం కావడం వల్ల ఇలా జరిగింది.
మానవుడు తన మనుగడ వల్ల, పరిసరాలు ఎందుకు, ఎలా ఉన్నాయో తెలుసుకొని ముందుకు సాగపోతే, వాటిని అదుపులో పెట్టడం అనూహ్యమవుతుంది. జరగబోయేవాటికి వూహించి తాను వాటి హఠాత్పరిణామాలకు లోనై, నాశనం కాకుండా కాపాడుకోవలసిన అవసరమున్నది. సంబంధం లేని సంఘటనల వెనుక ఏదో ఒక నియమం ఒక క్రమం, ఒక పొందిక చూడదలచిన ఆదిమ మానవుడు, సహజ సంఘటనలను, అలౌకిక శక్తి ఏదో నడిపిస్తున్నదని భావించాడు. ఈ శక్తులే ప్రకృతి మత దేవతలైనాయి. సహజ సంఘటనల వెనుక అలౌకిక శక్తులున్నాయనడం, ఆదిమ, వైజ్ఞానిక ప్రతిపాదన మాత్రమే. నేటికీ పూర్తిగా తెలియని సహజ సంఘటనలను వివరించటానికి విజ్ఞానం కొన్ని ప్రతిపాదనల మీద ఆధారపడుతున్నది. గతంలోని జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఇటువంటి ప్రతిపాదనలు చేస్తున్నది. కాని ఆదిమ మానవుడు, తగినంత జ్ఞానంలేని రోజులలో ఏదో ఒక ప్రతిపాదనను, నిరంకుశంగా చేయవలసి వచ్చింది. ప్రతి భౌతిక సంఘటనకు, పొందిక వుంటుందనే భావనకు మానవ అనుభవమే ఆధారంగా ఉంటుంది. యుగాలుగా, సూర్యోదయం, సూర్యాస్తమయం, మానవుడు చూస్తూనే వున్నాడు. సంవత్సరంలో, కొన్ని ఋతువులలోనే వర్షం పడటం గమనిస్తూనే ఉన్నారు. రాత్రింబవళ్ళలా కాలంలో మార్పు ఉన్నది. ఇటువంటి క్రమాన్ని పరిశీలంచడంవల్ల ఏదో ఇచ్ఛ, ఇందుకు కారణమని, చిందరవందరగా సంఘటనలు జరగటంలేదని మానవుడు నమ్మాడు. ప్రతి సహజ సంఘటనకూ, కారణం వుంటుందనే నమ్మకం వల్ల విశ్వ వ్యాప్తంగా ఆదిమ మానవుడు కోట్ల కొద్దీ దేవుళ్ళను తెచ్చిపెట్టాడు. ఈ దేవుళ్ళను తనకు ప్రతీకలుగా, మానవుడికి ఆదర్శంగా, మానవుడికి మించిన శక్తి మంతుడుగా ఉండేటట్లు సృష్టించాడు. భూమిపై ఉండేవారి కంటె అధిక శక్తిగల వారెవరో వర్షం కురిపిస్తున్నారని, రాత్రింబవళ్ళు ఏర్పరుస్తున్నారని ఒక క్రమంలో నియమ బద్ధంగా ఋతువులు వచ్చేటట్లు చేస్తున్నారని నమ్మారు. మానవుడి ఆదిమ వివేచన వ్యక్తం కావడానికి ఇటువంటి మతమే సాక్ష్యాధారం. తెలుసుకోవడానికీ, వివరించడానికీ మానవుడిలో కోరిక ఉండగా, నమ్మకం తరువాత వచ్చింది. తెలుసుకోలేనప్పుడు నమ్మకం వస్తుంది. మానవజ్ఞానం పెంపొందుతుండగా, నమ్మడానికి తెలుసుకోవాలనే కోరిక కలగటానికీ, ఉండే నిష్పత్తి తారుమారయింది. ఆధునిక మానవుడు వివేచనాత్మకంగా ఉంటూ, జ్ఞానార్జన చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు తప్ప గుడ్డి నమ్మకంలో ఊరట పొందాలనుకోవడం లేదు.
ఆధునికత అనేది కాలాను గుణంగా వచ్చే భావనే కాదు. మధ్య ఆఫ్రికా కూడా అమెరికా వలె 20వ శతాబ్దంలోనే ఉన్నది. కాని 20వ శతాబ్దంలో ఉన్నంత మాత్రాన అందరినీ ఆధునికులే అనలేము. కొందరు శారీరకంగా 20వ శతాబ్దంలో ఉండవచ్చునేమో కాని, సాంస్కృతికంగా చరిత్ర పుట్టక ముందటివారే ఈ విచక్షణను గమనిస్తే ఆదిమ దశలోని నమ్మకం ఇంకా విస్తారంగా ప్రబలి ఉన్నట్లు చూడవచ్చు. ఇండియాలో చాలామంది ప్రజలు అటువంటి దశలో నివసిస్తున్నందువల్ల, నమ్మడమే మానవ స్వభావం అనే సూత్రానికి చాలా బలం ఉన్నది. ఆధునిక దేశాలలో విజ్ఞానం విస్తరించి పోతుండగా, ఇండియా పరిస్థితి ఇలా ఉన్నది. కాని మామూలు రైతు మతపరంగా ఉన్నంత మాత్రాన, అతడు మానవ జాతినంతటికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడనుకోటానికి వీలులేదు. సామాన్య భారతీయుడి దృష్టిలో మతానికి ఆధ్యాత్మిక విలువ ఏమీ లేదు. అది పరంపరానుగతంగా సంక్రమించిన నమ్మకం మాత్రమే. భారత జాతీయ వాదులు తరచు, మిగిలిన ప్రజలకంటే ఇండియాలో వారు ఆధ్యాత్మిక చింతనలో ఆధిక్యత గలవారనుకుంటారు. ఇది శాస్త్రీయంగా రాబట్టిన విషయం కాదు.
నమ్మకమే మానవ స్వభావం అనే ప్రాచీన సూత్రాన్ని త్యజించడంతో నవ్య మానవవాదం ఆరంభిస్తుంది. మానవ స్వభావం ప్రాయికంగా, వివేచనాత్మకం అని నొక్కి చెపుతున్నది. విజ్ఞానం, చరిత్ర ఇందుకాధారాలు. మానవుడు సహజంగా తెలుసుకోవాలను కుంటాడు. వివరణ కోరతాడు. దీనివల్ల మానవ స్వభావం పరిణనిస్తుందనీ, మారుతుందనే నిర్ణయానికి రావడం జరిగింది. అజ్ఞాన పరిస్థితులలో నమ్మకమే మానవ స్వభావానికి ఊరట కలిగించింది. విజ్ఞాన వాతావరణంలో ఇంకా ఎక్కువ తెలుసుకోవడం మానవ స్వభావమయింది. ఆ విధంగా మానవ స్వభావం మారింది. జ్ఞానాభివృద్ధితో పాటు ఇంకా మారుతుంది. మానవ స్వభావంలోని ఈ నిరంతర మార్పు మానవ వ్యక్తిత్వాన్ని బయటకు చూపుతూ పోతుంటుంది.
మానవ స్వభావం, వివేచనాత్మకం. ప్రతి మానవుడూ తెలుసుకోవడానికి శక్తికలవాడు, జ్ఞాన పిపాసి. ఈ విషయాలవల్ల మానవతావాది యొక్క సాంఘిక ఆచరణ కూడా సులువుగా పరిష్కారమవుతుంది. నేడు కల్పనగానూ, నైరూప్యంగానూ కన్పించే భావన క్రమంగా అనేకమంది స్త్రీ పురుషులు అభినందిస్తారు. వారి ఉద్రేకాలకు విజ్ఞప్తి చేయడం కాక, వారి రాగ ద్వేషాలకు ఆధారాన్ని కల్పించటం గాక, నమ్మడమే వారి స్వభావం అనుకోడం గాక, మనుషుల వివేచనకు విజ్ఞప్తి చేసి, వారింకా ఎక్కువ తెలుసుకోటానికి తోడ్పడటం జరుగుతుంది. మనసులు వికసిస్తుంటే జ్ఞాన పరిధి విస్తరిస్తుంటే, ఆ మేరకు స్త్రీ పురుషులు అనేకులు నవ్య మానవవాద సూత్రాలకు అభినందించగలరు. ఆచరణ అనేది కలవర పెట్టే సమస్య కాకుండా పోతుంది.
నవ్య మానవవాదం, తత్వానికి చెందిన, ప్రత్యేక లక్షణాలతో నీతికి సంబంధించిన సమస్యలను ఎలా పరిష్కరిస్తుందనేది పేర్కొనదగిన విషయం. ఆధునిక ప్రపంచంలో నైతిక సంక్షోభం, నైతిక పతన విధానం అందరూ గుర్తించి, విచారిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభం నుంచి, బ్రతికి బయటపడాలంటే అధిక సంఖ్యాకులలో ఉన్నత స్థాయికి చెందిన సామాజిక చిత్త ప్రవృత్తి పెంపొందించవలసిన అవసరం ఉంటుందనేది స్పష్టం. ఇప్పటి వరకూ నైతిక దృష్టి, నైతిక విలవలనేవి, నమ్మడమే మానవ స్వభావం అనే భావంతో ముడిపడి ఉన్నాయి. వివరించడానికి వీలులేని, విశ్లేషించి చూడటానికి సాధ్యపడని అంతర్భుద్ధి, ప్రేరణ, ఉపచేతనావస్థ, జీవశక్తి ఇత్యాది లక్షనాలతో నీతికి సంబంధం ఉన్నదని చెబుతూ వచ్చారు. మానవుడు తానుగా నీతిమంతుడు కాలేదనే దోషపూరిత నిర్ణయానికి రావడానికి ఈ భావనలే కారణం.
సాధారణ స్త్రీ పురుషులు నీతిగా ఉండాలంటే ఆధ్యాత్మిక, దైవ సంబంధమైన వత్తిడి ఉండాలనే, వీరంతా వాదించారు. నైతిక చిత్త ప్రవృత్తిని మానవాతీత విషయాన్నుంచి రాబట్టాలన్నారు. నీతికీ మతానికీ ముడివేశారు. నేటికీ చాలా వరకు ఇది ఇలాగే ఉన్నది. ఈ భావన ప్రబలి ఉన్నంత వరకు స్వశక్తిపై మానవుడు, నీతిగా ఉండగలడా లేదా అనేది పరీక్షించలేము. మానవుడిలో విజ్ఞానం విస్తరించకుండా ఉండేటట్లు చూస్తే తప్ప నైతిక పునరుజ్జీవం సాధ్యపడదన్నమాట. విజ్ఞానం విస్తరిస్తే విశ్వాసం అంతరిస్తుంది. విశ్వాసం ఆధారంగా నీతి ఉంటే దీనికి మానవాతీత శక్తి ఆధారమైతే, విజ్ఞానం విస్తరించే కొద్దీ నీతి నాశనమవుతుందన్నమాట. నైతిక సంక్షోభం నుంచి ప్రపంచాన్ని బయటకు లాగివేసే బదులు ఇంకా పాతాళానికి అణచివేయటమే జరుగుతుందన్నమాట. మానవత్వారోపణ గల మతం గానీ, మరే మతం గానీ, నీతికి ఆధారం అనేటంత దూరం పోకుండా నీతికి ఆధారం ఏదో మార్మికత అని చూపే ఆధునిక, నైతిక తత్వవేత్తలున్నారు. అంతర్బుద్ధి, ప్రేరణ వంటి ప్రాథమిక జీవ సంబంధమైన భావాలు యధేచ్ఛగా ప్రయోగిస్తున్నప్పటికీ స్పష్టమైన నిర్వచనం లేకుండా, వివరణ లేకుండా ఉన్నవి. వీటికి మూలం మానవుడికి మించి పోవటం వల్ల, మానవుడి అవగాహనకు, అవి అందుబాటులో లేవని చెబుతున్నారు. నైతిక పిపాస మానవాతీతంగానూ, అతి భౌతికంగానూ, అలౌకికంగానూ రావాలంటున్నారు. మానవుడు నీతి గానూ, లేక అవి నీతిగానో ఉండటమనేది అతడి పిపాస మీద ఆధారపడిలేదు. పిపాస అయితే అతడే పెంపొందించుకోగలడు. అది వేరే శక్తి మీద ఆధారపడింది కనక, మానవుడికి అది లభించనూ వచ్చు, లేక పోనూ వచ్చు. అదృష్టవంతులు కొందరు, దైవం నిర్ణయించినవారు, లేదా తక్కువ పాపాలు చేసిన వారు నైతిక పిపాసలో వుండవచ్చు. క్రైస్తవులు చెప్పే తొలి పాపం అనే సిద్ధాంతం భిన్న రూపాలలో మానవ జాతిని వెన్నాడుతున్నది. ఈ విషవలయం నుంచి బయటపడటానికి మానవుడు తానుగా నీతి మంతుడు కావాలి. అతడి ఇచ్ఛ, వివేచన మానవుని నీతిగా ఉండటానికి అవకాశం కల్పిస్తుంది.
అలౌకిక శక్తుల భావనను మానవుడు బహిరంగంగా వ్యతిరేకించటం ప్రారంభించినప్పిటి నుంచీ, ఆలోచనాపరులకు సెక్యులర్ (మతరహిత) నీతి అనేది సమస్యగా ఎదురైంది. నేడది అత్యంత ప్రధాన సమస్య. ఇంతవరకూ ఆధునిక తత్వవేత్తలు నైతిక సంక్షోభంలో ఎంత కలవరపాటు చెందినా సెక్యులర్ నీతిశాస్త్రాన్ని రూపొందించలేకపోయారు. పైగా సునిశితమైన వాదనతో మత ప్రమాణాన్ని, మార్మిక రీతులను వెదికి నీతికి ఆధారాలను అన్వేషించారు.
ఈ విషయంలో కూడా నవ్య మానవవాదం కొత్త దారులు చూపుతున్నది. మానవుడు హేతువాది కనక తనంతట తానే నీతిమంతుడు కాగలడని చెబుతున్నారు. మానవతా వాదం వలె ఈ విషయం కూడా కొత్తగా కనుక్కొన్నది కాదు. ఎపిక్యూరస్ ఎప్పుడో ఈ విషయాన్ని చెప్పాడు. దేవుళ్ళు వుంటారనేది నిరాకరించారు. తాను సత్యం, ధర్మం, దయలను పాటించాలనుకుంటున్నాననీ, ఎవరికో లొంగి ఉండేటందుకు కాక తనకు ఆనందాన్ని ఇస్తున్నందున వీటిని పాటిస్తున్నానన్నాడు.
మానవుడు తన శక్తి మీద ఆధారపడి, ఆధ్యాత్మిక శిక్ష పడుతుందని అనుకోకుండా ధర్మంగా ఉండగలడా? నీతి అనేది మానవుడి అంతర్గత లక్షణమా? ఒకానొక పరిస్థితిలో సరైన విషయమేదో నిర్ణయించగలగడం నీతి అనిపించుకుంటుంది. ఇటువంటి నిర్ణయానికి వివేచన తోడ్పడుతుంది. హేతువాది అని తెలిసి వివేచనను పాటించేవాడు, ఎక్కడ నుంచో వచ్చిందని కాక తనలో భాగంగానే వివేచనను పరిగణించేవాడు, తను నీతిమంతుడనని చెప్పుకోగలడు. వివేచనాత్మక చింతనవల్ల ఇతడు ఒకానొక పద్ధతిలో తప్ప అన్యధా ప్రవర్తించలేడు.
నైతిక సమస్యకు ఇటువంటి ధోరణి వ్యాపింపజేయటం, సెక్యులర్ నీతిశాస్త్రానికి (మతరహిత) అవకాశం ఉన్నదని చూపడం ఆచరణలో నవ్య మానవవాదులు చేసే రెండో పని. అన్వేషించడం, తెలుసుకోవడం మానవ స్వభావం గాని, మానవునికి మించి ఉన్నత శక్తి ఏదో మనుగడ సాగిస్తున్నదనే నమ్మకాన్ని పోగొట్టడం నవ్వ మానవవాద ప్రథమ కర్తవ్యమని ముందే పేర్కొన్నాము. ఈ దృక్పథం వల్ల ఆత్మగౌరవం, తనలో విశ్వాసం కలుగుతాయి. మానవుడు సహజంగా హేతువాది అయినప్పటికీ చాలామందికావిషయం తెలియదు. గర్భితంగా హేతువాదులైనవారు వాస్తవంగా హేతువాదులు కావటానికి సత్తా ఉన్నవారే. మానవుడు ప్రకృతిని ఆధారంగా ఆవిర్భవిస్తున్నందువల్ల, విశ్వం పొందికతో, నియమబద్ధతతో ఉన్నందువల్ల మానవుడికి హేతువాదిగా ఉండే సత్తా లభించింది. మానవుడి ఆలోచనా రీతి, ఉద్వేగాలు, భావనలు అన్నీ కొన్ని నియమాలకు లోబడి ఉండాలి. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. మనలో ఇవి పని చేస్తున్నందువల్ల వీటిని తెలుసుకోవచ్చు. అందుకే మానవుడు ప్రాయికంగా హేతువాది. హేతుబద్ధమైన నీతి వాదం సాధ్యమే. వాస్తవానికి వివేచనాత్మక ఆలోచనల వల్ల మానవుడిలో నైతిక ప్రవర్తన జనిస్తుంది. మతంతో నిమిత్తం లేని నీతిశాస్త్రానికి అదే ఆధారమవుతున్నది.
నవ్య మానవ వాద సూత్రాలు ఒక సాంఘిక తత్త్వాన్ని అందిస్తున్నవి. ప్రస్తుత సంక్షోభం నుంచి ఆధునిక ప్రపంచం బయటపడడానికి ఇవి తోడ్పడతాయి. కాని ఈ పంథాను అనుసరించడానికి సామాజిక మార్పులో కొత్త దారులు అనుసరించవలసి ఉంటుంది. ఇప్పటివరకూ మానవులను విద్యాధికులను చేయటానికి సంస్థలను సృష్టించారు. మానవుడు మంచితనంతో, సంపదతో, ఆనందంతో ఉండటానికి తగిన పరిస్థితులు సృష్టించారని ఉద్దేశించారు. మానవతా తత్త్వం వ్యక్తితో ప్రారంభిస్తుంది. నైతిక వ్యక్తులు మాత్రమే నైతిక సమాజాన్ని సృష్టించగలరని చెబుతున్నవి. హేతువాదులు మాత్రమే హేతువాద సమాజాన్ని సృష్టించగలరు. ఆధ్యాత్మిక వత్తిడి వల్ల, మత గ్రంథాల నియమాల వల్ల మానవుడు నీతిగా వుండజాలకపోతే సెక్యులర్ నియమాలతో భయపెట్టి మానవుని నీతిగా ఉంచలేరు. మత నియమాలు, శిక్షాస్మృతులు కొన్ని యుగాలుగా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నవి. కాని నేరం మాత్రం ఆగలేదు. నీతి అట్టడుగు స్థాయిలో ఉన్నది. చట్టాల వల్ల మనుషులు నీతిమంతులు కాలేరు. అలాగే మతం కూడా మానవులను నీతిమంతులను చేయజాలదని చారిత్రకానుభవం చెబుతున్నది. మానవునిలో అంతర్గతంగా నీతిగా వుండే రీతి ఉంటే తప్ప, నైతిక బాధ్యత అనే పిపాస ఉంటే తప్ప, ఇది సహజమైనదీ, ప్రాయికమైనదీ అనుకుంటే తప్ప నీతిగా ఉండటం సాధ్యపడదు.
నీతిగా ఉండటం మానవుడిలో అంతర్గతంగా ఉన్న కోర్కె అని నవ్యమానవవాదం పేర్కొంటున్నది. వ్యక్తిలోని అంతర్గత వివేచన వల్ల ఇటువంటి కోర్కె జనిస్తుంది. కొందరు వ్యక్తులు మిగిలిన వారికంటె అంతర్గతంగా గొప్పవారని నవ్య మానవవాదం అంగీకరించింది. జ్ఞానార్జనకు, ధర్మాన్ని పాటించటానికి కొందరిలోనే ప్రతిభ ఉన్నదని, మిగిలిన వారు తక్కువ స్థాయిలో, హీనంగా, అజ్ఞానంతో ఉండాలనే సిద్ధాంతాన్ని నవ్య మానవవాదం ఒప్పుకోదు. అదృష్టవశాత్తూ (ఉత్తములు) ఉన్నవారు కొందరు మిగిలిన వారికి శాశ్వత మార్గదర్శకులుగా ఉండాలనేది కూడా ఈ వాదం అంగీకరించదు. ప్రతి మానవుడూ ప్రాయికంగా హేతువాది కనక, గర్భితంగా నీతిమంతుడు అనే సిద్ధాంతంతో మానవవాదం ప్రారంభిస్తున్నది. కనక, ప్రతి వ్యక్తి తెలుసుకొనగలడనీ, నీతిగా ప్రవర్తించగలడనీ, అయితే అతడి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఇవ్వాలనీ చెపుతున్నది. నవ్య మానవవాద ఆచరణలో ఇది కేంద్ర స్థానం వహించిన సమస్య.
సామాజిక పరిస్థితులను మార్చనిదే మానవ స్వభావం మారదని నేటి సాంఘిక తత్వాలు చెబుతున్నవి. అయితే సామాజిక పరిస్థితిని మార్చవలసిన ఆవశ్యకతను ఎవరైనా ఒక వ్యక్తి భావించి చెబితే అటువంటి తత్వాన్ని అంగీకరించడం లేదు. ఒక పార్టీలో కొన్నివందల మంది సభ్యులు స్వభావం మారగలిగినప్పుడు, ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటంతవరకూ ఇతర ప్రజల స్వభావం మారదని ఎందుకనుకోవాలి? అధికారంలో వుంటూ తన భావాలకనుగుణంగా సమాజాన్ని అంతటినీ మూసలో పోస్తుందని ఎందుకు ఊహించాలి?
అతి మానవులు అనే భావన ఫాసిజానికి సంబంధించిన తిరోగమన సూత్రంగా చిత్రించారు. ఇదే విచిత్రంగా విప్లవ సాంఘిక తత్వాలలోకి కూడా ప్రవేశించింది. ఒకానొక దేశంలో పుట్టినందువల్ల లేదా ఒక వర్గానికి చెందినందువల్ల కొందరు ప్రజలు ఉన్నత నాయకులుగా ఉండటానికి (శేష్ఠజనులు) అర్హులు అని సిద్ధాంతీకరించారు. అంతేగాక ఉన్న పరిస్థితులలో మానవ స్వభావం మారదనీ, కొందరు ఎంపిక అయినవారు ఈ స్వభావాన్ని మార్చుకోగలరనీ చెప్పారు. ఇతరుల స్వభావాన్ని వీరు కాలానుగుణంగా మార్చడానికి అనువైన పరిస్థితిని కల్పిస్తారన్నారు.
ఇటువంటి దోషపూరిత ప్రతిపాదనను నవ్య మానవమాదం తృణీకరిస్తున్నది. కొందరు వ్యక్తులు వివేచనాత్మకంగానూ, నీతిగానూ, ప్రవర్తిస్తే వివేచనాత్మకంగా, నీతిగా ఇతరులు ప్రవర్తించడానికి తగిన వాతావరణం సృష్టించాలని భావిస్తే ఇటువంటి భావనే వ్యక్తులుగా స్త్రీ పురుషులలో కలగడానికి వీలున్నది. స్వర్గం భూమి మీదకు దిగివచ్చేంతవరకూ ఆగనవసరం లేదు. మన ప్రయత్నాలను ఇక్కడే ప్రారంభించి, భూమిమీదనే అటువంటి రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు.
రాడికల్ హ్యూమనిస్టు తనతో ప్రారంభిస్తాడు. అధికారాన్ని హస్తగతం చేసుకోవటం వల్ల ప్రపంచాన్నంతటినీ మార్చి నైతిక సమాజాన్ని సృష్టించటానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. అదలా ఉంచి నైతిక సమాజాన్ని సృష్టించడంలో విప్లవకారులందరికీ నమ్మకం లేదు. అధికారానికి వచ్చిన తరవాత నేను మాత్రం అవినీతికి గురికానని హామీ ఏమిటి? కనక నన్ను నేను మార్చుకొని నైతిక వ్యక్తిని కావడమే సమాజాన్ని మార్చడానికి దగ్గర దారి అవుతుంది. ఇందులో సఫలమైతే ఇతరులు అలానే చేయగలరనీ, చేస్తారనీ విశ్వాసం కలుగుతుంది.
చెప్పటం కన్నా చేయటం మేలు అనే సూత్రం ఆధారంగా మానవతా వాది ఆచరణ ఉంటుంది. నవ్య మానవవాదంలో ప్రారంభదశ వ్యక్తితో ఉంటుంది కనక ఆచరణ కూడా వ్యక్తుల కార్యకలాపాలు, ప్రవర్తనతోనే మొదలు కావాలి. వివేచనాత్మక నైతిక వ్యక్తులు కావాలనుకునేవారు తామే ముందుగా అలా మారతారన్నమాట. ఒక వందమంది వ్యక్తులు ఇటువంటి ఆదర్శంతో ఆచరణకుపక్రమించినప్పుడు వారి మధ్య సహకారం ఉంటుంది. అటువంటి మానవతావాదుల సమూహాలతో మానవవాద ఉద్యమం పెంపొందుతుంది. మంచి సమాజం కోసం దూరంగా ఉన్న ఆదర్శాన్ని సాధించాలని అనుకోవడం కాక, నవ్య మానవాదం కోరే వివేచనాత్మక నైతిక సమాజాన్ని సృష్టించి తామే భాగస్వాములవుతారన్న మాట.
నేడు విప్లవ తత్వవేత్తలు ఆదర్శవాదాలకు తిలోదకాలిచ్చారు. కాని వారే అధ్వాన్నపు ఆదర్శవాదులుగా తయారయ్యారు. వారి దృష్టిలో ఆదర్శ సమాజం చాలా దూరాన ఉన్నది. సమానత్వం, న్యాయంతో కూడిన సాంఘిక వ్యవస్థ భవిష్యత్తుకు చెందినది. ఎన్నో కారణాలూ, శక్తులు అటువంటి సమాజాన్ని నిర్ధారణ చేస్తాయి. వీరు నిమిత్తమాత్రంగానే ఉంటారు. కొత్త ఆదర్శానికి సాధనాలుగా ఇటువంటి ప్రవక్తలతో తొలుత కొత్త వ్యవస్థను సృష్టించాలి.
ఆ రాజకీయ వ్యవస్థ సమాజంపైన కొన్ని నిర్మాణయుతమైన మార్పులను నియంతృత్వ పద్ధతులతో, తుది లక్ష్యాన్ని సాధించే నిమిత్తం తెచ్చిపెడుతుంది. ఈ విధానం వల్ల మానవ వ్యక్తిత్వ అభివృద్ధికి ఆటంకం వాటిల్లుతుంది. అంటే మానవుడి స్వేచ్ఛకూ, భావ స్వేచ్ఛకూ కూడా నిరోధం కలుగుతుందన్న మాట. లక్ష్యాన్ని ఓడించే ఇటువంటి మార్గాలవల్ల స్వేచ్ఛకు దారితీయటం సాధ్యపడదు. మార్గాలకూ, లక్ష్యాలకూ వైరుధ్యం ఉన్నది. ఇప్పుడు మార్గాలలో నివసిస్తున్నాం. ఏదో ఒకనాడు లక్ష్యాన్ని సాధిస్తాం. కాని మార్గాలు అనంతంగా సాగిపోతున్నాయి. చెడు మార్గాలైనప్పటికీ లక్ష్యం పేరుతో వీటిని సమర్థిస్తున్నారు. మంచి సమాజం కోసం చెడు మార్గాలను అనుసరిస్తుంటే ఆ మార్గాలే నిలబడిపోయి, చెడు సమాజమే మిగులుతున్నది.
సమకాలీన ప్రపంచంలో పైన పేర్కొన్న విషయాలు అనుభవ పూర్వకంగా కనిపిస్తున్నాయి. పదార్థ వాదతత్వంగా ఉన్న నవ్య మానవ వాదం, దోషపూరితమైన భావవాద దృక్పథాన్ని ఖచ్చితంగా నిరాకరిస్తున్నది. నవ్య మానవవాదంలో మార్గాలకు లక్ష్యాలకు ఐక్యత ఉన్నది. ఈ రెండింటికీ తేడా లేదు. భవిష్యత్తులో ఎప్పుడో జరగవలసినది కాక ఇప్పుడే ఇక్కడే సృష్టించడం ఇందలి విశిష్టత. ఇది సుదీర్ఘ విధానమని ప్రజలు అనవచ్చు. ఈ పద్ధతిలో జ్ఞానాన్ని, విద్యను వ్యాపింపజేసి, కొత్త సాంఘిక వ్యవస్థను రూపొందించడానికి కొంత కాలం పడుతుందనవచ్చు. అటువంటి వారికి దగ్గర మార్గాలు కావాలి. కొంతమంది వ్యక్తులు కోట్లాది ప్రజలకు విద్య గరిపే కృషి ఎలా చేస్తారో వారు అవగాహన చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం మాత్రమే ఈ పని చేయగలదంటున్నారు. ప్రభుత్వ విద్య అంటే మేధస్సును మూసలో పోయడమే అవుతుంది. మానవ వ్యక్తిత్వ వికాసానికి అది తోడ్పడదు. వ్యక్తులను ప్రమాణీకరించాలని ప్రభుత్వం భావిస్తుంది. సామాజిక రాజకీయ యంత్రాంగంలో వ్యక్తులు ఇమిడి పోవాలని భావిస్తుంది. ఇటువంటి విద్యలో వైజ్ఞానిక, సాంకేతిక శాస్త్రాలు కూడా ఉండవచ్చు. అయితే వ్యక్తుల భావ స్వేచ్ఛకు గానీ, ప్రజల యొక్క ప్రజల చేత ప్రభుత్వాలు ఏర్పాటుకు గాని ఈ విద్య తోడ్పడదు. వ్యక్తులు గానీ, కొందరు వ్యక్తులు కలిసి గానీ విద్యను వ్యాపింపజేసే ప్రయత్నం సాగించవచ్చు. సమూల మానవతావాద ప్రజాస్వామ్యానికి అప్పుడు తగిన పరిస్థితులు ఏర్పడతాయి.
మానవతావాద విద్య అంటే ఒకే పద్ధతిలో సిద్ధాంతాన్ని నూరిపోయటం కాని, మూసలో పోసినట్లు చెప్పటం కానీ జరగదు. ప్రజలను విప్లవానికి సాధకులుగా వాడుకోవడం మానవతావాదుల పని కాదు. ప్రజలను వ్యక్తులుగా, అందరికీ ఉన్నట్లే ప్రతిభ ఉన్నవారుగా పరిగణిస్తే, మనం భావిస్తున్నట్లే వారు కూడా భావించగలరనీ, ఆలోచించగలరనీ తెలుసుకుని ఇందుకు తోడ్పడవచ్చు. మనలా ఇతరులు కూడా వివేచనాత్మకంగా, నైతికంగా, ప్రతిస్పందించగలరని గ్రహించవచ్చు. ఉత్తమ సమాజం కోసం కలలుగనే వారే గాక అటువంటి సమాజం కోసం నివసించే వారి సంఖ్యను పెంచగలిగితే, మన మధ్యనే ఆ సమాజం ఎర్పడుతుంది. ఉత్తమంగానూ, వివేచనాత్మకంగానూ ఉన్న సమాజం ఇతర చోట్లకు వ్యాపిస్తుంది.
తొలుత వ్యక్తులు కొందరు ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ అధ్వాన్న పరిస్థితులవల్ల, సాంఘిక తత్వాలు మార్గాంతరాన్ని చూపటంలో విఫలమయినందువల్ల, కొద్దిమంది మానవతావాదులే ఎంతో సాధించగలరు. నేటి సమస్యలతో కలవరపాటు చెందుతున్న సునిశిత వ్యక్తులు ఎందరో వున్నారు. సంప్రదాయ బద్ధమైన రీతిలోని పెట్టుబడిదారీ విధానం గతానికి చెందినది. సోషలిజం భవిష్యత్తులో సాధించవలసిన లక్ష్యం. మార్క్సిస్టు అధికారంలో ఉన్న చోట కూడా పరిస్థితి ఇంతే. కాని కార్ల్ మార్క్స్ ప్రవచించిన వాటిలో నవ్య మానవవాదం విషయ పూరణ చేస్తున్నది. పాత క్రమం పతనమవుతుండగా స్వేచ్ఛాపరులు కొత్త సమాజాన్ని నిర్మించవచ్చు. తొలి దశలో కొత్త సమాజం కొన్ని చోట్ల మాత్రమే ఆవిర్భవిస్తుంది. కొత్తవి పెరుగుతుండగా పాత సమాజాలు తొందరగా కూలి పోతాయి. ఈ చైతన్య స్రవంతిలో నవ సమాజం తలెత్తుతుంది. ఇది ఒకనాడు జరిగేపని కాదు. కొంతకాలం కనిపించకుండా జరిగే మార్పు మాత్రమే ఇదంతా ఎప్పుడు, ఎలా జరిగిందో తెలుసుకోలేనంతగా మొత్తం పరిస్థితి మారిపోతుంది.
సామాజిక విప్లవాదర్శానికి ఇటువంటి పంధా అవసరం. పాత పద్ధతిలో విప్లవం అసాధ్యమయిపోయింది. అటువంటి విప్లవం ప్రతి విప్లవానికి దారి తీస్తుంది. విప్లవానికి కొత్త పంథా కనుక్కోకపోతే అసలు విప్లవమే ఉండదు. మానవజాతి నాశనం కావాలి, దిగజారిపోవాలి.
ఇటువంటి మృతప్రాయమైన నిరాశా వాతావరణంలో నవ్య మానవవాదం ఆశాకిరణాన్ని చూపుతుంది. ప్రతి స్త్రీ పురుషుడు కొంత చేయగలరని, గుంపులో కలిసిపోకుండా సత్తా చూపించవచ్చుననీ, నవ్యమానవవాదం చెబుతున్నది.
సాంఘిక విప్లవానికి నేడు నవ్యమానవ వాదాన్ని ఆచరించటం ఒక్కటే సక్రమ పద్ధతిగా ఉన్నది. స్వేచ్ఛను పెంచి, న్యాయాన్ని సమకూర్చే విప్లవంగా ఇది ఉంటుంది. ఉన్నత సంస్కృతికి తగిన పరిస్థితులను కూడా ఇది కల్పించగలదు. ఎటువంటి సమాజాన్ని ఇప్పుడే సృష్టించవచ్చు. వాటికి పునాదులు ఇప్పుడే వేయవచ్చు. మానవకావాద ఆచరణవల్ల విప్లవాత్మకమైన ఈ పద్ధతిని అనుసరించవచ్చు.
నవ్యమానవాద భావాలు ఏ రూపంలో అందించాలనేది మనకు అనుభవం వల్ల తెలుస్తున్నది. అంతగా అదృష్టం లేనివారు వీరిని త్వరగా గ్రహించగలరు కూడా. ప్రారంభకులు చొరవ చూపటంలోనూ, సాంఘిక మార్పుకు కొత్త పద్ధతుల ననుసరించటంలోనూ అనేక సాహసోపేత విషయాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ ఉద్యమం వివేచన ఉన్న స్త్రీ పురుషులను ఆకర్షిస్తుంది. తమ నగరాలలో, గ్రామాలలో ప్రజాజీవితాన్ని పెంపొందించాలనేవారు. ఆకర్షితులౌతారు. అక్కడ మొదలుకొని దేశమంతా ఇది వ్యాపిస్తుంది. వ్యక్తిగతమైన జీవతాలతో ఆరంభించి, పరిసరాలలో అల్లుకొని, క్రమంగా కార్యాలయాలకూ, నగరాలకూ, జిల్లాలకూ వ్యాపిస్తుంది. భవిష్యత్తుకు చెందిన వివేచనాత్మక నైతిక సమాజం పెంపొందుతుంది. ఒకసారి ఈ పద్ధతి ప్రారంభిస్తే విస్తృతంగా ఆకర్షించి త్వరితంగా వ్యాప్తి చెందటానికి అవకాశం ఉంది.
రచన అనువాదం
ఎమ్.ఎన్.రాయ్ నరిసెట్టి ఇన్నయ్య
No comments:
Post a Comment