షిరిడి సాయిబాబా - ఎవరు?
మూలం:పి.కె.నానావతి అనువాదం:గుమ్మావీరన్న
పాతతరం హిందీ సినిమా అమర్, అక్బర్, అంథానీలో ఒక పతాక సన్నివేశం వుంది. సాయిబాబా భారీ విగ్రహం ముందు అక్బర్ తారాస్థాయిలో పాడుతున్నాడు. ఆ విగ్రహం కళ్ళనుండి రెండు కాంతివంతమైన రంగుల కిరణాలు వెలువడి అంధురాలైన అక్బర్ తల్లి కళ్ళలోకి ప్రవేశిస్తాయి. "నేనిపుడు చూడగలుగుతున్నాను. దేవుడు నన్ను కరుణించాడు" గట్టిగా అరుస్తుందా తల్లి. సినిమాహాలులోని ప్రేక్షకులంతా ఉద్వేగభరితులవుతారు.
'సాయిబాబా దేవుడు' ఏం అద్భుతం జరగబోతుంది' సినీ పరిశ్రమలోని వారికి షిరిడి సాయిబాబా కనకవర్షం కురిపించే దేవుడిగా మారిపోయాడు. అతని ఆశీర్వాదం లేకుండా సినిమా షూటింగ్ ప్రారంభం గాని, పూర్తయిన సినిమా విడుదల కాని జరగదు. సినీ పరిశ్రమలోనివారు, దేశంలోని వేలాది భక్తులు క్రమం తప్పకుండా సందర్శించే శిరిడికి వెళుతున్నపుడు 'మేము ఇరవై ఏళ్లుగా బాబా భక్తులుగా వున్నాం', 'అతని దీవెనలే మమ్మల్ని చాలాసార్లు కాపాడాయి', సాయిబాబా గొప్పవాడే' వంటి మాటలను వింటుంటాం. వారంతా సాయి మహిమలో మునిగి వున్నందువల్ల వారితో వాదించడం అర్థరహితం. ఈ ప్రగాఢ విశ్వాస ప్రభావంవల్ల వారు సక్రమంగా ఆలోచించలేరు. ప్రయాణంలో చాలామంది 'సాయి చరిత'ను గట్టిగా చదువుతుంటారు. కీర్తిశేషులైన గోవింద్ రఘునాథ్ దభోల్కర్ ఓ గ్రంధాన్ని రచించారు. ఆ పుస్తకం నిండా సాయిబాబా మహిమలే. ఆ గ్రంథాన్ని 20 - 30 సార్లు చదివినట్లు భక్తులు చెబుతుంటారు. అందులోని అంశాలన్నీ వారి మెదళ్ళలో శాశ్వతంగా నాటుకుపోయి వుంటాయి. మీరు పుస్తకంలోని పేజీలను కొద్దిగా తిరిగేస్తే చాలు. సాయిబాబా పేగులను బయటకు తీసి గాలిలో ఆరబెట్టి, మరల కడుపులోకి నెట్టేసుకోవడం వంటి మహిమలు దర్శనమిస్తాయి. అటువంటి మహిమల గురించి చదివేటపుడు డోకు వస్తుంది. అయితే ఆ గ్రంథం గత 50 ఏళ్లలో 20 కంటే ఎక్కువసార్లు పునర్ముద్రణ పొంది వేలాది కాపీలు గ్రంథాన్ని ప్రచురిస్తూ అందులోని చెత్తను కీర్తిస్తుంటారు.
దాదా సాహెబ్ కపర్దీ కొడుకు వొంటిమీది బొబ్బలతో బాధపడుతుంటాడు. ఆ అబ్బాయి తల్లి సాయిబాబావద్దకు వెళుతుంది. సాయిబాబా ఆమెతో 'భయపడకు' నయమవుతుందంటాడు. సాయిబాబా తన వంటిమీది దుస్తులను తీయడం ప్రారంభిస్తాడు. ఆ తల్లి సాయిబాబా శరీరంమీది బొబ్బలను చూస్తుంది. తన భక్తుల బాధలన్నీ తానే భరిస్తానని సాయిబాబా చెబుతాడు. గ్రంథకర్త గోవింద్ దభోల్కర్ ఒక న్యాయమూర్తి. ఈ సంఘటనలన్నీ యథార్థంగా జరిగినవేనని, ఎవరూ వీటిని సందేహించరాదని ధృవీకరిస్తాడు. తోటి ప్రమాణికుడొకడు 'నా కోడలికి కానుపు ఇబ్బందిగా మారింది. నేను సాయి గుడినుండి విభూది తెచ్చి ఆమె పొట్టమీద రాసాను. అయిదు నిమిషాల్లో ఆమె ఆరోగ్యంగా వున్న శిశువును ప్రసవించిందని చెప్పడం మొదలుపెట్టాడు.
షిరిడిలో కాలు పెట్టగానే 'సాయి శంకర్ పూల వ్యాపారులు పూజకు, అభిషేకానికి అవసరమైన వస్తువులన్నీ సరసమైన ధరలకు లభిస్తాయి' అనే కరపత్రాలు, కార్డులు మన ముందుకొస్తాయి. భక్తుల ప్రయోజనార్థం 'దొంగలున్నారు జాగ్రత్త' అనే వాక్యం కూడా కనిపిస్తుంది. సాయి మహిమలో ఇటువంటి వాటిని ఎవరూ వూహించలేరు. ఇంతలోనే 'సర్, లాడ్జి సౌకర్యాలు, చాల చౌక సర్,.... అభిషేకానికి పూలు సర్.... నేను గుడి చూపిస్తాను సర్, .... కేవలం పది రూపాయలే సర్' అంటూ కొందరు మిమ్మల్ని చేయి పట్టి లాగడానికి ప్రయత్నిస్తారు. మీరు వారిని తప్పించుకొని బయటకు రాగలిగితే మీ చుట్టూ సాయి లాడ్జ్, సాయి హోటల్, సాయిబాబా ఎస్.టి.డి. బూత్, సాయి హేర్ డ్రెస్సర్స్ , సాయి పాన్ షాప్, సాయి జ్యూస్ సెంటర్, సాయి ట్రావెల్స్... వంటి పేర్లతో దుకాణాల బోర్డులు పెద్ద అక్షరాలతో వందల సంఖ్యలో కనిపిస్తాయి. ఇక్కడంతా సాయి మహిమే.
షిరిడి వ్యాపార వస్తువు సాయి
ఏ దుకాణానికైనా వెళ్ళండి. 25 రూపాయలు చెల్లిస్తే అభిషేకానికి కావలసిన వస్తువులన్నీ లభిస్తాయి. దుకాణాల యజమానులు సాయిబాబా మిమ్ములను దీవిస్తారంటారు. దర్శనమెలా అనేది అమాయకంగా కనిపించినా చిక్కు ప్రశ్నే. ఉదయం 9 గంటల అభిషేకానికి 5 గంటలనుండే క్యూలో నిలబడాలి. మధ్యాహ్నం 12 గంటలకు సత్యనారాయణ పూజ, సాయంత్రం హారతి, చివరి మంగళ హారతి రాత్రి 10 గంటలకు ఉంటుందని వివరాలు చెప్పాడు. 'క్యూలో నిలబడకుండా తప్పించుకోవచ్చా .....?'
దానికి పై స్థాయిలో నీకు పరిచయాలుండాలి. లేదా నీవు రాజకీయంగా పలుకుబడిగల ఎం.ఎల్.ఏ., ఎం.పి., మంత్రి లేక సచివాలయాదికారి అయి వుండాలి. అటువంటివారికి మాత్రమే నేరుగా ప్రధాన ఆలయ ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. 50 ,000 రూపాయల పెద్ద విరాళమివ్వగలవారికి మాత్రం ప్రధాన ఆలయ ద్వారాలు వెంటనే తెరుచుకుంటాయి. సాయికంటే డబ్బుకున్న మహిమే గొప్పది!
ప్రత్యేక దర్శనానికి సంబంధించిన వివరాలున్న బోర్డు ట్రస్టు కార్యాలయంలో కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇతరులకంటే కొందరు ఎక్కువ సమానం. ఎవరికి ఫిర్యాదు చేయాలి? సాయి దర్శనానికై నిరీక్షించే భక్తులకోసం ట్రస్టు పెద్ద హాలు నిర్మించింది. ఇందులో విశ్రాంతికోసం చలువరాతి బెంచీలుంటాయి. గర్భగుడిలో జరిగే పూజను బయటి భక్తులు చూడటానికి వీలుగా టి.వి.లను అమర్చారు. వేచివున్న భక్తులకు ఈ ఏర్పాట్లు తృప్తినిస్తాయి. హాలులోని గోడలన్నీ సాయి మహిమలను తెలిపే దృశ్యాలతో చిత్రించబడి వుంటాయి.
మహిమలు:
1 ) గ్రామస్తులకు కలరా వ్యాధి సోకినపుడు సాయిబాబా జొన్న పిండిని గ్రామం చుట్టూ చల్లి వారికి స్వస్థత చేకూర్చటం.
2 ) సాయిబాబా శిరిడికి తెచ్చిన చాంద్ భాయి పొగ (పైపు) తాగాలనుకుంటాడు. దగ్గరలో నిప్పు కనిపించదు. అపుడు ఫకీరు పచ్చగడ్డిని తాకగానే నిప్పు రగులుకొంటుంది. 3 ) సాయిబాబా పాదంలోని బొటనవ్రేలి నుండి నది ప్రవహించడం.
4 ) సాయిబాబా నది ఒడ్డున నిలబడినప్పుడు నీళ్ళలో వేలాది దీపాలు వెలగడం.
అనేక మహిమలు:- చుట్టూ ఇటువంటి దృశ్యాలున్నపుడే క్యూలో నిలబడిన వ్యక్తి దేన్నయినా సరే నమ్మడానికి సిద్ధపడతాడు. ఆలోచన లేకుండా దేన్నయినా ఆమోదించడానికి వీలుగా వారి మనసు నియంత్రించబడి వుంటుంది. సాయి చరిత లేదా సాయి లీలామృతం వంటి గ్రంథాలు సాయి మహిమల శక్తిని సదా కీర్తిస్తుంటాయి. దేన్నయినా సరే కీర్తించడమే భారత సమాజ మౌలిక సూత్రంగా మారింది. విశ్వాసి మానసికంగా బలహీనుడై, నిస్సహాయుడై తనమీద, తమ ప్రయత్నాలమీద క్రమంగావిశ్వాసాన్ని కోల్పోతాడు. జీవితంలో ఏదైనా మంచి జరిగితే దాన్ని దేవుడికో, గురువుకో ఆపాదిస్తాడు. చెడు జరిగితే మాత్రం తలరాతగా భావిస్తాడు. పై తెల్పిన మహిమల వివరాలకోసం వాటిని లోతుగా పరిశీలించడానికి గాని, చారిత్రకాధారాలను చూపడానికి గాని ఎవరూ ప్రయత్నించరు. ఎటువంటి ఆధారాలు లేకపోవడమే దానికి కారణం కావచ్చు. అవన్నీ ధనార్జనకోసం చేసిన ఊహలు మాత్రమే. అక్కడ ఫొటోలు కూడా ఊహా కల్పితాలే. ట్రస్టు కార్యాలయంలో విచారించినపుడు సాయిబాబా ఫొటోల అసలు ప్రతులు ఎక్కడా లేవని సంబంధిత అధికారే తెలిపాడు. అయినా మార్కెట్ లో అమ్మకానికి సాయిబాబా ఫొటోలు కుప్పలుగా పెట్టడం చూస్తుంటే కల్పితాల ఆధారంగా కూడా ఆచారాలు రూపు దిద్దుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దేశాయి అనే జిల్లా కలెక్టరు సాయిబాబా ఫొటోను తీసినట్లు 1941 లో ప్రచురితమైన పుస్తకంలో పేర్కొన్నారు. కాని దాని కాధారమేమీ లేదు. 1922 లో ట్రస్టు సాయిబాబా ఫొటోను విడుదల చేసింది. ట్రస్టు కూడా ఈ విషయంలో మహిమల మార్గాన్నే ఎన్నుకొంది.
పొడవైన క్యూ నత్త నడకన సాగుతోంది. భక్తులు గుజరాత్ నుండి ఎక్కువగా వచ్చారు. బోలో సాయినాథ్ మహారాజ్ కి జై, బోల్ సె బోలో సాయి బోలో, అంటూ వారంతా ప్రతి 10 - 15 నిమిషాలకోసారి పెద్దగా అరుస్తున్నారు. ప్రతి ఒక్కరు పూలు, పూజా సామగ్రి వున్న పళ్లాలను పట్టుకొని వున్నారు. తలకు కాషాయ రిబ్బన్లు చుట్టుకొన్నారు. క్యూ నిదానంగా కదులుతోంది. క్యూలో భక్తులకోసం మరుగుదొడ్లను కూడా నిర్మించారు. ఎవరైనా క్యూలో దొడ్డిదారిన ముందుకు దూకితే భక్తులు సాయి నామాన్ని గొంతెత్తి అరుస్తూ తమ ఆగ్రహాన్ని తెలుపుతారు. 'సాయి ఆ ఆకతాయిని శిక్షిస్తాడ'ని ఒకడన్నాడు.
ఇంతలో ఒకడు రెండు రూపాయలకొక లడ్డును అమ్మడం మొదలు పెట్టాడు. భక్తులంతా గుడిలో సాయి విగ్రహ పాదాలముందు లడ్డును సమర్పించాలి. తరువాత దాన్ని ప్రసాదంగా తినాలి. తాము తెలిసో, తెలియకో చేసిన పాపాలన్నీ ఈ ప్రసాదంతో ప్రక్షాళన అవుతాయని భక్తులు భావిస్తారు. సగటున ప్రతిరోజూ 4000 మంది భక్తులు దర్శనం చేసుకొంటారు. గురువారమైతే ఈ సంఖ్య 60 ,000 దాకా పెరుగుతుంది. దీన్ని బట్టి షిరిడిలో జరిగే వ్యాపార స్థాయిని మీరు వూహించుకోవచ్చు. సత్యనారాయణ పూజకు 25 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఒక్క పూజవల్లే వారానికి 20 లక్షల రూపాయలకు పైగా వస్తుంది. విరాళాలు స్వీకరించడానికి 15 - 18 సీలు చేసిన పెద్ద స్టీలు పెట్టెలను వుంచాలి. ఇచ్చిన విరాళాలకు భక్తులు రసీదులు అడగరు . ఇక్కడ కొన్నిసార్లు వారానికి 50 లక్షల రూపాయలు పోగవుతుంటాయి. ఏదో ఒక రోజు షిరిడి సాయిబాబా తిరుపతి బాలాజీని మించిపోతాడు.
ఎన్నో అవాంతరాలను అధిగమించి భక్తులు చివరికి సాయి విగ్రహాన్ని తాకడానికి వీలుండే గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. అంతలోనే కొందరు భక్తులు పూనకం వచ్చినట్లు క్రిందపడి దొర్లుతూ తలలను బాదుకొంటారు. భక్తుడు తాను తెచ్చిన పళ్ళాన్ని పూజారికివ్వగా అతడు దాన్ని విగ్రహ పాదాలకు తాకించి మరుక్షణంలో తిరిగి యిచ్చేస్తాడు. భక్తునికి తృప్తి కలగదు. దాన్ని ఎక్కువసేపు వుంచాలనుకొంటాడు. సాయి శక్తితో ప్రతీదీ పునీతం కావాలనుకొంటాడు. పూజారికి ఎవరో ఒకరు సర్ది చెబుతుంటారు. ఇక్కడ 24 మంది పూజారులు రెండు షిఫ్టులలో పని చేస్తుంటారు. వీరు సాయిబాబా భక్తులకు మధ్య దళారీలన్నమాట. 24 గంటలు సాయి పనులకోసం 45 మంది పనివాళ్ళు వుంటారు. 24 మంది పూజారులలో 9 మంది త్రియంబకేశ్వర వేద పాఠశాలనుండి డిప్లమా సర్టిఫికెట్లు పొందినవారు. ఈ పాఠశాలలో మూడేళ్ళ పూజారి కోర్సును నిర్వహిస్తుంది. ఈ కోర్సులో విగ్రహారాధన, పూల సమర్పణ, సత్యనారాయణ పూజ, సందర్భానుసారంగా చదివే మంత్రాలు మొదలైనవి వుంటాయి. ఈ పూజారులు సాయిబాబా సమక్షంలో ఉంటూ నిత్యం దర్శించుకుంటున్నా, ఇతర పరిశ్రమల కార్మికులలాగా జీవనోపాధికై షిఫ్టు డ్యూటీలు చేస్తుంటారు. సాయి విగ్రహం ఇటాలియన్ చలువరాతితో చేయబడింది. వెండి, బంగారంతో మలచిన డిజైన్లతో కూడిన సింహాసనం వుంది. ఎరుపు, కాషాయరంగు దుస్తులతో విగ్రహం అలంకరించబడి వుంటుంది. మెడలో ముత్యాలహారం వుంటుంది. ఇతర దేవాలయాలలో వుండే విధంగా ఇక్కడ కొబ్బరికాయల కుప్పలుండవు. అయితే లోపలి నేల భాగమంతా పూల కుప్పలతో నిండిపోయి వుంటుంది.
దభోల్కర్, దేశ పాండే , సహస్రబుద్ధల త్రయం శతాబ్దం క్రితం లాభదాయకమైన సాయిబాబా విగ్రహారాధన వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో వున్న సాయి కథలను, కల్పనలను విశ్లేషించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే - సాయిబాబా అనే వ్యక్తి వాస్తవంగా వుండేవాడా, లేక అమాయక ప్రజలను దోచుకోవడానికి ఒక దొంగల ముఠా వూహించిఅల్లిన కథా అనే సందేహం తలెత్తుంది. మారుమూల గ్రామానికి ఫకీరు రావడం, మసీడువంటి ప్రదేశంలో వుండి, అల్లా పేరు చెప్పడం చూస్తుంటే అతడు హిందూ మతస్తుడే కాదని తెలుస్తుంది. వాస్తవానికి ఆ వ్యక్తి అసాధారణమైన ప్రవర్తన కలిగివున్నట్లు తెలుస్తుంది. అతడు పొగ తాగేవాడు (చిలుం అనే పైపు) ఎల్లప్పుడు చిరిగిన దుస్తులు ధరించి ఆ ప్రాంతమంతా కొండలెక్కుతూ, ఏటి గట్లవెంట తిరుగుతూ ఉండేవాడు. కళ్ళార్పకుండా ఎక్కువసేపు ఆకాశం వంక చూస్తూ వుండేవాడు. గ్రామస్తులతన్ని పిచ్చి ఫకీరనేవారు. బిక్షగాళ్ళు అతడి జోలెని దొంగలించారు. బాయజబాయి అతనికి వండి పెట్టింది. ఎప్పుడూ వేళకు తిండి తినేవాడు కాదు. త్వరగా కోపమొచ్చేది. కొన్నిసార్లు అతడు వీథులలో చిందులు తొక్కేవాడు. ఒకసారి నిప్పులో చెయ్యి పెట్టాడు. మహిళలు వచ్చినపుడు బూతులు మాట్లాడేవాడు. అతడు ఏమి గొణుగుతున్నాడో ఎవరికీ అర్థమయ్యేదికాదు. ట్రస్టు వారు ముద్రించిన జీవిత చరిత్రలో ఇటువంటి వివరాలెన్నో వున్నాయి. అతని జీవిత చరిత్ర చదువుతుంటే దభోల్కర్, దేశ పాండే, దసానూ మొదలగువారు సాయిబాబా హిందూ సాధువుగా చిత్రించడానికి ఉద్దేశ పూర్వకంగా ప్రయత్నించినట్లు అర్థమవుతుంది. నిజానికి సాయిబాబా జీవితమంతా పాతబడ్డ మసీదులో గడుపుతూ ముస్లిముల పద్ధతిలో అల్లాను ప్రార్థించేవాడు. అయితే చాలామంది హిందూ సాంప్రదాయవాదులు అతడిని తమ ఇష్టదైవం యొక్క అవతారంగా ఊహించారు. అతడిని 16 వ శతాబ్దంలోని స్వామి రామదాసుగా కొందరు పూజిస్తారు. శంకరుడి అవతారమని కొందరు చెబుతారు. దత్తాత్రేయ అవతారమని మరికొందరు ప్రచారం చేస్తారు. మరికొందరు అతడిని 18 వ శతాబ్దంలోని అక్కలకోట మహారాజు అవతారమని చెప్పేదాకా వెళ్ళారు. ఈ జీవిత చరిత్రలలో తర్కంగాని, సమన్వయంగాని లేదు. 'అల్లా మాలిక్ హై' అనేది సాయిబాబా ప్రఖ్యాత నినాదం. అతడు హిందూ కాదనడానికి ఎన్ని సాక్ష్యాధారాలున్నప్పటికీ ప్రతి భక్తుడు అతడిని ప్రసిద్ధ హిందువుగానే భావిస్తాడు. కాకపోతే అతని ప్రవర్తన కొంచెం అసాధారణంగా ఉంటుందనుకొంటాడు. స్వార్థ ప్రయోజనాలకోసం ఏ ముఠా అయితే సాయిబాబాకి దేవుడి స్థాయిని కల్పించిందో, అదే అతడికి హిందూ మతంలో నూతన స్థానాన్ని కల్పించింది. సాయిబాబా స్నానం చేసేటపుడు తాను సహకరించేవాడినని, సాయిబాబా చెవులకు హిందువుల ఆచారంలో వున్నట్లు చెవులు కుట్టబడి వున్నాయని చందోర్కర్ చెప్పేవాడు. ఆ విధంగా సాయిబాబా చుట్టూ హిందూ వాతావరణాన్ని సృష్టించారు. రామనవమి పండుగతో సాయిబాబాకు ఎలాంటి సంబంధం లేదు. పైన పేర్కొన్న త్రయం డబ్బులు పోగు చేసుకోడానికి దీనిని ప్రారంభించారు. సాయిబాబా సమాధిని కూడా హిందూ సాంప్రదాయం ప్రకారమే నిర్మించారు.
సాయిబాబా సెక్యులరిజం బూటకం
సాయిబాబా జీవిత చారిత్రక వివరాలను పరిశీలిస్తే అతనికి ఒక్క ముస్లిం భక్తుడు వున్నట్లు కూడా కనిపించదు. ముస్లిం మతం ప్రకారం విగ్రహారాధన నిషేధం. అందువల్ల సాయిబాబాకు లేదా షిరిడికి ఆపాదించిన సెక్యులరిజం బూటకమని తేలుతుంది. ముస్లిములెవ్వరూ ఈ స్థలాన్ని సందర్శించరు. ముల్లాలెవరూ ఇక్కడ ప్రార్థనలు జరుపరు. అయినప్పటికీ ఈ దేవాలయాన్ని సెక్యులరిజానికి చిహ్నంగా పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. సెక్యులరిజమనేది భక్తుల ప్రపంచంలో విచిత్ర భావన, అదేమిటంటే - మాట భావాలకు హాని కలుగకుండా హిందువులు, ముస్లిములు కలిసి ఒకే విధానాన్ని రూపొందించుకోడానికై ఒప్పందానికి రావాలి. కాని స్వార్థానిదే పై చేయి కాగా, హిందూయిజమే రాజ్యమేలుతుంది.
సమీపంలో తాటాకులతో కప్పబడిన నిర్మాణం క్రింద ఒక వేప చెట్టుంది. ఆ వేపచెట్టు ఆకులు తీయగా ఉంటాయని అక్కడ ప్రతీతి. అందులోని నిజాన్ని తెలుసుకోవాలంటే ఆకులను తుంచి తినడానికి అనుమతించరు. ఎటువంటి విషమ పరిస్థితికైనా హిందూమతంలో ఒక పరిష్కారముంటుంది. మీరు నేలమీద పడిన ఆకులను తినవచ్చు. అవి తీయగా లేకపోయినట్లయితే నీవు పవిత్రమైనవాడివి కావని అర్థం చేసుకోవాలి! దేవుడు నిన్ను కరుణించ
లేదనుకోవాలి! ఒక జర్మను శాస్త్రవేత్త ఆ తీయదనంలోని రహస్యాన్ని కనిపెట్ట లేకపోయాడని అక్కడి ట్రస్టు అధికారి గర్వంగా ప్రకటించారు. దానికి సంబంధించిన నివేదికను చూపమని అతడిని అడిగినపుడు తాను చూపలేనని నిస్సహాయతను తెలియజేస్తాడు. ఆ ప్రదేశంలో చిన్న సందొకటుంది. ఆ సందు భిక్షగాళ్ళతో కిటకిటలాడుతుంటుంది. అక్కడ కనీసం 800 మంది భిక్షగాళ్ళుండవచ్చు. వారిలో 50 - 60 మంది స్త్రీలు. మీరు కాసేపు అక్కడ ఆగితే 4 - 5 బ్రెడ్డు ముక్కలతో రొట్టెలమ్మేవాడు అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఆ బ్రెడ్డు ముక్కలను భిక్షగాళ్ళకు పంచమని కోరుతాడు. ఒకొక్క బ్రెడ్డు ముక్క ఖరీదు 20 రూపాయలు లేక అంతకంటే ఎక్కువే. భిక్షగాళ్ళకు తినిపించే అవకాశం కల్పించడానికి కనీసం 400 రూపాయలు సంపాదిస్తుంటారు. వారిలో చాలామందికి బ్యాంకు అకౌంట్లు వుంటాయి. ఆర్ధిక స్వేచ్చ వున్న ఈ కాలంలో అన్నీ సిద్ధంగా లభ్యమయ్యేవే. సిద్ధంగా వున్న భిక్షగాళ్ళు, బ్రెడ్డు ముక్కల రూపంలో సిద్ధంగా వున్న ఆహారం, అప్పటికప్పుడు పుట్టుకొచ్చే వ్యాపారులు! ప్రతి ఒక్కరూ తక్షణం లభ్ది పొందాలనుకుంటారు. సాయిబాబా పవిత్రమైన విభూతిని అక్కడ పంచిపెట్టినట్లు చెప్పే స్థలం ఆ దారిలోనే వుంది. దాన్ని చందోర్కర్ చావడి అంటారు. అందులో అందంగా చెక్కిన చెక్క పలక వుంది. దానిపై బాబా నిద్రించే స్థలాన్ని తెలిపే వివరాలు చెక్కబడ్డాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ చెక్కపలక అయిదారు సంవత్సరాల క్రితం చెక్కబడినట్లు తెలుస్తుంది. అక్కడ స్త్రీలకు ప్రవేశం లేదని తెలిపే మరో బోర్డు కూడా కనిపిస్తుంది. సాయిబాబా జీవిత చరిత్ర ప్రకారం అతని జీవితకాల పర్యంతం మంచి చెడ్డలు చూసిన మహిళ బయజబాయి. అయితేఈ కాలంలో కూడా మహిళలకు ఇటువంటి నిషేధం విధిస్తూ వివక్ష చూపడమెందుకో అర్థం కాదు. దీన్నిబట్టి చూస్తె 21 వ శతాబ్దంలో కూడా పురాతనమైన మనుస్మృతిలోని విధి నియమాలను పాటించాలని కొందరు కోరుకుంటున్నట్లు కనిపిస్తుంది.
ఈ ప్రదేశానికి దగ్గరలోనే సాయిబాబా సమకాలీనుడైన అబ్దుల్ బాబా ఇల్లు వుంది. ఆ వృద్ధుడి ఫొటోలు చూస్తే, అవి అచ్చుగుద్దినట్లు సాయిబాబా ఫొటోల్లాగే వుంటాయి. ఆ ఫొటోల గురించి అడిగితే అవి అబ్దుల్ బాబావేగాని సాయిబాబావి కాదని తెలిసింది. అక్కడి పవిత్ర గ్రంథం, ఇతర వస్తువులన్నీ అబ్దుల్ బాబాకు చెందినవని తెలిపాడు రహీం బాబా. భక్తులు లోపలి వచ్చినపుడు రహీం బాబా వారిని దీవిస్తాడు. వారు అతనికి చిల్లర యిచ్చి వెళతారు.
'మీరు సాయిబాబాను చూసారా' అని అతడిని అడిగాను.
'నేను అబద్ధం చెప్పను. ఈ విషయం గురించి మాట్లాడదలచుకోలేదు. నేడంతా వ్యాపారమయమైపోయింది. సాయిబాబా గురించి ఇతని వివరాల గురించి ఎవరికి కావాలి?' అని ఆక్రోశించాడు.
" సాయిబాబా ఒరిజినల్ ఫొటో దొరుకుతుందా?" అని ప్రశ్నించాను.
"చూడండి. అబ్దుల్ బాబా సాయిబాబాకు సమకాలీనుడు. అబ్దుల్ బాబా అసలు ఫొటోలు మా వద్ద వున్నాయి. మిగతా విషయాలు నాకు తెలియవు. సత్యానికి చోటెక్కడుందయ్యా" అన్నాడతడు.
ద్వారకామాయి మసీదుగా ప్రసిద్ధమైన మరో ప్రదేశముందక్కడ. గోధుమల సంచి, స్నానపు రాయి, పొగపీల్చే గొట్టం (చుల్వా) మున్నగు వస్తువులన్నీ చరిత్రకు సంబంధించిన మ్యూజియాలలో మాదిరిగా ప్రదర్శనకు పెట్టారు. ప్రజలు చాల గౌరవ భావంతో ఇక్కడికి వస్తుంటారు. గోధుమల సంచి మాత్రం ఇటీవల కొన్నదానిలాగా కొత్తగా కనిపిస్తుంది. వందేళ్ళ పాతది మాత్రం కాదు.
పొగ పీల్చే గొట్టం రంగులతో అలంకరించబడి వుంది. నిప్పున్న ప్రాంతం మండుతూ వుంది. సాయిబాబా ఆశీస్సులకోసం భక్తులంతా ప్రతి వస్తువు ముందు తలలు వంచి మొక్కుతారు. ఆ వస్తువులు అసలువా, నకిలీవా అనే సందేహం ఎవ్వరికీ కలుగుతున్నట్లు కనిపించదు. ఈ నకిలీ వస్తువులను దర్శిస్తూన్నపుడు ఎవరూ ఎటువంటి ప్రశ్నలూ అడగరు. ఆలోచనాశక్తి, హేతుత్వం, జిజ్ఞాస మచ్చుకైనా కనిపించవు. మతవిలువలకై ప్రాకులాడే వారు అందరినీ బానిసలను చేసారు. అన్ని సమస్యలకు బాబావద్ద పరిష్కారాలున్నాయి. అతడు అన్ని వ్యాధులను నయం చేస్తాడు. బాబా (లేక అతని వారసులు) ఇచ్చే బూడిదే దివ్యౌషధం. అది జలుబునుండి కాన్సర్ వరకు అన్ని రోగాలను నయం చేస్తుంది. (దానితోనే) అంధుడైన తాత్యషేబు స్కూలర్ కు దృష్టి వచ్చింది. పుట్టు చెవుడు ఉన్నప్పటికీ బాబా దీవెనలవల్ల పద్మనాభస్వామి స్పష్టంగా వినగల్గుతున్నాడు. కుక్కకు బాబా అన్నం పెట్టినందువల్ల బాబాసాహెబ్ హంపి అనే అతనికి మలేరియా వ్యాధి నుండి విముక్తి కలిగింది. శ్రీమంత్ రక్త విరోచనాల నుండి విముక్తుడయ్యాడు. ఇటువంటి వేలాది కట్టు కథలు సర్వత్రా తరతరాలుగా వ్యాపిస్తూ వస్తున్నాయి. బాబా దివ్యత్వం, అనంతశక్తి, కరుణ గురించి సందేహించే ధైర్యం ఎవ్వరికీ లేదు. బాబా యిచ్చిన వేరుశనగ కాయలు తినడంవల్ల మహాదేవరావు దేశ పాండేకు మొలల వ్యాధి నయమయింది. పాము, తేలు కాట్లను విషం పీల్చడం ద్వారా బాబా నయం చేసేవాడు. పవిత్ర విభూతిని మింగినపుడు దక్తోపంతుకు కడుపునొప్పి తగ్గిపోయింది. గ్రామస్తులంతా ప్లేగు వ్యాధితో పీడింపబడుతున్నప్పటికీ చందోర్కర్ స్నేహితురాలు తన ముఖానికి విభూది పూసుకొన్నందువల్ల బ్రతికింది. మాలెగావ్ కు చెందిన క్షయ వ్యాధిగ్రస్తుడు తన దేహం నిండా విభూతి పూసుకోవడం ద్వారా రోగ విముక్తుడయ్యాడు.
సాయిలీలామృతంలో ముద్రించిన ఈ మహాత్యాలను పదేపదే చెప్పి, సవరించి, కీర్తించి, మెరుగు పరచడం ద్వారా వాటిలోని వాస్తవం గురించి ఎవరికీ ఏమాత్రం సందేహం కలుగకుండా చేసారు. వీటిని వర్ణించేవాడు ఆయా మహత్యాలు సంభవిస్తున్నపుడు తాను స్వయంగా అదృశ్య రూపంలో ఆయా ప్రదేశాలలో ఉన్నట్లే వర్ణిస్తాడు. గాడి మనస్తత్వాన్ని సంతరించుకున్న భక్తుల మనసులు అటువంటి అభూత కల్పనలను వినడానికే అలవాటు పడతాయి. దర్శనం చేతగాని, విభూతి చేతగాని వ్యాధులు నయమయ్యే పక్షంలో ట్రస్టు వారు అధునాతనమైన ఆసుపత్రిని ఎందుకు నిర్మించినట్లు? నిరుపేద భక్తుల వైద్యానికి సంబంధించిన బిల్లుల చెల్లింపులో సబ్సిడీలు ఇవ్వడం వల్ల ఆ ఆసుపత్రికి ఏటా పాతిక లక్షల రూపాయల నష్టం వస్తోంది. సాయిబాబా రోగాలు రాకుండా ఎందుకు చేయలేకపోతున్నాడు? షిరిడికి, బాబాకు మహత్యమే వుంటే - రోగ నిర్ధారణ కేంద్రాలు, ఆపరేషన్ థియేటర్లు, శస్త్ర చికిత్సా సదుపాయాలు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, అనుభవజ్ఞులైన సర్జన్లు ఎందుకు కావాలి? సాయిబాబా భక్తుడు యజమానిగా వున్నా శ్యాం దాస్ ఫౌండేషన్ వారు హాంకాంగ్ లో అధునాతనమైన ఆసుపత్రిని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా వున్న వందలాది వైద్య నిపుణులు ఏదో ఒక హోదాలో ఈ ఆసుపత్రిని సందర్శిస్తుంటారు. అధునాతన సౌకర్యాలు, సాయిబాబా ఆశీస్సులు ఉన్నప్పటికీ ఈ ఆసుపత్రిలో రోగులు కోలుకొనే స్థాయి మాత్రం అటువంటి సౌకర్యాలతో కూడిన ఇతర ఆస్పత్రుల స్థాయికి సమానంగానే వుంటున్నది.
సాయిబాబా ఇక్కడ ఎటువంటి ప్రత్యేకతను గాని, తేడాను గాని చూపలేకపోయాడు. ఇటువంటి గణాంక వివరాలతో కూడిన సంభావ్యతలు, వాస్తవాలు, కళ్ళకు కనిపించే సాక్ష్యాధారాలకు భిన్నంగా సాయిలీల అనే మాసపత్రికలో రకరకాల మహత్యాల గురించి ట్రస్టు వారు ప్రచురిస్తూనే వున్నారు. నిరక్షరాస్యులైన భక్తులకు, రోగ వ్యాప్తి ప్రక్రియ గురించి రోగమూలం గురించి తెలియకపోవచ్చు. రోగ నిర్థారణ పరీక్షలు, రోగ నిరోధక శక్తి, వైద్య విధానాల గురించి కూడా వారికి తెలియకపోవచ్చు. అయితే జీవితంలో జరిగే మంచిని మాత్రం సాయిబాబాకు అపాదిస్తున్నారనేది మాత్రం స్పష్టమైంది. సాయిబాబా మహత్యాల ప్రచారంలో ఇటువంటి ఆలోచనా రీతే ప్రధాన పాత్ర వహిస్తుంది. పోలియో, క్యాన్సర్, గుండె జబ్బులతో బాధపడే రోగులు నేడు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. సంతానం కోరే దంపతులు కూడా తరచుగా ఇక్కడికి వస్తుంటారు. అప్పటికప్పుడే ముడుపులు చెల్లిస్తుంటారు. వారు ఆర్ధిక పరిస్థితులను కూడా చూసుకోకుండా తమ కోరిక నెరవేరితే పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లిస్తామని మొక్కుకుంటారు. మొక్కులు చెల్లించుకోడానికి వడ్డీ వ్యాపారుల చేతిలో నలిగిపోతుంటారు. అమాయకులైన భక్తుల విరాళాలతో ప్రధానంగా లబ్ధి పొందుతున్నది మాత్రం ట్రస్టే. సాయిబాబా మహాత్యాలతో రోగాలను నయం చేస్తాడనే కథల ప్రచారం డబ్బులు పోగు చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ట్రస్టు సాయిబాబాకున్నమహత్యాల శక్తి గురించి పుస్తకాలలో, మేగజైన్లలో అక్కడక్కడ పేర్లు మార్చి, పునర్ముద్రణలు వేస్తుంటుంది. అన్ని కథలు ఒక్కలాగే వుంటాయి.
కొంతకాలం క్రితం కె.ఎస్.పాథక్ అనే ఐ.ఏ.ఎస్. అధికారి ట్రస్టు పెద్ద నియమితుడైనాడు. స్థానిక ట్రస్టీలు పెద్దమొత్తంలో సొమ్మును దుర్వినియోగపరచినట్లు తెలుసుకొన్నాడు. ట్రస్టీలు ప్రజలను దోచుకునేవారు. ట్రస్టుకు చెందిన బంగారు, వెండి ఆభరణాలు ట్రస్టీ ఇళ్ళలో కనిపించాయి. పోలీసులు వారిళ్ళకు సోదాకు వెళ్ళినపుడు ఆ ఆభరణాలను వారు సమీపంలో పొలాల్లోకి విసిరేశారు. ఛారిటీ కమిషనర్ విచారణ చేపట్టినపుడు, సి.ఐ.డి. అధికారులు ట్రస్టీ మోసాలను పరిశోధించారు. విచారణలు, పరిశోధనలు కొనసాగకుండా ట్రస్టీలు వారిపై రాజకీయ పలుకుబడితో వత్తిడి తెచ్చారు. చివరకు కొద్దిమంది ట్రస్టీలను జైళ్లలో పెట్టి శిక్షించారు. పత్రికలలో ఈ విషయాలన్నీ పతాక శీర్షికలలో వచ్చినప్పటికీ భక్తులు షిరిడిని సందర్శించడానికి వెనుకాడడంలేదు. 'సాయిబాబా గొప్పవాడు. మన పాపాలను ప్రక్షాళన చేస్తాడు' అనేదే భక్తుల దృక్పథం. రాజకీయ నాయకులు తమ శక్తిని పెంచుకోడానికి ఇక్కడికి వస్తుంటారు. అయితే కొన్నిసార్లు వారు కూడా అవస్థ పడతారు. మాజీ దేశాధ్యక్షుడైన శంకర్ దయాళ్ శర్మ అధికారార్భాటంతో షిరిడిని సందర్శించాడు. దర్శించిన కొద్దిరోజులకే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డాడు. సారూప్యభావాలున్న పార్టీలతో జత కట్టడానికి శరద్ పవార్ ఇక్కడికి వచ్చి ఆలయ దర్శనం చేసుకున్నాడు. మూడునెలల తర్వాత అతని రాజకీయ ఎత్తుగడలన్నీ చిత్తయ్యాయి. శంకరావు చవాన్, వసంతదాదాలు కూడా చాలా అవస్థ పడ్డారు. ప్రధానమంత్రిగా వున్నపుడు పి.వి. నరసింహారావు ఇక్కడికి వచ్చారు. అతడు తిరిగి ఢిల్లీ చేరుకొనేసరికి పదవే వూడింది. ఇది కూడా సాయిబాబా మహత్యం కావచ్చు!
మనం భక్తులను, వారి సమస్యలను ప్రక్కన పెట్టి చూచినా ట్రస్టీలు, స్థానిక ప్రజలు ప్రమాదపు సుడిగుండంలో వున్నట్లు కనిపిస్తారు. ఇక్కడి ధన క్రేజ్ లో ప్రతి పార్టీ తమవంతు వాటా కావాలంటుంది. సన్నిహిత సంబంధాలుండడం వల్ల గ్రామస్తులకు వారు ఏమి పోగొట్టుకుంటున్నది తెలియదని ఒకడు వాదించాడు. డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టడం ద్వారా పల్లెలను ఫైవ్ స్టార్ హోటళ్ళుగా మార్చివేసిందని గ్రామస్తులు వాదించరు. ఎత్తయిన భవంతులు, విశాలమైన రోడ్లు, విమానాశ్రయం ఉన్నప్పటికీ స్థానిక ప్రజలు మాత్రం కనీసావసరాలు తీరక బాధపడుతున్నారు. (ప్రజలను లూటీ చేయడంలో) స్థానిక ప్రజలు తమకు సహకరిస్తే వారు కూడా లబ్ధి పొందగలరని ట్రస్టీలు భావిస్తారు. స్థానికులు ఆలయం చుట్టూ తాత్కాలిక దుకాణాలను పెట్టుకొని భక్తుల కవసరమైన వస్తువులను అమ్మడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ఇది ట్రస్టీల కోపానికి కారణమైంది. వికారంగా కనిపించే ఆ తాత్కాలిక దుకాణాలను తక్షణం తొలగించాలని ట్రస్టీలు కోరుతున్నారు. సంవత్సరాల తరబడి వీరి మధ్య తగాదా కొనసాగుతుంది. అప్పుడప్పుడది హింసాత్మకంగా కూడా మారుతోంది. సాయిబాబా ఇక్కడి సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించలేకపోతే అతడు ఇతరుల సమస్యలను పరిష్క రించగలడని ఎలా భావించగలం? సాయిబాబా జేబులు కత్తిరించేవారికి, దొంగలకు సహకరిస్తున్నందువల్ల నేడు భక్తులు తమ సామానులు, డబ్బులు గురించి తామే జాగ్రత్త పడవలసి వస్తున్నది. భక్తులు గర్భగుడిలో వున్నపుడు కూడా వారి బ్యాగులు, పర్సులు దొంగతనానికి గురవుతున్నాయి. శ్రీరామనవమి, గురుపూర్ణిమ, దసరావంటి పండుగ దినాలలో భక్తుల తాకిడి ఎక్కువగా వున్నపుడు దొంగలు తమ పని చేసుకోవడం సులభమవుతుంది. సాయిబాబా మీద వున్న అచంచల విశ్వాసమే భక్తులు ఇటువంటి దుశ్చర్యల గురించి పట్టించుకోకుండా చేస్తుంది.
ఇంటర్ నెట్ లో ప్రధానంగా కనిపించే సందేశం - 'నీవు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను'. దూరప్రాంతాలవారు ఇంటర్నెట్ లోనే సాయిబాబాను దర్శించుకొని ఆశీస్సులను పొందవచ్చు. వెబ్-సైట్లలో కనిపించే విదేశీయుల ఈ మెయిల్ సమాచారం చదువుతుంటే ఆసక్తికరంగా వుంటుంది. వరాహ అప్పికట్ల అనే అతడు అమెరికాలో నివసించే భారతీయుడు. అతడు సాయిబాబా దర్శనం చేసుకొని ఐ.బి.ఎం. కంపెనీలో ఉన్నత పదవిలోకొచ్చాడు. ఇప్పుడతడు ట్రస్టుకు పెద్దమొత్తంలో విరాళం పంపడానికి సిద్ధంగా వున్నాడు. ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సహాయాన్ని వీరు తమ మూఢ విశ్వాసాలను బలపరచుకోడానికి వినియోగించుకుంటున్నారు.సాయిబాబా నమ్మకమనేది అంటువ్యాధివంటిది. ఇది మహారాష్ట్ర ప్రాంతానికే పరిమితం కాలేదు. దక్షిణ భారతంలో పుట్టపర్తి సాయిబాబా షిరిడి సాయిబాబాను అన్నివిధాలుగా అధిగమించాడు. ధర్మసాయి సేవ ట్రస్టు అణగారిన పిల్లలకు, నిరుపేదలకు అన్నం పెట్టడానికి హిందూజాతి నిర్మాణానికి, వేదపాఠశాల నిర్మాణానికి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరిస్తూ ఇప్పటికే ప్రసిద్ధమైంది.
దేశం నలుమూలలనుండి ప్రజలు షిరిడికి వస్తారు. వారంతా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నపుడు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంటారు. ప్రతి ఒక్క కథ దేనికదే సాటి. ఎవరైనా లోతుగా ప్రశ్నిస్తే భక్తులు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతారు. సంపద, విలాసాలు, చుట్టూ వుండే జనం,నివాసస్థలం, కుటుంబ సభ్యులు, ఒకటేమిటి ఇలా ప్రతిదానికి భయపడతారు. ఎవరినీ నమ్మే స్థితిలో వుండరు. ఈ భక్తులందరినీ ఒకరకమైన మానసిక వ్యాధి ఆవరిస్తుంది. బయటినుండి చూడడానికి వీరంతా సాధారణ మనుషుల్లాగే కనిపిస్తారు. అయితే ఈ సామాన్యులే కట్టు కథలను, మహత్యాలను, ఆశీర్వాద బలాన్ని, మానవ కల్పిత రక్షకులను ఎలా విశ్వసిస్తారో ఎవరికీ అర్థం కాదు. ఇటువంటి ప్రదేశాలనుండి తిరిగి వెళుతున్నపుడు తాను ఎటువంటి వుచ్చులో పడిపోతున్నాడో గుర్తించగల సాధారణ స్థాయిలో ఈ సమాజం ఉందా అనే అనుమానం హేతువాదికి కూడా కలుగకపోదు.
నినాదాల మధ్య మరోసారి నీవు- "సాయిబాబా బోలో.....సాయిబాబా బోలో....."
(రచయితా పూనాలో నివసించే చురుకైన హేతువాద మానవవాది)
1 comment:
ముస్లింలెవ్వరు దర్శించరు అన్నారు నా ముందే క్యూలో మాతో పాటు ముస్లింలు దర్శనానికి వచ్చారు.
బాబా కేవలం కల్పిత పాత్ర అన్నారు మీరన్నది నిజం అని నమ్మటం కష్టమే.ఎందుకంటే ఒక ఊరు ఊరంతా కూడబలుక్కుని కధ సృష్టించి ఉండాలి.ప్రాక్టికల్ గా ఇది జరుగుతుందా.మహిమలు ఉన్నాయా లేవా అనేది వేరే విషయం.ఒరిజినల్ ఫొటో దొరకలేదని కల్పిత పాత్ర అనటం సరిగాలేదు.ఏన్నో చారిత్రక సత్యాలకి ఫొటోలు లేవు.మహిమలు ఉన్నాయా లేవా అనే చర్చ వేరు చరిత్రకి సంబందించిన చర్చ వేరు.
Post a Comment