రచయిత త్రిపురనేని గోపీచంద్ పరిణామంత్రిపురనేని గోపీచంద్ పరిణామం
గోపీచంద్ రచయితగా ఆరంభమైన దశలో ఘంటాపధంగా శాస్త్రీయ హేతువాద దృక్పధంతో కలాన్ని నడిపించాడు. 1930లో అలా మొదలెట్టిన త్రిపురనేని గోపీచంద్ ఆంధ్రలో 15 సంవత్సరాల పాటు రచనా రంగంలో ఉర్రూతలూగించాడు.
  
“భగవంతుడు లేడు. సంగంలోని ఈ హెచ్చు తగ్గులు భగవంతుడు సృష్టించాడని చెప్పటం మోసం. నీతి నియమాలు ప్రకృతిలో నియమబద్ధతకు సంబంధించినవే” ఇలా రాసిన గోపీచంద్ తొలి ఆలోచనా స్రవంతికి అది అద్దంపడుతుంది. (పుటలు : సత్యాన్వేషణ. పేజీ- 145,149) అంతటితో ఆగక గోపీచంద్ ఇంకా ముందుకు వెళ్ళి ఇలా రాశాడు. “ఆధ్యాత్మిక నాగరికత అనే మత్తులో పడిఉండటం విదేశీ ప్రభుత్వానికి మంచిది కనుక అదే ప్రోత్సహిస్తుంది”. (ప్రాచ్య పాశ్చాత్య నాగరికత - 1938 ప్రజామిత్ర – పేజీ-70). “ఏ దృక్పధమైనా మానవుడి పరిణామానికి దోహం ఇచ్చేదిగా ఉండాలి. అతని మీద పెద్దనం చెలాయించేదిగా ఉండకూడదు” (పేజీ-171). ఆ గోపీచంద్ రాడికల్ మానవ వాదిగా, తండ్రి త్రిపురనేని రామస్వామి ప్రభావం కింద నాస్తికుడిగా, హేతువాదిగా విజృంభించాడు. ఎమ్.ఎన్. రాయ్ శాస్త్రీయ ఆలోచన వలన మానవ విలువలను పుణికి పుచ్చుకున్నాడు. సినిమాలలో కూడా సంస్కరణ ధోరణులు ప్రవేశ పెట్టాలని గూడవల్లి రాంబ్రహ్మంతో సహకరించాడు.  ఇది 1938 నాటికి మద్రాసులో ఆరంభమైన చైతన్య దశ.
“పదార్థం తనకు తానే పరిణామం చెందుతుంది. ప్రకృతి నియమ బద్ధత గలది” (సత్యాన్వేషణ, పేజీ-145).

త్రిపురనేని గోపీచంద్ రచయితగా రంగప్రవేశం చేసే నాటికి (1930 ప్రాంతంలో) ఉన్నవ లక్ష్మీ నారాయణ మాలపల్లి అప్పుడే వెలుగు చూచింది. త్రిపురనేని రామస్వామి అప్పట్లో జస్టిస్ పార్టీ పాలనా ప్రభావంలో రచనలు చేశారు. ఆయన భావ ఛేదకుడు. గోపీచంద్ అటువంటి వాతావరణంలో శంబుకవథ వ్యాసంతో వచ్చారు. ఆ తరువాత గోపీచంద్ నాటి రాష్ట్ర రాజధాని మద్రాసు వెళ్ళి గూడవల్లి రాంబ్రహ్మం సంస్కరణల ప్రభావంలోకి ప్రవేశించారు. అది కూడా గోపీచంద్ రచనలకు వన్నె తెచ్చింది.

అటువంటి కీలక దశలో రెండో ప్రపంచ ఆరంభ సమయంలో పునర్వికాసోద్యమ కర్త మానవేంద్రనాథ్ రాయ్ తటస్తపడ్డాడు. గోపీచంద్ కు నచ్చిన, ఆయన మెచ్చిన భావ విప్లవ బీజాలు రాడికల్ డెమొక్రటిక్ పార్టీలో చూచాడు. ఆలోగా రాయ్ రచనల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీలో పట్టాభిసీతారామయ్య సోషలిజాన్ని వెక్కిరిస్తూ మంచి రచన చేశాడు. దేవుని జీవితం, భార్యలలోనే ఉంది. వంటి రాజకీయ షార్ట్ స్టోరీస్ రాసి ఆకర్షించాడు.
రాజకీయ కథలకు గోపీచంద్ నాంది పలికాడు. శాస్త్రీయ పంధాలో ఆలోచించడం, చరిత్రను సైంటిఫిక్ గా మన దేశంలో రాయాలనడం మొదలైంది. అది రాయ్ మార్గదర్శకత్వం, గోపీ చంద్ కు నచ్చింది. తనూ ఆ మార్గంలో రాశాడు. విమర్శలు గుప్పించాడు. రాయ్ రచనలు తెలుగులోకి అనువదించాడు. మార్క్సిజం అంటే ఏమిటి?, సోషలిస్ట్ ఉద్యమ చరిత్ర అనే చిన్న, పదునైన పుస్తకాలు వెలువరించాడు.

త్రిపురనేని రామస్వామి పెద్దకుమారుడు గోపీచంద్. భావ ఛేదకుడుగా సమాజంలో మలుపులు తిప్పిన రామస్వామి ధోరణి కొంత వరకూ గోపీచంద్ కు పట్టుబడింది. అందులో హిందూ సంస్కరణలు, రామాయణ విమర్శ తొలిదశలో కనిపించాయి.

గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో బి.ఎ. చదివిన గోపీచంద్ కు, రామస్వామి (శంబుకవథ) నాటకం నచ్చి, కాలేజీ మాగజైన్ లో వ్యాసం రాశారు. స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న రోజులవి. తెనాలిలో రామస్వామి కొంత వరకు జస్టిస్ పార్టీ ప్రభావంతో వున్నారు. మరో పక్క స్వాతంత్ర్య పోరాటాన్ని సమర్థించాడు. “వీర గంథం తెచ్చినాము, వీరులెవరు తెలుపండి” అనే ప్రేరణాత్మక స్వాతంత్ర గేయాలు జనంలో చొచ్చుకుపోయిన రోజులవి.

ఎ.సి. కాలేజీ నుండి వివాహ జీవితంలో అడుగిడిన గోపీచంద్ న్యాయవాద వృత్తి కోసం లా చదివారు. కాని ఆ వృత్తిలో ఆయన రాణించలేదు. అయితే మద్రాసులో వుండగా గూడవల్లి రాంబ్రహ్మం గారితో పరిచయమైంది. అదొక మలుపు. రాంబ్రహ్మం కృష్ణాజిల్లా నుండి మద్రాసు వచ్చి, ప్రజామిత్ర పత్రిక నడిపారు. సినిమా రంగంలో సంస్కరణ చిత్రాలు తీశారు. మరోపక్క ఎం.ఎన్. రాయ్ ను ఆహ్వానించి, ఆయన వ్యాసాలు, వార్తలు తన పత్రిక ద్వారా జనానికి అందించారు. అప్పుడే గోపీచంద్ కూడా ఎం.ఎన్. రాయ్ ప్రభావం కిందకు వచ్చాడు. ఆయన వ్యాసాలు చదివి, కొన్ని తెలుగులోకి ప్రజామిత్ర ద్వారా అందించారు.
ఆనాడు ఎం.ఎన్. రాయ్ రచనలు పత్రికలు ప్రచురించేవికావు. ఆయన కొత్త విశేషాలు, శాస్త్రీయ పంథా రాజకీయాల్లోకి తెచ్చారు. భారతీయ చరిత్రను వైజ్ఞానిక పంథాలో రాసి, పుక్కిటి పురాణాలు ఆధారాలు లేని గాధలు దూరంగా పెట్టాలన్నాడు. కాంగ్రెస్ పార్టీని అట్టడుగు నుండీ బలోపేతం చేసి, ప్రజలు పాల్గొనేటట్లు చేయాలన్నాడు. దేశానికి పునర్వికాసం అవసరమన్నాడు. స్వాతంత్ర్యం రాకముందే రాజ్యాంగాన్ని ముసాయిదా రూపొందించుకోవాలన్నాడు. ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తూ, మతాల్ని వ్యక్తిగత స్థాయిలో అట్టెపెట్టుకోవాలన్నాడు. రాజకీయాలలో శాస్త్రీయ పంథా సాధ్యమేనన్నాడు. గాంధీని విమర్శించటం, మితవాద కాంగ్రెస్ ను వ్యతిరేకించటం కారణంగా ఎం.ఎన్. రాయ్ ను, ఆయన పెట్టిన పునర్వికాస ఉద్యమాన్ని నాటి మీడియా కూడా ఆదరించలేదు. ఆ భావాల్ని తెలుగులో రాసిన గోపీచంద్ విషయం కూడా అంతే జరిగింది.
ఇదంతా గాంధేయ కాంగ్రెస్ కు కొత్త. యువత, కొందరు మేధావులు రాయ్ ధోరణిని ఆహ్వానించారు. కలకత్తాలో అమృత బజార్ పత్రిక మాత్రమే రాయ్ రచనలు అందించేది.
1937లో ఎం.ఎన్. రాయ్ మద్రాసు వచ్చినప్పుడు గూడవల్లి రాంబ్రహ్మం స్వాగత విందు యిచ్చారు. వి.ఆర్. నార్ల, ఖాసాసుబ్బారావు వంటి వారు నిరసన తెలుపగా, గోపీచంద్, ఆవుల సాంబశివరావు వంటి వారు స్వాగతించారు.
తెనాలిలో ప్లేడర్ గా గోపీచంద్ ఏమంత పేరులోకి రాలేదు. కాని రాడికల్ హ్యూమనిస్ట్ గా ఖ్యాతి ఆర్జించాడు.
ఎం.ఎన్. రాయ్ ఉత్తరోత్తరా తెనాలి వచ్చినప్పుడు త్రిపురనేని రామస్వామి, చలం గార్లతో చర్చా సమావేశం జరిగింది (1941-42). గోపీచంద్, ఆవుల గోపాలకృష్ణ మూర్తి యీ సమావేశ కర్తలు. ఆ తరువాత కొద్ది కాలానికే త్రిపురనేని రామస్వామి చనిపోయారు (1943 జనవరి) గోపీచంద్ పూర్తి స్థాయిలో ఎం.ఎన్. రాయ్ భావ ప్రపంచంలో నిమగ్నమయ్యారు. చాలా లోతుకు వెళ్ళారు.
ఎం.ఎన్. రాయ్ స్థాపించిన రాడికల్ డెమొక్రటిక్ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి అయ్యారు. కార్యాచరణలోకి దిగారు. రచనలు విస్తారంగా చేశారు. గోపీచంద్ మిత్రులలో సహచరులలో అబ్బూరి రామకృష్ణారావు, జీవి కృష్ణారావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, కోగంటి రాధాకృష్ణమూర్తి, పాలగుమ్మి పద్మరాజు మొదలైన వారు ఉండేవారు.
గోపీచంద్ ఎదురీత
ఆనాటి గడ్డు రాజకీయ సాంఘిక వాతావరణంలో గోపీచంద్ గట్టిగా నిలిచాడు. ఒకవైపు రచనలు చేస్తూ, మరో పక్క అధ్యయన తరగతులలో పాల్గొంటూ, పార్టీని పటిష్ట పరచాడు.
రెండో ప్రపంచ యుద్ధం మొదట్లో కమ్యూనిస్టులు “సామ్రాజ్య వాదయుద్ధం” అంటూ దానిని వ్యతిరేకించారు. చరిత్ర తెలిసిన ఎం.ఎన్. రాయ్, బి.ఆర్. అంబేద్కర్ లు యుద్ధ స్వభావాన్ని వివరించారు. జర్మనీ, జపాన్, ఇటలీలు కలసిన నేపధ్యంలో చూడాలన్నారు. వారు గెలిస్తే ఫాసిజం, నాజీయిజం మళ్ళీ ప్రపంచాన్ని ఏలుతాయని, ఇండియా మరో 200 ఏళ్ళు పరాయి పాలనలోకి పోతుందన్నారు. యుద్ధంలో ఇంగ్లండ్ గెలిస్తే, యుద్ధానంతరం దేశాన్ని విడిచి వెళ్ళవలసిన పరిస్థితి తప్పని సరిగా వస్తుందన్నారు. కనుక బ్రిటన్ ను యుద్ధంలో సమర్థించాలన్నారు. కమ్యూనిస్టులు దీనిని వ్యతిరేకించి, ఎం.ఎన్. రాయ్ ను తిట్టారు.
అప్పట్లో హిట్లర్ తో సంధి రాయబారం నడిపిన రష్యా నియంత స్టాలిన్, భజనలో కమ్యూనిస్టులు నిమగ్నమయ్యారు. కాని అచిర కాలంలోనే రష్యాపై జర్మనీ దండెత్తడంతో కమ్యూనిస్టులు గుక్క తిప్పుకోలేక పోయారు. సామ్రాజ్యవాదయుద్ధం కాస్తా ప్రజా యుద్ధంగా మారింది. రష్యా ఎలా చెబితే అలా నడచిన కమ్యూనిస్టులు, సొంత ఆలోచన చేయలేక పోయారు. గుడ్డిగా దేశంలో ఎం.ఎన్. రాయ్ ను, వ్యతిరేకించారు.

మరో వైపు కాంగ్రెస్ వారు దూర దృష్టి లేకుండా ప్రవర్తించారు. సుభాష్ చంద్ర బోస్ ఉద్రేకంగా హిట్లర్ ను వెనకేసుకొచ్చాడు. రాయ్ అందులోని లోపాన్ని చూపి హెచ్చరించాడు.
అలాంటప్పుడు ఎం.ఎన్. రాయ్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీ పెట్టారు. శిక్షణ తరగతులు నడిపారు. అంతర్జాతీయ రాజకీయాల విడమరచి చెప్పారు. రచనలు చేసి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, శాస్త్రీయ ధోరణి తెచ్చారు. గోపీచంద్ ఆపంధాలో తెలుగులో రచనలు చేశారు.
ఆనాడు బలంగా వున్న సోషలిస్టు ఉద్యమాన్ని పరిశీలించి, చరిత్ర రాసి అందించారు. జయప్రకాశ్ నారాయణ, రాం మనోహర్ లోహియా, మధు లిమాయే, అశోక్ మెహతా, అరుణా అసఫ్ అలీ వంటి వారు ప్రముఖ పాత్ర వహించిన సోషలిస్టు పార్టీ, ఉద్యమ చరిత్రను గోపీచంద్ విశ్లేషించారు.

మరో వైపు గాంధీ అనుచరుడుగా పట్టాభిసీతారామయ్య 1938లో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. బోస్ ను ఓడించారు. పట్టాభి  సీతారామయ్య కాంగ్రెస్ పార్టీ చరిత్ర రాశారు. గాంధీకి సన్నిహితుడుగా బందరు నుండి ఇంగ్లీషులో పత్రిక నడిపారు. ఆయనకు వంట బట్టని సోషలిజం గురించి గోపీచంద్ విమర్శనాత్మక రచన చేశారు.

అటు కమ్యూనిస్టులకూ ఇటు కాంగ్రెస్ వారినీ ఎడాపెడా ఎదుర్కొన్ని, విమర్శలు చేస్తూ, వ్యంగ్య రచనలు చేసిన గోపీచంద్ తొలి సారిగా తెలుగులో రాజకీయ కథలు రాశారు. సిద్ధాంతాలను అతి తేలిక భాషలో విడమరచిచెప్పారు. రాడికల్ డెమొక్రటికీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మూఢనమ్మకాలను ఎదుర్కొన్నారు. కవితలు, సాహిత్య రంగంలో విశ్వనాధ సత్యనారాయణ వంటి తిరోగమన వాదుల్ని బాగా తిప్పి కొట్టారు.

బెజవాడ నుండి బండి బుచ్చయ్య నడిపిన ‘ములుకోల’ పత్రిక, తెనాలిలో ప్రారంభమైన ‘రాడికల్’ పత్రిక, గూడవల్లి రాంబ్రహ్మం ‘ప్రజామిత్ర’ మాత్రమే గోపీచంద్ రాజకీయ రచనలు ప్రచురించేవి.  దిన పత్రికలు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, మిగిలిన పత్రికలు కృష్ణా పత్రిక వంటివి గోపీ చంద్ రాడికల్ విమర్శలు ప్రచురించేవిగావు. ఆ మాట కొస్తే వార్తలు సైతం వేసేవి కావు.
1942లో ప్రజామిత్ర ఆగింది. 1943 జనవరిలోనే త్రిపురనేని రామస్వామి చనిపోయారు. ఆయన తుది వరకూ పురాణాల్ని, ఛాందసాల్ని, మూఢనమ్మకాల్ని ఎదుర్కొంటూ పోయారు. రాను రాను కులతత్వం పై ధ్వజం ఎత్తి, తన పేరులో ‘చౌదరి’ కూడా చివరలో తొలిగించుకున్నారు. కాని ఆయన 50 సంవత్సరాలకే చనిపోయారు. ఆయన భావ ప్రభావం మాత్రం గోపీచంద్ పై ముద్ర వేసింది. ఆ తరువాత ఎం.ఎన్. రాయ్ రావడంతో గోపీచంద్ భావ పరిణితి బాగా విస్తరించి, ఆలోచనా పరిధిలోతు పాతుల్ని చవిచూచింది. శాస్త్రీయ పంథా అంటే ఏమిటో గోపీచంద్ గ్రహించారు.
పీఠాధిపతి
తెనాలిలో గోపీచంద్ సూతాశ్రమంలో ఒక ఆకర్షణీయ వ్యక్తి అయ్యారు. ఆయన చుట్టూ రచయితలు, కవులు, కళాకారులు, ఎందరో కొలువు తీర్చేవారు.  గోపీచంద్ తెనాలిలో పీఠాధిపతి అయ్యారు. ఇది 1945 వరకూ సాగింది. ఈలోగా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ మేధావులలో కొందరిని ఆకట్టుకున్నది. కొందరు రచయితలు పదునైన పుస్తకాలు వెలువరించారు. వారిలో కోగంటి రాధా కృష్ణమూర్తి, పి.వి. సుబ్బారావు వంటి వారి రచనలకు గోపీచంద్ పీఠికలు రాశారు.
గోపీచంద్ స్థానంలో గుత్తి కొండ నరహరి రాష్ట్ర రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శి అయ్యారు. తెనాలిలో ఆనాడు ఆవుల గోపాలకృష్ణమూర్తి రాడికల్ హ్యూమనిస్ట్ గా, ఎం.ఎన్. రాయ్ అనుచరుడుగా చాలా ప్రాముఖ్యత వహించాడు. ఆయన వ్యాసోపన్యాసకుడు. అడ్వకేట్ అనువాదాలు కొన్ని చేసి రాయ్ భావ ప్రచారం గావించాడు. ఎం.ఎన్. రాయ్ ను త్రిపురనేని రామస్వామికి, చలానికి పరిచయం చేసిన కీలక వ్యక్తి, ఆయన చుట్టూ ఎందరో యువకులు, కవులు, గాయకులు, కళాకారులు, విద్యార్థులు వుండేవారు. ఆ కర్షణీయమైన ఉప న్యాసాలు, పదునైన ఘాటైన విమర్శలు ఎజికె బలం.

గోపీచంద్ కు యిదంతా యిష్టం వుండేది కాదు. తన పీఠాధిపత్యానికి ఎదురుండరాదని ఆయన అభిమతం. కాని ఎజికె ఆకర్షణముందు గోపీచంద్ పనికిరాలేదు. చివరకు గోపీచంద్ తమ్ముడు గోకుల్ చంద్ కూడా ఎజికె అంటే విపరీత అభిమానం చూపేవాడు. ఎందరో రచయితలు తమ పుస్తకాలకు ఎజికె చేత పీఠికలు రాయించుకున్నారు. ఎజికె అంటే గోపీచంద్ కొంత బెరుకుగా వుండేవాడు. ఎదుటబడి ధైర్యంగా మాట్లాడే వాడు కాదు.
అఖిలభారత రాడికల్ హ్యూమనిస్ట కాంప్ లలో సైతం ఎం.ఎన్. రాయ్ ను ఎదుర్కొగలిగిన ఎజికె తన పీఠాధిపత్యానికి ముప్పు అని గోపీచంద్ భావించాడు.
సినిమారంగంలో

గోపీచంద్ మద్రాసులో గూడవల్లి రాంబ్రహ్మం గారి పరిచయంలో సినిమా రంగ ప్రవేశం చేశారు. రైతుబిడ్డ సినిమాకు సంభాషణలు రాశారు. ఇది 1937 నాటి విషయం. ఆ తరువాత రాజకీయాల్లో వున్నారు. గనుక, సినిమాకు సెలవు బెట్టారు. తెనాలిలో ప్లీడర్ గానూ, రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగానూ వుంటూ, 1946 నాటికి వాటికీ స్వస్తి పలికారు. మళ్ళీ సినిరంగంలో ప్రవేశించడానికి మద్రాసు వెళ్ళారు. అదొక పెద్ద మలుపు.
గోపీచంద్ సినీరంగంలో అన్ని పాత్రలు నిర్వహించారు. అంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, సంభాషణలు యిలా వివిధ కోణాలు చూశారు. సినీరంగం భిన్నలోకానికి చెందినది. అక్కడ తళుకు బెళుకులూ, ఆకర్షణలు, రామణీయకతలు, కష్ట నష్టాలు, రసవత్తర రమ్యతలు అన్నీ గోపీచంద్ ను చుట్టుముట్టాయి. డబ్బు రాలేదు. శృంగార సుడిగుండాలు సరేసరి. ‘లక్ష్మమ్మ’ సినిమాతో గోపీచంద్ సాధారణ జీవితం గడపడం కష్టమైంది. మద్రాసులో సినీ కళాపోషణ రామణీయకతల నుండి గోపీచంద్ ను బయటపడేయడానికే ఆయన్ను పాండిచేరి అరవిందాశ్రమం తీసుకెళ్ళానని ఆచంట జానకీ రాం నాకు చెప్పారు. సంజీవ్ దేవే ఇంట్లో తుమ్మపూడిలో కలసినప్పుడు యిది జరిగింది. అంతటితో కొన్నాళ్ళు అరవిందుడి ఆధ్యాత్మిక అయోమయంలో పడిపోయాడు. దానిని సమర్థించడానికి పూనుకున్నాడు. కాని బ్రతుకు దెరువు ఆధ్యాత్మికతలో కష్టం, సంసారం యీదాలిగదా. కనుక కర్నూలులో రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ డైరెక్టర్ గా చేరారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వంలో ఆకాశవాణి ఉద్యోగిగా హైదరాబాద్ లో వున్నారు.
వయస్సు వచ్చేకొద్దీ కొందరు మెదడుకు పదను పెడతారు. ఎదుగుతారు. బెర్ట్రాండ్ రస్సెల్ అందుకు ఆదర్శం. మనమధ్యలో నార్ల వెంకటేశ్వరరావు ఉదాహరణ. గోపీచంద్ అందుకు భిన్నంగా మానవ హేతువాదం నుండి ఆధ్యాత్మిక అంధ విశ్వాసంలోకి దిగజారి పోయాడు. అది సమర్థించుకోడానికి రాతలు చేబట్టాడు. పాత జ్ఞాపకాలు, అనుభవాలు యితివృత్యాలుగా తీసుకొని, తన రచనా పాటవంతో, సమర్థించుకున్నాడు. అలా వెలువడిన వాటిలోనే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, మెరుపులు మరకలు పేర్కొనవచ్చు.
తెనాలిలో తన సహచరులుగా రాడికల్ డెమొక్రటిక్ పార్టీలో వున్న వారిని, తన తండ్రిని, తనను పాత్రలుగా చిత్రించి రాసిన పుస్తకమే పండిత పరమేశ్వర శాస్త్రి. అదంతా అరవింద పూర్ణయోగం చేబట్టిన కారణంగా, దానిని వెనకేసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రాసిందే. దానికి తోడు తన పీఠాధిపత్యం ఆరు పువ్వులు మూడు కాయలుగా తెనాలిలో వెలగకపోడానికి అడ్డొచ్చిన వారిని దుష్ట పాత్రలుగా పెట్టారు. జి.వి. కృష్ణారావు, ఆలూరి బైరాగి, కోగఁటి రాధాకృష్ణమూర్తి, ఆవుల గోపాలకృష్ణమూర్తి ప్రభృతులు పాత్రలు కాగా, తనను ఉత్తమ వున్నత ఆదర్శపాత్రగా మర్దించుకున్నాడు.
ఆద్యాత్మిక వాదిగా గోపీచంద్ లో రాగ ద్వేషాలు రోజు రోజుకూ పెరిగిపోగా తన సహచర్యులపై మరొక నవల మెరుపులు మరకలు రాశాడు. రేడియో కేంద్రంలో పాత్రలు ఎందుకు మౌనం వహిస్తాయి? ఆ నవలకు దీటుగా మళ్ళీ నవలలు వెలువరించి, బాగా తిప్పికొట్టారు.
అలా దిగజారుతూ పోయిన గోపీచంద్ చివరి దశలో సాయిబాబా భక్తుడుగావడం పరాకాష్ఠ. ఆలోచన చచ్చిపోయిన దశ అది.
తత్వవేత్తలు
గోపీచంద్ ప్రతి భావంతుడైన తెలుగు రచయిత. బాగా చదివాడు. బాగా చదివించగలడు. అటువంటి గొప్ప తనం అతని తత్వవేత్తలు రచనలో చూడవచ్చు.  గోపీచంద్ తాత్మిక విద్యార్థికాదు. బి.ఏ చదివి, లా ప్రాక్టీసు చేసిన వ్యక్తి. సొంతగా తత్వశాస్త్రాలు చదివాడు. అంత వరకూ బాగానే వుంది. చివరి దశలో అరవింద్ ఆధ్యాత్మిక పులుముడు సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడాడు. దానిని సమర్థించడానికి తత్వవేత్తలు లో ప్రయత్నించడం దారుణం.
ఇక అరవిందో ఒక కల్ట్ శాఖాధిపతి. నమ్మకాలు ప్రచారం చేసిన వ్యక్తి. ఆయన చెప్పే అడ్డదిడ్డమైన పూర్ణయోగం, క్రమం అన్నీ మూఢనమ్మకాలే. వీటిని తెగబలిసిన భాషలో యిమిడ్చాడు. కాని తత్వం ఏదీ లేదు. అందుకే తాత్వికులలో ఆయన యిమడడు. అయితే గోపీచంద్ అరవిందో భక్తుడుగా ఆయన్ని సమర్థిస్తూ పుస్తకాన్ని ముగించాడు.
గోపీచంద్ సన్నిహితులు ఆయనవలె, రాడికల్ డెమొక్రటిక్ పార్టీలో ఆ తరువాత మానవ వాద ఉద్యమంలో కృషి చేసిన వారు రావిపూడి వెంకటాద్రి. అలాగే ఎన్.వి. బ్రహ్మం వారిరువురూ వివిధ సందర్భాలలో గోపీచంద్ ను మద్రాసులో హైదరాబాద్ లో కలిశారు.
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాలో పాత్రల్ని గురించి, తెనాలిలో కొందరిని దృష్టిలో పెట్టుకొని రాసిన తీరు గురించి ప్రశ్నించారు. గోపీచంద్ దాటేశారు. ఎన్.వి. బ్రహ్మం పట్టు విడవక, ఆవుల గోపాలకృష్ణమూర్తి గురించి నవలలో రాసింది  విఫలమైందని కూడా ఎత్తి పొడిచారు. గోపీచంద్ తప్పించుకోడానికే ప్రయత్నించారు. అంతకు మించి ఆయన బయట పడలేక పోడానికి కారణం ఆయన గిల్టీ మనస్తత్వమే. బాపు చేత వేయించిన ముఖ చిత్రంలో ఎ.జి.కె, జి.వి.కె, రామస్వామి, గోపీచంద్ పోలికలు వున్నాయి.

ఆద్యాత్మిక వాదానికి, హేతువాదానికి సమన్వయం చేయటానికి గోపీచంద్ రచనలు ఉద్దేశించాయని కొందరు సందర్ధించబోవటం అపహాస్యమైన విషయం. ఆధ్యాత్మిక వాదంలో ఆలోచన తాకట్టు పడుతుంది. అందులో మనిషి పెరగడు. హేతువాతం అనంతం. నిరంతర శాస్త్రీయ దృక్పదంతో సాగిపోతూ కొత్త విషయాలను స్వీకరిస్తూ తమ పాత విషయాలను సరిదిద్దుకుంటూ పోతుంటుంది. ఇది అభ్యుదయ విధానం. ఇలాంటిది ఆధ్యాత్మికతలో ఉండదు.

ఇలా సాగిపోయిన గోపీచంద్ 1950 వరకు ఆ ధోరణిని కొనసాగించగలిగాడు. అయితే 1946 నుండి కొంత ఆలోచన, ఆచరణ మార్పుకు గురైంది. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ కార్యదర్శిగా మానేసి, అసమర్థుని జీవయాత్ర రచన (ఇది ఆలూరి భైరాగి కవిని ఉద్దేశించినది అనే అభిప్రాయం లేకపోలేదు) అనంతరం రాజకీయాలకు స్వస్తి పలికి, కొంత ధనాపేక్షతో సినిమాలకు కథలు, దర్శకత్వం, ప్రొడక్షన్ చేయాలని మద్రాసు వెళ్ళారు. అయితే ఆయన అనుకున్నట్లుగా ఆ రంగంలో రాణించలేకపోయారు. చాలా ఆటుపోట్లకు గురయ్యారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడు కుటుంబ వత్తిడుల కారణంగా, కొందరు మిత్రుల ప్రోత్సాహంతో పాండిచెర్రిలోనీ అరవింద ఆశ్రమానికి వెళ్ళారు. అప్పటి నుండి సొంత ఆలోచన లేదు. తాకట్టు మనస్తత్వంతో ప్రశ్నించకుండా గుడ్డిగా అనుసరించే విధానంలో పడిపోయారు. అదే అరవిందుడి పూర్ణయోగ విధానం. తరువాత ప్రచారకుడిగా మారిపోయాడు. అవే ఆయన రచనలలోనూ తొంగి చూశాయి. కొన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా మరి కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రచనలు కొనసాగించారు. వాటిలో మొదటి పలుకు, వివేచనా, లోతైన పరిశీలన విడనాడాడు. రాగద్వేషాలు బాగా ప్రవేశపెట్టి తనకు కోపతాపాలున్న వ్యక్తులను పాత్రలుగా పెట్టి రచనలు చేశారు. అలా చేసిన వాటిలో మెరుపులు మరకలు అనే నవల ఒకటి కాగా, పండిత పరమేశ్వరరశాస్త్ర వీలునామా అరవిందో ఆలోచన ప్రచారానికి పరాకాష్టను అందుకున్నది. అందులో పాత్రలన్నీ ఇంచుమించు తెనాలిలో ఆయన సన్నిహితులకు, తన తండ్రికి, తనకు సంబంధించినవే.
తత్వవేత్తలు రెండు భాగాలుగా మార్క్స్ తో మొదలెట్టి అనిబిసెంట్ తో ముగించాడు. అరవిందో తో ముక్తాయింపు పలికాడు. ఇంగ్లీషులో విల్ డ్యురాంట్ రాసిన దిస్టోరీ ఆఫ్ ఫిలాసఫి ప్రధాన ఆధారం చేసుకున్నాడని, దీనితొలి ప్రచురణ కర్త, బొందలపాటి శివరామకృష్ణ సదుద్దేశ్యంతోనే నాతో చెప్పారు. ఎవరైనా సరే ఆధార గ్రంధాల స్వీకరించక తప్పదు. గొప్ప తత్వవేత్తలు-బెర్ట్రాండ్ రస్సెల్, దాస్ గుప్త, ఎం.ఎన్. రాయ్ వంటి వారు తమ రచనలకు ఆధారాలు చూపి, తరువాత తమసొంత అభిప్రాయాలు చెప్పారు. గోపీచంద్ తత్వవేత్తలలో అలాంటి చిత్త శుద్ధిలోపించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాసినట్లున్నది.

చాలామంది తత్వవేత్తల గురించి అతి సులభశైలిలో చెప్పారు. అది హర్షించదగింది. అయితే గోపీచంద్ కు ఏది తత్వశాస్త్రం,  ఏది కాదు అనే విచక్షణ లేదు. అందుకు తగిన అకడమిక్ జ్ఞానం, క్రమశిక్షణ లేదుగనుక యీ దోషం వచ్చింది.

రష్యాలో బయలుదేరిన ఒక మూఢనమ్మకాల మాత బ్లా వెస్కీ చెప్పిన అంశాలే దివ్య జ్ఞాన సమాజం అయింది. ఆమె భక్తురాలుగా అనిబిసెంట్ చివరలో ఇండియా వచ్చి ఆ ప్రచారం చేసింది. కథలు అల్లింది. అలాంటి ఆమెను తత్వవేత్తలలో చేర్చడం తత్వశాస్త్రానికి అవమానం.
ఆర్య సమాజం హిందూ మతానికి సంస్కరణ వాదంగా బయలుదేరి కొంత వరకు వ్యాపించి, ఆగిపోయింది. దీనికి వేదాలు ప్రమాణ గ్రంథం. అది తప్ప మిగిలినవి పక్కన బెట్టాలన్నారు. దానిలో భాగంగా అనేక సంస్కరణలు అమలు పరచడంలో దయానంద సరస్వతి కృషి చేశారు. వివాహ పద్ధతి కూడా ఒకటి వున్నది. అయితే వీరికి తత్త్వ శాస్త్రం ఏదీ లేదు. కాని గోపీచంద్ వీరిని చేర్చడం అసంబద్ధం.
ఇక చివర చివరకు పేరా సైకాలజీ పేరిట అతీంద్రియ శక్తుల విషయాలు ప్రచారంలోకి తెచ్చిన డా. జె.బి. రైన్ ప్రభావంలోకి కూరుకుపోయాడు. చైతన్యం కాని మరి కొన్ని స్థాయిలున్నాయని, మహర్షులు ఆ స్థాయికి చేరుకున్నారని వారి అనుభవాలే వేదాలని రాశాడు. అంతేకాక వేదాలను ప్రశ్నించటానికి వీలు లేదంటే తప్పులేదని కూడా గోపీచంద్ అన్నాడంటే, అతని ఆధ్యాత్మిక ధోరణి ఏ స్థాయికి తీసుకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. మనం కింది స్థాయిలో ఉన్నామని, మహర్షులు పై స్థాయిలో ఉన్నారని కనుక వారిని ప్రశ్నించరాదని గోపీచంద్ నమ్మాడు.
ఉత్తరోత్తరా జె.బి. రైన్ వంటి వారి పేరా సైకాలజీ అశాస్త్రీయమని, స్పష్టంగా రుజువైంది. ఆయన అమెరికా యూనివర్సిటీలో దుకాణం మూసివేసి తాను చేసిన పనికి క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. అప్పటికి గోపీచంద్ లేడు. మొత్తం మీద శాస్త్రీయ ఆలోచనకు దూరమైంతర్వాత గోపీచంద్ సొంత ఆలోచన అంటూ చేయలేదని స్పష్టమైంది. “దారి తప్పిన మానవుడు” అనే వి.ఎస్. రమాదేవి నవలలో గోపీచంద్ పాత్ర కనిపిస్తున్నదని పరిశీలకులు అంటారు. ఇది పరిశోధన చేయవలసిన అంశం
.
(గోపీచంద్ శత జయంతి (1910-2010) సందర్భంగా ఆయన రచనలు సాధ్యమైనన్ని కూర్చి, 10 సంపుటలుగా, కమిటీ వెలువరించింది. ఇవి విజయవాడలోని అలకనంద ప్రచురణల వారందించారు. చలసాని ప్రసాద్, కృష్ణాబాయి కూర్పు చేసి, చిన్న పరిచయ పీఠిక రాశారు. అయితే 1937 నుండి 1945 వరకు ఎం.ఎన్. రాయ్, మానవ వాద ప్రభావంలో గోపీచంద్ రాజకీయ రచనలు, విమర్శలు అనువాదాలు యీ సంపుటాలలో లేవు. మార్క్సిజం అంటే ఏమిటి? సోషలిస్ట్ ఉద్యమ చరిత్ర అనేవి లభించలేదని అన్నారు. ఈ వ్యాసంలో ఉదహరించిన విషయాలు, చూపిన పేజీలు ఈ సంపుటాలలోనివే).
-         ఎన్. ఇన్నయ్య

No comments:

Post a Comment