మాది శాస్త్రీయం (సైంటిఫిక్) అని యిటీవల ప్రతి మతం అంటున్నది. పవిత్ర గ్రంథాలు మతాలకు మూలంగదా! అవీ సైంటిఫిక్ అంటున్నారు. బాబాలు, మాతలు చేసే అద్భుతాలు, యోగ ఒకటేమిటి! అన్నీ సైంటిఫిక్ పరిధిలోకి తీసుకువస్తున్నారు.
ఎందుకని?
సైంటిఫిక్ అంటే గౌరవం. తిరుగులేని వాదనగా జనం అంగీకరిస్తారని ఒప్పుకుంటున్నారు. ఇంకా రాను, రాను, జ్యోతిష్యం, వాస్తు, ముహూర్తాలు, చిట్కా వైద్యాలు సైంటిఫిక్ అంటున్నారు. ఆచారాలు, క్రతువులు, వ్రతాలు, నోములు, ఏదైనాసరే సైంటిఫిక్ అంటే చాలు – పాతతరం, కొత్త తరం అందరూ ఆమోదిస్తారనుకుంటున్నారు.
ఇది గొప్ప పరిణామం. ప్రతిదీ శాస్త్రీయం. (సైంటిఫిక్) పరిధిలోకి రాగలిగితే, అంతకంటే ఆహ్వానించదగింది మరొకటి లేదు.
వైద్యం, సాంకేతికం టెక్నాలజి, కంప్యూటర్ పరిజ్ఞానం, యివన్నీ శాస్త్రీయ పరిధిలోనివే. అలాగే భిన్న రంగాలలో విభిన్న శాస్త్రాలు, అభ్యసించి, వుద్యోగాలు సంపాదించి, వృత్తి నిపుణులుగా రాణించడానికి శాస్త్రీయ పద్ధతే కారణం.
అదే క్రమం మతాలకు, విశ్వాసాలకు, నమ్మకాలకు విస్తరించి, శాస్త్రీయ పద్ధతిని అంగీకరించడం పెద్ద మార్పు.
అయితే ఒక విషయం మరచిపోరాదు.
శాస్త్రీయ పద్ధతికి కీలకమైన అంశం – రుజువులు, ఆధారాలు అవి ఎప్పటికప్పుడు అన్వయిస్తూ పోతారు. వాటికి నిలిస్తేనే శాస్త్ర ప్రమాణంలోకి తీసుకుంటారు. ఇది సైన్స్ లో అన్ని విభాగాలకు చెందుతుంది. ఫిజిక్స్, ఖగోళం, భూగర్భం, వైద్యం, ఇంజనీరింగ్, విద్యుత్ యిలా ఏదైనా సరే శాస్త్రీయ పద్ధతి ప్రకారం సాగిపోతుంటాయి.
శాస్త్రీయ పద్ధతిలో శాశ్వతంగా స్థిరంగా మార్పులేని, ఎదురులేని విషయం అంటూ వుండదు. మార్పు నిత్యం, సత్యం. మార్పులకు అనుగుణంగా సిద్ధాంతాన్ని, అన్వయాన్ని మార్చుకుంటూ సాగుతారు. ఒక సైంటిస్ట్ చెప్పినది ప్రమాణంగా తీసుకోరు. అతను ఎంత గొప్పవాడైనా సరే. ఐన్ స్టీన్ కావచ్చు. హరగోవింద ఖురాన్ కావచ్చు. న్యూటన్ కావచ్చు. వారు సైతం సైంటిఫిక్ పద్ధతికి అనుగుణంగా రుజువుకు నిలవాల్సిందే. మార్పులు అంగీకరించాల్సిందే. అందుకే సైన్స్ లో, సాంకేతికంలో ఎప్పుడూ మార్పులు చూస్తాం. పాతవాటికి జతచేసి కొత్తవాటిని యిమిడ్చి సరిదిద్దుతారు. అదే శాస్త్రీయ పద్ధతిలో విశేషం. దీనినే శాస్త్రీయ పురోగమనం అంటారు. 18వ శతాబ్దం నుండి 19కి, ఆ తరువాత 20వ శతాబ్దానికి, ఏ రంగంలో చూచినా మార్పులు చేర్పులు కనిపిస్తాయి. అది శాస్త్రీయ పురోగమనం.
తప్పులు దిద్దుకోవడం, దోషాలు సవరిస్తూ సాగడం, శాస్త్రీయ పద్ధతి విశిష్ట లక్షణం. అదే పురోగమనానికి తోడ్పడుతుంది.
కనుక శాస్త్రీయ పద్ధతి, మతాలు, పవిత్ర గ్రంథాలు, బాబాలు, మాతలు, ఒప్పుకుంటే చాలా సంతోషం.
బైబిల్, ఖురాన్, వేదాలు, జిందావిస్తా, యిలాంటి మత పవిత్ర గ్రంథాలు తిరుగులేని, మార్పులేని, పరమసత్యాలు చెప్పాయంటారు. వాటికి శాస్త్ర్రీయ పద్ధతి అన్వయిస్తారా? అది జరిగితే సంతోషం. ప్రవక్తలు, దేవుళ్లు, బాబాలు, మాతలు చెప్పిందాన్ని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పాలేగాని, చంపకూడదు. హింసకు పూనుకోరాదు.
అంతేగాదు. మా మతం, మా దేవుడిని అంగీకరించని వారు మ్లేచ్ఛులని, పాషండులని, కాఫిర్లని, హేథన్స్ అని అనరు. వెలివేయడం వుండదు. శాస్త్రీయం అని చెప్పుకునేవారు యీ విషయాలు గ్రహిస్తే గొప్ప విశేషం. ఆహ్వానించాలి. అది మానవ సౌభాగ్యానికి ఉపకరిస్తుంది.
కొత్త కారుకు, పూజ చేయించాలని దానికి మతాచారం చెబితే, పురోహితుడికి గిట్టుబాటు కావచ్చు. అలాగే ముహూర్తాలకు, వ్రతాలకు, పరికిణీ పండగలకు మంత్రాలతో పురోహితులు క్రతువులు చేయిస్తే చేయించవచ్చు. పిండ ప్రదానం, సంవత్సరికాలు సరేసరి. వాటి వెనక శాస్త్రీయత, సైన్స్ వున్నదంటే, ప్రశ్న వస్తుంది. అది మూఢనమ్మకం, మా పూర్వీకులు అంటే అది వేరు. దానికి నేటి సైన్స్ జోడించబోతే, చిక్కు వస్తుంది. శాస్త్రీయ పద్ధతి అంటే ఏమిటో, అందుకే వివరించవలసి వచ్చింది.
అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియాలో అడుగు పెట్టినా ఇంగ్లండ్ ఉద్యోగం చేస్తున్నా, “మన కులం, మన గోత్రం, మన వంశం, మన అంటరానితనం, మన హెచ్చు తగ్గులు వెంట తేవడం మన మూర్ఖత్వం. అందులో శాస్త్రీయత లేదు. పుట్టెడాముదంలో మునిగినా అంటేదే అంటుతుందన్నట్లు, శాస్త్రీయ పరిజ్ఞానం మన దురాచారాన్ని మార్చలేకపోయిందనుకోవాలి.”
కాని మనం మారే అవకాశం వుంది. ముఖ్యంగా మన కుల, మత నమ్మకాలను పిల్లలకు అంటగట్టకపోతే, ముందు తరాలకు చాలా తోడ్పడినట్లు, అదేమంత సులభం కాదు. కాని ప్రయత్నం ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి గదా.
Innaiah Narisetti
No comments:
Post a Comment