ఎం.ఎన్.రాయ్ రచనలు



సుప్రసిధ మానవ తత్వవేత్త ఎం.ఎన్.రాయ్ రచనలు కొన్ని ఇప్పుడు వెభ్ సైట్ లో చదవవచ్చు. ఈ లింక్ చూడాండి.

http://www.theradicalhumanist.com/index.php?option=com_radical&controller=literatures&Itemid=61
తెలుగులో ఎం.ఎన్.రాయ్ ప్రధాన రచనలన్నీ నేను అనువదించగా తెలుగు అకాడమి,హైదరాబాద్ లో ప్రచురించింది.కాని అవి అయిపోయాయి. మళ్ళీ అచ్చు వేయవలసి వుంది.
నరిసెట్టి ఇన్నయ్య

రచయిత త్రిపురనేని గోపీచంద్ పరిణామం



త్రిపురనేని గోపీచంద్ పరిణామం
గోపీచంద్ రచయితగా ఆరంభమైన దశలో ఘంటాపధంగా శాస్త్రీయ హేతువాద దృక్పధంతో కలాన్ని నడిపించాడు. 1930లో అలా మొదలెట్టిన త్రిపురనేని గోపీచంద్ ఆంధ్రలో 15 సంవత్సరాల పాటు రచనా రంగంలో ఉర్రూతలూగించాడు.
  
“భగవంతుడు లేడు. సంగంలోని ఈ హెచ్చు తగ్గులు భగవంతుడు సృష్టించాడని చెప్పటం మోసం. నీతి నియమాలు ప్రకృతిలో నియమబద్ధతకు సంబంధించినవే” ఇలా రాసిన గోపీచంద్ తొలి ఆలోచనా స్రవంతికి అది అద్దంపడుతుంది. (పుటలు : సత్యాన్వేషణ. పేజీ- 145,149) అంతటితో ఆగక గోపీచంద్ ఇంకా ముందుకు వెళ్ళి ఇలా రాశాడు. “ఆధ్యాత్మిక నాగరికత అనే మత్తులో పడిఉండటం విదేశీ ప్రభుత్వానికి మంచిది కనుక అదే ప్రోత్సహిస్తుంది”. (ప్రాచ్య పాశ్చాత్య నాగరికత - 1938 ప్రజామిత్ర – పేజీ-70). “ఏ దృక్పధమైనా మానవుడి పరిణామానికి దోహం ఇచ్చేదిగా ఉండాలి. అతని మీద పెద్దనం చెలాయించేదిగా ఉండకూడదు” (పేజీ-171). ఆ గోపీచంద్ రాడికల్ మానవ వాదిగా, తండ్రి త్రిపురనేని రామస్వామి ప్రభావం కింద నాస్తికుడిగా, హేతువాదిగా విజృంభించాడు. ఎమ్.ఎన్. రాయ్ శాస్త్రీయ ఆలోచన వలన మానవ విలువలను పుణికి పుచ్చుకున్నాడు. సినిమాలలో కూడా సంస్కరణ ధోరణులు ప్రవేశ పెట్టాలని గూడవల్లి రాంబ్రహ్మంతో సహకరించాడు.  ఇది 1938 నాటికి మద్రాసులో ఆరంభమైన చైతన్య దశ.
“పదార్థం తనకు తానే పరిణామం చెందుతుంది. ప్రకృతి నియమ బద్ధత గలది” (సత్యాన్వేషణ, పేజీ-145).

త్రిపురనేని గోపీచంద్ రచయితగా రంగప్రవేశం చేసే నాటికి (1930 ప్రాంతంలో) ఉన్నవ లక్ష్మీ నారాయణ మాలపల్లి అప్పుడే వెలుగు చూచింది. త్రిపురనేని రామస్వామి అప్పట్లో జస్టిస్ పార్టీ పాలనా ప్రభావంలో రచనలు చేశారు. ఆయన భావ ఛేదకుడు. గోపీచంద్ అటువంటి వాతావరణంలో శంబుకవథ వ్యాసంతో వచ్చారు. ఆ తరువాత గోపీచంద్ నాటి రాష్ట్ర రాజధాని మద్రాసు వెళ్ళి గూడవల్లి రాంబ్రహ్మం సంస్కరణల ప్రభావంలోకి ప్రవేశించారు. అది కూడా గోపీచంద్ రచనలకు వన్నె తెచ్చింది.

అటువంటి కీలక దశలో రెండో ప్రపంచ ఆరంభ సమయంలో పునర్వికాసోద్యమ కర్త మానవేంద్రనాథ్ రాయ్ తటస్తపడ్డాడు. గోపీచంద్ కు నచ్చిన, ఆయన మెచ్చిన భావ విప్లవ బీజాలు రాడికల్ డెమొక్రటిక్ పార్టీలో చూచాడు. ఆలోగా రాయ్ రచనల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీలో పట్టాభిసీతారామయ్య సోషలిజాన్ని వెక్కిరిస్తూ మంచి రచన చేశాడు. దేవుని జీవితం, భార్యలలోనే ఉంది. వంటి రాజకీయ షార్ట్ స్టోరీస్ రాసి ఆకర్షించాడు.
రాజకీయ కథలకు గోపీచంద్ నాంది పలికాడు. శాస్త్రీయ పంధాలో ఆలోచించడం, చరిత్రను సైంటిఫిక్ గా మన దేశంలో రాయాలనడం మొదలైంది. అది రాయ్ మార్గదర్శకత్వం, గోపీ చంద్ కు నచ్చింది. తనూ ఆ మార్గంలో రాశాడు. విమర్శలు గుప్పించాడు. రాయ్ రచనలు తెలుగులోకి అనువదించాడు. మార్క్సిజం అంటే ఏమిటి?, సోషలిస్ట్ ఉద్యమ చరిత్ర అనే చిన్న, పదునైన పుస్తకాలు వెలువరించాడు.

త్రిపురనేని రామస్వామి పెద్దకుమారుడు గోపీచంద్. భావ ఛేదకుడుగా సమాజంలో మలుపులు తిప్పిన రామస్వామి ధోరణి కొంత వరకూ గోపీచంద్ కు పట్టుబడింది. అందులో హిందూ సంస్కరణలు, రామాయణ విమర్శ తొలిదశలో కనిపించాయి.

గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో బి.ఎ. చదివిన గోపీచంద్ కు, రామస్వామి (శంబుకవథ) నాటకం నచ్చి, కాలేజీ మాగజైన్ లో వ్యాసం రాశారు. స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న రోజులవి. తెనాలిలో రామస్వామి కొంత వరకు జస్టిస్ పార్టీ ప్రభావంతో వున్నారు. మరో పక్క స్వాతంత్ర్య పోరాటాన్ని సమర్థించాడు. “వీర గంథం తెచ్చినాము, వీరులెవరు తెలుపండి” అనే ప్రేరణాత్మక స్వాతంత్ర గేయాలు జనంలో చొచ్చుకుపోయిన రోజులవి.

ఎ.సి. కాలేజీ నుండి వివాహ జీవితంలో అడుగిడిన గోపీచంద్ న్యాయవాద వృత్తి కోసం లా చదివారు. కాని ఆ వృత్తిలో ఆయన రాణించలేదు. అయితే మద్రాసులో వుండగా గూడవల్లి రాంబ్రహ్మం గారితో పరిచయమైంది. అదొక మలుపు. రాంబ్రహ్మం కృష్ణాజిల్లా నుండి మద్రాసు వచ్చి, ప్రజామిత్ర పత్రిక నడిపారు. సినిమా రంగంలో సంస్కరణ చిత్రాలు తీశారు. మరోపక్క ఎం.ఎన్. రాయ్ ను ఆహ్వానించి, ఆయన వ్యాసాలు, వార్తలు తన పత్రిక ద్వారా జనానికి అందించారు. అప్పుడే గోపీచంద్ కూడా ఎం.ఎన్. రాయ్ ప్రభావం కిందకు వచ్చాడు. ఆయన వ్యాసాలు చదివి, కొన్ని తెలుగులోకి ప్రజామిత్ర ద్వారా అందించారు.
ఆనాడు ఎం.ఎన్. రాయ్ రచనలు పత్రికలు ప్రచురించేవికావు. ఆయన కొత్త విశేషాలు, శాస్త్రీయ పంథా రాజకీయాల్లోకి తెచ్చారు. భారతీయ చరిత్రను వైజ్ఞానిక పంథాలో రాసి, పుక్కిటి పురాణాలు ఆధారాలు లేని గాధలు దూరంగా పెట్టాలన్నాడు. కాంగ్రెస్ పార్టీని అట్టడుగు నుండీ బలోపేతం చేసి, ప్రజలు పాల్గొనేటట్లు చేయాలన్నాడు. దేశానికి పునర్వికాసం అవసరమన్నాడు. స్వాతంత్ర్యం రాకముందే రాజ్యాంగాన్ని ముసాయిదా రూపొందించుకోవాలన్నాడు. ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తూ, మతాల్ని వ్యక్తిగత స్థాయిలో అట్టెపెట్టుకోవాలన్నాడు. రాజకీయాలలో శాస్త్రీయ పంథా సాధ్యమేనన్నాడు. గాంధీని విమర్శించటం, మితవాద కాంగ్రెస్ ను వ్యతిరేకించటం కారణంగా ఎం.ఎన్. రాయ్ ను, ఆయన పెట్టిన పునర్వికాస ఉద్యమాన్ని నాటి మీడియా కూడా ఆదరించలేదు. ఆ భావాల్ని తెలుగులో రాసిన గోపీచంద్ విషయం కూడా అంతే జరిగింది.
ఇదంతా గాంధేయ కాంగ్రెస్ కు కొత్త. యువత, కొందరు మేధావులు రాయ్ ధోరణిని ఆహ్వానించారు. కలకత్తాలో అమృత బజార్ పత్రిక మాత్రమే రాయ్ రచనలు అందించేది.
1937లో ఎం.ఎన్. రాయ్ మద్రాసు వచ్చినప్పుడు గూడవల్లి రాంబ్రహ్మం స్వాగత విందు యిచ్చారు. వి.ఆర్. నార్ల, ఖాసాసుబ్బారావు వంటి వారు నిరసన తెలుపగా, గోపీచంద్, ఆవుల సాంబశివరావు వంటి వారు స్వాగతించారు.
తెనాలిలో ప్లేడర్ గా గోపీచంద్ ఏమంత పేరులోకి రాలేదు. కాని రాడికల్ హ్యూమనిస్ట్ గా ఖ్యాతి ఆర్జించాడు.
ఎం.ఎన్. రాయ్ ఉత్తరోత్తరా తెనాలి వచ్చినప్పుడు త్రిపురనేని రామస్వామి, చలం గార్లతో చర్చా సమావేశం జరిగింది (1941-42). గోపీచంద్, ఆవుల గోపాలకృష్ణ మూర్తి యీ సమావేశ కర్తలు. ఆ తరువాత కొద్ది కాలానికే త్రిపురనేని రామస్వామి చనిపోయారు (1943 జనవరి) గోపీచంద్ పూర్తి స్థాయిలో ఎం.ఎన్. రాయ్ భావ ప్రపంచంలో నిమగ్నమయ్యారు. చాలా లోతుకు వెళ్ళారు.
ఎం.ఎన్. రాయ్ స్థాపించిన రాడికల్ డెమొక్రటిక్ పార్టీకి రాష్ట్ర కార్యదర్శి అయ్యారు. కార్యాచరణలోకి దిగారు. రచనలు విస్తారంగా చేశారు. గోపీచంద్ మిత్రులలో సహచరులలో అబ్బూరి రామకృష్ణారావు, జీవి కృష్ణారావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, కోగంటి రాధాకృష్ణమూర్తి, పాలగుమ్మి పద్మరాజు మొదలైన వారు ఉండేవారు.
గోపీచంద్ ఎదురీత
ఆనాటి గడ్డు రాజకీయ సాంఘిక వాతావరణంలో గోపీచంద్ గట్టిగా నిలిచాడు. ఒకవైపు రచనలు చేస్తూ, మరో పక్క అధ్యయన తరగతులలో పాల్గొంటూ, పార్టీని పటిష్ట పరచాడు.
రెండో ప్రపంచ యుద్ధం మొదట్లో కమ్యూనిస్టులు “సామ్రాజ్య వాదయుద్ధం” అంటూ దానిని వ్యతిరేకించారు. చరిత్ర తెలిసిన ఎం.ఎన్. రాయ్, బి.ఆర్. అంబేద్కర్ లు యుద్ధ స్వభావాన్ని వివరించారు. జర్మనీ, జపాన్, ఇటలీలు కలసిన నేపధ్యంలో చూడాలన్నారు. వారు గెలిస్తే ఫాసిజం, నాజీయిజం మళ్ళీ ప్రపంచాన్ని ఏలుతాయని, ఇండియా మరో 200 ఏళ్ళు పరాయి పాలనలోకి పోతుందన్నారు. యుద్ధంలో ఇంగ్లండ్ గెలిస్తే, యుద్ధానంతరం దేశాన్ని విడిచి వెళ్ళవలసిన పరిస్థితి తప్పని సరిగా వస్తుందన్నారు. కనుక బ్రిటన్ ను యుద్ధంలో సమర్థించాలన్నారు. కమ్యూనిస్టులు దీనిని వ్యతిరేకించి, ఎం.ఎన్. రాయ్ ను తిట్టారు.
అప్పట్లో హిట్లర్ తో సంధి రాయబారం నడిపిన రష్యా నియంత స్టాలిన్, భజనలో కమ్యూనిస్టులు నిమగ్నమయ్యారు. కాని అచిర కాలంలోనే రష్యాపై జర్మనీ దండెత్తడంతో కమ్యూనిస్టులు గుక్క తిప్పుకోలేక పోయారు. సామ్రాజ్యవాదయుద్ధం కాస్తా ప్రజా యుద్ధంగా మారింది. రష్యా ఎలా చెబితే అలా నడచిన కమ్యూనిస్టులు, సొంత ఆలోచన చేయలేక పోయారు. గుడ్డిగా దేశంలో ఎం.ఎన్. రాయ్ ను, వ్యతిరేకించారు.

మరో వైపు కాంగ్రెస్ వారు దూర దృష్టి లేకుండా ప్రవర్తించారు. సుభాష్ చంద్ర బోస్ ఉద్రేకంగా హిట్లర్ ను వెనకేసుకొచ్చాడు. రాయ్ అందులోని లోపాన్ని చూపి హెచ్చరించాడు.
అలాంటప్పుడు ఎం.ఎన్. రాయ్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీ పెట్టారు. శిక్షణ తరగతులు నడిపారు. అంతర్జాతీయ రాజకీయాల విడమరచి చెప్పారు. రచనలు చేసి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, శాస్త్రీయ ధోరణి తెచ్చారు. గోపీచంద్ ఆపంధాలో తెలుగులో రచనలు చేశారు.
ఆనాడు బలంగా వున్న సోషలిస్టు ఉద్యమాన్ని పరిశీలించి, చరిత్ర రాసి అందించారు. జయప్రకాశ్ నారాయణ, రాం మనోహర్ లోహియా, మధు లిమాయే, అశోక్ మెహతా, అరుణా అసఫ్ అలీ వంటి వారు ప్రముఖ పాత్ర వహించిన సోషలిస్టు పార్టీ, ఉద్యమ చరిత్రను గోపీచంద్ విశ్లేషించారు.

మరో వైపు గాంధీ అనుచరుడుగా పట్టాభిసీతారామయ్య 1938లో కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. బోస్ ను ఓడించారు. పట్టాభి  సీతారామయ్య కాంగ్రెస్ పార్టీ చరిత్ర రాశారు. గాంధీకి సన్నిహితుడుగా బందరు నుండి ఇంగ్లీషులో పత్రిక నడిపారు. ఆయనకు వంట బట్టని సోషలిజం గురించి గోపీచంద్ విమర్శనాత్మక రచన చేశారు.

అటు కమ్యూనిస్టులకూ ఇటు కాంగ్రెస్ వారినీ ఎడాపెడా ఎదుర్కొన్ని, విమర్శలు చేస్తూ, వ్యంగ్య రచనలు చేసిన గోపీచంద్ తొలి సారిగా తెలుగులో రాజకీయ కథలు రాశారు. సిద్ధాంతాలను అతి తేలిక భాషలో విడమరచిచెప్పారు. రాడికల్ డెమొక్రటికీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మూఢనమ్మకాలను ఎదుర్కొన్నారు. కవితలు, సాహిత్య రంగంలో విశ్వనాధ సత్యనారాయణ వంటి తిరోగమన వాదుల్ని బాగా తిప్పి కొట్టారు.

బెజవాడ నుండి బండి బుచ్చయ్య నడిపిన ‘ములుకోల’ పత్రిక, తెనాలిలో ప్రారంభమైన ‘రాడికల్’ పత్రిక, గూడవల్లి రాంబ్రహ్మం ‘ప్రజామిత్ర’ మాత్రమే గోపీచంద్ రాజకీయ రచనలు ప్రచురించేవి.  దిన పత్రికలు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, మిగిలిన పత్రికలు కృష్ణా పత్రిక వంటివి గోపీ చంద్ రాడికల్ విమర్శలు ప్రచురించేవిగావు. ఆ మాట కొస్తే వార్తలు సైతం వేసేవి కావు.
1942లో ప్రజామిత్ర ఆగింది. 1943 జనవరిలోనే త్రిపురనేని రామస్వామి చనిపోయారు. ఆయన తుది వరకూ పురాణాల్ని, ఛాందసాల్ని, మూఢనమ్మకాల్ని ఎదుర్కొంటూ పోయారు. రాను రాను కులతత్వం పై ధ్వజం ఎత్తి, తన పేరులో ‘చౌదరి’ కూడా చివరలో తొలిగించుకున్నారు. కాని ఆయన 50 సంవత్సరాలకే చనిపోయారు. ఆయన భావ ప్రభావం మాత్రం గోపీచంద్ పై ముద్ర వేసింది. ఆ తరువాత ఎం.ఎన్. రాయ్ రావడంతో గోపీచంద్ భావ పరిణితి బాగా విస్తరించి, ఆలోచనా పరిధిలోతు పాతుల్ని చవిచూచింది. శాస్త్రీయ పంథా అంటే ఏమిటో గోపీచంద్ గ్రహించారు.
పీఠాధిపతి
తెనాలిలో గోపీచంద్ సూతాశ్రమంలో ఒక ఆకర్షణీయ వ్యక్తి అయ్యారు. ఆయన చుట్టూ రచయితలు, కవులు, కళాకారులు, ఎందరో కొలువు తీర్చేవారు.  గోపీచంద్ తెనాలిలో పీఠాధిపతి అయ్యారు. ఇది 1945 వరకూ సాగింది. ఈలోగా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ మేధావులలో కొందరిని ఆకట్టుకున్నది. కొందరు రచయితలు పదునైన పుస్తకాలు వెలువరించారు. వారిలో కోగంటి రాధా కృష్ణమూర్తి, పి.వి. సుబ్బారావు వంటి వారి రచనలకు గోపీచంద్ పీఠికలు రాశారు.
గోపీచంద్ స్థానంలో గుత్తి కొండ నరహరి రాష్ట్ర రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శి అయ్యారు. తెనాలిలో ఆనాడు ఆవుల గోపాలకృష్ణమూర్తి రాడికల్ హ్యూమనిస్ట్ గా, ఎం.ఎన్. రాయ్ అనుచరుడుగా చాలా ప్రాముఖ్యత వహించాడు. ఆయన వ్యాసోపన్యాసకుడు. అడ్వకేట్ అనువాదాలు కొన్ని చేసి రాయ్ భావ ప్రచారం గావించాడు. ఎం.ఎన్. రాయ్ ను త్రిపురనేని రామస్వామికి, చలానికి పరిచయం చేసిన కీలక వ్యక్తి, ఆయన చుట్టూ ఎందరో యువకులు, కవులు, గాయకులు, కళాకారులు, విద్యార్థులు వుండేవారు. ఆ కర్షణీయమైన ఉప న్యాసాలు, పదునైన ఘాటైన విమర్శలు ఎజికె బలం.

గోపీచంద్ కు యిదంతా యిష్టం వుండేది కాదు. తన పీఠాధిపత్యానికి ఎదురుండరాదని ఆయన అభిమతం. కాని ఎజికె ఆకర్షణముందు గోపీచంద్ పనికిరాలేదు. చివరకు గోపీచంద్ తమ్ముడు గోకుల్ చంద్ కూడా ఎజికె అంటే విపరీత అభిమానం చూపేవాడు. ఎందరో రచయితలు తమ పుస్తకాలకు ఎజికె చేత పీఠికలు రాయించుకున్నారు. ఎజికె అంటే గోపీచంద్ కొంత బెరుకుగా వుండేవాడు. ఎదుటబడి ధైర్యంగా మాట్లాడే వాడు కాదు.
అఖిలభారత రాడికల్ హ్యూమనిస్ట కాంప్ లలో సైతం ఎం.ఎన్. రాయ్ ను ఎదుర్కొగలిగిన ఎజికె తన పీఠాధిపత్యానికి ముప్పు అని గోపీచంద్ భావించాడు.
సినిమారంగంలో

గోపీచంద్ మద్రాసులో గూడవల్లి రాంబ్రహ్మం గారి పరిచయంలో సినిమా రంగ ప్రవేశం చేశారు. రైతుబిడ్డ సినిమాకు సంభాషణలు రాశారు. ఇది 1937 నాటి విషయం. ఆ తరువాత రాజకీయాల్లో వున్నారు. గనుక, సినిమాకు సెలవు బెట్టారు. తెనాలిలో ప్లీడర్ గానూ, రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగానూ వుంటూ, 1946 నాటికి వాటికీ స్వస్తి పలికారు. మళ్ళీ సినిరంగంలో ప్రవేశించడానికి మద్రాసు వెళ్ళారు. అదొక పెద్ద మలుపు.
గోపీచంద్ సినీరంగంలో అన్ని పాత్రలు నిర్వహించారు. అంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, సంభాషణలు యిలా వివిధ కోణాలు చూశారు. సినీరంగం భిన్నలోకానికి చెందినది. అక్కడ తళుకు బెళుకులూ, ఆకర్షణలు, రామణీయకతలు, కష్ట నష్టాలు, రసవత్తర రమ్యతలు అన్నీ గోపీచంద్ ను చుట్టుముట్టాయి. డబ్బు రాలేదు. శృంగార సుడిగుండాలు సరేసరి. ‘లక్ష్మమ్మ’ సినిమాతో గోపీచంద్ సాధారణ జీవితం గడపడం కష్టమైంది. మద్రాసులో సినీ కళాపోషణ రామణీయకతల నుండి గోపీచంద్ ను బయటపడేయడానికే ఆయన్ను పాండిచేరి అరవిందాశ్రమం తీసుకెళ్ళానని ఆచంట జానకీ రాం నాకు చెప్పారు. సంజీవ్ దేవే ఇంట్లో తుమ్మపూడిలో కలసినప్పుడు యిది జరిగింది. అంతటితో కొన్నాళ్ళు అరవిందుడి ఆధ్యాత్మిక అయోమయంలో పడిపోయాడు. దానిని సమర్థించడానికి పూనుకున్నాడు. కాని బ్రతుకు దెరువు ఆధ్యాత్మికతలో కష్టం, సంసారం యీదాలిగదా. కనుక కర్నూలులో రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ డైరెక్టర్ గా చేరారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వంలో ఆకాశవాణి ఉద్యోగిగా హైదరాబాద్ లో వున్నారు.
వయస్సు వచ్చేకొద్దీ కొందరు మెదడుకు పదను పెడతారు. ఎదుగుతారు. బెర్ట్రాండ్ రస్సెల్ అందుకు ఆదర్శం. మనమధ్యలో నార్ల వెంకటేశ్వరరావు ఉదాహరణ. గోపీచంద్ అందుకు భిన్నంగా మానవ హేతువాదం నుండి ఆధ్యాత్మిక అంధ విశ్వాసంలోకి దిగజారి పోయాడు. అది సమర్థించుకోడానికి రాతలు చేబట్టాడు. పాత జ్ఞాపకాలు, అనుభవాలు యితివృత్యాలుగా తీసుకొని, తన రచనా పాటవంతో, సమర్థించుకున్నాడు. అలా వెలువడిన వాటిలోనే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, మెరుపులు మరకలు పేర్కొనవచ్చు.
తెనాలిలో తన సహచరులుగా రాడికల్ డెమొక్రటిక్ పార్టీలో వున్న వారిని, తన తండ్రిని, తనను పాత్రలుగా చిత్రించి రాసిన పుస్తకమే పండిత పరమేశ్వర శాస్త్రి. అదంతా అరవింద పూర్ణయోగం చేబట్టిన కారణంగా, దానిని వెనకేసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రాసిందే. దానికి తోడు తన పీఠాధిపత్యం ఆరు పువ్వులు మూడు కాయలుగా తెనాలిలో వెలగకపోడానికి అడ్డొచ్చిన వారిని దుష్ట పాత్రలుగా పెట్టారు. జి.వి. కృష్ణారావు, ఆలూరి బైరాగి, కోగఁటి రాధాకృష్ణమూర్తి, ఆవుల గోపాలకృష్ణమూర్తి ప్రభృతులు పాత్రలు కాగా, తనను ఉత్తమ వున్నత ఆదర్శపాత్రగా మర్దించుకున్నాడు.
ఆద్యాత్మిక వాదిగా గోపీచంద్ లో రాగ ద్వేషాలు రోజు రోజుకూ పెరిగిపోగా తన సహచర్యులపై మరొక నవల మెరుపులు మరకలు రాశాడు. రేడియో కేంద్రంలో పాత్రలు ఎందుకు మౌనం వహిస్తాయి? ఆ నవలకు దీటుగా మళ్ళీ నవలలు వెలువరించి, బాగా తిప్పికొట్టారు.
అలా దిగజారుతూ పోయిన గోపీచంద్ చివరి దశలో సాయిబాబా భక్తుడుగావడం పరాకాష్ఠ. ఆలోచన చచ్చిపోయిన దశ అది.
తత్వవేత్తలు
గోపీచంద్ ప్రతి భావంతుడైన తెలుగు రచయిత. బాగా చదివాడు. బాగా చదివించగలడు. అటువంటి గొప్ప తనం అతని తత్వవేత్తలు రచనలో చూడవచ్చు.  గోపీచంద్ తాత్మిక విద్యార్థికాదు. బి.ఏ చదివి, లా ప్రాక్టీసు చేసిన వ్యక్తి. సొంతగా తత్వశాస్త్రాలు చదివాడు. అంత వరకూ బాగానే వుంది. చివరి దశలో అరవింద్ ఆధ్యాత్మిక పులుముడు సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడాడు. దానిని సమర్థించడానికి తత్వవేత్తలు లో ప్రయత్నించడం దారుణం.
ఇక అరవిందో ఒక కల్ట్ శాఖాధిపతి. నమ్మకాలు ప్రచారం చేసిన వ్యక్తి. ఆయన చెప్పే అడ్డదిడ్డమైన పూర్ణయోగం, క్రమం అన్నీ మూఢనమ్మకాలే. వీటిని తెగబలిసిన భాషలో యిమిడ్చాడు. కాని తత్వం ఏదీ లేదు. అందుకే తాత్వికులలో ఆయన యిమడడు. అయితే గోపీచంద్ అరవిందో భక్తుడుగా ఆయన్ని సమర్థిస్తూ పుస్తకాన్ని ముగించాడు.
గోపీచంద్ సన్నిహితులు ఆయనవలె, రాడికల్ డెమొక్రటిక్ పార్టీలో ఆ తరువాత మానవ వాద ఉద్యమంలో కృషి చేసిన వారు రావిపూడి వెంకటాద్రి. అలాగే ఎన్.వి. బ్రహ్మం వారిరువురూ వివిధ సందర్భాలలో గోపీచంద్ ను మద్రాసులో హైదరాబాద్ లో కలిశారు.
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాలో పాత్రల్ని గురించి, తెనాలిలో కొందరిని దృష్టిలో పెట్టుకొని రాసిన తీరు గురించి ప్రశ్నించారు. గోపీచంద్ దాటేశారు. ఎన్.వి. బ్రహ్మం పట్టు విడవక, ఆవుల గోపాలకృష్ణమూర్తి గురించి నవలలో రాసింది  విఫలమైందని కూడా ఎత్తి పొడిచారు. గోపీచంద్ తప్పించుకోడానికే ప్రయత్నించారు. అంతకు మించి ఆయన బయట పడలేక పోడానికి కారణం ఆయన గిల్టీ మనస్తత్వమే. బాపు చేత వేయించిన ముఖ చిత్రంలో ఎ.జి.కె, జి.వి.కె, రామస్వామి, గోపీచంద్ పోలికలు వున్నాయి.

ఆద్యాత్మిక వాదానికి, హేతువాదానికి సమన్వయం చేయటానికి గోపీచంద్ రచనలు ఉద్దేశించాయని కొందరు సందర్ధించబోవటం అపహాస్యమైన విషయం. ఆధ్యాత్మిక వాదంలో ఆలోచన తాకట్టు పడుతుంది. అందులో మనిషి పెరగడు. హేతువాతం అనంతం. నిరంతర శాస్త్రీయ దృక్పదంతో సాగిపోతూ కొత్త విషయాలను స్వీకరిస్తూ తమ పాత విషయాలను సరిదిద్దుకుంటూ పోతుంటుంది. ఇది అభ్యుదయ విధానం. ఇలాంటిది ఆధ్యాత్మికతలో ఉండదు.

ఇలా సాగిపోయిన గోపీచంద్ 1950 వరకు ఆ ధోరణిని కొనసాగించగలిగాడు. అయితే 1946 నుండి కొంత ఆలోచన, ఆచరణ మార్పుకు గురైంది. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ కార్యదర్శిగా మానేసి, అసమర్థుని జీవయాత్ర రచన (ఇది ఆలూరి భైరాగి కవిని ఉద్దేశించినది అనే అభిప్రాయం లేకపోలేదు) అనంతరం రాజకీయాలకు స్వస్తి పలికి, కొంత ధనాపేక్షతో సినిమాలకు కథలు, దర్శకత్వం, ప్రొడక్షన్ చేయాలని మద్రాసు వెళ్ళారు. అయితే ఆయన అనుకున్నట్లుగా ఆ రంగంలో రాణించలేకపోయారు. చాలా ఆటుపోట్లకు గురయ్యారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పుడు కుటుంబ వత్తిడుల కారణంగా, కొందరు మిత్రుల ప్రోత్సాహంతో పాండిచెర్రిలోనీ అరవింద ఆశ్రమానికి వెళ్ళారు. అప్పటి నుండి సొంత ఆలోచన లేదు. తాకట్టు మనస్తత్వంతో ప్రశ్నించకుండా గుడ్డిగా అనుసరించే విధానంలో పడిపోయారు. అదే అరవిందుడి పూర్ణయోగ విధానం. తరువాత ప్రచారకుడిగా మారిపోయాడు. అవే ఆయన రచనలలోనూ తొంగి చూశాయి. కొన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా మరి కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రచనలు కొనసాగించారు. వాటిలో మొదటి పలుకు, వివేచనా, లోతైన పరిశీలన విడనాడాడు. రాగద్వేషాలు బాగా ప్రవేశపెట్టి తనకు కోపతాపాలున్న వ్యక్తులను పాత్రలుగా పెట్టి రచనలు చేశారు. అలా చేసిన వాటిలో మెరుపులు మరకలు అనే నవల ఒకటి కాగా, పండిత పరమేశ్వరరశాస్త్ర వీలునామా అరవిందో ఆలోచన ప్రచారానికి పరాకాష్టను అందుకున్నది. అందులో పాత్రలన్నీ ఇంచుమించు తెనాలిలో ఆయన సన్నిహితులకు, తన తండ్రికి, తనకు సంబంధించినవే.
తత్వవేత్తలు రెండు భాగాలుగా మార్క్స్ తో మొదలెట్టి అనిబిసెంట్ తో ముగించాడు. అరవిందో తో ముక్తాయింపు పలికాడు. ఇంగ్లీషులో విల్ డ్యురాంట్ రాసిన దిస్టోరీ ఆఫ్ ఫిలాసఫి ప్రధాన ఆధారం చేసుకున్నాడని, దీనితొలి ప్రచురణ కర్త, బొందలపాటి శివరామకృష్ణ సదుద్దేశ్యంతోనే నాతో చెప్పారు. ఎవరైనా సరే ఆధార గ్రంధాల స్వీకరించక తప్పదు. గొప్ప తత్వవేత్తలు-బెర్ట్రాండ్ రస్సెల్, దాస్ గుప్త, ఎం.ఎన్. రాయ్ వంటి వారు తమ రచనలకు ఆధారాలు చూపి, తరువాత తమసొంత అభిప్రాయాలు చెప్పారు. గోపీచంద్ తత్వవేత్తలలో అలాంటి చిత్త శుద్ధిలోపించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాసినట్లున్నది.

చాలామంది తత్వవేత్తల గురించి అతి సులభశైలిలో చెప్పారు. అది హర్షించదగింది. అయితే గోపీచంద్ కు ఏది తత్వశాస్త్రం,  ఏది కాదు అనే విచక్షణ లేదు. అందుకు తగిన అకడమిక్ జ్ఞానం, క్రమశిక్షణ లేదుగనుక యీ దోషం వచ్చింది.

రష్యాలో బయలుదేరిన ఒక మూఢనమ్మకాల మాత బ్లా వెస్కీ చెప్పిన అంశాలే దివ్య జ్ఞాన సమాజం అయింది. ఆమె భక్తురాలుగా అనిబిసెంట్ చివరలో ఇండియా వచ్చి ఆ ప్రచారం చేసింది. కథలు అల్లింది. అలాంటి ఆమెను తత్వవేత్తలలో చేర్చడం తత్వశాస్త్రానికి అవమానం.
ఆర్య సమాజం హిందూ మతానికి సంస్కరణ వాదంగా బయలుదేరి కొంత వరకు వ్యాపించి, ఆగిపోయింది. దీనికి వేదాలు ప్రమాణ గ్రంథం. అది తప్ప మిగిలినవి పక్కన బెట్టాలన్నారు. దానిలో భాగంగా అనేక సంస్కరణలు అమలు పరచడంలో దయానంద సరస్వతి కృషి చేశారు. వివాహ పద్ధతి కూడా ఒకటి వున్నది. అయితే వీరికి తత్త్వ శాస్త్రం ఏదీ లేదు. కాని గోపీచంద్ వీరిని చేర్చడం అసంబద్ధం.
ఇక చివర చివరకు పేరా సైకాలజీ పేరిట అతీంద్రియ శక్తుల విషయాలు ప్రచారంలోకి తెచ్చిన డా. జె.బి. రైన్ ప్రభావంలోకి కూరుకుపోయాడు. చైతన్యం కాని మరి కొన్ని స్థాయిలున్నాయని, మహర్షులు ఆ స్థాయికి చేరుకున్నారని వారి అనుభవాలే వేదాలని రాశాడు. అంతేకాక వేదాలను ప్రశ్నించటానికి వీలు లేదంటే తప్పులేదని కూడా గోపీచంద్ అన్నాడంటే, అతని ఆధ్యాత్మిక ధోరణి ఏ స్థాయికి తీసుకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. మనం కింది స్థాయిలో ఉన్నామని, మహర్షులు పై స్థాయిలో ఉన్నారని కనుక వారిని ప్రశ్నించరాదని గోపీచంద్ నమ్మాడు.
ఉత్తరోత్తరా జె.బి. రైన్ వంటి వారి పేరా సైకాలజీ అశాస్త్రీయమని, స్పష్టంగా రుజువైంది. ఆయన అమెరికా యూనివర్సిటీలో దుకాణం మూసివేసి తాను చేసిన పనికి క్షమాపణ కూడా చెప్పుకున్నాడు. అప్పటికి గోపీచంద్ లేడు. మొత్తం మీద శాస్త్రీయ ఆలోచనకు దూరమైంతర్వాత గోపీచంద్ సొంత ఆలోచన అంటూ చేయలేదని స్పష్టమైంది. “దారి తప్పిన మానవుడు” అనే వి.ఎస్. రమాదేవి నవలలో గోపీచంద్ పాత్ర కనిపిస్తున్నదని పరిశీలకులు అంటారు. ఇది పరిశోధన చేయవలసిన అంశం
.
(గోపీచంద్ శత జయంతి (1910-2010) సందర్భంగా ఆయన రచనలు సాధ్యమైనన్ని కూర్చి, 10 సంపుటలుగా, కమిటీ వెలువరించింది. ఇవి విజయవాడలోని అలకనంద ప్రచురణల వారందించారు. చలసాని ప్రసాద్, కృష్ణాబాయి కూర్పు చేసి, చిన్న పరిచయ పీఠిక రాశారు. అయితే 1937 నుండి 1945 వరకు ఎం.ఎన్. రాయ్, మానవ వాద ప్రభావంలో గోపీచంద్ రాజకీయ రచనలు, విమర్శలు అనువాదాలు యీ సంపుటాలలో లేవు. మార్క్సిజం అంటే ఏమిటి? సోషలిస్ట్ ఉద్యమ చరిత్ర అనేవి లభించలేదని అన్నారు. ఈ వ్యాసంలో ఉదహరించిన విషయాలు, చూపిన పేజీలు ఈ సంపుటాలలోనివే).
-         ఎన్. ఇన్నయ్య

క్రిస్టోఫర్ హిచిన్స్ మరణం


క్రిస్టోఫర్ హిచిన్స్                            Presenting Telugu translation of God is not great to him in Washington DC

గొప్ప రచయిత, మానవవాది,జర్నలిస్ట్,రచయిత,హిచిన్స్ క్రిస్టోఫర్ 2011 డిసెంబర్ 15 న చనిపోవడం సెక్యులర్ లోకానికి చాలా లోటు. ఆయన రచన గాడ్ ఈజ్ నాట్ గ్రేట్ ను నేను తెలుగులోకి అనువదించి, ఆయన అనుమతితో ప్రచురించి ,2010లో వాషింగ్ టన్ శాస్త్రీయ పరిశీలన వారి సభలో ఆయనకు బహూకరించాను. తొలుత 2008లో ప్రపంచ నాస్తిక సభలో కలసి చాలాసేపు ముచ్చటించాను .మార్గరెట్ డౌనీ  ఏర్పరిచిన ఆ సభసందర్భంగా నాతో తన భారత పర్యటన అనుభవాలు చెప్పి మరోసారి రావాలని వుందన్నారు. చాల శక్తివంతమైన రచయిత.



స్వాతంత్ర పోరాట రైతు యోధుడు


కన్నెగంటి జగ్గయ్య (1900-1970)
చొక్కా ధరించకుండా తెనాలి లో కర్ర పట్టుకొని తిరుగుతూ కనిపించె కన్నెగంటి జగ్గయ్య రైతులకొరకు జీవితమంతా పోరాడాడు. పిచ్చయ్య ,హనుమాయమ్మ  సంతానంగా ఇతానగర్ లో 1900 లో పుట్టాడు .1920లో సీతారామమ్మను వివాహమాడాడు.
1926లో తెనాలిలో త్రిపురనేని రామస్వామితో పరిచయం కాగా, ఆయన అభిమానిగా జీవితమంతా వున్నాడు.
1930లో ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ కాగా రాయవెల్లూరులొ జైల్ జీవిథం గడిపి ,అహారం సరిగాలేనందుకు అధికారులపై పోరాడాడు.
1932లో కరాచిలో జరిగిన కాంగ్రెస్స్ సభలకు వెళ్ళాడు.
1943లో రామస్వామి చనిపోగా, ఆయన సూతాశ్  రమం కాపాదుతూ వున్నాడు.
ఆవుల గోపాల క్రిష్న మూర్తి అభిమానిగా మానవ వాద వుద్యమానికి సహకరించాడు.
శిస్తుల విషయంలో రైతులకు అన్యాయం జరిగినప్పుదు అధికారులపై తిరుగుబాటు చేశాడు. ఢైర్యశాలిగా బ్రతికాడు
I had the opportunity to meet him several times and had friendly exchange of views..
Innaiah Narisetti

 కొద్దిపాటి రచనలు కూడా చేశాడు.


స్వాతంత్ర పోరాట రైతు యోధుడు


కన్నెగంటి జగ్గయ్య (1900-1970)

చొక్కా ధరించకుండా తెనాలి లో కర్ర పట్టుకొని తిరుగుతూ కనిపించె కన్నెగంటి జగ్గయ్య రైతులకొరకు జీవితమంతా పోరాడాడు. పిచ్చయ్య ,హనుమాయమ్మ  సంతానంగా ఇతానగర్ లో 1900 లో పుట్టాడు .1920లో సీతారామమ్మను వివాహమాడాడు.
1926లో తెనాలిలో త్రిపురనేని రామస్వామితో పరిచయం కాగా, ఆయన అభిమానిగా జీవితమంతా వున్నాడు.
1930లో ఉప్పు సత్యాగ్రహంలో అరెస్ట్ కాగా రాయవెల్లూరులొ జైల్ జీవిథం గడిపి ,అహారం సరిగాలేనందుకు అధికారులపై పోరాడాడు.
1932లో కరాచిలో జరిగిన కాంగ్రెస్స్ సభలకు వెల్లాడు.
1943లో రామస్వామి చనిపోగా, ఆయన సూతాస్రమం కాపాదుతూ వున్నాడు.
ఆవుల గోపాల క్రిష్న మూర్తి అభిమానిగా మానవ వాద వుద్యమానికి సహకరించాడు.
శిస్తుల విషయంలో రైతులకు అన్యాయం జరిగినప్పుదు అధికారులపై తిరుగుబాటు చేశాడు. ఢైర్యశాలిగా బ్రతికాడు.
Innaiah Narisetti

కొద్దిపాటి రచనలు కూడా చేశాడు.

మానవ వాది కోగంటి సుబ్రమణ్యం 1912-78


 .మానవ వాది కోగంటి సుబ్రమణ్యం  1912-78


కూచిపూడి గ్రామములో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన కోగంటి సుబ్రహ్మణ్యం 1940 ప్రంతాలలో ఎం.ఎన్.రాయ్ భావాల ప్రభావం లో పని చేశారు. పాఠ శాల విద్యకు పరిమితమైనా సొంతగా చదివి భావపరిణితి చెందారు. కూచిపూడి గ్రామము ఆనాడు జి.వి.క్రి ష్నారావు , కోగంటి రాధాక్రి ష్న మూర్తి వంటి వారితో పేరు గాంచింది. వెసవి పాఠశాలలు నిర్వహించారు. అందులో సుబ్రమణ్యం ప్రధాన పాత్ర వహించారు.
1950 తరువాత , ఎం.ఎన్.రాయ్ (1887-1954) తరువాత రాడికల్ హూమనిస్ట్ వుద్యమం బాగా తెనాలిలో పనిచేసింది .అందులో సుబ్రహ్మణ్యం ఎంతో క్రిషి జరిపారు.
రాడికల్ హూమనిస్త్ తెలుగు పక్ష పత్రికకు ఎడిటర్ గా వుంటూ ,అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎం.ఎన్.వ్యాసాలు కొన్ని అనువదించారు.
1964-70 లో కూచ్జిపూడి గ్రామానికి సర్పంచ్ గా చాలా పనిచేశారు.
తరువాత ఖమ్మం వలస వెళ్ళి కొన్నాళ్ళు వున్నారు. 1970లో చనిపోయారు. ఆయన హూమనిస్ట్ హీరొ.

Innaiah Narisetti

బైబిల్, ఖురాన్, గీత శాస్త్రీయమా?




మాది శాస్త్రీయం (సైంటిఫిక్) అని యిటీవల ప్రతి మతం అంటున్నది. పవిత్ర గ్రంథాలు మతాలకు మూలంగదా! అవీ సైంటిఫిక్ అంటున్నారు. బాబాలు, మాతలు చేసే అద్భుతాలు, యోగ ఒకటేమిటి! అన్నీ సైంటిఫిక్ పరిధిలోకి తీసుకువస్తున్నారు.
ఎందుకని?
సైంటిఫిక్ అంటే గౌరవం. తిరుగులేని వాదనగా జనం అంగీకరిస్తారని ఒప్పుకుంటున్నారు. ఇంకా రాను, రాను, జ్యోతిష్యం, వాస్తు, ముహూర్తాలు, చిట్కా వైద్యాలు సైంటిఫిక్ అంటున్నారు. ఆచారాలు, క్రతువులు, వ్రతాలు, నోములు, ఏదైనాసరే సైంటిఫిక్ అంటే చాలు – పాతతరం, కొత్త తరం అందరూ ఆమోదిస్తారనుకుంటున్నారు.
ఇది గొప్ప పరిణామం. ప్రతిదీ శాస్త్రీయం. (సైంటిఫిక్) పరిధిలోకి రాగలిగితే, అంతకంటే ఆహ్వానించదగింది మరొకటి లేదు.
వైద్యం, సాంకేతికం టెక్నాలజి, కంప్యూటర్ పరిజ్ఞానం, యివన్నీ శాస్త్రీయ పరిధిలోనివే. అలాగే భిన్న రంగాలలో విభిన్న శాస్త్రాలు, అభ్యసించి, వుద్యోగాలు సంపాదించి, వృత్తి నిపుణులుగా రాణించడానికి శాస్త్రీయ పద్ధతే కారణం.
అదే క్రమం మతాలకు, విశ్వాసాలకు, నమ్మకాలకు విస్తరించి, శాస్త్రీయ పద్ధతిని అంగీకరించడం పెద్ద మార్పు.
అయితే ఒక విషయం మరచిపోరాదు.
శాస్త్రీయ పద్ధతికి కీలకమైన అంశం – రుజువులు, ఆధారాలు అవి ఎప్పటికప్పుడు అన్వయిస్తూ పోతారు. వాటికి నిలిస్తేనే  శాస్త్ర ప్రమాణంలోకి తీసుకుంటారు. ఇది సైన్స్ లో అన్ని విభాగాలకు చెందుతుంది. ఫిజిక్స్, ఖగోళం, భూగర్భం, వైద్యం, ఇంజనీరింగ్, విద్యుత్ యిలా ఏదైనా సరే శాస్త్రీయ పద్ధతి ప్రకారం సాగిపోతుంటాయి.
శాస్త్రీయ పద్ధతిలో శాశ్వతంగా స్థిరంగా మార్పులేని, ఎదురులేని విషయం అంటూ వుండదు. మార్పు నిత్యం, సత్యం. మార్పులకు అనుగుణంగా సిద్ధాంతాన్ని, అన్వయాన్ని మార్చుకుంటూ సాగుతారు. ఒక సైంటిస్ట్ చెప్పినది ప్రమాణంగా తీసుకోరు. అతను ఎంత గొప్పవాడైనా సరే. ఐన్ స్టీన్ కావచ్చు. హరగోవింద ఖురాన్ కావచ్చు. న్యూటన్ కావచ్చు. వారు సైతం సైంటిఫిక్ పద్ధతికి అనుగుణంగా రుజువుకు నిలవాల్సిందే.  మార్పులు అంగీకరించాల్సిందే. అందుకే సైన్స్ లో, సాంకేతికంలో ఎప్పుడూ మార్పులు చూస్తాం. పాతవాటికి జతచేసి కొత్తవాటిని యిమిడ్చి సరిదిద్దుతారు. అదే శాస్త్రీయ పద్ధతిలో విశేషం. దీనినే శాస్త్రీయ పురోగమనం అంటారు. 18వ శతాబ్దం నుండి 19కి, ఆ తరువాత 20వ శతాబ్దానికి, ఏ రంగంలో చూచినా మార్పులు చేర్పులు కనిపిస్తాయి. అది శాస్త్రీయ పురోగమనం.
తప్పులు దిద్దుకోవడం, దోషాలు సవరిస్తూ సాగడం, శాస్త్రీయ పద్ధతి విశిష్ట లక్షణం. అదే పురోగమనానికి తోడ్పడుతుంది.
కనుక శాస్త్రీయ పద్ధతి, మతాలు, పవిత్ర గ్రంథాలు, బాబాలు, మాతలు, ఒప్పుకుంటే చాలా సంతోషం.
బైబిల్, ఖురాన్, వేదాలు, జిందావిస్తా, యిలాంటి మత పవిత్ర గ్రంథాలు తిరుగులేని, మార్పులేని, పరమసత్యాలు చెప్పాయంటారు. వాటికి శాస్త్ర్రీయ పద్ధతి అన్వయిస్తారా? అది జరిగితే సంతోషం. ప్రవక్తలు, దేవుళ్లు, బాబాలు, మాతలు చెప్పిందాన్ని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పాలేగాని, చంపకూడదు. హింసకు పూనుకోరాదు.
అంతేగాదు. మా మతం, మా దేవుడిని అంగీకరించని వారు మ్లేచ్ఛులని, పాషండులని, కాఫిర్లని, హేథన్స్ అని అనరు. వెలివేయడం వుండదు. శాస్త్రీయం అని చెప్పుకునేవారు యీ విషయాలు గ్రహిస్తే గొప్ప విశేషం. ఆహ్వానించాలి. అది మానవ సౌభాగ్యానికి ఉపకరిస్తుంది.
కొత్త కారుకు, పూజ చేయించాలని దానికి మతాచారం చెబితే, పురోహితుడికి గిట్టుబాటు కావచ్చు. అలాగే ముహూర్తాలకు, వ్రతాలకు, పరికిణీ పండగలకు మంత్రాలతో పురోహితులు క్రతువులు చేయిస్తే చేయించవచ్చు. పిండ ప్రదానం, సంవత్సరికాలు సరేసరి. వాటి వెనక శాస్త్రీయత, సైన్స్ వున్నదంటే, ప్రశ్న వస్తుంది. అది మూఢనమ్మకం, మా పూర్వీకులు అంటే అది వేరు. దానికి నేటి సైన్స్ జోడించబోతే, చిక్కు వస్తుంది. శాస్త్రీయ పద్ధతి అంటే ఏమిటో, అందుకే వివరించవలసి వచ్చింది.
అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియాలో అడుగు పెట్టినా ఇంగ్లండ్ ఉద్యోగం చేస్తున్నా, “మన కులం, మన గోత్రం, మన వంశం, మన అంటరానితనం, మన హెచ్చు తగ్గులు వెంట తేవడం మన మూర్ఖత్వం. అందులో శాస్త్రీయత లేదు. పుట్టెడాముదంలో మునిగినా అంటేదే అంటుతుందన్నట్లు, శాస్త్రీయ పరిజ్ఞానం మన దురాచారాన్ని మార్చలేకపోయిందనుకోవాలి.”
కాని మనం మారే అవకాశం వుంది. ముఖ్యంగా మన కుల, మత నమ్మకాలను పిల్లలకు అంటగట్టకపోతే, ముందు తరాలకు చాలా తోడ్పడినట్లు, అదేమంత సులభం కాదు. కాని ప్రయత్నం ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి గదా.

Innaiah Narisetti

డా.కనుపర్తి విజయ రచనలు-Review

చదవండి; చదివించండి :


రచయిత్రి : డా. కనుపర్తి విజయబక్ష్

రచనలు :

1. ఆమె చెప్పిన కథ – (69 కథలు)

2. ఆకాశంలో సగం మాది, అవకాశాల్లో చోటేది? (వ్యాసాలు)

3. సుకన్య (నవల)

4. సాహిత్య సౌరభం (వ్యాసాలు)



------



1. ఆమె చెప్పిన కథ



డా. కనుపర్తి విజయబక్ష్ రచనలన్నీ సామాజిక స్పృహతో చేసినవే. ముఖ్యంగా స్త్రీల సమస్యలు, వారెదుర్కొంటున్న అసమానతలు అవస్థలు ఆమె రచనల నిండా చోటు చేసుకున్నాయి. ఆమె చెప్పిన డా.ఆలూరి విజయలక్ష్మిగారి పీఠికతో ప్రారంభమైంది. ఇందులో స్త్రీల అజ్ఞానం, మూఢవిశ్వాసాలు, అమాయకత్వం, వారు సహిస్తున్న అవమానాలు, వేధింపులు, హింస, అత్యాచారాలు, వారనుభవిస్తున్న బానిస బ్రతుకు హృదయాన్ని తట్టి కుదిపే విధంగా స్త్రీల గురించిన 69 గాథలు రచయిత్రి మన ముందుంచారు.



ఇందులో :



అనుమాన పిశాచి భర్త పెట్టే హింసలు భరించలేక, బాల్య వివాహాలే నయమేమో అని ఒక క్షణం పాతకాలపు ఆలోచనలో పడిన అమల; డాక్టరుగా తనంతగా రాణించక, ఆత్మన్యూనతకు గురి అవుతున్న డాక్టరు భర్త అహాన్ని సంతృప్తి పరచాలని తన పేషెంట్లను అతని దగ్గరకే పంపించే డా.ధరణి; ఇద్దరి మధ్య ప్రేమ, అనురాగాలు మృగ్యమై డబ్బు సంబంధమే రాజ్యమేలుతున్నదని బాధపడి విపరీత నిర్ణయం తీసుకున్న జ్యోతి; భార్యలు భర్తల అవసరాలు, కోర్కె తీర్చే మిషనని, వారికంటూ సొంత అభిప్రాయాలు, జీవితం ఉండగూడదని శాసించే భర్తతో నరక జీవితం అనుభవించే స్త్రీలు, తమ ఆధిక్యతను చాటుకునే తాపత్రయంతో భార్యలను “పల్లెటూరి మొద్దు, ఏమీ తెలియదు” అంటూ అందరి ముందూ అవమానించే భర్తలు, భార్య భర్త సహజీవనంలో ప్రేమ, అనురాగం, నమ్మకం బలంగా వేళ్ళూనాలనే స్వతంత్రలక్ష్మి; ఆడపిల్లలలను అందమైన బొమ్మలుగా కాకుండా విజ్ఞానవంతులుగా, జీవితంలోని ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కోగల ధీశాలురుగా తీర్చి దిద్దటం తల్లి-దండ్రులు, గురువులు, మీడియావారి బాధ్యత అని చెప్పే అజంత సజీవంగా మనముందు నిలిచేలా రాసారు విజయబక్ష్. సంస్కారవంతుడైన భర్త సాహచర్యంలో స్త్రీ చక్కని శిల్పంగా మారుతుంది. సంస్కార హీనుల హింసతో శిలగానే మిగిలిపోతుందనే అచల; 13 ఏట పెళ్ళయి, 70 ఏళ్ళ వయసులో కూడా భర్త పెత్తనం, అదుపు, జులుం నుండి బయటపడలేని తులశమ్మ; భార్యగా యింటి యిల్లాలుగా తనకేమీ హక్కులు లేనపుడు ఆ యింటి బరువు బాధ్యతల్ని నెత్తికెత్తుకుని జీవితాంతం మోయమంటే ఎలా సాధ్యం అని నిలదీసే శ్రీలక్ష్మి, విరివిగా పుస్తకాలు చదివి, తన జ్ఞానాన్ని భర్తతో పంచుకోవాలని, పలు చారిత్రక స్థలాలు కలిసి చూడాలని, ప్రకృతి అందాలను తిలకించాలనే మానస డబ్బు, వ్యాపారం తప్ప మిగతాదంతా పరమవేస్ట్ అనే భర్తతో నిరుత్సాహంగా, నిర్వికారంగా జీవితం గడపడం; ఆడవారికి ఆడవాళ్ళే శతృవులనే నానుడి ఉటంకిస్తూ, కోడళ్ళు కట్నాలు బాగా తేలేదని, వాళ్ళ పుట్టింటివాళ్ళు లాంఛనాలు బాగా జరపలేదని, కోడళ్ళు పిల్లల్ని కనలేదని చిన్న చూపు చూస్తే అత్తలూ, అత్తగారి కడుపు నిండా తిండి పెడితే ఖర్చయిపోతుందనుకునే కోడళ్ళు, వారి క్షేమం కోసమేనంటూ ఆడపిల్లల ప్రతి కదలికనూ అనుమానించే తల్లులూ; డబ్బుకోసం బిడ్డను తార్చే తండ్రులూ – అందరూ ఈ కథల్లో ప్రత్యక్షం అయ్యారు. అలాంటి తండ్రులకేమి శిక్ష వేయాలి అని అర్థోక్తిలో ఆగిపోయిన రచయిత్రి ఏ శిక్ష వేసినా తక్కువే అని చెప్పకనే చెప్పారు.



పై సమస్యలకన్నిటికీ పరిష్కార మార్గాలు సూచించారు రచయిత్రి :



స్త్రీలు చదువుకోవాలి. ప్రశ్నించటం అలవరచుకోవాలి, స్వయం శక్తితో ఎదిగి, నిలబడాలి. వారి ఎదుగుదల కుటుంబ సభ్యుల ముఖ్యంగా పురుషులు, సమాజం – పరిస్థితులు, చట్టాలు, వాటినమలుపరిచే ప్రభుత్వం – అందరూ సహకరించినప్పుడే సాధ్యమవుతుంది. స్త్రీ శక్తివంతురాలయితే కుటుంబం, సమాజం దేశం బాగుపడుతుంది. స్త్రీలు మూఢ విశ్వాసాల నుండి, శుష్క ఆచారాల నుండి బయటపడగలిగిననాడే పురాణాలు, మనుస్మృతులు ఘోషించి, శాసించి స్త్రీ స్వేచ్ఛను అరికట్టే కథలను కథలుగానే చదవాలని ఆచరించనవసరం అసలే లేదని నిరూపించగలరు.



2. ఆకాశంలో సగం మాది అవకాశాల్లో చోటేది ?



రచయిత్రి స్త్రీల సమస్యలను – సమాజపరంగా, కుటుంబ పరంగా, విద్యాపరంగా, రాజకీయపరంగా, ఆర్థికపరంగా – క్షుణ్ణంగా అధ్యయనం చేసి రాసిన వ్యాస సంపుటి యిది. డా. చిరంజీవినీ కుమారి తన ముందు మాటలో సవివరంగా పుస్తకాన్ని పరిచయం చేశారు.



అనాదిగా స్త్రీలను విద్యకు దూరం చేసి మూఢవిశ్వాసాలను నమ్ముకునేలా చేసి ఇంటి చాకిరీకే పరిమతం చేయడం జరిగింది. పురాణాలూ స్మృతులూ స్త్రీ స్వేచ్ఛకు అర్హురాలు కాదని ఘోషించాయి. వెనుకబాటుతనం అనే ముళ్ళ కిరీటాన్ని ఆమె నెత్తిన బెట్టి ఆమె ఎదగకుండా అన్ని అవరోధాలు కల్పించాయి. అలా చేస్తున్న సమాజానిది మొదట తప్పంటారు బక్ష్.



జనాభాలో సగంమంది స్త్రీలు. ప్రస్తుతకాలంలో స్త్రీలు చదువుకుంటున్నారు. కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా హుందాగా జీవించే హక్కు, ఆర్థికంగా సమానత్వం, రాజకీయంగా తగిన అవకాశాలూ ఇంకా పొందలేకపోతున్నారు. కారణం ఎన్నో తరాలుగా వాళ్ళు బానిసత్వపు కోరల్లో చిక్కుకుని ప్రశ్నించవచ్చు అనే విషయాన్నే మరచారు. హేతుబద్ధమైన ఆలోచన శాస్త్రీయ పరిజ్ఞానం లేకుంటే చదువుకున్నా అదంత ప్రయోజనకారి కాదు.



ఆడపిల్లలను పుట్టకుండా అడ్డుపడుతున్న ఈ సమాజం సిగ్గుతో ఎందుకు తలవంచుకోదోనని రచయిత్రి ఆక్రోశించారు. ‘ప్లీజ్ మమ్మల్ని పుట్టనివ్వండి’లో – ‘మహిళా సాధికారత సాధ్యమేనా?’లో స్త్రీని పరిపాలనా సీటులో అలంకార ప్రాయంగా కూర్చోబెట్టి పరిపాలనా యంత్రాంగం అంతా పురుషుని పెత్తనంతో నడుస్తుంటే ఆమె తన సామర్థ్యాన్ని చాటుకునేదెప్పుడు మరి అన్నారు రచయిత్రి - అడుగడుగునా పురుషుడు శక్తివంతుడు, స్త్రీ అబల అని నిరూపణే ధ్యేయంగా ఉంటున్నది ఈ సమాజంలో.



అదర్శ మహిళ అంటే యిలా వుండాలి అని పురుషులు నిర్ణయించినంత వరకూ స్త్రీ జనాభివృధ్ధి కుంటుపడుతూనే వుంటుంది. స్త్రీలకు ఎంతసేపూ సీతా, సావిత్రి, చంద్రమతి కథలు చెపుతూ అలా వుండాలని నూరిపోస్తారు.



పెండ్లి పేరుతో ఆమె మీద సర్వహక్కులూ భర్తకూ, అత్తింటివారికీ ధారాదత్తం చేస్తారు. అత్తింట నానా కష్టాలు పడుతుంటే సర్దుకుపోవాలి అని స్త్రీకి చెప్పటం రోజూ చూస్తున్నాం. భర్త కొట్టినా, హింసించినా, అతని పాదాల దగ్గర బానిసగా పడి ఉండాలని నేర్పుతాం. కాదని బయటపడితే జీవితం కుక్కలు చింపిన విస్తరవుతుంది అని ఆమెను భయపెడతాం. ఈ నరకం ఈ వివక్ష ఇంకా ఎంతకాలం అని రచయిత్రి ప్రశ్నిస్తున్నారు. ఈ పైశాచికాలకు అంతమెప్పుడు? పాతివ్రత్యం పేరిట పురుషునికి స్త్రీమీద అసాధారణ పెత్తనం ఇవ్వటమేమిటి? శీలం అనేది ఇద్దరికీ వర్తించాలి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమార్గాలు సూచించారు విజయ బక్ష్.



తల్లిదండ్రులు ఆడపిల్లలను, మొగ పిల్లలలనూ సమానమని పెంచాలి. ఆడపిల్లలను చదివించాలి. వారికి సొంత ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టాలు, అభిరుచులు ఉంటాయని తెలుసుకోవాలి. వారు అన్ని రంగాలలో రాణించగలరు. సమర్థత చూపగలరు. అవకాశాలివ్వకుండా అడ్డుపడరాదు. భార్య అంటే జీతం బత్తెం లేకుండా 24 గంటలూ బానిస చాకిరి చేసే వ్యక్తి కాదని, పిల్లల్ని కనే యంత్రం కాదని పురుషులు గుర్తించాలి. పెండ్లి భార్య, భర్తల మధ్య ప్రేమ, అప్యాయత, నమ్మకం అనే పునాదుల మీద నిర్మింపబడే ఒక సామాజిక క్రతువు. అనివార్యమైన విధి అని ఈ సమాజం గుర్తించి ఆచరించాలి. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే ప్రసక్తి రాకూడదు. స్త్రీకి ఎన్నో హక్కులున్నాయి. చట్టపరంగా, కాని అవి కాగితాలకే పరిమితం. అవన్నీ స్త్రీలకి తెలియజెప్పి అమలుపరిచే బాధ్యత ప్రభుత్వానిది.



ఈరోజుల్లో విద్య, వైద్య వ్యవసాయ సామాజిక రంగాలలో స్త్రీలు పురుషులతో దీటుగా పనిచేస్తున్నారు. ప్రగతి పథంలో ముందుకు పోతున్నారు. ఇది పురుషులకు మింగుడు పడాలి. స్త్రీల శక్తి మీద వారికి ఎప్పుడు నమ్మకం కలుగుతుంది అని నిలదీస్తున్నారు రచయిత్రి. స్త్రీకి పరిధులు గీసి, అవి దాటితే పురుషుడు సహించడు. ఆ పరిస్థితి మారాలి. అవధులు చెరిపి స్త్రీ పురుషులిద్దరూ సమానంగా నడిచినప్పుడే కుటుంబంలో సమాజంలో, దేశంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. స్త్రీ పురుషుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. మంచి అవగాహన, ఆచరణ పునాదుల మీదే వారి జీవితాలు నడవాలి. స్త్రీ రచయితలు, కళాకారుల మీద ఛాందసవాదుల దాడులు ప్రస్తావిస్తూ తస్లీమా మీద దాడి జరిగిన రోజును ‘సిగ్గే సిగ్గుపడిన రోజు’ అంటూ రచయిత్రి ఎంతో ఆవేదన వ్యక్తం చేశాడు. అసలు ఆ టైటిలే ఒక మణిపూస అని గర్వంగా చెప్పగలం.



అమెరికాలో పెళ్ళిళ్ళు విడాకుల ప్రస్తావన చేస్తూ భార్యా భర్తలు కలిసి ప్రశాంతంగా జీవించని పరిస్థితి దాపురిస్తే విడిపోవడం ఉత్తమమన్నాడు విజయబక్ష్.



స్త్రీ తెలివితేటలనూ, శ్రమశక్తినీ గౌరవించిననాడే సమానత్వం వెల్లివిరుస్తుంది. అసాధ్యాన్ని సాధ్యం చేయగల చేవ, సత్తువ, నిగ్రహం అన్నీ స్త్రీలలో నిబిడీకృతమై ఉన్నాయి. వెలికి వచ్చే అవకాశాలు పుష్కలంగా అందాలి, అంతే!



3. సుకన్య



చక్కని యితివృత్తంతో, దీప్తి గోరా ప్రశఁసతో ముచ్చటగా రూపు దిద్దుకుంది సుకన్య.



సుకన్య, చంద్రధర్ బాల్యం నుండి కలిసి చదువుకున్నారు. యూనివర్సిటీలో చదివే రోజుల్లో వారి స్నేహం ప్రేమగా పరిఢవిల్లింది. వివాహం చేసుకుని చక్కని ఇల్లాలుగా, మంచి తల్లిగా, జీవితం తరింప చేసుకోవాలన్న సుకన్య కలలన్నీ తండ్రి కులం పట్టుదలతో నీళ్లుగారిపోయాయి. చంద్రధర్ స్ఫురద్రూపి. విజ్ఞాన పండితుడు. సంస్కారి. అవేవీ సుకన్య తండ్రి కులం, ధనం, దర్పం అనే గొప్పల ముందు నిలవలేకపోగా, అతను చంద్రధర్ ని ‘కుమ్మరాడి కొడుకు’ అని హీనంగా అవమానపరుస్తాడు. అతన్ని వివాహమాడి కుటుంబం పేరు ప్రతిష్ఠలు మంటగలిపేకన్నా, ఆశ్రమంలో సేవ చేస్తూ సన్యాసిగా ఉండిపొమ్మని తండ్రి సుకన్య జీవితాన్ని మోడు చేశాడు. సుకన్య వృద్ధుల, అనాథల సేవకే అంకితం అయిపోయింది కాని తండ్రిని ఎదిరించి పోలేకపోయింది. అదే తండ్రి తన కొడుకు ‘తెల్ల దొరసాన్ని’ పెండ్లాడితే ఘనంగా స్వాగతించి, పార్టీ యిచ్చాడు. ఆడపిల్ల, మగపిల్లవాడి మధ్య చూపే వివక్ష మనం ఎరగనిదేముంది! అవివాహితుడుగా చంద్రధర్, అతని తల్లిదండ్రులు సుకన్య కార్యకలాపాలలో అండగా నిలిచారు.



‘సుకన్య’లో నీల సురేష్ వల్ల ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్య చేసుకుంటుంది.



ప్రేమ పెళ్ళిళ్ళను నిరసించే వనజకు ఆర్భాటంగా తల్లిదండ్రులు పెళ్ళి చేయగా భర్త దురాగతాలకు తట్టుకోలేని వనజకు పెళ్ళి పెటాకులయింది మూడు నెలలకే.



కులం ఎలా వేళ్ళూని జీవితాలని బాధా భరితం చేస్తుందో రచయిత్రి సవివరంగా చూపారు. స్వార్థపరులైన దొంగ బాబాల ఆశ్రమ కార్యకలాపాలను తీవ్రంగా విమర్శించారు. చదువుకున్న అమ్మాయిలు అవసరమైనప్పుడు తల్లిదండ్రులను వ్యతిరేకించితేనే మంచిదని సుకన్య జీవితం చూచిన వారికి అనిపించక మానదు. కులం, మతం అంటూ యింకా ఎంతకాలం ఈ సమాజం గిరిగీసుకుంటుందో తెలియదు. కులాంతర, మతాంతర వివాహాలు నిర్భయంగా జరగటానికి యింకెన్ని దశాబ్దాలు పడుతుందో మరి! కొందరైనా వాటిని ప్రోత్సహించి ముందుకు రావాలని రచయిత్రి కోరుతున్నారు.



4. సాహిత్య సౌరభం



సాహిత్య సౌరభం అదృష్టదీపక్ విమర్శనాత్మక పీఠికతో, చక్కని టైటిల్ తో, చక్కని భాషతో మనముందు నిలిచింది.



సాహిత్య విద్యార్థిగా అధ్యాపకురాలిగా తాను పొందిన అనుభూతిని పుస్తక రూపంలో మనతో పంచుకుంటున్నారు రచయిత్రి.



తిక్కన, కందుకూరి, గురజాడ, చలం, కృష్ణశాస్త్రి మొదలగు గొప్ప రచయితలు, పండితుల గురించి ఆధునిక కోణంలో హేతుబద్ధమైన వివరణతో హృద్యమంగా రచన చేశారు విజయబక్ష్.



ఆమె మనకందించిన సౌరభాలు :



తిక్కన ఆనాడే సామాజిక స్పృహతో రచనలు చేశాడు. అప్పుడు శివభక్తి ప్రబలంగా వ్యాపించి ఉన్నది. శివకవులు – మల్లికార్జున పండితారాధ్యులు, పాల్కురికి సోమన, నన్నెచోడుడు ఆ భక్తిని వ్యాపింపచేశారు. తిక్కన కవిగా ఎంత ప్రసిద్ధుడో మత సమన్వయ కర్తగా, సామాజిక స్పృహ గల వ్యక్తిగా అంతే ప్రసిద్ధుడు అన్నారు రచయిత్రి.



వీరేశలింగం విశ్వమానవ సమానత్వం గుర్తించిన మహానుభావుడు. ఉదారహృదయుడు. ఆయన స్త్రీ విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేశాడు. వితంతువుల దుస్తితి నెరిగి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించటానికి ఆయన ఎన్నో పాట్లు పడవలసి వచ్చింది. ఆయన రచనలలోని స్త్రీ పాత్రలన్నీ అభ్యుదయాన్ని కాంక్షించేవే. వివేకవంతులు, విద్యావంతులైన స్త్రీ మూర్తులను ఆయన రచనల ద్వారా మన ముందుంచాడు.



నవలా సాహిత్యం గురించి వివరిస్తూ రచయిత్రి ఇటీవలి కాలంలో ప్రబలిన క్షుద్రసాహిత్యం పాఠకుల మీద భయంకర ప్రభావాన్ని చూపుతున్నదన్నారు. చేతబడులు, బానామతులు అంటూ సమాజాన్ని తిరోగమింపచేస్తూన్నదన్నారు.



కృష్ణశాస్త్రి ఆంధ్ర దేశం గర్వించదగిన మహాకవి. మానవతా మూర్తి, భావకతా యుగపు రాజు. ఆయన రచనల్లో విశ్వమానవ ప్రేమ, స్వేచ్ఛానురక్తి వెల్లడయినాయి. కులం, మతం అనే అడ్డుగోడలు లేని సమభాగ్యం, సంస్కృతి కొత్త కాంతిని, వినూత్నశాంతిని భారతావనికి యివ్వాలని మనసారా కోరినవాడు. జాతి కుల మతాలను నిరశించాడు. ఆయన కవిత్వం ఎల్లలు లేని మానవ ప్రపంచాన్ని కల్లలెరుగని ప్రేమ వెల్లువని ప్రవహింపచేసింది.



కొప్పరపు సుబ్బారావు ‘శాస్త్రదాస్యం’లో సంఘ క్షేమానికీ, సర్వమానవ కళ్యాణానికి పనికిరాని శాస్త్రాన్ని త్యజించాలన్నారు.



సమాజాభివృద్ధిలో పత్రికల పాత్ర ఎనలేనిది. ప్రభుత్వం తమకోసం ఏమి చేస్తున్నదో ప్రజలు తెలుసుకొనేది పత్రికల వల్లనే. పత్రికలు సరైన త్రోవ చూపాలి. నిజాయితీగా, నిర్భీతిగా వార్తలందించాలి.



అన్ని రంగాలలో స్త్రీని కించపరచే ధోరణులున్నట్లే, భాష వాడకంలోనూ అదే ధోరణి విరాజిల్లుతున్నది. స్త్రీని హీనంగా చూపే పదాలను వాడటం – ముఖ్యంగా ఆడవారినైనా మగవారినైనా తిట్టాలంటే అన్ని తిట్లూ ‘లం’, ‘ముం’తోనూ ప్రారంభించటం నిత్యం చూస్తున్నదే. మగవాడి మీద కక్ష తీర్చుకోవాలంటే ‘మగ’ తిట్లతోనే తీర్చుకోవాలిగాని అందులో స్త్రీ ప్రసక్తి ఎందుకంటున్నారు రచయిత్రి. ‘అమ్మ’ అనే, పవిత్ర పదాన్ని అతి నీచంగా వాడుతున్నదీ సమాజం. చదువుకున్నవారు, సంస్కారవంతుల మనుకునేవారు గూడా స్త్రీని ‘ఏమేవ్’, ‘ఒసేవ్’, ‘అది’, ‘ఇది’ అని అనునిత్యం కించపరుస్తూనే ఉన్నారు. సంస్కారహీనమైన పదాలను స్త్రీ పట్ల వాడకుండా, తమ భాషా పరిజ్ఞానాన్నీ, సంస్కారాన్ని చాటుకోమని జనాన్ని రచయిత్రి కోరుతున్నారు.



చలం రచనల్లో హేతుదృష్టిని వివరించారు. రచయిత్రి, చలం స్త్రీ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను నూతన దృష్టితో చూచి తన రచనల్లో విశ్లేషించటంలో కొత్త పంథాను అనుసరించాడు. స్త్రీలను రెవల్యూషనరీ పాత్రలుగా మలచటం, స్వేచ్ఛాయుత ప్రణయ జీవనం కోసం దేన్ననయినా త్యజించగలరనటం వంటి విపరీత ధోరణులను అనుసరించటం వల్ల ఆయన అపఖ్యాతి పాలయినాడు. ఆయన ‘అపఖ్యాతిపాలైన ప్రఖ్యాత రచయిత’ అన్నారు విజయ బక్ష్. చలం గురించి రాచమల్లు రామచంద్రారెడ్డి మాటలను యిక్కడ ప్రస్తావించారు; చలం లేకపోతే మన సాహిత్యంలో వాస్తవికవాదం యింత బలంగా ఉండేదికాదు.



ప్రాచీన ఛాందసవాద ధోరణిని వ్యతిరేకించి, మానవతా దృక్పథంలో, హేతు దృష్టితో ప్రశ్నించటం నేర్పి భారతీయుల్లో పునరుజ్జీవనానికి నాంది పలికిన ఆధునిక మానవుడు రాజా రామమోహన్ రాయ్.



సాహిత్యంలో మనకింకా స్వేచ్ఛ ఉందన్నారు రచయిత్రి. స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించిన రచనలే పదికాలాలపాటు నిలబడతాయి. ప్రజల సమస్యలతో మమేకమై చేసే రచనలే ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. నేటిదాకా సాహిత్యంలో స్వేచ్ఛా ధోరణులను వెలార్చిన రచయితలెందరో ఉన్నారు. సాహిత్యంలో స్వేచ్ఛను నియంత్రించటం మనదేశంలో యింకా జరగలేదు.



కన్యాశుల్కానికి చలించిపోయి గురజాడ ఒక అపూర్వమైన నాటకాన్ని సృష్టిస్తే, వరకట్న దురాచారానికి చలించిపోయి కాళ్ళకూరి నారాయణరావు ‘వరవిక్రయం’ అనే ఒక అద్భుతమైన నాటకాన్ని రచించాడు. ఆ రచనలు వచ్చి 80, 90 ఏళ్ళయినా వరకట్న పిశాచం సమాజంలో బలంగా వేళ్ళూని, తిష్ఠవేసి ఆడపిల్లల పట్ల శాపమై కూర్చుంది. ఈ దురాచారాన్ని రూపు మాపటానికి యువత నడుం కట్టాలి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపాలి.



పుస్తకాల విలువను ఇలా చూపారు రచయిత్రి. పిల్లలకు చిన్ననాటినుండే పుస్తకాలు (రంగు రంగుల బొమ్మలు, కథలు ఉన్నవి) చదవటం అలవాటు చేయాలి. బొమ్మలతో పాటు మంచి పుస్తకాలు వారికి బహుమతులుగా యివ్వాలి. మంచి పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. పుస్తకాలు విజ్ఞానం పంచి, తెలియని ప్రపంచాన్ని తెలియజెప్పే అద్భుత సాధనాలు. ఈ సందర్భంగా గోర్కీ మాటలను మనకి గుర్తు చేశారు. “పుస్తకాలు నా మనస్సుకు, హృదయానికి రెక్కలిచ్చాయి. నేను బురద నుండి బయట పడటానికి తోడ్పడ్డాయి. అవి చదవకపోతే నా చుట్టూ ఉన్న మౌఢ్యంలోనూ, నీచంలోనూ మునిగిపోయి ఉండేవాడిని. విశాల ప్రపంచ దృశ్యాలను పుస్తకాలు నా ముందు పరిచాయి”



కందుకూరి, రఘుపతి వెంకటరత్నం నాయుడు సమాజంలోని చీకటి కోణాలను వెలుగు రేఖలతో నింపారు. వీరేశలింగం ‘వివేకవర్థిని’ పత్రిక స్థాపించి ఉద్యమానికి సాధనగా వాడాడు. పత్రికా ప్రచురణను చేపట్టి ఆయన భావితరాలకు మంచి బాటను చూపాడు. ఈనాటి పత్రికలు ఆయన బాటలో నడిచి నైతిక విలువలను కాపాడుకోవాలి.



వీరేశలింగంతోపాటు ఆయన సతీమణి రాజ్యలక్ష్మి అన్ని కార్యక్రమాలలో ఆయనకు చేదోడుగా ఉండి ఆంధ్రదేశ సాంఘిక చరిత్రలో తన పేరును కూడా చిరస్థాయిగా నిలుపుకున్నారు.



మహీధర రామమోహనరావు రచన – ‘ఇక ఆ కథ ఇంతే’లో స్త్రీల చదువులు, ఉద్యోగాలు వారి వైవాహిక జీవితంలో సృష్టించే కల్లోలాలను అతి సహజంగా, కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. ఇందులో రాజ్యలక్ష్మి, ప్రభాకరం భార్యా భర్తలు. ప్రభాకరం తన దుందుడుకు ప్రవర్తనతో ఉద్యోగం పోగొట్టుకొని భార్య, కొడుకుతో సహా కష్టాలపాలయ్యాడు. రాజ్యలక్ష్మి గ్రామసేవికగా ఉద్యోగం చేపట్టి కుటుంబాన్ని నడుపుతుంది. మొదట్లో బాగా ఉన్నా రాను రాను భార్యను అనుమానించి మాటల తూటాలతో హింసిస్తూ పోతారు. చివరికి భరించలేక అతన్ని వదిలి వెళ్ళాలని అనుకున్నా వదిలి వెళ్ళరు. కారణాలనేకం. అలోచనలలో ముందడుగు ఆచరణలో వెనకడుగు వేసే రాజ్యలక్ష్ములు కోకొల్లలు మన సమాజంలో. ఈ వెనుకబాటువల్ల ప్రభాకరం లాంటి మగవారి దృష్టిలో స్త్రీలు పలుచనైపోయారు. కాని రచయిత్రి నిరాశచెందలేదు. ఆడవారి ఈ పరిస్థితికి చదువుకొని, ఉద్యోగాలు చేస్తూన్న స్త్రీలలో మార్పు వస్తుందని, కొంతకాలం పడుతుందనీ అంటారు ఆమె. ‘ఇక ఈ కథ ఇంతేలే’ అని నిస్పృహ చెందనవసరం లేదంటారు.



ఇలా స్త్రీల అభ్యున్నతి కోరి, సమాజ హితం దృష్ట్యా చక్కని రచనలు మనకందించిన డా.కనుపర్తి విజయ బక్ష్ కి ధన్యవాదాలు. మరెన్నో రచనలు ఆమె నుండి ఆశిద్దాం.



పూజలు, పునస్కారాలు, అనాదిగా వస్తున్న ఆచారాలతో ఎక్కువ కాలం గడుపుతున్న స్త్రీలు గూడా ఇలాంటి పుస్తకాలు చదవగలిగితే వారి విజ్ఞాన పరిధిని పెంచుకోవటం సాధ్యం. మగవారు చదివి వారి ఆలోచనా విధానాన్ని, ఆచరణను మార్చుకునే అవకాశం చాలా ఉన్నది. భార్యను భరించేవాడు భర్త అని ఈనాటికీ నమ్ముతున్న ఈ సమాజంలో స్త్రీ జనాభ్యుదయం ............ తేరుకుని ఆశించిన మార్పు భవిష్యత్తులో చూడగలమనే ధీమా మనకుండటం, సహజం. అలా జరుగుతుంది తప్పకుండా. భార్యాబాధితులుగా కొందరు భర్తలుండి ఉండవచ్చు. అలాంటి వారికి మా సానుభూతి ఎప్పుడూ వుంటుంది.



- వెనిగళ్ళ కోమల



అమెరికాలో నివాసం