మల్లాది రామమూర్తి
భారత రాడికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా చేసిన మల్లాది రామమూర్తి నాకు అర్థ శతాబ్దం పాటు సన్నిహిత కుటుంబ మిత్రులు. 1960 ప్రాంతాలలో గుంటూరు జిల్లా బాపట్లలో అడ్వ కేటుగా ఆయన ప్రాక్టీసు చేస్తున్నప్పుడు పరిచయమయ్యాడు. అప్పట్లో ఆయన భార్య మల్లాది సుబ్బమ్మ హైస్కూలు మాత్రమే చదువుకున్న గృహిణి. ఇంటికి వెళ్లినప్పుడల్లా ఆప్యాయంగా ఆదరించి అన్నం పెట్టిన దంపతులు, సహృదయులు. ఆ తరువాత సుబ్బమ్మను ఇంటర్, బి.ఎ. ప్రైవేటుగా చదివించి, రాయటం, చదవడం బాగా అలవాటు చేసి ఆమెను మానవవాదిగా తీర్చి దిద్దిన శ్రమ అంతా రామమూర్తిగారిదే.
కమ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన రామమూర్తి 1940 ప్రాంతాలకే ఎమ్. ఎన్. రాయ్ ప్రభావంతో మానవ వాదిగా మారి జీవితమంతా అలాగే కొనసాగారు. ఒక వైపు ప్రాక్టీసు చూసుకుంటూనే, మానవ వాద ఉద్యమానికి అంకితమయ్యారు. మేమిరువురం అనేక సమావేశాలలో శిక్షణా శిబిరాలలో కలసి పాల్గొన్నాము. ఆయన ఉత్తరోత్తరా పెట్టిన వికాసం అనే మాసపత్రికలో నేను చాలా వ్యాసాలు వ్రాశాను. మేమిరువురం అఖిల భారత మానవ వాద సభలకు కూడా కలసి వెళ్ళి పాల్లొన్నాము. అలాగే హేతువాద ఉద్యమంలో కూడా కలసి పనిచేశాం.
రామమూర్తి పౌరహక్కుల సంఘాలలో మానవ హక్కుల సమితిలో ఎంతో కృషి చేశారు. జయప్రకాష్ నారాయణ్ మొదలుకొని వి.యమ్. తార్కొండే వరకు రామమూర్తికి బాగా పరిచయం. ఎమ్.ఎన్.రాయ్.తో శిక్షణ పొందిన రామమూర్తి తార్కికంగా రాసేవారూ, ఆలోచించేవారు. ఆవుల గోపాలకృష్ణమూర్తితో అతి సన్నిహితంగా ఉండేవారు. అక్కడ కూడా మేము తరచు కలిసేవారం. రామమూర్తి అనేక సెక్యులర్ పెళ్ళిళ్ళు చేయించారు. నాటికలు రాయించి ప్రదర్శింపచేశారు. అనువాదాలు చేశారు. ప్రజాస్వామ్య ప్రచురణలు అనే సంస్థలో కొన్ని పుస్తకాలు వెలువరించారు. విదేశీ పర్యటనలు చేశారు .రాను రాను చివరి దశలో కేవలం సుబ్బమ్మకు తోడ్పడటం ఆమె నాయకత్వాన్ని పెంచడం పనిగా పెట్టుకున్నారు. సొంత ఖర్చు పెట్టుకొని జీవితమంతా మానవ విలువలకోసం ఉద్యమాలలో రాజీపడకుండా పనిచేశారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో, ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీలో జైలుపాలయ్యారు. 1999లో చనిపోయారు.
In Mussorie during Radical Democratic study camp 1975(tribal dress)
1 comment:
నమస్కారం ఇన్నయ్య గారూ! మానవత వాది మల్లాది రామమూర్తి గారిని గురించి టపా పెట్టినందుకు కృతజ్ఞతలు.మీ వ్యక్తిగత పరిచయం నుంచి కొన్ని ఆసక్తి కరమయిన విశేషాలను నలుగురితో పంచు కోవటానికి వీలయినవి తెలియ చేస్తే మా బోటి వారికి మరింత సంతోషంగా వుండేది.నాది బాపట్లే.వారిని గురించి మల్లాది సుబ్బమ్మ గారిని గురించి బాపట్లలో ఎప్పుడూ చెప్పుకుంటుంటారు. కృతజ్ఞతలు .
Post a Comment