మణి బెన్ కారా – హ్యూమనిస్ట్ హీరోయిన్

Maniben in Internatinal conference
Maniben with V B Karnik, M N Roy 1930s
మణి బెన్ కారా –




1974లో మణిబెన్ హైదరాబాద్ వచ్చే నాటికి బాగా వృద్ధాప్యం కనిపించింది. అప్పటికే ఆమె మానవ వాద, కార్మిక రంగాలలో ఆరి తేరిన కార్యకర్త, నాయకురాలు. దేశంలోనూ, ప్రపంచంలోనూ పర్యటన చేసి స్త్రీల హక్కుల కోసం నిరంతర కృషి చేసిన మణిబెన్ 1905లో బొంబాయిలో పుట్టారు. ఆమె మధ్యతరగతి కుటుంబీకురాలు కావటంతో గామడెన్ లోని సెయింట్ కొలబా హైస్కూల్లో చదివింది. ఆ తరువాత ఇంగ్లాండులో సాంఘిక కార్యక్రమాల శిక్షణ అధ్యయనం చేయటానికి బర్మింగ్ హామ్ వెళ్ళారు. తిరిగి వచ్చిన తరువాత కార్మిక రంగంలో దిగిపోయి. నిర్విరామ శ్రమ చేసి, రేవు కార్మికులు, గుడిసెలలో మగ్గుతున్న పేద ప్రజలు, హక్కులు లేకుండా బతుకుతున్న స్త్రీలను పట్టించుకోవటం ప్రారంభించారు. ఆ కృషిలో భాగంగా వివిధ కార్మిక సంఘాలలో బాధ్యతలు స్వీకరించి అఖిలభారత ట్రేడ్ యూనియన్ నాయకురాలిగా ఆవిర్భవించారు. ఆ విధంగా ఆమెకు వి.బి. కర్నిక్, ఎన్.ఎం. జోషి వంటి వారు ఎదురయ్యారు. వారి సహకారంతో కార్మిక రంగంలో ఎనలేని సేవలు చేశారు. గుర్తింపు పొందారు.

బొంబాయిలో ఒక ప్రింటింగ్ ప్రెస్ నెలకొల్పి కొంత కాలం నడిపారు. 1930లో ఆమెకు విదేశాల నుండి అప్పుడే తిరిగి వచ్చిన ఎం.ఎన్.రాయ్.తో పరిచయమయింది. అది సన్నిహితమై చివరకు రాయ్ నెలకొల్పిన రాడికల్ డెమెక్రటిక్ పార్టీలో ప్రధాన పాత్ర వహించేటట్లు చేసింది. ఆ తరువాత మానవ వాద ఉద్యమంలో ఆమె నిమగ్నురాలైంది. ఈ లోగా జాతీయ రాజకీయాలలో మునిగితేలింది. 1931లో స్విజర్ లాండ్ నుండి ఓడలో వచ్చి బొంబాయిలో దిగిన లూసి గెస్లర్.ను కలిసింది. ఆమె వెంట బ్రిటిష్ గూఢచారులు పడగా మణిబెన్ కాపాడి ఎం.ఎన్. రాయ్ దగ్గరకు రహస్యంగా తీసుకు వెళ్ళింది. కానీ త్వరలోనే పసిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం లూసీని మళ్ళీ విదేశాలకు పంపించేశారు.

పోరాటాల సందర్భంగా 1932లో మణిబెన్ అరెస్ట్ అయింది. ఎం.ఎన్. రాయ్.కు అండగా నిలిచింది. కేంద్ర శాసన సభకు సభ్యురాలిగా ఎన్నికై కొన్నాళ్ళు పనిచేసింది. అనేక మురికివాడలలో సాహసించి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించింది. ఆమె కృషికి తొడుగా ఇందుమతి ఫరేక్ నిలిచారు. ప్రభుత్వం నియమించిన వివిధ స్త్రీ సంక్షేమ సంఘాలలో మణిబెన్ కృషి చేశారు.

ఆమె మా ఆహ్వానంపై హైదరాబాద్ పర్యటించారు. అలా వచ్చినప్పుడు నగరం చూడటమే కాక, నాటి ప్రముఖ మానవ వాద నాయకులు, న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు ఇంటికి నేనూ, కోమల కలసి వెళ్ళాము. అప్పుడు సాంబశివరావు హైదరాబాద్.లోని మలక్ పేటలో ఉండేవారు. ఆయన కుమార్తె మంజులత అప్పుడే ఒక కుమారుడుని ప్రసవించింది. మణిబెన్ ఆ పసివాడికి ఒక జ్ఞాపిక బహూకరించింది. అలా ఇవ్వడం మంచి సంప్రదాయమని మాతో చెప్పింది. హైదరాబాద్ పాతబస్తీలో అనేక వస్తువులపై ఆమె ఆసక్తి కనపరచింది. స్త్రీల సంఘాలలో తన కృషి, అనుభవాలు ఎన్నో వివరించింది. ఎమ్.ఎన్.రాయ్ తో సుదీర్ఘ పరిచయాలు, అనుభవాలు ఎంతో ఓపికగా చెప్పారు.

1979లో ఆమె చనిపోయారు. చివరి వరకు మానవ వాద ఉద్యమ నాయకురాలిగా ఆమె చేసిన కృషి గణనీయమైనది. వి.బి. కర్నిక్ ఆమె జీవిత చరిత్రను సంక్షిప్తంగా ప్రచురించారు. జాతీయ, అంతర్జాతీయ మహా సభలలో ప్రతినిధిగా మణిబెన్ పాల్గొని తన వ్యక్తిత్వాన్ని చూపారు

No comments:

Post a Comment