క్రైస్తవం ఇంత అమానుషమా


అమెరికాలో క్రైస్తవులనుద్దేశించి శామ్ హారిస్ (సుప్రసిద్ధ మనోవిశ్లేషణ శాస్త్రజ్ఞుడు, హేతువాది) ‘ఒక బహిరంగ లేఖ’ను సంచలనాత్మకంగా ప్రచురించాడు. లోగడ ‘మూఢనమ్మకాలకు స్వస్తి’ అనే గ్రంథం రాసి బహుళ ప్రచారం పొందిన శామ్ హారిస్ లేఖతో మరికొంత సంచలనం సృష్టించాడు. ఆయన అనుమతితో దీన్ని తెనిగించి ప్రచురించాను. అది వరుసగా ఇక్కడ అందిస్తున్నాము.
క్రైస్తవం ఇంత అమానుషమా
(లెటర్ టు క్రిస్టియన్ నేషన్)
పరిచయ వాక్యాలు

శామ్ హారిస్ మాటలలో సౌమ్యుడు. కలం పడితే చాలా పదునైన భావాలు వెలువడతాయి. మతాల ఘోర కృత్యాలను, దారుణ హింసలకు బాగా రియాక్ట్ అయ్యి మానవులను మంచి మార్గంలో నడపడానికి మతాలు ఎలా అడ్డు వస్తున్నాయో అధ్యయనం చేసి తెలుసుకున్నారు. ఆయనను మొట్టమొదట 2005లో అమెరికాలో బఫెలో నగరంలో కలిశాను. సెంటర్ ఫర్ ఇంక్వరీ ట్రాన్స్ నేషనల్ వాళ్ళు పాల్ కట్జ్ ఆధ్వర్యాన నూతన వికాసం అనే పేరిట 5 రోజులపాటు ప్రపంచ సభలు జరిపారు. వాటిల్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు శామ్ హారిస్ కలిశారు. అప్పటికే ఆయన ది ఎండ్ ఆఫ్ ఫెయిత్ పుస్తకం వెలువరించారు. అది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా బహుళ ప్రచారంలోకి వచ్చింది. తన ఆటోగ్రాఫ్ తో ఆ పుస్తకాన్ని నాకు బహూకరించారు. వివిధ మతాల ఆచారాల, నమ్మకాల విషయాలను తెలుసుకోవడానికి పర్యటన చేస్తూ, భారతదేశంలో ఉత్తరాది ప్రాంతాలలో అనేకచోట్లకు వెళ్లానని చెప్పారు. ఆ సమావేశాల్లో చర్చా వేదిక నుండి మాట్లాడిన శామ్ హారిస్ ఎంతో నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడారు.
శామ్ హారిస్ 1967లో పుట్టారు. ఆయన స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ చదివారు. సుప్రసిద్ధమైన పత్రికలకు వ్యాసాలు రాశాడు. అందులో లాస్ ఏంజిల్స్ టైమ్స్, ప్లే బోయ్, ఫ్రీ ఇంక్వరీ, టైమ్స్ వంటి పత్రికలలో చాలా లోతుపాతులయిన విషయాలు చర్చించారు. ఫ్లెమింగ్ ది గాడ్ హువజ్ నాట్ దేర్ అనే సినిమాలో ప్రత్యేక అభిప్రాయాలను ఇస్తూ రికార్డు చేశారు. మెదడులో నమ్మకాలకు అతీంద్రియ విషయాలకు ఆసక్తి కనబరిచే ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని న్యూరో సైన్స్ విభాగంలో పిహెచ్.డి చేస్తున్నారు. దీనికిగాను ఎమ్.ఆర్.ఐ పరికరాలను ఉపయోగిస్తున్నారు. అనేక సెక్యులర్ ప్రాజెక్టులను ప్రపంచ వ్యాప్తంగా స్థాపించి హేతుబద్ధంగా శాస్త్రీయంగా ఆలోచించడానికి పథకాలు వేశాడు. హఫింగ్టన్ పోస్ట్ వ్యాసాలు బహుళ ప్రచారంలోకి వచ్చాయి. తూర్పు పశ్చిమ ప్రపంచపు సంప్రదాయాలను ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. అమెరికా యూరోపులలో నిరంతర చర్చా వేదికలలో పాల్గొంటున్నారు.
శామ్ హారిస్ క్రైస్తవుల ప్రాబల్యాన్ని, అమెరికాలో వారి మూర్ఖత్వాన్ని మతం పేరిట అటు అధికారంలో ఉన్నవారు. ఇటు చర్చిల పురోహిత వర్గాలు చేస్తున్న మావో చిత్రహింసలను బయట పెడుతున్నారు. ప్రత్యేకంగా వెబ్ సైట్ కూడా నడుపుతూ ఆసక్తిపరులకు జిజ్ఞాసాపూర్వకమైన విషయాలను అందిస్తున్నారు. క్రైస్తవులపై ఆయన చేసిన దాడి ఇతర మతాలకు కూడా వర్తిస్తుంది. ముస్లింలు, హిందువులు, యూదులు, సిక్కులు తదితరులు చేస్తున్న దారుణాలను ద ఎండ్ ఆఫ్ ఫెయిత్ లో బాగా విపులీకరించారు. సమకాలీన ప్రపంచంలో బుష్ ఆధ్వర్యాన ఛాందస క్రైస్తవుల విజృంభణతో సమాజం ఎలా వెనక్కు పోతున్నదో హెచ్చరించడానికి రాసిన  ఈ పుస్తకం చాలా శక్తివంతమైన ఆయుధం.
ఫ్రీ ఇంక్వరీ పత్రిక ఎడిటర్ నా మిత్రులు టాం ఫ్లిన్ ఈ రచన తెలుగు అనువాదానికి చొరవ తీసుకుని అనుమతి పంపేటట్లు ఏర్పాడు చేశారు. ఆయనకు ధన్యవాదాలు. ఇటువంటి ఆలోచన భారతదేశంలోనూ అవసరమేనని మిత్రులు శిశిర్ చలసాని  ఈ గ్రంథాన్ని తెనిగించమని విస్తారంగా ప్రజలలోకి వెళ్ళాలని ప్రోత్సహించారు. ఆయన కనబరిచిన ఉత్సాహమే  ఈ అనువాదానికి ప్రచురణకు దారితీసింది.
శక్తివంతమైన ఇటువంటి శాస్త్రీయ దృక్పథాలు అన్ని మతాలకు అన్వయిస్తూ రావాలి. పాఠకులు ఈ గ్రంథాన్ని చదివి, చదివించి సమాజానికి ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. శామ్ హారిస్ ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్నారు. ఆయనకు భార్య కుమారుడు ఉన్నారు.
--- ఎన్. ఇన్నయ్య

పాఠకులకోమాట

‘నమ్మకానికి అంతం’ (ఎండ్ ఆఫ్ ఫెయిత్) అనే శీర్షికన నా తొలి పుస్తకం రచించినప్పటి నుండి దేవుణ్ణి నమ్మకపోవడంలో నేను తప్పు చేస్తున్నానని వేలాదిమంది నాకు ఉత్తరాలు రాశారు. ఇందులో వ్యతిరేకమైనవి క్రైస్తవుల నుండి వచ్చాయి. ఇది చాలా విడ్డూరమైనది. ఇతరులకంటే తమ మతం ప్రేమను, క్షమాపణను చాలా బాగా ఆచరణలోకి పెడుతుందని ఊహిస్తారు. క్రీస్తు ప్రేమ వలన మారిపోయామని చెప్పేవారు. విమర్శలు సహించలేక చాలా ఘాటుగా హత్యచేసేటంత కసిగా ఉంటున్నారు. ఇది మానవ స్వభావం అనుకోవచ్చు. కానీ అలాంటి ద్వేషం బైబిల్ నుండి రాబట్టడం స్పష్టంగా ఉంది. ఇదెలా తెలుసు? నాకు ఉత్తరాలు రాసేవారు బైబిల్ లో అనేక సూత్రాలను ఉదహరిస్తూ ఉంటారు.
ఈ పుస్తకం అన్ని మతాల వారిని ఉద్దేశించి ఉంది. కాని ‘క్రైస్తవులకు బహిరంగ లేఖ’గా దీనిని బయట పెడుతున్నాను. క్రైస్తవులు తమ మత విశ్వాసాలను సమర్ధిస్తూ వాదించే తీరును దృష్టిలో పెట్టుకుని రాశాను. మన సమాజంలో సెక్యులరిస్టులు మతాన్ని ప్రభుత్వాలకు దూరంగా ఉంచాలని కోరుతున్నారు. వారిని సమర్థిస్తూ ఈ రచన చేశాను. క్రైస్తవులు ఇందుకు వ్యతిరేకంగా తమ హక్కులకు పోరాడుతున్నారు. ఈ పుస్తకంలో క్రైస్తవం అని ఉద్దేశించింది పరిమిత దృక్కోణంలోనే. క్రైస్తవులు బైబిల్ ను దైవ ప్రేరణ విధంగా భావిస్తారు. జీసస్ క్రైస్ట్ కు దివ్యత్వం ఉన్నట్లుగా నమ్మినవారే మరణానంతరం ముక్తిని పొందుతారని అంటారు. అమెరికా జనాభాలో చేసిన వైజ్ఞానిక సర్వేలను బట్టి సగంమంది ఇలాంటి నమ్మకాలు వెల్లడిస్తున్నారు. క్రైస్తవ శాఖలో  ఈ నమ్మకాలు వివిధ రీతులుగా వున్నాయి. కాథలిక్కులు, ప్రొటస్టెంట్ లు, ఎవాంజలిస్టులు, బాప్టిస్టులు, పెంటెకోస్టులు, జెహోవా విట్ నెస్ లు తదితర మితవాద శాఖలు  ఈ వాదనలో ఉన్నారు. మితవాద క్రైస్తవులు జాతీయ రంగంలో – కోర్టులలోను, స్కూళ్లలోనూ, ప్రభుత్వ శాఖలలోనూ చాలా ప్రభావాన్ని చూపుతున్నారు.
‘క్రైస్తవ దేశానికి బహిరంగ ఉత్తరం’ రాయడంలో క్రైస్తవులు నైతిక నటనలకు వారు కట్టుబడి ఉన్నామనుకునే తీరు తెన్నులు పటాపంచలు చేయదలచాను. ఉదారవాద, మితవాద క్రైస్తవులు నేను చెప్పే క్రైస్తవంలోకి రామని అంటారు. ఈ మితవాద, ఉదారవాద క్రైస్తవులు నా వలె ఇతర క్రైస్తవులు తమ హక్కుగా నిర్ధారించే విషయాలపట్ల కలవరం చెందుతున్నారు. తమ మత విశ్వాసాల పట్ల వారు కోరే హక్కులు ఆధారంగా ఇతర మతాల తీవ్రవాదులు కూడా రక్షణ కోరుతున్నారని వారు గుర్తించాలి.  ఈ ఉదార మితవాదులు విమానాలతో భవనాలను కూలగొట్టకపోవచ్చు. ప్రపంచం అంతం అవుతున్నదని చెప్పే జోస్యాలు నమ్మకపోవచ్చు. కాని పిల్లల్ని క్రైస్తవులుగా, ముస్లింలుగా, యూదులుగా పెంచడాన్ని వారు ప్రశ్నించరు. ప్రపంచంలో మతపరంగా ఉన్న అత్యంత అభ్యుదయకర నమ్మకస్తులు సైతం ప్రశ్నించడంలేదు. ‘లెటర్ టు ఎ క్రిస్టియన్ నేషన్’లో క్రైస్తవులు ఎలా విభజిస్తున్నారో, హాని చేస్తున్నారో తిరోగమనం వైపు తీసుకెడుతున్నారో చూపాను. ఇందులో ఉదార వాదులు, మితవాదులు, నమ్మకం లేనివారు సర్వసాధారణమైన విషయాలను తమ మధ్య ఉన్నాయని గ్రహించవచ్చు.
అమెరికాలో ఇటీవల గాలప్ పోల్ తీసుకుంటే కేవలం 12 శాతం మాత్రమే భూమి మీద మానవ జీవనం దేవునితో నిమిత్తం లేకుండా సహజంగా పరిణమించిందని అన్నారు. కాని 31 శాతం మంది   పరిణామానికి దేవుడు దయ ఉన్నది అన్నారు. ప్రపంచాన్ని గురించి ఎలాంటి అభిప్రాయం ఉన్నది అని పోల్ పెడితే తెలివిగల పథకం ఎవరో రూపొందించారనే అంశం తెలుస్తుంది. దేవుడు విధానం ఓడిపోతుంది. ప్రకృతిలో తెలివిగల పథకం ఎవరో రూపొందించారనే అంశానికి సాక్ష్యాధారాలు లేవు. పైగా  ఈ పథకంలో తెలివిలేని రీతులు ఎన్నో కనిపిస్తాయి. తెలివిగల పథకంపై జరుగుతున్న వాదోపవాదాలు మనల్ని పక్కదారి పట్టించరాదు. 21వ శతాబ్దంలో మతపరంగా వస్తున్న ఆందోళనకర అంశాలు విస్మరించరాదు. అమెరికాలో 53 శాతం సృష్టివాదులని గ్యాలప్ పోల్ చెబుతున్నది. ఒక శతాబ్దం పాటు శాస్త్రీయ పరిశోధన జీవితాన్ని, భూమిని గురించి ఎంతో పరిశోధనలు చేసి శాస్త్రీయంగా విషయాలు వెల్లడించింది. అయినా మన తోటి వాళ్ళలో సగం మంది 6,000 సంవత్సరాల క్రితం ఈ విశ్వం పుట్టినట్లు నమ్ముతున్నారు. సుమేరియన్లు జిగురు కనుగొన్న వెయ్యి సంవత్సరాల తరువాత పరిస్థితి ఇలా ఉన్నది. రాష్ట్రపతిని, శాసన సభ్యులను ఎన్నుకొనే అధికారం గలవారు, ఆ సభలకు ఎన్నికయినవారు నోవా ఓడలో డైనోసార్లు జంటలుగా వుండేవని, సుదూరాన ఉన్న పాలపుంతల వెలుగు భూమి ద్వారా సృష్టి అయిందని, మనుషుల్లో తొలి స్త్రీ పురుషులు మట్టి నుండి సృష్టి కాగా దైవము ఊపిరి పోసిందని, ఈడెన్ తోటలో మాట్లాడే పాము ఉండగా అదృశ్య దేవుడు ఈ చర్యలని చేశాడని నమ్ముతున్నారు.
అభివృద్ధి చెందిన దేశాలలో అమెరికా నమ్మకాలు ఏకాకిగా కనిపిస్తున్నాయి. చరిత్రలో మునుపు ఎన్నడూ లేనంతగా అమెరికా దిగజారిపోయి నిలిచింది. అగ్రరాజ్యం, ఉన్నత మూర్ఖత్వంతో ఉంటే అది దారుణమైన అంశమని నాగరికతను పట్టించుకోనివారు ఎవరైనా అనుకోవాల్సిందే.
చాలామంది నాగరికత ఎట్లాపోతే ఏంటి అనుకుంటున్నారు. అమెరికా జనాభాలో 44 శాతం జీసస్ తిరిగి వస్తాడని, రానున్న ఏభయి సంవత్సరాలలో జనాల భవిష్యత్తు నిర్ణయిస్తాడని, భూమి మీద పరిస్థితులు దారుణంగా పరిణమించినప్పుడు జీసస్ తిరిగి వస్తాడని బైబిల్ జోస్యాన్ని వ్యాఖ్యానించేవారు ఉంటున్నారు. న్యూయార్క్ నగరం అగ్నికి ఆహుతి అయితే అప్పుడు అమెరికా జనాభాలో కొందరు క్రీస్తు తిరిగి రావడానికి అదొక చిహ్నంగా భావించి ఆహ్వానిస్తారు కూడా. ఇలాంటి నమ్మకాలు మనుషుల మనసుల్ని మూసిపెడుతుంటే, సాంఘికంగా, ఆర్థికంగా, పరిసరాల దృష్ట్యా భౌగోళిక రాజకీయాల దృష్ట్యా మంచి భవిష్యత్తు నిర్మించుకోవడం కష్టం. అమెరికా ప్రభుత్వంలో చాలామంది ప్రపంచం అంతం అవుతుందని అది దివ్యమైన స్థితి అని నమ్మితే ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించండి. అమెరికా జనాభాలో సగం మందికి ఇలాంటి నమ్మకాలున్నాయి. అందుకు మతంపట్ల మూర్ఖ నమ్మకమే కారణం. అటువంటి స్థితిని నైతికంగా, మేథస్సు రీత్యా అత్యవసర పరిస్థితిగా మనం భావించాలి. అటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడింది కనుకనే ఈ పుస్తకం మీ ఎదుట ఉంచాను. ఇది మీకు ఉపయోగపడుతుందని నా ఉద్దేశ్యం.
-- శామ్ హారిస్  

1 comment:

కమనీయం said...




సున్నితమైనా ఈ అంశాన్ని స్పృశించారు.ఇక్కడ మూడు విషయాలు ముఖ్యం 1.మతబోధలో ఉన్నట్లు ఆమతస్థుల్లో చాలా మంది ప్రవర్తించరు.అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ సమర్థించుకుంటూ ఉంటారు.2.యుద్ధాలు చెయ్యని జాతులు ,మతస్థులు లేరు. మరి యుద్ధం అంటేనే అమానుషం,హింసాపూరితం.ఇది అన్ని మతాలవారికీ వర్తిస్తుంది.3.మతగ్రంథాల్లోనే హింస,ద్వేషం,అసహనం ప్రేరేపించే భాగాలు ఉన్నాయి.4.అందువలన ఏమతస్తులైనా,21వ శతాబ్దంలో మనం పూర్వులకన్నా అభివృద్ధిచెందాము కాబట్టి,మన స్వంత బుద్ధి, ఆలోచనలతో ఆయా మతాలలోన్ని మంచిని మాత్రమే స్వీకరించి ,చెడుని,మూఢత్వన్ని విసర్జించాలి.

Post a Comment