దేవునికోసం మంచి చెయ్యడం


నాలుగవ భాగం


దేవుడి పేరుతో ప్రజలు చేసిన మంచి పనుల మాటేమిటి? మానవుల బాధలు నివారించడానికి చాలా మంది విశ్వాసపాత్రులు వీరోచిత త్యాగాలు చేసినమాట వాస్తవం. ఈ విధంగా ప్రవర్తించడానికి కారణమేమిటో తగిన సాక్ష్యాధారాలు లేకుండా నమ్మడం అవసరమా?  దయచూపడం అనేది మత మూర్ఖత్వంపై ఆధారపడి ఉంటే యుద్ధ భీభత్స ప్రాంతాలలో సెక్యులర్ డాక్టర్లు చేస్తున్న పనిని ఎలా అర్ధం చేసుకోవాలి. చాలామంది డాక్టర్లు మానవ బాధలను నివృత్తి చేయడానికి దేవుని ఆలోచనలతో నిమిత్తం లేకుండానే కృషి చేస్తుంటారు. క్రైస్తవ మిషనరీలు బాధా నివృత్తికి పని చేస్తున్నప్పటికీ వారు ప్రమాదకరమైన, చీలికలు తెచ్చిపెట్టే గాధల ప్రచారానికి పూనుకుంటున్నారు. అవసరాలున్న ప్రజల్ని మతం మార్పిడి చేయడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మిషనరీలు చాలా డబ్బు ఖర్చు పెడుతూ చాలా కాలాన్ని వృధా చేస్తున్నారు. వారు కుటుంబ నియంత్రణ గురించి, లైంగికంగా అంటుకుంటున్న వ్యాధుల గురించి, తప్పుడు సమాచారాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు. సరైన సమాచారాన్ని దాచి పెడుతున్నారు. మిషనరీలు చిక్కుల నెదుర్కొంటూ గొప్ప పనులు చేస్తున్నా వారి మూర్ఖ విశ్వాసాలవల్ల అజ్ఞానం ప్రబలుతున్నది. ఇందుకు భిన్నంగా సెక్యులర్ సంస్థలు, సరిహద్దులు పాటించని డాక్టర్లు జీసస్  కన్యకు పుట్టాడంటూ కాలం వృధా చేయరు. ఆఫ్రికా ఎడారులలో 40 లక్షల ప్రజలు ఏటా ఎయిడ్స్ వ్యాధితో చనిపోతున్నారు. అయినా సరే కండోములు వాడటం పాపమని వారు చెబుతున్నారు. క్రైస్తవ మిషనరీలు పల్లె ప్రజలకు కండోములు గురించి ఎలాంటి సమాచారం లేని చోట అవి వాడితే పాపం అంటూ చెబుతుంటారు. సామూహికంగా జనాన్ని చంపే పవిత్ర కార్యం ఇది. (వాటికన్ కండోములను వ్యతిరేకిస్తున్నది. పెళ్ళయినవారి మధ్య హెచ్.ఐ.వి. వ్యాధి వ్యాపించకుండా కండోములు వాడటానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఈ విధానాన్ని మళ్ళీ పరిశీలిస్తున్నట్లు పోప్ ఆలోచన గురించి వదంతులున్నాయి. ఈ సమస్యను శాస్త్రీయంగా, సాంకేతికంగా, నైతికంగా అధ్యయనం చేస్తున్నట్లు వాటికన్ రేడియో ప్రకటించింది. మతపరమైన సలహా సంఘ అధ్యక్షులు కార్డినల్ జేవియర్ లొజానో బారగన్ అటువంటి ప్రకటన చేశాడు. మూఢ విశ్వాసాలను నిలబడవు అనడానికి క్రైస్తవమతంలో వస్తున్న మార్పు సూచన కావచ్చు. విశ్వాసంలో వివేచన ఉన్నదనడానికి ఆధారాలు లేవు.) ప్రజలు బాధపడుతుంటే వారికి సహాయపడడం మంచిదా లేదా అలా సహాయ పడితే సృష్టికర్త బహూకరిస్తాడని భావించడం మంచిదా?
మత మూఢ విశ్వాసం వలన నైతిక భావనలు ఎలా దెబ్బతింటాయో, ఈ విషయంలో ఇతరులకు సహాయపడే నిమిత్తం మంచి వ్యక్తి కూడా ఏవిధంగా దారి తప్పుతాడో, మదర్ తెరీసా నిర్దుష్టమైన ఉదాహరణగా చెప్పవచ్చు. క్రిస్టొఫర్ హిచిన్స్ ఆవిడ స్వభావాన్ని అరమరికలు లేకుండా ఇలా చెప్పాడు :
‘మదర్ తెరీసా పేదల స్నేహితురాలు కాదు. ఆమె పేదరికానికి మిత్రురాలు. బాధలు పడడం దేవుడి వరం అని ఆమె చెప్పింది. పేదరికాన్ని పోగొట్టడానికి స్త్రీలను శక్తివంతం చేయడం, తప్పనిసరిగా పిల్లల్ని కనడం నుండి విమోచన చేయడం అనేవాటిని ఆమె జీవితాంతం వ్యతిరేకించింది.’
హిచిన్స్ చెప్పేదాంతో నేను చాలా వరకు అంగీకరిస్తున్నాను. మదర్ తెరీసా దయ చూపడంలో గొప్ప శక్తివంతురాలు. తోటివారు బాధపడుతుంటే ఆమె చలించిపోయి ఆ బాధను గురించి పట్టించుకునేటట్లు చేసింది. ఆమె దయ అంతా కూడా మత మూఢవిశ్వాసాలలో చిక్కుకు పోయింది. నోబెల్ ప్రైజ్ బహుమానాన్ని ఆమోదిస్తూ ఆమె చెప్పిన మాటలివి :
‘శాంతిని నాశనం చేసేది గర్భస్రావం. చాలామంది భారతదేశంలో, ఆఫ్రికాలో పిల్లలు చనిపోతున్నారని, తగిన ఆహారం లేక ఆకలి బాధతో అస్తమిస్తున్నారని అనుకుంటున్నారు. కాని లక్షలాది మంది చనిపోవడానికి తల్లులు ప్రసవించే ధోరణే కారణం. శాంతిని నశింపచేసే విషయం అది. తల్లి తన బిడ్డను చంపుకుంటే – నిన్ను నేను, నన్ను నీవు చంపడానికి తేడా ఏముంది?’
ఈ మాటలు తప్పుద్రోవన పట్టాయని చెప్పక తప్పదు. నీతికి సంబంధించిన విషయంగానూ ఇందులో చెప్పుకోదగింది లేదు. భూమి మీద జరుగుతున్న ఎన్నో బాధల్ని కష్టాల్ని పక్కన పెట్టి, తల్లి తొలిదశలోని పిండాన్ని అంతం చేయడం ఆమె దయకు గురి అవుతున్నది. గర్భస్రావం వాస్తవ విషయం. ఇది తగ్గించటానికి కండోములు వాడటం చక్కని మార్గం. గర్భస్రావం అంతం అవుతున్న పిండాలు ఏ స్థాయిలో బాధపడుతున్నాయో తెలుసుకుంటే మంచిది. యుద్ధంలో, కరువులో, రాజకీయ చిత్రహింసలలో మానసిక రుగ్మతలతో బాధపడే కోట్లాదిమంది ప్రజల గురించి పట్టించుకోవడం అవసరం. లక్షలాది మంది ఊహించడానికి  వీలులేనంతగా భౌతిక, మానసిక చిత్రహింసలకు గురవుతున్నారు. అలాంటిచోట దేవుడిదయ కానరాదు. పైగా మానవుల పట్ల దయచూపుతున్నామనేవారు పాపాన్ని, ముక్తిని అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. నిజంగా మానవ బాధల్ని పట్టించుకోదలిస్తే అందులో గర్భస్రావం అనేది ఏమంతగా చింతించాల్సిన అంశం కాదు.
అమెరికాలో గర్భస్రావ సమస్య చాలామందిని విడదీస్తున్నది. క్రైస్తవ మతం ఎల్ సాల్వడార్ అనే దేశంలో  ఈ సమస్యపట్ల అవలంబించిన నైతిక దృష్టి దారుణంగా బయటపడింది. అక్కడ గర్భస్రావం ఏ పరిస్థితులలోనైనా చట్ట విరుద్ధమే. చెరచటం, చిన్నపిల్లలతో లైంగిక సంబంధం కూడా మినహాయింపులకు గురి కాలేదు. గర్భస్రావం జరిగినట్లు ఏ ఆసుపత్రిలోనైనా తెలిస్తే ఆ స్త్రీని నేరస్థురాలిగా చిత్రహింసలు చేస్తున్నారు. డాక్టర్లు ఆమెను పరీక్షిస్తున్నారు. గర్భం తొలగించుకున్నందుకు 30 ఏళ్ల నుండి అనుభవిస్తున్నవారున్నారు. కండోములు వాడటం దైవం పట్ల పాపం చేసినట్లేనని చెబుతున్న దేశంలో పరిస్థితి ఇది. మదర్ తెరీసా ప్రపంచంలో బాధలను గురించి చెబుతున్న విషయాలను అంగీకరిస్తే ఎల్ సాల్వడార్ ఆర్చిబిషప్ గర్భస్రావ వ్యతిరేక ప్రచారం చేశాడు. 1999లో మెక్సికో సిటీని సందర్శించిన రెండవ పోప్ జాన్ పాల్ అటువంటి చర్యను సమర్థించాడు. క్రైస్తవ మతం మరణ సంస్కృతికి విరుద్ధంగా జీవిత అనుకూలతను చాటాలన్నాడు.
క్రైస్తవ మతం గర్భస్రావాన్ని గురించి జీవశాస్త్రం చెబుతున్న అంశాలను పరిగణనలోకి తీసుకోదు. మానవుడి బాధల గురించి కూడా వాస్తవ విషయాలను స్వీకరించదు.
గర్భస్రావాన్ని గురించి క్రైస్తవ మతం జీవశాస్త్రం చెప్పే అంశాలను పట్టించుకోవడంలేదు. గర్భస్రావంలో 80 శాతం వాటంతట అవే జరుగుతున్నాయి. గర్భం దాల్చిన స్త్రీకి తెలియకుండా కూడా ఇవి జరుగుతున్నాయి. గర్భధారణ 20 శాతం నిలబడక పోవడం జరుగుతూ ఉంటుంది. దేవుడు గనక ఉంటే అందరికంటే ఎక్కువగా గర్భస్రావాలను చేయిస్తున్నది అతడే అనవచ్చు.
         మూలం                                     అనువాదం
    శామ్ హారిస్                         ఎన్. ఇన్నయ్య

No comments:

Post a Comment