నాస్తికులు పాపాత్ములా?--ఐదవ భాగం-Letter to Christian Nation by Sam Harris




నీతికి మత విశ్వాసం ఒక్కటే ఆధారం అయితే, నమ్మేవారికంటే నాస్తికులు నీతిలో తక్కువ వారన్నమాట. వాస్తవానికి నీతి లేని వారన్నమాట. అవునా? అమెరికాలో నాస్తిక సంఘాలవారు నేరాలలో భాగం పంచుకుంటున్నారా? సైన్స్ జాతీయ అకాడమీ సభ్యులలో 93 శాతం దేవుడనే భావాన్ని నిరాకరిస్తుండగా వారంతా అబద్ధాలాడుతూ మోసం చేస్తూ దొంగతనాలు చేస్తున్నారా? సాధారణ జనాభాలా వీళ్ళంతా సత్ప్రవర్తన కలిగిన వారేనని గట్టిగా చెప్పవచ్చు. అయినా అమెరికాలో నాస్తికులను అల్ప సంఖ్యాకులుగా చిన్న చూపు చూస్తున్నారు. నాస్తికుడిగా ఉండటం దేశంలో పెద్ద పదవులకు పోటీ చేసే దానికి పెద్ద ఆటంకం అయిపోయింది. అటువంటి ఆటంకాలు నల్లవారికి, ముస్లింలకు, స్వలింగ సంపర్కులకు కూడా లేవు. ఇటీవల ఒక డేనిష్ వార్తాపత్రిక మహమ్మద్ ప్రవక్తను అపహాస్యం చేస్తూ 12 కార్టూన్లు వేయగా ముస్లిం ప్రపంచం వేలాదిగా యూరోపులో రాయబార కార్యాలయాలను తగలబెట్టి, బెదిరించి, కొందరిని చంపి, మరికొందరిని ఎత్తుకుపోయారు. అలాంటిది నాస్తికుల పేరిట ఎప్పుడు కొట్లాటలు జరిగాయో చెప్పమనండి. ప్రపంచంలో ఎక్కడయినా ఏ వార్తాపత్రికయినా నాస్తికత్వాన్ని గురించి వ్యంగ్య చిత్రాలు వేయడానికి సందేహిస్తారా? అలాంటి సంపాదకులను ఎత్తుకు పోతారని, చంపేస్తారని భయం ఉన్నదా?
అడాల్ఫ్ హిట్లర్, జోసెఫ్ స్టాలిన్, మావో సేటుంగ్, పోల్ పాట్, రెండవ కిం సుంగ్ వంటి దుర్మార్గులు నాస్తికత్వం నుండి వచ్చారని అంటారు. వారిలో కొందరు మతానికి వ్యతిరేకులైనా, వారేమీ హేతువాదులు కాదు.
(హిట్లర్ నాస్తిక వాదాన్ని చాలా అతిశయోక్తులతో చిత్రించారు :
“క్రైస్తవుడుగా నేను దేవుణ్ణి చూస్తూ రక్షకుడుగా నన్ను కాపాడమని కోరతాను, ఏకాంతంగా ఉన్న నన్ను భగవంతుడు యూదులపై పోరాడమని ఆదేశించాడు. క్రైస్తవుడిగా నేను యూదులను గుర్తించి భగవంతుడు ఇచ్చిన శక్తిని వినియోగించుకుంటాను. యూదులపై పోరాటానికి భగవంతుడు అపార శక్తివంతుడు. క్రైస్తవుడుగా నాకు నా ప్రజలను సేవించాల్సిన కర్తవ్యం ఉన్నది.”)
బహిరంగంగా ఈ నాయకులు చేసే ప్రకటనలు భావపూరితమైనవి. జాతి, ఆర్థిక విధానం, జాతీయత, చరిత్ర గమనం, మేధావుల వల్ల నైతిక ప్రమాదాలు అనే అంశాలపై వీరి ప్రకటనలు భ్రమల్ని కలిగిస్తాయి. నిరంకుశులైన ఈ నాయకులు మతాన్ని నిరాకరించే బదులు, జీవితాలను విధ్వంసం చేసే ధోరణులు అవలంబిస్తారు. చాలామంది ఒక రకమైన మతపరంగా వ్యక్తిత్వ ఆరాధనను తమచుట్టూ పెంపొందించుకుంటారు. అది అట్టిపెట్టుకోవడానికి ప్రచారసాధనాలు వాడుకుంటారు. ప్రచారానికి,  చిత్తశుద్ధితో సమాచారన్ని అందించడానికి తేడా ఉన్నది. ఉదార ప్రజాస్వామ్యంలో సాధారణంగా మనం సమాచారాన్ని అందించాలని కోరుకుంటాం. నిరంకుశులు సామూహికంగా జనాన్ని తుడిచిపెట్టే విధానాలను క్రమబద్ధంగా పాటిస్తారు. తమ దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ఆ స్థితికి వారే అగ్రనాయకత్వం వహిస్తారు. వారు హేతుబద్ధంగా ఉండకపోగా వెర్రిమొర్రి భావనలతో పాలిస్తారు. రెండవ కిం సుంగ్ తన నివాసంలో పడకలు సముద్రమట్టానికి 500 మీటర్ల పైకి ఉండాలన్నాడు. కప్పుకునే దుప్పట్లు సుతిమెత్తగా ఉండాలన్నాడు. అంతటి మెత్తని పదార్థం పిచుకల ముక్కు వెనుక భాగానికి ఉంటుంది. కనుక అతడు పడకల కోసం 7 లక్షల పిచుకలను చంపేసి ఆ పదార్థం స్వీకరించాడు. రెండవ కిం సుంగ్ ఉత్తర కొరియాలో ఎంత హేతుబద్ధమైన వ్యక్తో దీనిని బట్టి తెలుసుకోవచ్చు.
యూదులపై జరిగిన దారుణ హత్యాకాండ చూద్దాం. మధ్యకాలపు క్రైస్తవుల నుండి యూదుల వ్యతిరేకత పుణికి పుచ్చుకున్న నాజీ మరణ కూపాలు పేర్కొనవచ్చు. శతాబ్దాలుగా యూరోపులో క్రైస్తవులు ప్రతి సామాజిక దోషానికి యూదులే కారణం అంటూ వారు ఉండటమే విశ్వాసానికి ప్రతీఘాతం అన్నాడు. జర్మనీలో యూదులపట్ల ద్వేషం సెక్యులర్ ధోరణిలో వ్యాపించింది. ఇందుకు మూలం మతమే. యూరోపులో యూదులను మతపరంగా భూతాలుగా పరిగణించి చిత్రించారు. 1914లో యూదులను ఘోరమైన జాతిగా వాటికన్ ముద్రవేసింది. (యూదులు మత క్రతువులలో రక్తం వాడే నిమిత్తం యూదులు కాని వారిని చంపుతారని తప్పుడు ప్రచారం చేశారు. ముస్లిం ప్రంపంచంలో ఇప్పటికీ ఈ నమ్మకం వ్యాప్తిలో ఉంది.) కాథలిక్, ప్రొటస్టెంట్ మతాలవారు నాజీలు చేసిన భారీ సామూహిక హత్యలపట్ల ఉదాశీనత వహించడం అవమానకరం.
జర్మనీలో, సోవియట్ గులాగ్స్ లో, కంబోడియా పొలాలలో జరిగిన హత్యలు హేతుబద్ధంగా ఉండేవారు చేసే పనులు కాదు. రాజకీయంగా, జాతి మూర్ఖత్వంతో ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో ఈ సంఘటనలో తెలియజేస్తారు. మీవంటి క్రైస్తవులు విశ్వాసాన్ని హేతుబద్ధంగా నిరాకరిస్తే, గుడ్డిగా నాస్తికత్వాన్ని స్వీకరించినట్లు ఉందనుకోవడం దారుణమైన భావన, మతం, నాజీయిజం, స్టాలిన్ వాదం, నియంతృత్వ మిథ్య అన్నీ పిడివాదంలో నుండి జనించినవే. మానవ చరిత్రలో ఏ సమాజంలో కూడా ప్రజలు సాక్ష్యాధారాలు చూపుతూ విశ్వాసాలను నమ్మకాలను పెంపొందించుకున్న ఉదాహరణ కనపడదు.
మతాన్ని అంతం చేయడం అనుభవమైన లక్ష్యంగా భావిస్తారు. అభివృద్ధి చెందిన ప్రపంచంలో  ఈ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. నార్వే, ఐస్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్, స్విట్జర్లాండ్, బెల్జియం, జపాన్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఇంగ్లండ్ దేశాలు ఏమంతగా మతాన్ని పాటించడం లేదు. 2005లో ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధిని బట్టి  దేశాలు జీవనప్రమాణాన్ని, వయోజన విద్యను, తలసరి ఆదాయాన్ని, విద్యాస్థాయిని, స్త్రీ పురుష సమానత్వాన్ని, ఆరోగ్యాన్ని సాధించుకుంటూండగా బాల్య మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. పశ్చిమ యూరోప్ లో నేరాలు చాలావరకు ప్రవాసం వచ్చిన వారివలన సంభవిస్తున్నాయి. ఫ్రాన్స్ లో జైళ్ళలో ఉన్నవారు 70 శాతం ముస్లింలే. పశ్చిమ యూరోప్ లో ఉన్న ముస్లింలు నాస్తికులు కారు. మానవాభివృద్ధి సూచికలో 50 దేశాల నుండి వచ్చిన లెక్కల ప్రకారం వారంతా మత నమ్మకస్తులే.
అమెరికా సంపన్న ప్రజాస్వామిక దేశమైనా మతాన్ని అంటిపెట్టుకున్నది. అందులో గర్భస్రావాలు, యువతులలో గర్భధారణలు, లైంగికంగా వస్తున్న జబ్బులు, చిన్నపిల్లల మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో మత ఉదారవాదం ఎక్కువగా ఉన్న దక్షిణాది మధ్య రాష్ట్రాలు పై లక్షణాలను స్పష్టంగా కనబరుస్తున్నాయి. అమెరికాలో ఉత్తర తూర్పు ప్రాంతాలలో సెక్యులర్ ధోరణులతో యూరోప్ ప్రమాణాలను చేరుకుంటున్నారు. అమెరికాలో పార్టీ అనుబంధాన్ని బట్టి మతాన్ని అంచనావేయలేం. అమెరికాలో మితవాద క్రైస్తవ రాజకీయ ప్రభావం వున్న రాష్ట్రాలను రెడ్ స్టేట్స్ అంటారు. కానీ అలా చూడం. తీవ్ర నేరాలు జరుగుతున్న నగరాలను గమనిద్దాం. ఇందులో 25 నగరాలు పరిశీలిస్తే ఎక్కువ నేరాలు రెడ్ స్టేట్స్ లోను, తక్కువ నేరాలు బ్లూ స్టేట్స్ లో ఉన్నాయి. అతి ప్రమాదకరమైన నగరాలుగా పరిగణించిన వాటిలో 76 శాతం రెడ్ స్టేట్స్ లోను, 24 శాతం బ్లూస్టేట్స్ లోనూ ఉన్నాయి. ఆమాటకొస్తే అమెరికాలో అతి ప్రమాదకరమైన ఐదు నగరాలలో మూడు టెక్సాస్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇళ్ల దోపిడీ ఎక్కువగా జరిగే పన్నెండు రాష్ట్రాలు క్రైస్తవానికి చెందిన రెడ్ స్టేట్స్ లో ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 24 దొంగతనాలకు పేరుమోయగా అవి రెడ్ స్టేట్స్ లో ఉన్నాయి. హత్యలకు మారుపేరయిన 28 రాష్ట్రాలలో 17 క్రైస్తవ రెడ్ స్టేట్స్ లో ఉన్నాయి.
అయితే ఇలాంటి పరస్పర సంబంధం సమాచారం కార్యకారణతను వివరించదు. దేవుళ్ళ నమ్మకం వలన సమాజం నిర్వీర్యం కావచ్చు. సమాజంలో చైతన్యత లేకపోవడం దేవుడి పట్ల నమ్మకానికి దారితీయవచ్చు.  ఈ రెండు ఇతరత్రా తప్పుడు భావనల వలన జనించవచ్చు. ఈ కార్యకారణ సంబంధాన్ని అలా ఉంచి గణాంక వివరాలు చూస్తే సభ్య సమాజం కోరుకునే వాటికి పొందికగా నాస్తికత్వం ఉన్నది. దేవుడి మీద నమ్మకం వలన సమాజం ఆరోగ్యకరంగా రూపొందుతున్నట్లు దాఖలాలు లేవు.
నాస్తికత  ఎక్కువగా ఉన్న దేశాలలో దాతృత్వం, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చెందవలసిన దేశాలకు సహాయం చేసే తీరు బాగా కనిపిస్తున్నాయి. క్రైస్తవ ఉదారవాదం, క్రైస్తవ విలువలు పరస్పరం సంబంధం కలిగి ఉండడం అబద్ధమని అక్కడ సాంఘిక అసమానతలు ఎక్కువ ఉన్నాయని స్పష్టపడుతున్నారు. కొన్ని సంస్థలలో ప్రధాన అధికారికి సాధారణ ఉద్యోగులకు మధ్య వేతనాల నిష్పత్తి గమనించవచ్చు. గతంలో ఇది 24:1, ఫ్రాన్స్ లో 15:1, స్వీడన్ 13:1, అమెరికాలో 475:1, అలాంటి అమెరికాలో తుది తీర్పునాడు దేవుడి ముందుకు అందరినీ హాజరు పెట్టాలని జనం నమ్ముతారు. అంటే ఒంటె సూది బెజ్జంలో నుండి సులభంగా దాటిపోతుందన్నమాట. (బైబుల్ కథనం అలా ఉంది).
       మూలం                                   అనువాదం
    శామ్ హారిస్                         ఎన్. ఇన్నయ్య

No comments:

Post a Comment