శాస్త్రదాస్యం పుస్తక పరిచయం


కొప్పరపు సుబ్బారావు అద్వితీయ రచన శాస్త్ర దాస్యం కు త్రిపురనేని గోపిచంద్ 1944 లో రాసిన పరిచయం

ఈ గ్రంథకర్త కొప్పరపు సుబ్బారావుగారు నాటక కర్తలుగా, మ్యూజిక్ డైరెక్టరుగా, ఆంధ్రలోకానికి చిరపరిచితులూ, ప్రఖ్యాతులున్నూ, కాని, వీరి శాస్త్రజ్ఞానం, విమర్శనా పటిమా మాత్రం, ఆంధ్రలోకానికి క్రొత్తే అనుకుంటాను.
నేనీ గ్రంథం చదవటం పూర్తిచెయ్యగానే, వీరు ఇంత పాండిత్యం ఆవేశం, ఇన్నాళ్లూ తమలో ఎట్లా ఇముడ్చుకొని, దాచుకోగలిగారా, అని ఆశ్చర్యపడ్డాను. ఈ గ్రంథంవల్ల వీరు నిశ్చయంగా ఆంధ్రలోకానికి అపారమైన సేవ చేశారని నేను తలుస్తున్నాను. సహృదయంతో ఈ గ్రంథాన్ని చదివిన ప్రతి ఒక్కరూ, నాతో ఏకీభవిస్తారని నా నమ్మకం. ధర్మాచరణ మానుకొని, ఇతరులకు దాస్యం ప్రతిపాదించటమే ఆదర్శంగా పెట్టుకొని, చీటికీ, మాటికీ పూర్వధర్మాలను మంత్రాలకుమల్లే పునఃశ్చరణ చేస్తూ కూర్చునే, ఆకారవాదులకు, శుష్కవాదప్రియులకు, బహు చక్కని జవాబు, యుక్తియుక్తంగా చెప్పి,  సుబ్బారావుగారు హిందూ సంఘానికి, అత్యంత మేలు చేశారని, అంగీకరించక తప్పదు.
మానవ సంఘానికి, స్తిరత్వం అనేది లేదు. ఆదికాలం నుంచీ, పరిణామం పొందుతూనే వొచ్చింది. కల్పాంతంవరకూ, పరిణామం చెందుతూనే ఉంటుంది. అది నిత్య నూతనం. ధర్మశాస్త్రం అట్లా కాకపోవటం వల్ల, ఒక కాలానికి ఉపయోగకరంగా ఉన్నది, మరొక కాలానికి నిరుపయోగంగానో, హానికరంగానో తయారవటం కద్దు.  ఎప్పటికప్పుడు, సంఘంలో, మానవ ఆదర్శంలో, జరిగే ఈ మార్పునే, అరవిందులు తమ గీతావాక్యంలో ఇట్లా చెప్పారు -
“మానవుడు ఆదిలో వ్యక్తి సుఖమే, పరమావధిగా పెట్టుకున్నాడు. అందుకు అనుకూలమైన ధర్మాలు, బయలుదేరినవి. తరువాతి మెట్టు కుటుంబం, అప్పుడు కుటుంబంకోసం, స్వసుఖాన్ని పరిత్యజించటం, ప్రశంసనీయమైంది. తరువాతి మెట్టు వంశం. అప్పుడు వంశంకోసం, స్వసుఖాన్నీ, కుటుంబశ్రేయస్సునీ కూడా, లెక్కచెయ్యకపోవటం, ప్రశంసనీయమైంది. తరువాతి మెట్టు జాతి. దాని తరువాత దేశం. దాని తరువాత ప్రపంచం”
ఒక మెట్టులోనుంచి, రెండవ మెట్టులోకి, వొచ్చేటప్పుడు సంఘర్షణ, యుద్ధం, జననష్టం తప్పదు.
ఈ విధంగా మానవసంఘం పరిణామం, జరిగేటప్పుడు, ఒక దశకు ఉపయోగపడిన ధర్మాలు, మరొక దశకు పనికి రాకపోవటం సహజమే! ఇందులో ప్రకృతి విరుద్ధంగానీ, వైపరీత్యంగానీ ఏమీలేదు.
నేడు మన పండితుల్లో ఎక్కువమంది, ఈ సత్యాన్ని గ్రహించటంలేదు. ధర్మశాస్త్రాలూ, నీతిశాస్త్రాలూ ఎందుకు పుట్టినయ్యో, వాటి ప్రయోజనం ఏమిటో మరిచిపోయి, తమ స్వార్ధానికీ, పరపీడనకూ ఉపయోగిస్తున్నారు. దీన్నే సుబ్బారావుగారు, ఈ గ్రంథంలో అళీకపాండిత్యం, అనీ ఆత్మౌపమ్య రాహిత్యం అనీ ఉదహరించారు.
అసలు ధర్మం ఎందుకు పుట్టింది? సంఘకళ్యాణం కోసం గదా? నలుగురు కలిసి ‘మనం కొన్ని ధర్మాలను పాటిస్తేగాని, సుఖంగా, ఒడుదుడుకుల్లేకుండా బ్రతకలేం’ అని నిర్ణయించుకొని, తమ సుఖజీవనం కోసం, ధర్మాలను ఏర్పరచుకుంటారు. సంఘం పరిణామం చెంది, ఈ ధర్మాలను ఏర్పరచుకున్న స్తితిని దాటినప్పుడు, ఈ ధర్మాలే - ఒకప్పుడు సంఘానికి శ్రేయస్సును కూర్చిన ఈ ధర్మాలే - అహితాన్ని కలుగజేస్తయ్. అంటే ఈ ధర్మాలన్నీ అధర్మాలవుతాయన్నమాట! అప్పుడు నూతన ధర్మాల అవసరం, సంఘానికి కలుగుతుంది.
ఇప్పుడు ‘అబద్ధం ఆడగూడదు’ అనే ధర్మం ఉందనుకోండి. ఇది చాలా మంచి ధర్మం. సత్యం చెప్పటం చాలా మంచిది. ప్రతివాడూ అబద్ధం ఆడుతూ ఉంటే మానవుల్లో ఒకరిమీద ఒకరికి నమ్మకమే ఉండదు. సుహృద్భావమే నశిస్తుంది. సంఘం అల్లకల్లోలమైపోతుంది. నిజమే! కాని సత్యం చెప్పటం వల్ల ఒక నిరపరాధికి అపకారం మాత్రమే, జరిగేటట్టయితే మాత్రం అసత్యం చెప్పటమే మానవధర్మం అవుతుంది. ఇట్లాగే, అహింస పరమధర్మం. కాని ఒక దుర్మార్గుడు మనలను హింసించటానికి పూనుకున్నప్పుడు మాత్రం. సామదానభేద దండోపాయాల్తో, మనలను కాపాడుకోవటమే పరమధర్మం. “సమచిత హింసన మరయ నహింస” అని కూడా భారతం చెపుతూ ఉంది. ఇంతేకాదు “పరహితము సేయబూనిన పురుషుడు, పాపంబుసేసి పొందడుకీడు” అని కూడా చెపుతూ వుంది.
ఈ అపవాదాలను బట్టి, ధర్మశాస్త్రాలు సంఘ క్షేమం కోసం ఏర్పడ్డవిగాని, పీడనకోసం కాదని మనకు సులభంగా గ్రాహ్యమౌతుంది. మనం ధర్మశాస్త్రాల కోసం పుట్టలేదు. మన కోసం ధర్మ శాస్త్రాలు పుట్టి పై ధర్మానికి దానంతటదానికి విలువలేదు - ఫలితాన్ని బట్టి కలుగుతుంది. ఈ సంగతే ఈ గ్రంథంలో సుబ్బారావుగారు, మిక్కిలి ప్రతిభావంతంగా వ్రాశారు. ఇదెవ్వరూ - సంఘక్షేమం కోరేవారు - కాదనలేని ధర్మం. ఈ ధర్మానికి అపవాదం కూడా లేదు.
“ముందు ఆకలి, తర్వాత ధర్మం" అంటున్నారు సుబ్బారావుగారు. ఇది మహావాక్యం, మానవుడు కొన్నాళ్ళు జీవించి ఉంటేనే ఏదైనా, జీవించటం ముఖ్యం. దీనికి మించిన ధర్మం లేదు. విశ్వామిత్ర మహర్షి కరువులో తిండి దొరక్క మాలపల్లిలో కుక్కమాంసం దొంగిలించి తిని, జీవించాడు. ఇది అధర్మం కాదా అని ప్రశ్నించిన మాలవానికి, “జీవితం మరణా ఛ్రేయో జీవన్ ధర్మమవాప్నుయాత్” అని జవాబు చెప్పాడు. “మరణించటం కంటే, జీవించటం మేలు. జీవించివుంటే, ధర్మం - చెయ్యగలంగాని, మరణించి చేసేదేముంది” అని.
ఇందులో తప్పులేదు - “ప్రాణరక్షణం పరమధర్మం”  కనుక “ముందు మానవులు సలక్షణంగా జీవించే ఏర్పాటు చెయ్యండి. తర్వాత జీవించి ఏంచెయ్యాలో, దేన్ని సాధించాలో, చెప్పండి..” అంటున్నారు సుబ్బారావుగారు. ఆర్థిక సమానత్వం ముందు, ఆధ్యాత్మిక చింతన తర్వాత. అంతేగాని శాస్త్రాల వంకతో మొదలుకే, మోసం తేకండి!. ఈ అభిప్రాయంతోనే వివేకానంద స్వాములు కూడా, “నా దేశంలో ఆకలితో మూలిగే ఒక కుక్కవున్నా, దాని కడుపుచిచ్చు  చల్లార్చటమే నా మతం...” అన్నారు. ఇది గ్రహించక, సంఘానికి ఆర్థిక సౌష్ఠవం ఏర్పడకముందే, ప్రజలందరికీ ఆహారం దొరికే సదుపాయం కలగక ముందే, ఆధ్యాత్మిక చింతనలో, పడటం వల్లే మన దేశానికి ఈ దుర్గతి పట్టిందని నా విశ్వాసం.
ఈ గ్రంథంలో సుబ్బారావుగారు, సాంఘిక ఆర్థిక దృష్టి లోపించటం వల్ల వొచ్చే, శాస్త్ర దాస్యాన్నీ, దానివల్ల కలిగే అగచాట్లనూ, కన్నులకు కట్టినట్లు వర్ణించారు. దీనివల్ల  శాస్త్ర దాస్యాన్ని ప్రచారం చేసే వారిలో, ఏ కొద్దిమందికైనా అనుభవించేవారిలో, ఏ కొద్దిమందికైనా, కనువిప్పు కలిగితే వారు కృతార్థులైనట్లే.
వారు చెప్పినట్లు. ఈ గ్రంథం వ్రాయటానికి కారణం, పెద్దలను తిరస్కరించటం కాదు. పండితులను దూషించటమూ కాదు. సంఘశ్రేయస్సు మాత్రమే....
సంఘహితమే ఆదర్శంగా పెట్టుకున్న, ఈ గ్రంథం ఉత్తమ గ్రంథం - ప్రజల ఆదరాభిమానాలను తప్పక చూరగొంటుంది. వివిధ శాస్త్రావలోకనం చేసి ధర్మాధర్మాలు కుశలాకుశలాలను బట్టి నిర్ణయింపబడతవని, నిరూపించిన సుబ్బారావుగారు ధన్యులు.
శాస్త్రదాస్యం, ఆంధ్రదేశాన్నేకాక, యావద్భారతదేశాన్నీ, పీడిస్తున్న జాడ్యం అవటంవల్ల, ఈ గ్రంథం త్వరలో, ఇతర భాషల్లోకి తర్జుమా కాగలదని ఆశిస్తున్నాను. సంఘ సంస్కర్తలు, ఇందుకు పూనుకోవాలని నా మనవి. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటికే కాలాతీతమైంది. సుబ్బారావుగారి మాటలు వినాలని మీరు చాలా కుతూహలంతో ఉండి ఉంటారు. ఇక నేను నిష్క్రమిస్తున్నాను. అరుగో సుబ్బారావుగారు ప్రవేశిస్తున్నారు.

సూతాశ్రమం
తెనాలి గోపీచంద్

No comments:

Post a Comment