ద్వితీయ భాగం
అసత్య బోధనలు
ఈ విషయములను నీవు తప్పక బోధించుచు, హెచ్చరించవలెను.
‘మన ప్రభువగు ఏసుక్రీస్తు యొక్క యథార్థములగు పలుకులను, దైవభక్తికి అనుకూలమగు బోధనలను అంగీకరింపక వానికి విరుద్ధమగు సిద్ధాంతమును బోధించు ఏ వ్యక్తియైనను జ్ఞానశూన్యుడు, పొగరుబోతు. అట్టి వానికి వాగ్వివాదములయందును, వాగ్యుద్ధముల యందును అభిలాష మెండు. వీని మూలముగ అసూయలు కలహములు, దుషణలు, దుష్ట సందేహములు.’
-- తిమోతి 6..1 – 4
19వ శతాబ్దంలో బానిసత్వం పోవాలనేవారు సరిగానే ఆలోచించినప్పటికీ మత రీత్యా వారి వాదన బలహీనంగా ఉన్నది. 1845లో రిచర్డ్ ఫుల్లర్ చెప్పినట్లు బైబుల్ లోని పాత కొత్త నిబంధనలలో దేవుడు చూపిన మార్గాలు పాపాలు కావడానికి వీలులేదు. రిచర్డ్ ఈ విషయంలో గట్టి ఆధారాలతో ఉన్నారు. క్రైస్తవ మత శాస్త్రం బైబుల్ లోని లోపాలను దిద్దగలిగిన స్థితిలో లేదు.
బానిసత్వం పోవాలనేవారు బైబుల్ నుండే ప్రేరణ పొందారని అనవచ్చు. ఆ మాట నిజమే. బైబుల్ నుండి నైతిక, ప్రేరణాత్మక విషయాలను సమర్థించుకోవడానికి అక్కడక్కడ ఉదహరించిన విషయాలను చూపుతున్నారు. దీనిని బట్టి బైబుల్ ను దైవవాక్యంగా ఆమోదిస్తే కోట్లాది అమాయక స్త్రీ పురుషులను, పిల్లలను బానిసత్వం వైపు దింపడం వారి దృష్టిలో తప్పు కాదు. బైబుల్ బానిసత్వానికి మించి చేసిన సమర్థన అలాంటిది. కొంతమంది బానిసత్వం పోవాలనేవారు బైబుల్ లో కొన్ని భాగాలను ఉదహరిస్తూ మిగిలిన భాగాలు తృణీకరిస్తే బైబుల్ మంచి నీతివంతమైన మార్గదర్శి కాబోదు. మానవుడు నైతిక సమస్యలు పరిష్కరించుకోవడానికి బైబుల్ ను సంప్రదించాలనడం ఉచితం కాదు. బానిసలు కూడా మనవలె మానవులే. వారికీ సుఖదుఃఖాలు ఉంటాయని గ్రహిస్తే, పొలంలో వాడుకునే పనిముట్లువలె వారిని చూడటం మంచిది కాదు. ఈ నిర్ణయానికి రావడం సులభమే అయినప్పటికీ అమెరికాలో పవిత్ర క్రైస్తవులుగా భావించబడుతున్న దక్షిణాది ప్రాంతపు సమాఖ్యవారు తుపాకీలు పట్టుకొని బైబుల్ వాక్యాలను ప్రచారం చేస్తున్నారు.
బైబుల్ పేర్కొన్న పది ఆజ్ఞలు గురించి ఆలోచించాలి. అమెరికాలో చాలామంది వాటిని నైతికంగా, చట్టబద్ధంగా తప్పనిసరి అంటున్నారు. అమెరికా రాజ్యాంగంలో దేవుడు ప్రస్తావన లేదు. రాజ్యాంగం ఏర్పడినప్పుడు అది మతేతర ప్రమాణ పవిత్రంగా భావించారు. కాని క్రైస్తవులు అమెరికాలో యూదు-క్రైస్తవ సూత్రాలపై స్థాపించినట్లు భావిస్తున్నారు. అందుకు మద్దతుగా పది ఆజ్ఞలను చూపుతున్నారు. వాటికి అమెరికా చరిత్రకు పొందిక ఏమిటని పరిశీలించవచ్చు. పది ఆజ్ఞల పట్ల మన గౌరవం యాదృచ్ఛికమైనది కాదని భావించాలి. బైబులులో పది ఆజ్ఞలను సృష్టికర్త స్వయంగా రాసినందున అవి ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్నారు. అలాంటి వాక్యాలు తిరుగులేనివని ఏ భాషలోనైనా ఏ విషయంలోనైనా వాటికి సాటి లేదని అంటున్నారు. అవేమిటంటే –
1. మేము తప్ప మరొక దేవుడు లేడు.
2. దేవుడి పేరిట రూపాలు చిత్రించరాదు.
3. దేవుని పేరును దుర్వినియోగ పరచరాదు.
4. విశ్రాంతి రోజున పవిత్రంగా గడపడం అవసరం.
5. తల్లిదండ్రులను గౌరవించాలి.
6. హత్య చేయరాదు.
7. దొంగతనము చేయరాదు.
8. వ్యభిచరించరాదు.
9. పొరుగువారికి వ్యతిరేకంగా దొంగ సాక్ష్యం చెప్పరాదు.
10. పొరుగువాని ఇంటిని, అతని భార్యను, అతని సేవకులను, అతని పశువులను ఆశించకూడదు.
ఇందులో మొదటి నాలుగు ఆజ్ఞలు నీతికి సంబంధించినవి కావు. యూదులకు, క్రైస్తవులకు సంబంధం లేనివి. హిందుమతం, తదితర మతాల కళలు స్వీకరించి పాటించరాదు. ‘దేవుడు శపించు’గాక అనే మాటలు వాడరాదు. సాబత్ వంటి విశ్రాంతి రోజున పనిచేస్తే మరణ శిక్షకు పాత్రులవుతారు. నాగరికత నిలబెట్టుకోవడానికి ఈ ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యత చెందినవో గమనించండి.
5 నుండి 9 ఆజ్ఞల వరకు నీతికి సంబంధించినవి ఉన్నాయి. ఎంతమంది తమ తల్లిదండ్రులను గౌరవించారో, హత్యలు, వ్యభిచారం, దొంగతనం చేయకుండా ఉన్నారు అనేది ప్రశ్నించదగిన అంశం. చరిత్రలో ఇలాంటి వాటిని అన్ని సమాజ సంస్కృతులు ఖండించాయి. బైబిల్ లో వాటి ప్రస్తావనకు ప్రత్యేకత ఏమీ లేదు. తల్లిదండ్రులను బాగా చూడడం అనేది జీవ సంబంధమైన కారణాలుగా పరిణమించింది. హత్య చేసిన వారిని, వ్యభిచారులను, దొంగలను, అబద్ధాలాడేవారిని ఈసడించుకోవడం సర్వసాధారణం. పవిత్ర గ్రంథాలు రాకముందు నుండి క్రూరత్వాన్ని ఈసడించడం న్యాయబద్ధంగా ఉండాలనడం, నైతిక ఉద్వేగ రీతులుగా వచ్చాయి. మానవులకు ముందు నుండి ఇలాంటి ఉద్వేగాలు ఉన్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఆదిమ మానవులు కూడా పూర్వం తమ సన్నిహితులకు ఆదరణ చూపుతూ హత్యల్ని, దొంగతనాల్ని సహించకుండా గడిపిన సందర్భాలున్నాయి. మోసాన్ని, లైంగిక ద్రోహాన్ని కూడా ఇష్టపడని రీతులున్నాయి. చింపాంజీలలో ఎన్నో క్లిష్టమయిన సామాజిక రీతులున్నాయి. మన బంధువులలో ఎలాంటి ప్రవర్తన కావాలనుకుంటామో అటువంటివి చింపాజీలలో కనిపిస్తాయి. కనుక నీతి సూత్రాలు పాలరాతిపైన చెక్కి చూపినంత మాత్రాన అవన్నీ పవిత్ర గ్రంథాల నుండి వచ్చినట్లు కాదు. ఈ విషయం అమెరికా వారు గ్రహించాలి. సృష్టికర్త పశువులను, సేవకులను పట్టించుకోకుండా పవిత్రగ్రంథాలు ప్రవచించాడనుకుందామా?
బైబుల్ దేవుణ్ణి వాస్తవంగా స్వీకరిస్తే అతడు చెప్పిన ఆజ్ఞలు అనుసరించడానికి అశ్రద్ధ చేయడానికి మానవులకు స్వేచ్ఛ లేదు. శిక్షలు వేసే విషయంలోనూ చూసీ చూడనట్లుగా పోవడం కూడా దేవుడు ఒప్పుకోడు. పది ఆజ్ఞలను ఉల్లంఘిస్తే శిక్షలు తప్పనిసరి అన్నాడు.
పది ఆజ్ఞల నుంచి నీతి విషయంలో మెరుగైనవి మరేవీ లేవనుకుంటే ఇతర పవిత్ర గ్రంథాలలో అలాంటివి ఎన్నో ఉన్నాయి. జైనులలో వీటిని చూడవచ్చు. బైబుల్ వీటిని మించిపోయిన సూత్రాలను జైన మహావీరుడు చెప్పాడు. ‘హాని చేయవద్దు, దూషించవద్దు, అణచివేయవద్దు, అవమానించవద్దు, చిత్రహింసలు పెట్టవద్దు. బానిసలుగా బంధించవద్దు. జీవులను చంపవద్దు.’ బైబిలులో ఈ సూత్రం ఉంటే ప్రపంచం మరో తీరుగా ఉండేదేమో. శతాబ్దాలుగా దేవుళ్ళ పేరుతో క్రైస్తవులు అణచివేశారు. బానిసలను చేశారు, అవమానించారు. చిత్రహింసలు చేశారు. చంపారు. ఇదంతా బైబుల్ చదివి తదనుగుణంగా మతాన్ని కాపాడుతున్నామనుకుని చేసిన పనే. జైన సూత్రాలను పాటిస్తే ఇలాంటివి చేయడం అసంభవం. అటువంటప్పుడు నీతిని గురించి ఎవరూ చెప్పనంతగా బైబుల్ స్పష్టంగా చెప్పిందని ఎవరం అనగలం.
మూలం అనువాదం
శామ్ హారిస్ ఎన్. ఇన్నయ్య
No comments:
Post a Comment