మార్క్సిజందోషపూరితమని రుజువయ్యింది

14 - “శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?”


సమాజ విజ్ఞానం నుంచి మనం చివరి ఉదాహరణ చర్చిద్దాం. సమాజ సిద్ధాంతానికి సంబంధించి మార్క్సిజాన్ని శాస్త్రీయమైందిగా భావిస్తున్నారు. గతి తార్కిక పదార్థవాదం అనే ప్రకృతి సిద్ధాంతం నుంచీ దీని రూపొందించారు. ఈ విధమైన ఆలోచనను తమకాలంలోని వైజ్ఞానిక సామాజిక వాస్తవాల దృష్ట్యా, మార్క్స్, ఏంగిల్స్ లు అనేక సంవత్సరాల కృషితో పెంపొందించారు. వీరిద్దరూ వాస్తవాల విషయంలో విజ్ఞాన ఘనులుగా భావించబడ్డారు. అయితే ఆ వాస్తవాలన్నీ అంత ఉపయోగకరమైనవి కాదు. మార్క్స్, ఏంగిల్స్ లు వైజ్ఞానిక పద్ధతిలో శిక్షణ పొందినవారు కారు. జర్మన్ తత్వవేత్త హెగెల్ ప్రభావం కింద మార్క్స్ ఉన్నారు. కేవల భావం అనే పేరిట గతితార్కికాభివృద్ధి దృష్ట్యా ప్రపంచంలోని భిన్న సంఘటనలను వ్యాఖ్యానించడానికి హెగెల్ పూనుకున్నాడు. హెగెల్ పద్ధతిని అనుసరించి మార్క్స్ కు, ఏంగిల్స్ కు ఉన్న మోజు వల్ల వారు, వారి కాలంలోని పదార్థ విజ్ఞానం, గణితశాస్త్రాన్ని కూడా వక్ర భాష్యంలో చిత్రీకరించారు. కాని గతితార్కిక పదార్థవాదం వంటి దోష పూరితమైన ప్రకృతి సిద్ధాంతం నుంచి సామాజిక సిద్ధాంతాన్ని రూపొందించవచ్చునా లేదా అనే విషయాన్ని అలా ఉంచుదాం. కాని గతి తార్కిక పదార్థవాదం వంటి దోష పూరితమైన ప్రకృతి సిద్ధాంతం నుంచి, రాబట్టిన సామాజిక సిద్ధాంతం ఏదీ కూడా సరైంది కావడానికి వీలులేదు. (సోవియట్ శాస్త్రజ్ఞులూ, విజ్ఞాన తత్వవేత్తలు కూడా గతితార్కిక భౌతిక వాదం పట్ల ఏదో మొక్కుబడిగానే గౌవరం చూపుతున్నారు. సరళమైన విమర్శకు సిడ్నీ హుక్ రాసిన డైలెక్టికల్ మెటీరియలిజం అండ్ సైంట్ ఫిక్ మెథడ్ చూడవచ్చు. ఈ విషయంలో ఐన్ స్టిన్ కూడా తనతో ఏకీభవిస్తున్నట్లు హుక్ పేర్కొన్నారు.) మార్క్సిజం అంచనా వేసిన అనేక ప్రధాన ప్రాతిపదికలు దారుణంగా, దోష పూరితాలని రుజువయ్యాయి. పారిశ్రామికీకరణ పెంపొందే కొద్దీ బూర్జువావర్గం తప్ప సమాజంలో మిగిలిన వారందరిలోనూ పేదరికం ధోరణి పెరిగిపోతుందని మార్క్స్ అంచనా వేశాడు. బూర్జువావర్గం మాత్రం కొద్దిమందే అయినా బాగా సంపన్నులుగా పెరిగి పోతారన్నారు. దీని ఫలితంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలలో కమ్యూనిస్టు విప్లవం వస్తుందని మార్క్స్ అంచనా వేశారు. విప్లవానికి సంరక్షకులుగా కార్మిక వర్గం ముందు నడుస్తుందన్నాడు. కార్మిక వర్గ నియంతృత్వం ద్వారా పెట్టుబడిదారీ వర్గాలకు భిన్నమైన వారికి అధికారం సంక్రమించటానికి విప్లవం తోడ్పడుతుంది. పెట్టుబడిదారులు తప్ప మిగిలిన వారందరూ రాజకీయ ఆర్థిక స్వేచ్ఛను అనుభవించేటట్లు కార్మిక వర్గం జాగ్రత్త వహిస్తుందన్నారు. సంధికాలం అనంతరం (ఇదెంతకాలం ఉంటుందో మార్క్స్ సూచించలేదు. పెట్టుబడిదారీ అవశేషాలు తొలగిపోవటానికి వీలుగా రెండు తరాలు ఉంటుందని అంచనా వేసుకోవచ్చు). రాజ్యం హరించిపోవడానికి నాంది పలుకుతుంది. ఆస్తి యాజమాన్యం ఉన్న వర్గాలంటూ ఏమీ లేవు గనక ఎవరికీ ఒత్తిడి చేయవలసిన పనిలేదు. ఎవరినీ దోపిడీచేసే అవకాశం లేదు.

ఈ అంచనాలన్నీ దోషపూరితమని రుజువయ్యింది. కమ్యూనిస్టులు తొలుత రష్యాలోనూ, తరవాత తూర్పు ఐరోపాలోనూ, పిమ్మట చైనాలోనూ విప్లవాన్ని తెచ్చారు. ఇవన్నీ పారిశ్రామికంగా వెనకబడిన దేశాలే. (చెకోస్లోవేకియా ఇందుకు మినహాయింపు) తూర్పు ఐరోపాలో విప్లవంలాగే ఎక్కడ కూడా కుట్రతో తప్ప మార్క్స్ కలలు గన్నట్లు ప్రజావిప్లవం రాలేదు. పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికాలలాగ ఈ దేశాలు సంపన్నమైనవి కావు. కమ్యూనిస్టేతర దేశాలలో పారిశ్రామికీకరణాభివృద్ధి వల్ల ప్రజలలో పేదరికం పెరగలేదు. పైగా ఆర్థిక సమానత్వాలు తగ్గిపోయి, కార్మికుడు సమాజంలో ఆత్మ గౌరవం గల సభ్యుడుగా ఆదరం పొందాడు. కమ్యూనిస్టు దేశాలలోని కార్మిక నియంతృత్వం. ఇతర నియంతృత్వాలు తగ్గిపోయి, కార్మికుడు సమాజంలో ఆత్మ గౌరవం గల సభ్యుడుగా ఆదరం పొందాడు. ప్రజలపై అధికారం చెలాయించే నియంతృత్వంగా తయారయింది. ప్రజలపై అధికారం చెలాయించగల హక్కు లభించడం, దానిని వీరు ఇష్టం వచ్చినట్లు, అమానుషంగా వాడటం జరిగింది. సోవియటే రష్యాలో మూడు తరాల అనంతరం కూడా నియంతృత్వం పట్టుసడలే ధోరణిగానీ, రాజ్యం హరించుకుపోయే లక్షణాలుగాని కనిపించలేదు. అక్కడ పెట్టుబడిదారీ అవశేషాలు ఏమాత్రం లేవు కూడా. (సోవియట్ యూనియన్ తరవాత విచ్చిన్నమై, కమ్యూనిజం అధికారాన్ని కోల్పోయింది).

జ్యోతిష్యంలాగే మార్క్సిజం కూడా పరీక్షకు గురిఅయ్యే ప్రమాణాన్ని అన్వయించనందున, వైఫల్యాలతో సర్దుకుపోతోంది. ప్రతివైఫల్యానికి ఏదో ఒక సాకు ఉంటుంది. సోషల్ డెమోక్రట్ల విద్రోహచర్య, కార్మిక వర్గ అపరిపక్వత, వామపక్ష సెక్టీరియనిజం మొదలైనవి పేర్కొంటారు. ఇవన్నీ, సంఘటనలు జరిగిపోయిన తరవాత అన్వేషించే సాకులే. సిద్ధాంతం మాత్రం లోగడవలె ఇప్పుడు కూడా నిస్సారమైందే. పదజాలాన్ని మాత్రం సంపన్నం చేశారు. విధేయులుగా ఉండేవారు సంతోషించారు. కృశ్చేవ్ దోషాలను బయటపెట్టినప్పుడూ, మావోదురాక్రమణ చేసినప్పుడూ మూఢ విశ్వాసులమత్తు వదిలిపోయింది. ప్రాపంచిక అనుభవానికీ, విజ్ఞానానికీ మార్క్సిజం పనికిరానిదన్నప్పుడు, పరీక్షించడానికి తగిన ప్రమాణాలు ఈ సిద్ధాంతానికి అన్వయించవనే అర్థం. ఆచరణలో మాత్రం మార్క్సిజం అమానుష, సామాజిక ఫలితాలకు దారితీసింది. చరిత్రలో ఎన్నడూలేనంతగా భారీ ఎత్తున ఈ అమానుష కృత్యాలు జరిగాయి. మానవజాతికి ఇది చాలా ప్రధానమైన విషయం. అయితే మార్క్సిజం యొక్క వైజ్ఞానిక స్థాయిని నిర్ణయించటానికి ఈ విషయాలు సందర్భ సహితాలు కావు.

మానవుడిని గురించి గాని, విశ్వం గురించి గాని ఇదే తుది సత్యమంటూ ప్రజాస్వామ్యం దేనినీ పేర్కొనదు. స్వేచ్ఛ, వ్యక్తి, గౌవరం, మనుషులలోని అంతర్యంలోనూ, పరిసరాల దృష్ట్యా ఎంతతేడా ఉన్నప్పటికీ మానవులందరినీ సమానంగా గుర్తించడం, ఇతరులతో సహకరిస్తూ సంపూర్ణ జీవితాన్ని గడపడం అనేవాటిని ప్రజాస్వామ్యం ప్రధానంగా స్వీకరిస్తుంది. ఇటువంటి విలువలను సాధించడానికి ఉత్తమోత్తమ సామాజిక వ్యవస్థను కనుక్కొనే పంథాను ప్రజాస్వామ్యం నమ్ముతుంది. అటువంటి మార్గం ప్రాపంచికానుభవంతో కూడిందేగాక, తాత్కాలికం కూడా. ప్రతివ్యక్తి కూడా ఈ విలువలను క్రమంగా సాధ్యమైనంత మేరకు సాధించ కుంటూ పోతాడు. అటువంటి సామాజిక క్రమాన్ని సాధించుకోడానికి ఏదీ ఉత్తమ పద్ధతి అని పరిశీలిస్తాడు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది కీలకమైన విలువ. సమాజంలోని వ్యక్తి మాత్రమే స్వేచ్ఛను సాధించగలడు. కనక ప్రజాస్వామ్యం అందరికీ ఓటు హక్కు కోరుతుంది. స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు కావాలంటున్నది. తమ ప్రతినిధులుగా ఉండదగనివారిని అధికారం నుంచి తొలగించే హక్కు వారికి ఉండాలంటుంది. ఆర్థికంగా అసమానత్వాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తే, రాజకీయ సమానత్వం అనేది కేవలం ఆటగామాత్రమే ఉంటుంది. అటువంటప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆర్ధికాధికారాన్ని వికేంద్రీకరించాలని ప్రజలు కోరారు. ఉత్పత్తి సాధనాలను జాతీయం చేయడం ద్వారా దీనిని సాధించవచ్చునని తొలుత భావించారు. ఆర్థిక స్వేచ్ఛను కోరిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గ్రేట్ బ్రిటన్ లో లేబర్ పార్టీని అధికారంలోకి ఎన్నుకోగా, వారు జాతీయీకరణతో ప్రయోగం చేశారు. కాని ప్రజాస్వామిక, కమ్యూనిస్టు దేశాలలో జాతీయీకరణ ప్రయోగం కనువిప్పుకలిగించింది.

జాతీయీకరణకంటే, ఆర్థికరంగాన్ని అదుపులో పెట్టడం వల్ల అనుకున్నవి సాధించవచ్చునని తేలింది. జాతీయకరణ వృధా అనీ, చికాకుకలిగించే పద్ధతి అని రుజువైంది. కమ్యూనిస్టు దేశాలన్నిటిల్లోనూ రాజకీయాధికారానికి ఆర్థికాధికారం తోడు అయింది. జాతీయకరణ వల్ల కలిగిన ఫలితమే ఇదంతా, ఒక పక్కన ప్రభుత్వానికి విపరీతాధికారాలుండగా, మరొక పక్క పౌరడు బానిస స్థాయికి దిగజారాడు. ఈ అనుభవం నుంచి ప్రజాస్వామ్యం గుణపాఠం నేర్చుకుంది. కనుక పిడివాదం లేని పంథాను అనుసరించాలని ప్రజాస్వామ్యం చెబుతుంది. సోషలిజంపై తీవ్రచర్చ జరిగింది. ప్రాశ్చాత్య ప్రపంచంలో ఇది ఇంకా మారు మ్రోగుతూనే ఉంది. దీని ఫలితంగానే 20వ శతాబ్దపు సోషలిజం అనే సిద్ధాంతం వెలువడింది. (సోషలిస్ట్ యూనియన్ ప్రచురించిన ట్వంటియత్ సెంచరీ సోషలిజం చూడండి. పెంగ్విన్ బుక్స్) మార్క్సిజం ఇంకా జాతీయకరణనే పట్టుకువేలాడుతోంది. ముందుగా రూపొందించిన చట్రంలో వాస్తవాలను ఇమడ్చాలని ప్రయత్నిస్తున్నది. అనుభవాన్ని బట్టి సిద్ధాంతాన్ని స్వచ్ఛందంగా మార్చుకోవాలనుకోవడం లేదు.

వైజ్ఞానిక సిద్ధాంతాన్ని అన్వయించడానికి గాను కొన్ని ఉదాహరణలు పరిశీలించాం. ఇది ఇతర విషయాలకు వర్తింపజేయవచ్చు. కులం, ఏకపక్షంగా నిరాయుధీకరణ, సమిష్టివ్యవసాయక్షేత్రాలు, శాంతి ప్రయోజనాల సాధన, పారిశ్రామికీ కరణకు పథకాలు-ఇత్యాదులను పరిశీలించవచ్చు. ఇవన్నీ ఎక్కువ స్వేచ్ఛను, వ్యక్తి సంక్షేమాన్ని కోరేవే. ఇటువంటి ప్రతిపాదనలు చేసిన వారి స్వేచ్ఛను, వ్యక్తి సంక్షేమాన్ని కోరేవే. ఇటువంటి ప్రతిపాదనలు చేసిన వారి ఉద్దేశాలను ప్రశ్నించకుండానే, ఏ మేరకు ప్రయోజనాన్ని సాధించామో పరిశీలించవచ్చు. అలా చేయడానికి గాను అనువైన వాస్తవాలను ఎక్కడ, ఎలా కనుక్కోవడమో వ్యక్తికి తెలియాలి. ఇందుకు తగిన శ్రమ చేయాలి. ఎలాంటి అరమరికలు లేకుండా నిష్పాక్షికంగా అన్వేషణ చేసే ధోరణి అలవరచుకోవాలి. అనేకమంది వ్యక్తులు ఈ విధమైన కృషి చేస్తే తప్ప, ప్రజాస్వామ్యానికీ మానవ విలువలకూ భద్రతలేదు. సంపన్నమైన సుసంఘటిత సమాజాలలోనూ ఇదే పరిస్థితి ఉంది. మనసమాజం సంపన్నమూ కాదు, సుసంఘటితమూ కాదు.
 రచన తెలుగుసేత
    ఎ.బి.షా నరిసెట్టి ఇన్నయ్య

ఎలక్ట్రాన్- దైవం- ఆత్మ

13 - “శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?”



ఎలక్ర్టాన్, దేవుడు అనే భావాలు మరొక ఉదాహరణగా స్వీకరించవచ్చు. ఇవి రెండూ సూటిగా చూడడానికి వీలులేదు. ఎలక్ట్రాన్ చలనాన్ని పరిశీలిస్తున్నామని విజ్ఞానవేత్తలు చెప్పారంటే ఆటలో బంతిని గమనించినట్లు ఇది గూడా చూశారని భావించరాదు. గ్యాస్ లో రేణువులు ఒకానొక మార్గంలో ఉన్నప్పుడు, ఎలక్ర్టాన్ నుంచి శక్తిని పొంది, విజ్ఞానం పేర్కొనే నియమాలననుసరించి కాంతి కిరణాలను ప్రసరిస్తాయి. విజ్ఞానవేత్తలు గమనించేది ఈ కాంతి మార్గాన్నే. ఆ మార్గాన ఎలక్ట్రాన్ పయనించినట్లు విజ్ఞాన వేత్త గ్రహిస్తాడు. మనం చూడని ఎడ్లబండి రోడ్డు మీద వెళ్ళిపోయిన తరవాత ఆ దారిన పడిన గుర్తులనుబట్టి ఎడ్లబండిగాక, ఇంకేవీ వెళ్ళలేదని తెలుసుకుంటాం. పైగా ఎంతదూరం అలా వెళ్ళింది గమనించవచ్చు కూడా. ఇదంతా మనం చూడని ఎడ్లబండి వెళ్ళిపోయిన తరవాత చెబుతున్న మాటలే. పైన చెప్పిన ఆవిరిలో ఎలక్ర్టాన్ మార్గం కూడా ఇలాంటిదే. ఎలక్ర్టాన్ పరిమాణం మనం సూటిగా చూడటానికి వీలులేనంత చిన్నది. కాని దాని చలనాన్ని అంచనా వేయవచ్చు. వెలిగిన మార్గానికి మరొక కారణం లేదనికూడా చూపవచ్చు. కనకనే ఆ మార్గాన ఎలక్ట్రాన్ పయనించినట్లు నిర్ధారణగా చెప్పవచ్చు. బంతి పోవడానికీ, ఎడ్లబండి వెళ్ళిపో వడానికీ, తేడా ఉంది. ఎలక్ర్టాన్ వెళ్ళిన తరవాత కాంతి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. గాలిలో రేణువులు ఎలక్ట్రాన్ వల్ల ప్రకంపించి నందువల్ల మనకు వెలుగురావడం లేదు. ఎలక్ర్టాన్ తన శక్తిని వాటికి ఇవ్వడం వల్లనే వెలుగువస్తుంది

అయినప్పటికీ ఎలక్ట్రాన్ వైజ్ఞానిక భావన అంటున్నాం. మేధస్సుతో అవగాహన చేసుకునే భావన ఇది. ప్రాపంచిక విధానాలకు చెందేతీరు ఇందులో ఉంది. దీనికి కొంత ద్రవ్యరాశి, పరిమాణం చేర్చవచ్చు. దీని ప్రవర్తనకు సంబంధించిన నియమాలను రూపొందించవచ్చు. ఈ కార్యకారణ విధానంలో సాక్షి వంటి పరిశీలకుడు ఎవరూ అవసరం లేదు. ఎలక్ర్టాన్ ప్రాపంచిక అనుభవరీత్యా వాస్తవమైనది. ఎలక్ర్టాన్ ప్రవర్తనను పరిశీలించేవాడు ఎప్పుడు ఎక్కడ ఉన్నాడనే దానితో నిమిత్తం లేకుండా, అది స్వతంత్రంగా కాల ప్రదేశాలలో ఉన్నది.

దైవ భావన విషయంలో ఇదే సూత్రం అన్వయించదు. దేవుడు తప్పనిసరిగా ఉంటాడనుకొంటే, దేవునికి నియమాలను ఏర్పరచడం సాధ్యపడదు. పరిశీలకునితో నిమిత్తం లేకుండా, కాల-ప్రదేశాలలో ప్రాపంచిక అనుభవ విషయంగా చూసేటందుకు వీలులేని విషయమిది. దైవభావన విజ్ఞాన పూరితంకాదు. ప్రాపంచిక వాస్తవానికి చెందని విషయమిది. మానవుడు, ప్రకృతి గురించి విజ్ఞానం చెపుతున్న దాన్నిబట్టి చూస్తే దైవానికి అంటగట్టే లక్షణాలు అనవసరమనీ లేదా, అశాస్త్రీయమని అనిపిస్తున్నది. దైవం విషయంలో లాగే, ఆత్మ భావనలో కూడా ఇటువంటి వాదమే చెల్లుతుంది.

      రచన తెలుగుసేత
        ఎ.బి.షా నరిసెట్టి ఇన్నయ్య

జ్యోతిష్యం అశాస్త్రీయమే కాదు. విజ్ఞాన వ్యతిరేకం కూడా

12 - “శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?”

తన పరిధిలో పరిశీలనకు వచ్చిన వాస్తవాలను సంతృప్తికరంగా వివరించకపోతే వైజ్ఞానిక సిద్ధాంతం ఏదీ కూడా అట్టేకాలం నిలబడదు. కాని విజ్ఞాన చరిత్ర నిండా ఉత్తరోత్తరా దోషాలని రుజువైన సిద్ధాంతాలు లేకపోలేదు. న్యూటన్ పేర్కొన్న వెలుగుకణ సిద్ధాంతం ఇందులో ఒకటి. ఇంత మాత్రానే విజ్ఞాన స్థాయికి భంగం వాటిల్లదు. మనో విశ్లేషణవంటి అన్వేషణారంగాలనేకం ఉన్నాయి. వాటిలో సర్వసాధారణంగా ఆమోదించే వైజ్ఞానిక సిద్ధాంతం ఇంకా రావలసి ఉంది. అంటే మనో విశ్లేషణ ఉబుసుపోక అనుకోరాదు. చాలా ఆసక్తికరమైన, ఉపయోకరమైనకృషి ఈ రంగంలో జరిగింది. అనేక సందర్భాలలో ఈ పద్ధతి ప్రయోగించే చికిత్సా విధానాలను చూస్తుంటే దీనిని తేలికగా కొట్టిపారేయడానికి వీల్లేదు. అయినప్పటికీ ఆ సిద్ధాంతంగా పేర్కొన్న దానిలో అద్భుతమైన అంతర్ దృష్టి కనిపిస్తున్నదేగాని, కీలకమైన పరీక్షకు గురికాలేదు. విజ్ఞాన సిద్ధాంతంగా ఆవిర్భవించడానికి మనో విశ్లేషణ అన్వయించే పద్ధతులు, ఉద్దేశాలు ఉన్నాయికూడా. దీనికి వ్యతిరేకంగా వ్యవస్థాపితమైఉన్న సిద్ధాంతం ఏదీ లేదు. అందు వల్లనే, మనో విశ్లేషణ రానురాను విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందవచ్చు. ఆ లక్ష్యం చేరుకోడానికి ఎంతో దూరం పయనించవలసి రావచ్చు.

మరో విధమైన సిద్ధాంతాలు కూడా ఇక్కడ చర్చించబోతున్నాం. వాటిలో పరిమితంగా ప్రాపంచికానుభవ సత్యం కొంతమేరకు ఉన్న సందర్భాలు లేకపోలేదు. అయినా అవి విజ్ఞానపరంగా లేవు. ఈ సిద్ధాంతాలు ప్రతిపాదించే వాటిననుసరించి, అందులో ఇమిడి ఉన్నవాటిని పరోక్షంగానైనా రుజువుపరచవీల్లేదు. అదే రంగంలో విజయవంతంగా పనిచేస్తున్న వైజ్ఞానిక సిద్ధాంతాలలో పెసగకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. పైగా అటువంటి విజ్ఞాన-విజ్ఞానేతర సిద్ధాంతాలను (ఒకే రంగంలో) కొన్నింటిని చూద్దాం.

ఖగోళం-జ్యోతిష్యం

ఈ రెండూ మానవుడు చిరకాలంగా పరిశీలిస్తున్న ఆకాశానికి చెందినవే. ఆకాశంలో ఒకే తీరుగా చలిస్తున్నవాటిని, అందుకు సంబంధించిన భౌతిక సంఘటనలను మానవుడు పరిశీలిస్తున్నాడు. ఆధునిక విజ్ఞానం ఆవిర్భవించేటంత వరకూ జ్యోతిష్యం-ఖగోళ శాస్త్రం భిన్నమైనవని భావించనేలేదు. మానవ వ్యవహారాలకు ఖగోళ విషయాలను అన్వయిస్తే జ్యోతిష్యం అవుతుంది. మానవుడి వ్యవహారాలకు ఖగోళ విషయాలను అన్వయిస్తే జ్యోతిష్యం అవుతుంది. ప్రతి నక్షత్రం, ప్రతి గ్రహానికి కూడా ఒక దేవత ఉంటుందనీ, ఆ దేవత మానవుడి వ్యవహారాలలో ఆసక్తి చూపడమేగాక, ప్రభావితం చేస్తుందని భావించారు. గ్రహాల చలన నియమాలను కనుక్కొన్న కెప్లర్ సైతం జ్యోతిష్యంలో నమ్మకం గలవాడే. అతడి సమకాలీనులకు ఈ ధోరణిలో దోషం కనిపించలేదు. ఆకాశంలోని ఈ నక్షత్రాలు, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకున్న తరవాత, సామాజిక సంస్థలు పనిచేసే తీరు, మానవుడి శారీరక మానసిక రీతుల గురించి తగినంతగా తెలిసిన అనంతరం, గడ్డినుంచి గింజలు వేరు చేయడానికి వీలుచిక్కింది. ఖగోళశాస్త్రం విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందింది. మానవుడిపై గ్రహాల, నక్షత్రాల ప్రభావం ఉంటుందనే జ్యోతిష్యం విజ్ఞానపరంగా అపఖ్యాతి పాలైంది. ఇది అవగాహన చేసుకోవడం సులభమే. ప్రతిపాదన చేసిరాబట్టే నిర్మాణం ఖగోళంలో ఉంది. అనేక పరిశీలనాంశాలకు స్పష్టమైన వివరణలను ఖగోళ శాస్త్రం ఇస్తోంది. పరీక్షకు తట్టుకొనే ప్రమాణానికి నిలబడకలుగుతోంది. ఇందుకు భిన్నంగా, జ్యోతిష్యంలోని మూల సూత్రం దోషపూరితమైంది. నక్షత్రాలకు, గ్రహాలకు అంటి పెట్టుకొని దేవతలు అనేవారెవరూ లేరు. ఆకాశంలోగాని భూమిపైన గాని ఎక్కడా అలాంటి వారు లేరు కనక వారు మానవుడి వ్యవహారంలో ఆసక్తి చూపే ప్రశ్నేరాదు. జ్యోతిష్యం అశాస్త్రీయం. మనకు గల ప్రత్యక్షజ్ఞానానికి, వ్యవస్థాపిత సిద్ధాంతాలకు పొసగకుండా జ్యోతిషం ఉంది. జ్యోతిష్యం అశాస్త్రీయమే కాదు. విజ్ఞాన వ్యతిరేకం కూడా, జ్యోతిష్యంలో లాగే, యోగసిద్ధాంతం వంటి వాటిల్లోనూ ఇలాంటి విజ్ఞాన వ్యతిరేక ధోరణి ఉంది. విజ్ఞానం రుజువు పరచిన నియమాలను పాటించకుండా, గతం, వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించి జ్ఞానాన్ని మానవుడు యోగం ద్వారా సిద్ధింపజేసుకోవచ్చుననటం వాస్తవ వ్యతిరేకమే.

ఆలోపతి-ఆయుర్వేదం

అలోపతి-ఆయుర్వేద వైద్యరంగాలలోనూ ఇటువంటి విచక్షణే చేయవలసి ఉంది. అనుభవం, పరిశీలన ఆధారంగా ఆయుర్వేదం అనేక ప్రాపంచిక విషయాలను చిలికించింది. జ్యోతిష్యం లాగ కాక ఆయుర్వేదంలో రోగ నిర్ణయానికీ, చికిత్సకూ సంబంధించి విజ్ఞాన సిద్ధాంతాన్ని ఏర్పరచడానికీ వీలుగా ఆధారం ఉంది. అయితే ఆయుర్వేదం ఇంకా విజ్ఞాన సిద్ధాంతంగా పెంపొందలేదు. వాత, పిత్త, కఫం అనే ప్రతిపాదనలుగానీ, రస, కామ, రక్త, మాంస, మేధ, అస్తి, మజ్జ, శుక్ర అనే ఏడు సారాంశాల విషయంగానీ, ఆధునిక శారీరక శాస్త్రం కనుక్కొన్న వాటితో సరిపోవడం లేదు. ఈ విధంగా ప్రత్యక్షంగా వ్యవస్థాపితమైన జ్ఞానంతో పొందికగా లేకపోవడం వల్ల ఆధునిక విజ్ఞానానికి ఆయుర్వేదం ఆమోద యోగ్యం కాదు.

ఆయుర్వేదానికి భిన్నంగా ఆలోపతి సిద్ధాంతం ప్రత్యక్షపరిశీలనపై ఆధారపడి ఉంది. మానవుని శరీరంలో ఏది ఎలా పనిచేస్తుందో గమనించారు. ఇది ఒకవేళ అసంపూర్తిగా ఉన్నప్పటికీ ప్రశ్నించటానికి వీలులేని వాస్తవాల నాధారం చేసుకొని గట్టి ప్రాతిపదికలు చేసింది. ఆధునిక వైద్య శాస్త్రంలో కొన్ని రోగాలకు మాత్రమే నిర్దిష్టంగా చికిత్సలు కనుక్కొన్నారు. కాని రోగ నిర్ణయం మాత్రం తిరుగులేనిది. కాన్సర్ (పుట్టుకురుపు) ఎలా పెంపొందుతుందో, దీనిని ఎలా నయం చేయాలో ఇంకా తెలియదు. తొలిదశలో కనుక్కొంటే మాత్రం నయం చేయగలుగుతున్నారు. మధుమేహం, చలిజ్వరం, ప్లేగు, సన్నిపాతజ్వరం, కలరా, రక్తపుష్ఠి లేకపోవటం, నంజువ్యాధి, ఎముకలు సరిగ్గా ఎదగకపోవటం ఇత్యాదుల విషయంలో వివరాలతో సహా రోగనిర్ణయం తెలుసు. వీటిలో కొన్నిటికి ఆయుర్వేదం చికిత్స చేసి ఫలితాలు సాధిస్తున్నది. అయితే ఈ రోగాలకు చెప్పే కారణాలు, ఎలా నయమవుతున్నాయో వివరించే విధానం కృత్రిమంగానూ, దోష పూరితంగానూ ఉన్నాయి.

   రచన తెలుగుసేత
         ఎ.బి.షా నరిసెట్టి ఇన్నయ్య


వైజ్ఞానిక పద్ధతి - పరీక్షకు నిలబడటంతుదిఘట్టం

11 - “శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?”



అంచనావేసే శక్తి ఉంటేగాని పరీక్షకు నిలబడటం సాధ్యం కాదు. అంచనా అనేది తుదిఘట్టం. కీలకమైన పరీక్షలో విఫలమైతే ప్రతిపాదనతో పొందికగా ఉన్న ఇతర విషయాలను చూసి సరిపెట్టుకోడానికి వీల్లేదు. పరీక్షకు అర్థాన్ని గమనిస్తే ఇటువంటి సందర్భాలలో రాశివిధానాలు (Quantitative Methods) చాలా ఫలవంతంగా ఉన్నట్లు గమనించవచ్చు. అయితే పరీక్ష నిమిత్తం, వైజ్ఞానిక స్థాయి కోసం, రాశి విధానాలనేవి తార్కిక విశ్లేషణకు, నిగమన పద్ధతులకు పనికి వచ్చే మేరకే స్వీకరిస్తాయి. ఉదాహరణకు, మేఘాలు ఏర్పడే విషయమై ప్రతిపాదనలు, అలోపతి వైద్యం ప్రకారం రోగకారణాలు, నయం చేసే రీతులలో రాశివిధానాల ప్రయోజనం అట్టేలేదు. అయినప్పటికీ వైజ్ఞానిక ప్రమాణాన్ని, పరీక్షకు నిలబడటాన్ని సంతృప్తి పరచడం వల్ల అవి కూడా వైజ్ఞానికాలే.

అంచనా వేయడంలో నిర్ధిష్టంగా ఉండడానికి, ప్రతిపాదనలో ఇమిడి ఉన్న విషయాలను ఇంకా సునిశితంగా పరిశీలించడానికి రాశిపద్ధతులు ఉపయోగపడే మాట నిజమే. కాని ఒకానొక సిద్ధాంతం విజ్ఞానయుతం గావడానికి దాని తార్కిక నిర్మాణం, దానికే ప్రపంచానుభవంతో కూడిన వాస్తవాలకూ గల సంబంధం ముఖ్యం. ఇదంతా గణితపద్ధతులలో ఉన్నా లేకున్నా ఫరవాలేదు. అంతవరకూ వస్తున్న నమూనారీతులన్నీ ఇదే విధంగా ఉన్నాయి. ఒక ప్రతిపాదన చేయడం అందులో ఇమిడి ఉన్న విషయాలను నిగమన తర్కంలో ఉన్నాయోలేదో చూడడం, తరవాత పరిశీలిస్తూ పరీక్షకు గురికావించడం జరగాలి. దీనిలో ఇమిడి ఉన్నవన్నీ సరిపోతే, సిద్ధాంతానికి (తార్కికంగా) అందరూ ఆమోదిస్తారు. (ఇది కచ్చితంగా సరైందనలేం. కొన్ని సందర్భాలలో అంచనాలు విఫలమైనప్పటికీ, వ్యవస్థాపిత సిద్ధాంతాన్ని అట్టిపెడతారు. కలవరపెడుతున్న విషయాన్ని భవిష్యత్తు కనుక్కోవచ్చుననే ఆశతో ఇలా చేస్తారు. యురేనస్ గ్రహం విషయంలో ఇంతే జరిగింది. సిద్ధాంతం ఏ మేరకు సఫలమైందనే దాన్ని బట్టి, అంచనా విఫలమై సిద్ధాంతం కూడా విఫలమైనట్లు పరిగణించే పరిస్థితి వస్తుంది).
వైజ్ఞానిక నిర్మాణ నమూనాను ప్రతిపాదన-నిగమన నమూనా అంటారు. విషయం ఏదైనా అన్ని విజ్ఞాన సిద్ధాంతాలకు ఈ నమూనా సర్వసాధారణంగా ఉంటుంది. ఆర్థిక, నైతిక, రాజకీయ విషయాలలో ఈ పద్ధతి అంతగా అన్వయించలేకపోడానికి సాంఘిక శాస్త్రాలలో మార్పులే కారణం. మానవేచ్చ పనిచేయడంతో నిర్దిష్టంగా అంచనావేయడం సాధ్యపడటం లేదు. పరిమితంగా తప్ప, గణిత విధానాలు అన్వయించడం కూడా కుదరడం లేదు. మానవ ప్రవర్తన అధ్యయనానికి సైతం అన్వయించగల స్థాయికి గణితం ఇప్పుడే చేరుకుంటున్నది. సాంఘిక శాస్త్రాలలో అగ్రగణ్యం ఉన్న ఆర్థిక శాస్త్రం వంటివాటికి వైజ్ఞానిక పద్ధతులు అన్వయిద్దామనుకున్నప్పటి ఆగమన పద్ధతి ప్రాధాన్యం ఒక శతాబ్దం నుంచే గుర్తించడం జరిగింది. సామాజిక రాజకీయ శాస్త్రాలలో ఈ పద్ధతి ఇప్పుడిప్పుడే వస్తున్నది. నైతికశాస్త్రంలో ఇది మొదలు కాలేదు. కనక సాంఘిక శాస్త్రాలు ప్రతిపాదన-నిగమన నమూనాను చెప్పుకోదగినంతగా అన్వయించలేదు. సాంఘిక శాస్త్రాలలో ఆగమన ప్రాతిపదికలు సరిగా ఉన్నచోట, సిద్ధాంత ప్రతిపాదనలు, వైజ్ఞానిక సిద్ధాంతంగా ఉంటాయి. అంటే రూపొందించిన సిద్ధాంతాలు నిజమా, అబద్దమా అంటే, పరీక్షా ప్రమాణాన్ని బట్టి ఉంటుంది. అయితే సిద్ధాంత నిర్మాణం మాత్రం దెబ్బతినదు.
విజ్ఞాన సత్యం సంభావ్యమే

విజ్ఞాన సిద్ధాంతాన్ని గురించి ఇంతవరకు జరిపిన చర్చవల్ల లోగడ చెప్పని విజ్ఞానసత్యం ఒకటి తెలుస్తోంది. విజ్ఞానం నిర్మాణంలో వివేచనాత్మకమనీ, విషయంలో ప్రపంచానుభవం గలదనీ, మతరహిత స్వభావంతో కూడినదనీ పరిశీలించాం. విషయపరంగా ప్రపంచానుభవంతో కూడినదంటే, ఇందలి సత్యం సంభావ్యమనీ, కచ్చితంకాదనీ అర్థం, కేవల వివేచనా లేదా, అంతర్భుద్ధి వల్ల వెల్లడించే సత్యాల వంటిది కాదన్నమాట. మార్మికవాదిగాని కేవలం వివేచనాత్మకుడుగాని పెర్కొనే సత్యంకంటే, విజ్ఞానపరమైన సత్యం తక్కువ అని అనుకోరాదు. ఈ రెండు సందర్భాలలోనూ సత్యం అనే పదాన్ని వివరణ లేకుండా వాడితే తప్పుదారిన పట్టించినట్లవుతుంది. మార్మికుని సత్యం ప్రకారం ప్రపంచానుభవంతో సరిపోయినా, లేకున్నా ఫరవాలేదు. కేవల హేతువాది చెప్పే సత్యం ప్రాయికంగా ఒకప్రతిపాదన స్వభావం గలది మాత్రమే. కనక ఇందులో నిర్ధారణ భిన్న రంగానికి చెందినది.

సత్యం అనే పదాన్ని రెండు భిన్నమైన అర్ధాలలో వాడుతున్నారు. ఒకానొక ప్రకటన సత్యమైనదంటే, అర్థం ఏదైనా కావచ్చు.

1. లోగడ పేర్కొన్న ప్రతిపాదన తాత్కాలికంగా సత్యమైనదిగా భావిస్తుంటే అందులోంచి సత్యాన్ని సరిగ్గా రాబట్టడం జరగవచ్చు.
2. ప్రపంచరీతిని సరిగా చిత్రించవచ్చు.
మొదటి ప్రకటన తార్కికంగా సత్యమైంది. కనక తార్కికంగా సరైందనవచ్చు. సత్యం అంటే ఇక్కడ తార్కికంగా సరిపడినదన్న మాట. రెండోది ప్రాపంచికాను భవం దృష్ట్యా వాస్తవం. ఒకో పర్యాయం ఒక ప్రకటన తార్కికంగా సరైంది కావచ్చు. ప్రాపంచికానుభవంలోనూ సరైందికావచ్చు. లేదా రెండింటిలో ఏదో ఒకదానికే చెందవచ్చు. ఈ విషయం సాధ్యమవడానికి ఉదాహరణలు చూద్దాం.
                                                                             బి
1.   మనిషి నాలుగు కాళ్ళతో ఉంటాడు.             1. కనక నాకు నాలుగు కాళ్ళున్నాయి.
2.   నీరు రాయికంటే భారమైంది.                      2. కనక రాయి నీటిలో మునుగుతుంది.
3.   రోమ్ కు ఉత్తరదిశగా లండన్ ఉంది.            3. కనక రోమ్ కంటే లండన్ చల్లగా ఉంటుంది.
4.   నీరు గాలికంటే తేలిక.                                 4. కనక రాయి నీటిలో తేలుతుంది.
పై ప్రకటనలన్నింటిల్లోనూ, మొదటి భాగం ప్రతిపాదనకాగా, రెండో భాగం దాని నుంచి వచ్చిన నిర్ణయం. ఈ నిర్ణయాలను పరిశీలిద్దాం.
1    బి) తార్కికంగా సరైందే, ప్రపంచ అనుభవంలో తప్పు.
2    బి) తార్కికంగా చెల్లదు. ప్రపంచంలో వాస్తవమే.
3    బి) తార్కికంగా సరైంది. ప్రపంచంలోనూ వాస్తవమే.
4    బి) తార్కికంగా చెల్లదు. అనుభవంలో దోషపూరితం.

ఈ ఉదాహరణ వల్ల, తార్కికంగా సరిగా ఉండడం, ప్రపంచ సత్యం అనేవి స్వతంత్ర ప్రతిపాదనలని గ్రహించవచ్చు.
పూర్వాపర సంబంధాలను బట్టి తర్కం నిర్ధారణ అవుతుంది. ప్రపంచానుభవం అనేది వాస్తవాన్ని బట్టి ఉంటుంది. తర్కంలో ఒక ప్రకటన చెల్లడమో, చెల్లకపోవడమో తప్ప, మధ్యే మార్గంలేదు. తార్కికంగా సరైన ప్రతిపాదనలోని సత్యం ఎంత నిర్ధారితమైనదో, తార్కికంగా చెల్లని ప్రతిపాదనకూడా అంతే నిర్ధారణతో కూడింది. ప్రపంచానుభవంతో కూడిన సత్యంలో వాస్తవాలు రెండు విషయాలపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు వర్షం కురుస్తున్నది అనే ప్రతిపాదనలో వాస్తవమో, అసత్యమోతప్ప, సందేహానికి చోటు లేదు. కాని, హంసలు తెల్లనివి అంటూ ఒక సర్వ సాధారణ ప్రతిపాదన చేసినప్పుడు, ఇందలి సత్యం కచ్చితమని చెప్పజాలం. అన్ని హంసలనూ పరిశీలించే వీలులేదు. గనక ఇలా చెప్పజాలం. భవిష్యత్తులో రానున్న హంసల విషయం పరిశీలించడం అసలే సాధ్యపడదు. కనక అటువంటి ప్రతిపాదన కొన్నిటికే పరిమితం. ఆ మేరకు ఈ ప్రతిపాదనలోని సత్యం నిర్ధారితం కాదు. ఇదంతా కేవలం కోడి గుడ్డుపై వెంట్రుకలు లెక్కించడం వంటిదేమీ కాదు. ఇటీవలే ఆస్ట్రేలియాలో ఒక నల్లని హంసను చూశారు కూడా.

సర్వ సాధారణమైన ఇలాంటి ప్రతిపాదనల మాట అలా ఉంచి, విజ్ఞాన సిద్ధాంతంలో ఒకే ఒక ప్రతిపాదన సైతం సంభావ్యంగానే భావించాలి. అలాంటి ప్రతిపాదనలు సైతం సాధారణ సత్యాలుగా భావించే వాటి నుంచి రాబట్టినవేగదా. ప్రతిపాదనలలో భావనలు, సంబంధాలుకూడా ఇమిడి ఉంటే, పరిశీలించదగిన ప్రాపంచిక విషయాలు ఉంటే, పరిమిత సంఖ్యకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వాటికి సంబంధించిన సత్యం అసంపూర్తి సాక్ష్యాధారాలపైనే ఉంటుంది. అటువంటి వాటి నుంచి రాబట్టిన ఏ ప్రతిపాదన అయినా నిర్ధారితంగా ఉండదు. నిగమనం అంటే సర్వసాధారణత్వం నుంచి ఒకానొక ప్రతిపాదనకు దారితీసే పద్దతే గదా.
మేదస్సు అవగాహనతో కూడిన భావనలపై ఆధారపడి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఈ పరిస్థితిలో మెరుగు ఉండదు. ఇమిడి ఉన్న వాటన్నిటినీ పూర్తిగా పరిశీలించినప్పటికీ అది ప్రాపంచికానుభవం సత్యంగా గాక, ప్రతిపాదనల సంభావ్యతనే సూచిస్తుంది. కొన్ని ప్రతిపాదనలు ఒక గణిత సిద్ధాంతాన్ని నిర్ధారించ వచ్చు. అయితే సిద్ధాంతం మాత్రం ప్రతిపాదనలను రుజువు చేయలేక పోవచ్చు. భిన్న ప్రతిపాదనల నుంచి తార్కికంగా సిద్ధాంతాలను నిర్దిష్టంగా రాబట్టవచ్చు. ప్రతి పాదనలలోని సత్యాన్ని సిద్ధాంతాలలో ఇమిడి ఉన్న వాటికి అన్వయించవచ్చు. ఇమిడి ఉన్నవాటి సత్యం ఆధారంగా ప్రతిపాదనలు నిర్ధారితాలని చెప్పజాలం. దీనిని బట్టి తేలేదేమంటే మేధస్సు భావనల ఆధారంగా ఏర్పడిన వైజ్ఞానిక సిద్ధాంతం, అందుకు సంబంధించిన ప్రాపంచికానుభవ సత్యం కూడా సంభావ్యంగానే నిలుస్తాయి. నైరూప్యతకూ వీటికీ తేడా ఉంది. మేథోభావనలకు సరిపడే ప్రాపంచిక పరిశీలక విషయాలు లేవు. ఇక్కడే చిక్కులో ప్రవేశిస్తున్నాం. విజ్ఞానం అభివృద్ధిచెందే కోద్దీ తార్కికంగా కచ్చితమయిన సిద్ధాంతంలో సత్యం తగ్గిపోతున్నదన్నమాట. కేవలం వివేచనాత్మక పద్దతిలో ఇటువంటి చిక్కులేదు. అటువంటి పద్ధతిలో ఆద్యంతాలు తర్కం పైన ఆధారపడడాన్ని చూడొచ్చు.
ఈ స్థితిలో వైజ్ఞానిక సత్యాన్ని గురించి పరిశీలించదగిన అంశం మరొకటి ఉంది. ఒక సిద్ధాంతం స్థానంలో మరొకటి చోటు చేసుకున్నప్పుడు, తొలుత ఉన్న సిద్ధాంతాన్ని ఉత్తరోత్తరా వచ్చిన సిద్ధాంతం స్వీకరించినట్లే. ఐన్ స్టీన్ సిద్ధాంతం సంప్రదాయ పదార్థ విజ్ఞానాన్ని స్వీకరించింది. అయితే సంప్రదాయ పదార్థ విజ్ఞానం పేర్కొన్న ప్రపంచ దృక్పథం దోషపూరితమని, ఆధునిక పదార్థ విజ్ఞానం చూపింది. అయితే వీటిలో ఏది సరైంది. అని ప్రశ్నించడం సబబే, ఉజ్జాయింపుగా వాస్తవం అనడానికీ, దోషపూరితం అనడానికీ చాలా తేడా ఉంది. కానీ రెండూ విభిన్న విషయాలకు సంబంధించినవని తెలిస్తే చిక్కువిడిపోతుంది. న్యూటన్ సిద్ధాంతం ఐన్ స్టిన్ సిద్ధాంతానికి సన్నిహితమైనదంటే సంప్రదాయ పదార్థ విజ్ఞానం నుంచి రాబట్టిన గణితాన్నే దృష్టిలో పెట్టుకున్నారు.
గ్రహచలనానికి చెందిన కెప్లర్ నియమాలు ఒక ఉదాహరణగా చూపవచ్చు. సాపేక్షతా, సిద్ధాంతంలోని గణితసూత్రాలలో కెప్లర్ నియమాలు ఉన్నాయి. పరిశీలించే వస్తువుకు సంబంధించి, పరిశీలకుడి గమనవేగాన్ని గ్రహించకపోవడంలోనే ఈ సన్నిహితత్వం ఉంది. ఏ సిద్ధాంతమైనా కొంత కాలం నిలబడాలంటే, దాని అంచనాలు సరిగా ఉండాలి. చాలా సందర్భాలలో ఇలానే జరుగుతుంది.

ఒకానొక గణిత సిద్ధాంతాన్ని రాబట్టడానికి అనేక ప్రతిపాదనలు ఉపకరించవచ్చు. పూర్వ ప్రతిపాదన వల్లనే ఉత్తరోత్తరావచ్చే ఫలితం ఉండకపోవచ్చు. ఒక సిద్ధాంతం మరొక సాధారణ సిద్ధాంతంలో కలిసినప్పుడే అది పెంపొందే అవకాశం లభించవచ్చు. లోగడ సిద్ధాంతంతో పోల్చి చూస్తే, సాధారణ సిద్ధాంత ప్రతిపాదనలు భిన్నమైనవికావచ్చు. తొలి సిద్ధాంతానికి చెందిన గణిత అంచనాలు కొత్త ప్రతిపాదనలో వాస్తవాలుగా కొనసాగవచ్చు. అప్పుడు తొలుతఉన్న ప్రపంచ దృక్పథం తనవిలువను కోల్పోతుంది. కొత్త సిద్ధాంతం సమర్పించే దృక్పథంలో పాత అంతా కలిసిపోతుంది. సంప్రదాయస్థితి నుంచి ఆధునిక స్థాయికి పెంపొందిన పదార్థ విధానంలో ఇదే జరిగింది. అందుకే నేటికీ న్యూటన్ పదార్థ విజ్ఞానాన్ని రోడ్లు, వంతెనల నిర్మాణంలో, విద్యుత్తును ఉత్పత్తి చేసి, పంపిణీ చేయడంలో,  మోటార్లు తయారు చేయడంలో ఇంకా అనేక విషయాలలో వాడుతున్నాం. వాటిని ఆధునిక విజ్ఞానానికి సమీపంలో ఉన్న సూత్రాలుగా భావించడమే. ఇందుకు దోహదం చేసింది. ఇవన్నీ ప్రాపంచికరీతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇందులో దోషాలు ఏమంత పట్టించుకోదగినవి కావు. అయితే న్యూటన్ పదార్థ విధానం భౌతిక విశ్వాసానికి సంబంధించిన మౌలిక విషయాలగురించి సరిగ్గా చెప్పిందని మాత్రం ఒప్పుకోవడం లేదు. విశ్వంలో ప్రతి సంఘటనకూడా మరో సంఘటనతో కార్యకారణ సంబంధంతో ఉందని  ఇప్పుడు ఒప్పుకోలేం. దూరాన్ని కొలవాలంటే కాలవ్యవధితో నిమిత్తం లేదనేది కూడా ఇప్పుడు అంగీకరించం. ఈ విధంగా న్యూటన్ రోజులలోని పదార్థ విధానం కాస్తా ఆధునిక పదార్థవిధానంలో ఐక్యమైపోయింది. ఆ విధంగా సజీవంగా ఉందనవచ్చు. న్యూటన్ పదార్థ విధానపు ప్రపంచ దృక్పథం మాత్రం మౌలికంగా దోషపూరితమైంది గనక తోసిపుచ్చడం.

రచన తెలుగుసేత
          ఎ.బి.షా నరిసెట్టి ఇన్నయ్య

విజ్ఞాన సిద్ధాంతం - ఇతర సిద్ధాంతాలతో సఖ్యత --



10-Scientific Methood
ఇతర సిద్ధాంతాలతోొందికగా ఉండటమనేది విజ్ఞాన సిద్ధాంతం సంతృప్తిపరచవలసిన లక్షణాలలో ఒకటి. భూమి, చంద్రుడు కూడా సూర్యునితో బాటే ఒకే కక్షలో ఉన్నప్పుడు గ్రహణం వస్తుందని గ్రహచలన సిద్ధాంతం పేర్కొంటున్నది. కనక రాహువు, కేతువుల దుష్టపథకం వల్ల గ్రహణం ఏర్పడుతుందని అంగీకరించ వీల్లేదు. విజ్ఞానం, వైద్యం చెబుతున్న రీతిగా కలరా, స్పోటకం అనే వ్యాధులకు కారణాలు, చికిత్స అంగీకరిస్తే, క్షుద్రదేవతల ఆగ్రహం వల్ల ఆ వ్యాధులు వస్తాయని ఒప్పుకోరాదు ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. తాత్కాలిక ప్రతిపాదనలు విజ్ఞాన సిద్ధాంతంలో ఉండవు. కొత్తగా కనుక్కొన్న వాటిని వివరించడానికి గాను ఒకదాని తరవాత మరొక ప్రతిపాదన చేస్తూ పోరాదు. ఇలా చేస్తే మౌలిక ప్రాతిపదనపై నమ్మకం సడలుతుంది.

ఒక పర్యాయం ప్రతిపాదన సంతృప్తికరంగా ఉందంటే, అందులో ఇంకే మార్పులూ చేయరాదని అర్థం కాదు. పాతవాటిని బలిపెట్టకుండా, కొత్త వాస్తవాలను వివరిస్తూ, సమర్థనీయమైన మార్పులు ఉంటే ఆహ్వానించవచ్చు. సాక్ష్యాధారాలు లభిస్తుంటే, సాధారణీకం గావిస్తుంటాం. అది వాంఛనీయం. కాని ప్రతిపాదనకు ఉప ప్రతిపాదనలు చేస్తుంటే, మౌలిక సిద్ధాంతంలో దోషం ఉన్నట్లే. కొత్త వాస్తవాలను సహజమైన సాధారణీకరణ ద్వారా గనక సిద్ధాంతం వివరించలేకపోతే, తొలి పదాలు, ప్రతిపాదనలు సమూలంగా మార్చాలన్నమాటే.
పదార్థ విజ్ఞానంలో ఇదే జరిగింది. సంప్రదాయ పదార్థ విజ్ఞానం అనేక ప్రతిపాదనలపై ఆధారపడింది. అందులో కొన్ని పేర్కొందాం.

1. పరిశీలకుని వేగంతో నిమిత్తం లేకుండా కాలం, దూరం ఉంటాయి. ఇవి మారవు.
2.    యూక్లిడ్ చెప్పిన తీరులో ప్రదేశం ఉన్నది. దూరాన్ని కొలవాలంటే కాలంతో నిమిత్తం లేదు.
3.  ప్రదేశం యావత్తు ఈథర్ ఆవరించి ఉంది. పదార్థ రేణువుల మధ్య విద్యుదయస్కాంత తరంగాలు ప్రసారమయ్యేచోట సైతం ఈధర్ ఉంది.
4.    శక్తిని అనంతంగా విభజిస్తూ పోవచ్చు.
5. ద్రవ్యరాశి ఎప్పుడూ పదార్థాన్ని అంటి పెట్టుకొని మారకుండా ఉంటుంది. శక్తితో దీనికి సంబంధం లేదు. ఎంత వేగంగా ఏ వైపుకు వెడుతున్నప్పటికీ ద్రవ్యరాశి అలానే ఉంటుంది.
6.  పదార్థ విశ్వంలో కార్యకారణ నియమం కచ్చితంగా ఉంది. సూత్రప్రాయంగా ప్రతి సంఘటననూ అవసరమైనదిగా, తిరుగలేనిదిగా దానికారణాలను బట్టి వివరించవచ్చు.
మైకల్ సన్-మోర్లే పరిశోధనల ఫలితంగా వచ్చిన పరోక్ష ఫలితాలు, ఇంకా అనేకానేక పరిశోధనలు 19వ శతాబ్దం చివరి వరకూ జరిగినవాటిని గమనిస్తే పైన పేర్కొన్న వాటి ఆధారంగా ఉన్న పదార్థ విజ్ఞానం సమూలంగా మార్చాలని తేలింది. ప్రతిపాదనల జోలికి పోకుండా సిద్ధాంతాన్ని మార్చాలని చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోగా, పరస్పర విరుద్ధ విషయాలకు దారితీసింది. ఐన్ స్టీన్, ప్లాంక్ లు తుదకు ఈ సన్నివేశంలో వచ్చిన సమస్యను పరిష్కరించారు. వారి సాపేక్షతా, క్వాంటం (తేజఃకణ) సిద్ధాంతాలు సంప్రదాయ పదార్థ విజ్ఞాన ప్రాతిపదికలకు పూర్తిగా భిన్నమైంది.

అసలు పరీక్ష

విజ్ఞాన సిద్ధాంతానికి మరొక ప్రమాణం ఉంది. తెలిసిన వాస్తవాలన్నిటినీ వివరించడం, లోగడ ఆమోదించిన సిద్ధాంతాలతో సరిపోవడమే చాలదు. విజ్ఞానంగా భావించడానికి అసలైన పరీక్షకు నిలబడగలగాలి. అసలు పరీక్ష అంటే, దానితో సిద్ధాంతగతి నిర్ధారణ అవుతుందన్నమాట. ప్రతిపాదన అలా ఉంచి, పరిశోధన జరిగినప్పుడు వచ్చే ఫలితాలు ప్రతిపాదనలో సరిపడకపో వచ్చు. అటువంటప్పుడు ప్రతిపాదన సరికాదని రుజువు అవుతుంది. అంటే ప్రతిపాదన నిలవాలంటే ఇటువంటి కీలక పరీక్షకు గురికావలన్నమాట.

కాంతి ప్రసారాన్ని గురించి న్యూటన్, హ్యూజిన్ లు ప్రతిపాదించిన వివాదాలను పరిశీలిద్దాం. కాంతి కిరణాలను ఫోటాన్లు అంటారని, అవి సూటిగా పయనిస్తాయనీ పెర్కొన్నాడు న్యూటన్. అయితే కాంతి అండాకార తరంగాలుగా ఈథర్ లో ప్రసారమవుతుందని హ్యూజిన్స్ అన్నాడు. తరంగంలో ప్రతి బిందు కేంద్రం కూడా కాంతి ద్వితీయ మూలంగా ఉంటుంది. ఈ రెండు ప్రతిపాదనలు ప్రతిబింబం, వక్రీభవనం ఆశక్తి తెలిసిన విషయాలను వివర్తిస్తున్నాయి. దృష్టికి సంబంధించిన శాస్త్రంలోని ఈ అంశాలకు సంతృప్తికర సమాధానం లభిస్తుంది. ఆమోదించిన సిద్ధాంతాలకు విభిన్నంగా లేవు. విజ్ఞాన దృష్య్టా ఏదో ఒక సిద్ధాంతాన్నే సమర్ధించాల నేదేమి లేదు. పదార్థ విజ్ఞాన శాస్ర్తజ్ఞులు తమ తమ మనో ప్రవృత్తిని బట్టి ఏదో ఒక సిద్ధాంతాన్ని సమర్ధించారు. రెండు సిద్ధాంతాల మధ్య స్పర్థకూడా ఒక కీలక పరీక్షకు గురయ్యే వరకూ అసలు విషయం తేలలేదు. చివరకు పెట్టిన పరీక్ష చాలా సాధారణమైనది. సాంకేతిక పదజాలంతో నిమిత్తం లేకుండా ఈ పరీక్షను వివరించవచ్చు.

ప్రశాంతంగా ఉన్న నీళ్ళల్లో రాయి వేశామనుకోండి. రాయిబడిన చోట నుంచి తరంగాలు గుండ్రంగా అన్ని దిక్కులలో వ్యాపించడాన్ని గమనిస్తాం. దీనిని కేంద్రంగా స్వీకరించి గమనిస్తే ఈ తరంగాలతో నీరు పైకీ కిందకూ అన్ని దిక్కులలో కదలడాన్ని పరిశీలిస్తాం. మొదట వేసిన చోటే మరొక రాయి వేశామనుకోండి. మరొక తరంగ ప్రవాహం మొదలై వ్యాపిస్తుంది. అప్పుడు మొదటి తరంగం రెండో తరంగం ఉబ్బెత్తుగా లేచి తారసిల్లిన చోట నీటికణాలు పరిశీలించవచ్చు. అని తొలుత ఉన్న దూరంకంటె రెట్టింపుగా అటూ ఇటూ ఊగుతాయి. అలాగే రెండ కెరటాల మధ్య ఉన్న పల్లపు ప్రాంతపు పరిస్థితి కూడా ఉంటుంది. కాని ఒక కెరటం లేచినచోట మరొ కెరటపు పల్లపు ప్రాంతం ఉంటే గందరగోళం ఏమీ ఉండదు. నీటి కణాలు ప్రశాంతంగా ఉంటాయి.

కాంతి గనుక తరంగ స్వరూపంతో ఉండేటట్లయితే కొన్ని అనుకూల పరిస్థితులలో రెండు తరంగాలు కలిసినప్పుడు జోక్యం గమనించవచ్చు. ఇలాంటి జోక్యమే ఉంటే రెండు తరంగాలవల్ల ఏర్పడిన గందరగోళం లేకుండా పోవాలి. ఈథర్ కణాల గందరగోళం ఉండరాదు. అంటే అలాంటిచోట్ల కాంతి ఉండరాదు. ఒకదానికి బదులు రెండు కాంతి తరంగాలు ఉన్నప్పటికీ ఇలా జరగాల్సి ఉంటుంది. న్యూటన్ కణ సిద్ధాంతం సరైనదైతే వెలుగు ఫొటాన్లరూపంలో కణ ప్రవాహంగా ప్రసరిస్తే, రెండు ఫొటాన్లు పరస్పరం తారసిల్లినచోట, కాంతి తీవ్రత ఉండాలి. అలా కలసిన చోట వెలుగు అసలే కనిపించకుండా పోరాదు. చీకటి దృశ్యాలు ఉంటే, న్యూటన్ ప్రతిపాదన తప్పని, హ్యూజిన్ ప్రతిపాదన సరైనదని తేలిపోతుందన్నమాట.

పరిశోధనల వల్ల తేలిందేమంటే వెలుగుచీకట్లు రెండూ హ్యూజన్ అంచనా వేసిన రీతిలో కనిపించాయి. న్యూటన్ ప్రతిపాదనను తృణీకరించారు.
సాపేక్షతా సిద్ధాంతం కూడా ఇలాంటి పరీక్షకు గురికావలసి వచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం ద్రవ్యరాశి, శక్తి- ఒకదాని నుంచి మరొకదానికి మార్చడానికి, వీలున్నది, కనక శక్తితో కూడిన కాంతి కిరణాలు గురత్వాకర్షణ క్షేత్రానికి ఆకర్షితం కావడం జరుగుతుంది
.
సూర్యుడికి సమీపంగా పయనించే నక్షత్ర కాంతి కిరణాలు, సూర్యుని బలమైన ద్రవ్యరాశి ఆకర్షణ మూలంగా, సూర్యునివైపుకు కొంత మేరకు వంగుతాయి. సూర్యుని తీవ్రవెలుగు ప్రసారం వల్ల మామూలుగా నక్షత్ర కిరణాలు ఇలా వంగడాన్ని గమనించలేం. కాని సంపూర్ణ సూర్యగ్రహణ సందర్భంగా సూర్యుడి కిరణాలు భూమి మీద సూటిగా పడవు. అప్పుడు ఏర్పడిన అంధకారం మూలంగా దూరాన ఉన్న నక్షత్రాల నుంచి వచ్చే కాంతి మార్గాన్ని గమనించవచ్చు. అంచనా వేసినట్లు ఈ కాంతి కిరణాలు గనక సూర్యుడి వద్ద వంగకపోతే, ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సాపేక్షతా సిద్ధాంతం రుజువయ్యేదికాదు. 1919లో వచ్చిన గ్రహణం ఆధారంగా పరిశోధనలు జరిపి, తారల నుంచి వచ్చే కాంతి కిరణాలు సూర్యునివద్ద వంపుగా ఉండడాన్ని గమనించారు.

సారాంశం ఏమంటే, విజ్ఞాన సిద్ధాంతం కొన్ని కీలక పరీక్షలకు నిలబడాలి. అక్కడ విఫలమైతే ప్రతిపాదించిన సిద్ధాంతం సరైనదికాదన్న మాట. దీనికే అసలు పరీక్ష అంటారు. ఏ ప్రతిపాదనకైనా ఇది అన్వయించక తప్పదు. ఇటువంటి పరీక్షకు నిలబడని సిద్ధాంతం నిజం కాకపోవచ్చు. సత్యం అంటే ఏమిటో ఆయా వ్యక్తులు భావించే దానిని బట్టి నిజం ఉంటుంది. కాని విజ్ఞాన దృష్టిలో మాత్రం, అటువంటి ప్రతిపాదన నిజమూ కాదూ, అబద్ధమూ కాదు. అది విజ్ఞాన పరిధికి చెందదు, అది భౌతిక, రమణీయక సిద్ధాంతాలు ఎంత సునిశితమైనా, హేతుబద్ధంగా ఉన్నప్పటికీ, అవి మేధస్సు అవగాహనతో చేసిన భావనలైనప్పటికీ, వాటికి విజ్ఞాన స్థాయి మాత్రం చేకూరదు. మేధస్సుకు అవగాహన అయ్యే భావనలలో దేవుడు, ఆత్మ, ఎలక్ర్టాన్ ఉన్నాయి. ఇందులో ఎలక్ర్టాన్ ఒక్కటే విజ్ఞాన భావన. దీనికి చెందిన సిద్ధాంతం విజ్ఞాన పరమైనది. ఇది పరీక్షకు నిలబడుతుంది. దేవుడు, ఆత్మ భావనలు విజ్ఢానేతరాలు, వీటికి పరీక్షకు నిలబడే సత్తా లేదు. ఇతర సిద్ధాంతాలతో పొందికగా ఉండాలనే ప్రమాణం కూడా చేర్చి చూస్తే, ఈ భావనలు అశాస్త్రీయాలే.

రచన తెలుగుసేత
       ఎ.బి.షా                       నరిసెట్టి ఇన్నయ్య


సిద్ధాంత ప్రాతిపదికలు--మేధోభావనలు

- “శాస్త్రీయ పద్ధతి (వైజ్ఞానిక విధానం) అంటే ఏమిటి ?”



ఒక సిద్ధాంతానికి ప్రాతిపదికగా ఉన్నదే మరొక సిద్ధాంతానికి నిర్ణయం కావచ్చు. వంశపారంపర్యత, జన్యుశాస్త్ర సిద్ధాంతాలలోని నిర్ణయాలు పశువుల కృత్రిమ సంపర్క సిద్ధాంతానికి ప్రాతిపదికలయ్యాయి. ఇలా ఒక సిద్ధాంతం నుంచి మరొక సిద్ధాంతానికి తార్కికంగా కారణాలు అన్వేషిస్తూ అనంతంగా వెనక్కు పోజాలం. ఎక్కడో ఒక చోట ప్రతిపాదన ఆరంభం కావాలి. దానిని సమర్థించడం ప్రాపంచిక అనుభవరీత్యానే తప్ప, తార్కికంగా కాదని గ్రహించాలి. అవి నిజమైనవని అంగీకరిస్తే వాటిని మరొక ప్రాతిపదిక నుంచి రాబట్టవచ్చు. అంతమాత్రాన నిజమైనవనడంలేదు. అవి ఫలప్రదమైనవి. వాటి నుంచి నిజమైన నిర్ధారణలను రాబట్టడానికి వీలౌతున్నది.

ఒక సిద్ధాంతంలో తార్కికంగా వెనక్కు వెళ్ళడానికి వీల్లేని వాటిని ప్రాతిపదికలు అంటున్నాం. ఒకానొక సిద్ధాంతంలోని ప్రాయికమైన భావనల మధ్య కొన్ని సంబంధాలను ప్రాతిపదిక నిర్ధారిస్తుంది. ప్రాతిపదికలలాగే, ఈ భావనలు కూడా అప్పటి వరకు ఉన్న ప్రాతిపదికల ఆధారంగా రూపొందించినవే. వీటిని వాటితో నిర్వచించే పరిస్థితి ఉండదు. కనక అలాంటి వాటిని అనిర్వచనీయ పదాలనీ, తొలి పదాలు అనీ అంటాం. ప్రతి సిద్ధాంతం కూడా ఇలాంటి తొలి పదాలతోనూ, ప్రాతిపదికలతోనూ ప్రారంభిస్తుంది. లేకుంటే అనంతంగా వెనక్కు పోతూనే ఉండవలసి వస్తుంది. అప్పుడు ఏ సిద్ధాంతమూ సాధ్యం కాదు.

తొలి పదాలు, ప్రాతిపదికలు అనేవి ఆధునిక విజ్ఞానానికే ప్రత్యేక లక్షణాలని భావించరాదు. ప్రాచీన, ఆధునిక వివేచనాత్మక సిద్ధాంతాలన్నింటికీ ఇవి ప్రారంభదశలే. సంప్రదాయ పదార్థ విజ్ఞానంలో రేణువు (పార్టికల్)ను నిర్వచించలేదు. న్యూటన్ చలన సూత్రాలు, గురుత్వాకర్షణ నియమాలు కూడా ప్రాతిపదికలే. స్థిర పదార్థం (రిజిడ్ బాడీ) అనేది రాబట్టిన పదమే. కెప్లర్ గ్రహచలన సిద్ధాంతాలు పైన పేర్కొన్న ప్రాతిపదికల నుంచి రాబట్టినవే.

నైరూప్యాలు-మేధోభావనలు

ప్రతి సిద్ధాంతానికి తొలి పదాలు, ప్రాతిపదికలు ఉండడం తప్పనిసరి అయినప్పటికీ, అవి అవగాహనకు అందనట్టివవనిగాని, అయోమయమైన వనీ అనుకోరాదు. వాటికి అర్థం లేదని, భావించరాదు. ఇతరపదాల సహాయంతో వీటిని వివరించడం, నిర్వచించడం కుదరనప్పటికీ, ఒకటి రెండు పద్ధతులతో తెలిసేటట్లు చేయవచ్చు. కొన్ని వస్తువులకు ఎరుపు సాధారణ వర్ణమైనట్లు మనం పేర్కొంటాం. అలాగే మరికొన్ని సందర్భాలలో సాధారణ లక్షణాన్ని చూపవచ్చు. ఇటువంటి పద్ధతిని నైరూప్యం అంటారు. (ప్రోఫెసర్ నార్త్ రఫ్ గ్రంధంలో ఈ విషయాన్ని వివరించాడు). కలగాపులగంగా ఉన్న అనేక వస్తువుల సముదాయం నుంచి ఒక సాధారణ లక్షణాన్ని రాబట్టి, దానికి ఒక స్వతంత్రభావ ప్రతిపత్తిని, తార్కిక స్థాయిని సమకూర్పు తున్నామన్నమాట. మనం సాధారణంగా వాడే పదాలు మంచితనం, చతురస్రం, ఒక దానికంటె ఎక్కువ, నీలం అనేవి ఇలాంటి భావనలే. నైరూప్యతలో ప్రధానలక్షణం ఏమంటే ప్రపంచంలోని వస్తువుల విధానాలు ఆధారంగా పూర్తి అర్థాన్ని చిత్రీకరించవచ్చు.
తొలిపదం అర్థం కావాలంటే ఆ పదం వచ్చే ప్రాతిపదికలను ప్రస్తావించాలి. ఇతర భావాలతో దీనికిగల సంబంధాన్ని ప్రత్యేకించి పేర్కొనవచ్చు. అంటే గర్భితంగా నిర్వచించడమేనన్నమాట. అణుపదార్థ విజ్ఞానంలోని ఎలక్ట్రాన్, వేవ్ పాకెట్ గాని, సంప్రదాయ పదార్థ విజ్ఞానంలోని పార్టికల్ గాని తత్వంలోని ఆత్మ గాని వివరించాలంటే, ఇదొక్కటే పద్ధతి. వేవ్ పాకట్ అనే పదాలు నిర్దిష్టంగా ఒకానొక వస్తువుకు చెందుతాయని చూపడం సాధ్యంకాదు. కనక ఇలాంటి భావనలు ఎరువు వంటి నైరూప్యాలు కాదు.

ప్రాతిపదికల ఆధారంగా పూర్తి అర్థాన్ని వివరించగల భావనలను మేధోభావనలంటాం. ఇందుకు ఉదాహరణలు ఎలక్ట్రాన్, ఎనర్జి, ఎంట్రోఫి, ఎలక్ట్రొ మేగ్నటివ్ వేవ్స్, గ్రావిటేషనల్ వేవ్స్, కెమికల్ బాండ్, ఆత్మ ఇత్యాదులు.
నైరూప్యతతో పోల్చిచూస్తే మేధో భావనలో వాస్తవికత తక్కువ అని ఊహించరాదు. నైరూప్యతలో సైతం ప్రపంచానుభవంతో పోల్చినప్పుడు కొంత మేరకు అఖాతం ఉంటుంది. ఎర్రదనం, జీవితం అనే వాటికి వస్తుగతంగా చూడడానికి విడిగా ఏవీలేవు. దానికంటే ఎక్కువ, ఎడమపక్కకు, అతని యొక్క సోదరుడు ఇత్యాదుల సంబంధాలలోని నైరూప్యతలలో ఈ విషయం స్పష్టమే. మేదో భావనలలో, ప్రపంచవస్తువులకూ భావనలకూ అఖాతం ఇంకా ఎక్కువ. ఒక వస్తువును లేదా వస్తువులను చూసి, ఫలానా భావనకు అవి మారురూపాలని మేధస్సులో అవగాహన చేసుకునే వాటిలో చూపలేం. మనం చేయగలిగిందల్లా, ఒకానొక సన్నివేశాన్ని చూసి, వివేచనాత్మక వివరణ, అవగాహన కావాలంటే మేధోభావన, వాటిని గర్భితంగా నిర్వచించే ప్రాతిపదికలు అవసరం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటున్నది. ఈ ప్రాతిపదికల నుంచి తార్కికంగా మనం కొన్ని వాస్తవ ప్రకటనలు రాబట్టవచ్చు. నైరూప్యతలలాగే వీటిని కూడా ప్రాపంచకానుభవంతో పరిశీలించి రుజువు పరచవచ్చు. ఒక విధంగా ఇది ప్రాయోజికతావాదంగా అనిపించవచ్చు. అయితే ఆలోచనారంగంలో ఈ మాత్రం ప్రాయోజికతావాదం ఉంటుంది. మానవుడి మేధస్సుకు, అది అవగాహన చేసుకోదలచిన ప్రపంచానికి ఈ విధానం ఒక్కటే వారధి.

మేధాభావనలు ఆధునిక విజ్ఞానానికి, తత్వానికి మాత్రమే పరిమితంకాదు. సహజచారిత్రక దశస్థాయి నుంచి విజ్ఞానం ముందుకు సాగిపోయినప్పుడు, కేవలం వర్ణనగాక, వివరణ అవసరమైనప్పుడు, మేధాభావనలతో కూడిన ప్రాతిపదికలు వస్తాయి. సహజ చారిత్రక దశ పూర్తిగాక పూర్వమే కొన్ని సందర్భాలలో తాత్వికులు, శాస్త్రజ్ఞులు మేధాభావనలు చేసిన ఉదాహరణలు లేకపోలేదు. ప్లేట్లో భావాలు కణాదుడు, ఎసిక్యూరస్ లు పేర్కొన్న అణువు హెగెల్ (భావం) ఇందుకు మచ్చు తునకలు. విజ్ఞానాభివృద్ధిలోని ఒక స్థాయిలో భావనలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ఉత్తరోత్తరా ఇంకా సునిశితమైన వాటిని ఇముడ్చుకోవలసి ఉంటుంది. అయితే మాటలు పాతవే ఉండవచ్చు. 19వ శతాబ్దిలో రసాయనిక శాస్త్రం పేర్కొన్న అణువుకూ ఆధునిక రసాయనిక విజ్ఞానం చెప్పే అణువుకూ అర్థం పూర్తిగా మారిపోయింది. మేధాభావన దశపై ఆధారపడనిదే ఏ విజ్ఞానం కూడా పరిపక్వస్థాయికి చేరదు.

నైరూప్యతపై ఆధారపడిన సిద్ధాంతాలలో అంచనావేసే శక్తి బహుస్వల్పం పరిశీలించిన సమాచారం ఆధారంగా తొలిపదాలు, ప్రాతిపదికలు రాబట్టిన దృష్ట్యా అంతకు మించి ముందుకు పోజాలని స్థితిలో నైరూప్యదశ ఉంటుంది. ప్రతిపాదన నుంచి వాస్తవాలను రాబట్టినప్పటికీ, వర్ణన చేయడం తప్ప, సిద్ధాంతం ఏమంతగా ముందుకు సాగలేదు. మేధాభావనపై ఆధారపడిన సిద్ధాంతం, అవధులు దాటిపోయి. కొత్త పరిశోధనలకు, నూతన విషయాలు కనుక్కోవడానికి దారితీయగలదు. నిత్యానుభవం నుంచి భావన ఎంతదూరమైతే అంత ఫలవంత మౌతుందని చెప్పవచ్చు. అందుకే గణితభావనలు, పద్ధతులు అన్వయించిన చోటల్లా, సాధారణ అనుభవంకంటే ఎంతో ఫలప్రదమైనట్లు రుజువైంది.

సాధారణంగా నైరూప్యతతో సాగిపోతుంటాం. మన దృష్టి, శక్తి సామర్ధ్యాలు స్పర్శేంద్రియాధార ఊహలు కొన్ని హద్దులకు పరిమితమై ఉంటాయి. విజ్ఞానరంగంలో ప్రతి విభాగం కూడా తన సిద్ధాంతానికి గణిత రూపాన్నివ్వాలని కలలు కంటుంది. పదార్థ విజ్ఞానం ఈ విషయంలో గణనీయదశకు చేరింది. ఏ విజ్ఞాన విభాగమైనా ఇలా చేయగలదా అనేది ఆయా విషయాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు రాజకీయ విజ్ఞానం ఈ స్థాయికి చేరుకోగలగడం చాలా సందేహాస్పదమైన విషయం.

అంత మాత్రాన గమన రూపంలో సిద్ధాంతంగా రాజకీయ శాస్త్రం ముందుకు పోలేదని భావించరాదు. సహజ విజ్ఞానంలోగల నిర్దిష్టత కచ్చితంగా పేర్కొన్నడం అనే స్థాయికి చేరుకోలేదనే ఇక్కడ ఉద్దేశ్యం. అయితే రాజకీయాలలో వాస్తవాలను వివరించవచ్చు. ఒకే తీరును సాధించవచ్చు. అంచనావేయవచ్చు. లోగడ ఇలా చేయలేదంటే, ఆగమన కృషి జరగలేదు. రాజకీయ సిద్ధాంతాన్ని రూపొందించడానికి ఇటువంటిపని జరగాలి. ఏ మేరకు ప్రతిపాదనలు రూపొందించవచ్చునో ఆ మేరకు మార్క్స్ ప్రయత్నించి ఇంచుమించు సఫలీకృతుడైనాడు. అతడు నిర్మాణ క్రమం కోరినవాడు. బైబిల్ లోని పాత నిబంధనల ప్రవక్తవంటివాడు. కనక తన ఆలోచనలకు పదును పెట్టే తీరులో తనలోని సామాజిక శాస్త్రాల ధోరణికి స్వేచ్ఛను ఇవ్వలేదు

విజ్ఞాన సిద్ధాంత నిర్మాణం
వివరణ-అంచనా

ఒక సిద్ధాంతం వైజ్ఞానికంగా ఉండాలంటే, పరిశీలించదగిన వాస్తవాలను, వాటి తార్కిక అవసరాల దృష్ట్యా వచ్చే ఫలితాలను వివరించగలిగి ఉండాలి. ప్రకృతి విజ్ఞానంలో ఎటువంటి వివరణకైనా ఇది కనీస అవసరం. మానవుడికి సంబంధించిన విజ్ఞానంలో తార్కిక ఆవశ్యకతలే గాక, మానసిక విషయాలను కూడా పరిగణనకు స్వీకరించాలి. మానవుడి కార్యకలాపాలలో తార్కిక ఆవశ్యకత అంటే, మానవుడి పిపాసలు, ఉద్దేశాలు ఇమిడే ఉంటాయి. ఈ విధంగా చూస్తే, ప్రకృతి విజ్ఞానంకంటే మానవ సామాజిక విజ్ఞానాల తర్కం ఉన్నతమయినది. (వీటి విస్తృత చర్చకు ఎఫ్.ఎన్.సి. నార్త్ రప్ రచన, ఎర్నెస్ట్ కాజైనర్ రాసిన లాజిక్ ఆఫ్ హ్యూమానిటీస్ చూడండి) ప్రస్తుతం ప్రకృతి విజ్ఞానానికే మనం పరిమితమౌతున్నాం.

నైరూప్యత ఆధారంగా ఉన్న సిద్ధాంతాలలో, ప్రతిపాదనలోకి తెలిసిన వాస్తవాలను వినడం మినహా అదనంగా చేసేదేమి లేదు. కాని సిద్ధాంతంలో నమ్మకం కుదరాలంటే గతాన్ని భవిష్యత్తును గురించి చెప్పగలిగిన సత్తా ఉండాలి. ఈ విషయాలు మామూలుగా అయితే అంత అవసరం లేనివిగా భావిస్తారు. ప్రకృతి సామాజిక శాస్త్రాలకంటే, పదార్థ విజ్ఞానం ఆధిక్యతలో ఉండగలగడానికి కారణం, గతాన్ని భవిష్యత్తును గురించి చాలావరకు చెప్పగలగడమే. ఉదాహరణకు న్యూటన్ పేర్కొన్న గురుత్వాకర్షణ సిద్ధాంతం, చలన సిద్ధాంతం విభిన్న రంగాలలోని సంఘటనలను ఏకం చేశాయి. కొన్నిటిని అంచనా వేయగలగడం కూడా జరిగింది. లేకుంటే వాటి జోలికే ఎవరూ పోలేరు. గ్రహాల చలనం, గ్రహణాలు, తోక చుక్కలు కనిపించడం, అలల ఆటుపోటులు, తుపాకి గుండు దూసుకుపోవడం, ఎత్తుతోబాటు బరువులో మార్పు, సూర్యుని వంటి నక్షత్రాలు స్థిరంగా, అండాకారంలో ఉండడం వంటి వాటిని ఉదాహరణగాను చెప్పవచ్చు. న్యూటన్ సిద్ధాంతం ప్రకారం అద్భుతమయిన అంచనాలుగా 1845లో కనుక్కొన్న నెప్ట్యూన్ గ్రహం, 1930లో కనుక్కొన్న ప్లూటో గ్రహం పేర్కొనదగినవి. యాడమ్స్, లెవిరియర్లు ఎవరికివారే వరుణ (నెప్ట్యూన్) గ్రహాన్ని కనుక్కొన్నారు. యురేనస్ గ్రహ చలనంలో, న్యూటన్ సిద్ధాంతాన్ననుసరించి, ఏదో ఇంకొక గ్రహం ఉండాలని భావించారు. ఇలాంటి పరిశోధన ఫలితంగానే ప్లూటో గ్రహాన్ని కూడా కనుక్కొన్నారు.

అయితే, న్యూటన్ కు పూర్వం శతాబ్దాల తరబడి, గ్రహణాలు, ఆటుపోటుల గురించి సరిగానే అంచనా వేయగలిగారు గనక న్యూటన్ సిద్ధాంతం విజ్ఞాన రంగంలో ముందుకు వెళ్ళినట్లు చెప్పలేకపోవచ్చు. ఇక్కడ కేవలం అంచనా వేయడం మాత్రమే ప్రధానం కాదు. ఏ ప్రాతిపదికపై అంచనా వేశారనేది ముఖ్యం. పరిశీలించదగిన వాస్తవాల నుంచి ఒక నమూనాను కనుక్కోవడం ఒక ఎత్తు. ఆ నమూనాకు మూలం కనుక్కొని ఇందుకుగాను అవసరమయిన గర్భత విషయాలు గ్రహించడం మరొక ఎత్తు. ప్రతి రోజూ సూర్యోదయం తూర్పున ఇంచుమించు ఒకే సమయాన జరుగుతుందనీ, రుతువులు ఒకదాని తరవాత మరొకటి వస్తాయని ఆటవికులకు కూడా తెలుసు, వీటికి వెనక ఎవరో దేవతలున్నారు. అనుకున్నంతవరకూ అతడి జ్ఞానం అస్తవ్యస్తంగానే ఉంటుంది. చలికాలంలో పగలుతక్కువగా ఉండడం, ఒకోసారి దేవతలున్నారు. అనుకున్నంతవరకూ అతడి జ్ఞానం అస్తవ్యస్తంగానే ఉంటుంది. చలికాలంలో పగలుతక్కువగా ఉండడం, ఒకోసారి ఆలశ్యంగా వర్షాకాలం ప్రారంభం కావడం వంటివన్నీ ఆయా దేవతల మనస్సులోని మార్పుననుసరించి జరుగుతాయనుకున్నాడు. కనక ప్రకృతి గురించిన అతడి అవగాహనలో భద్రతా రాహిత్యమే కనిపిస్తుంది. భూమి సంవత్సరానికో పర్యాయం స్యూరునిచుట్టూ పరిభ్రమించడం, భూమి తన అక్షంపై తాను తిరగడం అనేవి ఖగోళ శాస్త్రజ్ఞుడు అవగాహన చేసుకున్నాడు. క్రమంగా ఉండడం, అందులో కొంత దారి తప్పడం అనేవి వస్తు తరహాలని, వీటిని వివేచనాత్మకంగా సంతృప్తికరంగా అవగాహన చేసుకోవచ్చని మానవుడు తెలుసుకున్నాడు. న్యూటన్ సిద్ధాంతంలో జరిగింది ఇదే, ఏదొక విధంగా అనిగాక, ఆవశ్యకత అనేదానికీ, మితమయిన స్థాయి నుంచి విశ్వజనీనతకు న్యూటన్ సిద్ధాంతం దారితీసింది.

రచన తెలుగు సేత
ఎ. బి. షా నరిసెట్టి ఇన్నయ్య