ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గౌతు లచ్చన్న


బారువలో బాధ్యతారహిత – బాల్యదశ నుండి
ముందుమాట
గొప్పవాళ్ళమనుకున్న వాళ్ళు స్వీయగాథలు రాసుకుంటారు. అధికారంలో ఉన్న వారి జీవితాల్ని కథలుగా వ్రాయటం, వ్రాయించుకోవటం ఆనవాయితీగా చూస్తున్నాం. లచ్చన్న తనను గొప్పవాడుగా భావించుకోలేదేమో మరి, స్వీయగాథ వ్రాసుకోలేదు. అధికారంలో ఉన్న సంవత్సరంన్నర కాలంలో తన చరిత్ర వ్రాయమని ఎవరినీ అడగలేదు. అడగకపోయినా అధికారంలో వున్నవారి యాత్రలు వ్రాసి గిట్టుబాటు చేసుకుంటున్న రోజులలో రాజకీయాల్లో 40 ఏళ్ళుగా వుంటూ, కొన్ని సందర్భాలలో క్లిష్టపాత్ర వహించి, చరిత్ర మలుపులు తిప్పిన పాత్ర లచ్చన్నది. ఆ పాత్ర ఎలాంటిదో చెప్పటానికే యీ ప్రయత్నం చేస్తున్నాను.  సందర్భంలో స్పష్టం చేయవలసిన విషయం ఒకటుంది. రచయితకు లచ్చన్న రాజకీయాలకు సంబంధం లేదు. రచయిత ఏ పార్టీకీ చెందినవాడు కాదు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర సమగ్రంగా వ్రాయవలసి వున్నది. ఆపని ఉత్తరోత్తరా ఎవరు చేసినా, అందులో లచ్చన్న నిర్వహించిన విషయాలు యీ రచనలో కొంతవరకైనా లభించగలవనే ఆశ.
రచయిత
లచ్చన్న వంశ వాతావరణం
గౌతు లచ్చన్న 1969 ఆగస్టు 16న, నేటి శ్రీకాకుళం జిల్లా సోంపేట తాలూకా బారువా గ్రామంలో, చిట్టయ్య-రాజమ్మ దంపతులకు పుట్టాడు. వారిది కల్లుగీత వృత్తి. గౌడ అంటారు. ఉపకులరీత్యా తల్లిదండ్రులు అంతకుముందు యిరువంశాలు చదువుతో నిమిత్తం లేని జీవితాలు గడిపారు. తాత చిరుప్రాయములో చనిపోగా, నిరుపేద లచ్చన్న నాయనమ్మ నిస్సహాయురాలు కాగా కుటుంబపోషణార్థం, చిట్టయ్య కాయ కష్టం చేసి, పొట్టపోసుకునేవాడు. ప్రధానంగా పాలికాపు పనిచేస్తూ లచ్చన్నకు తాతవరుస అయిన ఆయన దగ్గరే చివరిసారిగా ఆ వృత్తి ముగించాడు.
బారువ సముద్రతీర ప్రాంత గ్రామం, సమీపంలో కలకత్తా మద్రాసు రైలుమార్గం కూడా వున్నది. ఆనాటికి ఆ సౌకర్యాలు రెండూ ఆ వెనుకబడిన ప్రాంతానికి ఆశాకిరణాలే. అప్పటికి శ్రీకాకుళం జిల్లా ఏర్పడలేదు. ఒరిస్సా రాష్ట్రం రూపొందలేదు. బారువా గ్రామం గంజాం జిల్లాలో వుండేది. బారువా తీరప్రాంతంలో చిన్న కస్టమ్స్ కార్యాలయం కూడా వుండేది. ఆంధ్రులు విశేషంగా బర్మావలస వెళ్ళి భిన్న వృత్తులు యథాశక్తి అవలంభించి డబ్బు ఆర్జిస్తూ ఉండే రోజులవి. చిట్టయ్య కూడా వారిలో ఒకడిగా రంగూన్ వెళ్ళి, శ్రమించి డబ్బుకొంత మిగిలిస్తూ అంచెలవారీగా, లచ్చన్నకు అమ్మమ్మ – అంటే చిట్టయ్యకు అత్తకు పంపుతుండేవాడు. అలా వాయిదాల మీద వస్తున్న డబ్బు జాగ్రత్తపరచి, కొంత పొలం కొని, చిన్న యిల్లు కట్టించి, చిట్టయ్యకు తన కుమార్తె రాజమ్మనిచ్చి పెళ్ళిచేసింది ఆమె. రంగూన్ నుండి తిరిగి వచ్చిన చిట్టయ్య ఒక కొబ్బరితోట ఆసామీ అయ్యాడు. చిన్న గృహ యజమానిగా తన కులవృత్తి కల్లుగీత చేసుకుంటూ తానుతింటూ నలుగురికి పనికల్పించిన వాడయ్యాడు. కాని ఆయనకు వరుసగా ఆరుగురు సంతానం కలిగినా ఒక్కరూ దక్కకుండా పోయారు. ఆ పిమ్మట సత్యనారాయణ, లచ్చన్న మధ్యలో ఒక ఆడ సంతానం కలిగి నిలబడ్డారు. వరుసగా ఐదుగురు పోవటంతో దక్కిన వారిని అమిత ప్రేమతో పెంచారు. చిట్టయ్య తన సంతానానికి కులవృత్తి నేర్పదలచలేదు. మార్గం తప్పించి ఏమైనాసరే అక్షరాస్యుల్ని చెయ్యాలని ఇంకా వృద్ధి చెందింపచేయాలని దీక్షవహించాడు. అదొకమలుపు.
బడిచదువు
చిట్టయ్య కల్లుగీత వృత్తి చేయటమే గాక, నిరంతర నిషాలో వుండేవాడు. అది దురభ్యాసంగా మారిందని తెలిసినా, మానలేకపోయేవాడు. కాని సంతానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ యిది అంటకూడదని తాపత్రయ పడ్డాడు. అదే విశేషం. ఇంట్లో వుంటే వాసనకు అలవాటు పడతారని భయపడి ఊళ్లోనే ఒక ప్రాథమిక పాఠశాల అధ్యాపకుని ఇంట్లో “ప్రైవేట్” ట్యూషన్ ఏర్పాటు గావించాడు. అంటే లచ్చన్నకు స్వగృహం ఒక భోజన వసతిగానూ, మాస్టారిల్లు స్వంత యిల్లుగానూ మారింది. లచ్చన్న ఎప్పుడైనా ఇంట్లో కనిపిస్తే బూతులు తిట్టేవాడు తండ్రి. కొడుకు బాగుపడాలనే ఆత్రుత అలాంటిది. ఏడవ ఏట అంటే 1916లో అక్షరాభ్యాసం ఆరంభించిన లచ్చన్న బాల్యజీవితం స్వైర విహారంగా సాగింది. చదువులేనప్పుడు సముద్రతీర ప్రాంతాలలో బెస్తవారి మధ్య ముద్దుల బాలుడుగా మసిలాడు ఆనాటి స్మృతులే ఉత్తరోత్తరా ఆప్యాయతలుగా మారాయి ఆబెస్తవారికి.
చిట్టయ్య రోజంతా నిషాలో ఉన్నా, కుమారుల విషయంలో ఏ మారక ఏదో ఒక సమయంలో మాస్టారింటికి ఫలమో పుష్పమో సమర్పించి, లచ్చన్న నా కుమారుడు కాదు. మీ బిడ్డడుగా భావించండి. మీ చేతుల్లో పెట్టాను, అని చెప్పి పోతుండేవాడు. తనకు లేని, రాని సదవకాశాల్ని కుమారులకు కలిగించి లోటు తీర్చాలని ఆ తండ్రి ఆశకు అర్థమున్నది.
బాల్య వివాహం
1922లో లచ్చన్నకు 13 సంవత్సరాల ప్రాయంలో చిట్టయ్యకు జబ్బు చేసింది. బ్రతకననుకొని భయపడి కుమారుల వివాహాలు కళ్ళారా చూసి పోదామని ఆశించాడు. లచ్చన్న ఇంకా 8వ తరగతి గట్టెక్కలేదు. తండ్రి అవస్థ చూసి ఆయన కోర్కెలకు సమ్మతించి, సత్యనారాయణ, లచ్చన్నలిరువురూ బాల్యవివాహాలు చేసుకోక తప్పింది కాదు. కాని పెండ్లి జరిగిన రెండేండ్లకే లచ్చన్న తొలి భార్య మశూచితో మరణించింది. ఆ తర్వాత సత్యనారాయణ భార్యకు విడాకులిచ్చాడు. అయితే చిట్టయ్య కోలుకొని మామూలు మనిషయ్యాడు. మళ్ళీ వృత్తి కొనసాగించగలిగాడు. కుమారులు చదువు కొనసాగింది, 1924 నాటి సంగతి ఇదంతా.
వ్యక్తి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అతని వంశం, పరిసరాలు, సామాజిక స్థితిగతులు తెలిసి వుండటం ఎంతో అవసరం. కనుకనే ఇవన్నీ చెప్పటం. ఇప్పటివరకూ చూస్తే లచ్చన్న బాల్యదశలో వృత్తిరీత్యా వంశపరంగా, పరిసరాల దృష్ట్యా ఉన్నత కులాలవారికిగల సదవకాశాలేవీ లేవనేది స్పష్టం. అందులోనుండి ఆవిర్భవించాడు లచ్చన్న. ఇది తరువాత గాని అవగాహన కాదేమో.
బారువలో ఒక హయ్యర్ ఎలిమెంటరీ పాఠశాల వుండేది ఆనాడు. కాంగ్రెసు ఆశయాలకు ప్రభావితుడైన దేశభక్తుడు కోడుగంటి నరసింహమూర్తి అందులో ఉపాధ్యాయుడు. ఆయన “స్వరాజ్య” పత్రిక తెప్పించి చదువుతూ అప్పుడప్పుడూ రాత్రిళ్ళు పిల్లలకు అందులో విశేషాలు చెబుతుండేవాడు. వాటి ప్రభావం వెంటనే వున్నదని చెప్పజాలంగాని, అవి బీజాంకురాలుగా పనిచేశాయంటే అతిశయోక్తి కాదేమో. లచ్చన కూడా శ్రోతగా స్వాతంత్రపాఠాలు విన్నాడు. ఇంకా పరిణతి చెందని, చిలిపి మనసుగల వయసుగదా. 15 సంవత్సరాల వయసు లచ్చన్నది.
బారువలో గల కస్టమ్స్ కార్యాలయంలో అన్వార్, రంగనాయకులు అనే జవాన్లిరువురు కొన్నాళ్ళపాటు తాలింఖానా నడిపి, పిల్లలకు కసరత్తు సాముగరిడీలు నేర్పారు. అందులో చాలా హుషారుగా పాల్గొన్న లచ్చన్నకు ఆరోగ్యంగా రాత్రింబవళ్ళు షష్టిపూర్తి అనంతరం కూడా పనిచేయటానికి ఉపకరించాయి. ఇవిగాక లచ్చన్న చెడుగుడు, బాడ్మింటన్ బాగా ఆడుకునేవాడు.
మకురుతనం
ఆటలమాట ఎలా వున్నా 8వ తరగతి చేరిన లచ్చన్నకు మకురుతనం కూడా జాస్తి. ఆ ప్రభావంతో ఒక సందర్భంలో హెడ్మాస్టరును కొట్టి ఇల్లుమాని ఎస్టేటుదార్ల స్నేహితుల ఇళ్ళలో భోజనం చేస్తూ, తోటల్లో స్వేచ్ఛావిహారం చేస్తూ కాలక్షేపంచేశాడు కొన్నాళ్ళు. జబ్బు నుండి కోలుకున్న తండ్రి పట్టుదలగా వెతికించి మందసా హైస్కూలులో చేర్పించాడు. దీనికి అన్న సత్యానారాయణ ప్రోత్సాహం తోడ్పడింది. కొర్ల హరికృష్ణ అజమాయిషీలో లచ్చన్నను అట్టిపెట్టారు. అయినా మాసిన చదువులు మరల చదవబుద్ధిగాక, మందసా అడవుల్లో తిరగటమేగాక, మందసా హైస్కూలులోనే పేకాట ప్రారంభించాడు. ఎలాగైతైనేమి మరుసటి సంవత్సరానికి 8వ తరగతి పాసయ్యాడు. అప్పటికే అన్న సత్యనారాయణ 8వ తరగతి ముగించి హైయ్యర్ గ్రేడ్ ట్రైనింగుకై శ్రీకాకుళంలో చేరగా లచ్చన్న కూడా 9వతరగతి (నాటి 4వ ఫారమ్ లో) చేరాడు. అన్న శిక్షణ పూర్తయిన రెండేళ్ళలో లచ్చన్న ఒకసారి 9 తప్పి రెండో ఏడు నెట్టేశాడు. కాని 10వ తరగతి తొలి సంవత్సరమే ఉత్తీర్ణుడయ్యాడు. శిక్షణ పూర్తి గావించిన సత్యనారాయణ ఉపాధ్యాయ వృత్తికై స్వగ్రామం చేరుకోగా ఎస్.ఎస్.ఎల్.సి. చదువుకై లచ్చన్న ఇచ్ఛాపురం వచ్చాడు. మళ్ళీ పాత కథే. హద్దూ అదుపూలేని లచ్చన్న విజృంభించి, ఒకనాడు హెడ్మాస్టరుకు ముసుగు వేసి పారిపోయాడు. ఫలితంగా సెలక్షన్ స్థాయిలోనే ఆగిపోయాడు. ఇక లాభంలేదని మళ్ళీ శ్రీకాకుళంలో చేర్పించి యీ పర్యాయం రావిగంటి జగన్నాథం పంతులుగారి అజమాయిషీలో అట్టిపెట్టారు. ఇంటి ఆర్థిక పరిస్థితి బొత్తిగా బాగుండని రోజులవి. కష్టించి దాచిన డబ్బు ఇంట్లో నుంచి లచ్చన్న కొట్టేసిన సందర్భం. కాని జగన్నాధంగారి వాత్సల్య అనురాగాలతో లచ్చన్న ఎస్.ఎస్.ఎల్.సి ఉత్తీర్ణుడయ్యాడు. అదే లచ్చన్న ఆఖరు డిగ్రీ. 1930కు చేరుకున్నాం మనం. లచ్చన్న 20 సంవత్సరాల ప్రాయానికి వచ్చాడు.
కాంగ్రెసు సమావేశాలు
1920 నుండే బారువలో కాంగ్రెసు సంఘం పనిచేస్తుండేది. ఏ ఉద్యమం జరిగినా ఆ వేడి కొంత గ్రామానికి కూడా తాకేది. ఒకసారి దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను అరెస్టు చేసి రైల్లో తీసుకుపోతుంటే, అందరితోపాటు లచ్చన్న కూడా స్టేషనుకు వెళ్ళి దర్శనం చేసుకొచ్చాడు. బారువలో తిత్తి బలరామయ్య, వెంకట రెడ్డిగార్లు ఒకవైపున జమీందార్లకు అండగా వుంటూనే మరొక ప్రక్క కాంగ్రెసు సమావేశాలకు తోడ్పడుతూ, ద్విపాత్రాభినయం చేస్తుండేవారు. పల్లెటూరుగనుక, కాంగ్రెసు పేరుతో జరిగే ప్రతి సమావేశానికీ ఆడుకుంటూ పాడుకుంటూ లచ్చన్న కూడా వెళ్ళివస్తుండేవాడు. ఆకతాయిగా వెళ్ళినా వాటి ప్రభావం ఆ తర్వాత లీలగా ద్యోతకం కాకపోలేదు.
ఉప్పు సత్యాగ్రహం
చదువు ముగించి, శ్రీకాకుళం నుండి స్వగ్రామానికి తిరిగొచ్చేసరికి లచ్చన్నకు ఉప్పు సత్యాగ్రహం తారసిల్లింది. ఉప్పు చేయటం కూడా ఒక ఉద్యమమేనా అని వెక్కిరించాడు. లచ్చన్న జిల్లాలో అప్పుడు ప్రసిద్ధ న్యాయవాదిగా పేరుమోసిన సోమయాజులు బారువలో సత్యాగ్రహ శిబిరం స్థాపించాడు. లచ్చన్నతోపాటు ఆయన దండు కూడా బాడ్ మింటన్ ఆటకు పోతూ వస్తూ శిబిర కార్యకర్తల్ని హేళన చేస్తుండేవారు. కాని గాంధి దండి (సూరత్) వద్ద ఉప్పుచేయడానికై సబర్మతి (1930 ఏప్రిల్ 6న) చేరాడు. గుజరాత్ ఆశ్రమం నుండి 1930 మార్చి 11న పాదయాత్ర ప్రారంభించి, ఒక్కొక్కరోజు గడుస్తుంటే దేశం వేడెక్కింది బారువా కూడా అందులో భాగం పంచుకున్నది. ఆ వేడిలో ఒకనాడు బాడ్ మింటన్ నుండి తిరిగొస్తున్న లచ్చన్నను పట్టి వంటి మీద వస్త్రాలు ఊడబెరికి, తగలబెట్టారు శిబిర కార్యకర్తలు అంతే. లచ్చన్నలో కూడా ఏదో ఆవేశం పూని, కార్యరంగంలోకి దూకాడు. అది రాజకీయ పర్వంలో అడుగిడటానికి నాంది.
సత్యాగ్రహం నుంచి టెర్రరిజానికి
గాంధీజీ పిలుపు యిచ్చిన ఉప్పు సత్యాగ్రహం గంజాం జిల్లాలో ఉప్పెనకు దారితీసింది, నౌవడలో ఉప్పు కొఠారులపై దండయాత్ర బయలుదేరిన ఊరేగింపు చూసినవారికి, జిల్లా యావత్తు అక్కడే ఉన్నదా అనిపించింది. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా, అన్నకు మాత్రం తెలియజేసి చూసివద్దామని వెళ్ళిన లచ్చన్న ఆ జన సందోహాన్ని చూసిన ఉద్వేగంలో సత్యాగ్రహం చేసి అరెస్టు అయ్యాడు. ఆనాడు జిల్లా నాయకులుగా పేరుమోసిన వరహగిరి జోగయ్య పంతులు, న్యాపతి నారాయణమూర్తి, పుల్లెల శ్యాంసుందరరావు, ఉన్నవ రామలింగం ప్రజల్ని నడిపించారు. ఊరేగింపులో పాల్గొన్న ప్రజలకు ప్రశాంతంగా వుండవలసిందిగా, లక్ష్మి (వి.వి.గిరి సోదరి) వేదాంతం కమలాదేవి (కాకినాడ) గారలు చేసిన విజ్ఞప్తిని ఎవరూ లక్ష్యపెట్టలేదు. ఫలితంగా మూకుమ్మడి అరెస్టులు చేశారు. అందులో వి.వి.గిరి సోదరుడు కూడా ఉన్నాడు. అరెస్టయిన లచ్చన్న బృందాన్ని జైల్లో పెట్టకుండా వంశధార  ఇసుక తిన్నెలపైకి లారీలలో తీసుకెళ్ళి వదిలేశారు. నాటి జిల్లా కలెక్టర్ ఆసిన్ ఉద్యమాన్ని దెబ్బతీయటానికి వేసిన ఎత్తుగడ అది.
లచ్చన్న, మరికొందరు మళ్ళీ నడిచివచ్చి, సత్యాగ్రహం చేసి, అరెస్టు అయ్యారు.  ఈమారు టెక్కలి సబ్ జైల్లో పెట్టారు. ఆ దళంలో 26 మంది ఉన్నారు. వారిని విచారించటంగాని, శిక్షవేయటంగాని జరగలేదు. కొద్ది రోజుల నుంచి క్షమాపణ చెబితే వదులుతామన్నారు. అలాంటి సదవకాశం కోసం ఎదురుచూస్తున్న వారు నాటికీ నేటికీ ఉన్నారు. ఉంటారు. అందుకే ఉద్యమాలు నీళ్ళుకారిపోతుంటాయ్. మొత్తం 26గురిలో 8 మంది నిలబడ్డారు. ఆ 8 మంది 23 రోజుల పాటు జైల్లో వున్నారు. చెరువులో స్నానం స్వయంపాకం దినచర్య, లచ్చన్న సహనం పోగా ఆందోళన చేసినందున, ఎలాగైతేనేమి విచారణ జరిపి, ఒక మాసం శిక్ష విధించారు. బరహంపూరు జైల్లో పెట్టారు. అప్పుడు తొలిసారిగా గొట్టిపాటి బ్రహ్మయ్యను లచ్చన్న చూడటం తటస్థించింది. అంతకుపూర్వం గవర్నరుకు నల్లజండాలు చూపినందున బ్రహ్మయ్య జైల్లోపడ్డాడు. వీరంతా సి తరగతి ఖైదీలు. పరిస్థితులు దుర్భరంగా వుండేవి. మట్టి బొచ్చెల్లో సంకటి పోసేవారు. ఖైదీలపట్ల అధికారుల ధోరణికి నిరసనగా లచ్చన్న బృందం ఒకనాడు దిగంబరులై కూర్చున్నారు. కాంగ్రెసు పెద్దలు ఇంకా అంతటి స్థాయికి పోలేక, యువకులకు ఎలాగో సర్ది చెప్పి, ఆ ప్రయత్న విరమణ చేయించారు. ఎస్.ఎస్.ఎల్.సి.లో ఉత్తీర్ణులైనట్లు జైల్లో వుండగా తెలిసింది.
రైల్వై సిగ్నల్ శిక్షణ
ఈ విధంగా జైలు శిక్ష అనుభవించి వచ్చిన లచ్చన్నకు తరువాత ఏమి చెయ్యాలో తోచలేదు. అప్పటికే ఉప్పు సత్యాగ్రహం చప్పబడింది. గాంధీ-ఇర్విన్ ఒడంబడిక వచ్చింది. (1931 మార్చి) బ్రతుకు తెరువు మార్గాంతరం చూసుకోవాలనుకొని రైల్వే సిగ్నలర్ శిక్షణ పొందితే ఏదైనా ఉద్యోగం వస్తుందని ఆశించాడు. రైల్వే సిగ్నలర్ గా ఉద్యోగం చేస్తున్న ఒక తెలిసిన వ్యక్తి చెంత అనధికారికంగా శిక్షణ పొందటం ఆరంభించాడు. ప్రతిరోజూ బారువ నుండి 3 మైళ్ళు సైకిల్ పై వెళ్ళి, శిక్షణ పొంది వస్తుండేవాడు. మూడుమాసాలపాటు ఈ శిక్షణ కార్యక్రమము జరిగింది.
కల్లు దుకాణాల పికెటింగ్
ఉప్పు సత్యాగ్రహోద్యమంలో శిక్ష అనుభవించిన వారితో సహా కొందరు పర్లాకిమిడిలో ఒక సత్యాగ్రహ శిబిరం ప్రారంభించి జిల్లా అంతటా కల్లు దుకాణాల ముందు పికెటింగ్ జరపాలని, కల్లు త్రాగటం మాన్పించాలని తీర్మానించుకున్నారు. తదనుగుణంగా బారువలో దుర్లభసాన్, అప్పనపాఢి అనే వారిరువురు ఉత్సాహంగా ముందుకొచ్చి శిబిరం ప్రారంభించేసరికి, లచ్చన్నకు మళ్ళీ పని తగిలింది. సిగ్నల్ శిక్షణకు స్వస్తి పలికి రంగంలోకి దిగాడు. కాని వెంటనే ఆయన్నెదుర్కొన్న సమస్య గృహసమస్యే. కల్లు దుకాణం తన యింటనే ఉన్నది. తండ్రి కల్లు తాగుతాడు. ఇంట గెలిచి రచ్చగెలవాలి గదా! కనుక కల్లు దుకాణం తన యింట్లో మూసేసే వరకు యింటికి రానని భీష్మించటంతోపాటు, తండ్రి తాగటం కూడా మానాలని వరం కోరాడు. ఒకటి కుటుంబ జీవనాధార సమస్య. రెండవది వ్యక్తిపరమైన అలవాటుకు సంబంధించినది. తల్లిదగ్గర లచ్చన్న పట్టిన పట్టు పనిచేసింది. దుకాణం మూతపడింది. పదిమంది ఎదుట తండ్రి తాను తాగనని లచ్చన్న వద్ద ప్రమాణం చేశాడు. ఆవిధంగా ఇంట గెలిచిన లచ్చన్నకు వీధినబడే నైతికబలం చేకూరింది. అయితే తండ్రి అలవాటు మానుకోలేక, చాటుమాటుగా పుచ్చుకొని లచ్చన్నకు తెలియనివ్వద్దని చూచిన వారిన బ్రతిమాలుకునేవాడు.
కల్లు అమ్మటం మాన్పించిన లచ్చన్న ప్రత్యామ్నాయంగా జీవనాధార విషయం ఆలోచించలేదు. ఇతర కల్లు దుకాణాల వద్ద పికెటింగ్ చేయటంలో ఆయన నిమగ్నుడయ్యాడు. బారువాలోనే గాక సోంపేట, ఇచ్ఛాపురం వరకు కోస్తా ప్రాంతంలో ప్రతి కల్లు దుకాణంవద్ద పికెటింగ్ చేశారు. కులంవారీగా సమావేశాలు జరిపి కులకట్టుబాటుగా త్రాగరాదనే తీర్మానం చేయించారు. త్రాగితే జరిమానా వేస్తామన్నారు. త్రాగినవారి కూపీ యిచ్చినవారికి పారితోషికాలు యిచ్చారు. స్త్రీలకయితే చీరెలు బహుమానంగా యిచ్చేవారు. ఉద్యమంగా సాగిన ఆ పికెటింగ్ కార్యక్రమంలో చాలా కల్లు దుకాణాలు మూయించారు. కాని మరో ప్రక్క లచ్చన్నపై ఆయన కులం వారికి అసంతృప్తి పెరిగింది. మార్గాంతరం చూపకుండా జీవనాధారం ఆపేశాడని కోపం తత్ఫలితంగా బారువాలో లచ్చన్న కుటుంబాన్ని వెలిగా చూడటంతోపాటు, లచ్చన్న సోదరిని ఆమె అత్తగారు పంపించేశారు. అంతటితో ఆగలేదు. ఉద్యమాల్లో పాల్గొంటున్న లచ్చన్నను ఆయన పినతండ్రి అణంగి దండయ్య ఒకరోజు త్రోవకాచి, కొట్టాడు. కాని గ్రామస్తులంతా దండయ్యను దండించి లచ్చన్న ప్రక్క నిలబడ్డారు.
హరిజనోద్ధరణ
లచ్చన్న హరిజనుడని, అంటరానివాడని విదేశ పండితులు అనుకోటానికి బహుశా, ఆయన హరిజనులతో అంతగా కలిసిమెలిసి పనిచేయటమేనేమో చూడండి HOWARD L.E. RDMAM వ్రాసిన The Swantantra Party, Indian Conservatism. 1967లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రచురించిన యీ గ్రంథంలో ఆ పండితుడు లచ్చన్నను హరిజన నాయకుడని (పుట 120), అంటరానివాడని (పుట 199) వ్రాశాడు. ఇలాంటి విషయాలు వ్రాసేటప్పుడు జాగ్రత్త వహించటం పండితుల ప్రథమ కర్తవ్యం. బారువలో అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమానికి నాంది పలికిన వ్యక్తి ఎం.జి.వి.జి. సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడు. నాటి వేదపండితులైన బంకుమల్లి మల్లయ్య శాస్త్రిని పిలిపించి, హరిజనులను అంటరానివారిగా చూడరాదనే విషయం చెప్పించటానికి సభ ఏర్పాటు చేశారు. లచ్చన్న కూడా రంగంలో దిగి, హరిజనవాడలో రాత్రి పాఠశాల ప్రారంభించాడు. ఆ పాఠశాల విద్యార్థిగా తొలుత చేరిన కొత్తపల్లి పున్నయ్య ఉత్తరోత్తరా లచ్చన్నకు చాలా సన్నిహితుడయ్యాడు. లచ్చన్న కేవలం పాఠశాలతో ఆగక గ్రామంలోని ఒక బావి అయినా హరిజనులు వాడుకోవటానికి అంగీకరించాలని పట్టుబట్టాడు. గ్రామ పెద్దల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఒక బావిలో హరిజనుల చేత నీళ్ళు తోడించాడు. పెద్దలలో అభిప్రాయాలు పొడసూపినయి. ఆగ్రహులైన పెద్దలు ముందు లచ్చన్న కుటుంబంపై కసి తీర్చుకున్నారు. చాకలి, మంగలి ఆయింటికి వెళ్ళకుండా కట్టుదిట్టం చేశారు. హరిజనులు తెచ్చుకునే కుండల్ని పగులగొట్టారు. చివరకు, వారు నీడుతోడుకునే బావిలో చచ్చిన పిల్లుల్ని, అశుద్ధాన్ని వేశారు. అప్పటికీ లచ్చన్న లొంగి రాకపోయేసరికి పెద్దలంతా ఒక సభ పెట్టి హరిజనులు బావిని వాడటానికి వీల్లేదని తీర్మానించారు. కాని హరిజనులపై వూరివారు చేయిచేసుకుంటే బుర్రలు ఎగిరిపోతాయని లచ్చన్న ఉద్రేకంగా హెచ్చరించాడు. తరువాత పరిస్థితులు విషమించక పూర్వమే, గ్రామంలో కలరా సోకింది. అప్పుడు లచ్చన్న బృందమే తెగించి, సేవలు చేశారు. అప్పుడు కులం, గోత్రం ఎవరూ పట్టించుకోలేదు. అంతటితో హరిజనులపై కోపము పట్టుదల సడలింది.
తలతంపర జమీపై పోరాటాలు
సేవాదళ్ శిబిరంలో శిక్షణ
కాంగ్రెస్ పార్టీలో తొలుత దేశ వ్యాప్తంగా ఒక వలంటీర్ల దళం ఏర్పాటు చేయాలనే ప్రయత్నం చేసింది హర్డికర్. తదనుగుణంగా ఆంధ్రలోకూడా ఒక శిక్షణ శిబిరం కాకినాడలో జరిగింది. మైసూరు నుండి భట్టు, దయానందరావు అనే వారిరువురు వచ్చి యీ శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. లచ్చన్న అందులో శిక్షణ పొందాడు. గంజాం జిల్లా కాంగ్రెస్ నిర్వహించిన మరొక శిబిరంలోనూ లచ్చన్న శిక్షణ పొందాడు. కాకినాడలో శిక్షణ శిబిరం జరుగుతున్న రోజులలో శాసనోల్లంఘనోద్యమం ప్రారంభమైంది.  (1932 జనవరి నుండి) ప్రభుత్వం 144వ సెక్షన్ అమలు జరిపింది. ప్రభుత్వ ఆంక్షల్ని ధిక్కరించిన లచ్చన్న పట్టుబడకుండా, యించుమించు మూడు వారాలపాటు జిల్లాలో తిరిగాడు. చివరకు పట్టుబడడంతో పాటు, లాఠీ దెబ్బలు చవిచూచి, ఆరుమాసాల శిక్ష అనుభవించటానికై రాజమండ్రి జైలుకు ‘సి’ తరగతి ఖైదీగా పంపించబడ్డాడు.
టెర్రరిస్టు వాసనలు
రాజమండ్రి జైలులో కొందరు టెర్రరిస్టులతో లచ్చన్నకు తొలిపరిచయమైంది. భగత్ సింగ్ కేసుకు సంబంధించిన ముద్దాయి సిన్హా ఒక్కడే కలిశాడు. అప్పటికే అన్నాప్రగడ కామేశ్వరరావు, కాకరాల కామేశ్వరరావు, చల్లా అప్పారావు, మద్దూరి అన్నపూర్ణయ్య ప్రభృతులు టెర్రరిస్టులుగా ప్రసిద్ధి చెందారు.  అదీగాక బెంగాల్ టెర్రరిస్టులు కొందరు ఆంధ్ర మద్రాసు ప్రాంతాల జైళ్ళలో ఉండి, టెర్రరిస్ట్ భావాలు వ్యాపింపచేశారు. జైలునుండి విడుదల అయిన తరువాత, బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలద్రోయటానికి కొన్ని పన్నాగాలు పన్నారు. రాజమండ్రి, కడలూరు, బళ్ళారి జైళ్ళలో జరిగిన యీ నిర్ణయాలు అమలుపరచటానికి లచ్చన్న కూడా అంగీకరించాడు. జైలు నుండి టెర్రరిస్ట్ మనస్తత్వంతో ఇంటికి వెళ్లిన లచ్చన్నకు, మిడ్నపూరులో కలెక్టర్.ను చంపి, పారిపోయి, తలదాచుకోటానికి వచ్చిన ఒక టెర్రరిస్ట్ తారసిల్లాడు. అతనికి ఐదురోజులపాటు స్వగృహములో ఆతిథ్యం యిచ్చి పంపాడు లచ్చన్న. కాని ఏ కారణం వలన అయితేనేమి జైలులో వేసుకున్న పథకం ప్రకారం యితర టెర్రరిస్టులు లచ్చన్నను సంప్రదించకుండానే రంగంలోకి దిగారు. కాకినాడలో బాంబు ప్రేలుడు జరిగింది. ఆనాడే మద్రాసు తదితర చోట్ల కూడా కొన్ని విఘ్న చర్యలు అమలుపరిచారు. తనకు తెలియపరచనందుకు ఆగ్రహావేశపరుడైన లచ్చన్న తల్లిదండ్రులు దాచుకున్న డబ్బు చెప్పకుండా తీసుకుని, తొలిసారి బెజవాడ చేరారు. మొగల్ రాజపురంలో పూర్ణచంద్రరావు యింట నారాయణరావు అనే టెర్రరిస్ట్ లచ్చన్నను నిరుత్సాహ పరచగా, లాభం లేదనుకొని, ముదునూరు వెళ్ళి అన్నె అంజయ్యను కలుసుకున్నాడు. ఆయన కూడా నిరుత్సాహంగానే మాట్లాడగా రైలెక్కి బారువ బదులు బర్హంపూర్ వెళ్ళాడు. జైలు స్నేహితుడైన యజ్ఞనారాయణ ఇంట్లో ఉన్నాడు. అప్పుడు బర్హంపూరు రైల్వేస్టేషన్ మాస్టర్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ యిరువురూ ఆంధ్రులు, కలకత్తా ప్రయాణమయిన లచ్చన్నకు సౌహార్దంగా వీడ్కోలు చెప్పారు. కాని, డబ్బు చాలదనే భయంతో లచ్చన్న రైలు ప్రయాణంమాని కాలినడకన భద్రక్ చేరేసరికి, తీవ్రంగా జ్వరపడ్డాడు. రైల్వే టికెట్ కలెక్టర్ సాయంతో అలాగే ఖర్గపూర్ చేరుకున్నాడు. కానీ పట్టణంలో కర్ఫ్యూ అమలులో ఉన్నది. జైల్లో వ్రాసుకున్న టెర్రరిస్టు చిరునామాల ననుసరించి గృహాలు వెతుకుతుంటే ఎవరూ దొరకలేదు, ఉన్న ఒక్కతను లచ్చన్నను యింటికి పొమ్మన్నాడు. మిడ్నపూర్ వెళ్ళాడు. అక్కడా చుక్కఎదురైంది. టాటానగర్ చేరాడు. అప్పటికి డబ్బుతోపాటు ఉత్సాహం కూడా అయిపోయింది. ఇచ్ఛాపురంలోని ఒక బాల్యమిత్రుడు తటస్థపడగా, అతనింట్లో వుంటూ, ఊళ్లో టెర్రరిస్ట్లకై అన్వేషించాడు. వాళ్లెవరూ దొరకలేదుగాని, స్నేహితుడు అనుమానించసాగాడు. అప్పటికి లచ్చన్నకు సన్నిపాత జ్వరం వచ్చింది. ఆ మిత్రుడు లచ్చన్న విషయమై ఇంటికి ఉత్తరం వ్రాయగా, సోదరుడు సూర్యనారాయణ నూరు రూపాయలు పంపిస్తూ, ఎలాగైనా లచ్చన్నను యింటికి చేర్చమని, ఉత్తరం వ్రాశాడు. ఇది లచ్చన్నకు తెలియకుండా జరిగినా, ఇంటి ధ్యాసలో పడిన లచ్చన్న ధోరణి కనిపెట్టిన ఆ స్నేహితుడు బర్హంపూర్ వరకు తోడుగా వచ్చి, అక్కడ లచ్చన్న బంధువులు తటస్థపడగా వారికి అప్పగించాడు. ఆవిధంగా టెర్రరిస్టు ఉద్రేకం తాత్కాలికంగా లచ్చన్నను ఆవరించి, సడలిపోయింది.
రంగా శిష్యరికం
1934లో నేటి శ్రీకాకుళం (నాడు ఉత్తర విశాఖ) జిల్లా అంతటా విపరీతమైన కరువు సంభవించింది. టెక్కలిలో పశువులు, మనుషులు యించుమించు ఒకేరీతిలో మరణించిన ఘట్టమది. అంతదారుణం జరుగుతున్నా రైతులు ప్రభుత్వానికి మహజర్లు పెట్టటానికి జంకారు. కారణం – నిన్నటివరకూ రాజభరణాలివ్వాలని పోరాడిన జమీందార్ల పాలన అక్కడ అమలులో వుండటమే. వారే ప్రభుత్వం సర్వస్వం. వారి మాటకు ఎదురు లేదు.
లచ్చన్న ప్రాంతమంతా తలతంపర ముఠా అనబడే 21 గ్రామాలలో కూడిన ఎస్టేట్, ఆనాడు జమీందార్ల భూముల్ని కవులుకు తీసుకున్న రైతులు మందసాలో ఎకరాకు 30 బస్తాలు, బొబ్బిలిలో ఎకరాకు 40 బస్తాలు, బారువలో పంటలో సగం జమీందార్లకు యిచ్చుకోవాల్సిందే. ఒక ప్రక్కన పంటలు పోయి, ఆర్థికంగా చితికిపోతున్న రైతుల్ని గమనించక జమీందార్లు తమ కవుళ్ళు యివ్వనందుకు జప్తులు చేసిన రోజులవి. కాంగ్రెసు అధిష్టాన వర్గం అప్పటికి జమీందారీ  వ్యతిరేక విధానం అవలంభించలేదు. కమ్యూనిస్టులు, సోషలిస్టులు సైతం రైతు వ్యవస్థకు మద్దతునివ్వలేదు. అదీ స్థితి.
అప్పుడు లచ్చన్న రంగంలో దిగి గ్రామాలు తిరిగి, రైతుల్ని ప్రోత్సహించి, మహజర్లు పెట్టమని పురికొల్పాడు. ఇక చూస్తూ వూరుకుంటే ప్రయోజనం లేదని, నౌపడలో ఒక శిబిరం ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి మహజర్లు పంపించే కార్యక్రమాన్ని చేపట్టాడు. అవసరమైతే తానే వేలిముద్రలు వేసి, ఆయా రైతుల పేరిట మద్రాసు ప్రభుత్వానికి మహజర్లు ఉప్పెన పంపించాడు. మలబారులో పర్యటిస్తున్న రంగాను రమ్మని తంతిద్వారా కోరాడు. రంగా వెంటనే వచ్చి కాలినడకనే మూడు రోజులలో 20 గ్రామాలు పర్యటించి, రైతుల్ని ప్రోత్సహిస్తూ ఉపన్యాసాలు చేశాడు. అంతగందరగోళం జరిగితే, మద్రాసు ప్రభుత్వం కదలి ఒక రెవిన్యూ సభ్యుణ్ణి పంపింది. ఆయన టెక్కలి మిషనరీ బంగళాలో మకాం పెట్టి, విచారణకు పూనుకున్నాడు. లచ్చన్న రైతుల్ని పోగుచేసి ఆ సభ్యుని వద్దకు ఒక ఆకలి యాత్ర నడిపించాడు. ఇదంతా చూచిన తర్వాత, ఆ సభ్యుని సిఫారసులపై ప్రభుత్వం కొన్ని సహాయ కార్యక్రమాలు తలపెట్టింది. అంతటితో ఆ సమస్య ఉపశమించింది.
కాంగ్రెసు సోషలిస్టు పార్టీలో
1934లో గాంధీ నాయకత్వాన కాంగ్రెసు అంతగా పురోగమించని సందర్భంలో సోషలిస్టు పార్టీ పుట్టింది. జయప్రకాశ్ నారాయణ్ పాట్నాలో దీనికి బీజాంకురాలు నాటాడు. 1935 జనవరిలో జయప్రకాశ్ ఆంధ్రలో పర్యటించి, పార్టీని పటిష్టం చేయమని ప్రోత్సహించాడు. 1936 లక్నో కాంగ్రెస్ నాటికి బాగా సభ్యత్వం చేర్పించాలన్నాడు. ఆంధ్రలో కాంగ్రెసు సోషలిస్టు తొలి మహాసభ 1935 ఫిబ్రవరి 19న గుంటూరులో జరిగింది. తెన్నెటి విశ్వనాథం అధ్యక్షత వహించగా, మసాని ప్రారంభించారు. అప్పుడు ఏర్పడిన ఆంధ్ర కార్యవర్గంలో లచ్చన్న సభ్యుడయ్యాడు. అల్లూరి సత్యనారాయణరాజు, అన్నె అంజయ్య, పుచ్చలపల్లి సుందరయ్య అందులో సభ్యులు. తరువాత ఆంధ్ర మహాసభలు విశాఖలో జరిగిన సందర్భంగా, బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షతన ఒకరోజు సోషలిస్టు పార్టీ మహాసభ జరిగింది. కాంగ్రెసు నుండి విడిపోయే వరకు లచ్చన్న కార్యవర్గ సభ్యుడుగా కొనసాగాడు.
ఒక ఏడాది శ్రీకాకుళం ప్రాంతీయ సోషలిస్టు సమావేశాలు జరిపినప్పుడు స్వామి సహజానంద సరస్వతి అధ్యక్షతవహించారు. ఇందూలాల్ యాజ్ఞిక్ సభలకని వచ్చి, లచ్చన్నకు తన కొత్త బట్టలిచ్చి అక్కడక్కడా చింపించి, పాచికలు వేయించ మన్నాడట. అది కనువిప్పు కలిగించే విషయంగా లచ్చన్న భావించాడు.
లక్నో కాంగ్రెసు సమావేశాలకు లచ్చన్న, సుందరయ్య, అల్లూరి సత్యనారాయణ రాజు కలసి ప్రయాణం చేశారు. సభల నుండి తిరిగి వస్తూ, ఢిల్లీలో ఆగి ప్రదేశాలు చూస్తూ కుతుబ్ మినార్ వద్ద ఒక పందెం వేసుకున్నారట. ఎక్కడా ఆగకుండా ఒకే పరుగున కుతూబ్ మీనార్ పైకి వెళ్ళాలి. ఆ పందెంలో సుందరయ్యే గెలుపు. లచ్చన్న, అట్లూరి మధ్యలో ఆగిపోయారు. అదొక మధుర స్మృతిగా లచ్చన్న పేర్కొంటుంటారు.
1936 నుండి కాంగ్రెసు నుండి రాజీనామా యిచ్చేటంతవరకూ లచ్చన్న ఎ.ఐ.సి.సి. సభ్యుడు. ఇంచుమించు అన్ని సమావేశాలకు (జైలు జీవితంలో తప్ప) హాజరయ్యాడు. లచ్చన్నను రంగానుండి విడదీసి, తమ పార్టీలో చేర్చుకోవాలని, కాంగ్రెసులో ఉంటున్న కమ్యూనిస్టులు ఆంతరంగిక సమావేశాల్లో చర్చించినట్లు అల్లూరి సత్యనారాయణరాజు లచ్చన్నకు ఉత్తరోత్తర వెల్లడించాడట.
జైలునుండి తిరిగి వచ్చేసరికి లచ్చన్న కుటుంబపు ఆర్థిక పరిస్థితులు బాగా చితికిపోయాయి. వృత్తి మానేయటం ఇందుకు ప్రధాన కారణం. తండ్రి బాగా వృద్ధుడయ్యాడు. అన్న ఉపాధ్యాయుడు. సంపాదించేది చాలదు. అలాంటి పరిస్థితుల్లో బారువలో ఉన్న కొంప కాస్తా అమ్ముకుని, అద్దెఇంట్లో ఉండేవారు. కాని బారువలో లచ్చన్నకు ఇద్దరు వ్యక్తులు ఆర్థికంగా తోడ్పడుతుండేవారు. అల్లాడ లక్ష్మోజీ, భరతుసాపు. రెండో అతను కాఫీ హోటలు యజమాని, లచ్చన్నకే గాక అతని అనుచరులకు సైతం ఆ హోటల్లో సర్వవేళల్లో సదుపాయాలు, సౌకర్యాలు సరఫరాలు అందేవి. అలా గడుస్తుండేది లచ్చన్న జీవితం.
1935 వేసవిలో లచ్చన్న జీవితంలో శూన్యం ఆవరించింది. చేసేపని లేదు. ఉద్యమాల్లేవు. తిరిగి స్వగ్రామంలో హాయిగా పేకాటలో నిమగ్నుడయ్యాడు. అలాంటి సందర్భంలో ఒకనాడు పుల్లెల శ్యామసుందరరావు వచ్చి బలవంతాన లచ్చన్నను బయటకు లాగి, పురికొల్పి, దారిఖర్చులిచ్చి, రంగా నడుపుతున్న రాజకీయ పాఠశాలకు వెళ్ళమని రైలెక్కించాడు. లచ్చన్నకు జిల్లా స్థాయిలో నాయకుడు, మార్గదర్శిగా పుల్లెల శ్యామసుందరరావు చనిపోయే వరకు నిలబడ్డాడు.
రంగాజీ రైతాంగ పాఠశాలలో
7-11-1933 శ్రీకాకుళం ప్రాంతములో పర్యటిస్తున్న సందర్భముగా తొలిసారి రంగాను దర్శించిన లచ్చన్న, కరువు సందర్భములో ఆయన ఉపన్యాసాలతో ఉత్తేజితుడై ఉండటం. వీటన్నిటివలన, రంగా రాజకీయ పాఠశాలకు అనగానే సంతోషముగా వెళ్ళాడు లచ్చన్న. ఆ విధంగా ఎస్.ఎస్.ఎల్.సి.తో ఆపేసిన చదువును మళ్ళీ రంగా పాఠశాలలో రాజకీయ విద్యార్థిగా కొనసాగించాడు. 1935 నుండే వరుసగా మూడేళ్లు నిడుబ్రోలు వేసవి పాఠశాలకు విద్యార్థిగా వెళ్ళి, సిద్ధాంతాలను ఆకళింపు చేసుకున్నాడు. అది ఒకవిధంగా లచ్చన్న రాజకీయ మనస్తత్వానికి ప్రాతిపదిక అనవచ్చు.
రంగా 1934లోనే రాజకీయ పాఠశాలలు ప్రారంభించాడు. తొలి సంవత్సరం జిల్లాలో కరువు కారణంగా లచ్చన్న హాజరు కాలేదు. ఆంధ్రలో రాజకీయ పాఠశాల ప్రారంభించింది రంగా మాత్రమే. తరువాత అన్ని పార్టీలవారు, ముఖ్యంగా కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాల ప్రచారానికి పాఠశాలలు పెట్టారు. రంగా పాఠశాలలో శిక్షణ పొందినవారిలో కమ్యూనిస్టులతో సహా అన్ని రాజకీయ పక్షాలవారు వున్నారు. 1935లో లచ్చన్నతోపాటు మాకినేని బసవపున్నయ్య కూడా విద్యార్థిగా పాఠశాలలో వున్నాడు.
రాజకీయ పాఠశాల పాఠ్యప్రణాళిక చూస్తే లచ్చన్న నేర్చుకున్న విషయాలేమిటో వేరే చెప్పనక్కరలేదు. ఆ అంశాలు ఇవి – 1. ఆదిమకాలం నుండి పెట్టుబడిదారీ, పారిశ్రామిక వ్యవస్థ పరిణామం, 2. ఫాసిజం 3. ఇతరచోట్ల ఫాసిస్టు అవకాశాలు,                                              4. పెట్టుబడిదారుల వ్యవస్థా నిర్మాణం, 5. వాణిజ్య సంస్థల ఆర్థిక వ్యవస్థ పరిశీలన, 6. పారిశ్రామికీకరణ 7. మన ఆర్థిక వ్యవస్థ విధానపు వ్యయం 8. దేశరక్షణ పారిశ్రామిక విధానం వలన బాగుపడేవారు. 9. పారిశ్రామిక జనావళి 10. కార్మికుల ప్రత్యక్షచర్యల చరిత్ర 11. మూడవ అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థ ఏర్పాటు 12. ఆచరణయుక్తమైన సంస్కరణలు 13. జాతీయీకరణ, వ్యక్తిపరమైన వ్యాపారాలు 14. వ్యవసాయం, 15. భూమిశిస్తు  16. జమీందారీ వ్యవస్థ రైతులు 17. జమీన్ రైతుల సంఘటితం 18. జమీందారీ విధానం రద్దు 19. రాజ్యాంగాలు 20. శాసనసభల విధానం, 21. ప్రాతినిధ్యపు సంస్థలు 22. మంత్రిమండలి  23. భారత రాజ్యాంగం  24. భారత రాజ్యాంగం-ప్రజలు 25. స్థానిక స్వపరిపాలన 26. బడ్జట్ రీతులు 27. ప్రభుత్వవ్యయాలు 28. భారత ప్రభుత్వ రుణం 29. ప్రభుత్వోద్యోగాలు 30. ప్రజారోగ్యము – పారిశుభ్రత 31. ప్రజల విద్య 32. విదేశ విధానం 33. సోషలిస్టు భావచరిత్ర 34. సహకారోద్యమం  35. కార్మికోద్యమం  36. కార్మిక శాఖలు 37. నిరుద్యోగం  38. కరువు నివారణ విధానం  39. పౌరహక్కులు  40. మతం  41. పత్రికలు ప్రచారం, 42. గ్రామ పునర్నిర్మాణం 43. వయోజన విద్య  44. గ్రంథాలయోద్యమం  45. గ్రామాలకు నీటిసరఫరా  46. ప్రజాపోరాటాలు  47. ప్రజల మనుగడకు అనుకూలంగా ప్రపంచాన్ని మార్చే తీరులు (ఇంకా వివరాలకు చూడండి) The modern Indian Pensant by N.G.Ranga, Kisan Publications, 23 stringer street, Madras.
1935 ఏప్రిల్ నుండి జూన్ వరకు ఎనిమిది వారాలపాటు నిడుబ్రోలులో జరిగిన యీ పాఠశాల (చూడు పుట 98 పైన పేర్కొన్న గ్రంథం) లచ్చన్న పైన పేర్కొన్న విషయాలన్నీ నేర్చుకున్నాడు. బహుశ పై చదువులు చదివినా ఇన్ని విషయాలూ ఎక్కడా చెప్పేవారుకాదు. కనుకనే లచ్చన్నకు సిద్ధాంతపరమైన పునాదులు యేర్పడినవి. లచ్చన్న ఇప్పటికి తరచు అంటుంటాడు. తాను ఎస్.ఎస్.ఎల్.సి. గ్రాడ్యుయేట్ మాత్రమేనని. అంటే లాంఛన ప్రాయమైన పట్టాలు లేవు.
రంగా రాజకీయ పాఠశాలకు హాజరైన లచ్చన్న అప్పటి నుండీ రంగాను గురువుగా భావించాడు. అదేగాక, రాజకీయ పాఠశాల విద్యార్థుల్ని రంగా దంపతులు ఎంతో ఆప్యాయంగా ఆదరించి, వారి కుటుంబ యోగక్షేమాలతో సహా పరామర్శించి ఆప్యాయంగా చూడటంవలన కూడా, లచ్చన్న మరీ సన్నిహితుడయ్యాడు. రంగాకు సంతానము లేనిలోటు కూడా ఒకవిధంగా యిలానిండేది. అంతకు పూర్వమే భారతీదేవికి ఒకసారి గర్భస్రావం గావటం, ఇక సంతానం కలగరని వైద్యులు చెప్పటంతో వ్యక్తిగతంగా విచారం, లోటు అనిపించినా, రాజకీయంగా దృష్టి నిమగ్నతకు తోడ్పడింది.
బడారాజులకు వ్యతిరేకంగా కాంగ్రెసులో కృషి, అధికారం
పాఠశాల నుండి తిరిగివచ్చి లచ్చన్న తన ప్రాంతములో అనేక చిన్న రాజకీయ పాఠశాలలు నిర్వహించి రంగా, న్యాపతి నారాయణమూర్తి, పుల్లెల శ్యామసుందర రావుగారల పర్యటన కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. కాని బొబ్బిలిలో బహిరంగ సభ జరపటానికి రాజా అభ్యంతర పెట్టి, రౌడీలను నియమించాడు. వారి దృష్టి మళ్ళించటానికై లచ్చన్న బృందం “రైతు భజనావళి”లోని గేయాలు పాడుతూ బొబ్బిలి వీధుల్లో తిరుగుతుంటే రౌడీలు వారి వెంటబడ్డారు. ఆ సమయంలో బొబ్బిలిలోని తాండ్రపాపారాయుడు మండపములో బహిరంగ సభ పెట్టి రంగా గంభీరోపన్యాసం చేశాడు. అప్పటి నుండి కోటగిరి సీతారామారావు ఉత్తేజితుడై బయటపడి రంగా అనుచరుడయ్యాడు. బొబ్బిలిలో రాజాకు వ్యతిరేకంగా బహిరంగ సభ జరపటం అదే మొదటిసారి. అంతకు క్రితమే ఒక పర్యాయం రంగాను చంపించాలని బొబ్బిలిలో రాజా ఆడవరం వద్ద ప్రయత్నించి, రంగా విడిది గృహాన్ని తగలపెట్టించాడు. కాని ముందే పసిగట్టిన లచ్చన్న ప్రభృతులు రంగాను మరొక చోటకు తరలించారు. ఇలా రంగా పరిథిలో ఆకర్షితుడైన లచ్చన్న, అన్నివిధాలా బాంధవ్యం పెంచుకున్నాడు.
బ్రిటిష్ ప్రభుత్వం 1935లో తెచ్చిన చట్టానుసారం రాష్ట్ర శాసనసభలకు 1937 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. టెక్కలి నియోజవర్గం నుండి కాంగ్రెసు అభ్యర్థిగా నాటి శ్రీకాకుళం జిల్లా నాయకుడు పుల్లెల శ్యామసుందరరావు పోటీ చేసాడు. లచ్చన్న నియోజకవర్గంలో విపరీతంగా తిరిగి కృషిచేశాడు. శ్యామసుందరరావుకు పోటీగా సర్ ఎ.పి.పాత్రో నిలబడ్డారు. అలాగే బొబ్బిలి రాజుపై కాంగ్రెస్ అభ్యర్థిగా వి.వి.గిరి పోటీచేశారు. లచ్చన్న ఆనాడు గిరి పక్షాన కూడా ప్రచారం సాగించాడు. (చూడండి అఖిలాంధ్ర వీరసంస్మరణ కుసుమాంజలి. కొవ్వూరు 1953) ఆ ఎన్నికలలో శ్యామసుందర రావును అభ్యర్థి కాకుండా చేయాలని శ్రీకాకుళంలో ఎందరో ప్రయత్నించినా కళా వెంకటరావు తోడ్పాటు వలన పుల్లెలవారే నెగ్గారు. పాత్రోపై 9 వేల ఓట్లు అధికంగా వచ్చాయి. అయితే ఎన్నికల సందర్భంగా పాత్రోకు ఒక బహిరంగ లేఖ వ్రాసి, పంచాడు లచ్చన్న. అది ఆధారంగా పాత్రో ఎన్నికల అనంతరం పరువునష్టం దావా వేసి పుల్లెల ఎన్నికను రద్దు చేయించాలని ప్రయత్నించాడు. తొలిసారి లచ్చన్న సాక్షిగా బోనులో నిలబడి పుల్లెలను సమర్థించాడు. లచ్చన్న రైతు కాదు గనుక ఎస్టేటుదారుకూ, రైతులకూ మధ్య తగాదాలలో సాక్ష్యం చెప్పే అర్హత ఆయనకు లేదని విచారిస్తున్న సబ్ – కలెక్టరు అభ్యంతరం తెలిపాడు. అతనొక ఐ.సి.ఎస్. అధికారి. లచ్చన్న సమాధానం చెబుతూ దివాన్ గిరి లేని వ్యక్తి దివాన్ గా యీ కేసులో ఉండరాదని ఎదురు అభ్యంతరం తెచ్చాడు. అంతటితో లచ్చన్నను సాక్ష్యం చెప్పనిచ్చారు. అలాంటి రణపెంకి లచ్చన్నంటే.
శాసనసభ ఎన్నికలు కాగానే మద్రాసులో రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ప్రకాశం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి వదలి రెవిన్యూ మంత్రి అయ్యాడు. అతని స్థానంలో పట్టాభి సీతారామయ్య అధ్యక్షుడు కాగా, కార్యదర్శిగా గొట్టిపాటి బ్రహ్మయ్య వచ్చాడు. ఉత్తర విశాఖ జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడుగా పుల్లెల శ్యామసుందరరావు, కార్యదర్శిగా లచ్చన్న ఎన్నిక అయినప్పటికీ ఎన్నికైన సంఘాన్ని రద్దుచేసి, జిల్లా సంఘంపై విచారణ జరపాలంటూ, ఒక అడహాక్ సంఘాన్ని రాష్ట్ర కాంగ్రెసు నియమించింది. అడ్ హాక్ సంఘాలు నాటికీ నేటికీ కాంగ్రెసుకు ఆనవాయితీగా వస్తున్నవే. వారిక్ ప్రజాస్వామ్యంలోగల నమ్మకం అలాంటిది. రాష్ట్ర కాంగ్రెసు ప్రతినిధిగా గొట్టిపాటి బ్రహ్మయ్య వచ్చి, ఛార్జి ఇవ్వమన్నాడు.  ఒక యినాందారింట్లో కాంగ్రెస్ కార్యాలయం ఉండేది. సమావేశానికి జిల్లా నలుమూలల నుండి ప్రతినిధులు లారీలపై కిసాన్ ఎర్రజండాలతో వచ్చారు. ఎన్నికైన సంఘాన్ని రద్దు చేసినందుకు కార్యకర్తలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. సమావేశంలో జిల్లా సంఘంపై ఆరోపణలు ప్రస్తావనకు రావటం, వాదోపవాదాలు పెరగటం, లచ్చన్న అనుయాయుల్ని రౌడీలని గొట్టిపాటి బ్రహ్మయ్య అనటం, కార్యకర్తలు తలుపులు మూయటం, తిరిగి అప్పల నాయుడు చొక్కా చేతులు పైకి తీయటం ఒకదాని వెంట ఒకటి నాటకంలో సీనుల్లాగా జరిగాయి. లచ్చన్నకు అండగా, కుడి భుజంగా కిల్లి అప్పలనాయుడు అప్పుడే రాజకీయరంగంలో ప్రవేశించాడు. సమయం మించిపోతున్నదని గ్రహించిన పుల్లెల శ్యామసుందరరావు లచ్చన్నను బ్రతిమలాడి, సర్ది చెప్పి, గొట్టిపాటి బ్రహ్మయ్య చేత క్షమాపణ కోరించాడు. అంతేగాక ఎన్నికైన సంఘాన్ని గుర్తిస్తున్నట్లు కూడా ప్రకటించాడు బ్రహ్మయ్య. అప్పుడు తలుపులు తెరుచుకున్నాయి. కిల్లి అప్పలనాయుడు చొక్కా సర్దుకున్నాడు. రాజకీయాల్లో లచ్చన్న పట్టుదల అలాంటిది.
1937 నుండి లచ్చన్న అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడుగా కాంగ్రెసు సమావేశాలకు వెళ్ళేవాడు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా 1938లో నెగ్గాడు.
చారిత్రక రైతు యాత్ర
శ్రీకాకుళం ప్రాంతంలోని రైతులు జమీందార్ల నిరంకుశ విధానాల వలన పడుతున్న కష్టాలు కాంగ్రెసు ప్రభుత్వం  గమనించలేదు. కనుక వారి దృష్టికి యీ సమస్య తీసుకెళ్ళాలని జిల్లా నాయకులు నిశ్చయించారు. దీనికి రైతు యాత్ర నడపాలని తలపెట్టారు. జిల్లా కిసాన్ సంఘాధ్యక్షుడుగా పుల్లెల శ్యామసుందరరావు, రాష్ట్ర కిసాన్ సంఘాధ్యక్షుడుగా కె.ఎస్.ఎన్.మూర్తి, కార్యదర్శిగా సి.హెచ్.వి.రావు, రైతు రక్షణ సంఘ కార్యదర్శిగా  లచ్చన్న రైతుల్ని సమీకరించారు. అదొక మహోన్నత ప్రయత్నం.
ఇచ్ఛాపురంలో రైతు యాత్రను రంగా ప్రారంభించాడు. 1938 జూలై 13 నాడు కమ్యూనిస్టులుగా ఉన్న జొన్నలగడ్డ రామలింగయ్య, చుండి జగన్నాథ, చలసాని వాసుదేవరావులు ఆ యాత్రలో పాల్గొన్నారు. 45 రోజులపాటు కాలినడకన సాగిన యీ రైతు యాత్ర మద్రాసు చేరేలోగా 500 గ్రామాలు, నగరాలు చుట్టి, వెయ్యి మైళ్ళు నడిచి, త్రోవ పొడుగునా స్వాగతాలు అందుకున్నది. లచ్చన్న చివరి వరకూ ఉన్నాడు. చుండి జగన్నాథం తూర్పుగోదావరి జిల్లా వరకు వచ్చి మానేసాడు. విజయనగరం సమీపాన గల పూసపాటి రేగ అనే గ్రామంలో అంతా రాజుల మయం. వారు యీ యాత్రను ఆహ్వానించి ఆతిథ్యం యిచ్చారు. తరువాత జరిగిన సమావేశంలో జమీందార్లను విమర్శిస్తుంటే, రాజులుగా ఆ గ్రామస్తులు సహించలేక ఉద్రేకపడ్డారు. ఎవరిని విమర్శించినా సహిస్తాంగాని, విజయనగరం రాజాను మాట అంటే వూరుకోమన్నారు. అప్పుడు లచ్చన్న జోక్యం చేసుకుని, ఇది నా వ్యక్తిగత విమర్శ కాదని, నాటి విజయనగరం రాజా రైతుపట్ల సక్రమంగా ప్రవర్తించినా ఉత్తరోత్తరా వచ్చేవారు అలాగే ఉంటారనే హామీ ఏమిటని ప్రశ్నించాడు. అలా రైతులకు ఉపశమనం కలిగించాడు. త్రోవపొడవునా అమితోత్సాహంతో  రైతు యాత్రను పురిగొల్పుతూ మందేశ్వరశర్మ అందించిన కిసాన్ సాహిత్యాన్ని పాడుకుంటూ, లచ్చన్న ప్రముఖపాత్ర వహించాడు. అప్పడప్పుడూ రంగావచ్చి రైతుల నుద్దేశించి ఉపన్యాసాలిచ్చి ప్రోత్సహించి వెళ్ళేవాడు. ట్రంక్ రోడ్డుపైనే గాక, సమీపంలో ఉన్న గ్రామాలకు కూడా యాత్ర వెళ్ళివచ్చేది. ఈ విధంగా 27-8-1938న ఒక నివేదిక సమర్పించింది. ఆ మెమొరాండంలో 600 గ్రామాలపై రైతులిచ్చిన 110 పిటిషన్లు ప్రస్తావించారు. (చూడండి History of Kisan Movement by N.G. Ranga, Swami Sahajananda 1939 పుట.109. All India Kisan Publication 23, Stringer Street, Madras) ఆ మెమోరాండంలో 600 గ్రామాలపై రైతు లిచ్చిన 110 పిటిషన్లు ప్రస్తావించారు.
తండ్రి మరణం
1938లో రెవిన్యూమంత్రి ప్రకాశం రైతుల కష్టాల్ని పరిశీలించటానికై ప్రభుత్వం నియమించిన వ్యవసాయ సంఘాధ్యక్షుడుగా శ్రీకాకుళం ప్రాంతం పర్యటించాడు. అప్పుడు రైతుల నుండి సాక్ష్యం యిప్పించటానికి లచ్చన్న జిల్లా అంతటా పర్యంటించాడు. అదే సమయంలో లచ్చన్న తండ్రి చిట్టయ్య చావు బ్రతుకుల మధ్య కుమారుని చూడాలని కలవరిస్తుంటే పుట్టెల శ్యామసుందరరావు వచ్చి, లచ్చన్నను కోపగించి, ఇంటికి తీసుకుని వెళ్లాడు. లచ్చన్న వివాహం నిమిత్తం రహస్యంగా దాచిన రెండువేల రూపాయల్ని, లచ్చన్న చేతుల్ని పుల్లెలవార్కి అప్పగించాడు. ఆరాత్రే చిట్టయ్య మరణించాడు.
పంచాయతీ అధ్యక్షుడుగా
1938లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో లచ్చన్న బారువా పంచాయతీకి అధ్యక్షుడయ్యాడు. అతన్ని అనుచరుల్ని ఓడించాలని జమీందారీ వర్గం చేసిన ప్రయత్నం విఫలమైంది. వ్యవసాయ కార్మికులకు గృహవసతి కల్పించాలనే దృష్టితో బారువా పంచాయతీ అధ్యక్షుడుగా లచ్చన్న ఒక ఆదర్శకాలనీ కట్టించాడు. (చూడండి : Fight For Freedom by N.G.Ranga, page 211, S.Chand & Co., Delhi 1968) పంచాయతీ ధనం దుర్వినియోగ పరచినందుకు పదవి నుండి ఎందుకు తొలగించరాదో సంజాయిషీ చెప్పమని ప్రభుత్వం నోటీసు యిచ్చింది. లచ్చన్న చెప్పిన సంజాయిషీతో ఆ నోటీస్ ఉపసంహరించుకున్నాడు.
1938లోనూ 1939లోనూ అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షస్థానానికి సుభాష్ చంద్రబోసును బలపరచిన వారిలో లచ్చన్న ఒకడు. రంగాకూడా బోస్.కు అనుకూలంగా ఉండేవాడు. బోస్.ను బలపరచటం గాంధీకి వ్యతిరేకమని తెలిసినా లచ్చన్న తన ఓటు బోస్ కే వేశాడు. బోస్ తీవ్రవాదం ఆయనకు నచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడుగా బోస్ ఒకసారి విశాఖ నుండి మద్రాసు వరకు రైల్లో ప్రయాణం చేసినప్పుడు లచ్చన్న ఆయనతో కలసివెళ్ళి, బోస్ వలన ఉత్తేజితుడయ్యాడు.
తెనాలి తాలూకా రైతు మహాసభ అధ్యక్షుడుగా లచ్చన్న తెనాలిలో ప్రసంగిస్తూ “ఇండియాకు సంపూర్ణ స్వరాజ్యం అంటే కార్మికుల రైతుల రాజ్యస్థాపన అన్నమాట” అని చాటాడు. 1938లో (చూడండి : ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారి Freedom Struggle in Andhra, 4వ సంపుటి పుట 106 అచ్చులో ఉన్నది) 1938 ఏప్రిల్.లో సి.వి.కె.రావు ఆధ్వర్యాన కాకినాడలో జరిగిన పీచు కార్మికుల సమ్మెలో లచ్చన్న కూడా పాల్గొన్నాడు. (ఈ విషయం వాస్తవమని రచయితకు సి.వి.కె.రావు చెప్పారు.)
మందసా - మహర్నాటకం
దేశమంతటా కాంగ్రెసు మంత్రివర్గాలు ఏర్పడినప్పటికీ 1937 నుండి 39 వరకు వారి పాలనలో బ్రిటిష్ వారి ధోరణే కొనసాగటం కిసాన్ సభలకు కష్టమనిపించింది. ఆంధ్రలో రంగా నాయకత్వానగల కిసాన్ సభలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు, కాంగ్రెసువారూ ఉన్నారు. అందరూ కలసి ఉండటానికి ఎవరి కారణాలు వారివి, కాని కిసాన్ సభలను బలపరచటం, కాంగ్రెస్.కు ప్రత్యామ్నాయ సంస్థలుగా ప్రతిచోటా రూపొందించటం కాంగ్రెస్ నాయకులు సహించలేకపోయారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు వేరే జండా, వేరే సంఘం ఎందుకని నెహ్రూ, పటేల్, గాంధీల ప్రశ్న. అదీగాక కిసాన్ సభలు హింసాధోరణిలో ఉన్నందున నిరసిస్తూ 1938 జనవరిలో కాంగ్రెస్ తీర్మానం చేసింది. కాంగ్రెస్ ను ఆక్రమించటానికి తలపెట్టారని గాంధీ తన హరిజన పత్రికలో కిసాన్ సభ్యుల్ని  విమర్శించాడు. (చూడండి – హరిజన్ 1938 ఏప్రిల్ 23) కిసాన్ సభల్లో కాంగ్రెస్ వాదులు జోక్యం చేసుకోగూడదంటూ 1938లో హరిపురా కాంగ్రెస్ తీర్మానించింది. కిసాన్ సభలు ప్రత్యేకంగా ఉంటూనే కాంగ్రెస్ కు అనుబంధంగా ఉండాలని ఫైజ్ పూర్ కాంగ్రెసులో కమ్యూనిస్టులు, సోషలిస్టులు తీర్మానాలు పెట్టారు. కాంగ్రెసు వాదులు, రాడికల్స్ దీనిని వ్యతిరేకించారు.
కాంగ్రెసు ధోరణి ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రలో రంగా, ఆయన అనుయాయులు కిసాన్ సభలలో ఉంటూ, ఉద్యమాల్ని సాగించారు. హరిపురా కాంగ్రెస్ కు రైతుల ఊరేగింపును తీసుకెళితే, పటేల్ వెక్కిరించాడు. అందులో లచ్చన్న కూడా ఉన్నాడు.
పలాసా రైతు సభ
అఖిల భారత కిసాన్ మహాసభ పలాసాలో జరపాలని నిశ్చయించి ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. కార్యదర్శిగా లచ్చన్న ఉన్నారు. లచ్చన్న జిల్లా స్థాయివరకు కమ్యూనిస్టు వ్యతిరేకి సిద్దాంత రీత్యానూ.
అయితే రంగా వలన కిసాన్ సభలో కమ్యూనిస్టులతో కలసి పనిచేయక తప్పలేదు. కాని పలాసా సభ రంగాకు ఆయన అనుచరులకు కనువిప్పు అయింది. సభను ప్రారంభించమని రాహుల్ సాంకృత్యాయన్.ను ఆహ్వానించగా కారణాంతరాల వల్ల ఆయన రాలేదు. సమావేశాలను చెడగొట్టాలన్న జమీందార్ల ప్రయత్నం సఫలం కాలేదు. కాని సమావేశంలో రంగా వర్గానికి కమ్యూనిస్టులకు పోటీ జరిగింది. అన్నిటా రంగా వర్గమే నెగ్గింది. అప్పటి నుంచీ కమ్యూనిస్టులకు దూరం కావటం ఆరంభమైంది. కాని వెంటనే జరిగిన అరెస్టుల వలన కమ్యూనిస్టులకే సదవకాశం లభించి ఆంధ్రలో కిసాన్ సభ వారి వశమైంది.
పలాసా సభ అనంతరం జరిగిన గొడవలే అసలు పేర్కొన దగినవి. మందసా సభలో ప్రేరేపితులైన రైతులు గిరిజనులు జమీందార్లపై తిరగబడ్డారు. మందసా వద్ద గిరిజనులు పుల్లలకై అడవికొట్టారు. అటవీ శాఖాధికారులు అటకాయించినా లెక్క చెయ్యలేదు. కొందరిని అరెస్టుచేసి తీసుకు పోతుంటే, ఈ వార్త గ్రామాల్లో పొక్కి మగవారిని చంపేస్తున్నారనే వదంతిగా మారింది ఆడవాళ్ళంతా తెగించి పోలీసులకు అడ్డుపడ్డారు. అందులో గున్నమ్మ అనే స్త్రీ పోలీసులను బాగా తిట్టింది.
పరిస్థితి విషమించగా పోలీసు కాల్పులు జరిపారు. గున్నమ్మతో సహా 5గురు చనిపోయారు. శవాల్ని బంధువులకు అప్పగించకుండా పోలీసులు తీసుకెళ్లారు. ఇదంతా జరుగుతున్నప్పుడు లచ్చన్న శ్రీకాకుళంలో ఉన్నారు. ఈ సంఘటన విని పుల్లెల శ్యామసుందరరావు, లచ్చన్న మందసా వచ్చారు. అప్పటికే ఆనాటి కలెక్టర్ గా ఉంటున్న భారతీయుడు చక్రవర్తి రిజర్వ్ పోలీసును పిలిపించాడు. వారు ఊళ్ళమీదబడి కనిపించిన మగవారినందరినీ బాదటం ప్రారంభించారు. ఫలితంగా పురుషులంతా పగలు అడవుల్లో దాక్కొన్నారు. స్త్రీలు భీతావహులై బ్రతికారు.
లచ్చన్న రంగంలోకి దిగి మందసా కాల్పులు బాధితుల రక్షణ సంఘం స్థాపించాడు. కారణం తెలియదు కాని, పోలీసులు లచ్చన్న జోలికిపోలేదు. పుల్లెల శ్యామసుందరరావును నిర్బంధించారు. లచ్చన్న మాత్రం 14 గ్రామాల్లో  దళాల్ని ఏర్పరచి, రాత్రిళ్లు గస్తీలు తిరిగే ఏర్పాట్లు చేశాడు. ఒక్క నెలలో 300 మందిని అరెస్టు చేసిన పోలీసులు ఒక్క కేసూ పెట్టలేదు. పరిస్థితి యిలాగే కొనసాగనిస్తే మరి చెయిజారిపోతుందని కాబోలు లచ్చన్న కొత్త పన్నాగం పన్నాడు. పుచ్చపాడు గ్రామంలో పారమ్మ అనే యువతిని పోలీసు చెరచారంటూ ఒక కట్టు కథను సాక్ష్యాధారాలతో జాగ్రత్తగా అల్లి, గవర్నరుకు, అధికారులకు, కాంగ్రెసు నాయకులకు తంతులు పంపాడు. “హిందు” దినపత్రిక వెంటనే ప్రత్యేక ప్రతినిధిని పంపించింది. వడ్డె విశ్వనాథం అనే వ్యక్తిచేత యిదంతా కట్టుకథ అని లచ్చన్న ప్రత్యర్థులు ప్రకటన చేయించారు. కళా వెంకటరావు ఆ ప్రాంతం వచ్చి పుచ్చపాడు సందర్శించగానే, రైతు సంఘం ప్రోత్సహించినదనీ లచ్చన్న రెచ్చగొట్టాడనీ, అంతకుమించి ఏమీలేదనీ ప్రకటించాడు. అన్ని కట్టుదిట్టాలు చేసి ఉంచిన లచ్చన్న వీటన్నిటీ ఖండిస్తూ, బహిరంగ విచారణ చేయమని సవాల్ చేశాడు. ఆ ప్రకారం ఒక సంఘాన్ని కాంగ్రెసు నియమించింది. పోలీసు కాల్పుల్ని ఖండిస్తూ ఆ సంఘం తీర్మానించింది. (చూడండి “ఫ్రీడం స్ట్రగుల్ ఇన్ ఆంధ్ర”                                                                                                                                                                                                                    ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య 4వ సంపుటి పుట 128 అచ్చులో) ఈ విచారణ జరిపింది అయ్యదేవర కాళేశ్వరరావు, మాగంటి బాపినీడుగారలు. విచారణలో లచ్చన్నకు అనుకూలంగా రైతులు సాక్ష్యం చెప్పారు. వారికి ఊర్లన్నీ తిప్పి చూపారు. అలాగే టంగుటూరు ప్రకాశం వచ్చి చూచి పోలీసు కాల్పుల్ని ఖండించాడు. కానీ అయ్యదేవర సంఘం పెయ్యనాకుడు తీర్పు చెప్పి, తామరాకుపై నీటిబొట్టువలె తప్పించుకున్నారు. ఏమైతేనేమి లచ్చన్న చేసిన యీ గొడవలో ప్రభుత్వం రిజర్వ్ పోలీసును ఉపసంహరించింది. రైతులు ఊపిరి పీల్చుకున్నారు. సంతోషించారు. నెలరోజుల భీభత్స వాతావరణం సద్దు మణిగింది. అయితే పారమ్మ అనే స్త్రీ ఉండటం వాస్తవం. అంతకు మించి ఏమీ జరగలేదు. దీని ఫలితంగా లచ్చన్నపై ప్రభుత్వం ఆంక్ష పెట్టింది. బారువా దాటి ఎటూ కదలటానికి వీల్లేదన్నది.
ఇంతలో పుల్లెల శ్యామసుందరరావు పోలీసు నిర్బంధంలో చనిపోయాడనే వార్త లచ్చన్నకు పిడుగు పడ్డట్టుగా చేరింది. తనపై గల ఆంక్ష మరచి తక్షణమే బయలుదేరి బస్సులో ఇచ్ఛాపురానికి వెడుతుంటే, సోంపేటలో తాసీల్దార్ పోలీస్ అధికారులు అడ్డుపడ్డారు. వారిరువురకూగల అవినాభావ సంబంధం, ఆప్యాయతలు వారికి తెలిసినా, ప్రభుత్వ కఠోర ఆంక్షలు పాటించక తప్పదన్నారు. చివరకు అధికారుల ఉద్యోగాల రక్షణ దృష్ట్యా ఆ ప్రయాణం విరమించమని బ్రతిమలాడారు. ప్రత్యేక అనుమతి యిచ్చేందుకు కలెక్టర్ నిరాకరించాడు. ఆ విధంగా లచ్చన్నకు ప్రియతమ నాయకుడు స్నేహితుడు, ఆప్తుడు పుల్లెలను ఆఖరిసారిగా చూడలేకపోయాడు. బారువాకు తిరోగమించాడు.
బారువాకు వెళ్ళేసరికి లచ్చన్నకు మరొక వార్త అందింది. అతి త్వరలో లచ్చన్నను అరెస్ట్ చేయవలసిందిగా కలెక్టర్ ప్రభుత్వానికి సిఫారసు చేశాడని,  ఏ క్షణానైనా అరెస్టు జరగవచ్చని, కలెక్టర్ కేంప్ క్లర్క్ వెల్లడించాడు. ఆ వార్త రాగానే లచ్చన్న తన ఆంతరంగికులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి సంప్రదించాడు. మందసా రైతులకోసం కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉండమని వారంతా సలహా యిచ్చారు. ఇంకా మందసా  రైతులపై ఆనేక కేసులు పెట్టినవి అలాగే ఉన్నవి. కనుక వారి రక్షణ నిమిత్తం వెంటనే సామాను సర్దుకుని సోంపేట మీదుగా బరంపురం వెళ్లాడు లచ్చన్న. ఆయన వెళ్లిన రాత్రికే పోలీసులు అరెస్టు వారెంట్ తో వచ్చి లచ్చన్న లాడ్జిని సోదాచేసి దొరకనందున లచ్చన్న ప్రయాణం చేసిన గుర్రపుబండి యజమానిని పట్టుకున్నారు. లచ్చన్నపై నిఘా పెట్టిన వ్యక్తిని సస్పెండ్ చేసారు.
అండర్ గ్రౌండ్ లో
లచ్చన్న హౌరా వెళ్ళి, మళ్ళీ నాగపూర్ మీదుగా కర్నూలు చేరుకున్నాడు. కందుల ఓబుల రెడ్డి సహాయంతో గాడిదమడుగు అనబడే నేటి గార్గేయపురంచేరి, చిన శివారెడ్డి మేనల్లుడు రంగా రెడ్డి యింట్లో ఒకమాసం రోజులపాటు ఉన్నాడు. ఆ పిమ్మట నంద్యాల చెంత భీమవరంలో కొన్నాళ్ళు మకాం, ఏనుగు తొండం ఎక్కడున్నా వూరుకోదన్నట్లు, నంద్యాల రామిరెడ్డితో కలసి రాజకీయ శిబిరం నిర్వహిస్తుంటే పోలీసులు నిఘావేసి రామిరెడ్డి యిల్లు సోదాచేశారు. అంతటితో గుర్రపు బండికి తెరలుగట్టి ఘోషా స్త్రీగా బయటివారిని భ్రమింపచేసే రీతిగా వెళ్ళి, ఓబుల రెడ్డి అత్తగారింట నాలుగైదు రోజులున్నాడు. పోలీస్ నిఘా ప్రారంభమైన తర్వాత ఒకచోట ఉండటం ఉన్నవారికీ – అండనిచ్చిన వారికి కష్టమేగదా, కనుక లచ్చన్న మళ్లీ బయలుదేరి కడపలో ఆదినారాయణ రెడ్డిగారింట మోడుపల్లిలో కె. రంగారెడ్డి వద్ద కొన్నాళ్ళు తలదాచుకున్నాడు. తరువాత దగ్గుబాడులో నివాసం పెట్టాడు. అది కేంద్రంగా చేసుకొని చుట్టుప్రక్క గ్రామాలు తిరిగి కొంత రాజకీయం నడిపారు. ఆ కృషిలో బాచిన సుబ్బారావు, పుల్లెల రత్తయ్య, కొసరాజు అమ్మయ్య, గోగినేని లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు. గుంటూరు జిల్లా వదలి చిత్తూరు చేరి టీసదనం గ్రామంలో రాజకీయ పాఠశాల నిర్వహించారు. అప్పటికి వ్యక్తి సత్యాగ్రహం చేయమని గాంధీ పిలుపు యిచ్చాడు. కాంగ్రెసు ఆమోదించింది. (1940 సెప్టెంబర్) లచ్చన్నకు యిది నచ్చలేదు. అలాగే దేశంలో వామపక్షాల వారు కూడా యిందులో పాల్గొనలేదు. కాని కొన్నాళ్ళైన తర్వాత చిత్తూరు జిల్లాలో వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమాన్ని లచ్చన్న కూడా ప్రోత్సహించాడు.
లచ్చన్న యిలా కాందిశీకుడుగా తిరుగుతున్నప్పటికీ జిల్లాతో సంబంధాలు తెంచుకోలేదు. ఎప్పటికప్పుడు పరిణామాలు తెలుసుకునే ఏర్పాట్లు గావించే వచ్చారు. అంతవరకూ లచ్చన్న ప్రచ్ఛన్నంగా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాడని భ్రమించిన పోలీసులు ఆ ఆశను అడియాస చేసుకున్నారు. జిల్లాలో లేడని రూఢిగా పోలీస్ అనుకున్నప్పుడు లచ్చన్న మళ్ళీ శ్రీకాకుళంలో అడుగుపెట్టారు. వచ్చీ రావటంతోనే రైతులకు డిఫెన్సు ఏర్పాట్లు చేశాడు. మందసా కాల్పుల కేసులో చివరికి 21 మందికి ఒక సంవత్సరం పాటు శిక్ష పడటంతో, కేసు తేలికగా పోయింది. దీనికి చాలా వరకు కలెక్టర్ చక్రవర్తి యిచ్చిన సాక్ష్యమే కారణమని లచ్చన్న భావించారు. లచ్చన్నకు మాత్రం ప్రవాస జీవితం తప్పలేదు. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా నినాదం రాగానే అదే అదనుగా భావించి లచ్చన్న విజృంభించాడు. అంతకుముందే జిల్లా అంతా పట్టుకోవటానికి పథకాలు వేశాడు. అడవుల్లో వుంటూ, తోటాలు, రైఫిళ్ళు, సిల్లకోలలు తయారు చేయాలని, ఒకేసారి జిల్లా అంతటా అన్ని కార్యాలయాలు ఆక్రమించి, రాకపోకలు స్తంభింప చేయాలని ఎత్తులు వేశాడు. దీనికిగాను కొబ్బరితోటల్లో అనేక సమావేశాలు జరిపాడు. ఇదంతా మండపల్లి గ్రామం చెంత జరిగిన వ్యవహారం దీనికితోడు క్విట్ ఇండియా పిలుపు రాగానే, లచ్చన్నకు కలిసి వచ్చినట్లయింది. బారువా దగ్గర ఒక గూడ్సుబండి పట్టాలు తప్పించారు. కళింగ పట్నంలో ఒక పోస్టాఫీసును దోపిడీ చేశారు. ఈ హడావుడిలో ఒకనాడు సోంపేట పొలిమేరల్లో కాలు బెణుకగా నడవలేని స్థితిలో సిందిర రామస్వామి గారింట్లో విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడ క్షేమకరం కాదని మదనాపురంలో రాజారావుగారింట 10 రోజులపాటు విశ్రాంతి గైకొన్నాడు. ఒకనాటి రాత్రి మందపల్లి గ్రామంలో పోతూవుంటే దూరాన వస్తున్న సెంట్రీని చూసి, పారిపోతూ, ఊరి వెలుపల అడ్డొచ్చిన పంటకాలువ దూకాడు.
రహస్య జీవితం – కడలూరు జైలు
అక్కడ వెంపలి దుంప కాలును 4 అంగుళాలు చీరేసింది. గత్యంతరం లేక సమీపంలో ఒక దేవాలయపు గర్భగుడిలో తలదాచుకొని, రాత్రికి రాత్రే బండిలో బార్లపూడి గ్రామానికి వెళ్ళి బార్లపూడి జగన్నాథంగారింట పడమటి చీకటిగదిలో 45 రోజులున్నాడు. ఆ జంట స్త్రీలు నిర్విరామంగా లచ్చన్నకు సేవలు చేశారు. కాలు తగ్గినట్లే ఉన్న కొంచెం నడిస్తే మళ్ళీ కలక బారటంతో, కొజ్జరియ గ్రామం వెళ్ళి ఒక నాటువైద్యుని చికిత్సలో ఉపశమనం పొందాడు. అక్కడు నుండి ఖర్గపూర్ వెళ్ళి రైల్వే హాస్పిటల్లో ఎక్స్.రే తీయించుకొని అంతా బాగున్నట్లు ఖాయపడిన అనంతరం కలకత్తా వెళ్ళారు.
కలకత్తాలో అప్పుడే దత్తు ముజుందార్ నాయకత్వాన బోల్షివిక్ పార్టీ ప్రారంభమైంది. ఉత్తరోత్తరా అతను పశ్చిమ బెంగాల్ కు కార్మిక మంత్రిగా పనిచేశాడు కూడా. లచ్చన్న వారి రక్షణ పొందటమే గాక, వారి అధ్యయన శిబిరంలో పాల్గొని, ఒకపక్షం రోజులపాటు మార్క్సిజం చదివాడు. తరువాత ఒకనాడు కలకత్తాలో తిరుగుతూ ట్రాంలో ఎవరో, జేబు కొట్టేయగా, ఎలాగో తిప్పలు పడి స్వస్థలానికి తిరిగొచ్చాడు.
లచ్చన్నకు శ్రీకాకుళం జిల్లాలో ఆనాడు కుడిభుజంగా మెలగిన వ్యక్తి కిల్లి అప్పలనాయుడు. అతనిది పురుషోత్తమ పురం. లచ్చన్న రావటంతోనే వేసవి పాఠశాల నడపాలని తలపెట్టి ప్రకటించాడు. కాని పోలీస్ లు ఒకనాడు హఠాత్తుగా దాడి చేయటంతో ఆ ప్రయత్నం విరమించుకోవలసి వచ్చింది. పారిపోయి ఏటి అవతల జీడితోటల్లో దాక్కొని, తలదాచుకున్నారు.
అలాగే రహస్య జీవితం గడుపుతూ గొగ్గిలి, గుల్లలపాడు, మదనాపురం గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసారు. వీటన్నిటికీ కిల్లి అప్పల నాయుడు ఎంతగానో తోడ్పడ్డాడు. పిమ్మట కళింగపట్నంలో కప్పగంతుల సుబ్బారావు తండ్రిగారింటిలో సిల్లపేట సిర్లా రాజుల రెడ్డి ఇంటిలో కొన్నాళ్ళు గడిపాడు. లచ్చన్నతోపాటు కిల్లి అప్పలనాయుడు కూడా వచ్చి ప్రచ్ఛన్న వేషంలో చేరాడు. రాజుల రెడ్డి క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టుగావటంతో లచ్చన్న మళ్ళీ రాష్ట్రం వదలి ఈసారి బెంగుళూరు చేరాడు. అక్కడ బసవన్న గుడియం అనే పేటలో ఒక సర్కిల్ ఇన్సెపెక్టర్ ఇంట్లోనే, తెలియకుండా అద్దెకుంటూ, సుబ్బారాయలు అనే స్నేహితునితో  కలసి “రణభేరి” పేరిట 8 పుటల పత్రికను 3 మాసాలపాటు రహస్యంగా సైక్లోస్టైల్ చేసి, జిల్లాకు పంపించాడు. ఆవిధంగా జర్నలిజంతో కించిత్తు పరిచయమైంది. మళ్లీ జిల్లాకు తిరిగొచ్చి లుకలాపు లక్ష్మణదాసు ఊళ్ళో మీటింగులు పెట్టాడు.
లచ్చన్నను మద్రాసు రమ్మని సంపత్కుమార్ పంపిన ఆహ్వానాన్ని జయంతి ధర్మతేజ తెచ్చియిచ్చాడు. అప్పటికి లచ్చన్న సర్వోదయ కార్యకర్త అయిన మల్లిపెద్ది కృష్ణదాసు సహాయంతో ఒక కేంద్రం నిర్వహిస్తున్నాడు. సంపత్కుమార్ ఆహ్వానం ప్రకారం లచ్చన్న, కిల్లి అప్పల నాయుడు మద్రాసు ప్రయాణమయ్యారు. విజయనగరం మీదుగా జామ అనే గ్రామం చేరేసరికి, లచ్చన్నను ఒక కమ్యూనిస్టు ఒక సర్వోదయ కార్యకర్త అనుచరులుగా అనుసరించి ఉన్నారు. వారికి తప్ప లచ్చన్న ప్రయాణం మరవరికీ తెలియదు కాని పోలీస్ కు తెలిసింది. ఎలా తెలిసింది అని ప్రశ్నించటం అవసరం.  అనకాపల్లి చేరిన లచ్చన్న పగలంతా ధర్మతేజ సోదరి గృహంలో ఉన్నాడు. రాత్రికి మెయిల్ కు వెళ్ళాలని ప్రయత్నం. సొంతగా టికెట్ కొనుక్కుని బండెక్కే లచ్చన్న ఆవేళ అనుచరులు చెప్పినట్లు విని, ప్లాట్ ఫారం చివరి చెట్లు క్రింద కూర్చున్నాడు. టికెట్ కొనితెచ్చి యిచ్చిన అనుచరులు బండెక్కించి, వీడ్కోలు చెప్పారు. అనుచరులు వెళ్ళిపోయారుగాని, లచ్చన్న కిల్లి అప్పలనాయుడుతోపాటు మరో యిరువురు ప్రచ్ఛన్న వేషంలో ఎక్కటం లచ్చన్న పసిగట్టాడు. కిల్లి అప్పలనాయుడు నిశ్చింతగా నిద్రపోయాడు. మూడవ తరగతి ఇరుకుపెట్టెలో, ఒకటి రెండు పర్యాయాలు లచ్చన్న బండిదూకి పారిపోయే ప్రయత్నం తలపెట్టి విరమించుకున్నాడు. రాజమండ్రిలో తెల్లారేసరికి బండి దిగి, ముందే చేసిన ఏర్పాట్ల ప్రకారం చౌదరి సత్యనారాయణ సోదరుని లాడ్జికి వెళ్ళారు. అది మంగళవారపు పేటలో ఉన్నది. లచ్చన్న కాలకృత్యాలు తీర్చుకునే లోపుగా రిజర్వ్ పోలీస్ లాడ్జిని చుట్టుముట్టింది. మీరెవరని వచ్చిన యిన్స్పెక్టర్ ప్రశ్నిస్తే, “మాది గోపాలపురం. మామిడి మొక్కలు కొనుగోలుపై వచ్చాము” అని లచ్చన్న తడుముకోకుండా చెప్పాడు. కాని వెంటఉన్న జూనియర్ సబ్ ఇన్స్పెక్టర్ లచ్చన్నతోపాటుగా చదువుకున్న వాడు గావటంతో వచ్చింది చిక్కు. “ఎందుకండీ లచ్చన్నగారూ అబద్దాలాడతారు” అన్నాడు. “అయితే తెలిస్తే అడగటం దేని”కని లచ్చన్న అనడం అరెస్టు జరిగిపోయాయి.
నాడు రాజమండ్రిలో డి.వి.సుబ్బారావు సరి రౌడీలకు, దొంగలకు హడల్. యడవల్లి సూర్యనారాయణ అల్లుడతను. లాకప్.లో ఉండగనే చావమోదేవాడట. లచ్చన్నకు కూడా అదితప్పదన్నాడు. కాని అతను అలాంటిదేమీ చేయకపోవటం అందరినీ ఆశ్చర్యమనిపించింది. పోలీస్.లు కూడా రాత్రి ఘర్షణ పడ్డారు. తెల్లారేసరికి సబ్ జైలు నుండి లచ్చన్నను సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటికే రాజమండ్రి అంతటా లచ్చన్న అరెస్టయిన విషయం పొక్కటమే యిందుకు కారణం. మరునాడు లచ్చన్నను కోర్టులో హాజరుపరచాలేగాని, సాయంత్రం 5 గంటల వరకూ పోలీస్ అధికారులెవరూ రాలేదు. కోర్టులో నాలుగైదుమార్లు పిలిచి, మాజిస్ట్రేట్ కూడా విసుగెత్తి, చివరకు కోర్టు అయిన తర్వార చాంబర్.లోకి పిలిచాడు. అంతకుముందే అనుకున్న ప్రకారం లచ్చన్న కథ అల్లి, క్షత్రపురం వద్ద గోపాల పుర వాసులమనీ, తమలపాకుల బేరానికి వచ్చామని చెప్పాడు. వారిని వదిలేయమని మాజిస్ట్రేట్ చెప్పాడు. కాని కోర్టు  గుమాస్తా ఎందుకైనా మంచిదని మరోసారి పోలీస్ స్టేషనుకు ఫోను చేసాడు. అప్పుడు డి.వి. సుబ్బారావు అందుకుని లచ్చన్న కథనానికి ఆశ్చర్యపడి, హుటాహుటిన వచ్చి అసలు విషయం వెల్లడించాడు. మాజిస్ట్రేట్ దిగ్భ్రమ చెంది, “కొంపదీశావు కదా లచ్చన్నా! నా ఉద్యోగం ఊడబీకేయించేవాడివే” అని శిక్ష వేశాడు. కిల్లి అప్పలనాయుడును డిటున్యూగా కడలూరుకు పంపారు. లచ్చన్నను “సి” తరగతి ఖైదీగా సంవత్సరం శిక్షవేసి, అల్లీపురం జైలుకు పంపారు.
జైలులో కూడా విప్లవ కార్యక్రమాలు
అల్లీపురం జైలులో పెద్ద పెద్ద హాలులు ఉండేవి. నాడు తలల లెక్క తప్ప ముఖాలు గుర్తుపట్టటంలేదు. ఒక్కొక్క హాలులో ఒక్కో ముఠాను అట్టిపెట్టారు. లచ్చన్న జైలులో వావివాల గోపాల కృష్ణయ్య, సి.వి.కె.రావు, ఎ.వి.నాగేశ్వరరావు, సూర్యప్రకాశరావు, పోలవరపు శ్రీహరిరావు, వెలగా రామకోటేశ్వరరావు (హిందీ పండిట్) ఇత్యాదులెందరో ఉండేవారు. బ్రాహ్మణ అబ్రాహ్మణ విచక్షణ ఖైదీలకు ఉండేది. ఎ.బి.నాగేశ్వరరావు ఖైదీలకు చక్కని సేవలు చేసేవాడు. కమ్యూనిస్టు, కమ్యూనిస్టేతర ద్వేషాలు తీవ్రంగా ఉన్న రోజులవి. కమ్యూనిస్టు వ్యతిరేకిగా లచ్చన్న జైలులో ప్రచారం చేశాడు. కొన్నాళ్ళకొక హాలు చొప్పున స్థానం మార్చి, తను ఉండవలసిన చోట మరొకరిని పెడుతూ ఆస్థానంలో ప్రవేశించి ప్రచారం చేసేవాడు. ఈ పరకాయ ప్రవేశం నిశాచరుడుగా చేశాడు. జైలు వార్డన్ల ద్వారా బయటి నుండి దివపత్రికలు తెప్పించి, చదివి నోట్సు వ్రాసుకుని, రాత్రిళ్ళు, ఖైదీలకు చెబుతుండేవాడు. లచ్చన్న, ఆ అధ్యయన విధానంలో కమ్యూనిస్టు వ్యతిరేకత తీవ్రస్థాయి చేరుకొనగా, కలహాలు రగిలి, తలలు పగిలేవరకూ పోయింది. విడుదలై బయటపడుతుతున్న కొందరు బళ్ళారి ఖైదీలతో లచ్చన్న రహస్యంగా మంతనాలు సాగించాడు. మరోవారం రోజులకు విడుదల కావలసిన లచ్చన్నను కన్ననూరు జైలుకు తరలిస్తారని పసిగట్టాడు. రైల్లో పోయేటప్పుడు, విడుదలైన ఖైదీల సహాయంతో బళ్ళారి వద్ద తప్పించుకోవాలని లచ్చన్న ఉద్దేశ్యం. విడుదల అయిన ఖైదీలు ఇచ్చిన హామీ నిలబెట్టుకోనందున కన్ననూరు  జైలు లచ్చన్నకు తప్పింది కాదు. అక్కడ డాక్టర్ పి. తిరుమలరావు, సూర్యప్రకాశరావు, ఒక తెలుగు కమ్యూనిస్టు కూడా ఉన్నారు. లచ్చన్నకు చక్కని వాతావరణమనిపించింది. తాత్కాలికంగా రాజకీయాలకు స్వస్తి చెప్పి కలహాలకు సమస్యలు లేనందున, ఆనవాలు కసరత్తులు చేస్తూ కాలక్షేపం చేశాడు. అక్కడ నుండి లచ్చన్నను తంజావూరు జైలుకు మార్చారు. కథ రక్తిగట్టింది.
లచ్చన్న వెళ్ళేసరికి రంగం సిద్ధమై ఉన్నది. తంజావూరు జైల్లో రంగా, కల్లూరి చంద్రమౌళి, కాసు బ్రహ్మానందరెడ్డి, గొట్టిపాటి బ్రహ్మయ్య, బాచిన సుబ్బారావు,  గొల్లపూడి (స్వామి సీతారాం) కిల్లి అప్పలనాయుడు, నేతి చలపతి, దండు నారాయణ రాజు, మంతెన వెంకటరాజు, మొదలైన వారెందరో ఉన్నారు. ఖైదీల పక్షాన జైలు అధికార్లతో మాట్లాడటానికి కొన్నాళ్ళు దండు నారాయణరాజు, పిమ్మట బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. మేయర్ అని అతన్ని పిలిచేవారు, (చూడండి కపిల కాశీపతిగారి “బ్రహ్మానంద యాత్ర” 1970 మేలో హైదరాబాద్ నుండి ప్రచురణ పుట 156).
లచ్చన్న ప్రవేశించేనాటికి తంజావూరు జైలులో ఆంధ్ర, తమిళ, కేరళ ఖైదీల మధ్య వైషమ్యాలు ఉన్నవి. ఇందులో మళ్ళీ శాఖాహార మాంసారుల మధ్య గొడవలు ఉండేవి. అదిగాక స్వామి సీతారాం అపక్వాహార ముఠా ఉండేది. వంటదగ్గరే అసలు రాజకీయం నడిచేది.
రంగా ఉదయం, సాయంత్రం రాజకీయ శిబిరాల వంటివి పెట్టి, పాఠాలు చెబుతుండేవాడు. వంటకు సంబంధించిన ఫిర్యాదులు ఏవైనా ఉన్నా అవి పైకి రానిచ్చేవాడు కాదు. అధికార రాజకీయాలకు దూరంగా ఉండాలని చెబుతుండేవాడు. అప్పటికి రెండు పర్యాయాలు రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షపదవికి ప్రయత్నించి ఓటమి చెందటం, భారతీదేవిని గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షురాలుగా చేసే ప్రయత్నం ఫలించక పోవటం, జిల్లా బోర్డు సభ్యుడుగా తాను గెలవక పోవటంతో, రంగా నిరుత్సాహ పడడం సహజం. అందువలన సిద్ధాంతపరంగానే ఉండేవాడు. ఆయన అనుచరులకు యిది ఆట్టే గిట్టేది కాదు. అలాంటి సమయంలో లచ్చన్న రాగా బాచిన సుబ్బారావు మొదలైన రంగా అనుచరులు పంటకు సంబంధించిన ఫిర్యాదులు, రంగా నిర్లిప్తత ఆయనకు ఏకరువు పెట్టారు.
మాంసాహార వంటకు పెత్తనం మంతెన వెంకటరాజు నిర్వహిస్తుండేవాడు. తల ఒక్కింటికి రోజుకు రూపాయి ముప్పావలా ఖైదీకి ఇచ్చేవారు. అందులో వంట యాజమాన్యం చేసేవారు. జైలు అధికారులు వాటాలు పంచుకునేవారు. ఖైదీలకు ఏమీ డబ్బు రూపేణా మిగిల్చి ఇచ్చేవారు కాదు. మంతెన వెంకట రాజు ఇలా మిగిల్చిన డబ్బు పెట్టి చాలా గ్రంథాలు కొనుక్కున్నాడని ఒక కాంగ్రెస్ పెద్దమనిషి చెప్పాడు. ఈ విషయం వ్రాస్తే మాత్రం తాను సాక్ష్యం చెప్పనన్నాడు. కాంగ్రెస్ నీతి అలాంటిది. పైగా వెంకటరాజు చేసినపని చెడ్డదే అయినా పుస్తకాలు కొనుక్కున్నాడు గనుక ఫరవాలేదని ఆయనతృప్తి, మంతెన వెంకటరాజు ఆధ్వర్యాన శాకపాకాలు కొందరిగదుల్లోకి ప్రత్యేకంగా టిఫిన్ కారియర్.లో వెళ్ళేవి. కల్లూరి అందరితోపాటు ఆయన పంక్తి భోజనం చేసే వాడుకాదు. ఇలాంటి సౌకర్యాలు చేసినందుకు మంతెన వెంకటరాజు వారికి మంచి వాడయ్యాడు.
శ్రీకాకుళం జిల్లా వంతు వచ్చిననాడు లచ్చన్న పెత్తనం స్వీకరించాడు. వంటదగ్గరే కుర్చీ వేసుకు కూర్చున్నాడు. యథా ప్రకారం ఆనాడు వెంకట్రాజుగారి నుండి ఒక ఖైదీ వచ్చి 40 పాయింట్లు పాలు తెమ్మన్నారంటూ వచ్చాడు. లచ్చన్న నిరాకరించాడు. గొట్టిపాటి బ్రహ్మయ్య రాయబారం చేయబోయి, మంతెన వెంకటరాజును వెనకేసుకొచ్చి, తెచ్చిన అప్పు తీర్చాలిగదా అన్నాడు. ఎవరి హయాంలో అప్పు చేశారో వారే తీర్చమన్నాడు లచ్చన్న. కథ మలుపు తిరిగింది. భోజనాలు ఎవరికీ పంపేది లేదు. అందరూ పంక్తిలోకి రావాల్సిందే అన్నాడు లచ్చన్న. ఇదిమరీ దుర్భరమైంది కొందరికి. వారంతా మంతెన వెంకటరాజును సమర్థిస్తూ భోజనాలవద్ద చిన్న ఉపన్యాసం చేశారు. వారిలో చింతమనేని రామయ్య చావలి  సూర్యనారాయణ కల్లూరి చంద్రమౌళి, కాసు బ్రహ్మానందరెడ్డి ప్రధానంగా పేర్కొనదగినవారు. ఇలాగైతే తానూ యాజమాన్యం చేయనని రాజీనామా ఇచ్చాడు మంతెన వెంకటరాజు. ఆయన దొంగ అనుకున్నారా అని ఒకరు ఆగ్రహించారు. లచ్చన్న మాత్రం చలించక, ఇన్నాళ్లూ సేవచేసి ఆరోగ్యం పాడుచేసుకున్న మంతెన వెంకటరాజు రాజీనామా ఆమోదించమన్నాడు. అందులోని వ్యంగ్యం గ్రహించిన ఒకరు శ్రీకాకుళం ముఠా రౌడీలని దూషించగా, కిల్లి అప్పల నాయుడు చొక్కా చేతులు మడిచాడు. అంతటితో అలిగి వారంతా తమ గదులకు పోయి విడిగా వంట ఆరంభించించారు. అప్పటినుండీ ఖైదీలందరూ పుష్కలంగా తినగా, ఒక్కొక్కరికీ రోజుకు ఆరణాలు మిగిలేవి.
తంజావూరు జైల్లోనూ మిగిలిన చోట్లా చాలామంది కాంగ్రెస్ ఖైదీలు ఆశలు వదులుకున్న బాపతే, దేశానికి స్వాతంత్ర్యం రావటం కల్ల అని ఎలాగైనా బయటపడాలని కక్కుర్తిపడి, ఏదో మిషపెట్టి, పెరోల్.పై బయటపడ్డారు. లచ్చన్న మాత్రం ఆపని చేయక, చివరివరకూ ఉన్నారు. అందరికంటె ఆఖరున విడుదలయిన వారిలో లచ్చన్న ఒకడు.
రాష్ట్ర కాంగ్రెసులో రంగా శకం
అందరూ విడుదలైనప్పటికీ లచ్చన్నను తంజావూరు నుండి రాయవెల్లూరు జైలుకు తరలించి అక్కడ స్త్రీలవార్డులో ఉంచారు. అప్పటికీ కళా వెంకటరావు కూడా ఉన్నారు. లచ్చన్న జాతకం కూడా వ్రాశాడు జైల్లో.
గాంధీ-వేవెల్ ఒడంబడిక జరిగిన అనంతరం లచ్చన్నను విడుదల చేశారు. ఆనవాయితీ ప్రకారం నిడుబ్రోలులో రంగా దర్శనం చేసుకొని శ్రీకాకుళం వెళ్ళేసరికి, తలవని తలంపుగా జిల్లా అంతటా లచ్చన్నకు సన్మానాలు జరిగాయి. ఆ సభల్లో ప్రజలు లచ్చన్నను “సర్దార్” అని నినాదాల ద్వారా పిలుచుకున్నారు. ఆ విధంగా ప్రజలిచ్చిన సర్దార్ పేరుతో కలిసిపోయింది.

1946 మార్చిలో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెసు పోటీ చేయదలచింది. రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు ప్రకాశం, కార్యదర్శి కళా, కాని ప్రకాశానికి చెప్పకుండా ఎన్నికల సంఘాన్ని నియమించాడు. తనను సంప్రదించక ఏ పనీ చేయరనే ధీమాతో ప్రకాశం ఉండేవాడు. ఏర్పడిన ఎన్నికల సంఘంలో ప్రకాశానికి, రంగాకు వారి అనుచరులకు చోటులేదు. ప్రకాశం ఆశ్చర్యపోయి, గంగ వెర్రులెత్తి, తనవారికి, రంగా అనుచరులకు తంతులు యిచ్చాడు. లచ్చన్నకు కూడా అలాగే ఒక తంతి చేరింది. తక్షణం మద్రాసు రమ్మని సారాంశం. లచ్చన్న మద్రాసులో ప్రకాశం యింటికి వెళ్ళేసరికి, తెన్నేటి విశ్వనాథం, క్రొవ్విడి లింగరాజు, కందుల ఓబులరెడ్డి, అన్నె అంజయ్య యిత్యాదులు ఉన్నారు. ఎంతసేపువున్నా ప్రకాశం విషయం విడమరిచి చెప్పలేదు. నియోగి లౌక్యంలో ఆలోచించండి నేను చెప్పాలా అని సన్నాయి నొక్కులు నొక్కేవాడు. మొత్తం మీద అందరూ ఒకందుకే చేరారు గనుక, ప్రకాశంగారి పక్షాన వకాల్తా పుచ్చుకున్నారు. రంగా అనుచరులు సరాసరి నిడుబ్రోలు వచ్చి, రంగాకు నచ్చచెప్పే ప్రయత్నం చేసారు. జైల్లో అధికార రాజకీయ కలహాల జోలికి పోగూడదనే పాఠాలు చెప్పిన గురువు, విన్న శిష్యులు విస్మరించారు. అధికార రాజకీయ చదరంగం అలాంటిది. ఏమైతేనేమి రంగా దీవెనలు పొంది, ఊళ్ళమీదబడి, కొత్త సంఘాన్ని ఎన్నుకోవాలనీ రిక్విజిషన్.కు మద్దత్తు పొందడానికి  తలపెట్టారు. ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులచే సంతకాల సేకరణ పూర్తి కాగానే, రాజమండ్రిలో సమావేశం ఏర్పాటైంది. రేపు సమావేశం అనగా రాత్రి కళా వెంకటరావు దింపుడుగళ్ళం ఆశతో లచ్చన్న వద్దకు కప్పగంతుల సుబ్బారావును రహస్య రాయబారిగా పంపాడు. రాయవెల్లూరులో జాతకం వ్రాసిన దగ్గర ఉపోద్ఘాతం ప్రారంభించి, ఈ సమావేశంలో రంగా తటస్థంగా వుంటే, శ్రీకాకుళం జిల్లాలో లచ్చన్నను ఎదురులేని చక్రవర్తిని చేస్తానన్నాడు. రంగా వర్గంలో ఎవరికి కావాలంటే వారికి స్థానాలు యిస్తానన్నాడు. లచ్చన్న అంతా విని ససేమిరా అన్నాడు. కళా రాయబారానికి సాక్షిగా కిల్లి అప్పలనాయుడు కూడా లచ్చన్న చెంత ఉన్నాడు.
by Innaiah Narisetti

No comments:

Post a Comment