నాస్తిక భావాల బాటలో ఎదురీదిన గోరా

నాస్తిక భావాల బాటలో ఎదురీదిన గోరా
(1902-1975)


వేదాలు నాలుగు వేడి వేడి నేతిగారెలవలె ఆరగించే సద్ర్బాహ్మణ కుటుంబంలో గోపరాజు వెంకట సుబ్బారావుకు 1902లో నవంబరు 15న గోరా పుట్టారు. అప్పట్లో ఒరిస్సాలోని క్షత్రపూర్ లో ఉండేవారు. గోరా వృక్షశాస్త్రంలో నిష్ణాతుడై కాలేజీ ఉద్యోగంలో ప్రవేశించేవరకూ జంథ్యం వేసుకొని, జేబులో పవిత్ర విబూది పొట్లాన్ని పెట్టుకుని తిరిగేవాడు. గోరా 1922లో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పదేళ్ళ వయస్సుగల సరస్వతిని వివాహమాడారు. ఆనాడు బాల్య వివాహాలు మామూలే.
నేను అమెరికాలో, యూరోప్ లో మానవవాద సంఘాల సభలకు వెళ్ళినప్పుడు ‘నీకు గోరా తెలుసా’ అని అడిగేవారు. ఆయన ఆ సంఘాలన్నింటిలో బహుళ ప్రచారంలోకి వచ్చిన వ్యక్తి.
నాస్తిక భావాల బాటలో ఎదురీదిన గోరా
చదువు ముగించిన తరువాత మధురైలోని అమెరికన్ మిషన్ కాలేజీలో ఉద్యోగంలో ప్రవేశించి 1926 నాటికి కోయంబత్తూరులోని వ్యవసాయ పరిశోధనా సంస్థలోనికి అడుగు పెట్టారు. 1927 నాటికి కొలంబో వెళ్లి ఆనంద కళాశాలలో చేరి బౌద్ధ తాత్విక విషయాలను పరిశీలించారు. కొలంబోలో (శ్రీలంక) ఒక ఏడాది ఉద్యోగానంతరం కాకినాడ పి.ఆర్. కళాశాలలో బోటనీ లెక్చరర్ గా చేరారు.  ఆయన జీవితం అప్పటి నుండి సాఫీగా సాగలేదు. అతని నాస్తిక భావాలని బయట సంఘం మాట అట్లా వుంచి కుటుంబమే ఆమోదించలేదు. గోరా మొండివాడు. నాస్తిక భావాలు వెల్లడిస్తూనే పోయాడు. ఆగ్రహించిన తండ్రి 1928లో అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. అప్పటికే గోరా జంథ్యం తీసివేశారు. అలా వెలివేయబడిన గోరా తన జీవితాన్ని కొనసాగిస్తూండగా రెండున్నర సంవత్సరాల అనంతరం రాజీపడిన తల్లిదండ్రులు గోరాను మళ్ళీ పిలిచారు. బంధుమిత్రులు, బ్రాహ్మణ సమాజం అంగీకరించకపోగా గోరాతోపాటు తల్లిదండ్రులను కూడా వెలివేశారు. గోరా నాస్తిక భావాలు మింగుడు పడని పి.ఆర్.కళాశాల యాజమాన్యం 1933లో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించింది. దైవ భావాన్ని తృణీకరిస్తూ కాలేజీ మేగజైన్ లో వ్యాసం రాసినందుకు ఈ శిక్ష వేశారు. బ్రహ్మ సమాజం ప్రభావంలో ఉన్న కళాశాల యాజమాన్యం గోరాను జీర్ణించుకోలేకపోయింది. ఆ తరువాత బందరు హిందూ కళాశాలకు వెళ్ళి లెక్చరర్ గా గోరా చేరారు. అక్కడ కూడా ఆయనకు నాస్తిక వాదంతో కష్టాలు ఎదురయ్యాయి. కళాశాలలో పనిచేస్తూనే వారాంతంలో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి నాస్తిక ప్రచారం చేసేవారు. అది ఆకళింపు చేసుకోలేని యాజమాన్యం1939లో గోరాను ఉద్యోగం నుంచి తొలగించింది. అదే గోరా జీవితంలో పెద్ద మలుపు తిప్పింది. 1940లో కాలేజీ నుంచి బయటపడ్డ గోరా మళ్ళీ ఉద్యోగాలు చెయ్యలేదు.
కృష్ణాజిల్లాలో ముదునూరు గ్రామానికి చెందిన స్వాతంత్ర్య యోధుడు అన్నె అంజయ్య సహకరించగా ఆ గ్రామంలో ఉంటూ అంటరాని వారి మధ్య సహపంక్తి భోజనాలు చేస్తూ గ్రామ సేవలో నిమగ్నమయ్యారు. నాస్తిక కేంద్రాన్ని నెలకొల్పారు. గ్రామస్తులు ఆయనకు బాగా సహకరించారు. నాస్తికత్వం గురించి గోరా రాసిన పుస్తకాన్ని 1941లో ముదునూరు గ్రామస్తులు ప్రచురించటం విశేషం. ఇప్పటికీ గోరా ప్రభావంతో ఆ గ్రామంలో సహపంక్తి భోజనాలు సాంఘిక సేవా కార్యక్రమాలు డాక్టర్ ఎన్. భాస్కరరావు ఆధ్వర్యాన జరుగుతూనే ఉన్నాయి.
గోరాకు 9 మంది సంతానం. పిల్లలందరికీ మతరహిత పేర్లు పెట్టటం గమనార్హం. ఉప్పు సత్యాగ్రహంలో పుట్టినందుకు కుమారుడికి ‘లవణం’ అని పేరు పెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పుట్టిన కుమారుడికి ‘సమరం’, యుద్ధానంతరం పుట్టిన కుమారుడికి ‘విజయం’ అని పెట్టారు. 9వ సంతానంగా పుట్టిన కుమారుడికి ‘నవ్’ అని పేరు పెట్టారు.
ముదునూరు నుండి కేంద్రాన్ని బెజవాడలోని పటమటలో ఏర్పరుచుకున్నారు. అదే ఉత్తరోత్తరా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అక్కడ నుండే గోరా గాంధీని కలిసి ఆయన సేవా కార్యక్రమాలను అంగీకరిస్తూ ఆయన మత భావాలను నిరాకరించారు. గోరా ఆధ్వర్యాన కొన్ని వందల సెక్యులర్ పెళ్ళిళ్ళు జరిగాయి. తన సంతానానికి కూడా గాంధీ సేవాగ్రామ్ లో పెళ్ళిళ్ళు చేయించారు. 1951 నాటికి వినోబా భావేతో సన్నిహితంగా భూదానం, శ్రమదాన ఉద్యమాలలో పాల్గొన్నారు.
మదరాసులో నాస్తిక ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో నడిపిస్తున్న పెరియార్ రామస్వామి నాయక్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు.
భావ ప్రచారకుడిగా గోరా
పార్టీరహిత ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో తొలుత తెచ్చిన ఎమ్.ఎన్.రాయ్ భావాలు ఆయనను ఆకర్షించాయి. అదే ధోరణిలో పార్టీ రహిత అభ్యర్థులుగా పోటీ చేయటం, ఎన్నికలలో పాల్గొని ప్రచారం చేయటం గోరా కొనసాగించారు. ఆవిధంగా చేస్తున్న జయప్రకాష్ నారాయణ్ తో సహకరించారు. గోరా ప్రపంచంలోని నాస్తికులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. తెలుగులో, హిందీలో, ఇంగ్లీషులో పత్రికలు పెట్టి భావ ప్రచారం చేశారు. నాస్తిక కేంద్రం చాలామందిని ఆకట్టుకుంది. అయితే ఆయన శాఖలు ఏర్పరచి విస్తృత పరచలేదు. ఒకే కేంద్రం నుండి పనిచేశారు. ఇప్పటికీ అలాగే జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నాస్తికులు ఆయన కేంద్రాన్ని సందర్శించారు. భారతదేశంలో విస్తృతంగా పర్యటించిన గోరా 1972లో ప్రథమ ప్రపంచ నాస్తిక సభలు జరిపి ఎందరినో ఆకర్షించారు.
1970లో గోరా విదేశీ పర్యటన చేశారు. అమెరికాలో వీరనాస్తికురాలిగా పేరొందిన మేడలిన్ ఓహేర్ ను కలిశారు. ఆమె కూడా తరువాత ఇండియా వచ్చి పర్యటించింది. యూరోపులో, ఆస్ట్రేలియాలో నాస్తిక ప్రముఖులు రావడం ప్రచారం ముమ్మరంగా సాగించడం జరిగింది.
1972లో గోరా నిర్వహించిన మాంసాహార విందు ఎందరినో ఆకర్షించగా మరెందరినో దూరం చేసింది. అందులో ఆవు మాంసం, పంది మాంసం రొట్టెలలో పెట్టి విందు చేశారు. ఆయన సిద్ధాంత ప్రకారం భోజన విషయంలో నిషిద్ధాలు ఉండకూడదని ఎవరిష్టం వచ్చిన భోజనం వారు చేసుకునే స్వేచ్ఛ ఉండాలని చెప్పారు. కానీ అటు సనాతన హిందువులు, ఇటు ఛాందస ముస్లింలు గోరా విందును బహిష్కరించి నిరసించారు. అయినా గోరా వెనుకాడలేదు. తన భావాలను గాంధీ దగ్గరకు వెళ్ళి కూడా నిస్సంకోచంగా చెప్పిన వ్యక్తి ఆయన.
అనేక రచనలు తెలుగులోను, ఇంగ్లీషులోను పుస్తక రూపంలో వ్యాసాల పరంగా ప్రచురించారు. ఎమ్.ఎన్.రాయ్ అనుచరులు రాడికల్ హ్యూమనిస్టులు ముఖ్యంగా ఆవుల గోపాలకృష్ణమూర్తి వంటివారితో సహకరించి పనిచేశారు.
ప్రపంచ మానవవాద సంఘ సమావేశాలలో రెండు పర్యాయాలు పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో అమెరికా, రష్యా యూరోపు దేశాలు, ఆస్ట్రేలియా, ఫిజి దీవులు, ఇండోనేషియా, ఈజిప్టు పర్యటించారు. ఎక్కడికి వెళ్ళినా హ్యూమనిస్టుల ఇళ్ళల్లో వుంటూ వారితో సన్నిహిత సంబంధాలు పెంపొందించే పద్ధతులు గమనార్హం. ఇంగ్లీషులోను తెలుగులోనూ స్పష్టంగా మాట్లాడేవారు. అలాగే రాసేవారు. 1956 నుండి ఆయన చనిపోయేవరకూ నేను గోరాతో సన్నిహితంగా ఉన్నాను. ఆయన వస్త్రధారణలో చొక్కాలు వేసుకునేవాడు కాదు. ఒక వస్త్రాన్ని కప్పుకునేవాడు. మోకాళ్ళవరకే పంచ కట్టుకునేవాడు. ఆయన దగ్గరకు నేను వెళ్ళటం, మా ఇంటికి ఆయన రావటం అనేక పర్యాయాలు జరిగింది. నేను నిర్వహించిన మానవవాద, హేతువాద అధ్యయన శిబిరాలలో పాల్గొని మాట్లాడారు. అభిప్రాయ భేదాలను వ్యక్తిగత సంబంధాలలోకి తెచ్చేవారు కాదు. అదీ ఆయన గొప్ప సుగుణం. భావాలలో ఎక్కడా రాజీపడేవారూ కాదు.
1975లో గోరా సమావేశాలలో పాల్గొంటూనే చనిపోయారు. అప్పటికాయన వయసు 73 సంవత్సరాలు. ఆయన ప్రారంభించిన నాస్తిక ఉద్యమాలు పట్టుదలగా ఆయన కుటుంబీకులు వారి మిత్రుల సహకారంతో కొనసాగిస్తున్నారు. గోరా శాస్త్రీయ పద్ధతికి అనుకూల వ్యక్తి. అదే ఉద్యమానికి ఆయువు పట్టు. మేము అనేకసార్లు వాదోపవాదాలలో ఆయనతో భేదించినా మళ్ళీ ఇంటికి వచ్చి, మాతో భోజనాలు చేస్తూ హాయిగా మాట్లాడేవాడు. అదీ గోరా వ్యక్తిత్వం. ఇంతకూ గోపరాజు రామచంద్రరావు గోరాగా ఎప్పుడు మారాడు. తనను వెలివేసిన సందర్భంగా అలాంటి మార్పు పేరులోనూ తెచ్చాడు.
గోరా నాస్తిక వాదంలో కొన్ని తేడాలు గమనించి విమర్శించిన మానవవాదులు రావిపూడి వెంకటాద్రి, మల్లాది రామమూర్తి, లేకపోలేదు. కానీ అలాంటివి పక్కన పెట్టి ఆయనతో సహకరిస్తూ ఆవుల గోపాలకృష్ణమూర్తివంటి మానవవాదులు ముందుకు సాగారు.
గోరా ఆదర్శాలు
గోరా చేపట్టిన ఉద్యమాలలో పదవులలో ఉన్నవారు ఆదర్శంగా సాధారణ జీవితం గడపాలని, ప్రజాధనం దుర్వినియోగం చేయరాదని, విలాసవంతమైన భవనాలలో ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు ఉండరాదని, ఫస్ట్ క్లాస్ ప్రయాణాలు చేయరాదని పట్టుబట్టారు. సంజీవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వుంటున్న గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ ముందు కూర్చొని సమ్మె చేశారు. ఆ సమయంలో (1957) నేనూ ఉన్నాను. విషయాన్ని అర్థం చేసుకున్న సంజీవరెడ్డి లౌక్యంగా గోరాను ఆహ్వానించి తనతో భోజనం చేయమని, విషయాన్ని చర్చించి గోరాతో అంగీకరిస్తున్నట్లు తెలిపారు. అంతేగాని గోరా కోరినట్లు సాధారణ జీవితం గడపలేదు.
పూలమొక్కల బదులు కూరగాయ మొక్కలు వేయమని ప్రభుత్వాన్ని అర్థిస్తూ హైదరాబాదులో ఆకాశవాణికి ఎదురుగా ఉన్న పూలమొక్కలను పెకిలించి వేశారు. పోలీసులు దానికి అభ్యంతర పెట్టి నిర్బంధంలోకి తీసుకున్నారు.
గోరా తన నాస్తిక వాదాన్ని గురించి విపులీకరిస్తూ కేవలం దేవుడు లేడు అనడం కాదని నాస్తిక జీవితంలో రామణీయకతను జీవిత విలువలు సంతోషంగా బతకటం, సహకారం, మానవ విలువలను పాటించటం ప్రధానంగా వుంటుందన్నారు.
- నరిసెట్టి ఇన్నయ్య
ఉపన్యసిస్తున్నవారు ఆవుల గోపాలకృష్ణమూర్తి (న్యాయవాది, రచయిత, హేతువాది, ఆదర్శవివాహ నిర్వాహకులు, 1964 అమెరికా యాత్ర చేశారు) కూర్చున్నవారు ఎథియిస్ట్ లీడర్ గోరా, హ్యూమనిస్ట్ లీడర్ మల్లాది రామమూర్తి, ఎడిటర్, వెనుక కూర్చున్నవారు నరిసెట్టి ఇన్నయ్య

         



సరస్వతీ గోరా, గోరా


--
13.61 GB (90%) of 15 GB used
©2015 Google - Terms - Privacy
Last account activity: 12 minutes ago
Details


No comments:

Post a Comment