సంజీవదేవ్ by ముత్తేవి రవీంద్రనాథ్

స్ఫూర్తి ప్రదాత సంజీవదేవ్ -- ముత్తేవి రవీంద్రనాథ్, 98491 31029. పరిచయం :- ఆయనో సాదా సీదా మనిషి. ఆయనకేమీ డిగ్రీలూ గట్రా లేవు. పుట్టింది ఏ పండితవంశంలోనో కాదు - స్థితిపరులైన వ్యవసాయదారుల కుటుంబంలో. బాల్యం కొంతకాలం మేనమామల ఇంట కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కోనాయపాలెంలోనూ, తరువాత జీవితం అంతా తెనాలి సమీపంలోని తన స్వస్థలం తుమ్మపూడిలోనూ గడిచింది. కోనాయపాలెం, తుమ్మపూడి -- ఆ రెండూ కుగ్రామాలే. పసితనం నుంచీ పరిసరాలను ఆసక్తిగా గమనించడం, ప్రకృతి సౌందర్యానికి పరవశించడం, ప్రతి చిన్న విషయానికీ ‘హేతువు’ కనుగొనే ప్రయత్నం చేయడం, తనకు నచ్చని, అసమంజసమనిపించిన పనులను నిర్మొగమాటంగా ఎదిరించడం -- ఇవీ అతడి లక్షణాలు.కోనాయపాలెంలో ఉర్దూ, తెలుగు భాషలను,తుమ్మపూడిలో ఆంగ్ల భాషను తనకోసం నియమించిన ప్రత్యేక ఉపాధ్యాయుల శిక్షణలో కొంతమేరకు నేర్చాడు. తరవాత జీవితంలో స్వయంకృషితో నేర్చుకున్నదే ఎక్కువ. బాల టాగోర్ వలెనే ఈ బాలుడూ పాఠ్యాంశాలకంటే పాఠ్యేతరాంశాలపైనే ఎక్కువ మక్కువ చూపేవాడు. చిన్నప్పుడు విన్న ‘మనుచరిత్ర’ పద్యాలలోని హిమాలయాల సౌందర్యం పట్ల మోహితుడైన ఆ బాలుడు తానుకూడా ‘ ప్రవరుడిలా పాదాలకు లేపనం రాసుకుని ఎప్పుడెప్పుడు హిమాలయాల్లో విహరిస్తానా ?’ అంటూ కలలు కనేవాడు.దివ్యజ్ఞాన సమాజం(Theosophical Society) పట్ల అనురక్తి కలిగిన తన పెదతండ్రి సూర్యదేవర చిన వెంకటక్రిష్ణయ్యగారి ప్రభావం ఆ బాలుడిపై గాఢంగా పడింది.ఆ సంస్థ మహాసభలకు పెదతండ్రితో కలిసి మద్రాసు వెళ్ళిన ఆ బాలుడు అడయార్ లో అనిబిసెంట్ వచోవైభవానికి అబ్బురపడ్డాడు. అదే సందర్భంలో జిడ్డు కృష్ణమూర్తి తనను పలకరిస్తే పులకరించిపోయాడు.మరో పెదతండ్రి కుమారుని కారణంగా ఆయనకు రామకృష్ణ మిషన్ వారి కార్యకలాపాలతోనూ,సాహిత్యంతోనూ కొంత పరిచయం ఏర్పడింది. స్వామి రామతీర్థ చేసిన హిమాలయ యాత్ర గురించి చదివి, హిమాలయాలను దర్శించాలని మరింతగా ఉవ్విళ్ళూరాడు.కృష్ణ శర్మ అనే ఉపాధ్యాయుని ద్వారా పద్నాలుగేళ్ళ వయసులో ఇంటివద్దే హిందీ చదవడం, రాయడం నేర్చాడు. ఆయన వద్ద ఉన్న ‘బెంగాలీ స్వబోధిని’ సాయంతో బెంగాలీ భాషను మక్కువతో నేర్చుకుని, బెంగాలీ సాహిత్యాన్నీ స్వయంకృషితో మథించాడు. పదహారేళ్ళు వచ్చేసరికల్లా హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ భాషల పత్రికలు తెప్పించుకుని చదవడం,పత్రికల సంపాదకులతో ఆ యా భాషలలో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరపడం ఆయనకు అలవాటుగా మారింది.రామకృష్ణ మిషన్ వారి ఇంగ్లిష్ మాసపత్రిక ‘ప్రబుద్ధ భారత్’ సంపాదకుడు స్వామి పవిత్రానందకు లేఖరాసి, తనకు ఆ పత్రిక సంపాదక కార్యాలయం ఉన్న అల్మోరా జిల్లాలోని మాయావతికి వచ్చి ఆయన్నివ్యక్తిగతంగా కలుసుకోవాలనే కోరిక ఉందనీ, అందుకోసం వీలయినంత త్వరలో బయలుదేరి రావాలనుకుంటున్నాననీ తెలియజేశాడు. తన పదహారవ ఏట ఇంటినుంచి ఎవరికీ చెప్పాచెయ్యకుండా హిమాలయాలకు బయల్దేరి, దారిలో లక్నోలో సుప్రసిద్ధ హిందీ నవలా రచయిత మున్షీ ప్రేమ్ చంద్ ని కలిసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ‘గబన్’, ‘నిర్మలా’, ‘షత్రంజ్ కే ఖిలాడీ’, ‘ప్రతిగ్యా’, ‘రంగ్ భూమి’ మొదలైన ప్రేమ్ చంద్ హిందీ రచనలు తాను అప్పటికే చదివి ఆయన అభిమానిగా మారానని చెప్పాడు. సీతాపూర్, రాణీఖేత్, అల్మోరాలమీదుగా అష్టకష్టాలూపడి ఎట్టకేలకు మాయావతి చేరుకుని స్వామి పవిత్రానందను కలిశాడు. హిమాలయాలను చేరుకుని అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించాలనే తన చిరకాల స్వప్నాన్ని అలా సాకారం చేసుకున్నాడాయన. మాయావతి ఆశ్రమంలోని వారంతా బెంగాలీలే అయినా ఆయనకి అక్కడ భావవ్యక్తీకరణలో ఇబ్బందులేమీ కలుగలేదు; తనకున్న బెంగాలీ భాషా ప్రావీణ్యంతో ఆయన వారందరితో కలగలిసి పోయాడు. ఆశ్రమంలో పవిత్రానంద సహాయంతో కొంతకాలం పాశ్చాత్య తర్కం, జ్ఞాన సిద్ధాంతం, సౌందర్య శాస్త్రం మొదలైన అంశాలలో లోతైన అధ్యయనం చేశాడు. కొన్నాళ్ళు అక్కడే మకాంవేసి, అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలను, భాషా సంస్కృతులను నిశితంగా పరిశీలించాడు. అక్కడి దేవదారు, చీడ్ (కర్పూర తైలపు) వృక్షాల గురించే కాదు; కంచర గాడిదలూ, చమరీ మృగాలను గురించి కూడా ఎన్నో విషయాలు అక్కడి వారి నుంచి ఆసక్తిగా తెలుసుకున్నాడు. ఇద్దరు ఫ్రెంచి మిత్రులతో సహవాసం చేసి వారి ద్వారా ఫ్రెంచ్ భాష నేర్చుకున్నాడు. అక్కడి ప్రకృతి రామణీయకతపై ఆంగ్లంలో చక్కటి కవితలు అల్లాడు. అక్కడినుంచి రెండు రోజులు ప్రయాణించి, అస్కోట వెళ్లి అక్కడ నగ్న శరీరాలతో జీవించే ‘రాజీలు’ అనే ఆటవిక జాతి ప్రజలను కలుసుకున్నాడు. వారి వింత ఆచారాలు తెలుసుకున్నాడు. అక్కడినుంచి ఫిలిభిత్ మీదుగా లక్నోవెళ్లి అక్కడి లలితకళల విద్యాలయ ప్రిన్సిపల్, ప్రఖ్యాత చిత్రకారుడు, తన కలం స్నేహితుడు అయినట్టి అసిత్ కుమార్ హల్దార్ (విశ్వకవి రవీంద్రుని మేనకోడలి కుమారుడు)ను కలిశాడు. ‘మీరు బెంగాల్ ప్రాంతపు హలధారులైతే, నేను ఆంధ్రప్రాంతపు హలధారి(రైతు)ని’ అనేవాడట సంజీవదేవ్ ఆయనతో చమత్కారంగా. (హల్దార్ శబ్దానికి ‘హలధారి’ శబ్దమే మూలం. రైతు అని దాని అర్థం). ఆయన నుంచి నైరూప్య కళకు సంబంధించిన పలు విషయాలు సంజీవదేవ్ శ్రద్ధగా రాబట్టాడు. అదే సమయంలో లక్నో వచ్చిన రవీంద్రుడిని, ఎ. కె. హల్దార్ వెంట వెళ్లి కలిసి, రవీంద్రుడు రాసిన బెంగాలీ గీతాలను ఆయనకే శ్రావ్యంగా చదివి వినిపించి, ఆయన మెప్పు పొందాడు. 1937 లో లక్నో నుంచి తుమ్మపూడికి తిరిగివచ్చిన ఆయనలో సాహిత్య పిపాస చెలరేగింది. అప్పటివరకూ ఇతర భాషలలో చేస్తూండిన రచనలకు తోడు తెలుగులోనూ వ్యాస రచన చేయసాగాడాయన. విజయవాడ, దుగ్గిరాల వంటి బయటి ఊళ్లకు వెళ్లి సాహిత్యం, చిత్రలేఖనం మొదలైన విషయాలపై ఉపన్యాసాలిచ్చేవాడు. ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ చిత్రకారుడు, గ్రంథకర్త, పర్యాటకుడు అయిన ప్రొఫెసర్ నికొలాస్ రోరిక్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలెట్టాడు. ఆ దశలోనే విస్సా అప్పారావు, అడివి బాపిరాజు వంటి ప్రముఖులతో పరిచయాలయ్యాయి. ఈ పరిచయాలన్నీ ఒక ఎత్తు; మహా మహోపాధ్యాయ రాహుల్ సాంకృత్యాయన్ తో ఏర్పడిన పరిచయం మరొక ఎత్తు. ఆ పరిచయంతో వారిద్దరి మధ్యా విడదీయరాని బంధం ఏర్పడింది. కమ్యూనిస్టుల నేతృత్వంలో బెజవాడలో 1944 లో జరిగిన అఖిలభారత రైతు మహాసభకు అప్పుడు కమ్యూనిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్న రాహుల్జీ వచ్చారు. అప్పటి యస్. ఆర్. ఆర్. కళాశాల ప్రిన్సిపల్ డా. పుట్టపర్తి శ్రీనివాసాచారి ద్వారా రాహుల్జీని పరిచయం చేసుకున్న సంజీవదేవ్, ఆ కొద్ది పరిచయం ఆధారంగా రాహుల్జీని వారంపాటు తుమ్మపూడికి తన అతిథిగా రప్పించుకోగలగడంలో కృతకృత్యుడయ్యాడు. పూర్వాశ్రమంలోని కేదార్ నాథ్ పాండే బౌద్ధ సన్యాసిగా, ‘రాహుల్ సాంకృత్యాయన్’గా మారి, సంస్కృతం, చైనీస్, పాలీ, టిబెటన్, సింహళీస్ మొదలైన పలు ప్రపంచ భాషలలో పాండిత్యం సంపాదించి, ఆ యా భాషలలో అప్పటికే అంతరించిపోతున్న బౌద్ధ సాహిత్యాన్నిఇతర భాషలలోకి అనువదించి లోకానికి పరిచయం చేసి, ‘మరో కుమారజీవుడ’ ని ఖ్యాతిగాంచిన ఆ మహామహోపాధ్యాయుడికి సంజీవదేవ్ వ్యక్తిత్వంలోని విలక్షణమైన అంశాలు ఎన్నో నచ్చిన కారణంగానే ఆయన ఈ ఆతిథ్యం స్వీకరించారనడంలో ఎంతమాత్రం సందేహంలేదు.(కుమారజీవుడు క్రీ.శ. 325 ప్రాంతాలలో జన్మించి, కాశ్మీర్ లోని బంధుదత్తుని వద్ద సంస్కృతంనేర్చి, ఆ తరువాత చైనాను పాలించిన త్సిన్ వంశీకుల ఆస్థాన పండితునిగా ఉంటూ, 300 కు పైగా బౌద్ధ ఉద్గ్రంథాలను సంస్కృతాన్నుంచి చైనీస్ భాషలోనికి అనువదించి, క్రీ. శ. 413 లో మరణించేనాటికి మూడు వేలమందికి పైగా ఉద్దండ పండితులను తన శిష్యులుగా చేసుకున్న మహాయాన బౌద్ధ శాఖకు చెందిన మహా పండితుడు. ఆయన కారణంగానే చైనాలో బౌద్ధమతం వ్యాపించింది.) తాను రాహుల్జీకి ఆతిథ్యమిచ్చిన వారంరోజులు రాహుల్జీ సాహచర్యం తన జీవితంలో ఎన్నో దీపికలను వెలిగించిందని రాసుకున్నారు సంజీవదేవ్. తుమ్మపూడిలోని బకింగ్ హాం కాలువలో వారిరువురూ తనివిదీరా ఈదులాడారు. సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలైన అమరావతి, నాగార్జున కొండ వారిరువురూ కలిసే దర్శించారు. ఆ సందర్భంగా తనను కలుసుకున్న కొందరు సుగాలీల (లంబాడీల)తో సంభాషించి, లిపి లేని వారి భాషకు అప్పటికప్పుడు ఒక లిపిని రూపొందించి ఇచ్చారట రాహుల్జీ. రాహుల్జీ తన ప్రఖ్యాత రచన ‘ఓల్గా సే గంగా’ పుస్తకాన్నొకదాన్ని సంజీవదేవ్ కు ప్రేమతో బహూకరించారు. రాహుల్జీ అప్పటికే ప్రముఖ కమ్యూనిస్టు నేత అయినందున గుంటూరు జిల్లా కమ్యూనిస్టు పార్టీ వీరిరువురికీ గుంటూరులో విందు ఇచ్చి, సన్మాన సభ జరిపింది. ఆ సభలో ప్రముఖ బుర్రకథకుడు (పద్మశ్రీ)నాజర్ దళం చెప్పిన బుర్ర కథను చివరివరకూ సంజీవదేవ్ తోపాటు తెలుగు తెలియకున్నా రాహుల్జీ కూడా శ్రద్ధగా ఆలకించారట.రాహుల్జీకి ఎన్నో ఇతర భాషలు వచ్చినట్లే తెలుగు కూడా చదవడం వచ్చు. అయితే ఆయన తెలుగు విని అర్థం చేసుకోలేరట. సంజీవదేవ్ కూడా బహుభాషావేత్త. సరికొత్త అంతర్జాతీయ సంధాన భాష ‘ఎస్పరాంటో’ ను కూడా ఆయన నేర్చుకున్నారు.ఇక సంజీవదేవ్ చింతనాధారలోని మార్మికవాద ఛాయలు రాహుల్జీకి నచ్చలేదు. రాహుల్జీ భౌతికవాద దృక్పథాన్ని విని ఆనందించిన సంజీవదేవ్ ఆ దృక్పథాన్ని తనదిగా చేసుకొనేందుకు మాత్రం ఇష్టపడలేదు. ఏ వాదమైనా అది మానవ చైతన్యాన్ని ఊర్థ్వముఖంగా మార్చి, మానవ హృదయంలో ఉన్నతమైన ఆనందాన్ని సృష్టించి, మానవుడిని మానవుడి కంటే పైకి ఎత్తగలిగినప్పుడే అది ఉత్తమవాదమని సంజీవదేవ్ అభిప్రాయం. అటువంటి వాదాన్ని ఏపేరుతో పిలిచినా పరవాలేదనీ, భౌతికవాదం కూడా ఆ విధంగా చేయగలిగినప్పుడు దాన్ని స్వీకరించడానికి కూడా వెనకాడవలసిన అవసరంలేదనీ, అందుకే ఒక మార్మికవాది భౌతికవాదాన్ని చిన్నచూపు చూడాల్సిన పని లేదనీ ఆయన అభిప్రాయం. భౌతికవాదాన్ని మార్మికవాదాన్నుంచి వేరు చేసి, కేవలం భౌతికవాదం మాత్రమే మహత్తరమైనదనే రాహుల్జీ ఆలోచన తనకు నచ్చదని పేర్కొన్నారు సంజీవదేవ్. సమన్వయ దృష్టి లోపించినందున ఆ తరహా ఏకపక్ష దృష్టి తనకు అంగీకారయోగ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా భిన్నమైన వైఖరులు కలిగి ఉన్నప్పటికీ వారిరువురి మైత్రీ బంధం కొనసాగింది. ఇదంతా కేవలం సంజీవదేవ్ జీవితంలోని ఒక పార్శ్వం మాత్రమే. మరెందరో ప్రముఖ వ్యక్తులతో సన్నిహిత స్నేహబంధాన్ని నెరపడం మాత్రమే కాక, రచయితగా, తాత్త్వికునిగా, వ్యాఖ్యాతగా, చిత్రకారునిగా, చిత్రకళా విమర్శకునిగా, చాయా చిత్రకారునిగా, కళా పోటీలలో న్యాయ నిర్ణేతగా, ఉపన్యాసకునిగా, పర్యాటకునిగా, లేఖా స్నేహ శిల్పిగా కేవలం తెలుగు జాతికే కాదు; మొత్తం మానవజాతికి ఆయన చేసిన బహుముఖీనమైన సేవలు అగణితమైనవి. వెలకట్టలేనివి కూడా. 1939 నుంచీ - అంటే తన ఇరవై ఐదవ యేటినుంచీ - కలంపట్టి రచనలు సాగించారు. ఆయన రచనలు అప్పట్లో మద్రాసు నుంచి వెలువడే ‘ఆంధ్రప్రభ’లో ధారావాహికంగా వచ్చేవి. ఎందఱో మిత్రులు, అభిమానులకు ఆయన పుంఖానుపుంఖంగా లేఖలు రాశారు. తెలుగు లేఖా సాహిత్యంలో సంజీవదేవ్ లేఖలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సమకాలీన ప్రపంచంలో దాదాపుగా ప్రముఖ వ్యక్తులందరూ ఆయన కలం స్నేహితులే. మరో ముఖ్యమైన విషయమేమంటే - తనకంటే వయస్సులోనూ, అనుభవంలోనూ ఎంతో చిన్నవారితో కూడా ఆయన ఎంతో శ్రద్ధతో, అంకితభావంతో కలం స్నేహం నెరపేవారు. ఆయన రాసిన లేఖలన్నీ ముచ్చటైన ఆర్ట్ పేపర్ మీద చూడ చక్కని చేవ్రాతతో ఉండేవి. 1960 తరువాత ఆయన రాసిన లేఖలన్నిటికీ తాను స్వయంగా చిత్రించిన ఓ వర్ణచిత్రాన్ని తప్పక జతపరచేవారు. అందుకే ఆయన లేఖల్ని కలం స్నేహితులు తమవద్ద కలకాలం పదిలపరచుకోదగ్గ నిధులుగా భావిస్తారంటే అందులో వింతేమీ లేదు. రవీంద్రుని ‘గీతాంజలి’కి చలం చేసిన అనువాదానికి ‘అనుమేళన’ పేరుతో సంజీవదేవ్ రాసిన ఉపోద్ఘాతం ఆయన లోతైన తాత్త్విక చింతనకు అద్దం పడుతుంది.తన ఇరవై ఆరవ ఏట మరొకసారి ఇల్లు విడిచి పంజాబ్, హిమాలయాలు దర్శించుకున్న ఈ ప్రకృతి ప్రేమికుడు కులూ లోయలో నికొలాస్ రోరిక్ కుటుంబాన్ని కలిశారు.అది ఆయన జీవితంలోని మరో మరపురాని మధురానుభూతి.1914 జూలై మూడవ తేదీన జన్మించిన సంజీవదేవ్ 1950 లో తన 36 వ ఏట సులోచనాదేవిని వివాహమాడారు. నాటి నుంచీ తుమ్మపూడిలోని వారి ఇల్లు అతిథి అభ్యాగతులతో కళకళలాడేది. ఆ దంపతులు ఎందరెందరికో తమ ఇంట మరువలేని ఆతిథ్యాన్నిచ్చారు. అంతకు మునుపు కేవలం సౌందర్యారాధకునిగానూ, కళా విమర్శకునిగానూ ఉన్న సంజీవదేవ్ 1960 నుంచి స్వయంగా కుంచె పట్టి రంగులతో అద్భుతాలు సృష్టించారు.ఆయన స్వీయ చరిత్ర, అనంతసాగరంవంటి ఆయన లేఖాసాహిత్యం, ఇతర రచనలే కాక, ఆంగ్లంలో ఆయన రాసిన ‘Her Life’, ‘ Bio-symphony’వంటి రచనలు ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. లోతైన పరిశీలన, సునిశిత విమర్శ, హాస్యోక్తి - ఈ మూడింటినీ కలగలిపి సమయోచితంగా ప్రసంగించే నేర్పుగల వక్తగానూ ఆయన లబ్ధప్రతిష్ఠులయ్యారు. తనలాగే సామాన్యులెవరైనా దీక్షతో, పట్టుదలతో, స్వయం కృషితో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని నిరూపించిన స్ఫూర్తి ప్రదాత సంజీవదేవ్ గారిని ఆంధ్ర విశ్వ విద్యాలయం ‘ చంద్రునికో నూలుపోగు’ చందంగా గౌరవ డి. లిట్. తో సత్కరించి, తనను తాను గౌరవించుకుంది. తాత్త్వికుడు, మనోవైజ్ఞానికుడు, ప్రకృతి ప్రేమికుడు, చిత్రకారుడు, కళా విమర్శకునిగానే కాక, సౌందర్య పిపాసిగానూ,సాంస్కృతిక వారధిగానూ వాసికెక్కిన ఆ మహనీయుడి స్మృతికి నివాళిగా ఈ శతజయంతి సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడెమి ఈ సాహిత్య సభను నిర్వహించడం ముదావహం. ఈ సందర్భంగా తనను తాను ఒక అపురూప శిల్పంలా తీర్చిదిద్దుకున్న ఆ మహత్తర రూపశిల్పి సంజీవదేవ్ స్మృతికి ముందుగా మనమంతా ఘనంగా అంజలి ఘటిద్దాం. ప్రస్తుత ప్రసంగాంశం సంజీవదేవ్ ఆత్మకథలోని మూడవ భాగమైన ‘గతంలోకి’ పై సమీక్ష. ఆయన స్వీయ చరిత్రలోని మొదటి రెండు భాగాలూ - అంటే ‘తెగిన జ్ఞాపకాలు’, ‘స్మృతి బింబాలు’ - ఆయన బాల్య (5 సంవత్సరాల వయస్సు వరకు) ,కౌమార (5 నుంచి 16 సంవత్సరాల వరకు) , యౌవన ( 16 నుంచి 50 సంవత్సరాల వరకు) దశలకు సంబంధించినవి కనుక సహజంగానే అవి ఘటనా వైచిత్రి కలిగి, అద్భుతరసంతో కూడిన పలు వర్ణనలు, రసపుష్టి కలిగిన అనుభవాలు, అనుభూతులతో నిండి ఉంటాయి. ‘గతంలోకి’ అన్న మూడవ భాగం 1959 తో ఆరంభమై, 1965 తో అంతమౌతుంది. ఇది దాదాపుగా ఆయన వృద్ధాప్యంలో ప్రవేశించిన దశ. ఆ కారణంగా ఈ భాగమంతా ఆయన గతకాలపు అనుభవాలపట్ల లోతైన అంతర్దృష్టితో కూడి, సమీక్షాత్మకంగా ఉంటుంది. ఇందులో తత్త్వ చింతనే ప్రధానాంశం. ఈ దశలో వివిధ సందర్భాలలో పలు అంశాలపై ఆయన వ్యక్తపరచిన భావనలను స్థూలంగా స్పృశిస్తూ, అవి ఒక చింతనా స్రవంతిగా ఎలా రూపుదిద్దుకున్నాయో మనమిప్పుడు తెలుసుకుందాం. బాల్యం వేదనాభరితం సంజీవదేవ్ బాల్యం వేదనాభరితమైనది. తన నాలుగవ ఏటనే తల్లి వెంకాయమ్మని కోల్పోవడం, తండ్రి రామదేవ్ పునర్వివాహం చేసుకోవడం కారణంగా ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. రాచవారి కుటుంబాలలో సర్వ సాధారణమైన (కోనాయపాలెం లోని ఒకప్పటి)కోటలూ, గుర్రాలమీద స్వారీలు చేయడం మొదలైనవి ఆ పసి బాలుడికి ఒక దశలో ఆకర్షణీయంగా అనిపించి ఉండవచ్చునేమోగానీ, వస్తుతః స్వేచ్ఛాప్రియుడైన సంజీవదేవ్ కి తమ కుటుంబాలలోని ప్రత్యేక నియమనిబంధనలు, అప్రజాస్వామిక ఆచారాలు మాత్రం కంటకప్రాయంగా మారాయి. సాధారణంగానే వారి కుటుంబాలలో పిల్లలు తండ్రుల ఎదుటపడి మాట్లాడడం ఉండదు. పైపెచ్చు తండ్రి పునర్వివాహం చేసుకొనడం రుచించని ఆయన, తండ్రికి మానసికంగా మరింత ఎడమయ్యాడు. సంతానంలేక తనను దత్తత తీసుకున్న పెదతండ్రి జోగయ్యగారి భార్య తనపట్ల ఎప్పుడూ నిర్దయగా వ్యవహరిస్తూ, తననుచూసి గుడ్లురుముతూ ఉండిన కారణంగా ఆమె ప్రేమకూ నోచుకోక, ఆమె ఎంత త్వరగా కాలం చేస్తుందా -- అని ఆయన ఎదురు చూసేవాడట. బాల్యంలోని ఈ వేదనాభరితమైన మనః స్థితి కారణంగానే ఆయన తరచు ప్రకృతిలోకి పలాయనం అయ్యేవాడు. ప్రకృతి రామణీయకతకు ముగ్ధుడై గంటలపాటు ఆ తలపులలోనే మునిగితేలేవాడు.ఇంట్లో ఆదరణ కరవైన ఆ బాలుడికి ప్రకృతిలోని ప్రతి వస్తువూ అత్యంత సుందరమైనదిగానే కనుపించడంలో వింతేమీ లేదు. ఆయన ఎప్పుడూ ఇంటినుంచి వెళ్ళిపోయి హిమాలయాల సౌందర్యంతో తాదాత్మ్యం చెంది తద్వారా మానసికంగా ఓదార్పు పొందాలని తపనపడేవాడు. ఆ దశలో మరొక పెదతండ్రి వెంకట కృష్ణయ్య ఆ బాలుడిని ప్రేమగా దగ్గరకు తీశారు. ఆయన దివ్యజ్ఞాన సమాజం అనుయాయి అయినందున ఆ సిద్ధాంతాల ప్రభావం సహజంగానే ఈ బాలునిపైన కూడా పడ్డది. రామకృష్ణ మఠం మరియు అద్వైతాశ్రమం వారి తాత్త్విక చింతనను ఒంట పట్టించుకున్న మరొక పెదనాన్న కుమారుడి ప్రభావం కారణంగా కూడా సంజీవదేవ్ మనస్సు బాల్యంలోనే ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆకర్షితమైంది. ఐహిక జీవనంలో సుఖశాంతులకు నోచుకోని ఆ బాలుడు ప్రకృతి పట్ల ఆకర్షితుడవడం, కొంతమేరకు ఆముష్మిక చింతన బాటపట్టడం అలా ఒక సహజ పరిణామంగానే జరిగాయి. తెలుసుకోవటం - ఇతర్ల గురించీ, తన గురించీ ‘ఆత్మానామ్ విజానీయాత్’ (Know Thyself) అని ఆర్యోక్తి. ప్రతి ఒక్కరూ తనను తాను తెలుసుకోవాలి. అయితే ఏ వ్యక్తికైనా బయటి ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడం కంటే తనను గురించి తాను తెలుసుకోవడం చాలా కష్టమనే భావన అందరిలోనూ ఉంది. ఈ విషయాన్ని చర్చిస్తూ ఆయన ఇలా రాసుకున్నారు. “తనను తాను తెలుసుకోటం ఇతర్లను తెలుసుకొనే దానికంటే ఎక్కువ కష్టం అంటారు. ఇది ఆంశిక సత్యమే కానీ సమగ్ర సత్యం కాదు. అసలు తెలుసుకోటం అనే పని సులభమైంది కాదు. తెలుసుకోటం అనేపని కష్టమైంది అయినపుడు ఎవరిని గురించి తెలుసుకోటమైనా సులభం కాదు. కొన్ని విషయాల్లో ఇతర్లను గురించి తెలుసుకోటం సులభం. మరికొన్ని విషయాల్లో తనను గురించి తెలుసుకోటం కష్టం, ఇతర్లను గురించి తెలుసుకోటం సులభం. అందువల్ల రెంటిలోనూ కష్టం ఉన్నది, రెంటిలోనూ సౌలభ్యం ఉన్నది. ఇతర్లలోని లోపాలను తెలుసుకోటం సులభం. తనలోని లోపాలను తెలుసుకోటం కష్టం.” స్వీయ చరిత్ర ఎలా ఉండాలి ? అనే విషయంమీద రాస్తూ ఆయనిలా అంటారు. మానవుడు వైయక్తిక జీవి కాదు. సామాజిక జీవి. సమాజంలో జీవిస్తాడు కనుక అతని స్వీయ చరిత్ర అంటే అందులో తోటి సామాజిక జీవుల కథలు చాలా వస్తాయి. ఇతరుల కష్టసుఖాలనుండి తాను దూరంగా జీవించలేడు కనుక తన స్వంత కష్టసుఖాలకు మాత్రమే స్పందించక ఇతర్ల కష్టసుఖాలకు కూడా తాను స్పందిస్తాడు. తాను ఏమి తింటున్నాడు, ఏమి త్రాగుతున్నాడు, ఏమి చదువుతున్నాడు, ఏమి ఆలోచిస్తున్నాడు, ఏమి ఆకాంక్షిస్తున్నాడు అనేవి ఇతర్లకు అంత ప్రాముఖ్యం కావు. తన స్వంతాలు అనేవి సాధారణీకరణ అనే ప్రక్రియ ద్వారా విశ్వజనీనంగా మారినపుడే అవి ఇతర్లలో అభిరుచిని రేకెత్తించేది. స్వీయ చరిత్రలలో ఈ ప్రక్రియ మృగ్యమైనపుడు స్వీయ చరిత్ర అంటే కేవలం తన స్వంత డప్పును తాను వాయించుకోటమే అవుతుంది. ఏమి రాయాలా ? అనేదాని కంటే దేన్ని వర్జించాలా అనేది నిర్ణయించడం ముఖ్యం. వ్రాసేవి తక్కువ, వ్రాయకుండా వదిలేవి ఎక్కువ వున్నప్పుడే రచన, ప్రత్యేకించి స్వీయ చరిత్ర రక్తికడుతుంది. గొప్పవారిని మాత్రమే గురించి వ్రాసి, కొద్దివారిని వదలివేస్తే అటువంటి స్వీయ చరిత్ర మానవతకు దూరమై మనిషిలోని మనుష్యత్వానికి భంగం కలిగిస్తూ, అది ఉన్నత స్థాయికి చెందిన స్వీయ చరిత్ర అనుపించుకొనదు. ఒక వ్యక్తి తనలోని గుణదోషాలు రెంటినీ దాచక బయల్పరచినపుడే అది ఉన్నత శ్రేణికి చెందిన స్వీయ చరిత్ర అవుతుందంటారు సంజీవదేవ్. ప్రయాణంలో వింత అనుభవం 1959 ఆయన మొదటిసారిగా హైదరాబాద్ వెళ్ళారు. భార్య సులోచన, కుమారులు జోగేంద్ర, మహేంద్రలతో పాటు బేగంపేట పబ్లిక్ స్కూలులో చదువుతున్న మేనల్లుడు సుధా స్వరూప్ ని కూడా వెంట తీసుకుని విజయవాడ నుంచి హైదరాబాద్ బస్సెక్కారాయన. ఈ బస్సు ప్రయాణం సంజీవదేవ్ లోని ఒక వింత కోణాన్ని ఆవిష్కరిస్తుంది. సహజంగా బస్ లో ప్రయాణం చేసే ఎవరైనా ఏదైనా చదువుకోవడమో, సహ ప్రయాణికులతో మాటలాడడమో, లేక కుదిరితే సీట్లోనే జారగిలబడి నిద్రపోవడమో చేస్తారు.కాని ఆయన మాత్రం వింతగా తన తోటి ప్రయాణికులంతా సంతోషంగా ఉన్నారో లేదో తెలుసుకొనడానికి వారందరి ముఖాల్నీ పరిశీలనగా చూశారట. అందరూ సంతోషంగా కనుపించారుగానీ ఒక మధ్యవయస్కుడైన పెద్ద మనిషి మాత్రం ఏదో దిగులుగా, ఆందోళనగా ఉన్నట్లు కనుపించాడట. ఇక సంజీవదేవ్ కి మనసు ఆగలేదు. ఎలాగైనా ఆ పెద్దాయన్ని పలకరించి ఆయన దిగులుకి కారణం కనుక్కోవాలని ఒకటే ఆరాటపడ్డారాయన. మధ్యలో సూర్యాపేటలో బస్ ఆగి, అందరూ కిందకి దిగినప్పుడు, ఆ పెద్దాయన ఎవరికోసమో వెతుకులాడుతున్నట్లు అనిపించి, చొరవచేసి ‘ ఎవరికోసం చూస్తున్నారు ? మీరెందుకో ఆందోళనగా ఉన్నట్లున్నారు. మీ దిగులుకి కారణం ఏమిట’ని అడిగారాయన. తన పదహారేళ్ళ కుమారుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడనీ, అతడిని వెతకడానికే తిరుగుతున్నాననీ, అతడు క్షేమంగా ఉన్నాడో లేదోనని ఆందోళనగా ఉందనీ ఆ పెద్దాయన తెలిపాడట.ఆయన విచారానికి కారణం తెలుసుకున్న తరువాత తన మనసు కుదుటపడ్డదనీ, ఆ కారణం తనకి అంత బరువైనదిగా తట్టలేదనీ పేర్కొంటూ పదహారేళ్ళ కుమారుడు కనుక అతడు ఎక్కడికీ పోడనీ, ఇంటినుంచి తీసుకెళ్ళిన డబ్బు అయిపోయే వరకు ఏ పట్టణంలోనో తిరిగి, అది అయిపోగానే తిరిగి ఇంటికి చేరుకుంటాడనీ ఆ పెద్దాయనను అనునయిస్తారాయన. ఈ సందర్భంగా ఆయన ‘అయినా, ఎవరి బాధ వారికి బరువుగానే తడుతుంది. ఒకరి బాధలోని బరువు మరొకరికెలా తెలుస్తుంది ?’ అని రాసుకున్నారు. తాను ఇంట్లో చెప్పాపెట్టకుండా సొమ్ములు తీసుకుని హిమాలయాలకు చెక్కేసింది కూడా పదహారవ ఏటనే కావడం గమనార్హం. నమ్మకం- విశ్వాసం హైదరాబాద్ లో ఒకప్పటి గుంటూరు జిల్లా కలెక్టరు (తరువాత కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) భగవాన్ దాస్, ఆయన సతీమణి ప్రమీల, ప్రభుత్వ ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ విశ్వనాథ ముఖర్జీ, వైస్ ప్రిన్సిపల్ మసూద్ సాబ్, రాజా త్రియంబక్ రాజ్ బహదూర్ మొదలైన వారితో ఫోటోగ్రఫీ, చిత్రకళలపై ఆయన జరిపిన చర్చలు లోతైన ఆయన కళాదృష్టినే కాదు; కళావిమర్శకునిగా ఆయన సమున్నత స్థాయినీ తెలుపుతాయి. ఆయన, భగవాన్ దాస్, రాజా త్రియంబక్ - ఈ ముగ్గురూ అప్పుడు హైదరాబాద్ లో జరిగిన ఒక అంతర్జాతీయ ఫోటోగ్రాఫుల పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.ఆ ఫోటో ప్రదర్శనను గవర్నర్ ప్రారంభించాల్సి ఉంది. జడ్జింగు పూర్తయిన తరువాత తాను జడ్జిగా తన విధిని సక్రమంగా నేరవేర్చానా ? లేదా ? అనే సందేహం ఆయనకి కలుగుతుంది. ఈ సందర్భంగా ఆయనలో అంతర్మథనం ఇలా సాగింది. ‘ జడ్జింగ్ సమయంలో ఫోటోగ్రాఫర్లెవరికీ అన్యాయం చేయలేదు గదా ! అని జడ్జింగ్ ను ఒకసారి గుర్తు తెచ్చుకున్నాను,చేయలేదనే నమ్మాను. నమ్మడానికి, వాస్తవానికి సంబంధం లేదు. నమ్మింది నిజం కావాలని ఎక్కడుంది ? నమ్ముతున్నవాడు దాన్ని నిజమనే నమ్ముతాడు. అయితే నమ్మినదంతా నిజం కాకూడదనేదేముంది ? నమ్మింది నిజమయేదీ వుంటుంది, నిజం కానిదీ వుంటుంది. కనుక ఏ వ్యక్తి కూడా కేవలం విశ్వాసం మీద ఆధారపడి వుండరాదు. తాను నమ్మింది మాత్రమే నిజమనే మొండితనం కీడు తెస్తుంది,’ అంటారాయన. పిల్లల విద్య తన మేనల్లుడు సుధాస్వరూప్ ను శలవుల తరువాత తిరిగి స్కూల్ లో చేర్చి రావడానికి ఆయన బేగంపేట పబ్లిక్ స్కూల్ కి వెళ్ళినప్పుడు ‘పబ్లిక్ స్కూలులో చదువు ఎంత బాగుంటుందో తెలియదు కానీ, పబ్లిక్ స్కూల్ మాత్రం చాలా బాగుంది’ అని వ్యాఖ్యానిస్తారాయన. ఆ సందర్భంగా పిల్లల విద్య గురించి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు అచ్చం విద్యా తత్త్వం (Educational Philosophy) గురించిన రవీంద్రనాథ్ టాగోర్ భావాల్లాగానే ఉండడం విశేషం. ఆ భావాలేమిటో ఆయన మాటల్లోనే చూడండి. ‘పిల్లల విద్య అనేది ఒక గొప్ప సమస్య అయింది. ప్రత్యేకించి మనదేశంలో విద్య అనేది పిల్లలకు ఒక నిబంధన అయింది. చదువుకోవడం అనేది ఒక ఇష్టంలేని కర్తవ్యం అయింది కాని ఒక మధురమైన స్వేచ్చామయమైన వినోదం కాలేదు పిల్లలకు. పాఠశాల అనేది వాళ్లకు ఆనందదాయకమైన క్రీడానికేతనం కాక నేర్చుకొనే జైలు మాత్రమే అయింది. విద్యాభ్యాసం, ఆనందం ఈ రెండూ ఒకే వస్తువు కావాలి. అప్పుడు కాని పిల్లల విద్యకు మంచి భవిష్యత్తు ఉండదు.’ సత్య నిష్ఠ ఆత్మకథా రచనలో సంజీవదేవ్ ఎంతటి సత్య నిష్ఠను పాటించారో తెలిపే ఒక సన్నివేశాన్ని గురించి తప్పక చెప్పుకోవాలి. హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించడానికి వచ్చిన అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ భీమసేన్ సచార్ కు సంజీవదేవ్ ను పరిచయం చేసిన భగవాన్ దాస్ గవర్నర్ కి తాము జడ్జ్ చేసిన ఛాయాచిత్రాల విశేషాలను వివరించే పనిని అప్పగించారు. ముందుగా కొంతసేపు ఆయన ఒక్కొక్క ఫోటోగ్రాఫు - దానిలోని వస్తువు, సాంకేతిక విషయాల - గురించి వివరంగా గవర్నర్ కి విశదీకరించారట. అయితే ఆయన వివరిస్తున్న విషయాలేవీ గవర్నర్ కి అర్థం అవుతున్నట్లు లేవని గ్రహించి కొంతసేపటి తరువాత ఇక వివరించడం మానేశారట ఆయన. ఛాయాచిత్ర కళకు సంబంధించిన లోతైన విషయాలు బొత్తిగా తెలియని గవర్నర్, వ్యాఖ్యాతను ఏదో ఒకటి ప్రశ్నించాలి కనుక ‘అక్కడ తెల్లగా ఎందుకుంది ?’, ‘ఇక్కడ నల్లగా ఉందేం ?’ అంటూ అడగడం మొదలెట్టారట. దాంతో సంజీవదేవ్ కి విసుగు జనించి, తాను మాట్లాడుతున్నది ఒక రాష్ట్ర గవర్నరుతో అనే వెరపు ఎంత మాత్రం లేకుండా అంతే వ్యంగ్యంగా ‘ అక్కడ నల్లగాలేదు కాబట్టి తెల్లగా ఉంది’, ‘ఇక్కడ తెల్లగా లేదు కనుక నల్లగా ఉంది’ అంటూ ముక్తసరిగా సమాధానాలిచ్చారట. ఈ ఘటనను గుర్తుచేసుకుంటూ ఆయన తన ఆత్మకథలో ఇలా రాశారు, ‘ నాకు అనిపించింది, మంచి తెలివిగలవారిని గవర్నర్లుగా నియమించరేమో అని.’ ఇలా ఒక రాష్ట్ర గవర్నర్ గురించి రాస్తూ కూడా ఆయన నిర్భీతితో కూడిన సత్య నిష్ఠను పాటించడం ఆయన వ్యక్తిత్వంలోని మెచ్చదగ్గ విశేషం. చందూలాల్ మాధవలాల్ త్రివేదీ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ గవర్నర్ గా 1957 నుంచి 1962 వరకు పూర్తికాలం పనిచేసిన భీమసేన్ సచార్ (1894-1978) అంతకు పూర్వం పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ, ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ గానూ పనిచేసిన వ్యక్తి. విఖ్యాత రచయిత, జర్నలిస్టు కులదీప్ నయ్యర్ భీమసేన్ సచార్ అల్లుడే. పంజాబ్ హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజిందర్ సచార్ భీమసేన్ కుమారుడే. అలాంటి ప్రముఖ వ్యక్తి గురించి రాస్తూ కూడా ఎంతమాత్రం వెరపులేని సత్యనిష్ఠను పాటించడం సంజీవదేవ్ ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి. చిత్రకళలో వాస్తవ వాదం - ఆదర్శ వాదం 1959 జనవరి 23 వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ‘ Realism and Idealism in Art’ అన్న అంశంపై ఇచ్చిన ఉపన్యాసంలో కళలలో వాస్తవవాదానికీ, ఆదర్శవాదానికీ గల తేడాను విడమరచి చెప్పారాయన. ప్రతి కళ వాస్తవవాదంలో జన్మించి, ఆదర్శవాదంతో పరిణతి చెందుతుంది.వాస్తవవాదం బాహ్య రూపాలు ఏవిధంగా ఉంటే ఆ విధంగా ఉన్నట్టు చూపుతుంది. ఆదర్శవాదం బాహ్యరూపాలు ఏ విధంగా ఉంటే బాగుంటాయో ఆ విధంగా ఉండాలని చూపుతుంది. ఒకరి ముక్కు వంకరగా ఉంటే వాస్తవవాది ఆ వంకర ముక్కునే చిత్రించి వూరకుంటాడు. ఆదర్శవాది అలాకాక, ఆ ముక్కు ఎలావుంటే బాగుంటుందో అలా చిత్రిస్తాడు. బాహ్య రూపాలన్నీ చిత్రకారుడికి ముడిసరకుల వంటివి. కళాకారులు తమ ఆదర్శ దృష్టికి అనుగుణంగా తమకు కావలసిన రీతిలో వాటిని మలుచుకొంటారు. ప్రకృతిలో నీలాకాశం క్రింద ఆకుపచ్చని ఆకుల చెట్టుంటుంది. కాని నీలము, ఆకుపచ్చ అంత సరైన వర్ణ సమ్మేళనం కావు. ఆ కనిపించే విధంగానే వాస్తవవాదంలో చిత్రిస్తే ఆ చిత్రం అంత సొంపుగా గోచరించదు. నీలాకాశం కింద పసుపురంగు ఆకుల చెట్టు ఉంటే ఆ దృశ్యం సురమ్యంగా ఉంటుంది. కనుక ఆదర్శవాద చిత్రకారుడు నీలాకాశం నేపథ్యంలో చిత్రించేటప్పుడు చెట్టు ఆకులకు పసుపు రంగు వాడేందుకు ఏ మాత్రం సందేహించడు. ఏ కళలో ప్రకృతి రూపాంతరం చెందుతుందో అదే ఉత్తమ కళ. ఇందుకు ప్రముఖ ప్రాచ్య, పాశ్చాత్య చిత్రకారుల కళాకృతుల నుంచి ఉదాహరణలు చూపుతూ ఆ సభలో ప్రసంగించారాయన. సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. రస తత్త్వం, చిత్ర కళా రీతులు, కళా విమర్శ, సంస్కృతి, సాంస్కృతిక జీవనం, ప్రపంచ భాషల తీరుతెన్నులు , విశ్వ సంధాన భాష ‘ఎస్పరాంటో’ఆవశ్యకత, విశ్వ సంస్కృతి వగైరా ఎన్నో అంశాల మీద ఆయన పలు సందర్భాలలో విలువైన ప్రసంగాలు చేశారు. క్లుప్తంగా, సూటిగా ప్రసంగిస్తూ, తాను చెప్పదలచిన విషయాన్ని తేలికైన భాషలో శ్రోతల హృదయాలలో నాటుకునేటట్లు చెప్పడంలో ఆయన దిట్ట. పిల్లల పట్ల శ్రద్ధ హైదరాబాద్ లో పదిరోజులు గడిపి, ఆయన కుటుంబంతో సహా తుమ్మపూడికి తిరుగు ప్రయాణం అయ్యారు. బస్సు ఎక్కగానే ఆయనకి ఇంట్లోంచి వెళ్ళిపోయిన తన పదహారేళ్ళ కొడుకుకోసం వెతుకుతూ వచ్చిన పెద్దమనిషి గుర్తుకొచ్చాడు. అప్పుడు సంజీవదేవ్ ఇలా తలపోశారు. ‘ ఆయనకు తన కుమారుడు దొరికాడో లేదో. ఇంటినుంచి పారిపోయిన పిల్లలూ బయటికిపోయి సుఖపడరు, ఆ పిల్లల తల్లిదండ్రులూ సుఖపడరు. పిల్లలు చెప్పకుండా దేశం మీద పోవడంలో అంతా పిల్లల తప్పే కాదు, పెద్దల తప్పు కూడా ఉంటుంది అందులో. పిల్లలు కనపడకుండా పోయినప్పుడు, వాళ్ళ మీద కనపరచే కనికరం వాళ్ళు ఇంటి దగ్గర ఉండగానే కనపరుస్తూ ఉంటే వాళ్ళసలు ఇల్లు వదలడం అనేదే జరగదు.’ తన బాల్యంలో తాను గడిపిన నిరాదరణపూర్వక వేదనామయ జీవితం కారణంగానేనేమో ఆయనకు పిల్లలన్నా, వారి మనస్తత్త్వాలన్నా ప్రత్యేక శ్రద్ధ. ఒకసారి గొర్రెపాటి వెంకటసుబ్బయ్య గారి చిన్న కుమార్తె తన ఒకే ఒక్క కుమారుడిని అనాథగాచేసి, మరణించిందని తెలిసి గొర్రెపాటి వారికి సానుతాపం తెలియజేద్దామని సంజీవదేవ్ విజయవాడ వెళితే, ఆయన స్థితప్రజ్ఞతతో బాధను అణచుకుని, లేని నవ్వు తెచ్చిపెట్టుకుని నవ్వారట. అప్పుడు సంజీవదేవ్ ఆలోచనలు ఇలా సాగాయి. ‘ఇక ఆయన్నేం సముదాయిస్తాం ? ఆయనసలు నా ఎదుట దుఃఖాన్ని చూపితేగా నేను ఆయన్ని ఓదార్చాల్సింది ? ఆయన దుఃఖాన్నే కనపరచనప్పుడు ఇంకా నేను ఎవరిని ఓదార్చేది ? మూసివున్న తలుపులను తీయడానికి ఉంటుంది. కాని మూయని తలుపుల్ని ఇంకా తీయడానికి వీలేముంటుంది? విపత్తు తల్లిలేని బిడ్డలదే. తల్లి లేని బిడ్డడుగానే నేను చిన్నతనం నుంచీ పెరిగాను. నాకు తెలుసు ఆ ఆవేదన. అందువల్ల నేను బాధపడింది వెంకట సుబ్బయ్యగారిని గురించి కాక, తల్లి లేని వెంకట సుబ్బయ్యగారి మనుమడిని గురించి,’ అని రాసుకున్నారాయన. చిన్న పిల్లల పట్ల - ప్రత్యేకించి తల్లిలేని పిల్లలపట్ల - ఆయనకున్న ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులను ఈ ఘటనలు తెలుపుతాయి. కళ ఎందుకోసం ? సమకాలీన సమాజంలో ‘కళ కళ కోసమా ? కాసు కోసమా ? లేక ప్రజలకోసమా ?’ అనే చర్చ మనం తరచు వింటూ ఉంటాం.కళ కాసుకోసమనేవారి వాదన పక్కనబెట్టి, ముందుగా కళ ప్రజల కోసమనేవారి వాదన ఏమిటో చూద్దాం. వారి దృష్టిలో ప్రజలు తమ ఆనందం కోసం సృష్టించుకున్నవే ఈ కళా రూపాలన్నీ. రోజంతా శ్రమించే సామాన్య జనం తాము సృష్టించుకున్న ఈ కళారూపాలను ప్రదర్శిస్తూ కొందరు, చూస్తూ మిగిలినవారందరూ తమ శారీరక శ్రమలోని భారాన్ని మరచిపోయి, ఆనందం పొందేవారు. అందుకే కళలు దైవ సృష్టి కాదు ; వాటిని ప్రజలు తమ ఆనందం కోసం తామే తమ అవసరం కొద్దీ సృష్టించుకున్నారనీ ; కాబట్టి కళలు కళల కోసమూ కాదు; కాసుకోసమూ కాదు ; అవి ప్రజల కొరకేననీ వారి అభిప్రాయం. వారి దృష్టిలో ప్రయోజనంలేని కళ కళ కాదు.కళకు ప్రయోజనమే కాదు; నీతి కూడా ఉండాలని ఇంకొందరి అభిప్రాయం. జీవితంలోనూ, కళలోనూ కూడా నీతి ప్రధానమైన అంశమని వారి భావన.కళ మానవ శ్రేయం నిమిత్తం, మానవుని నైతిక వికాసం నిమిత్తం అని వారి అభిప్రాయం. కళ కళ నిమిత్తమే అనే వాదన సరికాదు. ‘నీతిలేని కళ కోతికంటే హీనం’ అంటారు వారు. ఈ విషయంలో సంజీవదేవ్ అభిప్రాయం భిన్నంగా ఉంటుంది. కళ అనేది నీతికి చెందిందీ కాదు. అవినీతికి చెందిందీ కాదు. అది నీతికీ, అవినీతికీ అతీతం. అందుకే ఆయనిలా రాసుకున్నారు, ‘ నీతిలేనివాడు కోతికంటే హీనుడు అనే సామెత నాకు అస్సలు నచ్చదు, కోతి హీనమైంది కాదు కనుక. కళలో నీతి, అవినీతి అని ప్రభేదం అవసరం లేదు. కళ ప్రధాన లక్ష్యం రసానందాన్ని ప్రసాదించడమే కాని నీతిని గురించి కానీ, అవినీతిని గురించి కానీ సందేశాలివ్వడం కాదు. కళ కేవలం ఒకదాని నిమిత్తమే కాక, కళ చాలా వాటి నిమిత్తం ఉంటుంది. కళ కళ కొరకే అనడంలో కానీ, కళ నైతిక సందేశం అందిచడం కొరకే అనడంలో కానీ, కళ ఆధ్యాత్మిక సత్యాన్ని వెలిబుచ్చే నిమిత్తం మాత్రమే అని కానీ అనడం కళలోని ఒక పార్శ్వాన్ని చూడడం మాత్రమే అవుతుంది. కనుక కళ అనేది వీటి అన్నింటి నిమిత్తం కూడా, ఇంకా ఎన్నింటి నిమిత్తమో కూడా.’ కళా తత్త్వాన్ని గురించి సంజీవదేవ్ వెలిబుచ్చిన ఈ అభిప్రాయాలు అచ్చంగా అరవిందుల అభిప్రాయాలను పోలి ఉండడం విశేషం. ప్రజలకు తిరుపతి స్వామి మీద ఆకర్షణ ఒకసారి తిరువణ్ణామలైలో ఉన్న చలం గారిని కలుసుకునే నిమిత్తం ‘బాలబంధు’ బి. వి. నరసింహారావు, సంజీవదేవ్ పాసింజరు ట్రైన్ లో బయలుదేరారు. మధ్యదారిలోని అన్నిస్టేషన్లనూ వివరంగా చూస్తూ అక్కడి విశేషాలు ప్రత్యక్షంగా గ్రహించడానికీ, ప్రయాణంలో తటస్థపడే సామాన్య జనం వేష భాషలు, సంస్కృతి వగైరాల గురించి లోతుగా తెలుసుకొనడానికీ, దూర ప్రయాణాలలో కూడా ఆయన పాసింజరు ట్రైన్లలో ప్రయాణించడానికే ఎక్కువ ఇష్టపడేవారు. దారిలో రేణిగుంట రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగినప్పుడు అక్కడ తిరుపతి పోయేవారు, తిరుపతి నుంచి తిరిగి వచ్చేవారు పెద్ద సంఖ్యలో కనుపించారు. అది చూసిన ఆయన లౌకిక భక్తిలోని మూఢత్వం పట్ల ఆందోళన చెందుతూ, ఈ విషయమై తన మనోభావాలను ఇలా అక్షరబద్ధం చేశారు. ‘ ప్రజలలో తిరుపతి స్వామి మీద ఇంత ఆకర్షణ ఎందుకో. వీరు కోరే కోరికలన్నిటినీ ఆ స్వామి తీరుస్తాడని వీరి నమ్మకమే ఈ ఆకర్షణకు కారణం. అయినా, పరిశీలించి చూస్తే ఎవరి కోరికలూ తీరుతున్నట్లు కనుపించవు. కోరికలు తీరినవారు స్వామి మహత్యంవల్ల తీరినాయని నమ్ముతుంటే తీరనివారు తాము స్వామికేదో అపచారం చేసివుంటాం కనుక తమ కోరికలు తీరలేదని తిరిగి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంటారు. ప్రతి మతంలోనూ ఇటువంటి లౌకిక భక్తి ఉంటూనే ఉంటుంది. హిందూ మతంలో కూడా ఉన్నది. కాని, దీని మూలంగా ప్రజలలో మూఢత్వం ఎక్కువై పోతుందనడంలో సందేహం లేదు.’ ‘ నేటి సమాజంలో, ఈ వైజ్ఞానిక యుగంలో, నవభావ స్రవంతి ప్రవహించే ఈ ఇరవయ్యో శతాబ్దంలో హేతువాదం వికసించడానికి బదులు తిరుపతి భక్తి వికసిస్తున్నందుకు ఆశ్చర్యంగా ఉంది. సమాజం ముందుకు నడుస్తున్నదా ? వెనుకకు నడుస్తున్నదా ? అని నిర్ణయించడానికి కూడా వీలు లేకుండా ఉన్నది. ముందుకు నడుస్తున్నా ఇటువంటి మూఢత్వం ఉండడానికి వీల్లేదు. వెనుకకు నడుస్తున్నా ఇటువంటి మూఢత్వం ఉండడానికి వీలులేదు. పూర్వం ఉపనిషత్తుల కాలంలోకి పోతే ఆనాటి మతం అనేది, నేటి మతం ఉన్నంత చౌకబారుగా, మూఢత్వంగా హ్రస్వ దృష్టితో ఉన్నంతగా లేదు. కనుక నేటి సమాజం ముందుకు పోకపోగా, వెనక్కికూడా పోతున్నట్టు లేదు. ముందుకు, వెనుకకు కూడా నడవని ప్రవాహం నిలిచిపోయిన మురుగునీటి మడుగు అవుతుంది.’ సరిగ్గా ఇలాంటి భావాలనే వ్యక్తపరుస్తూ ప్రముఖ అభ్యుదయ కవి గజ్జెల మల్లారెడ్డి తన కవితలో ‘ తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది- డ్రైనేజీ స్కీములేక డేంజరుగా మారుతోంది’ అని రాశారు. అనువాద ప్రక్రియ ‘బాలబంధు’ బి. వి. నరసింహారావు రాసిన ‘పాలబడి పాటలు’ కు పరిచయ వాక్యాలు రాయడమే కాక, ఆసక్తితో ఆ పాటలన్నింటినీ తర్జుమా చేసి ఇంగ్లిష్ కవితలుగా మార్చేశారు సంజీవదేవ్. శ్రవ్యప్రధానమైన ఈ పాటల్ని తెలుగులోంచి ఇంగ్లిష్ కవితలుగా తర్జుమా చేయడంలో చాలా కష్టం వేసిందని చెపుతూ, అందుకు ఉదాహరణగా ఒక పాటను పేర్కొన్నారాయన. బంతి పువ్వు- చేమంతి పువ్వు బీర పువ్వు - కరవీర పువ్వు జాజి పువ్వు - విరజాజి పువ్వు వంగ పువ్వు- సంపెంగ పువ్వు. ‘దీనిని ఇంగ్లిష్ లోకి మార్చాలంటే ఏ విధంగానూ కుదరదు. అందుకని ఆ పూవుల పేర్లనే ఇంగ్లిష్ అక్షరాలలో వ్రాసి సంతృప్తి చెందాను !!’ అని రాశారాయన. ఆ సందర్భంగా అనువాద ప్రక్రియ గురించి ఇంకా ఇలా రాశారాయన - “ సాహిత్య జగత్తులో అనువాదం అనేది విచిత్రమైన కార్యం. అనువాదం అనేదే లేకపోతే ప్రపంచంలో ఏ భాషలోని ఉత్తమ రచన ఆ భాషలోనే ఉండిపోయి, ఇతర భాషలవారికి అందుబాటులో ఉండేది కాదు. ప్రతి వ్యక్తీ ప్రపంచంలోని రెండువేల ఏడు వందల తొంభై రెండు భాషలను నేర్చుకోవాలంటే ఒక జీవితం కాదుగదా, ఎన్ని జీవితాలైనా చాలవు. ఈ బాధ లేకుండా చేసింది అనువాదం అనేది. ఏనాడు ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ ఈ అనువాద పద్ధతిని, ఇదొక మహోపకారం సాహితీ జీవులకు. అనువాదం అనేది చాలా కష్టసాధ్యమైన పని. ఏ భాషనుంచి అనువాదం చేస్తారో, ఆ భాషలోనూ అనువాదకర్తకు దక్షత ఉండాలి. భాషలలో దక్షత ఉన్నా కొందరు మౌలిక రచనలను మాత్రమే చేయగలరు కానీ, అనువాదం చేయజాలరు. నా వరకు నాకు అనువాదం చేయడమంటే చాలా బాధతో కూడుకొన్న పనిగా గోచరిస్తుంది. అనువాదం చేయడానికి ప్రత్యేక వ్యక్తులుంటారేమో అనిపిస్తుంది. సరే, ఎవరికి చేతగాని పని వారికి కష్టంగా తడుతుంది !!” అని రాసుకున్నారాయన నిజాయతీగా. ఇది చదివిన వెంటనే ‘ పాలబడి పాటలు’ లో అనువాదం ఏ విధంగానూ కుదరదని ఆయన ఆ పూల పేర్లను మాత్రం ఇంగ్లిష్ అక్షరాలలో రాసి (Transliterate చేసి) వదిలేసిన ఆ పద్యాన్ని అనువదిద్దామని(Translate చేద్దామని)పించింది నాకు. ఇదిగో ఆ పద్యానికి నా అనువాదం - చిత్తగించండి. Blooms of Marigold and Chrysanthemum, Blossoms of Luffa and Oleander, Florets of Needle and Star Jasmine, And of Aubergine and Gold Flowers. ( బంతి - Marigold; చేమంతి - Chrysanthemum; బీర - Luffa (Sponge Gourd); కరవీర లేక గన్నేరు - Oleander; సన్నజాజి- Needle Jasmine; విరజాజి - Star Jasmine; వంగ - Aubergine or Egg Plant or Brinjal; సంపెంగ - Gold Flower. Bloom, Blossom, Flower - ఇవన్నీ పర్యాయ పదాలే. Floret అంటే చిన్న పువ్వు. అందుకే ఆ పదాన్ని చిన్నవైనట్టి సన్నజాజి, విరజాజి, వంగ పూలకు వాడాను.పద్యంలో ఏకవచనం కంటే బహువచనమే బాగుంటుందని Flowers, Florets, Blooms, Blossoms అని వాడాను.) రచనా వ్యాసంగం - ఉపన్యాసాలు రచనా వ్యాసంగం, ఉపన్యాసాలు - ఈ రెంటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి ? ఇది సాధారణంగా అందరు రచయితలూ ఎదుర్కొనే సమస్యే. ఇతరులెవరైనా తనను ఉపన్యాసాలివ్వమని సభలకు ఆహ్వానించినప్పుడు అందరు రచయితలలాగే ఆయన కూడా ఆ యా ఉపన్యాసాలకు తయారవడానికి పట్టే సమయంలో తాను లోగడ తలపెట్టిన రచనా వ్యాసంగం ఆ మేరకు కుంటుపడుతుందని భావించి కావచ్చు, కొంచెం ఇబ్బంది పడేవారు. అయినా ఆయన రచనల కంటే సభలకే ప్రాధాన్యం ఇచ్చారు. దీనిని ఆయన సునిశితమైన హాస్యోక్తితో ఎలా వ్యక్తం చేశారో చూడండి. “ అవిరామంగా రచన చేసే అలవాటు లేదు నాకు. అప్పుడప్పుడూ చేయడమే అలవాటు. అంటే నెలలో రచన చేసే రోజులు తక్కువ, రచన చేయని రోజులు ఎక్కువ. వీటిని మార్చి, రచన చేసే రోజుల సంఖ్యనే హెచ్చిస్తే బాగుంటుందని అప్పుడప్పుడు అనిపించినా కూడా ఆ తలంపుకు కార్యరూపం ఇవ్వడంలో శ్రద్ధ చూపడం పడలేదు. నిత్యము బాగుంటాయని ఎక్కువ రచించే రచయితల రచనలకంటే అప్పుడప్పుడు రచించే రచయితల రచనలే ఎక్కువ బాగున్నా, తక్కువ బాగున్నా, నాకు నిత్యం రచించే అలవాటు ఏర్పడలేదు. అంటే రచించని రోజులన్నీ రచించే రోజులకు సోపానాలేమో ! “కొన్ని దినాలబట్టీ రచనలెక్కువై ఉపన్యాసాలు తగ్గినాయి. రచనల నిమిత్తం ఇతరులపై ఆధారపడాల్సిన పనిలేదు. రచనలను ఇష్టం వచ్చినపుడు చేసుకొని ఇష్టం లేనపుడు మానేయవచ్చు. కాని, ఉపన్యాసాల విషయం ఇందుకు భిన్నం. అవి మన ఇష్టం వచ్చినపుడు చేయడానికి వీలైనవి కావు. ఉపన్యాసాలను ఇతరులు ఏర్పరచి ఆహ్వానించాలి. ఉపన్యాసకుడే స్వయంగా ఏర్పరచుకొన వచ్చునేమో ! ఎవరు ఏర్పరచినా దానికి వినే శ్రోతలు ఉండాలి. ఒంటరిగా కూర్చొని రచన చేసుకోవచ్చుగాని, ఒంటరిగా నిల్చొని ఉపన్యాసం చేయటం కుదరదు. తన ఉపన్యాసానికి తానే శ్రోతగా ఉండదలిస్తే ఒంటరిగా కూడా ఉపన్యాసం చేయవచ్చు.” ఓదార్చటం- ఓదార్చబడటం బి. వి. నరసింహారావును చిన్నప్పటి నుంచీ పెంచి, పెద్దచేసి ఎంతో అండగా ఉంటూవచ్చిన ఆయన అక్కగారు మరణించినప్పుడు, ఆయన తల్లడిల్లిపోయి, విషాదయోగంలో పడి సంజీవదేవ్ కి శోకపూరితమైన ఒక ఉత్తరం రాశారు. ‘ ఆత్మీయుల మరణం ఎవరికైనా బాధనే కలిగిస్తుందిగాని, మరీ విపరీతమైన బాధను కలిగించేలా మనసును బలహీన పరచుకోటం సమంజసం కాద’నే భావనతో సంజీవదేవ్ ఆయనకు ఓదార్పుగా రాసిన లేఖలోని కొన్ని భాగాలు చూడండి - “ Time is the best healing balm అని నా జీవితపు అనేక చీకటి ఘడియలలోని అనుభవం ద్వారా తెలుసుకొన్నాను. దేన్ని గురించి కూడా మీరు బాధపడకండి. కాలమే దాన్ని సరిచేస్తుంది. మీరు కొంచెంసేపు కళ్ళు మూసుకొని, లేక కళ్ళు మామూలుకంటే బాగా తెరచికాని, ‘దుఃఖాన్ని జయించాలి. బాధను భేదించాలి.ఆనందాన్ని వశపరచుకోవాలి.’ అని కొన్నిసార్లు నోటితో అనండి. మీ సగం బాధ అప్పుడే అంతరిస్తుంది. మిగతా సగం తరువాత జరిగిన నష్టాన్ని మరచిపోయి, మళ్ళీ మీ మాట, పాట, ఆటలలో మునగండి. రసానందంలో ఈదులాడండి. మనమంతా ఇతరుల ఆస్తికి ఎంతవరకు వారసులమో తెలియదు కానీ, మనమంతా ఆనందానికి మాత్రం వారసులం.ఈ వారసత్వాన్ని ఎలాంటి తరుణంలో కూడా కోల్పోరాదు.” ఈ సందేశం అచ్చంగా పాపచింతను గురించి స్వామి వివేకానంద చేసిన బోధనను పోలి ఉండడం విశేషం. ‘ వేదాంతం దృష్టిలో పాపులంటూ ఎవరూ లేరు.అందుకే అది కేవలం మానవులు చేసే తప్పిదాల్ని మాత్రమే గుర్తిస్తుంది ; పాపాల్ని కాదు. మీరు పాపులనీ, బలహీనులనీ, తుచ్ఛ జీవులనీ, శక్తివిహీనులనీ, మీరు కొన్ని పనులు మాత్రమే చేయగలరనీ, కొన్ని చేయలేరనీ చెప్పడమే పెద్ద తప్పిదమని వేదాంతం భావిస్తుంది. కనుక పాపులమనే చింత వదిలి మనందరం ఆనందానికి వారసులమని గుర్తెరగండి,’ అంటారాయన, భారతీయుల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేస్తూ. ఈ సందర్భంగా సంజీవదేవ్ ఓదార్పు విషయమై తన భావాలను తన ఆత్మకథలో ఇలా రాసుకున్నారు, “ విషాదంలో మునిగి ఉండే వ్యక్తులకు ఈ విధమైన సాంత్వనలు పనిచేయని మాట నిజమేగాని కొందరికి కొన్ని సమయాలలో అవి తోడ్పడతాయి. ఓదార్చటం సులభమే కాని, ఓదార్చబడటం సులభం కాదు. ఓదార్చబడే వ్యక్తికి దెబ్బ తగిలి ఉంటుంది. ఓదార్చే వ్యక్తికి దెబ్బ తగిలి ఉండదు. అసలు మరొక తమాషా ఏమంటే, కొందరి శోకం ఓదార్చిన కొద్దీ ఎక్కువౌతుంది. ఏమైనప్పటికీ, బాధలోవున్న చాలా మందికి సాధారణంగా ఓదార్పు కొంత ఉపశాంతిని ప్రసాదిస్తుంది.ఆ ఉపశాంతి తాత్కాలికమే కావచ్చు. తాత్కాలికాల సంఖ్య పెరిగితే అది చిరకాలికమే అవుతుంది.” కొందరు తమ దుఃఖాన్ని మరచిపోవటానికి చెడ్డ పరిణామాలకు దారితీసే అనేక దురభ్యాసాలకు బలి అవుతూ ఉంటారని పేర్కొంటూ, ఆ అలవాట్లు తాత్కాలికంగా దుఃఖాన్ని తొలగించినా, మనిషిపై వాటి స్వంత ప్రభావాలను వేయటం ప్రారంభించి జీవితాలనే ధ్వంసం చేస్తాయనీ, కనుక ఇలాంటి సాధనాలతో దుఃఖాన్ని తొలగించుకునే ప్రయత్నం చేసేకంటే, దుఃఖాన్ని తొలగించుకోకుండా దుఃఖాన్ని అనుభవించడమే ఎక్కువ సుఖం, ఎక్కువ శ్రేయం అంటారాయన. సంధాన భాష ఎస్పరాంటో ప్రపంచంలో మొత్తం రెండువేల ఏడువందల తొంభై రెండు భాషలున్నాయి. ఒకరి భాష అర్థం చేసుకొనడం వేరొకరికి కష్టం. ప్రపంచంలో ఏ ప్రాంత ప్రజలైనా తేలిగ్గా అర్థం చేసుకోగల ఒక భాష ఉన్నట్లయితే ఆ భాష ప్రపంచ ప్రజలందరికీ ఒక అనుసంధాన భాష కాగలదు. ప్రపంచంలోని ఏ దేశపు మాతృభాషకు కూడా ఇలా అంతర్జాతీయ భాష అయే అర్హత లేదు.అంతర్జాతీయ భాష కాదగినది లోకంలో ఎవరికీ మాతృభాష కారాదు. ఒకరి మాతృభాష కనుక ప్రపంచ భాష అయితే ఆ మాతృభాషను మాట్లాడేవారికుండే సదుపాయాలూ, ఉచ్చస్థానం ఇతర భాషలు మాట్లాడేవారికి ఉండవు. ప్రపంచ భాష అన్నప్పుడు ఆ భాషను ప్రతివారూ నేర్చుకొంటేనే కానీ రాదన్నట్టు ఉండాలి. సంజీవదేవ్ అభిప్రాయంలో అలా అంతర్జాతీయ సంధానభాషగా ఉండదగిన అర్హత ఒక్క ‘ఎస్పరాంటో’ అనే కృతక అనుసంధాన భాష (Constructed Auxiliary Language)కే ఉంది. ఈ భాషను 1870- 1880 మధ్య కాలంలో డా. లుడ్విగ్ లాజరస్ జామెన్ హోవ్ (Dr. Ludwig Lazarus Zamenhof) అనే రష్యన్ లిథుయేనియన్ కనిపెట్టాడు. సంజీవదేవ్ ఎంతో ఆసక్తితో ఆ భాషను నేర్చుకున్నారు. ఎస్పరాంటో చాలా సహేతుకమైన భాష అంటారాయన. ఒకే వ్యాకరణ నియమం అపవాదాలు లేకుండా సర్వత్రా ఉపయోగిస్తుందట. దీన్ని ఆయన ఇంకా ఇలా వివరిస్తారు. ఇంగ్లిష్ భాషలో eat అనే క్రియకు భూతకాలం ate అయితే, work అనే క్రియకు భూతకాలం worked అవుతుంది. flower కి ‘s’ చేరిస్తే ‘flowers’ అనే బహువచనం అవుతుంది. కాని phenomenon అనే ఏకవచనం బహువచనంలో phenomena అవుతుంది. ఆంగ్ల భాషలో ఈ విధంగా ఒకే సూత్రం అన్నిటికీ వర్తించదు. కాని ఎస్పరాంటోలో ఆ విధంగా కాక అన్నిటికీ ఒకే సూత్రం వర్తిస్తుంది. అందువల్ల ఎస్పరాంటోను అభ్యసించడం సులభం అంటారాయన. మొత్తం పదహారు వ్యాకరణ సూత్రాలతో ఈ అంతర్జాతీయ భాషను నేర్చుకోవచ్చునని చెపుతూ కొన్ని వ్యాకరణ సూత్రాలు కూడా ఆయన ఆసక్తిగా వివరించారు. ఇక చివరిగా ఆయన భావనలతో నేను విభేదించే కొన్ని విషయాలను కూడా ప్రస్తావించి నా ఉపన్యాసం ముగిస్తాను. మార్మికవాదం లేక సాక్షాత్కార దర్శనం లేక రహస్యవాదం ( Mysticism) పట్ల, పరా మనోవిజ్ఞానం ( Parapsychology) పట్ల సంజీవదేవ్ కున్న మొగ్గు ఆయన రచనలలో అక్కడక్కడా స్పష్టంగా కనుపిస్తూనే ఉంటుంది. ఆయన ఏర్పరచున్న ఈ తరహా విశ్వాసాలు మాత్రం అశాస్త్రీయాలు కనుక అవి నాకు అంగీకారయోగ్యాలు కావు.సంజీవదేవ్ రాసిన ‘గుడ్డిపిల్ల’ అనే కవిత చదివిన భగవాన్ దాస్ ఆయన్ని ‘ పుట్టుకతో గ్రుడ్డివారైనవారు స్వప్నాలలోనైనా రంగులను చూస్తారా ?’ అని ప్రశ్నించారు. అందుకు అప్పుడు మాత్రం ఆయన చూడరనే సమాధానం చెప్పారు. ఒకసారైనా ఇంద్రియాలతో అనుభవించని విషయం స్వప్నాలలో మాత్రం ఏ విధంగా ప్రత్యక్షమౌతుందని ప్రశ్న వేసుకుని, బాహ్యజగత్తులోని రంగులను చూచిన తరువాత గ్రుడ్డితనం సంభవిస్తే అప్పుడు స్వప్నాలలో రంగులను చూడవచ్చునని చెపుతూనే ఆయన ఇంకా ఇలా అన్నారు, - ‘ అయితే దీన్ని పరామనోవిజ్ఞాన దృష్ట్యా చూస్తే కొంతవరకు సంభవమేమో అనిపిస్తుంది. పరామనోవిజ్ఞాన దృష్ట్యా అయితే ఇంద్రియాల ద్వారా తెలుసుకొనకుండానే తెలుసుకోవచ్చు,’ అన్నారాయన. పరా మనోవిజ్ఞానం చెప్పేదాని ప్రకారం దివ్యదృష్టి (Clairvoyance) సాధ్యమే. పరా మనోవిజ్ఞానం జ్ఞానేంద్రియాల యొక్క ప్రమేయం లేకుండా లోతైన అంతర్దృష్టితో కంటికి కనుపించని సూక్ష్మమైనట్టి, కట్టెదుట లేకుండా ఎక్కడో దూరంగా ఉన్నట్టి, వ్యక్తులను, వస్తువులను స్పష్టంగా చూడడం సాధ్యమేనని ప్రతిపాదిస్తుంది. అది ఇంద్రియాతీత జ్ఞానం (Extra-sensory Perception) సాధ్యమేనంటుంది. జ్ఞానేంద్రియాల ప్రమేయం లేకుండా మనసులు సంభాషించుకొనడం, ఆలోచనల మార్పిడి ( Telepathy) కూడా సాధ్యమేనంటుంది. అయితే ఇవన్నీ కేవల విశ్వాసాలు, ప్రతిపాదనలే కానీ శాస్త్రీయంగా రుజువుపరచబడిన సిద్ధాంతాలు మాత్రం కావు. ఇలా నమ్ముతున్న వారు వాటిని శాస్త్రీయ సత్యాలుగా ఋజువు పరచలేకపోయారు. అందుకే శాస్త్రీయ దృష్టి కలవారు ఎవరైనా ఈ తరహా విశ్వాసాలను అశాస్త్రీయాలుగానే భావిస్తారు. జ్ఞానేంద్రియాల ద్వారా సమకూరిన జ్ఞానం మనస్సులో పరీక్షించబడి, వర్గీకరించబడి, నిక్షిప్తమవుతుందనేది ధృవపడిన శాస్త్రీయ దృష్టి. మనస్సులో చోటుచేసుకునే జ్ఞప్తి (Memory), గుర్తింపు (Recognition) వంటి ప్రక్రియలు జ్ఞాన సముపార్జనకు తోడ్పడినప్పటికీ జ్ఞానేంద్రియాల నుంచి అప్పుడుగానీ, లోగడగానీ మనస్సుకు అందే సంకేతాలే జ్ఞానసముపార్జనకు మూలం.కాబట్టి ఇంద్రియాతీత జ్ఞానం అసాధ్యం. అదే విధంగా ఆయన కలల గురించి రాస్తూ - ‘చూచినవన్నీ కలలోకి రావు, చూడనివన్నీ రాకుండానూ ఉండవు. చూడటం, చూడకపోవటం అనేవి కలలకు సంబంధించవు. కలలకు వేరే కారణాలు బయటివి, లోపలివి అనేకం ఉంటాయి’ అంటారాయన.కలలకు రూపకర్త మనస్సనేది వాస్తవం. అయితే కలలను తాను అనుకున్న రీతిలో సృష్టించేందుకు మనస్సు వాడే ముడిసరకు మాత్రం మనం అంతకు మునుపు ఎప్పుడో చూసిన దృశ్యాలే. మనం ఆరోజు చూసిన దృశ్యాలే ఆ రాత్రికి తప్పనిసరిగా కలలోకి రావాలని ఎక్కడాలేదు కాని కలలో ఏమి వచ్చినా అవి ఇంద్రియాల ద్వారా గ్రహించి మన మనస్సులో నిక్షిప్తమైన జ్ఞాన సంపదకు మన మనస్సు తన ఊహా శక్తిని జోడించి తయారు చేసిన దృశ్యాలే అయివుంటాయి. అలా ఇంద్రియాల ద్వారా సమకూరిన జ్ఞానమే కలల సృష్టికి ముడిసరకు అనేది శాస్త్రీయంగా ధృవపడింది. మనం చూడటం, చూడకపోవటం అనేవాటికీ, కలలకూ ఎలాంటి సంబంధం లేదనడం శాస్త్రీయ దృష్టి కాదు. . ( సంజీవదేవ్ శత జయంతి సందర్భంగా సెప్టెంబర్ 28 న కేంద్ర సాహిత్య అకాడెమి వారు తెనాలిలోనిర్వహించిన సదస్సులో నా ప్రసంగం పూర్తి పాఠం)

No comments:

Post a Comment