మహాభారతం-హరిమోహన్ ఝా -జె. లక్ష్మీరెడ్డి - తెలుగు

మైథిలీ మూలం ‘ఖట్టర్ కాకా’ హరిమోహన్ ఝా మహాభారతం నేను ప్రాతఃశ్లోకాలు చదువుతూ ఉన్నాను - ‘పుణ్య శ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో యుధిష్ఠిరః’ (నల మహారాజు పుణ్యచరితుడు, యుధిష్ఠిరుడు పుణ్య చరితుడు) ఇంతలో వికటకవి చిన్నాన్న వచ్చి అన్నాడు - అరే, ప్రొద్దున్నే ఈ వ్యర్థుల పేర్లు జపిస్తున్నావేమిటి? నేను - చిన్నాన్నా, ధర్మరాజు లాంటి సత్ఫురుషుని గురించి మీరిట్లా మాట్లాడతారేమి? చిన్నాన్న - ధర్మరాజు కాదు, మూర్ఖరాజు, జూదంలో రాజ్యంతో పాటు భార్యను కూడా పోగొట్టుకొని అడవుల్లో చెట్ల వెంబడీ, గుట్టల వెంబడీ తిరిగే వాణ్ణి మరేమనాలి? అతనికి దీటైనవాడు ఒకడే ఉన్నాడు - నలమహారాజు, ఆయన కూడా జూదంలో సర్వస్వం కోల్పోయి అడవుల్లో పడి తిరిగాడు. నిద్రపోతున్న భార్యను అక్కడే అర్ధనగ్నంగా వదలిపెట్టి చెప్పాపెట్టకుండా పారిపోయాడు. నలుడు, యుధిష్ఠిరుడు ఒకే కాడికి కట్టదగిన జోడెద్దులు. ఈ శ్లోకం తయారుచేసింది ఎవరో గాని, ఇద్దరినీ చాలా బాగా జత కూర్చాడు! నేను - చిన్నాన్నా, ధర్మరాజు, మహాభారతంలో ఆదర్శపాత్ర, ఆయననుండి నేర్చుకోవలసింది చాలా ఉంది. చిన్నాన్న - అవును. మొట్టమొదట నేర్చుకోవలసింది ఏమిటంటే వంశంలో అయోగ్యుడు ఒక్కడు పుట్టినా వంశం పూర్తిగా నాశనమవుతుందని. ధర్మరాజు గనక జూదరి కాకపోయి ఉంటే అంత వినాశకరమైన మహాభారత యుద్ధం ఎందుకు జరిగేది? నేను - కౌరవులు చేసిన అన్యాయం వల్ల యుద్ధం జరిగిందని అందరూ అంటూంటే మీరు మాత్రం నింద అంతా ధర్మరాజు తలపైన మోపుతున్నారు! చిన్నాన్న - నీవే ఆలోచించి చూడు. ధర్మరాజు జూదం ఆడటానికి సరదా పడకుండా ఉండి ఉంటే ఇదంతా ఎందుకు జరిగేది? ఆవేశంలో పాచికలు విసురుతూ పోయాడు. చివరకు భార్యను కూడా ఒడ్డినాడు. అరే, మూర్ఖుణ్ణి అందరూ రెచ్చగొడుతూనే ఉంటారు. ఆయన స్వంత బుద్ధి ఏ గడ్డి తినడానికి వెళ్ళింది? ఆయన ఓడిపోతే అందులో ఇతరుల తప్పేముంది? ఓడిపోయిన తర్వాత ఊరక పక్కన కూర్చోవలసింది. అప్పుడు కూడా సింహాసనం కావాలనుకోవడం, ఇదెక్కడి న్యాయం? నేను - చిన్నాన్నా, ద్రౌపదికి అంత అన్యాయం జరిగింది. అది మీరు ఆలోచించారా? చిన్నాన్న - నీవు ద్రౌపది తప్పు గురించి ఎందుకు ఆలోచించవు? దుర్యోధనుడు మహలు చూడడానికి వచ్చాడు. కొత్త చలువరాతిని చూసి ఆయనకు నీళ్ళని భ్రమ కలిగింది. అది చూసి కిల కిల నవ్వుతూ ద్రౌపది - ‘గుడ్డివాని కొడుకు గుడ్డివాడే అవుతాడు’ అని అనవచ్చా? నీవే చెప్పు? ఇది ఎంత అమర్యాదకరమైన మాటో! మర్యాద తెలిసిన కులస్త్రీ ఎవరైనా మామ-మరుదులను ఇలాంటి మాట అనగలదా? రూపగర్విత అయిన ద్రౌపదికి చిన్న - పెద్ద అనే ఆలోచన లేకపోయింది. పాండవులైదు మందినీ ఒకే విధంగా శాసించింది. ఇంకా చెప్పాలంటే ధర్మరాజుపైన మరింత అధికారం చెలాయించేది. కానీ అవమానం సహించి ఊరక ఉండిపోడానికి పోడానికి కౌరవులు అలాంటి దద్దమ్మలు కారు. వాళ్ళు తమ అసలు తండ్రికి పుట్టిన పిల్లలు. తృప్తిగా పగ తీర్చుకున్నారు. నేను - కానీ ధర్మరాజైన యుధిష్ఠిరుడు సాక్షాత్తు ధర్మపుత్రుడు కదా! చిన్నాన్న నా మాట మధ్యలోనే ఇలా అన్నాడు - ధర్మపుత్రుడు కాదు, అధర్మపుత్రుడను. మాటమాటికి ‘ధర్మరాజు’, ‘ధర్మరాజు’ అని ఎందుకు జపిస్తావు? ఏ యుధిష్ఠిరుడైతే తమ్ముడు అర్జునుడు స్వయంవరంలో పెళ్ళాడిన ద్రౌపదిని పొందడానికి సందేహించలేదో, ఆ యుధిష్ఠిరుణ్ణి నీవు ధర్మరాజు అని అంటున్నావు! అలాంటివాణ్ణి అధర్మరాజు అనాలి! నేను - కాని, అది వారి తల్లి కుంతి ఆజ్ఞ కదా, ‘ఐదుగురూ సమానంగా పంచుకొండి’అని. చిన్నాన్న ఆవేశంతో అన్నాడు - అరే, పాంచాలి ఏమైనా పంచామృత ప్రసాదమా, ఈ విధంగా పంచిపెట్టడానికి? పాంచాలి ఐదు అంగాల పంపకం జరగలేదు, దీనికి మనం సంతోషించాలి. లేకపోతే పాపం ఆమె పరిస్థితి మరింత దారుణమైపోయేది. అయినా ఆమె తక్కువ దుర్దశ పాలైందా? ఐదుగురు పురుషుల మధ్య ఒక స్త్రీ! అందరికీ ఆమె పైన హక్కు! ఆమె ఒక స్త్రీ గాక ఉమ్మడి హుక్కా అయినట్లు. వంతుల వారీగా గుడగుడమని పీల్చడానికి! మర్యాదస్తుల పద్ధతి ఇదేనా? నిజం చెప్పాలంటే పాండవులు పతితులు. కులాన్ని ముంచేశారు! అందుకే గదా, ఒకసారి కర్ణుడు నిండు సభలో పాంచాలి ధర్మపత్ని కాదు, ఐదుగురి ఉంపుడు కత్తె, అని అన్నాడు - ‘ఏకో భర్తా స్త్రియాః దేవైర్విహితః కురునందన ఇయం త్వనేకవశగా బంధకీతి వినిశ్చితా’ (మహాభారతం, ఆది పర్వం) (కురునందనా! స్త్రీకి ఒకే భర్త ఉండాలని దేవతలు నిర్దేశించారు. కాని, ఈమె అనేకుల వశవర్తిని. కాబట్టి ఖచ్చితంగా ఉంపుడు కత్తే!) నేను - చిన్నాన్నా, కౌరవులు అంత అన్యాయం చేశారు. దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది చీర లాగి వివస్త్రను చేయడానికి కూడా ప్రయత్నించాడు. ఇక ఇంతకు మించిన అవమానం ఏముంటుంది? చిన్నాన్న - బాగా ఆలోచించి చూస్తే ద్రౌపదిని అవమానం చేసింది స్వయంగా యుధిష్ఠిరుడే! అతడు భార్య దేహాన్ని బహిరంగంగా వర్ణిస్తూ ఆమెను జూదంలో ఒడ్డాడు - ‘వైవ హ్రస్వా న మహతీ న కృశా నాతిరోహిణీ నీల కుంచిత కేశీ సా తయా దీవ్యామ్యహం త్వయా’ (సభాపర్వం) (నా భార్య పొట్టిగానూ లేదు. పొడవుగానూ లేదు, లావుగాను లేదు. (అంటే మధ్యమాంగి) ఆమెకు ఉంగరాల నల్లని జుట్టు వుంది. నేను ఆమెను పణంగా ఒడ్డుతున్నాను) భార్యను తార్చేవాడే ఈ విధంగా వర్ణిస్తాడు. ఇక ఓడిపోయిన తర్వాత దుశ్శాసనునికి పగ సాధించడానికి అవకాశం చిక్కింది. ఆ సుకేశి కేశాలు పట్టుకొని లాక్కొచ్చాడు - ‘జగ్రాహ కేశేషు నరేంద్రపత్నీమ్ ఆనీయ కృష్ణామతి దీర్ఘ కేశామ్’ (సభాపర్వం) (అతి దీర్ఘ కేశాలు గల పాండవ పత్ని ద్రౌపది వెంట్రుకలు పట్టుకొని లాక్కొచ్చి…) అప్పుడు ద్రౌపది యుధిష్ఠిరుణ్ణి ఎలా నిందించిందో తెలుసా? ‘మూఢో రాజా ద్యూతమదేన మత్తః కోహిదీవ్యేద్ భార్యయా రాజపుత్రః’ (సభాపర్వం) (జూదం మత్తులో మైమరచిన మూర్ఖుడైన రాజు తప్ప భార్యను పణంగా ఒడ్డేవాడు ఎవడుంటాడు?) దుశ్శాసనుడు పట్టుకొని సభలోకి లాక్కొని పోగా కొంచెం వంగిన శరీరంతో ద్రౌపది మెల్లగా అంది - బుద్ధిహీనుడా! నేనిప్పుడు రజస్వలను, ఏకవస్త్రను, అనార్యుడా! నన్ను సభలోకి ఎలా తీసుకుపోతావు? ‘సా కృష్యమాణా నమితాంగయష్ఠిః శనైరుాచాథ రజస్వలాస్మి ఏకం చ వాసో మమ మందబుద్ధే సభాం నేతుం నార్హసి మామనార్య’ (సభాపర్వం) దీనికి దుశ్శాసనుడిలా అన్నాడు - ‘రజస్వలా వా భవ యాజ్ఞసేని ఏకాంబరా వాzప్యథవా వివస్త్రా ద్యూతే జితా చాసి కృతాసి దాసీ దాసిషు వాసశ్చ యథోపజోషమ్’ (నువ్వు రజస్వలవో, ఏకవస్త్రవో, వివస్త్రవో ఏమైనా అవు. యాజ్ఞసేనీ! మేము నిన్ను జూదంలో గెల్చుకున్నాం. ఇప్పుడు నీవు మా దాసివి. మా దాసీ జనంలోనే నీ స్థానం. ఎలా కావాలంటే అలా చేస్తాం). తర్వాత పెనుగులాటలో - ‘ప్రకీర్ణకేశీ పతితార్థవస్త్రా దుఃశాసనేన వ్యవధూయమానా.’ (ద్రౌపది కేశాలు చెదరి పోయాయి. సగం చీర జారి కింద పడిపోయింది.) పాపం ఆమె చేతిలో ఎదలు కప్పుకొని బ్రతిమాలనారంభించింది - ‘మా మా వివస్త్రాం కురు మాం వికార్షీః’ (నన్ను వివస్త్రను చేయవద్దు, లాగవద్దు) ‘తథా బృవంతీ కరుణం సుమధ్యమా భర్త్రూన్ కటాక్షైః కుపితా హ్యపశ్యత్’ (ఈ విధంగా దీనంగా అంటూ సన్నని నడుము గల ఆ సుందరి కోపంతో తన భర్తల వైపు చూసింది) అయినా - ‘తతో దుశ్శాసనో రాజన్ ద్రౌపద్యాః వసనం బలాత్ సభామధ్యే సమాక్షిప్య వ్యపాక్రష్టుం ప్రచక్రమే’ (దుశ్శాసనుడు సభ మధ్యలోకి ఆమెను తోసి బలవంతంగా ఆమె చీర లాగి వివస్త్రను చేయసాగాడు) ఇటు ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతూంటే అటు పాండవులు సభలో కిమ్మనకుండా కూర్చున్నారు! భార్య బలాత్కారం జరుగుతూ ఉంటే కూడా వాళ్ళు స్థితప్రజ్ఞుల్లాగా నిర్వికారభావంతో చూస్తూ ఉండిపోయారు! వాళ్ళలో పౌరుషమంటూ లేకపోయింది! నేను - చిన్నాన్నా, అది వాళ్ళకు సమయం కాదు. చిన్నాన్న గదామాయిస్తూ అన్నాడు - అరే, అంతకు మించిన సమయం ఏముంటుంది? ఏ కొద్ది పౌరుషం ఉండినా అక్కడే ప్రాణాలకు తెగించేవారు. దుశ్శాసనునిపై విరుచుక పడేవారు. చచ్చేవారు. నాశనమైపోయేవారు. అర్జునుని గాండీవం, భీముని భీకరమైన గద ఇంకే రోజు పనికొస్తాయి. కొద్దిసేపు ఉద్రిక్త స్థితిలో ఉండిన తర్వాత చిన్నాన్నే ఇలా అన్నాడు - అందుకే ద్రౌపది ఒకసారి తిరస్కార భావంతో ఇలా అంది - ‘నైవ మే పతయః సంతిః’ (నాకు భర్తలే లేరు) ఇలా అని ఆమె చేతితో ముఖం కప్పుకొని రోదించింది. ‘ఇత్యుక్త్వా ప్రారుదత్ కృష్ణా ముఖం ప్రాచ్ఛాద్య పాణినా’ కరుణ కలిగించే ఆక్రందనలో కన్నీటి వర్షం ఎంతగా కురిసిందంటే - ‘స్తనావపతితౌ పీనౌ సుజాతౌ శుభలక్షణౌ అభ్యవర్షత పాంచాలీ దుఃఖజైరశ్రుబిందుభిః’ (పొంకంగాను, శుభలక్షణ యుక్తంగాను ఉన్న పాంచాలి పీన స్తనాలు కళ్ళనుండి జాలువారిన దుఃఖాశ్రువులతో పూర్తిగా తడిసిపోయాయి) అయినా భర్తల హృదయాల్లో ఆవేశం ఉబికి రాలేదు. వాళ్లు నపుంసకుల్లాగా ఆమెను చూస్తూ ఉండిపోయారు. అందుకే అర్జునుణ్ణి అవమానిస్తూ ఊర్వశి ఒకసారి ఇలా అంది, ‘నీవు పురుషునివి కాదు, నపుంసకునివి. అభిమానం వదలి స్త్రీలలోకి వెళ్ళి నాట్యంచేయి - ‘తస్మాత్ త్వం నర్తనః పార్థ స్త్రీమధ్యే మానవర్జితః అపుమానితి విఖ్యాతః షండవత్ విచరిష్యసి’ (వనపర్వం) నేను - చిన్నాన్నా, పాండవులు వీరత్వానికి ప్రసిద్ధులు కదా, ముఖ్యంగా అర్జునుడు. వక్కలు కత్తిరిస్తూ చిన్నాన్న అన్నాడు - అరే, భార్య విరాటరాజు మహలులో ఊడిగం చేయడం కళ్లారా చూసి కూడా దిగులు చెందని పాండవులను వీరులని నేనెలా అనుకోవాలి? అర్జునుడిలో పౌరుషం ఉండి ఉంటే గడ్డం-మీసాలు తీసేసి, లంగా-చోళీలో బృహన్నల వేషంలో తా-తా-థై-థై అని రాజకుమారికి నాట్యం నేర్పుతూ ఉండేవాడా? ఇక భీముడు భోజనభట్టే, భోజనభట్టు! పొట్ట నిండితే చాలు! పెద్దవాళ్ళ పరిస్థితే ఇలా ఉంటే ఇక నకుల - సహదేవుల గురించి చెప్పేదేముంది? నేను - చిన్నాన్నా, అప్పుడు వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నారు. చిన్నాన్న - నిజం చెప్పాలంటే వాళ్ళు ఎవరికీ ముఖం చూపడానికి తగిన వాళ్ళు కాదు కూడా. ఏ కృష్ణుడు వాళ్ళ కోసం అంత చేశాడో, ద్రౌపది మాన సంరక్షణ చేశాడో, ఆ కృష్ణుని చెల్లెలు సుభద్రను అర్జునుడు లేవనెత్తుకు పోయాడు. మేనమామ కూతురు అని కూడా ఆలోచించలేదు! ఇక భీముడు తన పిన్నమ్మ కూతురు (శిశుపాలుని చెల్లెలు)ను లేవనెత్తుకుపోయాడు. వాళ్ళు ధర్మం, నీతి, మర్యాద, అన్నింటినీ భ్రష్టు పట్టించారు. నేను క్షోభ పడుతూ ఉండడం చూసి చిన్నాన్న మళ్ళీ ఇలా అన్నాడు - ఆలోచించి చూస్తే పాండవుల మూలంలోనే భ్రష్టత్వం ఉంది. ‘పాండవాః జారజాతాః’ (పాండవులు జారజులు, రంకు మగడికి పుట్టినవారు) పాండవుల తండ్రి పాండురాజు స్వయంగా తన భార్యల (కుంతి, మాద్రిల) ద్వారా సంతానోత్పత్తి చేయడంలో అసమర్థుడు. అందువల్ల ఐదుగురు దేవతల ఆవాహన చేసి పాండవులు జన్మించేట్లు చేయడం జరిగింది. అరే, దీనికంటే పాండురాజు నిస్సంతుగా మరణించినా బాగుండేది. ఎవరికి వందమంది అన్న కుమారులున్నారో, అతడికి వంశం ఇంకా వృద్ధిచేసుకోవాలని అంత ఆరాటం ఎందుకుండాలి? అది కూడా ఇతరుల భరోసాతో! పాండురాజు కూడా ఒకవేళ భీష్ముని లాగా సంతృప్తిపడి ఉంటే, సింహాసనం కోసం పోరాటం జరిగే అవకాశమే ఉండేది కాదు. ధృతరాష్ట్రుని పుత్రులు రాష్ట్రాన్ని పాలిస్తూ ఉండేవారు. కానీ పాండురాజు కళ్లపైన పచ్చకామెర్ల పసిమి వ్యాపించి ఉంది. ఆయన జారజ సంతానం వంశాన్నే ముంచేసింది! చిన్నాన్న పాండవుల పని పడుతున్నాడని గ్రహించాను. ఆయనతో నేనేమి వాదించగలను.. మరో స్తోత్రం చదవడం మొదలుపెట్టాను. ‘అహల్యా ద్రౌపదీ తారా కుంతీ మండోదరీ తథా పంచకన్యాః స్మరేన్నిత్యం మహాపాతకనాశనమ్’ (అహల్య, ద్రౌపదీ తార, కుంతి, మండోదరి ఈ పంచకన్యలను నిత్యం స్మరించినవారి పాపాలన్నీ నశించిపోతాయి.) చిన్నాన్న మళ్ళీ అడ్డుపడ్డాడు - వీళ్ళు ఐదుగురూ పెళ్ళి అయిన వాళ్లే. మరి పంచ కన్యలని ఎందుకంటున్నావు? వీళ్ళను ప్రాతఃస్మరణీయులని ఎందుకు చెప్తున్నావు? నేను - వాళ్ళు పతివ్రతలు. చిన్నాన్న - వీళ్ళలో ఎవరి పతివ్రత? అహల్య తను చేసిన పనికి రాయి అయిపోయింది. తార, మండోదరి ఇద్దరూ తమ మరుదుల బాహుపాశాల్లో ఇమిడిపోయారు. ఇక కుంతి, ద్రౌపది, వీరి సంగతి చెప్పవలసిన పనేలేదు. ‘పంచభిః కామితా కుంతీ పంచభిః ద్రౌపదీ తథా సతీతి కథ్యతే లోకే యశో భాగ్యేన లభ్యతే’ (సుభాషితం) (కుంతి ఐదుగురితో కామించబడింది. ద్రౌపది కూడా అంతే. అయినా ఇద్దరూ లోకంలో పతివ్రతలుగా చెప్పబడుతున్నారు! కీర్తి భాగ్యవంతులకే లభిస్తుంది!) అత్త ఐదుగురి మక్కువ తీర్చింది. ఇక కోడలు మటుకేం తక్కువతింది? ఆమె కూడా ఐదుగురి వలపు తీర్చింది. అరే, ద్రౌపది భర్తలను పేకముక్కల్లా మార్చేది. తాను ఆటీన్ రాణిలాగా ఉంటూ భర్తలను వశం చేసుకొని బ్రతికింది. భర్త నెత్తి పైకెక్కి వెళ్ళే భార్య ఆమె. ఒకసారి అడవిలో నడుస్తూ - నడుస్తూ కింద పడిపోయింది. ఆమెను చూసి యుధిష్ఠిరుడు ఇలా విలపించాడు - ‘కిమిదం ద్యూతకామేన మయా కృతమబుద్ధినా ఆదాయ కృష్ణాం చరతా వనే మృగగణాయుతే శేతే నిపతితా భూమౌ! పాపస్య మమ కర్మభిః’ (వనపర్వం) (ఛీ! నేనెంత మూర్ఖుణ్ణి! జూదం వ్యసనంలో పడి ఇలాంటి సుకుమారి రాకుమార్తెను వెంటబెట్టుకుని అడవి మృగాల మధ్య తిరుగుతున్నాను! నా చెడు ఆలోచనల పాప ఫలితంగానే పాపం, ఈమె నేలపైన పడిపోయింది.) భీముడు, నకులుడు మొదలైనవారు ఆమెను ఎత్తుకొని నడవడానికి ఉపక్రమించారు. ఒకే పురుషునికి భార్యగా ఉండి ఉంటే ఆమెకు ఇలాంటి దర్జా దక్కేదా? ఆ పంచపత్ని ఒక్కొక్క భర్తతో ఒక్కొక్క పుత్రుణ్ణి పొందింది. నేను - మహాభారత కాలంలో స్త్రీలకు ఇంత ఎక్కువ స్వేచ్ఛ ఉండేదా? చిన్నాన్న - అందులో అనుమానమేముంది? చూడు - ‘సుషవే పితృగేహస్థా పశ్చాత్ పాండు పరిగ్రహః జనితశ్చ సుతః పూర్వం పాండునా సా వివాహితాః (దేవీ భాగవతం) (కుంతి తండ్రి ఇంట్లో ఉన్న రోజుల్లోనే ఓ పుత్రుణ్ణి కనింది. తర్వాత పాండురాజు ఆమెను వివాహమాడాడు. ముందు కొడుకు పుట్టాడు. తర్వాత వివాహం అయింది.) ఆమె కోడలు పాంచాలి స్వయంవరంలో వరించింది ఒకరినే అయినా పంచపత్ని అయి జీవించింది. కుంతి మనుమడు అభిమన్యుని భార్య ఉత్తర పెళ్ళయిన ఏడు నెలలకే పుత్రుణ్ణి (పరీక్షిత్తుణ్ణి) కనింది. అరే, గొప్ప ఇండ్ల కథలు కూడా గొప్పగానే ఉంటాయి. ఆ రోజుల్లో బుద్ధిపూర్వకంగా తమ అపహరణ చేయించుకొనే ప్రౌఢ రాకుమార్తెలు ఒకరిని మించి ఒకరు ఉండేవారు. అంబ, అంబిక, అంబాలిక ముగ్గురు పరిపక్వత పొందిన కన్యలు. పూర్ణ యౌవన సుభద్రను రైవతక పర్వతం పైన జాతర నుండి లేవనెత్తుకు పోవడం జరిగింది. శకుంతల, దమయంతి సంగతి నీకు తెలుసు. శర్మిష్ఠ, దేవయాని పరాచికాలాడడంలో ఆధునిక యుగాన్ని కూడా హీనపరిచి వెళ్ళారు. బాణాసురుని కుమార్తె ఉష ఎంత గడుసుదంటే నిద్రపోతున్న అనిరుద్దుణ్ణి బలవంతంగా తన శయనాగారం లోకి తెప్పించుకొని -- ‘సంభోగం కారయామాస బుబుధే న దివానిశమ్!’ (బ్రహ్మవైవర్త పురాణం) (తన సంభోగేచ్ఛ తీర్చించుకుంది, రాత్రి-పగలు అనే ధ్యాస లేకుండా.) అరే, ఎంతవరకని చెప్పమంటావు? వీరి ఉపాఖ్యానాలతోనే కదా, మహాభారతం నిండి ఉంది! కావ్యాల్లో, పురాణాల్లో సామాన్య గృహిణుల వర్ణన ఎందుకుంటుంది? నేను - చిన్నాన్నా, మహాభారతం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి? చిన్నాన్న - ఒక పాఠం ఇదే ఉంది - ‘స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః’ (గీత 1/40-41) (కుల స్త్రీలు దూషితలైనప్పుడు వర్ణసంకరులు జన్మిస్తారు. వాళ్ళు వంశాన్ని నాశనం చేస్తారు. (పాండు పుత్రులు ఎలా చేశారో అలాగ) కులము (వంశము) నశిస్తే అనాది కాలము నుండి వస్తున్న కుల ధర్మాలు నశిస్తాయి.) నేను - చిన్నాన్నా, పాండురాజు భార్యలు దూషితలెలా అయ్యారు? చిన్నాన్న - స్వయానా భర్తే వాళ్ళను దూషితలుగా చేశాడు. ఈ రోజుల్లో కుటుంబ నియంత్రణ లేక నియోజన ఫేషనయింది. కానీ, ఆ రోజుల్లో నియోగం ఆచారంగా ఉండేది. అంటే పుత్రప్రాప్తి కోసం పరపురుషునితో సంగమించడం శాస్త్రసమ్మతంగా ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో సతీత్వ రక్షణకంటే వంశరక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ‘అపుత్రస్య గతిర్నాస్తి’ (పుత్రహీనునికి మంచిగతులుండవు) అనేవారు. అందువల్లనే పాండురాజు స్వయంగా భార్యలను ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాడు అనడం కంటే బ్రతిమాలాడాడు, అనాలి, ఎవరివల్ల నైనా పుత్రుణ్ణి పొందమని, చూడు ఆయన కుంతిని ఎలా బుజ్జగిస్తున్నాడో - ‘పత్యా నియుక్తా యా చైవ పత్నీ పుత్రార్థమేవ చ న కరిష్యతి తస్యాశ్చ భవితా పాతకం భువి’ (ఆది పర్వం) (పతి ఆజ్ఞాపించినా పుత్రప్రాప్తి కోసం పరపురుషుని చేరని స్త్రీకి పాపం అంటుకుంటుంది) అంతేకాదు, ఆయన ఎన్నో ఉదాహరణలు కూడా ఇచ్చాడు - ‘ఉద్దాలకస్య పుత్రేణ ధర్మ్యా వైశ్వేతకేతునా సౌదాసేన చ రంభోరుః నియుక్తా పుత్రజన్మని ఏవం కృతవతీ సాzపి భర్తుః ప్రియచికీర్షయా అస్మాకమపి తే జన్మ విదితం కమలేక్షణే!’ (ఆదిపర్వం) (ఓ సుందరీ! ఉద్దాలకుని పుత్రుడు శ్వతకేతు ద్వారా ఇది ధర్మసమ్మతంగా చెప్పబడింది. సౌదాసుడు తన భార్యను పుత్రప్రాప్తి కోసం ఈ పద్ధతిని అవలంబించమని కోరగా భర్త సంతృప్తి కోసం ఆమె అలాగే చేసింది). పాండురాజు చివరకు తన తల్లి (అంబాలిక) ప్రస్తావన కూడా తెచ్చి ఇలా అన్నాడు - ఓ కమలేక్షణా! నేను కూడా నియోగం ద్వారానే పుట్టాననే విషయం నీకు తెలుసు కదా! ఇక అలాంటి పరిస్థితిలో పాపం కుంతిగాని, మాద్రిగాని, ఏం చేస్తుంది? భర్త ఆజ్ఞ శిరసావహించి వాళ్ళు తమ అత్త అడుగుజాడల్లో నడిచారు. నేను అడిగాను - చిన్నాన్నా, పాండురాజు తల్లి అలా ఎందుకు చేసింది? చిన్నాన్న - తన అత్త సత్యవతి ఆజ్ఞ వల్ల ఆమె అలా చేసింది. చూడు, సత్యవతి కోడలితో ఏమంటూందో - ‘నష్టం చ భారతం వర్షం పునరేవ సముద్ధర పుత్రం జనయ సుశ్రోణి దేవరాజ సమ ప్రభమ్’ (ఆదిపర్వం) (ఓ సుందరీ! భారతవర్షం నశించిపోతూంది. దాన్ని ఉద్ధరించు. ఎవరివల్లనైనా ఇంద్రునితో సమానంగా తేజస్వి అయిన పుత్రునికి జన్మనివ్వు) అంతే కాదు. ఈ పుణ్యకార్యానికి సుయోగ్యుడైన ఒక వ్యక్తి, వ్యాసుణ్ణి సిఫారసు కూడా ఆమె చేసింది. ఈ సిఫారసు కూడా ఎవరితో చేసింది? అంబాలిక బావగారైన భీష్మునితో! భీష్ముడు వెనుకాడటం గమనించి సత్యవతి కొంత బిడియపడుతూ, చిరునవ్వుతో ఇలా అంది - నీకొక రహస్యం చెప్తాను. యౌవనావస్థలో మత్స్యగంధిగా నేను పేరు పొందాను. అప్పుడొకసారి పరాశర ముని యమున దాటడానికి నా నావలోకి వచ్చాడు. నన్ను చూసి ఆయనకు మోహం కలిగింది. కానీ పగటి వెలుగులో ఇతరుల ఎదుట ఆయన కోరిక ఎలా తీరుతుంది? అప్పుడాయన యోగబలంతో దట్టమైన మంచు సృష్టించి మోహం తీర్చుకున్నాడు. దాని వల్ల నాకొక పుత్రుడు కలిగాడు. ఆ పుత్రుడే వ్యాసుడుగా ప్రసిద్ధికెక్కాడు. నీవు ఆ వ్యాసుణ్ణి పిలుచుకొని రా. ‘తవ హ్యనుమతే భీష్మ నియతం స మహాతపాః విచిత్రవీర్యక్షేత్రేషు పుత్రానుత్పాదయిష్యతి’ (ఆదిపర్వం) (ఓ భీష్మా! నీ అంగీకారంతో నియమించబడిన మహాతపస్వి ఆ వ్యాసుడే విచిత్రవీర్యుని (విధవ) భార్యల (అంబిక, అంబాలికల) గర్భం నుండి పుత్రులను జన్మింపచేస్తాడు). నేను ఆయన వైపే చూస్తున్నట్లు గమనించి చిన్నాన్నే ఇలా అన్నాడు - అప్పుడు వ్యాసుణ్ణి పిలువనంపారు. ఆయన వీర్యంతోనే పాండురాజు, ధృతరాష్ట్రుడు జన్మించారు. నియోగ సమయంలో అంబిక కళ్ళు మూసుకుందట. కాబట్టి ఆమెకు జన్మాంధుడైన పుత్రుడు కలిగాడు. అంబాలిక చందన లేపనం చేసుకుందట కాబట్టి పాండుపుత్రుడు కలిగాడు. వ్యాసునికి అంబాలికతో ఎక్కువ సంతృప్తి కలిగింది. అందువల్లనే ఆయన అంతగా ఆమె వంశీయుల (పాండవుల) పక్షం వహించాడు. నేనడిగాను - చిన్నాన్నా, అంత పెద్ద జ్ఞాని అయి కూడా వ్యాసుడు వ్యభిచారకర్మకు ఎందుకు సిద్ధపడ్డాడు? చిన్నాన్న - చూడు, ‘ఆత్మా వై జాయతే పుత్రః’ (ఆత్మే పుత్రుని రూపంలో జన్మిస్తుంది). వ్యాసుని తండ్రి పరాశరుడు కూడా ఆ పనే చేశాడు కదా! ‘మత్స్యగంధాం ప్రజగ్రాహ మునిః కామాతురః తదా’ (దేవీ భాగవతం) (కామాతురుడై ఆ ముని మత్స్యగంధిని పట్టుకున్నాడు) పాపం బెస్తకన్య సత్యవతి భయపడుతూ - భయపడుతూ ఇలా అడిగింది -- ‘పితరం కిం బ్రవీమ్యద్య సగర్భా చేద్ భవామ్యహమ్ త్వం గమిష్యసి భుక్త్వా మాం కిం కరోమి వదస్వ తత్’ (దేవీ భాగవతం) (మీరేమో నన్ను అనుభవించి వెళ్ళిపోతారు. నాకు గర్భం అయితే మా తండ్రికి ఏమి సమాధానం చెప్పగలను? అది చెప్పండి.) అప్పుడు పరాశరుడు ఇలా ఆశీర్వదించాడు --- ‘పురాణకర్తా పుత్రస్తే భవిష్యతి వరాననే వేదవిద్ భాగకర్తా చ ఖ్యాతశ్చ భువనత్రయే’ (దేవీ భాగవతం) (ఓ సుందరీ! నీ గర్భం నుండి జన్మించే పుత్రుడు వేదాల్లో పారంగతుడు, పురాణకర్త అయి, ముల్లోకాల్లో ఖ్యాతి పొందుతాడు). ఆ పుత్రుడే వ్యాసుడు. ఒక ద్వీపంలో జన్మించాడు. కాబట్టే ఆయన్ను ద్వైపాయనుడని కూడా అంటారు. ద్వైపాయన వ్యాసుడు తన తండ్రి సంస్కారం ఎలా వదులుకుంటాడు? రాణివాసంలోని కామకళాప్రవీణ అయిన దాసి ఆయన్ను సంపూర్ణంగా తృప్తి పరచినప్పుడు ఆమెను కూడా ఆయన ఆశీర్వదించాడు. నీగర్భం నుండి ధర్మాత్ముడు, సత్యవాది అయిన పుత్రుడు (విదురుడు) జన్మిస్తాడు, అని --- ‘సంతోషితస్తయా వ్యాసో దాస్యా కామకలావిదా విదురస్తు సముత్పన్నో ధర్మాంశః సత్యవాన్ శుచిః’ (దేవీ భాగవతం) అందువల్లనే కదా, వ్యాసుడు మహాభారతంలో విదురుణ్ణి అంతగా పొగిడాడు? ఇది గమనించావా? చిన్నాన్న చిటికెడు వక్కపొడి నోట్లో ఉంచుకొని మళ్ళీ అన్నాడు - చూడబ్బాయ్, వ్యభిచార పర్యవసానం మంచిగా ఉండదు. వ్యాసునికి కూడా తర్వాత పశ్చాత్తాపం కలిగింది - ‘వ్యభిచారోద్భవాః కిం మే సుఖదాః స్యుః సుతాః కిల’ (దేవీ భాగవతం) (వ్యభిచారం వల్ల కలిగిన నా ఈ పుత్రులు కళ్యాణకారులు కాగలరా?) అర్జునుని మనసులో కూడా ఆత్మగ్లాని పుట్టింది -- ‘దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః’ (గీత 1/43) (కుల విధ్వంసకులు తెచ్చిపెట్టే ఈ వర్ణసాంకర్యం వల్ల కలిగే దోషాలవల్ల శాశ్వతాలైన వర్ణాచారాలు, కులాచారాలు నశిస్తాయి) అరే, వంశానికి ఒకసారి మచ్చవస్తే అది త్వరగా మాసిపోదు. దాన్ని కడిగేయడానికి చాలా కాలం ప్రాయశ్చితం చేయవలసి ఉంటుంది. కొంచెం ఆగి చిన్నాన్న మళ్ళీ అన్నాడు - చూడబ్బీ, ‘గతానుగతికో లోకః’ (ముందు వాళ్ళు ఎలా చేస్తే లోకం గుడ్డిగా అలాగే చేస్తుంది). సత్యవతి నుండి అంబాలిక నేర్చుకుంది. అంబాలిక నుండి కుంతి నేర్చుకుంది, కుంతి నుండి ద్రౌపది నేర్చుకుంది. ఈ విధంగా విచిత్రవీర్యుని వంశంలో విచిత్రమైన ఈ ఆచారం కొనసాగినందువల్ల కులస్త్రీలు దూషితలవుతూ వచ్చారు. వర్ణ సంకరులైన వారి పుత్రులు చేసిన వంశ విధ్వంసం అందరికీ తెలిసిందే. మహాభారతం మననం చేయవలసిన రచన. అందులో లేనిదేముంది? ‘యన్న భారతే తన్న భారతే’ (మహాభారతంలో లేనిది భారత దేశంలోనే లేదు.) నేను - అయినా మహాభారత యుద్ధానికి అసలు సూత్రధారి కృష్ణుడు కదా! చిన్నాన్న - అవును. ఆయన బలంతోనే అర్జునుడు గంతులేసేవాడు. గుంజ బలంతో ఆవుదూడ గెంతినట్లు. ధర్మయుద్ధమే గనుక జరిగి ఉంటే పాండవులు గెలిచేవారే కాదు. టక్కరి కృష్ణుడు అలా జరగనివ్వలేదు. మొదటి నుండి చివరిదాకా అధర్మయుద్ధమే జరిగింది. కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, వీరందరి వధ ధర్మవిరుద్ధంగానే జరిగింది. అయినా గీతాకారుడు ‘ధర్మక్షేత్రే కురుక్షేత్రే’ అంటాడు! నాకు మాత్రం ఇది ఖచ్చితంగా వ్యంగ్యంగానే కనిపిస్తుంది. వ్యాసుడన్నాడు - ‘యతో ధర్మస్తతో జయః’ (ధర్మమున్నచోటే జయం ఉంటుంది) కాని మహాభారతంలో ‘యతోzధర్మస్తతో జయః’) (అధర్మమున్నచోటే జయం ఉంటుంది) అనేదే జరిగింది. అందువల్లనే ఆ జయం కూడా క్షయంగా పరిణమించింది! నేను - చిన్నాన్నా, మహాభారత యుద్ధానికి మూల కారణం దుశ్శాసనుడు చేసిన ద్రౌపది వస్త్రాపహరణ! చిన్నాన్న - అవును, దుశ్శాసనుడు ఒకే ఒక చీరను అపహరిస్తే దానిపైన మహాభారత యుద్ధం చెలరేగింది. శ్రీకృష్ణుడు అంత వస్త్రాపహరణ చేస్తే అది విశుద్ధ భాగవతమై కూర్చుంది. కానీ కర్మఫలం ఏదో ఒకరోజు అనుభవించక తప్పదు. గోపికలతో ఎవరైతే అన్ని రాసక్రీడలు చేశాడో, ఆయన భార్యలను కూడా చివర్లో గొల్లలు కొల్లగొట్టి తీసుకుపోయారు. చూడు - ‘కృష్ణపత్న్యః తదా మార్గే చోరాభీరైశ్చ లుంఠితాః ధనం సర్వం గృహీతాం చ నిస్తేజాశ్చార్జునోzభవత్’ (దేవీ భాగవతం . 2/7) (కృష్ణావతారానంతరం అర్జునుడు కృష్ణుని భార్యలను ద్వారక నుండి హస్తినాపురం తీసుకుపోతున్న సమయంలో దారిలో దొంగలు, గొల్లలు మొత్తం వారి ధనాన్నే కాక, కృష్ణుని భార్యలను కూడా అపహరించి తీసుకుపోయారు. అప్పుడు వాళ్ళ సంరక్షకుడు అర్జునుడు అసహాయుడై చూస్తూ ఉండిపోయాడు!) ఆ ధనుర్ధరుని తేజం అప్పుడు ఎక్కడికి పోయింది? అరే, కాలం గర్వాపహారి. ఎవరి గర్వాన్నీ నిలువ నివ్వదు! గట్టిగా ఊపిరి పీల్చుకొని చిన్నాన్న మళ్ళీ అన్నాడు - భాగ్యలీల విచిత్రంగా ఉంటుంది. ఎవరైతే జీవితంలో అంతమంది అసురులను అంతమొందించాడో, ఆ శ్రీకృష్ణుడే చివరకు ఒక వేటగాని బాణానికి ఆహుతి అయిపోయాడు. ఒక చెట్టు కింద జింక అనే భ్రమతో వేటగాడు ఆయనపైన బాణం వేశాడు, ఆయన రాణులు పశువుల్లాగా కొల్లగొట్టబడ్డారు! దీన్ని విధి వైపరీత్యమనాలా లేక కర్మఫలమనాలా? శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అన్నదమ్ములకు, దగ్గరి బంధువులకు మధ్య విరోధం పుట్టించి, ఒకరినొకరు చంపుకొనేట్లు చేసి భూభారం తగ్గించాడని పురాణం చెప్తుంది - ‘కురుపాండవ యుద్ధం చ కారయామాస భేదతః భువో భారావతరణం చకార యదునందనః’ (బ్రహ్మవైవర్త పురాణం) కాని, యదునందనునికి దాని ఫలం ఏమి దక్కింది? ఆయన యదువంశం కూడా అదే విధంగా నశించిపోయింది. కురుక్షేత్రానికి ప్రతిఫలం ప్రభాసక్షేత్రం (ఒక ప్రాచీన తీర్థస్థలం)లో లభించింది. ‘పుత్రా ఆయుధ్యన్ పితృభిః భ్రాతృభిశ్చ మిత్రాణి మిత్రైః సుహృదః సుహృద్భి’ (భాగవత పురాణం) అన్న-తమ్ముళ్ళు, తండ్రి-కొడుకులు, మిత్రులు అందరు పరస్పరం పోరాడి మరణించడం వల్ల (యాదవ వంశం) నాశనమైపోయింది. వంశంలో ఏడ్చేవాడు కూడా లేకుండా పోయాడు! అరే, విషవృక్షం విషఫలాలనే ఇస్తుంది, అమృత ఫలాల నివ్వదు. చిన్నాన్న ముక్కు పుటాలకు నశ్యం దట్టిస్తూ ఇలా అన్నాడు - అన్యాయం చేసేవాడు చివరకు నశించే పోతాడు. అందుకే పాండవులు హిమాలయాల్లో సమసి పోయారు. యుధిష్ఠిరుని వెంట ఆయన రాజ్య వైభవమేమీ పోలేదు. వెంటపోయింది ఒక కుక్క మాత్రమే! భాతృ విరోధంవల్ల, నరసంహారం వల్ల ఏం ఫలితం దక్కింది? అయినా, మన కళ్ళు తెరుచుకోవడం లేదు. భారతదేశంలో మరోసారి అలాంటి యుద్ధం వచ్చే పరిస్థితి రాకుండా భగవంతుడు కాపాడుగాక! తెలుగు అనువాదం పురాణ ప్రలాపం జె. లక్ష్మీరెడ్డి Retired professor in Delhi University

No comments:

Post a Comment