భగవద్గీత--హరిమోహన్ ఝా -- తెలుగు-జె. లక్ష్మీరెడ్డి
Posted by
innaiah
on Monday, October 20, 2014
మైథిలీ మూలం
‘ఖట్టర్ కాకా’
హరిమోహన్ ఝా
భగవద్గీత
నా చేతిలో భగవద్గీత చూసి వికటకవి చిన్నాన్న అన్నాడు - ఏం నాయనా! ఈ మధ్య గీతా పారాయణం చేస్తున్నావా ఏం? అలా అయితే నీకు దూరంగా ఉండాలి!
నేను ఆశ్చర్యపోయి అడిగాను - ఎందుకు చిన్నాన్నా?
చిన్నాన్న - చూడబ్బాయ్, మొదట అర్జునునిలో ప్రేమ, మమకారం ఉండేవి. ‘వీళ్ళు అన్నదమ్ములు. వీళ్ళు చిన్నాన్న - పెదనాన్నలు, ఆయన పితామహుడు, వీళ్ళ పైకి చేయి ఎలా ఎత్తేది?’ అని సందేహించాడు. కానీ గీతసవం తాగిన తర్వాత బాణ వర్షం కురిపించి ఆయన వృద్ధ పితామహుని ఎదను కూడా జల్లెడ చేసేశాడు. అందువల్ల ఏ విషయంలోనైనా తగాదా వస్తే నీవు కూడా అర్జునుని లాగా నిర్వికార యోగివై - ‘నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః’ (గీత 2/23) (ఆత్మను అస్త్ర - శస్త్రాలు ఏమీ ఛేదించలేవు. అగ్ని దహించలేదు) అని ఆలోచించి, ‘చిన్నాన్న ఆత్మను ఏ ఆయుధమూ ఖండించలేదు కదా! అలాంటప్పుడు గండ్రగొడ్డలితో ఒక మాంచి దెబ్బ వేస్తే ఏం?’ అనుకుంటే? తర్వాత మీ పిన్ని ఏడ్వడం మొత్తుకోవడం మొదలు పెడితే ఇలా ఓదార్చడానికి ప్రయత్నిస్తే --
‘వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో..పరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహీ’ (గీత 2/22)
(మనిషి చిరిగిన బట్టలు విడిచిపెట్టి కొత్త బట్టలు ఎలా ధరిస్తాడో, అదే విధంగా జీవాత్మ జీర్ణించిన శరీరాన్నివదలిపెట్టి కొత్త శరీరాన్ని గ్రహిస్తుంది.)
‘పిన్నమ్మా! చిన్నాన్న శరీరం మారిపోయింది. కొత్త శరీరం ప్రాప్తించింది. మీరు సంతోషించి బారసార పాటలు పాడండి. ఏడుస్తున్నారెందుకు?’అని నీవంటే!
ఊళ్ళో కుర్రాళ్ళంతా గీతోపదేశం ప్రకారం నడుచుకోడం మొదలుపెడితే ఎంతమంది చిన్నాన్నలు చంపబడతారో, ఎంతమంది పిన్నమ్మలు విధవలై పోతారో చెప్పడం కష్టం. అందువల్లనే నేను నీకు దండం పెడతాను. చదవాలే అనుకుంటే ‘గీత గోవిందమ్’ చదువు నాయనా, ఈ గీత చదివే సరదా పెంచుకోకు.
నేను - గీత అహింస, వైరాగ్యాలు ఉపదేశిస్తుందని కదా అంటారు?
చిన్నాన్న -- అరే, నాకు తెలిసిందొకటే, గీతోపదేశం విన్నతర్వాత అర్జునుడు గాండీవం విసిరేసి కాషాయ వస్త్రాలు ధరించి ఉంటే, కవచం విప్పేసి కమండలం చేతికి తీసుకొని ఉంటే, కురుక్షేత్రం వదిలిపెట్టి వరాహక్షేత్రం (ఒక తీర్థస్థలం) దారి పట్టి ఉంటే అప్పుడు నేను గీతలో అహింస, వైరాగ్యం నిండి ఉన్నాయని ఒప్పుకొనే వాణ్ణి. కానీ ఆయన మత్సవేధం (మత్స్య యంత్రం) లాగా బంధు మిత్రుల మస్తకఛేదం చేయడం మొదలు పెట్టాడు!
అరే, ఈ రోజుల్లో ఊరకనే ప్రజలు ఈటెలు, బల్లేలు బయటి తీస్తూంటారు. వాటిపైన గీత పదును కూడా ఎక్కిందంటే ప్రతి ఊరూ కురుక్షేత్రం అయిపోతుంది. అందుకే నేను చేతులు జోడించి ఉడుకు రక్తంలో గీత చదవ వద్దు బాబూ, అంటాను.
నేను - చిన్నాన్నా, గీతాకారుని అసలు అభిప్రాయం వేరే ఉందేమో!
చిన్నాన్న చిరాకు పడుతూ అన్నాడు - వేరే అభిప్రాయం నాకెలా తెలుస్తుంది? గీతాకారుడే స్వయానా సారథి అయి ముందు కూర్చొని ఉన్నాడు కదా! అహింసా ప్రబోధమే చేయదలచుకొని ఉంటే ఆయన యుద్ధభూమి నుండి రథం ఎందుకు మళ్ళించ లేదు? ఇలా ఎందుకనలేదు? -- ‘అర్జునా! శరీరం నశ్వరమని, ప్రపంచం క్షణభంగురమని, ఇంత జ్ఞానం నేను ఇచ్చిన తర్వాత హస్తినాపురం ఏపాటిది? ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది. దానికోసం రక్తధారలు ఎందుకు ప్రవహింప చేస్తావు? ప్రాపంచిక సుఖాలు తుచ్ఛమైనవి. రాజ్యకాంక్ష వదిలేసేయి. రాజ్యం కోసం వృద్ధ పితామహుని పైన, పూజ్యుడు ద్రోణుని పైన బాణాలు సంధించడం నీకు శోభిస్తుందా? యుద్ధం చేయకపోతే ఏమవుతుంది? క్షత్రియుడై ఉండి, యుద్ధభూమి వదలిపోయాడని లోకులు నవ్వుతారు. అంతేకదా! కానీ, ఎవరు నిజమైన జ్ఞానులో, వారు నిందలకూ - ప్రశంసలకూ చలించరు. ఈ తంటా అంతా వదిలేయ్. నాతో హిమాలయాలకు వచ్చేయ్!’ ఈ మాటలేవీ ఆయన అనలేదు. యుద్ధానికి పురికొల్పాడు. ఇంత జరిగినా నీవు మాత్రం గీతలో అహింస, వైరాగ్యం ఉందని అనుకుంటున్నావు! ఏమి బుద్ధి! ఏమి బుద్ధి!
నేను - చిన్నాన్నా, పెద్ద - పెద్ద వాళ్ళు గీత ద్వారా విశ్వశాంతి స్థాపించాలనుకుంటున్నారు. అయినా మీరు అందులో యుద్ధ సందేశమే కనిపిస్తూంది.
చిరునవ్వు నవ్వి చిన్నాన్న అన్నాడు - నీవు మన వీరకావ్యం ‘అల్హా’ ఎప్పుడైనా విన్నావా? అది చదివే వాళ్ళు వినేవాళ్ళల్లో ఏ విధంగా వీరావేశం పెంచేస్తారు? - ‘చివరకు దేవుడెలా రాసిపెట్టి వుండే అలా అవుతుంది. ఒక రోజు అందరూ వెళ్ళిపోవలసిందే.’ ఈ మాటల పైనే ఎందరో తలలర్పించి చచ్చారు. నాకు మాత్రం అలాంటి పిలుపే గీతలో కూడా వినిపిస్తూంది -
‘అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః
అనాశినోzప్రమేయస్య తస్మాదుధ్యస్వ భారత’ (గీత 2/18)
(ఆత్మ ధరించే శరీరాలన్నీ నశించి పోయేవే. కానీ జీవాత్మ నాశము లేనిది, అనిర్వచనీయమైనది, నిత్యమైనది. కావున అర్జునా! యుద్ధం చెయ్యి)
కానీ, ఎప్పుడో ఒకసారి చావాలి కాబట్టి ఇప్పుడే చచ్చిపో, అనే ఈ తర్కం నాకు నచ్చదు.
నేను - చిన్నాన్నా, భగవంతుడనేదేమిటంటే, జీవుడు ఎప్పుడూ నశించడని.
చిన్నాన్న - జీవుడు నశించనప్పుడు హత్య చేసిన వాడికి ఉరిశిక్ష ఎందుకివ్వాలి? శ్రీకృష్ణుడు అర్జునికేమో ఇలా ఉపదేశిస్తాడు -
‘గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః’ (గీత 2/11)
(జ్ఞానులయిన వారు మరణించిన వారిని గురించిగానీ, జీవించి ఉన్న వారిని గురించిగానీ శోకించరు).
కానీ, అభిమన్యుని చంపినప్పుడు ఈ జ్ఞానం ఎక్కడ మాయమై పోయింది? --
‘న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః
అజో నిత్యః శాశ్వతోzయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే’ (గీత 2/20)
(ఈ ఆత్మ ఎన్నడూ పుట్టదు, ఎన్నడూ గిట్టదు. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు ఉండకుండా పోదు. ఇది పుట్టుక లేనిది, మార్పు లేనిది, నిత్యమైనది. ఎల్లప్పుడు స్వస్వరూపంలోనే ఉంటుంది. మరణం శరీరానికే గాని ఆత్మకు లేదు.)
ఈ మాటే సత్యమైతే జయద్రథునితో పగ సాధించడానికి అంత మాయోపాయం ఎందుకు చేయవలసి వచ్చింది? అప్పుడు --
‘దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
వీతరాగభయక్రోథః స్థితధీర్ముని రుచ్యతే’ (గీత 2/56)
(దుఃఖాల్లో కలత చెందక, సుఖాల్లో వాంఛ లేక, అనురాగ, భయ కోపరహితుడై ఉండే వాడే స్థితప్రజ్ఞుడైన ముని)
ఈ మాట ఎందుకు మరచి పోయాడు? అరే అబ్బీ, నీవింకా పిల్లవాడిని, ఇవన్నీ అర్థం చేసుకోలేవు.
నేను -- చిన్నాన్నా, ఈ శ్లోకం ప్రసిద్ధికెక్కింది కదా --
‘సర్వోపనిషదో గావో దోగ్దా గోపాలనందనః
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్’
(ఉపనిషత్తులన్నీ గోవులు, కృష్ణుడు వాటిని పితికే గోపాలుడు. పాలు గీతామృతం. ఆ పాలు తాగిన దూడ ధీమంతుడైన అర్జునుడు)
చిన్నాన్న నవ్వుతూ అన్నాడు - అవును, అర్జునుడు పాపం ఆవుదూడ లాంటి అమాయకుడే. అందువల్లనే కదా, కృష్ణుడు బుజ్జగించి యుద్ధానికి పురికొల్పాడు? ఒక రకంగా చూస్తే అర్జునుణ్ణి మభ్యపెట్టడానికే గీత రచించడం జరిగింది. శ్రీకృష్ణునికి పోట్లాట పెట్టాలని ఉంది, అర్జునుని వీపు తట్టాడు. యుద్ధం జరుగుతూంటే తాను మాత్రం తమాషా చూస్తూ కూర్చున్నాడు. అర్జునిపైన కృష్ణుని శ్యామరంగు ఎంతగా ఎక్కిపోయిదంటే మొత్తం వంశాన్నే మంటకలిపేశాడు.
నేను - చిన్నాన్నా, అర్జునుడు అనాసక్తుడై యుద్ధం చేశాడు. రాజ్యకాంక్షతో కాదు.
చిన్నాన్న వ్యంగ్యంగా అన్నాడు - అవును, అందుకే గదా, హస్తినాపురం సింహాసనం నీ పేర రాసి ఇచ్చి వెళ్ళాడు! అరే, అనాసక్తుడే అయితే నూరు - నూరుగురు పెత్తండ్రి కుమారుల రక్తంతో రాజ్యాభిషేకం చేసుకుంటాడా? ఓ ఢిల్లీ! నీ కారణంగా జరిగిన రక్తపాతానికి ఈ రోజు వరకూ నీ కోట ఎర్రగానే ఉంది!
నేను -- చిన్నాన్నా, మీరు ధన్యులు! మాటలను ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్తారు!
చిన్నాన్న తన ధోరణిలోనే మాట్లాడ సాగాడు - చూడు, కృష్ణునికి పోరాటం పెట్టాలని ఉంది, అర్జునునికి స్వంత బుద్ధి లేకపోయింది. అందువల్ల కృష్ణుడు మనసుకు ఏది తోస్తే అది చెప్పుకుంటూ వెళ్ళాడు -- ‘శరీరం నశ్వరం. అందువల్ల యుద్ధం చెయ్యి. ఆత్మకు మరణం లేదు. కనుక యుద్ధం చెయ్యి. క్షత్రియుడివి. కనుక యుద్ధం చెయ్యి. యుద్ధం చేయకపోతే నిందల పాలవుతారు. కాబట్టి యుద్ధం చెయ్యి.’
చిరునవ్వు నవ్వుతూ చిన్నాన్న మళ్లీ ఇలా అన్నాడు - క్షత్రియుడికి యుద్ధభూమి నుండి పారిపోవడం కంటే మరణించడమే శ్రేయస్కరమని కృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తాడు. కాని తాను మాత్రం జరాసంధునితో యుద్ధం చేయలేక ద్వారకకు పలాయనం చిత్తగించాడు! అందువల్లనే ఈ నాటికీ ‘రణఛేడ్’ (యుద్ధం భూమి వదలినవాడు) అనే పేరు ఆయనకుంది. దీన్నే ‘పరోపదేశే పాండిత్యం’ (ఇతరులకు ఉపదేశం ఇవ్వడంలో పాండిత్యం కలిగి ఉండడం) అంటారు. ఇక ఆయనకు జవాబివ్వగలిగే తెలివి అర్జునునికెక్కడిది? ఆబగా వింటూ పోయాడు. అంతా విన్న తర్వాత కూడా అర్జునికి ఏమీ బోధపడక పోయేసరికి కృష్ణుడు తన భీకర రూపం చూపించి భయపెట్టాడు. ‘ఆ విధంగా తెలుసుకోకపోతే ఈ విధంగా తెలుసుకో!’ అని.
నవ్వుతూ చిన్నాన్న మళ్ళీ ఇలా అన్నాడు -- నాకొక విషయం గుర్తుకు వస్తూంది. ఒకసారి మీ పిన్నమ్మ కాశీ స్నానానికి వెళ్తూ ఉంది. ఆమెతోపాటు ఐదేళ్ళు ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడు నేను కూడా వెంట వస్తానని హఠం చేయడం మొదలు పెట్టాడు. నేను ఎన్నో విధాల వాడికి నచ్చ చెప్పాను - నదిలో ప్రవాహ వేగం ఎక్కువగా ఉంది. పిల్లలు కొట్టుకుపోతారు. నీళ్ళలో మొసళ్ళున్నాయి, పట్టుకుంటాయి, వెళ్ళవద్దు, అని. వాడు ఎంతకూ వినకపోతే అప్పుడు రామలీల రాక్షసుని ముఖం తగిలించుకొని వాణ్ణి భయపెట్టాను. అది చూడగానే బుద్ధిమంతుడై పోయాడు. ఒరే అబ్బీ, నాకు మాత్రం ఆ పిల్లవాడిలోనూ అర్జునుడిలోనూ ఏమంత పెద్ద తేడా ఉన్నట్లు అనిపించదు.
నేను - చిన్నాన్నా, గీతలో ఎంతో జ్ఞానయోగం, భక్తియోగం, కర్మయోగం నిండి ఉన్నాయి. కదా!
చిన్నాన్న --- అన్ని యోగాల లక్ష్యం ఒకటే, ‘తస్మాతం యుధ్వస్య భారత!’ అంటే యుద్ధం చెయ్యి, కౌరవులను చంపు. ఎలాగో ఒక లాగ అర్జునుణ్ణి యుద్ధానికి సంసిద్ధుని చేయడం కోసం నిష్కామకర్మ. అనాసక్త యోగాల పెద్ద వల అల్లడం జరిగింది. అర్జునుని బుద్ధి అందులో చిక్కుకుపోయినందువల్ల కృష్ణుడు ఆయన్ను ఎలా కావాలంటే అలా ఆడించాడు. కాని, అర్థం చేసుకొనే శక్తి ఉన్నవాడు మాత్రం కృష్ణుని ఎత్తుగడను అర్థం చేసుకొనే తీరుతాడు.
నేను - నీవెంతటి వాడివి? పెద్ద-పెద్ద పండితులకే అర్థంకాదు. కానీ, నాకు మాత్రం అంతా విస్పష్టంగా తెలుస్తూనే ఉంది. కృష్ణుడంటాడు -
‘ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్
ఆత్మన్వేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే’ (గీత. 2/55)
(ఎవరైతే అన్ని కోరికలు త్యజించి తమలో తామే సంతృప్తులై ఉంటారో, వారే నిజమైన స్థితప్రజ్ఞులు) అలాంటప్పుడు రాజ్యం, స్వర్గం, వీటి ఆశ చూపుతూ ఇలా ఎందుకన్నాడు?-
‘హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః’
(అర్జునా! చనిపోతే స్వర్గం ప్రాప్తిస్తుంది. జయం పొందితే రాజ్య భోగాలననుభవిస్తావు. రెండు విధాల లాభమే ఉంది. అందువల్ల కృతనిశ్చయుడవై యుద్ధానికి లే! )
చిరునవ్వు నవ్వుతూ చిన్నాన్న అన్నాడు - అర్జునుడు తర్కం శాస్త్రం చదవలేదు. అందుకే రెండు విధాలా ఉచ్చులో చిక్కుకున్నాడు. నేనుండి ఉంటే అడిగేవాణ్ణి. ‘హే కృపాసింధు, ఈ రెండూ కాక మరో పరిణామం కూడా జరగవచ్చు కదా! అర్జునుణ్ణి పట్టి బంధిస్తే అప్పుడు మరి ఎలా? స్వర్గమూ ఉండదు, రాజ్యమూ ఉండదు కదా! రెంటికీ చెడ్డ రేవడై పోయినట్లే కదా!’ కానీ అర్జునుడు తిన్నగా చూసే ధనుర్ధరుడు మాత్రమే. ఎవరైనా పక్షధరుడు భగవానునికి తారసపడి ఉంటే కదా! నేనయితే అడిగేవాణ్ణి ‘మహాప్రభూ, అన్ని మనోరథాలూ (కోరికలు) వ్యర్థమే అయినప్పుడు మీరీ రథానేన్నైనా ఎందుకు నడుపుతున్నారు?’ అని.
నేను - చినాన్నా, ప్రతిచోటా మీరు మీ తర్కశాస్త్రం తీసుకొస్తారు!
చిన్నాన్న ఎందుకు తీసుకురానబ్బాయ్? ఇదే కదా మన దేశంలోని ప్రధాన విద్య. దేన్నైనా ఖండించడానికి, సమర్థించడానికి ఇలాంటి సూక్ష్మబుద్ధి మరెవరికుంది?
అడకత్తెరలో పోకచెక్కలు కత్తిరిస్తూ చిన్నాన్న అన్నాడు - చూడు, కృష్ణుడు ఒకచోటనేమో ఇలా ఉపదేశిస్తున్నాడు --
‘సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాస్మకాంచనః
తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మసంస్తుతిః’ (గీత. 14/24)
(సుఖదుఃఖాలను సమానంగా భావించి, ఆత్మస్థుడై ఉంటూ మట్టి గడ్డను, రాతిని, బంగారాన్ని, ఒకటిగానే ఎంచుతూ, ఇష్టానిష్టాలను, నిందాస్తుతులను సమభావంతో ఎవడు స్వీకరిస్తాడో వాడే ధీరుడు).
మరోచోట ఈ మాట కూడా అంటాడు -
‘అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేzవ్యయామ్
సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే’ (గీత 2/34)
లోకులు నీ తరగని అపకీర్తిని కలకాలము ప్రస్తావించుకుంటూ ఉంటారు. మాన్యుడైన వానికి సంకీర్తి మరణం కంటే బాధాకరమైనదిగా ఉంటుంది)
ఒకసారి అనాసక్త కర్మను ఉపదేశిస్తాడు -
‘సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ
తతో యుద్దాయ యుజ్యస్వ నైనం పాపమవాప్స్యసి’ (గీత 2/38)
(సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను, సమానంగా భావించి యుద్ధానికి సన్నద్ధుడవు కా. దీనివల్ల నీకు పాపమంటదు)
తర్వాత గెలుపు ఆశ కూడా చూపుతాడు ---
‘తస్మాతం త్వముత్తిష్ఠ యశో లభస్య జిత్వా శత్రూ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్’
(గీత 11/33)
(కాబట్టి అర్జునా, లే, యశస్సు పొందు, శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యం అనుభవించు)
ఇక నీవే చెప్పు, సుఖం, దుఃఖం, గెలుపు, ఓటమి, కీర్తి, అపకీర్తి అన్నీ సమానమైనప్పుడు భగవానుడు జయము, కీర్తి, వీటి ఆశ ఎందుకు చూపుతున్నాడు?
నేను - మౌనంగా ఉండడం చూసి చిన్నాన్నే మళ్ళీ అన్నాడు - అరే, ఒక మాట అడుగుతాను, భగవానుడంటాడు -
‘ఈశ్వరః సర్వాభూతానాం హృద్దేశేzర్జున తిష్ఠతి
భ్రామయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా’ (గీత 18/61)
(ఈశ్వరుడే సర్వప్రాణుల హృదయాల్లో నెలకొని తన మాయ ప్రభావంతో వానిని కీలు బొమ్మల్లాగా ఆడిస్తున్నాడు.) ఈ మాటే నిజమైతే ఇంత అయోమయం సృష్టించవలసిన పనే ముంది? నేరుగా తన యంత్రమే తిప్పేస్తే సరిపోయేదికదా! ఆయన కోరిక ఎదుట అర్జునుని కోరిక ఏపాటి? తర్వాత మళ్ళీ ‘యథేచ్చసి తథా కురు’ (గీత 18/63) (నీ కోరిక ఎలా ఉంటే అలా చెయ్యి) అనే మాట ఎందుకంటాడు? ఇదే ఆయన ఉద్దేశ్యమైతే ఈ మాటపైనే నిలబడవలసింది. మరి ఇలా ఎందుకన్నాడు -
‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వాం సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః’
(అన్ని ధర్మాలు (కర్తవ్య కర్మలు) వదలి పెట్టి నా ఒక్కని శరణు పొందు. నేను నీకు అన్ని పాపాల నుండి విముక్తి కలిగిస్తాను).
అరే, ఇట్లా మాట్లాడేది పండాలు, పురోహితులు, ఫాదరీలే. ఇలా మాట్లాడటం భగవంతునికి శోభిస్తుందా? చిట్ట చివరన ఈ మాటే చెప్పదలచుకొని ఉంటే, ఏడు వందల శ్లోకాల అవసరం ఏముంది? ఒకే శ్లోకార్ధంలో ఈ మాట అని ఉంటే సరిపోయేది కదా -
‘అహమాజ్ఞాపయామి త్వాం తస్మాత్ యుధ్వస్వ భారత!’
(ఓ అర్జునా, నేను నిన్ను అజ్ఞాపిస్తున్నాను, కాబట్టి యుద్ధం చెయ్యి.)
నేను - చిన్నాన్నా, నాకు తెలిసినంతవరకు మొత్తం గీత నిష్కర్ష - నిష్కామ కర్మ.
చిన్నాన్న - అరే, అదే కదా నాకు బొత్తిగా అర్థం కానిది! ఇచ్ఛాకృత కర్మ (కోరి చేసిన పని) కూడా ఎక్కడైనా నిష్కామంగా ఉండగలుగుతుందా? ఎవరే పని చేసినా ఏదో ఒక కోరిక ప్రేరణతోనే చేస్తారు. అన్ని కోరికలూ త్యజించాలనుకోవడం కూడా ఒక కోరికే కదా! ‘నిష్కామ కర్మ’ అనడంలో వదతోవ్యాఖాత దోషం (ముందు చెప్పిన దాన్ని ఖండించే మరో మాట చెప్పడం) ఉంది.
నేను - చిన్నాన్నా, మీ తర్కం ముందు నేనక్కడ నిలబడగలను? కానీ, జీవన్ముక్తునికి మాత్రం ఏ కోరికా ఉండదు కదా!
నవ్వుతూ చిన్నాన్న అన్నాడు -- అబ్బాయీ, నాకు మాత్రం ఇంత వరకు ఒక్క జీవన్ముక్తుడు కూడా కనపడలేదు. కనబడితే కర్రతో ఒక దెబ్బ వేసి ఆయన స్థితప్రజ్ఞత ఏ పాటిదో చూసే వాడిని. అరే, ఇవన్నీ ఉబుసుపోక చెప్పే మాటలు!
నేను గంభీరంగా అడిగాను - అయితే భగవానుడు అర్జునుణ్ణి యుద్ధానికి ప్రేరేపించడం కోసమే గీత రచించాడని మీ అభిప్రాయమా?
చిన్నాన్న గట్టిగా నవ్వాడు. తర్వాత చిటికెడు వక్కపొడి నోట్లో వేసుకొని అన్నాడు - అరే, నువ్వు ఏ లోకంలో ఉన్నావు? ఇవన్నీ కవి కల్పనలు. కవికి ఏదో ఒక ఆధారం కావాలి. తన కావ్య చమత్కారం చూపడానికి, ఒకరు రాముని సందర్భంతో ‘రామగీత’ రాశాడు. మరొకరు శివుని సందర్భం తీసుకొని ‘శివగీత’ రాశారు. మరొకరు గోపికల సందర్భం ఆధారంగా ‘గోపీ గీత’ రాశారు. అదే విధంగా ఎవరో తన జ్ఞానాన్ని ప్రదర్శించేందుకు కురుక్షేత్ర నేపథ్యంతో ‘భగవద్గీత’ రాశారు. నీవే చెప్పు, అంత భయంకరమైన యుద్ధం జరగబోయేముందు పద్ధెనిమిది అధ్యాయాల గీత చెప్పడానికి, వినడానికి తీరిక ఎవరికి వుంది? అంతవరకు పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం త్రాటక ముద్రలో కుంభక ప్రాణాయామం చేస్తూ వుందా? సంజయుని కళ్లల్లో టెలివిజన్ ఫిట్ అయి ఉందా? కవికి ఏదో సాకుతో తన సాంఖ్యయోగ, వేదాంతాల జ్ఞానం ప్రదర్శించుకోవలసి ఉంది, అది ఆయన ప్రదర్శించాడు.
నేను - అయితే మరి మీ దృష్టిలో గీత వల్ల ఏ ప్రయోజనమూ లేదా?
చిన్నాన్న చిరునవ్వు నవ్వుతూ అన్నాడు - ప్రయోజనం ఎందుకు లేదూ? దీనివల్ల కుటుంబ నియంత్రణకు తోడ్పాటు లభిస్తుంది. ఇదే ఒక ప్రయోజనం!
నేను - ఏ విధంగా?
చిన్నాన్న - చూడు, గీత సందేశం ఇది --
‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’
(కర్తవ్య కర్మ చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది. దాని ఫలితం పైన ఎప్పుడూ ఉండదు.) ఈ శ్లోకంలో సంతాన నిరోధ మంత్రం దాగి వుంది!
నేను చకితుణ్ణయి అడిగాను - ఎలా చిన్నాన్నా?
చిన్నాన్న - కేవలం కర్మ చేస్తూ పో, ఫలాపేక్ష పెట్టుకోవద్దు, అని కదా సందేశం? ఇక్కడ ఫలం అంటే సంతానం అని అర్థం చేసుకోవాలి మరి. ఇక ఇంతకంటే వివరించి ఎలా చెప్పను? చిన్నాన్నను కదా!
నేను - చిన్నాన్నా, మీరు ప్రతి మాటలో వినోదం సృష్టిస్తారు. గీత అనాసక్త భావంతో కర్మ చేయాలని కదా ఉపదేశిస్తుంది..
చిన్నాన్న - అవునబ్బాయ్, ఈ ఉపదేశాన్ని అమలు చేస్తే దేశంలో ఎట్టి పరిస్థుతుల్లోనూ విప్లవం జరగదు. గానుగెద్దుకు బెల్లం ఉండతో ఏమిటి ప్రయోజనం? ఈ జ్ఞానం కార్మికులకు అందితే, కార్ఖానాల్లో ఇక సమ్మె ఎందుకు జరుగుతుంది? కానీ ఇప్పుడు మాత్రం దేశంలో తారుమారైన గీతోపదేశం నడుస్తూ ఉంది -
‘ఫలేష్వవాధికారస్తే మా కర్మణి కదాచన’
(ఫలం పైన మాత్రమే నీకు అధికారం ఉంది, కర్మ పైన ఎప్పుడూ ఉండదు)
ఈ నిష్కర్మ భోగవాద వెల్లువను అడ్డగించేందుకు కర్మను, దాని ఫలితాన్ని రెండింటినీ ఒకేసారి తీసుకొని ముందుకు సాగే గీత దేశానికి కావాలి. అలాంటి గీత ఇక కురుక్షేత్రంలో కాక, కృషిక్షేత్రంలో తయారవుతుంది. ఆ గీత వల్ల ఒక కురు (వంశం) అంతరించింది. ఈ గీత వల్ల మరో కురు (కార్యశీలత) మంత్రం ఉదయిస్తుంది. అప్పుడే ‘సుజలాం సుఫలాం శస్యశ్యామలాం’ అనే మన జాతీయగీత సార్థకమవుతుంది!
రానున్న తరాలు ఇలా అడుగుతాయి -
‘ధర్మక్షేత్రే కృషిక్షేత్రే సమవేతాశ్చికీర్షవః
మామకాః పూర్వజాశ్చైవ కిమకుర్వత భారతే?’
(ధర్మక్షేత్రమైన భారత దేశ కృషి క్షేత్రంలో కర్మణ్య భావంతో వచ్చి చేరిన మా వాళ్లు మా పూర్వీకులు ఏమి చేశారు? ).
తెలుగు అనువాదం
పురాణ ప్రలాపం (ఆచారాలు - ఆక్షేపణలు)
No comments:
Post a Comment