రామాయణం--పురాణ ప్రలాపం (ఆచారాలు - ఆక్షేపణలు
Posted by
innaiah
on Thursday, October 16, 2014
రామాయణం
వికటకవి చిన్నాన్న రామనవమి ఫలహారానికి ఎండు ద్రాక్ష శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు.
నేనన్నాను - చిన్నాన్నా. ఈ రోజు రాత్రి మైదానంలో రామకథ ఉంది. వస్తారా ?
చిన్నాన్న - ఏమిటి ఈ రోజు ఘట్టం ?
నేను - ఎందుకు చిన్నాన్నా? నీతి బద్ధుడు, పురుషోత్తముడు, అయిన రాముడు ఒకదాన్ని మించి ఒకటి ఎన్నో ఆదర్శాలు చూపాడు కదా!
చిన్నాన్న - అవును, చూపించకపోవడానికే, చూపించాడు. అబలను ఎలా దుఃఖాల పాలు చేయాలి? సతి, సాధ్వి అయిన భార్యను ఇంట్లో నుండి ఎలా వెళ్ళగొట్టాలి? ఏ ఆడదాని ముక్కైనా కోసేసుకో. ఏ ఆడదాని పైనైనా బాణం వేయి. ఒక రకంగా చూస్తే స్త్రీని ఏడ్పించడంతోనే ఆయన వీరత్వం మొదలయింది. దానితోనే ముగిసింది కూడా.
నేను - చిన్నాన్నా, భగవంతుడు మనిషి అవతారమెత్తి ఈ లీలలన్నీ చేశాడు.
చిన్నాన్న - కాఠిన్యం లేకుండా లీల చేేయడానికి వీల్లేదా? అయినా నిజానికి తప్పంతా ఆయనదే అనడానికి వీల్లేదు. మొదట్లోనే ఆయనకు విశ్వామిత్రుడు లాంటి గురువు దొరికాడు. ఆయన తాటకవధతో విద్యాభ్యాసం చేయించాడు. అలాకాకపోతే రాముని మొదటి బాణం ఎక్కడైనా స్త్రీ పైకి వెళ్ళేదా? కానీ విశ్వామిత్రునివి అన్నీ విపరీత చేష్టలే. ఆయన తన పేరులోని ‘అమిత్ర’ పదాన్ని (విశ్వ + అమిత్ర) ‘మిత్ర’గా రుజువు చేయడానికి వ్యాకరణ నియమాన్నే మార్చేశాడు! రాజర్షి నుండి బ్రహ్మర్షి కావడానికి వర్ణ వ్యవస్థ నియమాన్నే తారుమారు చేసేశాడు. వశిష్ఠునితో పోటీ పడి నీతి-నియమాలను కర్మనాశా నదిలో ముంచేశాడు. అలాంటప్పుడు రామునికి ఏం విద్య నేర్పగలడు? ‘’స్వయమసిద్ధః కథం పరాన్ సాధయతి… (తానే పొందలేనప్పుడు సిద్ధిని ఇతరులకు ఎలా ప్రాప్తింపచేస్తాడు’’)
నేను - చిన్నాన్నా, రామచంద్రుడు న్యాయం యొక్క ఆదర్శాన్ని చూపెట్టి వెళ్ళాడు. న్యాయపాలన కోసం సీతలాంటి భార్యను అడవులకు పంపడానికి కూడా వెెనకాడలేదు.
చిన్నాన్న - అలా కాదబ్బాయ్, వాళ్ళ వంశానికది పరిపాటే, తండ్రి ఈయనకు వనవాసం ఇచ్చాడు. ఈయన భార్యకిచ్చాడు. నీవు న్యాయం, న్యాయం అంటున్నావు. న్యాయం అంటే, ఎవడో ఏదో అన్నాడని ఎవరినైనా ఉరికంబమెక్కించడమేనా? న్యాయమే చేయదలచుకుంటే వాది. ప్రతివాది ఇద్దరినీ రాజాస్థానంలోకి రప్పించవలసింది. రెండు పక్షాల వాజ్ఞ్మూలాలు విని నిష్పక్షపాతంగా నిర్ణయిం చేయవలసింద! అదంతా ఏమీ చేయలేదు. గప్ చిప్ గా సీతను అరణ్యానికి పంపేశాడు. ఇది ఎక్కడి ధర్మం, ఎక్కడి ఆదర్శం? ఒక సాధారణ పౌరునికి ఉండే అధికారం కూడా మహారాణి సీతకు లేకపోయింది?
నేను - కానీ రామునికి ప్రజారంజన అనే ఆదర్శం చూపవలసిన అవసరం ఉంది..
చిన్నాన్న - కాదు, అలా కానే కాదు. సీతను అడవుల పాలు చేయమని అయోధ్య ప్రజలు ఎన్నడూ కోరలేదు. అందువల్లనే రాత్రికి రాత్రే రథం తరలించడం జరిగింది. ఇక లక్ష్మణుడు అన్నింటికీ తయార! శూర్పణక ముక్కు కోయమంటే కత్తి తీసుకొని రెడీ! సీతను అడవిలో వదిలిపెట్టి రమ్మంటే రథంతోపాటు తయారు! తెల్లవారి ప్రజలకు విషయం తెలియగానే అయోధ్య అంతటా హాహాకారం వ్యాపించింది. కానీ, రాజు అయిన రాముడు తన పట్టుదల ముందు ప్రజల ప్రార్థనలు వినిందెప్పుడు? తన వనవాస విషయంలో అయినా ప్రజల ఏ మాట విన్నాడని సీత వనవాస విషయంలో వింటాడు?
నేను - చిన్నాన్నా, తండ్రి మాటను పాలించడానికి ఆయన వనవాసానికి వెళ్ళాడు.
చిన్నాన్న - కొంచెం తర్క శాస్త్రం ఉపయోగించు. వనవాసం అంటే ఏమిటి? ”సర్వేషు వనేషు వాసః” (అన్ని వనాల్లో నివాసం) లేదా “కస్మింశ్చిద్ వనే వాసః” (ఏదో ఒక వనంలో నివాసం) మొదటి అర్థం తీసుకుంటే ఆయన అలా చేయలేదు. చేయలేడు కూడా. ఇక రెండవ అర్థం తీసుకుంటే అయోధ్యకు దగ్గరలోనే ఏదో ఒక అడవిలో ఉండవలసింది లేదా చిత్రకూటంలోనే పధ్నాలుగేండ్లు గడపవలసింది! అలా చేసినా తండ్రి మాట పాలించడం జరిగేది. అలా కాక వేల మైళ్ళు తిరగవలసిన పనేమిటి? అది కూడా కాలి నడకన, సుకుమారి సీతను వెంట పెట్టుకొని! ఈ మాటే మిథలావాసి, నైయాయికుడు (న్యాయదర్శన పండితుడు గౌతముడు) అడిగినప్పుడు రాముడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. విసుక్కొని అన్నాడు -
“యః పఠేత్ గౌతమీం విద్యాం శృగాలీ యోనిమాప్నుయాత్!”
(గౌతముని విద్య (తర్కశాస్త్రం) చదివినవాడు నక్కైపుడతాడు!)
ఇది ఎక్కడి జవాబు? శాస్త్ర చర్చ చేయడం, నక్కై మొరగడం రెండూ ఒకటేనా? ఆయన మిథిలావాసుల న్యాయశాస్త్రం చదివి ఉంటే ఈ అన్యాయం చేసేవాడు కాదు.
చిన్నాన్న కొబ్బరి ముక్కలు కోస్తూ మళ్లీ ఇలా అన్నాడు -- ప్రజలు ఏక కంఠంతో సీతను రాజ్యం నుండి బహిష్కరించమని అన్నారే అనుకో, అప్పుడు రాముని కర్తవ్యమేమిటి? మహారాణి నిర్దోషి అనీ, అగ్ని పరీక్షలో ఉత్తీర్ణురాలయిందనీ, ఆయనకు తెలిసినప్పుడు ప్రపంచం ఏమంటే ఏం? తన న్యాయం పైన గట్టిగా నిలబడి ఉండాలి కదా? ప్రజలు తిరుగుబాటు చేస్తారనే అనుమానం ఉంటే మళ్ళీ భరతుణ్ణి సింహాసనం పైన కూర్చోబెట్టి భార్యతో సహా అడవి మార్గం పట్టవలసింది! అప్పుడు అది ఆదర్శ పరిపాలన అనిపించుకునేది. కానీ, రాజు అయిన రాముడు కేవలం రాజ్యాన్నిఅర్థం చేసుకున్నాడు కానీ, ప్రేమను అర్థం చేసుకోలేదు. మహారాణి సీత తన పత్నీ ధర్మం ఎదుట ప్రపంచ సామ్రాజ్యాన్ని తుచ్ఛంగా భావించేది. కానీ రామరాజు తన పతిధర్మం కోసం అయోధ్య సింహాసనాన్ని వదులుకోలేకపోయాడు. ఒక ఇంగ్లాండు రాజు (అష్టమ ఎడ్వర్డ్) తను ప్రేమించిన స్త్రీ (సింప్సన్)ని పెళ్లి చేసుకోవడం కోసం సింహాసనాన్ని వదులుకున్నాడు. ఆయన చేసినంత త్యాగం కూడా సతీ శిరోమణి సీతకోసం మీ రాముడు చేయలేకపోయాడు!
నేను - చిన్నాన్నా, సీతావనవాసం వల్ల మీకు చాలా బాధ కలిగినట్లుంది.
చిన్నాన్న - ఎందుకు కలగదు? సీత జీవితమంతా దుఃఖమే. పాపం సుఖపడే రోజులు ఎప్పుడూ రాలేదు. మొదట భర్తతో పాటు అడవుల్లో ఎక్కడెక్కడో తిరిగింది. తర్వాత మహలులో ఉండే రోజులు రాగానే వెళ్లగొట్టబడింది. అడవిలో మాత్రం “అయ్యో సీత! అయ్యో సీత!” అంటూ ఆమె కోసం భూమి, ఆకాశం ఏకం చేశాడు. సముద్రంపైన వారధి కట్టాడు. ఆ సీతే తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో ఉండలేకపోయింది! అందువల్లనే మిథిలావాసులు తమ ఆడపిల్లలకు పడమరవైపు సంబంధం చేయకూడదంటారు!
చిన్నాన్న కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కొద్దిసేపు క్షోభపడి అన్నాడు - సీత వంటి దేవేరి పట్ల ఇంత నిర్దయా? త్రికరణ శుద్ధిగా రాముని సేవలో లీనమై ఉంది. ఆయన అడుగుజాడలో నడిచింది. ఎలాంటి దుర్గమారణ్యాలలో తిరిగింది? ఆయన సంతృప్తికోసమే అగ్గిలో కూడా దూకింది. అగ్నిలో ప్రవేశించే ముందు ఆమె ఇలా అంది -
“త్రికరణ శుద్ధిగా రఘువీరుడు రాముణ్ణే నేను ఎల్లవేళలా ఆరాధిస్తూ ఉండి ఉంటే, అన్నీ తెలిసిన అగ్నిదేవుడు నాకోసం చందనంతో సమానంగా సీతలమవుగాక” (తులసీ రామాయణం) అలాగే జరిగింది కూడా. అగ్నిజ్వాల చందనశీతలమైపోయింది!
అగ్నిలో శుద్ధమైన బంగారం లాగా ప్రకాశిస్తూ ఆమె బయటికి వచ్చేసింది. అయినా, సర్వశ్రేష్ఠురాలైన ఆ సతి పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించారు. ఎనిమిదవ నెలలో ఆమె ఇంట్లో నుండి వెళ్లగొట్టబడింది. ఈ క్రూరత్వానికి జే కొట్టాలి. సీత మిథిలలో పుట్టిన కన్య. విసుగుతో ‘ఇస్స్’ అనే రకం కాదు. అందుకే కదా! మరో ప్రాంతపు ఆడది అయి వుంటే రామునికి తన సత్తా చూపించేది! అరే, నేను ఒక మాట అడుగుతాను. సంబంధం తెంచుకోవాలనే అనుకుంటే సీతను తండ్రి ఇంటికి జనకపురికి పంపవచ్చుకదా! అలాంటి ఘోరారణ్యంలోకి ఎందుకు పంపాడు? ఈ భూమిపైన న్యాయం లభిస్తుందనే నమ్మకం లేకపోవడంవల్లనే పాపం ఆమె పాతాళంలో ప్రవేశించింది. ఏ మట్టి గర్భం నుండి జన్మించిందో, ఆ మట్టిలోనే మళ్ళీ లీనమై పోయింది. ప్రపంచంలోనే అత్యుత్తమురాలైన సతి జీవితం ఇంత బాధాకరంగా ముగియాలా? అందుకే గదా, భూమి బద్దలయింది.
ఆయన్ను ఊరడించేందుకు నేనన్నాను - చిన్నాన్నాఈ విషాదానికంతా మూల ఆ చాకలివాడు!
చిన్నాన్న కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన అన్నాడు నేను నిన్నొకటి అడుగుతాను చెప్పు. ఎవరో చాకలి వాడు అలిగి గాడిదపై నుండి కిందపడితే నేను మీ పిన్నమ్మను ఇంట్లో నుండి వెళ్ళగొడతానా అయినా రాముడు ఎక్కువ కాలం గడిపింది అలాంటివాళ్ళతోనే కదా! నిషాదుడు, కేవటుడు, భిల్లిని, గద్ద, ఎలుగుబంటి, కోతి - వీరి మధ్యనే గదా ఉన్నాడు! మూర్ఖపు దాసి మాటలకు తండ్రి కొడుకుకు వనవాసం ఇచ్చాడు. ఈయన మతిలేని చాకలివాని మాటలకు భార్యకు వనవాసం ఇచ్చాడు. వాళ్ళ ఆస్థానంలో చిన్న వాళ్ళదే పెత్తనం. ఇంట్లో మంథర, బయట దుర్ముఖుడు! (రాముని గూఢచారి).
నేను - చిన్నాన్నా, అది నీతిని పాలించడం కోసం ….
చిన్నాన్న - నీతి కాదు, అవినీతి అను. నీతి ఆదర్శమే చూపదలచుకుంటే మరి వాలిని ఆ విధంగా చెట్టు చాటున దాక్కొని ఎందుకు చంపాడు? ఎదురెదురుగా యుద్ధంచేసి చంపవలసింది? అప్పుడు .. రఘువంశీయులు యుద్ధంలో యమునికి కుడా భయపడరు! అనే ప్రతిజ్ఞ ఎక్కడికి పోయింది? అందుకే వాలి వ్యంగ్యంగా అననే అన్నాడు - “మహాత్మా” ధర్మం కోసం అవతరించావు. కానీ, నన్ను మాత్రం వ్యాధునిలాగా (పొంచి ఉండి) చంపావు. (తులసీ రామాయణం).
ఒకవేళ వాలి చేసిన అవినీతిని శిక్షించదలచుకొని ఉంటే, అదే అవినీతి చేసిన సుగ్రీవుణ్ణి ఎందుకు శిక్షించలేదు. విభీషణుణ్ణి ఎందుకు చంపలేదు? రామాయణ రచయితకు కూడా ఈ తప్పిదం స్వీకరించవలసి వచ్చింది. “ఏ పాపానికైతే (సోదరుడు సుగ్రీవుని భార్య తారను కైవసం చేసుకున్నందుకు” వ్యాధుని లాగా వాలిని చంపాడో అదే పాపం తర్వాత వాలి భార్యను తనదానిగా చేసుకుని సుగ్రీవుడు చేశాడు. ఆ దుశ్చేష్టే (రావణ వధానంతరం మండోదరిని కైవసం చేసుకొని ) విభీషణుడు కూడా చేశాడు. కాని రాముడు స్వప్నంలో కూడా వీటిని గురించి ఆలోచించలేదు! (తులసీ రామాయణం) చివరకు మరణదండన ఇచ్చింది ఎవరికి? పాపం, సాత్త్విక వృత్తితో తపస్సు చేసుకుంటూ ఉండిన శంబూకునికి!
నేను - కానీ నేను నీతిని పాటించే పురుషోత్తముడు ….
చిన్నాన్నా - నీవు నీతిని పాటించే పురుషోత్తముడవు, కానీ నాకు మాత్రం ఆయనలో తొందరపాటే కనిపిస్తుంది. పిల్లవాడిలాగా బంగారు జింక వెంట ఎందుకు పరిగెత్తాడు? సీతా వియోగంలో చెట్లూ - పుట్టలూ పట్టుకొని ఎందుకు విలపించాడు? సుగ్రీవునితో అంత గాఢమైన స్నేహం ఉండి కూడా సీతను వెతికించడంలో కొంచెం ఆలస్యం అయినందుకు పాపం అతని పైకి ధనుర్బాణాలు తీసుకొని వెంటనే తయారయ్యాడు! సముద్రుని పూజించడానికి ఎంతోసేపు పట్టదు. అతనిపైకి బాణం ఎక్కుపెట్టడానికీ ఎంతోసేపు పట్టదు! ఇక లక్ష్మణునికి శక్తి బాణం తలిగినప్పుడు యుద్ధభూమిలో అయ్యో! అని ఘోరంగా విలపించాడు. ఇలా ధీరత్వం కోల్పోవడం వీరులకు శోభిస్తుందా?
చిన్నాన్న బాదాం పప్పులు పగల గొడుతూ మళ్ళీ ఇలా అన్నాడు -- కానీ, బాగా ఆలోచించి చూస్తే రాముని తప్పేమీ లేదనిపిస్తుంది. ఆయన తండ్రి దశరథుడే తొందరపాటు మనిషి, వేటకు వెళ్ళాడు. నది ఒడ్డున శబ్దం విన్నాడు. వెంటనే బాణం వదిలాడు. అక్కడ ఎవరైనా మనిషి కూడా ఉండవచ్చు కదా, అని ఆలోచించలేదు. పాపం శ్రవణ కుమారుణ్ణి చంపేశాడు. అతని గుడ్డి తండ్రి పుత్రవియోగంతో ప్రాణాలు వదిలాడు. దాని ఫలితంగా తాను కూడా పుత్ర వియోగంతో చనిపోయాడు. అరే, ఇద్దరు పట్టమహిషులుండగా ముసలితనంలో మూడో పెళ్ళి చేసుకోవాలనే సరదా ఎందుకు పుట్టింది? ఇక “వృద్ధస్య తరుణీ భార్యా ప్రాణేభ్యోపి గరీయసీ” (వృద్ధునికి యువతి అయిన భార్య ప్రాణాలకంటే ఎక్కువ ప్రియంగా ఉంటుంది) కైకేయి మాయలో ఎలా పడి పోయాడంటే యుద్ధానికి వెళ్ళినా రథంలో ఆమెను పక్కన కూర్చోబెట్టుకొనే వెళ్ళేవాడు! ఆ రథం కూడా ఎలాంటిది? మాంచి టైములో విరిగిపోయింది! పేరుకు దశరథుడు! కానీ ఒక్క రథం కూడా పనికి వచ్చేది లేదు! కాకపోతే కైకేయికి చక్రంలో తన మణికట్టు ఎందుకు అడ్డం పెట్టవలసి వచ్చేది? మణికట్టు కూడా మహాగొప్పదే! ఇరుసులో పడి కూడా విరగలేదు! అందువల్లనే కదా, ఆమె హృదయం కూడా అంత కఠినంగావుంది! రాణి ప్రతాపం వల్ల యుద్ధంలో ముసలిరాజు ప్రాణాలు ఎలాగో నిలిచాయి. ఇక ఏమీ ఆలోచించకుండా భార్యకు మాట ఇచ్చేశాడు - ఏమి కోరితే అది ఇస్తానని. ఆకాశంలోని నక్షత్రం తెచ్చి ఇమ్మని అడిగితే అప్పుడేమవుతుంది? అని ఆలోచించేంత బుద్ధి లేకపోయింది. తర్వాత ఆమె రాముని వనవాసం కోరినప్పుడు విలవిలలాడిపోయాడు. అయినా కైకేయి కొంత మర్యాద పాటించిందనే చెప్పాలి. ఒకవేళ ఆయన గుండెలు తీసి ఇమ్మని అడిగి ఉంటే, సత్యపాలకుడు దశరథ మహారాజు ఏం చేసేవాడు? అంతేకాదు, ఒకసారి మాట ఇచ్చిన తర్వాత గుండెలు ఎందుకు బాదుకున్నాడు? పద్నాలుగేళ్ళ తర్వాత కొడుకు మళ్ళీ రాజ్యమేలే వాడే కదా! అంతవరకు ఓపిగ్గా ఎదురు చూడవలసింది పుత్రప్రేమ అంత ఎక్కువగా ఉండి ఉంటే తాను కూడా రాముని వెంట వెళ్లవలసింది. అదంతా ఏమీ చేయలేదు. “హా రామా.. హా రామా!” అంటూ ప్రాణాలు విడిచాడు. క్షత్రియుని హృదయం ఎక్కడైనా ఇంత బలహీనంగా ఉంటుందా?
చిన్నాన్న ఎవరి వెంట పడితే వారి అంతు తేల్చేవరకు వదలడు. ఇప్పుడు దశరథుని వెంట పడ్డాడు. అని మనసులో అనుకొని ఇలా అన్నాను - చిన్నాన్నా, అందరూ రామాయణంలోని పాత్రల నుండి గుణపాఠం నేర్చుకుంటారు….
చిన్నాన్న - గుణపాఠం నేను కూడా నేర్చుకుంటాను. చూడకుండా బాణం వలద కూడదు. ఆలోచించకుండా మాట ఇవ్వకూడదు. మాట ఇచ్చిన తర్వాత గుండెలు బాదుకోకూడదు.
నేను - చిన్నాన్నా, మీరు కేవలం దోషాలే చూస్తున్నారు.
చిన్నాన్న - అయితే గుణాలు నీవే చూపించు మరి!
నేను - దశరథ మహారాజు ఎంత సత్యసంధుడో చూడండి…
చిన్నాన్న - అవును, ఎంత సత్యసంధుడంటే నకిలీ శ్రవణ కుమారుడై గుడ్డి తండ్రిని మభ్యపెట్టడానికి ప్రయత్నించాడు!
నేను - రాముడు ఎలాంటి పితృభక్తుడు …
చిన్నాన్న - అవును, తండ్రి మరణ వార్త విని కూడా తిరిగి రాలేదు! జ్యేష్ఠ పుత్రుడై కూడా తండ్రి శ్రాద్ధం చేయలేదు! నేరుగా దక్షిణ దిశగా సాగిపోయాడు!
నేను - లక్ష్మణుడు ఎంత భ్రాతృభక్తుడు…
చిన్నాన్న - అవును, ఒక సోదరుని (రాముని) తరఫునుండి మరో సోదరునిపైకి (భరతుని పైకి) (ధనుర్భాణాలు ఎక్కుపెట్టాడు.
నేను - భరతుడు ఎంత గొప్ప త్యాగి …
చిన్నాన్న - అవును, పద్నాలుగేండ్లు అన్న ఏమైనాడో పట్టించుకోలేదు. రాజధానిలో తీరిక దొరికినప్పుడు కదా, అడవిలోకి వెళ్ళి తెలుసుకుంటాడు? అరే, అయోధ్య నుండి సైన్యం సన్నద్ధం చేసుకొని ఆయన వెళ్ళి ఉంటే రామునికి కోతుల సహాయం ఎందుకు తీసుకోవలసి వచ్చేది?
నేను - హనుమంతుడు ఎలాంటి స్వామిభక్తుడు….
చిన్నాన్న - అవును. మొదటి యజమాని సుగ్రీవుణ్ణి వదిలిపెట్టి రాముని సేవకు అంకితమైపోయాడు.
నేను - విభీషణుడు ఎలాంటి ఆదర్శం. ….
చిన్నాన్న - అవును, ‘ఇంటి గూఢచారి లంకను ధ్వంసం చేస్తాడు’ అనే సామెతకు కారకుడయ్యాడు. ఇలాంటి విభీషణుల నుండి భగవంతుడు దేశాన్ని రక్షించుగాక!
నేను - అయితే మీ దృష్టిలో రామాయణంలో ఒక్కటి కూడా ఆదర్శ పాత్ర లేదా?
చిన్నాన్న - ఎందుకు లేదు? మొత్తం రామాయణంలో నాకు కేవలం ఒకే ఒకపాత్ర ఆదర్శపాత్ర పాత్రగా అనిపిస్తుంది.
నేను - ఎవరు?
చిన్నాన్న - చిరునవ్వు నవ్వుతూ అన్నాడు - రావణుడు!
నేను - మీకెప్పుడూ వేళాకోళమే!
చిన్నాన్న - వేళాకోళం కాదు. రావణుని దోషం ఒక్కటి చెప్పు చూద్దాం!
నేను - మీరు ధన్యులు చిన్నాన్నా! అందరికీ రావణునిలో అన్ని దోషాలు కనిపిస్తూంటే మీకు ఒక్కటి కూడా కనిపించడం లేదా?
చిన్నాన్న - అయితే నీవే చెప్పు మరి.
నేను - సీతను అపహరించి తీసుకెళ్ళాడు….
చిన్నాన్న - అది మీ నీతిమంతునికి, పురుషోత్తమునికి ఎవరి అక్క -చెల్లెలి ముక్కు-చెవులు కోయరాదనీ, పరదేశంలో ఉంటూ ఎవరితోనూ వైరం పెట్టుకోరాదనీ, ఎండమావుల వెంట పరిగెత్తరాదనీ, ఏ స్త్రీనీ అవమానించరాదనీ గుణపాఠం నేర్పడానికి. చూడు, లంకకు తీసుకెళ్ళి కూడా రావణుడు సీతను అవమానించలేదు. రాణివాసంలోకి తీసుకెళ్ళలేదు. అశోకవాటికలో ఉంచాడు. అందరూ రాక్షసుడనవచ్చు. కానీ, అంత సభ్యతతో కూడిన ప్రవర్తన మనుషుల్లో అరుదుగానే కనిపిస్తుంది.
నేను - చిన్నాన్నా, మీ మాటలు ఎప్పుడూ లోక విశ్వాసానికి విరుద్ధంగానే ఉంటాయి. అంత అత్యాచారం చేసిన వాని తరఫునుండి వాదిస్తూ కరుణా సముద్రుడు సీతాపతిని …
చిన్నాన్న - కఠిన హృదయుడు సీతాపతి అను. విదేహ రాజ కన్య అయోధ్య వెళ్ళింది. దాని ఫలితం ఏమైందీ? మళ్ళీ ఆమె పుట్టింటి ముఖం చూడలేకపోయింది. అందువల్లనే కదా, పడమరవాళ్ళను మేము దూరంగా ఉంచుతాము!
నేను - చిన్నాన్నా, సీత అత్తగారింటి వాళ్ళంటే మీకు పడదు. ఒకవేళ రాముడు మీకు కనిపించి ఉంటే ఏమనేవారు? నమస్కారమైనా చేసేవారా లేదా?
చిన్నాన్న పల్లీల పప్పు వలుస్తూ అన్నాడు -- నమస్కారం ఎలా చేస్తాను? నేను బ్రాహ్మణుణ్ణి, ఆయన క్షత్రియుడు. ఆఁ, ఆశీర్వాదం మాత్రం ఇచ్చేవాణ్ణి, “సద్బుద్ధి కలుగుగాక!” ఇక మందు ఎప్పుడైనా రామరాజ్యం అయితే ప్రజలు “ఛీ, ఛీ, రామ రామ” అనేట్లు చేయకండి. ఎవరైనా నాలాంటి బ్రాహ్మణ్ణి మంత్రిగా పెట్టుకోండి” అనేవాణ్ణి.
నేను - చిన్నాన్నా, రామరాజ్యం కదా!
చిన్నాన్న - అవును, తులసీదాసు రాశాడు - “దీనులు, దరిద్రులు, దుఃఖించేవారు, ఎవరూ ఆ రాజ్యంలో లేరు” అని, నేనయితే “పాపం సీత ఒక్కతే దౌర్భాగ్యురాలు” అని దానికి జోడించేవాణ్ణి. మన గ్రామరాజ్యం కూడా రామరాజ్యంలాగానే నడవడం మొదలు పెడితే ఎందరు సీతలు మట్టిలో కలసిపోతారో చెప్పలేము.
నేను - చిన్నాన్నా, మీరు శ్రీరామనవమి వ్రతం పాటిస్తారు. మనసులో భక్తి ఉండే ఉంటుంది.
చిన్నాన్న - అది సీత కోసం. సీత లేకపోతే రాముడు కేవలం “రఘుపతి రాఘవ రాజారాం” అనిపించుకునేవాడు. “పతతి పావన సీతారామ్” అనిపించుకునేవాడు కాదు. ఏ ఏ పనులు ఆయన చేశాడో క్షత్రియ రాజులు అవన్నీ చేయనే చేస్తారు. కేవలం ఒక్క విషయంలో ఆయన శ్రేష్ఠత పొందాడు. మరో భార్యను తెచ్చుకోలేదు. జానకి బంగారు ప్రతిమ చేయించుకొని శేష జీవితం గడిపాడు. ఒక్క దీని పైన్నే ఆయన అపరాధాలన్నీ క్షమించేస్తాను. రాముని గొప్పతనం సీత వల్లనే. అందువల్లనే ముందు సీత, ఆ తర్వాత రాముడు. తులసీదాసు ఇలా అంటాడు - “ఈ సృష్టినంతా సీతారాముల మయంగా భావించి రెండు చేతులు జోడించి వారికి నమస్కరిస్తాను” అని. మహర్షి వాల్మీకి కూడా అలాగే అంటాడు -- “సీతాయాః పతయే నమః”
నేను - చిన్నాన్నా, మీకు సీత పట్ల అంత శ్రద్ధా భక్తులున్నాయికదా, అలాంటప్పుడు రాముణ్ణి ఎందుకిలా విమర్శిస్తారు? ఆయన తండ్రిని కూడా మీరు వదిలిపెట్టలేదు.
చిన్నాన్న నవ్వి అన్నాడు - అరే, ఇంత మాత్రం కూడా అర్థం కాదా నీకు! నేను ఆయన అత్తవారింటి మనిషిని కదా! అత్తవారింటి మంగలి తిట్టినా బాగానే వుంటుంది. మరి నేను బ్రాహ్మణుణ్ణి! వేరే ఎవరికైనా ఇలా మాట్లాడే సాహసం ఉంటుందా? మిథిలా వాసులు మాత్రం అయోధ్య వాళ్ళను దూషిస్తూనే ఉంటారు. మిథిలావాసి నోరు మూయించే శక్తి భగవంతునికి కూడా లేదు!
మైథిలీ మూలం తెలుగు అనువాదం
‘ఖట్టర్ కాకా’ పురాణ ప్రలాపం (ఆచారాలు - ఆక్షేపణలు)
హరిమోహన్ ఝా జె. లక్ష్మీరెడ్డి
No comments:
Post a Comment