అధికార వికేంద్రీకరణ-ఎమ్.ఎన్.రాయ్
Posted by
innaiah
on Saturday, October 4, 2014
రాజకీయాలు -అధికారం- పార్టీలు
అధికార వికేంద్రీకరణ
ఎమ్.ఎన్.రాయ్
ఆధునిక ప్రజాస్వామ్యాలన్నిటిలో అధికారం రాజ్యం చేతుల్లో కేంద్రీకృతం కావడం ప్రధాన సమస్యగా ఉన్నది. ఐదారు దశాబ్దాలుగా ఈ వికేంద్రీకరణ సమస్యవిపరీతంగా పెరిగిపోయింది. అధికారం అంటే ఏమిటి? పనులు చేసే శక్తి ఉండటమే అధికారం అని నిర్వచించవచ్చు. ఆ విధంగా మానవ సమాజంలో అధికారానికి ఎప్పుడూ చోటు ఉంటుంది. కాని వికేంద్రీకరణ విపరీతంగా జరిగి సమాజం యావత్తూ నిస్సహాయమైనప్పుడు అధికార ఉపయోగానికి గ్రహణం పట్టి దుర్వినియోగం అయింది. రాజ్యం అనే భావన కూడా నిర్వచింపవలసి ఉన్నది. రాజ్యం చేసే పనులతో ముడిపడి అధికారం ఉన్నది. ఇటీవల రాజకీయ సిద్ధాంత కర్తలు రాజ్యం అంటే వత్తిడి చేసే సాధనగా నిర్వచించారు. ఒక వర్గం లేదా సమాజంలో ఒక భాగం ఇతరుల మీద ఆధిపత్యం వహించటానికి వీలుగా రాజ్యం అనే సాధనగా నిర్వచించారు. ఒక వర్గం లేదా సమాజంలో ఒక భాగం ఇతరుల మీద ఆధిపత్యం వహించటానికి వీలుగా రాజ్యం అనే సాధన సృష్టించుకున్నారన్నారు. ఈ నిర్వచనం ఫలితంగా రాజ్యం ఉన్నంతవరకూ న్యాయమైన సాంఘిక వ్యవస్థ అసాధ్యమన్నమాట. అందువల్ల తమ ఆలోచన పొందికగా ఉండే నిమిత్తం, ఆదర్శ సమాజంలో రాజ్యం ఉండదని ఈ రాజకీయ సిద్ధాంతపరులు నిర్ణయానికి వచ్చారు. అసలు రాజ్య అవసరమే లేదనడం అరాచక ధోరణి, కమ్యూనిస్టులు చెప్పే ఊహాలోకానికి ఇదొక అతిశయోక్తి రూపం.
రాజ్యం లేకుండా సమాజం అసంభవమనేది స్పష్టమే. కమ్యూనిస్టు సాంఘిక వ్యవస్థలో రాజకీయ ఆర్థికాధికారం బాగా కేంద్రీకృతం కావటం కొట్టొచ్చినట్లు కనిపించే లక్షణం. ఈ రెండిటిలో ఒక దాన్ని మరొకటి ఎలా రద్దు చేస్తుందో చెప్పటం అనూహ్యం. కమ్యూనిస్టు సమాజాన్ని నిర్మించటానికి ముందుగా, రాజకీయాధికారాన్ని బాగా కేంద్రీకరించాలి. భవిష్యత్తును గురించి అవాస్తవిక స్వప్నభావాలు ప్రపంచానుభవంతో రుజువు చేయటానికి వీలులేని సిద్ధాంతాల నుంచే రాబట్టారు. సమాజం వర్గాలుగా విభజించి ఉన్నదన్నారు. వర్గ పోరాట చరిత్రే నాగరికత చరిత్ర అన్నారు.
భిన్న ఆసక్తులు గల వర్గాలుగా సమాజం విభజించి ఉండటం చారిత్రక సత్యం. కాని ఐక్యపరిచే శక్తులు కూడా సమాజంలోనే ఇమిడి ఉన్నాయనేది కూడా అంతే వాస్తవం. కేంద్రం నుంచి దూరంగా పోవాలని ఉన్న ధోరణిని, కేంద్రానికి చేరువగా ఉండే ధోరణి ఎదుర్కొంటూ ఉన్నది. సాంఘిక పరిణామ చరిత్రలో ఈ రెండు ధోరణులూ తులనాత్మకంగా ఉండటం వల్ల సుస్థిరత చేకూరింది. పొందిక లేకపోవటం, అపస్వరాలు అన్నీ నియంతృత్వాలని స్థాపించటానికి లేదా నిరంకుశ ప్రభుత్వాలకు లేదా సమాజిక విచ్ఛిన్నతకు దారి తీశాయి.
సమాజంలో పొందిక లక్షణాలు లేకపోతే మానవజాతి ఆటవిక నియమాలతో పరిపాలించబడేదే. సమాజ చరిత్ర అంతా పరిశీలిస్తే, కలిపి ఉంచే శక్తి ఎప్పుడూ పనిచేస్తూనే ఉన్నది. లేనట్లయితే నాగరికతా చరిత్రే ఉండేది కాదు. ప్రాచీన నాగరికతలు విచ్ఛిన్నం కావడానికి, బలీయమైన శక్తులు కొన్ని కలసి ఉండే ధోరణికి వ్యతిరేకంగా, సాంఘిక సమన్వయానికి భిన్నంగా పనిచేయడమే కారణం. మధ్య యుగాలలోనూ, ఆధునిక చరిత్రలో కూడా తరచు యుద్ధాలూ, విప్లవాలూ సంభవించాయి. సమాజ పరిణామం ఉన్నత స్థాయికి చేరుకోగా నాగరికత నిలబడింది. అప్పుడప్పుడు వచ్చే వడిదుడుకుల నుంచి తట్టుకొని, సంఘర్షణ శక్తుల మధ్య తులనాత్మక స్థితిని సమకూర్చుకున్నది.
ఆదర్శవంతమైన రాజ్యంలో పరస్పర విరుద్ధ శక్తులు అదృశ్యం కావటం, సమాజం ఏక జాతిగా రూపొందడం ఊహించవచ్చు. అప్పుడు ఒక వర్గాన్ని మరొక వర్గం పెత్తనం చేసే పరిస్థితి ఉండదు. వర్గాలు లేకపోయినా సమాజం ఉంటుంది. ఆదిమ సమాజ స్థితి పోయి, సంక్లిష్టమైన వ్యవస్థగా, విభిన్న కార్యకలాపాలతో సమాజం ఉంటుంది. అటువంటి సమాజానికి కేంద్ర వ్యవస్థ ఉండక తప్పదు. అయితే పెనుభూతం వంటి రాజ్యంగా కేంద్ర వ్యవస్థ ఉండనక్కరలేదు. సమన్వయపరచే సాంఘిక సంస్థగా, వివిధ సంస్థల మధ్య పొందికను ఏర్పరచేదిగా మాత్రమే రాజ్యం ఉండాలి.
ఆదిమ సమాజాలు మొదట ఏర్పడినప్పుడు గాక ఉత్తరోత్తరా రాజకీయంగా సంఘటితపడ్డాయి. తమను కాపాడుకోవటానికీ, మనుగడ పోరాటం కోసం ఇవి సంఘటితం కావటం జరిగింది. ఈ మధ్యలో క్రమంగా మానవాభ్యుదయం వల్ల సమాజ విధులకు కొత్తగా మరికొన్ని వచ్చిచేరి, వృత్తి రీత్యా విభజన ఏర్పడింది. కాలానుగుణంగా రాజ్యం వచ్చి భిన్న సామాజిక కార్యకలాపాలను సమన్వయంగా సాగేటట్లు తోడ్పడింది. సమాజం సంక్షేమాన్ని పెంపొందించటానికి రాజ్యం ఉపకరించింది. సమాజం మీద ఉపరితల నిర్మాణంగా రాజ్యం ఏర్పడలేదు. నియంతృత్వ ప్రాధాన్యత కూడా రాజ్యానికి లేదు. ప్రజా పరిపాలనతో ఒక క్రమాన్ని పాటించటానికి, నియమాల నేర్పరచి అమలు పరచటానికి రాజ్యం సృష్టి అయింది. భిన్న సామాజిక కార్యకలాపాలు శాంతియుతంగా కొనసాగటానికే రాజ్యాన్ని ఉద్దేశించారు. ఆర్థిక, విద్యా సాంస్కృతిక సంస్థలన్నీ సమాన స్వతంత్ర ప్రతిపత్తిగల సాంఘిక సంస్థలుగా ఉన్నప్పుడు వాటిలో ఒకటిగా మాత్రమే రాజ్యం ఆవిర్భవించింది.
సమాజ ఆర్థిక జీవనంలో ప్రభుత్వ జోక్యం చేసుకొనే రోజులు ఉండేవి. సమాజానికి కావలసిన అవసరాలను రైతులు, కళాకారులు, వ్యాపారస్తులు తీర్చేవారు. సహజ వనరులను వాడుకోవటానికి మానవులు శ్రమను జోడించేవారు. ఇది వ్యక్తి పరంగానూ, వ్యవస్థాపిత గిల్టుల రూపేణా జరిగేది. విద్యా సాంస్కృతిక రంగాలలో వ్యక్తి స్వేచ్ఛ, సంస్థాగత స్వతంత్ర ప్రతిపత్తీ రాజ్య పరిధిలో ఉండేవే కాదు.
రాజకీయంగా కేంద్రీకృతమైన ఆధునిక సమాజంలో ఆర్థిక సదవకాశాలు సందేహాస్పదాలే. నేడు రాజ్యం పెనుభూతం వలె తయారయింది. అలా కాకుండా పోయే రోజులు మనం మళ్ళా ఊహించవచ్చు. అయితే రాజ్యం లేని సమాజాన్ని, ప్రజా పరిపాలన లేని సమాజాన్ని ఊహించడం లేదు. అటువంటిది కేవలం ఆచరణకు రాని ఆదర్శం మాత్రమే. కాని రాజ్యం యొక్క విధులను కనీస స్థాయికి తగ్గించే మార్గాన్వేషణ జరగాలి. అంటే ప్రజా పరిపాలనకు సాధనగానూ, స్వతంత్ర ప్రతిపత్తి గల సాంఘిక సంస్థల కార్యకలాపాలను సమన్వయపరిచేదిగానూ రాజ్యం ఉండాలన్న మాట.
బహుళత్వంతో కూడిన సమాజాన్ని కోరే సాంఘిక తత్వవేత్తలు ఉన్నారు. ఇందులో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలుంటాయి. రాజ్యం కూడా ఒక సంస్థగా ఉంటుంది. భిన్న కార్యకలాపాలను క్రమబద్ధంగా జరిగేటట్లు చూడటం సమన్వయపరచటం మాత్రమే రాజ్యం కర్తవ్యం. 19వ శతాబ్దపు ఉదారవాదంలో సామాజిక వ్వవస్థకు సంబంధించిన ఈ దృక్పథాన్ని పేర్కొన్నారు. కనీస పాలన చేసే ప్రభుత్వమే ఉత్తమం అన్నారు. అప్పటి నుంచీ, అధికార కేంద్రీకరణ ధోరణి బలపడింది. రాజ్యం వత్తిడి చేసే యంత్రంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇదంతా అధికారం వల్ల కాదు, అధికార కేంద్రీకరణ వల్ల మాత్రమే. ప్రజా స్వామిక రాజకీయ ఆచరణలో వికేంద్రీకరణ ప్రధాన సమస్య అయింది. రాజకీయంగా చూస్తే, ఇది కలవరపాటు చెందవలసిన సమస్య ఏమీ కాదు. ఆర్థిక కేంద్రీకరణ ఎక్కువ కావటంతో రాజ్యాధికారం కూడా బలపడింది. ఆధునిక సమాజంలో ఆర్థిక విధానాన్ని వికేంద్రీకరించవచ్చునా.. దీని ఫలితంగా రాజకీయాధికారాన్ని కూడా వికేంద్రీకరించవచ్చునా? శతాబ్దాలుగా వస్తున్న దానిని ఎలా మారుస్తాము… అని వాదించి తప్పుకుంటే చాలదు. మానవ ప్రతిభ అయిపోయిందని భావిచడం, విధి వశానికి వదిలేసే దృక్పథం మాత్రమే. వివేచనలో తుది పలుకు ఎప్పుడో పలికారనడం కూడా, మానవజాతి ప్రయాణంలో అంతానికి చేరుకున్నదని చెప్పటమే. అంటే, సమాజం విభిన్నం కానున్నదన్న మాట. మానవ ప్రతిభను ఇలా వ్యతిరేకించటం, ఆవిర్భవిస్తున్న, పురోగమిస్తున్న అనంత సృష్టిిని కాదని, బలంగలవారిదే హక్కు అని చెప్పటం చట్టబద్ధమైనదీ, నైతికమైనదని కొందరు భావించారు. అటువంటి ఆటవిక నియమంలో సమాజ పాలన కింద జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోవలసిందే.
అధికార కొట్లాటలో మానవ స్వేచ్ఛను, బలి చేయదలచుకోకపోతే రాజకీయ పార్టీల జోక్యం లేకుండా, రాజకీయాల నాచరించే అవకాశాలను అన్వేషించాలి. రాజకీయ పార్టీలు సాధనగా, కొద్దిమంది చేతులలో నేడు అధికారం కేంద్రీకృతమై కపటపు నెపంతో దుర్వినియోగ పరుస్తున్నారు. కేంద్రీకరణ సాధనగా ఉపకరించేవి అదృశ్యం కావటం అధికార వికేంద్రీకరణకు అవసరం. దీని స్థానే మరొక సాధన రావాలి. ప్రజల సార్వభౌమత్వాన్ని ప్రజలలోనే అన్ని సమయాలలోనూ, ఉంటే హామీ కావాలి.
ప్రజాస్వామ్యాన్ని ఆచరించటానికి రాజకీయ పార్టీలు తప్పనిసరి అని నమ్మినంత కాలం కొద్దిమంది చేతులలో అధికారం కేంద్రీకృతం కావటం కూడా తప్పదు. పార్టీ విధానంలో దయామయమైన నియంతృత్వాన్ని మాత్రమే ఆశించవచ్చు. దీనినే ఆదర్శప్రాయమని చెప్పవచ్చు. కాని ప్రపంచంలో అటువంటిదెన్నడూ లేదు.
అవినీతికి లోనుగాని ప్రజలున్నారు. నేడు రాజకీయాలను ఆచరించే తీరుపట్ల వారు జుగుప్సతో ఉన్నారు. అధికార పోరాటానికి వీరు దూరంగా ఉన్నారు. అత్యుత్తములను కూడా అధికారం చెడగొట్టవచ్చు. అంతమాత్రం చేత వీరు ప్రజా వ్యవహారాల పట్ల ఉదాసీనంగా లేరు. వారు చిన్న విషయాలను ప్రశాంతంగా చేసుకుపోతుంటారు. ఇటువంటి వారి కృషి ఫలితంగానే సమాజంలో నైతిక స్థాయి పూర్తిగా తుడిచిపెట్టుక పోకుండా ఉన్నది. రాజకీయాలు అవినీతి నుంచి దూరం చేసి స్థాయి పెంచాలంటే అధికార తృష్ణ నుంచి విమోచన పొందాలి. రాజకీయాలను ప్రక్షాళితం చేయడానికి అధికారాన్ని సమానంగా పంచుతూ రాజ్యాంగ నిర్మాణం జరగాలి. వ్యక్తికి ప్రధాన స్థానం కల్పించినప్పుడే సరైన ప్రజాస్వామిక పద్ధతి సాధ్యపడుతుంది.
ప్రజా స్వామ్యం అపఖ్యాతిపాలు కావటానికి మోసపూరితమైన ఆచరణ, దోష పూరితమైన సిద్ధాంతం ఒక కారణం. ప్రజా స్వామిక రాజ్యానికి సుస్థిర పునాదులు వేయడానికి వీలు లేకుండా, నేటి ఆచరణ అడ్డు పడటం రెండో కారణం. మూక స్వామ్యంపై ఇదంతా ఆధారపడింది. ఉత్తమ ప్రపంచాన్ని ఊహించేవారు అవినీతి నుంచి రాజకీయాలు విమోచన పొందాలనేవారు ప్రజాస్వామిక సమాజానికి పునాదులు వేసే ప్రయత్నం చేయాలి. స్త్రీలూ, పురుషులూ తమ వ్యక్తిత్వాన్ని గురించి చైతన్యం చూపాలి. తాము చేసే నిర్ణయాలలో తమ శక్తిని గమనించాలి. తాము ఎదుర్కొనే నైతిక, రాజకీయ సమస్యలను విచక్షణతో పరిశీలించాలి. అటువంటప్పుడు, రాజకీయ వాదులు ఉద్వేగాలకూ, ప్రేరణలకూ విజ్ఞప్తి చేసి ఆకర్షించటం సాధ్య పడదు. ఓటర్లలో అధిక సంఖ్యాకులు, ఎన్నికల సమయంలో పార్టీలు చేసే వాగ్దానాలను పరిశీలిస్తే, అవి సరైనవి అవునో కాదో గ్రహించ గలుగుతారు. ప్రజా స్వామ్యాన్ని పునాదులు నుంచి నిర్మించటానికి ప్రజలు తోడ్పడతారు. ఆధునిక ప్రపంచంలో ప్రజా స్వామిక ఆచరణకు ఎదురైన కలవరపాటు తొలగాలంటే ఇదే సరైన మార్గం. పెద్ద రాజ్యాలలో అధిక జనాభా ఉన్నప్పుడు, ప్రత్యక్ష ప్రజా స్వామ్యాన్ని పాటించటం ఎలాగ అనే సమస్య పరిష్కారమవుతుంది. సరైన ప్రజాస్వామ్యమంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యమే. పరోక్ష ప్రజాస్వామ్యమంటే అధికారాన్ని దత్తత చేయటమే. అధికారాన్ని దత్తత ఇస్తే, సార్వభౌమత్వాన్ని స్వాధీనం చేసినట్లే. స్థానికంగా వ్యవస్థాపితమైన ప్రజాస్వామ్యాలపై ఆధారపడితే తప్ప ప్రజా స్వామ్యం వాస్తవం కాదు. నిస్సహాయంగా ఉండే వ్యక్తుల వల్ల ప్రయోజనం లేదు. ప్రజాస్వామ్య రాజ్యానికి పునాదిగా స్థానిక ప్రజాస్వామ్య సంస్థలుండాలి. ప్రజాస్వామ్యాన్నివికేంద్రీకరిస్తే అధికార కేంద్రీకరణకు ఆటంకం ఏర్పడుతుంది. అప్పుడు స్వతంత్ర ప్రతిపత్తిగల సాంఘిక సంస్థల కార్యకలాపాలను సమన్వయీకరించటం వరకే రాజ్యం పరిమితమవుతుంది.
ఈ విధానానికి చాలాకాలం పట్టవచ్చు. సర్వసాధాణంగా ఇదొక అభ్యంతరమైనట్లు చెబుతున్నారు. ఒకసారి నిర్ణయం చేసుకొని కొత్త దారిలో పయనించటం ప్రారంభిస్తే, వాస్తవానికి కనిపించేటంత దూరం లేదని తెలుస్తున్నది. ముందుగా మానవ స్వభావానికి సంబంధించిన సంప్రదాయ భావాన్ని వదలాలి. మానవ స్వభావం దోషపూరితం కాదు, దైవత్వంతో కూడినదీ కాదు. మానవుడు ప్రాయికంగా హేతువాది. అవకాశం వస్తే ప్రతి వ్యక్తీ స్వయంగా ఆలోచించుకోగలడు. మంచి చెడులను నిర్ణయించుకోగలడు. తదనుగుణంగా వర్తించగలడు. వ్యక్తిగా తన స్వభావాన్ని బట్టి వివేచనాత్మకంగా ఆలోచించటం, నైతికంగా ప్రవర్తించటం చేస్తే తప్ప, స్వేచ్ఛాయుత న్యాయ సమ్మతమైన సాంఘిక వ్యవస్థను ఆశించటం వృధా అవుతుంది. ప్రస్తుతానికి సామాన్యులు నిరక్షరాస్యులు కావటం నిజమే. వారు దేశాన్ని పరిపాలించలేకపోవచ్చు. కాని వారి మానాన వారిని వదిలేస్తే, అజ్ఞాని అయిన రైతు సహితం తన వ్యవహారాలను మన ప్రభుత్వం కంటే బాగా నిర్వహించగలడు అనేది వాస్తవం కాదా? సామాన్య ప్రజల ఆలోచనా శక్తిలో అపనమ్మకాన్ని వెల్లడించి, వారి వ్యవహారాలు తాము చూస్తామంటూ అధికారాన్ని చేబట్టటం, దుర్వినియోగ పరచడం, వ్యక్తుల స్వేచ్ఛను అణచటం జరుగుతున్నది.
ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ప్రజల మధ్యకు పోయి హామీలిస్తాయి. వాటిలో సగం కూడా తీర్చలేమని వారికి బాగా తెలుసు. ఓటర్లు అర్థం చేసుకోలేరనీ, కనక మోసంగించవచ్చుననే విషయం వీరికి తెలుసు. ఆ స్థితిని మార్చలేమా? మార్చవచ్చు. ఈ పరిస్థితిని మార్చటమే మొట్టమొదట చేయవలసిన పని, రాజకీయాలలో పాల్గొనదలచినవారి బృహత్తర బాధ్యత ఇదే. అయితే స్వార్థం కోసం మాత్రం కాకూడదు. ఓట్ల కోసమే ప్రజలలోకి వెళ్ళనక్కరలేదు. తెలివిగా వోట్లను వేసేందుకు తోడ్పడటం చాలా ముఖ్యమైన కృషి. అన్ని పార్టీల కార్యక్రమాలను పరిశీలించమని చెప్పాలి. హామీలు సాధించటం సాధ్యమేనా అని చూడటం, ఒకవేళ సాధ్యపడితే అందువల్ల పరిస్థితి మెరుగుపడుతుందేమో గమనించటం - ఇవి ఓటర్లకు చెప్పవలసిన విషయాలు. ఈ కొత్త రాజకీయ ఆచరణకు గాను మానవ స్వభావాన్ని గురించిన భావంలో సమూలంగ మార్పు రావాలి. వివేచనకు విజ్ఞప్తి చేయాలి. మానవుడు హేతువాది అని ముందు నమ్మాలి. సామాన్యుడు స్వయంగా ఆలోచించలేడని నేటి రాజకీయ ఆచరణ సాగుతున్నది. అందుకే అతడు పార్టీలను, రాజకీయ వాదులను అనుసరించాలంటున్నాడు. ప్రజలకూ, పార్టీలకూ, రాజకీయవాదులకూ మధ్య అసహజమైన సంబంధం వల్ల పార్టీ రాజకీయాలకు పునాదులు ఏర్పడినాయి. ప్రజలను స్వయంగా ఆలోచించకుండా పార్టీలు అడ్డుపడుతున్నాయి. రాజకీయాలంటే అధికారం కోసం పెనుగులాట మాత్రమే గాక, అన్నివిధాలైన పోటీలకు రంగస్థలమైనది.
ఇదంతా విషవలయంగా కనిపించవచ్చు. కాని మార్గాంతరం ఉన్నది. రాజకీయ వాదులు అందుకు ఒప్పుకోరు. ఎందుకంటే అంతటితో వారి పని ముగుస్తుంది. వివేచనకు విజ్ఞప్తి చేయటమే మార్గాంతరం. ఆధునిక విజ్ఞానం దారి చూపుతున్నది. మానవ స్వభామంటే నమ్మటం కాదనీ, పరిశీలించటం అనీ, అది వివేచనాత్మకమనీ విజ్ఞానం బోధిస్తున్నది. మానవుడి వివేచనా స్వభావాన్ని పాతాళంలో పాతిపెట్టిన మాట నిజమే. కాని మానవ స్వభావానికి సారం అదే గనక పునరుద్ధరించవచ్చు. కొంతమంది దృఢ విశ్వాసంతో, సాహసంతో ప్రవర్తిస్తే చాలు. వివేచనా, మేథస్సు స్థాయికి రాజకీయాలను తీసుకు రావాలి. వివేచనకు విజ్ఞప్తి చేసినందువల్ల తగిన ప్రతిస్పందన ఉంటుంది. ఊహించిన దానికంటే వేగంగానే కొత్త రాజకీయాలు ఫలిస్తాయి. అయితే విజయానికి కొలమానం అధికారం కాదు. క్రమంగా ఆ దోషం అదృశ్యం కావటమే. అధికార తృష్ణను వదిలేసి. అధికార పోరాటంలో పాల్గోకుండా కొందరైనా ఉండగలిగితే, ప్రజాస్వామ్యానికీ, స్వేచ్ఛకూ సుస్థిర పునాదులు వేసినట్లే. ప్రజల పేరిట పరిపాలిస్తామంటూ ఓట్లు అడగవద్దు. మానవుని హుందాతనం, ఆలోచనా శక్తి సృష్టించే ప్రతిభను, అతడికి జ్ఞాపకం చేస్తే చాలు.
క్రమంగా ఓటర్లు నిశిత పరిశీలకులుగా విచక్షణను చూపటం జరుగుతున్నది. స్థానికంగా ఓటర్లు అన్ని పార్టీల అభ్యర్థులకూ తమను వదిలేయమని చెప్పే సమయం వస్తుంది. తమలోనే తమకు విశ్వాసం గల వ్యక్తిని, బాధ్యతగా ప్రవర్తించే వ్యక్తిని కనుగొంటాడు. ఒకసారి ఇది జరిగితే పార్టీ విధానం అంతంగావటం ఆరంభమైనట్లే. పార్టీలతో పాటు అధికార కేంద్రీకరణకు ప్రధాన కారణం కూడా అదృశ్యమవుతుంది. వికేంద్రీకృత రాజ్యంతో కూడిన స్థానిక రిపబ్లిక్కులకు పునాది పడుతుంది. రాజ్యం చేసే పని స్థానిక రిపబ్లిక్ కింది స్థాయిలో చేస్తుంది. స్థానిక రిపబ్లిక్ ల నమూనాలో జాతీయ సంస్కృతి, జాతీయ ఆర్థికత, జాతీయ రాజకీయ సంస్థలు మలచబడతాయి. అధికారం ప్రజలతోనే ఉంటుంది. చిన్న సమూహాలలో సభ్యులు ప్రత్యక్షంగా అధికారాన్ని వినియోగిస్తారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో విస్తృత ప్రాతిపదిక ఆధారంగా ఉన్న రాజ్యం వాస్తవ ప్రజాస్వామికంగా ఉంటుంది. అధికారాన్ని కాజేసే ప్రశ్నే ఉండదు. రాజకీయ ఆర్థిక అధికార కేంద్రీకరణ తొలగిపోయి బహుళత్వ ఆధునిక సమాజంచాలు .
(1953, ఆగస్టు 30న రాడికల్ హ్యూమనిస్టు (ఆంగ్ల వారపత్రిక, కలకత్తా) సంపాదకీయం.)
రచయిత అనువాదం
ఎమ్.ఎన్.రాయ్ నరిసెట్టి ఇన్నయ్య
1 comment:
its very nice to hearing from you.
Post a Comment