సంజీవ దేవ్ ఇన్నయ్యకు రాసిన ఉత్తరాలలొ ఒకటి

https://www.facebook.com/Sanjivadev/photos/a.578723512166669.1073741828.578631185509235/793899283982423/?type=1&theater--link

ఇన్నయ్య నరిసెట్టి జీవనగమనం కినిగి లో విడుదల

http://kinige.com/book/South+India+to+North+America+Journey+of+Journalist

మహాభారతం-హరిమోహన్ ఝా -జె. లక్ష్మీరెడ్డి - తెలుగు

మైథిలీ మూలం ‘ఖట్టర్ కాకా’ హరిమోహన్ ఝా మహాభారతం నేను ప్రాతఃశ్లోకాలు చదువుతూ ఉన్నాను - ‘పుణ్య శ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో యుధిష్ఠిరః’ (నల మహారాజు పుణ్యచరితుడు, యుధిష్ఠిరుడు పుణ్య చరితుడు) ఇంతలో వికటకవి చిన్నాన్న వచ్చి అన్నాడు - అరే, ప్రొద్దున్నే ఈ వ్యర్థుల పేర్లు జపిస్తున్నావేమిటి? నేను - చిన్నాన్నా, ధర్మరాజు లాంటి సత్ఫురుషుని గురించి మీరిట్లా మాట్లాడతారేమి? చిన్నాన్న - ధర్మరాజు కాదు, మూర్ఖరాజు, జూదంలో రాజ్యంతో పాటు భార్యను కూడా పోగొట్టుకొని అడవుల్లో చెట్ల వెంబడీ, గుట్టల వెంబడీ తిరిగే వాణ్ణి మరేమనాలి? అతనికి దీటైనవాడు ఒకడే ఉన్నాడు - నలమహారాజు, ఆయన కూడా జూదంలో సర్వస్వం కోల్పోయి అడవుల్లో పడి తిరిగాడు. నిద్రపోతున్న భార్యను అక్కడే అర్ధనగ్నంగా వదలిపెట్టి చెప్పాపెట్టకుండా పారిపోయాడు. నలుడు, యుధిష్ఠిరుడు ఒకే కాడికి కట్టదగిన జోడెద్దులు. ఈ శ్లోకం తయారుచేసింది ఎవరో గాని, ఇద్దరినీ చాలా బాగా జత కూర్చాడు! నేను - చిన్నాన్నా, ధర్మరాజు, మహాభారతంలో ఆదర్శపాత్ర, ఆయననుండి నేర్చుకోవలసింది చాలా ఉంది. చిన్నాన్న - అవును. మొట్టమొదట నేర్చుకోవలసింది ఏమిటంటే వంశంలో అయోగ్యుడు ఒక్కడు పుట్టినా వంశం పూర్తిగా నాశనమవుతుందని. ధర్మరాజు గనక జూదరి కాకపోయి ఉంటే అంత వినాశకరమైన మహాభారత యుద్ధం ఎందుకు జరిగేది? నేను - కౌరవులు చేసిన అన్యాయం వల్ల యుద్ధం జరిగిందని అందరూ అంటూంటే మీరు మాత్రం నింద అంతా ధర్మరాజు తలపైన మోపుతున్నారు! చిన్నాన్న - నీవే ఆలోచించి చూడు. ధర్మరాజు జూదం ఆడటానికి సరదా పడకుండా ఉండి ఉంటే ఇదంతా ఎందుకు జరిగేది? ఆవేశంలో పాచికలు విసురుతూ పోయాడు. చివరకు భార్యను కూడా ఒడ్డినాడు. అరే, మూర్ఖుణ్ణి అందరూ రెచ్చగొడుతూనే ఉంటారు. ఆయన స్వంత బుద్ధి ఏ గడ్డి తినడానికి వెళ్ళింది? ఆయన ఓడిపోతే అందులో ఇతరుల తప్పేముంది? ఓడిపోయిన తర్వాత ఊరక పక్కన కూర్చోవలసింది. అప్పుడు కూడా సింహాసనం కావాలనుకోవడం, ఇదెక్కడి న్యాయం? నేను - చిన్నాన్నా, ద్రౌపదికి అంత అన్యాయం జరిగింది. అది మీరు ఆలోచించారా? చిన్నాన్న - నీవు ద్రౌపది తప్పు గురించి ఎందుకు ఆలోచించవు? దుర్యోధనుడు మహలు చూడడానికి వచ్చాడు. కొత్త చలువరాతిని చూసి ఆయనకు నీళ్ళని భ్రమ కలిగింది. అది చూసి కిల కిల నవ్వుతూ ద్రౌపది - ‘గుడ్డివాని కొడుకు గుడ్డివాడే అవుతాడు’ అని అనవచ్చా? నీవే చెప్పు? ఇది ఎంత అమర్యాదకరమైన మాటో! మర్యాద తెలిసిన కులస్త్రీ ఎవరైనా మామ-మరుదులను ఇలాంటి మాట అనగలదా? రూపగర్విత అయిన ద్రౌపదికి చిన్న - పెద్ద అనే ఆలోచన లేకపోయింది. పాండవులైదు మందినీ ఒకే విధంగా శాసించింది. ఇంకా చెప్పాలంటే ధర్మరాజుపైన మరింత అధికారం చెలాయించేది. కానీ అవమానం సహించి ఊరక ఉండిపోడానికి పోడానికి కౌరవులు అలాంటి దద్దమ్మలు కారు. వాళ్ళు తమ అసలు తండ్రికి పుట్టిన పిల్లలు. తృప్తిగా పగ తీర్చుకున్నారు. నేను - కానీ ధర్మరాజైన యుధిష్ఠిరుడు సాక్షాత్తు ధర్మపుత్రుడు కదా! చిన్నాన్న నా మాట మధ్యలోనే ఇలా అన్నాడు - ధర్మపుత్రుడు కాదు, అధర్మపుత్రుడను. మాటమాటికి ‘ధర్మరాజు’, ‘ధర్మరాజు’ అని ఎందుకు జపిస్తావు? ఏ యుధిష్ఠిరుడైతే తమ్ముడు అర్జునుడు స్వయంవరంలో పెళ్ళాడిన ద్రౌపదిని పొందడానికి సందేహించలేదో, ఆ యుధిష్ఠిరుణ్ణి నీవు ధర్మరాజు అని అంటున్నావు! అలాంటివాణ్ణి అధర్మరాజు అనాలి! నేను - కాని, అది వారి తల్లి కుంతి ఆజ్ఞ కదా, ‘ఐదుగురూ సమానంగా పంచుకొండి’అని. చిన్నాన్న ఆవేశంతో అన్నాడు - అరే, పాంచాలి ఏమైనా పంచామృత ప్రసాదమా, ఈ విధంగా పంచిపెట్టడానికి? పాంచాలి ఐదు అంగాల పంపకం జరగలేదు, దీనికి మనం సంతోషించాలి. లేకపోతే పాపం ఆమె పరిస్థితి మరింత దారుణమైపోయేది. అయినా ఆమె తక్కువ దుర్దశ పాలైందా? ఐదుగురు పురుషుల మధ్య ఒక స్త్రీ! అందరికీ ఆమె పైన హక్కు! ఆమె ఒక స్త్రీ గాక ఉమ్మడి హుక్కా అయినట్లు. వంతుల వారీగా గుడగుడమని పీల్చడానికి! మర్యాదస్తుల పద్ధతి ఇదేనా? నిజం చెప్పాలంటే పాండవులు పతితులు. కులాన్ని ముంచేశారు! అందుకే గదా, ఒకసారి కర్ణుడు నిండు సభలో పాంచాలి ధర్మపత్ని కాదు, ఐదుగురి ఉంపుడు కత్తె, అని అన్నాడు - ‘ఏకో భర్తా స్త్రియాః దేవైర్విహితః కురునందన ఇయం త్వనేకవశగా బంధకీతి వినిశ్చితా’ (మహాభారతం, ఆది పర్వం) (కురునందనా! స్త్రీకి ఒకే భర్త ఉండాలని దేవతలు నిర్దేశించారు. కాని, ఈమె అనేకుల వశవర్తిని. కాబట్టి ఖచ్చితంగా ఉంపుడు కత్తే!) నేను - చిన్నాన్నా, కౌరవులు అంత అన్యాయం చేశారు. దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది చీర లాగి వివస్త్రను చేయడానికి కూడా ప్రయత్నించాడు. ఇక ఇంతకు మించిన అవమానం ఏముంటుంది? చిన్నాన్న - బాగా ఆలోచించి చూస్తే ద్రౌపదిని అవమానం చేసింది స్వయంగా యుధిష్ఠిరుడే! అతడు భార్య దేహాన్ని బహిరంగంగా వర్ణిస్తూ ఆమెను జూదంలో ఒడ్డాడు - ‘వైవ హ్రస్వా న మహతీ న కృశా నాతిరోహిణీ నీల కుంచిత కేశీ సా తయా దీవ్యామ్యహం త్వయా’ (సభాపర్వం) (నా భార్య పొట్టిగానూ లేదు. పొడవుగానూ లేదు, లావుగాను లేదు. (అంటే మధ్యమాంగి) ఆమెకు ఉంగరాల నల్లని జుట్టు వుంది. నేను ఆమెను పణంగా ఒడ్డుతున్నాను) భార్యను తార్చేవాడే ఈ విధంగా వర్ణిస్తాడు. ఇక ఓడిపోయిన తర్వాత దుశ్శాసనునికి పగ సాధించడానికి అవకాశం చిక్కింది. ఆ సుకేశి కేశాలు పట్టుకొని లాక్కొచ్చాడు - ‘జగ్రాహ కేశేషు నరేంద్రపత్నీమ్ ఆనీయ కృష్ణామతి దీర్ఘ కేశామ్’ (సభాపర్వం) (అతి దీర్ఘ కేశాలు గల పాండవ పత్ని ద్రౌపది వెంట్రుకలు పట్టుకొని లాక్కొచ్చి…) అప్పుడు ద్రౌపది యుధిష్ఠిరుణ్ణి ఎలా నిందించిందో తెలుసా? ‘మూఢో రాజా ద్యూతమదేన మత్తః కోహిదీవ్యేద్ భార్యయా రాజపుత్రః’ (సభాపర్వం) (జూదం మత్తులో మైమరచిన మూర్ఖుడైన రాజు తప్ప భార్యను పణంగా ఒడ్డేవాడు ఎవడుంటాడు?) దుశ్శాసనుడు పట్టుకొని సభలోకి లాక్కొని పోగా కొంచెం వంగిన శరీరంతో ద్రౌపది మెల్లగా అంది - బుద్ధిహీనుడా! నేనిప్పుడు రజస్వలను, ఏకవస్త్రను, అనార్యుడా! నన్ను సభలోకి ఎలా తీసుకుపోతావు? ‘సా కృష్యమాణా నమితాంగయష్ఠిః శనైరుాచాథ రజస్వలాస్మి ఏకం చ వాసో మమ మందబుద్ధే సభాం నేతుం నార్హసి మామనార్య’ (సభాపర్వం) దీనికి దుశ్శాసనుడిలా అన్నాడు - ‘రజస్వలా వా భవ యాజ్ఞసేని ఏకాంబరా వాzప్యథవా వివస్త్రా ద్యూతే జితా చాసి కృతాసి దాసీ దాసిషు వాసశ్చ యథోపజోషమ్’ (నువ్వు రజస్వలవో, ఏకవస్త్రవో, వివస్త్రవో ఏమైనా అవు. యాజ్ఞసేనీ! మేము నిన్ను జూదంలో గెల్చుకున్నాం. ఇప్పుడు నీవు మా దాసివి. మా దాసీ జనంలోనే నీ స్థానం. ఎలా కావాలంటే అలా చేస్తాం). తర్వాత పెనుగులాటలో - ‘ప్రకీర్ణకేశీ పతితార్థవస్త్రా దుఃశాసనేన వ్యవధూయమానా.’ (ద్రౌపది కేశాలు చెదరి పోయాయి. సగం చీర జారి కింద పడిపోయింది.) పాపం ఆమె చేతిలో ఎదలు కప్పుకొని బ్రతిమాలనారంభించింది - ‘మా మా వివస్త్రాం కురు మాం వికార్షీః’ (నన్ను వివస్త్రను చేయవద్దు, లాగవద్దు) ‘తథా బృవంతీ కరుణం సుమధ్యమా భర్త్రూన్ కటాక్షైః కుపితా హ్యపశ్యత్’ (ఈ విధంగా దీనంగా అంటూ సన్నని నడుము గల ఆ సుందరి కోపంతో తన భర్తల వైపు చూసింది) అయినా - ‘తతో దుశ్శాసనో రాజన్ ద్రౌపద్యాః వసనం బలాత్ సభామధ్యే సమాక్షిప్య వ్యపాక్రష్టుం ప్రచక్రమే’ (దుశ్శాసనుడు సభ మధ్యలోకి ఆమెను తోసి బలవంతంగా ఆమె చీర లాగి వివస్త్రను చేయసాగాడు) ఇటు ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతూంటే అటు పాండవులు సభలో కిమ్మనకుండా కూర్చున్నారు! భార్య బలాత్కారం జరుగుతూ ఉంటే కూడా వాళ్ళు స్థితప్రజ్ఞుల్లాగా నిర్వికారభావంతో చూస్తూ ఉండిపోయారు! వాళ్ళలో పౌరుషమంటూ లేకపోయింది! నేను - చిన్నాన్నా, అది వాళ్ళకు సమయం కాదు. చిన్నాన్న గదామాయిస్తూ అన్నాడు - అరే, అంతకు మించిన సమయం ఏముంటుంది? ఏ కొద్ది పౌరుషం ఉండినా అక్కడే ప్రాణాలకు తెగించేవారు. దుశ్శాసనునిపై విరుచుక పడేవారు. చచ్చేవారు. నాశనమైపోయేవారు. అర్జునుని గాండీవం, భీముని భీకరమైన గద ఇంకే రోజు పనికొస్తాయి. కొద్దిసేపు ఉద్రిక్త స్థితిలో ఉండిన తర్వాత చిన్నాన్నే ఇలా అన్నాడు - అందుకే ద్రౌపది ఒకసారి తిరస్కార భావంతో ఇలా అంది - ‘నైవ మే పతయః సంతిః’ (నాకు భర్తలే లేరు) ఇలా అని ఆమె చేతితో ముఖం కప్పుకొని రోదించింది. ‘ఇత్యుక్త్వా ప్రారుదత్ కృష్ణా ముఖం ప్రాచ్ఛాద్య పాణినా’ కరుణ కలిగించే ఆక్రందనలో కన్నీటి వర్షం ఎంతగా కురిసిందంటే - ‘స్తనావపతితౌ పీనౌ సుజాతౌ శుభలక్షణౌ అభ్యవర్షత పాంచాలీ దుఃఖజైరశ్రుబిందుభిః’ (పొంకంగాను, శుభలక్షణ యుక్తంగాను ఉన్న పాంచాలి పీన స్తనాలు కళ్ళనుండి జాలువారిన దుఃఖాశ్రువులతో పూర్తిగా తడిసిపోయాయి) అయినా భర్తల హృదయాల్లో ఆవేశం ఉబికి రాలేదు. వాళ్లు నపుంసకుల్లాగా ఆమెను చూస్తూ ఉండిపోయారు. అందుకే అర్జునుణ్ణి అవమానిస్తూ ఊర్వశి ఒకసారి ఇలా అంది, ‘నీవు పురుషునివి కాదు, నపుంసకునివి. అభిమానం వదలి స్త్రీలలోకి వెళ్ళి నాట్యంచేయి - ‘తస్మాత్ త్వం నర్తనః పార్థ స్త్రీమధ్యే మానవర్జితః అపుమానితి విఖ్యాతః షండవత్ విచరిష్యసి’ (వనపర్వం) నేను - చిన్నాన్నా, పాండవులు వీరత్వానికి ప్రసిద్ధులు కదా, ముఖ్యంగా అర్జునుడు. వక్కలు కత్తిరిస్తూ చిన్నాన్న అన్నాడు - అరే, భార్య విరాటరాజు మహలులో ఊడిగం చేయడం కళ్లారా చూసి కూడా దిగులు చెందని పాండవులను వీరులని నేనెలా అనుకోవాలి? అర్జునుడిలో పౌరుషం ఉండి ఉంటే గడ్డం-మీసాలు తీసేసి, లంగా-చోళీలో బృహన్నల వేషంలో తా-తా-థై-థై అని రాజకుమారికి నాట్యం నేర్పుతూ ఉండేవాడా? ఇక భీముడు భోజనభట్టే, భోజనభట్టు! పొట్ట నిండితే చాలు! పెద్దవాళ్ళ పరిస్థితే ఇలా ఉంటే ఇక నకుల - సహదేవుల గురించి చెప్పేదేముంది? నేను - చిన్నాన్నా, అప్పుడు వాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నారు. చిన్నాన్న - నిజం చెప్పాలంటే వాళ్ళు ఎవరికీ ముఖం చూపడానికి తగిన వాళ్ళు కాదు కూడా. ఏ కృష్ణుడు వాళ్ళ కోసం అంత చేశాడో, ద్రౌపది మాన సంరక్షణ చేశాడో, ఆ కృష్ణుని చెల్లెలు సుభద్రను అర్జునుడు లేవనెత్తుకు పోయాడు. మేనమామ కూతురు అని కూడా ఆలోచించలేదు! ఇక భీముడు తన పిన్నమ్మ కూతురు (శిశుపాలుని చెల్లెలు)ను లేవనెత్తుకుపోయాడు. వాళ్ళు ధర్మం, నీతి, మర్యాద, అన్నింటినీ భ్రష్టు పట్టించారు. నేను క్షోభ పడుతూ ఉండడం చూసి చిన్నాన్న మళ్ళీ ఇలా అన్నాడు - ఆలోచించి చూస్తే పాండవుల మూలంలోనే భ్రష్టత్వం ఉంది. ‘పాండవాః జారజాతాః’ (పాండవులు జారజులు, రంకు మగడికి పుట్టినవారు) పాండవుల తండ్రి పాండురాజు స్వయంగా తన భార్యల (కుంతి, మాద్రిల) ద్వారా సంతానోత్పత్తి చేయడంలో అసమర్థుడు. అందువల్ల ఐదుగురు దేవతల ఆవాహన చేసి పాండవులు జన్మించేట్లు చేయడం జరిగింది. అరే, దీనికంటే పాండురాజు నిస్సంతుగా మరణించినా బాగుండేది. ఎవరికి వందమంది అన్న కుమారులున్నారో, అతడికి వంశం ఇంకా వృద్ధిచేసుకోవాలని అంత ఆరాటం ఎందుకుండాలి? అది కూడా ఇతరుల భరోసాతో! పాండురాజు కూడా ఒకవేళ భీష్ముని లాగా సంతృప్తిపడి ఉంటే, సింహాసనం కోసం పోరాటం జరిగే అవకాశమే ఉండేది కాదు. ధృతరాష్ట్రుని పుత్రులు రాష్ట్రాన్ని పాలిస్తూ ఉండేవారు. కానీ పాండురాజు కళ్లపైన పచ్చకామెర్ల పసిమి వ్యాపించి ఉంది. ఆయన జారజ సంతానం వంశాన్నే ముంచేసింది! చిన్నాన్న పాండవుల పని పడుతున్నాడని గ్రహించాను. ఆయనతో నేనేమి వాదించగలను.. మరో స్తోత్రం చదవడం మొదలుపెట్టాను. ‘అహల్యా ద్రౌపదీ తారా కుంతీ మండోదరీ తథా పంచకన్యాః స్మరేన్నిత్యం మహాపాతకనాశనమ్’ (అహల్య, ద్రౌపదీ తార, కుంతి, మండోదరి ఈ పంచకన్యలను నిత్యం స్మరించినవారి పాపాలన్నీ నశించిపోతాయి.) చిన్నాన్న మళ్ళీ అడ్డుపడ్డాడు - వీళ్ళు ఐదుగురూ పెళ్ళి అయిన వాళ్లే. మరి పంచ కన్యలని ఎందుకంటున్నావు? వీళ్ళను ప్రాతఃస్మరణీయులని ఎందుకు చెప్తున్నావు? నేను - వాళ్ళు పతివ్రతలు. చిన్నాన్న - వీళ్ళలో ఎవరి పతివ్రత? అహల్య తను చేసిన పనికి రాయి అయిపోయింది. తార, మండోదరి ఇద్దరూ తమ మరుదుల బాహుపాశాల్లో ఇమిడిపోయారు. ఇక కుంతి, ద్రౌపది, వీరి సంగతి చెప్పవలసిన పనేలేదు. ‘పంచభిః కామితా కుంతీ పంచభిః ద్రౌపదీ తథా సతీతి కథ్యతే లోకే యశో భాగ్యేన లభ్యతే’ (సుభాషితం) (కుంతి ఐదుగురితో కామించబడింది. ద్రౌపది కూడా అంతే. అయినా ఇద్దరూ లోకంలో పతివ్రతలుగా చెప్పబడుతున్నారు! కీర్తి భాగ్యవంతులకే లభిస్తుంది!) అత్త ఐదుగురి మక్కువ తీర్చింది. ఇక కోడలు మటుకేం తక్కువతింది? ఆమె కూడా ఐదుగురి వలపు తీర్చింది. అరే, ద్రౌపది భర్తలను పేకముక్కల్లా మార్చేది. తాను ఆటీన్ రాణిలాగా ఉంటూ భర్తలను వశం చేసుకొని బ్రతికింది. భర్త నెత్తి పైకెక్కి వెళ్ళే భార్య ఆమె. ఒకసారి అడవిలో నడుస్తూ - నడుస్తూ కింద పడిపోయింది. ఆమెను చూసి యుధిష్ఠిరుడు ఇలా విలపించాడు - ‘కిమిదం ద్యూతకామేన మయా కృతమబుద్ధినా ఆదాయ కృష్ణాం చరతా వనే మృగగణాయుతే శేతే నిపతితా భూమౌ! పాపస్య మమ కర్మభిః’ (వనపర్వం) (ఛీ! నేనెంత మూర్ఖుణ్ణి! జూదం వ్యసనంలో పడి ఇలాంటి సుకుమారి రాకుమార్తెను వెంటబెట్టుకుని అడవి మృగాల మధ్య తిరుగుతున్నాను! నా చెడు ఆలోచనల పాప ఫలితంగానే పాపం, ఈమె నేలపైన పడిపోయింది.) భీముడు, నకులుడు మొదలైనవారు ఆమెను ఎత్తుకొని నడవడానికి ఉపక్రమించారు. ఒకే పురుషునికి భార్యగా ఉండి ఉంటే ఆమెకు ఇలాంటి దర్జా దక్కేదా? ఆ పంచపత్ని ఒక్కొక్క భర్తతో ఒక్కొక్క పుత్రుణ్ణి పొందింది. నేను - మహాభారత కాలంలో స్త్రీలకు ఇంత ఎక్కువ స్వేచ్ఛ ఉండేదా? చిన్నాన్న - అందులో అనుమానమేముంది? చూడు - ‘సుషవే పితృగేహస్థా పశ్చాత్ పాండు పరిగ్రహః జనితశ్చ సుతః పూర్వం పాండునా సా వివాహితాః (దేవీ భాగవతం) (కుంతి తండ్రి ఇంట్లో ఉన్న రోజుల్లోనే ఓ పుత్రుణ్ణి కనింది. తర్వాత పాండురాజు ఆమెను వివాహమాడాడు. ముందు కొడుకు పుట్టాడు. తర్వాత వివాహం అయింది.) ఆమె కోడలు పాంచాలి స్వయంవరంలో వరించింది ఒకరినే అయినా పంచపత్ని అయి జీవించింది. కుంతి మనుమడు అభిమన్యుని భార్య ఉత్తర పెళ్ళయిన ఏడు నెలలకే పుత్రుణ్ణి (పరీక్షిత్తుణ్ణి) కనింది. అరే, గొప్ప ఇండ్ల కథలు కూడా గొప్పగానే ఉంటాయి. ఆ రోజుల్లో బుద్ధిపూర్వకంగా తమ అపహరణ చేయించుకొనే ప్రౌఢ రాకుమార్తెలు ఒకరిని మించి ఒకరు ఉండేవారు. అంబ, అంబిక, అంబాలిక ముగ్గురు పరిపక్వత పొందిన కన్యలు. పూర్ణ యౌవన సుభద్రను రైవతక పర్వతం పైన జాతర నుండి లేవనెత్తుకు పోవడం జరిగింది. శకుంతల, దమయంతి సంగతి నీకు తెలుసు. శర్మిష్ఠ, దేవయాని పరాచికాలాడడంలో ఆధునిక యుగాన్ని కూడా హీనపరిచి వెళ్ళారు. బాణాసురుని కుమార్తె ఉష ఎంత గడుసుదంటే నిద్రపోతున్న అనిరుద్దుణ్ణి బలవంతంగా తన శయనాగారం లోకి తెప్పించుకొని -- ‘సంభోగం కారయామాస బుబుధే న దివానిశమ్!’ (బ్రహ్మవైవర్త పురాణం) (తన సంభోగేచ్ఛ తీర్చించుకుంది, రాత్రి-పగలు అనే ధ్యాస లేకుండా.) అరే, ఎంతవరకని చెప్పమంటావు? వీరి ఉపాఖ్యానాలతోనే కదా, మహాభారతం నిండి ఉంది! కావ్యాల్లో, పురాణాల్లో సామాన్య గృహిణుల వర్ణన ఎందుకుంటుంది? నేను - చిన్నాన్నా, మహాభారతం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి? చిన్నాన్న - ఒక పాఠం ఇదే ఉంది - ‘స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః’ (గీత 1/40-41) (కుల స్త్రీలు దూషితలైనప్పుడు వర్ణసంకరులు జన్మిస్తారు. వాళ్ళు వంశాన్ని నాశనం చేస్తారు. (పాండు పుత్రులు ఎలా చేశారో అలాగ) కులము (వంశము) నశిస్తే అనాది కాలము నుండి వస్తున్న కుల ధర్మాలు నశిస్తాయి.) నేను - చిన్నాన్నా, పాండురాజు భార్యలు దూషితలెలా అయ్యారు? చిన్నాన్న - స్వయానా భర్తే వాళ్ళను దూషితలుగా చేశాడు. ఈ రోజుల్లో కుటుంబ నియంత్రణ లేక నియోజన ఫేషనయింది. కానీ, ఆ రోజుల్లో నియోగం ఆచారంగా ఉండేది. అంటే పుత్రప్రాప్తి కోసం పరపురుషునితో సంగమించడం శాస్త్రసమ్మతంగా ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో సతీత్వ రక్షణకంటే వంశరక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ‘అపుత్రస్య గతిర్నాస్తి’ (పుత్రహీనునికి మంచిగతులుండవు) అనేవారు. అందువల్లనే పాండురాజు స్వయంగా భార్యలను ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాడు అనడం కంటే బ్రతిమాలాడాడు, అనాలి, ఎవరివల్ల నైనా పుత్రుణ్ణి పొందమని, చూడు ఆయన కుంతిని ఎలా బుజ్జగిస్తున్నాడో - ‘పత్యా నియుక్తా యా చైవ పత్నీ పుత్రార్థమేవ చ న కరిష్యతి తస్యాశ్చ భవితా పాతకం భువి’ (ఆది పర్వం) (పతి ఆజ్ఞాపించినా పుత్రప్రాప్తి కోసం పరపురుషుని చేరని స్త్రీకి పాపం అంటుకుంటుంది) అంతేకాదు, ఆయన ఎన్నో ఉదాహరణలు కూడా ఇచ్చాడు - ‘ఉద్దాలకస్య పుత్రేణ ధర్మ్యా వైశ్వేతకేతునా సౌదాసేన చ రంభోరుః నియుక్తా పుత్రజన్మని ఏవం కృతవతీ సాzపి భర్తుః ప్రియచికీర్షయా అస్మాకమపి తే జన్మ విదితం కమలేక్షణే!’ (ఆదిపర్వం) (ఓ సుందరీ! ఉద్దాలకుని పుత్రుడు శ్వతకేతు ద్వారా ఇది ధర్మసమ్మతంగా చెప్పబడింది. సౌదాసుడు తన భార్యను పుత్రప్రాప్తి కోసం ఈ పద్ధతిని అవలంబించమని కోరగా భర్త సంతృప్తి కోసం ఆమె అలాగే చేసింది). పాండురాజు చివరకు తన తల్లి (అంబాలిక) ప్రస్తావన కూడా తెచ్చి ఇలా అన్నాడు - ఓ కమలేక్షణా! నేను కూడా నియోగం ద్వారానే పుట్టాననే విషయం నీకు తెలుసు కదా! ఇక అలాంటి పరిస్థితిలో పాపం కుంతిగాని, మాద్రిగాని, ఏం చేస్తుంది? భర్త ఆజ్ఞ శిరసావహించి వాళ్ళు తమ అత్త అడుగుజాడల్లో నడిచారు. నేను అడిగాను - చిన్నాన్నా, పాండురాజు తల్లి అలా ఎందుకు చేసింది? చిన్నాన్న - తన అత్త సత్యవతి ఆజ్ఞ వల్ల ఆమె అలా చేసింది. చూడు, సత్యవతి కోడలితో ఏమంటూందో - ‘నష్టం చ భారతం వర్షం పునరేవ సముద్ధర పుత్రం జనయ సుశ్రోణి దేవరాజ సమ ప్రభమ్’ (ఆదిపర్వం) (ఓ సుందరీ! భారతవర్షం నశించిపోతూంది. దాన్ని ఉద్ధరించు. ఎవరివల్లనైనా ఇంద్రునితో సమానంగా తేజస్వి అయిన పుత్రునికి జన్మనివ్వు) అంతే కాదు. ఈ పుణ్యకార్యానికి సుయోగ్యుడైన ఒక వ్యక్తి, వ్యాసుణ్ణి సిఫారసు కూడా ఆమె చేసింది. ఈ సిఫారసు కూడా ఎవరితో చేసింది? అంబాలిక బావగారైన భీష్మునితో! భీష్ముడు వెనుకాడటం గమనించి సత్యవతి కొంత బిడియపడుతూ, చిరునవ్వుతో ఇలా అంది - నీకొక రహస్యం చెప్తాను. యౌవనావస్థలో మత్స్యగంధిగా నేను పేరు పొందాను. అప్పుడొకసారి పరాశర ముని యమున దాటడానికి నా నావలోకి వచ్చాడు. నన్ను చూసి ఆయనకు మోహం కలిగింది. కానీ పగటి వెలుగులో ఇతరుల ఎదుట ఆయన కోరిక ఎలా తీరుతుంది? అప్పుడాయన యోగబలంతో దట్టమైన మంచు సృష్టించి మోహం తీర్చుకున్నాడు. దాని వల్ల నాకొక పుత్రుడు కలిగాడు. ఆ పుత్రుడే వ్యాసుడుగా ప్రసిద్ధికెక్కాడు. నీవు ఆ వ్యాసుణ్ణి పిలుచుకొని రా. ‘తవ హ్యనుమతే భీష్మ నియతం స మహాతపాః విచిత్రవీర్యక్షేత్రేషు పుత్రానుత్పాదయిష్యతి’ (ఆదిపర్వం) (ఓ భీష్మా! నీ అంగీకారంతో నియమించబడిన మహాతపస్వి ఆ వ్యాసుడే విచిత్రవీర్యుని (విధవ) భార్యల (అంబిక, అంబాలికల) గర్భం నుండి పుత్రులను జన్మింపచేస్తాడు). నేను ఆయన వైపే చూస్తున్నట్లు గమనించి చిన్నాన్నే ఇలా అన్నాడు - అప్పుడు వ్యాసుణ్ణి పిలువనంపారు. ఆయన వీర్యంతోనే పాండురాజు, ధృతరాష్ట్రుడు జన్మించారు. నియోగ సమయంలో అంబిక కళ్ళు మూసుకుందట. కాబట్టి ఆమెకు జన్మాంధుడైన పుత్రుడు కలిగాడు. అంబాలిక చందన లేపనం చేసుకుందట కాబట్టి పాండుపుత్రుడు కలిగాడు. వ్యాసునికి అంబాలికతో ఎక్కువ సంతృప్తి కలిగింది. అందువల్లనే ఆయన అంతగా ఆమె వంశీయుల (పాండవుల) పక్షం వహించాడు. నేనడిగాను - చిన్నాన్నా, అంత పెద్ద జ్ఞాని అయి కూడా వ్యాసుడు వ్యభిచారకర్మకు ఎందుకు సిద్ధపడ్డాడు? చిన్నాన్న - చూడు, ‘ఆత్మా వై జాయతే పుత్రః’ (ఆత్మే పుత్రుని రూపంలో జన్మిస్తుంది). వ్యాసుని తండ్రి పరాశరుడు కూడా ఆ పనే చేశాడు కదా! ‘మత్స్యగంధాం ప్రజగ్రాహ మునిః కామాతురః తదా’ (దేవీ భాగవతం) (కామాతురుడై ఆ ముని మత్స్యగంధిని పట్టుకున్నాడు) పాపం బెస్తకన్య సత్యవతి భయపడుతూ - భయపడుతూ ఇలా అడిగింది -- ‘పితరం కిం బ్రవీమ్యద్య సగర్భా చేద్ భవామ్యహమ్ త్వం గమిష్యసి భుక్త్వా మాం కిం కరోమి వదస్వ తత్’ (దేవీ భాగవతం) (మీరేమో నన్ను అనుభవించి వెళ్ళిపోతారు. నాకు గర్భం అయితే మా తండ్రికి ఏమి సమాధానం చెప్పగలను? అది చెప్పండి.) అప్పుడు పరాశరుడు ఇలా ఆశీర్వదించాడు --- ‘పురాణకర్తా పుత్రస్తే భవిష్యతి వరాననే వేదవిద్ భాగకర్తా చ ఖ్యాతశ్చ భువనత్రయే’ (దేవీ భాగవతం) (ఓ సుందరీ! నీ గర్భం నుండి జన్మించే పుత్రుడు వేదాల్లో పారంగతుడు, పురాణకర్త అయి, ముల్లోకాల్లో ఖ్యాతి పొందుతాడు). ఆ పుత్రుడే వ్యాసుడు. ఒక ద్వీపంలో జన్మించాడు. కాబట్టే ఆయన్ను ద్వైపాయనుడని కూడా అంటారు. ద్వైపాయన వ్యాసుడు తన తండ్రి సంస్కారం ఎలా వదులుకుంటాడు? రాణివాసంలోని కామకళాప్రవీణ అయిన దాసి ఆయన్ను సంపూర్ణంగా తృప్తి పరచినప్పుడు ఆమెను కూడా ఆయన ఆశీర్వదించాడు. నీగర్భం నుండి ధర్మాత్ముడు, సత్యవాది అయిన పుత్రుడు (విదురుడు) జన్మిస్తాడు, అని --- ‘సంతోషితస్తయా వ్యాసో దాస్యా కామకలావిదా విదురస్తు సముత్పన్నో ధర్మాంశః సత్యవాన్ శుచిః’ (దేవీ భాగవతం) అందువల్లనే కదా, వ్యాసుడు మహాభారతంలో విదురుణ్ణి అంతగా పొగిడాడు? ఇది గమనించావా? చిన్నాన్న చిటికెడు వక్కపొడి నోట్లో ఉంచుకొని మళ్ళీ అన్నాడు - చూడబ్బాయ్, వ్యభిచార పర్యవసానం మంచిగా ఉండదు. వ్యాసునికి కూడా తర్వాత పశ్చాత్తాపం కలిగింది - ‘వ్యభిచారోద్భవాః కిం మే సుఖదాః స్యుః సుతాః కిల’ (దేవీ భాగవతం) (వ్యభిచారం వల్ల కలిగిన నా ఈ పుత్రులు కళ్యాణకారులు కాగలరా?) అర్జునుని మనసులో కూడా ఆత్మగ్లాని పుట్టింది -- ‘దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః’ (గీత 1/43) (కుల విధ్వంసకులు తెచ్చిపెట్టే ఈ వర్ణసాంకర్యం వల్ల కలిగే దోషాలవల్ల శాశ్వతాలైన వర్ణాచారాలు, కులాచారాలు నశిస్తాయి) అరే, వంశానికి ఒకసారి మచ్చవస్తే అది త్వరగా మాసిపోదు. దాన్ని కడిగేయడానికి చాలా కాలం ప్రాయశ్చితం చేయవలసి ఉంటుంది. కొంచెం ఆగి చిన్నాన్న మళ్ళీ అన్నాడు - చూడబ్బీ, ‘గతానుగతికో లోకః’ (ముందు వాళ్ళు ఎలా చేస్తే లోకం గుడ్డిగా అలాగే చేస్తుంది). సత్యవతి నుండి అంబాలిక నేర్చుకుంది. అంబాలిక నుండి కుంతి నేర్చుకుంది, కుంతి నుండి ద్రౌపది నేర్చుకుంది. ఈ విధంగా విచిత్రవీర్యుని వంశంలో విచిత్రమైన ఈ ఆచారం కొనసాగినందువల్ల కులస్త్రీలు దూషితలవుతూ వచ్చారు. వర్ణ సంకరులైన వారి పుత్రులు చేసిన వంశ విధ్వంసం అందరికీ తెలిసిందే. మహాభారతం మననం చేయవలసిన రచన. అందులో లేనిదేముంది? ‘యన్న భారతే తన్న భారతే’ (మహాభారతంలో లేనిది భారత దేశంలోనే లేదు.) నేను - అయినా మహాభారత యుద్ధానికి అసలు సూత్రధారి కృష్ణుడు కదా! చిన్నాన్న - అవును. ఆయన బలంతోనే అర్జునుడు గంతులేసేవాడు. గుంజ బలంతో ఆవుదూడ గెంతినట్లు. ధర్మయుద్ధమే గనుక జరిగి ఉంటే పాండవులు గెలిచేవారే కాదు. టక్కరి కృష్ణుడు అలా జరగనివ్వలేదు. మొదటి నుండి చివరిదాకా అధర్మయుద్ధమే జరిగింది. కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, వీరందరి వధ ధర్మవిరుద్ధంగానే జరిగింది. అయినా గీతాకారుడు ‘ధర్మక్షేత్రే కురుక్షేత్రే’ అంటాడు! నాకు మాత్రం ఇది ఖచ్చితంగా వ్యంగ్యంగానే కనిపిస్తుంది. వ్యాసుడన్నాడు - ‘యతో ధర్మస్తతో జయః’ (ధర్మమున్నచోటే జయం ఉంటుంది) కాని మహాభారతంలో ‘యతోzధర్మస్తతో జయః’) (అధర్మమున్నచోటే జయం ఉంటుంది) అనేదే జరిగింది. అందువల్లనే ఆ జయం కూడా క్షయంగా పరిణమించింది! నేను - చిన్నాన్నా, మహాభారత యుద్ధానికి మూల కారణం దుశ్శాసనుడు చేసిన ద్రౌపది వస్త్రాపహరణ! చిన్నాన్న - అవును, దుశ్శాసనుడు ఒకే ఒక చీరను అపహరిస్తే దానిపైన మహాభారత యుద్ధం చెలరేగింది. శ్రీకృష్ణుడు అంత వస్త్రాపహరణ చేస్తే అది విశుద్ధ భాగవతమై కూర్చుంది. కానీ కర్మఫలం ఏదో ఒకరోజు అనుభవించక తప్పదు. గోపికలతో ఎవరైతే అన్ని రాసక్రీడలు చేశాడో, ఆయన భార్యలను కూడా చివర్లో గొల్లలు కొల్లగొట్టి తీసుకుపోయారు. చూడు - ‘కృష్ణపత్న్యః తదా మార్గే చోరాభీరైశ్చ లుంఠితాః ధనం సర్వం గృహీతాం చ నిస్తేజాశ్చార్జునోzభవత్’ (దేవీ భాగవతం . 2/7) (కృష్ణావతారానంతరం అర్జునుడు కృష్ణుని భార్యలను ద్వారక నుండి హస్తినాపురం తీసుకుపోతున్న సమయంలో దారిలో దొంగలు, గొల్లలు మొత్తం వారి ధనాన్నే కాక, కృష్ణుని భార్యలను కూడా అపహరించి తీసుకుపోయారు. అప్పుడు వాళ్ళ సంరక్షకుడు అర్జునుడు అసహాయుడై చూస్తూ ఉండిపోయాడు!) ఆ ధనుర్ధరుని తేజం అప్పుడు ఎక్కడికి పోయింది? అరే, కాలం గర్వాపహారి. ఎవరి గర్వాన్నీ నిలువ నివ్వదు! గట్టిగా ఊపిరి పీల్చుకొని చిన్నాన్న మళ్ళీ అన్నాడు - భాగ్యలీల విచిత్రంగా ఉంటుంది. ఎవరైతే జీవితంలో అంతమంది అసురులను అంతమొందించాడో, ఆ శ్రీకృష్ణుడే చివరకు ఒక వేటగాని బాణానికి ఆహుతి అయిపోయాడు. ఒక చెట్టు కింద జింక అనే భ్రమతో వేటగాడు ఆయనపైన బాణం వేశాడు, ఆయన రాణులు పశువుల్లాగా కొల్లగొట్టబడ్డారు! దీన్ని విధి వైపరీత్యమనాలా లేక కర్మఫలమనాలా? శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అన్నదమ్ములకు, దగ్గరి బంధువులకు మధ్య విరోధం పుట్టించి, ఒకరినొకరు చంపుకొనేట్లు చేసి భూభారం తగ్గించాడని పురాణం చెప్తుంది - ‘కురుపాండవ యుద్ధం చ కారయామాస భేదతః భువో భారావతరణం చకార యదునందనః’ (బ్రహ్మవైవర్త పురాణం) కాని, యదునందనునికి దాని ఫలం ఏమి దక్కింది? ఆయన యదువంశం కూడా అదే విధంగా నశించిపోయింది. కురుక్షేత్రానికి ప్రతిఫలం ప్రభాసక్షేత్రం (ఒక ప్రాచీన తీర్థస్థలం)లో లభించింది. ‘పుత్రా ఆయుధ్యన్ పితృభిః భ్రాతృభిశ్చ మిత్రాణి మిత్రైః సుహృదః సుహృద్భి’ (భాగవత పురాణం) అన్న-తమ్ముళ్ళు, తండ్రి-కొడుకులు, మిత్రులు అందరు పరస్పరం పోరాడి మరణించడం వల్ల (యాదవ వంశం) నాశనమైపోయింది. వంశంలో ఏడ్చేవాడు కూడా లేకుండా పోయాడు! అరే, విషవృక్షం విషఫలాలనే ఇస్తుంది, అమృత ఫలాల నివ్వదు. చిన్నాన్న ముక్కు పుటాలకు నశ్యం దట్టిస్తూ ఇలా అన్నాడు - అన్యాయం చేసేవాడు చివరకు నశించే పోతాడు. అందుకే పాండవులు హిమాలయాల్లో సమసి పోయారు. యుధిష్ఠిరుని వెంట ఆయన రాజ్య వైభవమేమీ పోలేదు. వెంటపోయింది ఒక కుక్క మాత్రమే! భాతృ విరోధంవల్ల, నరసంహారం వల్ల ఏం ఫలితం దక్కింది? అయినా, మన కళ్ళు తెరుచుకోవడం లేదు. భారతదేశంలో మరోసారి అలాంటి యుద్ధం వచ్చే పరిస్థితి రాకుండా భగవంతుడు కాపాడుగాక! తెలుగు అనువాదం పురాణ ప్రలాపం జె. లక్ష్మీరెడ్డి Retired professor in Delhi University

భగవద్గీత--హరిమోహన్ ఝా -- తెలుగు-జె. లక్ష్మీరెడ్డి

మైథిలీ మూలం ‘ఖట్టర్ కాకా’ హరిమోహన్ ఝా భగవద్గీత నా చేతిలో భగవద్గీత చూసి వికటకవి చిన్నాన్న అన్నాడు - ఏం నాయనా! ఈ మధ్య గీతా పారాయణం చేస్తున్నావా ఏం? అలా అయితే నీకు దూరంగా ఉండాలి! నేను ఆశ్చర్యపోయి అడిగాను - ఎందుకు చిన్నాన్నా? చిన్నాన్న - చూడబ్బాయ్, మొదట అర్జునునిలో ప్రేమ, మమకారం ఉండేవి. ‘వీళ్ళు అన్నదమ్ములు. వీళ్ళు చిన్నాన్న - పెదనాన్నలు, ఆయన పితామహుడు, వీళ్ళ పైకి చేయి ఎలా ఎత్తేది?’ అని సందేహించాడు. కానీ గీతసవం తాగిన తర్వాత బాణ వర్షం కురిపించి ఆయన వృద్ధ పితామహుని ఎదను కూడా జల్లెడ చేసేశాడు. అందువల్ల ఏ విషయంలోనైనా తగాదా వస్తే నీవు కూడా అర్జునుని లాగా నిర్వికార యోగివై - ‘నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః’ (గీత 2/23) (ఆత్మను అస్త్ర - శస్త్రాలు ఏమీ ఛేదించలేవు. అగ్ని దహించలేదు) అని ఆలోచించి, ‘చిన్నాన్న ఆత్మను ఏ ఆయుధమూ ఖండించలేదు కదా! అలాంటప్పుడు గండ్రగొడ్డలితో ఒక మాంచి దెబ్బ వేస్తే ఏం?’ అనుకుంటే? తర్వాత మీ పిన్ని ఏడ్వడం మొత్తుకోవడం మొదలు పెడితే ఇలా ఓదార్చడానికి ప్రయత్నిస్తే -- ‘వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో..పరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహీ’ (గీత 2/22) (మనిషి చిరిగిన బట్టలు విడిచిపెట్టి కొత్త బట్టలు ఎలా ధరిస్తాడో, అదే విధంగా జీవాత్మ జీర్ణించిన శరీరాన్నివదలిపెట్టి కొత్త శరీరాన్ని గ్రహిస్తుంది.) ‘పిన్నమ్మా! చిన్నాన్న శరీరం మారిపోయింది. కొత్త శరీరం ప్రాప్తించింది. మీరు సంతోషించి బారసార పాటలు పాడండి. ఏడుస్తున్నారెందుకు?’అని నీవంటే! ఊళ్ళో కుర్రాళ్ళంతా గీతోపదేశం ప్రకారం నడుచుకోడం మొదలుపెడితే ఎంతమంది చిన్నాన్నలు చంపబడతారో, ఎంతమంది పిన్నమ్మలు విధవలై పోతారో చెప్పడం కష్టం. అందువల్లనే నేను నీకు దండం పెడతాను. చదవాలే అనుకుంటే ‘గీత గోవిందమ్’ చదువు నాయనా, ఈ గీత చదివే సరదా పెంచుకోకు. నేను - గీత అహింస, వైరాగ్యాలు ఉపదేశిస్తుందని కదా అంటారు? చిన్నాన్న -- అరే, నాకు తెలిసిందొకటే, గీతోపదేశం విన్నతర్వాత అర్జునుడు గాండీవం విసిరేసి కాషాయ వస్త్రాలు ధరించి ఉంటే, కవచం విప్పేసి కమండలం చేతికి తీసుకొని ఉంటే, కురుక్షేత్రం వదిలిపెట్టి వరాహక్షేత్రం (ఒక తీర్థస్థలం) దారి పట్టి ఉంటే అప్పుడు నేను గీతలో అహింస, వైరాగ్యం నిండి ఉన్నాయని ఒప్పుకొనే వాణ్ణి. కానీ ఆయన మత్సవేధం (మత్స్య యంత్రం) లాగా బంధు మిత్రుల మస్తకఛేదం చేయడం మొదలు పెట్టాడు! అరే, ఈ రోజుల్లో ఊరకనే ప్రజలు ఈటెలు, బల్లేలు బయటి తీస్తూంటారు. వాటిపైన గీత పదును కూడా ఎక్కిందంటే ప్రతి ఊరూ కురుక్షేత్రం అయిపోతుంది. అందుకే నేను చేతులు జోడించి ఉడుకు రక్తంలో గీత చదవ వద్దు బాబూ, అంటాను. నేను - చిన్నాన్నా, గీతాకారుని అసలు అభిప్రాయం వేరే ఉందేమో! చిన్నాన్న చిరాకు పడుతూ అన్నాడు - వేరే అభిప్రాయం నాకెలా తెలుస్తుంది? గీతాకారుడే స్వయానా సారథి అయి ముందు కూర్చొని ఉన్నాడు కదా! అహింసా ప్రబోధమే చేయదలచుకొని ఉంటే ఆయన యుద్ధభూమి నుండి రథం ఎందుకు మళ్ళించ లేదు? ఇలా ఎందుకనలేదు? -- ‘అర్జునా! శరీరం నశ్వరమని, ప్రపంచం క్షణభంగురమని, ఇంత జ్ఞానం నేను ఇచ్చిన తర్వాత హస్తినాపురం ఏపాటిది? ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది. దానికోసం రక్తధారలు ఎందుకు ప్రవహింప చేస్తావు? ప్రాపంచిక సుఖాలు తుచ్ఛమైనవి. రాజ్యకాంక్ష వదిలేసేయి. రాజ్యం కోసం వృద్ధ పితామహుని పైన, పూజ్యుడు ద్రోణుని పైన బాణాలు సంధించడం నీకు శోభిస్తుందా? యుద్ధం చేయకపోతే ఏమవుతుంది? క్షత్రియుడై ఉండి, యుద్ధభూమి వదలిపోయాడని లోకులు నవ్వుతారు. అంతేకదా! కానీ, ఎవరు నిజమైన జ్ఞానులో, వారు నిందలకూ - ప్రశంసలకూ చలించరు. ఈ తంటా అంతా వదిలేయ్. నాతో హిమాలయాలకు వచ్చేయ్!’ ఈ మాటలేవీ ఆయన అనలేదు. యుద్ధానికి పురికొల్పాడు. ఇంత జరిగినా నీవు మాత్రం గీతలో అహింస, వైరాగ్యం ఉందని అనుకుంటున్నావు! ఏమి బుద్ధి! ఏమి బుద్ధి! నేను - చిన్నాన్నా, పెద్ద - పెద్ద వాళ్ళు గీత ద్వారా విశ్వశాంతి స్థాపించాలనుకుంటున్నారు. అయినా మీరు అందులో యుద్ధ సందేశమే కనిపిస్తూంది. చిరునవ్వు నవ్వి చిన్నాన్న అన్నాడు - నీవు మన వీరకావ్యం ‘అల్హా’ ఎప్పుడైనా విన్నావా? అది చదివే వాళ్ళు వినేవాళ్ళల్లో ఏ విధంగా వీరావేశం పెంచేస్తారు? - ‘చివరకు దేవుడెలా రాసిపెట్టి వుండే అలా అవుతుంది. ఒక రోజు అందరూ వెళ్ళిపోవలసిందే.’ ఈ మాటల పైనే ఎందరో తలలర్పించి చచ్చారు. నాకు మాత్రం అలాంటి పిలుపే గీతలో కూడా వినిపిస్తూంది - ‘అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినోzప్రమేయస్య తస్మాదుధ్యస్వ భారత’ (గీత 2/18) (ఆత్మ ధరించే శరీరాలన్నీ నశించి పోయేవే. కానీ జీవాత్మ నాశము లేనిది, అనిర్వచనీయమైనది, నిత్యమైనది. కావున అర్జునా! యుద్ధం చెయ్యి) కానీ, ఎప్పుడో ఒకసారి చావాలి కాబట్టి ఇప్పుడే చచ్చిపో, అనే ఈ తర్కం నాకు నచ్చదు. నేను - చిన్నాన్నా, భగవంతుడనేదేమిటంటే, జీవుడు ఎప్పుడూ నశించడని. చిన్నాన్న - జీవుడు నశించనప్పుడు హత్య చేసిన వాడికి ఉరిశిక్ష ఎందుకివ్వాలి? శ్రీకృష్ణుడు అర్జునికేమో ఇలా ఉపదేశిస్తాడు - ‘గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః’ (గీత 2/11) (జ్ఞానులయిన వారు మరణించిన వారిని గురించిగానీ, జీవించి ఉన్న వారిని గురించిగానీ శోకించరు). కానీ, అభిమన్యుని చంపినప్పుడు ఈ జ్ఞానం ఎక్కడ మాయమై పోయింది? -- ‘న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోzయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే’ (గీత 2/20) (ఈ ఆత్మ ఎన్నడూ పుట్టదు, ఎన్నడూ గిట్టదు. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు ఉండకుండా పోదు. ఇది పుట్టుక లేనిది, మార్పు లేనిది, నిత్యమైనది. ఎల్లప్పుడు స్వస్వరూపంలోనే ఉంటుంది. మరణం శరీరానికే గాని ఆత్మకు లేదు.) ఈ మాటే సత్యమైతే జయద్రథునితో పగ సాధించడానికి అంత మాయోపాయం ఎందుకు చేయవలసి వచ్చింది? అప్పుడు -- ‘దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోథః స్థితధీర్ముని రుచ్యతే’ (గీత 2/56) (దుఃఖాల్లో కలత చెందక, సుఖాల్లో వాంఛ లేక, అనురాగ, భయ కోపరహితుడై ఉండే వాడే స్థితప్రజ్ఞుడైన ముని) ఈ మాట ఎందుకు మరచి పోయాడు? అరే అబ్బీ, నీవింకా పిల్లవాడిని, ఇవన్నీ అర్థం చేసుకోలేవు. నేను -- చిన్నాన్నా, ఈ శ్లోకం ప్రసిద్ధికెక్కింది కదా -- ‘సర్వోపనిషదో గావో దోగ్దా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్’ (ఉపనిషత్తులన్నీ గోవులు, కృష్ణుడు వాటిని పితికే గోపాలుడు. పాలు గీతామృతం. ఆ పాలు తాగిన దూడ ధీమంతుడైన అర్జునుడు) చిన్నాన్న నవ్వుతూ అన్నాడు - అవును, అర్జునుడు పాపం ఆవుదూడ లాంటి అమాయకుడే. అందువల్లనే కదా, కృష్ణుడు బుజ్జగించి యుద్ధానికి పురికొల్పాడు? ఒక రకంగా చూస్తే అర్జునుణ్ణి మభ్యపెట్టడానికే గీత రచించడం జరిగింది. శ్రీకృష్ణునికి పోట్లాట పెట్టాలని ఉంది, అర్జునుని వీపు తట్టాడు. యుద్ధం జరుగుతూంటే తాను మాత్రం తమాషా చూస్తూ కూర్చున్నాడు. అర్జునిపైన కృష్ణుని శ్యామరంగు ఎంతగా ఎక్కిపోయిదంటే మొత్తం వంశాన్నే మంటకలిపేశాడు. నేను - చిన్నాన్నా, అర్జునుడు అనాసక్తుడై యుద్ధం చేశాడు. రాజ్యకాంక్షతో కాదు. చిన్నాన్న వ్యంగ్యంగా అన్నాడు - అవును, అందుకే గదా, హస్తినాపురం సింహాసనం నీ పేర రాసి ఇచ్చి వెళ్ళాడు! అరే, అనాసక్తుడే అయితే నూరు - నూరుగురు పెత్తండ్రి కుమారుల రక్తంతో రాజ్యాభిషేకం చేసుకుంటాడా? ఓ ఢిల్లీ! నీ కారణంగా జరిగిన రక్తపాతానికి ఈ రోజు వరకూ నీ కోట ఎర్రగానే ఉంది! నేను -- చిన్నాన్నా, మీరు ధన్యులు! మాటలను ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్తారు! చిన్నాన్న తన ధోరణిలోనే మాట్లాడ సాగాడు - చూడు, కృష్ణునికి పోరాటం పెట్టాలని ఉంది, అర్జునునికి స్వంత బుద్ధి లేకపోయింది. అందువల్ల కృష్ణుడు మనసుకు ఏది తోస్తే అది చెప్పుకుంటూ వెళ్ళాడు -- ‘శరీరం నశ్వరం. అందువల్ల యుద్ధం చెయ్యి. ఆత్మకు మరణం లేదు. కనుక యుద్ధం చెయ్యి. క్షత్రియుడివి. కనుక యుద్ధం చెయ్యి. యుద్ధం చేయకపోతే నిందల పాలవుతారు. కాబట్టి యుద్ధం చెయ్యి.’ చిరునవ్వు నవ్వుతూ చిన్నాన్న మళ్లీ ఇలా అన్నాడు - క్షత్రియుడికి యుద్ధభూమి నుండి పారిపోవడం కంటే మరణించడమే శ్రేయస్కరమని కృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తాడు. కాని తాను మాత్రం జరాసంధునితో యుద్ధం చేయలేక ద్వారకకు పలాయనం చిత్తగించాడు! అందువల్లనే ఈ నాటికీ ‘రణఛేడ్’ (యుద్ధం భూమి వదలినవాడు) అనే పేరు ఆయనకుంది. దీన్నే ‘పరోపదేశే పాండిత్యం’ (ఇతరులకు ఉపదేశం ఇవ్వడంలో పాండిత్యం కలిగి ఉండడం) అంటారు. ఇక ఆయనకు జవాబివ్వగలిగే తెలివి అర్జునునికెక్కడిది? ఆబగా వింటూ పోయాడు. అంతా విన్న తర్వాత కూడా అర్జునికి ఏమీ బోధపడక పోయేసరికి కృష్ణుడు తన భీకర రూపం చూపించి భయపెట్టాడు. ‘ఆ విధంగా తెలుసుకోకపోతే ఈ విధంగా తెలుసుకో!’ అని. నవ్వుతూ చిన్నాన్న మళ్ళీ ఇలా అన్నాడు -- నాకొక విషయం గుర్తుకు వస్తూంది. ఒకసారి మీ పిన్నమ్మ కాశీ స్నానానికి వెళ్తూ ఉంది. ఆమెతోపాటు ఐదేళ్ళు ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడు నేను కూడా వెంట వస్తానని హఠం చేయడం మొదలు పెట్టాడు. నేను ఎన్నో విధాల వాడికి నచ్చ చెప్పాను - నదిలో ప్రవాహ వేగం ఎక్కువగా ఉంది. పిల్లలు కొట్టుకుపోతారు. నీళ్ళలో మొసళ్ళున్నాయి, పట్టుకుంటాయి, వెళ్ళవద్దు, అని. వాడు ఎంతకూ వినకపోతే అప్పుడు రామలీల రాక్షసుని ముఖం తగిలించుకొని వాణ్ణి భయపెట్టాను. అది చూడగానే బుద్ధిమంతుడై పోయాడు. ఒరే అబ్బీ, నాకు మాత్రం ఆ పిల్లవాడిలోనూ అర్జునుడిలోనూ ఏమంత పెద్ద తేడా ఉన్నట్లు అనిపించదు. నేను - చిన్నాన్నా, గీతలో ఎంతో జ్ఞానయోగం, భక్తియోగం, కర్మయోగం నిండి ఉన్నాయి. కదా! చిన్నాన్న --- అన్ని యోగాల లక్ష్యం ఒకటే, ‘తస్మాతం యుధ్వస్య భారత!’ అంటే యుద్ధం చెయ్యి, కౌరవులను చంపు. ఎలాగో ఒక లాగ అర్జునుణ్ణి యుద్ధానికి సంసిద్ధుని చేయడం కోసం నిష్కామకర్మ. అనాసక్త యోగాల పెద్ద వల అల్లడం జరిగింది. అర్జునుని బుద్ధి అందులో చిక్కుకుపోయినందువల్ల కృష్ణుడు ఆయన్ను ఎలా కావాలంటే అలా ఆడించాడు. కాని, అర్థం చేసుకొనే శక్తి ఉన్నవాడు మాత్రం కృష్ణుని ఎత్తుగడను అర్థం చేసుకొనే తీరుతాడు. నేను - నీవెంతటి వాడివి? పెద్ద-పెద్ద పండితులకే అర్థంకాదు. కానీ, నాకు మాత్రం అంతా విస్పష్టంగా తెలుస్తూనే ఉంది. కృష్ణుడంటాడు - ‘ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్వేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే’ (గీత. 2/55) (ఎవరైతే అన్ని కోరికలు త్యజించి తమలో తామే సంతృప్తులై ఉంటారో, వారే నిజమైన స్థితప్రజ్ఞులు) అలాంటప్పుడు రాజ్యం, స్వర్గం, వీటి ఆశ చూపుతూ ఇలా ఎందుకన్నాడు?- ‘హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః’ (అర్జునా! చనిపోతే స్వర్గం ప్రాప్తిస్తుంది. జయం పొందితే రాజ్య భోగాలననుభవిస్తావు. రెండు విధాల లాభమే ఉంది. అందువల్ల కృతనిశ్చయుడవై యుద్ధానికి లే! ) చిరునవ్వు నవ్వుతూ చిన్నాన్న అన్నాడు - అర్జునుడు తర్కం శాస్త్రం చదవలేదు. అందుకే రెండు విధాలా ఉచ్చులో చిక్కుకున్నాడు. నేనుండి ఉంటే అడిగేవాణ్ణి. ‘హే కృపాసింధు, ఈ రెండూ కాక మరో పరిణామం కూడా జరగవచ్చు కదా! అర్జునుణ్ణి పట్టి బంధిస్తే అప్పుడు మరి ఎలా? స్వర్గమూ ఉండదు, రాజ్యమూ ఉండదు కదా! రెంటికీ చెడ్డ రేవడై పోయినట్లే కదా!’ కానీ అర్జునుడు తిన్నగా చూసే ధనుర్ధరుడు మాత్రమే. ఎవరైనా పక్షధరుడు భగవానునికి తారసపడి ఉంటే కదా! నేనయితే అడిగేవాణ్ణి ‘మహాప్రభూ, అన్ని మనోరథాలూ (కోరికలు) వ్యర్థమే అయినప్పుడు మీరీ రథానేన్నైనా ఎందుకు నడుపుతున్నారు?’ అని. నేను - చినాన్నా, ప్రతిచోటా మీరు మీ తర్కశాస్త్రం తీసుకొస్తారు! చిన్నాన్న ఎందుకు తీసుకురానబ్బాయ్? ఇదే కదా మన దేశంలోని ప్రధాన విద్య. దేన్నైనా ఖండించడానికి, సమర్థించడానికి ఇలాంటి సూక్ష్మబుద్ధి మరెవరికుంది? అడకత్తెరలో పోకచెక్కలు కత్తిరిస్తూ చిన్నాన్న అన్నాడు - చూడు, కృష్ణుడు ఒకచోటనేమో ఇలా ఉపదేశిస్తున్నాడు -- ‘సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాస్మకాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మసంస్తుతిః’ (గీత. 14/24) (సుఖదుఃఖాలను సమానంగా భావించి, ఆత్మస్థుడై ఉంటూ మట్టి గడ్డను, రాతిని, బంగారాన్ని, ఒకటిగానే ఎంచుతూ, ఇష్టానిష్టాలను, నిందాస్తుతులను సమభావంతో ఎవడు స్వీకరిస్తాడో వాడే ధీరుడు). మరోచోట ఈ మాట కూడా అంటాడు - ‘అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేzవ్యయామ్ సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే’ (గీత 2/34) లోకులు నీ తరగని అపకీర్తిని కలకాలము ప్రస్తావించుకుంటూ ఉంటారు. మాన్యుడైన వానికి సంకీర్తి మరణం కంటే బాధాకరమైనదిగా ఉంటుంది) ఒకసారి అనాసక్త కర్మను ఉపదేశిస్తాడు - ‘సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్దాయ యుజ్యస్వ నైనం పాపమవాప్స్యసి’ (గీత 2/38) (సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను, సమానంగా భావించి యుద్ధానికి సన్నద్ధుడవు కా. దీనివల్ల నీకు పాపమంటదు) తర్వాత గెలుపు ఆశ కూడా చూపుతాడు --- ‘తస్మాతం త్వముత్తిష్ఠ యశో లభస్య జిత్వా శత్రూ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్’ (గీత 11/33) (కాబట్టి అర్జునా, లే, యశస్సు పొందు, శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యం అనుభవించు) ఇక నీవే చెప్పు, సుఖం, దుఃఖం, గెలుపు, ఓటమి, కీర్తి, అపకీర్తి అన్నీ సమానమైనప్పుడు భగవానుడు జయము, కీర్తి, వీటి ఆశ ఎందుకు చూపుతున్నాడు? నేను - మౌనంగా ఉండడం చూసి చిన్నాన్నే మళ్ళీ అన్నాడు - అరే, ఒక మాట అడుగుతాను, భగవానుడంటాడు - ‘ఈశ్వరః సర్వాభూతానాం హృద్దేశేzర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా’ (గీత 18/61) (ఈశ్వరుడే సర్వప్రాణుల హృదయాల్లో నెలకొని తన మాయ ప్రభావంతో వానిని కీలు బొమ్మల్లాగా ఆడిస్తున్నాడు.) ఈ మాటే నిజమైతే ఇంత అయోమయం సృష్టించవలసిన పనే ముంది? నేరుగా తన యంత్రమే తిప్పేస్తే సరిపోయేదికదా! ఆయన కోరిక ఎదుట అర్జునుని కోరిక ఏపాటి? తర్వాత మళ్ళీ ‘యథేచ్చసి తథా కురు’ (గీత 18/63) (నీ కోరిక ఎలా ఉంటే అలా చెయ్యి) అనే మాట ఎందుకంటాడు? ఇదే ఆయన ఉద్దేశ్యమైతే ఈ మాటపైనే నిలబడవలసింది. మరి ఇలా ఎందుకన్నాడు - ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః’ (అన్ని ధర్మాలు (కర్తవ్య కర్మలు) వదలి పెట్టి నా ఒక్కని శరణు పొందు. నేను నీకు అన్ని పాపాల నుండి విముక్తి కలిగిస్తాను). అరే, ఇట్లా మాట్లాడేది పండాలు, పురోహితులు, ఫాదరీలే. ఇలా మాట్లాడటం భగవంతునికి శోభిస్తుందా? చిట్ట చివరన ఈ మాటే చెప్పదలచుకొని ఉంటే, ఏడు వందల శ్లోకాల అవసరం ఏముంది? ఒకే శ్లోకార్ధంలో ఈ మాట అని ఉంటే సరిపోయేది కదా - ‘అహమాజ్ఞాపయామి త్వాం తస్మాత్ యుధ్వస్వ భారత!’ (ఓ అర్జునా, నేను నిన్ను అజ్ఞాపిస్తున్నాను, కాబట్టి యుద్ధం చెయ్యి.) నేను - చిన్నాన్నా, నాకు తెలిసినంతవరకు మొత్తం గీత నిష్కర్ష - నిష్కామ కర్మ. చిన్నాన్న - అరే, అదే కదా నాకు బొత్తిగా అర్థం కానిది! ఇచ్ఛాకృత కర్మ (కోరి చేసిన పని) కూడా ఎక్కడైనా నిష్కామంగా ఉండగలుగుతుందా? ఎవరే పని చేసినా ఏదో ఒక కోరిక ప్రేరణతోనే చేస్తారు. అన్ని కోరికలూ త్యజించాలనుకోవడం కూడా ఒక కోరికే కదా! ‘నిష్కామ కర్మ’ అనడంలో వదతోవ్యాఖాత దోషం (ముందు చెప్పిన దాన్ని ఖండించే మరో మాట చెప్పడం) ఉంది. నేను - చిన్నాన్నా, మీ తర్కం ముందు నేనక్కడ నిలబడగలను? కానీ, జీవన్ముక్తునికి మాత్రం ఏ కోరికా ఉండదు కదా! నవ్వుతూ చిన్నాన్న అన్నాడు -- అబ్బాయీ, నాకు మాత్రం ఇంత వరకు ఒక్క జీవన్ముక్తుడు కూడా కనపడలేదు. కనబడితే కర్రతో ఒక దెబ్బ వేసి ఆయన స్థితప్రజ్ఞత ఏ పాటిదో చూసే వాడిని. అరే, ఇవన్నీ ఉబుసుపోక చెప్పే మాటలు! నేను గంభీరంగా అడిగాను - అయితే భగవానుడు అర్జునుణ్ణి యుద్ధానికి ప్రేరేపించడం కోసమే గీత రచించాడని మీ అభిప్రాయమా? చిన్నాన్న గట్టిగా నవ్వాడు. తర్వాత చిటికెడు వక్కపొడి నోట్లో వేసుకొని అన్నాడు - అరే, నువ్వు ఏ లోకంలో ఉన్నావు? ఇవన్నీ కవి కల్పనలు. కవికి ఏదో ఒక ఆధారం కావాలి. తన కావ్య చమత్కారం చూపడానికి, ఒకరు రాముని సందర్భంతో ‘రామగీత’ రాశాడు. మరొకరు శివుని సందర్భం తీసుకొని ‘శివగీత’ రాశారు. మరొకరు గోపికల సందర్భం ఆధారంగా ‘గోపీ గీత’ రాశారు. అదే విధంగా ఎవరో తన జ్ఞానాన్ని ప్రదర్శించేందుకు కురుక్షేత్ర నేపథ్యంతో ‘భగవద్గీత’ రాశారు. నీవే చెప్పు, అంత భయంకరమైన యుద్ధం జరగబోయేముందు పద్ధెనిమిది అధ్యాయాల గీత చెప్పడానికి, వినడానికి తీరిక ఎవరికి వుంది? అంతవరకు పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం త్రాటక ముద్రలో కుంభక ప్రాణాయామం చేస్తూ వుందా? సంజయుని కళ్లల్లో టెలివిజన్ ఫిట్ అయి ఉందా? కవికి ఏదో సాకుతో తన సాంఖ్యయోగ, వేదాంతాల జ్ఞానం ప్రదర్శించుకోవలసి ఉంది, అది ఆయన ప్రదర్శించాడు. నేను - అయితే మరి మీ దృష్టిలో గీత వల్ల ఏ ప్రయోజనమూ లేదా? చిన్నాన్న చిరునవ్వు నవ్వుతూ అన్నాడు - ప్రయోజనం ఎందుకు లేదూ? దీనివల్ల కుటుంబ నియంత్రణకు తోడ్పాటు లభిస్తుంది. ఇదే ఒక ప్రయోజనం! నేను - ఏ విధంగా? చిన్నాన్న - చూడు, గీత సందేశం ఇది -- ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ (కర్తవ్య కర్మ చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది. దాని ఫలితం పైన ఎప్పుడూ ఉండదు.) ఈ శ్లోకంలో సంతాన నిరోధ మంత్రం దాగి వుంది! నేను చకితుణ్ణయి అడిగాను - ఎలా చిన్నాన్నా? చిన్నాన్న - కేవలం కర్మ చేస్తూ పో, ఫలాపేక్ష పెట్టుకోవద్దు, అని కదా సందేశం? ఇక్కడ ఫలం అంటే సంతానం అని అర్థం చేసుకోవాలి మరి. ఇక ఇంతకంటే వివరించి ఎలా చెప్పను? చిన్నాన్నను కదా! నేను - చిన్నాన్నా, మీరు ప్రతి మాటలో వినోదం సృష్టిస్తారు. గీత అనాసక్త భావంతో కర్మ చేయాలని కదా ఉపదేశిస్తుంది.. చిన్నాన్న - అవునబ్బాయ్, ఈ ఉపదేశాన్ని అమలు చేస్తే దేశంలో ఎట్టి పరిస్థుతుల్లోనూ విప్లవం జరగదు. గానుగెద్దుకు బెల్లం ఉండతో ఏమిటి ప్రయోజనం? ఈ జ్ఞానం కార్మికులకు అందితే, కార్ఖానాల్లో ఇక సమ్మె ఎందుకు జరుగుతుంది? కానీ ఇప్పుడు మాత్రం దేశంలో తారుమారైన గీతోపదేశం నడుస్తూ ఉంది - ‘ఫలేష్వవాధికారస్తే మా కర్మణి కదాచన’ (ఫలం పైన మాత్రమే నీకు అధికారం ఉంది, కర్మ పైన ఎప్పుడూ ఉండదు) ఈ నిష్కర్మ భోగవాద వెల్లువను అడ్డగించేందుకు కర్మను, దాని ఫలితాన్ని రెండింటినీ ఒకేసారి తీసుకొని ముందుకు సాగే గీత దేశానికి కావాలి. అలాంటి గీత ఇక కురుక్షేత్రంలో కాక, కృషిక్షేత్రంలో తయారవుతుంది. ఆ గీత వల్ల ఒక కురు (వంశం) అంతరించింది. ఈ గీత వల్ల మరో కురు (కార్యశీలత) మంత్రం ఉదయిస్తుంది. అప్పుడే ‘సుజలాం సుఫలాం శస్యశ్యామలాం’ అనే మన జాతీయగీత సార్థకమవుతుంది! రానున్న తరాలు ఇలా అడుగుతాయి - ‘ధర్మక్షేత్రే కృషిక్షేత్రే సమవేతాశ్చికీర్షవః మామకాః పూర్వజాశ్చైవ కిమకుర్వత భారతే?’ (ధర్మక్షేత్రమైన భారత దేశ కృషి క్షేత్రంలో కర్మణ్య భావంతో వచ్చి చేరిన మా వాళ్లు మా పూర్వీకులు ఏమి చేశారు? ). తెలుగు అనువాదం పురాణ ప్రలాపం (ఆచారాలు - ఆక్షేపణలు)

సంజీవదేవ్ by ముత్తేవి రవీంద్రనాథ్

స్ఫూర్తి ప్రదాత సంజీవదేవ్ -- ముత్తేవి రవీంద్రనాథ్, 98491 31029. పరిచయం :- ఆయనో సాదా సీదా మనిషి. ఆయనకేమీ డిగ్రీలూ గట్రా లేవు. పుట్టింది ఏ పండితవంశంలోనో కాదు - స్థితిపరులైన వ్యవసాయదారుల కుటుంబంలో. బాల్యం కొంతకాలం మేనమామల ఇంట కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కోనాయపాలెంలోనూ, తరువాత జీవితం అంతా తెనాలి సమీపంలోని తన స్వస్థలం తుమ్మపూడిలోనూ గడిచింది. కోనాయపాలెం, తుమ్మపూడి -- ఆ రెండూ కుగ్రామాలే. పసితనం నుంచీ పరిసరాలను ఆసక్తిగా గమనించడం, ప్రకృతి సౌందర్యానికి పరవశించడం, ప్రతి చిన్న విషయానికీ ‘హేతువు’ కనుగొనే ప్రయత్నం చేయడం, తనకు నచ్చని, అసమంజసమనిపించిన పనులను నిర్మొగమాటంగా ఎదిరించడం -- ఇవీ అతడి లక్షణాలు.కోనాయపాలెంలో ఉర్దూ, తెలుగు భాషలను,తుమ్మపూడిలో ఆంగ్ల భాషను తనకోసం నియమించిన ప్రత్యేక ఉపాధ్యాయుల శిక్షణలో కొంతమేరకు నేర్చాడు. తరవాత జీవితంలో స్వయంకృషితో నేర్చుకున్నదే ఎక్కువ. బాల టాగోర్ వలెనే ఈ బాలుడూ పాఠ్యాంశాలకంటే పాఠ్యేతరాంశాలపైనే ఎక్కువ మక్కువ చూపేవాడు. చిన్నప్పుడు విన్న ‘మనుచరిత్ర’ పద్యాలలోని హిమాలయాల సౌందర్యం పట్ల మోహితుడైన ఆ బాలుడు తానుకూడా ‘ ప్రవరుడిలా పాదాలకు లేపనం రాసుకుని ఎప్పుడెప్పుడు హిమాలయాల్లో విహరిస్తానా ?’ అంటూ కలలు కనేవాడు.దివ్యజ్ఞాన సమాజం(Theosophical Society) పట్ల అనురక్తి కలిగిన తన పెదతండ్రి సూర్యదేవర చిన వెంకటక్రిష్ణయ్యగారి ప్రభావం ఆ బాలుడిపై గాఢంగా పడింది.ఆ సంస్థ మహాసభలకు పెదతండ్రితో కలిసి మద్రాసు వెళ్ళిన ఆ బాలుడు అడయార్ లో అనిబిసెంట్ వచోవైభవానికి అబ్బురపడ్డాడు. అదే సందర్భంలో జిడ్డు కృష్ణమూర్తి తనను పలకరిస్తే పులకరించిపోయాడు.మరో పెదతండ్రి కుమారుని కారణంగా ఆయనకు రామకృష్ణ మిషన్ వారి కార్యకలాపాలతోనూ,సాహిత్యంతోనూ కొంత పరిచయం ఏర్పడింది. స్వామి రామతీర్థ చేసిన హిమాలయ యాత్ర గురించి చదివి, హిమాలయాలను దర్శించాలని మరింతగా ఉవ్విళ్ళూరాడు.కృష్ణ శర్మ అనే ఉపాధ్యాయుని ద్వారా పద్నాలుగేళ్ళ వయసులో ఇంటివద్దే హిందీ చదవడం, రాయడం నేర్చాడు. ఆయన వద్ద ఉన్న ‘బెంగాలీ స్వబోధిని’ సాయంతో బెంగాలీ భాషను మక్కువతో నేర్చుకుని, బెంగాలీ సాహిత్యాన్నీ స్వయంకృషితో మథించాడు. పదహారేళ్ళు వచ్చేసరికల్లా హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ భాషల పత్రికలు తెప్పించుకుని చదవడం,పత్రికల సంపాదకులతో ఆ యా భాషలలో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరపడం ఆయనకు అలవాటుగా మారింది.రామకృష్ణ మిషన్ వారి ఇంగ్లిష్ మాసపత్రిక ‘ప్రబుద్ధ భారత్’ సంపాదకుడు స్వామి పవిత్రానందకు లేఖరాసి, తనకు ఆ పత్రిక సంపాదక కార్యాలయం ఉన్న అల్మోరా జిల్లాలోని మాయావతికి వచ్చి ఆయన్నివ్యక్తిగతంగా కలుసుకోవాలనే కోరిక ఉందనీ, అందుకోసం వీలయినంత త్వరలో బయలుదేరి రావాలనుకుంటున్నాననీ తెలియజేశాడు. తన పదహారవ ఏట ఇంటినుంచి ఎవరికీ చెప్పాచెయ్యకుండా హిమాలయాలకు బయల్దేరి, దారిలో లక్నోలో సుప్రసిద్ధ హిందీ నవలా రచయిత మున్షీ ప్రేమ్ చంద్ ని కలిసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ‘గబన్’, ‘నిర్మలా’, ‘షత్రంజ్ కే ఖిలాడీ’, ‘ప్రతిగ్యా’, ‘రంగ్ భూమి’ మొదలైన ప్రేమ్ చంద్ హిందీ రచనలు తాను అప్పటికే చదివి ఆయన అభిమానిగా మారానని చెప్పాడు. సీతాపూర్, రాణీఖేత్, అల్మోరాలమీదుగా అష్టకష్టాలూపడి ఎట్టకేలకు మాయావతి చేరుకుని స్వామి పవిత్రానందను కలిశాడు. హిమాలయాలను చేరుకుని అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించాలనే తన చిరకాల స్వప్నాన్ని అలా సాకారం చేసుకున్నాడాయన. మాయావతి ఆశ్రమంలోని వారంతా బెంగాలీలే అయినా ఆయనకి అక్కడ భావవ్యక్తీకరణలో ఇబ్బందులేమీ కలుగలేదు; తనకున్న బెంగాలీ భాషా ప్రావీణ్యంతో ఆయన వారందరితో కలగలిసి పోయాడు. ఆశ్రమంలో పవిత్రానంద సహాయంతో కొంతకాలం పాశ్చాత్య తర్కం, జ్ఞాన సిద్ధాంతం, సౌందర్య శాస్త్రం మొదలైన అంశాలలో లోతైన అధ్యయనం చేశాడు. కొన్నాళ్ళు అక్కడే మకాంవేసి, అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలను, భాషా సంస్కృతులను నిశితంగా పరిశీలించాడు. అక్కడి దేవదారు, చీడ్ (కర్పూర తైలపు) వృక్షాల గురించే కాదు; కంచర గాడిదలూ, చమరీ మృగాలను గురించి కూడా ఎన్నో విషయాలు అక్కడి వారి నుంచి ఆసక్తిగా తెలుసుకున్నాడు. ఇద్దరు ఫ్రెంచి మిత్రులతో సహవాసం చేసి వారి ద్వారా ఫ్రెంచ్ భాష నేర్చుకున్నాడు. అక్కడి ప్రకృతి రామణీయకతపై ఆంగ్లంలో చక్కటి కవితలు అల్లాడు. అక్కడినుంచి రెండు రోజులు ప్రయాణించి, అస్కోట వెళ్లి అక్కడ నగ్న శరీరాలతో జీవించే ‘రాజీలు’ అనే ఆటవిక జాతి ప్రజలను కలుసుకున్నాడు. వారి వింత ఆచారాలు తెలుసుకున్నాడు. అక్కడినుంచి ఫిలిభిత్ మీదుగా లక్నోవెళ్లి అక్కడి లలితకళల విద్యాలయ ప్రిన్సిపల్, ప్రఖ్యాత చిత్రకారుడు, తన కలం స్నేహితుడు అయినట్టి అసిత్ కుమార్ హల్దార్ (విశ్వకవి రవీంద్రుని మేనకోడలి కుమారుడు)ను కలిశాడు. ‘మీరు బెంగాల్ ప్రాంతపు హలధారులైతే, నేను ఆంధ్రప్రాంతపు హలధారి(రైతు)ని’ అనేవాడట సంజీవదేవ్ ఆయనతో చమత్కారంగా. (హల్దార్ శబ్దానికి ‘హలధారి’ శబ్దమే మూలం. రైతు అని దాని అర్థం). ఆయన నుంచి నైరూప్య కళకు సంబంధించిన పలు విషయాలు సంజీవదేవ్ శ్రద్ధగా రాబట్టాడు. అదే సమయంలో లక్నో వచ్చిన రవీంద్రుడిని, ఎ. కె. హల్దార్ వెంట వెళ్లి కలిసి, రవీంద్రుడు రాసిన బెంగాలీ గీతాలను ఆయనకే శ్రావ్యంగా చదివి వినిపించి, ఆయన మెప్పు పొందాడు. 1937 లో లక్నో నుంచి తుమ్మపూడికి తిరిగివచ్చిన ఆయనలో సాహిత్య పిపాస చెలరేగింది. అప్పటివరకూ ఇతర భాషలలో చేస్తూండిన రచనలకు తోడు తెలుగులోనూ వ్యాస రచన చేయసాగాడాయన. విజయవాడ, దుగ్గిరాల వంటి బయటి ఊళ్లకు వెళ్లి సాహిత్యం, చిత్రలేఖనం మొదలైన విషయాలపై ఉపన్యాసాలిచ్చేవాడు. ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ చిత్రకారుడు, గ్రంథకర్త, పర్యాటకుడు అయిన ప్రొఫెసర్ నికొలాస్ రోరిక్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలెట్టాడు. ఆ దశలోనే విస్సా అప్పారావు, అడివి బాపిరాజు వంటి ప్రముఖులతో పరిచయాలయ్యాయి. ఈ పరిచయాలన్నీ ఒక ఎత్తు; మహా మహోపాధ్యాయ రాహుల్ సాంకృత్యాయన్ తో ఏర్పడిన పరిచయం మరొక ఎత్తు. ఆ పరిచయంతో వారిద్దరి మధ్యా విడదీయరాని బంధం ఏర్పడింది. కమ్యూనిస్టుల నేతృత్వంలో బెజవాడలో 1944 లో జరిగిన అఖిలభారత రైతు మహాసభకు అప్పుడు కమ్యూనిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్న రాహుల్జీ వచ్చారు. అప్పటి యస్. ఆర్. ఆర్. కళాశాల ప్రిన్సిపల్ డా. పుట్టపర్తి శ్రీనివాసాచారి ద్వారా రాహుల్జీని పరిచయం చేసుకున్న సంజీవదేవ్, ఆ కొద్ది పరిచయం ఆధారంగా రాహుల్జీని వారంపాటు తుమ్మపూడికి తన అతిథిగా రప్పించుకోగలగడంలో కృతకృత్యుడయ్యాడు. పూర్వాశ్రమంలోని కేదార్ నాథ్ పాండే బౌద్ధ సన్యాసిగా, ‘రాహుల్ సాంకృత్యాయన్’గా మారి, సంస్కృతం, చైనీస్, పాలీ, టిబెటన్, సింహళీస్ మొదలైన పలు ప్రపంచ భాషలలో పాండిత్యం సంపాదించి, ఆ యా భాషలలో అప్పటికే అంతరించిపోతున్న బౌద్ధ సాహిత్యాన్నిఇతర భాషలలోకి అనువదించి లోకానికి పరిచయం చేసి, ‘మరో కుమారజీవుడ’ ని ఖ్యాతిగాంచిన ఆ మహామహోపాధ్యాయుడికి సంజీవదేవ్ వ్యక్తిత్వంలోని విలక్షణమైన అంశాలు ఎన్నో నచ్చిన కారణంగానే ఆయన ఈ ఆతిథ్యం స్వీకరించారనడంలో ఎంతమాత్రం సందేహంలేదు.(కుమారజీవుడు క్రీ.శ. 325 ప్రాంతాలలో జన్మించి, కాశ్మీర్ లోని బంధుదత్తుని వద్ద సంస్కృతంనేర్చి, ఆ తరువాత చైనాను పాలించిన త్సిన్ వంశీకుల ఆస్థాన పండితునిగా ఉంటూ, 300 కు పైగా బౌద్ధ ఉద్గ్రంథాలను సంస్కృతాన్నుంచి చైనీస్ భాషలోనికి అనువదించి, క్రీ. శ. 413 లో మరణించేనాటికి మూడు వేలమందికి పైగా ఉద్దండ పండితులను తన శిష్యులుగా చేసుకున్న మహాయాన బౌద్ధ శాఖకు చెందిన మహా పండితుడు. ఆయన కారణంగానే చైనాలో బౌద్ధమతం వ్యాపించింది.) తాను రాహుల్జీకి ఆతిథ్యమిచ్చిన వారంరోజులు రాహుల్జీ సాహచర్యం తన జీవితంలో ఎన్నో దీపికలను వెలిగించిందని రాసుకున్నారు సంజీవదేవ్. తుమ్మపూడిలోని బకింగ్ హాం కాలువలో వారిరువురూ తనివిదీరా ఈదులాడారు. సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలైన అమరావతి, నాగార్జున కొండ వారిరువురూ కలిసే దర్శించారు. ఆ సందర్భంగా తనను కలుసుకున్న కొందరు సుగాలీల (లంబాడీల)తో సంభాషించి, లిపి లేని వారి భాషకు అప్పటికప్పుడు ఒక లిపిని రూపొందించి ఇచ్చారట రాహుల్జీ. రాహుల్జీ తన ప్రఖ్యాత రచన ‘ఓల్గా సే గంగా’ పుస్తకాన్నొకదాన్ని సంజీవదేవ్ కు ప్రేమతో బహూకరించారు. రాహుల్జీ అప్పటికే ప్రముఖ కమ్యూనిస్టు నేత అయినందున గుంటూరు జిల్లా కమ్యూనిస్టు పార్టీ వీరిరువురికీ గుంటూరులో విందు ఇచ్చి, సన్మాన సభ జరిపింది. ఆ సభలో ప్రముఖ బుర్రకథకుడు (పద్మశ్రీ)నాజర్ దళం చెప్పిన బుర్ర కథను చివరివరకూ సంజీవదేవ్ తోపాటు తెలుగు తెలియకున్నా రాహుల్జీ కూడా శ్రద్ధగా ఆలకించారట.రాహుల్జీకి ఎన్నో ఇతర భాషలు వచ్చినట్లే తెలుగు కూడా చదవడం వచ్చు. అయితే ఆయన తెలుగు విని అర్థం చేసుకోలేరట. సంజీవదేవ్ కూడా బహుభాషావేత్త. సరికొత్త అంతర్జాతీయ సంధాన భాష ‘ఎస్పరాంటో’ ను కూడా ఆయన నేర్చుకున్నారు.ఇక సంజీవదేవ్ చింతనాధారలోని మార్మికవాద ఛాయలు రాహుల్జీకి నచ్చలేదు. రాహుల్జీ భౌతికవాద దృక్పథాన్ని విని ఆనందించిన సంజీవదేవ్ ఆ దృక్పథాన్ని తనదిగా చేసుకొనేందుకు మాత్రం ఇష్టపడలేదు. ఏ వాదమైనా అది మానవ చైతన్యాన్ని ఊర్థ్వముఖంగా మార్చి, మానవ హృదయంలో ఉన్నతమైన ఆనందాన్ని సృష్టించి, మానవుడిని మానవుడి కంటే పైకి ఎత్తగలిగినప్పుడే అది ఉత్తమవాదమని సంజీవదేవ్ అభిప్రాయం. అటువంటి వాదాన్ని ఏపేరుతో పిలిచినా పరవాలేదనీ, భౌతికవాదం కూడా ఆ విధంగా చేయగలిగినప్పుడు దాన్ని స్వీకరించడానికి కూడా వెనకాడవలసిన అవసరంలేదనీ, అందుకే ఒక మార్మికవాది భౌతికవాదాన్ని చిన్నచూపు చూడాల్సిన పని లేదనీ ఆయన అభిప్రాయం. భౌతికవాదాన్ని మార్మికవాదాన్నుంచి వేరు చేసి, కేవలం భౌతికవాదం మాత్రమే మహత్తరమైనదనే రాహుల్జీ ఆలోచన తనకు నచ్చదని పేర్కొన్నారు సంజీవదేవ్. సమన్వయ దృష్టి లోపించినందున ఆ తరహా ఏకపక్ష దృష్టి తనకు అంగీకారయోగ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా భిన్నమైన వైఖరులు కలిగి ఉన్నప్పటికీ వారిరువురి మైత్రీ బంధం కొనసాగింది. ఇదంతా కేవలం సంజీవదేవ్ జీవితంలోని ఒక పార్శ్వం మాత్రమే. మరెందరో ప్రముఖ వ్యక్తులతో సన్నిహిత స్నేహబంధాన్ని నెరపడం మాత్రమే కాక, రచయితగా, తాత్త్వికునిగా, వ్యాఖ్యాతగా, చిత్రకారునిగా, చిత్రకళా విమర్శకునిగా, చాయా చిత్రకారునిగా, కళా పోటీలలో న్యాయ నిర్ణేతగా, ఉపన్యాసకునిగా, పర్యాటకునిగా, లేఖా స్నేహ శిల్పిగా కేవలం తెలుగు జాతికే కాదు; మొత్తం మానవజాతికి ఆయన చేసిన బహుముఖీనమైన సేవలు అగణితమైనవి. వెలకట్టలేనివి కూడా. 1939 నుంచీ - అంటే తన ఇరవై ఐదవ యేటినుంచీ - కలంపట్టి రచనలు సాగించారు. ఆయన రచనలు అప్పట్లో మద్రాసు నుంచి వెలువడే ‘ఆంధ్రప్రభ’లో ధారావాహికంగా వచ్చేవి. ఎందఱో మిత్రులు, అభిమానులకు ఆయన పుంఖానుపుంఖంగా లేఖలు రాశారు. తెలుగు లేఖా సాహిత్యంలో సంజీవదేవ్ లేఖలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సమకాలీన ప్రపంచంలో దాదాపుగా ప్రముఖ వ్యక్తులందరూ ఆయన కలం స్నేహితులే. మరో ముఖ్యమైన విషయమేమంటే - తనకంటే వయస్సులోనూ, అనుభవంలోనూ ఎంతో చిన్నవారితో కూడా ఆయన ఎంతో శ్రద్ధతో, అంకితభావంతో కలం స్నేహం నెరపేవారు. ఆయన రాసిన లేఖలన్నీ ముచ్చటైన ఆర్ట్ పేపర్ మీద చూడ చక్కని చేవ్రాతతో ఉండేవి. 1960 తరువాత ఆయన రాసిన లేఖలన్నిటికీ తాను స్వయంగా చిత్రించిన ఓ వర్ణచిత్రాన్ని తప్పక జతపరచేవారు. అందుకే ఆయన లేఖల్ని కలం స్నేహితులు తమవద్ద కలకాలం పదిలపరచుకోదగ్గ నిధులుగా భావిస్తారంటే అందులో వింతేమీ లేదు. రవీంద్రుని ‘గీతాంజలి’కి చలం చేసిన అనువాదానికి ‘అనుమేళన’ పేరుతో సంజీవదేవ్ రాసిన ఉపోద్ఘాతం ఆయన లోతైన తాత్త్విక చింతనకు అద్దం పడుతుంది.తన ఇరవై ఆరవ ఏట మరొకసారి ఇల్లు విడిచి పంజాబ్, హిమాలయాలు దర్శించుకున్న ఈ ప్రకృతి ప్రేమికుడు కులూ లోయలో నికొలాస్ రోరిక్ కుటుంబాన్ని కలిశారు.అది ఆయన జీవితంలోని మరో మరపురాని మధురానుభూతి.1914 జూలై మూడవ తేదీన జన్మించిన సంజీవదేవ్ 1950 లో తన 36 వ ఏట సులోచనాదేవిని వివాహమాడారు. నాటి నుంచీ తుమ్మపూడిలోని వారి ఇల్లు అతిథి అభ్యాగతులతో కళకళలాడేది. ఆ దంపతులు ఎందరెందరికో తమ ఇంట మరువలేని ఆతిథ్యాన్నిచ్చారు. అంతకు మునుపు కేవలం సౌందర్యారాధకునిగానూ, కళా విమర్శకునిగానూ ఉన్న సంజీవదేవ్ 1960 నుంచి స్వయంగా కుంచె పట్టి రంగులతో అద్భుతాలు సృష్టించారు.ఆయన స్వీయ చరిత్ర, అనంతసాగరంవంటి ఆయన లేఖాసాహిత్యం, ఇతర రచనలే కాక, ఆంగ్లంలో ఆయన రాసిన ‘Her Life’, ‘ Bio-symphony’వంటి రచనలు ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. లోతైన పరిశీలన, సునిశిత విమర్శ, హాస్యోక్తి - ఈ మూడింటినీ కలగలిపి సమయోచితంగా ప్రసంగించే నేర్పుగల వక్తగానూ ఆయన లబ్ధప్రతిష్ఠులయ్యారు. తనలాగే సామాన్యులెవరైనా దీక్షతో, పట్టుదలతో, స్వయం కృషితో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని నిరూపించిన స్ఫూర్తి ప్రదాత సంజీవదేవ్ గారిని ఆంధ్ర విశ్వ విద్యాలయం ‘ చంద్రునికో నూలుపోగు’ చందంగా గౌరవ డి. లిట్. తో సత్కరించి, తనను తాను గౌరవించుకుంది. తాత్త్వికుడు, మనోవైజ్ఞానికుడు, ప్రకృతి ప్రేమికుడు, చిత్రకారుడు, కళా విమర్శకునిగానే కాక, సౌందర్య పిపాసిగానూ,సాంస్కృతిక వారధిగానూ వాసికెక్కిన ఆ మహనీయుడి స్మృతికి నివాళిగా ఈ శతజయంతి సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడెమి ఈ సాహిత్య సభను నిర్వహించడం ముదావహం. ఈ సందర్భంగా తనను తాను ఒక అపురూప శిల్పంలా తీర్చిదిద్దుకున్న ఆ మహత్తర రూపశిల్పి సంజీవదేవ్ స్మృతికి ముందుగా మనమంతా ఘనంగా అంజలి ఘటిద్దాం. ప్రస్తుత ప్రసంగాంశం సంజీవదేవ్ ఆత్మకథలోని మూడవ భాగమైన ‘గతంలోకి’ పై సమీక్ష. ఆయన స్వీయ చరిత్రలోని మొదటి రెండు భాగాలూ - అంటే ‘తెగిన జ్ఞాపకాలు’, ‘స్మృతి బింబాలు’ - ఆయన బాల్య (5 సంవత్సరాల వయస్సు వరకు) ,కౌమార (5 నుంచి 16 సంవత్సరాల వరకు) , యౌవన ( 16 నుంచి 50 సంవత్సరాల వరకు) దశలకు సంబంధించినవి కనుక సహజంగానే అవి ఘటనా వైచిత్రి కలిగి, అద్భుతరసంతో కూడిన పలు వర్ణనలు, రసపుష్టి కలిగిన అనుభవాలు, అనుభూతులతో నిండి ఉంటాయి. ‘గతంలోకి’ అన్న మూడవ భాగం 1959 తో ఆరంభమై, 1965 తో అంతమౌతుంది. ఇది దాదాపుగా ఆయన వృద్ధాప్యంలో ప్రవేశించిన దశ. ఆ కారణంగా ఈ భాగమంతా ఆయన గతకాలపు అనుభవాలపట్ల లోతైన అంతర్దృష్టితో కూడి, సమీక్షాత్మకంగా ఉంటుంది. ఇందులో తత్త్వ చింతనే ప్రధానాంశం. ఈ దశలో వివిధ సందర్భాలలో పలు అంశాలపై ఆయన వ్యక్తపరచిన భావనలను స్థూలంగా స్పృశిస్తూ, అవి ఒక చింతనా స్రవంతిగా ఎలా రూపుదిద్దుకున్నాయో మనమిప్పుడు తెలుసుకుందాం. బాల్యం వేదనాభరితం సంజీవదేవ్ బాల్యం వేదనాభరితమైనది. తన నాలుగవ ఏటనే తల్లి వెంకాయమ్మని కోల్పోవడం, తండ్రి రామదేవ్ పునర్వివాహం చేసుకోవడం కారణంగా ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. రాచవారి కుటుంబాలలో సర్వ సాధారణమైన (కోనాయపాలెం లోని ఒకప్పటి)కోటలూ, గుర్రాలమీద స్వారీలు చేయడం మొదలైనవి ఆ పసి బాలుడికి ఒక దశలో ఆకర్షణీయంగా అనిపించి ఉండవచ్చునేమోగానీ, వస్తుతః స్వేచ్ఛాప్రియుడైన సంజీవదేవ్ కి తమ కుటుంబాలలోని ప్రత్యేక నియమనిబంధనలు, అప్రజాస్వామిక ఆచారాలు మాత్రం కంటకప్రాయంగా మారాయి. సాధారణంగానే వారి కుటుంబాలలో పిల్లలు తండ్రుల ఎదుటపడి మాట్లాడడం ఉండదు. పైపెచ్చు తండ్రి పునర్వివాహం చేసుకొనడం రుచించని ఆయన, తండ్రికి మానసికంగా మరింత ఎడమయ్యాడు. సంతానంలేక తనను దత్తత తీసుకున్న పెదతండ్రి జోగయ్యగారి భార్య తనపట్ల ఎప్పుడూ నిర్దయగా వ్యవహరిస్తూ, తననుచూసి గుడ్లురుముతూ ఉండిన కారణంగా ఆమె ప్రేమకూ నోచుకోక, ఆమె ఎంత త్వరగా కాలం చేస్తుందా -- అని ఆయన ఎదురు చూసేవాడట. బాల్యంలోని ఈ వేదనాభరితమైన మనః స్థితి కారణంగానే ఆయన తరచు ప్రకృతిలోకి పలాయనం అయ్యేవాడు. ప్రకృతి రామణీయకతకు ముగ్ధుడై గంటలపాటు ఆ తలపులలోనే మునిగితేలేవాడు.ఇంట్లో ఆదరణ కరవైన ఆ బాలుడికి ప్రకృతిలోని ప్రతి వస్తువూ అత్యంత సుందరమైనదిగానే కనుపించడంలో వింతేమీ లేదు. ఆయన ఎప్పుడూ ఇంటినుంచి వెళ్ళిపోయి హిమాలయాల సౌందర్యంతో తాదాత్మ్యం చెంది తద్వారా మానసికంగా ఓదార్పు పొందాలని తపనపడేవాడు. ఆ దశలో మరొక పెదతండ్రి వెంకట కృష్ణయ్య ఆ బాలుడిని ప్రేమగా దగ్గరకు తీశారు. ఆయన దివ్యజ్ఞాన సమాజం అనుయాయి అయినందున ఆ సిద్ధాంతాల ప్రభావం సహజంగానే ఈ బాలునిపైన కూడా పడ్డది. రామకృష్ణ మఠం మరియు అద్వైతాశ్రమం వారి తాత్త్విక చింతనను ఒంట పట్టించుకున్న మరొక పెదనాన్న కుమారుడి ప్రభావం కారణంగా కూడా సంజీవదేవ్ మనస్సు బాల్యంలోనే ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆకర్షితమైంది. ఐహిక జీవనంలో సుఖశాంతులకు నోచుకోని ఆ బాలుడు ప్రకృతి పట్ల ఆకర్షితుడవడం, కొంతమేరకు ఆముష్మిక చింతన బాటపట్టడం అలా ఒక సహజ పరిణామంగానే జరిగాయి. తెలుసుకోవటం - ఇతర్ల గురించీ, తన గురించీ ‘ఆత్మానామ్ విజానీయాత్’ (Know Thyself) అని ఆర్యోక్తి. ప్రతి ఒక్కరూ తనను తాను తెలుసుకోవాలి. అయితే ఏ వ్యక్తికైనా బయటి ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడం కంటే తనను గురించి తాను తెలుసుకోవడం చాలా కష్టమనే భావన అందరిలోనూ ఉంది. ఈ విషయాన్ని చర్చిస్తూ ఆయన ఇలా రాసుకున్నారు. “తనను తాను తెలుసుకోటం ఇతర్లను తెలుసుకొనే దానికంటే ఎక్కువ కష్టం అంటారు. ఇది ఆంశిక సత్యమే కానీ సమగ్ర సత్యం కాదు. అసలు తెలుసుకోటం అనే పని సులభమైంది కాదు. తెలుసుకోటం అనేపని కష్టమైంది అయినపుడు ఎవరిని గురించి తెలుసుకోటమైనా సులభం కాదు. కొన్ని విషయాల్లో ఇతర్లను గురించి తెలుసుకోటం సులభం. మరికొన్ని విషయాల్లో తనను గురించి తెలుసుకోటం కష్టం, ఇతర్లను గురించి తెలుసుకోటం సులభం. అందువల్ల రెంటిలోనూ కష్టం ఉన్నది, రెంటిలోనూ సౌలభ్యం ఉన్నది. ఇతర్లలోని లోపాలను తెలుసుకోటం సులభం. తనలోని లోపాలను తెలుసుకోటం కష్టం.” స్వీయ చరిత్ర ఎలా ఉండాలి ? అనే విషయంమీద రాస్తూ ఆయనిలా అంటారు. మానవుడు వైయక్తిక జీవి కాదు. సామాజిక జీవి. సమాజంలో జీవిస్తాడు కనుక అతని స్వీయ చరిత్ర అంటే అందులో తోటి సామాజిక జీవుల కథలు చాలా వస్తాయి. ఇతరుల కష్టసుఖాలనుండి తాను దూరంగా జీవించలేడు కనుక తన స్వంత కష్టసుఖాలకు మాత్రమే స్పందించక ఇతర్ల కష్టసుఖాలకు కూడా తాను స్పందిస్తాడు. తాను ఏమి తింటున్నాడు, ఏమి త్రాగుతున్నాడు, ఏమి చదువుతున్నాడు, ఏమి ఆలోచిస్తున్నాడు, ఏమి ఆకాంక్షిస్తున్నాడు అనేవి ఇతర్లకు అంత ప్రాముఖ్యం కావు. తన స్వంతాలు అనేవి సాధారణీకరణ అనే ప్రక్రియ ద్వారా విశ్వజనీనంగా మారినపుడే అవి ఇతర్లలో అభిరుచిని రేకెత్తించేది. స్వీయ చరిత్రలలో ఈ ప్రక్రియ మృగ్యమైనపుడు స్వీయ చరిత్ర అంటే కేవలం తన స్వంత డప్పును తాను వాయించుకోటమే అవుతుంది. ఏమి రాయాలా ? అనేదాని కంటే దేన్ని వర్జించాలా అనేది నిర్ణయించడం ముఖ్యం. వ్రాసేవి తక్కువ, వ్రాయకుండా వదిలేవి ఎక్కువ వున్నప్పుడే రచన, ప్రత్యేకించి స్వీయ చరిత్ర రక్తికడుతుంది. గొప్పవారిని మాత్రమే గురించి వ్రాసి, కొద్దివారిని వదలివేస్తే అటువంటి స్వీయ చరిత్ర మానవతకు దూరమై మనిషిలోని మనుష్యత్వానికి భంగం కలిగిస్తూ, అది ఉన్నత స్థాయికి చెందిన స్వీయ చరిత్ర అనుపించుకొనదు. ఒక వ్యక్తి తనలోని గుణదోషాలు రెంటినీ దాచక బయల్పరచినపుడే అది ఉన్నత శ్రేణికి చెందిన స్వీయ చరిత్ర అవుతుందంటారు సంజీవదేవ్. ప్రయాణంలో వింత అనుభవం 1959 ఆయన మొదటిసారిగా హైదరాబాద్ వెళ్ళారు. భార్య సులోచన, కుమారులు జోగేంద్ర, మహేంద్రలతో పాటు బేగంపేట పబ్లిక్ స్కూలులో చదువుతున్న మేనల్లుడు సుధా స్వరూప్ ని కూడా వెంట తీసుకుని విజయవాడ నుంచి హైదరాబాద్ బస్సెక్కారాయన. ఈ బస్సు ప్రయాణం సంజీవదేవ్ లోని ఒక వింత కోణాన్ని ఆవిష్కరిస్తుంది. సహజంగా బస్ లో ప్రయాణం చేసే ఎవరైనా ఏదైనా చదువుకోవడమో, సహ ప్రయాణికులతో మాటలాడడమో, లేక కుదిరితే సీట్లోనే జారగిలబడి నిద్రపోవడమో చేస్తారు.కాని ఆయన మాత్రం వింతగా తన తోటి ప్రయాణికులంతా సంతోషంగా ఉన్నారో లేదో తెలుసుకొనడానికి వారందరి ముఖాల్నీ పరిశీలనగా చూశారట. అందరూ సంతోషంగా కనుపించారుగానీ ఒక మధ్యవయస్కుడైన పెద్ద మనిషి మాత్రం ఏదో దిగులుగా, ఆందోళనగా ఉన్నట్లు కనుపించాడట. ఇక సంజీవదేవ్ కి మనసు ఆగలేదు. ఎలాగైనా ఆ పెద్దాయన్ని పలకరించి ఆయన దిగులుకి కారణం కనుక్కోవాలని ఒకటే ఆరాటపడ్డారాయన. మధ్యలో సూర్యాపేటలో బస్ ఆగి, అందరూ కిందకి దిగినప్పుడు, ఆ పెద్దాయన ఎవరికోసమో వెతుకులాడుతున్నట్లు అనిపించి, చొరవచేసి ‘ ఎవరికోసం చూస్తున్నారు ? మీరెందుకో ఆందోళనగా ఉన్నట్లున్నారు. మీ దిగులుకి కారణం ఏమిట’ని అడిగారాయన. తన పదహారేళ్ళ కుమారుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడనీ, అతడిని వెతకడానికే తిరుగుతున్నాననీ, అతడు క్షేమంగా ఉన్నాడో లేదోనని ఆందోళనగా ఉందనీ ఆ పెద్దాయన తెలిపాడట.ఆయన విచారానికి కారణం తెలుసుకున్న తరువాత తన మనసు కుదుటపడ్డదనీ, ఆ కారణం తనకి అంత బరువైనదిగా తట్టలేదనీ పేర్కొంటూ పదహారేళ్ళ కుమారుడు కనుక అతడు ఎక్కడికీ పోడనీ, ఇంటినుంచి తీసుకెళ్ళిన డబ్బు అయిపోయే వరకు ఏ పట్టణంలోనో తిరిగి, అది అయిపోగానే తిరిగి ఇంటికి చేరుకుంటాడనీ ఆ పెద్దాయనను అనునయిస్తారాయన. ఈ సందర్భంగా ఆయన ‘అయినా, ఎవరి బాధ వారికి బరువుగానే తడుతుంది. ఒకరి బాధలోని బరువు మరొకరికెలా తెలుస్తుంది ?’ అని రాసుకున్నారు. తాను ఇంట్లో చెప్పాపెట్టకుండా సొమ్ములు తీసుకుని హిమాలయాలకు చెక్కేసింది కూడా పదహారవ ఏటనే కావడం గమనార్హం. నమ్మకం- విశ్వాసం హైదరాబాద్ లో ఒకప్పటి గుంటూరు జిల్లా కలెక్టరు (తరువాత కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) భగవాన్ దాస్, ఆయన సతీమణి ప్రమీల, ప్రభుత్వ ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ విశ్వనాథ ముఖర్జీ, వైస్ ప్రిన్సిపల్ మసూద్ సాబ్, రాజా త్రియంబక్ రాజ్ బహదూర్ మొదలైన వారితో ఫోటోగ్రఫీ, చిత్రకళలపై ఆయన జరిపిన చర్చలు లోతైన ఆయన కళాదృష్టినే కాదు; కళావిమర్శకునిగా ఆయన సమున్నత స్థాయినీ తెలుపుతాయి. ఆయన, భగవాన్ దాస్, రాజా త్రియంబక్ - ఈ ముగ్గురూ అప్పుడు హైదరాబాద్ లో జరిగిన ఒక అంతర్జాతీయ ఫోటోగ్రాఫుల పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.ఆ ఫోటో ప్రదర్శనను గవర్నర్ ప్రారంభించాల్సి ఉంది. జడ్జింగు పూర్తయిన తరువాత తాను జడ్జిగా తన విధిని సక్రమంగా నేరవేర్చానా ? లేదా ? అనే సందేహం ఆయనకి కలుగుతుంది. ఈ సందర్భంగా ఆయనలో అంతర్మథనం ఇలా సాగింది. ‘ జడ్జింగ్ సమయంలో ఫోటోగ్రాఫర్లెవరికీ అన్యాయం చేయలేదు గదా ! అని జడ్జింగ్ ను ఒకసారి గుర్తు తెచ్చుకున్నాను,చేయలేదనే నమ్మాను. నమ్మడానికి, వాస్తవానికి సంబంధం లేదు. నమ్మింది నిజం కావాలని ఎక్కడుంది ? నమ్ముతున్నవాడు దాన్ని నిజమనే నమ్ముతాడు. అయితే నమ్మినదంతా నిజం కాకూడదనేదేముంది ? నమ్మింది నిజమయేదీ వుంటుంది, నిజం కానిదీ వుంటుంది. కనుక ఏ వ్యక్తి కూడా కేవలం విశ్వాసం మీద ఆధారపడి వుండరాదు. తాను నమ్మింది మాత్రమే నిజమనే మొండితనం కీడు తెస్తుంది,’ అంటారాయన. పిల్లల విద్య తన మేనల్లుడు సుధాస్వరూప్ ను శలవుల తరువాత తిరిగి స్కూల్ లో చేర్చి రావడానికి ఆయన బేగంపేట పబ్లిక్ స్కూల్ కి వెళ్ళినప్పుడు ‘పబ్లిక్ స్కూలులో చదువు ఎంత బాగుంటుందో తెలియదు కానీ, పబ్లిక్ స్కూల్ మాత్రం చాలా బాగుంది’ అని వ్యాఖ్యానిస్తారాయన. ఆ సందర్భంగా పిల్లల విద్య గురించి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు అచ్చం విద్యా తత్త్వం (Educational Philosophy) గురించిన రవీంద్రనాథ్ టాగోర్ భావాల్లాగానే ఉండడం విశేషం. ఆ భావాలేమిటో ఆయన మాటల్లోనే చూడండి. ‘పిల్లల విద్య అనేది ఒక గొప్ప సమస్య అయింది. ప్రత్యేకించి మనదేశంలో విద్య అనేది పిల్లలకు ఒక నిబంధన అయింది. చదువుకోవడం అనేది ఒక ఇష్టంలేని కర్తవ్యం అయింది కాని ఒక మధురమైన స్వేచ్చామయమైన వినోదం కాలేదు పిల్లలకు. పాఠశాల అనేది వాళ్లకు ఆనందదాయకమైన క్రీడానికేతనం కాక నేర్చుకొనే జైలు మాత్రమే అయింది. విద్యాభ్యాసం, ఆనందం ఈ రెండూ ఒకే వస్తువు కావాలి. అప్పుడు కాని పిల్లల విద్యకు మంచి భవిష్యత్తు ఉండదు.’ సత్య నిష్ఠ ఆత్మకథా రచనలో సంజీవదేవ్ ఎంతటి సత్య నిష్ఠను పాటించారో తెలిపే ఒక సన్నివేశాన్ని గురించి తప్పక చెప్పుకోవాలి. హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించడానికి వచ్చిన అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ భీమసేన్ సచార్ కు సంజీవదేవ్ ను పరిచయం చేసిన భగవాన్ దాస్ గవర్నర్ కి తాము జడ్జ్ చేసిన ఛాయాచిత్రాల విశేషాలను వివరించే పనిని అప్పగించారు. ముందుగా కొంతసేపు ఆయన ఒక్కొక్క ఫోటోగ్రాఫు - దానిలోని వస్తువు, సాంకేతిక విషయాల - గురించి వివరంగా గవర్నర్ కి విశదీకరించారట. అయితే ఆయన వివరిస్తున్న విషయాలేవీ గవర్నర్ కి అర్థం అవుతున్నట్లు లేవని గ్రహించి కొంతసేపటి తరువాత ఇక వివరించడం మానేశారట ఆయన. ఛాయాచిత్ర కళకు సంబంధించిన లోతైన విషయాలు బొత్తిగా తెలియని గవర్నర్, వ్యాఖ్యాతను ఏదో ఒకటి ప్రశ్నించాలి కనుక ‘అక్కడ తెల్లగా ఎందుకుంది ?’, ‘ఇక్కడ నల్లగా ఉందేం ?’ అంటూ అడగడం మొదలెట్టారట. దాంతో సంజీవదేవ్ కి విసుగు జనించి, తాను మాట్లాడుతున్నది ఒక రాష్ట్ర గవర్నరుతో అనే వెరపు ఎంత మాత్రం లేకుండా అంతే వ్యంగ్యంగా ‘ అక్కడ నల్లగాలేదు కాబట్టి తెల్లగా ఉంది’, ‘ఇక్కడ తెల్లగా లేదు కనుక నల్లగా ఉంది’ అంటూ ముక్తసరిగా సమాధానాలిచ్చారట. ఈ ఘటనను గుర్తుచేసుకుంటూ ఆయన తన ఆత్మకథలో ఇలా రాశారు, ‘ నాకు అనిపించింది, మంచి తెలివిగలవారిని గవర్నర్లుగా నియమించరేమో అని.’ ఇలా ఒక రాష్ట్ర గవర్నర్ గురించి రాస్తూ కూడా ఆయన నిర్భీతితో కూడిన సత్య నిష్ఠను పాటించడం ఆయన వ్యక్తిత్వంలోని మెచ్చదగ్గ విశేషం. చందూలాల్ మాధవలాల్ త్రివేదీ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ గవర్నర్ గా 1957 నుంచి 1962 వరకు పూర్తికాలం పనిచేసిన భీమసేన్ సచార్ (1894-1978) అంతకు పూర్వం పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ, ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ గానూ పనిచేసిన వ్యక్తి. విఖ్యాత రచయిత, జర్నలిస్టు కులదీప్ నయ్యర్ భీమసేన్ సచార్ అల్లుడే. పంజాబ్ హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజిందర్ సచార్ భీమసేన్ కుమారుడే. అలాంటి ప్రముఖ వ్యక్తి గురించి రాస్తూ కూడా ఎంతమాత్రం వెరపులేని సత్యనిష్ఠను పాటించడం సంజీవదేవ్ ప్రత్యేకతగా మనం చెప్పుకోవాలి. చిత్రకళలో వాస్తవ వాదం - ఆదర్శ వాదం 1959 జనవరి 23 వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ‘ Realism and Idealism in Art’ అన్న అంశంపై ఇచ్చిన ఉపన్యాసంలో కళలలో వాస్తవవాదానికీ, ఆదర్శవాదానికీ గల తేడాను విడమరచి చెప్పారాయన. ప్రతి కళ వాస్తవవాదంలో జన్మించి, ఆదర్శవాదంతో పరిణతి చెందుతుంది.వాస్తవవాదం బాహ్య రూపాలు ఏవిధంగా ఉంటే ఆ విధంగా ఉన్నట్టు చూపుతుంది. ఆదర్శవాదం బాహ్యరూపాలు ఏ విధంగా ఉంటే బాగుంటాయో ఆ విధంగా ఉండాలని చూపుతుంది. ఒకరి ముక్కు వంకరగా ఉంటే వాస్తవవాది ఆ వంకర ముక్కునే చిత్రించి వూరకుంటాడు. ఆదర్శవాది అలాకాక, ఆ ముక్కు ఎలావుంటే బాగుంటుందో అలా చిత్రిస్తాడు. బాహ్య రూపాలన్నీ చిత్రకారుడికి ముడిసరకుల వంటివి. కళాకారులు తమ ఆదర్శ దృష్టికి అనుగుణంగా తమకు కావలసిన రీతిలో వాటిని మలుచుకొంటారు. ప్రకృతిలో నీలాకాశం క్రింద ఆకుపచ్చని ఆకుల చెట్టుంటుంది. కాని నీలము, ఆకుపచ్చ అంత సరైన వర్ణ సమ్మేళనం కావు. ఆ కనిపించే విధంగానే వాస్తవవాదంలో చిత్రిస్తే ఆ చిత్రం అంత సొంపుగా గోచరించదు. నీలాకాశం కింద పసుపురంగు ఆకుల చెట్టు ఉంటే ఆ దృశ్యం సురమ్యంగా ఉంటుంది. కనుక ఆదర్శవాద చిత్రకారుడు నీలాకాశం నేపథ్యంలో చిత్రించేటప్పుడు చెట్టు ఆకులకు పసుపు రంగు వాడేందుకు ఏ మాత్రం సందేహించడు. ఏ కళలో ప్రకృతి రూపాంతరం చెందుతుందో అదే ఉత్తమ కళ. ఇందుకు ప్రముఖ ప్రాచ్య, పాశ్చాత్య చిత్రకారుల కళాకృతుల నుంచి ఉదాహరణలు చూపుతూ ఆ సభలో ప్రసంగించారాయన. సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. రస తత్త్వం, చిత్ర కళా రీతులు, కళా విమర్శ, సంస్కృతి, సాంస్కృతిక జీవనం, ప్రపంచ భాషల తీరుతెన్నులు , విశ్వ సంధాన భాష ‘ఎస్పరాంటో’ఆవశ్యకత, విశ్వ సంస్కృతి వగైరా ఎన్నో అంశాల మీద ఆయన పలు సందర్భాలలో విలువైన ప్రసంగాలు చేశారు. క్లుప్తంగా, సూటిగా ప్రసంగిస్తూ, తాను చెప్పదలచిన విషయాన్ని తేలికైన భాషలో శ్రోతల హృదయాలలో నాటుకునేటట్లు చెప్పడంలో ఆయన దిట్ట. పిల్లల పట్ల శ్రద్ధ హైదరాబాద్ లో పదిరోజులు గడిపి, ఆయన కుటుంబంతో సహా తుమ్మపూడికి తిరుగు ప్రయాణం అయ్యారు. బస్సు ఎక్కగానే ఆయనకి ఇంట్లోంచి వెళ్ళిపోయిన తన పదహారేళ్ళ కొడుకుకోసం వెతుకుతూ వచ్చిన పెద్దమనిషి గుర్తుకొచ్చాడు. అప్పుడు సంజీవదేవ్ ఇలా తలపోశారు. ‘ ఆయనకు తన కుమారుడు దొరికాడో లేదో. ఇంటినుంచి పారిపోయిన పిల్లలూ బయటికిపోయి సుఖపడరు, ఆ పిల్లల తల్లిదండ్రులూ సుఖపడరు. పిల్లలు చెప్పకుండా దేశం మీద పోవడంలో అంతా పిల్లల తప్పే కాదు, పెద్దల తప్పు కూడా ఉంటుంది అందులో. పిల్లలు కనపడకుండా పోయినప్పుడు, వాళ్ళ మీద కనపరచే కనికరం వాళ్ళు ఇంటి దగ్గర ఉండగానే కనపరుస్తూ ఉంటే వాళ్ళసలు ఇల్లు వదలడం అనేదే జరగదు.’ తన బాల్యంలో తాను గడిపిన నిరాదరణపూర్వక వేదనామయ జీవితం కారణంగానేనేమో ఆయనకు పిల్లలన్నా, వారి మనస్తత్త్వాలన్నా ప్రత్యేక శ్రద్ధ. ఒకసారి గొర్రెపాటి వెంకటసుబ్బయ్య గారి చిన్న కుమార్తె తన ఒకే ఒక్క కుమారుడిని అనాథగాచేసి, మరణించిందని తెలిసి గొర్రెపాటి వారికి సానుతాపం తెలియజేద్దామని సంజీవదేవ్ విజయవాడ వెళితే, ఆయన స్థితప్రజ్ఞతతో బాధను అణచుకుని, లేని నవ్వు తెచ్చిపెట్టుకుని నవ్వారట. అప్పుడు సంజీవదేవ్ ఆలోచనలు ఇలా సాగాయి. ‘ఇక ఆయన్నేం సముదాయిస్తాం ? ఆయనసలు నా ఎదుట దుఃఖాన్ని చూపితేగా నేను ఆయన్ని ఓదార్చాల్సింది ? ఆయన దుఃఖాన్నే కనపరచనప్పుడు ఇంకా నేను ఎవరిని ఓదార్చేది ? మూసివున్న తలుపులను తీయడానికి ఉంటుంది. కాని మూయని తలుపుల్ని ఇంకా తీయడానికి వీలేముంటుంది? విపత్తు తల్లిలేని బిడ్డలదే. తల్లి లేని బిడ్డడుగానే నేను చిన్నతనం నుంచీ పెరిగాను. నాకు తెలుసు ఆ ఆవేదన. అందువల్ల నేను బాధపడింది వెంకట సుబ్బయ్యగారిని గురించి కాక, తల్లి లేని వెంకట సుబ్బయ్యగారి మనుమడిని గురించి,’ అని రాసుకున్నారాయన. చిన్న పిల్లల పట్ల - ప్రత్యేకించి తల్లిలేని పిల్లలపట్ల - ఆయనకున్న ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులను ఈ ఘటనలు తెలుపుతాయి. కళ ఎందుకోసం ? సమకాలీన సమాజంలో ‘కళ కళ కోసమా ? కాసు కోసమా ? లేక ప్రజలకోసమా ?’ అనే చర్చ మనం తరచు వింటూ ఉంటాం.కళ కాసుకోసమనేవారి వాదన పక్కనబెట్టి, ముందుగా కళ ప్రజల కోసమనేవారి వాదన ఏమిటో చూద్దాం. వారి దృష్టిలో ప్రజలు తమ ఆనందం కోసం సృష్టించుకున్నవే ఈ కళా రూపాలన్నీ. రోజంతా శ్రమించే సామాన్య జనం తాము సృష్టించుకున్న ఈ కళారూపాలను ప్రదర్శిస్తూ కొందరు, చూస్తూ మిగిలినవారందరూ తమ శారీరక శ్రమలోని భారాన్ని మరచిపోయి, ఆనందం పొందేవారు. అందుకే కళలు దైవ సృష్టి కాదు ; వాటిని ప్రజలు తమ ఆనందం కోసం తామే తమ అవసరం కొద్దీ సృష్టించుకున్నారనీ ; కాబట్టి కళలు కళల కోసమూ కాదు; కాసుకోసమూ కాదు ; అవి ప్రజల కొరకేననీ వారి అభిప్రాయం. వారి దృష్టిలో ప్రయోజనంలేని కళ కళ కాదు.కళకు ప్రయోజనమే కాదు; నీతి కూడా ఉండాలని ఇంకొందరి అభిప్రాయం. జీవితంలోనూ, కళలోనూ కూడా నీతి ప్రధానమైన అంశమని వారి భావన.కళ మానవ శ్రేయం నిమిత్తం, మానవుని నైతిక వికాసం నిమిత్తం అని వారి అభిప్రాయం. కళ కళ నిమిత్తమే అనే వాదన సరికాదు. ‘నీతిలేని కళ కోతికంటే హీనం’ అంటారు వారు. ఈ విషయంలో సంజీవదేవ్ అభిప్రాయం భిన్నంగా ఉంటుంది. కళ అనేది నీతికి చెందిందీ కాదు. అవినీతికి చెందిందీ కాదు. అది నీతికీ, అవినీతికీ అతీతం. అందుకే ఆయనిలా రాసుకున్నారు, ‘ నీతిలేనివాడు కోతికంటే హీనుడు అనే సామెత నాకు అస్సలు నచ్చదు, కోతి హీనమైంది కాదు కనుక. కళలో నీతి, అవినీతి అని ప్రభేదం అవసరం లేదు. కళ ప్రధాన లక్ష్యం రసానందాన్ని ప్రసాదించడమే కాని నీతిని గురించి కానీ, అవినీతిని గురించి కానీ సందేశాలివ్వడం కాదు. కళ కేవలం ఒకదాని నిమిత్తమే కాక, కళ చాలా వాటి నిమిత్తం ఉంటుంది. కళ కళ కొరకే అనడంలో కానీ, కళ నైతిక సందేశం అందిచడం కొరకే అనడంలో కానీ, కళ ఆధ్యాత్మిక సత్యాన్ని వెలిబుచ్చే నిమిత్తం మాత్రమే అని కానీ అనడం కళలోని ఒక పార్శ్వాన్ని చూడడం మాత్రమే అవుతుంది. కనుక కళ అనేది వీటి అన్నింటి నిమిత్తం కూడా, ఇంకా ఎన్నింటి నిమిత్తమో కూడా.’ కళా తత్త్వాన్ని గురించి సంజీవదేవ్ వెలిబుచ్చిన ఈ అభిప్రాయాలు అచ్చంగా అరవిందుల అభిప్రాయాలను పోలి ఉండడం విశేషం. ప్రజలకు తిరుపతి స్వామి మీద ఆకర్షణ ఒకసారి తిరువణ్ణామలైలో ఉన్న చలం గారిని కలుసుకునే నిమిత్తం ‘బాలబంధు’ బి. వి. నరసింహారావు, సంజీవదేవ్ పాసింజరు ట్రైన్ లో బయలుదేరారు. మధ్యదారిలోని అన్నిస్టేషన్లనూ వివరంగా చూస్తూ అక్కడి విశేషాలు ప్రత్యక్షంగా గ్రహించడానికీ, ప్రయాణంలో తటస్థపడే సామాన్య జనం వేష భాషలు, సంస్కృతి వగైరాల గురించి లోతుగా తెలుసుకొనడానికీ, దూర ప్రయాణాలలో కూడా ఆయన పాసింజరు ట్రైన్లలో ప్రయాణించడానికే ఎక్కువ ఇష్టపడేవారు. దారిలో రేణిగుంట రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగినప్పుడు అక్కడ తిరుపతి పోయేవారు, తిరుపతి నుంచి తిరిగి వచ్చేవారు పెద్ద సంఖ్యలో కనుపించారు. అది చూసిన ఆయన లౌకిక భక్తిలోని మూఢత్వం పట్ల ఆందోళన చెందుతూ, ఈ విషయమై తన మనోభావాలను ఇలా అక్షరబద్ధం చేశారు. ‘ ప్రజలలో తిరుపతి స్వామి మీద ఇంత ఆకర్షణ ఎందుకో. వీరు కోరే కోరికలన్నిటినీ ఆ స్వామి తీరుస్తాడని వీరి నమ్మకమే ఈ ఆకర్షణకు కారణం. అయినా, పరిశీలించి చూస్తే ఎవరి కోరికలూ తీరుతున్నట్లు కనుపించవు. కోరికలు తీరినవారు స్వామి మహత్యంవల్ల తీరినాయని నమ్ముతుంటే తీరనివారు తాము స్వామికేదో అపచారం చేసివుంటాం కనుక తమ కోరికలు తీరలేదని తిరిగి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంటారు. ప్రతి మతంలోనూ ఇటువంటి లౌకిక భక్తి ఉంటూనే ఉంటుంది. హిందూ మతంలో కూడా ఉన్నది. కాని, దీని మూలంగా ప్రజలలో మూఢత్వం ఎక్కువై పోతుందనడంలో సందేహం లేదు.’ ‘ నేటి సమాజంలో, ఈ వైజ్ఞానిక యుగంలో, నవభావ స్రవంతి ప్రవహించే ఈ ఇరవయ్యో శతాబ్దంలో హేతువాదం వికసించడానికి బదులు తిరుపతి భక్తి వికసిస్తున్నందుకు ఆశ్చర్యంగా ఉంది. సమాజం ముందుకు నడుస్తున్నదా ? వెనుకకు నడుస్తున్నదా ? అని నిర్ణయించడానికి కూడా వీలు లేకుండా ఉన్నది. ముందుకు నడుస్తున్నా ఇటువంటి మూఢత్వం ఉండడానికి వీల్లేదు. వెనుకకు నడుస్తున్నా ఇటువంటి మూఢత్వం ఉండడానికి వీలులేదు. పూర్వం ఉపనిషత్తుల కాలంలోకి పోతే ఆనాటి మతం అనేది, నేటి మతం ఉన్నంత చౌకబారుగా, మూఢత్వంగా హ్రస్వ దృష్టితో ఉన్నంతగా లేదు. కనుక నేటి సమాజం ముందుకు పోకపోగా, వెనక్కికూడా పోతున్నట్టు లేదు. ముందుకు, వెనుకకు కూడా నడవని ప్రవాహం నిలిచిపోయిన మురుగునీటి మడుగు అవుతుంది.’ సరిగ్గా ఇలాంటి భావాలనే వ్యక్తపరుస్తూ ప్రముఖ అభ్యుదయ కవి గజ్జెల మల్లారెడ్డి తన కవితలో ‘ తెలుగునాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది- డ్రైనేజీ స్కీములేక డేంజరుగా మారుతోంది’ అని రాశారు. అనువాద ప్రక్రియ ‘బాలబంధు’ బి. వి. నరసింహారావు రాసిన ‘పాలబడి పాటలు’ కు పరిచయ వాక్యాలు రాయడమే కాక, ఆసక్తితో ఆ పాటలన్నింటినీ తర్జుమా చేసి ఇంగ్లిష్ కవితలుగా మార్చేశారు సంజీవదేవ్. శ్రవ్యప్రధానమైన ఈ పాటల్ని తెలుగులోంచి ఇంగ్లిష్ కవితలుగా తర్జుమా చేయడంలో చాలా కష్టం వేసిందని చెపుతూ, అందుకు ఉదాహరణగా ఒక పాటను పేర్కొన్నారాయన. బంతి పువ్వు- చేమంతి పువ్వు బీర పువ్వు - కరవీర పువ్వు జాజి పువ్వు - విరజాజి పువ్వు వంగ పువ్వు- సంపెంగ పువ్వు. ‘దీనిని ఇంగ్లిష్ లోకి మార్చాలంటే ఏ విధంగానూ కుదరదు. అందుకని ఆ పూవుల పేర్లనే ఇంగ్లిష్ అక్షరాలలో వ్రాసి సంతృప్తి చెందాను !!’ అని రాశారాయన. ఆ సందర్భంగా అనువాద ప్రక్రియ గురించి ఇంకా ఇలా రాశారాయన - “ సాహిత్య జగత్తులో అనువాదం అనేది విచిత్రమైన కార్యం. అనువాదం అనేదే లేకపోతే ప్రపంచంలో ఏ భాషలోని ఉత్తమ రచన ఆ భాషలోనే ఉండిపోయి, ఇతర భాషలవారికి అందుబాటులో ఉండేది కాదు. ప్రతి వ్యక్తీ ప్రపంచంలోని రెండువేల ఏడు వందల తొంభై రెండు భాషలను నేర్చుకోవాలంటే ఒక జీవితం కాదుగదా, ఎన్ని జీవితాలైనా చాలవు. ఈ బాధ లేకుండా చేసింది అనువాదం అనేది. ఏనాడు ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ ఈ అనువాద పద్ధతిని, ఇదొక మహోపకారం సాహితీ జీవులకు. అనువాదం అనేది చాలా కష్టసాధ్యమైన పని. ఏ భాషనుంచి అనువాదం చేస్తారో, ఆ భాషలోనూ అనువాదకర్తకు దక్షత ఉండాలి. భాషలలో దక్షత ఉన్నా కొందరు మౌలిక రచనలను మాత్రమే చేయగలరు కానీ, అనువాదం చేయజాలరు. నా వరకు నాకు అనువాదం చేయడమంటే చాలా బాధతో కూడుకొన్న పనిగా గోచరిస్తుంది. అనువాదం చేయడానికి ప్రత్యేక వ్యక్తులుంటారేమో అనిపిస్తుంది. సరే, ఎవరికి చేతగాని పని వారికి కష్టంగా తడుతుంది !!” అని రాసుకున్నారాయన నిజాయతీగా. ఇది చదివిన వెంటనే ‘ పాలబడి పాటలు’ లో అనువాదం ఏ విధంగానూ కుదరదని ఆయన ఆ పూల పేర్లను మాత్రం ఇంగ్లిష్ అక్షరాలలో రాసి (Transliterate చేసి) వదిలేసిన ఆ పద్యాన్ని అనువదిద్దామని(Translate చేద్దామని)పించింది నాకు. ఇదిగో ఆ పద్యానికి నా అనువాదం - చిత్తగించండి. Blooms of Marigold and Chrysanthemum, Blossoms of Luffa and Oleander, Florets of Needle and Star Jasmine, And of Aubergine and Gold Flowers. ( బంతి - Marigold; చేమంతి - Chrysanthemum; బీర - Luffa (Sponge Gourd); కరవీర లేక గన్నేరు - Oleander; సన్నజాజి- Needle Jasmine; విరజాజి - Star Jasmine; వంగ - Aubergine or Egg Plant or Brinjal; సంపెంగ - Gold Flower. Bloom, Blossom, Flower - ఇవన్నీ పర్యాయ పదాలే. Floret అంటే చిన్న పువ్వు. అందుకే ఆ పదాన్ని చిన్నవైనట్టి సన్నజాజి, విరజాజి, వంగ పూలకు వాడాను.పద్యంలో ఏకవచనం కంటే బహువచనమే బాగుంటుందని Flowers, Florets, Blooms, Blossoms అని వాడాను.) రచనా వ్యాసంగం - ఉపన్యాసాలు రచనా వ్యాసంగం, ఉపన్యాసాలు - ఈ రెంటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి ? ఇది సాధారణంగా అందరు రచయితలూ ఎదుర్కొనే సమస్యే. ఇతరులెవరైనా తనను ఉపన్యాసాలివ్వమని సభలకు ఆహ్వానించినప్పుడు అందరు రచయితలలాగే ఆయన కూడా ఆ యా ఉపన్యాసాలకు తయారవడానికి పట్టే సమయంలో తాను లోగడ తలపెట్టిన రచనా వ్యాసంగం ఆ మేరకు కుంటుపడుతుందని భావించి కావచ్చు, కొంచెం ఇబ్బంది పడేవారు. అయినా ఆయన రచనల కంటే సభలకే ప్రాధాన్యం ఇచ్చారు. దీనిని ఆయన సునిశితమైన హాస్యోక్తితో ఎలా వ్యక్తం చేశారో చూడండి. “ అవిరామంగా రచన చేసే అలవాటు లేదు నాకు. అప్పుడప్పుడూ చేయడమే అలవాటు. అంటే నెలలో రచన చేసే రోజులు తక్కువ, రచన చేయని రోజులు ఎక్కువ. వీటిని మార్చి, రచన చేసే రోజుల సంఖ్యనే హెచ్చిస్తే బాగుంటుందని అప్పుడప్పుడు అనిపించినా కూడా ఆ తలంపుకు కార్యరూపం ఇవ్వడంలో శ్రద్ధ చూపడం పడలేదు. నిత్యము బాగుంటాయని ఎక్కువ రచించే రచయితల రచనలకంటే అప్పుడప్పుడు రచించే రచయితల రచనలే ఎక్కువ బాగున్నా, తక్కువ బాగున్నా, నాకు నిత్యం రచించే అలవాటు ఏర్పడలేదు. అంటే రచించని రోజులన్నీ రచించే రోజులకు సోపానాలేమో ! “కొన్ని దినాలబట్టీ రచనలెక్కువై ఉపన్యాసాలు తగ్గినాయి. రచనల నిమిత్తం ఇతరులపై ఆధారపడాల్సిన పనిలేదు. రచనలను ఇష్టం వచ్చినపుడు చేసుకొని ఇష్టం లేనపుడు మానేయవచ్చు. కాని, ఉపన్యాసాల విషయం ఇందుకు భిన్నం. అవి మన ఇష్టం వచ్చినపుడు చేయడానికి వీలైనవి కావు. ఉపన్యాసాలను ఇతరులు ఏర్పరచి ఆహ్వానించాలి. ఉపన్యాసకుడే స్వయంగా ఏర్పరచుకొన వచ్చునేమో ! ఎవరు ఏర్పరచినా దానికి వినే శ్రోతలు ఉండాలి. ఒంటరిగా కూర్చొని రచన చేసుకోవచ్చుగాని, ఒంటరిగా నిల్చొని ఉపన్యాసం చేయటం కుదరదు. తన ఉపన్యాసానికి తానే శ్రోతగా ఉండదలిస్తే ఒంటరిగా కూడా ఉపన్యాసం చేయవచ్చు.” ఓదార్చటం- ఓదార్చబడటం బి. వి. నరసింహారావును చిన్నప్పటి నుంచీ పెంచి, పెద్దచేసి ఎంతో అండగా ఉంటూవచ్చిన ఆయన అక్కగారు మరణించినప్పుడు, ఆయన తల్లడిల్లిపోయి, విషాదయోగంలో పడి సంజీవదేవ్ కి శోకపూరితమైన ఒక ఉత్తరం రాశారు. ‘ ఆత్మీయుల మరణం ఎవరికైనా బాధనే కలిగిస్తుందిగాని, మరీ విపరీతమైన బాధను కలిగించేలా మనసును బలహీన పరచుకోటం సమంజసం కాద’నే భావనతో సంజీవదేవ్ ఆయనకు ఓదార్పుగా రాసిన లేఖలోని కొన్ని భాగాలు చూడండి - “ Time is the best healing balm అని నా జీవితపు అనేక చీకటి ఘడియలలోని అనుభవం ద్వారా తెలుసుకొన్నాను. దేన్ని గురించి కూడా మీరు బాధపడకండి. కాలమే దాన్ని సరిచేస్తుంది. మీరు కొంచెంసేపు కళ్ళు మూసుకొని, లేక కళ్ళు మామూలుకంటే బాగా తెరచికాని, ‘దుఃఖాన్ని జయించాలి. బాధను భేదించాలి.ఆనందాన్ని వశపరచుకోవాలి.’ అని కొన్నిసార్లు నోటితో అనండి. మీ సగం బాధ అప్పుడే అంతరిస్తుంది. మిగతా సగం తరువాత జరిగిన నష్టాన్ని మరచిపోయి, మళ్ళీ మీ మాట, పాట, ఆటలలో మునగండి. రసానందంలో ఈదులాడండి. మనమంతా ఇతరుల ఆస్తికి ఎంతవరకు వారసులమో తెలియదు కానీ, మనమంతా ఆనందానికి మాత్రం వారసులం.ఈ వారసత్వాన్ని ఎలాంటి తరుణంలో కూడా కోల్పోరాదు.” ఈ సందేశం అచ్చంగా పాపచింతను గురించి స్వామి వివేకానంద చేసిన బోధనను పోలి ఉండడం విశేషం. ‘ వేదాంతం దృష్టిలో పాపులంటూ ఎవరూ లేరు.అందుకే అది కేవలం మానవులు చేసే తప్పిదాల్ని మాత్రమే గుర్తిస్తుంది ; పాపాల్ని కాదు. మీరు పాపులనీ, బలహీనులనీ, తుచ్ఛ జీవులనీ, శక్తివిహీనులనీ, మీరు కొన్ని పనులు మాత్రమే చేయగలరనీ, కొన్ని చేయలేరనీ చెప్పడమే పెద్ద తప్పిదమని వేదాంతం భావిస్తుంది. కనుక పాపులమనే చింత వదిలి మనందరం ఆనందానికి వారసులమని గుర్తెరగండి,’ అంటారాయన, భారతీయుల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేస్తూ. ఈ సందర్భంగా సంజీవదేవ్ ఓదార్పు విషయమై తన భావాలను తన ఆత్మకథలో ఇలా రాసుకున్నారు, “ విషాదంలో మునిగి ఉండే వ్యక్తులకు ఈ విధమైన సాంత్వనలు పనిచేయని మాట నిజమేగాని కొందరికి కొన్ని సమయాలలో అవి తోడ్పడతాయి. ఓదార్చటం సులభమే కాని, ఓదార్చబడటం సులభం కాదు. ఓదార్చబడే వ్యక్తికి దెబ్బ తగిలి ఉంటుంది. ఓదార్చే వ్యక్తికి దెబ్బ తగిలి ఉండదు. అసలు మరొక తమాషా ఏమంటే, కొందరి శోకం ఓదార్చిన కొద్దీ ఎక్కువౌతుంది. ఏమైనప్పటికీ, బాధలోవున్న చాలా మందికి సాధారణంగా ఓదార్పు కొంత ఉపశాంతిని ప్రసాదిస్తుంది.ఆ ఉపశాంతి తాత్కాలికమే కావచ్చు. తాత్కాలికాల సంఖ్య పెరిగితే అది చిరకాలికమే అవుతుంది.” కొందరు తమ దుఃఖాన్ని మరచిపోవటానికి చెడ్డ పరిణామాలకు దారితీసే అనేక దురభ్యాసాలకు బలి అవుతూ ఉంటారని పేర్కొంటూ, ఆ అలవాట్లు తాత్కాలికంగా దుఃఖాన్ని తొలగించినా, మనిషిపై వాటి స్వంత ప్రభావాలను వేయటం ప్రారంభించి జీవితాలనే ధ్వంసం చేస్తాయనీ, కనుక ఇలాంటి సాధనాలతో దుఃఖాన్ని తొలగించుకునే ప్రయత్నం చేసేకంటే, దుఃఖాన్ని తొలగించుకోకుండా దుఃఖాన్ని అనుభవించడమే ఎక్కువ సుఖం, ఎక్కువ శ్రేయం అంటారాయన. సంధాన భాష ఎస్పరాంటో ప్రపంచంలో మొత్తం రెండువేల ఏడువందల తొంభై రెండు భాషలున్నాయి. ఒకరి భాష అర్థం చేసుకొనడం వేరొకరికి కష్టం. ప్రపంచంలో ఏ ప్రాంత ప్రజలైనా తేలిగ్గా అర్థం చేసుకోగల ఒక భాష ఉన్నట్లయితే ఆ భాష ప్రపంచ ప్రజలందరికీ ఒక అనుసంధాన భాష కాగలదు. ప్రపంచంలోని ఏ దేశపు మాతృభాషకు కూడా ఇలా అంతర్జాతీయ భాష అయే అర్హత లేదు.అంతర్జాతీయ భాష కాదగినది లోకంలో ఎవరికీ మాతృభాష కారాదు. ఒకరి మాతృభాష కనుక ప్రపంచ భాష అయితే ఆ మాతృభాషను మాట్లాడేవారికుండే సదుపాయాలూ, ఉచ్చస్థానం ఇతర భాషలు మాట్లాడేవారికి ఉండవు. ప్రపంచ భాష అన్నప్పుడు ఆ భాషను ప్రతివారూ నేర్చుకొంటేనే కానీ రాదన్నట్టు ఉండాలి. సంజీవదేవ్ అభిప్రాయంలో అలా అంతర్జాతీయ సంధానభాషగా ఉండదగిన అర్హత ఒక్క ‘ఎస్పరాంటో’ అనే కృతక అనుసంధాన భాష (Constructed Auxiliary Language)కే ఉంది. ఈ భాషను 1870- 1880 మధ్య కాలంలో డా. లుడ్విగ్ లాజరస్ జామెన్ హోవ్ (Dr. Ludwig Lazarus Zamenhof) అనే రష్యన్ లిథుయేనియన్ కనిపెట్టాడు. సంజీవదేవ్ ఎంతో ఆసక్తితో ఆ భాషను నేర్చుకున్నారు. ఎస్పరాంటో చాలా సహేతుకమైన భాష అంటారాయన. ఒకే వ్యాకరణ నియమం అపవాదాలు లేకుండా సర్వత్రా ఉపయోగిస్తుందట. దీన్ని ఆయన ఇంకా ఇలా వివరిస్తారు. ఇంగ్లిష్ భాషలో eat అనే క్రియకు భూతకాలం ate అయితే, work అనే క్రియకు భూతకాలం worked అవుతుంది. flower కి ‘s’ చేరిస్తే ‘flowers’ అనే బహువచనం అవుతుంది. కాని phenomenon అనే ఏకవచనం బహువచనంలో phenomena అవుతుంది. ఆంగ్ల భాషలో ఈ విధంగా ఒకే సూత్రం అన్నిటికీ వర్తించదు. కాని ఎస్పరాంటోలో ఆ విధంగా కాక అన్నిటికీ ఒకే సూత్రం వర్తిస్తుంది. అందువల్ల ఎస్పరాంటోను అభ్యసించడం సులభం అంటారాయన. మొత్తం పదహారు వ్యాకరణ సూత్రాలతో ఈ అంతర్జాతీయ భాషను నేర్చుకోవచ్చునని చెపుతూ కొన్ని వ్యాకరణ సూత్రాలు కూడా ఆయన ఆసక్తిగా వివరించారు. ఇక చివరిగా ఆయన భావనలతో నేను విభేదించే కొన్ని విషయాలను కూడా ప్రస్తావించి నా ఉపన్యాసం ముగిస్తాను. మార్మికవాదం లేక సాక్షాత్కార దర్శనం లేక రహస్యవాదం ( Mysticism) పట్ల, పరా మనోవిజ్ఞానం ( Parapsychology) పట్ల సంజీవదేవ్ కున్న మొగ్గు ఆయన రచనలలో అక్కడక్కడా స్పష్టంగా కనుపిస్తూనే ఉంటుంది. ఆయన ఏర్పరచున్న ఈ తరహా విశ్వాసాలు మాత్రం అశాస్త్రీయాలు కనుక అవి నాకు అంగీకారయోగ్యాలు కావు.సంజీవదేవ్ రాసిన ‘గుడ్డిపిల్ల’ అనే కవిత చదివిన భగవాన్ దాస్ ఆయన్ని ‘ పుట్టుకతో గ్రుడ్డివారైనవారు స్వప్నాలలోనైనా రంగులను చూస్తారా ?’ అని ప్రశ్నించారు. అందుకు అప్పుడు మాత్రం ఆయన చూడరనే సమాధానం చెప్పారు. ఒకసారైనా ఇంద్రియాలతో అనుభవించని విషయం స్వప్నాలలో మాత్రం ఏ విధంగా ప్రత్యక్షమౌతుందని ప్రశ్న వేసుకుని, బాహ్యజగత్తులోని రంగులను చూచిన తరువాత గ్రుడ్డితనం సంభవిస్తే అప్పుడు స్వప్నాలలో రంగులను చూడవచ్చునని చెపుతూనే ఆయన ఇంకా ఇలా అన్నారు, - ‘ అయితే దీన్ని పరామనోవిజ్ఞాన దృష్ట్యా చూస్తే కొంతవరకు సంభవమేమో అనిపిస్తుంది. పరామనోవిజ్ఞాన దృష్ట్యా అయితే ఇంద్రియాల ద్వారా తెలుసుకొనకుండానే తెలుసుకోవచ్చు,’ అన్నారాయన. పరా మనోవిజ్ఞానం చెప్పేదాని ప్రకారం దివ్యదృష్టి (Clairvoyance) సాధ్యమే. పరా మనోవిజ్ఞానం జ్ఞానేంద్రియాల యొక్క ప్రమేయం లేకుండా లోతైన అంతర్దృష్టితో కంటికి కనుపించని సూక్ష్మమైనట్టి, కట్టెదుట లేకుండా ఎక్కడో దూరంగా ఉన్నట్టి, వ్యక్తులను, వస్తువులను స్పష్టంగా చూడడం సాధ్యమేనని ప్రతిపాదిస్తుంది. అది ఇంద్రియాతీత జ్ఞానం (Extra-sensory Perception) సాధ్యమేనంటుంది. జ్ఞానేంద్రియాల ప్రమేయం లేకుండా మనసులు సంభాషించుకొనడం, ఆలోచనల మార్పిడి ( Telepathy) కూడా సాధ్యమేనంటుంది. అయితే ఇవన్నీ కేవల విశ్వాసాలు, ప్రతిపాదనలే కానీ శాస్త్రీయంగా రుజువుపరచబడిన సిద్ధాంతాలు మాత్రం కావు. ఇలా నమ్ముతున్న వారు వాటిని శాస్త్రీయ సత్యాలుగా ఋజువు పరచలేకపోయారు. అందుకే శాస్త్రీయ దృష్టి కలవారు ఎవరైనా ఈ తరహా విశ్వాసాలను అశాస్త్రీయాలుగానే భావిస్తారు. జ్ఞానేంద్రియాల ద్వారా సమకూరిన జ్ఞానం మనస్సులో పరీక్షించబడి, వర్గీకరించబడి, నిక్షిప్తమవుతుందనేది ధృవపడిన శాస్త్రీయ దృష్టి. మనస్సులో చోటుచేసుకునే జ్ఞప్తి (Memory), గుర్తింపు (Recognition) వంటి ప్రక్రియలు జ్ఞాన సముపార్జనకు తోడ్పడినప్పటికీ జ్ఞానేంద్రియాల నుంచి అప్పుడుగానీ, లోగడగానీ మనస్సుకు అందే సంకేతాలే జ్ఞానసముపార్జనకు మూలం.కాబట్టి ఇంద్రియాతీత జ్ఞానం అసాధ్యం. అదే విధంగా ఆయన కలల గురించి రాస్తూ - ‘చూచినవన్నీ కలలోకి రావు, చూడనివన్నీ రాకుండానూ ఉండవు. చూడటం, చూడకపోవటం అనేవి కలలకు సంబంధించవు. కలలకు వేరే కారణాలు బయటివి, లోపలివి అనేకం ఉంటాయి’ అంటారాయన.కలలకు రూపకర్త మనస్సనేది వాస్తవం. అయితే కలలను తాను అనుకున్న రీతిలో సృష్టించేందుకు మనస్సు వాడే ముడిసరకు మాత్రం మనం అంతకు మునుపు ఎప్పుడో చూసిన దృశ్యాలే. మనం ఆరోజు చూసిన దృశ్యాలే ఆ రాత్రికి తప్పనిసరిగా కలలోకి రావాలని ఎక్కడాలేదు కాని కలలో ఏమి వచ్చినా అవి ఇంద్రియాల ద్వారా గ్రహించి మన మనస్సులో నిక్షిప్తమైన జ్ఞాన సంపదకు మన మనస్సు తన ఊహా శక్తిని జోడించి తయారు చేసిన దృశ్యాలే అయివుంటాయి. అలా ఇంద్రియాల ద్వారా సమకూరిన జ్ఞానమే కలల సృష్టికి ముడిసరకు అనేది శాస్త్రీయంగా ధృవపడింది. మనం చూడటం, చూడకపోవటం అనేవాటికీ, కలలకూ ఎలాంటి సంబంధం లేదనడం శాస్త్రీయ దృష్టి కాదు. . ( సంజీవదేవ్ శత జయంతి సందర్భంగా సెప్టెంబర్ 28 న కేంద్ర సాహిత్య అకాడెమి వారు తెనాలిలోనిర్వహించిన సదస్సులో నా ప్రసంగం పూర్తి పాఠం)

రామాయణం--పురాణ ప్రలాపం (ఆచారాలు - ఆక్షేపణలు

రామాయణం వికటకవి చిన్నాన్న రామనవమి ఫలహారానికి ఎండు ద్రాక్ష శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు. నేనన్నాను - చిన్నాన్నా. ఈ రోజు రాత్రి మైదానంలో రామకథ ఉంది. వస్తారా ? చిన్నాన్న - ఏమిటి ఈ రోజు ఘట్టం ? నేను - ఎందుకు చిన్నాన్నా? నీతి బద్ధుడు, పురుషోత్తముడు, అయిన రాముడు ఒకదాన్ని మించి ఒకటి ఎన్నో ఆదర్శాలు చూపాడు కదా! చిన్నాన్న - అవును, చూపించకపోవడానికే, చూపించాడు. అబలను ఎలా దుఃఖాల పాలు చేయాలి? సతి, సాధ్వి అయిన భార్యను ఇంట్లో నుండి ఎలా వెళ్ళగొట్టాలి? ఏ ఆడదాని ముక్కైనా కోసేసుకో. ఏ ఆడదాని పైనైనా బాణం వేయి. ఒక రకంగా చూస్తే స్త్రీని ఏడ్పించడంతోనే ఆయన వీరత్వం మొదలయింది. దానితోనే ముగిసింది కూడా. నేను - చిన్నాన్నా, భగవంతుడు మనిషి అవతారమెత్తి ఈ లీలలన్నీ చేశాడు. చిన్నాన్న - కాఠిన్యం లేకుండా లీల చేేయడానికి వీల్లేదా? అయినా నిజానికి తప్పంతా ఆయనదే అనడానికి వీల్లేదు. మొదట్లోనే ఆయనకు విశ్వామిత్రుడు లాంటి గురువు దొరికాడు. ఆయన తాటకవధతో విద్యాభ్యాసం చేయించాడు. అలాకాకపోతే రాముని మొదటి బాణం ఎక్కడైనా స్త్రీ పైకి వెళ్ళేదా? కానీ విశ్వామిత్రునివి అన్నీ విపరీత చేష్టలే. ఆయన తన పేరులోని ‘అమిత్ర’ పదాన్ని (విశ్వ + అమిత్ర) ‘మిత్ర’గా రుజువు చేయడానికి వ్యాకరణ నియమాన్నే మార్చేశాడు! రాజర్షి నుండి బ్రహ్మర్షి కావడానికి వర్ణ వ్యవస్థ నియమాన్నే తారుమారు చేసేశాడు. వశిష్ఠునితో పోటీ పడి నీతి-నియమాలను కర్మనాశా నదిలో ముంచేశాడు. అలాంటప్పుడు రామునికి ఏం విద్య నేర్పగలడు? ‘’స్వయమసిద్ధః కథం పరాన్ సాధయతి… (తానే పొందలేనప్పుడు సిద్ధిని ఇతరులకు ఎలా ప్రాప్తింపచేస్తాడు’’) నేను - చిన్నాన్నా, రామచంద్రుడు న్యాయం యొక్క ఆదర్శాన్ని చూపెట్టి వెళ్ళాడు. న్యాయపాలన కోసం సీతలాంటి భార్యను అడవులకు పంపడానికి కూడా వెెనకాడలేదు. చిన్నాన్న - అలా కాదబ్బాయ్, వాళ్ళ వంశానికది పరిపాటే, తండ్రి ఈయనకు వనవాసం ఇచ్చాడు. ఈయన భార్యకిచ్చాడు. నీవు న్యాయం, న్యాయం అంటున్నావు. న్యాయం అంటే, ఎవడో ఏదో అన్నాడని ఎవరినైనా ఉరికంబమెక్కించడమేనా? న్యాయమే చేయదలచుకుంటే వాది. ప్రతివాది ఇద్దరినీ రాజాస్థానంలోకి రప్పించవలసింది. రెండు పక్షాల వాజ్ఞ్మూలాలు విని నిష్పక్షపాతంగా నిర్ణయిం చేయవలసింద! అదంతా ఏమీ చేయలేదు. గప్ చిప్ గా సీతను అరణ్యానికి పంపేశాడు. ఇది ఎక్కడి ధర్మం, ఎక్కడి ఆదర్శం? ఒక సాధారణ పౌరునికి ఉండే అధికారం కూడా మహారాణి సీతకు లేకపోయింది? నేను - కానీ రామునికి ప్రజారంజన అనే ఆదర్శం చూపవలసిన అవసరం ఉంది.. చిన్నాన్న - కాదు, అలా కానే కాదు. సీతను అడవుల పాలు చేయమని అయోధ్య ప్రజలు ఎన్నడూ కోరలేదు. అందువల్లనే రాత్రికి రాత్రే రథం తరలించడం జరిగింది. ఇక లక్ష్మణుడు అన్నింటికీ తయార! శూర్పణక ముక్కు కోయమంటే కత్తి తీసుకొని రెడీ! సీతను అడవిలో వదిలిపెట్టి రమ్మంటే రథంతోపాటు తయారు! తెల్లవారి ప్రజలకు విషయం తెలియగానే అయోధ్య అంతటా హాహాకారం వ్యాపించింది. కానీ, రాజు అయిన రాముడు తన పట్టుదల ముందు ప్రజల ప్రార్థనలు వినిందెప్పుడు? తన వనవాస విషయంలో అయినా ప్రజల ఏ మాట విన్నాడని సీత వనవాస విషయంలో వింటాడు? నేను - చిన్నాన్నా, తండ్రి మాటను పాలించడానికి ఆయన వనవాసానికి వెళ్ళాడు. చిన్నాన్న - కొంచెం తర్క శాస్త్రం ఉపయోగించు. వనవాసం అంటే ఏమిటి? ”సర్వేషు వనేషు వాసః” (అన్ని వనాల్లో నివాసం) లేదా “కస్మింశ్చిద్ వనే వాసః” (ఏదో ఒక వనంలో నివాసం) మొదటి అర్థం తీసుకుంటే ఆయన అలా చేయలేదు. చేయలేడు కూడా. ఇక రెండవ అర్థం తీసుకుంటే అయోధ్యకు దగ్గరలోనే ఏదో ఒక అడవిలో ఉండవలసింది లేదా చిత్రకూటంలోనే పధ్నాలుగేండ్లు గడపవలసింది! అలా చేసినా తండ్రి మాట పాలించడం జరిగేది. అలా కాక వేల మైళ్ళు తిరగవలసిన పనేమిటి? అది కూడా కాలి నడకన, సుకుమారి సీతను వెంట పెట్టుకొని! ఈ మాటే మిథలావాసి, నైయాయికుడు (న్యాయదర్శన పండితుడు గౌతముడు) అడిగినప్పుడు రాముడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. విసుక్కొని అన్నాడు - “యః పఠేత్ గౌతమీం విద్యాం శృగాలీ యోనిమాప్నుయాత్!” (గౌతముని విద్య (తర్కశాస్త్రం) చదివినవాడు నక్కైపుడతాడు!) ఇది ఎక్కడి జవాబు? శాస్త్ర చర్చ చేయడం, నక్కై మొరగడం రెండూ ఒకటేనా? ఆయన మిథిలావాసుల న్యాయశాస్త్రం చదివి ఉంటే ఈ అన్యాయం చేసేవాడు కాదు. చిన్నాన్న కొబ్బరి ముక్కలు కోస్తూ మళ్లీ ఇలా అన్నాడు -- ప్రజలు ఏక కంఠంతో సీతను రాజ్యం నుండి బహిష్కరించమని అన్నారే అనుకో, అప్పుడు రాముని కర్తవ్యమేమిటి? మహారాణి నిర్దోషి అనీ, అగ్ని పరీక్షలో ఉత్తీర్ణురాలయిందనీ, ఆయనకు తెలిసినప్పుడు ప్రపంచం ఏమంటే ఏం? తన న్యాయం పైన గట్టిగా నిలబడి ఉండాలి కదా? ప్రజలు తిరుగుబాటు చేస్తారనే అనుమానం ఉంటే మళ్ళీ భరతుణ్ణి సింహాసనం పైన కూర్చోబెట్టి భార్యతో సహా అడవి మార్గం పట్టవలసింది! అప్పుడు అది ఆదర్శ పరిపాలన అనిపించుకునేది. కానీ, రాజు అయిన రాముడు కేవలం రాజ్యాన్నిఅర్థం చేసుకున్నాడు కానీ, ప్రేమను అర్థం చేసుకోలేదు. మహారాణి సీత తన పత్నీ ధర్మం ఎదుట ప్రపంచ సామ్రాజ్యాన్ని తుచ్ఛంగా భావించేది. కానీ రామరాజు తన పతిధర్మం కోసం అయోధ్య సింహాసనాన్ని వదులుకోలేకపోయాడు. ఒక ఇంగ్లాండు రాజు (అష్టమ ఎడ్వర్డ్) తను ప్రేమించిన స్త్రీ (సింప్సన్)ని పెళ్లి చేసుకోవడం కోసం సింహాసనాన్ని వదులుకున్నాడు. ఆయన చేసినంత త్యాగం కూడా సతీ శిరోమణి సీతకోసం మీ రాముడు చేయలేకపోయాడు! నేను - చిన్నాన్నా, సీతావనవాసం వల్ల మీకు చాలా బాధ కలిగినట్లుంది. చిన్నాన్న - ఎందుకు కలగదు? సీత జీవితమంతా దుఃఖమే. పాపం సుఖపడే రోజులు ఎప్పుడూ రాలేదు. మొదట భర్తతో పాటు అడవుల్లో ఎక్కడెక్కడో తిరిగింది. తర్వాత మహలులో ఉండే రోజులు రాగానే వెళ్లగొట్టబడింది. అడవిలో మాత్రం “అయ్యో సీత! అయ్యో సీత!” అంటూ ఆమె కోసం భూమి, ఆకాశం ఏకం చేశాడు. సముద్రంపైన వారధి కట్టాడు. ఆ సీతే తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో ఉండలేకపోయింది! అందువల్లనే మిథిలావాసులు తమ ఆడపిల్లలకు పడమరవైపు సంబంధం చేయకూడదంటారు! చిన్నాన్న కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కొద్దిసేపు క్షోభపడి అన్నాడు - సీత వంటి దేవేరి పట్ల ఇంత నిర్దయా? త్రికరణ శుద్ధిగా రాముని సేవలో లీనమై ఉంది. ఆయన అడుగుజాడలో నడిచింది. ఎలాంటి దుర్గమారణ్యాలలో తిరిగింది? ఆయన సంతృప్తికోసమే అగ్గిలో కూడా దూకింది. అగ్నిలో ప్రవేశించే ముందు ఆమె ఇలా అంది - “త్రికరణ శుద్ధిగా రఘువీరుడు రాముణ్ణే నేను ఎల్లవేళలా ఆరాధిస్తూ ఉండి ఉంటే, అన్నీ తెలిసిన అగ్నిదేవుడు నాకోసం చందనంతో సమానంగా సీతలమవుగాక” (తులసీ రామాయణం) అలాగే జరిగింది కూడా. అగ్నిజ్వాల చందనశీతలమైపోయింది! అగ్నిలో శుద్ధమైన బంగారం లాగా ప్రకాశిస్తూ ఆమె బయటికి వచ్చేసింది. అయినా, సర్వశ్రేష్ఠురాలైన ఆ సతి పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించారు. ఎనిమిదవ నెలలో ఆమె ఇంట్లో నుండి వెళ్లగొట్టబడింది. ఈ క్రూరత్వానికి జే కొట్టాలి. సీత మిథిలలో పుట్టిన కన్య. విసుగుతో ‘ఇస్స్’ అనే రకం కాదు. అందుకే కదా! మరో ప్రాంతపు ఆడది అయి వుంటే రామునికి తన సత్తా చూపించేది! అరే, నేను ఒక మాట అడుగుతాను. సంబంధం తెంచుకోవాలనే అనుకుంటే సీతను తండ్రి ఇంటికి జనకపురికి పంపవచ్చుకదా! అలాంటి ఘోరారణ్యంలోకి ఎందుకు పంపాడు? ఈ భూమిపైన న్యాయం లభిస్తుందనే నమ్మకం లేకపోవడంవల్లనే పాపం ఆమె పాతాళంలో ప్రవేశించింది. ఏ మట్టి గర్భం నుండి జన్మించిందో, ఆ మట్టిలోనే మళ్ళీ లీనమై పోయింది. ప్రపంచంలోనే అత్యుత్తమురాలైన సతి జీవితం ఇంత బాధాకరంగా ముగియాలా? అందుకే గదా, భూమి బద్దలయింది. ఆయన్ను ఊరడించేందుకు నేనన్నాను - చిన్నాన్నాఈ విషాదానికంతా మూల ఆ చాకలివాడు! చిన్నాన్న కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన అన్నాడు నేను నిన్నొకటి అడుగుతాను చెప్పు. ఎవరో చాకలి వాడు అలిగి గాడిదపై నుండి కిందపడితే నేను మీ పిన్నమ్మను ఇంట్లో నుండి వెళ్ళగొడతానా అయినా రాముడు ఎక్కువ కాలం గడిపింది అలాంటివాళ్ళతోనే కదా! నిషాదుడు, కేవటుడు, భిల్లిని, గద్ద, ఎలుగుబంటి, కోతి - వీరి మధ్యనే గదా ఉన్నాడు! మూర్ఖపు దాసి మాటలకు తండ్రి కొడుకుకు వనవాసం ఇచ్చాడు. ఈయన మతిలేని చాకలివాని మాటలకు భార్యకు వనవాసం ఇచ్చాడు. వాళ్ళ ఆస్థానంలో చిన్న వాళ్ళదే పెత్తనం. ఇంట్లో మంథర, బయట దుర్ముఖుడు! (రాముని గూఢచారి). నేను - చిన్నాన్నా, అది నీతిని పాలించడం కోసం …. చిన్నాన్న - నీతి కాదు, అవినీతి అను. నీతి ఆదర్శమే చూపదలచుకుంటే మరి వాలిని ఆ విధంగా చెట్టు చాటున దాక్కొని ఎందుకు చంపాడు? ఎదురెదురుగా యుద్ధంచేసి చంపవలసింది? అప్పుడు .. రఘువంశీయులు యుద్ధంలో యమునికి కుడా భయపడరు! అనే ప్రతిజ్ఞ ఎక్కడికి పోయింది? అందుకే వాలి వ్యంగ్యంగా అననే అన్నాడు - “మహాత్మా” ధర్మం కోసం అవతరించావు. కానీ, నన్ను మాత్రం వ్యాధునిలాగా (పొంచి ఉండి) చంపావు. (తులసీ రామాయణం). ఒకవేళ వాలి చేసిన అవినీతిని శిక్షించదలచుకొని ఉంటే, అదే అవినీతి చేసిన సుగ్రీవుణ్ణి ఎందుకు శిక్షించలేదు. విభీషణుణ్ణి ఎందుకు చంపలేదు? రామాయణ రచయితకు కూడా ఈ తప్పిదం స్వీకరించవలసి వచ్చింది. “ఏ పాపానికైతే (సోదరుడు సుగ్రీవుని భార్య తారను కైవసం చేసుకున్నందుకు” వ్యాధుని లాగా వాలిని చంపాడో అదే పాపం తర్వాత వాలి భార్యను తనదానిగా చేసుకుని సుగ్రీవుడు చేశాడు. ఆ దుశ్చేష్టే (రావణ వధానంతరం మండోదరిని కైవసం చేసుకొని ) విభీషణుడు కూడా చేశాడు. కాని రాముడు స్వప్నంలో కూడా వీటిని గురించి ఆలోచించలేదు! (తులసీ రామాయణం) చివరకు మరణదండన ఇచ్చింది ఎవరికి? పాపం, సాత్త్విక వృత్తితో తపస్సు చేసుకుంటూ ఉండిన శంబూకునికి! నేను - కానీ నేను నీతిని పాటించే పురుషోత్తముడు …. చిన్నాన్నా - నీవు నీతిని పాటించే పురుషోత్తముడవు, కానీ నాకు మాత్రం ఆయనలో తొందరపాటే కనిపిస్తుంది. పిల్లవాడిలాగా బంగారు జింక వెంట ఎందుకు పరిగెత్తాడు? సీతా వియోగంలో చెట్లూ - పుట్టలూ పట్టుకొని ఎందుకు విలపించాడు? సుగ్రీవునితో అంత గాఢమైన స్నేహం ఉండి కూడా సీతను వెతికించడంలో కొంచెం ఆలస్యం అయినందుకు పాపం అతని పైకి ధనుర్బాణాలు తీసుకొని వెంటనే తయారయ్యాడు! సముద్రుని పూజించడానికి ఎంతోసేపు పట్టదు. అతనిపైకి బాణం ఎక్కుపెట్టడానికీ ఎంతోసేపు పట్టదు! ఇక లక్ష్మణునికి శక్తి బాణం తలిగినప్పుడు యుద్ధభూమిలో అయ్యో! అని ఘోరంగా విలపించాడు. ఇలా ధీరత్వం కోల్పోవడం వీరులకు శోభిస్తుందా? చిన్నాన్న బాదాం పప్పులు పగల గొడుతూ మళ్ళీ ఇలా అన్నాడు -- కానీ, బాగా ఆలోచించి చూస్తే రాముని తప్పేమీ లేదనిపిస్తుంది. ఆయన తండ్రి దశరథుడే తొందరపాటు మనిషి, వేటకు వెళ్ళాడు. నది ఒడ్డున శబ్దం విన్నాడు. వెంటనే బాణం వదిలాడు. అక్కడ ఎవరైనా మనిషి కూడా ఉండవచ్చు కదా, అని ఆలోచించలేదు. పాపం శ్రవణ కుమారుణ్ణి చంపేశాడు. అతని గుడ్డి తండ్రి పుత్రవియోగంతో ప్రాణాలు వదిలాడు. దాని ఫలితంగా తాను కూడా పుత్ర వియోగంతో చనిపోయాడు. అరే, ఇద్దరు పట్టమహిషులుండగా ముసలితనంలో మూడో పెళ్ళి చేసుకోవాలనే సరదా ఎందుకు పుట్టింది? ఇక “వృద్ధస్య తరుణీ భార్యా ప్రాణేభ్యోపి గరీయసీ” (వృద్ధునికి యువతి అయిన భార్య ప్రాణాలకంటే ఎక్కువ ప్రియంగా ఉంటుంది) కైకేయి మాయలో ఎలా పడి పోయాడంటే యుద్ధానికి వెళ్ళినా రథంలో ఆమెను పక్కన కూర్చోబెట్టుకొనే వెళ్ళేవాడు! ఆ రథం కూడా ఎలాంటిది? మాంచి టైములో విరిగిపోయింది! పేరుకు దశరథుడు! కానీ ఒక్క రథం కూడా పనికి వచ్చేది లేదు! కాకపోతే కైకేయికి చక్రంలో తన మణికట్టు ఎందుకు అడ్డం పెట్టవలసి వచ్చేది? మణికట్టు కూడా మహాగొప్పదే! ఇరుసులో పడి కూడా విరగలేదు! అందువల్లనే కదా, ఆమె హృదయం కూడా అంత కఠినంగావుంది! రాణి ప్రతాపం వల్ల యుద్ధంలో ముసలిరాజు ప్రాణాలు ఎలాగో నిలిచాయి. ఇక ఏమీ ఆలోచించకుండా భార్యకు మాట ఇచ్చేశాడు - ఏమి కోరితే అది ఇస్తానని. ఆకాశంలోని నక్షత్రం తెచ్చి ఇమ్మని అడిగితే అప్పుడేమవుతుంది? అని ఆలోచించేంత బుద్ధి లేకపోయింది. తర్వాత ఆమె రాముని వనవాసం కోరినప్పుడు విలవిలలాడిపోయాడు. అయినా కైకేయి కొంత మర్యాద పాటించిందనే చెప్పాలి. ఒకవేళ ఆయన గుండెలు తీసి ఇమ్మని అడిగి ఉంటే, సత్యపాలకుడు దశరథ మహారాజు ఏం చేసేవాడు? అంతేకాదు, ఒకసారి మాట ఇచ్చిన తర్వాత గుండెలు ఎందుకు బాదుకున్నాడు? పద్నాలుగేళ్ళ తర్వాత కొడుకు మళ్ళీ రాజ్యమేలే వాడే కదా! అంతవరకు ఓపిగ్గా ఎదురు చూడవలసింది పుత్రప్రేమ అంత ఎక్కువగా ఉండి ఉంటే తాను కూడా రాముని వెంట వెళ్లవలసింది. అదంతా ఏమీ చేయలేదు. “హా రామా.. హా రామా!” అంటూ ప్రాణాలు విడిచాడు. క్షత్రియుని హృదయం ఎక్కడైనా ఇంత బలహీనంగా ఉంటుందా? చిన్నాన్న ఎవరి వెంట పడితే వారి అంతు తేల్చేవరకు వదలడు. ఇప్పుడు దశరథుని వెంట పడ్డాడు. అని మనసులో అనుకొని ఇలా అన్నాను - చిన్నాన్నా, అందరూ రామాయణంలోని పాత్రల నుండి గుణపాఠం నేర్చుకుంటారు…. చిన్నాన్న - గుణపాఠం నేను కూడా నేర్చుకుంటాను. చూడకుండా బాణం వలద కూడదు. ఆలోచించకుండా మాట ఇవ్వకూడదు. మాట ఇచ్చిన తర్వాత గుండెలు బాదుకోకూడదు. నేను - చిన్నాన్నా, మీరు కేవలం దోషాలే చూస్తున్నారు. చిన్నాన్న - అయితే గుణాలు నీవే చూపించు మరి! నేను - దశరథ మహారాజు ఎంత సత్యసంధుడో చూడండి… చిన్నాన్న - అవును, ఎంత సత్యసంధుడంటే నకిలీ శ్రవణ కుమారుడై గుడ్డి తండ్రిని మభ్యపెట్టడానికి ప్రయత్నించాడు! నేను - రాముడు ఎలాంటి పితృభక్తుడు … చిన్నాన్న - అవును, తండ్రి మరణ వార్త విని కూడా తిరిగి రాలేదు! జ్యేష్ఠ పుత్రుడై కూడా తండ్రి శ్రాద్ధం చేయలేదు! నేరుగా దక్షిణ దిశగా సాగిపోయాడు! నేను - లక్ష్మణుడు ఎంత భ్రాతృభక్తుడు… చిన్నాన్న - అవును, ఒక సోదరుని (రాముని) తరఫునుండి మరో సోదరునిపైకి (భరతుని పైకి) (ధనుర్భాణాలు ఎక్కుపెట్టాడు. నేను - భరతుడు ఎంత గొప్ప త్యాగి … చిన్నాన్న - అవును, పద్నాలుగేండ్లు అన్న ఏమైనాడో పట్టించుకోలేదు. రాజధానిలో తీరిక దొరికినప్పుడు కదా, అడవిలోకి వెళ్ళి తెలుసుకుంటాడు? అరే, అయోధ్య నుండి సైన్యం సన్నద్ధం చేసుకొని ఆయన వెళ్ళి ఉంటే రామునికి కోతుల సహాయం ఎందుకు తీసుకోవలసి వచ్చేది? నేను - హనుమంతుడు ఎలాంటి స్వామిభక్తుడు…. చిన్నాన్న - అవును. మొదటి యజమాని సుగ్రీవుణ్ణి వదిలిపెట్టి రాముని సేవకు అంకితమైపోయాడు. నేను - విభీషణుడు ఎలాంటి ఆదర్శం. …. చిన్నాన్న - అవును, ‘ఇంటి గూఢచారి లంకను ధ్వంసం చేస్తాడు’ అనే సామెతకు కారకుడయ్యాడు. ఇలాంటి విభీషణుల నుండి భగవంతుడు దేశాన్ని రక్షించుగాక! నేను - అయితే మీ దృష్టిలో రామాయణంలో ఒక్కటి కూడా ఆదర్శ పాత్ర లేదా? చిన్నాన్న - ఎందుకు లేదు? మొత్తం రామాయణంలో నాకు కేవలం ఒకే ఒకపాత్ర ఆదర్శపాత్ర పాత్రగా అనిపిస్తుంది. నేను - ఎవరు? చిన్నాన్న - చిరునవ్వు నవ్వుతూ అన్నాడు - రావణుడు! నేను - మీకెప్పుడూ వేళాకోళమే! చిన్నాన్న - వేళాకోళం కాదు. రావణుని దోషం ఒక్కటి చెప్పు చూద్దాం! నేను - మీరు ధన్యులు చిన్నాన్నా! అందరికీ రావణునిలో అన్ని దోషాలు కనిపిస్తూంటే మీకు ఒక్కటి కూడా కనిపించడం లేదా? చిన్నాన్న - అయితే నీవే చెప్పు మరి. నేను - సీతను అపహరించి తీసుకెళ్ళాడు…. చిన్నాన్న - అది మీ నీతిమంతునికి, పురుషోత్తమునికి ఎవరి అక్క -చెల్లెలి ముక్కు-చెవులు కోయరాదనీ, పరదేశంలో ఉంటూ ఎవరితోనూ వైరం పెట్టుకోరాదనీ, ఎండమావుల వెంట పరిగెత్తరాదనీ, ఏ స్త్రీనీ అవమానించరాదనీ గుణపాఠం నేర్పడానికి. చూడు, లంకకు తీసుకెళ్ళి కూడా రావణుడు సీతను అవమానించలేదు. రాణివాసంలోకి తీసుకెళ్ళలేదు. అశోకవాటికలో ఉంచాడు. అందరూ రాక్షసుడనవచ్చు. కానీ, అంత సభ్యతతో కూడిన ప్రవర్తన మనుషుల్లో అరుదుగానే కనిపిస్తుంది. నేను - చిన్నాన్నా, మీ మాటలు ఎప్పుడూ లోక విశ్వాసానికి విరుద్ధంగానే ఉంటాయి. అంత అత్యాచారం చేసిన వాని తరఫునుండి వాదిస్తూ కరుణా సముద్రుడు సీతాపతిని … చిన్నాన్న - కఠిన హృదయుడు సీతాపతి అను. విదేహ రాజ కన్య అయోధ్య వెళ్ళింది. దాని ఫలితం ఏమైందీ? మళ్ళీ ఆమె పుట్టింటి ముఖం చూడలేకపోయింది. అందువల్లనే కదా, పడమరవాళ్ళను మేము దూరంగా ఉంచుతాము! నేను - చిన్నాన్నా, సీత అత్తగారింటి వాళ్ళంటే మీకు పడదు. ఒకవేళ రాముడు మీకు కనిపించి ఉంటే ఏమనేవారు? నమస్కారమైనా చేసేవారా లేదా? చిన్నాన్న పల్లీల పప్పు వలుస్తూ అన్నాడు -- నమస్కారం ఎలా చేస్తాను? నేను బ్రాహ్మణుణ్ణి, ఆయన క్షత్రియుడు. ఆఁ, ఆశీర్వాదం మాత్రం ఇచ్చేవాణ్ణి, “సద్బుద్ధి కలుగుగాక!” ఇక మందు ఎప్పుడైనా రామరాజ్యం అయితే ప్రజలు “ఛీ, ఛీ, రామ రామ” అనేట్లు చేయకండి. ఎవరైనా నాలాంటి బ్రాహ్మణ్ణి మంత్రిగా పెట్టుకోండి” అనేవాణ్ణి. నేను - చిన్నాన్నా, రామరాజ్యం కదా! చిన్నాన్న - అవును, తులసీదాసు రాశాడు - “దీనులు, దరిద్రులు, దుఃఖించేవారు, ఎవరూ ఆ రాజ్యంలో లేరు” అని, నేనయితే “పాపం సీత ఒక్కతే దౌర్భాగ్యురాలు” అని దానికి జోడించేవాణ్ణి. మన గ్రామరాజ్యం కూడా రామరాజ్యంలాగానే నడవడం మొదలు పెడితే ఎందరు సీతలు మట్టిలో కలసిపోతారో చెప్పలేము. నేను - చిన్నాన్నా, మీరు శ్రీరామనవమి వ్రతం పాటిస్తారు. మనసులో భక్తి ఉండే ఉంటుంది. చిన్నాన్న - అది సీత కోసం. సీత లేకపోతే రాముడు కేవలం “రఘుపతి రాఘవ రాజారాం” అనిపించుకునేవాడు. “పతతి పావన సీతారామ్” అనిపించుకునేవాడు కాదు. ఏ ఏ పనులు ఆయన చేశాడో క్షత్రియ రాజులు అవన్నీ చేయనే చేస్తారు. కేవలం ఒక్క విషయంలో ఆయన శ్రేష్ఠత పొందాడు. మరో భార్యను తెచ్చుకోలేదు. జానకి బంగారు ప్రతిమ చేయించుకొని శేష జీవితం గడిపాడు. ఒక్క దీని పైన్నే ఆయన అపరాధాలన్నీ క్షమించేస్తాను. రాముని గొప్పతనం సీత వల్లనే. అందువల్లనే ముందు సీత, ఆ తర్వాత రాముడు. తులసీదాసు ఇలా అంటాడు - “ఈ సృష్టినంతా సీతారాముల మయంగా భావించి రెండు చేతులు జోడించి వారికి నమస్కరిస్తాను” అని. మహర్షి వాల్మీకి కూడా అలాగే అంటాడు -- “సీతాయాః పతయే నమః” నేను - చిన్నాన్నా, మీకు సీత పట్ల అంత శ్రద్ధా భక్తులున్నాయికదా, అలాంటప్పుడు రాముణ్ణి ఎందుకిలా విమర్శిస్తారు? ఆయన తండ్రిని కూడా మీరు వదిలిపెట్టలేదు. చిన్నాన్న నవ్వి అన్నాడు - అరే, ఇంత మాత్రం కూడా అర్థం కాదా నీకు! నేను ఆయన అత్తవారింటి మనిషిని కదా! అత్తవారింటి మంగలి తిట్టినా బాగానే వుంటుంది. మరి నేను బ్రాహ్మణుణ్ణి! వేరే ఎవరికైనా ఇలా మాట్లాడే సాహసం ఉంటుందా? మిథిలా వాసులు మాత్రం అయోధ్య వాళ్ళను దూషిస్తూనే ఉంటారు. మిథిలావాసి నోరు మూయించే శక్తి భగవంతునికి కూడా లేదు! మైథిలీ మూలం తెలుగు అనువాదం ‘ఖట్టర్ కాకా’ పురాణ ప్రలాపం (ఆచారాలు - ఆక్షేపణలు) హరిమోహన్ ఝా జె. లక్ష్మీరెడ్డి

అధికార వికేంద్రీకరణ-ఎమ్.ఎన్.రాయ్

రాజకీయాలు -అధికారం- పార్టీలు అధికార వికేంద్రీకరణ ఎమ్.ఎన్.రాయ్ ఆధునిక ప్రజాస్వామ్యాలన్నిటిలో అధికారం రాజ్యం చేతుల్లో కేంద్రీకృతం కావడం ప్రధాన సమస్యగా ఉన్నది. ఐదారు దశాబ్దాలుగా ఈ వికేంద్రీకరణ సమస్యవిపరీతంగా పెరిగిపోయింది. అధికారం అంటే ఏమిటి? పనులు చేసే శక్తి ఉండటమే అధికారం అని నిర్వచించవచ్చు. ఆ విధంగా మానవ సమాజంలో అధికారానికి ఎప్పుడూ చోటు ఉంటుంది. కాని వికేంద్రీకరణ విపరీతంగా జరిగి సమాజం యావత్తూ నిస్సహాయమైనప్పుడు అధికార ఉపయోగానికి గ్రహణం పట్టి దుర్వినియోగం అయింది. రాజ్యం అనే భావన కూడా నిర్వచింపవలసి ఉన్నది. రాజ్యం చేసే పనులతో ముడిపడి అధికారం ఉన్నది. ఇటీవల రాజకీయ సిద్ధాంత కర్తలు రాజ్యం అంటే వత్తిడి చేసే సాధనగా నిర్వచించారు. ఒక వర్గం లేదా సమాజంలో ఒక భాగం ఇతరుల మీద ఆధిపత్యం వహించటానికి వీలుగా రాజ్యం అనే సాధనగా నిర్వచించారు. ఒక వర్గం లేదా సమాజంలో ఒక భాగం ఇతరుల మీద ఆధిపత్యం వహించటానికి వీలుగా రాజ్యం అనే సాధన సృష్టించుకున్నారన్నారు. ఈ నిర్వచనం ఫలితంగా రాజ్యం ఉన్నంతవరకూ న్యాయమైన సాంఘిక వ్యవస్థ అసాధ్యమన్నమాట. అందువల్ల తమ ఆలోచన పొందికగా ఉండే నిమిత్తం, ఆదర్శ సమాజంలో రాజ్యం ఉండదని ఈ రాజకీయ సిద్ధాంతపరులు నిర్ణయానికి వచ్చారు. అసలు రాజ్య అవసరమే లేదనడం అరాచక ధోరణి, కమ్యూనిస్టులు చెప్పే ఊహాలోకానికి ఇదొక అతిశయోక్తి రూపం. రాజ్యం లేకుండా సమాజం అసంభవమనేది స్పష్టమే. కమ్యూనిస్టు సాంఘిక వ్యవస్థలో రాజకీయ ఆర్థికాధికారం బాగా కేంద్రీకృతం కావటం కొట్టొచ్చినట్లు కనిపించే లక్షణం. ఈ రెండిటిలో ఒక దాన్ని మరొకటి ఎలా రద్దు చేస్తుందో చెప్పటం అనూహ్యం. కమ్యూనిస్టు సమాజాన్ని నిర్మించటానికి ముందుగా, రాజకీయాధికారాన్ని బాగా కేంద్రీకరించాలి. భవిష్యత్తును గురించి అవాస్తవిక స్వప్నభావాలు ప్రపంచానుభవంతో రుజువు చేయటానికి వీలులేని సిద్ధాంతాల నుంచే రాబట్టారు. సమాజం వర్గాలుగా విభజించి ఉన్నదన్నారు. వర్గ పోరాట చరిత్రే నాగరికత చరిత్ర అన్నారు. భిన్న ఆసక్తులు గల వర్గాలుగా సమాజం విభజించి ఉండటం చారిత్రక సత్యం. కాని ఐక్యపరిచే శక్తులు కూడా సమాజంలోనే ఇమిడి ఉన్నాయనేది కూడా అంతే వాస్తవం. కేంద్రం నుంచి దూరంగా పోవాలని ఉన్న ధోరణిని, కేంద్రానికి చేరువగా ఉండే ధోరణి ఎదుర్కొంటూ ఉన్నది. సాంఘిక పరిణామ చరిత్రలో ఈ రెండు ధోరణులూ తులనాత్మకంగా ఉండటం వల్ల సుస్థిరత చేకూరింది. పొందిక లేకపోవటం, అపస్వరాలు అన్నీ నియంతృత్వాలని స్థాపించటానికి లేదా నిరంకుశ ప్రభుత్వాలకు లేదా సమాజిక విచ్ఛిన్నతకు దారి తీశాయి. సమాజంలో పొందిక లక్షణాలు లేకపోతే మానవజాతి ఆటవిక నియమాలతో పరిపాలించబడేదే. సమాజ చరిత్ర అంతా పరిశీలిస్తే, కలిపి ఉంచే శక్తి ఎప్పుడూ పనిచేస్తూనే ఉన్నది. లేనట్లయితే నాగరికతా చరిత్రే ఉండేది కాదు. ప్రాచీన నాగరికతలు విచ్ఛిన్నం కావడానికి, బలీయమైన శక్తులు కొన్ని కలసి ఉండే ధోరణికి వ్యతిరేకంగా, సాంఘిక సమన్వయానికి భిన్నంగా పనిచేయడమే కారణం. మధ్య యుగాలలోనూ, ఆధునిక చరిత్రలో కూడా తరచు యుద్ధాలూ, విప్లవాలూ సంభవించాయి. సమాజ పరిణామం ఉన్నత స్థాయికి చేరుకోగా నాగరికత నిలబడింది. అప్పుడప్పుడు వచ్చే వడిదుడుకుల నుంచి తట్టుకొని, సంఘర్షణ శక్తుల మధ్య తులనాత్మక స్థితిని సమకూర్చుకున్నది. ఆదర్శవంతమైన రాజ్యంలో పరస్పర విరుద్ధ శక్తులు అదృశ్యం కావటం, సమాజం ఏక జాతిగా రూపొందడం ఊహించవచ్చు. అప్పుడు ఒక వర్గాన్ని మరొక వర్గం పెత్తనం చేసే పరిస్థితి ఉండదు. వర్గాలు లేకపోయినా సమాజం ఉంటుంది. ఆదిమ సమాజ స్థితి పోయి, సంక్లిష్టమైన వ్యవస్థగా, విభిన్న కార్యకలాపాలతో సమాజం ఉంటుంది. అటువంటి సమాజానికి కేంద్ర వ్యవస్థ ఉండక తప్పదు. అయితే పెనుభూతం వంటి రాజ్యంగా కేంద్ర వ్యవస్థ ఉండనక్కరలేదు. సమన్వయపరచే సాంఘిక సంస్థగా, వివిధ సంస్థల మధ్య పొందికను ఏర్పరచేదిగా మాత్రమే రాజ్యం ఉండాలి. ఆదిమ సమాజాలు మొదట ఏర్పడినప్పుడు గాక ఉత్తరోత్తరా రాజకీయంగా సంఘటితపడ్డాయి. తమను కాపాడుకోవటానికీ, మనుగడ పోరాటం కోసం ఇవి సంఘటితం కావటం జరిగింది. ఈ మధ్యలో క్రమంగా మానవాభ్యుదయం వల్ల సమాజ విధులకు కొత్తగా మరికొన్ని వచ్చిచేరి, వృత్తి రీత్యా విభజన ఏర్పడింది. కాలానుగుణంగా రాజ్యం వచ్చి భిన్న సామాజిక కార్యకలాపాలను సమన్వయంగా సాగేటట్లు తోడ్పడింది. సమాజం సంక్షేమాన్ని పెంపొందించటానికి రాజ్యం ఉపకరించింది. సమాజం మీద ఉపరితల నిర్మాణంగా రాజ్యం ఏర్పడలేదు. నియంతృత్వ ప్రాధాన్యత కూడా రాజ్యానికి లేదు. ప్రజా పరిపాలనతో ఒక క్రమాన్ని పాటించటానికి, నియమాల నేర్పరచి అమలు పరచటానికి రాజ్యం సృష్టి అయింది. భిన్న సామాజిక కార్యకలాపాలు శాంతియుతంగా కొనసాగటానికే రాజ్యాన్ని ఉద్దేశించారు. ఆర్థిక, విద్యా సాంస్కృతిక సంస్థలన్నీ సమాన స్వతంత్ర ప్రతిపత్తిగల సాంఘిక సంస్థలుగా ఉన్నప్పుడు వాటిలో ఒకటిగా మాత్రమే రాజ్యం ఆవిర్భవించింది. సమాజ ఆర్థిక జీవనంలో ప్రభుత్వ జోక్యం చేసుకొనే రోజులు ఉండేవి. సమాజానికి కావలసిన అవసరాలను రైతులు, కళాకారులు, వ్యాపారస్తులు తీర్చేవారు. సహజ వనరులను వాడుకోవటానికి మానవులు శ్రమను జోడించేవారు. ఇది వ్యక్తి పరంగానూ, వ్యవస్థాపిత గిల్టుల రూపేణా జరిగేది. విద్యా సాంస్కృతిక రంగాలలో వ్యక్తి స్వేచ్ఛ, సంస్థాగత స్వతంత్ర ప్రతిపత్తీ రాజ్య పరిధిలో ఉండేవే కాదు. రాజకీయంగా కేంద్రీకృతమైన ఆధునిక సమాజంలో ఆర్థిక సదవకాశాలు సందేహాస్పదాలే. నేడు రాజ్యం పెనుభూతం వలె తయారయింది. అలా కాకుండా పోయే రోజులు మనం మళ్ళా ఊహించవచ్చు. అయితే రాజ్యం లేని సమాజాన్ని, ప్రజా పరిపాలన లేని సమాజాన్ని ఊహించడం లేదు. అటువంటిది కేవలం ఆచరణకు రాని ఆదర్శం మాత్రమే. కాని రాజ్యం యొక్క విధులను కనీస స్థాయికి తగ్గించే మార్గాన్వేషణ జరగాలి. అంటే ప్రజా పరిపాలనకు సాధనగానూ, స్వతంత్ర ప్రతిపత్తి గల సాంఘిక సంస్థల కార్యకలాపాలను సమన్వయపరిచేదిగానూ రాజ్యం ఉండాలన్న మాట. బహుళత్వంతో కూడిన సమాజాన్ని కోరే సాంఘిక తత్వవేత్తలు ఉన్నారు. ఇందులో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలుంటాయి. రాజ్యం కూడా ఒక సంస్థగా ఉంటుంది. భిన్న కార్యకలాపాలను క్రమబద్ధంగా జరిగేటట్లు చూడటం సమన్వయపరచటం మాత్రమే రాజ్యం కర్తవ్యం. 19వ శతాబ్దపు ఉదారవాదంలో సామాజిక వ్వవస్థకు సంబంధించిన ఈ దృక్పథాన్ని పేర్కొన్నారు. కనీస పాలన చేసే ప్రభుత్వమే ఉత్తమం అన్నారు. అప్పటి నుంచీ, అధికార కేంద్రీకరణ ధోరణి బలపడింది. రాజ్యం వత్తిడి చేసే యంత్రంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఇదంతా అధికారం వల్ల కాదు, అధికార కేంద్రీకరణ వల్ల మాత్రమే. ప్రజా స్వామిక రాజకీయ ఆచరణలో వికేంద్రీకరణ ప్రధాన సమస్య అయింది. రాజకీయంగా చూస్తే, ఇది కలవరపాటు చెందవలసిన సమస్య ఏమీ కాదు. ఆర్థిక కేంద్రీకరణ ఎక్కువ కావటంతో రాజ్యాధికారం కూడా బలపడింది. ఆధునిక సమాజంలో ఆర్థిక విధానాన్ని వికేంద్రీకరించవచ్చునా.. దీని ఫలితంగా రాజకీయాధికారాన్ని కూడా వికేంద్రీకరించవచ్చునా? శతాబ్దాలుగా వస్తున్న దానిని ఎలా మారుస్తాము… అని వాదించి తప్పుకుంటే చాలదు. మానవ ప్రతిభ అయిపోయిందని భావిచడం, విధి వశానికి వదిలేసే దృక్పథం మాత్రమే. వివేచనలో తుది పలుకు ఎప్పుడో పలికారనడం కూడా, మానవజాతి ప్రయాణంలో అంతానికి చేరుకున్నదని చెప్పటమే. అంటే, సమాజం విభిన్నం కానున్నదన్న మాట. మానవ ప్రతిభను ఇలా వ్యతిరేకించటం, ఆవిర్భవిస్తున్న, పురోగమిస్తున్న అనంత సృష్టిిని కాదని, బలంగలవారిదే హక్కు అని చెప్పటం చట్టబద్ధమైనదీ, నైతికమైనదని కొందరు భావించారు. అటువంటి ఆటవిక నియమంలో సమాజ పాలన కింద జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోవలసిందే. అధికార కొట్లాటలో మానవ స్వేచ్ఛను, బలి చేయదలచుకోకపోతే రాజకీయ పార్టీల జోక్యం లేకుండా, రాజకీయాల నాచరించే అవకాశాలను అన్వేషించాలి. రాజకీయ పార్టీలు సాధనగా, కొద్దిమంది చేతులలో నేడు అధికారం కేంద్రీకృతమై కపటపు నెపంతో దుర్వినియోగ పరుస్తున్నారు. కేంద్రీకరణ సాధనగా ఉపకరించేవి అదృశ్యం కావటం అధికార వికేంద్రీకరణకు అవసరం. దీని స్థానే మరొక సాధన రావాలి. ప్రజల సార్వభౌమత్వాన్ని ప్రజలలోనే అన్ని సమయాలలోనూ, ఉంటే హామీ కావాలి. ప్రజాస్వామ్యాన్ని ఆచరించటానికి రాజకీయ పార్టీలు తప్పనిసరి అని నమ్మినంత కాలం కొద్దిమంది చేతులలో అధికారం కేంద్రీకృతం కావటం కూడా తప్పదు. పార్టీ విధానంలో దయామయమైన నియంతృత్వాన్ని మాత్రమే ఆశించవచ్చు. దీనినే ఆదర్శప్రాయమని చెప్పవచ్చు. కాని ప్రపంచంలో అటువంటిదెన్నడూ లేదు. అవినీతికి లోనుగాని ప్రజలున్నారు. నేడు రాజకీయాలను ఆచరించే తీరుపట్ల వారు జుగుప్సతో ఉన్నారు. అధికార పోరాటానికి వీరు దూరంగా ఉన్నారు. అత్యుత్తములను కూడా అధికారం చెడగొట్టవచ్చు. అంతమాత్రం చేత వీరు ప్రజా వ్యవహారాల పట్ల ఉదాసీనంగా లేరు. వారు చిన్న విషయాలను ప్రశాంతంగా చేసుకుపోతుంటారు. ఇటువంటి వారి కృషి ఫలితంగానే సమాజంలో నైతిక స్థాయి పూర్తిగా తుడిచిపెట్టుక పోకుండా ఉన్నది. రాజకీయాలు అవినీతి నుంచి దూరం చేసి స్థాయి పెంచాలంటే అధికార తృష్ణ నుంచి విమోచన పొందాలి. రాజకీయాలను ప్రక్షాళితం చేయడానికి అధికారాన్ని సమానంగా పంచుతూ రాజ్యాంగ నిర్మాణం జరగాలి. వ్యక్తికి ప్రధాన స్థానం కల్పించినప్పుడే సరైన ప్రజాస్వామిక పద్ధతి సాధ్యపడుతుంది. ప్రజా స్వామ్యం అపఖ్యాతిపాలు కావటానికి మోసపూరితమైన ఆచరణ, దోష పూరితమైన సిద్ధాంతం ఒక కారణం. ప్రజా స్వామిక రాజ్యానికి సుస్థిర పునాదులు వేయడానికి వీలు లేకుండా, నేటి ఆచరణ అడ్డు పడటం రెండో కారణం. మూక స్వామ్యంపై ఇదంతా ఆధారపడింది. ఉత్తమ ప్రపంచాన్ని ఊహించేవారు అవినీతి నుంచి రాజకీయాలు విమోచన పొందాలనేవారు ప్రజాస్వామిక సమాజానికి పునాదులు వేసే ప్రయత్నం చేయాలి. స్త్రీలూ, పురుషులూ తమ వ్యక్తిత్వాన్ని గురించి చైతన్యం చూపాలి. తాము చేసే నిర్ణయాలలో తమ శక్తిని గమనించాలి. తాము ఎదుర్కొనే నైతిక, రాజకీయ సమస్యలను విచక్షణతో పరిశీలించాలి. అటువంటప్పుడు, రాజకీయ వాదులు ఉద్వేగాలకూ, ప్రేరణలకూ విజ్ఞప్తి చేసి ఆకర్షించటం సాధ్య పడదు. ఓటర్లలో అధిక సంఖ్యాకులు, ఎన్నికల సమయంలో పార్టీలు చేసే వాగ్దానాలను పరిశీలిస్తే, అవి సరైనవి అవునో కాదో గ్రహించ గలుగుతారు. ప్రజా స్వామ్యాన్ని పునాదులు నుంచి నిర్మించటానికి ప్రజలు తోడ్పడతారు. ఆధునిక ప్రపంచంలో ప్రజా స్వామిక ఆచరణకు ఎదురైన కలవరపాటు తొలగాలంటే ఇదే సరైన మార్గం. పెద్ద రాజ్యాలలో అధిక జనాభా ఉన్నప్పుడు, ప్రత్యక్ష ప్రజా స్వామ్యాన్ని పాటించటం ఎలాగ అనే సమస్య పరిష్కారమవుతుంది. సరైన ప్రజాస్వామ్యమంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యమే. పరోక్ష ప్రజాస్వామ్యమంటే అధికారాన్ని దత్తత చేయటమే. అధికారాన్ని దత్తత ఇస్తే, సార్వభౌమత్వాన్ని స్వాధీనం చేసినట్లే. స్థానికంగా వ్యవస్థాపితమైన ప్రజాస్వామ్యాలపై ఆధారపడితే తప్ప ప్రజా స్వామ్యం వాస్తవం కాదు. నిస్సహాయంగా ఉండే వ్యక్తుల వల్ల ప్రయోజనం లేదు. ప్రజాస్వామ్య రాజ్యానికి పునాదిగా స్థానిక ప్రజాస్వామ్య సంస్థలుండాలి. ప్రజాస్వామ్యాన్నివికేంద్రీకరిస్తే అధికార కేంద్రీకరణకు ఆటంకం ఏర్పడుతుంది. అప్పుడు స్వతంత్ర ప్రతిపత్తిగల సాంఘిక సంస్థల కార్యకలాపాలను సమన్వయీకరించటం వరకే రాజ్యం పరిమితమవుతుంది. ఈ విధానానికి చాలాకాలం పట్టవచ్చు. సర్వసాధాణంగా ఇదొక అభ్యంతరమైనట్లు చెబుతున్నారు. ఒకసారి నిర్ణయం చేసుకొని కొత్త దారిలో పయనించటం ప్రారంభిస్తే, వాస్తవానికి కనిపించేటంత దూరం లేదని తెలుస్తున్నది. ముందుగా మానవ స్వభావానికి సంబంధించిన సంప్రదాయ భావాన్ని వదలాలి. మానవ స్వభావం దోషపూరితం కాదు, దైవత్వంతో కూడినదీ కాదు. మానవుడు ప్రాయికంగా హేతువాది. అవకాశం వస్తే ప్రతి వ్యక్తీ స్వయంగా ఆలోచించుకోగలడు. మంచి చెడులను నిర్ణయించుకోగలడు. తదనుగుణంగా వర్తించగలడు. వ్యక్తిగా తన స్వభావాన్ని బట్టి వివేచనాత్మకంగా ఆలోచించటం, నైతికంగా ప్రవర్తించటం చేస్తే తప్ప, స్వేచ్ఛాయుత న్యాయ సమ్మతమైన సాంఘిక వ్యవస్థను ఆశించటం వృధా అవుతుంది. ప్రస్తుతానికి సామాన్యులు నిరక్షరాస్యులు కావటం నిజమే. వారు దేశాన్ని పరిపాలించలేకపోవచ్చు. కాని వారి మానాన వారిని వదిలేస్తే, అజ్ఞాని అయిన రైతు సహితం తన వ్యవహారాలను మన ప్రభుత్వం కంటే బాగా నిర్వహించగలడు అనేది వాస్తవం కాదా? సామాన్య ప్రజల ఆలోచనా శక్తిలో అపనమ్మకాన్ని వెల్లడించి, వారి వ్యవహారాలు తాము చూస్తామంటూ అధికారాన్ని చేబట్టటం, దుర్వినియోగ పరచడం, వ్యక్తుల స్వేచ్ఛను అణచటం జరుగుతున్నది. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ప్రజల మధ్యకు పోయి హామీలిస్తాయి. వాటిలో సగం కూడా తీర్చలేమని వారికి బాగా తెలుసు. ఓటర్లు అర్థం చేసుకోలేరనీ, కనక మోసంగించవచ్చుననే విషయం వీరికి తెలుసు. ఆ స్థితిని మార్చలేమా? మార్చవచ్చు. ఈ పరిస్థితిని మార్చటమే మొట్టమొదట చేయవలసిన పని, రాజకీయాలలో పాల్గొనదలచినవారి బృహత్తర బాధ్యత ఇదే. అయితే స్వార్థం కోసం మాత్రం కాకూడదు. ఓట్ల కోసమే ప్రజలలోకి వెళ్ళనక్కరలేదు. తెలివిగా వోట్లను వేసేందుకు తోడ్పడటం చాలా ముఖ్యమైన కృషి. అన్ని పార్టీల కార్యక్రమాలను పరిశీలించమని చెప్పాలి. హామీలు సాధించటం సాధ్యమేనా అని చూడటం, ఒకవేళ సాధ్యపడితే అందువల్ల పరిస్థితి మెరుగుపడుతుందేమో గమనించటం - ఇవి ఓటర్లకు చెప్పవలసిన విషయాలు. ఈ కొత్త రాజకీయ ఆచరణకు గాను మానవ స్వభావాన్ని గురించిన భావంలో సమూలంగ మార్పు రావాలి. వివేచనకు విజ్ఞప్తి చేయాలి. మానవుడు హేతువాది అని ముందు నమ్మాలి. సామాన్యుడు స్వయంగా ఆలోచించలేడని నేటి రాజకీయ ఆచరణ సాగుతున్నది. అందుకే అతడు పార్టీలను, రాజకీయ వాదులను అనుసరించాలంటున్నాడు. ప్రజలకూ, పార్టీలకూ, రాజకీయవాదులకూ మధ్య అసహజమైన సంబంధం వల్ల పార్టీ రాజకీయాలకు పునాదులు ఏర్పడినాయి. ప్రజలను స్వయంగా ఆలోచించకుండా పార్టీలు అడ్డుపడుతున్నాయి. రాజకీయాలంటే అధికారం కోసం పెనుగులాట మాత్రమే గాక, అన్నివిధాలైన పోటీలకు రంగస్థలమైనది. ఇదంతా విషవలయంగా కనిపించవచ్చు. కాని మార్గాంతరం ఉన్నది. రాజకీయ వాదులు అందుకు ఒప్పుకోరు. ఎందుకంటే అంతటితో వారి పని ముగుస్తుంది. వివేచనకు విజ్ఞప్తి చేయటమే మార్గాంతరం. ఆధునిక విజ్ఞానం దారి చూపుతున్నది. మానవ స్వభామంటే నమ్మటం కాదనీ, పరిశీలించటం అనీ, అది వివేచనాత్మకమనీ విజ్ఞానం బోధిస్తున్నది. మానవుడి వివేచనా స్వభావాన్ని పాతాళంలో పాతిపెట్టిన మాట నిజమే. కాని మానవ స్వభావానికి సారం అదే గనక పునరుద్ధరించవచ్చు. కొంతమంది దృఢ విశ్వాసంతో, సాహసంతో ప్రవర్తిస్తే చాలు. వివేచనా, మేథస్సు స్థాయికి రాజకీయాలను తీసుకు రావాలి. వివేచనకు విజ్ఞప్తి చేసినందువల్ల తగిన ప్రతిస్పందన ఉంటుంది. ఊహించిన దానికంటే వేగంగానే కొత్త రాజకీయాలు ఫలిస్తాయి. అయితే విజయానికి కొలమానం అధికారం కాదు. క్రమంగా ఆ దోషం అదృశ్యం కావటమే. అధికార తృష్ణను వదిలేసి. అధికార పోరాటంలో పాల్గోకుండా కొందరైనా ఉండగలిగితే, ప్రజాస్వామ్యానికీ, స్వేచ్ఛకూ సుస్థిర పునాదులు వేసినట్లే. ప్రజల పేరిట పరిపాలిస్తామంటూ ఓట్లు అడగవద్దు. మానవుని హుందాతనం, ఆలోచనా శక్తి సృష్టించే ప్రతిభను, అతడికి జ్ఞాపకం చేస్తే చాలు. క్రమంగా ఓటర్లు నిశిత పరిశీలకులుగా విచక్షణను చూపటం జరుగుతున్నది. స్థానికంగా ఓటర్లు అన్ని పార్టీల అభ్యర్థులకూ తమను వదిలేయమని చెప్పే సమయం వస్తుంది. తమలోనే తమకు విశ్వాసం గల వ్యక్తిని, బాధ్యతగా ప్రవర్తించే వ్యక్తిని కనుగొంటాడు. ఒకసారి ఇది జరిగితే పార్టీ విధానం అంతంగావటం ఆరంభమైనట్లే. పార్టీలతో పాటు అధికార కేంద్రీకరణకు ప్రధాన కారణం కూడా అదృశ్యమవుతుంది. వికేంద్రీకృత రాజ్యంతో కూడిన స్థానిక రిపబ్లిక్కులకు పునాది పడుతుంది. రాజ్యం చేసే పని స్థానిక రిపబ్లిక్ కింది స్థాయిలో చేస్తుంది. స్థానిక రిపబ్లిక్ ల నమూనాలో జాతీయ సంస్కృతి, జాతీయ ఆర్థికత, జాతీయ రాజకీయ సంస్థలు మలచబడతాయి. అధికారం ప్రజలతోనే ఉంటుంది. చిన్న సమూహాలలో సభ్యులు ప్రత్యక్షంగా అధికారాన్ని వినియోగిస్తారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో విస్తృత ప్రాతిపదిక ఆధారంగా ఉన్న రాజ్యం వాస్తవ ప్రజాస్వామికంగా ఉంటుంది. అధికారాన్ని కాజేసే ప్రశ్నే ఉండదు. రాజకీయ ఆర్థిక అధికార కేంద్రీకరణ తొలగిపోయి బహుళత్వ ఆధునిక సమాజంచాలు . (1953, ఆగస్టు 30న రాడికల్ హ్యూమనిస్టు (ఆంగ్ల వారపత్రిక, కలకత్తా) సంపాదకీయం.) రచయిత అనువాదం ఎమ్.ఎన్.రాయ్ నరిసెట్టి ఇన్నయ్య