వెనిగళ్ళ కోమల అనుభవాలు - జ్ఞాపకాలు

అనుభవాలు - జ్ఞాపకాలు వెనిగళ్ళ కోమల ఈ రచన ఎందుకు ? అమ్మ, నాన్న అల్లారు ముద్దుగా పెంచారు నన్ను. అన్నయ్య, ముగ్గురు అక్కలు మమతానురాగాలు పంచారు. కొందరు బంధువులు బాగా దగ్గరయ్యారు. ఎంతోమంది స్నేహితులను పొందగలిగాను. మంచి వ్యక్తులతో పరిచయాలయ్యాయి. నా జీవితానికి పరిపూర్ణతనిచ్చారు నా భర్త నరిసెట్టి ఇన్నయ్య, నా బిడ్డలు నవీన, రాజు. నా యీ సుదీర్ఘ జీవితం ఎన్నో అనుభవాలకూ, జ్ఞాపకాలకూ ఆలవాలమయింది. నా జ్ఞాపకాలను అక్షబద్ధం చేయమని ఇన్నయ్య ప్రోత్సహించాడు. జి.వి.కె. మామయ్య (గోగినేని వెంకట కృష్ణారావు) పదే పదే చెపుతూ పోయారు రాయమని. వారిద్దరికీ కృతజ్ఞతలు. నా యీ జ్ఞాపకాలు కాలక్రమానుసారంగా రాయలేదు. ఎప్పుడే విషయం మది నిండితే అదే వరుసలో రాయగలిగాను. సాధ్యమైనంత వరకూ జ్ఞాపకాలను గుదిగుచ్చాలనేదే నా ఉద్దేశ్యం. కొన్ని ముఖ్యమైన విషయాలు మరుగునపడి వుండవచ్చు. అంత ప్రాముఖ్యత లేని సంగతులు ఇందులో చోటు చేసుకునీ ఉండవచ్చు. ఈ రచన కేవలం నా సంతృప్తి కొరకు కొనసాగించినదే. ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించిన అమ్మకు, నాన్నకు అంకితం. వెనిగళ్ళ కోమల ఊరు - మూల్పూరు అమ్మ - వెనిగళ్ళ రామకోటమ్మ (కొల్లూరువారి ఆడపడుచు) నాన్న - వెనిగళ్ళ వెంకట సుబ్బయ్య మేము వారి ఐదుమంది సంతానం కమల గంగాధరరావు విమల శ్యామల కోమల (నేనండి) మేనమామలు, వారి కుటుంబాలు :- కొల్లూరి నాగభూషణం - అమ్మకు అన్న - పెదమామయ్య అని పిలిచే వాళ్ళం మేము. నాగేంద్రమ్మ - అత్తయ్య వారి సంతానం వసుమతి శేషగిరి వరలక్ష్మి (వరాలు) కొల్లూరి వెంకట్రామయ్య - అమ్మకు తమ్ముడు చినమామయ్య అని పిలిచేవాళ్ళం పిచ్చమ్మ - అత్తయ్య వారి పిల్లలు నిర్మల కోటేశ్వరరావు సత్యవతి మేనమామల గురించి ముందు ప్రస్తావించటానికి కారణం అందరం ఒకే కాంపౌండులో వేరు వేరు ఇళ్ళల్లో ఉండటాన వారితో ఉన్న అనుబంధం గొప్పది అవటం వలన. నాన్న కుటుంబం - ఊరు కాసరనేని వారి లంక వెనిగళ్ళ నరసింహం (మా తాతగారు) వెనిగళ్ళ వెంకమ్మ (మా నాయనమ్మ) నాగభూషణం - పెదనాన్న పున్నయ్య - బాబాయి నారాయణ - బాబాయి నాగమ్మ - పెద్దత్తయ్య సుబ్బమ్మ - చిన్నత్తయ్య ( ఆమె అకాల మరణం వలన నాకు పరిచయం కాలేదు) నాన్న తన మూడవ ఏట మూల్పూరు పెంపు వచ్చారట. పెంచుకున్న వారు అఫీషియల్ గా దత్తత నిర్వహించి నాన్న అసలు యింటి పేరు మార్చలేదు. పెంచి బాధ్యతలు, ఆస్తులు అప్పగించారు తప్ప. అందువలన మూల్పూరులో మేము ఒక్కళ్ళమే వెనిగళ్ళవాళ్ళం. అంట్లు, సూదకాలు మా దరికి రాలేదు మూల్పూరులో. మాది ఏకఛత్రాదిపత్యం మూల్పూరులో. పెద్దింటి వారుగా ఊరంతా గౌరవించేవారు. అలా అమ్మా, నాన్నా నడుచుకున్నారు మరి! అమ్మకు ఎనిమిదవ ఏట నాన్నతో (18ఏళ్ళు) పెండ్లి జరిపించారట. ఆమెకు పాతికేళ్ళు రాకుండానే మేమందరం పుట్టాము. అమ్మ మమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచింది. ఆమె చిన్న విగ్రహం, బంగారు ఛాయ (ఆమె తండ్రి శేషగిరిగారి రంగట అది) చక్కని నవ్వు. మనిషి, మాట అంతా పొందికే. ఆమెలో కోపం నేనెప్పుడూ చూడలేదు. అక్కయ్యలు, అన్నయ్య నెమ్మదస్తులు. అమ్మ పొందిక హరికి అబ్బింది. నేను గడుగ్గాయలా అల్లరి చేసినా ఎప్పుడూ కోప్పడిగాని, ఒక దెబ్బవేసిగాని ఎరుగదు అమ్మ. అంత ఓపిగ్గా ఎలా నెట్టుకొచ్చిందో తన సంసారాన్ని, పిల్లల్ని! ప్రతి శుక్రవారం మానలుగురికి నలుగుపెట్టి కుంకుడుకాయ రసంతో తల స్నానాలు చేయించేది. సాంబ్రాణి, పాలమడ్డి పొగలు జుట్టుకు పట్టించేది. అందరిదీ పెద్దజుట్టే. నేను నలుగుకి వంగక ఆవరణ అంతా పరుగులెత్తేదాన్ని. పనిపిల్లతో నన్ను పట్టించి నా ఏడుపు మధ్యలో నా తలంటు ముగించేది అమ్మ - ఇక అయిపోయింది, అయిపోయింది అంటూ. ప్రతి శుక్రవారం అదొక ప్రహసనం మా యింట్లో. నాన్నతో మాకు చనుము వుండేది కాదు. చనువంతా అమ్మతోనే. నాన్న గంభీరంగా ఉండేవాడు. మంచి పొడవు, చక్కని రూపం. ఎప్పుడూ పరిశుభ్రంగా కనిపించేవాడు. రోజుకు 3 సార్లు స్నానం చేసేవాడు. ఖద్దరే కట్టేవాడు - తుండుగుడ్డలు, జేబుగుడ్డలతో సహా అంతా ఖద్దరే వాడేవాడు. చాకలి ఆయన బట్టలు ప్రత్యేకంగా ఉతికి, ఇస్త్రీ చేసేవాడు. నాన్న మమ్మల్ని ఎంతో ప్రేమగా, శ్రద్ధగా పెంచాడు. అడగకుండానే అన్ని అవసరాలు తీర్చేవాడు. మా ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు. మామిడి పళ్ళు, సపోటాలు, అరటిపళ్ళు (గెలలే వేలాడుతుండేవి గదిలో) కలకత్తా జామ, ద్రాక్ష (బెంగుళూరు నుండి ఎర్రకుండలలో వచ్చేవి) పైన్ యాపుల్ తెప్పించేవాడు. అమ్మ రకరకాల పిండివంటలు చేసి డబ్బాలలో నింపేది. నేను తిండి ప్రియురాలను. పొట్లాలలో కట్టుకుని స్నేహితులతో పంచుకుని తింటూ ఆడేదాన్ని. ఆటల మధ్యలో వచ్చి అమ్మతో - ఫలానా ఫలానా తిన్నాను, అవిగాక వేరే ఏమన్నా పెట్టు అనేదాన్ని. అమ్మ నవ్వుతూ - “అమ్మాయ్, ఇక నేనే మిగిలాను, నన్ను తిను” అనేది. ఏ చెరుకు గడో, తేగలో, జామకాయో, వేరు శనగకాయలో (సంచులతో ఉండేవి). దొరకబుచ్చుకొని ఆటలకు పరుగులెత్తేదాన్ని. ఆటలన్నీ మా యింటి ఆవరణలోనో, చావడిలోనో. మామరోయింటి లోనో సాగేవి. నాన్నశాకాహారి, అమ్మ పుట్టింటి వాళ్ళు మాంసప్రియులు. మా యింట్లో ఎప్పుడోగాని మాంసాలు వండేవారు కాదు. మామయ్యల ఇండ్ల నుండి పంపేవారు. మా బట్టల విషయం కూడా నాన్న చూసుకునేవాడు. తెనాలి వెళ్ళి, బట్టలు ఎంచి మనిషినిచ్చి యింటికి మూట పంపేవాడు. వాకు నచ్చినవి చెప్పమని. అవి చింపించి టైలర్ కు కబురు పెట్టి యింటివద్దనే కుట్టించేవాడు. అవసరానికి మించి కుట్టించేవాడు. ఇన్ని అవసరం లేదని నేనంటే హాస్టల్లో (చదువురీత్యా ఉండేదాన్ని) చాకలి రాలేదని, ఇస్త్రీ బట్టలు లేవని, బట్టలు ఆరలేదనీ, క్లాసులు మానకూడదు. ఎక్కువ బట్టలుంటే అలాంటి పరిస్థితి ఎదురవ్వదు అనేవాడు. అమ్మకు కూడా ఖరీదైన చీరలు తెచ్చేవాడు. నాన్నకు శాస్త్రీయ సంగీతం, వాద్య సంగీతం ఇష్టం. చిన్నప్పుడు మృదంగం నేర్చుకున్నాడట. రేడియో కొన్నాక మేము గూడా వార్తలతోపాటు, ఆ సంగీతాలే వినేవాళ్ళం. నాన్నగానీ, అమ్మగానీ యిలా నడుచుకోవాలి అని ఎప్పుడూ చెప్పలేదు. కాని చక్కని క్రమశిక్షణ మా అందరికీ అలవడింది. అది ఆ యింటి పద్ధతి. నాన్న కాలేజి చదువులు చదవలేదు. ఇంగ్లీషు స్వయం కృషితో నేర్చుకున్నారు. తేలిక పాటి ఇంగ్లీషు సంభాషణ అలవరచుకున్నారు. ఇంగ్లీషు పేపరు, తెలుగు పేపరు తెప్పించేవారు. మా అందరికీ వార్తాపత్రికలు చదవటం అలవడింది నాన్నవల్లనే. భారతి, తెలుగు, స్వతంత్ర తెప్పించేవారు. ఎంతో శ్రద్ధతో చదివేవాళ్ళం. నాన్న మా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకునేవారు. ఎవరికైనా ఏ కొంచెం నలత చేసినా వెంటనే డాక్టరుగారు (ఎర్రడాక్టరుగారనేవాళ్ళం ఆయన్ని. మంచి రంగు పొట్టిగా ధృఢంగా, తెల్లటి బట్టలు ధరించి మెరుస్తూ ఉండేవారు.) రావలసిందే యింటికి. ఆయుర్వేద వైద్యం నడిచేది. మందు మింగననీ, జ్వరంలో గూడా అన్నం తింటాననీ అమ్మను బాగా వేధించేదాన్ని. చెప్పాను గదండీ ఆకాశమంత ఓర్పుల తల్లి మా అమ్మని. అన్నీ సహించేది. మాకు అవసరానికి ముందే అన్నీ అమిరేవి. అందువలన ‘లోటు’ అనే పదం ఆ యింటి నిఘంటువులో లేదు. నాకు బాగా గుర్తు - స్టూలు మీద కూచోబెట్టి చెవులు శుభ్రం చేసేవాడు. గోళ్ళు కత్తిరించి గ్లిజరిన్ ముంచిన దూదితో తుడిచే వాడు. ముఖం మీద పొక్కుగాని, మొటిమ గానీ రాకుండా ఉండాలని తగు శ్రద్ధ తీసుకునేవాడు. ఆయన సేవలవల్లనే కాబోలు - మా నలుగురికీ మొటిమల బాధ ఎదురు కాలేదు ఎప్పుడూ. అక్కలంటే ఏ పని చేసినా పద్ధతిగా, నీటుగా, నిలకడగా చేసేవారు. ముగ్గులు పెట్టటం, అల్లికలల్లడం, చక్కగా జడలు వేయడం. పెద్దక్కలిద్దరూ సంగీతం నేర్చుకున్నారు. ఏది చేసినా వారి పనిలో ప్రత్యేకత ఉండేది. నేను గజిబిజిగా, అల్లరిగా, హడావిడిగా చేసి పనులు చెడగొట్టేదాన్ని. చదువులో శ్రద్ధచూపేదాన్నేమో, మిగతావిషయాలలో నన్నెవరూ పట్టించుకునేవారు కాదు. నేను మా యింట్లో బ్లాక్ షీప్ (black sheep) ని రంగులో, రూపంలో, అన్నివిషయాలలో. అందువల్లనేనేమో అక్కలు, అన్నయ్య నన్నెంతో ముద్దు చేసేవారు. అన్నయ్య నా చదువు విషయంలో, తిండి, ఆటల విషయంలో శ్రద్ధ చూపేవాడు. నా బొమ్మల పెళ్ళిళ్ళకి పందిళ్ళు వేసేవారు. బూరలు ఊది మేళాలు అనేవాడు. అమ్మతో పులిహోర, పాయసం చేయించి నా స్నేహితులు (పెళ్ళి పెద్దలు గదా!) తినే ఏర్పాటు చేసేవాడు. నా పుస్తకాలకు అట్టలు వేసి, చక్కగా పేరు, క్లాసు రాసి బడికి పంపేవాడు. అమ్మా, నాన్నా పని వారినీ, పొలం చేసే వారినీ పూర్తి పేరులతో పిలిచేవాళ్ళు. అరే, ఒరే అనటం సంస్కారం కాదని మేము వారి వద్దనే నేర్చుకున్నాం. వాళ్ళకు మంచి భోజనం పెట్టేవాళ్ళు. మనం వాళ్ళపట్ల శ్రద్ధ చూపితే మన పని పట్ల వాళ్ళూ శ్రద్ధ చూపుతారనే వాళ్ళు అమ్మా, నాన్న. నేను ఆదివారం, అమావాస్య (మే 8, 1935) నాడు పుట్టానట. నాన్నకు మామల వరసైన వాళ్ళు - వెంకట సుబ్బయ్యకి దొంగ పుట్టింది అని హాస్యమాడారట. దానికి జవాబుగా నాన్న - “దొంగ పుట్టటం మా యింటా ఒంటా లేదు, మా యింటి వెనుక రామస్వామి (పెదనాన్న అనేవాళ్ళం) యింట కూడా లేద”న్నాడట. నాన్నకు అంత నమ్మకం తన బిడ్డల మీద. ఆయన నమ్మకం మేము వమ్ము చేయలేదు. ఆయనకు గర్వకారణంగానే ఎదిగాము. ఆయన సభ్యతనూ, సంస్కారాన్నీ అందిపుచ్చుకున్నాం. పెద్దవాళ్ళంటే గౌరవం, అతిథి సత్కారంలో ఆనందం, స్నేహశీలత, ఆప్యాయత అన్నీ అమ్మా, నాన్నల నుండి అబ్బినవే మా ఐదుగురికీ. నాన్న నన్ను హస్టల్లో పెట్టి చదివిస్తుంటే, ఊరిలో పెద్దవారు ఆయనకు సలహాలిచ్చేవారు - నలుగురాడపిల్లల తండ్రివి, వారి పెళ్ళిళ్లూ, పేరంటాలూ, పురుళ్ళూ బోలెడు ఖర్చులుంటాయి నీకు, చిన్నపిల్లని ఇంత చదివిస్తున్నావు ఖర్చు పెట్టి, రేపు ఆమెకంటే పెద్ద చదువు చదివినవాణ్ణి భర్తగా తేవాలి. కట్నమివ్వక తప్పదు. పెళ్ళి ఖర్చు జాస్తి. ఎందుకు జాగ్రర్త పడవు, అని అంటే నాన్న నా పిల్ల చదువే తనకట్నం అనుకుంటాను అనేవాడు. అలాగే నా పెళ్ళిలో కట్నాల ప్రసక్తి రాలేదు. పెద్దక్క కమలను గుంటూరు సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ లో చదివించారు. తరచు మలేరియా వస్తుంటే అక్కని హాస్టల్ నుండి తీసుకువచ్చేశారు. నేను అమ్మ నాన్నతో కలిసి మా గుర్రంబండిలో అక్కను చూడటానికి వెళ్ళేదాన్ని. జాన్ సాయిబు బండి తోలేవాడు. గుర్రం ఆలనా, పాలనా అతనే చూచేవాడు. పెద్దక్కలిద్దరికీ చిన్నవయసులోనే పెళ్ళిళ్ళు చేశాడు నాన్న. పెద్దక్క స్నేహితురాళ్ళు బసవమ్మక్కయ్య, కృష్ణపిన్ని నాకు బాగా ఇష్టమైనవారు. అట్లాగే అన్నయ్య స్నేహితులలో గోగినేని వెంకట కృష్ణారావు మా అందరికీ ప్రీతిపాత్రుడు. అన్నయ్య ‘కిష్టరావ్’ అని పిలిచేవారు. మేము జి.వి.కె మామయ్య అంటాము. ఆయన విదేశాలలో చదువులు సాగించి ఉద్యోగాలు చేశారు. హైదరాబాద్ లో పెద్ద ఆఫీసరుగా విధులు నిర్వహిస్తూ ఎంతోమందికి ఉద్యోగాలిప్పించారు. వారంతా మామయ్యను ‘దేవుడు’గా కొలుస్తారు. అన్నయ్య పిల్లల ఉద్యోగాలు, పెళ్ళిళ్ళ విషయాలలో ఎంతో సహాయపడ్డారు. జి.వి.కె. మామయ్యతో ఇప్పటికీ టచ్ లో ఉన్నాను. నాన్ననూ, అన్నయ్యను ఎంతో ఆర్తితో తలుచుకుంటేగాని మామయ్య ఫోను సంభాషణ ముగించరు. అంతటి సహృదయుడూ స్నేహ పాత్రుడు ఆ మామయ్య. ఆయన ప్రోత్సాహంతోనే నా జ్ఞాపకాలకు శ్రీకారం చుట్టాను. మామయ్య పది కాలాపాటు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాను. మా యింట్లో పరుష పదాలు, దూషణలు, తిట్లు ఎప్పుడూ వినలేదు. నాన్న మూల్పూరు పంచాయతీ ప్రెసిడెంట్ గా 15 ఏళ్ళు పనిచేసారు. ఆయన ఆధ్వర్యంలోనే రోడ్లు, బస్ సౌకర్యం, పసువుల వైద్యశాల, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పడ్డాయి. ఫండ్స్ తక్కువ పడితే తన సొంత డబ్బు ఖర్చు చేసి ఊరికి సౌకర్యాలు సమకూర్చారని ఇతరులు చెప్పగా విన్నాను. మా యింటికి సౌకర్యాలు ఏర్పాటు చేయటంలో ఏ లోటు చేయలేదు. ఇంటికి కరెంట్ పెట్టించటం, సెప్టిక్ టాంక్ లెట్రిన్ కట్టించటం మా ఊర్లో నాన్నే మొదలు చేయించారు. వర్షంలో బురద తొక్కుతామేమో అని వాక్ వేస్ (నడిచే మార్గం అంతా) నాప బండలు పరిపించాడు. పూలమొక్కలు, కూరగాయ మొక్కలు దండిగా పెంచేవాళ్ళు. యింటి ఆవరణలో మా నిమ్మతోటలో కూరగాయలు విరివిగా పండించేవారు. కానీ ఏ వస్తువూ అమ్మకానికి పెట్టేవారుకాదు. తెలిసినవారందరికీ పనివాళ్ళ చేత పంపకం చేసేవారు. హైబ్రిడ్ టమోటోలు గంపలు కొలది, బోరెడు బీరకాయలూ సంచుల కొలదీ తోట నుండి దిగేవి. ఇంట్లో చిక్కుడు, దొండ, పొట్ల, కూర అరటి కాసేవి. మా యింటి ములగ చెట్టు కాయలు రుచికి, కండకు ప్రసిద్ధి. అన్నీ పంపకాలు జరిగేవి. అమ్మ పూవులు (మల్లె, సన్నజాజి) మాలలు కట్టించి మరీ పంచేది. అమ్మ పూజలూ, పునస్కారాలు నిష్ఠగా చేసుకునేది. భక్తిమాటెలా ఉన్నా ప్రసాదాలు తినటానికి ముందుండేదాన్ని. మాకు రెండు ఇళ్లు ఉండేవి. ఒకటి పెద్ద అరుగులతో ఇల్లంతా నల్లరాయి పరిపించి చాలా సౌకర్యంగా ఉండేది. కాని అది మా అందరికీ సరిపోదని ఎదరుగా ఉన్న పెద్ద యింట్లోకి మారారు. ఇంటి చుట్టూ చాలా స్థలం ఉండేది. పసువులు వాటి మేత సౌకర్యం, వ్యవసాయపుటెడ్లు, బండ్లు విడిగా ఏర్పాటు చేసి, పెద్ద గేటు పెట్టించాడు నాన్న. మా యింటిలో నేను అమ్మా, నాన్న, అక్కయ్యలు, అన్నయ్య ద్వారా పొందిన మమతానురాగాలు నన్ను ఇప్పటికీ ఆ యింటితో పెనవేసుకునేలా చేశాయి. కలల్లో ఆ యింట్లోనే తిరుగాడుతూ, ఇంటి వాళ్ళందరినీ, గొప్పవాళ్ళను కూడా ఆ యింటిలోనే కలిసినట్లు తరచు కలలొస్తుంటాయి. అంత ఆనందం, సౌఖ్యం ఆ యింటిలో పొందాను మరి! పెద్ద మామయ్య అంటే నాన్నకు యిష్టం. మాకందరికీ చనువు ఉండేది. మామయ్యలు అమ్మ ఒకరినొకరు ప్రాణప్రదంగా చూసుకునేవారు. పెదమామయ్య సౌమ్యుడు. ఏ పని చేసినా నీటుగా, అందంగా చేసేవాడు. తాటిజీబుర్లతో ఎంతో ఉపయోగంగా ఉండే చీపుర్లు కట్టేవారు. నులక, నవారు, మంచాలు నేయటంలో నేర్పరి. దీపావళికి ఉమ్మెత్తకాయలు తొలిచి ప్రమిదలుగా చేసి, నూనెపోసి వెలిగించి ద్వారాలకు అందంగా వేలాడదీసేవాడు. ఉండ్రాళ్ళతద్దెకూ, అట్ల తద్దెకూ మా రెండో యింట్లో మోకులతో మాకు ఉయ్యాలలు కట్టేవాడు. స్నేహితులందరం ఊగేవాళ్ళం. మామయ్య బొడ్లో తాళాల గుత్తిలో చిన్న చాకు వేలాడుతూ ఉండేది. దానితో పెన్సిల్ కి ఎంతో నగిషీలు చెక్కేవాడు మామయ్య. రోజూ బడికి పోతూ పెన్సిల్ ముక్కు విరగదీసి మామయ్యను చెక్కమనేదాన్ని- ‘చాలా రాసినట్లున్నావు కదమ్మా’ అని ఎగతాళి చేసేవాడు. పెన్సిల్ చెక్కి, రోజూ ఒక కానీ (రూపాయలో 4వ వంతు) యిచ్చేవాడు. ఆ రోజుల్లో కానీ విలువ చాలా ఎక్కువ. ఇంట్లో ఏం టిఫిన్లు చేసినా పెదమామయ్యను పిలిచి పెట్టకపోతే అమ్మా, నాన్నలకు లోటనిపించేది. ఆవకాయ సీజన్లో, పొరుగూరు పనివాణ్ణి తీసుకుని ఒక ప్రత్యేకమైన చెట్టు మామిడి కాయలు కోయించి తెచ్చేవాడు. ముక్కలుగా కోసేవాడు కూడా. ఒకసారి చెయ్యి తెగ్గోసుకుంటే అందరం బాధపడ్డాం. అత్తయ్య నాగేంద్రమ్మ చక్కని వ్యక్తి. ప్రేమగా ఉండేది. అమ్మ, అత్తయ్య అప్పచెల్లెళ్ళలాగా ఉండేవారు. చినమామయ్య వెంకట్రామయ్య దుడుకు మనిషి, కోపిష్ఠి. ఆయన కోపానికి అత్తయ్య, పిల్లలు బాధపడవలసి కూడా వచ్చేది. ఎవరైనా ఆడపిల్లలను వేధించినా, జులాయితనం పోయినా ముందు వాళ్ళను కొట్టి, తరువాత ఎందుకు కొట్టాడో వాళ్ళకి వాళ్ళకి చెప్పేవాడు అమ్మంటే ప్రేమగా ఉండేవాడు. అత్తయ్యకు చీరలు కొంటే అమ్మకు కూడా ఒకటీ రెండు చీరలు కొనేవాడు అత్తయ్య కిష్టం లేకున్నా. చేపల కూర వండించి అమ్మకు ప్రత్యేకంగా పంపించేవాడు. బడికెళ్ళేటప్పుడు ఎదురుపడితే నాకు పావలా (1/4 రూపాయి) యిచ్చేవాడు. ఊరు తిరణాలప్పుడు రోజుకు రూపాయి ఇచ్చేవాడు. మామయ్య దగ్గర గ్రామఫోను ఉండేది పెద్ద బాక్సు టైపులో. చుట్టుపక్కల పిల్లలంతా మామయ్యని ఫోను మామయ్య అని పిలిచేవారు. అమ్మ ఏదైనా పెడితే మొహమాట పడేవాడు. రోజూ ఒకసారి యింటిలోకి వచ్చి అమ్మను చూచి వెళ్ళేవాడు. పిచ్చమ్మత్తయ్య అంత కలివిడిగా ఉండేది కాదు. కొంచెం స్వార్ధం పాలు ఎక్కువ అన్నట్లు ఉండేది. అయినా అమ్మ ఆమెకు అన్ని పనుల్లో సహాయపడుతూ ప్రేమగా ఉండేది. ఇక మామయ్యల పిల్లలు మేమూ అరమరికలు లేకుండా ఒకే కుటుంబం వారుగా ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవాళ్ళం. అందరం అమ్మ దగ్గరే గుమిగూడేవాళ్ళం. ఓపిగ్గా వండి మా అందరికీ తినిపించేది. అత్తయ్యలు - ఎప్పుడూ ‘ఏముందో, మేనత్త చుట్టూ చేరతారు తెల్లవారగానే’ అని మురిపెంగానే అనుకునేవారు. వసుమతీ, నేనూ బాగా అల్లరి పనులు చేసేవాళ్ళం. శ్యామల సుకుమారంగా ఉండేది. ఏ దుడుకు పనులకూ మాతో చేరేదికాదు. ఒకసారి వసుమతీ, నేను చేసిన అనాలోచితమైన దుడుకుపని మమ్మల్ని పశ్చాత్తాపపడేలా చేసింది. మా చాకలి ముత్తి (ముక్తి అయి ఉండవచ్చు) మంచి వ్యక్తి. చక్కగా బట్టలు ఉతికి, మడిచి అప్పచెప్పేది. అమ్మన్నా, పిల్లలం అన్నా ఎంతో ప్రేమగా ఉండేది. పిల్లలు లేరు. ఎవరినో పెంచుకున్నది - ఆ కోడలు బాధలు పెట్టేది ముత్తిని. అమ్మతో, తన బాధ పంచుకునేది. రోజూ రాత్రి బుట్ట తెచ్చుకుని అమ్మతో వేడిగా అన్నం కూరలు పెట్టించుకుని వెళ్ళేది. ఈనాటికి మరపురాని వ్యక్తి మొత్తి. ఒకసారి ముత్తి మా బట్టల పెద్ద మూట నెత్తిన పెట్టి తెస్తుండగా లోన తలుపుల చాటున దాక్కొని నేనూ, వసుమతి ఆమె గడపదాటుతుండగా ‘భౌ’ అని అరిచాం. అదిరిపోయింది. మూట కిందపడింది. ఆమెకు భయంకరంగా నడుంపట్టి చాలా బాధపడింది. అయినా మా మీద కోపం తెచ్చుకోలేదు. మేము పశ్చాత్తాప పడ్డాం ఇక ఎప్పుడూ తనను బాధించమని. మా అల్లరి చేష్టలకు ఇదొక ఉదాహరణే. అలాంటివి ఎన్నో! శేషగిరి నా వయసువాడే. మాతో కలిసిపోయేవాడు. అత్తయ్యలా అందంగా ఉండేవాడు. పావురాలను పెంచేవాడు. నాకు సైకిల్ తొక్కటం నేర్పించబోయాడు. ఏ పనులూ సమంగా పట్టించుకోను కదా. పడతానేమో అని భయపడి సైకిల్ నేర్వలేదు. అన్నయ్యకు శేషగిరి అంటే చాలా యిష్టం. అతని చదువు సంధ్యల విషయంలో శ్రద్ధ వహించింది అన్నయ్యే. డాక్టరు చదివించటానికి మామయ్యను ఒప్పించింది అన్నయ్యే. వరాలు చిన్నది. ఆట్టే మాతో జతకట్టేది కాదు. నిర్మల అందరితో చనువుగా ఉండేది. నాన్నతో గూడా హాస్యాలాడేది. ఇద్దరం ఆవకాయతో పెరుగన్నం యిష్టంగా తింటుండేవాళ్లం. చిన మామయ్య అమ్మతో ‘వాళ్ళకి ఆవకాయ పెట్టబోకమ్మాయి, బొంత కాకుల్లా ఎట్లా తయారవుతున్నారో చూడు’ అనే వాడు. అయినా మా తిండి మాదే. నిర్మల ఎక్కువ పెట్టించుకుని పారేస్తుంటే నాన్న - నిర్మలా అలా, వేస్ట్ చేయగూడదు. కావలసినంతే పెట్టించుకో అన్నాడు. నిర్మల సమాధానం - ‘ఏం చేయను మామయ్యా కళ్ళు కావాలంటున్నాయి. కడుపు వద్దంటున్నది మరి’ అని. నాన్న నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. నిర్మల బాగా చదవటంలేదని మాన్పించి 15 ఏళ్లకే పెళ్ళి చేశారు. మామయ్య. ప్రాక్టికల్గా మంచి సూక్ష్మ బుద్ధి నిర్మలది. ఎదుటి వారికి సహాయం చేయటానికి ముందుండేది. ప్రేమను పంచి యిచ్చేది. తనతల్లి కోటమ్మ పోలికతో పుట్టిందని సత్యవతి అంటే చిన మామయ్యకు ప్రేమెక్కువ. చాలా మొహమాటస్తురాలు. కోటేశ్వరరావు సిగ్గుపడి మాతో ఆట్టే చేరేవాడు కాదు ఆటలకు. ఇప్పటికీ పోయిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళం కలివిడిగా ఉంటున్నాము. వెనకటి ప్రేమానురాగాలు మాసిపోలేదు. మమ్మల్ని పెంచిన విధానం మమ్మల్ని అలా తయారుచేసింది. నాన్న సహాయం మా వూరిలో పొందినవారు ఎంతో కృతజ్ఞతతో ఆ విషయం మాకు చెప్పేవారు. ధనసహాయం, మాటసహాయం, సలహా సంప్రదింపులలో సాయం, పేదవారి పెళ్ళిళ్ళలో వధువుకు మంగళసూత్రం చేయించి యివ్వటం యిలా అనేక సంగతులు వినేవాళ్ళం. ముఖ్యంగా వారిలో ఇంద్రమ్మక్కయ్య (ఇందిరమ్మ) వాళ్ళ యింటిముందు యిప్పుడూ వుంటుంది. ఆమె భర్త నాన్నకు ఒక కోర్టు కేసు విషయంలో ముఖ్యమైన సమాచారాన్ని సకాలంలో అందించి కేసు గెలవటానికి సహకరించాడట. కృతజ్ఞతగా నాన్నవారికి ఇల్లు కొనిపెట్టారట. అక్కయ్య పలుసార్లు ఆ విషయం మాకు కృతజ్ఞత చెప్పేది మెరిసే కళ్ళతో. అమ్మా, నాన్న ద్వారా తెలియలేదుగాని - పరుల వల్ల తెలిసింది. అమ్మకు తాంబూలం (పెద్ద ఇత్తడి పళ్లెం) నిండా అన్ని రకాల నగలు ఉండేవట - నాన్న స్నేహితులొకరు వ్యాపారం పెట్టుకుంటానంటే అమ్మను సంప్రదించకుండానే నాన్న ఆ బంగారం అంతా అమ్మి డబ్బు ఆయనకిచ్చారట. ఆయన వ్యాపారం ఏమయిందో కాని బంగారం మాయం. అమ్మ ఆ విషయంలో నాన్ననెప్పుడూ నిందించలేదు. చిన్నక్క పెళ్ళిలో నాన్న బంగారం కొంటుంటే నా బంగారం ఉన్నట్లయితే పిల్లలందరికీ బాగా యివ్వగలిగేవాళ్ళం అని ఒకసారి అన్నది అంతే. అప్పుడు పెదమామయ్య ముంగాలలో తెచ్చిన ముంజలు తింటూ పనివాళ్ళు పండేసిన ఈత పళ్ళు తింటూ జీవితాన్ని ఆప్యాయతల మధ్య అనుభవించటం తప్ప పెద్ద విషయాలు అర్థం అయ్యేవికావు మాకావయసులో. నా చదువు ఊళ్ళో ప్రైమరీ స్కూలే ఉండేది. పసితనంలో వెంకటేశ్వర్లు (పెరవలి వారి ఊరు) మాష్టరుగారు ఒడిలో కూర్చోబెట్టుకుని పాఠాలు నేర్పారు. వారికి రుణపడి ఉన్నాను. మా బెంచిలో పెద్ద క్లాసులో మేము ముగ్గురం అమ్మాయిలం, ఒకబ్బాయి లింగాలు కూర్చునేవాడు. మేము ఏమీ ఎరగనట్లే నెమ్మదిగా ఒకరినొకరు తోసుకుంటూ అతన్ని కిందికి తోసేవాళ్ళం. పాపం! ఏమీ అనేవాడు కాదు. నేను కానులిచ్చి అతని దగ్గర చింతకాయలు కొనుక్కునేదాన్ని. అతను పెద్దయిన తరువాత పెండ్లి వాద్య బృందంలో చేరాడు. మా యింటి ముందుగా మేళం వెడుతుంటే నేను కనిపిస్తే సిగ్గుపడేవాడు. హైస్కూలు చదువులకు చాలామంది కూచిపూడి స్కూలుకు నడిచి వెళ్ళేవారు. నాన్నకు అలా పంపించటం యిష్టం లేక యింటిలోనే టీచర్ను పెట్టి చదివించారు. హిందీ చదువు యింట్లోనే సాగింది. నాతోపాటు చుట్టు పక్కల అమ్మాయిలు మా యింట్లో ఫ్రీగా చదువుకోగలిగారు. పెద్దక్క ఆమె మారుటి కుమార్తె సుజాత పెదపూడిలో వారింటిలోనే చదువు సాగించారు. నేను తరచు వారింట్లో గడిపేదాన్ని. బావగారు శరణు రామకోటయ్య నా చదువును ప్రోత్సహించినవారిలో ఒకరు. వారి చిన్నమ్మాయి శేషవర్ధిని తదుపరి కాలంలో మా అన్నయ్యకు భార్య అయింది. మేమిద్దరం బాగా స్నేహంగా ఉండేవాళ్ళం. నా తదుపరి చదువు మద్రాసులోనూ, చిత్తూరులోనూ సాగింది. 15వ ఏట హిందీలో అతిపెద్ద పరీక్ష, టీచరు ట్రైనింగ్ ముగించాను. టీచరుగా వెళతానంటే అన్నయ్య “పెద్ద కళ్ళ, బారుజడ పిల్ల పంతులమ్మ మాట ఎవరు వింటారు అని ఎగతాళి చేసి, బాగా చదువుకో, నాన్నకూ, నాకూ నీవు బాగా చదువుకోవాలని ఉన్నది” అని సలహా చెప్పి ఇంగ్లీషు చదువులలో పెట్టాడు. చిన్నప్పుడు గడియారంలో టైము చెప్పగలగటం అన్నయ్య నేర్పాడు. ABCDలు నేర్పాడు. పెద్దక్క 6, 7 తరగతుల ఇంగ్లీషు పాఠాలు చెప్పింది. ఆమె టీచరు కాగల అర్హతలన్నీ పొందినా బావగారు అక్కను ఉద్యోగం చేయనీయలేదు. ఆమె జీవితం మా అందరి సేవలకే అంకితమిచ్చింది. అమ్మా, నాన్నలను చూచుకున్నది తనే. అమ్మ తరువాత అమ్మగా మా అందరికీ అండగా నిలిచింది అక్కే. హారతి కర్పూరంలాగా, కొవ్వొత్తిలాగ కరిగి ఇతరుల సేవలకంకితమైన త్యాగ జీవి అక్క. ఆమెకు జోహారులు. విమలక్క, బావగారు వెలగా రామకోటేశ్వరరావు (హిందీటీచరు) గారి పిల్లలు పసితనంలో మా దగ్గర కొంతకాలం పెరిగారు. వారంతా మాకు చాలా యిష్టమయిన వారు. అన్నయ్య ఎంతో సుకుమారంగా ఆ పిల్లలను చూసుకునేవాడు. అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా నా రంగుకు నప్పే బట్టలు తెచ్చేవాడు. తనతో ప్రయాణాలు చాలా సౌఖ్యంగా ఉండేవి. ఎంతో అండదండలనందించిన అన్నయ్య ఒకనాడు ఎవరికీ చెప్పకుండా త్వరపడి మమ్మల్ని వీడి వెళ్ళిపోయాడు. ఆలోటు ఎవరు తీర్చగలరు? నేను చదువు నిమిత్తం మూల్పూరు వదిలేముందు నాకిష్టమైన వారినీ, గౌరవించినవారినీ, ఇప్పటికీ స్మృతిపథంలో మెలిగేవారినీ, నన్ను కవ్వించి నవ్వించిన వారందరిని గురించి ప్రస్తావించకపోతే నా యీ ‘జ్ఞాపకాలు’ సంపూర్ణంకావు. అమ్మ చిరకాల మిత్రురాలు వెంకాయమ్మ. అమ్మకు పనులలో సహాయపడుతూ, మాకూ పాటలు, కథలు వినిపిస్తూ ఉండేది వెంకాయమ్మ. అమ్మను ‘పిల్లా’ అనేది ఆప్యాయంగా. అమ్మ పని తీరక ఆలస్యంగా భోజనానికి కూర్చుంటే - పిల్లకు తిండి తినటానికి గూడా తీరనంత చాకిరి అని దిగులు పడేది. పండగలప్పుడు పెద్ద ఎత్తున పిండివంటలు, వంటలు చేసేది అమ్మ. పనివాళ్ళందరి కుటుంబాలను పిలిచి భోజనం పెట్టేది. ఆ పనులన్నిటిలో వెంకాయమ్మే అండగా నిలిచేది. ఎక్కువ మా యింట్లోనే ఉంటూ ఉండేది. మాకందరికీ ఇష్టమైన వెంకాయమ్మ నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువప్పుడు కాలం చెందింది. అమ్మ చాలా దుఃఖపడింది. అమ్మ అంతగా తనకిష్టమైన ఆవు చనిపోయినప్పుడు బాధపడటం చూచాను. నాన్న ఆవును ఊరేగింపుగా మా నిమ్మతోటకు వెళ్ళి అందులో ఖననం చేశాడు. ఆ ఆవుతో మేమూ ఆడేవాళ్ళం. కొమ్ము విసిరేది కాదు. అమ్మతోపాటు మాకు ఆప్యాయత పంచిందా సాధుజంతువు. సీతమ్మ పెద్దమ్మ ఒంటరి. అమ్మమ్మ నాటి నుండి స్నేహమట. అమ్మమ్మ, తాతయ్యలను నేను ఎరుగను. అది నా జీవితంలో లోటుగానే ఉండేది. ఆమె మా యింట్లో పెద్ద తోడుగా సహాయపడేది. అన్నయ్య తెనాలిలో చదువు కుంటుంటే దగ్గర ఉండి వండి పెట్టింది. నా పెండ్లి దాకా ఉన్నది పెద్దమ్మ. మేమంతా గౌరవించి, ప్రేమించిన సీతమ్మ పెద్దమ్మ. నాన్నగారి తరఫున తాతయ్య, బాబాయిలు, నాగమ్మత్తయ్య ఎక్కువ వచ్చిపోతుండేవారు. నాన్న స్థితిమంతుడవటాన వారికి కావలసిన ఆర్ధిక సహాయం లేదనకుండా అందించేవాడు. చిన్న బాబాయి నారాయణ నా చిన్నప్పుడు మా యింట్లో చాలాకాలం ఉన్నాడు. నన్ను బుజాలమీద మోసి ఆడించేవాడు. - నాకు చాలా యిష్టమైన బాబాయి. అమ్మ బాబాయిని సొంత కొడుకులా చూసుకునేది. నాగమ్మత్తయ్య మా యింట్లో అన్ని శుభకార్యాలకు పెనమలూరు నుండి వస్తుండేది. కిలారు వారి కోడలు. ఒక అగ్ని ప్రమాదంలో మరణించింది వారింట్లోనే. నాయనమ్మ అనారోగ్యకారణం వల్ల వచ్చేది కాదు. మేము ఆమెను చూడటానికి వెళ్ళేవాళ్ళం. మాకు అక్కడ సౌకర్యాలు బాగా ఉండవని నాన్నే ఎక్కువగా వెళ్ళి తన వాళ్ళను చూసి వచ్చేవాడు. చుట్టుపక్కల వాళ్ళు - సామ్రాజ్యమక్కయ్య, సౌభాగ్యం అక్కయ్య (ఇద్దరు తోటికోడళ్ళు) కమలాంబ పెద్దమ్మ, లలితాంబ పిన్ని (వసుమతి అత్తగారు) మన్సుబు అన్నయ్యగారి కుటుంబం - వదిన, మాణిక్యమ్మ పెద్దమ్మ, సరస్వతి, అనసూయక్కయ్యలు, అన్నయ్యగారి పెద్దమ్మాయి ప్రమీల, మేడ తులశమ్మ పెద్దమ్మ, ఇంటి వెనకరత్తమ్మక్కయ్య - వాళ్ళందరి పిల్లలు ఇప్పటికీ నాకు బాగా గుర్తు. వాళ్లంతా అమ్మను వరుసబెట్టి పిలిచి, ఎంతో గౌరవంగా చూసేవారు. శుభసందర్భాలలో పనులకు వారంతటవారే సహాయపడటానికి వచ్చేవారు. నాన్నంటే భయం, భక్తీ ఉండేవి వారందరికీ. అమ్మ గడపదాటి బయటకు వెళ్ళే రకం కాదు. రాత్రిపూట అప్పుడప్పుడూ పైన చెప్పిన వారంతా కాసేపు మా యింటికి వచ్చి ఆ కబురు, ఈ కబురు చెపుతుండేవారు. నేను నిద్రవస్తున్నా ఆమ్మ వడిలో కూర్చొని వారి సంభాషణలు వినేదాన్ని. ప్రమీల మా పెద్దక్క మాదిరిగానే తన జీవితాన్ని తనవారి సేవలకే అంకితం చేస్తున్నది. సంవత్సరానికి ఒకసారి ఊరి గుడితిరణాల 5 రోజులు జరిగేది. నన్ను రోజూ కొత్తబట్టలు కట్టి, నగలు పెట్టి మిగతావారి జతలో గుడికి పంపేది అమ్మ. ఆ రోజుల్లో దోచుకుంటారని, అత్యాచారం చేస్తారని భయాలుండేవి కాదు తలి-దండ్రులకు. మంచికాలమది. బొందిలీ లక్ష్మీబాయి (మిఠాయి వ్యాపారస్తులు) తిరణాలలో దుకాణం పెట్టి పరిశుభ్రంగా రకరకాల మిఠాయిలమ్మేది. మా యింటికి కూడా అక్కయ్యల పెళ్ళిళ్లలో, ఇతర శుభకార్యాలలో పెద్ద ఎత్తున మిఠాయిలు చేయటానికి తన మంది, మార్బలంతో వచ్చేది. మనిషి నీటు, పని నీటు, చక్కని రూపం, ఖచ్చితమైన పనితనం. నాకామెయిష్టంగా ఉండేది. మాకు మేనమామ, వరుసయ్యే రామదాసు ‘కమ్మబ్రాహ్మణుడు’ మూల్పూరులో పూజలూ, పెళ్ళిళ్లూ అన్నిటికి పౌరోహిత్యం నిర్వహించేవాడు. నన్నాటపట్టించేవాడు. ‘మీ నాన్నకు ఇంకో అమ్మాయి పుడితే ఏమి పేరు పెట్టేవాడు - కమల, విమల, శ్యామల, కోమల తరువాత సుట్టేసి నమల అని పెట్టేవాడేమో’ అంటూ. నేను - ‘నీకెందుకు మామయ్యా ఆచింత - ఇంత చక్కని పేర్లు పెట్టిన నాన్న మరో చక్కని పేరు పెట్టలేకపోడులే’ అనేదాన్ని. పనివాళ్ళలో ఇద్దరిని గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. గురవయ్య పెద్దమామయ్య దగ్గర పని. ఇంటికి తరచు వస్తుండేవాడు. ఒకసారి నేను అన్నం పెడితే తింటూ ఏమిటో ఊరిలో వాళ్ళ ముచ్చట్లు చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా అర్ధం కాక ఏమిటీ అని మరొకసారి అడిగాను - విసిగిపోయి - ‘ఏమమ్మా! నీకు అన్నం పేగు తప్ప, వివరం పేగు లేనట్లున్నది’ అన్నాడు. అది అర్ధం అవటానికీ చాలాసేపు పట్టింది. ఇప్పటకీ ఆ సంగతి నవ్వు పుట్టిస్తుంది. నిజంగా వివరం పేగు లేదా అని అనుకుంటాను. చినమామయ్య వాళ్ల పనివాడు వెంకటప్పయ్య రావికంపాడనే ఊరివాడు. పని ముగించుకుని ఎక్కువ మాదగ్గరే గడిపేవాడు. చదువుకోలేదు. నాకు ఇంగ్లీషు నేర్పుతానంటూ పేపర్లు తిరగేసి పట్టుకుని కుర్చీలో కూర్చొని ‘పీస్ పాస్’ అంటూ చదివేవాడు. నవ్వేవాళ్ళం. మేము పిలిచినట్లే మా వాళ్ళనందరినీ అండి చేర్చి పిలిచేవాడు. నాన్న అండీ, అమ్మండి, పెద్దమాండి (సీతమ్మ పెద్దమ్మని, నీ పెద్దబాండి పాడుగానూ, ఊరుకోరా అనేది పెద్దమ్మ) చిన్న మామయ్యాండి, పెదమామయ్యాండి, చిన్న అమ్మాయాండి అంటుంటే నవ్వురాదా మరి. వైద్గుడు (వైద్యుడు), డాస్కరు (డాక్టరు), గోయిత్రాకు (గోరింటాకు), నందొద్దన పువ్వూ (నందివర్ధన పువ్వు) యిలా మాటలు పలికి వినోదం కలిగించేవాడు. మునియ్య అని మా వ్యవసాయం, ఎడ్ల పనులు చూసేవాడు. ఒక జత పొగరుగా ఉండేది. అందుకే మాట వినేవి. అతను జబ్బుపడితే చూడటానికి వాళ్ళింటికెళ్లాం. ఎద్దుల ప్రస్తావన తెచ్చాడు. వాటితో సమస్యగా ఉన్నదని నాన్న అంటే అంతటి నీరసంలోనూ వచ్చి వాటిని సవర్ధించి మేతపెట్టి వెళ్ళాడు. అనతి కాలంలోనే టైఫాయిడంతో మృతి చెందాడు. నాన్న ఆ జత ఎడ్లజతను అమ్మవలసి వచ్చింది అతను లేనందువలన. మూల్పూరులో అత్యంత స్థితిమంతులు, గౌరవనీయులూ, పెద్దలూ బాపమ్మ నాయనమ్మ. ఆమె కుమారుడు ఆవుల సాంబశివరావు బాబాయిగారు. ఊరికంతటికీ ఆస్తిపరులైనా వారి మాటలో, మర్యాదలో అతిశయం దొర్లేది కాదు. ఎంతో నమ్రతగా అందరినీ పలకరించేవారు. బాబాయి పెద్దలాయరు. హైకోర్ట్ జస్టిస్ గానూ, ఆంధ్రాయూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గానూ అతి పెద్ద పదవులు నిర్వహించారు. వారిది చక్కని సువిశాలమైన యిల్లు. మమ్మల్ని ఆడుకోమని పిలిచేది నాయనమ్మ. ఆమె బంగారు రంగులో బంగారు మురుగులే వెలవెలబోయాయి. బాబాయిగారు నా పెళ్ళి నిశ్చయంలో, నిర్వహణలో ప్రధాన పాత్ర వహించారు. వారి సతీమణి జయప్రద పిన్ని, ఆయన మా దంపతులను - intellectual companions గా జీవించగలరని దీవించారు. వారిచిన్నమ్మాయి మంజులత చదువుకునే రోజుల్లో, ఉద్యోగిగా, తెలుగు యూనివర్సిటీ ఉపకులపతిగా నాకు బాగా పరిచయం. అప్పట్లో మూల్పూరులో యువకులు చదువుపట్ల మొగ్గిన వారెవరూ లేరు. నా తరవాత కాలం వారు బాగా చదువుకున్నారు. వారెవరితో నాకు పరిచయం లేదు. హిమశైలావతి, పద్మావతి, నాగేంద్ర స్నేహితవర్గంలో బాగా గుర్తుండిపోయారు. వారి జతన ఆడిన ఆటలు ఇంకా గుర్తుండిపోయాయి. సామ్రాజ్యమక్కయ్య పిల్లలు స్వరాజ్యం, మాణిక్యం, వెంకటేశ్వర్లు (డెంటిస్ట్), కమలాంబ పెద్దమ్మ పిల్లలు చినామణి, సావిత్రి, సత్యవతి వాళ్ళతో బాగా పరిచయం. లలితాంబ పిన్ని కొడుకు గురుమూర్తి అన్నయ్య వసుమతి భర్త. మూల్పూరులో మరికొందరి గురించి చెప్పి మూల్పూరుకు ‘బై’ చెపుతారు. రాఘవ భర్త కుండలు చేసి అమ్మేవారు. రాఘవకూ యింటి వడ్లదంపుడు, (మిషన్లు లేటుగా వచ్చాయి) పప్పులు తయారీ, ఇంటి (గచ్చులేనిచోట) అలుకులూ అన్నీ పనుల నిర్వహణ బాధ్యత వహించింది. తన దగ్గరే నేను రోకటిపోటు, ధాన్యం జల్లించడం, చెరగటం నేర్చుకున్నాను. అతి తక్కువ మాట్లాడేది రాఘవ. ఆమె కూతుళ్ళు చక్కటి వాళ్లు. విమలక్క పెండ్లి అయిన కొత్తలోనూ, ఆమెకు పిల్లలు కలిగాక రాఘవ పిల్లలు వంతులవారీగా అక్కతో సహాయంగా ఉండేవారు. రాఘవ కడ్డీలాగా ఉండేది. వయసు తెలిసేది కాదు. నాగులు బుర్ర మీసాలతో పింక్ కలర్ లో దిట్టంగా ఉండేవాడు. హుందాతనం ఉట్టిపడేది. పెదమామయ్యతో చనువెక్కువ అతనికి. మామూడిళ్లలో ఏ పెండ్లి, పేరంటాలు జరిగినా పనులన్నీ నాగులు ఆధ్వర్యంలో జరిగేవి. నిలకడగా నిలబడి, సవ్యంగా అన్నిపనులు జరిగేలా చూసుకునేవాడు. వంటల దగ్గర వడ్డనల దగ్గర అన్నీ తానై ఏదీ పొల్లుబోకుండా, ఎక్కడా మాటరాకుండా నిర్వహించేవాడు. ఇద్దరు అత్తరు అమ్మే సాయిబులు బాగా గుర్తున్నారు. వారిది మూల్పూరు కాదు. ఏ వూరి నుండో వచ్చి అత్తరులు, పాలమడ్డి అమ్మేవారు. మా యింటిలోగానీ, బాపమ్మ నాయనమ్మ యింటిలోగానీ బసచేసేవారు. పెద్ద సాయిబు చక్కగా, నీటుగా ఉండేవాడు. చిన్న సాయిబు బక్కగా, కొంచెం కంత్రీగా (cunning) ఉండేవాడు. అత్తరు సీసాలు చెక్కపెట్టె అరలలో సర్ది, ఎర్రని బట్టతో కట్టి తెచ్చేవారు. ఖాళీ సీసాలే ఎన్నేళ్ళయినా సువాసనలు వెదజల్లేవి. నిఖార్సయిన సరుకు పెద్దసాయిబు అమ్మేవాడు. చిన్నాయన కొంత కల్తీ చేస్తాడని పెద్దవాళ్ళంటుండేవాళ్ళు. ఇద్దరూ ఎప్పుడూ తెల్లటి బట్టలతో మెరుస్తూ ఉండేవారు. పెద్దపూడి (పెద్దక్కదగ్గరకు) యడ్లపల్లి (చిన్నక్క ఊరు) వెళితే వారిద్దరికి అతిథులుగా ఉండేవారు. వారి రూపాలు ఇప్పటికీ గుర్తే. సంక్రాంతి నెలలో ఎర్ర హరిదాసు, నల్లహరిదాసు పై ఊరినుండి వచ్చి నెలంతా యింటియింటికీ తిరిగి పాటలు పాడుకుంటూ భిక్ష స్వీకరించేవారు. ఎర్రటి హరిదాసుకాషాయ గుడ్డలు కట్టేవాడు. చక్కగా పాడేవాడు. నల్లహరిదాసు తెల్లటి బట్టలు ధరించేవారు. పాట కొంచెం క్లాసికల్ గా ఉండేది. రాగి అక్షయ పాత్రలు (గుమ్మడికాయ ఆకారంలో) నెత్తిన పెట్టుకొని, చేతిలో చిడతలు వాయిస్తూ పాడేవారు. చిన్నపిల్లలం బియ్యం పాత్రలో, వేయాలంటే మునికాళ్ళమీద కూర్చొని పెట్టించుకుని ‘కృష్ణార్పణం’ అనేవారు. నెల అయి వారెళ్ళిపోతుంటే అప్పుడే వెళ్ళిపోతున్నారనిపించేది. వారిప్పుడూ పాడుతూ వస్తున్నట్లు మనోఫలకం మీద కనిపిస్తుంటారు. పై చదువు 15 ఏట విద్యావనం (పామర్రు పొలిమేరలు)లో మెట్రిక్ చదవటానికి అన్నయ్య చేర్పించారు. తాను బందరు (మచిలీపట్నం)లో ఇంటర్ చదువుతుండగా ఆ సంస్థ గురించి తెలిసినట్లున్నది. అది ప్రముఖంగా హిందీబోధనా సంస్థ. యలమంచిలి వెంకటేశ్వరరావు, సరస్వతీ నిర్వహించేవారు. మెట్రిక్ ఒక సెక్షన్ నడిచేది. టీచర్లంతా అక్కడే బస చేసేవారు. పొలాలలో పూరి పాకలలో విద్యాబోధన, విద్యార్థుల నివాసం ఉండేది. పాములు, మండ్రగబ్బలు తిరుగాడుతుండేవి. కాని ఎవరికీ హాని జరగలేదు. పుల్లేరు గట్టున ఉన్నది సంస్థ. దాటితే బందరు రోడ్డు. అక్కడే బస్ ఎక్కి విజయవాడ వచ్చి, తెనాలి వెళ్ళి మూల్పూరు చేరుకోవాలి. చావా వెంకటేశ్వర్లు మాష్టారు బాగా యిష్టంగా ఉండేవారు నాకు. చక్కని విగ్రహం, ఎంతో నిబద్ధతో పాఠాలు చెప్పారు. అక్కడ ప్రకృతి వైద్యం నడిచేది. జ్వరం వస్తే కంట్లోకలిగ్గం, ఒండ్రుమట్టి వైద్యం చేసేవారు. చిట్టెక్క, ఆమెభర్త హిందీ చదివేవారు. వారికొపాప. హాస్టలు దగ్గర పాక అద్దెకు తీసుకుని ఉండేవారు. నాకెలా పరిచయమయిందో గుర్తులేదు గాని చిట్టెక్క నన్ను సొంత బిడ్డలా చూడటం గుర్తు. శీతాబాయి, శాఖమూరి సామ్రాజ్యం, బోయపాటి కృష్ణకుమారి (హిందీ ప్రేమామండలి, తెనాలి) సరోజిని, ప్రసూన (పెనమలూరు) హేమలత (లవణం భార్య) సన్నిహితులుగా వుండేవారు నాతో. నా క్లాస్ మేట్ రత్నం అక్క. తాను డాక్టరు చదివి ఇంగ్లండులోనూ, ఉయ్యూరులోనూ వైద్యసేలందించింది. ఆ అక్క కొడుకే జయరాంగారు, భార్య జయప్రద. సహృదయులు. ఇన్నయ్య ద్వారా ఫామిలీ ఫ్రండ్స్ గా కొనసాగుతున్నారు. ఇటీవల ఇన్నేళ్ళ తరవాత 2013లో సామ్రాజ్యాన్ని ఫోనులో కలవగలిగాను. చాలా సంతోషం కలిగింది. లెక్కలు ఒంటికి ఆట్టే పట్టలేదు. మెట్రిక్ లో 64శాతం వస్తే 100 శాతం వచ్చినంత పొంగిపోయాను. నా బాచ్ లో ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకొక్కదానికి. అది సర్వసాధారణం. అన్న లెక్కలోనే తీసుకున్నాను. 1953 సంగతి అది. 1953-55 తెనాలి కాలేజీలో ఇంటర్మీడియేట్ చదివాను. కుటుంబం అంతా తెనాలి మారింది. చినరావూరులో ఉండేవాళ్ళం. ఆర్ట్స్ గ్రూపులో చేరాను. రాజేశ్వరి (చిత్తూరులో నా క్లాస్ మేట్, స్నేహితురాలు) గూడా అదే గ్రూపు తీసుకున్నది. ఇద్దరం కలిసే రోజూ కాలేజికి వెళ్ళి వచ్చేవాళ్ళం. ఆమె తల్లి, అక్క పుణ్యవతిగారు నన్ను ఆప్యాయంగా పలకరించేవారు. ప్రిన్సిపాల్ రాగ్లండ్ ఇంగ్లీషు గ్రామరు, షేక్స్ పియర్ నాటకం బోధించారు. కె.ఎస్. రామ మరో ఇంగ్లీషు లెక్చరర్. బ్రిటీష్ హిస్టరీ, సివిక్స్ భాస్కరరెడ్డిగారు బోధించారు. ప్రతిపాఠం తరువాత నోట్స్ డిక్టేట్ చేసేవారు. ఎస్.ఎ.ప్రసాద్ గారు ఇండియన్ హిస్టరీ లెక్చరర్. ఆయన క్లాసు ఇష్టంగా ఉండేది. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాటా రాసుకో ప్రయత్నించేదాన్ని. ఇంగ్లీషు ధారాపాతంగా మాట్లాడేవారు. Busy ని మేమందరం బిజీ అన్నా ప్రసాద్ గారు ‘బుజీ’ అనే అనేవారు. ఆయన సోదరి సజ్జా కమల యూనివర్సిటీలో నా సమకాలీకురాలు. రాజేశ్వరికి క్లాస్ మేట్. ఆమె లాస్ ఏంజిలస్ లో ఉన్నారు. ప్రసాద్ గారు ఆస్ట్రేలియాలో ఉన్నట్లు తెలిసింది. హిందీ సెంకండ్ లాంగ్వేజ్ - దోనేపూడి రాజారావు గురువు. అప్పటికే పెద్ద క్లాసులు హిందీలో పాసయి ఉన్నాం గనుక ఆయన క్లాసులు లాంఛనంగా అటెండ్ చేసేవాళ్ళం. మొదటి సంవత్సరమంతా నేనే క్లాసుఫస్ట్ - సంవత్సరాంతం వ్యాసరచన పోటీ, మేగజైన్ కి మంచి ఆర్టికల్ రాసే పోటీలోనూ ఫస్ట్. యాన్యూవల్ డే ఫంక్షన్ లో అన్ని సబ్జెక్ట్స్ లోనూ ప్రైజులొచ్చాయి. చాలా చక్కని ఆర్ట్ పేపర్ మీద సర్టిఫికెట్లు యిచ్చారు. మోయలేనన్ని మంచి పుస్తకాలు బహూకరించారు. ప్రిన్సిపల్ గారి భార్య ఆటల్లో ప్రైజులు రాలేదేమని అడిగారు. పార్టిసిపేట్ చేయలేదని, అయినా నేను స్పోర్ట్స్ పర్సన్ ను కాదని చెప్పాను. ఇంటర్ సెకండ్ యియర్ పరీక్షల్లో నేనే కాలేజ్ ఫస్ట్ 87 శాతం మార్కులొచ్చాయి. నాన్నకు, అన్నయ్యకూ నన్ను డాక్టరు కోర్సు చదివించాలని ఉండేది. నేను అర్ట్స్ ప్రిఫర్ చేశాను. ఇంటర్ మార్కులు చూసి నాన్న - ‘సైన్స్ తో ఇంటర్ రిపీట్ చేయమ్మా మెడిసిన్ చేద్దువుగాని’ అన్నారు. ‘వద్దండీ’ అన్నాను. ఆ సందర్భంగా మా అన్నయ్య సంగతి ఒకటి ప్రస్తావించాలి. మొదటి సంవత్సరపు మార్కుల మెమోకార్డు మీద టైపు చేసింది పోస్ట్ లో ఇంటికొచ్చింది. కాలేజి ఆఫీసు నుండి గొప్ప మార్కులొచ్చాయి. కార్డు కింది వరసలో సిరాతో ఇరికించి ఇలా రాసి ఉన్నది. ‘can work hard and fare better’ అని. నాన్న అది చూసి యిదేమిటమ్మా ఇంత మంచి మార్కులు వచ్చినా ఇలా రాశారు? అని అడిగారు. పోస్ట్ అన్నయ్య తీసుకున్నాడు సిరాతో తానే రాసి ఉంటాడు అన్నాను. అది అన్నయ్య పనే. నాన్న ముసిముసిగా మురిపెంగా నవ్వుకున్నారు. అన్నయ్యకు నన్నలా అందలం ఎక్కించాలనే ఎప్పుడూ ఉండేది. ఒక పార్కర్, ఒక షీఫర్ పెన్ను కొనిచ్చాడు. నాన్న ఫేవర్ లూబా వాచి యిచ్చాడు. నాన్న కాలక్షేపం కోసం కాఫీ షాపొకటి తెరిచారు. కాఫీపొడి అమ్మేషాపు. దాని మీద లాభం లేకపోయినా ఆయనకు పదిమందిని తన షాపులో కలిసే అవకాశం దొరికింది. కాలక్షేపం బాగానే ఉండేది. ఆ రోజుల్లోనే జి.వి.కె. మామయ్య భార్య సుజాతక్కయ్యతో పరిచయాలేర్పడ్డాయి. వాళ్ళ ఏకైక పుత్రిక డా. విజయ (డెంటిస్ట్) లాస్ ఏంజలస్ లో స్థిరపడటాన మామయ్య, అక్కయ్య ఆమెతోనే వుంటున్నారు. టచ్ లో ఉన్నాం ఇప్పటికీ. చిన్నపిల్లల్ని పోగేసి చింతగింజలాట ఆడేదాన్ని ఇంటర్ చదివేటప్పుడు. అన్నయ్య ‘నిన్ను ఇలా చూచినవారెవరూ ఇంటర్ చదువుతున్నావంటే నమ్మరు’ అనేవాడు. ఐదురాళ్ళ ఆట కూడా మొదలు పెట్టా. నొక్కుల జుత్తు పెద్దగా, ఒత్తుగా ఉండేది. చిక్కు తీసుకోలేక పీకి, కత్తిరించి పడేస్తుంటే అన్నయ్య - నీకెందుకింత చక్కని జుట్టు వచ్చిందో గాని నులకతాడు పేనినట్లు పేనుతున్నావు అని కోప్పడేవాడు. మంచి దువ్వెన తెచ్చి ఇచ్చాడు. ఇంటర్ లో 100 మంది అమ్మాయిలం ఉండేవాళ్ళం. రాధాకృష్ణ (అతి నెమ్మదస్తురాలు, నాకు మంచి స్నేహితురాలు. ఇప్పుడు లేదామె) ప్రభల సరస్వతి, ఎల్. పద్మ, ఆర్. పద్మ బాగా గుర్తున్నారు. ఇంటర్ ఫలితాలు వెలువడిన తరువాత సరస్వతి నన్ను, మిగతా క్లాసు అమ్మాయిలనూ ఇంటికి ‘టీ’కి ఆహ్వానించింది. సరస్వతి తల్లి నన్నెంతగానో అభినందించారు. సరస్వతి తేజం నా మొహంలో ఉట్టిపడుతున్నదని. ఆమె పెద్ద మనసుకు చేయెత్తి నమస్కరించాను. చదువంటే కొందరికి అంత విలువ. గిరిజ, వరలక్ష్మి, వనమాల, శకుంతల, సుశీల, లలిత మాతో చదివారు. ఆంధ్రా యూనివర్సిటీకి బి.ఎ. (ఆనర్స్)కి అప్లికేషన్ పెట్టించాడన్నయ్య. నాన్న ‘లా’ చదవమన్నారు. నేను ఇంగ్లీషు లిటరేచర్ చదువుతానంటే రెంటికీ అప్లికేషన్లు పంపాడు అన్నయ్య. రెంటిలో సీటు దొరికింది. నా మనసెరిగిన అన్నయ్య వెంట వచ్చి నన్ను బి.ఎ. (ఆనర్స్) ఇంగ్లీష్ లిటరేచర్ లో జాయిన్ చేసి, హాస్టల్లో దింపి పుస్తకాలన్నీ కొనిచ్చి వెళ్ళాడు. ఎప్పుడు హాస్టలుకెడుతున్నా కొన్ని పోస్టు కార్డుల మీద నాన్న అడ్రస్ రాసి యిచ్చి ప్రతివారం క్రమం తప్పకుండా ఉత్తరం రాయమనేవాడు. నాన్న పుష్కలంగా ఖర్చులకు డబ్బు ఇచ్చేవాడు. లోటు రానీయలేదు. అలా అని విచ్చలవిడిగానూ ఖర్చు చేయలేదు నేను. క్లాసులో పిచ్చా కనకమణి (విజయవాడ), ఇందిర (ఒంగోలు) క్రిష్ణ (యు.పి.), లోతికా గుప్త (బెంగాల్) క్లాసుమేట్స్. సీనియర్స్ తో కలిసి క్లాసులుండేవి. వారిలో సుమిత్ర ఎన్.జి.యల్, సుశీలా పీటర్స్ నాకు హాస్టల్ మేట్స్ గూడా. సుమిత్ర అందమైన వ్యక్తి. పెద్దజడ, చక్కని నవ్వు - నాకు యిష్టంగా వుండేది. చదువయిపోయి మొదటి సంవత్సరం ఉద్యోగం చేస్తూ మెనెంజైటిస్ వచ్చి అకాల మరణం చెందింది. ఎంతోకాలం ఆ విషాదం బాధను కలిగించింది. ఆమె తల్లిదండ్రులెలా తట్టుకున్నారో అని గుండె బరువెక్కేది. సుశీలా పీటర్స్ విజ్ఞాన ఖని. అతి మంచి వ్యక్తి. షేక్స్ పియర్ నాటకాలు పేజీలకు పేజీలు కంఠతా వచ్చు ఆమెకు. పుస్తకం పడితే ముగించేదాకా రాత్రి తెల్లవార్లూ వదిలేది కాదు. కర్నూలు ఆమెది. ఎ.సి. కాలేజీలో కెమిస్ట్రీ బి.ఎ. చేసింది. నాకు ఇంగ్లీషు సాహిత్యం అంటే మక్కువ. ‘దుష్టీ’, ‘త్రాష్టీ’ అంటూ నన్ను ముద్దుగా పిలిచేది. చాలా కాలం టచ్ లో ఉన్నాం. ఒకటి రెండుసార్లు పరీక్షల పనుల్లో కలిశాం. ఆమె అంటే నాకు వీరారాధన ఉండేది. మనిషిగా, విజ్ఞాన ఖనిగా. ఇప్పుడిక లేరు. హాస్టల్లో ఉన్న మనోహరం (ముస్తాబాదు) లా చదివేది. మద్రాసులో హిందీలో క్లాసుమేట్. నేనప్పుడు మరీ చిన్నదాన్ని. అంత పరిచయం లేదు. కానీ వైజాగ్ లో నన్ను ఎంతో ఆప్యాయంగా చూచేది. బలహీనంగా ఉంటావు. తిండి సరిగా తినవు అంటూ రోజూ రెండు పచ్చి గుడ్లు బలవంతంగా గొంతులో పోసేది. నారింజలు తెప్పించి రసం తీసి తాగించేది. ఎన్.జి.రంగా గారి శిష్యవర్గం అన్నయ్య నెరుగును. తాను. జె.యస్.ఆర్. కృష్ణ అప్పుడు చదివాడు. మనోహరం ఏది కావాలన్నా తెప్పించేవాడు. పండ్ల సరఫరా గూడా ఆయనే చేయించేవాడు. నన్ను ‘కోమూ’ అంటూ పిలిచేది. ఆమె చనిపోయిన దాకా స్నేహాలు కొనసాగాయి. ఇన్నయ్యకు గూడా ఆమె పరిచితురాలే. ఆమె చిన్న చెల్లెలు విజయ భర్త మస్తాన్ చౌదరి హైదరాబాద్ లో మాకు మంచి మిత్రులు. జూబ్లీహిల్స్ లో మా యిద్దరి ఇళ్లు దగ్గర దగ్గరగానే ఉన్నాయి. ‘అక్కా’ అంటూ విజయ ఎంతో ఆప్యాయత పంచుతుంది. హాస్టల్లో అక్తరున్నీసా బేగం సోషల్ వర్క్ స్టూడెంట్ వుండేది. స్నేహమయింది ఆమెతో. ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. కోపం అంటే ఆమెకు తెలియదనే చెప్పాలి. ఆమె సహవాసంలో నాలో కోపం చాలా వరకు తగ్గిందని చెప్పాలి. హైదరాబాద్ లో గూడా ఉద్యోగరీత్యా ఉన్నాము. కలిసేవాళ్లం. తన పెళ్ళయి వెళ్ళిపోయాక మరల కలవ లేదు. కానీ ఎప్పుడూ తనను ఆనందంగా గుర్తు చేసుకుంటాను. రాజేశ్వరి, నేను పొడవుగా పెద్ద జడలతో కలిసి కనిపిస్తుంటే కొందరు మేమిద్దరం అక్క, చెల్లెళ్ళమనుకునేవారు. హాస్టల్ (మహారాణీ పేట) నుండి యూనివర్సిటీ బస్ లో వెళుతుంటే కండక్టర్ నా పక్కన రాజేశ్వరి కనిపించకపోతే అక్కయ్యగారికి క్లాసులు లేవాండీ ఈ రోజు రాలేదు అనేవాడు. అతనికి తెలియదు మేమిద్దరం అక్క చెల్లెళ్ళం కాదని - నేను చెపితే గదా ఆ సంగతి! క్లాసు అబ్బాయిలతో ఎప్పడూ మాట్లాడలేదు ఆ మూడేళ్ళలో. పల్లెటూరు నుండి వచ్చినదాన్ని, చొరవ చేయలేదు. వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. సీనియర్స్ లో ప్రేమ (ప్రొ.శ్రీనివాస్ అయ్యంగారి అమ్మాయి), లక్ష్మీదేవి (రెజిస్ట్రార్ కూర్మా వేణుగోపాల్ నాయుడుగారి కోడలు), జూనియర్స్ లో ఆదిలక్ష్మి (ప్రొ. ముత్తుస్వామిగారి అమ్మాయి), రాధాకృష్ణ (కృష్ణాజిల్లా) పరిచయంగా ఉండేవారు. టీచర్స్ ఉద్దండులు - (ప్రొ.శ్రీనివాస్ అయ్యంగార్) ప్రొ. కె. విశ్వనాథం, ప్రొ.ముత్తుస్వామి. డా.ఇలా సేన్, డా.ఇందుశేఖర శాస్త్రి. మూడు సంవత్సరాల చదువయిన తరువాత నా రిజల్ట్స్ అంత సంతృప్తినీయలేదు. 49 శాతఁ వచ్చింది. కాలేజ్ లో పనిచేయాలంటే 55 శాతం ఉండాలి. అవగాహన, ప్రెజంటేషన్ లోపమని సరిపెట్టుకున్నాను. ఆ రోజుల్లో బ్రాహ్మణ - బ్రాహ్మణేతర విచక్షణలుండేవి అని యూనివర్సిటీలో చెప్పుకునేవారు. నేనా విచక్షణకు బలి అయ్యానన్నారు కొందరు. నేనలా అనుకోలేదు. అన్నయ్య లండన్ పంపి లింగ్విస్టిక్స్ చదివిస్తానన్నాడు. అందుకయ్యే ఖర్చు దృష్టిలో పెట్టుకుని, నాకా సబ్జక్ట్ లో అభిరుచి లేదన్నాను. అప్పుడింకా ఆ కోర్సు మన యూనివర్సిటీల దాకా రాలేదు. నాన్న నన్ను గుంటూరులో సెయింట్ జోసఫ్స్ కాన్వెంట్ లో బి.యిడి.లో చేర్పించారు. హైస్కూల్లో చదవలేదు. అక్కడి విద్యా పద్ధతులు ట్రైనింగ్ లో నేర్పిస్తారని అలా చేర్పించారు. ప్రిన్సిపల్ సిస్టర్ అన్న మరియా నెమ్మదిగా, గంభీరంగా ఉండేవారు. సిస్టర్ థెరసలీనా ఇంగ్లీషు డిపార్ట్ మెంట్ హెడ్. నన్ను దగ్గరకు పిలిచి మాట్లాడేవారు. నవ్వుతూ మాట్లాడేవారు. నేను తలవంచుకుని సమాధానం చెపుతుంటే ఎదటి మనిషి కళ్ళల్లోకి చూసి మాట్లాడాలి అని చెప్పి నేర్పించారామె. ఆప్యాయంగా చూసుకునేవారు నన్ను. తరువాత రెండేళ్ళు వాళ్ల దగ్గర పనిచేసినప్పుడు బాగా సన్నిహితంగా మెలిగాము. అమ్మా, నాన్నా, తోడబుట్టినవారు, బంధువులు స్నేహితులు, గురువులూ నా పట్ల చూపిన ప్రేమ, ఆదరణ నా అదృష్టం అనుకొంటాను. 1959లో బి.యిడి. అయింది. ఆ కాలేజీలోనే 1959-61 వరకు పనిచేశాను. వారడిగిందీ ఆ రెండు సంవత్సరాలే. సిస్టర్ రోజీనా ఎం.ఎ. ఇంగ్లీషు పూర్తి చేసి నా స్థానంలో లెక్చరర్ గా వచ్చారు. అదృష్టం అంటే ఒక విషయం ప్రస్తావించక తప్పదు. నాకు కుడికాలికి ఆరువేళ్ళున్నాయి. అలా పుట్టాను. నాన్న ఆ వేలు సర్జరీ ద్వారా తొలంగించ సంకల్పించారట. తాత నరసింహయ్య అలా ఉండటం పిల్లకి అదృష్టం తీయించవద్దని అడ్డు తగిలారట. రెగ్యులర్ షూ వేసుకోటానికి ఆటంకం అని నాన్న తొలంగించాలనుకొన్నారట. మరల ఇంటర్ చదివేటప్పుడు ఆ ప్రస్తావన తెచ్చాడు నాన్న. డాక్టరుతో టైము ఫిక్స్ చేసారు. ఎక్స్ రే తీసి నిర్ణయిస్తామని డాక్టరన్నారు. నాకు డాక్టర్లు, వైద్యులూ అంటే యిష్టం ఉండదు. అమ్మ దగ్గర ఏడ్చి గొడవ పెట్టాను. వేలు తీయించవద్దని. అమ్మ రికమండేషన్ తో ఆ పని ఆగింది. ఇబ్బందిగా ఉన్నా విద్యార్ధిగా షూ వేసుకున్నాను నాన్న సంతృప్తి కోసం. ఈ మధ్య (2013) కాలికేదో సమస్య వస్తే అమెరికాలో డాక్టరుకు చూపింది నవీన. మీ ఇంట్లో ఇంకెవరికైనా ఆరవ వేలు ఉన్నదా అని అడిగారాయన లేదన్నాను. చిన్నప్పుడే 8 ఏళ్లుంటాయి నాకు నేను గెంతుతూ ఆడుతున్నాను. బజారు తలుపు తెరుచుకుని ఒకాయన కాషాయవస్త్రధారి (యువకుడే) వచ్చాడు. నాన్నను చూచి - ఈ అమ్మాయి అడవిలో కళ్ళు మూసుకుని కూర్చున్నా అన్నం దొరుకుతుంది అన్నాడు. నాన్న అతని మాటలు నమ్మాడని కాదుగాని అతను నాన్నను ప్లీజ్ చేయటానికి వాడిన సమయస్ఫూర్తి నచ్చి అతనికి 2 రూపాయలు (అప్పుడది ఎక్కువ) యిచ్చి పంపాడు. దానధర్మాలు చేయటం, చందాలు విరివిగా ఇవ్వటం నాన్నకు అలవాటు. ఒకసారి పెదపూడిలో (పెద్దక్క ఊరు) బజారుకెళ్ళారు. అక్కడ భిక్షకోసం వచ్చినవారు చక్కని వాయిద్యం వాయించారని జేబులో 50 రూపాయల నోటు ఉంటే వాళ్ళకిచ్చివచ్చారు. అంతెందుకు అని నేననంటే ‘చిల్లర లేదమ్మా పైగా వారి వాద్య సంగీతం నాకు నచ్చింది’ అన్నాడు నాన్న. అమ్మ దసరాలప్పుడు గౌరీ వ్రతం చేసేది. సంక్రాంతి కాలంలో బొమ్మల కొలువు పెట్టి పెద్దగా 5 రోజులు ముత్తయిదువులను పిలిచి రోజుకొకరకం పండ్లు, శనగలు, తాంబూలం పంపేది. ఆ బొమ్మలు విడప్పుడు రెండు పెద్ద కావిడి పెట్టెల్లో బట్టల మధ్య భద్రపరిచేది. అన్నయ్య పిల్లలాటలాడి వాటిని విరిచేదాకా అవి అలా భద్రంగా ఉన్నాయి. ఏడాదికొక కొత్త బొమ్మ కొనేది. పాతవిరంగు మాసితే మరల రంగులు వేయించేది. ఆరోజుల్లో రంగులు వేసేవాళ్ళు వచ్చేవారు. ఇళ్ళ వెంట. సంక్రాంతి కాలంలో కొత్త పిండివంటలతో ఆవరణలో రెండు పెద్ద పురులూ, రెండు పాతరలు ధాన్యాగారాలుగా ఉండేవి. ఎప్పుడూ బంధువుల రాకపోకలతో యిల్లు సందడిగా ఉండేది. అమ్మ కజిన్స్ పిచ్చాడమ్మ, భూషణమ్మ పెద్దమ్మ (భుసెప్ప అనేవారు) అనసూయ పిన్ని, ముగ్గురు వెంకటేశ్వర్లు మామయ్యలు సంవత్సరానికి ఒకసారి వచ్చి అమ్మ, మామయ్యలను చూసిపోతుండేవారు. మా యింట్లోనే వారందరికీ ఆతిథ్యం. ‘అతిథిదేవోభవ’ అని అమ్మా, నాన్న మా ఐదుగురికి నేర్పారు. మేము అదే వరవడి పాటించాము. రెండేళ్ళ ఉద్యోగానంతరం 1961 వేసవిలో ఖాళీగా ఉన్నాను. నా స్నేహితురాలు వసంత కుమారి డెక్కన్ క్రానికల్ లో ఇంగ్లీషు టీచర్లు కావాలని నారాయణ గూడా మల్టీపర్పస్ స్కూలు, హైదరాబాదు వారిచ్చిన ప్రకటన కట్టింగ్ మధిర నుండి పోస్ట్ లో పంపింది. చకచక అప్లికేషన్ పెట్టాను వివరాలతో. జూన్ మొదటి వారంలో ఇంటర్వ్వూకి రావలసిందని వారు కార్డు పంపారు. నాన్నకు నన్ను ఒంటరిగా పంపటం యిష్టం లేకపోయింది. అన్నయ్య వెంటబడి మారాం చేశాను, తిండి మానాను అలిగి. అన్నయ్య పంపిద్దామని నాన్నతో మాట్లాడాడు. అదే టైములో వేసవి సెలవులకు ఆవుల సాంబశివరావు బాబాయి, కుటుంబంతో మూల్పూరు వచ్చి ఉన్నారు. నాన్న బాబాయితో విషయం ప్రస్తావించగా, ‘పంపించండి అన్నయ్యా. అక్కడ దగ్గర లోనే (బరఖత్ పురా) వర్కింగ్ వుమెన్స్ హాస్టలులో ఉన్నది. జయప్రద ఆ బోర్డు మెంబరు, లెటర్ రాసి యిస్తుంది. ఉద్యోగం వస్తే అక్కడ ఉండవచ్చు’ అని ధైర్యం చెప్పారు నాన్నకి. అలా ప్రయాణానికి రెడీ అయిపోయా. బెట్టా బేడా సర్దుకుని (ఉద్యోగం వచ్చినంత సంబరంతో) బయలుదేరా. అక్తర్ అక్కడ ఉద్యోగంలో ఉంటే తనకు టెలిగ్రాం యిచ్చా స్టేషన్ కు రమ్మని. అన్నయ్య తన స్నేహితుడు అత్తోట భాస్కరరావుగారికి టెలిగ్రాం యిచ్చాడు. నేను బండి దిగగానే అక్తర్ కనిపించింది. తనతో వై.డబ్ల్యు.సి.ఎ. హాస్టల్ కి వెళ్ళా. నాన్న మనవాళ్ళ చౌదరి అనే లాయరు (నాన్న స్నేహితులు) గారి పేర ఏదో లెటర్ రాసి యిచ్చారు. ఆయన నారాయణగూడాలోనే ఉంటారు. ఇంటర్వ్యూ అయింది. భాస్కరరావు మామయ్య వచ్చి నన్ను తమ యింటికి తీసుకెళ్ళారు. ఆయన భార్య ఇందిర. నాలుగు రోజులు వారింట్లో ఉన్నాను. వారింటి దగ్గర స్కూలులో హెడ్ క్లర్క్ ఉంటారు. సెలెక్ట్ అయ్యానని అప్పాయింట్ ఆర్డర్ పట్టుకొని మామయ్య యింటికొచ్చారాయన. ఆయనది అమృతలూరు, మా వూరికి దగ్గరే. బహుశ మనవాళ్ల చౌదరిగారు స్కూలు సెక్రటరీతో మాట్లాడి ఉండవచ్చు. ఇంటర్వ్యూ కూడా బాగా చేశాను. 1961 జూన్ పన్నెండున స్కూలులో డ్యూటీ చేరాను. హాస్టల్ వసతి బాగున్నది. స్కూలుకు నడిచి వెళ్లే దూరమే. అప్పటికి కనకమషి - (నా క్లాసుమేట్), లక్ష్మీ కుమారి (యూనివర్సిటీలో పరిచయం) అదే స్కూలులో పని చేస్తూ అదే హాస్టల్లో ఉంటున్నారు రెండేళ్ళుగా. నా వృత్తి నాకిష్టం. అమ్మాయిల స్కూలది. వారితో పాఠాలు చెపుతూ గడిపిన రోజులు మరపురానివి. కొందరు సన్నిహితులయ్యారు. అరుణ, ఉషారాజు అందులో ముఖ్యులు. ఇద్దరూ డాక్టర్లు. ఉష అమెరికాలో పెథాలజిస్ట్ గా స్థిరపడింది. అరుణ ఎనస్తీషియా ప్రొఫెసర్ గాంధీ మెడికల్ కాలేజి హాస్పిటల్లో. ఇద్దరూ ఇప్పటికీ ఈ కోమలా టీచర్ని కలుస్తారు. 50 ఏళ్ళకు పైగా పెనవేసుకున్న అనుబంధమది. అరుణ భర్త డా.సుభాష్ బాబు మాకు ఫామిలీ డాక్టరు. ఎంతో శ్రద్ధగా వైద్యం చేస్తారు. ఇన్నయ్యకు ఆస్తమా ట్రబుల్ ఉండేది. సుభాష్ గారి వైద్యంలో ఇన్నయ్య తానొకప్పుడు ఆస్తమాతో బాధపడ్డాననేమాట మరచిపోయాడు. అంతటి ‘హస్తవాసి’ ఆ డాక్టరుగారిది అని చెప్పాలి. ఇప్పటికీ (అమెరికాలో ఉంటూ) ఆయనకు ఇండియా ఫోను చేసి వైద్య సలహాలు పొందుతూనే ఉన్నాం. మా పిల్లలంటే డాక్టరుగారు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. రాజుని (మా అబ్బాయిని) రాజా సాహెబ్ అని పిలుస్తారు. ఆ పిలుపులో ఎంతో ఆప్యాయత దాగి ఉన్నది. ‘అరుణక్క, సుభాష్ అంకుల్’ మా పిల్లలకు ప్రేమపాత్రులు. స్కూలులో మంచి మిత్రులు - రామలక్ష్మి (ఇంగ్లీషు టీచరు) సరోజిని (బోటనీ-సరో) హేమారాణి (సైన్స్ టీచరు). సరో ఇటీవలే తనువు చాలించింది. హేమారాణి పిన్నవయసులోనే వెళ్ళిపోయింది సుదూరతీరాలకు. రామలక్ష్మి తన వృత్తికి న్యాయం చేయాలని ఎప్పుడూ తాపత్రయ పడేది. మంచి వ్యక్తి. మనసు విప్పి మాట్లాడుకునేవాళ్ళం. వాళ్లన్నగారికి ట్రాన్సఫర్ (ఆల్ ఇండియా రేడియో) అవటాన విడిపోయాం. ఇప్పటికీ ఒకసారి కలవగలిగితే ఎంత బాగుండును అనుకునే స్నేహితురాళ్ళలో ఆమె ఒకరు. ఎక్కడ ఉన్నా నాకు మంచి మిత్రుల సాంగత్యం. వారి ఆదరణ, అభిమానం కోకొల్లలుగా లభించాయి. ఇంకా లభిస్తూనే ఉన్నది. అది వారందరి ఉదార స్వభావానికి స్నేహశీలతకు, సహృదయతకు తార్కాణం. నా అదృష్టం. గుంటూరులో ఉద్యోగానికి చేరేముందే కాలేజీవారు మూడు నెలల వేసవి ప్రత్యేక కోర్సుకు పంపారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ (CIEFL, Hyderabad) వారు ఆ కోర్సు ఊటీలో నిర్వహించారు. టీచర్లందరూ అప్పటికి విదేశీయులే. Mr. Bruton, Mr. Barren, Mr. George (German, a Vegetarian) Mr. Hill మొదలైనవారు. వారి సౌకర్యార్ధం చల్లని ప్రదేశం ఊటీలో కోర్సు జరిపారు. నవాబు ప్యాలెస్ - వుడ్ కాక్ హాల్ అందుకు ఉపయోగించారు. దేశంలోని అన్ని రకాల రాష్ట్రాల నుండి లెక్చరర్స్ కోర్సులో పాల్గొన్నారు. వారంతా అనుభవం గడించినవారే. నేనే వారందరిలో చిన్నదాన్ని. అప్పుడే ఉద్యోగం ప్రారంభించబోతున్నాను. కోర్సులో ఫోనెటిక్స్ లిటరరీ అప్రీసియేషన్, ఇంగ్లీషు సెకండ్ లాంగ్వేజ్ గా ఎలా బోధించాలి అనే అంశాలు సూక్ష్మంగా నేర్పించారు. ఆ అనుభవం నాకు బోధనలో ఎంతో ఉపకరించింది. ఆ అవకాశం కల్పించిన సెయింట్ జోసెఫ్ కళాశాలవారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కోర్సులో పాల్గొన్నవారిలో పి.యల్.యన్.శర్మగారు, షేఖ్ మౌలానాగారు ఇంకా బాగా గుర్తున్నారు. శర్మగారు కోమలమ్మా - 40 ఏళ్ళ వయసున్న ప్రతి మగవాడు ఒక రోగ్ (దుష్టుడేమో) అనేవారు. నవ్వేదాన్ని ఆయన అలా అంటుంటే. చక్కగా మాట్లాడేవారు. షేక్ మౌలాగారు సౌమ్యుడు. నిశితంగా కోర్సులో మునిగితేలినవాడు. తరవాత కాలంలో ఆయన స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గా తారసిల్లారు. టీచర్సుి తప్పులెన్నటం ఆయన లక్ష్యం కాదు. ఇన్స్పెక్షన్ టైములో వారు ‘మిస్’ అవుతున్న విషయాలను చూపి ఎలా బోధించాలో చెప్పటం వారి ఉద్దేశ్యం - చాలా అరుదుగా ఉంటారలాంటి వారు. ఈ కోర్సు టైములో రెండు వింతలు జరిగాయి. (కోర్సుకు సంబంధం లేదు) నేను, వెల్మాదయాల్ (నాగపూర్, కొత్తగా పరిచయమయ్యారు). రోజూ సాయంత్రం మార్కెట్ కి వెళ్ళి పండ్లూ, ఇతర అవసరమైన వస్తువులూ కొనుక్కునేవాళ్ళం. వస్తూ మల్లెపూలు కొని శిగలో తురుముకునేవాళ్ళం. పంజాబ్ నుండి వచ్చిన ఒక పెద్దాయనకు ఈ పూల విషయం వింతగా తోచేదట. ఒకరోజు ఉండబట్టలేక అడిగేశాడు - ఎందుకు మేమిద్దరం పూలు పెట్టుకుంటున్నామని. మాకు (ముఖ్యంగా దక్షిణ భారత స్త్రీలకు) అది ఆచారం, అలవాటు అని చెప్పాము. అసలు సంగతేమిటంటే ఆయన వచ్చిన ప్రదేశంలో వేశ్యలే పూలు ధరిస్తారట. ‘ఈ అమ్మాయిలు చూస్తే ఎంతో మర్యాదస్తులుగా ఉన్నారు. ఈ పూలేంటి’ అనేది ఆయన సందేహం. మేము విడమరచాము ఆయనకు. ఇంకానయం అడిగారు. సందేహనివృత్తి అయింది. లేకుంటే మా పట్ల దురభిప్రాయంతో వెళ్ళుండేవాడాయన. ఒకనాడు వెల్మా, నేను బస్ మిస్ చేసి మార్కెట్ కు అడ్డదారిన నడిచి వెళుతూ ఉన్నాం. నలుగురు యువకులు ఆ దారినే వెళుతూ ఉన్నారు. వెల్మా గళ్ళెగా పెద్దదానిలాగా ఉంటుంది. నేను అప్పుడు బక్కగా ఉండేదాన్ని. తనకు తెలుగు రాదు గనుక ఇద్దరం హిందీలో కబుర్లాడుకుంటూ నడిచాం. ఆ అబ్బాయిలు తెలుగులో మా మీద కామెంట్స్ పాస్ చేస్తూనే నడిచారు. మాకు అర్థం కాదని గాబోలు - ‘ఈమె మన సినిమా నటి జమునలాగా ఉన్నది. కానీ హిందీ మాట్లాడుతున్నది . తెలుగామె కాదు కదా ఆటపట్టిద్దామంటే పక్కన తల్లికోడిలా పెద్దామె ఉన్నది’ అంటూ అలా మాట్లాడుతూనే పోయారు. నేను కల్పించుకోలేదు. తీరా మార్కెట్ దగ్గర కొచ్చిన తరువాత - ‘థాంక్స్ మీ కామెంట్స్ కు, ఇలా ఆడవాళ్ళ వెంట బడటం మీ సభ్యతగాబోలు. చూస్తే మర్యాదస్తుల్లా ఉన్నారు. ఇదేబుద్ధి’ అన్నాను. వాళ్లు నా తెలుగు విని అవాక్కయ్యారు. వారికేమనలో తోచలా. మేము తిరిగి వెళ్ళేటప్పుడు ఇన్స్టి ట్యూట్ బస్ ఎక్కడం చూసారు. మరురోజు వుడ్ కాక్ హాలుకు వచ్చి క్షమాపణలడిగారు. వారిది రాజమండ్రి అట. ప్రోఫెషనల్ కోర్సు విద్యార్థులట. ఊటీ విహారయాత్రకొచ్చామని చెప్పారు. ఇది అప్రస్తుతమైనా చెప్పాలనిపించింది. కొన్ని సంఘటనలలా గుర్తుండిపోతాయి. 1959 నాటి ముచ్చట యిది. నేను ఊటీ వెళుతుంటే సుశీలా పీటర్స్ చక్కని స్వెట్టర్ బహూకరించింది. అది అక్కడి చలి వాతావరణంలో ఎంతో ఉపయోగపడింది. హాస్టల్లో ముఖ్యమైన మిత్రులు ఎస్. సావిత్రమ్మ, ఆర్. లక్ష్మీకాంతం. సావిత్రమ్మ బాలవితంతువు. హిందీ చదవటానికి రావులపాలెం (తూర్పుగోదావరి) నుంచి వచ్చి హాస్టల్లో ఉన్నది. నా రూంమేట్. 1961నాటి మాట. మనిషి నెమ్మది, మితభాషి. నేను ఎక్కువ మాట్లాడుతుంటే నవ్వుతూ వినేది. చదువయిపోయి ఆర్.టి.సి. స్కూల్లో హిందీ టీచరుగా కుదురుకున్నారు. సత్యనారాయణరెడ్డిగారు ఆమె బంధువు. ఆయన ప్రోద్బలం వల్లనే సావిత్రమ్మ చదివి, టీచరు కాగలిగింది. ఆయన లాయరు. కష్టపడి చదివి, పనిచేసి జీవితంలో సుస్థిరంగా నిలదొక్కుకున్న వ్యక్తి. మాకు పరిచయమయి మరణించేదాకా మిత్రులుగా కొనసాగారు. సావిత్రమ్మ అక్క వీరమ్మగారు, చెల్లెలు మీనాక్షి, తమ్ముడు వెంకట రెడ్డి అందరితో నాకు పరిచయముంది. మా యిద్దరి స్నేహం 45 ఏళ్ళు కొనసాగింది. అరమరికలు లేకుండా ఉండేవాళ్ళం. నా పిల్లలన్నా, నా భర్త అన్నా ఎంతో ఆదరంగా ఉండేది. ఊరి నుండి మిఠాయిలు వచ్చినా, తానేమన్నా తయారు చేసినా నాకు పంపించకుండా తాను తినేది కాదు. ఆమె తమ్ముని కొడుకు ప్రభాకర్ రెడ్డిని దగ్గరకు తీసి ఇంజనీరింగ్ చదివించింది. ఆమె, సత్యనారాయణరెడ్డిగారు వారి వారి పేదబంధువులకు విరివిగా ధనసహాయం అందించేవారు. ఆరేళ్ళ క్రితం ఆమె, 4 ఏళ్ళ క్రితం రెడ్డిగారు మరణించారు. ఆప్తమిత్రులను కోల్పోయామనే బాధ మిగిలింది మాకు. లక్ష్మీకాంతం జి.సి.ఐ.ఎమ్. (ఆయుర్వేదం) డాక్టరు. క్లాసుమేట్ ఒ.వి. సుబ్బారెడ్డి (నెల్లూరు)ని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇద్దరు నెల్లూరు ప్రజా వైద్యశాలలో పనిచేసి వైద్యవృత్తిలో అనుభవం గడించి బోధన్ లో హాస్పిటల్ తెరిచారు. వైద్యసేవలందించి మంచిపేరు గడించారు. స్థితిమంతులయ్యారు. మా యింటికి తరచు వస్తూ పోతూ ఉండేవారు స్నేహరీత్యా. లక్ష్మిది చాలా ఉదారబుద్ధి. స్నేహితులు అవసరంలో ఉన్నారని తెలిస్తే వారడక పోయినా సహాయమందించటానికి ముందుండేది. నవ్వుతూ మాట్లాడేది. రెండుసార్లు కవలపిల్లలు పుట్టారు. - స్వాతి, చిత్రకుమార్, హారతి, జ్యోతి. మా పిల్లలు, వాళ్లూ సెలవుల్లో కలిసి (మా దగ్గర) గడిపిన సందర్భాలున్నాయి. తల్లి-దండ్రి మాదిరిగా స్నేహశీలురు ఆనలుగురూ. వారంతా ఇంటర్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా ఒకనాడు పిడుగులాంటి దుర్వార్త అందింది. లక్ష్మి, రెడ్డిగారు, లక్ష్మి తల్లి బందిపోట్ల దురాగతంలో యింటిలో ప్రాణాలు విడిచారని. పిల్లల్ని కూడా చిత్రహింస పెట్టారు దుండగులు. హారతి గూడా గాంధీ హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ప్రొఫెషనల్ ఈర్ష్యతో కొందరు వారిని చంపించారని చెప్పుకున్నారు. భయంకరమైన సంఘటన అది. అలా చేయించిన దుర్మార్గులు ప్రశాంతంగా నిద్రపోగలరంటే నమ్మలేము. లక్ష్మి పెద్దక్క మాణిక్యమ్మగారు పిల్లలను (ముగ్గురు) దగ్గరకు తీసి స్థిరపడేటట్లు చేశారు. ఈనాటికీ, లక్ష్మిని, రెడ్డిగారిని తలచుకుంటే కన్నీళ్ళాగవు. అంత మంచి వ్యక్తులకు ఘోర విపత్తు తలపెట్టినవారు అంతటి దురాగతాన్ని అనుభవిస్తారేమో ఎప్పటికైనా! మరొక స్నేహితురాలు సీత, లాయరు. ఏలూరు నుండి వచ్చిందామె. ‘లా’మాగించి కమర్షియల్ టాక్స్ ఆఫీసరుగా కుదురుకున్నారు. నాకు హాస్టల్లో రూం మేట్. పెద్ద గ్లాసుతో కాఫీతాగేది. మాటికొకసారి అమృతాంజనం పిసరు తీసి కణతలకు రాసుకుంటూ ఉండేది. అంత చదివి, పెద్ద ఉద్యోగంలో ఉన్నా చాలా సీదా సాదాగా ఉండేది. హైదరాబాద్ లోనే స్థిరపడిందామె. ఇటీవలి కాలంలో కలవ లేదు. ప్రస్తుతం తన గురించి ఏమీ సమాచారం లేదు. కాని నవ్వుతూ మాట్లాడే సీత ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటుంది. వసంత కుమారి సరూర్ నగర్ లో స్కూల్లో సైన్స్ టీచరుగా కొంతకాలం పనిచేసి వివాహం వల్ల హైదరాబాద్ కి స్వస్తి పలికింది. హాస్టల్లోనే ఉండేది. ఆదివారం చర్చికి వెళుతూ (హెబ్రోన్) నన్నూ లాక్కెళ్ళేది. ఆమె సోదరులు డా. అభయ్, క్రిస్టీ (చదువుతుండేవాడు) బాగా పరిచయమయ్యారు. మంచి కుటుంబం నుండి వచ్చిందామె. దైవభక్తి మెండు. ప్రస్తుతం రిటైరయి మధిరలోనే ఉంటున్నది. అసలు తన వల్లనే నేను హైదరాబాద్ కు ఉద్యోగరీత్యా రాగలిగానని ఎప్పుడూ కృతజ్ఞతా భావం నాలో మెదులుతూ ఉంటుంది. నాన్న నన్ను రాత్రి కాలేజీలో చేరి ‘లా’ చదవమన్నారు. నా జీతం ఫీజులకు చాలదేమో అని డబ్బు కూడా ఇచ్చాడు. నాకెందుకో ‘లా’ చదవటం ఇష్టం కాలేదు. ఏదో వంక చెప్పి తప్పించుకున్నాను. ఇక నన్ను నాన్న బలవంత పెట్టలేదు. చదువు విషయంలో నాన్న కోర్కెను నేను తీర్చనేలేదు. ఇంతలో CIEFL నుండి ఒక లెటర్ వచ్చింది. ఇరాఖ్ లో ఇంగ్లీషు టీచర్లు కావాలని, ఇష్టమయిపోతామంటే వాళ్ళే ఏర్పాటు చేయగలమని. ట్రైనీస్ అందరికీ పంపి ఉంటారా లెటర్. నాకు ఆ దేశం గురించి ఏమీ తెలియకపోయినా వెళ్ళ సాహసించలేదు. వెళతానంటే నాన్న అనుమతి దొరికేదో లేదో వేరే సంగతి. పరుగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగటం మంచిదన్నట్లు వెళ్ళే ఆలోచనే పెట్టుకోలేదు. పిరికితనం అనుకుంటాను నాది! వివాహం, పిల్లలు, బాధ్యతలు అన్నయ్యకు చదువుతుండగానే పెండ్లయింది. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో డి్గ్రీ చదివారు. ముగ్గురు పిల్లల తండ్రయ్యారు. తార, నాగమణి, కృష్ణమోహన్ - వదిన ఎంపికే ముగ్గురి పేర్లు. పెంచే విధానం గూడా ఆమెకు తోచినట్లే. ఆ తరుణంలో మా అమ్మ నాకూ శ్యామలక్కకూ పెండ్లి విషయం నాన్న, అన్నయ్య శ్రద్ధ పట్టటం లేదని కొంత బెంగ పడింది. స్నేహితుల పెళ్ళిళ్ళ విషయంలో చూపే శ్రద్ధ మాపట్ల చూపటం లేదని ఒకసారి బాధపడింది నా ముందు. అవే అవుతాయి లేమ్మా, బాధపడకు అన్నాను నేను. ఇన్నయ్యతో నా పెళ్ళి ప్రస్తావన మొదలు తెచ్చింది ఆంధ్రపత్రిక కరస్పాండెంట్ వెంకటప్పయ్యశాస్త్రిగారు. ఆయన కన్యాకుమారి తండ్రి. కన్యాకుమారి ఇన్నయ్య సోదరుడు విజయరాజ్ కుమార్ భార్య. నాతోటికోడలు. 1963, ఆగస్టు 17న నాన్న ఆవుల సాంబశివరావుగారూ, ఇన్నయ్య, వాళ్ళ బావగారు చెరుకూరి వెంకట సుబ్బయ్యగారు నేనుంటున్న హాస్టల్ కి వచ్చారు. పెళ్ళిచూపులన్నమాట. ఇన్నయ్య హేతువాద ఉద్యమంలో పనిచేయటం వలన సాంబశివుగారికి, ఆవులగోపాలకృష్ణమూర్తిగారికి బాగా పరిచయమున్న వ్యక్తి. ఇద్దరం ఇష్టపడ్డాము, పెండ్లి నిశ్చయమయింది. నాన్న ఎంతకట్నమివ్వగలడో చెప్పాడట. అందుకు ఇన్నయ్య కట్నం ఆశించడంలేదు. ఇద్దరం చదువుకున్నాం. స్వశక్తితో బ్రతగ్గలమనే వివాహానికి ఒప్పుకున్నాడట. మాపెళ్ళిలో కట్న కానుకల ప్రసక్తి లేనేలేదు. అప్పుడు ఆవుల గోపాలకృష్ణమూర్తిగారు అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై అమెరికా టూర్ లో ఉన్నారు. ఆయన ఇన్నయ్యకు గురుతుల్యులు. ఆయనే వివాహం జరిపించాలని ఇన్నయ్య కోరిక. తానప్పుడు సంగారెడ్డిలో గ్రాడ్యుయేట్ టీచర్ గా పనిచేస్తున్నాడు. వేసవి సెలవుల్లో పెండ్లి చేసుకుంటామని ఇన్నయ్య సాంబశివరావుగారికి తెలిపాడు. ఇంతలో శ్యామలక్క పెళ్లి ఎం. నాగయ్య గారితో కుదిరింది. నాగయ్యగారు అద్దంకిలో పి.టి.టీచరుగా పనిచేస్తున్నారు. వారి స్వగ్రామం సంక్రాంతిపాడు సత్తెనపల్లి తాలూకా అనుకుంటాను. మే 31, 1964న మా యిద్దరి వివాహం తెనాలి తాలూక హైస్కూలు బిల్డింగ్ లో సాయంత్రం 5 గంటలకు జరిగింది. గోపాలకృష్ణమూర్తిగారు ఆధ్వర్యం వహించారు. దండల పెళ్ళి, మంత్రాలు, మేళాలువంటి తతంగంలేదు. సాంబశివరావుగారు చిన్న ఉపన్యాసం చేశారు. ‘ముహూర్తం’ అంటూ లేని పెళ్ళియిది. ఆదివారం, సాయంత్రం అందరికీ వీలు చిక్కే టైములో అంటూ సీతారాముల పెళ్ళి ముహూర్త బలం గురించి చమత్కరించారు. ఇన్నయ్యగారి ఆప్తమిత్రులు సి.రాజారెడ్డిగారు, పెద్దరికం వహించి ఇన్నయ్యతో ఒక చక్కని పట్టుచీర, మంగళసూత్రం, బంగారు గొలుసు కొనిపించి తెచ్చారు. రాజారెడ్డిగారిది చీరాల, వేసవి అంతా ఇన్నయ్య అక్కడ హేతువాద మిత్రులతోనే గడిపి అటునుండే స్నేహితులందరితో కలిసి తెనాలి వచ్చారు. శ్యామలక్క, నాగయ్యగారు సరిజోడు. ఇద్దరూ నెమ్మదస్తులు. అట్లా మాపెళ్ళిళ్ళయినాయి. అమ్మకు ఊరట కలిగింది. నేను ఎక్కువ హాస్టళ్ళలో ఉన్నాను. శ్యామలక్క అమ్మతో ఎక్కువ కాలం గడిపింది. అక్క వెళ్ళిపోతుంటే అమ్మ ఒంటరితనం అనుభవించింది. తప్పదుగదామరి! ఇన్నయ్యగారి అక్క కమలగారు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో డెప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తూ హైదరాబాద్ లో ఉంటున్నారు. వారుంటున్న ఇంటికి అనుబంధంగా ఉన్న పోర్షన్ మాకూ అద్దెకు కుదిర్చారు. ఇసామియా బజారులో చిన్న పెంకుటిల్లు. సరుకు, సరంజామా కొనుక్కుని కాపురం ప్రారంభించాం నేనూ, ఇన్నయ్య. ఇన్నయ్య ఆంధ్రాయూనివర్సిటీలో ఫిలాసఫీ డిపార్ట్ మెంట్ లో చదువుతూ తండ్రి రాజయ్యగారి మరణంతో అక్కడ చదువు మానవలసి వచ్చిందట. పెండ్లినాటికి ఉస్మానియా యూనివర్సిటీలో మొదటి సంవత్సరం యం.ఎ. ప్రైవేటుగా రాసి పాసయి ఉన్నాడు. ఉద్యోగం మాని 1964లో యూనివర్సిటీలో చేరి యం.ఎ. పూర్తిచేశాడు. వెంటనే పిహెచ్.డి.కి పేరు నమోదు చేసుకుని చదవటం ప్రారంభించి 18 నెలలలో ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు డిటర్మనిజంలో పిహెచ్.డి. సిద్ధాంతం తయారు చేశాడు, గైడ్ దురుద్దేశ్యంతో 12 ఏళ్ళు పట్టించాడు ఆయనకు డిగ్రీరావటానికి. అదో పెద్ద కథలెండి! మరోచోట ప్రస్తావిస్తాను ఆ కథ. ఆగస్టు 1964 మొదటి బిడ్డ కడుపున పడింది. మొదటి నాలుగు నెలలు అసౌకర్యంగా, ఇబ్బందిగా నీరసంగా గడిచాయి. తిండిమీద ప్రీతి పోయింది. కానీ ఉద్యోగ ధర్మం నిర్వర్తించవలసే వచ్చింది. ప్రసవం ముందు దాకా ఏ డాక్టరును చూడలేదు. ఏ మందులూ వాడలేదు. ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి స్త్రీ ప్రసవం తల్లి సమక్షంలో జరగాలని పుట్టింటికి పోగోరుతుంది. నేను అందుకు భిన్నం కాదు. హైదరాబాద్ లో మంచి డాక్టర్లు ఉన్నా ఏప్రిల్ లో సెలవులు ప్రారంభం కాగానే మూల్పూరు వెళ్ళిపోయాను. నాన్న తెనాలిలో డా.ఝాన్సీ వాణికి చూపించి ప్రసవానికి వారం ముందు చిన్నఇల్లు అద్దెకు తీసుకుని తెనాలి చేరాడు. అమ్మ, అక్కలు అందరూ నాతోనే ఉన్నారు. ఇల్లు సౌకర్యంగా లేదు గాని డాక్టరు క్లినిక్ ఎదురుగా ఉండటం ప్లస్ పాయింట్. మేం 20వ తేదీన (1965) రాత్రి డాక్టరు నన్ను చూచియింకా ప్రసవానికి టైమున్నది. తిరుపతి వెళ్ళి రెండవరోజు తిరిగి వస్తానని బయలుదేరి వెళ్ళారు. నాకు అదే అర్ధరాత్రి నుండి ప్రసవవేదన ప్రారంభమయింది. అవసరమైతే తనకు తెలిసిన లేడీ డాక్టరును పిలవమని నర్సులకు చెప్పారట. తీరా చూస్తే ఆమె సెలవులో ఎక్కడికో వెళ్లారని తెలిసింది. పగలు 11 గంటలు (21 మే) సమయంలో నర్సులకు దిక్కు తోచక డాక్టరు చావా సుబ్బారావుగారిని పిలుచుకొచ్చారు. సిజేరియన్ కేసది. కాని ఆయనకు సిజేరియన్ లు చేసే అలవాటులేదు గనుక ‘ఇంటర్నల్ టేర్’ (కోత) యిచ్చి పసి తల్లిని బయటకు తెచ్చారు. 23 కుట్లు వేసానన్నారు లోపల. పుట్టిన బిడ్డ దృఢంగా, చక్కని శరీర చాయ కలిగి నల్లని కురులతో ముద్దుగా ఉన్నది. ఆ విధమైన ప్రసవం వలన నా శరీరంలో కొన్ని లోపాలేర్పడ్డాయి. అవి ఇప్పటికీ లోపాలుగానే మిగిలాయి. డాక్టరు ఝాన్సీవాణి జరిగిన తప్పును గ్రహించారు. 10వ రోజు మరల మత్తు యిచ్చి కుట్లు సరిచేశారు. కాని జరిగిన నష్టంపూడలేదు. నేను లేచి తిరగటానికి నెలపట్టింది. ఇన్నయ్య చీరాలలో ఉండటాన మూడవ రోజు వచ్చి బిడ్డను చూచి వెళ్ళిపోయారు. అన్నయ్య, పిల్లలు, చిన్నక్క పిల్లలు – అశోక్, నరేంద్ర, సతీష్, కల్పన, కుసుమ, సురేషు అందరూ పాపచుట్టూనే ఉన్నారు. కాసేపు మంచం పక్కన ఎవరూ కనిపించకపోతే ‘బేర్’ మని ఏడ్చేది. ‘నీ కూతురుకు చుట్టూ మనుష్యుల సందడి కావాలి’ అని అక్కలు మురుసుకున్నారు. రోహిణీ కార్తె, మండుటెండలు. లేత అరటి ఆకులు తెప్పించి పసితల్లిని అందుమీద పడుకోబెట్టి వేడి నుండి కాపాడారు. అత్తయ్యలు, మామయ్యలు వచ్చి చూచి వెళ్ళారు. ఎడం కన్నులో విపరీతమైన బాధతో విలవిలలాడాను. డాక్టరుకు చూపించారు నాన్న – భయపడ్డారు. కన్ను ఏమవుతుందోనని. నెలకి మూల్పూరు వెళ్ళాం అందరం బిడ్డతో సహా. 24వ రోజు అమ్మ ఉయ్యాల వేసి సింపుల్ గా పేరంటం గావించింది. అదే రోజు కమలగారి దగ్గర నుండి పార్సెల్ అందింది. పసిదానికి రంగుల రంగుల జుబ్బాలు అందంగా కుట్లతో పంపించారు. పెద్దక్క మిషన్ కుడుతుంది. ఎన్నో రకాల గౌనులు, డైపర్ ల మాదిరిగా సైను బట్టతో అనేకం కుట్టింది. అక్కే స్నానం చేయించేది పసిదానికి. ఎప్పుడూ ఎవరో ఒకరు ఎత్తుకుని ముద్దాడుతుండేవారు. అక్కలు బంగారు గాజులు చేయించి యిచ్చారు బిడ్డకు. నాన్నను పేరు పెట్టమని అడిగాను. ఇన్నయ్య పెట్టుకుంటాడు లేమ్మా, తండ్రిగా అది అతని హక్కు అన్నారు నాన్న. రెండవ నెల పూర్తి కాకుండానే ప్రయాణం కట్టాను హైదరాబాద్ కు ఇన్నయ్య రమ్మని చెపితే, ఆలోగా నారాయణగూడాలో స్కూలు దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. సౌకర్యంగా ఉన్నది ఇల్లు. ఇంకా రెండు రోజులాగితే ఆషాఢం వెళుతుంది అన్నాడు నాన్న. ఎప్పుడూ తిథులూ, మంచి చెడులూ చూసే అలవాటు లేదు గనుక ప్రయాణం సాగింది. అమ్మనాతో గూడా హైదరాబాద్ వచ్చింది. పాపకు నాలుగు నెలలకు వచ్చినదాకా అమ్మ ఉన్నది. అప్పటికి పసి తల్లికూర్చుంటున్నది గనుక స్నానం చేయించటం కష్టం అవలేదు నాకు. ఇంటివాళ్ళ అమ్మాయి శైలజ నా స్టూడెంట్ స్కూలులో. ఇంటిల్లిపాదీ పాపను ముద్దు చేసే వారు. వాళ్ళే ‘సోనీ’ అనిపిలిచేవాళ్లు. వారందరి మధ్య బిడ్డ సంతోషంగా పెరిగింది. ఇంతలో నాన్ననుండి ఉత్తరం వచ్చింది. పాపకు రెండు, లేక మూడు అక్షరాలతో నవీనంగా ఉండే పేరు పెట్టుకోండి. ఆలస్యమైనకొద్దీ ‘బుజ్జి’, ‘బేబి’ అంటూ పిలుపులు అలవాటైపోతాయి అని రాశాడు నాన్న. అప్పటికే ఇన్నయ్య బుజ్జమ్మ అని పిలుస్తున్నాడు. ఉత్తరం చదివి, ఒక్క నిముషం ఆలోచించి, ‘నవీన’ అని పేరు పెడదామా అన్నాడు. ఆ పదం నాన్న ఉత్తరంలోని ‘నవీనంగా’ అన్న పదం నుండి తీసాడు. ఇక ‘నవీన’ పేరు స్థిరపరచుకున్నాం. పేరు నాన్న పెట్టినట్లే. నేను నటాషా అని పెడదామా అని ఆలోచించాను కాని ‘ట’ సౌండ్ హార్ష్ గా ఉంటుందేమో అని ఊరుకున్నాను. చాలామంది ఇప్పటికీ ‘సోనీ’ అంటారు. అక్కలు ‘చిన్ని’ అనేవాళ్ళు. మా అమ్మకు ఆఖరి మనవరాలని అలా ముద్దుగా పిలుచుకునేవారు. నేను ఇప్పటికీ ‘చిన్ని’ అనే పిలుస్తాను. అఫీషియల్ గా ‘నవీన’ నమోదయింది. నవీన పసితనం నుండి వింతగా, మెచ్యూర్డుగా వ్యవహరించేది. ఇన్నయ్య ఎక్కువ శ్రద్ధ చూపేవాడు నవీనపట్ల. మోకాళ్ళమీద పాకలేదు. మంచిదే అయింది. మోకాళ్ళు గీరుకుపోకుండా అనుకున్నాను. మా యింట్లోకంటే యింటివారివద్దనే ఎక్కువ సమయంగడిపేది. సోనీ దగ్గర మంచివాసన వస్తుంటుంది అని వాళ్ళు మెచ్చుకునేవారు. వారు టేబుల్ పై భోజనాలు చేస్తూ సోనీని మధ్యలో కూర్చోబెట్టుకునేవారు. కెలికినా వాళ్ళకి యిష్టంగానే ఉండేది. వాళ్ళ దగ్గర నుండి తీసుకు రాబోతే రానని మారాం చేసేది. శైలజ పెళ్ళికి, సోనీకి గూడా బట్టలు కొని పెళ్ళికి తీసుకు వెళ్ళారు. ముద్దుగా నడుస్తూ పువ్వులేరుతుంటే ఫోటోతీశారు. సంవత్సరంలో లోపల నడక మాటలు వచ్చాయి. రెండు నెలలు ‘క’ పలకలేదు. ‘త’ అనేది. మీ అమ్మ పేరు ఏమిటి అని ఎవరన్నా అడిగితే ‘తోమల’ అనేది. వాళ్ళు నవ్వితే కోపగించుకునేది. మరలా అడిగితే ‘తెలియదు’ అనేది. అలిగిందన్నమాట. ‘సాధనా’ కట్ అనేవారు అప్పటి హెయిర్ స్టైల్ ని అది చేయించాము. కేన్వాస్ షూజ్ వేసుకుని హుందాగా నడిచేది. పసితనంలో పాలపొడి డబ్బాలు దొరకకుండా మార్కెట్ లో బ్లాక్ లో అమ్మేవారు కొన్నాళ్ళు. చీరాల నుండి రాజా రెడ్డిగారు, మండవ శ్రీరామమూర్తిగారు వాటిని తెప్పించి పంపేవారు. నెమ్మదిగా గేదెపాలు అలవాటు చేశాము. అత్తగారు, పనిమనుషుల సహాయంతో పెంచగలిగాము. నేను డ్యూటీకి వెళ్ళవలసి వచ్చింది గనుక. రెగ్యులర్ గా డాక్టర్ చెక్ అప్ చేయించేవాళ్ళం. ఆరోగ్యంగా ఆనందంగా, ఏ ట్రబుల్ లేకుండా చక్కగా పెరిగింది నవీన. రెండు సంవత్సరాలు నిండగానే ‘శిశువిహార్’ మోంటిసోరీ స్కూలుకు పంపించాము. ఆయా ఎత్తుకుని తీసుకెళ్ళేది స్కూలుకు. 20 రోజులు పోనని ఏడ్చింది. అంతమంది కొత్తవారి మధ్య ఉండటం నచ్చినట్లు లేదు. తరువాత అలవాటుపడింది. నవీన తమ్ముడు మరుసంవత్సరం జూన్ 26న (1966) పుట్టాడు. హైదరాబాద్ లో డా. లక్ష్మీదేశాయి హాస్పిటల్లో ప్రసవించాను. మొదటి కాన్పులో జరిగిన లోటు యిబ్బంది కలిగించింది. డాక్టరు శ్రద్ధగా వైద్యం చేశారు. మరొకసారి కాన్పు వస్తే ముందునుండే జాగ్రత్త వహించాలి అని ఆమె వార్నింగ్ యిచ్చారు. ఆ ప్రమాదం కొని తెచ్చుకోలేదు. ఆదివారం తెల్లవారుతుండగా బాబు పుట్టాడు. సన్నగా, పొడవుగా ఉన్నాడు. మేము నవీనకు ఈ కొత్త ప్రాణి గురించి సరైన అవగాహన యిచ్చినట్లు లేదు. నా పక్కలో పసివాడిని చూసి ఈర్ష్య కలిగినట్లున్నది. పరుగెత్తుకొచ్చి మంచం ఎక్కుతుంటే నా పక్కన పడుకుంటుందేమో అని చోటు చేసుకున్నాను. శరవేగంగా పసివాడి నెత్తిమొత్తి మంచం దిగిపోయింది. ఇక అప్పటి నుండి తమ్ముని గురించి చెపుతూ, వాడిని ముట్టుకోమని, అడించమని చెప్పటం వలన త్వరలో అలవాటు పడింది. ఇద్దరూ కలిసి పెరిగారు. తమ్ముడిని అన్నివేళలా ...ప్రొటెక్ట్.. చేయటం అలవాటు చేసుకుంది ఇప్పటికీ తానే ‘కస్టోడియన్’ తన బేబీ బ్రదర్ కి. మా అత్తగారు ‘రాజు’ అని బాబును పిలవటం మొదలెట్టారు. మామగారు ‘రాజయ్య’గారి పేరు మీదుగా అందరం రాజు అన్నాం, వేరే పేరు పెట్టలేదు. బలహీనంగా ఉండేవాడు. సరిగా పాలుతాగేవాడు కాదు. సీసాపాలంటే వెగటు అనిపించేది. రెండు స్పూన్లకు మించి తాగేవాడు కాదు ప్రతిసారీ. పెరుగుతుంటే భోజనం తినిపించటం గూడా బ్రహ్మప్రయత్నంగా ఉండేది. ఒక ముద్ద మింగాలంటేనే నేను ఎంతో మాట్లాడి, బతిమాలి, బామాలి, అది చూపించి, ఇది చూపించి చాలా శ్రమ తీసుకునేదాన్ని. ఎప్పుడూ ఏదో అనారోగ్యం సూచనలుండేవి. చెవిలో చీము రావటం, కాళ్ళకి కర్పాణి రావటం, వైద్యం అవసరమయ్యేది. పక్కనే డా. ఉమక్లినిక్ ఉండేది. ఆమె వైద్యం చేసేవారు. చక్కని వ్యక్తి. శ్రద్ధ చూపేవారు. తరువాత ఆమె అమెరికా వెళ్ళి సెటిల్ అయినట్లు తెలిసింది. మరల కలవలేకపోయాను. రాజు ముద్దుగా ఉండేవాడు. పసితనం ఫోటోలు చూస్తుంటే ఆనందం వేస్తుంది. ఇంటివాళ్ళ చిన్నమ్మాయి బీనా ఎప్పుడూ ఎత్తుకుని తిరిగేది. మిగతా వారెవరి దగ్గరకూ వెళ్ళేవాడు కాదు. అమ్మను అతుక్కుని ఉండేవాడు. నల్లటివారెవరైనా ఎత్తుకోబోతే ‘బేర్’మని ఏడ్చేవాడు. పనిమనిషి దగ్గరకు అసలు వెళ్ళేవాడు కాదు. చీరాల నుండి ఇన్నయ్య స్నేహితుడు వెలిది వెంకటేశ్వర్లు అప్పుడు హైదరాబాదులో ఉంటూ ఏదో చదువు పూర్తి చేస్తున్నాడు. రోజూ నేను స్కూలుకు వెళ్ళే వేళకు వచ్చి రాజును చూసుకునేవాడు. నేను సాయంత్రం వచ్చిన తరువాత, నా బిడ్డను నా కప్పచెప్పి రూముకెళ్ళపోయేవాడు. అతని రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. అందరం ‘వెలిది’ అనే పిలిచేవాళ్ళం. పిల్లలిద్దరు ‘అయ్ మామ’ అనేవారు. ఇప్పటికీ అలానే పిలుస్తారు. అతను టీచరుగా రిటైరయ్యాడు. మనవళ్ళు పుట్టారు. అయినా నా పిల్లలకి ఇప్పటీ ‘అయ్ మామే’ అతను. చిన్నప్పుడు రాజును నీకు ఎవరంటే ఇష్టం అని అడిగితే ముందు నా వంక చూచి, వెలిది ఉంటే అక్కడ అతని వైపు చూచేవాడు. రాజుకు నడక కంటే మాటలు ముందుకు వచ్చాయి. మొదట వాక్యాలతోనే ప్రారంభించి తరువాత పదాలలోకి దిగాడు. రాజు మాట్లాడిన మొదటి వాక్యం ‘నాన్నా’ ఎక్కడికి వెళుతున్నావు? ఇన్నయ్య ఉస్మానియాలో పార్టు టైము జాబ్ చేస్తున్నాడప్పుడు. పొద్దున్నే వెళుతుంటే రాజు అలా అడిగాడు. అప్పటి దాకా రాజు మాటలొచ్చని మాకు తెలియదు. అదిరిపోయాం. నమ్మశక్యంకానంతగా. అప్పటికి 10 నెలల వాడు. నడక తరవాత వచ్చింది. రాజు మొదటి సంవత్సరం పుట్టిన రోజుకి కొద్దిమంది స్నేహితులను డిన్నర్ కి పిలిచాం. పసివాడికి ఆరోజున విపరీతమైన జ్వరం వచ్చింది. చంకనెత్తుకునే వంట ముగించాను. డిన్నర్ ముగిసింది. మూసిన కన్ను తెరవకుండా బిడ్డ ఉన్నాడు. మరురోజుకి ‘మీజిల్స్’ బయట పడ్డాయి. రెండవ సంవత్సరంలో ఆరోగ్యం మెరుగయినట్లనిపించింది. అంత ఎక్కువ డాక్టరు విజిట్లు లేవు. ఇన్నయ్య కూతురంటేనే ఎక్కువ శ్రద్ధ చూపేవారు. రాజును ‘మమ్మీకా బచ్చా’ అనేవాడు. ఇప్పటికీ అలానే అంటాడు. రెండు సంవత్సరాలు నిండగానే రాజును శిశువిహార్ లో నర్సరీలో చేర్పించాము. ఏడ్చేవాడు కాదు గానీ మొదట్లో కళ్ళనిండా నీళ్ళు తిరిగేవి. ఆయా ఇద్దరినీ రిక్షాలో స్కూలుకు తీసుకెళ్ళి, తీసుకువచ్చేది. శ్రద్ధగా పిల్లలను చూసుకున్నది. కొద్దికాలమే ఆ స్కూలుకెళ్ళారు పిల్లలిద్దరూ. ఇల్లు మారాము, స్కూలు మారింది. రాజు పుట్టుక గురించి నాకొక గట్టి విశ్వాసం ఉన్నది. నేను, కనకమణి స్కూలు లైబ్రరీకి ఇంగ్లీషు పుస్తకాలు కొనటానికి ఒకనాడు ఆబిడ్స్ వెళ్లాము. పుస్తకాలు సెలక్షన్ అయ్యింది. లంచ్ చేద్దామని నిజాం కాలేజికెదురుగా ఉన్న ఓరియంట్ రెస్టారెంట్ కి వెళ్ళాము. పదార్ధాలు ఆర్డరిచ్చి మాట్లాడుకుంటున్నాము. నాలో అతిసన్నని కదలిక అనిపించింది. గర్భం సూచన అది అనిపించింది. భోజనం సహించలేదు. ఓరియంట్ రెస్టారెంట్ కి ఒక ప్రత్యేకత ఉండేది. ఎలీట్, విజ్ఞులు, మేథావులు సాయంత్రాలు అక్కడ చేరి అనేక విషయాలు చర్చించుకునేవారు. అలాంటి స్థలంలో కూర్చుని గర్భవతినయ్యాననే విషయం గ్రహించాను. బిడ్డ మేథావిగా పెరిగాడు. అది నా నమ్మకం. ఎవరితోనూ ఎప్పుడూ చెప్పలేదు నా విశ్వాసాన్ని గురించి. ఇన్నయ్యకు కూడా చెప్పలేదు. సెంటిమెంట్ అని ఎగతాళిగా కొట్టిపారేసి ఉండేవాడు. ఒకవేళ చెప్పి వుంటే నా నమ్మకం నాది. నా బిడ్డ గురించి నా విశ్వాసం నాది. కాని ఇప్పుడా రెస్టారెంట్ ఇరానీ చాయ్ దుకాణంగా మారింది. ఆ మేథావులతరంతోనే దాని వైభవం గతించింది. శైలజా వాళ్ళ యింట్లోనుంచి మారాం అద్దె ఎక్కువయిందని. వెనక బజార్లో ప్లీడరు రాజారెడ్డిగారి మేడమీద చిన్న ఇండిపెండెంట్ పోర్షన్ ఉంటే అక్కడికి మారాము. నవీన ఇంటివారితో కలిసిమెలిసి ఉండేది. మూడేళ్ళు వచ్చాయి తనకు. ఆ ఇంట్లో ఉండగానే సొంతంగా చదివి ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎ. ఇంగ్లీషు పరీక్ష రాశాను. బిడ్డలిద్దరినీ వదిలి వైజాగ్ పరీక్షల ముందు వెళ్ళాను. అమ్మను పిలిపించుకున్నాను. మా అత్తగారూ ఉన్నారు. వైజాగ్ లో కనకమణి అప్పటికే యూనివర్సిటీలో చేరి ఎం.ఎ.కి చదువుతున్నది. ఆమె బంధువు ప్రొఫెసర్ రామ్ మోహన్ యింటిలో తనతోపాటు నేను ఒక నెలరోజులు ఉన్నాను. కమల, రామ్ మోహన్ ఎంతో ఆదరించారు. వారి అమ్మాయి అమర పసిపిల్ల అప్పుడు. ఆ తరువాత వారికి ఒక అబ్బాయి పుట్టాడు. బిడ్డల మీద బెంగ ఉన్నా పట్టుదలగా పరీక్షలు రాసి క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకున్నాను. కాలేజీలో లెక్చరర్ గా వెళ్లే అర్హత సంపాయించుకున్నాను. నేను వైజాగ్ నుండి తిరిగి వస్తే రాజు ఒక్క క్షణం అలా నా వైపు చూచి పరుగెత్తి వచ్చి కాళ్ళకు చుట్టేసుకున్నాడు. ఆ స్పర్శలో బిడ్డ పడిన బెంగ అంతా గ్రహించాను. నవీన రాజు అక్కగా హుందాగా నన్ను చేరింది. ఎప్పుడూ మెచ్యూర్డ్ ప్రవర్తనే తనది. అమ్మ బిడ్డలను కనిపెట్టుకుని ఉన్న ఆ నెలరోజులు నాన్నకు భోజనానికి ఇబ్బంది కలిగింది. పండ్లు పాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది మూల్పురులో. నేను తిరిగి రాగానే అమ్మ తిరిగి మూల్పూరు వెళ్ళిపోయింది. అదే ఆఖరుసారి అమ్మ మా యింట్లో నెల ఉండటం. కొన్ని చికాకులు ఎదురైనా గుంభనగా సర్దుకున్నదని అమ్మ చెప్పకపోయినా నాకర్ధమయింది. మనవల మీద ప్రేమ ముందు చికాకులు లెక్కలోనివి కాదనుకున్నది అమ్మ. ఇంటి ఓనరు సుశీలమ్మ – చక్కని రంగు, రూపం, నెమ్మదస్తురాలు. ఒకరోజు కూరలబండి వస్తే చిన్న బుట్టలో కొంచెం పాలకూర, టమాటాలు కొని తీసుకెళుతూ నవీన ఆడుతూ కనిపిస్తే – సోనీ అమ్మకు చెప్పు కూరలబండి వచ్చిందని, తీసుకుంటుందేమో అన్నారట. సోనీ ఆమె బుట్టవైపు చూపిస్తూ మా అమ్మ అంత కొంచెం కొనదు. మార్కెట్ కెళ్ళి పెద్ద బుట్ట నిండా కొంటుంది అన్నదట. నేను కనిపిస్తే ఆమె నీ బిడ్డ అసాధ్యురాలు ఇలా అన్నది అని సంతోషంగా చెప్పారు. సుశీలమ్మకు తెలుగు సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి ఆట చూడటం చాలా సరదా. అంత రద్దీలో చూసి వచ్చేవారు. దగ్గరలోనే దీపక్ మహల్ థియేటర్ఉండేది. అందులో ‘లేతమనసులు’ సినిమా వస్తే ఇన్నయ్య పిల్లలిద్దర్నీ తీసుకుకెళ్ళాడు. వాళ్ళెందుకో రాము అంటే జమున నటి చాలా బాగుంటుంది. అని నచ్చజెప్పి తీసుకెళ్ళారు. సినిమా అయిపోయి తిరిగి వస్తుంటే నవీన ‘డాడీ – జమున బాగుంటుంది అని అన్నారు. మా అమ్మ చక్కని చీర కట్టుకుంటే యింకా బాగుంటుంది’ అన్నదట. ఎవరి తల్లి వారికి బాగుంటుంది కదా మరి! పిల్లలిద్దరూ ఇంగ్లీషు సినిమాలు ఇష్టపడేవారు. సుశీలమ్మగారి ఇంటి నుండి త్వరలోనే మారాము. ఎం.ఎల్.ఎ. (కొత్తవి) క్వార్టర్సుకి మారాము. కొల్లూరు కోటేశ్వరరావు టీచర్, ఎం.ఎల్.సి.గా ఎన్నికయ్యారు. ఇన్నయ్య సహాయం కోరారు. ప్రశ్నలు వేయటం, వేసిన ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెప్పాలి, మొదలైన విషయాలన్నిటిలో ఇన్నయ్య ఆయనకు బాగా తోడ్పడ్డాడు. ఆయన ‘తెలుగు విద్యార్ధి’ అనే మాసపత్రిక నడిపేవారు. అన్ని స్కూళ్ళల్లోను బాగా ప్రచారం పొందిన పేపరది. ఇన్నయ్య అనేక విషయాలమీద రెగ్యులర్ గా ఆ పత్రికకు వ్యాసాలు రాసేవాడు. కొన్ని పుస్తకాలు కూడా రాశాడు. తెలుగు విద్యార్ధి ప్రచురణలు అని పబ్లిష్ అయ్యాయి. క్వార్టర్స్ లో ఫ్రీగా ఉండేవాళ్ళం. సెమీ ఫర్నిష్డ్, రెండు బెడ్ రూంల క్వార్టరు, ఫోను సౌకర్యం ఉండేది. ఎం.ఎల్.సి. మాతోనే ఉండేవారు. ఆయనకిష్టమైన వంటలే చేసేదాన్ని - వెజిటేరియన్, సొంత అన్న అన్నట్లే చూసాను. క్వార్టర్ట్స్ లో పిల్లలకు రక్షణ ఉండేది. లాన్ లో ఆడుతూ ఉండేవారు. రాజు మూడేళ్ళవాడు మేమక్కడకెళ్ళినప్పుడు. ఇతర పిల్లలతో కలిసి లాన్ లో ఆడేవారు. నేను కిటికీలో నుండి మధ్యమధ్య గమనిస్తుండేదాన్ని. రాజు ముద్దుగా సుకుమారంగా ఉండేవాడు. ఆటమధ్యలో కాసేపటికొకసారి వచ్చి తలుపు కొట్టేవాడు. నేను తలుపు తెరిస్తే - అమ్మా ఏం చేస్తున్నావు అంటూ లోనకొచ్చేవాడు. నాతో ఎక్కువ అనుబంధం తనకు. నా యం.ఎ. రిజల్ట్స్ రాకుండానే ఒకటి రెండు ఇంటర్వ్యూల కెళ్ళాను ఇంగ్లీషు లెక్చరర్ పోస్ట్ కి అన్ వారుల్ - ఉలూం కాలేజీలో సెలెక్ట్ అయ్యాను. ప్రొ.శివ్.కె.కుమార్ ఇంటర్వ్వూ చేశారు. నాతోపాటు ఇంకా ఇద్దరు గూడా సెలెక్ట్ అయ్యారు - గోపాల్, శివ్ కుమార్, అనుకూలమైన రిజల్ట్ వస్తే (ఎం.ఎ.లో) వెంటనే జాయిన్ అవమన్నారు - ఆగస్టు ...ఆగస్టు ..68, మరుసటి వారంలో రిజల్ట్ రాగా - ఫలితాలు ప్రకటించిన పేపర్ చూపి జాయినం అయ్యాను. నారాయణ గూడా స్కూలుకి 3 నెలల నోటీసు యిచ్చే వ్యవధిలేక - రెజిగ్నేషన్ లెటర్ తో పాటు 3 నెలల జీతం తిరిగి ఇవ్వటానికి స్కూల్ కెళ్ళాను. నన్ను రిలీజ్ చెయ్యకుండా సెక్రటరీ నరసింహారెడ్డి చాలా ఇబ్బంది పెట్టారు. కాలేజి ప్రిన్స్ పాల్ కి లెటర్స్ రాశాడు నన్ను తీసేయమని. ప్రిన్స్ పాల్ విసిగిపోయి - ఆమె రూల్స్ ప్రకారం 3 నెలల జీతం ఇస్తున్నది. తీసుకుని ఆమెను రిలీజ్ చేయమని రాశారు. దానితో తప్పనిసరిగా రిలీజ్ చేశారు. అప్పుడు 3 నెలల జీతం తిరిగి ఇవ్వాలన్నా నాకు ఆర్ధికంగా ఇబ్బందే. అయినా రూలు రూలేగదా! తప్పదు. కస్తూరి ప్రసాద్ స్కూలు ప్రిన్సిపాల్. సెక్రటరీని ఆమె ఎదిరించలేకపోయారు నా విషయంలో న్యాయమని తెలిసినా. నేను అన్వరుల్ - ఉలూ కాలేజీలో సెలెక్ట్ అవటానికి, ప్రొ.ఆలంఖుంద్ మిరి సాహబ్ సహాయపడి ఉండవచ్చు. ఆయన ఇన్నయ్యకు ఫిలాసఫీలో గురువు. తరువాత కొలీగ్ మంచి స్నేహితుడయ్యారు. శివ్.కె.కుమార్ ఆయన మంచి స్నేహితులు ఉస్మానియా యూనివర్సిటీలో. కొన్నాళ్ళ టీచింగ్ తరువాత - ఆలం సాహెబ్ ఇన్నయ్యతో అన్నాటరట - కోమల మంచి టీచరుగా విద్యార్థుల మన్ననలు పొందుతున్నదని - తాను కొందరు విద్యార్థులు మాట్లాడుకుంటుంటే విన్నాను.. అన్నారట. దాన్ని బట్టి నా విషయంలో శివ్.కె.కుమార్ కి రికమండ్ చేశారేమో అనుకున్నాను. వారిప్పుడు లేరు. వారికి కృతజ్ఞతలు మనసులోనే తెలుపుకున్నాను. ఎం.ఎల్.ఎ. క్వార్టర్సు దగ్గరలో, రిడ్జ్ హోటల్ డౌన్ లో ‘బ్లూబెల్స్’ అని చిన్న స్కూలు నడుపుతున్నారు శ్రీమతి నజ్మా అహమద్. ఆమె ఇంగ్లండులో ట్రైనింగ్ అయ్యారు. కొద్దిమంది పిల్లలతో నాలుగవ తరగతి వరకూ నడుపుతున్నారు. నవీన, రాజును అక్కడ చేర్పించాము. అక్కడ విద్యావిధానం పిల్లలిద్దరికీ మంచి పునాది వేసింది. నజ్మా ప్రత్యేక శ్రద్ధ చూపారు. నా పిల్లలిద్దరిపట్ల అప్పుడప్పుడు యింటికి వచ్చి పిల్లల విషయం ముచ్చటించేవారు. ఇప్పటికీ నవీన, రాజు ఆమెను కలుస్తూ, తలుస్తూ ఉంటారు. వారి మనసుల మీద చెరగని ముద్రవేసారామె. ఆమె బిడ్డ షిరీనం గూడా వీళ్ళతోపాటే చదివింది. స్కూలుకు లంచ్ బాక్స్ లు పట్టుకుని ఆయా భూదేవి పిల్లల వెంట వెళ్ళేది. తిరిగి సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేది. నవీన భూదేవి అవసరం లేదు, నేను తమ్ముణ్ణి తీసుకెళ్ళగలను అంటుండేది. కాని జాగ్రత్తకోసం తనను వెంట పంపేదాన్ని. నవీన దృఢంగా, చక్కగా, చురుకుగా కనిపించేది. త్రోవలో చాలా మంది పలకరించేవారు. అందరూ ‘సోనీ’ అనే పిలిచేవారు. క్వార్టర్సులో సోనీ అందరికీ పరిచయమే. మేము సోనీ అమ్మ, నాన్నలమనే వారికి తెలుసు. మా పేర్లు బహుశ వారందరికీ తెలియకపోవచ్చు. ఆటల్లో తమ్ముణ్ణి జాగ్రత్తగా కాపాడేది. ఎవరూ నెట్టకూడదు, పడవేయకూడదు. ఒక లీడరులాగానే వ్యవహరించేది. పిల్లలంతా ఆమె లీడర్ షిప్ ను ఒప్పుకునేవారు. అక్కడొక చిన్న షాపు ఉండేది. కూల్ డ్రింక్స్, సిగరెట్లు, పాన్ లూ, సోడాలు అమ్ముతుండేవారు. ఒకసారి ఎవరో అతిథులొస్తున్నారని ఇన్నయ్య అక్కడ సోడాలు కూల్ డ్రింక్స్ కావాలని వెళితే షాపతను కుర్రాడితో ‘సోనమ్మ నాన్నగారు, ఇంటిదాకా వెళ్ళి సరుకు యిచ్చిరా’ అన్నాడట. ఎం.ఎల్.ఎ. క్వార్టర్స్ నుండి మారవలసి వచ్చినపుడు ఆదర్శనగర్ లో యిల్లు చూడటానికి వెళ్ళితే - ‘సోనీ నాన్నగారు ఇచ్చేద్దాం ఇల్లు అద్దెకు’ అన్నదట ఇంటివారి అమ్మాయి ఉమారాణి. అలా కూతురు పేరుతో చలామణీ అవుతున్నాం అని నవ్వుకునేవాళ్ళం. నవీనకు మనోహరి (సుబ్బరాజుగారి మనవరాలు), దుర్గాభవాని (భవనం వెంకట్రాంగారి అమ్మాయి) ఆటల్లో స్నేహితులు. మనోహరి అమెరికాలో ఉంటున్నది. దుర్గాభవాని గైనకాలజిస్ట్ గా హైదరాబాద్ లో వారి సొంత హాస్పిటల్ - సన్ షైన్ - లోనే పనిచేస్తున్నది. బ్లూబెల్స్ స్కూలుకెళ్ళిన మొదటినాడు నవీన ఇంటికి వచ్చిన తరువాత, మంచం మీద ఎగురుతూ ‘మై ఫాదర్ నేమ్ ఈజ్ ఇన్నయ్య, మై మదర్ నేమ్ ఈజ్ కోమల’ అంటూ వల్లెవేస్తున్నది. నేను ‘ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్’ అనాలి అని కరక్ట్ చేశాను. తనకు నా మీద నమ్మకం కలగలా. ‘అలా అంటావా, సరే డాడీని రానివ్వు అడుగుతాను’ అన్నది నేనెప్పుడూ ఇంట్లో పనులు చేయటం, వాళ్ళ అవసరాలు తీర్చటమే చూస్తున్నారు పిల్లలు. తండ్రి దగ్గర కూర్చోపెట్టుకుని షేక్స్ పియర్ నాటకాల కథలు, వార్తలు చదివి వినిపిస్తూ, సైన్స్ విషయాలు వారికి సులభంగా చెపుతూ ఉండేవాడు. అందువలన తండ్రి జ్ఞానం మీదే వారికి గురి ఉండటం సహజం. ఇక నేను వారి చదువుల విషయంలో ఆట్టే కలగజేసుకోలేదు. ఎప్పుడైనా హిందీలోగాని, ఇంగ్లీషులో గాని సందేహాలడిగినప్పుడే చెబుతుండేదాన్ని. ఇన్నయ్య వల్లనే పిల్లలకు సైన్స్ పట్ల అభిరుచి, పుస్తకాలు, వార్తాపత్రికలు చదవటం అలవడింది. మొదటి నుండి సెక్యులర్ భావాలతోనే పెరిగారు. ఇప్పటికీ అదే పంథాలో వెళుతున్నారు. కులంమతం పాటించలేదు, అందరం మానవులం అనే ధోరణే వారికి కల్పించాడు తండ్రి. బ్లూబెల్స్ లో చదువయిన తరువాత ఇద్దరూ ఆబిడ్స్ లోని గ్రామర్ స్కూల్లో చేరి 9వ వరకూ చదివారు. అక్కడ స్కూలు సంవత్సరం జనవరి నుండి డిసెంబరు వరకూ ఉండేది. నెలకు చెరి వంద ఫీజు, టరం ఫీజు, యూనిఫారాలు, షూలు, పుస్తకాలు ఖర్చు ఎక్కువే అప్పట్లో. వారికి ఏ లోటూ రాకుండా పెంచాలనేదే నా తాపత్రయం. రాజు పుస్తకాలు అంటే బాగా శ్రద్ధ చూపేవాడు. ఏమి కావాలి అని తండ్రి అడిగితే పుస్తకాలు తీసుకురండి డాడీ అనేవాడు. సామాజిక విషయాలమీద దృష్టి ఉండేది. 6, 7 క్లాసులలో ఉన్నప్పుడు తన దృష్టికి వచ్చిన విషయాల మీద పత్రికలకు ‘లెటర్స్ టు ది ఎడిటర్’ కాలంకి రాసేవాడు. తెలుగు అంటే ఇష్టపడేవాడు కాదు. ఇద్దరూ హిందీ సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నారు. తెలుగు బదులు స్పెషల్ ఇంగ్లీషు చదివారు. హిందీని ‘చపాతీ’ భాష అనేవాడు రాజు. ఇద్దరూ 9వ క్లాసు డిసెంబరులో ముగించి సొంతంగా చదివి ప్రిపేర్ అయి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చిలో రాశారు. ఇద్దరికీ వయసు చాలదంటే తహసీల్దారు వద్ద నుండి ఏజ్ కాండొనేషన్ సర్టిఫికెట్ తెచ్చుకొని పరీక్షలు రాశారు. కమలగారి అబ్బాయి రాజశేఖర్ రాజు క్లాస్ మేట్. అతను కూడా 10వ తరగతి రాజుతోనే పాసయ్యాడు. ఇద్దరూ పందెం పెట్టుకున్నారు. ఇంగ్లీషులో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళు రెండవవారికి జేమ్స్ బాండ్ సినిమాలన్నీ ఫ్రీగా చూపించాలి అని. రాజుకి ఎక్కువ మార్కులు రావటంతో పందెం ప్రకారమే నడుచుకున్నాడు. నవీన ఇంటర్మీడియేట్ లో సైన్స్ గ్రూపు తీసుకుని స్టాన్లీ జూనియర్ కాలేజీలో చదివింది. రాజు చైతన్య జూనియర్ కాలేజీలో చదివాడు. 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. ఆర్ట్స్ గ్రూపు తీసుకుని ఫీజు కట్టడానికి వెళితే ప్రిన్సిపాల్ శ్రీ సుందరరామయ్య సైన్స్ గాని మ్యాథ్స్ గ్రూపుగాని తీసుకుని చదవమని సలహా యిచ్చి, మరురోజు దాకా ఆలోచించుకుని ఫీజు కట్టమని పంపించివేసారు. ఆయన మాటకు మర్యాదనిచ్చి మరురోజుదాకా ఆగినా ఆర్ట్స్ గ్రూపులోనే చేరాడు. ఆర్ట్స్ చదువుతానని 8వ క్లాసులోనే నిర్ణయించుకున్నాడు. సైన్స్ లో ఫిగర్స్ డ్రా చేయటం ఇష్టం ఉండేది కాదు. చిన్నప్పుడు అక్కతో గీయించుకునేవాడు ఏమన్నా చేయవలసి వస్తే. ఇంటర్లో ఆనందీమేడం ఇంగ్లీషు టీచరుగా రాజు మీద మంచి ప్రభావం చూపారు. ఆర్.కె.నారాయణ్, పి.జి.వోద్ హౌస్ రచనలు ఆమె ప్రభావం వల్లనే అక్కడే చదివాడు. ఇద్దరూ ఇంటర్ మంచి మార్కులతో పాసయ్యారు. నవీన చిన్నప్పుడు- నా స్నేహితులు, చుట్టాలు ముద్దుకి `ఏమి చదువుతావు` అని అడిగితే ‘డాక్టర్నవుతా, అమెరికా పోతా’ అనేది. డాక్టరు చదవమని నేను అని ఉండవచ్చు కాని ‘అమెరికా పోతా’ అనడం నాకూ అర్ధమయ్యేది కాదు అప్పుడు. 16 ఏళ్ళు నిండలేదని మెడికల్ ఎంట్రన్స్ రాయటానికి అనుమతి దొరకలేదు. దిట్టంగా ఉంటాను, చీరకట్టుకొని పెద్దమనిషిలా అప్లికేషన్ తీసుకు వెళితే రాయనిస్తారు అని ఆశపడి అప్లికేషన్ తీసుకెళ్ళింది. అప్లికేషన్ రిసీవ్ చేసే వ్యక్తి అప్లికేషన్ లో వయసు వివరం చూసి - నెక్ట్స్ ఇయర్ బెటర్ లక్ అమ్మా! అని అప్లికేషన్ నిరాకరించాడని చిన్న ముఖం చేసుకుని తిరిగి వచ్చింది. వేసవిలో గుంటూరు వెళ్ళి స్పెషల్ ఎంట్రన్స్ కోచింగ్ తీసుకున్నది. తులశమ్మ, రాఘవరావుగారి యింట ఉండి చదివింది గుంటూరులో. సీతమ్మ అమ్మమ్మ శ్రద్ధగా వండి పెట్టింది. అందరూ ప్రేమగా చూశారు. తీరా ఎంట్రన్స్ పరీక్ష రేపనగా సడన్ గా ఎపెండిసైటిస్ ఆపరేషన్ చేయించవలసి వచ్చింది. డాక్టర్ను బ్రతిమాలింది - మందులివ్వండి నొప్పికి - పరీక్ష రాసిన వెంటనే ఆపరేషన్ చేయండి అని. మేము రిస్క్ తీసుకోదలచలేదు - ఆపరేషన్ చేయించివేశాము. బాగా డీలా పడింది. కానీ అదే సంవత్సరం నిజాం కాలేజీలో జెనెటిక్స్ తో మొదటి సంవత్సరం బి.ఎస్సీ చదువుతుండగా ఎక్చేంజ్ ప్రోగ్రాంలో గవర్నమెంటు నుండి బెంగుళూరు గవర్నమెంటు కాలేజీలో ఎం.బి.బి.ఎస్.లో సీటు దొరికింది. అక్కడ హాస్టల్లో ఉండి మెడిసిన్ చదివింది. ఇన్నయ్య మెడిసిన్ వద్దు, ప్యూర్ సైన్సెస్ చదివి, రిసర్చ్ ఫీల్డ్ ఎన్నుకోమని ఎంత చెప్పినా మెడిసినే చదవుతానని పట్టుపట్టింది. సీటు రావటానికి ఛీఫ్ మినిస్టరుగా శ్రీ భవనం వెంకట్రాం తోడ్పడగా, అప్పుడే ఛీఫ్ మినిస్టరయిన శ్రీ విజయ భాస్కర రెడ్డి అనుమతి పత్రంపై సంతకం చేశారు. వెంటనే బెంగుళూరు వెళ్ళి జాయిన్ అయింది. రాజు మరుసటి సంవత్సరం ఇంటర్ అయి నిజాం కాలేజీలో బి.ఎ. ఎకనమిక్స్ మెయిన్ తో చదివాడు. ఒకనాడు ఇ.ఎన్.టి. డాక్టరు టి.వి.కృష్ణ ఇంటికి వచ్చారు. రాజు పసిగా ఉన్నప్పుడు ఆయనే టాన్సిల్స్ ఆపరేషన్ చేశారు. రాజును ఏమి చదువుతున్నావయ్యా అని అడిగారాయన. బి.ఎ. అన్నాడు. అదేమిటి ఇంజనీరింగో, మెడిసినో చదవక బి.ఎ. ఏమిటి? అన్నారాయన. ‘నేను అదే చదవాలనుకున్నాను, అదే చదువుతున్నాను’ అన్నాడు రాజు నిక్కచ్చిగా. రాజు ఇంటర్ చదివేటప్పుడు జస్టిస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఆటోబ్రయోగ్రఫీ రాసి చదివి ఎలా ఉందో చెప్పమన్నారు రాజును. చదివి - ‘మీరు బెట్ర్నాండ్ రసెల్ అని అనుకుంటున్నారా, ఈసోది అంతా ఎవరు చదువుతారు, కొన్ని వివరాలు తొలగించండి’ అని మార్జిన్ లో ఎక్కడెక్కడ తగ్గించాలో సూచించాడు. ఆయన పిల్లకాకి అని కొట్టిపడవేయకుండా రాజు సూచనలు పాటించారు. అలాగే నార్లగారి రచనలో రాజు సలహాలిచ్చాడు. ఇద్దరు విజ్ఞులూ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు తమరచనల్లో. బలహీనంగా ఉండేవాడు. తినే విషయంలో ఎప్పుడూ పేచీయే. తినమంటే విసుక్కునేవాడు చిన్నప్పుడు - అసలెందుకు తినాలమ్మా అని ప్రశ్నించాడు నన్ను. తింటే బలంవస్తుంది. పెద్దవాడిగా పెరుగుతావు. అని నాకు తోచిన మాటలు చెప్పాను. ఒకసారి ఏదివిన్నా మనసుకి హత్తుకుపోతుంది తనకు. ఏకసంతాగ్రాహి. ఎం.ఎల్.ఎ. క్వార్టర్సులో కింది భాగంలో ఎం.ఎల్.ఎ. జి.రాజారాంగారి కుటుంబం ఉండేది (తరవాత మినిస్టరయ్యాడాయన). వారి తల్లి మరణించింది అప్పుడు. ఎందుకు చనిపోయింది అని పసివాడు రాజు నన్ను ప్రశ్నించాడు. పెద్దామె అయింది. పెద్దవయసు వలన మృతి చెందింది అని చెప్పాను. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లో ఒకనాడు రాజు సడన్ గా నన్ను ప్రశ్నించాడు - ‘అమ్మా నీవు చిన్నప్పుడు 6 దోసెలు, నాలుగు ఇడ్లీలు తిని, చాలా గ్లాసుల పాలు తాగేదానివా?’ అని నాకు అయోమయంగా అనిపించినా ‘లేదు నాన్నా మామూలుగా తినేదాన్ని. అయినా ఎందుకలా అడుగుతున్నావు’ అన్నాను. తింటే బలం వస్తుంది, పెద్దవాళ్ళవుతారు అన్నావు. కింద ముసలమ్మగారు పెద్దగా అయి చనిపోయింది కదా! నీవు అలా పెద్దగా కావద్దు. మాకు నువ్వు కావాలమ్మా, చనిపోకూడదు అన్నాడు. బిడ్డ గొంతులో భయం చారలు నన్ను కలవరపెట్టాయి. సర్ది, బుజ్జగించి మరిపించవలసి వచ్చింది. క్వార్టర్సులో ఉన్నప్పుడు రాజు గురించి రెండు విషయాలు నేను ప్రస్తావించాలి. గ్యాస్ సిలిండర్ (అ రోజుల్లో ఒకటే ఉండేది) అయిపోయింది. ఫోన్ చేస్తే నాలుగు రోజుల్లో ఇస్తామన్నారు. ‘అయ్యో బంధువులు కూడా ఉన్నారు, కిరోసిన్ కూడా అయిపోయినట్లున్నది, ఎలాగా?’ అని పైకే అన్నాను. అది విన్నాడు రాజు బడికి బయలుదేరుతూ. ఆయా తలుపు తెరిచి వారిని లోనకు పంపించి వెళ్ళిపోయింది. రాజు ఖాళీ కిరోసిన్ డబ్బా తీసుకుని అక్కడ జార్ లో డబ్బుంటే తీసుకుని దగ్గరలో ఉన్న కిరణాషాపుకెళ్ళి డబ్బా నిండా కిరోసిన్ పోయించుకుని మోయలేక గుండెలకు డబ్బాని అదిమి పెట్టి నెమ్మదిగా నడుస్తూ రావటం అప్పుడే ఇల్లు చేరుతున్న నాకు కనిపించింది. పరుగెత్తి డబ్బా తీసుకున్నాను. హృదయం ద్రవించి కంట నీరొచ్చింది. బిడ్డ తీసుకున్న శ్రద్ధ చూసి. మరొకసారి సాయంత్రం కూరలు కొనటానికి వెళుతూ చిన్నక్క కొడుకు నరేంద్రతో కిరోసిన్ పొయ్యిమీద కుక్కర్ ఉంది, మూడు విజిల్స్ రాగానే దించమని చెప్పాను. నరేంద్ర ఏదో కథ చదువుతూ మూడు విజిల్స్ వచ్చినా పట్టించుకోలేదు. పసితండ్రి రాజు నేను చెప్పటం విన్నాడు కాబోలు వెళ్ళి కుక్కర్ దించాడు. బరువుకి కింద పెడుతుంటే పెద్ద శబ్దం రాగా నరేంద్రకు స్పృహ వచ్చి వెళ్ళి చూసాడు. నేను తిరిగి రాగానే నాకా సంగతి చెప్పాడు. గుండె గుభేలుమన్నది. ఇంకానయం హ్యాండిల్స్ పట్టుకొని దించాడు. కుక్కర్ మీద చేతులు పెట్టకుండా. చాలా భయం వేసింది. ఎం.ఎల్.ఎ. క్వార్టర్సులో హోలీ పండుగ నాడు గుండెలు పిండే సంఘటన జరిగింది. అక్కడ నేపాలీ గూర్ఖా పండుగ ఇనాం అంటూ వస్తే రాజుతోటే డబ్బు ఇప్పించానతనికి. అతనికి అప్పుడే దుర్మార్గపు ఆలోచన వచ్చినట్లున్నది. బయట ఆడుకుంటున్న రాజును కిడ్ నాప్ చేసి తన క్వార్టర్సులో బంధించి ఉంచాడు. పసివాడు సొమ్మసిల్లి భయపడి నిద్రపోయాడు. భోజనం వేళకి పిలుద్దామని వెళితే రాజు ఎక్కడా కనిపించలేదు. తోటి పిల్లలు, చూడలేదన్నారు. గుండెలవిసిపోయాయి. క్వార్టర్సు, నౌబత్ పహాడ్ అన్నీ గాలించాము. బిడ్డ ఆచూకీ దొరకలేదు. పోలీసు కమీషనరు పర్వతనేని కోటేశ్వరరావుగారికి తెలపగా అన్ని పోలీసు స్టేషన్లనీ ఎలర్ట్ చేసి సర్చ్ ఆర్డరిచ్చాడు. సాయంత్రం అవుతుండగా, రాజు నడిచి రావటం చూసిన పిల్లలు ‘రాజు వస్తున్నాడు, రాజు వస్తున్నాడు’ అని అరిచారు. బిడ్డ అలసి, సొలసి మౌనంగా వచ్చాడు. గూర్ఖా తన రూమ్ కి తీసుకెళ్లి, పదిపైసలు చేతిలో పెట్టాడు. బల్ల మీద కూర్చోబెట్టాడు. నిద్రపోయాను అని చెప్పాడు. గూర్ఖా భార్య ఎక్కడ నుండో ఇంటికి తిరిగి వచ్చి, పరిస్థితి తెలుసుకుని రాజుని విడిపించిందట. మనకీ పిల్లలున్నారు, దుర్మార్గపు ఆలోచన మంచిది కాదని భర్తకు చివాట్లు పెట్టిందట. ఏది ఏమైనా మా బిడ్డ మాకు దక్కాడు. గూర్ఖాను జైల్లో వేయవద్దని కోటేశ్వరరావుగారిని కోరాము. పర్వతనేని కోటేశ్వరరావుగారు నిజాయితీ ఉట్టిపడే పోలీసు ఆఫీసరు. రాజుకు ఆయన్ను యూనిఫారంలో చూడటం ఇష్టంగా ఉండేది. అంకుల్ మా యింటికి యూనిఫారంలోనే రండి! అని రిక్వెస్ట్ చేసేవాడు. ఆయనంటే ఎంతో గౌరవం రాజుకు. ఆయన ఎవార్డు తీసుకుంటుంటే ఆగస్టు 15వ తేదీన పెరేడ్ గ్రౌండ్స్ కి వెళ్ళి, ఆయనతో ఫోటో దిగాడు. తన బర్తడేకని పోలీసు యూనిఫాం కొనిపించుకున్నాడు నాచేత. కాని తీరా పుట్టినరోజు నాటికి ఆటలో పడి మోచేయి ఫ్రాక్చరు అయినందువలన పట్టీ ఉండటం మూలాన యూనిఫాం తొడుక్కోలేకపోయాడు. కోటేశ్వరరావుగారి భార్య రవికుమారి పిల్లలు సుధీర్, పద్మ మాకు బాగా దగ్గరయ్యారు. రిటైరైన కొద్దికాలంలోనే కోటేశ్వరరావుగారు మృత్యువాత పడటం మమ్మల్ని బాధించింది. రాజు బి.ఎ. అయిన తరువాత ఐ.ఎ.ఎఫ్. చేయమన్నాను. చేయగలను, ఫస్ట్ ఛాన్స్ లో క్లియర్ చేయగలను కాని చేయను అన్నాడు. గవర్నమెంటు అనుకూలంగా లేకపోతే తీసుకెళ్లి లూప్ లైన్ లో పడవేస్తారు. అలాంటి ఉద్యోగం నాకొద్దు అన్నాడు రాజు. ఏదైనా పుస్తకం చదవ మొదలెడితే అది పూర్తి అయ్యేదాకా భోజనానికీ, స్నానానికి లేచేవాడు కాదు. అసలు పిలిచినా వినిపించుకునేవాడు కాదు. సరిగ్గా తినకపోవడం, బలహీనంగా ఉండటం ఆయన జన్మహక్కులా ఉండేది ఆరోజుల్లో. జస్టిస్ జగన్ మోహనరెడ్డిగారు ఉస్మానియా వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు ఇన్నయ్యకు బాగా సన్నిహితులయ్యారు. ఇంటికి పిలిచి అనేక విషయాలు ఇన్నయ్యతో చర్చించేవారు. ఇన్నయ్య అప్పటికే ఎం.ఎన్.రాయ్ గ్రంథాలన్నీ తెలుగులోకి అనువదించి ఉన్నాడు. జగన్ మోహన్ రెడ్డిగారు రాసిన - మైనారిటీస్ అండ్ ది కాన్స్టిట్యూషన్, అవర్ గవర్నర్స్, లా అండ్ సొసైటీ, ది యూనివర్సిటీ ఐ సర్వ్డ్ అనే పుస్తకాలను ఇన్నయ్యతో తెలుగులోకి అనువాదం చేయించుకున్నారు. ఇన్నయ్యకు తెలుగులో అనేక గ్రంథాలు రాసిన అనుభవం ఉన్నది. అందువలననే జగన్మోహనరెడ్డిగారికి సహాయపడగలిగాడు. ఇన్నయ్య పాల్ కర్జ్, రిచర్డ్ డాకిన్స్, శామ్ హారిస్, క్రిస్టోఫర్ హిచిన్స్ వంటి రచయితల పుస్తకాలు తెలుగించాడు. నార్లగారి ‘ది ట్రూత్ ఎబౌట్ గీతా’ తెలుగు చేశాడు. చెప్పాలంటే ఇంకా పెద్ద లిస్టే అవుతుంది. మచ్చుకి కొన్ని ప్రస్తావించాను. నన్ను రచయితను చేయాలని ఎంతో ప్రయత్నించాడు. కొన్ని అనువాదాలు చేసినా రాయటం నాకంత సులభంగా అబ్బలేదు. తనేవిషయమైనా సులభశైలిలో చక్కగా రాయగలడు. తను 10వ క్లాసు చదివేనాటి నుండి అనేక పత్రికలకు రాసిన అనుభవం ఉంది. శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారు ప్రముఖ పాత్రికేయులు, బహుముఖ ప్రజ్ఞాశాలి. జర్నలిజంలో ప్రత్యేక వరవడి తెచ్చినవారాయన. అనేక గ్రంథాలు రచించిన మేథావి. ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా జర్నలిజంలో ఎన్నో ప్రక్రియలు ప్రవేశపెట్టినవారు. ఆయన సంపాదకీయాలు చదవటానికే పేపరు కొనేవాళ్ళు అనేకులు. నార్లగారితో ఇన్నయ్యకు సన్నిహితత్వం ఏర్పడింది. ఎక్కువగా వారిల్లు ‘లుంబిని’ (బంజారా హిల్స్)లో ఇద్దరూ కూర్చుని అనేక విషయాలు చర్చించేవారు. వారి కోరిక మీదట ఇన్నయ్య కొంతకాలం ఆంధ్రజ్యోతి హైదరాబాద్ బ్యూరోలో పనిచేశాడు. నార్లగారు పేపరు నుండి వైదొలగినప్పుడు ఇన్నయ్య ఉద్యోగం నుండి విరమించుకున్నడు. నార్లగారింటికి నేను గూడా అప్పుడప్పుడు ఇన్నయ్యతో కలిసి వెడుతుండేదాన్ని. వారి శ్రీమతి సులోచన మంచి ‘హోస్ట్’ వేడిగా తినమని పట్టుబట్టేవారు. నార్ల, ఇన్నయ్య మాట్లాడుకుంటుంటే నేను వింటూ ఉండేదాన్ని. వారి లైబ్రరీ 20వేల పుస్తకాలకు పై చిలుకు కలది. ‘వాల్ టు వాల్’ అలమేరాలలో క్రమంగా పుస్తకాలు సర్దబడి ఉండేవి. పుస్తకాలు, అనేక కళాఖండాలు కొనటం నార్లవారి అభిరుచి. సులోచనగారు ఎక్కువ చదువుకోకపోయినా ఆ పుస్తకాలను ఎంతో శ్రద్ధగా చూసుకున్నారు. నార్లగారు ఫలానా చోట ఫలానా పుస్తకం తెమ్మంటే ఆమె వెంటనే తెచ్చి యిచ్చేవారు. నార్లగారి అనంతరం ఆయన లైబ్రరీ అంతా ఓపెన్ యూనివర్సిటీకి బహూకరించబడింది. ఆదివారాలు ఇన్నయ్యను వెంటబెట్టుకొని సుల్తాన్ బజారులో రోడ్డు పక్కన పెట్టి అమ్మే పుస్తకాలు చూడటానికి వెళ్ళేవారు. నచ్చినవి కొనేవారు. ఏ పుస్తకమైనా తమ వద్ద ఎక్స్ ట్రా ఉంటే ఇన్నయ్యకిచ్చేవారు. మా పిల్లలకు కూడా రకరకాల పెన్నులు బహూకరించేవారు. చివరలో రైటింగ్ డెస్క్, టైప్ రైటరూ రాజుకి బహూకరించారు. అంతటి మేథావులతో పరిచయం నాకు గర్వకారణం. వారి అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ డాక్టర్లు - కోడళ్ళు, అల్లుళ్ళు కూడా. అందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. పెద్దమ్మాయి శారద తప్ప. రమ, మీనాక్షితో నాకు బాగా పరిచయం. ఇప్పటికీ టచ్ లో ఉన్నాము. నార్లగారు తమ ‘నరకంలో హరిశ్చంద్ర’ నాటకం ఇన్నయ్యకు అంకితమిచ్చారు. అదే వారి ఆఖరి రచన. రాజు నిజాం కాలేజీలో డిగ్రీ ముగించి ఇర్మా, ఆనంద్ (గుజరాత్) హరియన్ ఇన్స్టిట్యూట్ లో రెండేళ్ళు మేనేజ్ మెంట్ కోర్సు చేశాడు. వాళ్ళు స్కాలర్ షిప్ ఇచ్చారు. అది సరిపోయిందో లేదో గాని మమ్మల్ని ఎప్పుడూ డబ్బు అడగలేదు. బిడ్డే అన్నీ సర్దుకున్నాడు. ఎక్కడ చదివినా ఫస్ట్ రావలసిందే. ఇర్మాలో మాథ్స్ ఎక్కువగా ఉన్న కోర్సది. బిడ్డ చాలా కష్టపడవలసి వచ్చింది మొదట్లో. కాని సాధించి కోర్సులో ఫస్ట్ నిలిచాడు. ‘అమ్మా, ఫస్ట్ వస్తున్నానని నీవు బాగా సంతోషిస్తావు. అలా జీవితాంతం శ్రమపడితేనే అన్ని రంగాలలో ‘ఫస్ట్’ ను నిలుపుకోగలను’ అన్నాడు. అలానే నిలుపుకున్నాడు చేసిన ప్రతి పనిలో. ఇప్పటికీ అదే ప్రతిభ చూపుతున్నాడు తన పనిలో. ఇర్మాల్ కేంపస్ ప్లేస్ మెంట్ లో ఎ.పి.డి.డి.సి వారు సెలెక్ట్ చేసి అహమ్మదాబాద్ బ్రాంచ్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఆ ఉద్యోగం నిర్వహించటంలో తనకున్న ప్రతిభావ్యుత్పత్తులు చాటుకునే అవకాశం తక్కువగా ఉన్నదని గ్రహించిన రాజు అనతికాలంలోనే రాజీనామా సమర్పించి ఢిల్లీలో టైమ్స్ ఆఫ్ ఇండియా వారు నడిపే సోషల్ జర్నలిజం చదవటానికి వెళ్ళాడు. తన క్లాసుమేట్, స్నేహితుడు ప్రవీణ్ అగర్వాల్ ఢిల్లీలో ఎ.పి.డి.డి.సి. బ్రాంచ్ లో ఉద్యోగిగా ఉన్నాడు. అతను హైదరాబాద్ బ్రాంచ్ లో ఉన్నప్పుడు మా యింట్లోనే చాలా కాలం ఉన్నాడు. ఢిల్లీలో రాజును తనతో ఉండమని పట్టుబట్టాడు. అతని తల్లి, సోదరి నీరూ రాజును ప్రేమగా చూసుకున్నారు. జర్నలిజంలో రాజు గురువులు ప్రొ.నైనన్, ప్రొ. ఊమన్ రాజులోని ప్రతిభను గుర్తించారు. రాజుకు జర్నలిజంలో మంచి భవిష్యత్తు ఉన్నదని చెప్పిన వారు వాళ్ళిద్దరూ. చదువు అవగానే రాజుకు ‘ది ఎకనామిక్ టైమ్స్’లో ఉద్యోగమయింది. అనతి కాలంలోనే రాజును ఎసైన్ మెంట్ మీద జర్మనీ పంపిచారు ఒక నెల రోజులు. అప్పుడు రాజు తనకున్న తెలివి తేటలకు, శక్తి సామర్ధ్యాలకు బయట ప్రపంచంలో పనిచేయటం ఉత్తమం అని తెలుసుకున్నాడు. తిరిగి వచ్చిన తరువాత టోఫెల్, జి.ఆర్.ఇ. పరీక్షలు రాశాడు. టోఫెల్ పరీక్షలో సెంట్ పర్సెంట్ మార్కులతో పాసయ్యాడు. నవీన మెడిసిన్ పూర్తవుతుండగా హేమంత్ తో వివాహం జరిగింది. అతను నిజాం కాలేజి గ్రాడ్యుయేట్. ఇండియన్ ఎంబసీ, వాషింగ్టన్ లో ఉద్యోగిగా ఉన్నాడు. అతను ప్రపోజ్ చేసిన మీదట నవీన ఇష్టపడింది. అతను సెలవులకు హైదరాబాద్ వచ్చి ఉన్నాడు. ఇన్నయ్యకు ఆ పెండ్లికి అభ్యంతరం లేకపోయింది. జనవరి 12, 1988న రిజిస్టర్ వివాహం జరిగింది. జూబ్లీహిల్స్ క్లబ్ లో డిన్నర్ ఇచ్చాము. వ్యవధి లేకపోవటాన నా వాళ్ళంతా ఊళ్ళ నుండి రాలేకపోయారు. అన్నయ్య పిల్లలు, కొద్దిమంది లోకల్ గా ఉన్న స్నేహితులు అటెండ్ అయ్యారు డిన్నర్ కి, కమల గారి కుటుంబం అంతా మా వెంట ఉన్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ లో ఆలపాటి సచ్ దేవ్ ఇన్ ఛార్జి. (కేటరింగ్)గా ఉండి డిన్నర్ కు చక్కని ఏర్పాట్లు చేశాడు. హేమంత్ తరఫున చాలామంది డిన్నర్ కి వచ్చారు. అది మతాంతర వివాహం. బెంగుళూరు నుండి నవీన స్నేహితులు పెండ్లికి వచ్చారు. పెద్ద ఆర్భాటం లేకుండా పెండ్లి జరిగింది. జనవరి 16న హేమంత్ తిరిగి వాషింగ్టన్ వెళ్ళిపోయాడు. నవీన హౌవుస్ సర్జన్సీ ముగించి అదే సంవత్సరం డిసెంబరు 10న వాషింగ్టన్ వెళ్ళింది. డిప్లమాటిక్ వీసా గనుక, వర్క్ పర్మిట్ గూడా లభించింది. నవీన, హేమంత్ చిన్న అపార్ట్ మెంట్ కొనుక్కుని సహజీవనం ప్రారంభించారు. నవీన ఒక హాస్పిటల్లో తెల్లవారగట్ల ఐదు గంటలకు వెళ్ళి కొన్ని గంటలు పనిచేసింది. తరువాత ఐ.సి.ఎఫ్.ఎం.జి. పరీక్ష తయారీకి కేప్ లాన్ కోచింగ్ సెంటర్ లో చదివేది. కోచింగ్ ఫీజు, పరీక్ష ఫీజులు భారీగా ఉండటాన ఇద్దరూ కష్టపడి పనిచేశారు. హేమంత్ అదనంగా పని చేపట్టాడు. అప్పుడు నవీన యింకా డ్రయివింగ్ చేయలేకపోటాన హేమంత్ కారులో దించటం, లేక బస్ పట్టుకుని ప్రయాణాలు సాగించేది నవీన. పాసయిన తరువాత డి.సి.జనరల్ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ లో రెసిడెన్సీ దొరికింది. కొంతకాలం మెడిసిన్ చేసిన తరువాత సైకియాట్రీ వైపు మొగ్గు చూపి నాలుగేళ్లు అడల్ట్ సైకియాట్రీ, రెండేళ్ళు సూపర్ స్పెషాలిటీ - ఛైల్డ్ సైకియాట్రీ ముగించింది. కొంతకాలం డా. డెవాస్కిన్, డా. జోషీలతో కలిసి పనిచేసి తన సొంత ప్రాక్టీసు ప్రారంభించింది. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తుంది గనుక సత్ఫలితాలు సాధించగలుగుతున్నది. రాజు ప్రతిభకు తగిన దేశం అమెరికా అని, రాజును రమ్మని వత్తిడి చేసింది. జర్మనీ చూసి తిరిగి వెళ్ళిన రాజు అమెరికా పోవడానికి సిద్ధమయ్యాడు. ఇండియానా యూనివర్సిటీ, బ్లూమింగ్టన్ లో బిజినెస్ జర్నలిజంలో చేరి చదివాడు ఎం.ఎస్. ఇంటర్న్ గా, వాల్ స్ట్రీట్ జర్నల్ లో పనిచేసిన మొదటి రోజే తన ప్రతిభ చాటుకున్నాడు. తను రాసిన ఆర్టికల్ ఫ్రంట్ పేజీలో మొదటి రోజే అచ్చయింది. సీనియర్ స్టాఫ్ రాజును అభినందించారు. అలా మొదటి రోజే తన ఆర్టికల్ ఫ్రంట్ పేజీలో రావటం విశేషమని వారు రాజును కొనియాడారు. కోర్సు అవుతుండగానే డేటన్ డెయిలీ న్యూస్ పేపర్ లో ఉద్యోగం ఖాయమయింది. ఎడిటర్ గ్రెగ్ ష్రీహార్ టెక్ రాజు పనితనాన్ని ఎంతో మెచ్చుకున్నారు. రాజుకు ది వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఉద్యోగం వచ్చినప్పుడు గ్రెగ్ ఇష్టం లేకుండానే రాజును వదులుకోవలసి వచ్చింది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంటర్నేషనల్ పత్రిక. అందులో ఉద్యోగం రాజు ప్రతిభకు గీటురాయి అని గ్రెగ్ భావించాడు. రాజు మొదట పిట్స్ బర్గ్ బ్యూరోలో కొన్నాళ్ళు పనిచేసి న్యూయార్క్ మెయిన్ ఆఫీసుకు మారాడు. తనతో పనిచేస్తున్న కిమ్ బ్యారింగ్టన్ ను 1994 అక్టోబర్ 8న వివాహమాడాడు. అది అంతర్జాతీయ వివాహం. గ్రీన్ కార్డు అంతకుముందే రాజుకు వచ్చింది. నవీన కొడుకు రోహిత్ మా ముద్దుల మనవడు. 1994 మే 11న జన్మించాడు. వాషింగ్టన్ లో జరిగిన రాజు మామ పెండ్లికి పసివాడు రోహిత్ హాజరయ్యాడు తన 5 నెలల వయసులో. రాజు రెగ్యులర్ గా ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’కి ఆర్టికల్స్ రాసేవాడు. ఒక్కొక్కరోజు రెండు ఆర్టికల్స్ కూడా తనవి ప్రచురించేవారు. సీనియర్ జర్నలిస్ట్ లు ‘రాజా నీవు ఈ కొద్ది కాలంలో రాసినంత మేము 10 సంవత్సరాల ఉద్యోగ కాలంలో కూడా రాయలేదు పత్రికకి’ అని రాజును మెచ్చుకున్నారు. ఎక్కడ పనిచేసినా తన శక్తి సామర్ధ్యాలు చాటుకుని తనదైన ముద్ర వేయటం రాజుకు అతి సహజంగా అనిపించినా చూసేవారికి ఎంతో గొప్పగా అనిపించి మెచ్చుకునేవారు. అంతటి ప్రతిభ చూపగలగటం మామూలు విషయం కాదుగదా! నవీన ప్రసవించక ముందే నేను, ఇన్నయ్య తన దగ్గరకు చేరాము. 1992లో మొదటిసారి నవీన దగ్గర 6 నెలలు ఉండి వాషింగ్టన్ అంతా చూసాము. రాజు దగ్గరకు డేటన్ వెళ్ళి నెలరోజులున్నాము. బూమింగ్టన్ తీసుకెళ్ళి తాను చదివిన యూనివర్సిటీ చూపాడు. 1994 ఫిబ్రవరిలో నవీన దగ్గరకెళ్ళాము. మే 11న బాబు పుట్టాడు. చూడచక్కని పసివాడు. రోహిత్ జాషువా, జాష్ అంటారు అందరూ. నేను, ఇన్నయ్య, రాజు రోహిత్ అనే పిలుస్తాము. పసివాణ్ణి పెంచటంలో ఎంతో ఆనందం అనుభవించాము నేను, ఇన్నయ్య. ఏడవటం, విసిగించటం అనేవి ఏమీ లేకుండా ఎంతో హాయిగా నవ్వుతూ పెరిగాడు రోహిత్. ప్రతిక్షణం మేము ఆనందించాము. బిడ్డను పెంచనిచ్చినందుకు నవీన, హేమంత్ లకు కృతజ్ఞతలు తెలిపాము. మధ్య మధ్య ఇండియా కొద్దికాలం మేమిద్దరం వచ్చినా రోహిత్ కి 6 ఏళ్ళు వచ్చేదాకా ఎక్కువ కాలం నవీనతోనే ఉన్నాము. రోహిత్ పసితనంలోనే చదువు పట్ల శ్రద్ధ చూపేవాడు. రెండు సంవత్సరాలకే అక్షరాలు, అంకెలు రాయటం నేర్చుకున్నాడు. లైబ్రరీ నుండి కథల పుస్తకాలు తెచ్చి చదివేవాళ్ళం. విన్న కథ పొల్లుపోకుండా తిరిగి మాకు చెప్పేవాడు. వాళ్ళమ్మ పని వత్తిడితో పగలంతా బిజీగా ఉండేది. పసివాడి ముద్దుముచ్చట చెపుతుంటే తాను మిస్ అవుతున్నాననుకునేది. తనకు రెస్ట్ ఇవ్వాలని రాత్రి కూడా రోహిత్ ని నా దగ్గరే పడుకోబెట్టుకునేదాన్ని. అందుకే మాతో ఎక్కువ అనుబంధం రోహిత్ కి. తాత సెక్యులర్ భావాలు పసివాడికి అబ్బాయి. సైన్స్ పట్ల అభిరుచి తాతవల్లనే కలిగింది రోహిత్ కి. అదే బాటలో ఆలోచించి నడుచుకుంటున్నాడు. ఇప్పుడు కాలేజ్ చదువుల్లో ఉన్నాడు. మమ్మల్నిద్దర్నీ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు. తల్లికి ఆశాకిరణం ఆ బిడ్డ. అన్ని హంగులూ అడగకుండానే సమకూరుస్తుంది బిడ్డకు. రాహుల్ రెండవ బిడ్డ నవీనకి. ఇద్దరి మధ్య 6 సంవత్సరాలు తేడా. అన్ని విషయాలలోనూ రాహుల్ రోహిత్ కంటే తేడాగానే ఉన్నాడు. రంగు, రూపంతో సహా. నాకు ఎడమ కాలు రీప్లేస్ మెంట్ అయి సర్జరీ ఫెయిల్ అవటాన నేను రాహుల్ 20 రోజుల పిల్లవాడుగా ఉన్నప్పుడు జబ్బుపడి ఇండియా వెళ్ళిపోయాను. రాహుల్ ని పెంచటంలో ఏ విధంగానూ నేను నవీనకు తోడ్పడలేకపోయాను. రకరకాల వ్యక్తులు, బేబీ సిట్టర్ లు ఉండి కూడా నవీనకు ఎక్కువ తోడ్పడలేదు రాహుల్ ను పెంచటంలో. తానే ఎక్కువ కష్టపడవలసి వచ్చింది. మేము పెంచకపోవటాన రాహుల్ కి మాతో అంత సన్నిహితత్వం ఏర్పడలేదు. నవీనే అటు ఉద్యోగ ధర్మం, ఇటు ఇంటి విషయాలు, పిల్లల పెంపకం అన్నీ తానై నిర్వహించుకుంటున్నది. రాహుల్ ఇప్పుడు 8వ స్టాండర్డ్ చదువుతున్నాడు. కూచిపూడి డాన్స్, లక్ష్మీబాబు దగ్గర నేర్చుకుంటున్నాడు. ఇష్టం ఉండటాన త్వరగా నేర్చుకోగలుగుతున్నాడు. ఇది 2013 నాటి ముచ్చట. పిల్లలిద్దరూ ఓల్నీ ఇంట్లో ఉండగా పుట్టారు. పదేళ్ళుగా బ్రూక్ విల్ లో అతి పెద్ద ఇల్లుకొనుక్కుని అందులో ఉంటున్నారు. మూడు ఎకరాల ప్రాపర్టీ అది. స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నారు. అనేక రకాల చెట్లు, పూలు ఆహ్లాదాన్ని గొలుపుతాయి. యాపుల్స్ చెట్ల దగ్గరకు చాలా జింకలు వచ్చి తింటుంటాయి. దూర దూరంగా ఇళ్ళు ఉండటాన కూతవేటుకు మనుషులెవరూ అందరు. కారుల్లో పోతూ కనిపించి నప్పుడు ఆగి పలకరించుకుంటూ ఉంటారు. స్టీవ్, కారల్ దంపతులు, ఎమెట్, జేన్ దంపతులు స్నేహంగా ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు. ఇన్నయ్య అందరినీ పలకరించి స్నేహంగా ఉంటుంటాడు. వాళ్ళను ఇంటికి పిలిచి ఎంటర్ టైన్ చేస్తుంటాడు. ఎమెట్, జేన్ తనని తన యింటికి పిలుస్తుంటారు. కలిసి మూవీలు చూడటం, చదివిన పుస్తకాల గురించి మాట్లాడుకోవటం వారికి ఆసక్తి. అన్వరుల్ - ఉలుం కాలేజీలో వాతావరణం స్నేహపూర్వకంగా ఉండేది. మా డిపార్ట్ మెంట్ హెడ్ వి.ఎం.వాఛా స్టాఫ్ ను ఆదరించేవారు. అందరిచేత పనిచేయించటంలో నేర్పరి. కష్టజీవి. ఎప్పుడూ సెలవుపెట్టి ఎరగడు. తన పుట్టిన రోజున మాకు పార్టీలిచ్చేవాడు. ఇప్పటికీ అది కొనసాగుతున్నది. రాఘవేంద్ర మాన్వీ, క్రిస్టీనా, జాఫ్రీ - అందరం ఒక కుటుంబ సభ్యులుగా అమెరికాలో మెలిగేవాళ్ళం. నేను క్రిస్టీనా ఖమరున్నీసా బేగం (ఎకనామిక్స్) స్నేహంగా, కలిసికట్టుగా ఉండేవాళ్ళం. మమ్మల్ని చాలా మంది ‘త్రీ మస్కెటీర్స్’ అనేవాళ్ళు. ఖమరున్నీసా తన కారులో మాకు ‘రైడ్’ యిస్తుండేది తరచు. ఆమె చక్కని వ్యక్తి, సమర్ధురాలు కూడా. ముగ్గురు తరచు ఫోనులో మాట్లాడుకుంటాం ఇప్పటికీ. సుభాషిణీ నీలోఫర్ (బోటనీ) నాకు మంచి స్నేహితురాలు. అమెరికాలో సెటిల్ అయ్యాక టచ్ లేకుండా అయ్యాం. ఆమె అడ్రస్ తెలియలేదు అమెరికాలో. శ్రవంతి క్లారెన్స్ కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ హెడ్. అందరితో సఖ్యతగా ఉండేది. అమెరికాలో సెటిల్ అయ్యింది. మంచి టాలెంటెడ్ వ్యక్తి. ఫోనులో పలకరించుకుంటున్నాం ఇప్పటికి కూడా. ఎ.ఆర్.వర్మ, నాగరాజు (సైన్స్ వాళ్ళు) ఎక్కువ మాతో కలిసేవారు. కామర్స్, సైన్స్ సెక్షన్లలో 120 మంది విద్యార్థులుండేవారు. ఆర్ట్స్ లో సంఖ్య తక్కువే. కొందరు బాగా చదివే విద్యార్థులుండేవారు. వారికోసం శ్రద్ధగా పాఠాలు చెప్పాలనిపించేది. 14 ఏళ్లు ఉన్నా నా కాలేజీలో ఎవరూ ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఆ టైములోనే ఆంధ్రా యూనివర్సిటీ ప్రొ. విశ్వనాథం దగ్గర పిహెచ్.డి.కి రిజిస్టర్ చేసుకున్నాను. కేథరిన్ మేన్స్ ఫీల్డ్ రచనలు - నా టాపిక్. ఉత్సాహంగా చాలా వరకు మేటర్ సేకరించిన తరువాత గైడ్ టాపిక్ మార్చుకోమని లెటర్ రాశారు. దిక్కు తోచలేదు. వారం టైమిచ్చారు నా నిర్ణయానికి హెన్రీ ఫీల్డింగ్ - ఆయన నవలలు ఎన్నుకున్నాను. సీరియస్ గా కొంత వర్క్ చేశాను. పిహెచ్.డి. పరీక్ష పాసయ్యాను. నెమ్మదిగా ఇంటరెస్ట్ పోయింది. సేకరించిన మెటీరియల్ అటకెక్కింది. పిహెచ్.డి. పూర్తి చేయలేదు. ఇన్నయ్య పిహెచ్.డి గైడ్ అతనికి డిగ్రీ రాకుండా మధుసూదన రెడ్డి చాలా కాలం నాటకాలాడాడు. తన సొంత అన్నకు ముందు డిగ్రీ వస్తే అతన్ని ఇన్నయ్య ప్లేస్ లో లెక్చరర్ గా వేయాలని అలా చేశాడు. తీరా ఆ అన్నకు వయసు మీరటం వలన ఉద్యోగం అవలేదు. ఇన్నయ్యకు మాత్రం ద్రోహం చేశాడు మధుసూదన రెడ్డి. ఎన్.కె.ఆచార్య (లాయరు) ఇన్నయ్య తరఫున హైకోర్టులో కేస్ వేశాడు. జస్టిస్ అమరేశ్వరి యూనివర్సిటీని, గైడ్ ని తప్పు పట్టి ఇన్నయ్యకు డిగ్రీ ఇవ్వాలని తీర్పు చెప్పారు. గైడ్ మీద స్ట్రిక్టర్సు పాస్ చేశారు. అతను అభాసుపాలయ్యారు. రిజైన్ చేయవలసి వచ్చింది. ఇన్నయ్య కాంపెన్ సేషన్ కోరలేదు. కోరి ఉంటే అనుకూల తీర్పు వచ్చి ఉండేది. ఇదంతా 12 సంవత్సరాలు పట్టింది. అందువలన ఇన్నయ్య నన్ను ఎగతాళి చేసేవాడు. ‘నా పిహెచ్.డి. చరిత్ర నిన్ను పిహెచ్.డి. మీద నమ్మకం పోగొట్టుకునేలా చేసింది. అందుకే పూర్తి చేయలేదు’ అంటాడతను. నా బద్ధకం నాకడ్డుపడిందంటాను నేను. రేడియో ప్రసంగాలు ఆరోజుల్లో రేడియోలో ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. వేలూరి సహజానంద ప్రోగ్రాం డైరెక్టర్ గా ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్ లో ఉన్నారు. ఇన్నయ్యకు మంచి స్నేహితుడాయన. నాకు అవకాశం కల్పించారు. ‘విశ్వరచయితలు అనే శీర్షికన ఇతర దేశాల ప్రముఖ రచయితలను తెలుగు శ్రోతలకు పరిచయం చేయటం. ఆరు టాపిక్స్ గా మాట్లాడాను. నా ప్రోగ్రాం ప్రముఖ జర్నలిస్ట్ ఎం. చలపతి రావుగారిని ఆకట్టుకున్నది. నాకు చాలా సంతోషం కలిగింది. ఆయన నా ప్రోగ్రాం గురించి సద్విమర్శ చేశారు. సహజానందగారు - ‘సన్నకారు రైతులు సలహాలు’ అని ఐదు టాపిక్స్ మాట్లాడమన్నారు. 5 నిమిషాల టైము ప్రతి టాపిక్ కీ ముందు రాసి వారి అనుమతి పొంది నడిపించాను. ఆయన స్నేహ పాత్రుడు అనేకమంది మన్ననలు పొందిన సౌమ్యుడు. గౌరవనీయుడు. ఆ తరువాత స్త్రీల కార్యక్రమాలలో పాల్గొన్నాను. అంతటితో రేడియో అనుభవాలు ముగిసాయి.

No comments:

Post a Comment