పార్టీ లేని రాజకీయాలు--ఎమ్.ఎన్.రాయ్

రాజకీయాలు -అధికారం- పార్టీలు పార్టీ లేని రాజకీయాలు ఎమ్.ఎన్.రాయ్ ప్రపంచానుభవం దృష్ట్యా సిద్ధాంత రీత్యా అధికార పోరాటంలో ఉన్న అనేక పార్టీలు రాజ్యాంగరీత్యాగాని, సాయుధ విప్లవంతో గాని పెత్తనం కావాలని పెనుగులాడటం గమనించి, ప్రజాస్వామ్యాన్ని, మూకస్వామ్యంగా దిగజార్చారనే నిర్ణయానికి వచ్చాను. రాడికల్ ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు రాజకీయ పార్టీగా వ్యవహరించడం ఔచిత్యంగా ఉండదు. స్వగృహంలో ధర్మకార్యం ప్రారంభించాలని నానుడి ఉన్నది. చెప్పడం కంటే చేయడం ఉత్తమం అంటారు. రాడికల్ ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు రాజకీయ పార్టీగా వ్యవహరించటం ఔచిత్యంగా ఉండదు. స్వగృహంలో ధర్మకార్యం ప్రారంభించాలని నానుడి ఉన్నది. చెప్పడం కంటే చేయడం ఉత్తమం అంటారు. కనక, రాడికల్ హ్యూమనిస్టులు అధికార పోరాటంలో పాల్గొనే నిమిత్తం లేని సమాజం ఏర్పరచగలమనే మార్క్సిస్టుల ఊహాలోకంతో గాని, హ్యూమనిస్టులు అంగీకరించరు. రాజకీయాలకంటే ప్రజాపాలనకు చెందిన సిద్ధాంతం, ఆచరణ అనీ, రాజ్యం అంటే సమాజానికి చెందిన రాజకీయ వ్యవస్థ అని వారు నిర్వచించారు. దీని ఫలితంగా, సమాజంలో సభ్యత్వం అంటే ప్రజా వ్యవహారాలు ఒక క్రమంలో, సమానత్వంతో, న్యాయపాలనతో సాగాలని వారి ఉద్దేశ్యం. కేవలం సన్యాసి మాత్రమే ఈ బాధ్యతలను కాదంటాడు. పార్టీలు రద్దు చేసుకోటానికి నిర్ణయించిన రాడికల్ ప్రజాస్వామిక వాదులు ఆశ్రమాలకు పోదలచలేదు. ప్రస్తుతం ఆచరణలో ఉన్న రాజకీయ విధానంలో పాల్గొనగూడజదని మాత్రమే వారు తీర్మానించుకున్నారు. నేటి విధానం ప్రజాస్వమ్యాన్ని కలుషితపరచటమే గాక, మంచికంటే చెడు ఎక్కువ వ్యాపింపచేసింది. రాజకీయాలను ఉన్నత స్థాయిలో నడిపించే కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇచ్చే నిమిత్తం రాడికల్ హ్యూమనిస్టులు తలపడ్డారు. రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనేవారి సంఖ్యను పరిమితం చేయడం పార్టీ విధానంలో ఎంత పెద్ద పార్టీ అయినప్పటికీ, ప్రజలలో వారి శాతం చాలా స్వల్పంగానే ఉంటుంది. పార్టీ అనే మాటలోనే తార్కికంగా ఇటువంటి అదుపు ఉన్నది. భారతీయ భాషల్లో ప్రయోగిస్తున్న సంఘం, కాంగ్రెస్, సభ, దళ్ అనేవి కూడా పరిస్థితిని ఏ విధంగానూ మార్చలేదు. అన్నిటి ప్రయోజనం కూడా రాజకీయాధికారాన్ని హస్తగతం చేసుకోవడమే. పేరు ఏదైనప్పటికీ, ఇప్పుడుగాని, తరవాత గానీ, రాజ్యం మీద అదుపు పెట్టే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనేదే రాజకీయ పార్టీ ఏర్పరచటంలోని ఉద్దేశ్యం. అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే తన కార్యక్రమాలను ఆచరణలో పెట్టగలదనే వాదనతో తమ లక్ష్యాన్ని సమర్ధించుకుంటున్నారు. కనక, భారతీయ పదజాలాన్ని పార్టీకి పెట్టినంత మాత్రాన అది పార్టీ అది పార్టీ వ్యవస్థ కాకుండా పోదు. ప్రజలలో కొందరికి మాత్రమే, లేదా ఒక వర్గానికి, లేదా ఒక సమూహానికీ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది. అలా కానప్పుడు ప్రాతినిధ్యం అనే భావనకు అర్థమే లేదు. పార్టీ స్వభావాన్ని బట్టే ్ది వేరుగా ఉండటం, కొంతమందితో కూడిన వ్యవస్థగా మారడం వల్ల పార్టీ రాజకీయాలనేవి ప్రజాస్వామ్య రాజకీయాలనడానికి వీలులేదు. రాజకీయ వృత్తి పరులు కొందరు, రాజకీయ ఆచరణను గుత్తకు స్వీకరిస్తారు. అధిక సంఖ్యాకులకు ఇందులో స్థానం ఉండదు. వారంతా ఏదో ఒక పార్టీని అనుసరించాలన్నమాట. పార్టీ రాజకీయాలు దళారీతనంతో కూడినవి కనక వాటి సహాయంతో ప్రజాస్వామ్యాన్ని ఆచరించడం ఎప్పుడూ సాధ్యం కాదు. పార్టీ రాజకీయాలలో ప్రజలు, అనుచరుల స్థాయికి మాత్రమే తగ్గించబడతారు. పార్టీ రాజకీయాలు తృణీకరించడమంటే, ప్రజలందరూ పాల్గొనటానికి వీలుగా రాజకీయాచరణను విస్తత పరిధిలోకి తీసుకుపోవడమే. పార్టీ విధానంలో ఆయా పార్టీలు నిర్ణయించిన అభ్యర్థులకు ఓటు వేయడం మినహా ప్రజలు చేయగలిగిందేమీ లేదు. ప్రజలు అభ్యర్థిని నిలబెట్టి ఓటు చేయగలిగినప్పుడే రాజకీయాచరణ ప్రజాస్వామికం అవుతుంది. సమాజంలో ఉన్న వారందరూ ఉత్సాహంగా పాల్గొనే రాజకీయ అచరణలో పార్టీలకు తావు లేకుండా చేయడం సులభమే. ప్రజలను వత్తిడి చేయకుండానే, అందరూ చురుకుగా ప్రధాన పాత్ర వహించేటట్లు చేయటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ మార్పంతా తెల్లవారేసరికి జరుగుతుందని అనుకోటానికి వీలులేదు. దేశం యావత్తూ పాత ఆచరణను విడనాడి కొత్త విధానాన్ని స్వీకరించదు. ఇదొక క్రమ విధానం. ఈ విధానంలో తరతమ భేదాలుంటాయి. పార్టీ రాజకీయాల నుంచి ప్రజాస్వామ్య రాజకీయాలలో జరిగే మార్పు, క్రమంగా ప్రజలలో, మేధస్సు స్థాయి పెంచుకోవడంతో ఆత్మ గౌరవం, తనపై తాను ఆధారపడటాన్ని అలవాటు చేయడం వల్ల మార్పు వస్తుంది. ఇటువంటి విద్య లేకుండా ప్రజాస్వామ్యం సాధ్యపడదు. ప్రజాస్వామిక సాంఘిక వ్యవస్థకు పునాదులు వేసే ప్రయత్నంలో ఉన్నవారు చాలాకాలం కృషి చేయవలసి ఉంటుంది కనక, రాజకీయ పరిస్థితులపట్ల ఉదాసీనంగా ఉండదు. ఈ పరిస్థితులు వారి కార్యక్రమాన్ని మంచికో, చెడ్డకో ప్రభావితం చేయవచ్చు. మార్పు జరిగే కాలంలో నియంతృత్వంకంటే, ఎన్ని లోపాలు, అసమంజసాలు ఉన్నప్పటికీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కొంతనయం. ఒకే పార్టీ ఆధ్వర్యం కంటె అనేక పార్టీలు అధికారం కోసం పోటీ పడుతున్నప్పుడు, అధికారంలో స్థానాలు మారుతన్నప్పుడు పౌరహక్కులు ఉండటానికి ఎక్కువ అవకాశం కన్పిస్తున్నది. ఒకే పార్టీ రాజ్యాన్ని అదుపులో పెట్టటం, ప్రజలందరి ఆసక్తులకూ తానే సంరక్షణ వహిస్తున్నట్లు చెప్పటం ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఎంత మంచి ఉద్దేశాలున్నప్పటికీ, ఇటువంటి పెత్తందారీ విధనం ప్రజలలో చొరవను చంపేస్తుంది. అధికార మనస్తత్వానికి పోషణ చేస్తుంది. అధికారం సహజమైనదిగా భావించి, అంగీకరించే మనస్తత్వాన్ని కలిగిస్తుంది. వెనుకబడిన దేశాలలో ప్రజాస్వామికం కాని ఏకపక్ష పాలనకు ప్రజల సంప్రదాయ మనస్తత్వం, ఆత్మస్థైర్యం అనేవి పెట్టని కోటగా నిలిచాయి. రాజకీయంగా వెనుకబడినతనం, సర్వసాధారణమైన అజ్ఞానం కూడా వీటికి తోడైనాయి. కొత్త రాజ్యాంగం కింద ఓటర్ల సంఖ్య పెరగటంతో, అత్యధిక సంఖ్యాకులు నిరక్షరాస్యులుగా, నేటి పరిస్థితికింకా బలాన్ని చేకూరుస్తున్నారు. కనక, త్వరలో కాంగ్రెసు పార్టీని అధికారంలోంచి తొలంగించవచ్చుననీ, వాస్తవవాది అయిన ప్రజాస్వామికుడెవరూ భ్రమలు పెట్టుకోరాదు. పెత్తనం అంతా స్వీకరించాలనే అధికార పార్టీ ధోరణిని సాధ్యమైనంత మేరకు నిరోధించవలసి ఉంటుంది. అప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్య లక్షణాలూ, పౌరహక్కులూ నామమాత్రంగానన్నా నిలబడతాయి. ఇంతలో ప్రజాస్వామ్యాన్ని పునాదుల నుంచి నిర్మించుకొనే ప్రయత్నం చేస్తూపోవచ్చు. ఈ వాస్తవ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే, తామే సర్వస్వం పెత్తనం వహించాలనే ఏకపక్ష పాలనను ప్రశ్నించే పార్టీలను బలపరచటానికి రాడికల్ డెమోక్రాట్లకు అభ్యంతరం ఉండకూడదు. ఓటు వేయడానికీ, ఓట్లు కావాలని అడగటానికీ తేడా ఉన్నది. కనక అధికారం కోసం పెనుగులాడే పద్ధతినీ, పార్టీ రాజకీయాలనూ నిరాకరిస్తున్న రాడికల్ డెమోక్రాట్లు పై విధానాన్ని అనుసరించటంలో అనౌచిత్యం లేదు. ప్రతిపక్షాలలో ఉన్న పార్టీని రాడికల్స్ సమర్ధించటమే గాక, ఇతరులను కూడా అలా చేయమని అడగాలి. కాంగ్రెసును అధికారం నుంచి తొలగిస్తే, పరిస్థితిలో పెద్ద మార్పు వస్తుందనే భ్రమతో ఇలా చేయమనడం లేదు. ఏకపక్షపాలన పునాదులను కదిలించటానికి, ప్రతిపక్షంలో వ్యక్తిగత ప్రవర్తన మెరుగ్గా ఉన్నవారిని బలపరచటానికి, ప్రతిపక్షంలో వ్యక్తిగత ప్రవర్తన మెరుగ్గా ఉన్నవారిని బలపరచటానికి ఈ పద్ధతి పనికివస్తుంది. పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉండాలనే నిర్ణయం చిత్తశుద్ధితో కూడినదని రుజువుపరటానికి ఏ పార్టీలోనూ సభ్యులుగా ఉండకపోవడం, పార్టీల అభ్యర్థులుగా నిలబడకపోవటమే నిదర్శనం. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలతో సహకరించటమంటే రాడికల్ ప్రజాస్వామ్యానికి చెందిన రాజకీయ ఆచరణ అంతా అయిపోయిందనుకోకూడదు. ప్రజలకు విద్యాబోధన చేయడమనేది మౌలికమైన విషయం. ఎన్నికల ప్రచారం ఇందుకు వినియోగించుకోవచ్చు. ఉద్రేకాలకు ఆకర్షితులై మూకస్వామ్యంలో ప్రజలు కొట్టుకుపోయినంతకాలం ప్రజాస్వామ్యం సఫలం కాదు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఓట్ల నిమిత్తం వివిధ పార్టీలు పెద్ద హామీ ఇస్తుండగా, వాటన్నిటినీ పరిశీలించడంలో ఓటర్లకు తోడ్పడి, సలహానిచ్చి, తెలివిగా ఓటు వేయటానికి దోహదం చేయాలి. అది రాజకీయ విద్య అవుతుంది. ఏదో ఒక పార్టీకి ఓటు వేయడం తప్పనిసరి కాదని ప్రజలకు చెప్పాలి. స్థానికంగా నిర్ణయించిన అభ్యర్థిని, తమకు తెలిసిన వారిని, తాము సులభంగా అదుపులో పెట్టగలవారిని ఎన్నుకోవచ్చునని ప్రజలకు చెప్పాలి. పార్టీ వ్యక్తులకు బదులు స్థానిక అభ్యర్థులను నిర్ణయించవలసిందిగా ప్రచారం చేసినప్పుడు, అది ప్రజా సంఘాల ఏర్పాటుకు దారితీస్తుంది. ప్రజలే పార్టీని తొలగిస్తే, నిజమైన ప్రజాస్వామ్యానికి పెద్ద అండ చేకూరినట్లే. రాజకీయ కార్యకలాపంలో దీనికెంతో ప్రాధాన్యత ఉన్నది. అధికార పెనుగులాటలో పాల్గొనకుండానే, ప్రస్తుత దేశ రాజకీయాల్లో చురుకుగా ఉండడం ముఖ్యం. సహజ దైనందిన వ్యవహారాలలో స్వయంకృషిపై ఆధారపడటం, స్వతంత్ర ధోరణి వ్యాపింప చేయడం ఇత్యాది కార్యకలాపాలు పార్టీలతో నిమిత్తం లేకుండా ఎన్నో చేయవచ్చు. నిర్మాణాత్మక ప్రజాస్వామ్యాన్ని భావించినవారు ఇప్పుడు ఆచరణలో పెట్టాలి. ప్రజా సంఘాలు ఇందుకు నాందిగా ఉంటాయి. పార్టీ రాజకీయాల అంతానికి ప్రజా సంఘాలు ఇందుకు నాందిగా ఉంటాయి. పార్టీ రాజకీయాల అంతానికి ప్రజా సంఘాలే ఆరంభదశ అని సులభంగా గ్రహించవచ్చు. నిర్ణీత ప్రాంతాలలో ఈ పథకాన్ని ఆచరించే వ్యక్తుల అనుభవం ఇతరులకు ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇప్పుడున్న గ్రామ పంచాయతీలను నిర్మాణాత్మక ప్రజాస్వామ్యంలో ప్రాథమిక కేంద్రాలుగా రూపొందించవచ్చు. వాటిపై పార్టీల అదుపునూ, అధికారంలో ఉన్న పార్టీ అదుపునూ తప్పించవచ్చు. ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని ఏకపక్షపాలనకు వ్యతిరేకంగా, నిర్మాణాత్మకంగా, తెలుసుకొని పనులు చేసే ధోరణిలోకి మార్చగలగడం అంటే పార్టీ రాజకీయాల సంకుచిత ధోరణులు దాటిపోయి విస్తృతమైన రాజకీయ కార్యకలాపాలలో పాల్గోవటమే అవుతుంది. నేడున్న పెత్తందారీ వాతావరణంలో ఏకపక్షపాలన తప్పదేమో అన్నట్లు స్వీకరిస్తున్నారు. ప్రమాదకరమైన ఈ ధోరణులు వ్యతిరేకించాలి. లేకుంటే ...ప్రజాస్వామిక… బలంతోనే నియంతృత్వం వచ్చి రాజకీయ స్వేచ్ఛకూ, సామాజిక విమోచనకూ ఆశలేకుండా చేస్తుంది. వెనుకబడిన దేశాలలో సంస్కృతీ సంప్రదాయం ఇటువంటి ప్రమాదానికి ఆయువుపట్టు. కనక, సంస్కృతీ రంగంలో పోరాటం జరగాలి. ఇందుకు ఆయుధాలుగా జ్ఞానవికాసం, పౌరులకు విద్య, విజ్ఞాన వ్యాప్తి ప్రయోగించాలి. అనుభవం కూడా ఎంతో విలువైన విద్యగా తోడ్పడుతుంది. ఎన్నికలు అందులో ఒక భాగం, రాజకీయ నిరక్షరాస్యత ఓటర్లలో ఎక్కువగా ఉన్నప్పుడు, మధ్యతరగతి మనస్తత్వం సహితం సాధ్యంకాదు. పార్టీలలో ఉన్న అనేకమంది కూడా ఏదో ఒక సమయంలో అధికారానికి రాలేకపోవచ్చుని నిరాశపడిన సందర్భాలు లేకపోలేదు. అలాంటివారు కూడా ప్రజాస్వామ్యాన్ని పునాదుల నుంచి పెకిలించాలని అనుభవం వల్ల నేర్చుకుంటారు. పార్టీ రాజకీయాలను వదిలి ప్రజాస్వామిక రాజకీయాలను స్వాకరిస్తారు. ఈలోగా పార్టీ లేకుండా రాజకీయాలు సాధ్యమేనని కొందరు చూపవలసి ఉన్నది. సమకాలీన రాజకీయ చరిత్రలో రాడికల్ ప్రజాస్వామిక పార్టీ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది, రాజీయ పార్టీని ఒక సమగ్ర, సాంఘిక ఉద్యమంగా మార్చి, ప్రజస్వామ్యం కోసం విద్యను వ్యాప్తిచేయాలనీ, స్వేచ్ఛాదర్శాన్ని పెంపొందించాలనీ నిర్ణయించింది. రాజకీయ సంస్థల చరిత్రలో బహుశ ఇటువంటి నిర్ణయం ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. రాజకీయ వ్యవస్థలు దిగజారిపోవటం, పతనం చెందటం, లేదా, మరొక పార్టీలో చేరే నిమిత్తం రద్దు చేసుకోవటం ఎన్నో సందర్భాలలో చూడవచ్చు. వందలాది ప్రతినిధులు రాజకీయ విశ్వాసాలు, ఉత్సాహం ఉన్నప్పటికీ సుదీర్ఘ చర్చల అనంతరం తాము సృష్టించుకొన్నఒక రాజకీయ వ్యవస్థను మార్చాలనుకోవడం విశేషమైన సంఘటన. మానవుడి సార్వభౌమత్వం, సృజనాత్మకతకు ఇది నిదర్శనం. కలకత్తా మహాసభలో జరిగిన నిర్ణయం రెండేళ్ళ క్రితమే రాడికల్ డెమోక్రాట్లు రూపొందించిన నవ్య మానవవాద తత్వ ఫలితమని చెప్పవచ్చు. ఇందువల్ల రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ విశాలమైన సామాజిక ఉద్యమాన్ని పెంపొందించే ప్రయత్నంలో ఉన్నారు. అధికారం కావాలనే లక్ష్యాన్ని వదులుకొన్నందువల్ల అధికార పెనుగులాటలో ప్రవేశించక ఉండగలిగారు. నేడు రాజకీయాలంటే అధికార పోరాటమనే అర్థం చేసుకొంటున్నారు. సంప్రదాయ రాజకీయ పార్టీకి అన్వయించే ప్రమాణాలతో రాడికల్ పార్టీని కొలవడానికి వీలులేదు. అందువల్ల పార్టీ కార్యకలాపాలకు, ఆశయాలకూ కొంత విచక్షణ వచ్చింది. ఇది గందరగోళానికి దారితీసింది. రాడికల్ ప్రజాస్వామ్యాన్ని సానుభూతితో సమర్ధించే వారిలో కూడా ఈ గందరగోళం ఉన్నది. ఇది తుదముట్టించడానికి కలకత్తా మహాసభలోనే నిర్ణయం జరిగింది. కార్యకలాపాలమీద ఏదైనా అదుపు అంటూ ఉంటే అది కాస్తా తొలగిపోయింది. రాడికల్ డోమోక్రటిక్ పార్టీకి స్వేచ్ఛా సంప్రదాయం, వివేచన ఉన్నవి. కనకనే పార్టీ అలాంటి నిర్ణయం తీసుకోగలిగింది. పార్టీ ఉన్నంతకాలం సభ్యులకు ఒక పాఠశాలగా, ఉత్తమ మానవులను చేసేదిగా తోడ్పడింది. సమష్టిగ ఉండటం కోసం, అలౌకిక ప్రాధాన్యతతో వ్యక్తిత్వాన్ని వదులుకోవాలని ఎన్నడూ కోరలేదు. పార్టీలో విడి భాగాలకు మించి ప్రత్యేక ఉనికి అఁటూ ఎప్పుడూ పెట్టుకోలేదు. పార్టీని సృష్టించే వారినే బంధించలేదు. రాడికల్ డోమోక్రాట్ల సహకార కార్యకలాపాలకు, సామాన్య ఆదర్శానికి ఒక వ్యక్తీకరణే. కనక పార్టీ రాజకీయాల వ్యవస్థాగత లక్షణాల నుంచి స్వేచ్ఛగానే ఉంటూ వచ్చింది. అధికారంలోకి రావటానికి అవసరమైన లక్షణాలు పార్టీకి ఉన్నవి. ఈ పార్టీలో ఉన్న వ్యవస్థాగత క్రమశిక్షణ సభ్యులను అణచివేయటానికి గాని, మూసలో పెట్టటానికి గాని ఉద్దేశించినవి కావు. బాధ్యతలు ఐచ్ఛికంగానే ఆమోదించారు. సూచన ప్రాయంగానూ మార్గగామిగాను తప్ప పెత్తనం మరొక విధంగా లేదు. ఈ విధంగా నిర్మించిన పార్టీ ఎప్పుడూ ఒక యంత్రాంగాన్ని పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని నిర్మించుకోలేదు. అట్లా జరగటం అంటే సాంస్కృతికంగా వెనుకబడిన తనంతో అనేక మంది గుడ్డిగా అనుసరించటమే. వ్యక్తుల మేథస్సునూ, భావ బలాన్నీ గౌరవించటంలో దేశంలోని అన్ని పక్షాలకూ మించి పోయి ఈ పార్టీ పనిచేసింది. పార్టీ ఉన్న కొద్ది కాలంలో ఇవన్నీ రుజువయ్యాయి. పార్టీతో అంగీకరించని వారు వీటిని గుర్తించారు. ఎన్నో అవరోధాల మధ్య పార్టీ పనిచేయవలసి వచ్చింది. తరచు ఉప్పెనలా జాతీయ ఉద్యమం వచ్చిపడుతుండగా రాడికల్ డెమోక్రాట్లు ఏకాకిగా, స్థిరంగా నిలబడి, స్వేచ్ఛను తీసుకరావాలంటే రాజకీయాలలో ఉద్రేకం, ఈర్ష్య, ద్వేషాలు ఆధారం కాకూడదన్నారు. ప్రజా బాహుళ్య ధోరణికి వ్యతిరేకంగా రాడికల్స్ ప్రవర్తించారు. తాత్కాలిక, తక్షణ విజయాలకంటే, మేథస్సు, నైతిక సంబంధమైన చిత్త శుద్ధిని దృష్టిలో పెట్టుకోవటమే ఇందుకు కారణం. రాడికల్ డెమోక్రాటిక్ పార్టీ చాలా చిన్న పార్టీ, దాని సంప్రదాయాలూ, పనిచేసే తీరూ ఇతర రాజకీయ పక్షాలలో చాలా అరుదుగా చూస్తాము. ముఠా ధోరణిలో గల పరిమితులను దాటి పోవాలనే పోరాటానికి కార్య రూపాన్ని ఇవ్వడంలో రాడికల్ డెమోక్రాట్లు, రాజకీయపార్టీగా ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ప్రజాస్వామ్య ఆదర్శంతో ఉత్తేజితులవుతు, నిర్మాణాత్మక రాజకీయ వ్యవస్థను దృష్టిలో పెట్టుకున్న తరవాత ప్రజలలోనే అధికారం సమర్థవంతంగా ఉండాలని చెప్పిన అనంతరం ప్రజలకూ, రాజ్యానికీ మధ్య దళారీగా ఉండే ప్రయత్నం ఈ పార్టీ చేయలేక పోయింది. అధికారం విస్తృతంగా పంచబడాలని తలపెట్టి, పాలకులకూ, పాలితులకూ ఉన్న అఖాతాన్ని తొలగించాలనీ, తద్వారా ప్రజాస్వామ్యం నాశనం కాకుండా చూడాలనీ, లాంఛనప్రాయమైన ప్రాతినిధ్య సంస్థలలో సహితం ఇది సాధ్యమేనని ఈ పార్టీ భావించింది. కన అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని గానీ, అందుకు ఓటును, లేదా, తిరుగుబాటును ప్రయోగించాలని అనుకోలేదు. సంప్రదాయ దృష్టితో ఆలోచిస్తే ఈ పార్టీ రాజ్యాంగ బద్ధంకానీ, విప్లవాత్మకం కానీ కాదు. ఒకే ఆదర్శంగల వ్యక్తులు రాడికల్ డెమోక్రాట్లుగా కలసి, ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం కోసం స్వేచ్ఛాయుత సంస్థల అభివృద్ధి కోసం, అధికారాన్ని పలచబడేటట్లు చేసి, దీనంతటికీ తగిన జ్ఞానాన్ని విస్తరింపచేయాలని ప్రయత్నించారు. ఇటువంటి కృషిలో భాగస్వాములైన వారు రాజకీయ పార్టీగా ఎందుకుండాలో ఊహించటం కష్టం. ఆ కష్టాన్ని గుర్తించి, తొలగించటంలోనే పార్టీని రద్దు చేసుకోవాలనే నిర్ణయం జరిగింది. ఈ కష్టం వీరు తెచ్చి పెట్టుకున్నది కాదు. ఇది రాడికల్ డెమోక్రాట్లు తమ కార్యకలాపాలను అభివృద్ధి పరచుకొంటుండగా ఎదురైన సమస్య. అధికారం లక్ష్యంగా పెట్టుకోనప్పుడు, అధికార రాజకీయ క్రీడారంగంలో ప్రవేశించకుండా కావాలని బయట ఉన్నప్పుడూ, అటువంటి ఆటకు చెందిన నియమాలతో వీరి కృషిని నిర్ణయించటం అసందర్భంగా ఉంటుంది. రాజకీయ పార్టీగా పూర్తిగా భిన్న స్వరూపంలో ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యం పాటించని వ్యవస్థగా కొనసాగుతున్న పార్టీల పేరుపెట్టుకుని కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. పార్టీ స్వభావంలోనే ముఠాతత్వం ఉన్నది. సభ్యులు కానివారిని ఆటంకపరిచే ధోరణి ఉన్నది. స్వేచ్ఛనూ, సంక్షేమాన్నీ పెంపొందించే కార్యక్రమంలో నిమగ్నమైన వారికి ఇటువంటి పార్టీ వ్యవస్థ కుంచించుకపోయే ధోరణి కల్పిస్తుంది. ...పార్టీ.. అనే పదానికి ఒక అర్థమున్నది. ప్రజలలో వారు ఒక భాగం మాత్రమే. ఒకానొక ఆదర్శాన్ని పాటిస్తూ అది సాధించే కార్యకలాపాల్లో పాల్గొంటూ అందరిపైన ఆధిపత్యం వహించాలనే ధోరణి అవలంబిస్తారు. పార్టీ విధానంలో ఉన్న ప్రమాదాలకు వ్యతిరేకంగా పౌరులకు విద్య చెప్పటం, ప్రజల స్థాయినుంచి క్రమంగా కొత్త రాజకీయ నిర్మాణం గావించటమే శరణ్యం. విద్యవల్ల ప్రజలలో సొంతంగా నిలబడే శక్తి వస్తుంది. వివేచన పెంపొందుతుంది. విచక్షణ చూపగలుగుతారు. మూకస్వామ్యంలో కొట్టుకుపోకుండా తమను కాపాడుకోగలుగుతారు. అటువంటి ప్రజలే కొత్త సంస్థకు రూపురేఖలు దిద్దగలరు. వ్యక్తులను దోపిడీకి గురికాకుండా, పెత్తనంలో అణచి పెట్టకుండా కాపాడగలుగుతారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య చట్టంలో రాజకీయ పార్టీల వల్ల అధికారం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నప్పుడు ఇటువంటి అవసరాలు తీరవు. రాజకీయ పార్టీల స్వభావంలోనే ప్రజలకు విద్యగరిపే ధోరణి లేదు. ఏకపక్ష పాలనతో నియంతృత్వాన్ని స్థాపించాలనే ధోరణిగల పార్టీ మాట అలావుంచి, ఓట్లతో అధిక సంఖ్యాకుల బలం పొెంది, రాజ్యాంగపరంగా రాజకీయాధికారాన్ని పట్టుకోవాలనే పార్టీ కూడా ప్రజలకు విద్య చెప్పే కృషి చేపట్టడం లేదు. అధికారం అనే ఆటలో నిమగ్నమైనప్పుడు, అందులో ఉండే నియమాలు పాటించాలి. పక్షపాతం లేకుండా ప్రజలకు రాజకీయ విద్య చెప్పాలంటే అధికారం పట్టుకోవాలనే లక్ష్యం దెబ్బతింటుంది. ఒక పార్టీ అధిక సంఖ్యాకుల బలంతో అధికారంలోకి వచ్చినంత మాత్రాన ప్రజాస్వామ్యానికి హామీ లేదు. ప్రజలు విద్యావంతులైతే, అధికారంలో కొనసాగాలనే పార్టీ లక్ష్యానికి కూడా ముప్పు వస్తుంది. పార్టీ వ్యవస్థను త్యజించారంటే, రాడికల్ డెమోక్రాట్లు రాజకీయాలకు స్వస్తి చెప్పారని భావించకూడదు. అధికారం అనే ఎర లేకుండా రాజకీయాలను చూడలేనివారు, పార్టీ లేకుండా భావన చేయలేనివారు. నేటి రుగ్మతలకు ఉత్తమ చికిత్సాకారులు కాలేరు. వారికి కూడా చికిత్స అవసరం. పార్లమెటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయం సరళంగా సాగిపోవటానికి సాధనగా రాజకీయ పార్టీలు వచ్చాయి. వ్యక్తి సార్వభౌమత్వానికి మాటవరసగా తప్ప మరెలాంటి గౌరవాన్ని పార్టీలు చూపడం లేదు. అటువంటి లాంఛనం కూడా కొనసాగుతుందనే హామీ ఇప్పుడున్న పరిస్థితులలో సందేహాస్పదమే. ప్రజాస్వామ్య సమస్యను రాజకీయ పార్టీలు తీర్చలేవు. ఇది చాలా గాఢమైన, విశాలమైన సమస్య, సంస్థాగతంగా ఇమిడిపోవడం ఎలాగో ఇది పరిష్కరించటానికి సమగ్రమైన సామాజిక ఉద్యమం కావాలి. ఈ సమస్యలకు పరిష్కారం సూచించే తత్వం ప్రేరణను ఇవ్వాలి. రాజకీయ, ఆర్థిక, నైతిక సమస్యలను గుర్తించాలి. ..నవ్యమానవాదం… అటువంటి తత్వమే. దీనికి రాజకీయంగా జరిగిన రూపకల్పనే రాడికల్ ప్రజాస్వామ్యం. ఇటువంటి తత్వంతో రాడికల్ ప్రజాస్వామ్యవాదులు రాడికల్ హ్యూమనిస్టు ఉద్యమాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నానికి అనుచితమైన సంస్థాగత రూపాన్ని వారు త్యజించారు. (1949, సెప్టెంబరు 25న రాడికల్ హ్యూమనిస్టు (కలకత్తా) ఇంగ్లీషు వారపత్రికలో ప్రచురితమైనది. ప్రస్తుతం ఈ పత్రిక మాసపత్రికగా వెలువడుతున్నది.) రచయిత అనువాదం ఎమ్.ఎన్.రాయ్ నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment