నీతిశాస్త్రం - రాజకీయాలు--ఎమ్.ఎన్.రాయ్

రాజకీయాలు -అధికారం- పార్టీలు నీతిశాస్త్రం - రాజకీయాలు ఎమ్.ఎన్.రాయ్ సమకాలీన రాజకీయ సిద్ధాంతాలను – మితవాదం, అతివాదం, వామపక్షం, ఉదారవాదం, తిరోగమనం, విప్లవాత్మకం – పునఃపరిశీలిస్తే, ఆచరణలో వాటి మధ్య మౌలికమైన తేడా లేదని తెలుస్తున్నది. ఏ మార్గాన్ని అనుసరించి అయినా సరే అధికారాన్ని హస్తగతం చేసుకోవటం రాజకీయ సిద్ధాంతాలన్నిటికీ సర్వసాధారణ ప్రాతిపదికగా ఉన్నది. అధికారం కోసం జరిగే కుమ్ములాటలో క్రమంగా ప్రజా జీవితం, నైతికంగా దిగజారిపోయింది. ప్రజాసేవా రంగంలో, నీతి ఉండాలంటే, అధికారం హస్తగతం చేసుకోవటమే ముందు జరగవలసిన పని అని, సమాజంలో మార్పుకు అది తప్పనిసరి నే రాజకీయ సిద్ధాంతం ఉండరాదు. మానవుడికి మౌలికమైన సార్వభౌమత్వాన్ని కట్టబెట్టే సాంఘిక తత్వాన్నుంచి, కొత్త రాజకీయ సిద్ధాంతం రావాలి. చిత్త ప్రవృత్తి ననుసరించి నీతి ఉంటుంది కనక వ్యక్తులు మాత్రమే నీతిని పాటించగలరు. నైతిక వ్యక్తులు లేకుండా, నైతిక సమాజం ఉండదు. ఇంతవరకూ ఈ క్రమాన్ని తల్లక్రిందులు చేసి సంఘ నిర్మాతలు మన ముందు ఉంచారు. మానవ వ్యక్తిత్వ వికాసానికి ఆదర్శక్రమం ఉండాలని వారు ప్రతిపాదించారు. మంచి చట్టాల వల్ల మంచి జీవితాదర్శాలు ఉంటాయని ఉదారవాదులు నమ్మారు. వీరి ...సంస్కరణ వాదా...నికి వ్యతిరేకంగా సోషలిస్టులు, ఉత్తరోత్తరా కమ్యూనిస్టులు, మానవాభివృద్ధికి ఉమ్మడి యాజమాన్యంతో కూడిన ఆర్థిక పునర్మిర్మాణం కావాలన్నారు. తత్ఫలితంగా సమష్టివాదుల చేతుల్లో వ్యక్తికి గ్రహణం పట్టింది. సమష్టివాద సాంఘిక తత్వాల వల్లనే రాజకీయ రంగంలో నియంతృత్వాలు చోటుచేసుకున్నాయి. సాంఘిక తత్వంలో ప్రచురిత వ్యక్తికి కేంద్రస్థానం ఇవ్వటం సులభమే. వాస్తవానికి ఉదారవాద, సాంఘిక తత్వం, రాజకీయ సిద్ధాంతానికి కీలక సూత్రంగా వ్యక్తి వాదం ఉండేది. ఆధునిక నాగరికత సాధించిన ఘన విజయాలకు ఉదారవాదం ఉత్తేజాన్ని కల్పించింది. కాని ఆచరణలో వ్యక్తివాద సూత్రాలు, నైరూప్య సిద్ధాంతాలుగానూ, సార్వభౌముడైన వ్యక్తి చట్టబద్ధమైన కట్టుకథగానూ మారిపోయాడు. ఉదారవాదం పతనం చెంది, భిన్న సమష్టివాద సిద్ధాంతాలకు ప్రోత్సాహమిచ్చింది. వ్యక్తి స్వేచ్ఛావకాశాలను, నిరాకరించిన సమష్టివాదాలు, వ్యక్తి స్వేచ్ఛ అనేది ఆకారం లేనిదనీ, స్వేచ్ఛగా ఉండాలంటే మూకలో కలసిపోవాలనీ, వ్యక్తి తనను తాను ప్రజలలో లీనం చేసుకోవటం వల్ల స్వేచ్ఛను కనుక్కోవాలనీ అన్నారు. వ్యక్తి సార్వభౌమత్వాన్ని దారవాదులు చట్టబద్ధమైన కట్టుకథ చేస్తే సోషలిస్టులు, కమ్యూనిస్టులూ, స్వేచ్ఛను తృణీకరించారు. నైతిక ప్రమాణానికి సంబంధించి, స్పష్టత లేకపోవటమే ఉదారవాద సాంఘిక తత్వం పతనం చెందటానికి కారణం. వ్యక్తి నీతిమంతుడు కనక సార్వభౌముడు అనే అత్యుత్తమ సూత్రంతో వారు ప్రారంభించారు. ఇదొక ప్రాచీన విశ్వాసం. ఐరోపాలో క్రైస్తవులు దీనిని ప్రచారంలోకి తెచ్చారు. విశ్వ నైతిక నియమంగా ఉండే దైవ కాంతిలోని కిరణమే మానవుడిలో ఆత్మగా ఉన్నది. కనక వ్యక్తి నీతిమంతుడని క్రైస్తవులన్నారు. అదొక ఉదాత్త భావంగా తొలుత ఉన్నది. దానితో ఉత్తేజం పొందిన ఐరోపావాసులు మధ్య కాలాలకు చెందిన మతగురువుల, వ్యవస్థల బంధాలను త్రెంచివేశారు. అయితే మానవుని నీతికి సంబంధించిన మత విశ్వాసం అతని సార్వభౌమత్వానికి పరిమితిని విధించింది. మాటకొస్తే విమోచనకు వ్యతిరేకమయింది కూడా. విశ్లేషించి చూస్తే మానవుడు కేవలం మానవుడుగా మాత్రం నీతివంతుడు కాలేదు. నీతివంతుడు కావాలంటే మానవాతీత శక్తికి లొంగి ఉండాలి అన్నారు. భావాన్ని ఇలా లొంగదీసే జడప్రాయమైన దృష్టివల్ల మానవుడు స్వేచ్ఛాపరుడు కాడు. భావసంబంధమైన ఈ శాశ్వతమైన లొంగుబాటు సిద్ధాంతానికి వ్యతిరేకంగా మానవుడు జరిపిన పోరాట ఫలితంగా ఉదారవాదం ఆవిర్భవించింది. 18వ శతాబ్దంలో ఇది పతాకస్థాయిని చేరుకున్నది. దీని కాంతిపుంజాలన్నీ జ్ఞాన వికాసంలో ప్రతిబింబించాయి. ఫ్రెంచి విప్లవం వల్ల కలిగిన దిగ్భ్రమ ఉదారవాదాన్ని కంపింప చేసింది. పదార్ధవాదాన్ని ప్రకృతి, మతం వ్యతిరేకించింది. నైతిక ప్రమాణాలకు అలౌకిక ఆధారాలను అన్వేషించారు. 19వ శతాబ్దపు తొలి దశలోని నైతిక తత్వానికి చెందిన అలౌకిక వాదానికి వ్యతిరేకంగా, ఉదారవాద సాంఘిక సంస్కర్తలు, రాజకీయ సిద్దాంతవాదులు, ప్రయోజకత్వంతో కూడిన నీతిసూత్రాన్ని ప్రవేశపెట్టారు. అతి భౌతిక, నైతిక విలువలలో మానవుడి అనుభవం ఎక్కడా దరిదాపులలో లేకపోగా, ప్రయోజకత సూత్రంవల్ల బాహ్య ప్రమాణాలు లేకుండా పోయినందున, అసలు నీతినే వ్యతిరేకించే స్థితి ఏర్పడింది. రెండిటి మధ్య చిక్కుకున్న నాగరిక ప్రపంచం నైతిక సంక్షోభంలో పడింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ ఆర్థిక విధానం, ఆచరణలో, వ్యక్తిని నిస్సహాయ స్థితికి దిగజార్చాయి. నైతికంగా వచ్చిన గందరగోళం, సామాజికంగా ఏర్పడిన ఏకాంతం వల్ల మానవుడిలో ఆత్మవిశ్వాసం నశించిపోయింది. సమాజంలో అత్యధిక సంఖ్యాకుల అనుభవానికి సరిపడేటట్లుగా వ్యక్తి స్వేచ్ఛాభావన సమష్టివాదుల వెక్కిరింపుకు గురైంది. తనలో విశ్వాసాన్ని కోల్పోయిన మానవుడు, ప్రజాశక్తిలో భద్రత ఉంటుందనే ఆశతో, సమష్టివాదుల సాంఘిక తత్వాన్ని ఆహ్వనించాడు. రాజకీయాలలో వ్యక్తి విషయం అదృశ్యమయింది. హీనమైన ప్రేరణలు, దోషపూరితమైన రాగద్వేషాలను ఆకర్షించటం, ఆ విధంగా జనాన్ని ఆకట్టుకోవడం రాజకీయ ఆచరణలో మూలసూత్రమయింది. సామాజిక సిద్ధాంతాలు, రాజకీయ ఆచరణ, అనేవి నైతిక తత్వంతో ప్రభావితం చెందాలంటే, ఆ తత్వానికి సరైన ప్రాతిపదిక ఉండాలి. నీతిశాస్త్రానికి పునాది ఏమిటనేది కీలకమైన ప్రశ్న. మానవుడు తనంతట తాను నీతిగా ఉండగలడా? సామాజికంగా లేదా అలౌకిక శక్తి వత్తిడి చేస్తే తప్ప, మానవుడు నీతిగా ప్రవర్తించడమనేది ఇంతవరకూ సర్వ సాధారణంగా వస్తున్న అభిప్రాయం. మానవుడు నైతిక జీవి అనే విశ్వాసాన్ని, సంప్రదాయంగా వస్తున్న ఈ అభిప్రాయం, నీతికి ఆధారం వేరే ఉన్నట్లు భావిస్తున్నది. మానవుడిలో విశ్వాసాన్ని, మళ్లీ పునరుజ్జీవింపచేయాలి. తొలుత ఉన్న హద్దు నుంచి నైతిక మానవుడిని వివేచనాపరుణ్ణి గావించాలి. వివేచనాత్మక రాజకీయ సిద్దాంతం నీతితో కూడిన రాజకీయ ఆచరణ సూచించే విప్లవాత్మక సాంఘిక తత్వానికి ఇవన్నీ తప్పనిసరి. మానవ స్వభావం ప్రకృతిలో అతని స్థానం గురించి, మత రహితంగా, కొన్ని ప్రతిపాదనలు ఆధునిక నాగరికతా చరిత్రారంభ దశలో కొందరు మూల పురుషులు చేసినప్పుడు, పైన పేర్కొన్న ధోరణిలో కొంతవరకూ ముందుకు సాగారు. ధైర్యంగా ఊహించి చేసిన ఈ ఆలోచనకు, క్రమంగా, ప్రకృతిజ్ఞాన విస్తరణ వల్ల మద్దత్తు లభించి, 18వ శతాబ్దంలోని వైజ్ఞానిక పదార్థవాదంతో కలిసిపోయింది. ఇది మానవతా దృక్పథం. ప్రత్యేక సృష్టి అనే పిడివాదనను త్యజించి, ప్రకృతిలోనే మానవుడికి మూలాన్ని కనుగొన్నారు. నియమబద్ధమైన ప్రకృతి నుంచి వచ్చిన మానవుడు, హేతువాదిగా ఉండాలి. అతడు స్థాపించే సమాజం, అతడి వ్యక్తిత్వానికి వికాసాన్ని కలుగచేసేదిగా ఉండాలి. ఆలోచనలన్నీ సరైనవేనని, పందొమ్మిదో శతాబ్ద జీవశాస్త్ర పరిశోధనలు రుజువు పరచాయి. కాని అదే సమయంలో ఉదారవాదంలోని అసంబద్ధతలు, అస్పష్టతల వల్ల నాగరిక ప్రపంచం నైతికంగా, గందరగోళంలో పడింది. వైజ్ఞానిక సహజవాదానికి మూలం అనుకునే పదార్థం, కార్యకారణత్వం, అనే భావాలు నిలబడవని, ఈ శతాబ్దారంభంలో, పజార్థ విజ్ఞాన పరిశోధనలు బయటపెట్టేసరికి, గందరగోళం ఇంకా ఎక్కువయింది. విజ్ఞానాన్ని ప్రమాణంగా చేసుకొని మానవతావాదాన్ని ప్రశ్నిస్తూ, కొత్త మార్మికవాదం బయలుదేరింది. బాహ్య సత్యాన్నే గాక, మానవ జ్ఞానానికి చెందిన వాస్తవికతను గూడా వీరు ప్రశ్నించారు. జ్ఞానశాస్త్రాన్ని, అతిగా ప్రాధాన్యత ఇవ్వటంతో, విశ్వానికీ, మూలపదార్థాలకూ సంబంధించిన, ఆలోచనలో గందరగోళం ఏర్పడింది. మేధస్సులో వచ్చిన సంక్షోభం, నైతిక సంక్షోభాన్ని ప్రకోపింపచేసింది. విజ్ఞానాన్ని ప్రమాణంగా చేసి, మనో విజ్ఞాన శాస్త్రం, వివేచనా రాసిత్యతను ప్రచారం చేసింది. అంతర్భుద్ధి, మార్మికవాదం, అలౌకికవాదం, అనేవి అస్పష్ట భావాల, ముసుగు వేసుకొని, నీతిశాస్త్రంలో జొరబడ్డాయి. మానవుడు వివేచనా రహితుడన్నారు. అంధకార శక్తుల ప్రేరణలవల్ల, మనిషి ప్రవర్తిస్తున్నాడన్నారు. వ్యక్తిగతంగా గానీ, ప్రజాజీవితంలో గానీ, నైతిక ప్రమాణం అనేది శిక్షాస్మృతి అని, అదే రక్షక భటుడుగా పనిచేస్తుందనీ చెప్పారు. ప్రాపంచికంగానూ ఆధ్యాత్మికంగానూ, ఇలా నియమ నిబంధనలు కాపాడలేకపోతే, అటవిక నియమాలు ఆధిక్యత వహిస్తాయన్నారు. అయినప్పటికీ, నేడు ఆటవిక నియమాలే ఆధిక్యత వహించడం, చూస్తూనే ఉన్నాం. విషవలయాన్నుంచి బయట పడాలంటే నైతిక తత్వం కావాలి. దానికి సంబంధించిన విలువలు మానవునిలోని, వివేచనలోనే కనుగొన్నారు. మానవుడి వివేచనకు ప్రమాణం ఏమిటి... వివేచన అంటే ఏమిటి... అదొక అతి భౌతిక విషయమా, లేక జీవ సంబంధమైన సొత్తా... అతి భౌతికమైతే నైతిక ప్రమాణం వివేచనలో చూచినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. అది కేవలం సమస్యను ఇంకో చోటుకు నెట్టివేయటమే అవుతుంది. ప్రకృతిలోని వివేచనకు వ్యక్తీకరణగా హేతువనేది జీవసంబంధమైనదని గ్రహించవచ్చు. పదార్ధ నియతివాదం, ప్రకృతిలోని నియమమే. లేకుంటే, సంప్రదాయ భావాలైన సహజ నియమం నైతిక క్రమం అనేవి అర్ధరహితమవుతాయి. ఆధునిక పదార్ధ, జీవశాస్త్రాలు, ఈ భావాలను బాహ్యసత్యంతో చూపాయి. సమకాలీన సామాజిక, సమస్యలపై ఈ ఆలోచనా ధోరణులు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపెడుతున్నాయి. నేటి ప్రపంచాన్నెదుర్కొనే సమస్యలు నేటి సంక్షోభానికి చెందినవి. ప్రజాజీవితంలో నీతికి ఉన్నత స్థానం కల్పించే కొత్త సాంఘిక తత్వం కావాలని ఈ సమస్యల వల్ల స్పష్టపడుతుంది. రాజకీయాలతో విసుగెత్తిపోవటం, కొద్దిమంది అధిక సంఖ్యాకులు ఆర్ధికంగా దోపిడి చేయడం, అనేది వామపక్షాలకే పరిమితం కాలేదు. అందరూ, ఈ విషయంలో భాగం పంచుకుంటున్నారు. అధికార పోరాటంలో నిమగ్నులైన, రాజకీయ పక్ష నాయకులు అధికార రాజకీయాలను, అతి పవిత్రమైన మాటలతో ఖండిస్తూ ఉంటారు. ఉన్నత వర్గాల ఆదరణ పొందిన పార్టీలు వర్గరహిత సమాజాన్ని స్థాపించే ఉద్దేశాన్ని వెల్లడిస్తూ ఉంటారు. చిన్న, పెద్ద వ్యాపారులందరూ తమను సేషలిస్టులుగా పిలుచుకుంటారు. ఎక్కడ విన్నా నీతి కావాలి అనే మాట వినిపిస్తుంది. నైతిక విలువలను గురించి మాట్లాడటం ప్రజాసేవలో ఉన్న వారికి తప్పనిసరి అయింది. కాని, మెరుగుపడుతున్న సూచనలు ఎక్కడా కనిపించటం లేదు. బలం గలవాడిదే రాజ్యం, రాజకీయాధికారం కుమ్ములాట, ఆర్థికంగా నిలువుదోపిడి చేసే ధోరణి విశృంఖలంగా పనిచేస్తున్నది. ఈ విషయంలో ఏ దేశం కూడా తాను దోషిని కాదని చెప్పుకోదు. ఐనప్పటికి ప్రజా జీవితంలో నైతిక విలువలు లేనందుకు విచార పడటం, నైతిక విలువలకు నామమాత్రంగా విశ్వాసాలను చూపటం కూడా పేర్కొనదగిన అంశం. రాజకీయవాదులు తమ వృత్తి ధర్మాన్ని ఆచరించలేక పోతున్నారంటే చిత్తశుద్ధి లేకపోవటమేై కారణం కాదు. వారు ఒక విషయంలో చిక్కుకున్నారు. ఆట ఆడటం ప్రారంభించినప్పుడు ఆటలో నియమాలు పాటించాలి కదా? రాజకీయాలకు అధికారాన్ని లక్ష్యంగా పేట్టుకున్నంత కాలం వైఫల్యం తప్పదని నీతి మాటలు వల్లించే రాజకీయవాదులు గుర్తించలేకపోయారు. లక్ష్యాన్ని సాధించటానికి ఏ మార్గాన్నయినా అనుసరించవచ్చు అని భావించినప్పుడు ఏవో నియమాలంటూ అడ్డుపెడితే ఆగదు? ఈ సుడిగుండంలో చిక్కుకున్న తరవాత ఉత్తములు కూడా అట్టడుగుకు పోవచ్చు. అధికారంలో ఉన్నవారికి అదే అత్యున్నత దశగా కనిపించవచ్చు. సాంఘిక తత్వాన్ని, రాజకీయ ఆచరణను నీతిశాస్త్రంతో సామరస్యంగా కలపటం నేడు జరగవలసిన పని. మానవుడు నీతిమంతుడనే సూత్రాన్ని ప్రాతిపదికగా విప్లవ, సాంఘిక త్తవం రూపొందిస్తే, అదే మానవుడి సార్వభౌమత్వాన్ని మౌలికమైన విషయంగా స్వీకరిస్తుంది. ఈ నమ్మకం చిరకాలం నుంచి ఉన్నప్పటికీ ఆచరణలో నిలబడలేదు. మానవుడు హేతువాది కనక నీతిమంతుడనే వాస్తవం ఆధారంగా ఇప్పుడే విశ్వాసాన్ని పునరుద్ధరించాలి. విశ్వం నైతిక క్రమంతో కూడింది. దాని నియమైలన్నీ అంతర్గతంగా ఉన్నాయి. మానవుడు అందులోనుంచే ఆవిర్భవించాడు. సాంఘిక తత్వానికి నీతిశాస్త్రం ఆధారం కావాలి. అదీ నేటి అవసరం. అలౌకికవాదం ఊబిని, సాపేక్షతావాద లోపాలను తొలగించటానికి నీతి శాస్త్రాన్ని సర్వసాధారణ తత్వంతో ఇమడ్చాలి. మళ్ళీ ఆకాశంలో మేడలు నిర్మించటం అనవసరం. మళ్ళీ ఒక గాలివాన వస్తే ఆ మేడ కొట్టుకు పోతుంది. మానవతా వాద నీతిశాస్త్రం సహజ వివేచనా వాద ఆధారంగా ఉంటుంది. దీనికి పునాదిగా యాంత్రిక విశ్వశాస్త్రం, పదార్థ వాస్తవికతతో కూడిన ‘సత్’ వాదం ఉంటుంది. ఆధునిక విజ్ఞానం తెచ్చిపెట్టిన సమస్యలను పరిశీలించటంతో మనం ప్రారంభించాలి. నిర్జీవ, సజీవ, ప్రపంచానికి మధ్య వారధి ఎక్కడో కనుక్కోవాలి. ఈ వారధి అదృశ్యం కాలేదు. కనక జీవానికి మూలం ఏదో తేలిపోయింది. ప్రకృతి యాంత్రిక విధానంలో జీవం ఆవిర్భవించినట్లు కనుగొంటే నియమబద్ధమైన ప్రకృతి నుంచి మానవుడి వివేచనను రాబట్టవచ్చు. పదార్థ శాస్త్రానికీ, మానసిక విజ్ఞానానికీ ఇన్నాళ్లుగా ఊహించుకుంటున్న అఖాతానికి వారధి ఏర్పడుతుంది. తత్వశాస్త్రాన్ని కలవరపెడుతున్న జ్ఞానసంబంధమైన సమస్యలు పరిషారమవుతాయి. సత్యం అనేది అతి భౌతిక భావాలు కాదు. ప్రత్యక్ష జ్ఞానానికి వస్తువుగానే సత్యం ఉంటుంది. సత్యానికి సంబంధించిన ఈ మౌలిక స్వభావం తెలుసుకున్న అనంతరం ఇతర విలువల స్వభావం ఇంకా స్పష్టపడుతుంది. అప్పుడు వాటిని హేతుబద్ధంగా వాటి స్థానాలలో ఉంచవచ్చు. ఈ విధంగా మానవుడి ఉనికి, మార్పుకి సంబంధించిన ప్రపంచంలో నైతిక విలువలను బాబట్టటంతో, వాటిని సాంఘిక తత్వంతో సమన్వయించవచ్చు. అప్పుడు సమకాలీన ప్రపంచాన్ని ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ సమస్యలకు మానవతా దృక్పథంతో కూడిన ఈ సాంఘిక తత్వం తోడ్పుడుతుంది. రచయిత అనువాదం ఎమ్.ఎన్.రాయ్ నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment