ఆవుల గోపాలకృష్ణమూర్తి నా అమెరికా పర్యటన

నా అమెరికా పర్యటన రచన ఆవుల గోపాలకృష్ణమూర్తి (1917-1966) నా అమెరికా పర్యటన NAA AMERICA PARYATANA By Aavula Gopalakrishnamuthy First Edition : June 2014 Cover Design : Brahmam, Bhavana Graphics, Hyd., Cell : 9848254745 Price : Rs. 75 /- $ 10 © Publishers Published by : Telugu Print Plot No. 790, SKD Nagar, Vanastalipuram, Hyderabad – 500 070. Ph : 040 – 24241141 : +91-8143213738 Email : teluguprint@gmail.com Website : www.TeluguPrint.com All rights reserved. This book or any portion there of may not reproduced or used in any manner whatsoever without written permission of the publisher. Books available at : N. Innaiah 2 Hawlings Court, Brookville, MD 20833, USA Email : innaiah@gmail.com innaiahn@yahoo.com Sole Distributors : Navodaya Book House 3-3-365, Opposite Arya Samaj Kachiguda ‘X’ Roads, Hyderabad – 500 027. Phone : 040-24652387 For e-book : www. TeluguBooks.in Composed by : D. Nagalakshmi, Cell : 9912940182 Printed by : Charita Impressions, Hyderabad – 500 020. Ph : 040-27678411 ఈ పుస్తకంలో..........? ప్రఖ్యాత పత్రికా రచయిత, హ్యూమనిస్టు, వక్త, ప్రముఖ న్యాయవాది, ఎ.జి.కె. అమెరికా ప్రయాణానుభవాల గాథలు యితివృత్తం. ఎందరో అమెరికా వెళ్ళారు. తిరిగి వచ్చారు. కాని, ఎ.జి.కె. ప్రయాణం విశిష్టమైనది, విలక్షణమైనది. అమెరికా జీవితాన్ని అన్ని కోణాల నుండి చూచిన తీరు తెన్నులు, మనకూ వారికీ వివిధ రంగాల్లో గల పోలికల తీరులు గమనార్హాలు. ఇందలి ఒక్కొక్క శీర్షిక ఒక్కొక్క మచ్చుతునక. దేనికది ఒక వ్యాసం, ఒక వ్యాఖ్యానం. అన్నీ కలిస్తే అదొక గ్రంథం. ఇందులో కవులకు కవిత, సాంఘిక వాదులకు సాంఘిక ఇతివృత్తం, ప్రజాస్వామ్య వాదులకు భావ పునాదులు, రైతులకు, విద్యావేత్తలకు, స్థానిక పాలకులకు వలసిన విషయం వుంది. విషయ ప్రథానమీరచన. మీకై మీరే చదివి చూడండి. -- ప్రథమ ప్రచురణకర్త విషయానుక్రమం ముందుమాట ఇన్నయ్య ముందుమాట ప్రకృతిలో ప్రయాణం 1 దారిలో..... 6 ప్రజలు-ప్రవృత్తులు 8 ప్రభుత్వం ప్రజలు 20 రొండు నెలల్లో.... 30 విద్యావిధానాలు 44 “పిల్లలు ఎక్కడున్నా పిల్లలే” 54 స్థానిక సంస్థలు 58 పత్రికాలోకం 64 న్యాయస్థానాలు 76 సాంఘిక సంక్షేమం 84 వారివాజలు 96 నీగ్రో సమస్య లేక మానవ సంబంధాలు 98 అమెరికాలో వ్యవసాయం 109 అంతర్జాతీయ రైతులోకం 118 అమెరికాలో హ్యూమనిజం 122 ఒక సన్నివేశం 125 దృశ్యప్రబంధాలు 127 మరికొన్ని విశేషాలు 141 ముగింపు 149 ముందుమాట అది మా అమ్మాయి జయశ్రీ పెండ్లిరోజు. నాకు, హేమలతకు వివాహమై రజతోత్సవముహూర్తంలోనికి నడిచేరోజు. అమెరికా ప్రభుత్వం తమ దేశంలో రొండు మాసాలపాటు పర్యటించ వలసిందిగా ఆహ్వానించి మిత్రుడు బి.యస్.ఆర్. కృష్ణను తెనాలి పంపి, తమ ఆహ్వానాన్ని నాకందజేసిన రోజు. అది ఒకటవ జూన్ 1963. పర్యటనకై తెనాలిలో బయలుదేరింది ఎనిమిదవ నెలలో పదమూడవ తేదీ. దేశాన్ని వదిలింది ఆగష్టు పదిహేను. తిరిగి తెనాలి చేరింది నవంబరు మూడో తేది. ఆప్తులు, మిత్రులూ తటపటాయించి, 'చెప్పితే వినడు, పదమూడవ తేదీన, ఎనిమిదో నెలలో ఇంత దూరం వెళ్ళడానికి ప్రయాణం కడతారా?' అంటూ నాలుకలు కొరుక్కున్నారు. వచ్చిన రోజు మూడో తేదీ కాగా, సుఖంగా ప్రయాణం చేసిరాగా, అనుమానపడిన వారంతా సంతోషించారు. దేశ దేశాలూ తిరిగి --- అమెరికాలో అరవై రోజులు, ఇంగ్లండులో పదకొండు, హాలెండు, జర్మనీ, ఫ్రాన్సులలో చెరి నాల్గు రోజులు గడిపి ఇంటికి చేరాను. చోటు మారినప్పుడల్లా కొత్త కొత్త అనుభవాలు, దేశాల తారతమ్యాలు చూడ వీలైంది. ప్రజల్లోని వ్యత్యాసాలను గమనింప వనరుకుదిరింది. ప్రయాణమని తెలియగానే అనేకులైన మిత్రులు, ఎన్నో సంస్థలు, మా వూరు రమ్మని పిలుపులని పంపారు. ఆదేశించారు. ఆహ్వానించారు. సభలు చేసారు. సన్మానాలనిచ్చారు. సలహాలనిచ్చారు. కోర్కెల్ని చెప్పారు. సూచనల్ని చేశారు. ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. వారు భావించిన నా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకురమ్మన్నారు. వూకొట్టి, సరేనని వెళ్లాను. నా యీ పర్యట నానుభవాలే వారి భావాలకు నా వుడుగరలు. దేశం దాటి యెన్నడూ బయటికి వెళ్లనివాణ్ణి. అంతే కాదు, 1938 లో చదువులకు లక్నో వెళ్లకముందు బెజవాడ దాటి వెళ్ళనివాణ్ణి. యెన్నడూ విమాన మెక్కనివాణ్ణి. విదేశ ఆహారాన్ని యెన్నడూ తిననివాణ్ణి. అంతా కొత్త మేళం. వేషంలో కూడా నగిషీలకు పోనివాణ్ణి. అన్నీ మార్పులే! ఆ మార్పులకు, మారుతున్న ప్రాంతాలతో మారనినేను, మేళవించుకుంటూ తిరుగాడి వచ్చాను. వచ్చిన తర్వాత, జిల్లాలో అనేకంగానే గాక, సర్కారు జిల్లాలన్నీ తిరగక తప్పలేదు. నా అమెరికా పర్యటనలో నేను సంతరించుకున్న అనుభూతుల్ని, విషయాల్ని, భావాల్ని వాటి ప్రభావాన్ని నా ఎరిగిన వంతు చెప్పుకుంటూ వచ్చాను. ఎందరో పిలిచి, కుతూహలంగా విన్నారు. ప్రశ్నించారు. సమాధానాల్ని ఆదరించారు. అనేకవేలమంది జనాలకు వినిపించిన యీ గాథలనే కాగితస్థం చేస్తున్నాను. దీనికి ఆయా సమావేశాల ప్రోత్సాహమే కారణం. నేను అమెరికాలో తిరుగాడుతూ ఉండగా, ప్రయాణానికి ముందు తెనాలి న్యాయవాద సంఘ సమావేశంలో నేనేదో అన్నానని నా వెనుక ఆంధ్రావనిలో ఒకరకపు దుమారాన్ని, ఒకపాటి ప్రచార తుఫాన్ని లేవదీసారు. నన్ను అమెరికానుండి త్రిప్పి పిలువమన్నారు. విజ్ఞతలో అజ్ఞతను ప్రదర్శించారు. నామీది దుమారం, నా అనుకూల శక్తుల బలాన్ని ప్రేరేపించింది. ఎన్నో ప్రాంతాలవారు, మరెన్నో పత్రికలూ ముందుకువచ్చి, మన్నన చేసినై. తెలియని తెలుగుదేశం నా అమెరికా పర్యటనను గమనించవలసి వచ్చింది. నా పరోక్షంలో నన్ను బలపరచిన వారందరికీ నా వినతి. నేను వెళ్లకముందు, నా రాక అనంతరం, ఎంతగానో మక్కువతో నన్ను ఆహ్వానించి, సన్మానించి, ఆదరాన్ని, హృద్యతను ప్రదర్శించిన మంత్రులందరికీ నా ధన్యవాదాలు చెప్పితీరాలి. పేరులన్నీ చెప్పినా, సంస్థలనన్నింటినీ పేర్కొన్నా, సన్మానాల్ని ఏకరవుపెట్టినా, అంత బాగా ఉండకపోవచ్చు. పేరులన్ని చెప్పినా, సంస్థలనన్నింటినీ పేర్కొన్నా, సన్మానాల్ని యేకరువుపెట్టినా, అంత బాగా వుండకపోవచ్చు. నా ఈ సంచారం నాకొక కనువిప్పు కావించింది. లోకాన్ని గ్రంథాల్లోనే చూచిన నాకు, ప్రత్యక్ష ప్రమాణంగా ఈ పర్యటన చూపి, చెప్పించి, గ్రంథావలోకనకూ, దృశ్యావలోకనకూ వున్న వ్యత్యాసాన్ని చూపింది. ఆ తేడా విశేషమైనది. బలీయమైంది. దాని ప్రభావమే యీ రచనకు పురికొల్పింది. చదువరులీ విషయ సంచయాన్ని తిలకించి, పరిశీలించి, తదనుభూతుల్ని పొందగలరని ఆశిస్తున్నాను. ఆలస్యమైనా, నా యీ అనుభవాలకు ఆకృతికై పూనిక చేసిన మిత్రులకు కృతజ్ఞతలు. తెనాలి 1 - 4 - 66 --గోపాల కృష్ణమూర్తి. నరిసెట్టి ఇన్నయ్య మాట ఈ పుస్తకం ఇప్పుడెందుకు పనికొస్తుంది తెలుగువారు అమెరికా యాత్రకు వెళ్ళినప్పుడు బంధువుల దగ్గర పిల్లల దగ్గర వుంటూ పర్యటన చేసి తిరిగి వస్తుంటారు. అమెరికాలో ఉన్నప్పుడు యాత్రలో కొన్ని స్థలాలు విశేషాలు గమనించి వస్తారు. సర్వసాధారణంగా వారాంతంలోనే బయటికి వెళ్ళడానికి పిల్లలకు వెసులుబాటు వుంటుంది గనక అప్పుడు సాధ్యమైనన్ని తిరిగి చూస్తుంటామని చెప్పారు. మిగిలిన రోజుల్లో ఇళ్ళల్లోనే టి.వి.లు చూస్తూ కూర్చోవాలని, బోరుకొడుతుందని ఇంగ్లీషు అంతంత మాత్రంగా మాట్లాడేవారయితే బయటివారితో పలకరింపులు కూడా వుండవని ఫిర్యాదు చేస్తారు. అమెరికా వంటి అగ్రరాజ్యానికి వెళ్ళినప్పుడు చూచి నేర్పుకోవలసినవి మనకు అక్కరకు వచ్చే విషయాలు వెంట తెచ్చుకోవలసినవి అనేకం వున్నాయి. మన సంస్కృతిలో వారికి అందించవలసినవి కొన్ని వున్నాయి. అమెరికాలో అన్ని ప్రాంతాలలోనూ అందరికీ పనికొచ్చే కార్యక్రమాలెన్నో నిరంతరం జరుగుతుంటాయి. వెళ్ళినవారు తెలియక తెలిసినా జంకుతో ఎక్కడికీ వెళ్ళరు. ఆ విషయాలను సరిదిద్దుకోటానికి ఈ రచన ఎంతో ఉపకరిస్తుంది. లోతుపాతులతో సమాజాన్ని పరిశీలించటం ఎలా? మంచిని స్వీకరించి చెడును తొలగించుకునే ప్రయత్నానికి ఈ పుస్తకం ఎంతో తోడ్పడుతుంది. అమెరికాలో వుంటూనే చాలాకాలం ఉద్యోగాలు చేస్తూనే లోతైన విషయాలు గ్రహించకపోవడం కూడా గమనిస్తున్నాం. అవి కూడా సరిదిద్దుకోవడానికి ఎజికె రచన కరదీపికగా పనికివస్తుంది. అందువలన 50 ఏళ్ళ తరవాత కూడా దీని విలువ పెరుగుతూనే వచ్చింది. కనుక పునర్ముద్రణ అవసరమని భావించి దేశవిదేశాలలో తెలుగువారికి అందిస్తున్నాం. వ్యాసోపన్యాసకుడుగా పేరొందిన మానవవాద ప్రముఖులు కీ.శే. ఆవుల గోపాలకృష్ణమూర్తి. మిత్రుల మధ్య ఎజికెగా ఒకనాడు బహుళ ప్రచారం పొందిన వ్యక్తి. 50 ఏళ్ళ జీవితం ముగించకముందే గుండెపోటుతో చనిపోయిన ఎజికె తెనాలిలో ప్లీడరుగా ప్రాక్టీసు చేస్తున్న రోజులలో అమెరికా ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడం ఆశ్చర్యకరమైన విషయం. ఆయన తెలుగు వారిలో మానవవాద ప్రచారాన్ని విస్తృతంగా చేసిన వ్యక్తి ఎమ్.ఎన్.రాయ్ మానవవాద భావాల ప్రభావంతో పెరిగిన దిట్టగా అటు సాహిత్య రంగంలోను ఇటు విమర్శనా లోకంలోను మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ, తెలుగు ప్రాంతానికి మించిపోని ఆ వ్యక్తి అమెరికా వారి ప్రభుత్వాన్ని ఆకర్షించటం ఒక విశేష సంఘటన. ఇప్పటికీ ఏ విధంగా ఆయన అమెరికా ప్రభుత్వాన్ని ఆకట్టుకోగలిగారో తెలియదు. కానీ వారిచ్చిన ఆహ్వానాన్ని పురస్కరించుకుని అమెరికా పర్యటన చేసి వచ్చిన తరువాత అలాంటి వ్యక్తిని ఆహ్వానించగలగటం గర్వకారణంగా అమెరికా వారు భావించారు. గోపాలకృష్ణమూర్తి ఇంగ్లీషు తెలుగు భాషలలో పరిణితి చెందిన ఉపన్యాసకుడు, వ్యాసరచయిత. 1940 నుండి 65 వరకు ఆయన తెలుగు పత్రికలలో కొన్ని ఇంగ్లీషు పత్రికలలో విమర్శనాత్మక వ్యాసరచన చేశారు. అనువాదాలు అతికొద్దిగానే చేయగలిగారు. అఖిలభారత స్థాయిలో మానవవాద నాయకులను హేతువాద ప్రముఖులను ఆకట్టుకోగలిగారు. కొన్ని వందల వివాహాలు సెక్యులర్ పద్ధతిలో చేశారు. అనేక రచనలకు నిశిత పరిశీలనతో కూడిన పీఠికలు రాశారు. అలాంటి వ్యక్తి ఉపన్యాసాల రికార్డు లభించకపోవటం పెద్దలోపమే. అమెరికా పర్యటన చేసి వచ్చిన తరువాత ఆయన చేసిన రచన 1966 ప్రాంతాలలో రచన చేసినా నాటికీ నేటికీ దాని విలువ ఏమాత్రం తగ్గలేదు. కేవలం ఆనాటి అమెరికా లెక్కలు మాత్రం నేటికి సరిచేసుకోవచ్చు. మిగిలినవన్నీ నేటికీ పరిశీలించదగినవి. ఈ రచనను ఇంగ్లీషులో వెనిగళ్ళ కోమల అనువదించారు. అది వెబ్ సైట్ లో లభిస్తున్నది. నేటి విద్యార్థులకు యువతరానికి ఈ రచనలోని పరిశీలనలు గమనార్హం. ప్రకృతిలో ప్రయాణం "మా దేశంలో అరవై రోజులు పర్యటించి వార్తాపత్రికలు, పత్రికా రచన, న్యాయస్థానాలు ఇంకా మీ అభిరుచికి అనుగుణమైన ఇతర అంశాలు పరిశీలించి, ఇష్టం వచ్చిన చోట్లు చూచి, నచ్చిన వారలను కలసికొనిరావచ్చు"నని అమెరికా ప్రభుత్వాహ్వానం రాగా అంగీకరించి ప్రయాణం కట్టాను. దూరప్రయాణం అయినా, ప్రయత్నాలు చిన్నవి. అది స్వతంత్ర దినోత్సవపు రోజు; ఆగస్టు పదిహేను. తెల్లవారకముందు, 4 గంటల 45 నిమిషాలకు టి.డబ్లియు.ఎ. వారి జెట్ బోయింగ్ విమానంలో యానం ప్రారంభమైంది. బొంబాయి ఇంకా బాగా మేలుకోలేదు. దీపాల తారావళుల నిగనిగలు తప్ప, ప్రజల కోలాహలాలు ప్రారంభం కాలేదు. స్వాతంత్ర్య దినోత్సవం గనక జన సందోహ కార్యకలాపాలు చాలా వుంటాయి. నా వెనక స్వాతంత్ర్య దినోత్సవ సంరంభాలను వదిలినా, నా ముందు--- నేను న్యూయార్కు మన స్వాతంత్ర్య దినోత్సవం రోజునే--- చేరగలనన్న సంతోషం వుంది. నా ప్రయాణాన్ని సాగించే జెట్ బోయింగ్ బాగా ఖరీదుగల 'గాలి జంతువు'. రెండు కోట్లకు తక్కువ కాదు. గంటకు 600లకు తక్కువగాని, ఆరు లేక ఏడు వందల మైళ్ళ మధ్యగాగాని ఉరవడి చేస్తుంది. నిమిషానికి 10 మైళ్ళకు మించి వేగం అంటే మా మామూలు ఊహలకు అందదు. గాలికన్నా వేగంగా, మన కొందరి మనస్సులకన్నా దుడుకుగా ఈ బోయింగ్ ప్రయాణం చేస్తుంది. అంతే కాదు. నేలకు, నీటి మట్టానికి 25,000 అడుగులకు పైగానే యానం సాగిస్తుంది. మధ్య మధ్య, ముఖ్యంగా పారిస్ నుంచి న్యూయార్కుకు 35,000 అడుగులకు పైగా పోతుంది. బొంబాయిలో ఆగస్టు ఉదయం 4 గంటల 45 నిమిషాలకు బయలుదేరి అదే రోజున న్యూయార్కును రాత్రి 7 గంటల 10 నిమిషాలకు చేరుకున్నాము. అంటే మనం దాన్ని 14 గంటల 25 నిమిషాలుగా లెక్క చేయవచ్చు. కాని అంతకన్నా హెచ్చు కాలమే పట్టింది. లెక్కలో యిట్లా 14 గంటల 25 నిమిషాలే సరిపోతే, ఎక్కువ పట్టిందని యెట్లా? ఎందుకు ఎక్కువ పడుతుంది? విమానం నెమ్మదిగా వెళ్ళిందా? మరెందుకని? అన్న ప్రశ్నల పరంపర తప్పదు. దీనికి సమాధానం... భూమి బల్లపరపుగా వుంటే సమాధానం లేదు. భూమి చుట్టూ, పూర్వులు అనుకొన్నట్టు, సూర్యుడు తిరిగినా సమాధానం లేదు. అవి రెండూ కావు. భూమి గుండ్రంగా వుంది, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ వుంది. అందువల్ల సమాధానం వుంది. ప్రయాణం 14 గంటల 25 నిమిషాలకన్నా హెచ్చు పట్టింది; పట్టినా 15 వ తేదీ రాత్రి ఏడుగంటల పది నిమిషాలకే న్యూయార్కు చేరుకున్నాను. అది 27 గంటల చిల్లర ప్రయాణం. ప్రకృతిలో జరిగిన ఈ ప్రయాణంలో ఒక పెద్ద పోరాటం జరుగుతుంది. మన పురాతన భావాలకు, నేటి భావాలకు మాత్రమే కాదు. ప్రకృతికి మానవ ప్రయత్నానికి మధ్య జరుగుతుంది. ఏమిటా పోరాటం? ప్రకృతిలో భాగమైన సూర్యుడు క్షణ క్షణానికి ఒక్కొక్క ప్రాంతంలో ఉదయిస్తున్నట్టు కనబడతాడు. భూమి గుండ్రంగా ఉన్నందున, భూమి సూర్యునిచుట్టూ తిరుగుతున్న కారణాన ఆ పని జరుగుతుంది. వినోదంగా తోస్తుంది. అంటే 24 గంటలలో నిత్యం ఒకచోట తెల్లవారుతున్నట్టు, ఒకచోట ప్రొద్దు గ్రుంకుతున్నట్లు కనబడుతుంది. నిజానికి ప్రొద్దు పొడవడమూ లేదు. క్రుంకడమూ లేదు. గోళ భ్రమణం వల్ల అట్లా కనబడుతుంది. అది మిథ్య కాని సత్యం. మనకది---కొందరకు ముఖ్యంగా. మతవాదులకు --- వినోదంగా వున్నా, ప్రకృతికది దినచర్య మాత్రమే! ఈ చిన్న శాస్త్రజ్ఞానాన్ని అంగీకరించేవారికందరకూ అది నిజంగా మామూలే! మా విమానం బొంబాయినుంచి, సౌది అరేబియాలోని నూనె పట్టణమైన 'దర్.హామ్'లో ఆగింది. తరువాత ఈజిప్టు ముఖ్యపట్టణమైన 'కెయిరో' లో ఆగింది. గ్రీసు ముఖ్యనగరం 'ఏథెన్స్'లో తరువాత దిగాము. ఇటలీ ముఖ్య పట్టణం 'రోమ్'లో ఆగాము. ఫ్రాన్సు రాజధాని 'పారిస్'లో మజిలీ పెట్టాము. అక్కడినించి, ఇంగ్లండ్ తప్పించుకొని, సరాసరి అమెరికాలోని ముఖ్యనగరమైన ‘న్యూయార్కు’ చేరి రాత్రి 10 గంటలకు అమెరికా ముఖ్యపట్టణం, ప్రభుత్వ కేంద్రం, వాషింగ్టన్ చేరినాము. అది ఆగస్టు 15 వ తేదీ -- మన స్వతంత్ర దినోత్సవ దినం. కాని, నేను వాషింగ్టన్ లో దిగినప్పుడు రాత్రి 10 గంటలయితే ఇండియాలో రాత్రి 10 గంటలు కాదు. అది ఆగస్టు 15 వ తేదీ కూడా కాదు. ఆగస్టు 16 వ తేదీ ఉదయం 8 గంటలవుతుంది. మనము ఆగిన అయిదు పట్టణాలలో -- దర్ హమ్, కెయిరో, ఏథెన్సు, రోమ్, పారిస్ -- నాలుగు గంటలసేపు ఆగి ఉన్నాము. కేవల ప్రయాణంలో 23 గంటల చిల్లర ఉన్నాము. చిత్రమేమంటే, ఈ 27 గంటలు పయనించి న్యూయార్కులో 7-10 నిమిషాలకు చేరినప్పుడు అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. తర్వాత మూడు గంటలకు వాషింగ్టన్ చేరాము. అంతా ఒక పెద్ద పగలే మాకు! ఎంత పెద్ద పగలు? ఎట్లా? ఈ చిత్రమేమిటి? పగలుకు 12 గంటలేకదా? అన్న ప్రశ్న వస్తుంది. అదే చిత్రం. అదే ప్రకృతిమీద మానవుడు చేసిన పోరాటం. పగటి రోజును తను 12 గంటల నుంచి 27 గంటలకు పొడిగించుకున్నాడు. ఇంకా ప్రయాణం సాగించి న్యూయార్క్ నుంచి అమెరికా గుండా శాన్ ఫ్రాన్సిస్కో మీదుగా జపాను, బర్మా, బొంబాయి వస్తే, పగటిరోజును 27 గంటలకన్నా 44 గంటలకన్నా పొడిగించవచ్చు. అంతే కాదు. ప్రకృతితో పందెం పెట్టి ఒకడు అసలు రాత్రినే చూడనని నియమం పెట్టి, గెలవవచ్చు. లేదా, వెనక్కు ప్రయాణం జరిపి, అసలు పగలునే చూడనని పందెంవొడ్డి ప్రకృతి మీద గెలవవచ్చు. శాస్త్రం యిచ్చిన సహాయంతో, మానవకృషి ప్రకృతి మీద ఇంత ప్రభావాన్ని సాధించింది. దీనికి మతవాదులు చింతిస్తే, మనం వారిని ఏమీ అనము. ఇది పదార్థ యదార్థగాధ. ఈ పయనంలో ప్రకృతి ధిక్కారమూ లేదు. లొంగుబాటూ లేదు. ఇది కేవలం ప్రకృతిలో పయనం. పదార్థ యథార్థతను గమనిస్తూ, గమనించినదానిని గుర్తిస్తూ, ఉండడమే ఈ పయనంలోని ఆంతర్యం. నాకు ప్రయాణంలో 27 గంటల పగలు దొరికింది. మనవాళ్ళు దీన్ని 'దేవ మానాల' లోకి లాగరుగదా! ఇంత దీర్ఘపు పగలును అందంగా భావించడానికి, మనస్సుకు కావలసినంత అందాన్ని, ఆనందాన్ని, శివాన్ని పుట్టించగల పదార్ధ ప్రభావ మాధుర్యాన్ని ఈ ప్రభాతం కలుగజేసింది. స్వాతంత్ర్యం వచ్చి 16 యేళ్ళయినా, యింత గొప్ప భానూదయాన్ని నేనిదే మొదటిసారి చూడడం. వినడం లోగడ జరిగింది. విన్నదానికి కన్నదానికి వున్న వ్యత్యాసానికి విస్తుపోవడం మానవునికి మామూలే. ప్రభాత భేరీలు విన్నాము. సుప్రభాత స్తవాల్ని వింటున్నాము. వైతాళిక గానం అనుభవించాము. కాని, ఆ ప్రభాతాన్ని ప్రతివానికి చూపవలసిందే!! అప్పుడు యెవరి అనుభూతిని వారు పొందుతారు. భూమి అంచుల్ని, గోళాకృతిని ప్రస్ఫుటంగా చూడగలంత ఎత్తులో యానం సాగుతుంది. రంగులు మనవారన్న ఏడు మాత్రమేనన్నది తప్పేమోననిపించినన్ని రంగులు కనపడినవి. రంగుల మిశ్రమంలోని మంజులత్వంవల్ల, లాలిత్యంవల్ల అట్లా కనపడిందేమో? భ్రాంతి కలిగించగల సరంజామా అనంతంగా వున్నా దృశ్యమిది. దృశ్య గోళమో, గోళ దృశ్యమో! కాని అది ప్రభాతం. భూమికీ, నీటికీ మాకు మధ్యగా మేఘాల దొంతరలు అనంతంగా అగుపించే మేఘమాలికలు వున్నై. భూమికీ, మాకూ వున్న దూరం తెలుస్తుంది గాని, మాకూ మేఘలోకానికి వున్న దూరం గాని, వాటికీ భూమికీ వున్న దూరం గాని తెలియకనే ఉండిపోయింది. సూర్యుడిని ప్రసవించడానికి ప్రకృతి ప్రసవ వేదనలో పడింది. కాని ప్రసవం పూర్తి కాదు. ఆ వేదనలో సూర్యుడూ ప్రకృతీ నలిగిపోతున్నారు. మానవుడు పొందగల్గిన అనుభూతికి ఇద్దరూ వ్యవధినిస్తున్నారు. కాని, ఈ లోగా ఆ దృశ్యంలోని రంగుల రమణీయత చంచలం. దృశ్యం క్షణ క్షణానికి వినూత్నాకారాన్ని ధరిస్తూ వున్నా, సూర్యుడు ప్రకృతి గర్భం నుంచి త్వరలో విముక్తుడు కాలేకపోతున్నాడు. ప్రసవ వేదన జాస్తియై "కంద గద్దలాగయ్యే భూకాంతు ముఖము" అన్నట్లుంది. సూర్యోదయాన్ని వర్ణించిన మన కవులకీ దృశ్యం అందలేదు. అందినమనం కవులం కాము. అందువల్ల అసలు విషయం కవిత్వంలోనికి రాలేదు. అది అందరికీ లోటు. కనబడే మేఘాల దళసరితనం తెలియడంలేదు. మేఘాలే కొండలు కొండలుగా, పోగులు పోగులుగా, గుత్తులు గుత్తులుగా --- మల్లీశ్వరిలోని భానుమతిగారి పాటకు, కృష్ణశాస్త్రిగారి కవిత్వాన్ని మించి --- వుంగరాలుగా, తోరణాలుగా, గుర్రాలుగా, ఏనుగులుగా, సింహాలుగా, మేకపిల్లలుగా, ఆవులుగా, ఆంబోతులుగా --- ఇదీ అదీ అని ఏమి --- ప్రకృతిలో మనం చూచినా, చూడని జీవాల జంతువుల రూపాలు తాల్చినవి. విమానం పైకి పోయేటప్పుడూ, క్రిందికి వచ్చేటప్పుడు మేఘ గర్భాన్ని చీల్చి, 'చొరవతో బోయాండ్రు నడయాడు' ప్రాంతాల్ని చూచాము. దూరంలో సముద్రం వుందనుకోవడం కొంతసేపు. చూడడం కొంతసేపు. దగ్గరలో మేఘాలు, సూర్యుని బంగారు రంగు మేఘాలమీదపడి, నీలంగా, ఆకుపచ్చగా, పసుపు పచ్చగా, గోమేధికంగా, పుష్యరాగంగా, కెంపుగా..... మరీ మరీగా రంగుల్ని సృష్టించింది. సూర్యుని బంగారురంగు వదలి --- రాణివాసం వదలి --- తెలుపు దుస్తుల రంగు రాబోయేసరికి రెండున్నర గంటలకన్నా పైన పట్టింది. భూమి వృత్తాకారం దృగ్గోచరమై భూమికి సముద్రానికి అంచులలో మెరిసే జ్యోతిని చూస్తె, వర్ణనీయంగాను, వర్ణనాతీతంగాను, కవికి కవిత నేర్పే దృశ్యమది. ఆ అంచుల దగ్గరలోనే మేఘాలు వార్డులుగా, పట్టణాలుగా, నగరాలుగా తయారౌతూ, విచ్చిన్నమైపోతూ వుంటవి. సముద్రం అంచులలో కక్కే నురుగే మేఘాలుగా మారినట్లు గోచరిస్తుంది. మేఘాలు సంద్రానికి కప్పిన పెద్ద వలపుగా తోస్తాయి. మేఘాలే ఒక ప్రత్యేకపు కడలిగా తయారౌతాయి. విమానం దిగేటప్పుడు, మేఘాలగుండా దూరి క్రిందికి జారేటప్పుడు మా పాదాలనుంచి సముద్రతీరానికి మేఘాలు మెట్లు కట్టి, ఆహ్వానాన్ని పంపి, క్రిందికి దయతో కూడిన అసూయతో పంపివేస్తవి. ఆ దృశ్యంలోని సౌరు సంపదను అనుభవంలోకి మలుచుకోవడం కష్టం. మేఘాల అందం 15 వ తేదీ 10 గంటలు దాటిన తర్వాత తగ్గింది. క్రింద తెలుపు, యిసుక రేణువుల పసిమి జాస్తిగా వచ్చినవి. ఈ విధంగా ప్రకృతిని మనచేతులలో మలుపుకుంటూ, పగటిరోజుకు ప్రాణం పోస్తూ, దాన్ని 27 గంటలదాకా బ్రతికించి, అంతలో న్యూయార్కు రాగా, పగటిని బ్రతికించవలసిన పనిలేక, దానిదారిన దాన్ని జారనిచ్చాము. రాత్రి వచ్చి మమ్ము ఆతురతతో, చిక్కనే చిక్కారురా అంటూ వాటేసుకుంది. ఇది ప్రకృతిలో నా మొదటి పయనం. 'ఆంధ్రజ్యోతి' నుండి 1 - 9 – 63 దారిలో..... ప్రకృతి శోభల పరవళ్ళు నింగిలో యెగురుతున్నంతసేపూ చూస్తూ, నేలమీదికి రాగానే, మానవనిర్మిత కేంద్రాల్ని పరిశీలించగలం. తొలిమకాం, డర్ హామ్. వట్టి ఇసుకపర్రల పట్టణం. నూనెగనులరాణి. విమానాశ్రయంలో కన్నుకు తగిలి గుర్తుపడక తీరని వనరులేమీ లేవు, చలనం లేదు. కెయిరో మలి మకాం. ఫరూకులపాలన, పిరమిడ్ నిర్మాణం, మానవ విజ్ఞానపు ప్రాచీనతలు జ్ఞప్తికిరాగా కెయిరోలో దిగాము. డర్ హామ్ కన్నా పెద్ద కేంద్రం. విమానాశ్రయాన్ని పెద్దదిగానే చేశారు. శ్రుతిమించిన నిక్కచ్చి, నియతభావ ప్రభావం దోబూచులాడుతుంది. జవాన్.ల వంటి మనుషులు. మగవారికే ముసుగులు. కాని, చలనం కనబడుతుంది. అరబిక్ లోకశిల్ప దర్శనాన్ని కల్గించాలన్న ప్రయత్నం గోచరిస్తుంది. మిశ్రత, ఆ నిర్మాణాలల్లో కలదు. ఇక మూడో మజిలి ఏథెన్సు. చిన్నది. కాని ఎన్ని ప్రాచీన స్మృతులకు ఆలవాలం! సోక్రటీస్, ప్లేటో, ఎరిస్టాటిల్, ప్రోటో గరస్, డెమోక్రిటస్, తూసిడైడెస్, తేల్స్..... ఏస్కైలస్, ట్రోజన్ హార్స్ .... ఎన్నో చరిత్రాంశాలు. ఎందఱో తత్వవేత్తలు, దార్శనికుల మనోదర్శనాన్ని భావిస్తూ, ఆ పూర్వ నాగరికతల విలువల పురిటిగడ్డలో ఉత్తేజంతో అడుగు పెట్టాము. చిన్న భవనాలు. మన మంగుళూరు పెంకుల యిళ్లు. కాటిపాపటివారు యిక్కడ వాడే గంటలు వున్నై. అరివేణుకుండల లాంటివి కనుపించినై. ఆకులతో చేసిన బుట్టలు, యీనెలతో కూర్చిన తట్టలూ---గ్రీకులను మనకెంతో సన్నిహితులనుగా చేసినవి. సంగీత నృత్య వాద్యాలు ప్రదర్శించారు. మనకెంత సన్నిహితంగానో తోచింది. గ్రీకులు మనకు ఆది సోదరులు. ఏథెన్సు నుండి రోముకు తరువాతి గంతు. రోమ్ విజ్ఞానాలకన్నా గొప్ప రాచరికాలకు ప్రసిద్ధి. అయినా పూర్వ విజ్ఞాన పంక్తులలో వీరిదీ పై చేయి. ఏథెన్సు--రోముల మధ్యనే గదా రినైజాన్స్ ఉద్యమం ప్రగతిగన్నది! చిత్రకళలకు, శిల్పనైపుణ్యానికి అదొకనాడు ఆలవాలం. లియోనార్డో, మైకిలాంజిలో, మెడిచి సంస్కారాలు---లోకవిభూతులు. రోమ్.లో మనవైపు మొగ్గుకన్న పశ్చిమానికే వరుగుడు----పిజ్జాగోపురం మాదిరి---కనబడుతుంది. పారిస్.లో కనబడే నగిషీగాని, కెయిరోలో ప్రదర్శించబడు బలంగాని యిక్కడ అగుపడవు. ఇదీ మిశ్రజగత్తు. కనబడే వస్తువులు దీన్ని రుజువు చేస్తవి; మరుగుపరచలేవు. తరువాత నాజూకుమారి నారి పారిస్. విమానాశ్రయం నిగనిగలతో, మెత్తదనంతో, నిగారింపులతో, ప్రశాంతతతో, జనంతో నిండివుంది. నగిషీలరాణి గోచరిస్తుంది. పూర్తిగా పశ్చిమత్వం తొణికిసలాడుతుంది. వస్తువులు, సాహిత్యం, జనం పై భావాల్ని బలపరుస్తూ ఉంటవి. అందాల సౌరుకు తోడు బలగర్వంగూడా వున్నట్టు కనబడుతుంది. అక్కడనుంచి, ఒకే ఒక పరుగుతో అట్లాంటిక్ సముద్రం దాటి, హుటాహుటి నగరాల నగరమైన న్యూయార్కు చేరాము. *--*--* ప్రజలు – వృత్తులు మనదేశంలోనే మనం కూర్చొని 'లోకా స్సమస్తా సుఖినో భవంతు' అనుకొంటున్నా, లేక 'గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం' అనుకొంటున్నా కూపస్థ మండూక స్థాయి తప్పదు. దేశదేశాలు తిరగటంవల్ల ఇతర ప్రజల ప్రవృత్తుల సంగతి యెట్లా వున్నా మన ప్రవృత్తే మనకు బాగా తెలుస్తుంది. దూరంగా మనం ఉన్న దానికన్నా ఇతర ప్రజలు బాగా తెలుస్తారు. ఇతరత్రా ప్రయోజనకారి అయినా కాకున్నా విదేశ పర్యటన ఈ ద్వివిధ అన్వయ భావాన్ని పెంపొంద చేస్తుంది. అమెరికా ప్రపంచ దేశాల్లో జనసంఖ్యలో పెద్దది కాకపోయినా, పెద్ద దేశంగా, పెద్ద శక్తిగా ఒక కూటమికి నాయక దేశంగా, బడుగు దేశాల్లో యితోధిక సహాయకారిగా, జోక్యకారిగా మరెన్నో రీతుల పరిగణింపబడే దేశము. వారి జనాభా 18 కోట్ల 20 లక్షలుదాకా వుంది. మన జనాభాలో సగానికి తక్కువ; మన జనాభా 45 కోట్లు. 1812 లో వారి జనాభా 72 లక్షల 50 వేలు. 1852 లో 2 కోట్ల 30 లక్షలు. ఈ లోగా 20 లక్షలమంది యూరపునుండి అమెరికాకు వలసవచ్చారు. 1862లో వచ్చిన హోంస్టెడ్ చట్టమూలకంగా ఎవరు వచ్చినా 160 ఎకరాల భూమి వరకు, ఎకరా రు.25 లేదా రు.50 లకు కొనుక్కోవచ్చునన్నారు. దాంతో భూమి పంపిణీ బ్రహ్మాండంగా జరగడమే కాక, జనాలు విశేషంగా విదేశాలనుండి వచ్చి, నివాసాలేర్పరచుకున్నారు. అమెరికాలో యూరపులోని వివిధ దేశాలలోని ప్రజలంతా వున్నారు. అదొక చిన్న యూరపుగా కనబడుతుంది. యూరపుదేశాలవారే కాక రష్యానుండి, అరబ్ దేశాలనుండి, ఆఫ్రికా, ఆసియా దేశాలనుండి జపాను, చైనాలనుండి యెందరో జనం వచ్చి కుదురుకు పోయారు. అనేక జాతుల సమైక్యత ద్వారా ఒక జాతిగా ఏర్పడుతున్న దేశం అమెరికా; యెన్నో మైనారిటీల మేళవింపు చూడవచ్చు. అందువల్ల వారి జాతీయ భావాలలోనే అంతర్జాతీయ భావం యిమిడి వుంటుంది. అమెరికా ప్రజల విశిష్టతల్లో యిదొకటి. ఆఫ్రికా, ఆసియా, చైనా, రష్యా, యూరప్, యింగ్లండు దేశాలలోని ఒకానొక ప్రాధమిక స్వత్వ భావం ఆ దేశంలో వుంది. అమెరికాలో---నౌకరు, ఆసామి--అన్న భావం కనబడదు. ఇతర ప్రపంచంలో పింపిసలాడుతూ వుంటుంది ఆ భావం. అక్కడ ప్రాయికంగా వున్న భావం--- 'మిస్టర్, మిస్టర్' సంబంధ బంధం. అది యెంతగానో గమనించదగిన స్థాయిలో వుంటుంది. మరొకటి... అక్కడున్న ఆయాదేశాల జనాలు, తామంతా అమెరికన్లమనే భావంలోనే వుంటారుగాని; తమ మాతృదేశం వేరని, తమ మాతృభాష ప్రత్యేకమనీ భావింపరు. వారంతా అమెరికావారు. వారిది ఇంగ్లీషు భాష. దానివల్ల భిన్నత్వంలో యేకత్వం ప్రత్యక్షరంలో గోచరిస్తుంది. ప్రజలు చైతన్య ప్రాయులు. గత 30 సంవత్సరాల్లో వారి జనాభాను 18-19 కోట్లమధ్య నిలబెట్టుకొని కుటుంబాల్ని కాక కుటుంబ సంపదలను పెంచుకున్నారు. దానికి మనకువలె కుటుంబనియంత్రణ ప్రణాళికా గోలలు లేవు. ఎవరికైవారే కౌటుంబిక చైతన్యంతో జనాల్ని అదుపులో పెట్టుకొని, సౌఖ్యాలను పెంపరికం చేసుకొన్నారు. అమెరికా ప్రజల్లో ఒక గమ్మత్తు అయిన ప్రవృత్తి వుంది. పనిలో వంగితే గొర్రెలవలే తలలువంచి, వళ్ళు వంచి గట్టిగా పని చేస్తారు. తిండికి మళ్ళితే సుష్టుగా భోజనం చేస్తారు. పిల్లాజల్లా, భార్యా భర్తలు టుర్రుమని కారుల్లో ఎక్కి దర్జాగా షికార్లు కొడతారు. వారికి పనిచేయటం తెలుసు. తినటం తెలుసు. జీవితాన్నిఅనుభవించటం తెలుసు. అది వారి ప్రత్యేకత. వారాంతం వారికొక హడావిడి పండుగ. పండుగే గాదు అదొక పిచ్చిలాంటిది. వారాంతపు షికారుకు పోనివారు చాలా అరుదు. కాని, ఆ షికారుల్లో వారికి విశ్రాంతికన్నా బడలికే యెక్కువేమో! నేను కొందరి మిత్రులతో ప్రస్తావించగా కొందరు 'యింత వేడి విశ్రాంతి'ని తగ్గించడం మంచిదేమోనన్న భావంతో మాట్లాడడం మొదలుపెట్టారు. వారిని కొత్త దారుల్లోకి ఆలోచించేటట్లు చేయవచ్చు. హక్కులపట్ల అమెరికన్ల ఆసక్తి జాస్తి; బాధ్యతలనుగూడా విస్మరించే ధోరణి అక్కడ లేదు. అమెరికాలో నీగ్రోలపట్ల యితర రంగు జాతులపట్ల మానవ సోదరభావం గోచరిస్తుంది. కాని దక్షిణాదీయులలో జాత్యహంకార భావ ఝంఝలలు కలవు. కాని వారి సంఖ్య తగ్గుదలలో వుంది. జాతిధ్యేయాన్నిభావుకులు మిశ్రమ గతిగా అభివర్ణించారు. వారికి ప్రత్యేక భావాలు ప్రత్యేక మర్యాదల రోజులు పోతున్నవి.. అమెరికాలో ఒక మూలకు మరొకమూలకు; ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి వేలాది మైళ్ళ దూరం వుంది. అందరూ ఇంగ్లీషే మాట్లాడినా, ఉత్తరాదివారికి, దక్షిణాది వారికి మాటల రీతిలో తేడా వుంది; తూర్పువారికి, పశ్చిమం వారికి వచోఫణితిలో భేదం వుంది. వేషాల్లో భిన్నత్వం లేదు. ఆహార పానీయాదుల్లోగూడా మార్పులు లేవు. పరిశ్రమల అంతస్తుల్లో వ్యవసాయపు తేడాలలో వివిధ ప్రాంతాల్ని చూడవచ్చు. ఎంతో భిన్నత్వం వున్నట్లు గోచరించినా యేకత్వ స్ఫోరకత ప్రతి అంశంలోనూ పింపిసలాడుతూ కనబడుతుంది. కొన్ని చిన్న విషయాల్లో చూద్దాం. మానవులు ఎంతగా ఒకేరకపు వ్యాసంగాలతో ఉంటారో వ్యక్తమౌతుంది. పావురాయల్ని యెగరేసేవారూ కనబడతారు. వాటికి నూకలుపోసి, ఆహారం పెట్టేవారూ అగుపడతారు. అంతేకాదు. జీవకారుణ్య విధానాలకు పెన్నిధిగా చెప్పబడు భారతదేశంలో చీమలకు పంచదార పోసే వారెందరో కనబడినట్లే, ఆవుమాంసాదులు తినే ఆ దేశంలో అట్లాంటిరకంగూడా కనబడ్డారు. న్యూయార్కులో బెల్ మౌంట్ ప్లాజా హోటల్లోని కాఫ్ మాన్ కేఫ్.లో ఒకానొక అపూర్వ దృశ్యాన్ని చూచాను. మనస్సు చివుక్కుమంది. మనదేశంలో బజారులలో పారవేసిన యెంగిలి యిస్తళ్ళలో దిరికే జుస్టాన్నం కోసం పంది లేక కుక్క, మానవులు కలిసి యెగబడి కవర్లాడుకుంటుంటే మనస్సు చచ్చిపోతుంది. స్వరాజ్యపు విలువ సున్నాగా మారిపోతుంది. మానవత్వం సురిగి మందమై, శూన్యమైపోతుంది. అట్టి దృశ్యము కాదు. కాని అట్టి శ్రేణి దృశ్యాన్ని చూచాను. పచ్చడి గిన్నె నిండా పచ్చడి వుంది. పచ్చడి కాదు, జున్నులాంటిది వడ్డించారు. ఆయన కొంచెం కదిలించి, గిన్నె నెట్టివేశాడు. దానిమీది పైభాగం తీసివేసి తతిమ్మా దానిని ఆ హోటల్లో క్లీనరు దాచి పెట్టుకుంటం చూచాను. మనస్సు చివుక్కుమంది. కాని, నాలో నేనే నవ్వుకున్నాను. ప్రక్క పెద్దమనిషి నా ముఖంలోకి తొంగిచూచాడు. మానవుల్లో యేదో ఒక సామ్యగుణాన్ని చూచాను. దానికి నాకు వికారంలో ఒక ఆనందం కలిగింది. అందుకే నవ్వుకొన్నాను. కాని, ఆ నవ్వు కేవలం ఆనందం కాదు. మిశ్రమం. ఆనందంకన్నాదానిలో బాధే జాస్తి. ఈ సన్నివేశం అమెరికాను, యిండియాను ఒక గాటికి తోలింది. నేనెన్ని చూడలేక పోయినానో? చూచిన దానికే పిలకలు పిలకలుగా అన్వయించుకొంటూ కొంతకు కొంతగా వందురినాను. అది నా లోపమేమో! కాని, ఆ దేశంలో ముష్టివాళ్ళు కనబడలేదు. ఒకానొక వృద్ధు, మేడలో, రేకుకాదు అట్ట వేసుకుని ధర్మం అడుగుతున్నాడు. అదే ముష్టి. ఆయనలో కొంత వికలత్వం వుంది. అట్టివారికి ప్రత్యేక గృహాలున్నవి. కాని, ఆ మనిషి కనబడ్డాడు. అది న్యూయార్కులో. పశ్చిమాన దూరపు శాన్.ఫ్రాన్సిస్కో.లో ఒకనాడొక త్రాగుడు గాడు 'మిస్టర్, ప్రక్క పట్టానికి బస్సుకు సహాయం చేస్తారా' అంటూ మొదలిడినాడు. 'సారీ' అంటూ దాటుకొన్నాను. తిరిగి పరకాయించి చూచాను. వెళ్ళిపోయాడు. ఇంకా కొందరిని తప్పనిసరిగా అట్లాగే అడిగి ఉంటాడు. అమెరికాలో యే మూలకు పోయినా కనబడే ప్రధాన గుణం ఒకటున్నది.---ఆతిథ్య లక్షణం. పూర్వం మనదేశంలో మన తాతలు తండ్రుల రోజుల్లో వుండి, ఇప్పుడు లోపిస్తున్న గుణం అదొకటి. అతిథి సత్కారం చేయటంలో ఉదాత్తంగా చేస్తారు. నేను ఆల్బర్ట్ కాఫ్ మన్ గారింట మూడున్నర రోజులు వారి 'యింటి చుట్టం' గా వున్నాను. చేరిన మరుక్షణంనుండి ఇల్లంతా నా అధీనంలో వుంది. అందరూ వెళ్ళిపోగా, నేనే యింటికాపుగా వుండిపోయాను. భోజన భాజనాలు, మంచిచెడ్డలు ఎంతగానో మర్యాదలతో చూచారు. రెండు మూడు వందల మైళ్ళ దూరం వారి కారులో ప్రతిపూటా ఒకవైపుకు త్రిప్పి, వ్యవసాయరంగంలో యెన్నోఅంశాలను నేను చూడడానికి వీలుచేశారు. ఒకనాడొక విందు చేశారు. 23 కుటుంబాల్ని ఆహ్వానించారు. వచ్చేవారందరూ వారి వారి ప్లేట్లు, కత్తులు, కటార్లు తెచ్చుకుంటూ, ఒకొక వంటకం తెచ్చారు. అవన్నీ నేను అతిథిగా రుచి చూడవలెను. ఒకవేళ యెవరు తెచ్చినదన్నా ఒకటి రుచి చూడకపోతే వారు న్యూనతగా భావిస్తారట. ఆ భారీ భోజనానంతరం గోష్ఠి వుంది. అదొక తప్పని అలవాటు. నాటి ఆహ్వానితులలో కవులు, గాయకులూ, వుపాధ్యాయులు, చిత్ర కోవిదులు, లాయర్లు, డాక్టర్లు, వ్యవసాయదార్లు వున్నారు. వారందరూ లక్ష ప్రశ్నలు వేసారు. ఆ ప్రశ్నలు వారి విజ్ఞతను, యిండియా పట్ల వారి అజ్ఞతనుగూడ తెలియజేస్తవి. కాని. అందరూ యెంతగానో శ్రద్ధాసక్తులతో విని తెలుసుకుంటారు. కొందరు నోట్సుగూడా వ్రాసుకుంటారు. ఇంకొకచోట, మిల్వాకీ లో మాలింజర్ కుటుంబంవారు నన్ను విందుకు పిలిచారు. "ఇండియాను గురించి మీరే విషయంలో ఆసక్తి గలవా”రన్నాను. "మీకు ఆరుగురు పిల్లలని విని మిమ్ము భోజనానికి పిలిచాము" మేరీ మాలింజర్ అన్నది. "అయితే మీకు అంతకన్నా హెచ్చుమంది పిల్లలున్నా రేమో!" నన్నాను. "మీకెట్లా తెలుసు?" అన్నదామెగారు. . "లేకపోతే..."అని నేననగానే నవ్వి "అవును, మాకు తొమ్మిదిమంది ఆడపిల్లలు, ఒక అబ్బాయి. మరి నన్ను చూచారుగదా?" అంటూ హసించింది. ఆమె గర్భవతిగా వుంది. అంటే, పదకొండో సంతానం రాబోతుందని ఆమె నవ్వింది. "అయితే మీరు రోమన్ కాథొలిక్కులా" అన్నాను నేను సగం నవ్వుతూ. "మీకెట్లా తెలుసు" అని భార్యా భర్తలు పక్కున నవ్వారు. కాథొలిక్కులు కుటుంబ నియంత్రణకు వ్యతిరేకులుగదా! "వారింట నాటి విందు అదొక పండుగ లాంటిది. ఆ పదిమంది పిల్లలు...యింతలు అంతలునగు తన సంతానము చంట వెంట సందడి చేయన్...అన్న తెనాలి రామకృష్ణుని నిగమశర్మ అక్క ఉదంతం జ్ఞప్తికి వచ్చింది....నేను, వారిద్దరూ దంపతులు, వారిమామ---టేబుల్ చుట్టూ చేరాము. ఆనాడొక అమ్మాయి పుట్టినరోజు. బర్త్ కేక్---పెద్ద రొట్టె---తెచ్చారు. అది అతిథిగా నేను కోయాలి---కోసాను. పిల్లలు---చిన్నపిల్ల మూడో యేడు --- కిచకిచలాడారు. నవ్వారు. ఆమె గారొకసారి ..... 'యిండియా చుట్టానికి మీరు మీ మర్యాద లిట్లాగేనా చూపేది.....?' అని గద్దరించింది. పిల్లలు బిగిసి కూర్చున్నారు. కాని, ఆ బిగింపు క్షణికం. వారు పిల్లలు గదా! అందుకనే పిల్లలు యెక్కడున్నా పిల్లలే---పిల్లలు మాధుర్యాన్ని చిమ్ముతారు. ఆనాడు చిమ్మారు. భోజనం కాగా -- ఆ పిల్లలందరూ నా చుట్టూ చేరారు. "మీ భాష యింగ్లీషా?" అన్నదొకటి. "కాదు". "అయితే నీవెట్లా యింగ్లీషు మాట్లాడుతున్నావు? అన్నది మరొకటి. "నేర్చుకొన్నాను". "ఇంత బాగా యెవరు నేర్పారు?" మూడోది... నాలు గైదుగురు కూడా... "మా దేశం మీ దేశం మాదిరిగానే యింగ్లీషు వాళ్ళ దాస్యంలో వుండేది". "మాకు దాస్యం లేదే..." ఆరోదో ఏడోదో. "ఒకప్పుడుండేది" వాళ్ళ తల్లి మేరీ. "ఆ దాస్యం నుండి మీరు 1776 లో విముక్తి పొందారు. మేము 1947 లో విముక్తి పొందాము. మీకు యింగ్లీషు మాతృభాష అయింది. మాకు నేర్చుకున్న భాష - పెంపుడు భాష - అయింది" అన్నాను. ఆ బుడ్డవాళ్ళంతా ఒకరికేసి ఒకరు చూచుకున్నారు. "మీ భాష యెట్లా వుంటుందో చూపరూ?" అన్నది పెద్ద అమ్మాయి బి.ఎ. విద్యార్ధిని. అత్తోట రత్నకవి, అడ్వకేట్ జాన్సన్.లు పాడి, రికార్డు చేసినదాన్ని తీశాను. తండ్రి టేప్ రికార్డరు తీసి, రిలే పెట్టాడు. పిల్లలు విని గంతులువేసి, "బాగా వుంది. చాలా బాగా వుంది" అన్నారు. తెలుగును "యిటాలియన్ ఆఫ్ ది యీస్టు" అంటారని చెప్పాను. నన్ను పాడమన్నారు. రెండు పద్యాలు చెప్పాను. నా నోరు వెంట వారెట్లా చూశారో ఆశ్చర్యం. తరువాత పిల్లల్ని పంపివేసి, తల్లి మేరీ ఒక నోటు బుక్కుతో కుర్చీ నా దగ్గరకు లాక్కుని, యిక ప్రశ్నల పరంపర కురిపించింది. చెప్పేది వ్రాసుకుంది. "మీ దేశంలో స్త్రీకి ఎట్టి స్థానం వుంది?" అన్నది మేరీ మాలెంజర్ నా ముఖంలోకి ఎక్సురేలా చూస్తూ. "మీరామెను బెటర్ హాఫ్ అంటారు. మేము --- గృహలక్ష్మి, అర్థాంగి అంటాము. ఆడవాళ్ళు పురుషులకన్నా స్థూలంగానూ, వున్నదున్నట్టుగా చెప్పాలంటే తక్కువగానే భావింపబడతారు. ఇప్పుడిప్పుడూ కొంచెం మార్పు వస్తుంది. సమానత్వం గోచరిస్తుంది, అక్కడక్కడ" అన్నాను. మూతి బిగించింది. మిస్టర్ మాలెంజర్ నవ్వుతూ ఆమెలోకి చూస్తున్నాడు. "అయితే స్త్రీ పాత్ర స్వతంత్రం కావడానికి ఎన్నాళ్ళు పడుతుంది?" అన్నదామె. "కొన్ని తరాలు" తాపీగా, చల్లగా అన్నాను. "అంటే.....?" ఆమె. "చాలా కాలం పట్టుతుంది. మా దేశంలో మార్పులు చాలా స్వల్పంగా వస్తవి. అందులో సాంఘిక విషయాల్లో మేము చాలా నెమ్మది" అన్నాను. "మీ దేశంలో అస్పృశ్యత వున్నదా? మనుష్యుల్ని మనుష్యులే తాకరా.....? అన్నది ముఖంలో విసుకు జనింపగా. "అవును. రాజ్యాంగం అస్పృశ్యతను నిర్మూలించింది. శాసనాలు గూడా అంటరానితనపు ప్రదర్శనాన్ని నేరంగా యెంచుతూ చేయబడినై. కాఫీ హోటళ్ళలో, యితర బహిరంగ ప్రదేశాల్లో ఆ అవరోధం చూపరాదు" అన్నాను. "అస్పృశ్యత పోయిందా.....?" ఆమె. "పోలేదు. ఇప్పుడప్పుడే పోదు. ఇది యీనాటిది కాదు. ఇప్పుడప్పుడే పోదు. దీనికి ఒకరుగా యెవరూ బాధ్యులు కారు. మా దేశగతమంతా దీనికి బాధ్యత వహించాలి. మేమంతా కారకులమే! మేమందరం కలిసి కొన్ని తరాలు చైతన్యపూరిత కృషి---అంతర్వర్ణ వివాహాలు---యితరత్రా పనులు చేస్తే గాని పోదు.” “అది క్లిష్ట సమస్య” అన్నాను. నోరు తెరచి వింటుంది. చెకచెకా వ్రాస్తుంది. "ఎందుకు అంతకాలం పడుతుంది?" అన్నది. "సాంఘిక సమస్యలొకనాడు పుట్టవు. సాంఘిక వికారాలు పోవాలంటే చాలా కాలం పడుతుంది. అది ఎక్కడైనా అంతే" అన్నాను. "అవును. కాని...?" అన్నది. "కాని అనేది సాంఘిక సమస్యల్లో లేదు. అవి క్రమేణా పోవాలి. విద్యలో, వృత్తుల్లో, సాంకేతిక రంగాల్లో, వుద్యోగాల్లో, శాసన మండలాల్లో వీరికి ప్రత్యేక ప్రాతినిధ్యం యిస్తూ, వివాహాలు జరుగుతూ, ప్రచారం కదలుతూ వుంటే, త్వర త్వరగా పరిణామం వస్తుంది" అన్నాను. ఆమె మాటాడలేదు. భర్త లేచి యింకోగదిలోకి వెళ్ళాడు. మామగారు కిమ్మన కుండా వింటూ కూర్చున్నాడు. పిల్లలు వాళ్ళ వాళ్ళ ఆటల్లో పడ్డారు. యిక కాఫ్.మన్ గారి యింటిలో గోష్టిలోని వరవడి చూద్దాము. స్త్రీ పాత్ర మనదేశంలో యెట్లా ఉంటుందనే ప్రశ్న లేని చోటు లేదు. అది మొదలు మామూలు వివరాలన్నీ చెప్పాలి. "పురుషులు యింత స్వార్ధులు, సంకుచితులుగా మీ దేశంలో యెందుకున్నా" రన్నదొక కవయిత్రి. "అట్టి పురుషులు మీ దేశంలోనూ కొంతమంది ఉంటా"రన్నాను. అందరూ నవ్వారు "పురుషుల స్వార్థం సంకుచితత్వం మాత్రం కాదు. సాంఘిక వ్యవస్థలో, భావుకతలో యిరికిపోయిన లోకం, బయట పడలేక దాస్యంలోనే సేద దేర నేర్చి, పడిన బాటలోనే పయనం సుళువని గ్రహించి అట్లాగే అణుశ్రుతంగా నడిచి పోతుంది. సాంఘికంగా యీ నైజాన్నిఅన్ని దేశాల్లోనూ చూపవచ్చు. చరిత్ర చూడండి. సాంఘిక విప్లవాలను పరికించండి. పురుషులు పాతకు దాసుళ్ళు. కాని వారిలో కొందరు చైతన్యపరులు వుంటారు. వారు సాంఘిక వ్యతిరేక శక్తులు. అట్టివారు అన్ని దేశాల్లోనూ వున్నారు. అయితే, మా దేశ సాంఘిక వ్యవస్థ 16 వ శతాబ్దికి దగ్గర. కాని దేశం 20వ శతాబ్దిలో వుండడంతో మీరు యీ ప్రమాణాలతో పాతదైన మా సాంఘిక వ్యవస్థను కొలుస్తున్నా"రన్నాను. "ఒకరి ముఖం ఒకరు చూచారు. నా వంక చూచారు. వారు ప్రశ్న వేయటానికి తటపటాయించారు. "ఇది ఒకరి కృతం కాదు. వెనుకబడ్డ దేశాల్లో అన్నింటా యిట్లాగే వుంటుంది." అన్నాను. కాఫ్ మన్ అన్నాడు "మీ దేశంలో అంటరానితనం, కులవ్యవస్థలు గట్టిగా వున్నవా?" అని, మీ దేశంలో అవి రెండూ నిర్మూలింపబడినవా?" అని. "మా రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిర్మూలించారు. సమాజంలో అది పోలేదు. మా సమాజంలో కులం ఇంకా పోలేదు. పోగొట్టాలని ప్రయత్నం పూనికతో వుంది. కాని, మా దేశంలో స్వరాజ్యం కోసం జాతీయతను పెంచారు. జాతీయతలో ఒక వ్యతిరేక గుణం వుంది. బ్రిటిషు వారిమీది వ్యతిరేకత జాతీయతకు పునాది. వారు పోగా, అది ముస్లిం వ్యతిరేకతగా దేశ విభజనకాలంలో వెల్లివిరిసింది. దేశ విభజనాంతరం అదే కులతత్వంగా వికార రూపం తాల్చింది. కులతత్వం అసలు మా సాంఘిక వ్యవస్థకు పునాది. వర్ణాశ్రమ వ్యవస్థగా కొందరన్నారు. వర్ణాశ్రమ వ్యవస్థ కుల వ్యవస్థగా పీఠం వేసుకు కూర్చుంది. దానికి జాతీయ వాదంలోని వ్యతిరేక గుణం, ఆ సంకుచితత్వం, సహాయం చేసింది. దానిమీద యెన్నికలు, కులతత్వాన్ని ప్రదీప్తి చేస్తున్నవి. "పైగా మా దేశంలో పెండిండ్లు ఎవరి కులంలోనే వారు చేసుకుంటున్నాము. అంటే లక్షలాదిగా జరిగే పెండిండ్లు అన్నీ కులతత్వాన్ని ప్రోది చేస్తున్నవి." అన్నాను. “మీ దేశంలో పెండిండ్లు కులపు ఆవరణలు దాటవా? ఘోరం" అన్నారు వున్నవారందరు. "దాటవు. దాటాలి. ప్రయత్నం ఎక్కడో ఒకటి వున్నా, కథకు ప్రోది లేదు" అన్నాను. "అయితే మార్గాంతరం?" అన్నారందరూ. కొందరు లేచి నిలబడ్డారు. "దాని కొరకే దేవులాడుతున్నాము. వర్ణాంతర వివాహాలు ఒక మార్గం. చదువు సాముల మీద నెమ్మదిగా పోవాలి. నెమ్మదిగా తప్ప పోదేమో? అంటే కొన్ని తరాలు పట్టి తీరుతుంది" అన్నాను. నిట్టూర్చారు. నేనేదో మందభాగ్యుల ప్రతినిధినన్నట్టు నా వంక చూచారు. కాఫ్ మన్ మా యింటి ఆసామి. "మీ దేశంవారు కొందరు వచ్చి, పై రెండు వికారాలు లేవన్నారు..." యేదో చెప్పబోతున్నాడు. "అది యథార్థం కాదు. పచ్చి అబద్ధం" అన్నాను. "అయితే, ఆయన సంగతి ఏమిటి?" అన్నాడు. "అబద్ధం చెప్పాడు. మొఖం తప్పించుకున్నాడు. అంతేమి బాధ! మీ నీగ్రో సమస్యను గురించి నేనేదన్నా ప్రశ్న వేస్తే, మీరట్లా అబద్ధం చెప్పితే, సమస్య మాసిపోతుందా?" అన్నాను. "అవును, పోదు" అన్నారు అందరూ. "చిక్కుల్ని ఎదుర్కొనే ధైర్యం కావాలి" అన్నాను. ఇటువంటి ప్రశ్నలు అన్ని చోట్లా వచ్చినై. ఇంకా యెన్నో రకాలైన ప్రశ్నలూ వేశారు. నేను వారిని యెదురు ప్రశ్నలు వేయకుండానే వీలైనంత మేరకు నిష్కర్షగానే సమాధానం చెప్పాను. మన దేశంలో ఆ సమస్యల్ని గురించి మాట్లాడినట్లే మాట్లాడాను. ఇంకా ఎంతగానో గూడా చెప్పాను. చరిత్ర సాంఘిక ఇతివృత్తం, మన పూర్వాపరాలు, విదేశీ దాడుల వికారాలూ అన్నీ చెప్పాను. ఆ ప్రజల ఆసక్తి వారి ప్రవృత్తులను మనం యీ సాంఘిక సమావేశాల్లో చూడవచ్చును. మన సమస్యల్ని పరిష్కరించుకొనే మార్గాన్వేషణలో తామేమి సహాయం చేయగలరన్న ఆసక్తిని, శ్రద్ధను, భక్తిని వారు ప్రదర్శిస్తారు. * * * వాళ్ళు మనిషిమీద కన్నా మర మీదనే ఆధార పడతారు. విడిగా మనిషి శ్రమ వినియోగించు కోవటం చాల ఖరీదౌతుంది. వాడిన వస్తువును కడిగి తుడిచి తిరిగి వాడే కన్నా దాన్ని పారవేసి కొత్తదాన్ని చేసుకొంటారు. ఆడవాళ్ళు సిగరెట్లు కాల్చటంలో 60, 70 శాతం దాకా వుంటుంది. సహజంగా త్రాగనివారు వుండరు. ఆఫీసుల్లో కూడా 60 శాతం ఆడవాళ్ళు వుంటారు. న్యాయమూర్తినిలుగా గూడా జాస్తిగానే వున్నారు. ఆడ, మగ వ్యత్యాసం, న్యూన్తలు లేవు. వారు 18 కోట్ల దేవతలేమో. కాని, కుటుంబవ్యవస్థ అదొక రీతిగా నడుస్తుంది. కుర్రవాళ్ళను గురించి 15, 16 సంవత్సరాలు దాటగానే తలిదండ్రులు చాల తక్కువగా పట్టించుకుంటారు. పిల్లలకున్న స్వేచ్ఛ, వనరులు వాళ్ళను కొంతకు కొంత చెడగొట్టుచున్నవని చెప్పాలి. వారి కౌటుంబిక జీవనంలో ఇదొక లోపం. కుటుంబాలు, కుటుంబాలుగా హోటల్లో భోజనాలు చేయటం జాస్తి. కొన్ని కుటుంబాలు అసలు యింట వంట చేసుకోనుగూడా చేసుకోరేమో! అదొక లోపం, కౌటుంబిక వ్యవస్థలోని జిగి క్షీణించటాని కిదొక కారణంగా గోచరిస్తుంది. హోటలు వాసన గృహాల్లోకి ప్రాకుతుంది. అక్కడ మనకు గోచరించే ఒక విశేషం, వారు సాధారణంగా వాళ్ళ వాళ్ళ సంగతి తప్ప, పొరుగువాడి సంగతి పట్టించుకోరు. సామాన్యజనం పొరుగు దేశాల సంగతి పట్టించుకోరు. నూరువత్సరాల మన్.రో పథకం అమెరికాలో యీ వాతావరణానికి ప్రధాన కారణం కావచ్చు. కాలం వృధా పుచ్చటం వారికి గిట్టదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు యెంతో వడిగా నడుస్తారు. యెంతో వడిగానే మాట్లాడుతారు. వారి నడక మన పరుగుగా వుంటుంది. అందువల్ల, నియమంగా కాలాన్ని వినియోగిస్తారు. ఎవరితోనన్నా కలవాలంటే, ముందుగా కాలం నిర్ణయించుకోవాలి. టైముకు పోవాలి. టైముకి అన్నీ జరగాలి. ఒకనాడు నేను ఒకరితో 10 గంటలకు కలవటంకోసం నియామకం చేసుకొన్నాను. సమయానికి వెళ్ళినా, వారున్న గది చేరటం 10 నిమిషాలు ఆలస్యమైంది. ఆయన, నాతొ పెట్టుకొన్న పని ముగిసినట్టు యెంచి, మరో పనిలోకి మళ్లాడు. నేను వారి కార్యదర్శితో వాదులాడాను. "వారు మరోపని చూస్తున్నారు" అన్నది. "నాతో గోష్టికి అరగంటగదా నియామకం, యిప్పుడు పది నిమిషాలే అయింది ఖర్చు. తతిమ్మా 20 నిమిషాలు నాకై వినియోగించవలసినదే కదా" అన్నాను. ఆమె కేమీ తోచక, నవ్వి, "మీరు నాతో ప్లీడరీ చేస్తున్నారు" అంటూ లోనికి వెళ్ళింది. నన్ను వారు లోనికి రమ్మన్నాను. వెళ్లి మాట్లాడి, 20 నిమిషాలు కాగానే లేచాను. "పోనీ మీ 30 నిమిషాలు మీరే తీసుకోండి" అంటూ నవ్వి సంభాషణ పొడిగించాడు. వారి స్వభావాలు కాలావృతాలు. వారికి అప్రియమైన విషయాలను మనం యెన్ని చెప్పినా, ముఖంలో వికారం చూపకుండానే గ్రహించగలరు. ఎదిరి వాదనలోని వైశిష్ట్యాన్ని గ్రహింప చూస్తారు. కారణబద్ధ ఆలోచనకు లొంగుతారు. అందువల్ల హేతుబద్ధంగా మనం యెంత దూరం పోయినా, వారితో పరవాలేదు. "మీరు పిల్లల్ని సరిగా కాపాడక, మీ మీ, అనగా తలిదండ్రుల సుఖాల కోసం, బిడ్డల భవిష్యత్తు కొంత చెడగొడుతున్నా"రని నేను వారితో చాలా చోట్ల వాదించాను. రేడియోలో, టెలివిజన్ లో చెప్పాను. "మీరు బిడ్డలమీద కావురు కమ్మినట్లుగా కమ్మి, వాళ్ళను సరిగా విప్పారనివ్వ "రని వారెదుర్కొనేవారు. "పిల్లలకు పెండ్లాలను, భర్తలను మీ దేశంలో తల్లిదండ్రులే కుదురుస్తారటగా" అన్నది. వారి ప్రథమ ప్రశ్న. ముఖ్యమైన ఆక్షేపణగూడా. నన్ను ఆ విషయంలో బాగా కవ్వించారు. “పిల్లల్ని కని, పెంచి, వారి భవిష్యత్తు నెంతగానో వూహించి, దానికై జాస్తిగా త్యాగంచేస్తారు మాదేశంలో, మీరు కొంత దూరమే త్యాగంచేసి, పిల్లలకు పూర్తి నిర్ణయస్థాయి రాకముందే, వాళ్ళమీద వాళ్ళను వదిలివేస్తారు. బిడ్డల పెండ్లిలో గూడా తల్లిదండ్రులు శ్రద్ధచేసి, భార్యాభర్తలు కాదగినదెవరో కాదో గూడా మా దేశంలో సలహాలూ యిస్తారు, నిర్ణయాలూ చేస్తారు.....” అన్నాను. గుప్పున నవ్వి, “దారుణం” అంటారు. నేను ఆపలేదు. “మా దేశంలో మా చదువుల పెరుగుదలతో పెండ్లిండ్ల రీతులూ మార్పు చెందుతున్నై. మీ పూర్వానికి, నేటికీ తేడా వుంది గదా. ఒకప్పుడు, కొన్నిచోట్ల యిప్పుడూ, తల్లిదండ్రులే బిడ్డలకు భార్యాభర్తలను చూచి నిర్ణయిస్తారు. అది క్రమేణ మారుతుంది. మీ మాదిరిగా స్వేచ్ఛగా మా సంఘం యింకా కదలటం లేదు. కదలిక చదువుతో పరిశ్రమాభివృద్ధితో వస్తుంది. మా రీతి మేలని నేననను. కాని మీ రీతిలో బాధ్యత లేనితనం వున్నదంటాను” అన్నాను. “లేదు” అని ధట్టించారు. “వుంది. మీరు బిడ్డ 15, 16 ఏళ్ళ రాగానే అన్ని నిర్ణయాలూ వాని మీదనే వదిలివేసి మీరు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ, దాన్ని బిడ్డలకు స్వేచ్ఛ నివ్వటంగా మీరు నిర్వచించి, తప్పుకుంటున్నారు” అన్నాను. ఒకరి ముఖం ఒకరు చూచి, నాకై కసిగా చూచారు. "కాదు. మీరూ మీ బిడ్డల పెండిండ్ల విషయంలో సలహాదారులుగా వుండడంలో లోపమేమిటి? మనకన్నా మన బిడ్డల శ్రేయస్సు మరెవ్వరు చూస్తారు? మన సలహాను బిడ్డలు ఆజ్ఞగా ఎంచి తల వంచవలసిన పని లేదుగదా? సలహా చెప్పి వుచితరీతిని మళ్లించటం తలిదండ్రుల తప్పా? కాదు. కుటుంబ వ్యవస్థ మా దేశంలో కొంత జిగురు కలిగి వుంది. మీ దేశంలో పొడి పొడిగా వుంది" అన్నాను. మౌనం వహించారు కొందరు. కాదంటూ తలలూపారు కొందరు. కాని వారికి నచ్చని యీ వాదనను నేను పదే పదే చెప్పాను. అందులో కొంత సరసత వున్నదని గ్రహించారు. ఆ మేరకు తలిదండ్రుల శ్రద్ధ వాళ్ళ పిల్లల మీద అవసరం. అమెరికాలో "పిల్లల వికారాలు" జాస్తి కావటాని కిదొక కారణంగా నేను వారి దృష్టికి తెచ్చాను. కొందరంగీకరించారు. *--*--* ప్రభుత్వం – ప్రజలు అమెరికా ఫెడరల్ రాజ్యాంగం కలది. వయస్సులో చాల చిన్నది. 1492లో ఇటలీ దేశపు నావికుడు క్రిష్టఫర్ కొలంబస్, స్పెయిన్ రాజు పంపున, మన దేశానికి రాబోయే దారిలో అమెరికాలో అడుగు బెట్టాడు. యిండియాకు రావాలనుకున్న మనిషి, అదే యిండియా అని, వారిని 'యిండియను'లన్నాడు. వారే అమెరికా ఆదిమవాసులు; రెడ్ ఇండియనులు. తూర్పున అట్లాంటిక్, పశ్చిమాన పసిఫిక్ సముద్రాలు. 120 డిగ్రీల యెండనుండి మంచు కురిసే మేరకు శీతోష్ణతలు ఉంటవి. పెద్ద దేశం. కావలసినంత ఖనిజ సంపద, అడవులు, కొండలు' 50 రాష్ట్రాల దేశం. ఆదిమవాసులు 4 లక్షలు. వారి క్రింద 5 కోట్ల 60 లక్షల ఎకరాల భూమి వుంది. అమెరికాని పూర్వం 'కొత్త ప్రపంచం' అనేవారు. మానవుని ప్రాథమిక స్వత్వాల మీద అమెరికనుల కున్నంత మమకారం యితర దేశాల్లో కానరాదు. 1215 లో 'మాగ్నా కార్టా' నాటి నుండి యూరపులో పెరిగివచ్చిన ప్రాథమిక వ్యక్తి హక్కుల పట్ల భావాలనంటినీ వారి రాజ్యాంగ నిర్మాతలు శ్రద్ధతో గ్రంథించారు. ప్రజలలో ఆ స్వత్వ భావ పరంపర బాగా పాదుకొని పోయింది. అదే అమెరికాలోని, ఇతరులెరుగని ప్రజా స్వామ్య పునాదులకు ఆకారం. అదే అమెరికాకు జీవగర్ర. 1776 లో అమెరికా స్వాతంత్ర్యాన్ని పొందింది. మూడవ జార్జి పాలన అంతం అయింది. 'న్యాయ సంస్థాపనకు, అంతరంగిక ప్రశాంతతకు, సాధారణ శ్రేయస్సుకు, మనకు మన పౌత్రులకు స్వేచ్చా దీవెనలను పొందుటకు' అమెరికా ప్రజలు తమ రాజ్యాంగాన్ని రచించుకున్నారు. 1789 లో ఆచరణలోకి వచ్చింది. స్వాతంత్ర్య దీక్షా పత్రం, రాజ్యాంగంలో, మొదటి పది సవరణలు (హక్కుల బిల్లు) కలిసి అమెరికా వారసత్వం. నేటి అమెరికాలో 18 కోట్ల 20 లక్షలున్నారు. 3050 కౌంటీలుగా, 50 రాష్ట్రాలు చీలినవి. కౌంటీ ప్రాంతంలో, నగరం, పట్టణం, గ్రామం వుంటవి. 50 వేల స్కూళ్ళ జిల్లాలుగా, 14,424 పరిపాలనా జిల్లాలుగా వుంది. స్థానిక స్వపరిపాలన అమెరికాకు జీవనాడి. ప్రజాస్వామ్య దృష్టి వారి నాళాలలో యింకిన రీతి. కేంద్ర ప్రభుత్వాధికారాల కన్నా రాష్ట్రాధికారాలు జాస్తి. కేంద్ర ప్రభుత్వం --- విదేశ సంబంధాలు, విదేశ, రాష్ట్రాంతర వ్యాపారం, యుద్ధ సంబంధాలు, పన్నులు, కరెన్సీ, మెయిలు, నాచురలైజేషను, సాధారణ శ్రేయస్సు ---' అన్న విషయాల్ని చూస్తుంది. తతిమ్మా హక్కులన్నీ రాష్ట్రాలవే. క్రమేణా, రుణాలు, యిళ్ళకు నిధులు, విద్య, సాంఘిక సంక్షేమం, కార్మిక సమస్యల్లో కేంద్రం జోక్యం చేసుకొంటుంది. శ్రేయో రాజ్యం పేర ఆ జోక్యం పెరుగుతున్నదని అక్కడ బలీయంగా అభిప్రాయం వుంది. రొండు వంతులు జనాభా 5787 చిన్న రకం పట్టణాల్లో వుంటుంది. ఆ పట్టణాల్లో సగటు 2500 మంది కన్నా వుండరు. లక్ష జనాభా దాటిన నగరాలు 130 వున్నై. అయిదు లక్షల జనాభా దాటినవి 21 పెద్ద నగరాలున్నై, న్యూయార్కులో 90 లక్షలుదాకా జనాభా వుంది. అది వారి పెద్దనగరం. చికాగో, లాస్ యాంజెల్స్ గూడా 70 లక్షల దాకా జనాభా కల నగరాలు. అమెరికా ప్రభుత్వం, ఆదేశ ప్రజల మీద, రాజకీయ పార్టీల మీద ఆధారపడి వుంటుంది. వారివి రొండే పెద్ద పార్టీలు - రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, సోషలిస్టు పార్టీ, ప్రొహిబిషన్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, ప్రోగ్రెసివ్ పార్టీ మొదలైనవి గూడా కలవు. అవి చాల చిన్నవి. పెద్ద పెద్ద పార్టీలు రొండూ ఒకేరకమైన అంగ నిర్మాణం కలవిగా వున్నై. జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయ స్థాయీలలో పని చేస్తవి. పార్టీలో బేసికో యూనిట్ 'ఎన్నికల జిల్లా' గా వుంటుంది. అటువంటివి లక్షా యిరవై ఐదు వేల యూనిట్లు కలవు. యూనిట్ కి 200 నుండి 800 దాకా వోటర్లు వుంటారు. జిల్లా నాయకులు జిల్లాను "బ్లాకు"లుగా చీల్చి, బాధ్యతల్ని అప్పగిస్తారు. జిల్లా నాయకుడు, బ్లాకు నాయకులు, యితర ముఖ్య సభ్యులు కలిసి 'కాంగ్రెసు జిల్లా' గా వుంది "స్థానిక పార్టీ క్లబ్"గా వ్యవహరిస్తారు. కాంగ్రెసు జిల్లా అంటే ప్రతినిధుల సభకు నియోజక వర్గం అన్నమాట. జిల్లాల నాయకులు చేరి కౌంటీ కమిటీగా ఏర్పాటై, 3050 కమిటీలను ఆయా కౌంటీలలో నడుపుతారు. ఈ కౌంటీ కమిటీలు యిద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నుకుంటవి. రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ సభ్యులని యిద్దర్ని యెన్నుకుంటుంది. జాతీయ కేంద్ర కమిటీ అధ్యక్షుణ్ణి యెన్నుకుంటుంది. యీ అధ్యక్షుడు, దేశాధ్యక్ష అభ్యర్ధిచేత నియమింపబడతాడు. అధ్యక్ష అభ్యర్ధి ఆధారంగా జాతీయపార్టీ నాయకుడు. నాలుగేళ్ల కొకసారి పార్టీ మహాసభలు జరుగుతై. వున్న రొండు పెద్ద పార్టీలలో డెమోక్రాటిక్ పార్టీకి కార్మికుల మద్దత్తు, నీగ్రోల బలం, పారిశ్రామికుల అండ కలవు. రిపబ్లికన్ పార్టీకి దేశ ఆర్థికతలో ప్రభుత్వ జోక్యం తక్కువగా వుండాలని భావించేవారి అండదండలు వుంటవి. పారిశ్రామికులు, కర్షకులు దీన్ని బలపరుస్తారు. కాథొలిక్కులు డెమోక్రాటిక్ పార్టీకే మొగ్గు చూపుతారు. యీ రొండు పార్టీలలో తిరిగి లిబరల్, కన్సర్వేటివ్ వర్గాలుగా విభజనలు కనబడతై. కొన్ని చోట్ల యెన్నికలు గమ్మత్తుగా వుంటై. 1950లో న్యూయార్కు నగరంలో డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్ గెలిచాడు. రిపబ్లికన్ గవర్నర్ నెగ్గాడు. వుభయవర్గాలకు చెందని స్వతంత్రుడైన మేయరు యెన్నికైనాడు. వ్యక్తి ప్రభావాల భావం అట్లా వెల్లివిరుస్తుంది. యీ పార్టీలకు జెండాలు ప్రత్యేకంగా లేవు. రిపబ్లికన్ పార్టీకి 'ఏనుగు' గుర్తు. డెమోక్రాటిక్ పార్టీకి 'గాడిద' గుర్తు. రిపబ్లిక్ పార్టీని 'జి.ఓ.పి. (గ్రాండ్ వోల్డు పార్టీ) అంటారు. యీపార్టీలకు మన దేశంలో, యూరప్ లోని పార్టీలకున్న మాదిరిగా సభ్యత్వం లేదు. దరఖాస్తులు లేవు. ఒకరో, యిద్దరో కష్టపడి కలాలు విరిగేటట్టు, వ్రేళ్ళు అరిగేటట్టు సంతకాలు, నిశానీలు చేయపని లేదు. యీ పార్టీలకు 'విప్' లేదు. 'కొరడా' విసరటం లేదు. గొడ్లను కొరడాతో తోలినట్లు పార్టీ సభ్యులని ఒక గాటికి తోలే పని లేదు; తోల వీలు లేదు. పార్టీలో ముఖ్యులు, ఒకొక్కసారి నాయకుడుగా వున్న వాడే, పార్టీ విధానాలకు భిన్నంగా తన ఆత్మాభి ప్రాయానుకూలంగా వోట్లు వేస్తాడు. పార్టీలో దానివల్ల ముసలం లేదు. క్రమశిక్షణ పోయిందన్న భయం, బెడద లేవు. పార్టీ ముఠాలుగా చీలిపోవటం లేదు. మన దేశంలోని మాదిరిగా పార్టీ సమావేశాలు లేవు. పార్టీ కార్యక్రమానికి అనుకూలించిన వారు ప్రజల్లో యెవరా అన్న విషయాన్ని యింటింటికీ తిరిగి, ఆయా విధానాల పట్ల ఆయా ప్రజల భావం యెట్లా వున్నదో 'అభిప్రాయ' సేకరణ చేస్తారు. యిట్లా యింటింటికీ తిరిగి అభిప్రాయాల్ని సేకరించటం అమెరికాలో ముఖ్యమైన పార్టీ పనిగా భావిస్తారు. దానితో "గేలప్" వోటింగు గూడా తీస్తారు. పార్టీ నిధుల వసూళ్లు గూడా హెచ్చుగా యిట్లాగే చేస్తారు. అదీగాక "పార్టీ డిన్నర్లు" పెట్టుకొని, నిధులను ఆయా దాతలు వివరిస్తారు. పార్టీ నిధుల వసూలు జరుగుతుంది. సాంగత్యం ద్వారా పార్టీ ప్రభావాన్ని వ్యక్తులమీద ప్రజ్వరిల్ల చేస్తారు. పార్టీలు కేంద్రీకరింపబడవు. విధానాలు, నాయకత్వం వికేంద్రీకృతమై వుంటవి. పార్టీ కొరడా నివ్వకుండా ప్రతి సభ్యునితో చర్చించి, అభిప్రాయ సేకరణ చేస్తారు. ఆ అభిప్రాయాల్ని నాయకునికి తెలియపరుస్తారు. చర్చ వుంటుంది. కాని, పార్టీలో 'విధిగా' యిది చెయ్యాలి అనే 'హుకుం' పద్ధతి లేదు. స్పీకరు వివిధ కమిటీలలో సభ్యులని సూచిస్తారు. కమిటీలలో బలం పార్టీ నిష్పత్తి ప్రకారం నిర్ణయిస్తారు. క్రమేణా, పార్టీలలో జాతీయ దృక్పథం వివరింపబడుతూ వచ్చింది; ప్రాంతీయ భావాలు విచ్చిన్నమై పోతున్నవి. అయినా, పార్టీ ప్రభావం హెచ్చుగా అధ్యక్షుని యెన్నికల్లో అవసరంగా గోచరిస్తుంది. తతిమ్మా యెన్నికల్లో పార్టీ మీదకన్నా, నొక్కు వ్యక్తి మీదనే వుంటుంది. స్థానిక యెన్నికల్లో పార్టీ ప్రమేయం లేకుండానే జరుగుతుంది. అమెరికాలో న్యాయస్థానాలకు గూడా యెన్నికల్లో పాల్గొనటం వున్నా, పార్టీ తత్వం తగిలినా, పార్టీ ప్రమేయం లేకుండానే యెంచబడుతుంది. రిపబ్లికన్ పార్టీ గ్రామీణ రంగంలోనూ, నగరపుటంచులలోనూ, డెమోక్రాటిక్ పార్టీ నగరాల్లో, పరిశ్రమ వాడల్లో హెచ్చుగా వుంది. పార్టీలలో హెచ్చుగా పనిచేసేది ఆడవాళ్లే! యిదంతా నిర్వహించడానికి --- 'అమెరికా పద్ధతి' అంటారు. దానిమీద వారికి ప్రత్యేకపు మోజు వుంది. అమెరికా స్వాతంత్ర్యాన్ని సంపాదించినాక, 1812 లో నావికా హక్కుల విషయంలో యింగ్లండుతో యుద్ధాన్ని ప్రకటించింది. అప్పుడు మాడిసన్ అధ్యక్షుడు. 1823 లో జేమ్సు మన్రో అధ్యక్షుడుగా రాగా, 'మన్రో ప్రణాలిక'ను దేశం అమలుకు తెచ్చుకొని, యితర దేశాల్తో పొత్తులు, సంధులు, సంబంధాల విధానాలు తీసివేసి, 'తమ విధానాలే తమవిగా' నడుపుకొంటూ, 'ఏకాకి' వాదంలోకి అమెరికా ముడుచుకుంది. నూరేళ్ళపాటు యీ మన్రో భావ వీచికలు అమెరికన్ల మనోగత పరిధుల్ని, అనుశాసిస్తూనే వచ్చినవి. యిప్పుడు అమెరికన్లు రెండవవాడి సంగతి పట్టించుకోకుండా, తమ పని తాము చూచుకోవటాన్ని మనం గమనించిన జాతీయభావం. బహుశః యీ మన్రో సూత్రం నుండి, అది జాతీయ గుణంగా మారి వచ్చిన 'జోక్య రహిత' విధానంలోనిదేమో ననిపిస్తుంది. యీ విధానం క్రమేణా మారి, దక్షిణ అమెరికా పట్ల సౌహార్ద్ర విధానంలోకి దిగి, 'వారు మనం మంచి పొరుగుదార్లం' అన్న భావం నిలకడ పడి, 1948 నాటికి 'ఓ.ఏ.ఎస్. (అమెరికా రాష్ట్రాల సంఘం) గా రూపొందింది. నేడది "అభ్యుదయానికి కూటమి" (Alliance for Progress) అన్న విధానమై చలామణికి వచ్చింది. 1917 యుద్ధంలోనూ, 1941 యుద్ధంలోనూ దిగటంతో అమెరికా అంతర్జాతీయ శక్తిగా, ప్రథాన పాత్ర వహింపవలసి వచ్చింది. నేడది లోకానికొక ముఖ్య కూడలిగా కూర్చుంది. విదేశాల విషయంలో ఆసియాలో అమెరికా దృష్టి అదోరకం. తనకేమీ వంగడ రాజ్యాలు లేవు గనక, మిషనరీలు, పరిశోధకులవల్ల వచ్చిన జ్ఞానం తప్ప, పరిపాలనానుభవం బ్రిటన్, ఫ్రాన్సులకు వలె లేదు. అందువల్ల, స్వరాజ్యం వివిధ రాష్ట్రాలకు రావాలన్న ఆకాంక్ష మాత్రం అమెరికనులలో గోచరిస్తుంది. యూరపులో వారికి సంబంధ బాంధవ్యాలు కలవు. అక్కడ స్థాయి, స్థితి వేరు. ఆఫ్రికాలోగూడా ఆసియాకు దగ్గరగానే వారిస్థితి వుంటుంది. ప్రజల దృష్టి ఆయా రంగాల్లో పట్టీ పట్టనట్టుగా వుంది. కాని, కమ్యూనిజం పట్ల ప్రభుత్వ వైఖరి, ప్రజల దృష్టి తీవ్ర వ్యతిరేక భావంతో వున్నై. పత్రికలూ అట్టి తీవ్ర దృష్టినే కలిగి వున్నై. అయితే, మన దేశంనుండి ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన మార్పు కనబడుతుంది. ప్రభుత్వ పాత్ర యేమిటి? ప్రజల బాధ్యతలేమిటి? అన్న ప్రశ్నలు వేసుకుంటే, వచ్చే సమాధానాలు, ఆ తేడాలను బాగా వ్యక్తం చేయగలవు. మనం 'కో ఆపరేటివ్ కామన్ వెల్తు' అన్న రాజ్యాంగ భావం నుండి 'వెల్ ఫేర్ స్టేట్" అన్న భావంలోకి అభ్యుదయించాము. అక్కడినుండి 'సోషలిస్టు పాటరన్' లోకి కదిలాము. తర్వాత "సోషలిస్టు స్టేట్" లో చిక్కాము. అమెరికాలో వారు "ప్రెసిడెన్షియల్ ప్రభుత్వం"లోనే అప్పటి నుండి యిప్పటిదాకా వుండిపోయారు. మనం 'ప్రజాస్వామ్య సోషలిజం' మన ఆశయమని, ధ్యేయమని చెప్పాము. వారి ఆశయం 'ప్రజాస్వామ్యంగానే' వుండిపోయింది. స్వరాజ్యం వచ్చిన తర్వాత మన దేశంలో ఈ అవతారాల మార్పుల్లో ప్రభుత్వంలోని రూపాంతరాలను, పాకాంతరాలను మనకై మనము గ్రహిస్తూనే ఉన్నాము. కాని, అనుభూతుల్ని పొందుతూనే వున్నాము. కేంద్రీకృత రాష్ట్ర, కేంద్ర పాలనలలో గాని వికేంద్రీకృతమన్న పంచాయతీ, సమితి పాలనల్లో గానీ, ప్రభుత్వ జోక్యం రాను రాను కంటికి కనబడడమే గాక, చేతికి గూడా తగులుతుంది. అన్నిరంగాల్లో 'ప్రభుత్వ జోక్యం' ప్రమేయం హెచ్చుగా గోచరిస్తున్నవి. యిక కొన్నాళ్ళు యిదే విధంగా ప్రభుత్వం వంగడం పెరిగితే, యే మూల చూచినా ప్రభుత్వమే గోరాడుతుంది. యిప్పటికి మన పెరటిలో, యింటిలోగూడా కనబడుతుంది. యింకా పెరిగితే, పడకటింటిలోకి గూడా ప్రవేశిస్తుంది. 'సోషలిజమో, ప్రజాస్వామ్యమో గాని యింత దూరం ప్రభుత్వపు యంత్రం, బలం, ప్రయోగం హెచ్చి రావటం, పెరిగి కూర్చోవటం పాలకులకు శ్రేయో రాజ్యంగా తోపించినా, ప్రజలకు తలనొప్పిమారి రాజ్యంగా ఉండక తప్పదు. యిది మనకు నెహ్రూ రాజ్యంలో పెరిగి కూర్చున్న భారవహ పరిపాలనా విధానంకాగా; అమెరికాలో ప్రభుత్వం యెట్లా వుందో చూద్దాము. 'యే ప్రభుత్వం యెంత తక్కువగా పరిపాలిస్తుందో అదంత మంచి ప్రభుత్వం' అన్నారు విజ్ఞులనేకులు. అమెరికా అధ్యక్షుల్లో చాలామంది యీ వాక్యార్ధాన్ని అంగీకరించారు. కొంతగా అనుష్ఠించ డానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు రూపొందిన తీరు తెన్నులే నేటి అమెరికా ప్రభుత్వం. ప్రజాస్వామ్యానికి భారమైన పరిపాలనా విధానం, బరువైన ప్రభుత్వాలు పనికి రావు. పునాదులలో సౌరుగల పాలన ప్రజాస్వామ్యం. తలబరువు దానికి పనికి రాదు. ప్రజలు తమ తమ పనులను, విధులను బాగా చేసుకోగలరనేదే ప్రజాస్వామ్య పాలనకు మూలం. ప్రజల వల్ల కాదు. ప్రభుత్వం తనకు తానుగా పనుల నిర్వహణ జరిపించాలి అనుకొనేది ప్రజాస్వామ్యం కాదు. అది ప్రజల పేరుతొ జరిగే పాలన. ప్రజల పేరుతొ జరిగేది, అడుగులు సాగినకొద్దీ నియంతృత్వంలోకి లాగుతుంది. ఒక్కసారి నియంతృత్వం కుదురుకొనెనా, అది సర్వకాలానికి పాదుకు పోవాలని పెనగు లాడుతుంది. దాంతో ప్రజాస్వామ్యం నశిస్తుంది. అమెరికాలో ప్రభుత్వ పరంగా యే యే రంగాల్లో నిర్వహణ జరుగుతుంది? అన్న ప్రశ్న వేసుకొని, సమాధానం చూస్తె, పై రీతి ప్రపంచ పురోగమనానికి కొంత విరుగుడు కనబడుతుంది. రవాణా రంగం తీసుకోండి. రైళ్ళు ప్రభుత్వ పరంగా లేవు. ప్రయివేటు కార్పొరేషన్లు రైళ్ళను నడుపుటై. మన దేశంలో రైళ్ళు పూర్తిగా ప్రభుత్వ పరంగా వున్నవి. సోషలిస్టు దేశాలన్నింటిలోనూ యింతే! ప్రభుత్వపరం చేస్తే దోపిడీ లేదన్న తప్పుడు ఆర్థిక భావం వెదజల్లబడుతుంది. యిండియాలో రైళ్ళు మానవ యోగ్యాలన్న వాడు మందుడు కాక మానడు. అది ఎంత పరమో అటుంచి, వాటి ప్రయోజనాత్మకత చూడాలి. సిద్ధాంతాలతో పొట్టలు నిండవు. సిద్ధాంతాలు ఆచరణబద్ధం కావాలి; ఆచరణ ప్రయోజనాత్మకంగా వుండాలి. అట్లాగే, విమాన మార్గాలన్నీ ప్రభుత్వ అధీనంలో లేకుండా, ప్రయివేటు కంపెనీల చేతుల్లో వున్నై. రేట్లు, రూట్లు నిర్ణయించడంలో జాతీయ, అంతర్జాతీయ సంప్రదింపులు వుంటై. యిట్లాగే, నేలరవాణాలన్నీ, నీటి రవాణాలన్నీ ప్రయివేటు యేజన్సీల చేతులలోనే వున్నై. ప్రభుత్వ పెత్తనం లేదు. మోటారు బస్సు, లారీ, కారు, ట్రక్కు వగైరా రవాణా సంపద యావత్తు కార్పొరేషన్లు, యేజన్సీలు నడుపుతై. దేశంలోని విద్యుచ్చక్తి సంబంధ సరఫరాలన్నీ ప్రయివేటుదార్ల చేతుల్లోనే కలవు. ప్రభుత్వం తన అధీనంకోసం తాపత్రయపడదు. అమెరికాలోని అన్ని నగరాల్లో, పట్టణాల్లో, పల్లెల్లోని నీటి సరఫరా, గ్యాస్ సరఫరా అంతా ప్రభుత్వేతరంగా కార్పోరేషన్ల ద్వారా జరగవలసినదే! రోడ్డు నిర్మాణాలు, కాల్వల త్రవ్వకాలూ, వంతెనల కట్టడాలు, యితర ప్రాజెక్టుల సంతరణ యావత్తూ ప్రభుత్వంతో నిమిత్తం లేకుండానే జరుగుతుంది. భవన నిర్మాణంగూడా అట్లాగే జరుగుతుంది. టెలిఫోను పథకం, రేడియో, టెలివిజన్ అంతా ప్రయివేటు రంగంలోనే జరుగుతుంది. పోస్టాఫీసులు ప్రభుత్వ నిర్వహణలో వున్నవి. ఆయా బిల్డింగులు ప్రభుత్వానివే! అట్లాగే, ప్రభుత్వ న్యాయ స్థానాలు, ప్రభుత్వ భవనాల్లో వుండి వారి అధీనంలో ఉంటవి. అట్లాగే, ప్రభుత్వపు ఆఫీసులు పెట్టుకొన్న భవనాలన్నీ ప్రభుత్వానివే! గనులు---బొగ్గు, నూనె, యినుము, యితర లోహాలు---యివన్నీ ప్రభుత్వం క్రింద లేవు. ప్రయివేటు కార్పొరేషన్లు చేస్తూ ఉంటవి. యింతే కాదు, వ్యాపారం కోటానుకోట్లగా జరుగుతూ వుంటుంది. అదంతా---ఆహార రంగంగానీ, మరే యితర రంగంలోగానీ --- ప్రయివేటు రంగంలోనే వుంటుంది. యిదంతా ఎందుకు, అమెరికాలో ప్రభుత్వ స్థాయిలో యేమైనా ఉందా? అంటే తేలిగ్గా సమాధానం తేల్చుకోవచ్చునేమో! అవును, అమెరికాలో ప్రయివేటు రంగం ప్రాయికం. వ్యాపారాలకు, యితర మారకాలకు ఆ రంగమే కీలకం. యిది మనం ప్రత్యేకంగా గ్రహించవలసిన విషయం. ప్రభుత్వం, మనదేశంలో మాదిరిగా, అన్నీ నెత్తిన పెట్టుకోదు. ప్రభుత్వం అన్నీ నెత్తిన పెట్టుకోటం ప్రజాస్వామ్యం కాదని వారి అభిప్రాయం. అయినా, అమెరికా పెట్టుబడిదారీ విధానానికి కేంద్రం, దోపిడీ విశేషంగా వుంటుంది. ఆర్ధికంగా దోపిడీ వున్నా చోట ప్రజాస్వామ్యం సరిగా మన వీలులేదుగదా, దానిని గురించి మనం ఆలోచించ వలదా? అంటాము. తప్పనిసరిగా ఆలోచించాలి. మార్క్సు 'పెట్టుబడి'దారీ విధానాన్ని తీవ్రంగా, నిశితంగా విమర్శించాడు. మార్క్సు విమర్శించిన స్థాయిలో పెట్టుబడిదారీ విధానం లేదు. 'వ్యుత్పత్తి సామాజికంగా జరుగుతుంది. కాని, వినిమయం వ్యక్తి పరంగా అయిపోతుంది' అని మార్క్సు పెట్టుబడిదారీ వ్యవస్థను విమర్శించాడు. అందువల్ల ఆ లోపం యెక్కడున్నా అది పెట్టుబడిదారీ విధానంగా మార్క్సిస్టులు అంగీకరించాలి. ఆ దృష్టితో పరిశీలన చేయాలి. మరొక దృష్టి. వ్యక్తిత్వం వమ్ము కాకుండా దోపిడీ జరగకుండా సంఘంలోని వ్యుత్పత్తి తసరబు అయ్యేటట్టు చూడవలసి వుంది. ఆ పని కమ్యూనిజంలో జరగలేదు. వున్నా కమ్యూనిస్టు దేశాలను, అమెరికాను పోల్చి చూస్తె, సాంఘిక న్యాయం కమ్యూనిస్టు దేశాల్లో హెచ్చు జరిగినట్లు తేలడం లేదు. సాంఘిక న్యాయం జరగాలంటే, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక ప్రజాస్వామ్యాలు ఆచరణలోకి రావాలి. కేంద్రీకృత విధానాలు పోయి, వికేంద్రీకృత విధానాలు రావాలి. ఆ దృష్టితో నూతన పునఃపరిశీలన, అటు పెట్టుబడిదారీ విధాన దేశాల మీద, యిటు కమ్యూనిస్టు విధాన దేశాలమీద, విమర్శ బయలుదేరాలి. సమాజాన్ని విప్పారు తీరులలో నిర్మించటం జరగాలి. సమాజ వికాసం రావాలంటే, భావుకత క్రిందినుంచి పైకి రావాలి గాని, పైనుండి క్రిందికి నియత రీతిని రాగూడదు. ఈ దృష్టితో --- మానవుడు వ్యక్తిగా వికాసాన్ని పొంది, తానూ భావి సమాజనిర్మాణంలో పునాదిగా వుండగలిగిన ఏర్పాట్లను---మనం పరిశీలించి, గమనించుకోవాలి. నినాదాలు కృషికి ప్రత్యామ్నాయాలు కావు. అందుకని, ప్రభుత్వం తనకు తానై అన్ని రంగాల్లోకి రాగూడదు. ప్రభుత్వం వచ్చిన చోట సమిష్టి పేరుతో వికాస భ్రష్టత జరుగుతుంది. మానవుణ్ణి వ్యక్తిగా, సమిష్టి ఆచారదారునిగా మనం పునః పరిశీలన చేసి, శాస్త్రీయ విజ్ఞానంతో తిరిగి కొలవాలి. మానవుణ్ణి అట్లా కొలవగా నిలిచిన నవీన విలువలు, సమాజ నిర్మాణానికి ప్రాతిపదికలు కావాలి. ఆ దృష్టితో, నవ్య మానవతా దృష్టితో, నేను పరిశీలించాలని ప్రయత్నించాను. అమెరికా పెద్ద దేశం. కావలసినంత భూమి వుంది. ఖనిజ సంపద, పారిశ్రామికాభివృద్ధి వుంది. జనాలు అదుపులో వున్నసంఖ్యలోనే వున్నారు. ప్రతి వ్యక్తికీ, యింకా వనర్లు భారీగా పెంచుకొనే సావకాశాలు వున్నసాంఘిక వ్యవస్థ వుంది. కాని చాల మార్పులు కావాలి. కాని, పునాదుల్లో ప్రజాస్వామ్యం వుంది. అది పోషితం కావాలి. విప్పారాలి. స్వేచ్ఛలో సమానత్వం కావాలి. ఆ మార్పులు అమెరికాలో రావాలి. అందులో నాకు మరో అభిప్రాయం లేదు. కాని, వారి మార్గంలో వారు పోతూ వుండగా, మనం కోరే పరిణామాలు త్వరలో వస్తవా, లేక, కమ్యూనిస్టు మార్గంలో వారు మళ్ళితే ఆ పరిణామాలు త్వరలో వస్తవా అన్నప్రశ్నలు వేస్తె, వారి మార్గంలో వారు పోతూ ఉంటేనే త్వరలో వస్తవని నిర్ధారణగా చెప్పగలను. యిప్పటి వారి మార్గానికి, కమ్యూనిస్టు మార్గం వాంఛనీయ ప్రత్యామ్నాయ మార్గం కాదు. కాని, మార్గాంతరం లేదా? వుంది; లేదని కాదు. అదే హ్యూమనిస్టు మార్గాం తరంగా నేను భావిస్తాను. నా భావాలటుంచి, అక్కడ చెలామణిలో వున్న రీతుల్ని పరిశీలిద్దాం. అమెరికాని, కమ్యూనిస్టు రష్యాని దృష్టిలో పెట్టుకొని ఆలోచనలు చేస్తే, అమెరికాకు స్వాతంత్ర్యం 1776లో వచ్చినా, నవీన అమెరికా ఆవిర్భావం 1933 నుండి అని చెప్పవచ్చు. రష్యా 1917 నాటికి యూరపులో చాల దేశాల కన్నా గైరని మనం గ్రహించి, మొదటి పది పదిహేను సంవత్సరాలు వదలివేసి, 1933 ప్రాంతంనుంచి రష్యానూ పరిశీలించి, రెంటినీ పోల్చి చూస్తే, రెండురకాల ఆర్దికతల మధ్య యెటువంటి పొడిగింపులు జరిగినవో అర్థం చేసుకోవచ్చు. సిద్ధాంతాల మోజు మాత్రం చాలదు. సిద్ధాంతాలకు యిప్పటికి పట్టిన బూజులు చాలు. వ్యుత్పత్తి, మారకం, పంపిణీలలో ప్రయివేటు ఆస్తుల్ని రద్దు చేసినంత మాత్రాన, 'లోకా స్సమస్తా స్సుఖినో భవంతు' కాగలగటం భ్రాంతి అని అనుభవంలో తేలిపోయింది. ఆర్ధిక, రాజకీయాధికారాల కేంద్రీకరణ వల్ల వ్యష్టి స్వేచ్ఛ భ్రష్టమై, సమిష్టి సుఖం మిధ్యగా తేరి కూర్చుంది. అందువల్ల వ్యష్టి పునరుద్దీపన కాగల విధానాలు అవసరంగా తేలుతున్నై. వ్యక్తి భద్రత, వ్యక్తి స్వేఛ్చలు ప్రధానాలుగా వుండి తీరాలి. పెట్టుబడిదారీ విధానానికి ప్రాతిపదికగా గల లిబరల్ వారస్వత్వాలు ఆ వ్యక్తిత్వాన్ని ప్రోది చేయాలని పూనిక కలిగివున్నా, ఆచరణలో కాదగు భద్రతలను చేకూర్చలేక పోయినవి. కమ్యూనిజం ఆర్ధికత మీద నొక్కు పెట్టి, మనిషిని మరగా తయారుచేసి, మనుషులకన్నా విధానాల ప్రభావం జాస్తి చేసుకుంది. ఆ కట్టడి పోవలసి వుంది. కాని, అమెరికాలోని విద్య, స్థానిక సంస్థలు, స్వేచ్ఛా ప్రభుత్వం ప్రాథమిక ప్రజాస్వామ్య లక్షణాలు, సాంఘిక సంస్థలూ వారి భావ దీప్తి చూస్తే దేశంలో కొందరు పెద్దకారు పెట్టుబడిదార్లను, దోపిడీదార్లను చూచి, ఆ వరవడి యావత్తూ దేశం మీద రుద్దటం అశాస్త్రీయ రాజకీయపు విధానంగా తోచింది. ఆ తప్పుడు, వక్రమార్గాల్ని, సరిదిద్దుకోవలసి వుంది. అందుకే యిదంతా ! అమెరికా పుష్కల దేశం. అమెరికా ప్రజలు స్వేచ్ఛకు నీరాజనాల్ని యిస్తూ, దాని పునరుద్ధరణ వ్యక్తికంగా భావించే వారు. వ్యక్తికి అవరోధాలు వస్తే, ఏ విధానాన్ని అయినా త్రోసిరాజనే మనస్తత్వం కలవారు. విధానాల దాస్యం కోసం స్వేచ్ఛకు అవరోధాల్ని సహించని వారు. ఈ ప్రశస్తగుణాన్ని మనం గ్రహించాలి. యీ గుణాన్ని ఉద్దీపన చేయని ప్రభుత్వాన్ని ఆ ప్రజలు సహింపరు; వర్జిస్తారు. *--*--* రెండు నెలల్లో....? అమెరికాలో ఆగస్టు 15 న అడుగుపెట్టి అక్టోబరు 14న బయటకు మళ్ళాను. సరిగా రెండునెలలు ఆ దేశంలో సంచారం చేస్తూ, న్యూయార్కు, ఒహాయో, ఇల్లినాయిస్, విస్కాన్సన్, మిన్నెసోట, కాలిఫోర్నియా, ఎరిజోనా, టెక్సాస్, ఆర్కెన్.సాన్, టెన్నిసీ రాష్ట్రాల్లో, వివిధ నగరాల్లో పదివేల మైళ్ళు తిరిగి వచ్చాను. చూచింది హెచ్చు అనడానికి లేదు; చూడంది హెచ్చు అనడానికీ లేదు. కొన్ని విషయాల్ని అమెరికా విధానాల్లో ప్రాతినిధ్య స్థాయిలో చూచాను. ఎందరినో కలిసాను. ఎన్నో వూళ్ళు, నగరాలు, దృశ్యాలు, సంస్థలు, చూచాను. ఆవేదన పెంచిన చోట్లు, అనుభవాన్ని యిచ్చిన సన్నివేశాల్ని యెన్నింటినో తిలకించాను. నేనొక రాయబార వర్గంలో వెళ్ళలేదు. నేనొక ప్రతినిధిగా వెళ్ళలేదు. అమెరికా ప్రభుత్వం పిలిస్తే, వ్యక్తిగానే వెళ్లాను. కాని, నేను నా భావాలకు మాత్రమే ప్రతినిధిగానే వెళ్లాను. నేను యెక్కడకు వెళ్ళాలన్న, యెవర్ని కలవాలన్నా, యే సంస్థను చూడాలన్నా, చూచే సావకాశాన్ని నన్ను ఆహ్వానించినవారు కలిగించారు. నేను హెచ్చు చోట్లు తిరగకపోతే, తప్పో వొప్పో, నాదేగాని, వారిది కాదు. అమెరికాలోని యేబది రాష్ట్రాలూ చూడాలని, అరవై రోజుల్లో వీలుగా నేను ప్రణాళిక నివ్వగలిగితే, అవన్నీ వారు చూపేవారు. ప్రతి రాష్ట్ర ముఖ్య పట్టణంలో ఒక పూట గడిపి, తతిమ్మా రోజులన్నీ విమానయానంలో గడుపుతూ, యేమీ చూడకుండా, యెవర్నీ కలవకుండా, మన దేశం తిరిగి వచ్చినా వారేమీ అనరు; అనుకుంటే అనుకుంటారేమో! నేనా పని చేయ సాహసించలేదు. సరాసరి న్యూయార్కులో దిగినా, అప్పటికప్పుడే వాషింగ్టన్.కు బయలుదేరి, రాత్రికి విండ్ సర్ పార్కు హోటల్లో మకాం దిగాను. న్యూయార్కు విమానాయశ్రంలో దిగగానే స్టేట్ డిపార్టుమెంటు ప్రతినిధి నన్ను గుర్తు పట్టి, కష్టమ్సు, హెల్తు, ప్యాస్ పోర్టు పరిశీలనల కార్యక్రమం పూర్తిచేసి, వాషింగ్.టన్ విమానంలో చేర్చి వెళ్ళాడు. మరొక ప్రతినిధి వాషింగ్టన్ విమానాశ్రయంలో నన్ను కలిసి, హోటలుకు చేర్చి వెళ్ళాడు. వాషింగ్టన్ లో పది పన్నెండు రోజులున్నాను. పాల్ డి స్మిత్, లూయీ గ్రేషియాలు నా కార్యక్రమ నిర్ణయాధికారులు. స్మిత్ నన్ను 'నేషనల్ ప్రెస్ క్లబ్'కు తీసుకెళ్ళి, సభ్యుడుగా చేర్చి, గౌరవమిచ్చి, నాకై ప్రత్యేక విందు యేర్పరచి, నేను యే యే విషయాలను చూడదలచినదీ, మద్రాసునుండి వారికి చేరిన వుదంతం కాక, నా నుండి యెరిగి ప్లాను వేయటానికి భోగట్టా సేకరించారు. మరునాడు వాషింగ్.టన్ నగర సందర్శన యాత్ర, జార్జి వాషింగ్ టన్ యింటికి వెళ్లి, మౌంట్ వెర్.నాన్ చూచాము. అమెరికాలో వాషింగ్టన్.కు, కొలంబస్.కు వున్నన్ని స్తూపాలు, స్మారక చిహ్నాలు మరెవ్వరికి లేవు. లింకన్ విగ్రహం యెంతో వుత్తేజాన్ని కలిగించింది. పూర్వ గాథలన్నీ కళ్ళముందు నర్తించినై. ఎంత పెద్ద విగ్రహం! ఎంత బాగా వుంది!! లింకన్ వుదాత్తతను చాటేదిగా వుంది. లింకన్ విగ్రహం, వాషింగ్.టన్ స్మారక స్తూప స్థంభం, కేపిటల్ (పార్లమెంటు భవనం) అన్నీ ఒక లైనులో వుంటై. వాషింగ్.టన్.లో కేపిటల్ భవనానికన్నా యెత్తుగా మరే భవనాన్ని నిర్మించరాదన్న నిషేధం వుంది. వాషింగ్టన్ అమెరికాలోని సుందర నగరాల్లో ఒకటి. వెడల్పాటి వీధులు, రెండు ప్రక్కల చెట్లు, విశ్రాంతిని చిమ్ముతూ వుంటుంది. కేపిటల్ కేంద్రంగా పెట్టి, పట్టణాన్ని అర్థ చంద్రాకారంగా ఒక ఫ్రెంచి ఆర్టిస్టు రూపకల్పన చేసాడు. పార్లమెంటు, లేక, కాంగ్రెసుకి హాజరై రొండు సభల్లో --- ప్రతినిధుల సభ, సెనేట్ --- చర్చలు విన్నాను. వారికి కోరం నిబంధన లేదు. సెనేట్ లో ఒక్కడే సభ్యుడు ప్రసంగిస్తున్నాడు. అధ్యక్షుడు వింటున్నాడు. మరెవ్వరూ సభ్యులు లేరు. తర్వాత, తర్వాత చేరుకున్నారు. ఆగస్టు 20, 1963న కెనడీ పత్రికా విలేకరుల గోష్టికి వెళ్లాను. మొదటి వరసలో కూర్చొన్నాను. కెనడీకి ఎదురుగా రొండు గజాల దూరంలో. ఆనాటి సభ్యుల్లో నల్లరంగువాణ్ణి నేనొక్కడనే. చురుకైన గమనం. లేడి కళ్ళలాంటి కళ్ళు. యెరుపు, తెలుపు కలసి ధగద్యుతి కలిగిన దేహకాంతి. వయస్సుకి చిన్న. కాని ముక్కు పై భాగం చూస్తే, 60 యేళ్ళు కలవాడుగా కనబడతాడు. కొంచెం వంకరచేసి, చిరునవ్వు నవ్వుతాడు. "కోటా అంటే, నీగ్రోలకు ప్రత్యేక ప్రాతినిధ్యం మా రాజ్య ధ్యేయం కాదు. తెల్లలు, నల్లలు కలిసిపోవటం మా ఆశయం", అని నిగదించి ప్రవచించాడు. మనదేశంలో మన అధ్యక్షుడో, ప్రధానిగారో అట్లా అనగలరా? మరునాడు స్టేట్ డిపార్టుమెంటు ఉన్నతాధికారులతో చర్చ. అందులో ఒకరు తెలుగు దేశం తిరిగి వెళ్ళినవాడు. కొందరి వ్యక్తుల పేర్లు అడిగి, నానుండి కనుక్కొన్నాడు. వారితో చర్చ తీవ్ర రూపం గూడా తాల్చింది. కాని చివరికి వారు వంగి వచ్చారు. నెహ్రూకు --- కమ్యూనిజానికి వున్న సంబంధాన్ని గూర్చిన విషయంపై చర్చ తీవ్రత తాల్చింది. 'లోకం యెరిగిన దానికన్నా ఆయన హెచ్చుగా కమ్యూనిస్టు' అని నా వాదన. చివరకు చర్చ వివిధ విషయాలమీద లోతుగా జరిగింది. ఇవిగాక రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీల జాతీయ కార్యాలయాలకు వారి ప్రధాన ప్రతినిధులతో చర్చించాను. వారనేక విషయాలు చెప్పారు, నేర్పారు. నేనూ వారికి మూల విషయాలు అనేకం వినిపించాను. పార్టీలు లేని ప్రజాస్వామ్యం, హ్యూమనిస్టు వుద్యమం, సర్వోదయ మొదలైనవెన్నో వారితో చర్చించి, అభిప్రాయాల్ని తెలిసికొన్నాను. సుప్రీమ్ కోర్టుకు వెళ్లి కోర్టు సిబ్బందితో వివిధ విషయాలమీద చర్చించాను. కోర్టు ఫీజు, పాపరు దరఖాస్తులు, యింకా ముఖ్యాంశాల మీద గోష్టి జరిగింది. కోర్టు భవనం రూజ్ వెల్ట్ కాలంలో నిర్మించారు. ప్రశాంతత వర్షిస్తున్నట్లు వుంది. అంతర్జాతీయ కర్షక సమితి ఆఫీసుకు వెళ్లి డాక్టర్ జార్జి డిమిట్రాఫ్, యితర పెద్దలను కలిసి, వారితో అనేక విషయాలు ముచ్చటించాము. అది నా అమెరికా పర్యటనలో మహోదాత్త సన్నివేశాల్లో ఒకటి. లోగా తెనాలిలో డిమిట్రాఫ్ ని కలిసాను. వారెంతగానో మన్నన చూపి మర్యాద చేసారు. మరపురానిది ఆగస్టు 28 నాటి నీగ్రో యాత్ర. వాషింగ్ టన్ జనాభాలో సగానికి మించి నీగ్రోలున్నారన్నది చాలామందికి తెలియదు. నీగ్రోలు దేశంలోని నాలుగు చెరగుల నుండి చేరారు. నీగ్రోలు దేశంలోని నాలుగు చెరగులనుండి చేరారు. లింకన్ విగ్రహం వద్ద చేరి, ఆయన పాదాల వద్ద ఒక 'హక్కుల పిటిషన్' వుంచి, "1863 లో మీరు నీగ్రో విమోచంను ప్రకటించారు. యింకా మేము విముక్తి పొందలేదు" అంటూ, కన్నీటిజాలులో గద్గద కంఠాలతో విన్నవించి, ఆ పిటిషన్ తీసుకువెళ్ళి, దగ్గరగానున్న వైట్ హౌస్ లోని కెనడీకి సమర్పించారు. అది మరపురాని మనోజ్ఞదృశ్యం. లక్ష తెల్లలు, లక్షన్నర నల్లలు కలిసి, అమెరికనులుగా మైనారీటీ సంరక్షణకు దీక్ష వహించిన దినం. ఆనాడు అమెరికా అంతా గాద్గదికాన్ని పొందింది. తరువాత నా పెద్ద మజిలి న్యూయార్కు, ఒకటి రెండు తప్ప, వీధులు అంత వెడల్పు కాదు. ఇరుకు. భవనాలు ఆకాశపరిధుల్ని పుక్కిలిబట్టుతూ, మేఘమలికలతో వియ్య మందుతూ కూర్చుంటుంది. పాతిక అంతస్తులకు తగ్గితే అది చిన్న భవనమైపోతుంది. న్యూయార్కు 90 లక్షల పైగా జనం గల పట్టణం. చిత్ర నగరం. అమెరికా నగరరాజం, మన్ హాటన్, బ్రాక్లిన్ లాంగ్ ఐలాండ్, క్వీన్స్ అని చెప్పబడే నాలుగు దీవులు, బ్రాంక్స్ అన్న ద్వీప కల్పం కలిసి న్యూయార్కుగా వుంటుంది. ద్వీపాలనంటికీ వంతెనలు, రైళ్ళు, రవాణాలన్నీ పుష్కలంగా వున్నై. హడ్ సన్ నది, అట్లాంటిక్ సముద్రం ఈ భౌగోళిక కల్పనను న్యూయార్కుకు కలిగించినై. ఇక్కడికి నూరుమైళ్ళ దూరంలో వున్నా 'హైడ్ పార్క్' వెళ్ళాము. అది అధ్యక్షుడు రూజ్ వెల్ట్ నివాసస్థలం. వారి ఇల్లు, వనర్లు, చూచాము. యింటిలోకి ప్రవేశించి, యింటి బ్రాడ్ కాస్టింగ్.ను చెవులకు లగించాము. నెమ్మదిగా నడుస్తూ వుంటే, రూజ్ వెల్ట్ సతి ఎలియనార్ చెప్పే వ్యాఖ్య వింటూ యిల్లంతా తిరుగుతూ వెళ్ళాము. ఆమె సన్నని గొంతుకతో. తన యింటిని గూర్చి, భర్తనుగూర్చి చెప్పిన వ్యాఖ్య మహత్తరంగా వుంది. యెన్నో స్మృతులకు ఆలవాలమైంది. ఎలియనార్.ను చూచినట్లు, రూజ్ వెల్ట్ .ను కన్నట్టు అయింది. తోట, యిద్దరి సమాధులు, పరిసరాలు చూచి వచ్చాము. ఎందరినో మిత్రుల్ని చూచాము. చర్చి కేంద్రాల్ని పరిశీలించాము. న్యాయ స్థానాలు, పత్రికా కేంద్రాలు, రాక్ ఫెల్లర్ సెంటర్, అంతర్జాతీయ కర్షక సమితి కార్యాలయం, హ్యూమనిస్టు సంఘాలు ఎన్నో చూచాము. అక్కడినుంచి 'బఫెలో' పట్టణానికి వెళ్ళాము. నయాగరా జలపాతం చూట్టాని కని ఈ ప్రయాణం. బఫెలో నగరంనుండి నయాగరా వెళ్లి, జలపాతం సాయంత్రం చూచి రెడ్ కోచ్ యిన్.లో బస చేసాము. మిత్రుల్ని కలిసాము. విందులకు వెళ్లి, రాత్రి తిరిగి నయాగరా చూట్టానికి కెనడాలోకి వెళ్ళాము. పాతిక మైళ్ళుదాకా పయనించి వచ్చాము. నయాగరా ప్రాంతం మంచి పంటల కేంద్రం. యాపుల్స్, బీచస్, గ్రేప్స్ విశేషించి పండుతవి. పెద్ద రకం కావు. తిరిగి బఫెలో వెళ్లి అక్కడ నుంచి డేటన్ చేరుకున్నాము. డేటన్ నుంచి యీటన్ తీసుకు వెళ్ళారు. యీటన్ లో ఆ పూట గడిపి, కాఫ్ మన్ గారింటికి కాంపుబెల్ టౌన్ కు వెళ్ళాము. అక్కడ మూడురోజుల మకాం, యెంతో దూరం తిరిగి, యెన్నో వ్యవసాయ క్షేత్రాలను చూచి, మునిసిపల్ వ్యవహారాలు పరికించి --- నేను నేర్చిన వాటిల్లో హెచ్చు విషయాల్ని యిక్కడే సేకరించాను. యీటన్ నుండి డేటన్ చేరి, అక్కడనుంచి చికాగో మజిలీ కట్టాము. చికాగో మహానగరం, 60, 70 లక్షల జనం. వివేకానందుని నాటినుండి మనతో సంబంధం వున్న పట్టణం. మురికివాడలు గల పట్టణం. ఒక మంచి 'చిత్రశాల', పెద్దసరి నేషనల్ మ్యూజియములు కలవు. సరస్సుల నగరం. సరస్సులని పేరు గాని అవి నిజానికి సముద్రాలే! పెద్దసరి అలలు, వోడలయానాలు, భారీ చేపల పరిశ్రమ. చికాగో చిలిపి నగరం. ఒక్క క్షణంలో వాతావరణంలో మార్పులు వస్తవి. ఎండగా వుంది, చటాలున వర్షం వస్తుంది. అనుకోకుండా చలిగాలి క్షణంలో వీస్తుంది. చుడుపు గాలి బర్రున వచ్చి, నెత్తుల మీదనున్న టోపీలను చేతితో అదుముకొనే లోగానే గాలి వాటిని తోలి పారవేసి, సుడిగాలుల్లోకి లేపుకుపోతే వారు విహ్వలులై తలలెత్తి పరికిస్తుంటే, నవ్వటానికి వీలులేని నవ్వుల సన్నివేశంగా కనబడింది. అక్కడ 'బహాయ్' మత ప్రచారం వుంది. దాని సంబంధులు మన దేశంలో, ఢిల్లీలో గూడా వున్నారు. నీగ్రోల ఏకైక దిన పత్రిక "చికాగో డెయిలీ డిఫెండర్" పత్రిక వుంది. వెళ్లి చూచాను. సంపాదకుడు --- లోషార్ట్ వుద్యమంలో పండినవాడు. వారితో, యితర నీగ్రో నాయకులతో అనేకములైన నీగ్రో సమస్యల్ని చర్చించాను. నీగ్రో గృహాలు చూచాను. ఆఫీసులోని వారంతా నా పట్ల చూపిన ఆదరభావం చూస్తె, వారు నన్ను వారివానినిగా యెంతగా అనుకున్నారో వూహించవచ్చు తెలుగు మిత్రుల్ని కలిసాము. వాకిగన్ వెళ్ళాము. మరునాడు యాబట్స్ లాబరేటరీకి వెళ్ళాము. 90 సోల్లూశాన్లు, 30 కాప్సూళ్ళు, ప్లాస్టిక్ కంటెయినర్సు, నీడిల్స్, మరెన్నో తయారు చేస్తారు. 250 మంది పి.హెచ్.డి.లున్నారు. 79 ఎకరాల ప్రాంగణం. 4000 మంది నియుక్తులు. 1500 మంది రిసర్చిలో, 1800 వ్యుత్పత్తిలో వుండి పనిచేస్తున్నారు. 3500 కార్లలో వీరంతా వస్తారు. 600 రకాల మందులను వ్యుత్పత్తి చేస్తారు. రెండు అంశాల్ని యిక్కడ ఉదహరించాలి. యాబట్స్.లో పనిచేసేవారికి 'ఫ్రింజ్ బెనిఫిట్స్' అని, జీతాలు నాతాలు కాక, యితరత్రా కంపెనీ సాలీనా పదివేల రూపాయిల దాకా నియుక్తులు ప్రతిఫలం పొందుతారు. గుడ్డలకు, బూట్లకు, మందులకు, యితర ఉపకార వేతనాలుగా పొందుతారు. ఎవరన్నా, బాగా పనిచేస్తూ వున్నవారు, మధ్యలో మాంద్యంగా వుంటే, దాని కారణాల్నిమిత్రులు, సన్నిహితుల ద్వారా అరసి, తన్నివారణకు కంపెనీ ప్రత్యేక శ్రద్ధ చూపి, దానికగు ఖర్చులను ఉదారంగా భరిస్తారు. యీ తీరు తెన్నులు అమెరికాలో చాలాచోట్ల ప్రయివేటు కంపెనీలలో కలవు. విశ్వ విద్యాలయం చికాగోలో అతి ముఖ్యమైనది. వారి గ్రంథాలయంలో తెలుగు పుస్తకాలు, దిన, మాస పత్రికలు వున్నవి. అరవ సాహిత్యం, హిందీ గ్రంథాలు, వురుదూ కావ్యాలూ వున్నై. హిందీ, ఉరుదు, తమిళ భాషలు నేర్పుతున్నారు. తెలుగు త్వరలో నేర్పుతారు. ఒక ఉపాఖ్యానం. జూన్ ఏడవ తేదీ. ఆంద్ర పత్రిక తీసి, నేను అమెరికా వెళ్ళబోవు తరుణంలో ముద్రింపబడిన నా చిత్రాన్ని చూపాను. వారంతా చూచి కులాసాగా నవ్వుకున్నారు. "మీరు మా గ్రంథాలయంలో వున్నారు" అన్నారు. "నేను వున్నట్లు మీకు నేను చెప్పితేనేగదా తెలిసింది", అంటూ నవ్వుకున్నాము. యిక్కడ "రాష్ట్రాంతర సంఘం" అన్నదొకటి వుంది. వివిధ రాష్ట్రాలలో జరుగు రకరకాల శాసనాల్ని పరిశీలించి, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రం వారు నేర్చుకోదగ్గ అంశాలను గూర్చి నివేదికల్ని తయారు చేస్తారు. ఆ నివేదికలు వివిధ రాష్ట్రాలవారు పరిశీలిస్తారు. అవసరమైన కార్యక్రమాల్ని రూపొందించుకుంటారు. భిన్నంగా వున్నా శాసనాల్ని ఏకత్వ స్థాయికి తెచ్చుకునే రీతిని వీరు గమనించి కృషి చేస్తారు. ఇటువంటిదే, వివిధ రాష్ట్ర 'అటార్నీ--- జనరల్సు' తాలూకా సంఘం గలదు. ఆయా పరిశోధనల్ని పరిశీలించి, వారితో చర్చించి వచ్చాను. ఆ చర్చలు అనేక నూతనాంశాలను తెలియజేసినవి. అక్కడనుండి రైలులో మిల్వాకీ వెళ్లాను. అదే నా తొలి, తుది రైలు ప్రయాణం. సౌకర్యంగా వున్న ప్రయాణం. విస్కాన్ సన్ విశ్వ విద్యాలయానికి వెళ్లాను. అనేకులైన అధ్యాపకుల్ని కలిసాము. 36000 మంది బోధనలో వున్నారు. విద్యా విషయాలు, వికేంద్రీకరణ, పాలనా విధానం, యువకుల సమస్యల్ని, వ్యవసాయాన్ని, పత్రికలను గూర్చిన చర్చలు జరిగినవి. మిల్వాకీ జర్నల్, మిల్వాకీ సెంటినల్ పత్రికలను చూచాము. ప్రఖ్యాత సంపాదకులతో గోష్టి. ఆనాడు ప్రెస్ క్లబ్.లో ప్రసంగించాను. లోగడ తియోడోర్ రూజ్ వెల్ట్, అధ్యక్షుడు విల్ సన్, ఆర్.జి. యింగర్ సాల్ లాంటి ప్రఖ్యాతులు ఆ ప్రెస్ క్లబ్.లో మాట్లాడారు. ప్రసంగించినవారి సంతకాల్ని ఒక చిన్న బ్లాక్ బోర్డు మీద సేకరించి, చట్టం కట్టి వాటిని నిల్వ చేస్తున్నారు. నా సంతకాన్నీ అట్లాగే తీసుకున్నారు. యిక్కడ, ఒక పంజాబీ, ఒక కేరళీయుడు అమెరికా యువతులను వివాహం చేసుకొన్నారు. వారిద్దరూ నన్ను భోజనాలకు పిలచి, మిత్ర గోష్టులు జరిపించారు. యీ మిశ్ర వివాహాలు యెంతో మృదువుగా జరిగిపోతున్నవి. వారలపట్ల ప్రజలందరూ సమాన ఆదరణ భావాల్ని చూపుతూనే వుంటారు. బస్సులో మాడిసన్ వెళ్లాను. అక్కడ తెలుగువారనేకులు, తెలుగు నేర్పే తరగతులున్నవి. వెళ్లి చూచాను. పదకొండు వారాల్లో అమెరికా పిల్లలు చాల శ్రద్ధగా తెలుగు అధ్యయనం చేసారు. తెలుగు గ్రంథాలయం గూడా కలదు. కవిరాజు భగవద్గీతను గ్రంధాలయానికి బహూకరించాను. శాంతి దళాల నిర్మాతలతో చర్చలు చేసాము. యువసమాజ్ సమావేశాలకు హాజరైనాను. కొత్తగా బడులలో చేరినవారికి స్వాగతం చెప్పేరోజు, నేనూ మాట్లాడాను. విశ్వవిద్యాలయంలో రేడియో ప్రసంగం చేసాను. తిరిగి మిల్వాకీ చేరాము. యీ రోజుల్లో అమెరికా జీవితాన్ని అవగాహాన చేసుకోటానికి యెంతో సావకాశం కుదిరింది. అదను అబ్బింది. తరువాత కేంద్రం మినియా పోలిస్, మిన్నెసోట రాష్ట్ర ముఖ్య పట్టణం. పారిశ్రామికతకు, వ్యవసాయానికీ కూడలి రాష్ట్రం. డెమొక్రాటిక్ పార్టీ ఆఫీసుకు వెళ్లి చర్చలు చేశాను. రాష్ట్ర అటార్నీని కలిసాము. న్యూయార్కు అటార్నీ జనరల్ తో చేసిన చర్చలను పోల్చి చూచుకున్నాను. అభిప్రాయ భేదాలు వున్నా, ముఖ్యాంశాల్లో పెద్ద భేదాలు లేవు. ఆ సాయంత్రం యిండియా విద్యార్ధుల సమావేశానికి హాజరై, విశ్వవిద్యా లయోపాధ్యక్షులతో చర్చలు చేశాము. ఎన్నో నూతన విషయాలు చర్చకు వచ్చినవి. తెలుగు వారల బసలకు వెళ్లి, రేడియో ప్రసంగం చేసి, గ్రంథాలయం చూచాను. ఆవుపాడి కేంద్రాలు, వ్యవసాయ క్షేత్రాలూ చూచాను. మిన్నియా పోలీస్ స్టార్, మిన్నియా పోలీస్ ట్రిబ్యూన్ పత్రికల ఆఫీసులకు వెళ్లి జార్జి పీటర్.సన్.తో చర్చించి, వారి ఆఫీసు సిబ్బందితో ముచ్చటించాము. ఇండియాను గురించి లోతుగా చర్చలు జరిగినవి. పంచవర్ష ప్రణాళికల మీద, నెహ్రూమీద, చైనా యుద్ధంమీద... యెన్నో విషయాలమీద – చర్చ నిశితంగా, దీర్ఘంగా జరిగింది. మిత్రుడ జార్జి పీటర్ సన్ ఆ సమావేశాన్ని గురించి వ్రాస్తూ.... Dear Mr. Murthy! Thank you for your card from San Francisco. I want you to know how much I enjoyed your visit. I learned more from you about the Indian political situation than I have from any other person be he from India or not. I hope when you get back this way again you will stop in for another visit.” అన్నాడు. ఆనాటి చర్చలోని ప్రగాఢతను యీ లేఖ తెలియజేస్తుంది. అది మూడుగంటల సమావేశం. అమెరికా నగరరాణి శాన్ ఫ్రాన్సిస్కోకు అక్కడ నుండి తరలి వెళ్ళాను. వాషింగ్.టన్, శాన్.ఫ్రాన్సిస్కోలు పెద్ద పట్టణాల్లో, మిల్ వాకీ, ప్రెజ్నో, లిటిల్ రాక్.లు చిన్న పట్టణాల్లో నాకు నచ్చినవి. తూర్పుకు న్యూయార్క్ నగరం అమెరికాకు యెట్లాగో, పశ్చిమ కోస్తాలో శాన్.ఫ్రాన్సిస్కో అట్టిది. దీన్ని పశ్చిమ ముఖ్య పట్టణం అంటారు. ఆసియా నుండి అమెరికాకిది ద్వారం లాంటిది. న్యూయార్క్ ఐరోపా నుండి అమెరికాకు ద్వారం. యీ రెండు నగరాలు అమెరికాలోని ప్రాక్ పశ్చిమాలకు గరీయసత్వాన్ని పొందినవి. యిది యెత్తు పల్లాల పట్టణం. తాడెత్తు రోడ్లు, వెంటనే అగాధంలాంటి గుంటలలో రోడ్లు, ఐక్య జాతుల సమాఖ్య ప్రణాళిక రూపొందింది యిక్కడవున్న ‘సివిల్ సెంటర్’లో. జపాను శాంతిసంధి 1951లో యిక్కడే కుదిరింది. 1776లో అమెరికా స్వాతంత్ర్య దీక్షాపత్రాన్ని ప్రచురించటానికి అయిదురోజులు ముందుగా రెవరెండు ఫ్రాన్సిస్కో ఒక చర్చి భవనాన్ని తెరచాడు. మనంవాడే దోనె పెంకులతో కప్పు కప్పివుంది. ఆ పెంకులు, యిటలీ నుండో, యిండియా నుండో శాన్ ఫ్రాన్సిస్కోకు చేరివుండవచ్చు. రోమునగరం, వెంకన్న కొండలమాదిరిగా, యేడుకొండలమీద వుంది. శాన్ ఫ్రాన్సిస్కో 32 కొండలమీద వుంది. 910 అడుగుల యెత్తు శిఖరాలూ వున్నవి. 1775లో మొదటి నౌక యీ రేవుకు చేరిందట. గోల్డెన్ గేట్ బ్రిడ్జి, జపాను టీ గార్డెన్, మ్యూర్ రెడ్ వుడ్ యిక్కడి ప్రసిద్ధాలు. మూడు ప్రక్కల నీళ్ళుగల పట్టణం, ద్వీపకల్పంలాంటిది. ఎండజాస్తి. మంచు జాస్తి. చలికాలంలో రోడ్డు మీద దళసరి మంచుకరుళ్ళు కట్టుతై. మాడిసన్.లో మరీ జాస్తి. ట్రాముకారులాంటి, ప్రాచీన రవాణా వుంది. మ్యూజియం విలువక్రింద దాన్ని వుంచి, రవాణాగా నడుపుతుంది మునిసిపాలిటీ. పసిఫిక్ సముద్రంలోకి 30, 35 మైళ్ళ దాకా బోటు ప్రయాణం చేసి, రిచర్డ్.సన్ బే గాలించాము. అక్కడ సెక్యులర్ వాదులు, హ్యూమనిస్టులు ఎందరో కలరు. పత్రికలు, ప్రచురణలు కలవు. మేరీమొరెయిన్, లాయిడ్ మొరేయిన్లు హ్యూమనిస్టులు. బెర్నాడ్ రొక్క సెక్కులరిస్టు. వారలతో చర్చలు హృద్యంగా వున్నవి. అక్కడ నుండి ఫ్రెజ్నోకు. కాలిఫోర్నియా రాష్ట్రం అమెరికాకు తిండి పంటల కేంద్రం. కాలిఫోర్నియాకు ఫ్రెజ్నో కూడలి. 213 రకాల పంటలు పండుతై. తలసరి సాలీనా 20,000 రూపాయిల ఆదాయానికి తక్కువ పొందని పట్టణం. 57 జాతుల జనం వున్నారు. ఏడింట ఒకరు విదేశీయులు. యెంత మిశ్ర దృక్పథంతో వుంటుందో ఊహించవచ్చు. పెద్ద ఎత్తు వ్యవసాయ క్షేత్రాలకిది ప్రధాన కేంద్రం. రేడియోలో మాట్లాడాను. విలేఖరుల గోష్టి జరిగింది. విశ్వ విద్యాలయంలో ప్రసంగించాను. రాత్రి ఒక బహిరంగ సమావేశంలో మాట్లాడాను. ప్రశ్నల పరంపర వారి శ్రద్ధను వ్యక్తం చేస్తుంది. పంజాబీ మిత్రుడొకరు యిక్కడే గత 40 యేళ్ళ నుండి ఉండిపోయాడు. ఆయన ఆహ్వానించి, ఆతిథ్యమిచ్చాడు. లాయర్ల డిన్నరు. కళాకారుల టీలు జరిగినై. ఫ్రెజ్నో చక్కటి చిన్న పట్టణం. అక్కడనుండి లాస్ ఏంజల్స్ నగరానికి మరలింపు. యిదొక వింత పట్టణం. హడావిడికి అమెరికాకు పేరు; అందులో లాస్ ఏంజల్స్ ది పైచేయి. హాలీవుడ్ యిక్కడిదే. డిజ్నీలాండ్ సమీపంలోది. తూర్పు సంపర్కం గల్గి, జపాను, చైనా వాసనలతో, మురికివాడలు గలిగిన పెద్ద నగరం. లాస్ ఏంజల్స్ 'టైమ్సు' పత్రిక యిక్కడ ప్రసిద్ధి. ఆ పత్రికలో ఎన్నో వింతలున్నవి. చాల పెద్ద పత్రిక. విద్యా విషయాల్ని చర్చించడానికి విద్యాబోర్డుకు వెళ్లి వారలతో అనేకమైన నూతనాంశాలను చర్చించాను. ఒకరోజు మునిసిపల్ వ్యవహారాల్ని చర్చ చేశాను. యిర్వింగ్ స్టోన్, ప్రఖ్యాత నవలా కారుణ్ణి కలిసి, వారి యింట విందు చేసి, ఆ రోజు 109 డిగ్రీల వేడి రాగా, యింటి స్నానాల కొలనులో వారూ, మేమూ గ్రుంకులాడి, యెంతో వినోదంగా గడిపాము. వారి గృహం నుండి పట్టణాన్ని చూడటమే ఒక వినోదం. స్టోన్ సరసుడు. రసజ్ఞుడు. ఒక లాయరు కుటుంబం విందు చేసింది. భార్య, భర్త, యిద్దరు కొడుకులు. ఒక కోడలు లాయర్లు, వారానాడు యెంతో మేధో రీతుల్లో విందు గోష్టి జరిపారు. ఒక మనోజ్ఞ సాయంతనమది. ఎన్ని విషయాలు చెప్పారు! ఎన్ని విషయాల్ని ప్రశ్నల్తో వెలికి తీశారు!! హాలీవుడ్ చూచాము. షూటింగ్ తిలకించాము. రేడియోలో "ఎం.యన్. రాయ్ --- రాడికల్ హ్యూమనిజం" అన్న విషయం మీద ప్రసంగించాము. తరువాత వారది రిలే చేస్తూ, మన స్నేహితులు వినటం కోసం వివరాలు కావాలంటే వ్రాస్తామనీ వ్రాస్తూ; "Dear Mr. Murthy : We are pleased to inform you that KPFA will present "THE RAADICAL HUMANISM OF M.N.ROY" on Friday, December 6, 1963 at 1.00 p.m. The Programme is a recording of your talk with MR. John Ohliger. Thank you for the opportunity to present this programme to our audience . KPFA is heard throughout most of Northern California . If there are any groups or individuals whom you would like us to notify , please let us know అన్నారు. వారి రసజ్ఞత, ఉచితజ్ఞత చూడండి. ఒక రోజు డిజ్నీల్యాండ్ పర్యవేక్షణ సరిపోయింది. లాస్ ఏంజల్స్ కొంత హడావిడిగా వున్నట్లు కనబడుతుంది. విశ్వ విద్యాలయ కేంద్రం బాగా వుంది. ఫీనిక్స్ మా తరువాత కేంద్రం. ఆరిజోనా రాష్ట్రం. అక్కడనుండి ప్లాగ్ స్టాప్ వెళ్లి, బస్సులో 'గ్రాండ్ కానియన్' చూడడానికి వెళ్ళాము. అది మాపటివేళకు పూర్తి చేసి, ప్లాగ్ స్టాప్ కు వచ్చి, రాత్రి విమానంలో ఫీనిక్స్ చేరాము. అమెరికాలో రాత్రిపూట విమానంలో అది రొండోసారి. మొదటిసారి తొలినాడే న్యూయార్కు నుండి వాషింగ్.టన్.కు చేసిన ప్రయాణం. యిది రెడ్ యిండియన్ లకు కేంద్రం. అందుకే ప్రయాణం కట్టాను. ఆదిమ వాసుల్ని యీ దేశంలో యెరుగుదుము. అమెరికా ఆదిమవాసుల పేరే యిండియన్లు అని. వారికి మన పేరు కలిగింది. అది కొలంబస్ భ్రాంతివల్ల జరిగింది. ఎవరీ యిండియనులు? అసలు అమెరికా వారిది. కాని యిప్పుడు వారు అనామికులు. 1492 లో కొలంబస్ అమెరికాని కనుగొన్నప్పుడు, ఆ గడ్డ వారిది. దాని యేలుబడి వారి చేతుల్లో వుండేది. యిప్పుడు వారు నాల్గు లక్షలమంది, 60 లక్షల ఎకరాల భూమికి కామందులు. దేశ పాలనలో వారికి జానెడు చోటు లేదు. వారిలో ముసలి కారువారు, నేటి నాజూకులకురారు. పాత వేష భాషలలోనే వుండాలని చూస్తారు. యువకులు యింగ్లీషు నేర్చి. నాజూకు పొంది, సూటు వేషాల్ని వేసి, మామూలు అమెరికన్లలో కలిసిపోతున్నారు. రెడ్ యిండియన్లు చరిత్రలో కనబడని జాతిగా మారిపోయే సూచనలున్నవి. ఏ డిజ్నీ లాండ్ లోనో ప్లాస్టిక్ రెడ్ యిండియనులను తేలికగా చూడవచ్చును గాని, మామూలుగా వారిని చూచుట కష్టం. అందులోని వేషభాషలకు, మన పూర్వీకులైన ఆటవికుల వేష భాషలకు సామ్యం కనబడుతుంది. మన కోయ, కొండ జాతులు కొమ్ములు పెట్టుకొని వేషాలు కట్టినట్లు, వాళ్ళూ కడతారు. 1540లో స్పెయిన్ దేశీయులు న్యూమెక్సికో ప్రాంతంలో యిండియన్లను చూచి, వారు ధరించిన నూలు వస్త్రాల చేతను చూచి విస్తుపోయాను. ప్రాచీన సమాజ చరిత్ర పరిశోధకులు 700 సంవత్సరాల నాటికే మంచి నైపుణ్యంతో యిండియాను మించిన వస్త్ర కళాసృష్టి చేసినట్లు చెప్పుతున్నారు. 'నవాహొనేత' గా దీన్ని అభివర్ణిస్తున్నారు. వీరిలో 'హొపి యిండియను' అను మరియొక తెగ కలదు. బుట్టలు, తట్టలు, మట్టిపాత్రలు. వాటిమీద చిత్ర జగసృష్టి వారి నైపుణ్యంగా కనబడుతున్నట్లు చరిత్ర తెల్పుతుంది. 500 క్రీ.శ. నాటికి సంఘ తత్వ శాస్త్రజ్ఞుల పరిశోధనలలో 'అనసాజి' తెగవారిలో బుట్ట, తట్టలు పరిశ్రమ వుదాత్త స్థాయిలో వున్నట్లు తెల్పుతున్నారు. 700 క్రీ.శ. నాటికి వ్యవసాయ కుటుంబాలుగా వీరు పరిఢవిల్లినట్లు తెలుస్తుంది. వీరినే 'పిమా' యిండియనులని కూడా అందురు. 'పాపగో' అను మరొక శాఖగూడా కలదు. వీరి కళా ప్రదర్శనాల్లో యెంతో కవిత, భావుకత వున్నవి. "గుర్తులను చూపి, భావదీప్తి కల్గునట్లు చేయటం వీరి నైజంగా గోచరిస్తుంది. విలువిద్య, ఖడ్గయుద్ధాలు, కుస్తీలు, మైదుకుందులు వారిలో ప్రచారంలో వున్నట్లు తెలియవస్తుంది. యిప్పటికి 1500 సంవత్సరాలనాడు వారి సంస్కృతి విస్తారంగా వున్నదని తెలిస్తే అప్పటికది యెంత పాతదో, వారి భాషా ప్రాదుర్భావాలెట్టివో సరిగా తేలలేదు. పరిశోధనలు విశేషంగా కనబడవు. నేను యిండియనులను కలిసి చర్చింప వీలులేదు. వీరు అంతరిస్తున్న శాఖగా అమెరికా గ్రహించింది. జనాభాను బట్టి ఆ స్థాయిలోకే జారిపోతుంది. అందువల్ల కేంద్రీకృత ప్రచారం దీన్ని గురించి లేదు. యిది గతించిపోతున్నవారి కథ మాత్రం వుండిపోగలదు. అదొక స్వప్న గాథ కాగలదు. యీ ప్రాంతపు ప్రబంధకన్య గ్రాండు కానియన్ దృశ్యం. దానికే వెళ్లుతారు. తనివితీర చూస్తారు. మేము చూచాము. కాని నా మనస్సు యీ చిదికిపోతున్న అమెరికా పాతకాపుల మీదికి పోయింది. నేను పొందవలసిన సౌఖ్యాన్ని యీ విషయంలో పొందలేక పోయాను. అందుకని కదిలి ముందుకు వెళ్లాను. ఫీనిక్స్ నుండి టెక్సాస్ రాష్ట్రంలో డెల్లాస్.కు వెళ్ళాము. యిది పంటలకు, గొర్రెలకు, మేకలకు, పశు సంపదలకు ప్రశస్త రాష్ట్రం. దేశానికొక అండగానుండే కేంద్రం. కెనెడీని పొట్టన పెట్టుకున్న చోటిదే! డల్లాస్ నుండి ఆర్కెన్సాస్ రాష్ట్రంలోని లిటిల్ రాక్.కు వెళ్లాను. 1957 లో ఐసెన్ హోవర్ అధ్యక్షుడుగా వుండగా నీగ్రో విద్యార్ధుల విషయంలో గోల చేసి కేంద్రాధికారాల్ని ఆహ్వానించిన కేంద్రం. ప్రక్క రాష్ట్రమైన అలబామాలో నీగ్రోగోల నేనున్న రోజుల్లో రేగుతుంది. ప్రక్క రాష్ట్రంలో జాతుల గోల కొంచెం సాగితే, మన రాష్ట్రంలో కదిలే వాతావరణంలో మనకు, ఆ రాష్ట్రమేమి గురుతింపు నేర్పగలదో చూద్దామని వెళ్లాను. నాకు లోగడ జాత్యుద్ధాలను చేసుకొన్నవారైనా, యిప్పుడు నిశ్చలంగా, నిబ్బరంగా, నిలకడగా సాగిపోతూ, ప్రక్కవారు రెచ్చగొట్టు కేకలకు వుద్రిక్తులు కాక, సజావుగా జరిగిపోతున్నారు. అది నన్ను బాగా ఆకర్షింది. మనకు గుణపాఠం నేర్పతగింది. తూర్పు పాకిస్తాన్ లో హిందువుల్ని యేదో అన్నారని, నిజమో అబద్ధమో విన్న మనం మన దేశంలో ముస్లిములను చిత్తు రేగతన్ని, చంపనుగూడా చంపుకొంటున్న మనకు, యీ లిటిల్ రాక్ కొన్ని కధల్ని నేర్పాలి. వారి గాధల్ని మనం పరిశీలించుకోవాలి. లిటిల్.రాక్.లో మునిసిపల్ వ్యవహారాలూ, వ్యవసాయపు నిగ్గులు, జాత్యహంకారపు లోగడ యితివృత్తాలూ, నేటి సమైక్య పోకడలు చూచాను. యం.ఆర్.ఏ. వారి 'ఎస్ట్రోసాట్స్' నాటకం చూచాను. 2000 సభికులలో మూడు వంతులు నీగ్రోలు, ఒకవంతు తెల్లలు. యెంత నిరాడంబరంగా హాలు నిండి, కళాత్మక సృష్టిని, అభేద భారంతో తిలకించారు! మధ్య విశ్రాంతి సమయంలో యెంత బాగా చర్చిస్తారు!! నీగ్రో సమస్యలను బాగా అర్థం చేసిన చోటు లిటిల్ రాక్. మురికివాడలు చూచాను. సాంఘిక సంక్షేమ కార్య కలాపాలు చూచాను. అది ఎంతగానో నన్ను ముగ్ధుణ్ణి చేసింది. అమెరికన్లు వారికై వారు, ప్రభుత్వం వైపు చూడకుండా ఎన్ని పనులు చక్కదిద్దుకుంటారో వ్యక్తమైంది. విశ్వ విద్యాలయం చూచాను. వివిధ ప్రాంతాలు, ఒక పశువుల సంతనుగూడా కొంత చూచాము. వివిధ శాఖలలోని వ్యక్తుల్ని, నీగ్రో కార్యకర్తల్ని చూచాను. అక్కడనుంచి గోపీచంద్ స్మారక సంచికకు వ్యాసాన్ని పంపాను. జాత్యహంకారుల హోటలులో శాన్ పెక్ లో దిగాను. ఇప్పుడా జాడలుగూడా లేవు. పాత మనుషులే వున్నారు. కొత్త దృక్పథం ఏర్పడింది. అట్టి దృష్టి విస్తరించాలి. అక్కడనుండి టెన్నిసీ రాష్ట్రంలోని నాక్స్వెలీకి వెళ్ళాము. మిన్నియాపొలీస్ రాష్ట్రంలో పుట్టిన టెన్నిసీ నది వైభవాన్ని యీ రాష్ట్రంలో చూడగలిగాము. "టెన్నిసీ వాలీ అథారిటీ" చూచి, వ్యవసాయోదంతం పరిశీలించాలని వచ్చాము. మనం యిక్కడ నదీజలాల గోలలు చేసుకుంటున్నాము. శాస్త్రీయ విషయానికి రాజకీయ దుమారం పట్టిస్తున్నాము. అందుకని, నదీ జలాల సమస్యల్ని పరిశోధనా రీతిలో, శాస్త్రీయ దృష్టితో చూడటానికి వెళ్లాను. ఎన్నో విషయాల్ని చూచాము. చాల దూరం తిరిగి, చాల డాములు చూచాము. రూజ్ వెల్ట్ ప్రతిభ, అమెరికా 1933 తర్వాత పునర్నిర్మాణ స్థాయి బోధకాలైనై. కొండల కొరివిని నందనవనాలుగా మార్చిన ప్రణాలికలు చూచాము. టి.వి.ఏ. వుదంతం కొంత వేరుగా చూద్దాం. యిది నా ప్రయాణంలో చివరి మెట్టు. మగిడి వాషింగ్టన్ కు బయలుదేరి, చేరి, తిరిగి విండ్ సర్ పార్క్ హోటల్.లో బసకు దిగాము. ఇండియా ఎంబెసీలోకి వెళ్ళాము. చలనం లేని కృషి కేంద్రం అది. పని జరగని పనుల రంగం అది. తెలుగు మిత్రుల్ని చూచాము. విందులు చేశాము. అధికారులతో స్టేట్ డిపార్టుమెంటులో చర్చలు ముగింపు వాక్యాలు జరిగినై. మొదటి తగవులు లేవు. వారు నన్ను అంగీకరించారు. నా వాదాల బలం చూచారు. యునైటెడ్ స్టేట్సు సమాచార శాఖకు వెళ్లి, నా పర్యటనలో నేను పొందిన అభిప్రాయాల్ని సూచీ మాత్రంగా చెప్పాను. నా ప్రయాణాన్ని తీర్చిదిద్దిన పాల్ స్మిత్, గ్రేషియాలకు విందు చేసాను. నాకు జార్జి డెమిట్రాఫ్ విందు చేసాడు. ముఖ్యనగరంలో పని ముగించుకొని, న్యూయార్కుకు వచ్చాము. రూత్ సిగ్మన్ ను కలిసాను. వీరితో చర్చి కేంద్రాల విందులు, చర్చి సర్వీసు చూడటం జరిగింది. హ్యూమనిస్టు సమావేశంలో ప్రసంగం జరిగింది. ఆర్.జి. యింగర్ సాల్ మనుమరాల్ని చూచాను. హేతువాద పుంగవుని సంతతిగూడా అదే కోవలో వుంది, అంతర్జాతీయ కర్షక సమితి విందు చేసింది. బొకార్ యెన్నో సంగతులు, తూర్పు యూరపును గురించి చెప్పారు. కాగా, ఎల్లెన్ రాయ్ అన్న రాబర్ట్ గోష్టాల్క్.ను మా హోటలులో కలిసి, యెన్నో సంగతులు మాట్లాడుకొన్నాము. ఎల్లెన్ ఖూనీ సంగతులు రాగా, కళ్ళ నీళ్ళు పెట్టుకొన్నాము. ఆప్తులుగా ఘూర్ణిల్లాము. తరువాత 'ఎథికల్ యూనియన్'కు వెళ్లాను. ముఖ్యులతో చర్చించాను. వారు వ్యాసాలు వ్రాయమన్నారు. యెన్నిచోట్ల, యెన్నో వేళల, యెందరినో కలిశాము. యెంత హృద్యత ప్రదర్శించి, ఆప్యాయతలు చూపి, ఆత్మీయతలు కురిపించారు! అట్టి నిండు సంపర్కంతో, నిండిన హృదయంతో అక్టోబరు 10న న్యూయార్కు విడచి, అమెరికాను వదలి, 707 జెట్ బోయింగ్ లో ఇంగ్లండుకు పయనం సాగించాను. రెండు నెలల్లో యెంత తిరిగాను! యెన్ని అనుభవాల్ని గడించాను!! నేనెవరికి కృతజ్ఞత తెలపాలి?? *--*--* విద్యా విధానాలు ఒక దేశపు సౌరుసంపదలు వ్యక్తం కావాలంటే, ఆదేశానికి భవిష్యత్తు వున్నదో లేదో తేలాలంటే, అచ్చటి విద్యా విధానాల్ని పరిశీలించి చూస్తే, కథ బోధపడగలదు. అమెరికాలోని విద్యావిధానాలు అన్ని అంతస్తుల్లోనూ, ప్రజాస్వామ్య పునాదుల సంతరణకోసం ఏర్పాటు చేయబడినవిగా వారు భావిస్తున్నారు. వారి విద్యాతత్వాన్ని వారు ప్రజాస్వామ్యం దృష్ట్యా నిర్వచిస్తున్నారు. కాబట్టి, వారి విధానాలను మనం పరిశీలన చేసేటప్పుడు వారి ప్రమాణాల ప్రకారం, మన ప్రమాణాల ప్రకారం గూడా పరికించవచ్చు. అమెరికాలో, విద్యాతత్వంలో ప్రాథమిక భావం వ్యక్తి విలువల మీద ఆధారపడి వుంది. ఎలిమెంటరీ సెకండరీ విద్యలు మానవుణ్ణి పూర్ణుణ్ణిగా చేయటానికి ఏర్పాటు చేయబడినవి. అతడు ప్రజాస్వామ్య సమాజంలో అతని పాత్రను చక్కగా నిర్వహించేందుకు వుపకరిస్తుంది. తనకు తానై ఆలోచించి, స్వేచ్ఛగా వుచిత నిర్ణయానికి రాగలగాలి. భేదాభిప్రాయాల పట్ల మన్ననగలిగి, ప్రక్కవాని వ్యక్తిత్వాన్ని గుర్తించి వర్తించగలగాలి. యీ ధ్యేయాల్ని కలిగి అమెరికాలో విద్యల్ని రూపొందించుతూ వచ్చారు. ఆది నుంచి విద్యారంగంలో యీ విశిష్టతను అమెరికా గమనిస్తూ వచ్చింది. సుస్థిర పౌరుల్నిగా చేయగలిగిన విద్యను అమెరికాలో బిడ్డలకు యివ్వాలని, దానికై వికేంద్రీకృత విధానాల్ని అమలులో వుంచుకొంటున్నామని, భిన్నత్వానికి వ్యతిరేకులు కామనీ వారంటారు. పరిశీలిద్దాము. అమెరికాలో 50 రాష్ట్రాలు వున్నై. యీ యేబది రాష్ట్రాల్లో 50 వేల స్కూలు జిల్లాలు వున్నవి. యీ వివిధ జిల్లాలను ‘బోర్డుల’ ద్వారా పరిపాలిస్తారు. యీ బోర్డులను యెన్నికద్వారా ఆయా జిల్లాలలో నిర్మిస్తారు. విద్యా విధానాల్ని యీ బోర్డులు నిర్ణయిస్తై. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన మేరలో ఆదాయ వ్యయాలకు యీ బోర్డులే బాధ్యత వహిస్తవి. దేశంలో 1870 నాటికి 20 శాతం విద్యరానివారుండేవారు. 1959 నాటికి 2.2 శాతానికది తగ్గింపబడింది దరిమిలా అదియింకా తగ్గింది. శరీరవైకల్యాల కారణంగానూ అతివృద్ధుల్లో మాత్రమే విద్యావిహీనత మిగిలిపోయింది. దేశంలో 7900 పబ్లిక్ గ్రంథాలయాలు, 2000 కాలేజి గ్రంథాలయాలు, 42 వేల కేంద్ర స్కూళ్ళ గ్రంథాలయాలు కలవు. ప్రయివేటు గ్రంథాలయాలు, సంస్థలు పెట్టుకొన్నవి శతాధికాలు. పుస్తక ప్రచురణ, విక్రయం బహుళంగా జరుగుతుంది. విద్యకివ్వెంతో దోహదం చేస్తవి. దేశంలోని విద్యాసంస్థల నిర్మాణం చిత్రంగా వుంటుంది. 65 శాతం కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, వృత్తి పాఠశాలలో ప్రయివేటు, చర్చి సంస్థల ద్వారా మేనేజి చేయబడతవి. ఆయా రాష్ట్రాలలో ప్రత్యేక ఛార్టర్లద్వారా నిర్మితమైన “ట్రస్టీ బోర్డుల” పరంగా యీ సంస్థల పాలన జరుగుతుంది. ఆయా సంస్థలలోని వుపాధ్యాయులతో సంప్రతించి, యీ బోర్డులు విధానాలను యేర్పరచుకొని, యీ సంస్థల్ని నడుపుతై. యివిగాక, పబ్లికు విద్యాసంస్థలూ కలవు. అవి రాష్ట్ర ప్రభుత్వాలవల్ల, మునిసిపల్ పాలనలవల్ల నిర్వహింపబడతై. వీటికి గూడా, ‘ట్రస్టీబోర్డుల’ను శాసన మండలి గాని, గవర్నరుగాని, మునిసిపల్ మేయర్.గాని నిర్ణయిస్తారు. లేదా, బోర్డులను యెన్నుకుంటారు. వీటిమీద కోర్టు పర్యవేక్షణ కలదు. విద్యా సంస్థల్లో స్వేచ్ఛ సంపూర్ణంగా యివ్వబడుతుంది. ఎడనెడ విద్యాసంస్థల మీదికి యీ స్వేచ్ఛను నిరోధిస్తూ కథలు జరిగినా, అవి అతిస్వల్పాలు. విద్యారంగంలో సంపూర్ణ స్వేచ్ఛను పాటించటం అమెరికన్లకు ప్రధానకర్తవ్యంగా యెంచుకుంటారు. 1962 నాటికి, 6 మొదలు 13 యేళ్ళవాళ్ళు యెలిమెంటరీ విద్యలో 99 శాతం వున్నారు. 14 నుండి 17 సంవత్సరాలవాళ్ళు హైస్కూళ్ళలో 88 శాతం వున్నారు. మూడు సంవత్సరాలు ప్రయిమరీ, మరి మూడేళ్ళు మధ్యమలో – అంటే 6 సంవత్సరాలు యెలిమెంటరీ విద్య వుంటుంది. 6 యేళ్ళు సెకండరీ విద్య వుంటుంది. కాబట్టి 12 ఏళ్ళ విద్యతో సెకండరీ స్థాయి ప్రతి పౌరుడు దాటాలి. అంత మేరకు అన్ని రాష్ట్రాల్లో విద్య వుచితం. అంతవరకు ప్రతిరాష్ట్రంలోనూ నిర్భంధంగా గూడా చదువులు నేర్పాలి. 1962 నాటికి సెకండరీ విద్యలో కోటి పదిలక్షలమంది విద్యార్థులున్నారు. జాతిలోని 18-21 సంవత్సరాల యువకుల్లో 39½ శాతం 1962లో కాలేజీల్లో చదువుతున్నారు. వారు 37 లక్షలకు పైగా వున్నారు. యివి సాలీనా 3, 4 లక్షలకుపైగా పెగగలవని భావిస్తున్నారు. సెకండరీ విద్య తరువాత రెండేండ్ల ‘జూనియర్ కాలేజి’ విద్యను యేర్పరు స్తున్నారు. 14 సంవత్సరాల పిల్లలవరకూ జూనియర్ కాలేజీలలో పిల్లలు యిల్లు విడిచి వెళ్ళవలసిన అవసరం లేకుండా అన్ని చోట్లా నిర్మిస్తున్నారు. యిప్పుడు 500, 600ల జూనియర్ కాలేజీలు నిర్మింపబడినై. 4, 5 లక్షల విద్యార్థులున్నారు. ఏటేటా చదువులు పెరుగుతున్నవి. 1962 నాటికి 6 లక్షల 23 వేల డిగ్రీలను వివిధ కాలేజీలలో యివ్వటం జరిగింది. సెకండరీ స్కూళ్ళల్లో వుచితంగా పుస్తకాలు యిస్తారు. యిది చాల రాష్ట్రాల్లో వుంది. ‘లంచి’ వనర్లు ప్రతిస్కూలులో వున్నై. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ‘లంచి’కని ప్రత్యేక గ్రాంట్లు యిస్తారు. దీనికేగాక, సలహాకు, నేర్పటానికి గూడా ప్రభుత్వపు గ్రాంట్లు కలవు. యుద్ధవీరులకు, వృద్ధులకు ప్రత్యేక విద్యా ప్రణాలికలు కలవు. కోటి పదిలక్షల మంది యుద్ధవీరులు యీ గ్రాంటుల క్రింద లబ్ధి పొందారు. 9000 కోట్ల రూపాయలు ఫెడరల్ ప్రభుత్వం వ్యయించింది. సూటిగా యెలవెన్సుల రూపంలో ప్రతివ్యక్తికి యిస్తారు. 1962 నాటికి కోటిమంది దాకా వృద్ధులు గూడ విద్యనభ్యసించారు. ‘విద్యనిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్’ అన్న భర్తృ హరీయాన్ని వారు బాగా పాటించారు. ఎలిమెంటరీ విద్య దాదాపు అన్నిచోట్ల ఒకేరకంగా వుంటుంది. హైస్కూలు విద్యలో రెండు రకాలుగా కేటాయిస్తారు. కాలేజి చదువులకువెళ్ళే విద్యార్థుల కొకరీతి, వృత్తి విద్యల్లోకి వెళ్ళేవారి కొకతీరు. సాధారణ విద్య (జనరల్ ఎడ్యుకేషన్) అందరికీ వుంటుంది. జూనియర్ కాలేజీలకు వెళ్లువారికి మరికొంత తేడాతోనూ, తేడా లేకుండానూ వుంటుంది. ఉన్న 2150 కళాశాలల్లో 700 దాకా రాష్ట్ర, మునిసిపల్ పాలనలో వున్నై. వీటిలో రమారమి 60 శాతందాకా విద్యార్థులుంటారు. విద్య చాలావాటిల్లో వుచితం. కొన్నిచోట్ల నామకః కొంత ఫీజు వసూలు చేస్తారు. ఒక 500 సంస్థలు ప్రయివేటు మేనేజిమెటుల్లోనూ, 800 చిల్లర చర్చిసంఘాల అధీనంలోనూ వున్నై. విశ్వవిద్యాలయాలన్నీ ఒక యూనివర్సిటీ పట్టణంగా నిర్మింపబడతై. విశ్వ విద్యాలయమంటే, అనేక స్కూళ్ళు వుంటై. ఒకే ‘ట్రస్టుబోర్డు’ క్రింద వ్యవహరింపబడతై. సైన్సు, ఆర్ట్సు, పట్టభద్రుల స్కూళ్ళు, మెడిసిన్, లా, ఇంజనీరింగు, వ్యాపారం, సాధారణ విద్యలకు సంబంధించిన స్కూళ్ళు – అన్ని కలిపి ఒకే ఆవరణలో నిర్మింపబడతై. దాన్ని ఒక విశ్వవిద్యాలయ కేంద్రం అంటారు. ఈ సంస్థకు పెద్దను అధ్యక్షుడనీ లేక ఛాన్సెలర్ అనీ అంటారు. యిట్టి విద్యా కేంద్రాల్లో జీవితం బాగావుంటుంది. ఆటలు నృత్యాలు, డాన్సులు, నాటకాలు, లలితకళావిన్యాసాలు, వ్రాతల పోటీలూ వుంటవి. విద్యార్థి సంఘాలువున్నై. వాటి పాత్ర జాస్తిగా వుంటుంది. జాతీయరంగంలో మొత్తం 1,13,500 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు అవుతున్నట్లు అంచనాలు కలవు. 1500 కోట్లరూపాయలు 1960లో కేవల భవన నిర్మాణాలకే ఖర్చు చేశారు. ఖర్చుకు ఆ దేశంలో దడవరు. ప్రయోజనంకోసం పరవళ్ళు చేస్తారు. యిక కొన్ని విద్యావిషయాలు. మన ప్రధానోపాధ్యాయుడు అనే పేరుకి వారు ‘ప్రిన్సిపాల్’ అంటారు. మన బడులలో ప్రధానోపాధ్యాయుడు లెక్కల బాధ్యత కూడా కలిగి వుంటాడు. ఆయన యిటు బోధనారంగానికి, అటు స్కూలు మేనేజిమెంటుకు బాధ్యుడు కావాలి. అమెరికాలో ఆ బాధ లేదు. ప్రిన్సిపాల్ బోధనాధికాలను శ్రద్ధ చేసుకుంటూ, క్రమశిక్షణాదులు కాపాడుకుంటూ వుంటాడు. జీతాల నాతాలగోల, ఫీజుల వసూళ్ళు, లెక్కలు అన్నీ సూపరింటెండెంటు చూచుకుంటాడు. ఆయన మేనేజరు లాంటివాడు. అయితే, బోధనాదుల్లో, క్రమశిక్షణల్లో ఆయనకు యేమీ జోక్యం వుండదు. మన స్కూళ్ళల్లో మాదిరిగా ప్రధానోపాధ్యాయుడు తానొక ‘పెద్దగుమాస్తా’గా పనిచేయవలసిన బెడద వుండదు. యీ సూపరింటెండెంటు కేవలం ఒకే స్కూలుకు గాక, విద్యా జిల్లాలలోని మరికొన్ని స్కూళ్ళకుగూడా సూపరింటెండెంటుగా పనిచేయవచ్చు. పని వత్తిడినిబట్టి స్కూళ్ళసంఖ్యనిస్తారు. విద్యా జిల్లాలుగా దేశం విభక్తమౌతుంది. 50 వేల జిల్లాలున్నై. విద్యా జిల్లాలకు ఒక ‘బోర్డు’ను ఆ జిల్లాలలోని వోటర్లు యెన్నుకుంటారు. ఐదుగురో, ఏడుగురో సభ్యులుంటారు. ఒకర్ని అధ్యక్షునిగా యెన్నుకుంటారు. ఆ విద్య జిల్లాలోని బడులమీద యీ ‘బోర్డు’ అధీనం కలిగి వుంటుంది. ప్రభుత్వానికి, ప్రజలకు, విద్యాసంస్థలకు మధ్య యీ ‘బోర్డు’ ప్రథాన మధ్యవర్తి. అన్ని విషయాలకు బాధ్యత వారిదే. రాష్ట్ర ప్రభుత్వం దినసరి ఖర్చులో 20 శాతం నుండి, 25 శాతం దాకా భరిస్తుంది. తతిమ్మాఖర్చు అంతా స్థానికంగా పన్నుల మీద, దాతల చందాలమీద ఆధారపడి వుంటుంది. బడులలో పిల్లల నుండి వసూలుకాబడే ఫీజులు చాలా కొద్ది. స్పెషల్ ఫీజులు మాత్రం వుంటై. జీతాలు లేవు. కాలేజీల్లో వుచితంగా వున్నవీ కలవు. ఫీజులు వసూలు చేసేవీ కలవు. ప్రభుత్వ మునిసిపల్ కాలేజీలలోకన్నా, ప్రయివేటు కాలేజీలలో ఫీజులు జాస్తి. విద్యాజిల్లాలు విద్యాబోర్డుల పాలనలో వుంటుంది. బోర్డు తన అధీనంలో వున్న స్కూళ్ళకు అవసరమైన అంచనాల నన్నిటినీ తయారు చేసి, బడ్జెట్ ప్రతిపాదనలకు సిద్ధం చేస్తారు. యే స్కూలు కా స్కూలు తమతమ అవసరాలను పురస్కరించుకొని లెక్కల్ని తయారు చేస్తారు. అప్పడు బోర్డు జిల్లాకు అవసరమైన సూచనలను తయారు చేస్తుంది. యీ సూచనలు వారి ఆర్థిక అవసరాలమీద ఆధారపడి చేయబడతై. యీ సూచనలను ప్రజామోదం కోసం ‘రిఫర్’ చేస్తారు. దీనినే ‘రిఫరెండం’ అంటారు. దీనిలో, మన విద్యాజిల్లాకు “యీ సంవత్సరం అదనంగా 95 అన్ని బాపతుల క్రింద ‘యింత’ డబ్బు కావాలని, మీ అభిప్రాయాన్ని తెలియపరచాలని’’ ప్రజలకు రిఫరెండంలో నివేదించుకుంటారు. ప్రజలు వోటు చేస్తారు. ఆ వోటు అనుకూలంగా వుంటే, బోర్డువారి సూచనలు ఆమోదింపబడినట్లు, వ్యతిరేకంగా వుంటే, బోర్డువారి అదనపు సూచనలు వీగిపోయినట్లు. అంటే, లోగడవత్సరానికి ప్రజలు తెల్పిన ఆమోదం మేరకు యీ సంవత్సరం తిరిగి వారి ఆమోదం అవసరం లేదు. ‘అదనపు’ ప్రతిపాదనలకే యీ యేడు ప్రజామోదానికి రిఫర్ చేయబడుతుంది. వివిధ రాష్ట్రాలలో పరిశీలించగా తెలిసిన ప్రధానాంశమేమంటే, గత పాతిక ముప్ఫై సంవత్సరాల్లో విద్యాజిల్లా బోర్డుల అదనపు అవసర ప్రతిపాదనలను, యే జిల్లా ప్రజలు గూడా తిరస్కరించి యెరుగరు. ఏబది జిల్లాలలో యిదేరీతి ఆమోదాన్ని ప్రజలు విద్యారంగంలో యిచ్చి, విద్యపట్ల, తమ బిడ్డలయెడ వారికి గల నిండు ఆదరాన్ని చూపించారు. యిది అమెరికా జీవిత పంథాల్లో ఒకటి. ఆదేశంలోని ప్రజాస్వామ్య సౌధం ప్రాయికంగా విద్యల పునాదుల మీద ఆధారపడి వుందని వారంటారు. దానికి తార్కాణం మనం ఆచరణలో చూడవచ్చు. మనం గూడా ఎలిమెంటరీ విద్యకు డబ్బులు యిస్తూ వుంటాము. నిజానికి మనకు తెలియదు. ప్రతిరైతూ, తాను చెల్లించే భూమిపన్నుతోపాటు విద్యా పన్ను క్రింద కొంత యిస్తాడు. అది మనకు తెలియని రీతిని, బలవంతపు బ్రాహ్మణార్థం క్రిందికి వస్తుంది. అమెరికాలో, వారికై వారు పన్నులు విధించుకుంటారు ప్రభుత్వంతో నిమిత్తం లేని యీ పన్నుల విధింపు విధానాన్ని గమనించి చూచి, దానిలోని ఔన్నత్యాన్ని వుగ్గడించాలి. అమెరికాలోని విద్యాజిల్లాలలోకల్లా న్యూయార్కు జిల్లా చాలా పెద్దది. దాని తర్వాత లాస్ ఏంజల్స్ లోని బోర్డు. దీనిలో 550 బడులున్నై, 117 హైస్కూళ్ళు, 7 జూనియర్ కాలేజీలు, 27 వృద్ధుల పాఠశాలలు, తతిమ్మావి యెలిమెంటరీ, కిండర్ గార్టెన్ విద్యా కేంద్రాలు. 725 వేలమంది పిల్లలు బోధన పొందుతున్నారు. ఆ బోర్డు అధ్యక్షురాలు మేరీటీన్ గోల్స్. యీ బోర్డు విషయాల్ని యెన్నో యెంతవిపులంగానో చర్చించాను. వారి ఉత్సాహం గణనీయము. 1955లో 79 ½ కోట్లు, 1958లో 76 ½ కోట్లు, 1963లో 63 ½ కోట్ల రూపాయలు భవన నిర్మాణానికై యీ విద్యాజిల్లా బోర్డు ఖర్చు పెట్టింది. 1963-64లో వారి బడ్జెటు 170 కోట్ల రూపాయలు. మన రాష్ట్ర బడ్జెట్.తో పోల్చండి! రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖర్చులో 30 శాతం ఇస్తుంది. తతిమ్మా 70 శాతం ప్రజలు తమ మీద పన్నుగా వేసుకోవటానికి ‘రిఫరెండమ్’లో వోటు చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వ పెత్తనంగాని, కంట్రోలుగాని యీ బోర్డు మీద యేమీ వుండదు. వారుకొన్ని సూచనలను యెప్పుడైనా చేస్తే చేయవచ్చును. యీ విద్యాబోర్డులు స్వయం పరిపాలనను సంపూర్ణ స్థాయిలో కలిగివుంటై, విద్యపట్ల ప్రభుత్వ ఆసక్తివున్నా, వారి జోక్యంలోని ఆసక్తి మాత్రంగానే వుంటుంది. విద్యా బోధనలో, పాఠ్య నిర్ణయాలు, ప్రమాణ నిర్ధారణలు అన్నీ బోర్డులో స్వయంగా తీర్మానించుకోబడతై. సిలబస్, గ్రంథ నిర్ణయం అన్నీ వుపాధ్యాయ కోటి యెవరి విషయానికి సంబంధించి వారు చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంగాని, బోర్డువరకైనా వారి జోక్యంగాని వుండవు. విద్యలో ‘అటానమీ’ యీ రీతిగా పాలింపబడుతుంది. నేను వెళ్ళిన చోటల్లా, వుపాధ్యాయకోటి కనుపించినప్పుడల్లా ‘పాఠ్యపుస్తకాల జాతీయీకరణ, లేక, ప్రభుత్వీకరణను గురించి యీ మీ అభిప్రాయమేమి? అని అడిగితే, ‘అంతకన్నా దారుణమైన విషయం ప్రపంచంలో మరొకటి లేద’ని సమాధానం చెప్పి, ‘మీ దేశంలో అటువంటి జాడ్యం వున్నదా?’ అని అడుగనారంభించారు. ‘వున్నదని’ చెప్పగా విని, ‘నెహ్రూ ప్రజాస్వామ్యవాదని మేము చదివామే. యిట్టి దారుణవిషయాలు ఆయనయెట్లా అంగీకరించాడు. ఆయనకు తెలియదా, యీ సంగతి?’ అని వారు విస్తుపోయి, దిగ్భ్రాంత చిత్తాలతో అడుగు నారంభించారు. నెహ్రూకు తెలియకేమి! ఆయన ఆదేశానుసారమే యిట్లా జరుగుతుంది. ఆయన ధ్యేయాల్లో యిదొకటని నేను చెప్పగా ఒకరిముఖం ఒకరు చూచుకొని, చిన్నబోయిన ముఖాల్తో మిన్నకుండేవారు. కొన్నిచోట్ల కొందరు ‘మీరేమంటారని’ని అడిగేవారు. “హ్యూమనిస్టులుగా మేమట్టి విధానాన్ని సహించము. మేము దానికి ఎదురు. దాని విషయమై మా మా కేంద్రాల్లో యెదుర్కొంటున్నాము” అని చెప్పగా, ఒకచోట ఒక ఉపాధ్యాయుడు “మీరు కోర్టుద్వారా, దీన్ని సరిదిద్దకూడదా” అని అడిగాడు. యిక0ఉపాధ్యాయుల విషయం. ప్రతిఉపాధ్యాయుడు-బి.ఏ. లేక బి.యస్. (మనము బి.ఎస్.సి. అంటాము) ప్యాసు అయితీరాలి. అదిగాక, బోధనకు సంబం ధించిన ‘లైసెన్సు’, లేక, ‘సర్టిఫికెట్’ గూడా వుండాలి. యెలిమెంటరీ స్థాయి మొదలు అన్ని అంతస్తుల్లోని వుపాధ్యాయులకు యివే డిగ్రీలు ముఖ్యం. పైకి పోయిన కొద్దీ, యింకా పెద్ద డిగ్రీలు కావాలి. చిన్నచిన్న క్లాసుల్లోనే పెద్ద పెద్ద డిగ్రీలవారూ వుపాధ్యాయులుగా చేరవచ్చు. వారి జీతాల్లో కొంత తారతమ్యం వుంటుంది. ఎలిమెంటరీ స్థాయిలోని వుపాధ్యాయునికి సాలీనా 26,500 రూపాయలు జీతం వుంటుంది. అది బేసిక్ జీతం. ఆయన హెచ్చు జీతం, సంవత్సరాలు గడిచినకొద్దీ, 52,500 రూపాయలకు పెరుగుతుంది. వీరు బి.ఏ. ప్యాసు అయి వుండాలి. ఒకవేళ ఎం.ఏ. వారే యీ వుద్యోగానికి వస్తే నెలకు 100 రూపాయలు హెచ్చు వుంటుంది. పిహెచ్.డి గనక వస్తే సాలీనా 2500 రూపాయలు హెచ్చు జీతం ఇస్తారు. అందరు వుపాధ్యాయులకు సాలీనా 1000 రూపాయల జీతం పెరుగుతుంది. 13, 14 ఏళ్ళల్లో వారికి రాదగు హెచ్చు జీతాన్ని వారు పొందగలుగుతారు. రిటైరుమెంటు ఫండు ఒకటి మన ప్రావిడెంటు ఫండ్ మాదిరి వుంది. జీతంలో 8 శాతం దీనిక్రింద మినహాయిస్తారు. పన్నులు మిహాయింపు వుంటుంది. యీ జీతాలు బోర్డుకు బోర్డుకు కొంతగా మారుతూ వుంటై. 22,000 రూపాయలకు సాలీనా తగ్గదు. కాని పెద్ద పట్టణాల్లో జీవిత ప్రమాణం హెచ్చుగా వుంటుంది గనుక ఆయా పట్టణాలలో జీవన ప్రమాణ వ్యయాన్నిబట్టి, వుపాధ్యాయులకు జీతాలు హెచ్చుతూ, తగ్గుతూ వుంటవి. వుపాధ్యాయులు 22 లక్షల దాకా వివిధ పాఠశాలల్లో వున్నారు. జాతీయ జీవితంలో వీరి పాత్ర రానురాను హెచ్చుతూ వుంది. నేను చికాగోలో వుండగా, న్యూయార్కు వుపాధ్యాయులు సమ్మె నోటీసు యిచ్చారు. యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ నాయకత్వం వహించింది. 40 వేలమంది వుపాధ్యాయులు న్యూయార్కులో వున్నారు. ఈ సమ్మెల విషయంలో ఒక చట్టం వుంది. ఒకవేళ సమ్మె జరిగితే, యే పౌరుడైనా ‘విద్యాబోర్డు’ మీద దావావేసి వాళ్ళ బిడ్డలకు బోధన ఆగగూడదని వుత్తర్వు తేవచ్చు. పౌరునికి ఆ హక్కు వుంది. మీమీ వాదాల్లో మా బిడ్డల చదువు చెడగూడదంటారు. నూరేళ్ళక్రితం 203 కాలేజీలు వుంటే, నేడు 2150 దాకా వున్నవి. నూరేళ్ళనాడు 1500 మంది యువకుల్లో ఒకడు కాలేజీకి వెళ్ళేవాడు. యిప్పుడు అయిదుగురిలో యిద్దరు వెళుతున్నారు. ఏబ్రహామ్ లింకన్ ప్రతిపాదించిన లాండ్ గ్రాంట్ కాలేజీల క్రింద కోటి 70 లక్షల 30 వేల ఎకరాల్ని ప్రభుత్వం కాలేజీల క్రింద యిచ్చింది. యీపని గత నూరేళ్ళల్లో జరిగింది. వారి బడ్జెట్లకు మన బడ్జెట్లకు పోలికలేదు. కాని విధానాల రీతుల్లో, నచ్చిన మేరకు, విభేదం వుండకుండా చేసుకోవచ్చు. కాని, మూలవిధానాల్లో తేడాలువున్నై. మనం రోజులు గడిచినకొద్దీ ప్రభుత్వం మీద ఆధారపడటం జాస్తి అవుతుంది. యిది కనిపెట్టి ప్రభుత్వం సంపూర్ణాధికారాల్ని తన చేతుల్లోకి లాక్కొంటుంది. యిది ప్రజాప్రభుత్వం అయినప్పుడు దీనివల్ల చిక్కేమి అనటంకద్దు. ప్రజల దగ్గరకు అధికారాన్ని పాలనావిధానాల్ని తీసుకువెళ్ళి, వీలైనంతవరకు ప్రజల చేతుల్లోనే ఆ అధికారాన్ని వుంచేదానికి ప్రభుత్వం యెందుకు సందేహించాలి? అని మరో ప్రశ్న వస్తుంది. యీ ప్రశ్నోత్తరాల మధ్య అధికారం క్రమక్రమేణా ప్రభుత్వపరం అవుతూవుంది. రాష్ట్రం ప్రభుత్వం చేతుల్లో వుంది. కేంద్రప్రభుత్వానికి కావాలని, రాజ్యాంగాన్ని ఆమేరకు సవరణ చేయాలని మన వేత్తలు భావిస్తున్నారు. అక్కడికీ యిక్కడికీ తేడా అదే! విద్యను గూర్చి యింకొక విషయం చెప్పాలి. లాస్ ఏంజల్స్ విద్యాబోర్డు క్రింద 345 కోర్సులను నేర్పవచ్చునని వారి సెలబస్ వ్యక్తం చేస్తుంది. విశ్వవిద్యాలయాల్లో యితరచోట్ల పరిశీలిస్తే అమెరికా చదువుల్లో కోర్సులను చీల్చి, చీల్చి, యెంతగానో సున్నితం చేయటం కనబడుతుంది. మన విశ్వవిద్యాలయాల్లో ఒక్క విషయంగా బోధించేదాన్ని, అక్కడ 20 మొదలు 40 విషయాలుగా చీల్చి బోధిస్తారు. దీనివల్ల ప్రత్యేక శ్రద్ధతో, నొక్కు హెచ్చుతో చదువు నేర్పుతారు. అంతదూరం అవసరమా అన్న ప్రశ్న చాలమంది వేస్తున్నారు. అమెరికాలోని వేత్తలు కాదంటున్నారు. ఏది యెట్లా వున్నా మనం భరింపలేని విషయమది. అమెరికాలో విద్యావిధానంలో చాల ప్రధానమైన పాత్ర టెలివిజన్ వహిస్తుంది. టెలివిజన్ అంటే, మన రేడియో మాదిరిగా మాటలు చెప్పుతూ, మాటాడే మనిషి, ఆటాడేవారు, నృత్యం చేసేవారు, గానంచేసేవారూ కనబడుతూ వుంటారు. టెలివిజన్ ప్రతి యింటా వుంటుంది. యింటిలో వివిధ గదుల్లో గూడ వుంచు కుంటారు. పిల్లలకు పాఠాలను నిపుణులైన వుపాధ్యాయులచేత టెలివిజన్.లో నిర్ణీతవేళలకు చెప్పిస్తారు. ఒక బడిలో పిల్లలకు బ్లాక్ బోర్డుమీద వ్రాస్తూ ఆ పాఠం చెప్పబడుతూ వుంటుంది. మన యింట్లో పిల్లలకు కూర్చుని ఆ పాఠం వినవచ్చు. వ్రాసుకోనూవచ్చు. ఒకొకప్పుడు ఒకానొక పాఠం తిరిగి చెప్పించండీ అని పిల్లలు వ్రాస్తే, ఆ పాఠాన్ని తిరిగి చెప్పుతారు. కొన్ని రేడియో కేంద్రాలు ఆయాప్రాంతాలలోని పాఠశాలల్లోని పాఠ్య గ్రంథాలలోని సెలబస్ ప్రకారం రోజువారీ పాఠాలు మొదలు పెడతారు. ప్రత్యామ్నాయ బోధగా చెప్పుతారు. దీని వల్ల ఆయా రేడియో కంపెనీలకు ప్రచారం హెచ్చి, ఆ కేంద్రాన్ని బలపర్చటం జరుగుతుంది. పిల్లల ప్రత్యేక ప్రశ్నలకు సమాధానాలు గూడ చెప్పుతారు. దీనివల్ల విద్యాబోధ సుకరంగా అందుతుంది. యీ బోధన చిన్న క్లాసుల నుండి పెద్ద క్లాసులవరకూ జరుగుతుంది. కాలేజి విద్యార్థులకు గూడా యీ సదుపాయాల్ని అందజేస్తారు. యిది గమనార్హమైన నూతనాంశం. *--*--* “పిల్లలు ఎక్కడున్నా పిల్లలే” ఓహైఓ రాష్ట్రంలో తిరుగుతూ ఈటన్ పట్టణంలోని జాక్ వన్ స్కూలుకు వెళ్ళాము. ఆనాటి కార్యక్రమములో పిల్లల తరగతులు చూడడం ప్రధానంగా పెట్టుకున్నాము. ఆరు తరగతుల లోపు పిల్లలనే చూడాలనుకున్నాము. నాలుగవ తరగతికి వెళ్ళాము. ఈ దేశంలో ఒకటి నుంచి మూడు తరగతులను ప్రయిమరీ (ప్రాథమిక) తరగతులుగాను, నాలుగు నుంచి ఆరు తరగతులను ఎలిమెంటరీ తరగతులుగాను పరిగణిస్తారు. వారీ తరగతులను ‘గ్రేడ్స్’ అంటారు. హైస్కూలులో ఏడు నుంచి 12 వరకు తరగతులు వుంటాయి. చక్కటి భవనం. 38 మంది బిడ్డలున్నారు ఆ నాల్గవ తరగతిలో. ఆడపిల్లలు, మగపిల్లలు దాదాపు సరిసమానంగా వున్నారు. మేరీ శాండర్సుగారు ఉపాధ్యాయిని. నన్ను బడికి తీసుకొని వెళ్ళిన పాలీన్ కాఫ్ మన్ సతిని ముందు పిల్లలకు పరిచయం చేసి వారొక అతిథిని తీసుకవచ్చారని పిల్లలకు చెప్పి కాఫ్.మన్ సతిని నన్ను పరిచయం చేయమన్నారు. వారు చేశారు. మన పేర్లు వాళ్ళకో పెద్ద బెడద. తరువాత నేను పిల్లలకు ఇండియాను గురించి చెప్పుతూ ‘మీదేశం 200 సంవత్సరాల క్రితం బ్రిటన్ నుంచి స్వరాజ్యం సంపాదించుకుంది. మేమూ ఆ బ్రిటన్ నుంచే 16 సంవత్సరాల క్రింత స్వరాజ్యం సంపాదించుకున్నాము. మీరూ మేమూ అన్నదమ్ములం. మీరు ముందువచ్చారు. గనుక మీకు మేము తమ్ములము’ అనగా పిల్లలంతా చప్పట్లు కొట్టి ఉత్సాహంతో వుబ్బిపోయారు. ‘మీ దేశం పెద్దది. కాని మీకు 19 కోట్ల జనమే వున్నారు. మా దేశం కూడా పెద్దది. కాని మీదానంత పెద్దది కాదు. కాని మాకు 431 కోట్ల జనం వున్నారనగా పిల్లలంతా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ, మాస్టరుగారివంకా, నావంకా చూచి బుగ్గలు వుబ్బించారు. పిల్లలందరూ చదువుకోవడానికి మేమూ యేర్పాట్లు చేస్తున్నాము. ఉపాధ్యాయు లను తయారు చేసుకొంటున్నాము. మీకే యింకా సరిపడ్డ ఉపాధ్యాయులు లేరు. మాకింకా కొంతకాలం పడుతుంది. ‘మా పిల్లలు కూడా మీ మాదిరిగానే మంచివాళ్ళు. బుద్ధి మంతులు’ అనగా యెవరివంక వారు చూచుకొని ముసిముసి నవ్వులు నవ్వారు. ‘మాదేశం ఎక్కడో మీకు చూపుతా’ ననగానే వుపాధ్యాయిని ప్రపంచపటాన్ని క్రిందికి లాగింది. మనదేశం చూసి, ‘బాంబే నుంచి న్యూయార్క్.కు విమానంలో ఉదయం బయలుదేరి సాయంత్రానికి చేరాము. దూరం 11 వేల మైళ్ళు వుంది. 22 గంటలలో మీదేశం చేరా’మన్నాను. పిల్లలు సగం సగం లేచి కూర్చున్నారు. తర్వాత ప్రశ్నలు వేయమన్నాను. ప్రశ్న వేయదలచిన పిల్లలంతా చేతులెత్తారు. నేను ఒక్కొక్క బిడ్డవైపు చేయి చూపితే ఆ బిడ్డ ప్రశ్న వేస్తుంది, వేస్తాడు. సమాధానం అయినాక మళ్ళా చేతులెత్తారు. మనం ఫలానా బిడ్డను చూపినదాకా ప్రశ్నవేయరు. ఎవరూ మాట్లాడరు. వారు వేసిన ప్రశ్నలు – మీ దేశంలో పిల్లులూ, కుక్కలూ వుంటవా? మీ దేశంలో కుందేళ్ళు వున్నవా? గుర్రాలు వున్నవా? ఏనుగులు వున్నవా? వుంటే మాకొకదాన్ని తోల్తారా? మీకు వుడతలున్నవా? కోతులున్నవా? బల్లులున్నవా? ఈగలు దోమలు వుంటయ్యటగదా? అవులున్నాయా? వున్నవవి చెప్పి, మా యింటిపేరే ఆవులవారనగా వరసగా పొట్టచెక్కలయ్యేట్టు నవ్వారు. అందర్నీ నవ్వించారు. మిస్టర్ అని సంబోధిస్తారు. మీ దేశంలోని పిల్లలు మామాదిరిగా దుస్తులు వేస్తారా? ఇప్పడు జాస్తిగా మీ వలెనే దుస్తులు వేస్తారన్నాను. అబ్బురంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అంతలో ఒక చిన్న పిల్ల మీ పిల్లలు బూట్లు వేస్తారా? అన్నది. కొందరు బూట్లు వేస్తారు, మరి కొందరు చెప్పులు తొడుగుతారు అన్నాను. వాళ్ళకు తెలియలేదు. నేను ఆ పూట వేసుకుని వెళ్ళిన బాటా చెప్పులు చూపాను. పిల్లలు బుర్రలు నెమ్మదిగా పంకించారు. కొందరు వట్టి కాళ్ళతో వస్తారన్నాను. హెచ్చుమంది పిల్లలు ఇగ్లీషులో ‘డామ్’ అనే పదాన్ని ఆశ్చర్య చకితులై గుమ్మారు. అవును మా దేశంలో పేదరికం వల్ల అందరూ వనరుగా అన్ని అవసరాల్ని తీర్చుకోలేక పోతున్నారు. అందువల్ల అలా వస్తారు! అన్నాను. పెదవులు కొరుక్కుని ఒకరివంక ఒకరు చూచారు. మీ బడులలో మా మాదిరిగా కుర్చీలు, డెస్కులు ప్రతి పిల్లలకు వుంటవా? అని అడిగారు. ఇక్కడ అన్ని బడులలో అన్ని తరగతులలో ప్రతిపిల్లవానికి ప్రత్యేకంగా ఒక్కొక్క కుర్చీ, దాని ముందు డెస్కు వుంటవి. చిన్న పిల్లలకు చిన్నవి, పెద్ద పిల్లలకు పెద్దవి వుంటవి. “ఇట్లా వుండవు. పొడుగాటి బెంచీలు, వ్రాతబల్లలు వుంటవి. చిన్న చిన్న తరగతులలో నేలపరి బెంచీలు మాత్రమే వుంటవి. వాటిమీద కూర్చుంటారు. కొన్ని బడులలో చాపలమీద కూడా కూర్చోబెట్టుకుంటా”మన్నాను. నవ్వు, హాస్యాన్ని కలిపి గిలగిలమన్నారు. ‘చాప’ అంటే వారికి సరిగా బోధపడలేదు. నేను తిరిగి చెప్పాను. వారి పంతులమ్మ అందుకొని తిరిగి చెప్పింది. ‘ఎందుకనగా’ అన్నదొక చిన్నపిల్ల. ఇప్పుడిప్పుడే అన్నీ అమర్చుకుంటున్నాము. మీ తాతగారు చదువుకునే రోజులలో మీ దేశాలు ఇట్లాగే వున్నవి. అనగా అందరూ నా వెంట వచ్చిన పాలిన్ కాఫ్ మన్ సతి వంక చూశారు. ‘మీ పిల్లలు యింగ్లీషు చదువుతారా’ అన్నాడొకడు. ‘మా పిల్లలకు మా భాషలో అంటే మేము తెలుగు భాషలో చెప్పుతాము. అది మా మాతృభాష. మీకు యింగ్లీషు యెట్లాగో మాకు తెలుగు అట్లా’ అని అంటూ వుండగానే, పట్టలేక, యింకొక అమ్మాయి ‘మీపిల్లలకు మరి యింగ్లీషు రాదా’ అన్నది. ‘ఆగుతల్లీ – ముందు మా భాష నేర్పుతాము. ఇప్పుడు మూడో తరగతి నుంచి యింగ్లీషు కూడా నేర్పుతున్నాము’ అన్నాను. నవ్వుకొన్నారు. ‘ఇన్ని భాషలెందుకు, ఇంగ్లీషే నేర్పరాదా’ అన్నాడొకడు. ‘వీలులేదు. మా భాషలు వేరు. అవి నేర్పి, ప్రపంచభాష గనక ఇంగ్లీషు కూడా నేర్పుతున్నాము. మీరూ ఇతర దేశభాషలు పెద్దవాళ్ళు అయినాక నేర్చుకోవా’లన్నాను. తలలు వూపారు. ‘మీ భాష ఎట్లా వుంటుంది? అన్నదొక చురుకైన పిల్ల, బోర్డుమీద తెలుగులో నా పేరు వ్రాసి దానిక్రింద ఇంగ్లీషులో వ్రాసి ఏ భాగానికాభాగం గుర్తులు పెట్టాను. “తెలుగు” అనేది వ్రాశాను. ‘ఆంధ్ర’ అనేది వ్రాశాను. వాళ్ళంతా వ్రాసుకొన్నారు. నవ్వుకొన్నారు. కోలుకున్నారు. ‘ఒకే భాషకు రెండు పేర్లు ఎందుకు? అన్నదొక బిడ్డ ‘మామూలుగా వుండవు. కాని భాష మరీ తియ్యని భాష కావడంతో రెండు పేర్లు పెట్టుకున్నా’మని నవ్వాను. వాళ్ళూ నవ్వారు. నవ్వి ‘అయితే కొంచెం వినిపిస్తారా’అన్నారు. ప్రాణం మీదికి తెచ్చు కున్నట్లయింది నిజంగా. తెలుగు కృష్ణదేవరాయలన్నట్లు కండచక్కెరలాంటిది. కాని మన గాత్రం దానికి సరిపోవద్దూ, తప్పదుగదా, తటపటాయించకుండా ‘నిజంగా, మీకు తెలుగు కావాలా? అన్నాను. ‘తప్పనిసరిగా’ అన్నారు. వేమనపద్యం ఒకటి నెమ్మదిగా, బాగావుండేటట్టు మెత్తగా వుండేటట్టు అన్నాను. కవిరాజు పద్యం ‘గుడికి తరచు బోయి గొణుగు చుండెడివారు’ చెప్పాను. బి.వి.నరసింహారావుగారి ‘పిల్లలంటే మల్లెమొగ్గలు’, ‘గుడిలో బొమ్మలు పలకవు కదలవు బడిలో బొమ్మలు పలుకును, కదులును’ కూడా చెప్పి, యిట్లా మీకు యెన్నాళ్లయినా చెప్పుతానన్నాను. కిచకిచలాడారు. అది పిల్లల బాణి. అంతలో ముందువున్న పిల్లలు కనిపెట్టి నా వేషం చూస్తున్నారు. కాఫ్.మర్ దంపతుల సలహామీద ధోవతి చొక్కా మాత్రమే వేసుకు వెళ్ళాను. అదీ అంచుల ధోవతి. ‘ఇది మా తెలుగువారు మామూలుగా ధరించే ధోవతి, చొక్కా’ అని చూపాను. వాళ్ళు అంతా చూచి యేమి నవ్వుకున్నారో, ఎట్లా వుబ్బి తబ్బిబ్బులయ్యారో, నా వంక ఎట్లా ఎగాదిగా చూచారో, వళ్ళంతా కళ్ళు చేసుకుని చిత్తరువుల మాదిరిగా మారిపోయారో చూస్తే వినోదించని మనిషే వుండరు. నిజంగా, పిల్లలంటే పిల్లలే. వారికి వికారాలు లేవు. ప్రాకారాలు లేవు. అంచులు లేవు. పరిధులు లేవు. వారి హృదయాలు కోమలంగా, పేశలంగా వుంటవి. నేను ‘పిల్లలు యే దేశంలో వున్నా, యేమూలనున్నా ఒకటే.. నన్నాను. మా పిల్లలూ మీ మాదిరిగానే వుంటారు. మీ రెవరన్నా వస్తే, ఇట్లాగే యిటువంటి ప్రశ్నలే వేస్తారు. ప్రపంచంలోని పిల్లలంతా ఒకటే’ అన్నాను. చప్పట్లు కొట్టి, వారి సంతోషాన్ని, ఆనందాన్ని పొంగించి నాకు అందించారు. వాళ్ళే పిల్లలు. ఆ పిల్లలూ మన పిల్లల మాదిరే! ఏమీ తేడా లేదు. పిల్లలది అదొక లోకం. ఇటువంటి బడులను చికాగోలో, మిల్ వాకీలో, మిన్నెసోటాలో, శాన్ ఫ్రాన్సి.స్కోలో, లాస్ ఏంజల్స్.లో కూడా చూశాను. తీర్చిదిద్దిన కుందనపు బొమ్మల మాదిరిగా బిడ్డలున్నారు. కుదిరికగా బడులున్నవి. చురుకుగా తృప్తితో ఉపాధ్యాయకోటి వున్నది. తల్లిదండ్రులకు బడులంటే అమిత ప్రేమ. *--*--* స్థానిక సంస్థలు విద్యా సంస్థల తర్వాత, స్థానిక సంస్థలు అమెరికన్ల దృష్టిలో వారి ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభాలు. దేశాన్ని 50 రాష్ట్రాలుగా, ఏబది రాష్ట్రాలను 3050 కౌంటీలనుగా చేశారు. కౌంటీ ప్రాంతంలో నగరాలు, పట్టణాలు, గ్రామాలుగా విభజించుకొన్నారు. దేశంలో 14,424 పరిపాలనా జిల్లాలు కలవు. స్థానిక సంస్థలంటే స్వపరిపాలనా కేంద్రాలని మనం మొదటి నుండి భావిస్తూ వచ్చాము. రిప్పన్ స్థానిక సంస్థలకు మన దేశంలో పితామహుడు. సుపరిపాలన, స్వపరిపాలనల మధ్య మనదేశంలో వాదోపవాదాలు జరిగినరోజుల్లో, మన వారంతా స్వపరిపాలనకే మొగ్గారు. బ్రిటిష్ వారి పాలనలోనే పంచాయితీ, మునిసిపల్ స్థానిక స్వపరిపాలనా రంగాలను స్థాపించారు. వాటిని క్రమ క్రమేణా మనవారు విస్తరించి, నేటికీ వికేంద్రీకృత పంచాయతీ రాజ్య వ్యవస్థగా రూపొందించారు. ఆ దేశం మనదేశమంత ప్రాచీన వ్యవస్థల్ని కలిగింది కాదు. 1776 స్వాతంత్ర్యానంతరమే అక్కడి సంస్థల ప్రాదుర్భావం. వివిధ రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు వివిభిన్నాలుగా వున్న, ప్రధానాంశం యెన్నికమీద ఆధారపడటంగా కనబడుతుంది. స్థానికంగా ప్రజల అభిప్రాయాన్ని మన్నించటం మూలవిషయంగా నిలిచివుంది. దేశం పెద్దది. మనదేశం 12 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణం కలది. అమెరికా 36 లక్షలకు పైగా విస్తీర్ణపు మైళ్ళు కలది. మన జనాభాలు 45కోట్లు, వాళ్లకు 18 కోట్ల చిల్లర. మనదేశంలో పంచాయితీ పాలనవచ్చింది. మనం రాష్ట్రానికి వర్తించే గ్రామ పంచాయతీ చట్టాన్ని చేశాము. ప్రతి గ్రామంలోని పంచాయతీ యీ చట్టబద్ధంగా నడవవలసి వుంటుంది. పంచాయతీ తానేమీ ప్రత్యేక నిబంధనలను యేర్పరచుకొని తదనుకూలంగా నడవ వీలులేదు. కాని, అమెరికాలో విధానం వేరు. అక్కడ గ్రామ పంచాయతీ చట్టంలాంటి చట్టాలు యే రాష్ట్రంలోనూ లేవు. గ్రామ రాజ్య చట్టాలు లేకుండా గ్రామ పాలన యెట్లా జరుగుతుంది అన్న ప్రశ్న రావచ్చు. అచ్చట, యే గ్రామానికాగ్రామం ఒక యేలుబడి విధానాన్ని రూపొందించు కుంటుంది. ఆ నిబంధనావళిని, ఆ యేలుబడి విధానాన్ని ఆ గ్రామపౌరులందరు, అనగా వయోజనులందరూ వోటింగు ద్వారా నిర్ణయించు కుంటారు. అట్లా ఆమోదింపబడిన నిబంధనావళి ఆ గ్రామపు ‘చార్టర్’గా వుండిపోతుంది. దీన్ని సవరించుకోటానికి ఆ గ్రామ వోటర్లకే అధికారం కలదు. మనకు కో-ఆపరేటివ్ సంఘాలకు నమూనా ‘బైలాలు’ వున్నట్లే, అక్కడగూడా నమూనా నింబధనావళులు వుంటై. వాటిని చూచి, ఆయాప్రాంత గ్రామ అవసరాలదృష్ట్యా మార్పులు, చేర్పులు చేసి, ఆయా గ్రామాలు తమ యేలుబడిని తామే నిర్ణయించుకుంటై, లాంఛన ప్రాయ అనుమతి శాసన మండలి నుండి పొందుతారు. యీ గ్రామీణ, లేక, మునిసిపల్ ఛార్టర్, రాష్ట్ర రాజ్యాంగానికి అనుకూలంగా వున్నదో, లేదో అన్న విషయాన్ని మాత్రమే, ఛార్టర్లకు అనుమతించే కాలంలో శాసన మండలులు పరిశీలిస్తవి. దినచర్యల్లో ఛార్టర్లలోని నిబంధనావళి ప్రకారం నడచుకో వలెను. ఒకవేళ యీ నిబంధనలు రాష్ట్ర నిబంధనలకు విరుద్ధంగా వున్నా, యీ నిబంధనలే చలామణిలో నుండును. ఆమేరకు ఛార్టర్లలోని నిబంధనలకే గౌరవము మెండు. సిటీ కౌన్సిలు, ఒక మేయరును, ఆర్గురు కౌన్సిలర్లను యెన్నుకుంటుంది. యీ కౌన్సిలర్లకు అయిన ఖాళీలను, 1,2,3,4,5,6, నంబర్లవారీ ఖాళీలనుగా యెంతురు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఖాళీకి మాత్రమే నామినేషన్ వేయవచ్చును. హెచ్చు వోట్లు యెవరికి వస్తే వారు నెగ్గుతారు. నాలుగేళ్ళపాటు వీరు కౌన్సిలర్లుగా వుంటారు. అభ్యర్థిగా నిలబడువారు అప్పటికి మూడేళ్ళు వోటరుగా వుండవలయును. ఎన్నికైన కౌన్సిలర్లను ఆయన వోటర్లకు నచ్చనప్పుడు వారిని దింపే అధికారం (రికాల్) వోటర్లకు వుంది. మేయరు కౌన్సిలు అధ్యక్షుడు, అన్ని వేళల, అన్ని వుత్సవాలకు ఆయన ప్రధాని. ఆయనకు జీతం వుంటుంది. కౌన్సిల్ పనిమీద యితర చోట్లకు వెళ్ళినప్పుడు మామూలు ఎలవెన్సులూ వుంటవి. అట్లాగే ప్రతి కొన్సిలరుకు వేతనం వుంటుంది. కౌన్సిల్ పనిమీద నియమితుడైతే ఎలవెన్సులూ వుంటవి. కౌన్సిలు సమావేశాలు ప్రతివారం ఒకసారన్నా వుంటవి. యింకా తక్కువ వ్యవధిలోగూడా వుంటవి. కౌన్సిలు సమావేశాలకు యెవరైనా రావచ్చు. అవి బహిరంగ సమావేశాలు. కౌన్సిలు సంఖ్యలో మెజారిటీని ఫోరంగా యెంచుకుంటారు. యీ కౌన్సిల్ సమావేశాల్లో, పౌరుడెవరైనా వచ్చి వారి అవసరాన్ని చెప్పుకోవచ్చు. న్యాయవాది ద్వారా వాదన చేయించుకోవచ్చు. అది వారి ప్రత్యేక హక్కు. కౌన్సిల్ ఆమోదించు అంశములను తీర్మానములని, ఆర్డినెన్సులనీ అంటారు. మేనేజరు, లేక, ప్రధాన పాలనాధికారిని కౌన్సిల్ నియమిస్తుంది. కొన్నిచోట్ల, ఆర్ధిక కార్యదర్శిని తప్ప, తతిమ్మా ఆఫీసు సిబ్బందిని యావత్తు యీ మేనేజరే నియమిస్తాడు. కొన్ని చోట్ల కౌన్సిలే అందరినీ నియమిస్తుంది. హెచ్చు చోట్ల మేనేజరే నియమిస్తాడు. కౌన్సిలర్సుగాని, మేయరుగాని, మేనేజరు విధులలో జోక్యం చేసుకోరు. వారేదన్నా చేయాలంటే, కౌన్సిలు తీర్మానం ద్వారానే చేస్తారు. మనకు మాదిరే, కౌన్సిలుకు సలహాదారునిగా ఒక న్యాయవాదిని నియమిస్తారు. న్యాయశాస్త్ర విధులనేగాక, ఆర్డినెన్సులను, తీర్మానములను గూడా యీ న్యాయవాదే వ్రాసి యిస్తాడు. ఒక్కొక్క డిపార్టుమెంటులో నియమింపబడవలసిన సిబ్బందిని ఆ డిపార్టుమెంటు పెద్ద నియమిస్తాడు. వారి అజమాయిషీ యావత్తు ఆయన చూస్తాడు. కౌన్సిలు వంగడంలో పనిచేయు సిబ్బంది జీతనాతాలన్నీ ఛార్టర్లలోనే నమోదుచేస్తారు. అట్టి నమోదులేని చోట, కౌన్సిలు ఆయా సమయాలకు అవసరాన్ని బట్టి తీర్మానాలు చేస్తారు. వారానికి అయిదురోజులు, రోజుకు ఎనిమిది గంటలు సిబ్బంది యావత్తూ పనిచేస్తుంది. సిబ్బంది కౌన్సిలు యెన్నికలలో యెవరి తరఫుననూ పనిచేయకూడదు. కౌన్సిలు అనేక ఉపసంఘాలను నియమిస్తుంది. ప్లానింగ్ కమిషన్, సివిల్ సర్వీసు బోర్డు, టాక్సుబోర్డు, పార్క్సు కమిటి, పోలీసు – అగ్నిమాపకదళపు సంఘం, జోనల్ బోర్డు, అపీళ్ళ కమిటీ, పాలనా సలహాసంఘం, రోడ్ల ప్రక్క చెట్ల బోర్డు, సివిల్ సెంటర్ కమిటీ, యిండ్ల సంఘం మొదలైనవెన్నో కలవు. కౌన్సిలు యెవరికైనా అర్హతలను పరిశీలించి, వోటింగ్ అధికారాన్ని యివ్వ వచ్చును. పోలీసు, అగ్నిమాపక దళాలు కౌన్సిళ్ళ అధీనంలోనే వుంటవి. న్యాయపరిపాలన, నగరంలోని రక్షణ అంతా కౌన్సిల్ అధీనంలోనే వుంటుంది. మేయరు, అవసర సమయాల్లో, నగర కమాండరుగా గూడా పనిచేయవచ్చు. కౌన్సిలుకు జరిగే యెన్నికలన్నీ, మేయరు యెన్నికతో సహా నగరపౌరులందరూ యెన్నుకుంటారు. మనదేశంలో మాదిరిగా వార్డులుగా చీల్చి, ఒకోవార్డుకు ఒక్కొక్కరిని యెన్నుకోవటం కాదు. లోగడ మనకు గూడా పంచాయితీల్లో అధ్యక్షుణ్ణి పౌరులందరూ యెన్నుకోవటం ఉండేది. గాని దర్మిలా సవరణచేసి, పంచాయతీ మెంబర్లు అధ్యక్షుణ్ణి యెన్నుకొనే పద్ధతిని పునః ప్రవేశపెట్టారు. అమెరికాలో కొన్నిచోట్ల, గ్రామంలోగాని, నగరంలోగాని, పట్టణంలోగాని వయోజనులందరిచేతా యెన్నుకోబడే కౌన్సిలర్లు, మేయర్ను యెన్నుకొనటం వుంది. ఆయా రాష్ట్రాల్లో సంప్రదాయాల్ని బట్టి, ఆయా ప్రాంత ఛార్టర్లను బట్టి వుంటుంది. కౌన్సిలర్ల యెన్నికతోబాటే, న్యాయమూర్తుల్ని గూడా వోటరులందరూ యెన్నుకొంటారు. మునిసిపల్ కోర్టుకు ఒకర్ని సుపీరియర్ కోర్టుకు యింకొకర్ని యెన్నుకొంటారు. మునిసిపల్ కోర్టుల్లో 15,000 రూపాయలవరకు సివిల్ కేసులు, మునిసిపల్ ఆర్డినెన్సుల ధిక్కరణ నేరాలు, చిన్న క్లయిములు, చిన్న నేరాలను విచారిస్తారు. సుపీరియర్ కోర్టులో 15,000 రూపాయలపై సివిల్ కేసులు విడాకులు, బాల నేరస్తుల కేసులు, చోరీ, యితర పెద్ద నేరములను విచారిస్తారు. యిట్లా యెన్నుకోబడ్డ న్యాయ మూర్తులు, ‘లా’ అధ్యయనం చేసిన వారైయుండాలి. తతిమ్మా కౌన్సిలర్లుగా యెన్నుకోబడేవారికి విద్యార్హతల నియమాలు లేవు. వీరు ఆరేళ్ళకొకసారి యెన్నికౌతారు. జీతాల విషయంలో, మునిసిపల్ కోర్టు జడ్జికి ఆయా కౌన్సిళ్ళ ఆదాయాల్ని బట్టి వేతన నిర్ణయాలు వుంటై. ఈటన్ లో 18,000 రూపాయలిస్తారు సాలీనా, ఫ్రెజ్నోలో సాలీనా 94,000 రూపాయల దాకా యిస్తారు. ఫ్రెజ్నోలో సుపీరియర్ కోర్టు న్యాయమూర్తికి 1,05,000 రూపాయలిస్తారు. ఫ్రెజ్నోలో మేయరుకు సాలీనా 30,000 రూపాయలు, కౌన్సిలరుకు 18,000 రూపాయలు యిస్తారు. అక్కడ ప్రధాన పాలనాధికారికి 1,30,000లు సిటీ క్లార్కుకు 52,000లు, న్యాయవాదికి 80,000లను, ఫైనాన్సు డైరెక్టరుకు 70,000, పోలీసు ఛీఫ్.కు 70,000, అగ్నిమాపక దళాధిపతికి 70,000 పబ్లిక్ వర్క్సు డైరెక్టరుకు 81,000లు – యీ విధంగా జీతాలిస్తారు. యివి కౌన్సిళ్ళ ఆదాయ వ్యయాలనుబట్టి, కేంద్రత్వాన్నిబట్టి, జీవనవ్యయ ప్రమాణాలను బట్టి వుంటవి. పరిపాలనా విధానరీతులవి. పన్నులవిషయం పరిశీలన చేసి చూస్తే, కేంద్రప్రభుత్వం కొన్ని పన్నులను విధిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పన్నులను విధిస్తుంది. విద్యాబోర్డులు విద్యల పన్నులను విధిస్తాయి. మునిసిపల్, పట్టణ, గ్రామ పరిపాలనలు మరికొన్ని పన్నులను వేస్తాయి, రాష్ట్ర శాసనసభలు పన్నులు విధించటంలో కొన్ని రంగాలనే తడిమి చూస్తవి. స్థానిక సంస్థలు వేసే పన్నులు, ఆస్తుల మీద, లైసెన్సులు, పర్మిట్లు, సర్వీసింగ్ పన్నులు, నీటిపన్ను, బస్ లైన్స్, వ్యాపారం, జంతువుల లైసెన్సు, మోటార్ల బాపతు, తుపాకి లైసెన్సు, గాస్ పర్మిట్లు, ఎలెక్ట్రికల్ పర్మిట్లు, బిల్డింగ్స్ పర్మిట్లు, బైసికిల్ లైసెన్సులు, బండ్ల పన్నులు, పనులలో డివిడెండ్లు, సారాయి వగైరా లైసెన్సులు, సివిల్ డిఫెన్సు రిబేట్లు, జంతుశాలల పన్నులు, కవుళ్ళ పన్నులు, టోల్ గేట్ల పన్ను మొదలైనవి. యీ పన్నుల విధింపు మనకూ వారికి వ్యత్యాసంగా వుంటుంది. మనకు, కౌన్సిల్ తీర్మానం, కొన్ని యెడల ప్రభుత్వ ఆమోదం వుంటేచాలు. పన్నుపడుతుంది. అక్కడ రీతులు వేరు. నిరుటిమీద పన్ను యే రూపంలోనైనా పెంచాలంటే, పెంచదలచిన మేరకు అంచనాలు వేసి, కార్యకారణ సంబంధాలు వ్రాసి, వోటర్లకు ‘రిఫర్’ చేయవలసివుంది. వోటర్లు యీ అదనపు పన్నుల్ని పరిశీలించి, వాటిమీద వోటింగు చేస్తారు. ఆ వోటింగులో ప్రజలు ఆమోదిస్తే, ఆ సూచన చట్టమౌతుంది. కాక, వోటింగులో ప్రజలు యీ సూచనను తిరస్కరిస్తే, అది వీగిపోతుంది. యిట్లా వీగిపోవటాన్ని, విశ్వాసరాహిత్యంగా యెంచరు. ఎందుకంటే, ప్రజాభిప్రాయ సేకరణ ఆదేశంలోని ప్రజాస్వామ్య సూత్ర లక్షణం గనక, దాన్ని ప్రజల అభిప్రాయంగా మాత్రమే పరిగణించి, ఆచరణయోగ్యంగా గ్రహిస్తారు. విశ్వాస, అవిశ్వాసాలకందులో తావులేదు. ప్రజాభి ప్రాయం ప్రధానం, ప్రజాభిమతం ఆచరణయోగ్యం, అంతే! యిట్లా వేయబడిన పన్నులన్నీ కౌంటీలకు తెలియపర్చ బడతై. కౌంటీపాలనలో మాత్రమే పన్నుల వసూళ్ళ సిబ్బంది వుంటుంది. గ్రామ, పట్టణ, నగరాలకు ప్రత్యేకంగా సిబ్బంది ఉండదు. రాష్ట్ర కేంద్రాల తాలూకు పన్నులను గూడా కౌంటీ సిబ్బంది వసూలు చేస్తుంది. కాబట్టి, యెన్నో డిపార్టుమెంటు వాళ్ళు యెన్నిరకాల పన్నులనో వసూలు చేయకుండా, సంఘటితంగా కౌంటీ సిబ్బంది అన్నిపన్నులను వసూలు చేసి పెడుతుంది. అందరికీ ఆ పన్నులను కేటాయింపు చేసుకొంటుంది. మనకు గూడా మునిసి పాలిటీలువేసే ‘సినిమా పన్ను’ను సేల్సు టాక్సు డిపార్టుమెంటు వసూలు చేసి, వసూలు చేసినందుకు కొంత మినహాయించుకొని, మునిసిపాలిటీలకు జమ కడతారు. అట్లాగే, అన్ని రంగాల పన్నులను కౌంటీ స్థాయిలో అక్కడ వసూలు పరుస్తారు. దానివల్ల పౌరునికి సుఖం వుంది. ఒకే జాబితాలో అన్ని రకాల పన్నుల వైనం వేసి, ఒకేసారి యిస్తారు, వసూలు చేస్తారు. స్థానిక సంస్థలు తాముగా విద్యకేమీ ఖర్చు పెట్టవు. అట్లా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. విద్యకు సంబంధించిన వ్యవహారమంతా, విద్యా జిల్లాల తాలూకు బోర్డులు చూసుకొంటవి. విద్యాపన్ను ఆస్తిమీదనే వేస్తారు. ఆస్తి వుండటాన్ని బట్టి గ్రేడెడ్ టాక్సుగా అన్వయింపబడుతుంది. 5000 జనాభాకు మించితే సిటీ అవుతుంది. 5000 లోపు గ్రామం క్రింద లెక్క. సిటీకి మునిసిపల్ పాలన అంటారు. గ్రామాలకు కూడా పాలనారీతి సిటీలకు మాదిరిగానే వుంటుంది. వారికీ ప్రత్యేక పన్నులు, ప్రత్యేక పోలీసు, అగ్నిమాపకులు, శానిటరీ, నీటి సిబ్బందులు అన్నీ వుంటై. మేయర్, మేనేజరు వుంటాడు. కౌంటీ పాలనలో ‘కౌంటీ కమీషనర్లబోర్డు’ వుంటుంది. వారొక అధ్యక్షుణ్ణి యెన్నుకుంటారు. వారికి అవసరమైన సిబ్బందిని వారు నిర్ణయించి, నియమించు కుంటారు. వారూ పన్నులు వేయవచ్చు. అవి సిటీ, గ్రామకౌన్సిళ్ళ మీద చలామణి కాగలవు. 2½ లక్షల జనాభాగల ఫ్రెజ్నో ఆదాయం 11 కోట్ల రూపాయలు. 1½ లక్ష జనాభాగల లిటిల్ రాక్ ఆదాయం 2½ కోట్ల రూపాయలు. ఫ్రెజ్నో బాగా భాగ్యవంతమైన ప్రాంతం. ఆదాయాల స్థాయి మారుతూ వుంటుంది. మనం యిందులో గమనించవలసిన విషయాలు కొన్ని వున్నై. మనం గూడా వికేంద్రీకృత పాలన పెట్టాము. గనక అచ్చటి స్థానిక స్వపరిపాలనా రీతుల్ని గమనించాలి. అక్కడ ప్రజల పాలన యెంతమేరకు నడుస్తుంది.. పాలనలో ప్రజల కోర్కెలే శాసనాలుగా యెంతమేరకు చలామణి అవుతున్నై. వాటిని యెంతమేరకు మనం గ్రహించుకోగలం! యీ విషయాల్లో మనం యింకా పరిశోధన చేయవలసి వుంది. స్థానిక పాలన ప్రజాస్వామ్యానికి పునాది. మన వికేంద్రీకరణ పాలనా పద్ధతి, సిద్ధాంతరీత్యా వుదాత్తమైనది. కాని, ఆచరణలో దాని పాత్ర వమ్మయిపోతుందని అనుభవజ్ఞుల అంచనాలు కనబడుతున్నై. ఆచరణలో సిద్ధాంతాలు యింకా పటిష్టం కాగల పద్ధతులను మనం కనిపెట్టాలి. అమెరికాలోని అనుభవాలు మనకు, ఖర్చు లేకుండా ఆచరింప వీలుగల పద్ధతులేమున్నవో చూడాలి, చూచి, మన ఆచరణలోకి అనువైన వాటిని పరిగ్రహించి, మన స్థానిక స్వపరిపాలనా చట్టాలను ఆ మేరకు సవరించి, పరిపుష్టం చేసుకోవాలి. *--*--* పత్రికాలోకం విద్య, స్థానిక సంస్థలు, న్యాయస్థానాలు ప్రజాస్వామ్య సౌధానికి మూడు స్తంభాలు. నాలుగో స్తంభం పత్రికాలోకం యీ నాల్గు స్తంభాల గురుతుమీదుగా ప్రజాస్వామ్య పరిరక్షణ కావించాలి. అది ఒక్క అమెరికాలోనే కాదు, మనదేశంలోనూ, ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ అట్లాగే వుండాలి. నియంతృత్వ దేశాలసంగతివేరు. వారి తీరుతెన్నులు వేరు. వారి పోకళ్ళు వేరు, వారితో మనకు నిమిత్తంలేదు. ప్రపంచంలోకల్లా ‘యిండియా, అమెరికాలు పెద్ద ప్రజాస్వామ్య దేశాలు’ అని అధ్యక్షుడు రాధాకృష్ణ అన్నాడు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుగొమ్మల్లో ఒకటి పత్రికాలోకం. వ్యక్తి స్వేచ్ఛ అన్నిటికన్నా ముఖ్యంగా లోకం పుట్టిన నాట నుండి ప్రజాస్వామ్యంలో యెంచ బడుతూవుంది. వ్యక్తిస్వేచ్ఛ వున్నదా లేదా అని తెలుసుకోవటానికి ఆ వ్యక్తికి వాక్స్వాతంత్రం వున్నదా లేదా అని తెలిసుకోవటానికి రెండు స్వాతంత్ర్యాలు ముఖ్యం. అందులో మొదటిది పత్రికా స్వాతంత్ర్యం. రెండోది సమావేశ స్వాతంత్ర్యం. పత్రికా, సమావేశ స్వాతంత్ర్యాల్లో వాక్స్వాతంత్ర్యానికి రూఢిమ యేర్పడుతుంది. యీ మూడు స్వాతంత్ర్యాలు కాక, సమావేశ స్వాతంత్ర్యంతో కలిపితే, వ్యక్తి స్వేచ్ఛ సంపూర్ణంగా భద్రతను పొందగలదు. కాబట్టి ప్రజాస్వామ్యానికి పత్రికాలోకం ఒక స్తంభం అయితే, వ్యక్తి స్వేచ్ఛకు కూడా పత్రికా స్వాతంత్ర్యం నాల్గు స్తంభాల్లో ఒకటిగా పరిఢవిస్తుంది. అందువల్ల పత్రికా లోకానికిగల ప్రాశస్త్యాన్ని మనం ద్విధా గ్రహింపవచ్చు. అందువల్ల నిలకడగల ప్రజాస్వామ్యం వర్థిల్లాలి అంటే, పత్రికాలోకానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వుండాలి. అమెరికా సరియైన నిలకడగల ప్రజాస్వామ్యమా, కాదా, అని మనం నిర్వచించుకోవలసివస్తే, ఆదేశంలోని వివిధ పత్రికల్ని పరిశీలన చేసిచూస్తే, మనకు ఒక ప్రధానమైన గుర్తింపు తగులుతుంది. నా అనుభవంలో, మరేయితర ప్రయాణీకుని అనుభవంలో నైనా, అమెరికాలోని పత్రికాలోకంపట్ల, విప్పారిన దాని ప్రయోజనాత్మక వినిమయంపట్ల యెవరైనా అది స్వేచ్ఛాయుతమైన సాంఘికవ్యవస్థగా మన్నుతున్నదనీ, బాగా అచంచలమైన చలామణిలోనున్నదని భావింపక, అనక తప్పదు. పత్రికాలోకం, యెక్కడైనా– ప్రజల దృక్పథాలను ప్రభుత్వానికి, ప్రభుత్వ విధాన దృక్పథాలను ప్రజలకు అన్వయింప చేస్తూ, యేది యేయే వేళల వుచితమో వుభయులకు చెప్పుతూ, లోపాలను దిద్దే వేదికగా పనిచెయ్యాలి. పత్రికా రచన ఒక నైతిక విక్రియ. పత్రికాలోకం పతితమైతే, జాతి జీవనాడుల్లో ఒక ప్రధాన నాడి దెబ్బతినిపోయి, జీవిత గమనం సురిగిపోయినట్లు భావించవలసి వుంది. నియంతృత్వ దేశాల్లో పత్రికాలోకం ప్రభుత్వ డిపార్టు మెంటుల్లో ఒకటిగా పరివర్తితం చేయబడుతుంది. అందువల్ల అది మృతమైనట్లుగా భావించవచ్చు. అది ప్రభుత్వాలకొక ‘బాకా’గా మాత్రమే వుంటుంది. తప్పు యెవరు చేసినా ‘కొరడా’గా పనిచేయలేదు. నియంతృత్వ దేశాల్లో పత్రికాలోకం ఆత్మహత్య చేసుకొన్నట్లే. పత్రికాలోకంలో ఆత్మవంచన ఆత్మహత్యాసదృశం. అమెరికా యేపైన ప్రజాస్వామ్య దేశం. అమెరికాలో పత్రికాలోకం అట్లాగే యేపుగా వుంది. ‘మీదేశపు సంస్కృతి యెట్టిదో చెప్పాలి. అంటే మీ సాహిత్యాన్ని చూపండి. నేను చెప్పుతా’నన్నాడు రవీంద్రనాథ ఠాగూర్, దాని గూర్చి మీ దేశపు పత్రికల్ని చూపండి, మీదేశపు సంస్కృతి యెట్టిదో చెప్పుతాననవచ్చునేమో, రాధాకృష్ణ చెప్పిన మాటల్లోని అర్థంగూడా అదేనేమో! అమెరికాలో పత్రికల సంఖ్య అసంఖ్యాకం. యేదో పత్రిక చదువనివాడు బహుశః అమెరికాలో లేకపోవచ్చు. దేశంలో రమారమి 12 వేల పత్రికలు అన్ని బాపతులు వున్నవి. దినపత్రికలు 1890 దాకా కలవు. 9500 దాకా వారపత్రికలు, తతిమ్మావి పక్ష. మాస పత్రికలు. దేశంలో అన్ని మూలల్లో యీ పత్రికలు కలవు. విద్యవుండి, కొనుగోలు శక్తి వుండి, కొంత విశ్రాంతి వుండి, పత్రికలు వెసులుబాటులో వున్నప్పుడు వాటి కొనుగోలు జాస్తి కాక తప్పదు. దిన పత్రికలు రోజువారీగా 6 కోట్ల కాపీల వరకు, వార పత్రికలు 2 ¼ కోట్ల కాపీలు దాకా పోతై. కొన్ని పెద్ద నగరాల్లోని దినపత్రికలు, ఐదు, ఆరు ఎడిషన్లుగూడా వేస్తారు. అదివారం సంచికలు చాలా పత్రికలు వేస్తవి. చాలా భారీయెత్తున గూడా వేస్తారు. దినపత్రికల్లో కొద్దిగా పార్టీ పత్రికలు గూడా వున్నై – రిపబ్లికన్లు, డెమోక్రాట్లు నడుపుకుంటారు. పార్టీలతో సూటి ప్రమేయంలేకున్నా వ్యాపారదృష్ట్యా యీ ఆ పార్టీలను పత్రికలు బలపరచటం కద్దు. కాని అత్యధిక సంఖ్యాకమైన పత్రికలు స్వతంత్రాలుగా వుంటై. వారికి నచ్చిన దృక్పథంలో కార్యకథా కలాపాన్ని నడుపుతారు. వారపత్రికల్లో గూడా పార్టీలైను పత్రికలున్నా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా విషయ ప్రధాన దృక్పథాలతో నడపబడే పత్రికలే జాస్తి. ఎంత చిన్న పట్టణం గూడా దినపత్రిక లేకుండా అమెరికాలో లేదు. వారపత్రికలనేకాలుగా వుంటై. పత్రికల సైజు చాల భయంకరంగా వుంటుంది. ఏ చిన్న పత్రిక, మారుమూల పత్రికైనా, మన దేశంలోని పెద్ద పత్రికకన్నా పెద్దదిగా వుంటుంది. మారుమూల పట్టణాల్లో దిన పత్రిక గూడా 50 పేజీలకు తగ్గదు. ఆదివారం నాడు 100 పేజీలదాకా పోతారు. పెద్ద పట్టణాల్లో 100 మొదలు 150 పేజీల వరకు రోజువారీ దినపత్రికలు జాస్తి. ఆదివారం 200 మొదలు 300 పేజీల దాకా వేస్తవి. పెద్దపత్రికలు రోజువారీ 200 మొదలు 300 పేజీలు వేస్తారు. ఆదివారం నాడు 400 మొదలు 500, కొన్ని 600 పేజీలు కూడా వేస్తారు. క్రిస్టమస్ సంచికలు, స్వతంత్రదినోత్సవ సంచికలు 700 పేజీల దాకా వేయటం గూడా కలదట, న్యూయార్కు టైమ్సు లాస్ ఏంజిల్స్ టైమ్సు పత్రికలట్టి సంచికల్ని వేసినవట. కాబట్టి, యీ దినపత్రిక సైజు చూస్తే, మనదేశంలో గాభరా యెత్తాల్సిందే. ఒక్క న్యూయార్కు టైమ్సు పత్రిక సాలీనా వాడే ‘న్యూస్ ప్రింట్’ మన దేశంలోని అన్ని దినపత్రికలకు సంవత్సరం పొడుగునా సరిపోవచ్చు! దాన్ని బట్టి ఆ పత్రికల పెద్దరికాన్ని సైజులో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వాషింగ్ టన్ పోస్టు, న్యూయార్కు టైమ్సు, న్యూయార్కు హెరాల్డ్, చికాగో ట్రిబ్యూన్, డేటన్ టైమ్సు, మిల్ వాకి సెంటినల్, మిల్ వాకీ జర్నల్, మిన్నియా పోలీస్ స్టార్, మిన్నియా పోలీస్ ట్రిబ్యూన్, శాన్ ఫ్రాన్సిస్కో టైమ్సు లాస్ ఏంజల్స్ టైమ్సు – నేను చూచిన వాటిల్లో పెద్ద పేపర్ల క్రింద లెక్క. అమెరికాలో హెచ్చు పత్రికలు – బహుశః అన్ని పత్రికలూ – సగానికి పైగా అడ్వర్ టైజ్ మెంట్లు ప్రచురిస్తారు. అందులో కొన్ని పత్రికల్లో అడ్వర్ టైజ్ మెంటు రేటు చాల జాస్తి. న్యూయార్కు టైమ్సులో ఒక పూర్తి పుటకు 6000 డాలర్లు రమారమి 28000 రూపాయలు అవుతుందన్నారు. అమెరికాలోని పత్రికల్లో హెచ్చుభాగం వ్యక్తిగతమైన పత్రికలు. అట్లాకాక, దేశవ్యాప్తంగా కూడా లింకులు కలిగిన ‘గొలుసుపత్రిక’లూ వున్నై. సహకార పద్ధతులమీద నడిచే పత్రికలూ వున్నై. పత్రికల్లో పనిచేసేవారు 75 శాతం షేర్లు కలిగి నడుపుకొనే పత్రికలూ వున్నై. కాబట్టి అన్ని రకాల పత్రికలూ వున్నై. కాని, ప్రభుత్వపు పత్రికలంటూ లేవు. మన దేశంలో మాదిరిగానే. మెజారిటీ పత్రికలు ఒకే పార్టీని గాని ఒకే అభిప్రాయాన్నిగాని బలపరచవు. కొన్ని స్వేచ్ఛగా అంశాన్ని బట్టి వ్రాస్తవి. ఆ రకం పత్రికలు హెచ్చు. కొద్దిగా రిపబ్లికన్ పార్టీకి మొగ్గుగా, కొన్ని డెమోక్రాటిక్ పార్టీకి మొగ్గుగా, కొన్ని మధ్యేమార్గంగా వ్రాస్తూ వుంటవి. యిందులో అనేక రాజకీయాలున్నట్లే పత్రికల్లో కొంత ‘ఎడ్వర్ టైజ్ మెంటు’ రాజకీయాలు గూడా వున్నవి. అవీ కొన్నింట ప్రధాన పాత్ర వహిస్తూనే వుంటవి. అవసరాన్ని బట్టి ప్రభుత్వాన్ని అందులోని వ్యక్తులను, విధానాలను బాగా దుబారించి వేస్తారు. పత్రికల మీద పత్రికలు గూడా విసుర్లు వేసుకుంటూ, రుసరుసలు పడతారు. అన్ని దేశభాషా పత్రికలు గూడా అమెరికాలో వున్నవి. 675 అట్టి పత్రికలు వున్నవన్నారు. వాటిలో 82 దినపత్రికలు గూడా వున్నవి. వీటి విధానాల విషయంలో గూడా ప్రభుత్వపు వత్తిడిగాని, ప్రమేయంగానిలేదు. అమెరికాలో ‘జర్నలిజం’ యే స్థాయిలో వుందో పరిశీలిస్తే కొంచెం ‘హడావిడికి’ ప్రాధాన్యత వున్నదనే చెప్పాలి. కేవలం హడావిడి గూడా కాదు. యితర దేశాల్లో యేదేని ప్రధాన సన్నివేశం జరిగినప్పుడు, శ్రద్ధగా ఆ సన్నివేశంలోని రాజకీయార్థిక, సాంఘిక రగడల్ని పరిశోధనాదృష్టితో చూడటం తక్కువ. పైపైన చూచి వదలివేయటం దినపత్రికల్లో జాస్తిగా కనబడుతుంది. కొందరు పరిశీలకులు లోతుకు వెళ్ళి విషయగ్రహణ చేస్తారు. వారి సంఖ్య తక్కువ. పత్రికలు చదివేవాళ్ళు విదేశపు సన్నివేశాల్ని సాధారణంగా పట్టించుకోరు. మనం పట్టించుకొన్నంతగా అట్టి విషయాల్ని యే దేశమూ పట్టించుకోదు. అది జాతీయ గుణాల్లో ఒక్కటేమో! లేక మన పత్రికలు మనకు మొదటి నుంచీ చేసిన అలవాట్లను బట్టి వున్నదేమో! మనకు పత్రికలు వ్యుత్పమయ్యే రోజుల్లో, మనం విదేశీపాలనలో వున్నాము. మనపత్రికలు హెచ్చుగా బ్రిటన్ లోని పత్రికల నమూనాలుగా తయారైనవి. మన పత్రికల్లో బ్రిటను యూరపు మొదలగు విదేశవార్తలకు ప్రథమస్థానము. జాతీయ వార్తలకు ద్వితీయ స్థానము. రాష్ట్రీయ వార్తలకు తృతీయ స్థానము యివ్వ నారంభించారు. ఆ సాంప్రదాయం యింకా బాగా మనపత్రికల్లో సడలలేదు. మన పత్రికలన్నీ జాతీయ, అంతర్జాతీయ పత్రికలే. అందువల్ల ఆయా వార్తల ప్రాశస్త్యాన్ని హెచ్చుచేసినవి. ఇప్పుడిప్పుడు, కొద్ది మార్పువున్నా, చెప్పదగిన మార్పేమీ లేదు. మనకు ప్రాంతీయ వార్తలకన్నా, జాతీయ, అంతర్జాతీయ వార్తలమీద మోజు జాస్తి. మనము మన పత్రికలవల్ల అట్లా అయినామో, మన పత్రికలు మనవల్ల అట్లా అయినవో పరిశీలించుకోవాలి. అమెరికాలో పత్రికలు ప్రాయికంగా ప్రాంతీయాలు. ద్వితీయంగా జాతీయాలు. తృతీయంగా అంతర్జాతీయాలు. అందువల్లనే వారి దినపత్రికల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు క్రమానుగతంగా ప్రచారాన్ని పొందుతై. అది మనకు అంతగా వచ్చినట్లు కనబడదు. యూరప్, యింగ్లండు, రష్యాలాంటి దేశాల్లో పత్రికలన్నీ అట్లాగే వుంటై, అందులో రష్యారీతులు వేరు. అందుచేత అమెరికా ప్రజల్లో విదేశవ్యవహారాన్ని గురించి చర్చించేవారు తక్కువ. దీనికొక కారణం వుండవచ్చు. వందసంవత్సరాలకు పైగా జేమ్సు మన్రో సిద్ధాంతాల ప్రాబల్యం హెచ్చి అమెరికా తనవిషయం, తన ప్రాంత విషయాల్ని తప్ప పట్టించుకోక, ‘ఐసొలేష్’ గూడులో వాదం మాదిరిగా ఉండి పోవటంతో, యితర విషయాల్ని పట్టించుకోకపోవటం ఒక జాతీయ గుణంగా మారి కూర్చున్నది. ఏది కారణమైనా వారి స్వభావం యిప్పుడట్లా వుంది. అమెరికా పత్రికల్లోకల్లా న్యూయార్క్ టైమ్సును ప్రధాన జాతీయ పత్రికగా పరిగణిస్తారు. న్యూయార్కులోనే గాక పశ్చిమకోస్తాలో గూడా యీ పత్రిక ప్రత్యేక ఎడిషన్ వేస్తారు. పారిస్.లో యూరపు ఎడిషన్ వేస్తారు. యిదికాక, న్యూయార్కు హెరాల్డ్, లాస్ ఏంజల్స్ టైమ్సు, వాషింగ్టన్ పోస్టు, చికాగో ట్రిబ్యూన్ లాంటివి కొంత జాతీయ కోవకు చెందిన పత్రికలు కొన్ని కలవు. నేను రెండు మాసాలు అమెరికాలో తిరుగుతూవున్న రోజుల్లో, యిండియా నుండి వార్తలు నాలుగైదుసార్లు సందర్భపడినై, అది గూడా, ఢిల్లీ ప్రత్యేక విలేఖరుల నుండి వారానికొకసారి కొన్ని పత్రికలు ప్రచురిస్తవి. ఆ ఆదివారంనాడు పత్రికను మనం చూడలేకపోతే, మరో ఆదివారం దాకా ఇండియా అమెరికా పత్రికల్లో వుండనే వుండదు. అట్లా అదివారం వార్తలు వేసేది నాలుగైదు పత్రికలు మాత్రమే! న్యూయార్కు టైమ్సు, న్యూయార్కు హెరాల్డ్, వాషింగ్టన్ పోస్టు, లాస్ ఏంజిల్స్ టైమ్సు లాంటి పత్రికల్లో వేస్తారు. ఒక ఉదాహరణ, నెహ్రూ, కామరాజ పథకం పేరుతో తన మంత్రుల్లో చాలమందిని, పాము పాతకుప్పుసాన్ని విడిచినట్లు, విడిచివేశాడు. ఆ సంగతి యిక్కడి మిత్రులు వ్రాసిన వుత్తరాన్ని బట్టి మాత్రమే నాకు తెలిసింది. మనకది బ్రహ్మాండమైన వార్తగదా! అట్లా వుంటుంది మనదేశపు వార్తల్ని అమెరికా పత్రికలు ప్రచురించటం. యూరోప్.లో గూడా అంతే! వేలిడిచిన సంబంధం వల్ల బ్రిటనులో కొంచెం నయంగా వుంటుంది. అక్కడివారు చాల వారపత్రికల్ని చదువుతారు. కొనటం వలన కొని చదవరేమో ననుకున్నాను. ఒకనాడొక యువతియింటికి భోజనానికి వెళ్ళాను. టెన్నిసీ రాష్ట్రంలో, చాల పత్రికలున్నై, నాకు అనుమానం వేసి, ‘మీ అభిరుచి యేమండీ యీ పత్రికల్లో’ అన్నాను. కనిపెట్టింది, నా ప్రశ్నలోని వాడితూపు. మీరా పత్రికల్లో యే ముఖ్య వ్యాసాన్నయినా చూచి, అడగండి చెప్పుతానన్నది. ‘పరీక్షకు కాద’నన్నాను. ‘మా వాళ్ళు పత్రికలు బాగా చదువుతా’రన్నది. ‘అయితే యిబ్బంది పుస్తకాలతోనా’ అని నవ్వుకున్నాము. అమెరికాలో పత్రికల్ని అమ్మేపద్ధతులు గమ్మత్తుగా వుంటై. బజారుల్లో, వీధిమూల, పత్రికల్ని ఒకచోట పెడతారు. దాని ప్రక్కనే డబ్బులు వేయటానికి ఒక పెట్టె ఉంటుంది. దారిని పోతూ, పత్రిక తీసుకొని, దాని తాలూకు మూల్యం – 10 సెంట్లుగాని, ఆదివారమైతే 20 సెంట్లుగాని – ఆ పెట్టెలో వేసి పోతారు. కాజేయటానికి సంపూర్ణ సావకాశం వుంది. పత్రికా కాజేయవచ్చు. డబ్బులపెట్టెను కూడా వూడదీసి కాజేయవచ్చు. కాని, అక్కడ ఆపని జరగదు. గత పాతిక యేండ్లలో, 1, 2 సంఘటనలు తప్ప, అటువంటివి జరగలేదని పత్రికాలోకం చెప్పుతుంది. అట్లాకాక, కొన్నిచోట్ల యాంత్రిక సహాయంతో పత్రికలు యివ్వబడతై. పెట్టెల్లో పత్రికలు యిమిడ్చి వుంటై. పెట్టె తాళం వేసి వుంటుంది. మనం 10 సెంట్లను ఆ పెట్టె మలుపులోకి నెట్టితే, ఒక పత్రిక క్రిందకు జారుతుంది. ఆ పత్రిక తీసుకొని వెళ్ళవచ్చు. 10 సెంట్లు వేయకపోతే, ఆ పత్రిక రాదు. పత్రికలు పుస్తక విక్రయశాలల్లో దొరుకుతాయి. బజారు హాకర్లు అమ్ముతారు. ఇళ్లకు తెచ్చి సరఫరా చేస్తారు. ఇక పత్రికల పేజీలు జాస్తి. ప్రతిరోజూ పత్రికలో జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలు కాక, ఆడవాళ్ళ భాగం, ఆటల భాగం, వినోదాల భాగం, కథల భాగం, పిల్లల భాగంగా పత్రికలను విభాగించి వేస్తారు. ఎడ్వర్ టైజుమెంటు పత్రికలో అన్ని పేజీలలో వుంటంకాక, వర్గీకరింపబడిని ఎడ్వర్ టైజు మెంట్సుతో కొన్ని ప్రత్యేక సెక్షనులే వేస్తారు. మన పత్రికల్లో వార్తల్ని ‘ఒక విలేఖరి’, ‘మా విలేఖరి’, ‘మా ప్రత్యేక విలేఖరి’ అని వేస్తూ వుంటారు. అక్కడ పత్రికల్లో, ఆ విలేఖరి పేరుతో ఆ వార్త వేస్తారు. పద్ధతి బాగుంది. మంచి వార్తల సంతరణలో యే విలేఖరి బాగా కృషి చేస్తున్నాడో లోకానికి తెలుస్తుంది. పత్రికా రచయితగా అతని పేరు తెలియటానికి వీలౌతుంది. అట్లా కొత్త పత్రికా రచయితలు పేరుపొంది, పెరిగి రావటానికి వీలౌతుంది. వారి వారి ఫోటోలను గూడా తరచు వేస్తారు. ఆ మనిషి, అన్ని విధాలా లోకానికి తెలియటం జరుగుతుంది. పత్రికా రచనలో ఒక భాగమే అదిగదా! పత్రికా రచయితగా, చిన్న పత్రికలతో సంబంధం వున్న వాణ్ణిగా – రాడికల్, రాడికల్ హ్యూమనిస్టు, సమీక్ష – నేను ఆదేశం ఆహ్వానింపబడినందున, పత్రికారచన విషయంలో శ్రద్ధగా వివిధ కేంద్రాల్లో పరిశీలించాను. వాషింగ్టన్.లో వుండగా ‘వాషింగ్ టన్ పోస్టు’ ఆఫీసుకు వెళ్ళాను. మేనేజింగ్ ఎడిటర్ని కలిశాను. వారితో మాట్లాడుతుండగానే – రోజూ వారికి, యితర సంపాదక వర్గంలోని వారికి జరిగే సంప్రదింపుల సమావేశం వేళకాగా – నన్నుగూడా పాల్గొనమని ఫ్రండ్లీగా రమ్మనగా నేనూ పాల్గొన్నాను. మన దేశ పత్రికలో అట్టిదేమీ వుండదు కాని, సంపాదక, సహాయ సంపాదకులు రోజువారీ పత్రిక నిర్వహణలో సంప్రదింపులు తప్పవు. సంపాదకుడే చెప్పటమో, మరొకరు చూడటమో జరుగుతుంది. 32 మంది సమావేశమయ్యారు. పత్రిక రోజూ 200 పేజీల దాకా వేస్తారు. వివిధ సెక్షన్లు వుంటై. ఎడ్వర్ టైజ్ మెంటు మేనేజరు కోరిన ఖాళీలు పోను విషయ సమీకరణకు చోటు చర్చించబడుతుంది. ఏ వార్తకు యెంత ఫీచరింగు కావాలో చర్చింపబడుతుంది. ఒకరిద్దరు తమ వార్తకు హెచ్చుచోటు కావాలని వాదిస్తే, మేనేజింగు ఎడిటర్ సర్దుబాటు చేస్తాడు. యీ చర్చలకై పేజీలు గుర్తుపెట్టి తెల్లకాగితాలు కొట్టి యిస్తారు. అందరికి అవి అందచేస్తారు. కొన్ని వార్తల్ని గూడా పొందు పరుస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 2-3 గంటల మధ్య యీ చర్చ వుంటుంది. అంగీకారం కుదుర్చుకుని యెవరిచోటికి వారు వెళ్ళి, ప్లాను ప్రకారం పత్రికను రూపింప చేస్తారు. మరోనాడు, నాటి చర్చల్తో పోల్చి పత్రికను చూచాను. ప్లాను ప్రకారం ‘తు, చ’ తప్పకుండా కథలు అమర్చబడినై. ఆ సాయంత్రం ఆ చర్చల్లో పాల్గొనటం నాకొక ‘చదువు’గా వుంది. ‘మీ దేశపత్రికల్లో ఇట్లాగే చేస్తారా’ అన్నాడొక మిత్రుడు. ‘మీ పత్రికల్లో మహిళలకు ప్రత్యేక సెక్షన్ వుంటుందా’ అన్నది ఆ శాఖకు చెందిన సంపాదకురాలు. ‘యింత పెద్ద పేపర్లు మాకు లేవు. రోజువారీ 6, 8 పేజీలకన్నా హెచ్చు వుండదు. ఆదివారం నాడు 10, 12 పేజీలుంటవి’ అన్నాను. ‘అంత చిన్న పత్రికల్లో యేమి వ్రాస్తారు’ అన్నాడొక ఎడిటర్. ‘మా పత్రికల్లో విషయ ప్రథానంగా వ్రాస్తా’ రంటూ నవ్వాను. యీ పత్రిక రోజూ 4 ½ లక్షలు, ఆదివారం 5 ½ లక్షలు దాని సర్క్యులేషన్ కలది. అక్కడ మేనేజింగ్ ఎడిటర్ పాత్ర, నిత్యం యీ రీతిగా సంపాదకుల్ని అందర్నీ చేర్చి, పత్రికను రూపొందించటంలో ముఖ్యంగా ఉంటుంది. అతిథుల్ని చూడటం గూడా యీయనే జాస్తి, వ్యాపార సంబంధాలేమీ ఆయనకుండవు. అమెరికా పత్రికలో ‘ఎడిటోరియల్ ఎడిటర్’ (సంపాదకీయ సంపాదకుడు) అనీ, వారి సహాయకులనీ వుంటారు. వారే సంపాదకీయాల్ని వ్రాస్తారు. మనదేశంలో మాదిరిగా ఒకరే అన్నింటి మీదా వ్రాయక, వివిధ విషయాల మీద పలువురు వ్రాస్తారు. సర్వతోముఖత్వం అక్కడ సంపాదకులకు తక్కువ. ఇట్లాగే నేను ‘న్యూయార్కు టైమ్సు’ చూచాను. ‘చికాగో ట్రిబ్యూన్’ చూచాను. లాస్ ఏంజిల్స్ టైమ్సు చూచాను. యీ పత్రికలన్నింటిలో మరల వైనం అంతా చూచాను. మన పత్రికల్లో పెద్దవాటిని చూచాను. కాని, పోలికలు కుదరవు. యాంత్రికంగా వాళ్ళు పొందే సౌకర్యాలు చాల జాస్తి. అవి ఖర్చుతో కూడిన పనులు. న్యూయార్కు టైమ్సు రోజువారీ 7,16,210 కాపీలు వేస్తున్నారు. ఆదివారం 13,47,782 కాపీలు వేస్తున్నారు. లాస్ ఏంజిల్స్ టైమ్సు రోజూ వారీ 7 లక్షల కాపీలు, ఆదివారం నాడు 10 లక్షల కాపీలు వేస్తారు. యివన్నీ పెద్ద పత్రికలు. రోజూ 200, 300 పేజీలు, ఆదివారం నాడు 400, 500 పేజీల దాకా వేస్తారు. యీ పత్రికలలోకల్లా లాస్ ఏంజిల్స్ టైమ్సులో కొన్ని నూతనమైన యాంత్రిక సౌలభ్యాలున్నై. ‘ఆలోచనగల మర’ ఒకటి వుంది. దాన్ని ‘బ్రైన్ కంప్యూటర్’ అంటారు. యిది చిత్రమైన మర. ఒక వార్తను, నేను చెబుతుంటే, ఒకరు టైపు చేస్తుంటారు, యింకొకరు టేప్ రికార్డు చేస్తారు. టైపు చేసిన దానిని, ముగ్గురో నలుగురో దిద్ది, కలిపి కొంత కొట్టివేసి, చివరకు, అచ్చుకు పెద్ద సంపాదకుడు మంజూరు చేస్తాడు. యీ దిద్దుళ్లు జరిగితే, ఆ పాఠం అచ్చుకు సిద్ధంగా వున్నట్లు. యీ దిద్దిన టైపు కాపీని, టేప్ రికార్డు చేసిన మూల ప్రతినీ, యీ ‘ఆలోచన మర’లో ఒకవైపుగా వుంచుతారు. స్విచ్ నొక్కుతారు. రెండు ప్రతులూ మరలోనికి పోతై. వెనువెంటనే మరొక ప్రక్క నుంచి ‘శుద్ధప్రతి’ రిలీజ్ చేయబడుతుంది. టైపులో చేయబడిన సవరణలన్నీ యీ టేపులో చేర్చబడి, శుద్ధప్రతి మరొక టేప్ రూపంలో వస్తుంది. దీనికి వ్యవధి పట్టదు. యీ శుద్ధ ప్రతి టేపును తీసుకువెళ్ళి కంపోజింగు మరలో యిమిడ్చి, స్విచ్ వేస్తారు. యీ టేపులోని రచనను, నిమిషానికి పదికాల లైనుల కంపోజు చేసి, ఆమర పనిచేస్తూపోతూ వుంటుంది. యిట్టి మర అమెరికాలో యిందులో మాత్రమే వుంది. యిందులో 3500 మంది పనివారున్నారు. 350 మంది సంపాదక శాఖలో వున్నారు. యీ మరల ఆగమనంతో – దినపత్రికల్లో ‘ఆటోమేషన్’ (అత్యంత సున్నితమైన యంత్రసహాయంతో విశేషంగా పని చేయటం) – ప్రారంభమైంది. అందువల్ల, వున్నవారికి వుద్యోగాలు పోతున్నై. దానికై యీ మేనేజిమెంటు, వున్న వుద్యోగుల్ని తీసివేయకుండా వుంచేలాగున, వారికి ఆటోమేషన్ ట్రయినింగు యిప్పిస్తూ, కొత్తపనులకు పురమాయిస్తున్నారు. మరొక సంగతి, మిల్వాకీలోని ‘మిల్వాకీ జర్నల్’, ‘మిల్వాకీ సెంటినల్’ పత్రికల్ని చూచాను. మొదటిది డెమోక్రాటిక్ ధోరణి, రొండోది రిపబ్లికన్ ధోరణి జర్నల్ పత్రిక, సెంటినల్ పత్రికను కొన్నారు. మిల్వాకీ జర్నల్ రోజువారీ 3¾ లక్షలు, ఆదివారం 5,61,000 పోతుంది. సెంటినల్ రోజువారీ ఉదయం 3 లక్షలు, ఆదివారం 4½ లక్షలూ పోతుంది. జర్నల్ సాయంత్రం పత్రిక. జర్నల్.లో నియమితులైనవారు 72½ శాతం కంపెనీ షేర్లను కలిగి వున్నారు. వీరే సెంటినల్ పత్రిక కొన్నదానిలో గూడా షేరు హోల్డర్లుగా వుంటారు. హోచెన్, రింగర్, రస్సెల్ ఆస్టిన్ గారలు దీని జీవగర్రలు. యీ పత్రికల భవనం తిరిగిచూచి, లోపలి మరలన్నీ చూచాను. అట్లాగే మినియా పోలీస్ ట్రిబ్యూన్, మినియా పోలీస్ స్టార్ పత్రికలు రొండూ ఒకే మేనేజిమెంటువి. ట్రిబ్యూన్ ఉదయం, స్టార్ సాయంత్రం వస్తవి. వీటిని, లోని పనితనాన్ని, మరల్ని చూచాను. సంపాదకుడు పాల్.జి పియర్ సన్, వారి అనుచరులతో చర్చలు చాలా హృద్యంగా ఉన్నవి. అమెరికాలో నాకు కలిసిన వుత్తముల్లో అతనొకడు. యీ పత్రికలూ ఒకటి రిపబ్లికన్ వైపుకి, ఒకటి డెమోక్రాట్ల వైపుకు మొగ్గు చూపుతై. యీ పెద్దకారు పత్రికలను, పెద్దలైన పత్రికా సంపాదకులను చూచి, వారి పనిచోట్లలో వారలను కలసినమూలకంగా యెన్నో నూతనాంశాలను గ్రహించగలిగాను, పనిమీద శ్రద్ధ, నిజాయితీలు వుట్టిపడునట్లు చూడవచ్చు. అనుభూతిలోకి మలుచు కోవచ్చు. కొన్ని పత్రికలు, సాలీనా కొన్ని సాంఘిక కార్యక్రమాలను, పోటీలను, విద్యార్థులకు జరిపి, ఆయా పోటీలలోనూ ఉత్తీర్ణులైనవారికి బహుమతులనిచ్చి, ఒక సాంఘిక దృక్పథాన్ని వెలార్చటానికి వుపకరిస్తున్నారు. మిన్నియా పోలీస్ స్టార్, ట్రిబ్యూన్ పత్రికలు అట్టి సాంఘిక కార్యక్రమాన్ని నడుపుతున్నారు. గత 16 సంవత్సరాల నుండీ యీ కార్యక్రమం నడస్తూవుంది. పది లక్షల మంది విద్యార్థులు, వుపాధ్యాయులు యీ ప్రణాళిక క్రింద ప్రయోజనాల్ని పొందియున్నారు. యిట్టి సాంఘిక దృష్టితో కృషికి యితర పత్రికలు కూడా వుద్యుక్తమవుతున్నవి. అమెరికాలో, మనదేశంలో అస్పృశ్యతాది సాంఘిక సమస్యలున్నట్లు, నీగ్రో సమస్య వుందిగదా? నీగ్రోలకు, ఆ సమస్యా స్ఫూర్తికోసం, ప్రత్యేకంగా దిన, వార, మాస పత్రికలు వున్నై. చికాగోలో ‘డెయిలీడిఫెండర్’ అన్న దినపత్రిక ఉంది. దాన్ని చూచాను. వారి సమస్యల్ని చర్చించాము. యీ పత్రికలేవీ పెద్దకారు పత్రికలు కావు. నీగ్రోలలో తప్ప, హెచ్చు విక్ర.యాలు లేని పత్రికలే జాస్తి. మామూలు దిన పత్రికల్లో చాల పత్రికలు నీగ్రో సమస్యకు ఉచిత ప్రచారం యిచ్చేవి కలవు. అందువల్ల ఒకరకంగా ప్రత్యేక పత్రికల అవసరం లేకున్నా, ప్రతివుద్యమం తన తాలూకు పత్రికల్ని తాను స్థాపించుకోక తప్పదు. స్థాపించుకొన్నాక ప్రోది చేయక తప్పదు. అట్లాగే యీ పత్రికలన్నీ నడుస్తున్నవి. పత్రికలేగాక, తత్తుల్యమైన ప్రచారసాధనం రేడియో, టెలివిజన్ కలవు. అమెరికాలో 4 కోట్ల 80 లక్షల కుటుంబాలున్నవి. 5 కోట్ల 45 లక్షల టెలివిజన్ సెట్లు కలవు. 4250 రేడియోస్టేషన్లు, 625 టెలివిజన్ స్టేషన్లూ కలవు. పత్రికల మాదిరిగానే, యివన్నీ ప్రయివేటుదార్ల అజమాయిషీల్లో ఉన్నవే. ప్రభుత్వ పెత్తనం లేదు. కాని ఫెడరల్ కమిషన్ నిబంధనావళి వుంది. తదను సారంగా పోవాలి. అయితే, ప్రభుత్వపు బెదిరింపు, అదిరింపులు లేవు. కంట్రోలు యే మాత్రం లేదు. పత్రికలకు అనుబంధ ప్రచారసాధనలు ప్రజాస్వామ్య వుద్దీపనకు మార్గగాములు. వీటిని గూడా పత్రికాలోకంతో జతపరచి, ఆలోచింపవలసినదే! ప్రచారసాధనాలే గనుక, రొండే రొండు కళ్ళమాదిరిగా గమనించుకో దగినవే! అమెరికాలోని పత్రికలలో కొన్ని, వాటికై ప్రత్యేకంగా పెంచుకునే అడవులు, పత్రికలకుపయోగించే ‘న్యూస్ ప్రింట్’ను తయారు చేసే యంత్రాలుగూడా కలవు. లాస్ ఏంజల్స్ టైమ్సుకు అట్టి వనర్లు, యేర్పాట్లు కలవు. కాబట్టి వార్తాపత్రిక నిర్వహణ యెంతస్థాయి వ్యాపారంగా పరిగణింపబడుచున్నదో వ్యక్తం కాగలదు. పత్రికలు ఎడ్వర్ టైజ్ మెంటు మీద తమ ఆదాయానికి ప్రాయికంగా ఆధారపడినప్పటికీ, ఎడ్వర్ టైజ్ మెంటుదార్ల రాజకీయ ప్రభావం ప్రధానమైనది కానేకాదు. లింకు పత్రికలుగూడా ఒకే దృక్పథాన్ని ప్రచారం చేయాలని లేదు. వాటి ప్రభావం అమెరికా ప్రజల మనస్తత్వం మీద చెప్ప తగినంతగా లేదు. చిన్న పత్రికల ప్రభావమే జాస్తిగా పరిగణించటం కద్దు. అనాది నుంచి, అనగా 1733లో జాన్ పీటర్ జింజర్, న్యూయార్క్ గవర్నర్ని యెదిరించి, విమర్శించి, జైలులోబడి, తన విమర్శల్ని సాగిస్తూ, తాను కోర్టులో విజయం పొందిన నాటి నుండి, పత్రికా స్వాతంత్ర్యం మీద అమెరికాలో మక్కువ జాస్తి. ఆ స్వత్వాన్ని వారెప్పుడూ మరువలేదు. రాజ్యాంగ రక్షణలేగాక, కోర్టులిచ్చే రక్షణ అద్వితీయమైనది. పత్రికా స్వాతంత్ర్యంపట్ల విశేషమైన, ప్రాచీనమైన దీక్ష ప్రజల్లో కలదు. దానివల్లనే పత్రికాలోకం అమెరికాలో బలీయమైన సంస్థ. ఆ ప్రజాస్వామ్యానికదొక కూడలి. *--*--* న్యాయస్థానాలు విద్య స్థానిక సంస్థలు, పత్రికాలోకం అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థకు మూడుస్తంభాలు, నాలుగోస్తంభం న్యాయస్థానాలు. యీ నాలుగు స్తంభాలు అమెరికాలోని ప్రజాస్వామ్య సౌధాన్ని భరిస్తున్నవి. యీ నాల్గింటిలో యే మాత్రం వరుగు వచ్చినా, సౌధంలో నిలకడ పోతుంది. అందువల్ల యీ నాల్గు మూలల నిత్యం శ్రద్ధాసక్తులతో ప్రజలస్వామ్య పరిరక్షణ జరుగుతూ వుంటుంటేనే, అసలు రక్షణ కుదిరేది. యీ నాల్గింటిలో ఒకటికన్నా ఒకటి ముఖ్యం అన్నభావం లేకుండా, సమపాళంగా అంగరక్షకులుగా పనిచేస్తేనే, కథాకలన యుక్తి సజావుగా వుంటుంది. న్యాయస్థానాలు, లేక, ధర్మస్థానాలు, ప్రభుత్వ చర్యల్లో ప్రజల హక్కులు నిర్లక్ష్యం చేయబడకుండా కాపాడాలి. ‘ధర్మం’ అంటే ‘లా’ మనం పూర్వం దీన్ని ‘స్మృతి’ అనేవాళ్ళం. స్మృతి అంటే ధర్మం. ధర్మం అంటే ‘లా’ ‘లా’ అంటే ఏమిటో అందరికి తెలుసు. న్యాయస్థానాలు రాజ్యాంగ సూత్ర పంక్తిని సరిగా అన్వయిస్తూ, రాజ్యాంగములో నిక్షిప్తంకాబడిన ప్రజల హక్కులను – వ్యష్టిగానూ, సమిష్టిగానూ – అహర్నిశం కాపాడే కేంద్రాలే న్యాయస్థానాలు. ధర్మం యెదుట వ్యక్తుల మధ్య తారతమ్యం వుండదు. ధర్మం ముందు ప్రభుత్వానికి, ప్రజకు వ్యత్యాసం వుండదు. పాలించేవారు, పాలింపబడేవారు అన్న భేధం లేదు. మనదేశంలో ఒకప్పుడు ధర్మంబు కాశికాస్థాన మధ్యంబున నాల్గు పాదంబుల నడచి యాడెను. అది నాల్గు పాదముల ధర్మము. దానినే మనుష్యులకన్వయించారు. యిప్పుడిప్పుడు ధర్మాన్ని సరిసమానంగా అన్వయించాలని భావిస్తున్నారు. పూర్వపు వృత్తం మారుతూ, మారుతూ వుంది. పూర్తిగా మారలేదు. ఆ దేశంలోని వృత్తం వేరు. అక్కడ గూడా న్యూనతలు గల కొన్ని రంగాలు వుండేవి. న్యూనతలను న్యాయస్థానాలు పదేపదే తెగగొట్టి పారవేస్తూవచ్చినవి. మొన్న మొన్నటి పౌరసత్వ చట్టం మీది తీర్పు యీ వుద్యమాన్ని ఉచ్ఛస్థితికి తీసుకువెళ్ళింది. చట్టరీత్యా న్యూనతలకు ఆ దేశంలో స్థానంలేదు. న్యాయానికి, మనదేశంలోనూ లేకుండా చేయబడాలి. దగ్గరకు వస్తున్నాము. మనకు మతాలవారీ ‘లా’పోయి, ‘సివిల్.లా’ వచ్చి, దేశపౌరులందరికీ ఒకే చట్టం అన్వయం కావాలి. అప్పుడు వ్యత్యాసంలేని శాసనరాజ్యం ప్రారంభమౌతుంది. అమెరికాలో ‘సివిల్ లా’ అంతా ఒకటే, కాని, నీగ్రోల హక్కులలో కొంత న్యూనత వుండేది. ప్రతిరాష్ట్రానికి, మనకు హైకోర్టు వున్నట్లే వారికీ ఎపెలేట్ కోర్టు, కొన్ని చోట్ల సుప్రీం కోర్టులు వున్నై. దేశానికంతకూ పెద్ద కోర్టు. వాషింగ్.టన్.లోని సుప్రీంకోర్టు. దానిలో యేడుగురు న్యాయమూర్తు లున్నారు. అందొకరు ప్రథాని. యిది అత్యున్నతమైన న్యాయ స్థానము. రాష్ట్రాల మధ్య రాష్ట్రాలకు, ఉన్న వివాదాలు రాష్ట్రంలోని ఎపెలేట్ కోర్టుమీద అపీళ్ళు. రిట్ పిటిషన్లు హెచ్చుగా సుప్రీంకోర్టులో వుంటవి. వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినవి. రాజ్యాంగ సూత్రనిర్వచనకు అన్వయించినవీ ప్రధానంగా యెంచబడి, సుప్రీంకోర్టులో వుంటై. నేను సుప్రీంకోర్టుకు వెళ్ళి, చూచి, కోర్టు అధికార్లతో చర్చలు చేశాను. కోర్టు నిర్మాణం వుద్దీపన కలిగించేదిగా వుంది. కోర్టు హాలు చూడగానే ప్రశాంత వాతావరణం చిమ్ముతుంటుంది. న్యాయసస్యాలు పండుతున్నట్లు అనిపిస్తుంది. రూజ్ వెల్ట్ కాలంలో 1933లో యీ భవన నిర్మాణము 4 కోట్ల 85 లక్షల రూపాయల ఖర్చుతో పూర్తికావించబడింది. కళలకు కాణాచినిగా, ఆ కృతిలో అందాలు చిలుకుదానినిగా, గంభీరంలో లోతుపాతులు గలదానినిగా చూడగానే యిది ఒక ప్రశస్త కార్యనిర్వహణకు కేంద్రంగా తోచునట్లు చేశారు. చారిత్రక న్యాయమూర్తుల నెందరినో దృశ్యాకృతిలో చిత్రించారు. మనకోర్టుల మాదిరిగా వున్న యేడుగురు న్యాయమూర్తులు వేరువేరుగా కోర్టులను జరపక, అందరూ కలిసి కూర్చుంటారు. అన్ని కేసులు, అందరూ కలిసి వింటారు. మెజారిటీ తీర్పుబద్ధ నిర్ణయం ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లోని పెద్దస్థాయి కోర్టును ‘సుప్రీంకోర్టు’ అనే అంటారు. కేంద్రంలోని వుత్తమ న్యాయస్థానానికి, రాష్ట్రంలోని వుత్తమ న్యాయస్థానానికి ఒకే పేరుపెట్టటం అంత ఔచిత్య కార్యం కాదేమోనని నేనంటే, న్యూయార్కు రాష్ట్రం అటార్నీ జనరల్ ఫ్రాంక్ హోగన్ అంగీకరిస్తూ, అలవాటు పడిపోయి, యీ తేడా వున్నట్లు మావాళ్ళు భావించటం లేదన్నారు. మార్చటమే వుచిత మేమోనని మిన్నెసోటా అటార్నీ జనరల్ మండేల్ అన్నారు. ఎందుకంటే, సుప్రీంకోర్టుమీది అపీలు సుప్రీంకోర్టుకే చేయవలసి వస్తుంది. రాష్ట్రంలోని దానిమీద కేంద్రంలోని దానికి చేస్తారు. మనదేశ న్యాయ విధాన నిర్మాణానికి, ఆదేశంలోని విధాన నిర్మాణానికి చాలా తేడా వుంది. మనదేశంలో కేంద్ర చట్టాలు కొన్ని, రాష్ట్ర చట్టాలు కొన్ని వున్నై. కేంద్ర చట్టాలు రాష్ట్రాల అన్నింటిమీద చలామణిలో వుంటై. దీనికి విరుద్ధంగా రాష్ట్రంచట్టాల్ని చేయరాదు. చేసినా అవి అశాస్త్రీయంగా వుండిపోతై. అక్కడ అట్లాకాదు. రాష్ట్రాలు యెవరికి తోచిన శాసనాలను వారు చేసుకుంటారు. చట్టాలు ‘ప్రోసీజర్‘కు సంబంధించినవిగాని, ‘సబ్.ష్టాంటివ్ లా’కు సంబంధించినవిగాని రాష్ట్రాలు వేరుగా చేసుకుంటవి. అంటే, మనదేశంలో ‘సివిల్ ప్రొసీజరు’, ‘క్రిమినల్ ప్రొసీజరు’ అని రెండు ప్రధాన చట్టాలు కలవు. వీటిలోని విధానం ప్రకారమే ప్రాయికంగా మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు, వివిధ కోర్టుల్లో జరిగితీరాలి. కాని, అమెరికాలో యేబది రాష్ట్రాల్లో యేబదిరీతుల ‘ప్రోసీజర్’ వుంటుంది. యెవరికి వచ్చిన విధానాన్ని వారు అనుసరిస్తారు. బంధరీతిని ఆ విధానాలు వుండవు. అంతేకాదు. ముఖ్య చట్టాలు యే రాష్ట్రానికారాష్ట్రం అనేకంగా చేసుకుంటారు. కేంద్రం మన దేశంలో మాదిరి, కంట్రాక్టులకు, ఆస్తి మారకాలకు, పార్టనర్ షిప్పులకు, ఆర్బిట్రేషన్.కు యిట్లా అనంతగా చట్టాలు చేసి, యివి అన్ని రాష్ట్రాలకు వర్తిస్తవి అనటంలేదు. కేంద్రాల శాసనాల అనుశాసనపర్వం అక్కడ లేదు. అందువల్ల, ‘లోకోభిన్నరుచి’అన్న సూత్రం అక్కడ అమలులో వుంది. భిన్నమైన చోట్ల భిన్నమైన రుచులు వుండగా భిన్న శాసనాల్ని చేసుకుంటారు. వారిది ఫెడరల్ రాజ్యాంగం అని గమనించాముగదా! ఫెడరల్ రాజ్యాంగంలో, కేంద్రంపాత్ర చాలా తక్కువ. పరిమిత రంగాల్లోనే వుంటుందని వారు గ్రహించి, రాష్ట్రాలకు ప్రాంతీయ స్యామ్యాన్ని (అటానమీ పూర్తిగా యిస్తారు. అది వికేంద్రీకరణకు మూలకందమైన చట్ట నిర్మాణరీతి. మనదీ ఫెడరల్ రాజ్యాంగమేనట. కాని రాష్ట్రాలకు రానురాను హక్కులు బొత్తిగా పోయి, మునిసిపాలిటీల స్థాయికి దిగజారి పోతున్నవి. అక్కడ వారది సహించరు. యిక్కడ మన రాష్ట్ర ప్రభుత్వాలు తలవగ్గి, భరించటమేకాక, ఆహ్వానిస్తున్నారు. మనదేశంలో అనాటమీ – ప్రాంతీయస్వామ్యం – నశించిపోతుంది. అక్కడ రోజులు గడిచినకొద్దీ వృద్ధి పొందుతుంది. అది శాసన నిర్మాణరీతులమీద ఆధారపడి వుంది. అమెరికాలో న్యాయస్థానాలకు కొన్ని రంగాల్లో ఎన్నికలు జరుగుతై, స్థానిక సంస్థల యెన్నికల అదనులో, స్థానిక కోర్టులకగు న్యాయమూర్తుల యెన్నిక జరుగుట గమనించాము. అట్లాగే చాలా రంగాల్లో యెన్నికల రీతి న్యాయస్థానాల్లో వుంటుంది. సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల నియామకం అధ్యక్షుడు చేసినా, దానిని ‘సెనేట్’ ఆమెదించాలి. అటార్ని జనరల్ నియామకాలు పార్టీ ప్రాతిపదికలమీద వుంటై. నేను లిటిల్ రాక్ పట్టణానికి వెళ్ళినప్పుడొక సంఘటన జరిగింది. అధ్యక్షుడు కెనడీ ఆ రాష్ట్రం – అర్కెన్ సాస్ – వచ్చాడు. రాష్ట్ర గవర్నరు ఫాబస్ రిపబ్లికన్ పార్టీవాడు – అంతేకాక, నీగ్రో వ్యతిరేకి, కెనెడీ సభకు వచ్చి, రొండు ముక్కలు అహ్వానం చెప్పి, తీవ్రంగా కెనెడీ విధానాల్ని విమర్శించాడు. గవర్నరుకు ఇట్లా చేయటం మర్యాదగా లేదని పత్రికలు కొన్ని, కొందరు రాజకీయవేత్తలు అన్నారు. రాష్ట్ర అటార్నీ జనరల్ గవర్నరు చర్యను బలపరుస్తూ ప్రకటన చేశాడు. అదీ వారి ధోరణి. హోగన్, మండేల్ మొదలైనవారితో మాట్లాడుతూ ‘మా దేశంలో మాదిరిగా, మీ దేశంలో గూడా, యేబది రాష్ట్రాలకు వర్తించే క్రిమినల్, సివిల్ ప్రొసీజర్లు వుండటం మంచిదికదా!’ అని నేనన్నాను. ‘దానివల్ల మీకు జరిగే మంచి యేముంది, మాకు కలిగే నష్టమేముంది’ అన్నారు. ‘ఏకరీతి విధానాలు (ప్రొసీజర్లు) వుండటంలో న్యాయ వాదులకు, వివిధ న్యాయస్థానాలకేగాగ, సుప్రీంకోర్టుకు, సుళువుగా, అనుకూలంగా వుంటుందిగదా’ అన్నాను నేను. ‘యిప్పుడు మేము యేమీ యిబ్బంది అనుకోవటం లేదు. ఒక దానిలో, కేంద్ర ప్రొసీజరు అంగీకరిస్తే, క్రమేణా అన్నింటిలోకీ కేంద్రంజోక్యం చేసుకొనే గుణం వుంది. ప్రాంతీయ స్వామ్యాన్ని భగ్నం చేస్తారన్న భయం మాకుంది’ అన్నారు. నేను సరేనన్నాను. వారి ధోరణిలో యిమిడి వున్న ప్రాంతీయ ప్రజాస్వామ్య వైలక్షణాన్ని గమనించాలి. అదే అమెరికన్ విధానంలోని ప్రత్యేకత, ప్రాంతీయ ప్రజాస్వామ్య గుణవైలక్షణ్యత. ‘పోతే లా ఆఫీసర్లనుగాని, న్యాయమూర్తులనుగాని, యెన్నిక చేయటంవల్ల పార్టీ భావుకతను, న్యాయస్థాన రంగంలోకి దింపటం అవుతుందిగదా, దానివల్ల న్యాయపరిరక్షణలో పార్టీతత్వం ప్రబలి నష్టం కలుగుతుందేమో’ నన్నాను. ‘మా అనుభవంలో మేమట్లా అనుకోవటం లేదు’ అన్నారు. ‘పార్టీల మధ్య వున్న వైషమ్య కారణంగా వచ్చే కేసుల్లో, మీ ధోరణి పాక్షికంగా ఉండి, పార్టీవైపుకు మొగ్గటం జరగవచ్చుగదా’ అన్నాను. కొందరు కాదన్నారు. కొందరు ఆ చిక్కులు రావని మూకభావంగా వాదించారు. కొందరు సందేహం వుండవచ్చును గాని, అనుభవంలో పెద్ద చిక్కులేమీ వ్యుత్పన్నం కాలేదన్నారు. మన అనుభవాలు భిన్నంగా వున్నై. మనదేశ వాతావరణం భిన్నంగా వుంది. అమెరికాలో, ‘కుటుంబ న్యాయస్థానాలు’ ప్రత్యేకంగా వున్నవి. అంటే, కుటుంబాల్లో, తండ్రికి తల్లికి మధ్య, బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య, భార్యాభర్తలకు మధ్య వచ్చే వైషమ్య వ్యవహారా లనన్నింటినీ పరిష్కరించటానికి ప్రత్యేకంగా ‘ఫామిలీ కోర్టు’లను నెలకొల్పారు. యీ కోర్టుల్లో న్యాయమూర్తినిలు జాస్తిగా వున్నారు. అసలు అమెరికాలో, యితర దేశాలలోకన్నా ఆడవారు న్యాయమూర్తినులుగా వుండటం జాస్తి. అక్కడ విడాకులగోల జాస్తి. పూర్వం ఒక సామెతలాంటి నానుడి వుండేది. ‘హాలివుడ్’ సినిమా కేంద్రంలో విడాకులెంత జాస్తిగా వుండేవంటే, నిన్నటి ఆమెను చూచి, రేపు మాపు ‘మిసెస్’ అంటూ ఆగి, తటపటాయించి, పేరు పూర్తి చేయవలసి వచ్చేదనేవారు. మన తటపటాయింపు చూచి ఆయమ్మ తానే పేరు మార్పువుంటే అందుకొని చెప్పేదట! ఆ స్థితి మారుతూవుంది. అయినా విడాకులు జాస్తి. ఎందువల్ల? నైతికంగా అమెరికా తక్కువ స్థాయిలో నున్నందువల్లనా? కాదు. నైతికంగా మనకన్నా తక్కువస్థాయి అని నేను అనుకోను. కారణం ఒకటి వుంది. అక్కడ పరిగణన వ్యక్తికం, ‘ఆమెను’, ‘ఆయనను’ ఒకరికొకరు వ్యక్తులనుగా ముందు గుర్తిస్తారు. అట్టి సమానస్థాయిగల వ్యక్తులు పెట్టుకొన్న సంబంధాన్ని ‘వివాహం’ అంటారు. ఒకరిని యింకొకరికి ‘యిచ్చి’ మనదేశంలో మాదిరిగా వివాహం చేయరు. యిద్దరూ పెండ్లి చేసుకుంటారు. వారిద్దరూ ప్రతిపత్తిగలవారు. యెవరి స్వత్వాలు వారివి. యెవరి వ్యక్తిత్వం వారిది. అందువల్ల, అట్టి వ్యక్తిత్వపు విలువలలో యేమాత్రం అపశ్రుతి వచ్చినా, విడాకులకు దారితీస్తుంది. భార్యగాని, భర్తగాని కుమిలి, కుమిలి మన దేశబంధాల్లో నలిగినట్లు నలగరు. భార్యాభర్తలు మాట్లాడుకోకుండా, మూతులు బిగించి మనసులు నొక్కి పెట్టుకుని, లోకం కోసం సంసారాల్ని యీదరు. వారికి సంసారాలు సాగరాలు కాదు. అది కేవలం వ్యక్తుల మధ్య వారు వారికై యేర్పరచుకొన్న సంబంధాలు. సమాన ప్రతిపత్తితో వుండే సంబంధాలు మాత్రమే అవి. విడాకులన్నీ యీ ఫామిలీ కోర్టుల్లో జరుగుతై, ‘నచ్చదు’ అని భార్యాభర్తల్లో యెవరైనా విడాకులు పొందవచ్చు. మనకు విడాకుల కొత్తహక్కులు శాసనం వున్నా, నిజానికి రావలసినన్ని కేసులు కోర్టుకు రావటంలేదు. న్యాయస్థానాల్లో వ్యక్తి హక్కుల పరిరక్షణ ప్రధాన పాత్ర వహిస్తుంది. దాని తరువాత, నష్టపరిహారపు వ్యవహారాలు జాస్తి. ఒక మునిసిపాలిటీవారు అవ్యక్తంగా ఒకరోడ్డు మీద గోతులు, గండ్లుపెట్టి ప్రయాణానికి యిబ్బంది కలిగించి, బాధకలిగిస్తే, బాధపడ్డ వ్యక్తి నష్టపరిహారానికి దిగుతాడుగాని కిమ్మనకుండా వూరుకోడు. అక్కడ, రాష్ట్రంలోను, సుప్రీంకోర్టులోని ‘పాపరు’ కేసులు గూడా వున్నై. ‘పాపరు’ అంటే కోర్టుకు కేసు దాఖలు నిమిత్తం చెల్లించవలసిన డబ్బులేనివాడు. 1932లో 32 పాపరు కేసులూ, 1963లో 1628 కేసులూ సుప్రీంకోర్టులో కలవని, కోర్టు వుద్యోగి కల్లియన్ నాతో జరిగిన చర్చల్లో తెలియజేశాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సాలీనా లక్షాడెబ్బది అయిదువేలు, రాష్ట్ర అపీలు కోర్టులలోని న్యాయమూర్తులకు సాలీనా 1,25,000 రూపాయలు, జిల్లా న్యాయమూర్తులకు 1,10,000 రూపాయలు జీతాలువున్నై. కాని న్యూయార్కు రాష్ట్ర కోర్టులో, కేంద్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తులకన్నా హెచ్చు జీతం యిస్తారు. 1963లో 28,000 కేసులు సుప్రీంకోర్టులో కలవు. వాటిలో 16,000 పరిహరింపబడినవి. యితర కోర్టుల్లో గూడా కేసుల పరిహరణ యీ నిష్పత్తిలోనే వుంటుంది. వివిధ రాష్ట్రాల్లో విభిన్న శాసనాలు జరగటంవున్నా, ఆయా రాష్ట్రాల వుమ్మడి అవసరాలు గమనించటానికీ, వివిధ రాష్ట్రాల్లో జరిగే శాసనాల్ని సమన్వయించటానికీ చికాగోలో కొన్ని కేంద్ర సంఘాలు పనిచేస్తున్నవి. యింటర్ స్టేట్ డిపార్టుమెంటు అనేదొకటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో జరిగే శాసనాలు, వుత్కృష్ట ఫలితాల్ని యిస్తే వాటిని గమనించి, తమ రాష్ట్రంలో పరిస్థితులకన్వయించి, తమ రాష్ట్రంలో తదనుబంధ శాసనాల్ని చేసుకోవటానికొక నిత్యనూతన ప్రయత్నం జరుగుతుంది. అది యీడిపార్టుమెంటు ద్వారా జరిగింప బడుతుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ప్రసిద్ధ న్యాయవేత్తలూ వుంటారు. శాసనాల సమన్వయ స్థితిమాత్రమేగాక, యీ డిపార్టుమెంటులో వివిధ రాష్ట్రాల మధ్య వరపిడి సమస్యలుంటే, యింటర్ స్టేట్ ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కారమార్గాన్వేషణ చేస్తారు. అంతకు మించితే, సుప్రీంకోర్టుకు ఆ సమస్య వెళ్ళుతుంది. అదే మాదిరిగా జాతీయ అటార్నీ జనరల్ సమాఖ్య ఒకటున్నది. వివిధ రాష్ట్రాలలోని అటార్నీ జనరల్స్ దీనిలో సభ్యులు. వీరు ఆయా రాష్ట్రాలలో శాసనాలమీద సలహాల నివ్వవలసి వస్తూవుంటుంది గనుక, యీ జాతీయ సమాఖ్యలో సమావేశమై, వారి వారి స్థాయిలో సమన్వయ రీతుల్ని, శాసన భావాల్ని ఒకరికొకరు నివేదించుకుంటూ, వొకరి అనుభూతుల్ని యింకొకరు పోల్చి చూసుకుంటూ వుంటారు. పై మూడు సమాఖ్యలు యెంతో సాహిత్యాన్ని తయారు చేస్తూ వుంటారు. దీనివల్ల భిన్న భిన్న రాష్ట్రాలు, అవసరాల అనుభవాల దృష్ట్యా, యేకత్వ స్ఫోరక దృష్టిని పొందగలగటం గోచరిస్తుంది. శాసనాల పటిమ, సాంఘికంగా వాటి జిగురులు గోచరిస్తవి. యిక్కడ మిత్రులు పోస్నర్, మన్.సన్.లతో గోష్ఠి చాలా ప్రయోజనాత్మకంగా వుంది. విశ్వవిద్యాలయానికి దగ్గరలోనే యీ కేంద్రాలు నిర్మింపబడినవి. న్యాయస్థానాలపట్ల అమెరికను ప్రజలకు మంచి గౌరవప్రపత్తులు కలవు. అవి ధర్మస్థలాలన్న అభిప్రాయాన్ని బాగా కలిగివున్నారు. మనదేశంలో ఒక కేసు కోర్టులో వుండగా మనం బయటి దాని విషయమై చర్చింపరాదు. ‘సబ్ జుడీస్’ అన్న సూత్రాన్ని పాటించి, అట్టి చర్చల్ని ఆపుతాము. అది మనకు బ్రిటిష్ వారసత్వం. కాని అమెరికాలో యిట్టి నియామకం, యిట్టి ‘లా’ లేదు. అందువల్ల, పత్రికల్లో, యితరత్రాకూడా ముఖ్యమైన కేసులు జరుగుతూవున్నప్పుడు చర్చలు జరిగి, భిన్నభిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ వుంటారు. అందుకే, ఎల్లెన్.రాయ్ అన్న రాబర్ట్ గోష్టాల్క్.ను నేను న్యూయార్క్.లో కలిసినప్పుడు, ఆయన 13వ డిశంబరు 1960లో జరిగిన ఎల్లెన్.రాయ్ హత్య గురించి మన కోర్టులు డెహరాడూన్.లో చేసిన నిర్ణయాలపట్ల నిస్పృహను చూపి, ‘దాని విషయమై మనమెందుకు ప్రచారం చేసి, వత్తిడి చేయగూడ’దన్నారు. ‘మాదేశంలో సబ్.జుడీస్ సంబంధ బాధలున్నవ’న్నాను. పాపం యెంతో దిగులుగా చూచాడు. వారి న్యాయరీతుల్లో, మన రీతుల్లోని వ్యత్యాస భావుకతలు యిట్టివి. న్యాయస్థానాలు ప్రజల హక్కులను, ప్రభుత్వపు అధికారాల నుండి కాపాడటంలో అత్యంత శ్రద్ధాసక్తులతో వుంటవి. రాజ్యాంగంలోని ప్రాథమిక, ప్రజాస్వామ్య సూత్రాలను దైనందిన జీవితంలో అన్వయించటం అక్కడి న్యాయస్థానాలు జాగృతి మీరిన కృషి చేస్తవి. రాజ్యాంగానికి న్యాయ స్థానాలే పెట్టని కోటలు, త్రవ్వని అగడ్తలు. అమెరికా ప్రజాస్వామ్య భావుకతలో న్యాయస్థానాలు ప్రధానమైన నాల్గు స్తంభాల్లో ఒకటిగా వ్యవహరించి, ప్రజాస్వామ్య సౌధ నిర్మాణాన్ని పటిష్టంగా అట్టిపెడుతున్నవి. *--*--* సాంఘిక సంక్షేమం అమెరికాలో ప్రభుత్వంకన్నా ప్రజలే ప్రయివేటు రంగంలో హెచ్చు పనులు చేసుకొంటారన్నప్పుడు, సాంఘికరంగాన్ని గురించి నిజానికి వేరే చెప్పనే అవసరం లేదు. ప్రతిగ్రామంలోనూ, పట్టణంలోనూ, నగరంలో అనేకంగానూ, సాంఘిక సంక్షేమాన్ని పరిశోధించి, పనులు చేయటానికి యెన్నో సంస్థలు వున్నై. యీ సంస్థలు స్థానికంగా నిర్మింపబడతై. దీనికొక రాజ్యాంగ బద్ధనిధి అంటూలేదు. మునిసిపల్, గ్రామఛార్టర్లలో గూడా వీటి ప్రమేయం యేమీలేదు. కాని, వివిధ రంగాల్లో పనిచేయటానికి సంక్షేమ సంఘాలు అనేకం వుండటమేగాక, యివి లేని చోట్లంటూ లేవు. పెద్ద నగరాల్లో, వీటికితోడు, కొన్నిచోట్ల వీటిలో భాగాలుగా, ‘అతిథిసత్కార సంఘాలు’ వున్నై. విదేశీయులు గాని, యితర ప్రాంతాల స్వదేశీయులుగాని, ఆయా పట్టణాలకు వచ్చినప్పుడు, వారికి వనర్లు, వారే. యే విషయాన్ని గురించి ఆసక్తి చూపి ఆయా కేంద్రాల్ని చూడాలంటే, వారుగా అవన్నీ చూపుతారు. యెంతగానో ప్రయాణాలను సుఖవంతం చేయటానికి సహాయపడతారు. యింకా తాము యెక్కువగా చేయలేకపోతిమని అంగలారుస్తారు. ‘అన్నపూర్ణకు నుద్ది యౌవనతని గృహిణి, అతిథులే తెర నడికిరేయైన బెట్టు భక్ష్యభోక్ష్యములు యింటనవ్వారిగాగ’ అన్న పెద్దనగారి ప్రవరుని భార్యలు ఆదేశంలో వేలకు వేలుగలరు. వారియింట అవ్వారిగా భక్ష్యభోక్ష్యములు కలిగివుంటారు. సేవాతత్పరత వారిలో మూర్తీభవించి ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కో నుండి నన్నొకనాడు ‘మ్యూర్ వుడ్’ చూపటానికి అతిథి సత్కార సంఘం యియ్యకొని, జానెట్ గ్రిజ్ బాక్ అన్న ఆమెను పంపారు. కాంటర్ బెరీ హోటల్.కు వచ్చి ఆమె నన్ను తోడ్కొని పోవలెను. మామూలుగా అమెరికాలో, యింగ్లండులో ఆచారం ఒకటుంది. మనం వున్న హోటల్ గదుల్లోకి మనసు పిలవటానికి వచ్చిన స్త్రీలు యెవ్వరూ రారు. అతిథులకుగల గదివద్ద వుండి ఫోనులో తెలియపరుస్తారు. లేదా, హోటలు ఫలాని గేటువద్ద సమయానికి వేచివుంటారు. వారొచ్చి, కారులో తీసుకుపోతారు. కొన్ని నగరాల్లో మగవారైనా అంతే. ఎందుకంటే, కారు ఆపటానికి వనర్లు లేని కష్టంవల్ల అది జరుగుతుంది. అయిదు నిమిషాలకు మించి కారు అక్కడ ఆపరాదు. ఆపితే పోలీసు ‘టిక్కెట్టు’ సంపాదిస్తారు. అంటే, పోలీసు వచ్చి, ‘’మీరు రూల్సుకు విరుద్ధంగా హెచ్చు వ్యవధితో కారు ఆపారు. రేపు ఉదయం ‘యిన్ని’ గంటలకు ‘యింత’ జరిమానా కట్టాలి” అని ఒక చీటి కారులో పెట్టి పోతాడు. మీతో మాట్లాడను గూడా మాట్లాడడు. మరునాడు వెళ్ళి సమయానికి ఆజరిమానా చెల్లించి రావాలి. లేకుంటే, తరువాత 24 గంటలకు అది రెట్టింపు అవుతుంది. తరువాత పోలీసులు కారుని జప్తుచేసి తీసుకుపోతారు. పోలీసు ‘టికెట్టు’ సంపాయించటం, కారుతోలే వారికి న్యూనతగా యెంచ బడుతుంది. చికాగోలో దేవాభక్తుని రామస్వామి నన్ను బజార్లో తిప్పుతూ, ‘నాకెప్పుడు పోలీసు టికెట్టు రాలే’దన్నాడు. అంటే, అతను శ్రద్ధగల డ్రైవరన్నమాట. పోతే, అసలు కథ, జానెట్ గ్రిజ్ బాక్ వచ్చింది. నేను గేటు వద్ద వేచివున్నాను. ఆమె కారులో యిద్దరం బయలుదేరాము. శాన్ ఫ్రాన్సిస్కో వుదంతాల్ని యెన్నింటినో ఆమె చెప్పుతూవుంది. ‘గోల్డెన్ గేట్ బ్రిడ్జి’ దాటి, వెళ్ళాలి. అది. ప్రపంచంలోకెల్లా స్తంభాలు లేని పెద్ద, మనోజ్ఞమైన వంతెన. రెండు ప్రక్కలా కొండలు, కొండల్ని కలిపి, ఒక వారధి కట్టారు. దీన్ని ‘వ్రేలాడే బ్రిడ్జి’ అంటారు. ప్రపంచంలో యే బ్రిడ్జి ఇంత పొడవున వుండి, మధ్యమధ్య స్తంభాలు లేకుండా వ్రేలాడేది కాదు. దీని పొడవు 1.7 మైళ్ళు. బ్రిడ్జి దాటి వెళ్ళాము. రిచర్డ్ సన్ బే దాటాము. అది పసిఫిక్ సముద్రంలో భాగం. ‘మ్యూర్ అడవి’ చూచాము. తర్వాత, టి. బ్రౌన్ అన్న మేరియా కౌంటీలోని గ్రామానికి తీసుకువెళ్ళింది. అక్కడ సముద్రంలోకి 60, 70 గజాల మేరకు వుపరిసౌధం నిర్మించిన ఒక చిన్న సుందరమైన హోటలుకు తీసుకువెళ్ళింది. ఆమెలా నేను సిగరెట్టు కాల్చనైతిని. ద్రవం సేవించనైతిని. యితరాలు తింటూ అనేకమైన విషయాలు చర్చించాము. ఆమె తెలివిగలది. డాక్టరు భార్య, పిల్లవాడొకడు. ఆనాటి సాయంత్రం మధురమైంది. సముద్రంపైన కూర్చున్నాము. చక్కటి ప్రశాంత వాతావరణం. చల్లటి గాలి. సముద్రంలో బోట్లమీద పందేలు పెట్టుకొని, నీటిమీద స్కేటింగ్ మాదిరిగా పరుగులిడు జనం. హోటల్లో యెవరి టేబుల్ దగ్గర వారు గోలకాని గోష్ఠిలో వున్నారు. మా గోష్ఠి మాది. అమెరికా స్త్రీల స్వభావాన్ని అర్థం చేసుకోవటానికి లోతుగా చర్చించే చోట్లు. వారెన్నో విషయాలు, సరళంగా చర్చిస్తారు. ఆమెను కదిలించి చూచాను. నిబ్బరంగా నిలబడింది. అట్లాగే టెన్నిసీలో, నాక్సువెల్లీ దగ్గర నుండి, మరో గ్రామానికి మిస్ లీఫిష్ నన్ను విందుకు రాత్రి తీసుకువెళ్ళింది. ఇద్దరం రాత్రి 12 గంటల పై దాకా అనేక విషయాల్ని చర్చించాము. ఆమె వివాహం చేసుకోదలచలేదన్న వనిత. యెన్నో విషయాల్ని చర్చించగా, ‘మీరు మాదేశంలో వుండిపోయి, మీ వాదాలకొక వుద్యమం కట్టితే, మీకు చాలబలం, ప్రాపకంవస్తవి. నాబోటి వాళ్ళం అనేకులం చేరుతాము’ అన్నది. జానెట్ గ్రీజ్ బాక్ అంతదూరం రాలేదు కాని, యించుమించు నా భావాలతో సంపూర్ణ అంగీకారాన్ని వ్యక్తం చేసింది. ఆమెతో విందు కాగా, బిల్లు నేనివ్వబోయాను. గద్దించినట్లు, లేచి నిలబడి, ‘మీరునాకు అతిథులు నేనేయివ్వాలి’ అన్నది. అందరూ మా వైపు చూచారు. ‘సరే’ అన్నాను. వారి కారుమీద బోలెడు దూరం త్రిప్పి, భోజన భాజనాలకు వారే వెచ్చించి, మా హోటల్.కు జేర్చి, ‘మిమ్ము యింత త్వరలో వదలవలసినందుకు నాకు చాలా విచారంగా వున్న’దని ముఖంలో దైన్యాన్ని చూపగల ఆతిథ్య ధర్మాన్ని వారు నిర్వహిస్తారు. యిది అమెరికన్ల గుణాల్లో ఒకటి. అమెరికా సాంఘిక జీవితం యింత అర్థవంతం కావటానికి ప్రధానకారణం స్త్రీలే. వారాసమాజానికి అందాన్ని, ఆనందాన్నేగాక, ఒక వుత్కృష్టమైన జిగిని కల్పన చేస్తారు. ఆ జిగి ప్రధానంగా, ప్రాయికంగా సాంఘిక సంక్షేమ రంగంలో ప్రస్ఫుట మౌతుంది. లిటిల్ రాక్ చిన్న పట్టణం. లక్షన్నర జనాభా, ఫ్రెస్నో రొండున్నర లక్షల జనాభాకలది. మిల్ వాకీ యింకా పెద్దది. యివిగానీ, మరీ పెద్ద పట్టణాలు గాని, యింకా చిన్న పట్టణాల్నిగాని తీసుకోండి. సాంఘిక సంక్షేమ సంఘాలు బహుధా కలవు. మచ్చుకు లిటిల్ రాక్ తీసుకుంటాను. 1957లో నీగ్రోసమస్యల్ని వుబికించి, గవర్నర్ ఫాబస్.వల్ల రగడలు పొందిన రాష్ట్రం. రార్కెన్.సాస్ దక్షిణాది రాష్ట్రం. అందుకే అక్కడికి వెళ్ళాను. ఒక రోజల్లా సాంఘిక సంక్షేమ కార్యకలాపాలే చూచాను. అక్కడ 123 శాఖలలో సాంఘిక సేవా సంఘాలు స్థాపించబడినై, అంటే లిటిల్ రాక్ పట్టణంలో ఆ సాంఘిక సంక్షేమ సంఘం 123 రంగాల్లో కృషి చేస్తుంది. యీ 123 శాఖల నుండి, శాఖకు యిద్దర్ని యెన్నుకుంటారు. అట్లా యెన్నికైన 246 ప్రతినిధులు కూడి, ఒక డైరక్టర్ల బోర్డునెన్నుకుంటారు. ఆ డైరెక్టర్లు, యీ ప్రతినిధుల సలహా సంప్రదింపులతో, సంఘకార్యాల్ని నిర్వహిస్తారు. యీ సంఘం ప్రజల నుండి, వివిధ సంఘాల నుండి నిధి సేకరణ చేస్తుంది. సాలీనా వతనగా యిచ్చేవారు. చాలమంది వున్నారు. దీనిలో బలవంత బ్రాహ్మణార్థం యేమీలేదు. ఎవరికి వారు వుచితంగా, వుదారంగా యిచ్చే పద్ధతి తప్ప యేమీ లేదు. 1962లో వివిధ సంఘాలు 5 లక్షల రూపాయలు ప్రోగుచేశారు. 1963లో 7 లక్షలు ప్రోగు చేశారు. దానికి బడ్జెట్.లో వుప సంఘంవేసి, యేయే పనులకు యెంతెంత కేటాయించవలసినదీ నిర్ణయిస్తారు. మూలధనంగా కొంత వుంచుతారు. దాన్ని, అవసరాన్ని బట్టి అదనపు వ్యయం కావలసిన రంగంలో వినియోగిస్తారు. యీ 123 కక్ష్యలలో, ఆరోగ్యానికి కొన్ని రంగాల్ని, విద్యకు కొన్ని రంగాల్ని, చిన్నపిల్లలకు, వృద్ధులకు, విద్యార్థులకు, వికలాంగులకు, నీగ్రో సమస్యకు (యిప్పుడు దీనిని ‘మానవ సంబంధాల సమస్య’గా పరిగణిస్తున్నారు). మురికి ప్రాంతాల అభివృద్ధికీ, అనేకమైన వాటికి వినిమయం చేస్తారు. ఆయా రంగాలలో అభిరుచి కల్గిన వారు వుపసంఘాల్లో వుంటారు. వారి పని ధోరణి ఒకటి రొండు మచ్చుకు పరిశీలిద్దాము. ఆనాడు నేనొక వుపసంఘ సమావేశానికి హాజరైనాను. పాతిక మంది వచ్చారు. సగం స్త్రీలు, ఆనాటి చర్చాంశము, ‘బడులలో నుండి కొంతమంది పిల్లలు సంవత్సర మధ్యకాలంలో యెగగొట్టి పరారవుతున్న కారణాల్ని’ పరిశీలించటం. దీన్ని ‘ఫాలౌట్’ అంటారు. వివిధ రకాలైన బడుల నుండి వుపాధ్యాయుల రిపోర్టులు వచ్చినై. ఆ బిడ్డల తల్లిదండ్రులకు సాంఘిక సంఘం ఉత్తరాల్ని వ్రాస్తుంది. ‘మీ బిడ్డ యే కారణం చేతనో బడికి సరిగా హాజరు కావటం లేదట. ఆ విషయమై మీతో కొన్ని విషయాల్ని చర్చించవలసి వుంది. దయతో రాగలరా’ అని మర్యాదగా, జాగ్రత్తగా వ్రాస్తుంది. ఆ తల్లిదండ్రులు వస్తారు. సమస్య చర్చింపబడి, కారణాల్ని గ్రహిస్తారు. బిడ్డతో చర్చిస్తారు. దానికైన అవసర చర్యల్ని తీసుకుంటారు. డబ్బులోటుగాని, గుడ్డల లోటుగాని, తల్లిదండ్రుల వికారాలు గాని, బిడ్డయొక్క వికారాలుగాని, తప్పుడు సాంగత్యంగానీ, లేక, బిడ్డలో యేదేని మానసిక వికారం వుండటం గాని, మరేదన్నా కానీ, అన్నీ పరిశీలించి, దానికయిన ఖర్చు పెట్టి, ఆకుర్రలు బడికి సరిగాపోయే పరిస్థితుల్ని కల్పిస్తారు. ఖర్చుకు దడవరు. కథ కుదుటపడాలి. మరొక విషయం చూద్దాం. ఒకరియింట్లో, ఆమెగారో, ఆయనో రోగిష్టిగా వుండి, సరిగా చికిత్స పొందలేని స్థాయిలో పడి, కుటుంబం నలతగావుంది. నిపుణులైన డాక్టర్లు, సాంఘిక సంక్షేమ సంఘం తరఫున పరిశీలిస్తారు. అయిన ఖర్చు పెట్టి, ఆ చిక్కును పరిష్కరిస్తారు. ప్రత్యేక ఆసుపత్రికి పంపి, రోగ నివారణ చేస్తారు. ఆ కుటుంబాన్ని కుదుటపరుస్తారు. ఆ యింటి దీపం నిలబెట్టుతారు. ఆ బిడ్డలకు వుత్తేజాన్ని కలిగిస్తారు. శోకాంధ తిమిరావళి కప్పిన ఆ యింటిని ఆనంద కళికావళిగా చేస్తారు. యిట్లాగే, ఒక ప్రాంతం మురికి ప్రాంతంగా వున్నదనుకోండి. అక్కడ పట్టణపాలన శ్రద్ధ చేయలేదు. దానివిషయమై యీ సాంఘిక సంక్షేమ సంఘం దర్యాప్తు చేసి, మునిసిపాలిటీకి ప్రత్యేకంగా చెప్పి, తామా అవసరాన్నిబట్టి కొంత మూల్యాన్ని గూడా యిచ్చి పనిని తొందరగా నిర్వహింపజేస్తారు. మరొకచోట బడిలో కొన్ని వనర్లు తగ్గితే, దానికై యీ సంఘం కృషిచేస్తారు. నీగ్రో సమస్యను, మానవ సంబంధాల సమస్యగా యెంచి 1963కి బడ్జెటులో లక్ష రూపాయల్ని కేటాయించారు. దానిని ప్రత్యేకంగా నీగ్రోసమస్యలోని న్యూనతలను పోగొట్టడానికి, వారికి వనర్లు తగ్గితే అవి కల్పన చేయటానికి, వారి బిడ్డలకు తగ్గిన సౌకర్యాల్ని చిక్కించటానికి కృషిచేస్తారు. విజ్ఞాన వికాసవ్యాప్తికి కృషి చేస్తారు. నాటకాలు, డాన్సులు, పాటలు, ఆటలు, చిత్రలేఖనం, పిల్లల ప్రత్యేక కార్యక్రమాల్ని పెట్టిస్తారు. తెనాలిలోని ‘బాలకళా పరిషత్తు’ విషయం చెప్పి, వారి కార్యక్రమాల్ని వివరించాను. విని, సూచనలు చేసి, దాని పెంపుదలకు ఆస్త చూపించారు. యిదీ అదీ అవీ కాకుండా, మానవజీవితంలో ఏఏరంగంలో కృషి అవసరమో, ఆయా రంగాల్లో చేస్తారు. నిపుణులు కృషికి దిగుతారు. సంఘంలోని అవసరాల్లో చాలావాటికి, సంఘీయులు యీ సాంఘిక సంక్షేమ సంఘాలవైపుకే చూస్తూవుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వ కృషికి వీరి కృషి ప్రత్యామ్నాయంగా వుంటుంది. వున్నది కూడా. అమెరికా ప్రజలు, ప్రతిదీ ప్రభుత్వం చేసే విధానాలపట్ల వ్యతిరేక భావాన్ని కలిగి వుండటానికి కూడా, సంక్షేమ సంఘాలు కావించే కృషి ప్రధానంగా వ్యుత్పన్నమైన వాతావరణమే కారణం కావచ్చు. దానివల్లనే, అక్కడి ప్రజలు ప్రతిదానికీ ప్రభుత్వంవైపుకు చూడక, ప్రతి అవసరానికీ ప్రభుత్వం చేయలేదని చెప్పక, తమకు తామే చేసుకోవాలని, ఆత్మాశ్రయ రీతుల్లో నడవటం అలవాటు చేసుకున్నారేమో! కాబట్టి, సమాజంలో కొన్నాళ్ళపాటు వరవడిగా జరుగుతున్న కార్యకలాపాల ప్రభావం, సమాజంలో ప్రగాఢంగా పాతుకొనిపోయి, దానివల్ల నూతన సాంఘిక పరిణామాలు దృక్పథాలు కలగటం కద్దు. అట్టి పరిణామాలకు అమెరికాలోని యీ సాంఘిక సంక్షేమ సంఘాలు దారి చూపినై. ఈ సంఘాల కృషివల్ల వివిధవర్గాల్లో సామరస్య భావదీప్తి కలుగుతుంది. పలువులు పలుసార్లు కలిసిన కారణంగా, పలువిధ కార్యక్రమాల్ని చర్చించిన కారణంగా, సమాజంలో కలిసే నూతన పరిణామాలకిది కారణంకాగా, ఆ పరిణామాల ప్రభావం సమాజంలో ప్రభంజనం లాగా వీచి, మార్పుల్ని, చేర్పుల్ని, కూర్పుల్ని చేయ గలుగుతుంది. చిన్న చిన్న పట్టణాల్లో, పట్టణానికంతకూ ఒకే సాంఘిక సంక్షేమ సంఘం, వివిధరకాలతో పనిచేస్తుంది. పెద్ద పెద్ద నగరాల్లో, ప్రాంత ప్రాంతానికొక సంఘంగా, విడివిడిగా పనిచేస్తవి. చిన్న పట్టణాల్లో, ఈ సంఘాల ప్రతినిధులు సమావేశమై తామెరిగిన పట్టణాన్ని వీధులవారీగా మనోవీధుల్లో పర్యవేక్షిస్తూ, ‘వారింట యిది చిక్కు, వీరింట యిది యిబ్బంది’ అంటూ, పట్టణాన్ని అంతా కలయచూస్తారు. ఇబ్బందుల్ని వుల్లేఖిస్తారు. పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. అందువల్ల పట్టణంలోని చిన్నా, పెద్దా, మంచి, చెడ్డ విషయాలన్నీ వారి దృష్టికి రావటంతో, వస్తున్నపని దానికి సంబంధించిన వారికీ తెలియటంతో ఒకానొక సాంఘిక క్రమశిక్షణా భావం దాని అంతట అదే సామాజిక స్థాయిలో వ్యుత్పన్నమై, సమాజంలో ఒక రకమైన నైతిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ సాంఘిక సంఘాల కృషిలోకల్లా ఈ భాగం చాలా వుదాత్తమైనది. దీని ప్రభావం బాగా గమనింపబడినది. కాని, పెద్దపట్టణాలలో ఈ ప్రభావం చాలటం లేదు. అందువల్ల క్రమశిక్షణ లేని కొన్ని భాగాలు ఆయా నగరాల్లో తయారౌతున్నవి. పిల్లల వికారసమస్యలు కూడా యిందులో భాగంగా తయారై కూర్చుంటున్నవి. అమెరికా ప్రజల జీవితంలో మరొక దిగ్భ్రాంత సన్నివేశం వుంది. కౌటుంబిక జీవనంలో బిగుమానం తగ్గుతున్నదేమోనన్న సమస్య దీనికి ప్రధానం. యీ సాంఘిక వుద్యమం కొంత బిగుమానం తెచ్చినా, ప్రధానసమస్య మరొకటి వుండనే వుంది. 18 యేళ్ళ లోపువారు ఏడుకోట్లుదాక బిడ్డలున్నారు. వారిలో 30 లక్షల దాకా విడాకుల కుటుంబాల్లో చిక్కిన బిడ్డలున్నారు. 2 లక్షల దాకా పెంపుడు కుటుంబ గృహాల్లో వుంటారు. ఒక లక్షదాకా పబ్లిక్, ప్రయివేట్ సంస్థల్లో వుంటున్నారు. కాని, సాలినా 4 లక్షల దాకా బిడ్డలు జ్యూవైనైల్ కోర్టులకు తరలింపబడుతున్నారు. ఈ లెక్కలు చూస్తూవుంటే, నిబ్బరంగా వుండేవారికై నాగుండె జారుతుంది. పెంపుడు రక్షణ యిచ్చే సంస్థలు, పబ్లీక్, ప్రయివేటుగా పనిచేసేవి 2500 దాకా వున్నై. సాంఘిక సంక్షేమ కృషిలో యిదొక ముఖ్య ఘట్టంగా వుంటుంది. ఇవి గాక ఫామిలీ సర్వీసు సంస్థ అని మరొకటి వున్నది. దానికి అనుబంధ సంస్థలు 350 దాకా వున్నవి, ఈ రెండు రకాల సంస్థల్ని పరిశీలించి చూచాను. యేర్పాట్లు బాగా అమెరికన్ పద్ధతిలో చేశారు. బిడ్డలకు మాతృ, పితృ పరిష్వంగ సుఖాలు, మానవతకు చెందిన కౌటుంబిక స్థాయి తప్ప, తతిమ్మా వనర్లు వున్నై. కాని భవిష్యదమెరికాకిదొక సమస్యగా ప్రధాన సమస్యగా వుండితీరుతుంది. పిల్లల మీద శ్రద్ధ చేయవలసిన అవసరాన్ని యిప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు. అమెరికను సమాజంలో విడాకులు జాస్తి. బిడ్డలున్న కుటుంబాల్లోనూ వుంటున్నవి. దీనికి తోడు బిడ్డలు 15, 16 సంవత్సరాల వయస్సుకలవారు కాగానే, వారిని వారిమీదనే వదిలివేసే అలవాట్లు వుండి, యీ సమస్యను క్లిష్టస్థితికి లాగుతున్నై. వనర్లు, పుష్కలత వుండటం సమస్యను గడ్డువారుస్తుంది. విడాకులు బీదలరంగంలో, మరీ భాగ్యవంతుల రంగంలో జాస్తి, మధ్య తరగతుల్లో క్రమానుగతంగా తగ్గిపోతుంది. యీ మధ్య తరగతులు బాగా కుదురు కుంటున్నవని పలువురు చర్చల్లో చెప్పారు. ఆదినుంచి సాంఘిక పరిణామం. దీని విషయమై ఆమెరికన్లలో రానురాను శ్రద్ధాసక్తులు పెరుగుచున్నవి. యీ విషయాలన్ని ‘జాతీయ సాంఘిక సంక్షేమ అసెంబ్లీలో చర్చిస్తారు. దీనిలో జాతీయస్థాయిలో కృషిచేసే వాలంటరీ సంఘాలు 80 పాల్గొంటవి. ఫెడరల్ ప్రభుత్వ యేజన్సీలు వుంటవి. ప్రజల శ్రేయో విషయిక ప్రణాళికలిందు చర్చింపబడి, రూపొందింపబడతవి. అమెరికా సాంఘిక జీవితంలో యిదొక మహత్తర పాత్రను నిర్వహిస్తుంది. యిందులో స్త్రీలపాత్ర జాస్తిగా వుంటుంది. యిట్టి సాంఘిక కార్యకర్తల సమావేశాల్లో పాల్గొని, లిటిల్.రాక్.లో ఫ్లెచర్ మిల్లర్ గారింట, భోజనానంతర గోష్ఠికి పిలిచారు. రాత్రి 7-30 గంటలకు మాయింట గోష్ఠి అన్నారు. భోజనానంతరమో, కాదో నాకు సందేహం కలిగింది. కాని, వారు మామూలుగా రాత్రి భోజనం 5.30, 6 గంటలకే చేస్తారు గనుక వూహించి, కాదనుకొని, నాభోజనం నేను శాన్ పెక్ హోటలులో చేసి 6-30కు సిద్ధంగా కూర్చొన్నాను. ఫ్లెచర్ మిల్లర్ వచ్చి, తీసుకువెళ్ళారు. పదిమంది స్త్రీలు నలుగురు పురుషులు చేరారు. కవులు, న్యాయవాదులు, రచయితలు, రాయబారులు వున్నారు. చిన్నదయినా సత్తాగల జట్టు. జేన్ అన్న కవయిత్రి ‘మీదేశంలో విడాకులు వున్నవా’ అంది. ‘వున్నవి’ అన్నాను నేను. ‘విడాకులిచ్చిన స్త్రీలు సహజంగా పునర్వివాహం చేసుకుంటారా’ అంది ఆమె. ‘విడాకులిచ్చిన స్త్రీలపట్ల మీ సంఘం యెట్లా చూస్తుంది’ అన్నది మరొక కవయిత్రి. ‘విడాకులే మా దేశంలో తక్కువ. మా రాష్ట్రంలో 1949 నుండి మాత్రమే విడాకులు శాసనబద్ధంగా వచ్చినవి. దేశవ్యాప్తంగా 1956 నుండి మాత్రం వచ్చినవి’ అన్నారు. ‘యింతేనా’ అన్నారు వారందరు. ‘విడాకులు యిచ్చిన స్త్రీకి సమాజ గౌరవ ప్రతిపత్తులు లేవు’ అన్నానో లేదో.... ‘యింత ఘోరమైన సాంఘిక వ్యవస్థా’ అన్నారు. ‘విడాకులిచ్చిన స్త్రీలు పునర్వివాహం చేసుకోవటం వుంది. చాలా అరుదు. కాని క్రమేణా స్థితిగతులు మారేవాతావరణం వస్తూవుంది’ అన్నాను. ఒకరి మొఖం ఒకరు చూచారు. మిల్లర్ భార్య, ‘మీ దేశంలో విడాకులిచ్చిన వారి బిడ్డల్ని పోషించే సంస్థలేమైనా వున్నవా?’ అన్నది. లేవు. కాని కొన్నిచోట్ల శిశుపోషణాలయాలు యిప్పుడిప్పుడే ప్రభుత్వస్థాయిలో తలలెత్తుతున్నవన్నాను. ‘మీ దేశంలో యింగ్లీషు దేశభాషా’ అన్నదొక రచయిత్రి. ‘కాదు రాజ్యాంగంలో 14 భాషల్ని జాతీయ భాషలుగా అంగీకరించారు. హిందీని 1965 అనంతరం అధికార భాషగా అంగీకరిస్తారు. ఇంగ్లీషు క్రమేణా వెనక్కు నెడుతున్నారు’ అన్నాను. ‘ఇంగ్లీషువారు పోయారుగదా, యింగ్లీషు భాషమీద యింకా అక్కసు దేనికి, దాన్నే వుంచుకోరాదా’ అన్నాడొక రచయిత. ‘యింగ్లీషు పరాయి భాషగా యెంచి దేశభాషగా దాన్నీ యెంచక, మరొక దేశభాష యిప్పుడు యింగ్లీషు నిర్వహించే పాత్రను నిర్వహించాలి. లేకుంటే, దేశానికి గౌరవ ప్రతిపత్తులు వుండవన్న వాదన హెచ్చుమంది చేస్తున్నారు’అన్నాను. ‘హెచ్చుమంది అన్నా అది సబబు కాదేమో... ‘నన్నదొకామె. ‘ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలమేగదా గరీమ సత్యాన్ని పొందేది’ అన్నాను. ‘అవును, కాని........’ అని సాగదీశాడొకడు. ‘యింగ్లీషు స్థానే హిందీనే పెడతారా...’ అన్నదొక రచయిత్రి. ‘అవును అదే రాజ్యాంగ నిర్ణయం. కాని దక్షిణాదిన, బెంగాలులో హీందీని ప్రవేశపెట్టే విషయంలో అంగీకారం లేకపోగా, తీవ్ర వ్యతిరేక వుంది. భాషా విషయాలు కేవలం మెజారిటీని బట్టికాక, జనాల ఆమోద భావాన్నిబట్టి పోవాల’న్నాను. ‘అవును’ అన్నారు అందరూ. ‘కాని యింగ్లీషు పోతే, మమ్ము అంతర్జాతీయ రంగంలో కలిపే భాష యేముంది’ అన్నారొకరు. ‘రష్యాకి యేముంది... చైనాకి యేముంది...’ అన్నాను. ‘కాదు, వారికి అసలు లేనేలేవు. మీరు వున్నదాన్నీ వూడగొట్టుకోవడం దేనిక’న్నాడొక మిత్రుడు. ‘అధికార భాషగా, యింకా చాలాకాలంగా యింగ్లీషు వుండటం మంచిదని నేను అభిప్రాయ పడుతున్నా’నన్నాను. అందరూ అటూ యిటూ చూచి చల్లబడ్డారు. ‘మీ దేశంలో అనేక భాషలున్నవి కదా, ఒక భాషలోని వుత్తమ రచనల్ని మరొకరెట్లా గ్రహిస్తున్నా’రన్నది ఒక కవయిత్రి. ‘కష్టంగానే వుంది. అనువాదాలు తప్ప మార్గాంతరం లేదు. అవిగూడా హెచ్చుగా జరగటం లేదు. కొద్ది ప్రయత్నాలు అక్కడక్కడా ఉంటూవున్నవి. అవి చాలవు. యింకా పెద్ద యెత్తున ఆ ప్రయత్నం చేయాలి’ అన్నాను. అంతలో ఒకరు ‘యిండియన్లు యింగ్లీషులో బాగా రాస్తారే, అదే వారు తమ భాషగా యెందుకు స్వీకరించరు...’ ‘యింగ్లీషు మా భాషగూడా కాక, మాకు 13 మాతృ భాషలున్నై. మా దేశం బహు భాషా రాష్ట్రాల, బహుజాతుల కూడలి. యింగ్లీషు మాకు, ప్రభుత్వ భాషగా, అందరినీ అన్వయింపజేసేభాష. కాని, కథంతా అందులో జరగవీలులేదు. వివిధ రాష్ట్రాలు ఆయా భాషల్లో వ్యవహరిస్తూ, అంతర్రాష్ట్ర భాషగా చాలాకాలం యింగ్లీషు వుంచాలని మాబోటివారి అభిప్రాయం’ అన్నాను. యిదెంతో కష్టంగా ఉన్న మార్గమని వారందరూ అంగీకరించారు. యిట్టి కుటుంబ సమావేశాల్లో వారు మనల్ని యెరిగినా, మనం వారిని యెరిగినా. ఒకనాడు లాస్ ఏంజల్సులో ఫండర్ గారి యింటికి వెళ్ళాము. భార్యా భర్తలు న్యాయవాదులు. కొడుకులిద్దరు, ఒక కోడలు న్యాయవాదులు. నేనూ చేరాను. ఆనాటి విందు మనోహరమైంది. టెలివిజన్ శాఖ నుండి, కళాకారులు, కవులు, డాక్టర్లు, మహిళలు పదిమంది వున్నారు. ఫెండర్ తల్లి 87 ముసలామె వుంది. ఆమెకు తెలిసినన్ని విషయాలు యిండియాను గురించి అక్కడ చాలమందికి తెలియవు. ఆమె నా యింగ్లీషు మీద పెద్దగా వ్యాఖ్యానం చేసి, ‘యింగ్లండులో చదువుకున్నావా?’ అని అడిగి, ‘నీవు యింగ్లీషులో ఆలోచిస్తావా, లేక, మాతృభాషలో ఆలోచిస్తావా’ అని అడిగింది. ‘యింగ్లీషులో మాట్లాడితే యింగ్లీషులో, మా భాషలో మాట్లాడితే అందులోనే ఆలోచిస్తానన్నాను.’ తెలుగు పద్యాలు చదివించుకొన్నారు. నాకన్నా బాగా చదివే, పాడేవారి మాటలు వినిపిస్తానని, మోదుకూరి జాన్ సన్, అత్తోట రత్న కవులు రికార్డు చేసిన టేప్ తీశాను. వారు మరీ మెచ్చారు. అంతా నిశితంగావిని, ‘యెంత సుందరంగా వుంది’ మీ భాష అన్నారు. తెలుగును ‘తూర్పు దేశాల యిటాలియన్ భాష’ అంటారని నేను చెప్పగానే, ఒక ఇటలీ భాషా పండితుడు లేచి, ‘అవును’ అన్నాడు. అందరం నవ్వుకొన్నాము. నేను తెలుగులో ఒక పద్యం వ్రాసి చదివి, వినిపించి, అర్థం చెప్పి వారికి రొండు భాషల్లో వ్రాసి యిచ్చాను. ఒకరిద్దరు అక్కడే యింగ్లీషు పద్యాలు వ్రాశారు. పోటీగా చదవగా, మనకే యెక్కువ మార్కులు వేశారు. మన దేశంలోని కళను గురించి, అజంతా, ఎల్లోరాలను గురించి ఒక కళాకారుడు ప్రశ్న వేశాడు. ‘బౌద్ధ యుగంలో మీ దేశంలో కళల ప్రదుర్బావం బాగా వుండటానికి కారణమేమిటని’ అడిగాడు. ‘మా దేశంలో వున్న కళా, శిల్ప సృష్టుల్లో బౌద్ధ, ముస్లిం యుగాల్లోనే మంచి విజృంభణ జరిగింది. హిందూయుగంలో కవితలమీద, తత్వాలమీద హెచ్చుగా కృషి జరిగింది’ అన్నాను. తలవూచి, ‘నిజమా!’ అన్నాడు. అవునన్నాను. ‘బ్రిటిష్ యుగంలో యిట్టి విజర్ లేదా?’ అన్నదొకామె. ‘జరగకేమి, జరిగింది. బ్రిటిష్ యుగం కళలకు, కవితలకు, శిల్పాలకన్నా విద్య పెరిగిన యుగం’ అన్నాను. ఆశ్చర్యంతో చూచారు. ‘అంతే కాదు, ప్రాచీనమైన సంస్కృత రచనల్ని ప్రజలకందరకు వ్యక్తం చేస్తూ అనేక రచనలు వచ్చినై, అవి రాకుంటే, భారతీయ ప్రతిభ యింతగా విజ్జరాల్చేదికా’దన్నాను. అందరూ ఆశ్చర్యచకితులైనారు. ‘అయితే బ్రిటిష్ వారివల్ల మీకు లాభమే జరిగింది’ అన్నారు కొందరు. ‘మీకు జరిగినట్టేమాకూ లాభనష్టాలున్నై. మీరూ మేమూ బ్రిటిష్ సామ్రాజ్యవాద దాస్యం నుండి బయటపడ్డ వాళ్ళమేగదా! కాని, మా పూర్వ సాహిత్య ప్రచారం వారి వల్లనే హెచ్చుగా జరిగింది. దానికి వారికి కృతజ్ఞులం’ అన్నాను. అక్కడ సాంఘిక సమస్యల మీదికి తిరిగింది చర్చ. ‘మీ దేశంలో కదురు, నెమ్మదికన్నా వేగం జాస్తి కావటంతో, పిల్లలకు వికారాలూ, పెద్దలకు విడాకులు వస్తున్నవని నా వాళ్ళు అనుకుంటారు’ అని అన్నాను. కొందరు రేచుక్కలలాగా నన్ను కాట్లు వేయబోయారు. కొందరు తలలు పంకించారు. కొందరు మిన్నకున్నారు. మొత్తం మీద చర్చలో, అంగీకరించారు. ‘మీ దేశంలో విడాకులు మరీ బీదల్లో, మరీ ధనికుల్లో జాస్తికదా’ అన్నాడు. ఫెండర్ తల్లి అవునన్నది. ఫెండర్ కాదన్నాడు. ఫెండర్ భార్య అవునన్నది. మరొక కవీ అవునన్నాడు. ‘మీకీ ఉదంతం యెక్కడిది’ అని పృచ్ఛించిందొకయావిడ. ‘ఫ్రెజ్నోలో ఒక మిత్రుడు చర్చల్లో వ్యక్తం చేశాడ’న్నాను. ‘అయితే, మన సంభాషణలన్నీ సాంకేతికంగా రికార్డు అవుతున్నట్లే, నన్నదొకామె’ ‘అవసరమైన మేరకు’ అన్నాను. ఒకనాడు ప్రఖ్యాత రచయిత యిర్వింగ్ స్టోన్ యింట వున్నాను. బీవర్.లీ కొండలమీద చిన్న యిల్లు. అమెరికాలోని రచనల్లో సాంఘికంగా యితివృత్తంగల రచనలను గురించి, స్టోన్ రచనా పద్ధతులను గురించి చర్చచేశాము. స్టోన్, ఆయన సతీమణి, ఫెండర్ సతీమణి, నేను వారి కొలనులో స్నానం చేశాము – కాదు, క్రుంకులాడాము. ఆనాడు లాస్ ఏంజల్స్.లో 109 డిగ్రీల వేడి వుంది. వారి సాంఘిక స్వభావ, విభావాల్ని అటువంటి సన్నివేశాల్లో, సంభాషణల్లో గ్రహించవచ్చు. యిటువంటి వెన్నో వున్నై. సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో యీ యిండ్ల సమావేశాలు అత్యంత కీలకపాత్ర వహిస్తవి. యిక్కడ జరిగిన చర్చలలో వ్యుత్పన్నమయ్యే సమస్యలు, సంగతులు సాంఘిక సంక్షేమ రంగంలో చర్చిస్తారు. అమెరికా సమాజ జీవితానికి వికాసాన్ని, వెన్నెలను యిచ్చేది సాంఘిక సంక్షేమ కృషే! *--*--* వారి వాజలు అమెరికాలో హెచ్చుగా మనం వినేమాట ఒకటి వుంది; మా దేశంలోని విద్యావిధానం, పత్రికలు, స్థానిక సంస్థలు, న్యాయ స్థానాలు, సాంఘిక సంక్షేమ శాఖలు అనేవి మా ప్రధాన వాజలు – అని. వీటినే వారు తమ ప్రజాస్వామ్యపు పునాదులనుగా యెంచుతారు. వాటిమీద ప్రజలకు అచంచల విశ్వాసం వుంది. కొందరు ప్రత్యేకంగా గర్వపడతారు. ‘పునాదుల నుండి ప్రజాస్వామ్యం మా దేశంలో వున్నట్టు మరెక్కడా లేదేమో’ నంటారు కొందరు. ప్రజాస్వామ్యం అంటే, ప్రజలయొక్క, ప్రజల కొరకు – పర్యవేక్షణ చేయబడే విధానం అని యేనాడో ఏ అబ్రహాంలింకన్ అన్న మాటల్ని వారు యేకరవు పెడతారు. ప్రజలు వారి పాలనా రీతుల్ని వారి పూచీ మీద శాస్త్రబద్ధ రీతుల్లో నడుపుకోవాలని వారు వాంఛిస్తారు. వారి అభిమతానుసారంగా కథ నడుస్తున్నదని వారు భావిస్తారు. అమెరికా ఒక జాతికాదు. అమెరికా ‘ఒక మైనారిటీ జాతుల సంపుటి’ అని వారి భావన. యూరపులోని జాతులన్నీ అక్కడ ఉన్నవి. ఆసియా, ఆఫ్రికాలలోని జాతులూ వున్నవి. అక్కడ లేని జాతిలేదు. అయినా వారంతా అమెరికా వారమనే భావిస్తారు. అమెరికా భాషనే మాట్లాడుతారు. భిన్నత్వంలో యేకత్వం యింతగా తక్కువచోట్ల గోచరిస్తుంది. కొన్ని నగరాల్లో జనాభా చూస్తే సగం జర్మనులు, సగం యిటాలియనులు వున్నారు. కాని, అందరూ అమెరికన్లుగానే వ్యవహరిస్తారు. న్యూయార్కులో కొన్ని వీధులు వీధులుగా హాలెండు దేశస్తులు, యిటలీవారు, జర్మనీవారు వుంటారు. కాని పోయికంగా యింగ్లీషుతోనే వ్యవహరిస్తూ, అమెరికన్లుగానే వుంటారు. న్యూయార్కులో బాడుగ కారు లెక్కి, ‘హాలెండ్’ తీసుకువెళ్లు అంటే ఒక ప్రాంతానికి తీసుకుపోతారు. అయినా, ఆ భిన్నత్వంలోనే యేకత్వంవుంది. అట్టి భిన్నతా స్వరూప స్వభావాలు కలిగి, ప్రజాస్వామ్య పునాదులూ కలిగినదని వారూ గర్వపడే అమెరికాను లోకం ‘కాపిటలిస్టు’ దేశంగా మాత్రం పరిగణించటం సరసమేమో లోకమే భావించుకోవాలి. పెట్టుబడిదార్లు ఆ దేశంలో యెందరో వున్నారు. సిద్ధాంతరీత్యా ‘మాది నవ్యకాపిటలిజం’ అనేవారూ వున్నారు. ‘మాది ప్రపంచంలోకల్లా మంచి పెద్ద ప్రజాస్వామ్య దేశం’ అనేవారూ చాలామంది వున్నారు. ఏది ఏమైనా, ప్రజాస్వామ్యం వమ్ముకావటం కానీ, నియంతృత్వం విజృంభించటం కానీ, సోషలిజం విస్తరించటం కానీ వారికి గిట్టదు. సోషలిజం, కమ్యూనిజాలకు వారు వ్యత్యాసం చేయరు. రొంటినీ నియంతృత్వం, ప్రభుత్వీకరణగా భావించి, వర్ణిస్తారు. కాపిటలిజం మేలని బాహాటంగా వాదించేవారు అనేకులున్నారు. యీ యథార్థ స్వరూప స్వభావాల్ని అర్థం చేసుకోవాలి. ఆ దేశపు పాలనలోని ‘ప్రజా’ గుణాన్ని అవగాహన చేసుకోవాలి. వ్యక్తిగా వారి హక్కుల మీద, వారి ప్రాథమిక స్వత్వాల మీద, వారికున్న గౌరవాన్ని, ఆదరాన్నీ, ఆవేశాన్నీ మనం గ్రహించాలి. స్వేచ్ఛమీద వారి ఆ జన్మబద్ధ ఆకాంక్షల్ని మనం అవగాహన చేసుకోవాలి. అప్పుడు మనం ఆదేశాన్ని ‘కాపిటలిస్టు’ అని పిలిచినా, మరో పేర పిలిచినా ఫరవాలేదు. అదే ఆదేశపు విశిష్టత, దాన్ని గమనించి, గుర్తించటంలోనే మన విశిష్టత ఆధారపడి వుంటుంది. అప్పుడు నామకరణాల కంత ప్రాధాన్యత వుండదు. నామకరణాల క్రింద జొరబడి బ్రతుక ప్రయత్నించి ఫలితం లేదు. రూప, స్వరూప విశిష్టత గదా అసలు విషయం! *--*--* నీగ్రో సమస్య లేక మానవ సంబంధాలు ఆదినుంచి నీగ్రో సమస్యగా యెంచబడినదాన్ని, లోకం యింకా నీగ్రో సమస్యగా చిత్రిస్తూవున్నదాన్ని అమెరికాలో నేడు ‘మానవ సంబంధాల సమస్య’గా యెంచి కొత్తపేరు పెట్టుకున్నారు. ‘మాల, మాదిగల’ సమస్యను బ్రిటిష్ వారు ‘షెడ్యూలు జాతుల’ సమస్యగా చేస్తే, గాంధీ, హరిజన సమస్యగా మార్చారు. మనదేశంలో వెనుకబడిన జాతుల పేర్లను గూడా, ‘చాకలి’ని ‘రజకగా’, ‘మంగలి’ని ‘నాయీ బ్రాహ్మణ’గా, ‘కుమ్మర’ను ‘కులాలి’గా, ‘మేదర’ను ‘మహేంద్ర’గా, ‘వుప్పర్ల’ను ‘’సగరులను ‘గా యిట్లా యింకా యెన్నింటినో మార్చాము. అదొక తీరు. యీ పేర్ల మార్పులో మానవత గోచరమౌతుంది. న్యూనతను తీసివేయాలన్న ఆవేదన కనబడుతుంది. సమానతను చాటాలన్న భావతీవ్రత గోరాడుతుంది. అందువల్ల నీగ్రోసమస్య అనేదానికన్న మానవ సంబంధాల సమస్య అనటం యెంతో వుదాత్తంగా వుంది. సమస్యాపరిష్కార మార్గాన్వేషణలోని మానవహృదయ పరిధులు మనకెంతగానో ద్యోతకం కాగలవు. కావాలిగూడా! ఎందుకంటే, యివి మానవునికి మానవునికి వున్న సంబంధాల్ని చూసి గౌరవ ప్రపత్తులను పెంచవలసిన విషయాలు. రంగు తేడావల్ల జాతుల తేడా వున్నదనవలసిన అవుసరం లేదు. రంగు కేవలం భౌగోళిక, నైసర్గిక పరిధినిబట్టి, ప్రకృతిలోని వేడి, చలి తీండ్రిమలనుబట్టి మారునట్టిది మాత్రమే! రంగుకు మతంగాని, మనిషిగాని కారణంకాదు. రంగుకు ప్రకృతిలోని శీతోష్ణతలు తప్ప మరొక కారణం లేదు. యిది గ్రహింపని లోపమే జాత్యహంకారుల బలం! అజ్ఞానం ఆనందాన్ని యిన్తే, జ్ఞానార్జనకోసం తాపత్రయ పడటం వెర్రి కాగలదు. యిప్పుడు అమెరికాలో 50 రాష్ట్రాలున్నై, రెండుకోట్లదాకా నీగ్రోలున్నారు. అసలు అమెరికా ఆదిమవాసులైన రెడ్ యిండియనులది. వారిని అడవులకు, గుట్టలకు నెట్టి, యూరపు నుండి లక్షలాదిగా అమెరికాకు వచ్చిన వలస ‘జనం’ అమెరికాను తమదిగా చేసుకున్నారు. తమదిగా చేసుకున్న అమెరికాలో పనిపాటలు చేసి, సారంపిండి, వొనరులు పండింపవలసి వుంది. దానికై యీ వలసదార్లకు జవసత్వములు లేవు. అందులకై ఆఫ్రికా నుండి ‘నీగ్రోల’ను వారి పనులకు ‘కూలీ’లనుగా, ‘నౌకర్ల’నుగా ‘బానిస’లనుగా దిగుమతి చేశారు. వీరిని కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. కొందరిని యిక్కడే మార్కెటులో విక్రయం చేసుకొన్నారు. నీగ్రోను ‘ఆస్తి’గా సంపాదించారు. జీవిగా నుండి, వ్యక్తిత్వం లేనివానిని, ప్రాణిగా వుండి మానధనం లేనివానినిగా, మనిషిగా వుండి మానవుని కానివాణ్ణిగా యెంచి, నీగ్రోని ‘వస్తుగణం’లో చేర్చారు నాటి అమెరికన్లు. దాని వారసత్వ భావాన్ని దాటలేని వారు యింకా కొందరున్నారు. యీ నీగ్రో అనే ‘వస్తువు’ పొందిన పరిణామగాథే యీ మానవ సంబంధాల గాధాయితివృత్తం. ఆదిలో ‘నీగ్రో’ను ‘బానిస’గా యూరపు దిగుమతి చేసుకుంది. యూరపు నుండి వలసలుగా వారి ఆగమనంతో యూరోపియనులు నీగ్రోలను అమెరికాకు దింపారు. యీ దిగుమతి వలసరాజ్య వారసత్వంగా అబ్బింది. స్వార్జితం కాదు. 1772లో లండన్.లో లార్డ్ మాన్స్ ఫీల్డు తన బానిసను విముక్తుణ్ణి చేశాడు. అతడు నీగ్రో 1807లో యింగ్లండులో బానిసత్వాన్ని పూర్తిగా నిర్మూలించాడు. 1794లో అమెరికా నౌకల్లో నీగ్రోలను దిగుమతి చేయరాదన్నారు. 1807లో బానిసలను దిగుమతి చేయ రాదన్నారు. కాని 1860లో నాటికి గూడా నీగ్రో బానిసల స్థితి అధ్వాన్నంగా వుంది. బానిసను తాను బానిసో, స్వేచ్ఛావాదో అను నిర్ణయాన్ని చేసుకునే హక్కును కూడా లేదన్నారు. 1857లో జ్రెడ్ స్కాట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పులో – నీగ్రీని విముక్తుణ్ణి చేసినా అతను పౌరుడు కాదు అని నిర్ణయించింది. అమెరికా పాలనా బాధ్యత వహించి, రాజ్యాంగాన్ని సంరక్షించే కాంగ్రెసుకో, బానిసత్వాన్ని గురించి, శాసించే హక్కు లేదన్న వాదనలు బాగా సాగే రోజులవి. 1854లో నేబోస్కా, కాన్ సాన్.ల విషయంలో కాంగ్రెసు శాసనం చేస్తూ, అక్కడ నివాసాలేర్పాటు చేసుకునేవారు. బానిసత్వాన్ని నెలకొల్పుకోవచ్చునన్నది. మిస్సోరీ రాష్ట్రం బానిసత్వంతోపాటు యూనియన్.లో చేరవచ్చునని 1820లో కాంగ్రెసు శాసనం చేసింది. నీగ్రో బానిసలను, తాళ్ళతో, గొలుసులతో గదులు గదులుగా కట్టి తీసుకు వచ్చేవారు. స్తంభాలకు కట్టేవారు. గుదిబండలు వేసేవారు. నీగ్రో బానిస అంటే, వారికి ఆస్తిలో ఒక భాగం. గొర్రెలను, పులులను, సింహాలను అమ్ముకొన్నట్లు వీరిని అమ్ముతూ, కొంటూ వుండేవారు. మొదటినుండి, నీగ్రోల ఆగమనం దక్షిణాది రాష్ట్రాల్లో జాస్తి. యిప్పుడున్న 50 రాష్ట్రాల్లో, 25 రాష్ట్రాల్లో ఒక శాతం కన్నా నీగ్రోలు లేరు. మిగతా, 15 రాష్ట్రాల్లోనూ 415 రాష్ట్రాల్లో 30 శాతం దాకా ఉన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో 5 మొదలు 15 శాతందాకా వున్నారు. కాబట్టి నీగ్రో సమస్య ప్రాయికంగా 6, 7 రాష్ట్రాల సమస్య దక్షిణాది సమస్య. దీనిలో కొన్ని నైసర్గిక గమనికలు అవసరం. ఏ ఒక్క రాష్ట్రంలోనూ రానున్న నూరు నూటపాతిక యేళ్ళల్లోగా, నీగ్రోల మెజారిటీ జనాభా కాజాలరు. అమెరికాలోని 30 రాష్ట్రాలకు పైగా జనాభాలో 2.3 శాతంకన్నా పెరగలేదు. మిగిలిన కొలది రాష్ట్రాల్లో మైనారిటీగా వుండితీరాలి. కాబట్టి, దేశంలో రాష్ట్రాల్లో నీగ్రోలు యెల్లకాలపు మైనారిటీలుగా వుండి తీరాలి. అంతేకాదు, అమెరికా అంతా ఒక మైనారిటీల సమాఖ్య, అందువల్ల, నీగ్రోలూ అందులో ఒక భాగం. రెడ్ యిండియన్లు మరో భాగం. అందువల్ల, తాము మైనారిటీలమేనన్న వ్యధా కలిత భావాన్ని నీగ్రోలు ప్రత్యేకంగా పొందవలసిన అవసరం లేదు. వారు మైనారిటీలుగా ఆ భావాన్ని పొందటంలేదు. కాని, రంగునుబట్టి హక్కుల గమనం వున్న కారణంగా ఆ భావం కలుగక తప్పదు. పరిష్కార మార్గాన్వేషణలూ జరగక మానవు. జాత్యహంకారానికి కారణాలనేకంగా, అనేకులు చెప్పటం కద్దు. దక్షిణ ఆఫ్రికాలో తెల్లల రాజ్యం ఉంది. ‘ఘెటో’లని, ప్రత్యేకప్రాంతాల్లో నీగ్రోల వాసాలకేర్పాట్లు చేశారు. దక్షిణాఫ్రికా ‘ఘెటో’ స్వభావాలు మొదట్లో అమెరికాకూ దిగుమతి చేయబడినా, మొత్తం మీద ఆ రూపం యిప్పుడు తక్కువ. కాని కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఆభావం లేకపోలేదు. ఎక్కడన్నా ఒక యిల్లు అమ్మకానికి వస్తే, ఆ ప్రాంతీయులు తెల్లలైతే, వారు నీగ్రోని కొనివ్వకుండా వుండాలని పై పోటీలకు వచ్చి, నీగ్రోని కొన వీలులేకుండా చేస్తారు. అది కేటాయింపు కాని కేటాయింపు. కాని, యిండియాలో చూద్దాం. మాల, మాదిగలు, యితర మొండి బండ మొదలైన వారిని తాకేవారు కాదు. వారలను అస్పృశ్యులనుగా చేసి అంటక కొన్ని యెడల చూడక దూరంగా అట్టిపెట్టారు. అవి భాద్యభారతంలో (?) ఏడు లక్షల గ్రామాలుంటే, ఏడులక్షల మాలమాదిగ పల్లెల్ని యేర్పాటు చేసింది మన భారతీయ (?) సంస్కృతి, దీనికి సిగ్గుపడ్డ చార్వాకుడో, రామానుజుడో, పల్నాటి బ్రహ్మనాయుడో, గాంధీయో వారివారి కృషుల్ని చేశారు. అంబేత్కర్, ఎం.ఎన్.రాయ్ లాంటి వారు మార్గంతరాల్ని చూసి, వుద్యమించారు. దీన్ని చూసి సిగ్గుపడని పెద్దలు దక్షిణాఫ్రికాను గూర్చి, అమెరికాలో నీగ్రోలను గూర్చి వాపోతారు. ఎబ్బెట్టుగా మాట్లాడతారు. అపహసిస్తారు. వక్రోక్తుల్ని పలుకుతారు. అది గురివిందగింజ సంస్కృతీ భావ మాతృకలు చేసే పని. అందువల్ల నీగ్రో సమస్యల్లోని న్యూనతా భావం తగ్గదు, పోదు. నీగ్రో సమస్య భిన్నజ్ఞాతుల సమస్యగానన్నా వుంది. మనది యేక జాతుల్లోని భిన్న సమస్యగదా! పోల్చి చూచి, కార్యకారణ సంబంధబంధాల్ని వినిశ్చయించుకోవాలి. అమెరికాలో నీగ్రోల విముక్తి వుద్యమ చరిత్ర చిత్ర గతుల్లో నడిచింది. 1860 నాటికి నీగ్రోను సమాజ పౌరునిగా అంగీకరించటానికి నిరాకరించారు. ‘సమానపౌరుని’గా నేకాదు ‘రెండవరకం పౌరుని’గా కూడా అంగీకరింపలేదు. అసలు నీగ్రోపౌరుడే కాజాలడు. నీగ్రో మన ఆస్తి అనటం మొదలుపెట్టారు. చూడండి. 1820లో కాంగ్రెసు ఒక తీర్మానాన్ని చేసింది – మిస్సోరీ రాష్ట్రం యూనియన్.లో వుండేటట్లయితే, దాస్యాన్ని అంటే నీగ్రోలను దాసుళ్ళనుగా అంగీకరిస్తూనే, నిలచిపోవచ్చునని. 1850లో గూడా వుత్తర రాష్ట్రాలకు, దక్షిణ రాష్ట్రాలకు రాజీగా దక్షిణ రాష్ట్రాల్లో నీగ్రోలను దాసుళ్ళనుగా వుంచుకోవచ్చు నన్నారుగదా! అందాక యెందుకు, 1861లో అబ్రహామ్ లింకన్ అధ్యక్షుడుగా పదవీస్వీకారం చేసినప్పుడు కూడా, దాసుడుగా నున్న నీగ్రో పౌరుడుకాదు. అట్టివాని వారసుడుకూడా పౌరుడు కావీలులేదు. దాసుడుగా లేని నీగ్రోస్థాయి వేరుగానున్నదన్నది గమనార్హం. కొందరు విజ్ఞులు తమ తమ వీలునామాల్లో తమ క్రిందనున్న దాసుళ్ళయిన నీగ్రోలను విముక్తుల్ని చేస్తూ వారికి స్వేచ్ఛనిచ్చారు. సదరు వీలునామాల్లోని యీ షరతులు చెల్లవని న్యాయస్థానాలు తీర్పులు చెప్పినవి. ఎందుకని? దాసుడైన నీగ్రోకు – స్వేచ్ఛగా వుండాలా, లేక, దాసుడుగానే వుండాలా అన్న ప్రత్యామ్నాయ రూపక నిర్ణయం చేసుకొనే అధికారం లేదు – అతడు దాసుడుగానే వుండాలి. ‘కింకరోతి కింకరః‘ అన్నారుగదా, మన వారున్నూ! 1857లో డ్రెడ్ స్కాట్ కేసు తీర్పు విన్నాముకదా! ఆ తీర్పులో, కాంగ్రెసుకు యే రాష్ట్రంలో కూడా దాస్య వృత్తి పెరగకుండా చేసే అధికారం లేదన్నారు. లింకన్ యీ తీర్పును తీవ్రంగా ఖండించాడు. తన విమర్శలో, “రంగు యీ న్యూనతకు కారణమైతే మనకన్నా తెల్లగా నున్నవాళ్ళు మనల్ని న్యూనతగా చూడవచ్చు. మనకన్నా తెలివిగలవాళ్ళు మనల్ని చౌకబారుగా చూడవచ్చు. రంగుగాని, తెలివిగాని వర్గభావంతో వుండేవి కావు. మంచి వ్యక్తులందరూ యీ తీర్పును జుగుప్సతో చూడాలి” అన్నారు. “యీ దాస్యం తప్పు కాకపోతే, లోకంలో తప్పు అనేది మరొకటి వుండదు” అన్నారాయన. 1858లో లింకన్ వోడిపోయాడు. అతన్ని వోడించిన డగ్.లన్ అన్నాడుగదా – “ప్రభుత్వం తెల్లవారిది. తెల్లతనం పునాదిగా అది యేడ్పడింది. తెల్లలచేత చేయబడి, తెల్లల శ్రేయస్సుకు నడిచేది” అని. చూచారా, వున్న వాతావరణ బలీయత! నీగ్రో దాసుళ్ళు ఆస్తి అయితే మీ ఆస్తులలో అట్టి భాగానికి నష్టపరిహారం యిస్తామని లింకన్ ప్రతిపాదన చేశాడు. యీ మేరకు లింకన్ కాంగ్రెసులో ఒక బిల్లునుకూడా ప్రతిపాదించారు. “నీగ్రో దాసుళ్ళని విముక్తి చేయటం కాదు మనం వెంటనే నిర్ణయించవలసింది. వారిని విముక్తి చేద్దామన్న నిర్ణయాన్ని చేసుకోవా”లన్నారు లింకన్. లింకన్ అధ్యక్షుడు కాగానే నీగ్రోలు దాసుళ్ళుగా కావాలన్న రాష్ట్రాలు యూనియన్ నుండి విడిపోయి పోటీగా ఫెడరేషన్ పెట్టుకొన్నవి. 11 రాష్ట్రాలు చీలిపోయినై. జాతీయైక్యత ప్రధానమా నీగ్రో దాసుళ్ళ విముక్తి ప్రధానమా అన్న సమస్య వ్యుత్పన్నమైంది. జాతీయ విచ్ఛిన్న శక్తులు యుద్ధాన్ని ప్రారంభించినై. దాంతో సమస్య గడ్డువారింది. యుద్ధంలో నీగ్రోలను సైన్యంలో చేర్చుకోవటమా, మానటమా అన్న ప్రశ్నా వచ్చింది. వారు క్రమక్రమేణా సైన్యంలో చేర్పబడుతూనే వున్నారు. 1862లో సైన్యంలో నీగ్రోలను చేర్చటాన్ని శాస్త్రీయం చేశారు. రొండు లక్షల్ని చేర్చారు. వారంతా దేశయైక్యతకోసం పోట్లాడారు. క్రమశః, సైన్యాల్లో చేరిన ప్రతి నీగ్రోదాసుడు విముక్తుడైనాడు. దాంతో పెద్ద కలవరం వచ్చింది. ఒకరి కలవరమే రొండో వారి చైతన్యంగా పరిణమించింది. యీ రోజుల్లోనే లింకన్ అన్నాడుగదా – “నేనెప్పుడూ అనుకుంటాను, మానవులందరూ స్వేచ్ఛగా వుండాలని కాక, యెవరన్నా దాసుడుగా వుండాలని కోరుకునేవాడే, తన క్రింద ఒకర్ని దాసుణ్ణిగా వుంచుకోవాలని భావిస్తాడా”ని. ఎం.ఎన్.రాయ్ తన నవ్యమానవవాదంలో – దాసుడుగాని, దాసుణ్ణిగా అట్టిపెట్టు కోవాలనే వాడుగాని దాసుళ్ళేనన్నాడు. కాని, రాజకీయ తంత్రలో చిక్కులూ కలవు. “నేను దేశయైక్యతను, యూనియన్ భద్రతను దాసుళ్ళని విముక్తి చేయకుండా సాధింపగలిగితే, అట్లాగే చేస్తాను. కాక యూనియన్ రక్షణ నీగ్రో దాసుళ్ళ విముక్తివల్లనే జరుగుతుంది అంటే, వెంటనే వాళ్ళను విముక్తి చేస్తా”నని లింకన్ గూడా అనవలసి వచ్చింది. 1862 సెప్టెంబరు 13న చికాగో క్రైస్తవ సంఘం నీగ్రో విముక్తి కావాలని వివరించారు. 1862 సెప్టెంబరు 22న లింకన్ ఒక ప్రారంభ ప్రకటన చేశాడు. – 1863 జనవరి ఒకటిన విముక్త ప్రకటన చేస్తానని. వీరితో దేశంలో వుద్రిక్తత మిన్నుముట్టింది. దాంతో దక్షిణాదిన స్వేచ్ఛగా వున్న నీగ్రోలను కూడా పట్టి, దాసుళ్ళనుగా చేయాలని జెఫర్ సన్ డేలిస్ పిలుపు యిచ్చాడు. లింకన్ తన ప్రకటనవల్ల 2000 కోట్ల రూపాయలు నష్టముకలుగ జేశాడని రిచ్.మండ్ ప్రకటించాడు. 40 మంది నీగ్రో దాసుళ్ళు విముక్తులయ్యారు. అది లింకన్ ప్రతిభ, మానవునికి మానవత్వానికి కల్పించిన కథాకథనం. అది లింకన్ నీగ్రోజాతీయపితగా మారిన వైనం. లింకన్ ప్రారంభించిన విముక్తి ప్రతిపాదన, రాజ్యంగానికి 13న సవరణ, తరువాత వచ్చిన 14, 15 రాజ్యాంగ సవరణలు అమెరికన్ రాజ్యాంగాన్ని ‘రంగుదృష్టి’ లేని దానినిగా చేసినవి. రాజ్యాంగ కావచ్చుగాని, ఆచరణ యింక చాలా దూరంపోవాలి. మచ్చునకు మన రాజ్యాంగం చూడండి. ‘అస్పృశ్యత రద్దు చేయబడినది’ అని ఒక సూత్రం వుంది. రాజ్యాంగ బద్ధంగా రద్దు కావచ్చు. కాని ఆచరణ సంగతి యేమిటి? గొంగళి పెద్దగా కదలలేదు. నీగ్రో సమస్యలో, అమెరికాలో, రెండు మూడు దేశీయ సందర్భాలు అమలులో వున్నై. వుత్తరాది, దక్షిణాదికి సంబంధించిన పోటీలు ప్రధానం యింకా ముఖ్యమైనది. రాష్ట్రాలకు యేమి అధికారాలుండాలి. కేంద్రానికి యేమి అధికారాలుండాలి. అన్నది. నీగ్రో దాసుళ్ళ సమస్య. రాష్ట్రస్వయంపాలనకు సంబంధించినదని చాలమంది వాదించారు. కొందరు కేంద్రానికి సంబంధించినదంటూ వాదించారు. కేంద్రానికి రాష్ట్రం లొంగగూడదన్న ప్రజాస్వామ్య కోర్కెను యీ నీగ్రో సమస్యల్లోకి యిరికించారు. అందుకే యీ సమస్య బాగా క్లిష్టమై కూర్చుంది. ఆదృక్పథంతో కూడా నీగ్రో సమస్యను పరికించాలి. 1820 నుండి నీగ్రో సమస్యా పరిష్కారానికి వాదోపవాదాలు జరుగుతునే వున్నై. దీన్ని పరాకాష్ఠకు తెచ్చినవాడు ఏబ్రహామ్ లింకన్, ‘యేజాతి గూడా సగం స్వేచ్ఛా జీవులుగా, సగం దాసుళ్ళుగా వుండి హెచ్చుకాలం మనలేదు’ అని 1858లో లింకన్ తన ఆవేదనల్ని వ్యక్తం చేశాడు. ఆ ఆవేదన 1865 ఏప్రిల్.లో సేనాని దాసోహమన్నప్పుడు ముగిసింది. ఆ అనందంతో నాటకం చూడటానికి వెళ్ళిన లింకన్ నేతను 1865 ఏప్రిల్ 14వ తేదీన ఖూనీ చేయాలని కాల్చాడు. ఆయన మరునాడు మరణించాడు. దాస్యాన్ని నిర్మూలింప రాజ్యాంగ ప్రకటన చేసిన మహోదాత్తుడు, ఆయనగారే నీగ్రోల తండ్రి, తల్లి, తాత సర్వస్వం మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి. వలసలకుగా తెచ్చినవారి సంఖ్య మొదట్లో 40 లక్షలు వారు పెరిగి, అసలువేసి, కొమ్మలుతొడిగి నేటికి రమారమి రెండుకోట్ల జనాభాగా యెదిగివచ్చారు. పరిశ్రమాభివృద్ధి జరిగి, అమెరికాలో ఆర్థిక సంపద బాగా విప్పారినకొద్దీ, నీగ్రో సమస్య నవ్యరూపాల్ని దాల్చి, పరిష్కార మార్గాలుగూడా కొత్త పుంతలో బడజొచ్చినై. అదీగాక కాలప్రవాహం యథామాతృక పరివర్తనల్ని తెస్తుంది. అమెరికాలో గూడా అట్లాగే తెచ్చింది. యీ పరిశ్రమాభివృద్ధిలో వచ్చిన ఆర్థిక సంపద ఒక రీతిగా సాంఘికవిముక్తి వుద్యమాన్ని చురుకు పరిచేదానికన్న, మాంద్యాన్ని కొంతగా కలిగించిందేమో! అదీగాక, 1912లో ఆంజోనా రాష్ట్రం యూనియన్ లో చేరగా, అమెరికా మొదటిసారిగా ‘సంయుక్త రాష్ట్రాల’ పాలనలోకి వచ్చింది. నిజానికి అమెరికా వయస్సు 50 యేళ్ళు. నాగరిక దేశాల్లోకల్లా పిల్లరాజ్యం అందువల్లా, యే రాష్ట్రానికారాష్ట్రం స్వయం పరిపాలనాధికారాన్ని కావాలన్న వత్తిడివల్ల, సుప్రీంకోర్టు నిర్ణయాలవల్ల అక్కడి సాంఘిక సంస్కరణలు తాబేటి గమనంలో పడుచూ వచ్చినై. 1776లోని స్వాతంత్ర్య శపథపత్రం – మానవులందరూ సమానులుగా సృజింపబడినారన్నది. 1865లో రాజ్యాంగపు 13వ సవరణ, 1868లో 14వ సవరణ, 1870లో 15వ సవరణలు స్వతంత్ర దేశంలో స్వేచ్ఛాపునాదుల్ని వేసినవి. యింకొక విషయం, ప్రతినిధుల సభలో దక్షిణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తక్కువ. కాని, సెనేట్లో ప్రతి రాష్ట్రానికి యిద్దరు ప్రతినిధులుండటంతో – విస్తీర్ణం యెంతైనా, జనాభా యెంతైనా సరే – దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరిగి, నీగ్రో సమస్యలపట్ల వచ్చే సంస్కరణలకు, హెచ్చుగా దక్షిణాది ప్రతినిధులు వమ్ముచేస్తూ వచ్చారు. నీగ్రోలపట్ల సవరణలు సన్నగిల్లటానికిదే ప్రధానకారణం. 1896లో సుప్రీంకోర్టు తెల్లలకు, నల్లలకు వేరైనవే అయినా సమాన హక్కుల దృష్టిని వ్యక్తం చేసింది. 1938లో ‘ప్రత్యేకమే, కాని సమానం’ అన్న సూత్రానికి విద్యారంగంలో దెబ్బతగిలింది, కాని, 1954లోని సుప్రీంకోర్టు తీర్పుతో – విద్యారంగంలో దూరంగావుంచే విధానం, కేటాయింపు విధానం, న్యూనతగల విధానం రద్దు చేయబడి, అన్నిబడుల్లో అందరూ సమాన ప్రతిపత్తిని పొందారు. అదొక ప్రగతికథనం. ఆవిధంగా కోర్టులు పౌరసత్వాల్ని పెంపొందచేస్తూ వుండగా, అధ్యక్షుడు ఫ్రాంక్.లిన్ రోజ్ వెల్డ్ నాటి నుండి ఫెడరల్ వుద్యోగాల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, మిలటరీలో నీగ్రో ప్రాతినిధ్యం వచ్చి, పెరగనారంభించింది. అధ్యక్షుడు ఐజెన్ హోవర్ మొదటి ‘పౌరసత్వాల బిల్లు’ను ప్రతిపాదించారు. రూజ్ వెల్డ్ డెమోక్రాట్, ఐజెన్ హోవర్ రిపబ్లికన్, గత 80 సంవత్సరాల్లో యెన్నడూలేని పౌరసత్వాన్ని ఐజెన్ హోవర్ 1957లో 1960లో కలుగజేశాడు. 1964లో చట్టమైన పౌరసత్వాల సమగ్రరూపానికిదే నాంది. అధ్యక్షులు కెన్నడీ ప్రారంభించిన యీ పౌరసత్వచట్టాన్ని అధ్యక్షుడు లిన్.డన్ జాన్.సన్ ఆమోద ముద్రవేశాడు. లింకన్ ప్రారంభించిన నీగ్రో విముక్తి నేడు పరాకాష్ఠ చెంది, పరిఢవింప నారంభించింది. యీ కృషికి ప్రత్యేకంగా పనిచేసే నీగ్రోసంస్థ లనేకం కలవు. జాతీయ రంగు ప్రజల అభ్యుదయ సంఘం ప్రధానమైనది. యన్.ఏ.ఏ.సి.సి. రాయ్ విల్కిన్స్ ఆసంఘ కార్యదర్శి, కాంగ్రెస్ ఆఫ్ రేషియల్ యీక్వాలిటీ – సి.ఓ.ఆర్.యి – అనే మరో సంస్థ వుంది. దక్షిణ క్రైస్తవ నాయకత్వసభ, విద్యార్థి అహింసా సంఘటిత కమిటీ, నేషనల్ అర్బన్ లీగ్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నీగ్రోవుమెన్ – యింకా అనేకమైన చిన్న పెద్ద సంస్థలు వేలాదిగా వున్నై. అన్ని పార్టీలవారూ, అన్ని మతశాఖలవారూ, నీగ్రో పౌరసత్వాన్ని సమర్థించిన వారే, 1963 ఆగస్టు 28న జరిగిన ప్రదర్శన నాన్యతోదర్శనీయమైనది. నీగ్రోల సభకాదది. అమెరికన్ల సభ అని రుజువుచేశారు – తెల్లలు, నల్లలు కలసి 2­ ½ లక్షల మంది చేరి, నినదించి – విట్ నేయంగ్, రాయ్ విల్ కిన్స్, వాల్ టర్ పి., రియత్ మీర్, జేమ్సుఫార్మర్, మాత్యూఆక్.మన్, రబ్బీజొయాక్ మిమ్, ప్రిన్ జ్ డా. యుజీన్ కారోన్ బ్లాక్, జాన్ లెవిస్, డా.మార్టిన్ లూథర్ కింగ్ మొదలైనవారంతా ప్రధాన నీగ్రోవుద్యమ కార్యకర్తలు నాయకులు వీరుకాక వేలాదిగా వివిధప్రాంతాల కార్యకర్తలు కలరు. అనేక పత్రికలున్నై, యెందరో రచయితలున్నారు, కవులున్నారు, గాయకు లున్నారు, చిత్రశిల్ప కళాకారులున్నారు, నటులున్నారు, సంస్కృతీ విపంచిని మీటే వేలాది లలితకళా పారంగతులున్నారు. యిదంతా యెందుకు, సంగీతం నీగ్రోల సొమ్ము, చిత్ర శిల్ప కళారంగం వారిసొత్తు. లలితకళలో నీగ్రోల తీరు తెన్నులను కన్న విశిష్టత మరోవర్గానికి, వర్ణానికి లేదు. యిండియాలోనైనా వెనుకబడినవారుగా చెప్పబడే వర్గాలదే కదా శిల్ప, చిత్ర, రంగాల్లో సంగీతంలో, వాద్యాలలో ప్రధానపాత్ర, సాంఘిక చరిత్రకారులు ప్రాయికంగా యీ విషయాన్ని గురించి ప్రత్యేక శ్రద్ధతో యీ కారణాల్ని కనుక్కోగలుగుతారని భావిస్తాము. కారణాలేమైతేనేమి, కథనం తెలిసింది కదా! 1964 చట్టంలో పదకొండు విషయాల ప్రత్యేక రక్షణలున్నై – వోటింగు, స్కూళ్ళు, పబ్లిక్ స్థలాలల్లో, సంస్థలో హక్కులు, వుద్యోగార్హత సివిల్ హక్కులకోర్టు, ఫెడరల్ సివిల్ హక్కుల కమిషన్ ముఖ్యమైనవి. ఎట్టి న్యూనతనైనా ఫెడరల్ వ్యయంతో సరిదిద్దవలసిన అవసరాన్నిగుర్తించి, దానికి సావకాశం కల్పించడం ప్రదానం. యింతే కాక, నీగ్రో కార్మికుల కుటుంబ సగటు ఆదాయం 16,000 రూపాయలు, తెల్లకార్మికుల కుటుంబ సగటు ఆదాయం 30,000 రూపాయలు అని ప్రభుత్వ కార్మిక శాఖాప్రకటనలోనే వుంది. నీగ్రో కార్మికులు జాతీయంగా 11 శాతం వున్నారు. వీరిలోనే 2.1/2 శాతం నిరుద్యోగం వున్నట్లు తేలుతుంది. “యిట్టి తారతమ్యపుటన్యాయం లేకుండా చేయటానికి మానవులంగా సంకల్పాన్ని పొంది, కృషికి దిగాలని’’ అధ్యక్షుడు జాన్ సన్ వుద్ఘాటిస్తున్నారు. ‘ఉన్నత సమాజ’ నిర్మాణాన్ని గురించి ప్రణాళికల్ని ప్రగాఢ విశ్వాసంతో ప్రతిపాదిస్తున్నారు. లింకన్ ఆశయాల్ని ఫలింపజేయటానికి ప్రయత్న పూర్వక వ్యవహారాన్ని యెంతగానైనా చేస్తున్నాను. అమెరికాలో బీదరికం లేకపోలేదు. కాని, వారి బీదరికానికి, మన బీదరికానికి వ్యత్యాసం వున్నా వారిలో వారికి వ్యత్యాసాలున్నై. అది కేవల తెల్లల, నల్లల పద్ధతిమీద కాదు. బీదలు తెల్లలూ వున్నారు, నల్లలూ వున్నారు. కాని, నల్లల బీదలే జాస్తి. అది నిర్వివాదాంశం. నేను బీదలైన నల్లలయిళ్ళు, తెల్లల యిళ్ళు చూచాను. ఆ యిళ్ళల్లో టెలిఫోనులు, కార్లు, టెలివిజన్ సెట్లు, రిఫ్రిజిరేటర్లు వున్నవి. వున్నా మంచిరకంకావు. యిళ్ళు, బిడ్డలందరికీ ప్రత్యేక వనర్లు చూపగలవికావు. కలాలమాదిరిగా, బారుయిండ్లు. అందరికీ అన్ని గదులుగల వనర్లు లేవు. అన్నంలేక పస్తులుండేవారు. లేకున్నా, పుష్కలత లేనివారనేకులున్నారు. అందుకే ‘ఉన్నత సమాజాన్ని’ సృష్టించి, వనర్లు పెంచాలని అధ్యక్షుడు జాన్.సన్ కృషి ప్రారంభించాడు. యిప్పుడు శాస్త్రరీత్యా, చట్టబద్ధంగా న్యూనతలు లేని పాటవాన్ని తెచ్చారు. యింకా ఆచరణలో శ్రద్ధలు హెచ్చాలి, జాగ్రర్తలు మనాలి. కథ సొంపు యింపు కలిగేదిగా వుండాలి. అధ్యక్షుడు కెన్నడి అన్నట్లు, ‘కోటాపద్ధతి మా ధ్యేయం కాదు. తెల్లలు నల్లలు కలిపి యేక రాసి కావాలి. అదివారి ఆదర్శం. అది ఆదర్శవంతమైన ఆదర్శం. ఆ మార్గాన్నే కొన్నాళ్ళు పోతే, అమెరికాను నడిచే ప్రజాస్వామ్య దేశంగా చేయగలరు. వారు జయిస్తే, మనకు లాభదాయకమే’ అట్టి సమస్యలే మనకు వున్నై. మనము జయించాలి. ఆ ధైర్యం మనకు కలుగుతుంది. నీగ్రో సమస్యలో మరో నూతన పరిణామం, యీ మధ్య రావటం మొదలు పెట్టింది. దక్షిణాది రాష్ట్రాల నుండి నీగ్రోలు వుద్యోగం సద్యోగం కోసమని వుత్తరాది, పట్టణాలకు, యితర ప్రాంతాలకు తరలి వెళ్ళుతున్నారు. దీంతో, దక్షిణాదిన సాంద్రంగా వున్న నీగ్రో జనాభాలు క్షీణించి పోవనారంభించినై. ‘నీగ్రో’ల మీద రాజకీయాలు కట్టాలన్న వారికి నిస్ఫృహ కలుగుతుంది. నీగ్రో సమస్య తన సాంద్ర రూపాన్ని దక్షిణాదిలో కోల్పోతూంది. 1960లో కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో నీగ్రో జనాభాని చూద్దాం. అలబమాలో 9 లక్షల 83 వేలు, ఆర్కెస్ సాస్.లో 3 లక్షల 90 వేలు, ఫ్లారిడాలో 8 లక్షల 88 వేలు, జార్జియాలో 11 లక్షల 25 వేలు. కేంటకీలో 2 లక్షల 18 వేలు, లూసియానాలో 10 లక్షల 46 వేలు. మిస్సిసీపీలో 9 లక్షల 21 వేలు, నార్త్ కారోరొవీనాలో 11 లక్షల 57 వేలు, సౌత్ కారొలినాలో 8 లక్షల 35 వేలు, టెన్నిసీలో 5 లక్షల 90 వేలు. వర్జీనియాలో 8 లక్షల 73 వేలు వున్నారు. యీ పదకొండు రాష్ట్రాల్లోనే నీగ్రో జనాభాలు హెచ్చు. నీగ్రో సమస్య కరుడు గట్టి, చిట్టెంపాకంలో పడిన చోట్లేయివి. యీ మధ్యనే యీ ప్రాంతాల్లో 2 లక్షల మంది కొత్తగా వోటర్లుగా వచ్చారు. 5 లక్షల మంది విద్యార్థులు మిశ్రపు బడుల్లో చదువు సాములు నేర్చుతున్నారు. యీ రకంగా అభివృద్ధి కార్యక్రమ పరిణామ దశలోకి యీ నీగ్రో సమస్య వచ్చింది. యిది యెంత త్వరలో సలీసుగా మారితే, అమెరికాలో అంత మేరకు ప్రజాస్వామ్య గుణం అభివృద్ధి చెందినట్లు. దానికే అన్ని మూలల నుండి కేకలు, ప్రణాళికలు వస్తున్నై. జాతితో పాటు దేశంలోని వివిధ శక్తులు జాగృతిని పొంది, కృషికి సన్నద్ధులై ముందుకు వస్తున్నారు. ‘The answer is flowing in the winds I see freedom’ అంటాడు మన నీగ్రో. *--*--* అమెరికాలో వ్యవసాయం అమెరికాలో ప్రపంచంలోని మొత్తం ఆహారధాన్యోత్పత్తిలో 10 శాతం పండిస్తారు. మంచి విత్తనాలు సక్రమపు యెరువులు, వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టబడిన యాంత్రిక సౌలభ్యాల వల్ల యీ ఉత్పత్తి జరుగుతుంది. వృక్షశాస్త్రంలోని పరిశోధనల ఫలితాన్ని వ్యవసాయ రంగంలో శ్రద్ధతో అనుసరిస్తున్నారు. పంటలు యిబ్బడిగా పండుతున్నై. అంతేకాక భూమిలో పంటల మార్పిళ్ళూ మురుగు వనర్లు, భూమిమీద శ్రద్ధ యీ పంటల పెంపరికానికి మూలం. వ్యవసాయ రంగంలో లెక్కలు చాలా నిక్కచ్చిగా వుంచుతారు. పశువుల చరిత్ర పత్రాలు వుంటై. తల్లి, తండ్రి, తాతల గాథలు అట్టిపెడతారు. మేత వివరాలు వుంచుతారు. పాడి రోజువారీ వచ్చే లెక్కలు అట్టిపెడతారు. పశుగణాన్ని వ్యవసాయంలో నుంచి తీసివేసి వ్యవసాయమంతా యాంత్రికం చేశారు. అక్కడక్కడా, గుర్రాల సాగు యింకా కొంత కనబడుతుంది. అది చేదస్తుల విక్రడితాలుగా వుంటై. అమెరికన్లకు లెక్కల మోజు జాస్తి అతి శ్రద్ధతో లెక్కల్ని అట్టి పెడతారు. 1962 నాటికి 39 లక్షల కమతాలు వున్నై. యిందులో 75 శాతం దాకా స్వంతదార్లే పనిచేస్తారు. తతిమ్మావి కవుళ్ళలో వున్నై. కవుళ్ళ పద్ధతే గాక, పంట పాలు పద్ధతి కూడా వుంది. మామూలు కమతాలు 250 నుండి 300 ఎకరాలదాకా వుంటై. మొదట్లో, యిండియాలోని మాదిరిగానే, వ్యవసాయం ఒక కుటుంబ జీవన విధానంగా వుండేది. దేశం బాగా పారిశ్రామికంగా అభివృద్ధి చెంది, వాణిజ్యం పెరిగి, పట్టణాలు పెంపొందగా, వ్యవసాయ రంగం నుండి హెచ్చుమంది యితర వ్యాసంగాలకు పోవటం మొదలు పెట్టారు. దాంతో, వ్యవసాయంలో గల కుటుంబ జీవన విధాన రీతులు సడలి, వ్యవసాయం దెబ్బతినేటట్లు కనపడింది. 100 నుండి 200 ఎకరాల దాకా విశేషంగా కమతాలు వుండేవి. రానురాను కమతాలు పెద్దవి కావటం మొదలై, వ్యవసాయ రంగంలోకి యాంత్రికత వచ్చి, మనుష్యులు పనిచేయవలసిన స్థాయి తగ్గి, పశువులు పనిచేయవలసిన పని లేకుండా పోయి, వ్యవసాయం ఒక కుటుంబ జీవనం విధానంగా లేకుండా పోవనారంభించి, వ్యవసాయం ఒక పరిశ్రమగా రూపొందటం మొదలు పెట్టింది. యీ పరిణామం విప్లవాత్మక మైనదిగా తేలింది. 1959 నాటికి 25000 రూపాయల అమ్మకాన్ని చేయగల వుత్పత్తి చేసే కమతాలు 1954లో వాటికన్నా 1 1/2 లక్షలు పైగా పెరిగినై. 50.000 రూపాయల దాకా అమ్మకాన్ని చేయగల కమతాలు 36 శాతం పెరిగి 8 లక్షల కమతాలై, దీంతో లక్షలాది వ్యవసాయదార్లు రొండో వృత్తిని గూడా అవలంభింప మొదలు పెట్టారు. 70 లక్షల మంది రైతులు 10 వేల సహకార సంఘాల ద్వారా పంటల్ని మార్కెటుకు తరలించుకోవటం మొదలిడారు. 1963 నాటికి పరిస్థితులలో మార్పు వుంది. కమతాలు నాటి నాటికి విస్తీర్ణంలో పెరుగుతున్నై. సంఖ్య తగ్గుతుంది. వ్యవసాయం కొన్ని ప్రాంతాలలో – ముఖ్యంగా ఫ్రెజ్నోమూలం – భారీ పరిశ్రమగా జరుపుతున్నారు. దీనినే ‘ఆటోమేషన్ వ్యవసాయ పద్ధతి’గా వారభివర్ణిస్తారు. ఇండియా ప్రాయికంగా వ్యవసాయదేశం. అమెరికా ప్రధానంగా పారిశ్రామిక దేశం. మనదేశంలో యెన్ని పరిశ్రమల్ని పెంచినా, మన ఐదు లక్షల గ్రామాల్లో నిండి గోరాడే జనాలు ముఖ్యంగా వ్యవసాయిక రంగంమీద ఆధారపడమనాలి. మన ప్రణాళికానేతలు, యే మార్గల్లో గమనిస్తున్నా, చేసిన తప్పులు దిద్దుకోవాలి. తిరిగి దారికి రావాలి. ఆదారి, వ్యవసాయం ప్రధాన భూమికగా పరిగ్రహించటం, అందువల్ల, యితర దేశాల్లో వ్యవసాయ స్థాయి యెట్లావుందో, ఆ అనుభవాలమీద మనం ఎట్లా విధానాల్ని మళ్ళించుకోవాలో పరిశీలించుకోవాలి. ఆ దృష్టితో అమెరికాలో వ్యవసాయం ఎట్లావుందో చూద్దాం. అమెరికా పెద్దదేశం, మనకన్నా పెద్దది. మనకన్నా జనాభా చాల తక్కువ, సగంగూడాలేదు. మనదేశంలో మాదిరిగానే, అమెరికాలోనూ లోగడ వ్యవసాయం ఒక జీవనవిధానంగా, ఒక జీవితమార్గంగా వుండేది. రైతు స్వామ్యం దానికి పుట్టినిల్లుగా వుండేది. ఇప్పడు, రైతు కుటుంబ వ్యవస్థ, జీవనవ్యవస్థ సంపూర్ణ పరిణామాన్ని పొందింది. వ్యవసాయం యిప్పుడొక పరిశ్రమగా, ఒక వ్యాపార రంగంగా మారిపోతూంది. సంపూర్ణ పరిణామం త్వరలో వస్తుంది. కథ ఆపరిణామ జ్వాలలో వుంది. మనం వ్యవసాయాన్ని యింకా ఒక జీవనాధారంగా యెంచుకుంటున్నాము. మన రైతుస్వామ్యం కుటుంబ స్వామ్యాన్ని వీడలేని, విడని స్థాయిలోనే నడయాడుతూ వుంది. మార్పు ప్రాయికంగా దృక్పథాల్లో గోచరిస్తుంది. రంగం మీదికి యింకా బాగా రాలేదు. మనకు గరిష్ఠ పరిమితి వ్యవసాయాదాయంలో మాత్రం వచ్చింది. కనిష్ఠ పరిమితి లేదు. అమెరికాలో వ్యవసాయ రంగంలో కూడా గరిష్ఠ పరిమితులు లేవు. చిన్న కమతం రమారమి 90 ఎకరాలకు పైగా వుంది. భారీకమతాలూ వున్నవి. 50 వేల ఎకరాలదాకా అవి వున్నవి. పంట అధికంగా పండించటం ప్రధానంగాని, యెవరిక్రింద యెంత భూమి వున్నది అనేది ప్రధానం కాదు. అది గమనించతగిన మొదటి విషయం. వ్యవసాయరంగంలో పశుగణాన్ని అసలు వుపయోగించ కుండా జరుపుకుంటారు. అక్కడ గేదెలు, దున్నలు అసలు లేవు. నల్లజాతి పశువులు నాస్తి ఆవులు, కోడెలు మాత్రమే కలవు. ఆవులు పాడికి, కోడెలు, ఆబోతులు పోను మిగతావి భోజనానికి వుపకరిస్తవి. ఆవులు 10 ఏళ్ళపాటు పాడికి తరువాత భోజనాలకు మగడింపబడితవి. మనం, వ్యవసాయానికి రవాణాలకు యెంతగానో పశువులమీద ఆధారపడతాము. వారట్లాకాదు. వ్యవసాయాన్ని పూర్తిగా వారు యంత్రమయం చేశారు. విత్తనాలు చల్లటం దగ్గర నుంచి, కోత, నూర్పిళ్ళు యావత్తు యంత్రంతోనే జరిగిస్తారు. యంత్ర సారధ్యంతో కథంతా నడుస్తుంది. భూమిని బాగా 4 లేక 10 అంగుళాల లోతుదాకా దున్నుతారు యంత్రమే దున్నుతుంది. నీళ్ళు పెట్టి లెవెలు సరిచేస్తారు. పల్లం మెట్టలను చూచి అప్పుడు గట్టు వేసే మరతో ప్లాస్టిక్ గుడ్డతో, మేకులు పాతి వాటికి గుడ్డ చుట్టి, గట్టువేస్తారు. నీటిని అటూయిటూ దొర్లకుండా ఆగట్టు ఆపుతుంది. ఆ గట్టు కోతకాలంలో మరిక్రింద నలిగిపోతవి. తిరిగి మరు సంవత్సరం మళ్ళా వేసుకుంటారు. ఈ గట్ల మరగంటకు 1000 గజాల మేరకు గట్టు వేస్తుంది. మన దేశంలో మాదిరిగా, నాటువేసే పద్ధతి లేదు. విత్తనాల్ని సరాసరి చల్లటమేమార్గం, నీళ్ళల్లో చల్లుతారు. మొలక కట్టినాక నీరు తీసివేసి, క్రమేణ నీరు పెట్టుతూ వుంటారు. మన మాదిరే, కోత కోయబోయిన దాకా నీరు, కాలమంతా వుంటుంది. విత్తనాలు చేతితో చల్లరు. విమానంతో చల్లుతారు. విమానం, నేలకు 20-25 అడుగుల ఎత్తున వుండి విత్తనాల్ని చల్లుతుంది. ఎకరానికి 180 పౌనుల దాకా విత్తనాలు చల్లుతారు. చాల వత్తుగా వుంటుందీపైరు. అంతగా పెరగదు. కాలిఫోర్నియా రాష్ట్రంలో 1962లో రాష్ట్రంలో సగటుకు 4800 పౌనులు పండినవి. కొన్నిచోట్ల ఎకరాకు 6000 పౌనులు దాకా పండగలవని నేను చూచాను. అంటే 37 బస్తాల దాకా వారి సగటుగూడా ఎకరానికి 27 బస్తాల దాకా వుంది. వారు సాలీనా ఎకరాకు 75 లేక 100 రూపాయల కిమ్మతుగల ఎరువు వేస్తున్నారు. రసాయనిక ఎరువులనే వాడుతారు. గడ్డిని ఎరువుగా వాడటం తక్కువ. గడ్డిని తగులబెట్టి వేస్తారు. లేక కొద్దిగా, పశువుల పడకకు వేస్తారు. మేతగా వరిగడ్డని వాడరు. కోతకోయటానికి ‘కంబైనర్’ అన్న యంత్రాన్ని వాడతారు. అది ఒక లక్షరూపాయల కిమ్మతు వుంటుంది. మనిషి యెక్కి మరత్రిప్పుతూవుంటే, గంటకు ఐదుమైళ్ళ వేగంతోపోతూ మూడు గజాల మేర మునుము పెట్టి కోతకోస్తుంది. కోసిన పైరును లోనికి మరలలోకి యంత్రం లాక్కుంటుంది. నూర్చివేస్తుంది. గడ్డిని కింద పడవేస్తుంది. ధాన్యాన్ని ఒక తొట్టిలోకి నెట్టివేస్తుంది. తొట్టి నిండగానే, లారీ వచ్చి, దానిలోనికి లాగేసుకుంటుంది. గంటకు 6 లేక 7 ఎకరాలు కోసి, నూర్చగలదు. నూర్చిన ధాన్యాన్ని లారీలో కొట్టువద్దకు తీసుకవెళ్ళి, అక్కడ కాల్చివేస్తారు. ఆ ధాన్యం, అప్పటికప్పుడు కోసి నూర్చింది గనుక, నెమ్ము వుంటుంది. 100 డిగ్రీల వేడిగల యంత్రంలోగుండా పోనిచ్చి, ధాన్యంలోని నెమ్మును లాగివేస్తారు. నెమ్ము పోగా తూరుపార పడతారు, మరొక మరలో గుండా పోనిచ్చి తర్వాత కొట్టులోకి నెట్టివేస్తారు. విత్తనం చల్లేటప్పటి నుండి, గింజలను చేతితో అంటుకోవలసిన పనిలేదు. పరిశుభ్రంగా పనులు చేస్తారు. వరిపంట ఏప్రియల్ 15 నుండి మే 15 ప్రాంతంలో వేస్తారు. కోతలు ఆగస్టు చివరి నుండి సెప్టెంబరు చివరిదాకా కోస్తారు. 100 పౌనుల ధాన్యానికి 4½ డాలర్ల కిమ్మతు వుంటుంది. అంటే 22½ రూపాయిలు భూములు కవులుకు యిష్టంవచ్చిన ప్రకారం యిచ్చుకుంటారు. కవుళ్ళ చట్టాల ప్రతిబంధకాలు లేవు. ఒక్కొక్క ఆసామి, అన్ని పరికరాల్ని సంపాదించి వ్యవసాయానికి నియుక్తుడు కావాలంటే 100 ఎకరాల రైతు కూడా రు.15,000 కిమ్మతుగల వ్యవసాయ కమాటాన్ని వాడాలి. అంత కమాటంవాడితే, 100 ఎకరాలు సాగుకు చాలదు. దాంతో, 300 లేక 400 ఎకరాల్లో పనిచేయవచ్చు. అందుకని భూమి కవులుకు తీసుకుంటాడు. ఆ మేరకు పూర్తిగా పనుల్లో నిమగ్నుడౌతాడు. 400 ఎకరాలను ఒకే ఒక మనిషి చేయవచ్చు. 10,000 ఎకరాలను 2, 3 మనుష్యులే 50 లక్షల కిమ్మత్తు చేయు వ్యవసాయ సామగ్రితో చేస్తారు. 40 వేల ఎకరాలు సాగుచేయటానికి కోటిన్నర రూపాయల కమాటం వాడతారు. 5,.6గురు ఆ మొత్తం వ్యవసాయం చేస్తారు. వ్యవసాయాన్ని యింత భారీగా చేస్తున్నారు. తక్కువ మంది చేస్తున్నారు. మనుష్యుల ద్వారా పని చేయించుకోవటం చాల వల్లమాలిన ఖరీదు. అందుకని, అంతా మరల్తో చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. చేసుకొంటున్నారు. యంత్రాలతో చేయటమేకాదు. ‘ఆటోమేషన్’ స్థాయిలో చేస్తున్నారు. ఇతరత్రా, పరిశ్రమాభివృద్ధి చెందిన దేశాలే ఈ అభివృద్ధిని చూచి గాభరా పడుతున్నాయి. మన సంగతేమిటి? ప్రభుత్వం వ్యవసాయ రంగంలో జోక్యం చేసుకోదు. అయితే ఒక్కొక్కసారి ‘విస్తీర్ణ నియమిత సంఘం’ ప్రభుత్వ తరఫున ఆయా పంటల విస్తీర్ణం తగ్గించే, హెచ్చించే సూచనలు చేస్తూవుంటారు. ఆయా పంటలు పండించే రైతులలో ‘రిఫరెండమ్’ జరుగుతుంది. ఓటింగు రీతినిబట్టి ప్రభుత్వ సూచనను, అంగీకరించడమో, తిరస్కరించడమో జరుగుతుంది. వ్యవసాయ రంగంలోని ప్రజాస్వామ్యం యిది. అమెరికాలో వ్యవసాయదార్లు తుష్టితో వున్నా, పన్నులు గూడా భూమి మీద తక్కువ. వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చారు. పరిశ్రమలోని ఫలితాల్ని పొందుతున్నారు. ఓహాయో రాష్ట్రం వ్యవసాయానికి నిధి. ‘హాగ్ – కారన్’ రాష్ట్రంగా దాన్ని అభివర్ణిస్తారు. హాగ్ అంటే పందుల పెంపకం. కారన్ అంటే మొక్కజొన్న, ఒహాయో రాష్ట్రంలో, యిల్లినాయిస్ రాష్ట్రంలో వ్యవసాయ క్షేత్రాల్ని చాల చూచాను. కోళ్ల పెంపకాల్ని, గోగణ పెంపక కేంద్రాల్ని చూచాను. పందుల పెంపకం, కోళ్ళ పెంపకం, గోగణ పెంపకం వ్యవసాయంలో భాగాలుగానే వున్నై. మొక్కజొన్న, గోధుమ, వరి, బార్లీ, వోట్లు, వేరుశనగ, పొగాకు, ముఖ్యంగా పండిస్తారు. అల్ఫాల్పాగడ్డి పెంచుతారు. వరిగడ్డి మేతగా వాడరు. పొలాలలోనే వోదెల్ని కాల్చివేస్తాడు. గొడ్లకు పక్కగా వాడతారు. ఒహాయిలో ఒక చిన్న రైతు లియొమార్డ్ యల్, డ్యూక్. అతనికి 165 ఎకరాలున్నై. స్వంత సేద్యం, కూలీలను పెట్టుకోడు. అతనివద్ద, ఒక చిన్న కంబైన్ (కోత నూర్పిడిమర) మొక్కజొన్న కోతమర, ట్రాక్టర్, వాగన్, యినుపనాగలి, తూర్పారమర, జొన్ననాటేమర, గోధుమ కోతమర, జొన్న నూర్పిడిమర, శీతోష్ణ మాసము, యింకా యితర చిన్న పరికరాలు కలిసి 60,000 రూపాయలదాకా వున్నై. ఒకటి అర కావాలంటే అద్దెకు మరల్ని తెచ్చుకుంటాడు. తానూ కొన్ని అద్దెలకిస్తాడు. తానుకొంత భూమిని కవులుకు చేస్తాడు. ఆ మరల్తో 250 ఎకరాలదాకా సాగుచేయవచ్చు. కవులు సంగోరు పద్ధతిమీద వుంటుంది. మొక్కజొన్న బుషెక్ ఒకటికి రు.6-25 చేసి, గోధుమ బుషెక్ ఒకటికి రు.6-25 చేసి, గోధుమ బుషెక్ రు. 8-50 చేసి, ఓక్సు బుషెక్ రు.3-00 చేసి అమ్ముతాడు. స్థానికంగా ధాన్యం వ్యాపారులు, ప్రైవేటు సహకార సంస్థలు ధరల నిర్ణయం చేస్తారు, ప్రభుత్వం యేమీ కొనుగోలు చేయదు. వ్యవసాయ స్థిరీకరణ కార్పొరేషన్ వుంది. యీ నిర్ణయంలో వారి పాత్రా వుంటుంది. సాధారణంగా ప్రతి వస్తువుకు సామాన్యపాటి ధరవుంటుంది. దానినిబట్టి కొద్ది తేడాలతో కథనడుస్తుంది. యీ ప్రాంతంలో మూడో రకం భూములు ఎకరా 1000 లేక 1500 రూపాయలు రెండో రకం రు.1500 నుండి 2000 రూపాయిలదాకానూ, ఒకటోరకం భూములు రు.2500 దాకా వున్నవి. యీ ప్రాంతంలోనే బక్ లాండ్ బాబ్ అన్న ఆసామి తాలూకు గోక్షేత్రానికి వెళ్ళాము. యిద్దరు సోమరులు, 430 ఎకరాలుంది. స్వంత సేద్యం చేస్తారు. వారివద్ద 2 లక్షల రూపాయలు చేసే వ్యవసాయ కమాటం వుంది. వారికి 120 గోవులున్నై. వాటి మరమ్మత్తు 2 లక్షల రూపాయలు. వాటిల్లో 60 ఆవులు దాకా పాడియావులు, వీటికి మేత కట్టడాల్లో నిల్వ చేస్తారు. ముక్కలు ముక్కలుగా నరికి టిన్నుల్లో పడేటట్లు పెడతారు. మరతో నరికి, మరతో మేత నడిపి, టిన్నుల్లో పడేటట్లు చేస్తారు. విటమిన్ ఆహారం యిస్తారు. స్ఫటిక వ్రేలాడకట్టి వుంటుంది. కుడితి బాగా పోస్తారు. ఆవు యీనిన తర్వాత దూడను కుడవనివ్వరు. దూడలకు ప్రత్యేకంగా పాలు, మేతలు వేస్తారు. మూడునెల్ల దూడలు మన యేటిన్నర దూడలకన్నా బలంగా, పుష్టిగా, చంగనాలేస్తూ వుంటై. దూడమర్లు ఆవుకు వుండదు. పాలు తీయటం చేతులతో తీయరు, యంత్రాలతో తీస్తారు. పాలుతీసే చావడి ప్రత్యేకంగా వుంది. ఆరు ఆవుల్ని ఒకవైపుకు యింకో ఆరు ఆవుల్ని యింకొక వైపుకు తోలి, దానా వేస్తారు. కేవలం ములుము కాదది. పొదుగులు చావడి లోపలకు, తలలు చావడి అంచుల్లో వుండేటట్లు కట్టివేస్తారు. యీ రొండు సోలుపుల మధ్య, మోటారు కార్లు బాగుచేసే గుంటలాంటిదొకటుంటుంది. దానిలో సైకిలు చక్రాల బండిమీద ఒక ఆసామి కూర్చొని వుంటాడు. అతను ఆ పల్లంలో నుండి ఆవులకు పాలు పితికే మరల్ని తగలించి, అమర్చుతాడు. నాల్గుచళ్ళకు నాల్గు పితుకులుంటై, సమపాళమైన వత్తిడితో గుమ్ముగుమ్మున పాలు గుమాయించి లాగుతుంటై. పిండేపాలు, యీ కూర్చున్న కుర్రవాడి నెత్తిమీదుగావున్న గుండ్రటి గ్లాసు పాత్రల్లోకి యాంత్రికంగా లాగబడతై. ఆ పాత్ర కడవ పాలు పిండుతుంది. పాత్ర నిండే సమయానికి, ఆ కుర్రవాడు ఒక తీగ లాగుతాడు. పాత్ర బోర్లగిలుతుంది. యీ టాంకు చావడికి ఒక పక్కగా వుంటుంది. దీనిలోకి తరిపి పాలు, జున్నుపాలు అన్నీ కలిపి పంపుతారు. అవి కలిసినందున మనమాదిరి విరిగిపోవు. యీ తొట్టిలో యాంత్రికంగా సమశీతోష్ణస్థాయిని, పాలు చెడని స్థితిని యేర్పరచి వుంచుతారు. యీ తొట్టి నుండి, పట్టణాన్నుంచి వచ్చిన పాలకారు పాలు కొలతతో తోడుకొని వెళ్ళుతుంది. మనం యెన్నోసార్లు పాలు తీయటం మన వూళ్ళల్లో చూచినా, మనకు మనమై పాలుతీసి వున్నా, యీ అనుభవం నూతనంగా వుంది నాకు. ఎంతో మనోజ్ఞంగా వుంది. కన్నుల పండువగా వున్నది. యీ 60 గోధనంలో నుంచి 5000 పౌనుల పాలను రోజూ అమ్ముతారు. నూరు పౌనులు నాలుగు డోలర్లు, డోలరు 4-74 పైసలు, అంటే రోజుకు రమారమి 950 రూపాయలు రాబడి వుంటుంది. యీ గోగణం పదేళ్ళు బాగా పిండుతై, 17 ఏళ్ళు పిండినదాన్ని గూడా చూచాను. ఆవుకు వేసే మేతగానీ, మనం పిండుకొనే పాలుగాని చేతితో అంటవలసిన పనిలేదు. యిది బహాయో, యిల్లినాయిస్ రాష్ట్రాల్లో, మిన్నెసోటా రాష్ట్రంలో గూడా కొన్ని చూచాము. ఆసామి పియర్ సన్. 60 ఆవులున్నై, 30 పాలవి. రోజుకి 1200 పౌనుల పాలు అమ్ముతారు. యీయనకు 134 ఎకరాలున్నై. 90 ఎకరాలు ఎకరాకు 350 చొప్పున కౌలుకు తీసుకున్నాడు. 40 వేల కిమ్మతు చేయు పరికారాలున్నై. శిస్తు ఎకరాకు 24 రూపాయలు, పశువుల పెంపకం, పాలవ్యాపారం ఆయనకు ప్రధానం. వ్యవసాయం మేత కోసరంగా జరుగుతుంది. 100 పౌనులకు 41/2 డోలర్లు మంచి ధరగా ఎంచుతాడు. అంతకు మించి అమ్మటం దేశ ఆర్థికత దృష్ట్యా శ్రేయస్కరం కాదన్నాడు. అతని చైతన్యం విశిష్టమైనది. అట్లా మాట్లాడిన రైతులు చాలమంది వున్నారు. ఆవుల ధరలు, ఒక్కొక్కటి 5000, 6000 రూపాయల ఖరీదులో వున్నవి. ఆయన దగ్గర ఒక ఆబోతు గిత్త వుంది. 58లో పుట్టింది. 1963లో గదా నేను వారిని చూచింది. దాని తాత, తండ్రుల చరిత్ర అంతా పటంలో వుంది. దానిమీద 30, లేక 40 వేల రూపాయలదాకా ఆశపెట్టుకొని వున్నాడాయన. 20 వేలకు అడిగితే యివ్వలేదట. అక్కడ పాడిపంటల సిరుసంపద అట్టిది. అమెరికాలో ఆవులకు, ఎడ్లకు కొమ్ములు పుట్టగానే చివ్వి, ఆ కుదురులో కాల్చివేస్తారు. దాంతో యిక కొమ్ములు పెరగవు. బోడితలలేర్పడుతవి. ఆవులు 300 రోజులు పాడినిస్తవి. కొన్ని 350 రోజులు కూడా యిస్తవి. వారి మేపుడు వివరాలు చిత్రంగా వుంటై. ఆవుల్లో హాల్ స్టీన్, జెర్సీ, గొర్నెసీ, బ్రౌన్ స్విస్, ఆయస్ హెయిర్ జాతులు ముఖ్యం. పశువుల యిన్సూరెన్సు జాస్తిగా వుంది. గోవులకు పూర్వాపరాలు జీవిత గాథలేగాక, పాడిపంటల వైనంగల ఛార్టులు అట్టిపెడతారు. పాలలో 41/2 శాతం వెన్న లక్షణం వుంటే మంచి ఆవుక్రింద లెక్కవేస్తారు. నేను ఒకటి రెండు చోట్ల రెండు కడవల పాలిచ్చే ఆవుల్ని కూడా చూశాను. తర్వాత, కాలిఫోర్నియా రాష్ట్రంలో ఫ్రెజ్నో ప్రాంతంలో పొలాలకు వెళ్ళినప్పుడు ఒక గడ్డిమర చూచాను. అదొక పెద్ద ఫ్యాక్టరీ. అల్ఫాల్ఫా పచ్చిగడ్డి తోలుకొస్తారు. లారీలలో దింపుతారు. దాన్ని మరల్లోకి పంపుతారు. చిన్న చిన్న ముక్కలుగా చేసి, మరల్లో వివిధ అంతస్తుల్లోకి పంపి, చివరకు పొడిగా వచ్చి, పొడిని విటమిన్ బిళ్ళల్నిగా చేసి బయటకు పంపుతారు. ఎరువుల్ని కుట్టినట్టు గోతాల్లో నింపి, సీలువేసి, తోలివేస్తారు. దీన్ని పశుగణానికి విటమిన్ ఆహారంగా వాడతారు. రోజూ మానెడుదాకా వేస్తారు. సాంద్ర ఆహారంక్రింది లెక్క. వ్యవసాయ రంగంలో, పశుగణాలపట్ల శ్రద్ధలో అదొక ముఖ్యాంశం. యీ ప్రాంతంలో మామూలు భూముల ధరలు 3, లేక 4 వేల రూపాయలు, ద్రాక్షతోటలు వేసేవి 7500, లేక 10,000 దాకా వున్నవి. వరిపంట భూములు 3 లేక 4 వేల రూపాయలు, కొన్నిచోట్ల యివే 6000 రూపాయలదాకా వున్నవి. ఖరీదుల్లో మనకన్నా పెద్ద తేడా లేదు. కాని వరుమానంలో తేడా జాస్తి. పూర్వం కార్పొరేషన్లు యేర్పరచి వ్యాపారాలు చేసేవారు. యిప్పుడు వ్యవసాయరంగంలో అమెరికాలో కార్పొరేషన్లు నిర్మించి, వ్యవసాయాన్ని పరిశ్రమస్థాయికి మలిపారు. కొందరి చేతుల్లో వ్యవసాయంగా, మరి కొందరి చేతుల్లో ఒకరీతి కుటుంబజీవనంగా, మరి కొందరి చేతుల్లో భారీ పరిశ్రమగా రూపొందుతుంది. మిశ్రమంగా వుంది నేటికథ. మొగ్గు మాత్రం పరిశ్రమరీతులకే వుంది. ధరల విషయంలో 100 పౌనులకు 41/2 డాలర్లు చొప్పున వరికి, ప్రత్తికి 35 సెట్లున్నూ, బార్లీకి నూరు పౌన్లకు 11/2 డాలర్లు ఖరీదు కలదు. యివి సాధారణంగా చలామణి అయ్యేధరలు. వ్యుత్పత్తిదార్లు వినిమయదార్లు కలసి ధరల స్థిరీకరణ పద్ధతి లేదు. కాని, పైర్లవారీగా విస్తీర్ణ కంట్రోలు కమీషన్ చేయు సూచనలను, ఆయాపైర్లు పండించే రైతాంగం నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయాలే ప్రభుత్వానికి, శిరోధార్యాలుగా వుంటై. వుదాహరణకు కెన్నడి గోధుమలు పండించే విస్తీర్ణం తగ్గించండి. ధరలలో చిక్కులు వస్తవని రైతులకు విజ్ఞప్తి చేశారు. కాని రైతులు రిఫరెండంలో కెన్నడీ సూచనను తిరస్కరించి, మామూలుగా పండించేటంత పంటనే పండించాలన్నారు. యీ నిర్ణయాన్ని ప్రభుత్వం అంగీకరించింది. రైతులకొక వనరుంది. మీ పంటను భీమాచేసి ఆనాటి ధర ప్రకారం డబ్బు తెచ్చుకోవచ్చు. ధరపడితే ధాన్యం భీమా రోజు రేటు ప్రకారం ప్రభుత్వానికి వదలవచ్చు. ధర పెరిగితే, మీరే అమ్ముకొని భీమా చెల్లించవచ్చు. పత్తిని 2 లేక 4 బేళ్ళదాకా ఎకరానికి పండిస్తారు. బేలు అంటే 500 పౌన్లు, బార్లీ 4000 పౌన్లుదాకా పండిస్తారు. యిట్లాగే యితర పంటలున్నూ. పొలాల్లోకి చాలాచాల దూరం వెళ్ళి చూచాను. రాక పోకల సౌకర్యాల వనర్లు బాగున్నవి. వాహనాల మెహర్బానీతో జరిగే సాగుబడుల్లో రోడ్లు బాగులేంది కథ నడవదుకదా! నగరాల సౌరుసంపదలకు తగ్గని వ్యవసాయ సానువులు కలవు. వ్యవసాయపు పల్లెలు, గ్రామాలు పట్టణాలకన్నా వనర్లు తక్కువవి కావు. పల్లెల్లో దొరకంది. అదనంగా పట్టణాల్లో దొరికేదేమీ లేదు. *--*--* అంతర్జాతీయ రైతు లోకం వాషింగ్టన్.లో యెన్నో చూస్తున్నాను. యెందరనో కలుస్తున్నాను. కాని ఆగస్టు 24వ తేదీ అంతర్జాతీయ కర్షక సమితి కార్యాలయానికి వెళ్ళాను. కార్యవర్గ సమావేశం జరుగుతుంది. మాజీ పోలెండు ప్రధాని స్టాన్యలావ్ కొలజన్క్ అధ్యక్షత వహించాడు. మాజీ బుల్గేరియా ప్రధాని డా.జార్జి డెమిట్రాఫ్, సమితి ప్రధాన కార్యదర్శి నన్ను పరిచయం చేశాడు. డెమిట్రాఫ్ బుల్గేరియా ప్రధాని. హంగరీ ప్రధాని ఫెరంకినాగీ, అంతర్జాతీయ కర్షక సమితి కార్యదర్శి బేలాబొకార్, అంతర్జాతీయ కర్షక సమితి పత్రికా సంపాదకుడు హర్నికాస్ బ్లాజాస్. క్రొయీట్రియా రైతు పార్టీ నాయకుడు డా. వ్లాడ్ కోమాక్, జెకొస్లోవేకియా రిపబ్లికన్ రైతుపార్టీ నాయకుడు చి.సోనిమారే, ఎస్తోనియా దేశ సన్నకారు రైతుపార్టీ నాయకుడు ఎవ్ నారే జార్వెస్సో, లిధుయేనియా దేశ బాల్యాస్ పెరంఖన్, స్లోవేకియా ప్రజాస్వామ్యపార్టీ నేత జోసెఫ్ లెట్రిచ్, రుమేనియా రైతు పార్టీ నాయకుడు డా.అగస్టిన్ పోపా, యుగోస్లావియా రైతు సమాఖ్య నాయకుడు డా. మిలాన్ గెరిలోవిచ్ మొదలైనవారంతా ఆ సమావేశంలో వున్నారు. వీరిలో చాలమంది ఆయా విషయాలమీద ప్రశ్నలు వేశారు. ఆ సమితిలో పాల్గొనే సదవకాశం కలిగింది. నేను గంటకుపైగా మాట్లాడాను. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. అధ్యక్షులు తుది ప్రసంగంలో ‘తమందరి సానుభూతి ఇండియా రైతాంగానికి సంపూర్ణంగా కలదు. మీ దేశంలో రైతునాయకులైన రంగాజీ మొదలుగాగల వారికి మా యీ సద్భావాన్ని అందజేయండి. ఎందరెన్ని కుట్రలు పన్నినా, మీ మా రైతులోక (రైతులు – రైతు కూలీలు) సమస్యల్ని మనం వుమ్మడిగా, సరిగా, న్యాయంగా పరిష్కరించుకోగలం. మా యీ విశ్వాసాన్ని మీ దేశానికి అంద జేయండి’ అని అన్నారు. నా చుట్టూ వున్న ప్రపంచం వేరు. మామూలుది కాదు. నా ప్రసంగం మామూలుది కాకపోలేదు చేరినవారికి కావలసింది. మన దేశంలో రైతులోకాన్ని ఆవరించే శాసనాల్ని గురించి, రైతు లోకస్థితిని గురించి చెప్పమన్నారు. చెప్ప మొదలు పెట్టాను. వివిధ రాష్ట్రాల్లో స్వదేశ సంస్థానాధీశులు, భాషా రాష్ట్రాల్లో విలీనం చేసిన దగ్గర నుండి, జమీందారీ విధానాల రద్దును గురించి చెప్పాను. వారంతా రైతులలోక విజ్ఞులు. ప్రశ్నలు వేస్తూ వుండగా మన కథనం నేను చెప్పుతూ వచ్చాను. ప్లానింగ్ కమిషన్ పాత్రను గురించి అడిగారు. రైతు లోక సంసారంలో వారి పాత్ర ఘోరంగా వుందని చెప్పగా, వివరమడిగారు. మా రాష్ట్రంలోనే గరిష్టపరిమితి నిర్ణయం రైతు ఆదాయ చుట్టాన్ని, అనుకున్నంత తీవ్రంగా లేదని రాష్ట్ర ప్రభుత్వానికి తిరగగొట్టారని చెప్పారు. ప్లానింగ్ కమిటీని యెవరెన్నుకున్నారని అడిగారు. ప్రధాని నామినేటు చేస్తాడు. ప్రజలు డబ్బు ఇచ్చుకుంటారన్నాను. ఎవరూ ఎన్నుకోని వారికింత పెత్తనం యివ్వడం రాజ్యాంగం ఒప్పుకుంటుందా అన్నారు. ఒప్పుకోదు, కాని నెహ్రూ రాజ్యంలో ఆ సందర్భాలు అవసరం లేదన్నాను. నవ్వి కొందరు, తల పంకించి కొందరు, కథ చెప్పమన్నారు. ‘మా కేంద్ర ప్రజాస్వామ్య సోషలిస్టు నాయకత్వం రు. 5,400 సాలీనా ఆదాయం గల కమతాల కన్నా వుండగూడదని రైతు లోకం మీదికి వచ్చారు. ఇతరుల ఆదాయాలు యెంతైనా వుండగా రైతులోకం మీదికే యెందుకు రావాలని రంగా మొదలైనవారు, హ్యూమనిస్టులము ప్రశ్న లేవదీశాము. మంత్రుల జీతాలు చూచినా, వుద్యోగుల జీతాలు చూచినా, సాలీనా రు.5400ల కన్నా చాలా హెచ్చు జీతాలు వస్తున్నవి. వ్యాపార లాభాల సంగతి అటుంచగా, యీపని మొదలుపెట్టారు. రైతులోకాన్ని నియతం చేయటం వీరి ప్రాతిపదికల్లో ఒకటిగా వుంది. నాగపూరులో కాంగ్రెసువారు చేసిన తీర్మానాన్ని పరోక్షంగా ఆచరణలో పెట్టాలని నెహ్రూ తాపత్రయంలావుంది. ‘వివిధ రాష్ట్రాలలో 240 దాకా రైతులోకాన్ని అనుశాసించే, శాసనాలు వచ్చినాయి. కొందరు భూమిని యెకరాల్లో, కొందరు డబ్బుగా గరిష్ఠ పరిమితుల్ని పెట్టారు’ అంటూ వుండగా, ఫెరంకి నాగీ గారొక ప్రశ్నవేశారు. ‘యిది కమ్యూనిస్టు గోముల్కా, టిటో, కాదు, రష్యాలకన్నా ఘోరంగా లేదా?’ అని. ‘అది నాకన్నా మీకే బాగా తెలియాలిగదా! మా దేశంలో జరిగేది చెప్పుతున్నాను. పోలండులో, యుగోస్లోవియాలో, రష్యాల్లో గూడా కొంతభూమి అన్నారేగాని, ఆ భూమి మీద వచ్చే ఆదాయం గరిష్ఠంగా నిర్ణయించలేదు. అందువల్ల ఆయా దేశాల్లో వున్న, యిచ్చిన యెకరాల్లో యెంతైనా వరుమానం తీయవచ్చు. మా దేశంలో ఆ వరుమానం మీద గూడా గరిష్ఠ పరిమితి కొన్ని రాష్ట్రాల్లో వచ్చింది” అన్నాను. అందరూ గుభేలున నవ్వి, ‘మా కమ్యూనిస్టులే నయంగా వున్నారే’, అని నకనకలాడారు. ‘ఆహారధాన్యాల వుత్పత్తిని తాము గ్రహించి, ప్రభుత్వ వ్యాపారం పెట్టారు. ఆహార ధాన్యాలకు కంట్రోలు పెట్టాలంటున్నారు. భూముల విషయంలో కుదురుకొనకుండా ఒకదాని తర్వాత ఒకటిగా శాసనాల్ని రుద్దుతున్నారు.’ “కొత్తగా 17వ రాజ్యాంగ సవరణ తెచ్చి, మామూలు భూమికి ‘ఎస్టేటు’ అన్న నిర్వచనాన్ని తగిలించి, దాన్ని ప్రభుత్వానికి తోచిన పరిహారంతో వారు తీసుకొంటే, కోర్టుకు కూడా పోవీలులేకుండా, మా స్వాతంత్ర్యం వచ్చిన 17వ యేట యీ 17వ సవరణను పెట్టుతున్నారు. దీనికి తీవ్ర సమీకరణ జరగవలసి వుంది. రంగా దీనికి ప్రముఖపాత్ర వహించి కృషి చేస్తున్నారు” అని చెప్పగా ‘న్యాయస్థానాల మీద నెహ్రూకి నమ్మకం యెందుకు పోయింది?’ అని అడిగారు. ‘పోయిందని కాదు. వారికెప్పుడూ ఉన్నట్లుగా వారు చెప్పలేదు. కాబట్టి ఒకనాడు వుంటేగదా పోయింద’నగా గొల్లున నవ్వారు. ‘మన వ్యవసాయ రంగంలో కూలీకి హెచ్చుగా యిచ్చి నప్పుడు గూడా రోజుకు రు.3లకన్నా యివ్వమనీ, అంటే 65 సెంట్ల డబ్బు అనీ, రైతులోకంలో వత్తిడిపని మూడు నెలలు మాత్రమే వుంటుంది. తతిమ్మా కాలములో పనులు వుండవనీ.... చెప్పాను. విస్తుపోయారు. “అయితే స్వరాజ్యం వచ్చిన తర్వాత మెరుగేమి జరిగింద”న్నారు ఏకకంఠంతో. “మెరుగులు కొన్ని రంగాల్లో వున్నవి. రైతు రంగంలో చెప్పతగినవి లేకపోగా, తరుగుదల లున్నవన్నాను.” ఇట్లా చర్చజరిగింది, అధ్యక్షులు సహృదయకంగా మన దేశానికి సందేశం యిచ్చి, మన సమస్యలు పరిష్కార మయ్యే దాకా, విశ్రమించక కృషి చెయ్యాలన్నారు. డా. జార్జి డెమిట్రాఫ్, ఫెరంకి నాగా కృతజ్ఞతా వచనాలు చెప్పారు. నా చుట్టూ వున్న కొత్త ప్రపంచమది! అమెరికాలో వ్యవసాయాన్ని గురించి పూర్తి చేయకముందు, టెన్నీసీలోయ పథకాన్ని గురించి రెండు మూడు ముక్కలు అనాలి. టి.వి.ఏ. అంటారు దీన్ని. టెన్నిసీ నదిలోయ అధికార సంస్థ అని అర్థం. టెన్నిసీ అమెరికాలో పెద్దనది. మిన్నెసోటా రాష్ట్రంలో పుట్టి, టెన్నిసీ రాష్ట్రాన్ని హెచ్చుగా పర్యవేక్షిస్తుంది. తియొడోర్ రూజ్ వెల్ట్ అధ్యక్షుడుగా వున్న 1902 ప్రాంతంలో దీని కథ ప్రారంభమైంది. 1903లో మొదటి బిల్లు యీ కార్యక్రమాన్ని గురించి వచ్చింది. పిన్ కాట్, మెగీ లిద్దరూ యీ పథక వివరాల్ని ప్రచారం చేసిన మేథావులు. తరువాత సెనటర్ నారిస్ దీన్ని చట్టబద్ధం చేయటానికి ప్రయత్నించాడు. 1928లో అధ్యక్షుడు హూపర్ నారిస్ చట్టాన్ని నిరాకరించాడు. 1933లో అధ్యక్షుడు హూపర్ నారిస్ రెండో చట్టాన్ని తృణీకరించాడు. నారిస్ తెచ్చిన మూడో చట్టం ఫ్రాంక్లిన్ డి. రూజ్ వెల్ట్ ఆమోదాన్ని పొంది 1933లో శాసనమైంది. నారిస్ డామ్ ఒకటి మేము చూచాము. అది యీ నారిస్ పేర రూజ్ వెల్ట్ పెట్టాడు. 1936 నాటికే నారిస్, వీలర్ డాములు తయారైనై. 1939 నాటికి టెన్నిసీ విద్యుత్ శక్తి కంపెనీ స్థాపితమైంది. 22 మునిసిపాలిటీలు, 11 సహకార సంఘాలు, యితరులు దీన్ని స్థాపించారు. విద్యుత్ శక్తికి, ఆహార ధాన్యోత్పత్తికీ, ఎరువుల అభివృద్ధికి, నిరుద్యోగ నివృత్తికి, పరిశ్రమల పెంపుకూ యీ టి.వి.ఏ. నిధానమై కూర్చుంది. 42 వేల చదరపు మైళ్ళ మేరలో యీ పథక ప్రభావాలు భాసించటం మొదలుపెట్టినై. అమెరికాలో నవశకారంభానికి యీ ప్రణాళికలే నాందీ ప్రస్తావనలు గావించినై. అసలు అమెరికా అప్పటి నుంచే ప్రారంభమైంది. *--*--* అమెరికాలో హ్యూమనిజం హ్యూమనిస్టు వికాసం, వుద్యమాలు అంతర్జాతీయంగా సాగుతున్నవి. అమెరికా లోని రీతులను యిప్పుడు పర్యాలోచన చేద్దాం. యిండియాలో హ్యూమనిస్టు వుద్యమ ప్రారంభం 1946 నుండి విశేషించి జరిగిందనవచ్చు. కాక, రాయ్ మొదలైనవారు యిండియాలో భావ పునర్వికాస వుద్యమం కావాలన్నప్పటి నుండి భావ విప్లవ వుద్యమచ్ఛాయలు తగిలినై. ఆ రెంటి సంహిధానమే హ్యూమనిస్టు వుద్యమంగా వచ్చింది. హ్యూమనిస్టు వుద్యమం, తత్వం, జాతీయవాదాన్ని, అంతర్జాతీయవాదాన్ని, వర్గ వాదాన్ని, మరే యితర సమిష్టి భావాన్ని అంగీకరించదు. వ్యక్తిగా వున్న మనిషిని, లేక, మనిషిగా వున్న వ్యక్తిని సమాజానికి మూలంగా అంగీకరించాలి. మానవుణ్ణి సర్వానికి కొలమానంగా, అధినేతగా చేయాలి. మానవేతర శక్తుల్ని తీసివేసి, మానవుని భవితవ్యం మానవుని కృషిమీదనే వున్నదని విశ్వాస పూర్వక కృషికి దిగాలి. ఉమ్మడిని తగ్గించి, వ్యక్తిత్వాన్ని పెంచాలి. అధికార రాజకీయాల్ని వదలి, సాంఘిక రాజకీయాలకు దిగాలి. వ్యుత్పత్తిని లాభానికి గాక ప్రయోజనానికిగా మార్చాలి. దోపిడిని వర్జించి, సహకార సంబంధ బంధాల్ని పెంపొంద చేయాలి – అది యిండియాలో హ్యూమనిస్టులు చేయ సంకల్పించి, చేస్తున్న పని. యిక అమెరికాలో యెట్లావున్నదో పరిశీలిద్దాము. అమెరికా పెద్ద దేశం. 50 రాష్ట్రాలు గలది. 18, 19 కోట్ల జనాభా గలది. విద్యాన్వితమైన ప్రాంతం, వ్యక్తి స్వేచ్ఛలంటే ఎక్కువ మక్కువగల దేశం. కష్టపడి పనిచేసి, తుష్టగా భోజనం చేసి, హాయిగా విహరిస్తూ, ఆనందాన్ని జీవితానికి అన్వయింప చేసుకునే దేశం. వ్యక్తి గౌరవాలను చేకూర్చుకుని, వ్యక్తి స్వేచ్ఛ, సాంఘిక సమాన ప్రతిపత్తులకోసరం నిత్యం చైతన్య పూర్వక కృషిచేసే దేశం, మానవుణ్ణి మానవునిగా చూడగలగాలన్న తాపత్రయంగల దేశం. అక్కడ 53 కమ్యూనిస్టు శాఖలున్నై. అమెరికా హ్యూమనిస్టు అసోసియేషన్, ఎల్లోస్ప్రింగ్స్ అను ఓహియో రాష్ట్రంలోని పట్టణంలో వుంది. అమెరికాలో వివిధ ముఖ్య పట్టణాల్లో హ్యూమనిస్టు శాఖలు గలవు. వాటిని ‘ఛాప్టర్స్’ అంటారు. కొన్నిటిలో 1500 వరకూ సభ్యత్వం వుంది. ఈ 53 శాఖలు, కేంద్రంలోని అమెరికా హ్యూమనిస్టు అసోయేషన్.లో అనుబంధ సంస్థలు, ప్రతి శాఖకు ఒక్కొక్క నియమావళి, ప్రణాళిక, కలవు. కేంద్ర సంఘ ప్రణాళికకు అనుబంధంగానే వుంటూ వుంటవి. భిన్నతలు కూడా వుంటై. హ్యూమనిజం, ప్రజలలో నమ్మకం కలిగి మానవకోటి మీద విశ్వాసంతో, సత్యాన్వేషణకు శాస్త్రజ్ఞానం అవసరమని భావిస్తూ, సాహిత్యంద్వారా, కళల ద్వారా, శాస్త్ర విజ్ఞానం, తత్త్వవిద్యల ద్వారా నైతిక, ధార్మిక విలువలను గ్రహించి, జీవిత సమగ్రత్వాన్ని పొంద ప్రయత్నిస్తుంది. హ్యూమనిస్టులు సహజంగా మతంలోగానీ, దైవిక సంఘటనలలో గానీ ఆసక్తి లేనివారు. యే రూపంలో వచ్చినా నియంతృత్వ భావాలకు వ్యతిరేకులు. “హెచ్చుమంది హ్యూమనిస్టులు, సంఘటిత కార్యకలాపాల్లో పాల్గొనే దానికన్నా, వ్యక్తిగతంగా తమ తమ భావాలను వ్యక్తం చేస్తూ, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వుంటారు. ఆవిధంగా మానవుని ఔన్నత్యం కోసరం, జీవితాన్ని విషయ గర్భితంగా పెంపొందించే దానికోసం ప్రయత్నిస్తారు” ఈ విధంగా అమెరికాలోని హ్యూమనిస్టు అసోసియేషన్ తన విధాన వైవిధ్యాన్ని నిర్వచించింది. సంఘానికి “ది హ్యూమనిస్టు” అన్న ఒక ద్వైమాసపత్రిక, “ఫ్రీ మైండ్” అన్న మరొక ద్వైమాస ప్రచురణ కలవు. అవి ప్రతినెల యేదో ఒకటి ప్రచురింపబడుతూ వుంటుంది. “హ్యూమనిస్టు వుద్యమాన్ని ‘మా వుద్యమం’ అనిపించినా హ్యూమనిజానికి ప్రత్యేక వునికినేర్పరచి, దాని వైశిష్ట్యాన్ని ఉగ్గడిస్తూ కూర్చున్నా. లోగడ మతాల స్థానే యిప్పుడు హ్యూమనిజం వచ్చి కూర్చున్నా, ఒక సిద్ధాంతంగా దీనిని గుదిగుచ్చినా, హ్యూమనిస్టులనగానే ప్రత్యేక వుత్సాహంతో వొళ్లు పొంగినా, మతేతర భావంతో మిలిటరీ ధోరణిలో పడినా, హ్యూమనిజం దెబ్బతింటుంది” అని హ్యూమనిస్టు సంస్థ యొక్క ముఖ్యోద్దేశంగా సంపాదకీయంలో వ్యక్తం చేస్తూ వుంటారు. అమెరికాలోని హ్యూమనిస్టు ఉద్యమ స్వరూప స్వభావాలను, కార్యాచరణలను అర్థం చేసుకోటానికి యీ దృక్కోణం నుండి చూడాలి. అమెరికాలోని హ్యూమనిస్టు సంఘాలేగాక, యితర నామకరణనాలతో వున్న సంఘాలనేకం వున్నవి. ఎథికల్ యూనియన్, సెక్యులరిస్టు సంఘం, యూనిటేరియన్స్, అమెరికన్ రేషనలిస్టులు, యుటిలిటేరియన్సు, ఎథికలిస్టులు, మొదలైనవెన్నో గ్రూపుల పేర్లతో వున్నవి అనేకంగా కనబడతవి. “ది హ్యూమనిస్టు”, “ది ప్రోగ్రసివ్ వరల్డ్”, “ది అమెరికన్ రేషనలిస్టు” పత్రికలు యీ వుద్యమానికి ప్రధాన పత్రికలు. యివిగాక, యివిగాక ప్రాంతీయ రంగాల్లో 15 పత్రికలకు పైగా వున్నవి. దేశం పెద్దదిగనుక, దూరాలు జాస్తి గనుక ఆయా ప్రాంతీయ సంస్థలు ఆయా చోట్ల పనిచేస్తూవుంటవి. వీటి కార్యక్రమాలు సంధానింప జేయటం కోసరం, కొంత కృషి అవసరం. అదొక అవసరకృషిగా రెండేళ్ళపాటు జరిగితే, బలీయమైన వుద్యమంగా హ్యూమనిస్టు వుద్యమం రూపొందగలదు. అక్కడ భిన్నంగా వున్న హ్యూమనిస్టుల్లో “హ్యూమనిస్టు ప్రపంచ డైజెస్ట్” అన్న వారు మతదృష్టితో కూడా హ్యూమనిస్టు వుద్యమాలను నడుపుతున్నారు. “ఎథికల్ యూనియన్” పత్రిక వారూ అంతే! మతం విషయంలో తప్ప, తతిమ్మా విషయాల్లో ఏకాభిప్రాయం కలిగివుంటారు. అమెరికాలో మతం అంత పెద్దల మత్తుమందు కాదు. కాని మత ప్రభావం లేక పోలేదు. వివిధ ప్రాంతాల నుండి హ్యూమనిస్టు భావ ప్రసార, ప్రచారాలకోసం, బోలెడంత సాహిత్యం తయారౌతూవుంటుంది. అనేక మంది ప్రఖ్యాత రచయితలు, విద్యావేత్తలూ, అధ్యాపకులూ, హ్యూమనిస్టు వుద్యమవ్యాప్తికి కృషి చేసేవారు కలరు. సమాజంలో హ్యూమనిస్టు ప్రభావం వున్న కొన్ని ప్రాంతాలు కలవు. కాని, ప్రభుత్వ స్థాయిలో దాని ప్రభావం యేమీ లేదు. కాని, వ్యక్తి వికాసభావం హ్యూమనిజానికి ప్రధానమైనట్లే, ప్రజల్లో కూడా వ్యక్తి స్వేచ్ఛపట్ల, దానికి యెవరన్నా అవాంతరాలు కల్పిస్తే, దాన్ని యెదిరించటంపట్ల, వున్న భావాలూ గమనిస్తే, హ్యూమనిస్టు ప్రధానాశయ ప్రభావం బాగా పుంజుకునేవుందని చెప్పవలసి వస్తుంది. యిప్పుడిప్పుడు, హ్యూమనిస్టు కార్యక్రమాల ఆసక్తి పెరుగుతుంది. ఇంకా విస్తరించే సావకాశాలు కనబడుతున్నై. *--*--* ఒక సన్నివేశం అది ఫ్రెజ్నో. సుందరనగరం. అమెరికాలోని చిన్న నగరాలలో ఫ్రెజ్నో అందమైన పట్టణం. ఒకటిన్నర లక్షల జనాభా. ఫ్రెజ్నో అనేక పంటలకు ఆకరం. వరి పండించటంలో ముందంజవేసిన ప్రాంతం. వ్యవసాయాన్ని భారీ పరిశ్రమగా మార్చిన చోటు, ఇండియాలో ఆంధ్ర వరిపంటకెటువంటిదో, అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం అటువంటిది. ఆంధ్రకు తెనాలి ప్రాంతమెట్టిదో కాలిఫోర్నియాలో ఫ్రెజ్నో అటువంటిది. ఇచ్చటి వాతావరణం పంటలకు అనుకూలం. మంచి క్షేత్రాలు. 213 రకాల పంటలు పండుతై. వరి, ప్రత్తి, ద్రాక్ష పంటలకు నిలయం. ప్రపంచమంతటిలో పండే ద్రాక్ష కన్నా యిక్కడే రెండు లక్షల టన్నుల పంట హెచ్చుగా వుంది. 200 కోట్ల కిమ్మతుచేసే వ్యవసాయ పంటలు పండుతై, ఎనిమిది పంటల్లో, తలసరి వ్యుత్పత్తి అధికంగా దేశంలో పండిస్తుంది. అచ్చటి ప్రజలకు తలసరి, సగటున కాకుండా, (అంటే తక్కువ వారు ఎక్కువ వార్లతో కలిపి కాకుండా) ప్రతి వ్యక్తికి 20 వేల రూపాయల ఆదాయం వచ్చే వనర్లు వున్నై. 57 జాతుల జనాలు వున్నారు. ప్రతి ఏడుగురిలో ఒకడు విదేశీయుడు. ఫ్రెజ్నో అట్టి కాస్మాపాలిటన్ వాతావరణం కలిగిన పట్టణం. చిన్నకారు పట్టణం. నగరం కాని పట్టణం. పంజాబూ రైతులున్న ప్రాంతం. పట్టణం పరిశుభ్రంగా వుంటుంది. కిక్కిరిసే కక్కుర్తిలేని విశాలమైన రోడ్లు, భారీగాగల ఖాళీస్థలాలతో ముఖ్యమైన ఆఫీసులుగల చోటు, రోడ్లకు యిరువైపులా వాషింగ్టన్.లో లాగా చెట్లుగలది ఫ్రెజ్నో. పట్టణమేయరు, జి.యల్.సెల్లార్డ్ గారిని చూట్టానికి వెళ్ళాము. నేను లోగడ తెనాలికి మునిసిపల్ ఛైర్.మన్.గా కొన్నాళ్ళు వున్నావన్న సంగతి ఎగిరి, మేయరు నాకొక సత్కారం తలపెట్టాడు. ఆ సత్కారం నిజానికి వ్యక్తిగా నాకు జరిగినా, నాదికాదు. మనదేశంలోని పౌర పాలనపట్ల ఫ్రెజ్నో పురీయులకుగల సద్భావబంధంగా మాత్రం, ప్రాతినిధ్య ధర్మంగా మాత్రం, చేయబడిందని నా భావన. ఆ సత్కారం యిది. ఫ్రెజ్నో పట్టణానికి నన్నొకరోజు గౌరవాధ్యక్షుణ్ణిగా, మేయరుగా, నియమించారు. మునిసిపల్ భవనంలోకి వెళ్ళాము. నా వెంటవచ్చిన ఎడ్వర్డు నన్ను మేయరుకు పరిచయం చేశాడు. మేయరు వారి సిబ్బందిని రావించి, వారిని నాకు పరియచం చేశాడు. ఫ్రెజ్నో సాలుసరి బడ్జెట్ కాపీలను నాకిచ్చారు. నన్ను, వారి ప్రక్కసీటుకు రావించి, ‘మా గౌరవం పొందండి’, అంటూ, నా మెడమీద మేయరు గుర్తుగల గౌనును వుంచి, ‘యిదుగో, మీరిప్పుడు మాఫ్రెజ్నో పట్టణాధ్యక్షులు యీ స్థానాన్ని అలంకరించండి, అంటూ తాను తన స్థానాన్ని ఖాళీచేసి, నన్ను కూర్చోబెట్టాడు. మరోక్షణం తర్వాత, మీరిప్పుడు పట్టణ పాలనాధికారంతో, కొన్ని ఫైల్సు చూసి, ఆర్డర్లు వేయండి అని చిరునవ్వు నవ్వుతూ అసలు మేయరుగారు చుట్టపు మేయరైన నన్ను గురించి మొదలు పెట్టాడు. ఒక ఆఫీసు అధికారిణి ఒక ఫైలు తెచ్చింది. నేను నవ్వుతూ ఫైలు మాత్రం తీసుకొని ఆర్డర్లు నాతర్వాత అధికారంలోకి వచ్చేవారు వేస్తారంటూట ఫైలు ప్రక్కన బెట్టి, సీటు ఖాళీ చేసి, నా వారసుణ్ణి నియమిస్తున్నాటనంటూ అసలు మేయరుగారిని, తిరిగి వారి కుర్చీలో కూర్చోపెట్టాను. హృద్యంగా నవ్వుకున్నాము. ‘అధికారం చాలు, చలాయింప నవసరం లేదు’ అన్నాను. ‘లేక చలాయించేవారికన్నా, వుండి చలాయింపనివారు ఉత్తమం కదా!’’ అన్నది ఆర్థిక శాఖాధికారిణి. తరువాత ‘టీ!’ గోష్ఠి. మనదేశంలోని మునిసిపల్ రీతులు, వారిదేశంలోని స్థానిక పాలనా పుంతలను గూర్చి చర్చించుకున్నాము. మనకు రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని గ్రామాలకూ వర్తించే పంచాయతీ చట్టాలూ, పట్టణాలకు వర్తించే మునిసిపల్ శాసనాలూ, వున్నట్లు వారికి లేవు. గ్రామాలూ, పట్టణాలూ ఆయా ప్రాంతాలలో వారివారి ప్రత్యేక యేలుబడి విధానాలను ‘ఛార్టర్లు’గా నమోదు చేసుకోవడం వారికి రివాజు. అది మనకు అందని రీతి. దాన్ని వారు ప్రజాస్వామ్యంగా భావిస్తారు. మన శాసనాలూ, స్థానిక ప్రజారాజ్య పాలనను ‘నియతం’ చేస్తున్నవని వారి అభిప్రాయం. చర్చలు చాలాసేపు జరిగినయ్. తర్వాత నా మీద వారుంచిన మేయరు గౌను తీశాను. ఆఫీసునంతా చూపారు, కొంత సాహిత్యం యిచ్చారు. నేను ఆరోజు ఫ్రెజ్నోలో యేమికొనాలన్నా, దానిమీద స్థానిక, రాష్ట్ర, కేంద్రపుపన్ను లేకుండా వుంటుంది. అది వారిచ్చిన అతిథి సత్కారంలో అంతర్భాగం. అదొక సన్నివేశం. మరపురాని హృద్గత సన్నివేశం. వారి సౌజన్యాన్ని ప్రతిబింబింప చేసే సన్నివేశం. నాకది ఫ్రెజ్నోలో దొరికింది. *--*--* దృశ్య ప్రబంధాలు అమెరికా ఒక పెద్ద ప్రబంధం. అందులో తిరుగాడే వారికి అనేక దృశ్య ప్రబంధాలు వేద్యమౌతై. నేను మన తెలుగు ప్రబంధాలనేగాక, అమెరికాలో కొన్ని ప్రబంధాలను చూశాను. మనోజ్ఞమైన దృశ్యాలవి. మంచిని పెంచిన దృశ్యాలవి. మనిషికి ఉత్తేజాన్ని కల్గించిన దృశ్యాలవి. మనో వికాసాన్నిచ్చి, వుద్వేగతలను కలుగజేయ జాలినవవి. ఏ దేశంలోనైనా కొన్ని దృశ్యకాండలు వుండితీరుతై. మన దేశం వచ్చి, హిమవన్నగాన్ని చూచి, కాశ్మీరీ లోయలు పరికించి, కేరళ వనులు చూచి జలపాతాలను కాంచి, అజంతా, ఎల్లోరా, ఎలిఫెంటాదుల దృశ్యాల్లో మైమరచి, ‘అబ్బా! ఎంత అద్భుతాల’ని తలయూచని వారుండరు. దేనినో ఒకదాన్ని చూపి, - అది తాజ్ మహల్ కాకపోవచ్చు – తనూ సంతృప్తిపడి, మనకు సంతృప్తినిచ్చినట్లు భావించటం సహజం. అవి కొన్ని నిజంగా బాగుండడం కూడా కద్దు. అమెరికాలో నా పర్యటన కాలంలో నేను అక్కడక్కడా చూచిన దృశ్యాలను, ప్రబంధాల్నిగా చూడగలిగాను. వాటి జాడల్ని, ఆనుపానుల్ని, మనవారికి కొంతగానైనా అందించాలి గదా! ఇది నేను చూచినదానికి, నాతోటి వారికిచ్చే పంక్తిభోజనం. వారికగు నానివేదన. నయాగరా నయాగరా జలపాతం జగద్విఖ్యాతం. చూచిన తర్వాత యీ దృశ్యాన్ని యెంత శ్రద్ధగా ప్రయాణీకుల కేంద్రంగా చేశారో ననిపిస్తుంది. నది, యిటు అమెరికా, అటు కెనడాల మధ్యవుంది. నేను న్యూయార్కు నుండి బఫెలో విమానాశ్రయంలో దిగి, బస్సులో నయాగరా పట్టణం చేరాను. నయాగరా దృశ్యానికి దగ్గరలో బస చేశాము. నాల్గు, అయిదు ఫర్లాంగులమేర చక్కటి పచ్చిక బయళ్లు, పూలచెట్లు, తీర్చిదిద్దిన రోడ్లు, బస నుండి యీ దృశ్యం చూస్తూ వెళ్ళి, నయాగరాకు తూర్పుకట్టనున్న ఒక గోపురం వద్దకు చేరి, అది అవరోహించాము. ఒకవైపున నయాగరా జలపాతం, ప్రక్కగా గుర్రపు నాడె రూపంలో గల మరొక జలపాతం చూచాము. అసలు కెనడా తీరం కనబడుతుంది. నదిలో, జలపాతం దిగుదల లాంచీలు జనాన్ని నదీ మధ్యంలోకి తీసుకెళ్ళి తీరాలకు చేర్చి వేడుకలకు వింత గొల్పుతున్నై. ఆ బోటు ప్రయాణం బహు సర్దాగా వుంటుంది. ఆ ప్రయాణం అంతా జలపాతానికి అధోభాగాన జరుగుతుంది. జలపాతపు ఔన్నత్యాన్ని అభివ్యక్తం చేస్తుంది. తరువాత ఒడ్డుచేరి, ఒక బుడ్డరైలు – మోటారు రైలు మాదిరిది ఎక్కి, పిల్లల ప్రయాణంలాగా తోటలో తిరుగాడుతూ, జలపాత దృశ్యం చేరాము. గుహలు గుహలుగా వున్నై. నయాగరా జలపాతంలోకి వెళ్లాము. గుహలలో మామూలు దుస్తులు మార్చి, రబ్బరు దుస్తులు వేశాము. తలకు రబ్బరు టోపీలు పెట్టాము. చలి ప్రాంతాల గోరాడే సీమజనంగా తయారైనాము. ఒకరివెంట ఒకరం – స్త్రీలూ, పురుషులు – కేరింతలు కొట్టుకుంటూ జలపాతానికి చేరాము. కాళ్ళు విసిరేవాడొకడు, చేతులు సరిచేసేదొకతె, గంతులేస్తూ పాటలు పాడేవారు కొందరు. తల నీటిధారల్లో దూర్చి, వుఫ్, గుఫ్ అనే వారు కొందరు. అందమైన గందరగోళం చేశాము. అరగంటదాకా జలపాతపు అడుగుల్లో దాగి, దాని మడుగులు చూచాము. ఎంత వుత్సాహాన్నీ, వుద్వేగాన్నీ యిచ్చిందా దృశ్యం! ఆ అనుభవం!! శివజటా జూటాన్ని చదువుకున్న మాకు, మన చిత్రకారుల చిత్రాన్ని చూచిన మనం, యీ దృశ్యభావాన్ని పొంది, పూర్వపు మిధ్యకు వాస్తవికతను కల్పించినట్లుంది మా అనుభవం. స్వచ్ఛమైన నీరు, త్రాగవచ్చు. త్రాగిన వారూవున్నారు. హెచ్చుమంది కేవలం పుక్కిలిపట్టి వదలివేశారు. నయాగరా చూడని కవులు వ్రాసిన తెలుగు కవితల్ని, చూచి వ్రాసిన యింగ్లండు కవితల్ని యేకరువు పెట్టుకున్నాము. శీతల వాతావరణంలో, తుంపురుల పుంజాలు రాగమాలికలలాగా దోబూచులాడుతూ, వెనువెంట గోరాడుచూ వుంటుంది. వర్ణించడానికన్నా, అనుభవించడానికే అనువుగా వుంది. దీన్ని ‘మెయిడ్ ది మిస్ట్’ అని వర్ణించారు. ‘మంచుల బాల’, కొందరు ‘అందాల రాణి’ అన్నారు. కొందరు ‘విద్యుత్రాజు’ అన్నారు. పలువురు పలువిధాల పొగిడారు. అమెరికావైపు నయాగరా జలపాతాన్ని చూచి, ప్రశాంత సాయంతనం గడిపాము. రాత్రి యూనివర్సిటీ క్లబ్.లో విందుచేసి, నయాగరా నదిదాటి, కెనడాలో ప్రవేశించాము. రాత్రిపూట నయాగరా చూడాలంటే, కెనడావైపు నుంచే చూడాలి. జలపాతం అడుగున, శిఖరానికి శోభాయమానంగా కెనడా తీరం నుండి లైట్ల ప్రసారం వుంటుంది. ఆ వెన్నెలలో చిమ్మే విద్యుత్కాంతిలో, నయాగరా జలపాతపు హొయళ్ళు చూడవచ్చు. నిగారింపులు తిలకించవచ్చు. ఫేనపుంజపు గల్లంతులు చూడవచ్చు. ఆకుపచ్చలో తెలుపు, తెలుపు నీళ్ళపై వెన్నెల ప్రసారం, ఆ మిశ్రమగతిపై రాత్రి ప్రభావం, దాని అంచుల మన భావాల విజృంభణలు, అదో లోకాన్ని సృష్టించింది. ఆరాత్రి మధురిమలను గుమాయించింది. మనోజ్ఞంగా వెళ్ళిపోయింది. అది నయాగరా రాత్రి కెనడాలో నయాగరా ప్రక్కన పెద్ద మేడ వుంది. హోటలుగా, విశ్రాంతి కేంద్రంగా వుంది. దానిమీదకు వెళ్ళి నయాగరా రంగుల హొయలు చూడటం ఆహ్లాదాన్నిస్తుంది. మనకున్న మంచి చోట్లను అట్లా అందాలు చిందేటట్లు ఎందుకు వుంచుకోరాదా? అనిపిస్తుంది. కాసేపు బయట నుంచుంటే, జుట్టు తడిచిపోతుంది, నిలబెట్టిన కార్లు నీళ్ళతో కడిగినట్లౌతుంది. అంతగా తుంపిరి పడుతుంది. రెండు ఫర్లాంగుల మేరకు విస్తరిస్తుంది. తిరిగి రాత్రి పన్నెండుగంటలకు రెడ్ కోబ్ యిన్ బసకు చేరాము. నయాగరా స్మృతిపథంలో హత్తుకు, పోయింది. అది మనదిగా మారిపోయింది. మనం దానివారమయ్యాము. అందుకే నయాగరా అందరిదీ, చూచినవారందరిదీ! అయితే అమెరికా కెనడాల వుమ్మడి సంపద. డిస్నీలాండ్ మన పురాణాల్లో సృష్టికి ప్రతిసృష్టి చేసిన పేరు ప్రతిష్ఠలో లేక అప్రతిష్ఠలో, విశ్వామిత్రునికి దక్కి, విశ్వామిత్ర సృష్టి యన్నది నానుడిగా నిలిచిపోయింది. మరి ఆ సృష్టి స్వర్గమో, లేక నరకమో, లేక మధ్యేమార్గమో, యెవరికీ తెలియదు. లేక స్వర్గానికి కేవలం నిచ్చెనలో కూడా ఎవరికీ తెలియదు. యేదయినా అట్టివాడు వుండి వుంటే, అతడు ప్రతిభావంతుడే అయి వుంటాడు. అదీగాక అతడు మన వేమనకు, త్రిపురనేని కవిరాజుకు ఏదో అయివుంటాడు. అదెట్లా వున్నా, యిక్కడ కథ కేవలం దృశ్యాత్మకం. ఇదంతా మానవ సృష్టి – కొంత ప్రతిసృష్టి కూడా వుంది. డిస్నీలాండ్ సృష్టికర్త విశ్వామిత్రునికి చుట్టం కూడా కాక పోవచ్చు. అతడు వాల్టు డిస్నీగారు. ప్రతిభావ్యుత్పత్తులు కలవాడు. అసలు కలవాడు. దాన్నొకలోకంగా భావించి, లోకవృత్తాన్ని యావత్తు, సృష్టించాలని, పనిబూని విలువలేని ధనాన్ని వెచ్చించి, యీ డిస్నీ సీమను సృష్టించాడు. చిత్రకళాసృష్టికి, ప్రకృతి ప్రతిబింబ గ్రహణకు, కిమ్మత్తు ఎంత అని అడుగరాదు. డిస్నీలాండ్ మానవుని ప్రతిభకు నమూనా లాంటిది. గీటురాయి. డిస్నీలాండ్ ఒక చిత్రకళాసీమ మాత్రమే కాదు. ఆది ప్రాచీన, మాధ్యమిక, వర్తమాన కాలాల మానవకృషికీ, ప్రకృతికి ప్రతిబింబం, పురాణ, లేక, మతదృష్టలతో నిర్మాణాలున్నవి. చారిత్రక దృష్టితోనూ, కట్టడాలున్నవి. దానికన్న శాస్త్ర దృష్టితో ప్రధానంగా ప్రత్యామ్నాయ సృష్టి జరిగింపబడింది. మిశ్రమ భావుకత కూడా వుంది కాని, మొగ్గు శాస్త్ర పరిశోధనా గమ్యానికేవుంది. అదొక విజ్ఞానకేంద్రం గూడా! డిస్నీలాండ్ పిల్లలకు చదువులపంట, ఆనందడోలిక, వినోదసీమ, విహారక్షేత్రం ‘విశ్రాంతి కేంద్రం. పెద్దలకు మననీయ ప్రాంతం’ అమెరికావచ్చి, వీలున్నవారెవరూ దీన్ని చూడకుండా మగిడి రారాదు. డిస్నీ సృష్టికి మనం చేయదగిన వుపాయనం అది. అయితే, యేమిటీ డిస్నీలాండ్? డిస్నీగారి మాటల్లోనే చూద్దాం. ‘యిదొక తంత్రసీమ, యిందులో పౌరాణికతకూ, చరిత్రకూ, విజ్ఞానానికీ శాస్త్రానికీ, వినోదానికీ, చోటు కల్పించాము. యిక్కడ, పెద్దలకు అనేక పూర్వానుభూతులు మనోపరిధుల్లో పరిభ్రమిస్తవి. పిన్నలకు వినోదమిస్తూ, వర్తమానాన్ని ఎదుర్కోగల ధైర్యాన్ని భవితవ్యాన్ని యీయదగ మనోభావాల్ని యిస్తుంది’ అని అనవచ్చు నన్నాడాయన. డిస్నీలాండ్ కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజల్సు పట్టణానికి షుమారు 35 మైళ్ళ దూరంలో నిర్మింపబడింది. లాస్ ఏంజల్సు నుండి నిత్యం బస్సులు, కార్లు, అనంతంగా నడుస్తూనే వుంటై అక్కడికి. పిన్నలకు పెద్దలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని యిచ్చే యీ వినోద సీమలోని విశేషాల్ని కొన్ని గానన్నా మనం పరిశీలన చేసుకోవాలి. చూడని వారికీ, చూడలేనివారికీ, కొలదిగా నివేదించే కార్యక్రమం యిది. డిస్నీలాండ్ ఆవరణ పెద్దది. ఆ అవరణ చుట్టూ రమారమిగా సిమెంటు స్తంభాల మీద రైలు పట్టాలు కట్టి విమానంలాగా, పెద్ద నడిచే తిమింగలంలాగా కనబడే ఒక రైలు ప్రయాణీకుల్ని త్రిప్పుతుంది. రైలు – మోటారు – విమానయానాల్ని కలిపిన వనరు కనబడుతుంది. యీ ప్రయాణంలో! దీనిలో ప్రయాణం ముందుగా చేస్తే, డిస్నీలోని చాలా యితర విషయాలు స్థూలంగా కనబడతై. దాన్ని గురించి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తుంది. యిదిగాక మరొక రైలు గూడా వుంది. అది రైళ్ళు కనిపెట్టిన రోజుల్లో బుడ్డరైళ్ళ శ్రేణిలోది. అయిదారు స్టేషన్లు, యితర రూములూ హంగామా అంతావుంది. సైకిలు పరుగులాంటి రైలు. వివరంగా అన్ని మూలలూ చూడటానికి అనువుగా వుంటుంది. యిది పిల్లల రైలు, పెద్దలూ ఎక్కుతారు. డిస్నీలాండ్ చూడటానికి ఒక టిక్కెట్టు కొనాలి. సాధారణంగా డిస్నీని చూడటం కాక, ప్రత్యేకంగా నాలుగు చిత్రసన్నివేశాల్ని మన యిష్టప్రకారం చూడవచ్చు. తతిమ్మా భాగాలు చూడాలంటే దేనికయినా టిక్కెట్టు దానికిగా కొనుక్కోవాలి. మొత్తం అన్ని కక్ష్యలూ చూడటానికి ఒక నూరు రూపాయల పైగా అవుతుంది. అందులో అనేక వినోదాలున్నై. అన్నీ నేను చూడలేదు. అన్నీ వర్ణించటం సాధ్యం కాదు. సంగీతంలో నిష్ణాతులు అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ నృత్యాలకూ, డాన్సులకూ, నాటకాలకూ, సంగీతకచ్చేరీలకూ, వుదాత్తల్ని కల్పిస్తూ వుంటారు. చిత్రకారులు ముఖ్యంగా కార్టూనిస్టులు, లోక యితివృత్తాన్నిరాపాడిస్తూ, హాస్యానికి అవధులు లేవేమోనని రుజువు కోసం రోదసీ యాత్రికులలాగా కుంపిస్తూ వుంటారు. అనాది అమెరికా నుండి ప్రపంచ కేంద్రం కావాలనే అమెరికాదాకా, దార్లూ రహదార్లూ మలుపుతూ వుంటారు. ‘మికీమౌస్’ కార్లూన్లు కడుపు చెక్కలయ్యేట్లు నవ్విస్తవి. మనకు ఒకవేళ నవ్వు రాకపోయినా, నవ్వే కుర్రల్ని చూచినా, మనకు నవ్వు ఆగదు. కథ గిరులు దాటి పోతుంది. రంగుల రాట్నాలున్నై. మనుష్యులు కూర్చునే సైజు కప్పులు, సాసర్లు వున్నై. వాటిలో మనుష్యుల్ని కూర్చోబెట్టి, గబగబా విద్యుత్సహాయంతో నడుస్తై, పరుగులెత్తుతై. ఒకదానికొకటి కొట్టుకుని బ్రద్దలైపోయి మనుష్యులెక్కడ చస్తారోనన్నంత భీతాహం వేస్తుంది. కలిగే వినోదానికి కడుపుబ్బుతుంది. రంగుల రాట్నాల్లో యీ సాసర్ల పరుగుల్లో పాల్గొన్నాను. ఆవేదనలేని ఆవేశాన్ని పొందాను. హాస్యాలు కాని వినోదాన్ని, వినోదాలుకాని హాస్యాల్ని, వుభయంగా వుండి, వుభయం కాని వాటిని కాంచాము. గుర్రాలు కావు. కాకపోలేదు. కేవలం గాడిదలు కావు. బహుశః కంచర గాడిదలేమో! కాక, మూటిమిశ్రమాలో! వాటి మీద యెక్కి డిస్నీలాండ్.లో కొండలు, గొహలు, అరణ్యాలు, నదీనదాలను దాటాము. అరగంటకుపైగా పడుతుంది. ఆ పూట పిల్లకారులో చేరాము. పిల్లల కేరింతలూ, వారి హావభావ విలాసాల్ని చూరగొన్నాము. దృశ్యాల్ని అనుభవించాము. ఒకచోట ‘యిండియా గృహం’ చూచాము. ఆదారి ప్రయాణంలో మాటయిది. కదులుతూ, కాపలాలుకాస్తూ, పోయిరాజేస్తూ, పొక్కిరింతలు వేస్తూ, పాతపాటలు పాడుతూ, వారి నాగరికతను ప్రదర్శిస్తూ, రెడ్ యిండియన్లు కనబడ్డారు. అజాగ్రత్తగా చూస్తే రెడ్ యిండియన్లు గాబోలు ననుకుంటాము. కాని వారంతా, ప్లాస్టిక్ జనాలు! ఓరిడిస్నీ! యెంత మోసం చేశావురాభాయ్! అనిపిస్తుంది. అట్లాగే యీ గుర్రాలదారిలో కనబడే వివిధ రకాలైన పాములు, వుడతలు, ముంగిసలు, గొర్రెలు, మేకలు, పులులు, సింహాలు, సింగాలు, ఏనుగులు, వొంటెలు, జిరాఫీలు, తిమింగలాలు, వివిధరకాల పిట్టలు, నక్కలు, కుక్కలు కదిలినట్లే వుంటవి. నిజాలుగానే కనపడతై. నిలచిచూస్తే అంతా ప్లాస్టిక్ సరుకే! యిదెంతభ్రాంతి గొలుపుతుంది. శంకరుని మిథ్యా వాదాన్ని మెడమీదతన్ని మొనగాడిలాగ నిగిడిచూస్తుంది. తిరిగ తిరిగి, యివన్నీ చూచినా చూడక, చూడకపోయినా చూచినట్లయి, సముద్రతీరం చేరాము. గుర్రాల్ని దిగాము. అవి నీళ్లే గాని, సముద్రతీరం కాదు. లోగొన్న ప్రస్తుతినిబట్టి సముద్రం కాకపోలేదు! ముందు జలాంతర్గామిలో యెక్కాము. ‘సబ్ మెరైన్’ అంటారుగా దీన్ని. నీటిమీద తేలి తిమిగంలం బోటులాగుంది. చేరికూర్చున్నాము. ప్రక్క జాస్తిగా గ్లాసుతో నిర్మించారు. జనం చేరగా, సముద్రంలోకయానానికి తరిలాము. ముడుంగున మునిగింది. 40, 50 అడుగుల లోతులోకి వెళ్ళింది. మేము నీళ్ళోలో మునిగిపోయాము. కాని బోటులో భద్రంగా వున్నాము. సముద్రగర్భంలోకి వెళ్ళాము. సముద్రగర్భంలో రత్నాలు వుంటవని తప్ప, మరేమివుంటవో – చేపలు, తిమింగలాలు తప్ప – తెలియని చదువులు ఆర్ష చదువులు. మా చదువులకు మించి చూచాము. ఒకచోట, పెద్ద తిమింగలం మా వైపు వడిగా వచ్చి మా బోటును మ్రింగటానికి నోరు తెరిచి మాపైకి, పైపైకి వచ్చింది. బాలలు గోలలు గగ్గోలు పెట్టారు. కెవ్వున కేకలు వేశారు. మేమూ, మగవాళ్ళుగా నటించి – మేము వులిక్కిపడ్డాము. అది మమ్ము మ్రింగలేదు. బ్రతికి బయటపడ్డాము ‘బ్రతుకు జీవుడా’ అన్నంత పనియైంది. ఆ తిమింగలం కూడా ప్లాస్టిక్ తో చేయబడినదే.. అదిగాక సముద్రగర్భంలోనున్న వేలాది జాతులు – వృక్షాలేమి, మృగాలేమి, చేపజాతులేమి నాచురకాలేమి, అబ్బాయెన్ని రకాలు! అవన్నీ చూచాము. చూడటమేమిటి, సముద్రమంతా గాలించాము, మధించాము. కాని హాలాహలం తీసినదాకా రంగరింపలేదు. యీ జలాంతర్గామి ప్రయాణానుభవం నాకెంతో ఆహ్లాదాన్ని చేకూర్చింది. తరువాత ‘టీకిరూమ్’కు వెళ్ళాము. ఇది ప్రాయికంగా పిట్టల జగత్తు. అందులో చిలుకలు జాస్తి. అది మనదేశం కాదు గనుక, అవి బహుశః ‘రామచిలుకలు’ కావు! యీ సీమలోని కథంతా, ‘త్రిడిమెన్షన్’గా వుంటుంది. సినిమా కాని సినిమా, - ‘టీకిరూమ్’, సాంకేతికంగా దీన్ని ‘అడియో – యాని మెట్రానిక్స్’ అంటున్నారు. ‘సైలెంట్’ సినిమాల్లోనికి ‘సౌండ్’ వచ్చినప్పుడు, టెలివిజన్.లోకి రంగుల సంపద దిగినప్పుడు, యెంత గొప్ప పరిణామం వచ్చిందో, యీ ఆడియో – యానిమెట్రానిక్స్.తో సినిమా రంగంలోకి అంత పెద్ద పరిణామస్థాయి చేరుకున్న దన్నారు. చెట్లు, పక్షులు, పూలు, జంతువులు మాట్లాడతై. పాడతై. కాని గొంతుకలు మానవులవి వినబడతవి. యీ మాటలకు, పైవాటి కదలికలకు పొంకం కుదిరేట్టు చేశారు. అవన్నీ మన పురాణాల్లో మాదిరిగా, ‘మనుష్య భాషణంబులు నిట్లగు’ మాదిరిగా మాట్లాడుతవి. ధ్వనులు, సంగీతాలు, కుదిరివుంటై. వాటి నటనలకు అనువై వుంటై. వర్షాలు పడతై. పక్షులు, పూలు, కేరింతలు, కొడుతూ, కబుర్లు చెబుతూ, పాటలు పాడుతూ స్నానాలు చేస్తవి. యిది వినోదానికి సుగంధాన్ని యిచ్చిన రీతిగా, వుంటుంది. కవి వసంతోత్సవంలో మునిగి తేలుతూ, వుద్వేగించిన స్థాయిని చూడవచ్చు. వినోదానికి హేతువు. దీని వెనుకనున్నదంతా సైన్సు. నవీన శాస్త్రజ్ఞానాన్ని అన్ని హంగులతో, హొయళ్ళతో, వుపయోగించారు. ‘స్పేస్ రాకెట్ల’ వినియోగంలో వున్నంతహంగామా. శాస్త్రరీత్యా యీ ప్రయత్నం లోనూ ఉంది. అందుకే చెట్లలో పాట వ్యుత్పత్తికి యెంత శ్రద్ధ చేశారో గమనించటం కష్టం. అయితే అది మాజిక్ కాదు. గారడీకాదు. అవన్నీ వున్నట్లు కనబడుతుంది. కన్నట్టు, ఉన్నట్లనిపిస్తుంది. పురాణాల్లోని ఆకాశవాసుల్ని మించి వుంటుంది. పర్యవసానంలో దీన్ని ‘మ్యూజికల్ ఫాంటసీ’ అనవచ్చు – యిందులో 200 మంది గొంతుల సమైక్యత కనబడుతుంది. జర్మను, స్పానిషు ఫ్రెంచి, ఐరిష్ యింగ్లీషు భాషలు ప్రత్యక్షంగా ధ్వనిస్తవి. ఒక్కొక్కపాట సాగగా, 60 పక్షులు, అన్ని మూలల నుండి అందుకుంటై, పాటల్లో, మాటల్లో ధ్వని సంయమంలో అపశ్రుతి కానరాదు. మొత్తం ఒకొక ఆట యిరవై ఐదు నిమిషాలు పడుతుంది. గంటకు మూడుఆటలు వేస్తారు. వేలాదిగా ప్రేక్షక లోకం వస్తుంది. యిక తీగతొట్టి ప్రయాణం. రొండు కొండలు ఒకదానికొకటి ఫర్లాంగుపైగా దూరంగా వున్నై. ఆ రెండు కొండల మీద, రెంటిని కలుపుతూ, ఒక భారీ తీగ వేశారు. ఆ తీగకు ఒక అరడజను తొట్లు తగిలించారు. తొట్టికొక మనిషి యెక్కుతాడు. విద్యుత్ సహాయంతో ఆ తీగతొట్టి, అటునుండి యిటు, యిటు నుండి అటు మనుష్యుల్ని రవాణా చేస్తవి. గాలిలో ప్రయాణంలాగా వుంటుంది. భూమిని వీడని గుణం కూడా వుండి, వుత్సాహకరంగా నడుస్తుంది. మరొక దృశ్యం చంద్రగోళానికి రాకెట్.ను సంతరించిన వైనాన్ని చూపే వివరణ. వృత్తాకారంలో ఒక యిల్లు కట్టి చుట్టూ కూర్చోటానికీ, లోనపైకి పోను సన్నగా చంద్రబింబం దాకా దృశ్యపర్యటానికి వీలుగా నిర్మాణం చేశారు. జనం నిండగా, రాకెట్.ను చంద్రగోళానికి పయనింపచేస్తారు. దానికై ఎంత శాస్త్రజ్ఞానం అవసరమో , యెన్ని వివరాలు పరిశీలించాలో అంతా కచ్చితంగా చూడవచ్చు. యెంతో విజ్ఞానాన్ని పంచేచోటు అది. మైనం మనుషుల్ని తర్వాత చూద్దాం. ‘వాక్స్ మ్యూజియం’ అంటారు. అది ప్రకృతికి మరొక వికృతి. ప్రకృతి వికృతుల ప్రమేయాలు భాషారంగంలోనే కాకుండా మనుష్య రంగంలోకూడా చూపించారు డిస్నీసీమలో. 70, 80 మంది అంతర్జాతీయ ప్రఖ్యాత నటుల్ని మైనంతో చేసి, మీ ముందు ప్రత్యక్షింపచేసారు. తీరు తెన్నుల్లో, రూపకల్పనలో కించిత్తు తేడాగానీ, గోరంత లోపంగానీ కనబడదు. హాలీవుడ్.నే గాక, ప్రపంచంలో యెన్నో మూలల గల చిత్రసీమల్లో దోబూచులాడే నటీనటవర్గం యిక్కడ రూపాయికి కనబడతారు. క్షణంలో చూడవచ్చు. మైమరపు కొలిపే దృశ్యమిది. యీ వ్యక్తి చిత్రణలో యెంతో చిత్రశిల్ప కళాదృష్టిని ప్రదర్శించారు. కళ తొణికిసలాడుతూ, మైనంకన్న మెత్తగా వెన్నెల వెన్నెలల్ని చిందుతూ వుంది. యింకా ఎన్నో చిత్ర సంగతులున్నై డిస్నీలో. ఒక మూల ‘చూడండి అమెరికా’ అని ఒక అర్థచంద్రాకారంలో ఒక భవనం వుంది. లోనికి వెళ్ళి కూర్చుంటాము. సినిమా మాదిరి సాగుతుంది. రూజ్ వెల్ట్ కాలం నుండి, అమెరికా గత 30 సంవత్సరాల్లో పొందిన సంపదలను, సాధించిన యాంత్రిక సామాజిక విజయాల్ని చూపుతూ, త్రిడైమన్షనల్ చిత్రాన్ని చూపి, బాగా వుద్వేగపరుస్తారు. భౌగోళిక శాలలు, సైన్సు కేంద్రాలు మరెన్నో కలవు. వినోదంతోపాటు విజ్ఞానాన్ని మెత్తగా మేపుతారు. యిక ఒకటిరొండు క్షేత్రాల్ని చూసి డిస్నీకి శెలవిద్దాము. లేదా శెలవు తీసుకుందాము. చిత్రకళా కేంద్రం ఒకటుంది. మిమ్ము ఆపర్ని చిత్రంగా మార్చుతారు. 2, 3 డాలర్లకే గీసియిస్తారు. రంగుతో, కుంచెతో, పెన్సిల్.తో కలంతో వివిధ రీతులలో గీస్తారు. యెందరో కళాకారులున్నారు. నా యెదుట యెందరో యువతీ యువకులు, వేరువేరుగా, జంటలుగా తమతమ చిత్రాల్ని వ్రాయించుకొని, తామా బొమ్మలకన్నా బాగున్నారో, బొమ్మలే తమకన్నా బాగున్నవోనని వచ్చాందాలాడుతారు. బొమ్మలకన్నా వీరి వచ్చాందాలే బాగుంటై. కళలో ‘ఏనిమేషన్’ తేవాలని డిస్నీ కోరిక. ఆయన ఆరంగంలో బాగా నిపుణుడు. అందుకని “యానిమేషన్” మీదా ఆ తాలూకు మిక్కీమౌసుమీద. టీకీమీద, మోజుపుట్టి, కోట్లు వెచ్చించి వినూత్న దృశ్యప్రంబంథాల్ని సృష్టించాడు. అప్పటికప్పుడు గీసే బొమ్మలుగాక పెన్సిల్ స్కెచ్చీలను వేలాదిగా తయారుచేసి, వృక్ష, జంతు, పక్షి, మీన, మానవ జాతులకు సంబంధించి కృషి చేశాడు. కేవలం స్కెచ్చీలుగాక త్రివర్ణాత్మకంగా ఎన్నో మంచిచిత్రాలున్నై. ప్రకృతిని ప్రతిబింబించే రూపకల్పనలకు మితిలేదు. లండన్ లోని ట్రఫాల్గర్ స్క్వేర్ ప్రక్కనగల బ్రిటిష్ ఆర్ట్ గాలరీలో కల చిత్రాలతో పోటీ చేయగలవి అనేకం కలవు. చికాగో ఆర్ట్ గాలరీని త్రోసిరాజనగల చిత్రాలనేకం యిక్కడ బహుళంగా కలవు. డిస్నీలోకల్లా లలిత భాగాలివి. యిట్లా అంటూ పోతే చాలా దూరం పోవచ్చు. డిస్నీ వెళ్ళినంత దూరం పోవచ్చు. ఇప్పటికే చాలాదూరం వెళ్ళాముకూడా! గ్రాండ్ కాన్ యాన్ అరిజోనా రాష్ట్రంలో కొలరాడో నదీలోయలుగా, భూగర్భ కేంద్రాలుగా గ్రాండ్ కాన్ యాన్ ప్రసిద్ధి. ఒకనాడు అక్కడక్కడ నేడు కూడా కనుపించే రెడ్ యిండియన్ల దేశప్రాంతమది. వారి చిత్రకళా, శిల్పార, సౌరు సంపదలు, వారినేత వస్త్రాల పసందులు చూచే చోటది. ప్రకృతిని బాలెంతగా మనం చూడగలిగిన చోటది. గ్రాండ్ కాన్ యన్ చేరటానికి ఫ్లాంగాస్టాప్ విమానాశ్రయము నుంచి, పట్టణం వచ్చి, బస్సులో వెళ్ళాలి. నేను అమెరికాలో బస్సులో చేసిన పెద్ద ప్రయాణం కూడా యిదే. రూజ్ వెల్టు కాలంలో ‘నేషనల్ పార్క్’ అని కొన్ని వన్య ప్రాంతాల్నిప్రత్యేకించి సమిష్టి వాడుకకని ఒకరుగా యెవ్వరూ ఆ సంపద జోలికి పోకుండా యేర్పరచారు. అట్టి వాటిల్లో గ్రాండ్ కాన్ యాన్ ఒకటి. గ్రాండ్ కాన్ యాన్ సినిమాలోకి యెక్కింది. కోటానుకోట్ల సినిమాల్లో చూచివుంటారు. ప్రకృతికి యెంత రంగుల పసందు కలదో తనిఖీ చేయాలంటే నిజానికి గ్రాండ్ కాన్ యాన్.లో చూడవచ్చు. డిస్నీ కృత్రిమంగా ఎంత హుందాతనాన్ని ప్రతిబింబిపచేసిందో, గ్రాండ్.కాన్.యాన్ లోయ ప్రకృతి అందాన్ని చూపింది. ప్రపంచంలోని ప్రకృతి రూపకాల్లో అత్యంత చిత్రమైంది. మనుష్య నిర్మాణాలకు ప్రకృతి శోభలకు వ్యత్యాసాన్ని గాని సామ్యాన్నిగానీ పరికింపవచ్చు. గ్రాండ్.కాన్.యాన్ లో వర్షం కొద్ది పాతిక దుక్కులలోపు, అది కూడా ఒక వారంలో కుమ్మరించిపోతుంది. 217 మైళ్ళ బారు, 4 మొదలు 14 మైళ్ళదాకా వెడల్పు, ఒక మైలు లోతు వుంటుంది. మైలెత్తునా రెండు వొడ్డులుగా పర్వతశ్రేణులు నిగారించి, పొంచి వుంటై. వాటిమధ్య కొలరాడో నది వేగాతి వేగంగా పర్వులెత్తుతూ వుంటుంది. మైలు లోతు పర్వత శ్రేణులలో యిరువైపులా యెన్నో రంగులతో రాళ్ళు రవ్వలలాగా మెరుస్తూ వుంటవి. నాస్తికులు కూడా ప్రకృతికి జ్ఞానాన్ని ఆపాదించే చోటది. దీన్ని చూడాలి. చూచాము. కంచరగాడిదల మీద యెక్కి లోయల్లోకి లోతుకు వెళ్ళాము. మైలుదూరం నేలమీద పెద్దదూరం కాదుగానీ లోయల్లో యెగుడు దిగుడు ప్రాంతంలో చాలా పెద్దదూరం. దగ్గరలే దూరంగా మారేచోటది. గజం దిగటానికి యెన్నో వంకర్లు దిగాలి. దిగినకొద్దీ దిగాలి. తీరాదిగి, లోయగర్భాన్ని అంది, నిలచి పైకి చూస్తే చుట్టూ పరికిస్తే దిగ్భ్రాంతి కొలిపింది. మానవుడు ఎంత పొట్టివాడోనన్న భయం కలుగుతుంది. యింత చిన్నవాడైనా జ్ఞానప్రతిభల వెల్లువలవల్ల యెంతగా ‘యింతింతై… భువనమంతై అభోమండలంబంతై’ గోళం దాటి అంతర్గోళాల భాగాల్ని ఛేదించి యితర గోళాలకు ప్రాకుతున్నాడన్నది గుర్తుకు వచ్చి స్థైర్యంచిక్కి, ధైర్యంవిలోలం, కాకుండా నిలవగలిగినాను. యింతలోతు కోత పర్వత ప్రాంతాల్లో ఎన్నాళ్ళు పట్టిందోననిపిస్తుంది. భూగర్భ శాస్త్రజ్ఞులు 70 లేక 90 లక్షల యేళ్ళు పట్టి వుండవచ్చునని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోని ‘వాతావరణ ప్రాంతాలలోని యేడింటికీ, ఆరు గ్రాండ్ కాన్.యాన్.లోనే గలవన్నారు. హోపీ, నవోజా, హవాసుపాయ్, హయల్.పాయ్ అన్న రెడ్ యిండియను జాతులు గ్రాండ్ కాన్.యాన్ ప్రాంతమువారే. భూగర్భ శాస్త్రంలో అయిదు ప్రకరణాల్లో మూడు ప్రకరణాలు యీ లోయలోనే కలవు. 1540లో మొదటిసారి యీ ప్రాంతాన్ని సందర్శించినప్పటినుండి, నేటివరకు దానిప్రభావం, చరిత్ర పరిశోధనలు, భూగర్భ శాస్త్రంలో యితోధికాలు, భూగర్భ శాస్త్రంలో ప్రథమ శతాబ్ధిలోని ‘కొండముక్కలు’ గ్రాండ్.కాన్.యాన్.లో ప్రదర్శింపబడినై. వేసిన లెక్కలను బట్టి, అయిదు లక్షల టన్నుల కరిగిన మట్టి ప్రతి 24 గంటలలో నదిలో కారిపోతుందని అంచనా వేశారు. గ్రాండ్ కాన్.యాన్.లో 500ల దాకా చరిత్రకు పూర్వపుస్థలాలను శాస్త్రజ్ఞులు కేటాయించారు. అనేకమైన జీవనరాసులున్నై అక్కడ. 60 దాకా పాలిచ్చే విశేష జంతువులు. 180 దాకా పక్షిజాతులు, 25 మొసలి రకపు జీవులు, 25 రకాల దూకే జీవజంతువులున్నై. పార్కు చూడముచ్చటైన ప్రాంతం. మేము దాదాపు 30, 40 మైళ్ళ ప్రాంతం చూచాము. లోయల్లో, తిరిగాము. కొండలెక్కాము. మైలు లోతులో దాదాపు 100, 125 రకాల రంగులు విభిన్నత్వంలో పొరలు పొరలుగా తీర్చిదిద్ది కూర్చున్నవి. అవియెట్లా యేర్పాటై, అంత సుందరాకృతుల్ని యెట్లు తాల్చిందో, పరిశీలించటమే అదొక మహా ప్రబంధం, దాన్నే చూచాము. అది పంచిన, అందించిన ఆనందానుభూతుల్ని పొందాము. వనర్లకేమి? ఎక్కడికక్కడ హోటళ్ళు విశ్రాంతి భవనాలు గమ్మత్తైన పేర్లతో వున్నై. వుండటానికి, తింటానికీ యిబ్బంది లేదు. కొన్ని రోజులు వుండాలంటే గూడా వుండవచ్చు. అక్కడే కూర్చుని, కావ్యాలూ, కథలు వ్రాసుకోవచ్చు. కాన్ యాన్ హాలులో చుట్టాలు రాగానే ఒక భూగర్భ శాస్త్రపరిశోధకుడు, గ్రాండ్ కాన్ యాన్ పుట్టు పూర్వోత్తరాలను వినిపించి, సినిమా చూపుతాడు. కర్ణోత్సవ నేత్రోత్సవంగా వుంటుంది. బోలెడంత సారస్వతం అమ్మకానికి వుంది రెడ్ యిండియన్లు లేకున్నా, వారు తయారు చేసిన వస్తుతతి విక్రయానికుంది. ‘చేసినవారే అమ్మితే బాగుండునుగదా’ అన్నాను నేను. వారేమీ సమాధానం చెప్పలేదు. మూగ జీవాలగోడుల్లో అదొకటి. ఆ వస్తువుల్ని చూస్తే, నైపుణ్యంలో, మన్నికలో, కత్తులో మనదేశంలోని ఆదివాసులు, కొండజాతులు తయారు చేసిన వస్తువుల నకళ్ళుగా వున్నై యెంత స్వామ్యంవుందో పరికిస్తే సంబంధ బాంధవ్యాలు లేని జనాలు గూడా యెక్కడున్న ఒక రూపంలో ఒక హావ భావ విన్యాసాలతో ఒకే కళాలోకన దృష్టితో ఒకే ఆవేదనలో వుంటారని వ్యక్తమైంది. మానవులు ఎక్కడున్నా మానవులే, వారంతా ఒకటేనన్న సత్యం నిత్యంగా గోచరించి మనముందు నృత్యం చేస్తుంది. మన్ హాటన్ చుట్టూ న్యూయార్కు నగరం దీవుల నగరమని విన్నాము కదా! మన్ హాటన్ ఆ దీవుల్లో ఒకటి. పెద్దదిగూడా! దాని చుట్టూ హడ్ సన్ నది, అట్లాంటిక్ మహాసముద్రపు టంచులూ కలసి మెలసి గోరాడుతూవుంటై, చిన్నకారు స్టీమ్ బోటులో బయలుదేరి, యీ ద్వీపం చుట్టూ తిరిగివచ్చాము. చుట్టూ ముప్పది మైళ్ళు మూడు గంటల ప్రయాణం ఆయా ప్రాంతాల్లోని వివరాల్ని మనకు ఒకాయన వ్యాఖ్యానిస్తూ వుంటాడు. ఈ ప్రయాణం చాలా ఆహ్లాదాన్ని కలిగించింది. బోటులో తిండికి వనర్లు చేసారు. కబుర్లూ, కాలక్షేపాలూ చూచిన భవనాన్నలా ఫోటోలు తీసేవారూ – బోటంతా గందరగోళంగా కులాసాగా వుంటుంది. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత వారొక ‘స్వేచ్ఛామాత’ను పెద్ద విగ్రహంగా ప్రతిష్ఠాపన చేసుకున్నారు. సముద్రంలో ఒక చిన్న ద్వీపంలాంటి కొండవుంటే దానిమీద ఒక పెద్ద స్త్రీ మూర్తి విగ్రహం పెట్టారు. ఒక జ్యోతిని పట్టుకుని, ఆమె కుడిచేయి యెత్తి వుద్వేగాల పుంజంలాగా ఏర్పరచారు. బోటు ఆ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మన్ హాటన్ చుట్టటానికి పోతుంది. ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళినపుడు కోలాహలం గగుర్పాటు కలిగిస్తుంది. అమెరికావారి వలెనే మనం గూడా అదే బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం సంపాదించామని భావిస్తూ ఆ విగ్రహం చుట్టూ బోటు తిరిగి వస్తుంటే యెంతో సామ్యరూప భావాన్నీ పొందాను. మన్.హాటన్ చుట్టటంతో, న్యూయార్కులోని పెద్ద భవనాల పునాదుల ప్రక్కగా పోతూ, వాటి ఔన్నత్యాన్ని పరిశీలిస్తూ వుంటే ఒకదానికన్న మరొక భవనం పెద్దదిగా తోస్తూ వుంటే, అంతస్తుల్ని లెక్కించాలన్న భావన కలుగుతూ వుంటే, మనస్సును క్రిందికి దిగనీయని భావౌన్నత్యమే కుదురు కుంటుంది. ఒకచోట ఐక్య జాతుల సమాఖ్య కార్యాలయం ప్రక్కగా మలచాడు. బోటును, దాన్ని చూడగానే అంత పెద్ద సంస్థకు తగిన భవనమనిపిస్తుంది. లోనికెళ్ళి చూచాము మరెంతగానో వుంది. అట్లాగే యీ కంపెనీ వారి భవనం, ఆ కంపెనీవారి భవనాలూ యింకా యెన్నో కట్టడాల్ని చూస్తూ, ఆ కట్టడాల సౌరు సంపదల్ని, నిర్మాణ వైవిధ్యాల్ని అనుకుంటూ తిరిగాము. యెన్నో బోట్లు, నావలు, వోడలు చుట్టవేస్తూ వుంటై. నీటి మీద స్కేటింగ్ బోట్లు వల్లమాలిన వేగంతో నీటి అంచుల్ని చీల్చుకుంటూ ఝంకారం చేస్తూ పోతూ వుంటై. న్యూయార్కు నగర వీధుల్లో తిరగటానికీ, దాని చుట్టూ తిరగటానికీ, తేడాల్ని వూహించటంలో మనకెంతో కల్పనాచాతురి అలవడేటట్లు వుంటుంది. లోకోన్నత భవనం ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వత శ్రేణులు మనదేశంలో వున్నై హిమవన్నగమేగదా అది! అది ప్రకృతి యిచ్చిన లేక తెచ్చిపెట్టిన సొత్తు.. ప్రపంచంలోకల్లా ఎత్తైన భవనం న్యూయార్కులో వుంది. ‘ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’ 108 అంతస్తులున్నై అన్నే అంతస్తులతో అంతకన్న యెత్తాంటివి యిప్పుడు రెండు భవనాలు కడుతున్నారు. అవి పూర్తయితే మన యీ లోకోన్నత భవనం వెనుక బడుతుంది. ఈ భవనం ఒక నగరం లాంటిది. కోటానుకోట్లు కిమ్మతు చేస్తుంది. లిఫ్టులో రాత్రివేళ యీ భవనారోహణ చేశాము. మధ్యలో లిఫ్టు ఆగిపోతే యేమౌతుందోనన్న భయం సహజం. పగటివేళ చూస్తే న్యూయార్కునంతా చూడవచ్చు. రాత్రివేళ వున్నంత అందం పగటికేముంటుంది. వ్యవధి చిక్కితే రెండు వేళలా చూచి, తారతమ్యాన్ని వ్రాయవచ్చు. నేను రాత్రివేళే చూచాను. కోటానుకోట్ల విద్యుద్దీపాలు రంగు రంగుల హోయళ్ళతో రంగారినట్లు నాకెంతో అధోభాగాన కనిపిస్తున్నవి. నేను భ్రాంతి మంతంలో పడ్డాను. కవితల రాజ్యంలో దూరాను. నాకు నక్షత్రాల ప్రతిభ కన్పించలేదు. నేనేదో నక్షత్ర మండలం దాటి పైకివెళ్ళి, నక్షత్రమండలాన్ని నా పాదాక్రాంతం చేసుకుని, దానిమీద రేరాణుకై స్వారీచేస్తున్న భావన కలిగింది. కవుల్ని, భావుకుల్ని ఆమిద్దెకెక్కించి చూపితే వారు బాగా వ్రాస్తారు. ఆ స్థాయిలో నక్షత్రమండలం న్యూనత పొందింది. మానవుని సృష్టి వూపిరై కూర్చుంది. గ్రాండ్ కాన్ యాన్ లోయల్లో మైలు లోతున తిరుగాడేప్పటి భావాలకు యీ భవన శిరోభాగాన నడుచుచున్నప్పటి భావాలకు పోటీపడింది. గర్వాన్ని పెంచిన దృశ్యమది. మానవునికి అహంకారాన్ని యిచ్చే చోటది. ‘అహంబ్రహ్మాస్మి’ అనే వారుండవలసిన చొరవ అది. విమానం కన్న యెత్తు తక్కువైనా, యెంతో యెత్తుగా నున్నా నగ్న ప్రస్ఫుట భావం మదంతో చలాయించే చోటది. కన్నులకు భ్రాంతి కలిగింది. మనస్సుకు వుద్వేగం కలిగింది. నా క్రిందనున్న విద్యుల్లోకాన్నే, నా భ్రాంతికొద్దీ నక్షత్రమండలంగా యెంచి దాన్ని అపహశిస్తున్న నా భావాలు నాకే గుర్రాలై దౌడు తీయిస్తున్నవి. అదొక విద్యుత్ – నక్షత్ర మండలమై మిశ్రమై కూర్చుంది. చుట్టు తిరిగి తిరిగి చూచాను. పై చూచాను నక్షత్రాలన్నీ పై నుండి జారిపోయి, క్రిందికి దిగి, తోరణాలు కట్టుకుని తండోపలబ్ధిగా వర్ధిల్లుతున్నవన్న భావం కల్గింది. వాటిమీద జాలి వేసింది. యీ గందరగోళంలో రేరాణి తన గౌరవాధిక్యతలను పోగొట్టుకుని, బిక్కమొగం వేసి, ‘తారలు లేక నేనేమి చేయగల’నంటూ మబ్బుచాటుచేసి దాటుకుంది. ప్రకృతికే పరాభవం కలిగింది. చికాగో సరస్సులు చిన్నప్పుడు చదివాము. పెద్దయినాక చూచాము. ఆ మూడు సరస్సుల కొలికి, మామిడికాయల గుత్తిలా ప్రకృతిలో వ్రేలాడుతూ, దివిసీమల నుండి దిగివచ్చి, చికాగో ప్రాంతంలో మజిలీ కట్టినట్లుంది. అవి సరస్సులని అటంలో అర్థంలేదు. ఒరిస్సాలో, చిలకా సరస్సు చూచాము. సముద్రమంతగా వుంటుంది. కాని, చికాగో సరస్సులు సముద్ర పిల్లల్లాంటివి. సముద్రం మీద కోపించిన వారెవ్వరో – మన అగస్త్య మహాముని లాంటివాడు, - శపించి, మీ స్వేచ్ఛలు వదలి నేలలో బందీగా వుండడని సముద్రాల్ని శాసించి, వాటిని యీ సరస్సుల్నిగా మార్చారా! అనిపిస్తుంది. ఎంత పెద్ద సరస్సులు! అవి సరస్సు లేమిటి! సముద్రాలే ఎంత పెద్ద అలలు! తిమింగలాలూ దొరికే చోట్లవి, తిమింగలాలు నదుల్లో, సరస్సుల్లో గోరాడలేవు. వాటికి సముద్రాలే కావాలి. యివే వాటి సముద్రాలు. యీ సరస్సులో కొంతదూరం బోట్లమీద ప్రయాణం చేశాను. న్యూయార్కు దగ్గర అట్లాంటిక్ మహాసముద్రంలో శాన్ ఫ్రాన్సిస్కో వద్ద పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణం చేసినప్పుడు కల్గిన అనుభూతులే, మా ప్రయాణంలోనూ, కలిగినవి. యివి సరస్సులు కాని సముద్రాలు, సముద్రాలు కాని సరస్సులు. అవే చికాగో తలమానికాలైన మూడు సరస్సులు. *--*--* మరికొన్ని విశేషాలు మన యీ సంకలనంలో అనేక విషయ పరిశీలనల్ని చేశాము. కాని పరిశీలించిన రంగాలకన్నా, మిగిలి వున్నవే జాస్తి. పరిశ్రమల జోలికి పోలేదు. కళారంగాన్ని స్పృశింపనే లేదు. మరెన్నిటినో చూచీ చూడనట్లు వదలి వేశాను. ఇష్టం లేకకాదు. కష్టం వేసీ కాదు. చూడ వ్యవథి చాలక, చూచినవి గూడ వర్ణింపలేక. అందువల్ల మరికొన్ని చిన్నచిన్న విశేషాల్ని స్థాలీపులాకంగా త్రవ్వి పోస్తాను. లేత బుర్రలు కొక్కిరింపనూ వద్దు, తాతలనాటి కథలూ కావివి. * * * అమెరికాలోని వివిధ పట్టణాల్లో తిరిగేటప్పుడు కొన్ని మాటలు గమ్మత్తుగా చెవికి తగులుతై. నేను వాషింగ్.టన్.లో తిరుగాడేటప్పుడు “డౌన్ టౌన్” అన్న మాటలు వినగానే, పట్టణం ఎత్తుపల్లాలుగా వుంటుంది గాబోలు, పల్లపు ప్రాంతాన్ని డౌన్ టౌన్ అంటారనుకున్నాను. కాని అసలు సంగతి అదికాదు. డౌన్ టౌన్ అంటే వ్యాపారం జరిగే ప్రాంతమని అర్థం. వ్యాపారానికి యీ పదజాలానికి సంబంధం కనపడదు. అడిగితే సరిగా చెప్పలేకపోయారు. * * * వుచ్ఛారణలోనూ, భాష వాడటంలోను, గణితం వ్రాయటంలోనూ అమెరికన్ల దార్లు వేరు యింగ్లీషు భాషలో వుచ్ఛారణకు, గుణింతానికి సంబంధం తక్కువ. తెలుగులో, యిటాలియన్ భాషలో వున్నంత దగ్గరగా వుండదు. అమెరికన్లకది గిట్టదు. నిజానికది కేవలం యింగ్లీషు భాషా సంప్రదాయం గూడా కాదు. గ్రీక్, ఫ్రెంచి, జర్మను భాషల వరవడి కూడా కొంతగా యింగ్లీషులో ప్రవేశించి, ఆ భాషకు యీ యిబ్బందిని తెచ్చింది. ఆ లోపాన్ని సరిదిద్దాలని, గుణింతాన్ని సాఫీచేశారు అమెరికన్లు. అది వారి పుస్తకాల్లో కొట్టవచ్చినట్లు వుంటుంది. మనకంటికి మొదట్లో ఎబ్బెట్టుగా కనబడుతుంది. ఇక వుచ్ఛారణలోనూ ఆ తేడా కొన్నిమాటల్లో తగులుతుంది. ఇంగ్లీషువారు “షెడ్యూలు” అని వుచ్ఛరించే మాటను మనం అట్లాగే అంటాము. కాని అమెరికాలో “స్కెడ్యూల్” (Schedule) అంటారు. యిట్లా అనడంలో వ్రాసినట్లు కంటికి కనబడినట్లు అక్షరాల్ని పలకాలన్న ధోరణి వ్యక్తమౌతుంది. అది గ్రామ్యలక్షణం ఇంగ్లీషువారిది గ్రాంధిక లక్షణం, భాషలో మడిగట్టుకున్నవాదం. * * * అమెరికన్లు బహు వడిగా నడుస్తారు. డాక్టర్ జె.రాయ్ స్ట్రాక్ మేము చదువుకునే రోజుల్లో ఏ.సి. కాలేజిలో నడుస్తుంటే మా పరుగుకు అందేదిగా ఉండేది. యిదేమి “పరుగబ్బా!” అనుకునేవాళ్ళం. అమెరికాలో చూస్తింగదా, నడకలోని వేగం విపరీతం. ఒకనాడు, న్యూయార్కులో ‘బాలల, వృద్ధుల సెటిల్.మెంట్’కు వెళ్ళాము. రూత్ టెఫ్ఫర్ టెల్లర్ అన్న ఆమెవారి మేనేజరు వారు నన్ను వారి ఆవరణలో వివిధ కేంద్రాల్ని చూపుతుంది. నాకన్నా వడిగా నడుస్తుంది – యించుమించు పరుగు. మందహాసంతో అన్నదీ, యిండియన్లు నెమ్మదిగా నడుస్తారని’ ‘అవును ముంచుకుపోయేదేమీ లేదని’ అన్నాను. నవ్వింది. నేనూ వడిచేసి ఆమెకన్నా ముందే నడిచాను. అది మనకు ప్రయత్నపూర్వకంగా వుంది. వారికి సహజంగా తయారైంది. * * * కాని మాట్లాడ్డం వచ్చేసరికి బిగ్గరగా గొగ్గిరిగా మాట్లాడుతారు. కాని మనం మాట్లాడినంత వేగంతో మాట్లాడరు. నేను చేసిన కొన్ని ప్రసంగాల్లో శ్రోతలు నన్ను ‘చాలా వడిగా మాట్లాడుతావని’ అడుగుతూ వచ్చారు. నడకవేగం కార్కెతేదౌడు, మాట్లాడితే నెమ్మది – యివి వారి సంగతులు. * * * భార్యా భర్తలు వుద్యోగం చేసుకునేవాళ్ళు జాస్తి. అందువల్ల వుదయం ఫలహారం ఇంటివద్దచేసి మధ్యాహ్నం భోజనం యెవరు వుద్యోగం చేసే చోట వారు చేస్తారు. బిడ్డలున్నా వారెక్కడ చదువుకుంటూ అక్కడే తింటారు. అందువల్ల కుటుంబంలోని వారంతా కుదురుగా కూర్చుని తినేది. వుదయం ఫలహారం, రాత్రి భోజనం. కొన్ని కుటుంబాలు – రాను రాను వీటి సంఖ్య పెరుగుతుంది. రాత్రి భోజనానికి హోటళ్లలోనికి వెళ్ళుతారు. యీ హోటళ్ళ భోజన మనస్తత్వం నిజానికి సరసమైంది కాదేమో! నేను అతిథిగా వెళ్ళిన చోటకూడా అనేకసార్లు హోటళ్ళకే వెళ్ళాము. ఆ భార్యాభర్తలు నేను కలసి వెళ్ళేవాళ్ళము. అయితే అనేక విషయాలు మాట్లాడేదానికి వారి దృక్పథాల్ని, సామాజికతలను అవగాహన చేసుకోవటానికి సందర్భాలు బాగా పనికివచ్చేవి. * * * అమెరికన్ సాంఘిక జీవనంలో ‘డేటింగ్’ అన్నదొకటుంది. అది వారి ఆచారం. యుక్తవయస్సు వచ్చిన అమ్మాయి మరొక యువకునితో సంబంధాలు పెట్టుకునే సమయంలో కుర్రవాడు, అమ్మాయి యింటికి వెళ్ళి, ఆయన తల్లి దండ్రుల అనుజ్ఞ వేడుకుంటాడు – వారి అమ్మాయిని తన వెంట రానిమ్మని, తల్లితండ్రులు పరిశీలించి అట్టి అనుజ్ఞ యిస్తారు. వారిద్దరు షికార్లు కొడతారు. తరువాత, వారే భార్యాభర్తలు. యీ ఆచారం మనకు అపాచారంగా తోచవచ్చు. మనకేమి సదాచారాలున్నవి గనుక! అయితే, యీ కుటుంబాల్లో యింకొకటుంది. పెండ్లి అయ్యీ కాకముందే, ఆ బిడ్డ కుటుంబపు యింట్లో నుండి, తన కుటుంబం వేరే యేర్పాటు చేసుకుంటాడు. దాదాపు పెండ్లికి తప్ప, తర్వాత ఒకరొజైనా వుండరు. యిక, తల్లిదండ్రుల యింటికి వారు వచ్చినా, తల్లిదండ్రులు వారి యింటికి వెళ్ళినా, చుట్టపు చూపులు లాంటివిగానే వుంటవి. * * * వారికి కార్లు జాస్తి. కార్లులేని కుటుంబాలే లేవు మరి. కారులతో బాటు షికారులూ జాస్తి. ‘వారాంతం’ అనేదొక పిచ్చి మాదిరిగా వుంటుంది. వారానికి ఐదు రోజులే ఆఫీసులు పనిచేస్తవి. శుక్రవారం సాయంత్రానికి వారంతా మునిగాళ్ళ మీద నిలబడ్డట్టు, వారాంతపు హడావిడులకు కేరింతలు కొట్టుకుంటూ వుంటారు. హడావిడిగా బయలుదేరుతారు భార్యాభర్తలు. బిడ్డలు కార్లేసుకుని కదలి వెళ్ళిపోతారు. నదీతీరాలకో, కొండ ప్రాంతాలకో, అరణ్య సానువులకో, మరో ప్రాంతానికో పోతారు. తింటానికీ, పండటానికీ వవర్లు తీసుకువెళ్ళుతారు. కొంత దూరపు హోటళ్ళకూ పోతారు. యీతలూ వేస్తారు. కోతలూ కోస్తారు, డాంఢూములు చేస్తారు. కొంపలకు తిరిగి వచ్చేసరికి, వాడి వత్తులై వుంటారు. వారాంతం వారికొక వినోదపు పిచ్చి. నేను నిలదీసి అడిగాను వారాంతం విశ్రాంతిగా గడిపి, వారమల్లా తిరిగి బాగా పనిచేసుకోవటానికి గదా, మీరిట్లా అలసి, సొలసి వచ్చి ఆఫీసుల్లో విశ్రాంతి తీసుకుంటారా? అని ‘అవును, మా విశ్రాంతి రీతుల్లో మార్పు రావాల’ని కొందరంగీకరించారు. కొందరు కాదన్నారు. వారాంతాన్ని విశ్రాంతిగా మాత్రమే వాడే వాజ ఇంగ్లీషువారికి జాస్తి. అమెరికన్లకది విశ్రాంతి పరుగు, లేక పరుగులో విశ్రాంతి. * * * అమెరికాలో హోటళ్ళు కాక ‘మోటెళ్ళు’ కూడా వుంటవి. ‘హోటల్’ మనుషులకు, ‘మోటెల్’ కార్లకు వుంటవి. దారి ప్రాంతాల్లో ‘మోటెళ్ళు’ వుంటవి. కార్లకు వలసిన సామగ్రి పెట్రోలు – దాన్ని వారు గాసోలీక్ అంటారు – దొరుకుతై కార్లను పరిశుభ్రం జేసి, తిరిగి ప్రయాణానికి ఆయత్తం చేస్తారు. రిపేర్లూ చేస్తారు. పైగా, కారులోని ప్రయాణీకులు వుండటానికి గదులు, వారికి భోజన వనర్లు కూడా వుంటై. అదే మోటెల్. మోటెలంటే హోటల్.కు అన్నాగారో, యేమో అవుతుంది. ప్రయాణీకుల వనర్లకది పుట్టినిల్లు. * * * అమెరికాలో స్వంతకార్ల ప్రయాణాలు జాస్తి అయినా బస్సు, కాబ్ సర్వీసులు జాస్తిగా వున్నై. గ్రీన్.కాబ్, ఎల్లోకాబ్, రెడ్ కాబ్ సర్వీసులున్నై. అవి దేశ వ్యాప్తంగా వుండటం విశేషం. మీరొక స్టేషను నుండి విమానాశ్రయానికి కాబ్.లో అంటే అద్దె కారులో – వెళ్ళి, తాము దిగే చోటికి యీ కాబ్ సర్వీసు వారికి ఫోను చేసి, చెప్పమంటే యీ కాబ్ వారు చెప్పి, మీరా విమానాశ్రయంలో దిగగానే, ఆ కాబ్ వారు వచ్చి మిమ్ము ఆహ్వానించి తీసుకుపోతారు. అవి ప్రయివేటు సర్వీసులే! కాని జాతీయ రంగమంతటా వర్తిస్తవి. దానివల్ల వనర్లు జాస్తి. రవాణాలు జాతీయాలైన శ్రేయోరాజ్యాలలో కంటే, యిక్కడ వనర్లు జాస్తిగా వున్నై. ప్రజల సుఖం మేలురకంగా వుంది. కాబ్ సర్వీసు మాదిరే బస్సు సర్వీసు. అవీ జాతీయంగా వ్యాప్తమైవున్నై పోటీలుబడి రేట్లు తగ్గిస్తారు. ఒక సర్వీసు నుండి మరొక సర్వీసులోకి మీ ప్రయాణాలు మార్చుకోవచ్చు. డబ్బు దసకాల మార్పిళ్ళు వారే చూసుకుంటారు. మీకొక టిక్కెట్టు వుంటేచాలు. అట్లాగే, ఒకే సర్వీసులో మీరు దేశమంతా చూడవచ్చు. ఒక వూరి నుండి మరొక వూరు చేర్చి, మిమ్మొక హోటల్లోనో, మోటెల్.లోను అమర్చి ఆ బస్సు వెళ్ళిపోతుంది. మళ్ళా రేపోమాపో వచ్చే బస్సులో మిమ్ము తీసుకుపోతారు. మీ యిష్టం వచ్చిన మజిలీకి మీరు వెళ్ళవచ్చు. యీ రవాణా సౌకర్యాలవల్ల ప్రయాణాలు జాస్తిగా వున్నై. వనర్లతోకూడిన ప్రయాణాలు. * * * యీ ప్రయాణాలకు సుఖాన్ని యిచ్చేవి రోడ్లు పెడరల్ స్టేట్, కౌంటీ రోడ్లుగా వర్గీకరణగా వుంది. ఫెడరల్ హైవేస్ మీద స్పీడు జాస్తిగా వుండాలి. గంటకు 60 మైళ్లకన్నా తక్కువ వేగం, ప్రమాదాలకు కారణంగా యెంచుతారు. అమెరికాలో జరిగే హెచ్చు ప్రమాదాల్లో స్పీడుగా పోయేవారికన్నా కొందరు స్పీడు తక్కువ, కొందరు హెచ్చుగా వుండటంవల్ల కలుగుతున్నవని తేల్చారు. రోడ్ల ప్రయాణాల్లో స్టేట్, కౌంటీ రోడ్లకు ‘టోలుగేటు’ పద్ధతులున్నై. సుంకం చెల్లిస్తూ వుండాలి. “రోడ్లు వాడండి మరమత్తుకు డబ్బు యివ్వండి” అంటారు. అట్లాగేయిస్తారు. రోడ్లలో, నడిమి నుండి ప్రక్కలకు మూడు లేక నాల్గు సొలుపుల్లో కార్లు వెళ్ళవచ్చు. నడిమిగేటు ప్రక్కనున్న కార్లు మరీ వేగంగా, రెండవ గేటులోని కార్లు అంతకన్నా తక్కువ వేగంగా, మూడవ లైనులోనివి యింకా తక్కువగా, నాలుగో లైనులోనివి మరీ ‘స్లో’గా వెళ్ళుతవి. దాటి వెళ్ళాలంటే, పై గీట్లు జాగర్తగా చూచుకుంటూ నడిమి గేటు వైపుకు తొలుగుతూ పోవాలి. * * * కార్లు నిలిపే చోట్లు కష్టం. అందువల్ల కారుతోలే వారు బహుశ్రద్ధగా వుండాలి. ఆగరానిచోట ఒక్క నిమిషం దాటి నిలచినా ‘టికెట్’దాపురమవుతుంది. ‘టికెట్’ అంటే పోలీసు వారు. మీ కారు విషయంలో వేసిన ‘జరిమానా’ అని అర్థం. పోలీసు ఒక టికెట్ వ్రాసి మీకారుకు తగిలించి వెళ్ళుతాడు. ఆ ప్రకారం ఆ గడువు లోపల నీవు వెళ్ళి ముడుపు చెల్లించుకుని. ఆ మురికి తుడుచుకు రావాలి. లేకుంటే కథ ముదిరి కారునే జప్తు చేసి తీసుకు పోతారు. అమెరికాలో పోలీసులంటే కార్ల వారికి వున్న హడల్ చెప్ప శక్యం కానిది. యింకొకటి కాబ్ సర్వీసుల్లో, బస్సుల్లో ‘రిసీవర్ శెట్లు’ వుంటవి. మీరు బయలుదేరినప్పుడు ఎక్కడనుండి, యెక్కడకు యెంతమందితో నున్నవైనం చెప్పాలి. అప్పుడప్పుడ మీకు పోలీసు నుండి నడిచే కార్లకే వార్తలు పంపుతారు. అవి మన్నించి గమనించుకోవాలి. ప్రమాదాలు తగ్గించడానికిదొక మార్గం. రవాణా రీతుల్ని నియమితం చేయటానికి తీరు. యిట్లా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పాలి. కాని ఒకటి రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. నేను మాడిసన్ కళాశాలకు వెళ్ళాను. విస్ కాన్ సన్ విశ్వవిద్యాలయం వుపాధ్యక్షులు, ‘అంధ్ర విద్యార్థులు అంత శ్రద్ధగా లేరని’ నిందవేశారు. నేను ఆశ్చర్యపడ్డాను. 12, 13 వేల మైళ్ళు వచ్చి, బిడ్డలింత శ్రద్ధ లేకుండా ఎందుకు వుంటున్నారా అని విస్తుపోయాను. ‘కనుక్కుంటానని’ వారితో చెప్పాను. మన విద్యార్థులను అడిగితే, ‘అది కాదనీ – ఒక విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రభుత్వ విద్యార్థుల్ని కొందర్ని మనం స్థాపించే రూరల్ విశ్వవిద్యాలయం కోసం పంపింది. యిక్కడ 20 ఏళ్ళు వుద్యోగం చేసి, ‘రిఫ్రషర్ కోర్సు’లని వారిని పంపారు. వారేమి బడుల్లోకి ఆవయసులో వెళ్ళి చదువుతారు? వేళకు యెట్లా వెళ్ళగలరు? కాలం కోసరం లెక్కలు వేస్తూ, వనర్ల సుఖాన్ని అనుభవిస్తున్నారు. వీరు వుపాధ్యక్షుని దృష్టిలో పడ్డారు. ఆ నేరం తెలుగు విద్యార్థులందరిమీదా వచ్చింది. ఎందుకని? అసలు వుపాధ్యక్షునికి వీరు ఆంధ్రులని యెట్లా తెలుసు! యిండియావారనవలసింది గదా! కాదు, అక్కడ తెలుగుభాష బోధిస్తున్నారు. అందుకని ఆంధ్రులెవరో, యెందరో వారికి తెలుసు. కాని, ప్రభుత్వ పిల్లలకు మన పిల్లలకు వ్యత్యాసం చూపలేకపోయారు. నేనీ రహస్యం, రాత్రి ఫోనులో వుపాధ్యక్షునికి చెప్పగా, ఆయన సంతోషానికి మితిలేదు. నా శ్రద్ధకు నన్ను అభినందించబోతే, ఆపి, వారి శ్రద్ధకు నేనే కృతజ్ఞత తెలిపాను. పోరాని పిల్లలు వెళ్ళి, పంపరానివారిని మన ప్రభుత్వం పంపగా, యిట్లాంటి అప ప్రధల్ని కొనితెస్తారు. మన ప్రభుత్వం ఆ కోర్సుల్లో వుత్తీర్ణులైనవారిని తీసుకోక – వారెందరో వున్నారు – ప్రభుత్వ పిల్లల్ని డబ్బు వ్యయం చేసి పంపటం దేనికి? వారిని అడగకుండానే మనకు సమాధానం తెలిసినా, వారినే అడగటం మంచిదేమో! * * * అమెరికాలో మనదేశ భాషల్ని యెన్నింటినో నేర్పుతున్నారు. చికాగో విశ్వవిద్యాలయంలో తెలుగు బోధనకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రంథాలయాన్ని సంతరించారు. ‘ఆంధ్రపత్రిక’ లాంటి పత్రికలను తెప్పిస్తున్నారు. ఎవర్ని అడిగారోగానివారు, సిఫార్సు చేయబడ్డ గ్రంథాల్లో పనికిమాలిన సరుకు చాలావుంది. అవిచూచి, నేను వుపాధ్యక్షులకు ఒక వుత్తరం వ్రాశాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రారునుగానీ, అంధ్రసాహిత్య అకాడమీ అధ్యక్షుల్నిగానీ అడిగి తెలుగు పుస్తకాలు తెప్పించుకోమని! హిందీ, ఉర్దూ, తమిళం తెలుగు భాషల్ని చాలాచోట్ల నేర్పుతున్నారు. వుపాధ్యాయులందరూ ఆయా భాషల్ని నేర్చిన యిండియన్లు. అమెరికన్లకు భాషా జాతీయ అహంకారం కూడా కొన్నిచోట్ల వ్యక్తమైంది. ఒక ప్రఖ్యాత నవలాకారునితో నేను మాట్లాడేటప్పుడు, - ‘మా దేశంలో వ్యుత్పన్నమయ్యే సాహిత్యం చాలు. అది విస్తృతంగా వుంది. గుణంలోనూ గోప్పదే! మేము యింగ్లండు నుండి అరువు తెచ్చుకోవలసిందేమీ లేదు. యిక బహుశః వారే మానుండి స్వీకరించాలేమో! నన్నారు. ‘సాహిత్య విషయాల్లో యిట్లా గీతలు గీయటం, జాతీయ ప్రాంగణాలు వేయటం మంచిది కాదేమో’నన్నాను. “అవును, అయినా ‘బిగ్ ఇండియా’ (భారీభావన) అంటే, బ్రిటిష్ వారికి భయమండీ” అన్నాడు. యిదొక ప్రవృత్తి. యింకా విశేషాలున్నా, యింతటితో ఆగుదాం. *--*--* ముగింపు అమెరికాలో అరవై రోజులు ప్రయాణం పూర్తి చేసి, ఆ రోజుల్లోని నా అనుభవాల్ని కొంతమేరకు వుల్లేఖించాను. వివరాలు యింకా చెప్పవలసినవి చాలావున్నై. అన్నీ చెప్పవలను పడదు. యెక్కడో ఒకచోట ఆగాలి గనుక, యిక్కడే ఆపాను. పరాయిది, పెద్దదైన ఒక దేశంలో మనం కొద్ది రోజులు ప్రయాణం చేసి, కొన్ని విషయాల్ని మాత్రం చూచి, అన్నీ చూచినట్లు, సర్వం తెలిసినట్లు వ్రాసినా, మాట్లాడినా మంచిది కాదు. మనం లోతులు తరచి చూసే అవకాశం తొందర ప్రయాణాల్లో దొరకదు. కాని, కథల ఆనుపానులు మనకు కొంత తెలిసినప్పుడు తరచిన మేరకు వున్నదున్నట్టుగా గ్రహింపవచ్చు. నా ప్రయత్నంలోని ముఖ్యాంశం అదే! అందులో ప్రజాస్వామ్య దృక్పధాన్ని గీటు రాయిగా పెట్టుకున్నాను. నేను చూడనివి హెచ్చు అని గ్రహించితే, నా పుస్తకంలోని ప్రయత్నానికి, మీరు చదువరిగా నన్ను మన్నిస్తారు. హెచ్చు వివరాలు కోరరు. అమెరికా అంతా సుందరవనం కాదు. యెవరి మచ్చలు వారికి వుంటై. కాని, నేను ఆదేశంలో వున్న మంచినే వ్రాద్దామనీ, దానివల్లనే మనకు ప్రయోజనం, యేమైనా కలిగితే కలగాలనీ భావించి, ఆదేశంలో నా కంటబడ్డ, నాకు తెలిసిన చెడుగుడులని వ్రాయలేదు. అది నా సంకల్పంకాదు. వారిని పొగటంగాని, తెగడటం కాని నా చేయుపనికాదు. నా కట్టి రాజకీయాలు లేవు. రగడలు నా కవసరం లేదు. నేను చూచిన దానిలో వున్న మంచిని నా వారికి నివేదించటమే నా బాధ్యతగా భావించాను. ప్రజాస్వామ్యరీతుల్ని వివరించాను. ప్రజాస్వామ్యనుగతాలే నా సాంఘికా భిప్రాయాలు. యెవరైనా నా అభిప్రాయాలతో ఏకీభవింపని వారు, హేతు పూర్వకంగా కారణాల్ని చెప్పి, భిన్నాభిప్రాయాలు కావచ్చు. అట్టివారితో నాకు తగవులేదు. ‘అది’ మావూళ్ళో వుంటేనే ‘మంచి’ లేకుంటే ‘కామంచి’ అనే వైఖరి లోకంలో ప్రాయికంగా వుంది. అది మారాలి. ఆ వైఖరి నాకు నచ్చదు. ‘మంచి’కి ప్రాంతీయతలు అడ్డుగోడలు కాజాలవు. అదెక్కడైనా వుండొచ్చు. మాటలకు, మమతలకు దాసుళ్ళం కాకుండా మనగలటం ముఖ్యం. ఆ దృష్టితోనే నా పర్యటనానుభవాల్ని సంతరించాను. నా రచనలో మనకూ వారికీ వున్న కొన్ని భావాల్ని సమన్వయం చేయటానికి ప్రయత్నించాను. అవి కొందరికి కర్కశంగా తోచవచ్చు. సత్యమెప్పుడూ వెగటుగా వుంటుందంటారు. సత్యాన్వేషణ, స్వేచ్ఛ పిపాసలకు ఆనవాళ్ళు. మీకీ గీతలలో గోచరిస్తవి. నా ప్రయాణంలోగాని, పరిశీలనలో గాని నాధ్యేయం అదే! *--*--*

No comments:

Post a Comment