రాజకీయాలు -అధికారం- పార్టీలు- వ్యక్తి - సమాజం

రాజకీయాలు -అధికారం- పార్టీలు వ్యక్తి - సమాజం ఎమ్.ఎన్.రాయ్ వ్యక్తికీ సమాజానికి ఉన్న సంబంధాన్ని గురించి రెండు విధాలైన అభిప్రాయాలున్నాయి. ఈ రెండు అభిప్రాయాల ఆధారంగానే చర్చ సాగవలసి ఉంటుంది. ఒక అభిప్రాయాన్ననుసరించి సమాజం దానంతటదే ఉన్నది. సమాజానికి అనుగుణంగా వ్యక్తి ఇమిడేటట్లు మార్గాన్ని కనుక్కోవాలి. ఉన్న సమాజంలో వ్యక్తి ఒక భాగం కనుక అతను అందులోనే నివసిస్తాడు. పొందికైన జీవితం కోసం వ్యక్తి సమాజానికి సరిపెట్టుకోవాలి. మరొక అభిప్రాయం ఇందుకు భిన్నమైనది. వ్యక్తి ప్రాయికమైన విషయంగా భావించి, సమాజాన్ని వ్యక్తి సృష్టిగా స్వీకరిస్తారు. తన ప్రయోజనార్థం మానవుడు సమాజాన్ని సృష్టిస్తాడు. దీని తర్కమేమంటే సాంఘిక సంబంధాలను (రాజకీయ ఆర్ధిక నైతిక సంబంధాలు). వ్యక్తి జీవిత ప్రయోజనార్థం ఉండాలి. సామాజిక ఆలోచనాపరులు, సిద్ధాంత కర్తలలో మొదట అభిప్రాయం ప్రబలంగా ఉన్నది. చారిత్రకంగా కూడా ఇదే ప్రాచీనమైన అభిప్రాయం. సృష్టిలో నమ్మకమున్న మతాలన్నీ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. ప్రపంచం ఒకప్పుడెప్పుడో సృష్టి అయితే దైవవిధానంలో ఒక భాగంగా మానవుడు ఈ భూమి మీదకు వచ్చాడు. సమాజం కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నాయి. ప్రపంచం ఒకప్పుడెప్పుడో సృష్టి అయితే దైవ విధానంలో ఒక భాగంగా మానవుడు ఈ భూమి మీదకు వచ్చాడు. సమాజం కూడా దైవ పథకంలో భాగమే కనక మానవుడు చెప్పగలిగింది అతి స్వల్పం మాత్రమే. కాబట్టి అతడు ఇమిడిపోవలసి ఉంటుంది. సమాజానికి మూలం అలౌకికమనే దృక్పథం ఇలా వచ్చినట్టిదే. సమాజం మానవుడి సృష్టి అని చెప్పటం తర్కబద్ధమే గాక అనుభవరీత్యా కూడా చూపవచ్చు. నా అభిప్రాయం కూడా అదే. మానవుడు పరిణమించాడనే వైజ్ఞానిక సిద్ధాంతం దీనికి ఆధారంగా ఉంటుంది. మానవుడు ఉనికిలోకి రాగానే సహకార జీవితావసరాన్ని గ్రహించాడు. ప్రకృతి శక్తుల నెదుర్కోవడానికి, అనేక వైపరీత్యాల నుంచి కాపాడుపోవటానికి ఆదిమ దశలో మానవుడు సహకారావశ్యకతను గమనించాడు. సహకారం ఒక విధమైన సంఘటిత వ్యవస్థ. సమాజ సృష్టి అలా జరిగింది. పరిణామ దృక్పథాన్ని ఆసరాగా తీసుకొని 18వ శతాబ్ద సామాజిక ఒడంబడిక భావానను మనం నిరాకరించవలసి ఉంటుంది. ఈ సిద్ధాంత ధోరణి ఆదిమ మానవులు ఒకానొక సమయంలో సభ జరిపి, అప్పటినుంచీ సామాజిక సంబంధాలన్నీ నడిపించుకోవలసిన తీరును గురించి ఒప్పందం కుదుర్చుకొన్నట్లుగా ఉంటుంది. మానవజాతి వలె సమాజ వ్యవస్థ కూడా తొలి దశలలోనే యాదృచ్ఛిక పరిస్థితులలో జరిగి, క్రమేణ ప్రయోజనాత్మకంగా క్లిష్ట రూపాలు దాల్చింది. మానవజీవిత ప్రయోజనం ఏమిటి అనేది మౌలికమైన ప్రశ్న. ప్రత్యక్షంగా రుజువు చేయగల జ్ఞానాధారంతో ఈ ప్రశ్నను పరిశీలించాలి. ఒకవేళ మానవజీవితానికి మానవాతీత, దైవిక ప్రయోజనం ఉంటే అది తెలియదు. వైజ్ఞానిక చర్చా పరిధిలోకి కూడా రాదు. మానవుని గురించి మనకు తెలిసిన దాన్ని బట్టి మానవ ఉనికి ప్రయోజనం ఏమిటో పరిశీలించాలి. మానవుని జీవ సంబంధమైన ప్రక్రియల ఆధారంగానే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోగలం. జీవితాన్ని సాధారణంగా చూస్తే ప్రయోజనం ఏదీ లేదు. కాని జీవిత ఉన్నత దశలో మానవ రూపంలో వ్యక్తమైనప్పుడు, ప్రజ్ఞ బహిర్గతమైనప్పుడు ఇచ్ఛ, చైతన్యం వెలికి వచ్చినప్పుడు, జీవితానికి ప్రయోజనమున్నదనవచ్చు. కనక జీవితానికి గాక, మానవ జీవితానికి ప్రయోజనం ఏమిటనేది ప్రస్తుత ప్రతిపాదన. ఈ ప్రయోజనం విషయం ఒక అంగీకారానికి రావడం చాలా ప్రాధాన్యతతో కూడనట్టిదే. సాంఘిక వ్యవస్థ, భిన్న సాంఘిక సంబంధాలు, పొందికగానూ, స్థిరంగానూ, నైతికంగానూ ఉండగలగడం అంటే, మానవ జీవిత ప్రయోజనాన్ని పెంపొందిచటమే. మానవుడి ముందున్న జీవిత స్థాయిలో ప్రయోజనం ఏదీ లేనప్పటికీ మానవ జీవిత ప్రయోజనానికి వేర్లు ఆ స్థాయిలోనే చూడవచ్చు. జీవ పరిణామంలో మానవుడికి ముందున్న దశలో మనుగడ పోరాటం అనేది ఒక విలక్షణం. అందులోనే మానవ ప్రయోజనానికి ప్రారంభదశ ఉన్నది. ఆ దశలో పోరాటం అంతా యాంత్రికంగా ఇమిడిపోవటం, సహజంగా ఎంపిక చేసుకోవడం జరిగింది. కాని మానవ లక్షణాలైన ఇచ్ఛ, తెలివి కనిపించిన తరవాత యాంత్రికంగా గాక, పోరాటం ఉన్నత స్థాయిలో, తెలిసి నిర్ణయించుకోవడంలో, ఆ నిర్ణయాన్ని కొనసాగించడంలో ఉన్నది. తుదక నిర్ణయం తీసుకునే శక్తి నీతికీ విలువలకూ ఆధారమైనది. మానవస్థాయిలో మనుగడ పోరాటం తెలివితేటలతో కొనసాగిస్తున్నప్పుడు అది స్వేచ్ఛా పిపాసగా మారింది. ఈ పిపాస యాంత్రిక రూపమే మనుగడ పోరాటం. జీవి పరిసరాలన్నీ చుట్టుప్రక్కల వత్తిడి చేస్తుండగా, జీవి ఆ వత్తిడి నుంచి స్వేచ్ఛకోసం పోరాడకపోతే మనుగడ దుస్సధ్యం అయ్యేది. జీవితం ఆవిర్భవించగానే అంతమయ్యేది కూడా. ఉన్నత మానవ స్థాయిలో మనుగడ పోరాటం తెలిసి చేస్తున్న స్వేచ్ఛా పోరాటం అవుతుంది. ఆ పిపాసకు వ్యక్తీకరణే సమాజ సృష్టి అనవచ్చు. ప్రకృతిలో భిన్నశక్తులూ, అడవి మృగాలూ తదితర శక్తులన్నీ మానవజాతిని నాశనం చేసేవే. అలా నామరూపాలు లేకుండా పోయే స్థితినుంచి విముక్తి కావటానికే మానవుడికి సహకార కృషి అవసరమైంది. ఒకసారి జంతుజాలం నుంచి తగినంతగా విచక్షణతో వేరుపడిన ఆదిమ మానవుడు ఆహార నియమాలను వేరే అభివృద్ధి చేసుకున్నాడు. జంతువులవలె ఎవరికి వారే కృషి చేసుకోవడం కాక బ్రతుకుతెరువు కోసం ఆహారాన్నిసంపాదించుకునే కృషి కుడా మారింది. సహకార కృషితో వేట, చేపలు బట్టటం ఉత్తరోత్తరా వ్యవసాయం అలవాటు చేసుకున్నాడు. అడవి మృగాల దాడికి తట్టుకునే నిమిత్తం పరస్పరం సహకరించుకునే పరోక్ష ఆవశ్యకత, బ్రతుకుతెరువు భద్రతకోసం ప్రత్యక్షావశ్యకత అనేవి రెండూ ప్రాయికమైన తృష్ణలు కాగా, మానవులు నాగరిక సమాజానికి నాందీ ప్రస్తావన పలికారు. ఈ మౌలిక విషయాలు మనసులో ఉంచుకుంటే వ్యక్తికీ సమాజానికీ మధ్య ఉండే సంబంధాల ప్రమాణం మనకొక మార్గదర్శకంగా సహాయపడుతుంది. మనుగడ పోరాటాన్ని సమర్థవంతంగా సాగించటానికి మానవులు సమాజాన్ని ఏర్పరుచుకున్నారు. మానవుడు పెంపొందే కొద్దీ తొలి అవసరమైన ఆహార సేకరణ, సంతానాభివృద్ధి, ప్రేరణ స్థానంలో ఇంకా క్లిష్టమైన ప్రేరణలు, కోరికలు జనించాయి. కనక సమాజంలో భాగంగా అభివృద్ధి చెందిన మానవుడు మనుగడ పోరాటం సాగిస్తున్నాడనటానికి వీలులేదు. సమాజంలో ఉండటానికి, వ్యక్తిగా తన అభివృద్ధికి, జీవితానికి తోడ్పడే సమాజాన్ని నిర్మించుకోవడానికి, ఇతర మానవుల అవసరాలు, కోరికలూ, అభిరుచులతో సరిపెట్టుకోవలసి వచ్చింది. నాగరిక సమాజం ఏర్పరచుకున్న తరవాత, రాజకీయంగానూ, ఆర్థికంగానూ, దాన్ని సంఘటితపరచవలసి వచ్చింది. రాను రాను సమాజం క్లిష్టదశకు చేరుకున్నది. అయితే సమాజ తొలి ప్రయోజనం మానవునిలోని ప్రతిభను పెంపొందటానికి తోడ్పడటమే. మానవజీవితంలో చైతన్యాన్ని, ఇచ్ఛను, ప్రజ్ఞను, పెంపొందించుకుంటూ ఉంటే మానవుని అవసరాలు, ప్రయోజనాలు, భిన్న రంగాలలో విస్తరించటం జరిగింది. చిట్టచివరకు మానవుడి మనుగడకు వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవటంగా పరిణనించింది. ఈ దృక్పథాన్ని స్వీకరిస్తే నైతిక రాజకీయ ఆర్థిక వ్యవస్థలను ఏ సమాజంలోనైనా నిర్ణయించే కొలమానం లభించినట్లే, మానవుని వ్యక్తిత్వాన్ని స్వేచ్ఛగా పెంపొందించే అవకాశాన్ని ఏ సాంఘిక వ్యవస్థ ఆటంకపరిచినా మానవ సమాజం ఏర్పడిన ప్రయోజనానికి భిన్నంగా ఉన్నట్లే. కనక వ్యక్తి సంపూర్ణ స్వేచ్ఛకు సమాజ వ్యవస్థలో పొందికకు, వైవిధ్యం ఉండనక్కరలేదు. వ్యక్తికంటె సమాజ వ్యవస్థ ఎక్కువ విలువైనదనీ, దానికొక ప్రయోజనం ఉన్నదనీ, ఆ ప్రయోజనంతో వ్యక్తి ప్రయోజనానికి సంఘర్షణ వాటిల్లినప్పుడు, సమాజంలో గందరగోళం ఏర్పడుతుందనే భావనను వైవిధ్య ఆలోచనలకు దారి తీసినాయి. సమాజం సంక్లిష్టమవుతుండగా ఆ మేరకు సమస్యల పరిష్కారం కూడా జటిలమయ్యాయి. వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోటానికి మానవునికి కొన్ని ప్రాథమిక విషయాలు అవసరం. ముందు ఇతడి భౌతిక మనుగడ భద్రంగా ఉండాలి. శారీరక భద్రతకు, తన శక్తిని వినియోగంచుకోవలసిన అవసరం లేనంత మేరకు మానవుడు సునిశిత శక్తులను పెంపొందించుకోవటం అనేది అనుభవం చూపుతున్నది. ఆదిమ మానవునికి, అత్యున్నతంగా అభివృద్ధి చెందిన మానవునికీ మధ్య విశ్రాంతి సమయం ఎలా తోడ్పడుతున్నదో గమనించాం. అత్యున్నత స్థాయికి చేరిన మానవుడు వైజ్ఞానిక నైతిక భావ సంబంధమైన అభివృద్ధి ఉండాలంటే మనుగడకు కావలసిన కృషి అంతకుముందే చేసి ఉండాలి. కనుక ఏ సామాజిక వ్యవస్థ అయినా తన సభ్యులకు మనుగడలో భద్రత సమకూర్చడం ప్రథమ కర్తవ్యం. అందులోనే సామాజిక ఆర్థిక విషయం కూడా ఇమిడి ఉన్నది. ప్రతి వ్యక్తికీ మనసు ఉన్నది గనక, జ్ఞానార్జన చేయగలడు కనక ఆ శక్తిని పెంపొందించాలి. ఇలా పెంపొందించ విధానంలోనే సాంస్కృతిక, విద్యా సంబంధమైన వ్యవస్థలేర్పడతాయి. సమాజ ప్రయోజనంలో ఇది రెండో సమస్య. అనేకమంది ప్రజలు కలసి నివసిస్తున్నప్పుడు మానవుల అభివృద్ధి అసమానత్వాలు ఉన్నప్పుడు, సంఘర్షణలకు ఎప్పుడూ అవకాశం ఉన్నది. అది హింసా ధోరణిగా పరిణమించవచ్చు. కనుక రాజకీయ వ్యవస్థ అవసరం. రాజకీయ వ్యవస్థ అంటే రాజ్యమే. ఒకరినొకరు చంపుకోకుండా ఉండే పరిస్థితులను కల్పించడం, అలాగే, జాతులకూ, దేశాలకూ, దాడి జరుపుకునే అవసరం లేకుండా చూడటమే దీని ప్రయోజనం. ఒకరికి ఆస్తి ఉండటమే, మరొకరికి లేకపోవడంవల్ల ఈ దాడులు జరుగుతుంటాయి. శాంతియుత సహజీవనానికి, మనుగడకు, జ్ఞానార్జనలో సమాన అవకాశాలు, మేథస్సును పెంపొందించుకోవడానికి తగిన పరిస్థితులను కల్పిస్తే, ఆ తరవాత, వ్యక్తులను వారి మానాన వారిని వదిలివేయాలి. వ్యక్తుల సాంఘిక, వ్యక్తిగత, జీవితంలో, కార్యకలాపాలలో, కనీస జోక్యం మాత్రమే రాజ్యానికి అవసరమవుతుంది. మానవ స్వభావాన్ని తెలుసుకున్న తరువాత సంపూర్ణంగా, స్వేచ్ఛగా వికసించిన వ్యక్తులను గురించి, సరైన నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయమై భిన్నాభిప్రాయాలు, గందరగోళం ప్రబలి ఉన్నది. మానవస్వభావ సారమేమిటో, స్పష్టపడితే తప్ప, వ్యక్తికీ, సమాజానికీ సంబంధించిన విషయాలలో సరైన నిర్ణయాలకు రాలేము. జీవుల మనుగడలో అత్యున్నత స్థాయికి చేరుకున్న మానవుల అభివృద్ధి లక్షణాలను గమనిస్తే మానవ స్వభావం ప్రాయికంగా హేతుబద్ధమైనది. సమాజాన్ని తొలుత సృష్టించడం హేతుబద్ధమైన చర్యే. జంతువుల నుంచి ఇంకా పూర్తిగా విడిపోని మన పూర్వీకులు ఆటవిక మృగాలపై తమ మనుగడ కోసం పోరాడుతూ, తమవంటివారు అలాగే పెనుగులాడటం గమనించి, అందరమూ కలిసి శ్రతువుపై పోరాడితే, విజయానికి ఎక్కువ అవకాశాలుంటాయని గ్రహించి ఉంటారు. ఆ విధమైన వివేచనాత్మక నిర్ణయమే నాగరిక సమాజానికి పునాదులు వేసింది. మానవులలో ఉన్న ఈ ప్రేరణ ఇంకా వెనక్కు వెళ్ళి చూస్తే జీవ పరిణామంలో గమనించవచ్చు. ప్రేరణ అనేది వివేచన యొక్క ప్రాథమిక దశ మాత్రమే. జీవపరిణామ విధానాన్ని గురించి తెలుసుకుంటే మానవ స్వభావం ప్రాయికంగా హేతుబద్ధమైనదనే నిర్ణయానికి వస్తాం. కాని కాలానుగుణంగా జీవితానికి సంబంధించిన ఇతర విషయాలెన్నో అభివృద్ధి చెంది హేతుబద్ధంగా ఉండటం తమ స్వభావమని మానవులు మరచిపోయారు. ఆదిమ మానవులు ప్రకృతి శక్తులను లోబరుచుకోవడానికి ప్రకృతి దేవుళ్ళను ఆరాధిస్తే సరిపోతుందని పొరపాటున భావించారు. అది గమనించి అలౌకిక శక్తులలో నమ్మకం ఉంచటమే మానవ స్వభావ లక్షణమనుకున్నారు. ఈ కృత్రిమ నిర్ణయానికి సరిపడేటట్లు మానవుడు తన మంచిచెడులను నిర్ణయించుకోలేడని, అటువంటి ప్రమాదాలన్నీ దైవికమైన నియమాలలో ఉన్నాయని తలచారు. అదేగనక వాస్తవమైతే, వ్యక్తికీ, సమాజానికీ సామరస్యత సాధ్యపడదు. సామరస్యత ఉండాలంటే బలవంతం, ఒత్తిడి చేయవలసి ఉంటుంది. కొన్ని నమ్మకాలను అందరూ సమానంగా విధేయులు కనక, అటువంటి సమాజం సామరస్యంగా ఉంటుంది. కాని అది స్వేచ్ఛా సమాజం కాదు. సమాజంలో ఎవరైనా ఏ ఒక్క నమ్మకాన్నయినా సందేహించటం ప్రారంభిస్తే, నిశితంగా పరిశీలించాలనుకుంటే అతను సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసినవాడవుతాడు. సామరస్యం కోసం, అతడి స్వచ్ఛను అణచివేయాలి, లేదా, సమాజం నుంచి వెలివేయాలి. సమాజంలో సామరస్యం లేకుండా పోతుంది, లేదా విచ్ఛిన్నత ప్రబలుతుంది. వ్యక్తికీ, సమాజానికీ సామరస్యం అనేది స్వేచ్ఛతో పొసగుతుంది అని చూపాలంటే ప్రతివ్యక్తీ వివేచనాత్మకంగా నిర్ణయం తీసుకోగలడనీ, వ్యక్తికీ సమాజానికీ ఉండవలసిన సంబంధాల గురించి, నిర్దిష్టమైన కార్యక్రమాలు రూపొందించటం కష్టం. వ్యక్తి వికసిస్తుంటే, స్వేచ్ఛాపరుడుగా మారుతుంటే, వివేచనాత్మక, నైతిక నిర్ణయాలు తీసుకోగలిగితే, ఆ మేరకు సామరస్యం కూడా పెంపొందుతుంది. నీతి అనేది వివేచనాత్మక నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మానవాతీత శక్తికి, నీతి విషయాలను వదిలివేస్తే తప్ప ఇదే సరైన పద్ధతి. అయితే సామాజిక సమస్యలను చర్చించేటప్పుడు, మానవ సమస్యలను, మానవేతర శక్తులకు వదిలే ఆచారాన్నిమనం పట్టించుకోటం లేదు. మానవునిలో అంతర్గతంగా నైతిక నిర్ణయ శక్తి ఉంటే తప్ప స్వేచ్ఛా పిపాస అనే మౌలిక ప్రయోజనం సాధించలేము. లేకుంటే, అతీత శక్తులేవో ఏర్పరచిన నియమాలననుసరించి మానవుడు లొంగి నడచుకోవలసి ఉంటుంది. అప్పుడు మానవుడు నిర్ణేత కాదు, అతడు మంచితనాన్ని చూపలేడు. మంచితనం, చూపాలంటే అతడిపై రుద్దిన నియమాలను అనుసరించి నడచుకోవాలన్నమాట. నైతిక సమస్య అనేది సామాజిక ప్రవర్తన సమస్యగానూ పరిశీలించవచ్చు స్వేచ్ఛా పిపాసను గురించి చైతన్యం ఉంటే, ప్రజ్ఞాశాలిగా, నైతికంగా, భావసంబంధంగా పెంపొందాలంటే, నా స్వేచ్ఛలో జోక్యం చేసుకోని వ్యక్తులతో కూడిన సాంఘిక నిర్మాణం అవసరం అని గుర్తించాలి. అయితే నేను కూడా సమాజంలో ఇతర సభ్యులకు, అటువంటి హామీ ఇవ్వగలిగినప్పుడే నేనాశించే సాంఘిక వ్యవస్థ సాధ్యమని గ్రహించాలి. ఈ అభిప్రాయం ఒక విధంగా నైతిక ప్రవర్తన పాటించే కొన్నిమతాచారాలకు దగ్గరగా ఉన్నది. కాని నైతిక నిర్ణయాలు చేసే సత్తా పెంపొందాలంటే, ఏ మేరకు, వివేచనాత్మక నిర్ణయాలు చేయగల సత్తా ఉన్నదనే విషయాన్ని బట్టే తేల్చుకోవచ్చు. కనక అన్యాయమైన సాంఘిక వ్యవస్థలో వ్యక్తికీ, సమాజానికీ, సంబంధాలు సరిపుచ్చటం ఎలాగనే సమస్యతో సతమతమయ్యే బదులు, అసలు మూలానికి పోవాలి. ప్రతి వ్యక్తీ అభివృద్ధి పొందటానికి వీలుగా పరిస్థితులను కల్పిస్తూ సమాజ నిర్మాణం జరగాలి. ఇక్కడే సమాజాన్ని గురించిన రెండు అభిప్రాయాల దగ్గరకూ వస్తాము. సమాజం దానంతటదే ఉన్నదనుకొని, మంచి సమాజంలో సభ్యులు మంచి మానవులనీ, చెడు సమాజంలో వారందరూ చెడిపోయిన వారనీ భావిస్తే, సమాజాన్ని సంస్కరించటం అసంభవం అవుతుంది. వ్యక్తుల్ని వారి మానాన వార్ని వదిలివేయాలి. ఈ ప్రాతిపదిక మీద అనేక సామాజిక సిద్ధాంతాలు వచ్చాయి. సమాజాన్ని సంస్కరించాలనీ, తద్వారా వ్యక్తుల్ని మెరుగుపరచాలనే అభిప్రాయాలు నేడు ఆధిక్యతలో ఉన్నవి. నాగరికత పుట్టినప్పటి నుంచీ ఇటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ అది మనలను ఎంతో దూరం తీసుకపోలేదు. మంచి వ్యక్తులు మాత్రమే మంచి సమాజాన్ని నిర్మించగలరు. వివేచనాత్మక సమాజం, నైతిక సమాజం అనేది, వివేచనాత్మక, నైతిక వ్యక్తుల వల్లనే సాధ్యం. ప్రతి మనిషిలోనూ మంచితనానికీ, వివేచనకూ కావలసిన ప్రతిఫలం ఉన్నందువల్ల వాటిని పెంపొందించవచ్చు. అణచివేసే సమాజంలో ఈ కృషి చాలా జటిలమైనది. కాని కృషి చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది. ఆచరణ దృష్ట్యా ఈ సమస్యను చూస్తే, నియంతృత్వాల విషయం అలా ఉంచి, ఆధునిక నాగరిక సమాజంలో వ్యక్తి స్వేచ్ఛాపరుడుగా ప్రజ్ఞతో కూడిన నైతిక జీవిగా కావాలనుకుంటే పెంపొందగలడు. కాని అటువంటి కోరిక తరచు ఉండటం లేదు. దొంగతనాలతో కూడిన సమాజంలో బ్రతుకుతున్నామని, అటువంటి సమాజంలో జయప్రదం కావాలంటే దొంగగా మారాలని అనుకుంటున్నారు. సఫలీకృతం కావటమే ప్రమాణంగా కనబడుతున్నది. సమాజంతో వ్యక్తి సంబంధాలు సమన్వయీకరించే తీరులలో ఇదొకటి. ఇందువల్ల పరిస్థితులు మెరుగు కావు. మంచి శాసనాలు చేయటంతో మంచి సమాజాన్ని సృష్టించవచ్చని 18వ శతాబ్దపు ఉదారవాదం కోరుకున్నప్పటికీ అది అంతగా ఫలప్రదం కాలేదు. మంచి నియమాలు సమర్థవంతంగా ఉండాలంటే అంతకుముందే ఆమోదించిన, లేదా ఆమోదయోగ్యమైన సంబంధాలను క్రోడీకరించవలసి ఉంటుంది. సమాజంతోనూ, మనుషులతోనూ, శాంతియుతంగా, జీవనం గడపాలంటే, నైతికంగా, తెలివితేటలతో ప్రవర్తించాలంటే చాలావరకూ వృత్తి పైనే ఆధారపడి ఉంటుంది. సమాజంతో వ్యక్తి సంబంధాలు అనే సమస్యను పరిష్కరించటానికి, వ్యక్తుల, ప్రతిభను గుర్తింపుకు వచ్చేటట్లు చేయాలి. వివేచనాయుత నిర్ణయాలు తీసుకునే సమర్థత ప్రతి వ్యక్తికీ ఉంటుందని నచ్చ చెప్పాలి. అలాగే నైతిక నిర్ణయంలో ఉంటుందనీ, స్వేచ్ఛగా ఉండటం అవసరమనీ తెలియజెప్పాలి. సమాజంలో అలాంటి వ్యక్తులు పేర్కొనదగినంత సంఖ్యలో ఉంటే, అటువంటి సమాజం, వివేచనాత్మకంగానూ, నైతికంగానూ ఉంటుంది. (1952 ఏప్రిల్ 27న డెహ్రాడూన్ సెమినరీ ఆఫ్ ది ఫ్రండ్స్ సొసైటీకి ఇచ్చిన ఉపన్యాసం.) రచన అనువాదం ఎమ్.ఎన్.రాయ్ నరిసెట్టి ఇన్నయ్య

No comments:

Post a Comment